visitors

Sunday, August 29, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై ఆరవ భాగం

29.08.2021 - ఆదివారం భాగం - 46*:
అధ్యాయం 2  భాగం 45 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"పూర్ణిమ" - విజయరాఘవాచారి రోడ్ లోకి ప్రవేశించగానే కుడిచేతివేపున ఆకుపచ్చ,పసుపురంగుల మిశ్రమంలో వచ్చే పచ్చ రంగులో కనిపించే అతి పెద్ద భవనం. అందులోనే USEFI (United States Education Foundation in India) ఆఫీస్. అప్పటికి మద్రాస్ మౌంట్ రోడ్ లో ఆక్స్ ఫర్డ్   ప్రెస్ కు , కెథెడ్రల్ చర్చ్ కు మధ్యనున్న అమెరికన్ కాన్స్యులేట్ బిల్డింగ్, ఆఫీసులు లేవు. అప్పుడు అక్కడ చెప్పుకోదగ్గ మాన్యుమెంట్ జెమినీ స్టూడియో ఒక్కటే. తర్వాత సఫైర్ మల్టీ థియేటర్ కాంప్లెక్స్, ఆ తర్వాత పెద్ద ఫ్లై ఓవర్ వచ్చింది. అమెరికన్ కాన్స్యులేట్ భవంతి ఏర్పడ్డాక డి.ఎన్.రావుగారి ఆధ్వర్యంలోని USEFI కూడా అందులోకి మారిపోయింది. అయితే ఆ భవంతితో నాకు ఏ అనుభవమూ లేదు.

"పూర్ణిమ"  డా.డి.ఎన్.రావుగారి ఆఫీస్ కమ్ రెసిడెన్స్.  చెట్పట్ ప్రాంతంలోని హారింగ్టన్ రోడ్ లోనుండి ఈ భవంతికి మారిపోయారు. ఈ భవంతి ప్రముఖ నిర్మాత దర్శకుడు బి.ఎన్.రెడ్డిగారి అల్లుడిదని విన్న జ్ఞాపకం. ఆ విజయరాఘవాచారి రోడ్ లో వై.ఎస్.శాస్త్రిగారి వంటి తెలుగు ప్రముఖులుండేవారు. తెలుగువారంతా ఎక్కువగా కనపడే ఆంధ్రా క్లబ్ (మర్యాదపూర్వకంగా చెప్పాలంటే  ఆంధ్రా సోషల్ & కల్చురల్ అసోసియేషన్- ఆస్కా)  ఆ రోడ్ లోనే. ఆ రోడ్ చివరకు వెళ్ళి ఎడమకు తిరగగానే బోగ్ రోడ్ లో బి.ఎన్.రెడ్డిగారి యిల్లు. టి.నగర్ లో అతి పెద్ద రోడ్లలో బోగ్ రోడ్ ఒకటి. బోగ్ రోడ్, నార్త్ బోగ్ రోడ్, సౌత్ బోగ్ రోడ్ (శివాజీ గణేశన్ భవంతి), సౌత్-వెస్ట్ బోగ్ రోడ్ అంటూ సుమారు రెండు-రెండున్నర కిలోమీటర్ల పొడుగున ఉత్తర దక్షిణాలలో వున్న మౌంట్ రోడ్ కు సమాంతరంగా అటు జి.ఎన్.చెట్టి రోడ్డు, సర్ త్యాగరాయ రోడ్డు నుంచి ఇటు వెంకట నారాయణారోడ్, సౌత్ ఉస్మాన్ రోడ్, సి.ఐ.టి.నగర్ లను కలిపే అతి పెద్ద లింక్ రోడ్. కొన్ని దశాబ్దాల క్రితం బి.ఎన్.రెడ్డిగారిని గౌరవార్ధం ఆయన ఇల్లున్న ప్రాంతానికి బి.ఎన్.రెడ్డి రోడ్ అని పేరుపెట్టారు ఆనాటి సర్కారువారు. కొన్నేళ్ళకు కొత్త సర్కారు వచ్చింది. కులాలు, మతాలు 'కడియాదు' అంటూ రోడ్ల పేర్లలోని కులాలని, మతాలని కడిగేసారు. ఆ దుమారంలో 'బి.ఎన్.రెడ్డి రోడ్' లో 'రెడ్డి' చెరిగిపోయి 'బి.ఎన్.రోడ్' మిగిలింది.  ఇప్పుడు ఆ బి.ఎన్. ఎవరన్నా కావచ్చు. ఆ రోడ్ కు ఆ పేరు పెట్టడానికి గల ఉద్దేశమే ఇప్పుడెవరికీ అక్కర్లేదు. అదే రాజకీయం.

