visitors

Thursday, April 29, 2010

పట్రాయని వెంకట నరసింహ శాస్త్రి


పట్రాయని  వెంకట నరసింహశాస్త్రి గారు  సాలూరు పెద గురువుగారిగా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సంగీత విద్వాంసునిగా పేరు పొందిన వారు. 
పట్రాయని పాపయ్యశాస్త్రి గారి ఏకైక కుమారుడు - పట్రాయని నరసింహశాస్త్రిగారు.. 1872  భావనామ సంవత్సరంలో జన్మించారు. పట్రాయని వంశం పూర్వీకులు సంపన్నులే అయినా తాతగారు పట్రాయని పెదనరనన్నగారి  అమాయకత్వానికి, దుర్వ్యయానికి వారి ఆస్తులన్నీ హరించుకుపోయాయి.  చామలాపల్లిలో పట్రాయనివారికి సెంటు భూమిలేకపోయినా వారి పేరుతో పిలవబడుతున్న  చెరువులు, తోటలు ఉన్నాయి. 
నరసింహ శాస్త్రి గారి బాల్యం నాటికే ఆస్తులు పూర్ణానుస్వారం అయిపోయాయి.
తండ్రి పాపయ్యశాస్త్రిగారు 35 సంవత్సరాల వయసులోనే మరణించారు. ఆయన  మరణం తర్వాత తల్లితో పాటు ఆమె  పుట్టిల్లు కారాడ కి చేరుకున్నారు. గుడివాడ అగ్రహారం లో మధురాపంతుల కూర్మన్నగారి  కుమార్తె సూరమ్మగారితో వివాహం జరిగింది. ఆవిడ పచ్చి పసుపు కొమ్ములా ఉండేవారట. ఆథ్యాత్మ రామాయణ కీర్తనలు చక్కగా పాడేవారుట.