మళ్ళీ, వెనక్కి తిరిగి 'పూర్ణిమ' లోకి వెడదాము.

USEFI భారత్- యునైటెడ్ స్టేట్స్  దేశాల విద్యార్థుల పాలిటి ఒక కల్పతరువు. ఈ రెండు దేశాలలో ఉన్నత విద్యలు అభ్యసించాలనుకునే  ఉత్తమ విద్యార్థులకు ఫుల్బ్రైట్ స్కాలర్షిప్ లను ఇచ్చి ప్రోత్సహించే సంస్థ. ఆ సంస్థ సదరన్ రీజియన్ కు డైరక్టర్ డా.డి.ఎన్.రావు. ఆయనకు డెప్యూటీ డా.(మిసెస్)షెట్టి. దక్షిణ కర్ణాటకకు చెందిన మహిళ.  ఇద్దరు సెక్రెటరీలు. ఒకరు కుప్స్ అనబడే కుప్పుస్వామి. మరొక లేడీ సెక్రటరి. ఈ USEFI సంస్థ విదేశాలలో మెడిసిన్, ఇంజనీరింగ్, సైన్సెస్ కోర్స్లు చదవాలని ఆశించే విద్యార్ధులకు  టోఫెల్, జి.ఆర్.ఇ, తో పాటు మరో రెండు మూడు టెస్ట్ లు నిర్వహించేది. ఆ పరిక్షల సమయంలో ఇన్విజిలేటర్ గా పనిచేయడానికి, మిసెస్.షెట్టికి ఆఫీస్ ఫైలింగ్ సిస్టమ్ లో సహాయకారిగా వుండడానికి తాత్కాలికంగా నన్ను తీసుకోవాలనే ఉద్దేశ్యంతో డి.ఎన్.రావుగారు నన్ను వారి ఆఫీసుకు రమ్మని మా నాన్నగారి ద్వారా కబురుపంపారు. ఈ సంగతి వినగానే నా గుండెల్లో రాయిపడింది. కారణం నాకు తెలుగు, కొంచెం కొంచెం తమిళం తప్ప మరే భాషరాదు. ఇంగ్లీషు రాయడం చదవడం తప్ప స్వేఛ్ఛగా ఇంగ్లీష్ లో మట్లాడడమనేది అసలు చేతకాదు. ఒక వాక్యం ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ఓ పది నిముషాలు తెలుగులో ఆలోచించాల్సివచ్చేది. ఈ పరిస్థితులలో నేను ఆ ఫారిన్ ఆఫీస్ లో పనిచేయగలనా అనే సంకోచం. గతానుభవాన్ని బట్టి డి.ఎన్.రావుగారి ఫారిన్ స్టైల్ వేషభాషలు, ఆయన గాంభీర్యం, నిజం చెప్పాలంటే ఆయనతో మట్లాడడానికి జంకుగానే వుండేది. వాళ్ళ సంభాషణ అంతా ఎక్కువగా ఇంగ్లీష్ లోనే సాగేది. నాకు ఇండియన్స్ మాట్లాడే ఇంగ్లీష్ అయితే కొంత అర్ధమౌతుంది. ఫారినర్స్ మాట్లాడే ఇంగ్లీష్ స్లాంగ్  ఇప్పటికీ నాకు అర్ధంకాదు. గొప్పలు చెప్పుకోవడం కోసం హాలీవుడ్ సినీమాలు చూడడమే తప్ప అందులో ఒక్కమాటా ఇప్పటికీ అర్ధమై చావదు. ఈ నేపథ్యంలో నేను వాళ్ళ తృప్తిమేరకు పనిచేయగలనా? ఈ బాధలు ఎవరితో చెప్పుకోవాలి? అయినా తప్పదు. 

వెళ్ళి రావు గారిని కలిసాను. ఆయన చెప్పినవాటన్నిటిని శ్రధ్ధగావిని తలూపడం తప్ప మరేం చేయలేదు. మిసెస్ షెట్టి  చెప్పినవి చేస్తూ ఆఫీసు విధానాలు నేర్చుకోమన్నారు. అది మరో ఇబ్బంది నాకు. మా ఇళ్ళలో వుండే ఆడవారితో తప్ప బయట ఆడవారితో మాట్లాడిన సందర్భాలే లేవు. హైస్కూలులో చదివిన నాలుగేళ్ళలో, కాలేజీలో చదివిన మూడేళ్ళలో, కో-ఎడ్యుకేషనే అయినా ఏ ఒక్క ఆడపిల్లతో కలసి మాట్లాడిందేలేదు. అలాటి అవసరమూ రాలేదు. అలాటి నేను మిసెస్ షెట్టి దగ్గర ఎలా మాట్లాడి పని చేయడం. కానీ తప్పదు. ఒక పదిరోజులకు అక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాను. ఇప్పటిలా ఆ రోజుల్లో కంప్యూటర్ లు లేవు. అంతా మాన్యువల్ గానే జరిగేవి. 

యూసెఫీలో  వారు కండక్ట్ చేసే పరీక్షలకు సహాయకుడిగా, డా.షెట్టి దగ్గర పని నేర్చుకుంటూ కొన్ని మాసాలు పనిచేశాను. USEFI నిర్వహించే ఫుల్ బ్రై ట్ స్కాలర్ షిప్ టెస్ట్ లు మౌంట్ రోడ్ లోని ఎడిసన్స్ కంపెనీ వారి కాన్ఫరెన్స్ హాల్ లో జరిగేవి. ఈ ఎడిసెన్స్ పక్కనే హిగిన్ బాదమ్స్, మరోపక్క గవర్నమెంట్ పబ్లికేషన్స్, ఎదురుగా రోడ్ కు అవతలవేపు ఓరియెంట్ లాంగ్మెన్స్, ఆ పక్కనే పటుల్లాస్ రోడ్ లో మాక్మిలన్ పబ్లికేషన్స్ వుండేవి. ఈ ఎడిసన్స్ ఆడిటోరియంలో పరిక్షలు వ్రాయడానికి అనువుగా  ఒక్కోక్క విద్యార్ధికి రైటింగ్ టేబిల్ అటాచ్డ్  ఛైర్స్ వుండేవి. అక్కడికి పరీక్షలు వ్రాయడానికి వచ్చేవారంతా బాగా విద్యాధికులు. ఉన్నత వర్గాలనుండి వచ్చినవారుగా ఉండేవారు. అప్పటి ఆ టెస్ట్ లన్ని అప్టిట్యూడ్ టెస్ట్లు.  పెన్సిల్ తోనే సమాధానాలు వ్రాయాలి. ఆ పరిక్షలకు హాజరయేవారికి కావలసిన ప్రశ్నా పత్రాలు అందివ్వడం చివరలో వారి దగ్గరనుండి ఆ పేపర్లు తీసుకొని నెంబర్ వారీగా సార్టౌట్ చేసి కుప్పుస్వామి కి అప్పజెప్పడం, ఇదే నా పని. విద్యార్ధులెవరితో నేనేమీ మాట్లాడకూడదు. వారేమి అడిగినా చెప్పకూడదు. ఇదొక నిబంధన.  నాకు మహదానందం.  Of course అంతకంటే కావలసింది ఏముంది. అప్పట్లో నాకు of course అనే మాట ఊతపదం గా వుండేది. ఆ మాట అవసరమున్నా లేకపోయినా Of courseగా ఉపయోగించే వాడిని. దీనితో  తికమకపడిన కొంతమంది స్టూడెంట్స్ నన్నేమీ అడిగేవారు కాదు. ఈ పరీక్షలు ఉదయం పది తర్వాత గానీ, మధ్యాహ్నం రెండు తర్వాత గానీ జరిగేవి. ఒక్కోసారి రెండు పూటలా జరిగేవి.  