మధురా పంతుల పేరయ్యశాస్త్రిగారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో పేరుపడ్డ సంగీత విద్వాంసుడు నరసింహ శాస్త్రిగారి మామగారు మధురాపంతుల కూర్మన్నగారికి  పేరయ్యశాస్త్రిగారు సోదరుడు. ఆ విధంగా పినమామగారి వద్ద  నరసింహశాస్త్రిగారికి కూడా  శిష్యరికం లభించింది.
పేరయ్యశాస్త్రిగారు తంజావూరులో సంగీత సాధన చేసినవారు.  సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రిగారి శిష్యులు, ప్రముఖ  ద్వివేదుల కన్నడు శాస్త్రి, ద్వివేదుల లక్ష్మణ శాస్త్రి సోదరులు  పేరయ్యశాస్త్రిగారి వద్ద కూడా శిష్యరికం చేసారు. మధురాపంతుల పేరయ్య శాస్త్రిగారు  గొప్ప సంగీత విద్వాంసులు. ఆనంద గజపతి మహా రాజులతో ఘన సన్మానం పొందినవారు. పెద కాద అనే పల్లెలో నివాసం ఏర్పరచుకొని భూముల మీద వచ్చే ఆదాయంతో కాలక్షేపం చేసేవారు. సంగీత సాధనలో శిష్యులు ఏమాత్రం అశ్రద్ధ చూపినా భరించలేక పోయేవారుట. పేరయ్యశాస్త్రిగారు చాలా ఆత్మగౌరవం కలిగిన విద్వాంసులు. ఆయన సంగీత కచేరీ చేస్తున్నప్పుడు ఒక ప్రభుత్వోద్యోగి పక్కవారితో బాతాఖానీ ప్రారంభించడం చూసి  పాడడం ఆపేసారుట. ఆయన ఏదో చెప్పబోతే, నీ కచేరీలో ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే నీవేం చేస్తావు. ఇది నా కచేరీ  అన్నారుట. నరసింహ శాస్త్రిగారికి గురువుగారంటే అమితమైన గౌరవం, భయభక్తులు ఉండేవిట.  పేరయ్యశాస్త్రిగారి శిక్షణలో సంగీత రీతులను కంఠస్థం చేసుకొని  రాగాలాపన, స్వరకల్పన ప్రావీణ్యం సంపాదించి వివిధ రీతులలో పల్లవి పాడడంలో నిష్ణాతులయేరు శిష్యులు.
 అప్పుడప్పుడే కచేరీ పద్ధతి ఆంధ్ర దేశంలో ప్రారంభమవుతున్న రోజులు. దాక్షిణాత్య సంగీత ప్రభావంతో సంగీత త్రిమూర్తుల రచనలను కచేరీలలో పాడడం సంప్రదాయంగా ఉండేది. శ్రీ త్యాగరాజ స్వామి వారి  కీర్తనలు ప్రచారంలోకి వస్తున్న రోజులు. సంగీత శిక్షణను గురు ముఖతః పొందడం తప్ప వేరే దారి లేదు. నరసింహ శాస్త్రిగారు కీర్తన గ్రంథం నేర్చుకోవడానికి కొన్నాళ్ళు మద్రాసులో మకాం పెట్టారు.
 మద్రాసులో ఒక పెళ్ళి ఊరేగింపులో  నంజుండయ్య అనే విద్వాంసుడు   భైరవి రాగాలాపన చేసి ఒక విలంబ కాలం పల్లవి ఎత్తుకున్నారుట. నరసింహ శాస్త్రిగారికి పల్లవి ఆలాపన మీద ప్రత్యేకమైన అభిరుచి ఉండేదట.  నంజుడయ గారికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ పల్లవి తనకు చెప్పమన్నారుట. ఆనాడు నరసింహశాస్త్రిగారు రాజుగారు గౌరవంగా కప్పిన శాలువా వేసుకొని ఉన్నారట. నంజుండయ్యరుగారు ఈ శాలువాను గురుకట్నం క్రింద స్వీకరించి నరసింహశాస్త్రిగారికి పల్లవి పాడడం నేర్పారుట. 
విద్యా సముపార్జన పూర్తయాక  అనేక చోట్ల సంగీత కచేరీలు చేసి గొప్ప విద్వాంసులుగా పేరు పొందారు. ముగ్గురు పిల్లలు కలిగారు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఒక కుమారుడు మరణించగా,. కుమార్తె నేల నూతిలో పడి పసి తనంలోనే మరణించింది. భార్య కూడా మరణించింది. నరసింహ శాస్త్రిగారి జీవితంలో ఈ మరణాలు కలిగించిన విరక్తితో  మిగిలిన ఏకైక కుమారుడు సీతారామ శాస్త్రిగారిని మాతామహులు కూర్మన్న గారి సంరక్షణలో వదలి దేశ సంచార బాట పట్టారు. అనేక చోట్ల కచేరీలు చేస్తూ, సంగీత శిక్షణ ఇస్తూ చివరకు బరంపురంలో స్థిరపడ్డారు.

బరంపురం లో త్రిపాసూరి సోదరులు ముఖ్య ప్రాణరావు, చక్రవర్తి పంతులు నరసింహ శాస్త్రిగారితో ఎంతో సన్నిహితులుగా ఉండేవారు. సీతారామశాస్త్రిగారికి పది సంవత్సరాలు వచ్చేసరికి తండ్రి నరసింహ శాస్త్రిగారు బరంపురంలో మానసికంగా, ఆర్థికంగా కుదురుకొని ఉన్నారు. కూర్మన్నగారు  కొడుకు తండ్రి వద్ద పెరగడమే మంచిదని భావించి సీతారామ శాస్త్రిగారిని నరసింహ శాస్త్రి గారికి అప్పగించారు.