విద్యార్ధులు వ్రాసిన ఈ పరీక్షల సమాధాన పత్రాలను నలగకుండా, మడతపెట్టకుండా ఒక పెద్ద పసుపుపచ్చని కవర్ లో సీల్ చేసి యూసెఫీ అహ్మదాబాద్ ఆఫీస్ కు పంపేవారు. అక్కడినుండే రిజల్ట్స్ వచ్చేవి. ఆ తర్వాత అర్హత పొందిన విద్యార్ధులకు విదేశాలలో చదువుకోవడానికి అవకాశాలు వచ్చేవి. ఈ పరిక్షల నిర్వహణలో సహాయపడినందుకుగాను నాకు  కొన్ని రోజుల తర్వాత సగం రోజుకైతే 8 డాలర్లు, పూర్తిరోజుకైతే 15 డాలర్లు ఇచ్చేవారు. దానిని మన కరెన్సీలోకి మార్చి  మద్రాస్ ఆఫీస్ వారు రూపాయలలో ఇచ్చేవారు. నాకు అప్పటికి బ్యాంక్ ఎకౌంట్ లేదు. అందువల్ల క్యాష్ గానే పే చేసేవారు. మొదటిసారి పైకం తీసుకున్నప్పుడు వోచర్ మీద సంతకం పెట్టమన్నారు. నేను పూర్తిగా పట్రాయని ప్రణవ స్వరాట్ అని పేరు రాసాను. అది చూసి డిఎన్ రావుగారు "ఇది సంతకం కాదు. వీళ్ళెవ్వరికీ ద్వివేదుల నరసింగరావు, పట్రాయని ప్రణవ స్వరాట్ అంటే నోరు తిరగదు, పలకలేక ఛస్తారు. అందుచేత అందరూ పిలవడానికి వీలుగా పేరును సంతకాన్ని మార్చుకోమని ఇక పై కేవలం స్వరాట్ అని మాత్రం సంతకం పెట్టమని సలహా ఇచ్చారు. అప్పటినుండే నాపేరు పి.పి.స్వరాట్ గా మారింది. అలాగే ప్రతిరోజూ ఉదయం ఇండియన్ ఎక్స్ప్రెస్ డైలీ పేపర్ చదివితే మంచి ఇంగ్లీషు ఒంటబడుతుందని సలహా ఇచ్చేరు. ఆ రోజుల్లో  ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రిక భాషా స్థాయి అంత ఉన్నతంగా వుండేదని అర్ధం చేసుకోవచ్చును.

సాయంత్రం ఐదున్నర దాటేసరికి 'పూర్ణిమ' లో వాతావరణం పూర్తిగా మారిపోయేది. ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయాక డి.ఎన్.రావుగారు లోపలికి వెళ్ళి ఆరులోపల ఫ్రెషప్ అయి తెల్లటి పైజమా, జుబ్బా లేదా , హాఫ్ హాండ్ షర్ట్ వేసుకొని మళ్ళీ బయటకు వచ్చేవారు. ఈలోగా వారి కారు డ్రైవర్  బాలకృష్ణన్ లోపల్నుండి బయట వున్న లాన్స్ లోకి పేము కుర్చీలు తీసుకువచ్చి వేసేవాడు. రావుగారికి ఒక గ్రేకలర్ అంబాసిడర్ కారు వుండేది. MSV6799 అనే గుర్తు. మనిషి రంగు కొంచెం తక్కువే అయినా బాలకృష్ణన్  తెల్లటి యూనిఫామ్ లో అందంగా వుండేవాడు. చాలా మంచివాడు. 

పోకచెట్లు, అశోక చెట్లతో 'పూర్ణిమ'  ప్రాంగణం చల్లగా ఆహ్లాదకరంగా వుండేది. లోపలనుండి వారి సతీమణి  విశాలాక్షిగారు కాఫీ, టిఫెన్లు తీసుకువచ్చేవారు. వాటిని తింటూ తెలుగులో లోకాభిరామాయణం ప్రారంభించేవారు. అలాటి సందర్భాలలో ఇంట్లో వుంటే వారి అబ్బాయి అమ్మాయికి కూడా వచ్చి కబుర్లు చెప్పేవారు. 

ఒకరోజు ఇలాటి సంభాషణలు జరుగుతున్నప్పుడు విశాలాక్షిగారు "నిన్న రాత్రి ఆ వెధవలు ఏంచేసారో తెలుసునా..." అంటూ మొదలెట్టారు. అందరూ ఆసక్తిగా వినడం మొదలెట్టారు. కొంతసేపయ్యాక నాకు అర్ధమయింది, ఆ వెధవలని ప్రేమతో సంభోదించింది "పిక్సీ" అనే తెల్లటి పొమేరియన్ కుక్కపిల్ల , మరో పిల్లిపిల్లని. ఆ రెండూ ఒక రాత్రివేళ తమ చోట్లలో పడుక్కోకుండా విశాలాక్షిగారి బెడ్ ఎక్కి దుప్పట్లో దూరి వెచ్చగా పడుకున్నాయట. ఈ విషయాన్ని ఆవిడ ఎంతో మురిపెంగా చెపుతూంటే రావుగారు, వారి పిల్లలు ఆసక్తిగా వినేవారు. 

రావుగారి అబ్బాయి చేత కుప్స్ అని పిలవబడే సెక్రెటరీ కుప్పుసామి ఒకరోజు కంగారుపడుతూ వచ్చాడు. అతను వుండేది నంగనల్లూరు.  రోజూ అతనే వచ్చి ఆఫీస్ తలుపులు తెరుస్తాడు. ఆరోజు ఆఫీస్ తాళాలు కనపడలేదు. ఎక్కడైనా వదిలేసాడా, లేక మరెక్కడైనా జారిపోయాయో తెలియలేదు. వెంటనే డూప్లికేట్ తాళాలతో ఆఫీస్ తెరచి వెంటనే లోకల్ పేపర్లలో  ఎడ్రస్ తో సహా ఒక ప్రకటన వేయించారు " తాళాలు తెచ్చి ఇచ్చినవారికి తగిన నగదు బహుమానం ఇస్తామని". అలాగే ఆ ప్రకటన వచ్చిన మర్నాటి సాయంత్రానికల్లా ఎవరో ఒకతను వచ్చి ఏదో హోటల్ టేబిల్ మీద కనిపించాయని ఆ తాళాలు తిరిగి ఇచ్చేశాడు. విశేషం ఏమంటే వీరిస్తామన్న నగదు బహుమానం ఆ వ్యక్తి పుచ్చుకోలేదు.