బరంపురంలో నరసింహ శాస్త్రిగారు సంగీత శిక్షణలు ఇస్తూ, కచేరీలు చేస్తూ ఉండేవారు. తండ్రితో పాటుగా సీతారామశాస్త్రిగారు కూడా తిరుగుతూ ఆ విద్యార్థులతో పాటుగా  సంగీతాన్ని నేర్చుకున్నారు. తన ప్రతిభా విశేషాల వల్ల సంవత్సరం తిరిగే సరికి సంగీత గ్రంథాన్ని పూర్తి చేయడమే కాక   కొందరు విద్యార్ధులకు సంగీత పాఠాలు చెప్తూ బాల గురువుగా ఆదరణ పొందారు. పన్నెండేళ్ళ వయసుకి ఒక దేవాలయంలో జరిగిన కచేరీలో సంగీత ప్రదర్శన చేసి  స్వర్ణ కంకణాన్ని  బహుమతిగా పొందారు.
బరంపురం కేంద్రంగా తండ్రీ కొడుకులు జీవన యాత్ర సాగించారు. ఒరిస్సా, ఆంధ్ర, బెంగాల్  రాష్ట్రాలలోని అనేక ప్రదేశాలలో సంగీత కచేరీలు చేసేవారు. చాలా సంస్థానాలలో ఘన సన్మానాలు పొందారు. బరంపురంలో నివసించిన కాలంలో ఎవరికి వారే ధన సంపాదన చేసేవారు. సీతారామశాస్త్రిగారు తన సంపాదన అంతా తండ్రి చేతికి ఇస్తే రూపాయకి కాణీ వంతున కొడుకు ఖర్చుకోసం ఇచ్చి మిగిలిన సొమ్మను నరసింహశాస్త్రిగారి జాగ్రత్త చేసారు. నరసింహ శాస్త్రిగారి తల్లి గారు బొబ్బిలి సమీపంలోని  ఆనవరం అగ్రహారం లో కూతురు వద్ద  ఉండేవారు.
నరసింహ శాస్త్రిగారు   తను జాగ్రత్త పరచిన సొమ్ముతో ఆనవరంలో భూమిని కొన్నారు. వృద్ధురాలైన తల్లిని తీసుకొని వచ్చి సాలూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. లూధరిన్ చర్చి వెనక చిన్న ఇంట్లో  నివాసం ఉండేవారు.  అప్పటికి సీతారామ శాస్త్రిగారికి 20 సంవత్సరాలు.
సాలూరులో సంగీత పాఠాలు చెప్తూ, శ్రీ శారదా గాన పాఠశాల పేరుతో ఒక సంగీత పాఠశాలను నెలకొల్పారు నరసింహ శాస్త్రిగారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ సంగీత గురువులుగా ఎందరో విద్యార్థులకు ఉచితంగా సంగీత విద్యాదానం చేసేవారు. సాలూరు ప్రజలు ఇరువురినీ ఎంతో ఆత్మీయంగా ఆదరించారు. నరసింహ శాస్త్రిగారిని
పెద గురువుగారు అని, సీతారామ శాస్త్రిగారిని చిన గురువుగారు అని పిలిచే వారు. ఇద్దరూ  ఆంధ్ర, ఒరిస్సా, బెంగాలు వంటి ప్రాంతాలలో కచేరీలు చేసేవారు. వీరిద్దరిని  సన్మానించిన రాజాస్ధానాలు  చాలా ఉన్నాయి. చీకటి కోట, ధారాకోట, పెద కిమిడి, చిన కిమిడి, జరడా వీటిలో కొన్ని సంస్థానాల పేర్లు.