సాయంత్రాల పూట "పూర్ణిమ" ఒక సాహితీ కేంద్రం.  రచయిత పాలగుమ్మి పద్మరాజుగారు, అమెరికన్ రిపోర్టర్ ఎడిటర్ బి.ఎస్.ఆర్ కృష్ణగారు, సోవియట్ ల్యాండ్ శెట్టి ఈశ్వరరావుగారు, మా నాన్నగారు సంగీతరావుగారు, ఎన్నార్. చందూర్ గారు, ఇలా ఎవరో కొంతమంది సాహితీప్రియులు అక్కడకు చేరి రాత్రి తొమ్మిదివరకు అనేక విషయాలమీద ముచ్చటించేవారు. డి.ఎన్.రావు కుటుంబం మద్రాస్ లో వున్నంతకాలం ఈ సంగీత సాహిత్య సమ్మేళనం కొనసాగిందనే చెప్పాలి.

మీలో ఎవరికైనా సుప్రసిధ్ధ తమిళ నటుడు రంజన్ గుర్తున్నారా? జెమినీ వారి పాత అపూర్వ సహోదరులు, చంద్రలేఖ వంటి చిత్రాల్లో నటించారు. మనందరికీ బాగా గుర్తున్న "కొండవీటి దొంగ" చిత్రంలో ఘంటసాలవారు పాడిన "సాహసమే జీవిత పూ బాటరా" పాటను డూప్ లేకుండా గుర్రపుస్వారి చేస్తూ నటించిన ఇండియన్ రాబిన్ హుడ్ ఈ రంజనే. 


ఈయనను మొదటగా తెరమీద కాక బయట చూసింది డి.ఎన్.రావుగారి ఆఫీసులోనే. సూటుబూట్ తో చాలా రాజసంగా కనపడ్డారు. అప్పట్లో ఆయనకు సొంత విమానం, రేసు గుర్రాలు వుండేవని అనుకునేవారు.

ఒకరోజు మాలతీచందూర్ గారు, కె.రామలక్ష్మిగారు విశాలాక్షిగారిని చూడడానికి  వచ్చారు. ఈ ముగ్గురు మహిళలు ఇంటిలోపల ముచ్చట్లు మొదలెట్టారు. అసలు సిసలు తెలుగింటి ఆడపడుచులుగా వారి టాపిక్ చీరలు, నగలు మీదకు మళ్ళింది. ఆ సమయంలో నేను అనుకోకుండా లోపలికి వెళ్ళవలసి వచ్చింది. నన్ను చూసి విశాలాక్షిగారు "స్వరాట్ ఈ చీరల్లో ఏది బాగుంది కొంచెం చూసి చెప్పు" అన్నారు. నాకు కంగారుపుట్టింది. ఇంతలో మాలతిగారు కలగజేసుకొని "మగపిల్లాడు అతనికేం తెలుస్తాయి ఆడవాళ్ళ చీరల సంగతి" అని తేల్చేశారు. అదే నాకు కావలసింది. వెంటనే అక్కడనుండి బయటకు వచ్చేశాను. మాలతీచందూర్ గారి ఈ వ్యాఖ్య విన్నాక నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఏదో సందర్భంలో దొరైసామి రోడ్ చివర ఒక మేడమీద పోర్షన్ లో వుండే పామర్తిగారింటికి వెళ్ళాను. ఆ సమయంలో ఆయనలేరు. ఆయన సతీమణికి అర్జంటుగా ఒక జాకెట్ గుడ్డ కావలసివచ్చి నన్ను కొనుక్కొని తేగలవా అని అడిగారు. ఏ రంగైనా, ఏ వెరైటీ అయినా ఫర్వాలేదు అంటూ కొంత పైకం ఇచ్చారు. నేను పానగల్ పార్క్ దగ్గర వుండే పాత కుమరన్ స్టోర్ లో ఒక అరగంటసేపు ఆడవాళ్ళలాగే ఇదికాదు అది, అదికాదు ఇదని అన్ని బిట్స్ లాగించి చివరకేదో నాకు బాగుందనిపించినదానిని కొని తీసుకువెళ్ళి ఆవిడకు ఇచ్చాను. ఆవిడ నేను కొన్న బట్ట చూసి "నీకొచ్చే భార్య ఎవరోకానీ మహా అదృష్టవంతురాలయ్యా! ఆ పిల్ల బజార్ కు వెళ్ళే పనేలేదు" అంటూ మెచ్చుకున్నారు. ఇప్పుడు మాలతీచందూర్ గారి వ్యాఖ్య విన్నాక ఆ పాత సంఘటన గుర్తుకు వచ్చింది.