సీతారామ శాస్త్రిగారికి వివాహం జరిగాక, జీవన భృతి కోసం కొంతకాలం శ్రీకాకుళం వెళ్ళారు. అక్కడ ముగ్గురు మగ పిల్లలు కలిగాక భార్య మరణించింది.  తల్లి లేని పిల్లలను తీసుకొని సీతారామ శాస్త్రిగారు సాలూరుకి వచ్చేసారు.
సాలూరులో  ఆనాడు సాధు కూటాలు చాలా ఉండేవి. అక్కడ స్థిర పడే నాటికి నరసింహ శాస్త్రిగారిని ఈ సాధు కూటాలు ఆకర్షించాయి. ఆయన అటువంటి వైరాగ్య స్థితిలో ఉండేవారు. చాలా నిరాడంబరంగా, ఒక యోగి లాగ జీవితం సాగించారు నరసింహ శాస్త్రిగారు.
ఆరడుగుల ఎత్తు, బోడి తల మీద జడ కట్టిన చిన్న పిలక, చెవులకి ఒరిస్సాలో రూపొందిన కుండలాలు, మెడలో పెద్ద సైజు రుద్రాక్ష తావళం, కాషాయం రంగు దేరిన ధోవతి, పంచె కట్టు, పైన శాలువా  - అప్పటికి ఎనిమిదేళ్ళ వయసులో ఉన్న మనవడు సంగీత రావు గారి మనసులో స్థిరపడిన తాతగారి రూపం.
ఆ రోజుల్లో సాలూరు లోను, బొబ్బిలి లోను సంతర్పణలు నిరంతరం జరుగుతూ ఉండేవి. సంభావనలకి కూడా లోటులేదు. ఎప్పుడూ ఏకాహాలు, సప్తాహాలు, నవరాత్రులు, వసంత నవరాత్రులు, వనభోజనాలు జరుగుతూ ఉండేవి. అటువంటి వాటికి మనవడిని(శ్రీ సంగీతరావు) తీసుకుని వెళ్ళేవారు పెదగురువుగారు. అక్కడ భజన కార్యక్రమాలు జరిగేవి. మనవడి సంగీత శిక్షణతో పాటు ప్రదర్శన కూడా  వాటితో సాగేది.
పెదగురువుగారుగా నరసింహ శాస్త్రిగారిని సాలూరు ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరవించినా చినగురువుగారైన సీతా రామశాస్త్రిగారంటేనే అప్పటి ప్రజలకు ఆకర్షణ. సీతారామశాస్త్రిగారిది జనాకర్షణ శైలి. ఆయనది సృజనాత్మక మైన స్వతంత్ర మార్గం. నరసింహ శాస్త్రిగారు అత్యంత భక్తి శ్రద్ధలతో సంప్రదాయమైన శైలిలో సంగీతాన్ని నేర్చుకొని,  ఆ మార్గంలోనే జీవించిన వారు సంప్రదాయం పై తిరుగుబాటు ధోరణి ప్రదర్శించే సీతారామ శాస్త్రిగారి పద్ధతి నరసింహ శాస్త్రిగారిని అసంతృప్తికి గురిచేసేది.  ఈ విషయమై తండ్రీ కొడుకులిద్దరి మధ్య అభిప్రాయ భేదాలుండేవి.


1931 ఆంగీరస నామ సంవత్సరంలో యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో నరసింహ శాస్త్రిగారు మరణించారు.   పరమ ప్రశస్తమయిన రోజని, ఎంతో పుణ్యం చేసిన వారికి గానీ మరణం రాని తిథి అని చెప్పుకునే రోజు  భాద్ర పద బహుళ ఏకాదశి నాడు ఆయన భగవత్సన్నిధిని చేరుకున్నారు.  ఉత్తరాంధ్ర ప్రాంతంలో  ముఖ్యంగా సాలూరు ప్రజలనుండి   నరసింహ శాస్త్రిగారు   ప్రత్యేకమైన గౌరవం, ఆత్మీయతలను  అందుకున్నారు. సంగీత శిక్షణతో ఎందరో విద్వాసులను రూపొందించి ఆంధ్రదేశంలో సంగీతపరంగా సాలూరుకు ప్రత్యేకమైన కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించి పెట్టిన సాలూరు పెద గురువుగారిగా ఆయన పాత్ర చిరస్మరణీయం.

Thursday, April 22, 2010

పట్రాయని వారు
తెలుగువారి ఇంటిపేర్లలో అతి తక్కువగా వినిపించే ఇంటిపేరుగా పట్రాయని వారిని చెప్పవచ్చు.దక్షిణ భారత దేశపు బ్రాహ్మలలో ఆరామద్రావిడ శాఖకి చెందిన ఇంటిపేరు పట్రాయనివారు. వీరి పూర్వీకులలో ఎవరో సైనిక విభాగంలోని ఒక విభాగానికి అధిపతిగా పట్రాయడు అనే పదవిలో ఉండేవారని, అందువల్ల అతని వంశానికి పట్రాయడు అనే పేరు వచ్చిందని పెద్దలు చెప్పారు. వ్యాకరణరీత్యా ఇంటిపేర్లు తెలుగుదనం సంతరించుకున్న నేపథ్యంలో పట్రాయడు పదం పట్రాయనిగా కనిపిస్తుంది. తెలిసినంతవరకు పట్రాయనివారి కుటుంబానికి చెందిన పూర్వీకులలో 1800-1850 కాలానికి చెందిన పట్రాయని వెంకట నరసింహ భుక్త గారి పేరు వినిపిస్తుంది.,
శృంగవరపుకోట,విజయనగరం మధ్య చామలా పల్లి అనే అగ్రహారం ప్రతిగ్రహీత గా ఈ వంశంవారు అందుకున్నారు.
చామలా పల్లి 18 వృత్తుల అగ్రహారం. వృత్తి అంటే ఒక కుటుంబం జీవించడానికి కావలసిన భూ వసతి అని అర్థం. ఆనందగజపతి వంశపు రాజులతో ఈ పట్రాయని వెంకట నరసింహ భుక్తగారికి అనుబంధం ఉండేదని తెలుస్తోంది. నరసింహ భుక్తగారి కాలంలోనే ఆ అగ్రహారం, ఇతర ఆస్తులన్నీ హరించిపోయాయి. అతనికి ఆరుగురు కుమారులు.వారిలో పెద్దకుమారుడు పట్రాయని పాపయ్యశాస్త్రి. పాపయ్యశాస్త్రిగారి సోదరులు అయిదుగురిలో ఇద్దరు తూర్పుగోదావరి జిల్లాలవైపు వెళ్లారని, వారిపేర్లు పెదనరసన్న, చిన నరసన్న అని తెలుస్తోంది కాని మిగిలిన వివరాలు తెలియలేదు.
పాపయ్యశాస్త్రిగారి భార్య అవధాన్ల వారి అమ్మాయి నరసమ్మ. పాపయ్య శాస్త్రిగారు పౌరోహిత్యం చేసేవారని తోలు బొమ్మలాటలో ప్రావీణ్యం చూపేవారని తెలుస్తోంది. వీరు 35 ఏళ్ళ చిన్న వయసులోనే మరణించారు.
నరసింహశాస్త్రిగారు గుడివాడ అగ్రహారానికి చెందిన మధురాపంతుల కూర్మన్నగారి అమ్మాయి  సూరమ్మని వివాహం చేసుకున్నారు.


కూర్మన్నగారి పినతండ్రి కొడుకు, జ్ఞాతి మధురాపంతుల పేరయ్యశాస్త్రి గారు. నరసింహశాస్త్రిగారికి పినమామగారు.  పేరయ్యశాస్త్రిగారు అప్పటికే పేరుపొందిన సంగీత విద్వాంసులు. పట్రాయని నరసింహశాస్త్రిగారు వీరివద్ద శిష్యరికం చేసి సంగీతం నేర్చుకున్నారు.


దాక్షిణాత్యసంగీతం పట్ల అభిరుచితో సంగీత గ్రంధాన్ని నేర్చుకోవడం కోసం మద్రాసునగరానికి వెళ్ళి,నంజుండయ్యర్ వద్ద శిష్యుడిగా ఉన్నారు.బరంపురం,సాలూరు,విజయనగరం సంస్థానాలలో కచేరీలు చేస్తూ,సంగీతశిక్షణ ఇస్తూ ఉత్తరాంధ్రకు చెందిన ప్రసిద్ధ సంగీత విద్వాంసుడిగా పేరు పొందారు.

నరసింహశాస్త్రిగారు బరంపురం లో చాలాకాలం సంగీత శిక్షణలు చేసిన తరువాత బొబ్బిలి రాజా వారి ఆదరణపొంది సాలూరు లో స్థిరపడ్డారు. 


సాలూరు గ్రామ ప్రజలు నరసింహశాస్త్రిగారిని ఎంతో ఆప్యాయంగా పెదగురువుగారని సంబోధించేవారు. వారి కుమారుడు సీతారామశాస్త్రిగారిని చినగురువుగారని పిలిచేవారు. సాలూరు లో పెదగురువుగారి శిక్షణలో ఎందరో సంగీత విద్వాంసులుగా పేరుపొందారు.


1920 ప్రాంతాలలోనే నరసింహశాస్త్రిగారు, కుమారుడు సీతారామశాస్త్రిగారు ఇద్దరూ సాలూరులో శ్రీ శారదా గాన పాఠశాల అనే సంగీత విద్యాలయం ప్రారంభించి విద్యార్థులకు ఉచితంగా సంగీత శిక్షణ ఇచ్చేవారు. పర్ణశాలగా ప్రారంభమయిన పాఠశాలను సీతారామశాస్త్రిగారు పటిష్టమయిన కట్టడంగా రూపొందించారు.


 ఇప్పటికీ సాలూరులో పట్రాయని సీతారామశాస్త్రి సంగీత నృత్య కళాశాల పేరుతో నిర్వహింపబడుతున్న విద్యాలయంలో ఎందరో చిన్నారులు సంగీతం, నృత్యం మొదలైన రంగాలలో శిక్షణ పొంది వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.ఈ పాఠశాలను నేడు  జరజాపు ఈశ్వరరావుగారి సహకారంతో  జరజాపు రమేష్, సాలూరు రాజేశ్వర రావు మెమోరియల్ ట్రస్టులు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
నరసింహ శాస్త్రిగారి కుమారుడు పట్రాయని సీతారామ శాస్త్రి.  నరసింహశాస్త్రిగారు పెదగురువుగారనే పేరుతో, సీతారామశాస్త్రిగారు చినగురువుగారనే  పేరుతో ఆంధ్రదేశంలో ప్రసిద్ధి  పొందారు..
శ్రీ సీతారామశాస్త్రిగారు


సీతారామశాస్త్రిగారు అతి చిన్నవయసులోనే మాతృవియోగం పొంది తండ్రితో పాటు ఉత్తర దక్షిణ దేశ యాత్రలు చేస్తూనే సంగీతం నేర్చుకొని కర్ణాటక సంగీతంలోనే కాక హిందుస్తానీ సంగీతంలో కూడా ప్రావీణ్యం సంపాదించారు. సంప్రదాయ సంగీత కచేరీలలో సంప్రదాయం కన్నా జనరంజకత్వానికి పెద్ద పీట వేసి స్వీయ సంగీత రచనలను ఆలపించి అత్యంత జనాకర్షణ పొందారు. విజయనగరం మ్యూజిక్ కాలేజీలో వోకల్ పండితుడిగా ఎందరో విద్యార్థులను విద్వాంసులుగా తీర్చిదిద్దారు. సంగీత కళాశాలలో ఆయన వద్ద శిక్షణ పొందిన వారంతా ప్రభుత్వ కళాశాలలలో అధ్యాపకులుగా, సంగీత విద్వాంసులుగా, సినీ సంగీత శాఖలో ముఖ్యులుగా రూపొందారు. ప్రముఖ  సినీ నేపధ్యగాయకులు ఘంటసాల వెంకటేశ్వరావు వంటి ప్రముఖులెందరో  శాస్త్రిగారి వద్ద శిక్షణ పొందిన వారే. 1957 ప్రారంభంలో పదవీవిరమణ చేసిన శాస్త్రిగారు మరి కొద్దికాలానికే మరణించారు.
 
సీతారామశాస్త్రిగారికి ముగ్గురు కుమారులు. పట్రాయని సంగీతరావు,పట్రాయని నారాయణమూర్తి, పట్రాయని ప్రభాకరరావు. 

                   శ్రీ సంగీతరావుగారు, శ్రీ నారాయణమూర్తిగారు, శ్రీ ప్రభాకర రావుగారు(కుడివైపునుంచి)వీరు ముగ్గురూ తాతగారు,తండ్రిగార్ల సంగీత సంప్రదాయాన్ని కొనసాగించారు.

పట్రాయని సంగీతరావుగారు గాత్రంలో విద్వత్తును ప్రదర్శిస్తూ అతి చిన్న వయసులోనే కచేరీలు చేసారు. సంగీత శిక్షకుడిగా ఉంటూ కాలక్రమంలో ఘంటసాల వెంకటేశ్వరరావుగారికి సహాయకుడిగా, స్వర సహచరుడిగా, ఆయన మరణానంతరం కూచిపూడి నాట్య అకాడెమీలో సంగీతదర్శకుడిగా 35 సంవత్సరాలు తన సేవలనందించారు. వెంపటి చినసత్యం గారు రూపొందించిన నృత్య నాటికలకు సంగీతరావుగారు కూర్చిన సంగీతం జీవం పోసింది. దేశవిదేశాలలో కూచిపూడి నృత్యనాటకాలను ప్రదర్శించిన సందర్భంలో సంగీతరావుగారు కూడా సత్యంగారి వెంట ఉండి అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నారు.


సంగీత భూషణ, తమిళనాడు ప్రభుత్వం కళాకారులకు గౌరవపురస్కరంగా ఇచ్చే కలైమామణి, ఆంధ్రప్రభుత్వ ముఖ్యమంత్రి తో ఘనసత్కారం, మద్రాసు తెలుగు అకాడెమీ వారి స్వర్ణ పురస్కారం సంగీతరావుగారు అందుకున్న అనేక సన్మానాలలో కొన్ని.


సంగీతరావుగారికి ఇద్దరు అబ్బాయిలు,ముగ్గురు అమ్మాయిలు. అందరూ తండ్రిదగ్గర సంగీత శిక్షణ తీసుకున్నా, వారిలో రెండవ అమ్మాయి పద్మావతి సంగీతంలో విశేష ప్రజ్ఞ కనబరచి తమిళనాడు యూనివర్సిటీలో మ్యూజిక్ లో ఎం.ఏ,ఎం.ఫిల్ డిగ్రీలు సాధించారు. చినసత్యంగారి అమెరికా పర్యటనలో పద్మావతీ శ్రీనివాసం నృత్యనాటకానికి సంగీతరావుగారితో పాటు ప్రదర్శనలలో పాలుపంచుకుని గాత్ర సహకారం చేసారు.  భర్త ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివాసం ఉంటూ హైదరాబాద్ ఆలిండియా రేడియో కార్యక్రమాలలో తరచుగా పాల్గొంటూ ఉంటారు.ఇంటి దగ్గర అనేక మంది శిష్యులకు సంగీత పాఠాలు చెప్తారు. వర్థమాన  సినీ నేపథ్యగాయని, ఇటీవలి నంది అవార్డు గ్రహీత  కుమారి గీతామాధురి   పద్మావతి దగ్గర చిన్నతనం నుండి సంగీతం నేర్చుకున్న శిష్యురాలే.


సంగీతరావుగారి తమ్ముడు పట్రాయని నారాయణమూర్తిగారు వాసా వారివద్ద వీణ శిక్షణ పొంది విశాఖపట్నంలో ఎందరికో వీణలో, గాత్రంలో శిక్షణ ఇచ్చారు.
విశాఖపట్నంలో శ్రీ నారాయణమూర్తి గారి దగ్గర సంగీత శిక్షణ పొందిన వారు అధ్యాపకులుగా, సంగీత బోధకులుగా స్థిరపడి ఉన్నారు. సినిమా రంగంలో కూడా సంగీతరంగంలో పేరుతెచ్చుకున్న విద్యార్ధులున్నారు. ప్రముఖ వర్థమాన నేపథ్య గాయకుడు మల్లికార్జున్ నారాయణరావుగారి శిష్యుడే.


నారాయణమూర్తిగారికి ఇద్దరు  కుమార్తెలు. పెద్ద కుమార్తె జ్యోతిర్మయి - ప్రముఖ కథా రచయిత పంతుల శ్రీరామ శాస్త్రిగారి కోడలు. భర్త ఉద్యోగరీత్యా పాండిచ్చేరి లో కాపురం. జ్యోతిర్మయి పాండిచ్చేరిలో స్కూలు టీచర్ గా పనిచేస్తూనే తమిళనాడులో పలు ప్రాంతాలలో సంగీత కచేరీలు చేస్తూ పేరు పొందారు. రెండవకుమార్తె  కిరణ్మయి విశాఖపట్నం లో స్కూలులో సంగీత అధ్యాపకురాలిగా ఉద్యోగం చేస్తున్నారు.
                       శ్రీమతి కిరణ్మయి, శ్రీమతి పద్మావతి, శ్రీమతి జ్యోతిర్మయి(కుడివేపునుంచి)


పట్రాయని ప్రభాకరరావుగారు విజయనగరం మ్యూజిక్ కాలేజీలో సంగీతం అభ్యసించి డిప్లమా పొందారు. విజయనగరంలో చాలామందికి సంగీత శిక్షణ ఇచ్చారు. తండ్రి మరణానంతరం  సాలూరు లోని సంగీత పాఠశాల ను నిర్వహించి ఆ చుట్టుపక్కల పలు ప్రాంతాలనుంచి వచ్చేవారికి  సంగీత పాఠాలు చెప్పారు.
ఈ విధంగా పట్రాయని వంశంలో మూడు తరాల వారు సంగీతవిద్యా సరస్వతి ముద్దు బిడ్డలుగ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో సంగీతజ్యోతి దేదీప్యమానంగా వెలగడానికి కృషిచేసిన సంగీత విద్వాంసులుగా కనిపిస్తున్నారు