డి.ఎన్.రావుగారు USEFI డైరక్టర్ గా వున్నరోజుల్లోననే జ్ఞాపకం, జాన్ బి. హిగిన్స్ అనే అమెరికన్ ఫుల్ బ్రైట్ స్కాలర్ షిప్ లో మద్రాసులో కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి వచ్చారు. ఆయన అప్పటికే వెస్టర్న్ మ్యూజిక్ లో పిజి చేసారు. ఆయన మద్రాస్ లో తంజావూరు విశ్వనాథన్. అతని సోదరి ప్రముఖ భరతనాట్య కళాకారిణి టి.బాలసరస్వతి శిష్యరికంలో కర్ణాటక సంగీతంలో నిష్ణాతుడై డాక్టరేట్ పొందారు. జాన్ హిగిన్స్ గాత్రం విన్నవారెవరూ అతను ఒక విదేశీయుడనుకోరు. పూర్తి దక్షిణాది సంప్రదాయపధ్ధతి వేషధారణ తో వేదిక మీద పద్మాసనం వేసుకొని అతను మూడు గంటల సేపు కర్ణాటక సంగీత కచ్చేరీ చేస్తూంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. మానాన్నగారు అతని పట్టుదలకు, మన సంగీతం పట్ల అతనికి వున్న శ్రధ్ధాభక్తులకు ఎంతగానో ముచ్చటపడేవారు. ఆ శ్రధ్ధాభక్తులు మనవాళ్ళలో కనిపించడంలేదని కూడా అనేవారు. జాన్ హిగిన్స్ దక్షిణాదిన ఉన్న ప్రఖ్యాత సంగీత సభలన్నిటిలో కచేరీలు చేశారు. తమిళ సంగీత రసికులంతా ఆయనను 'హిగిన్స్ భాగవతార్' అని ప్రేమతో పిలిచేవారు. 

🌅🌿🌄

ఘంటసాలవారు బయట ప్రపంచానికి ఎంతటి పేరుప్రఖ్యాతులు గల గాయకుడైనప్పటికీ ఆయన చాలా నిరాడంబంరంగా వుండేవారు. నెం.35, ఉస్మాన్ రోడ్ ఇంటి వాతావరణం అలాగేవుండేది. ఏవిధమైన ఆడంబరం, డాంబికం కనిపించేవికావు. ఇంటి పైన మరో అంతస్తు కట్టించినా అదీ క్రిందింటిలాగే వుంచారు తప్ప ఏవిధమైన ఇంటీరియర్ డెకరేషన్స్ జోలికి పోనేలేదు. మెయిన్ హాల్లో మాత్రం తూర్పు దక్షిణాలు కలిసే గోడ దగ్గర అర్ధచంద్రాకారంలో ఒక చిన్న వుడెన్ టీపాయ్ చేయించిపెట్టారు. క్రింది హాల్లో ఉండే జలాల్ కంపెనీవారి సిల్వర్ డయల్ చైమింగ్ గోడగడియారం పై హాలు గోడను అలంకరించింది. ఆ గడియారం ప్రతీ పావుగంటకు బకింగ్ హాం పేలస్ బిగ్ బెన్ చైమింగ్ గంటలతో మ్రోగేది. ఒకసారి మ్రోగితే పావుగంట, అరగంటఅయితే రెండుసార్లు, ముప్పావు గంట అయితే మూడుసార్లు, గంట అయితే, అప్పుడు ఎన్నిగంటలో అన్నిసార్లు ఘంటసాలవారి గళంలాగే ఆ గంట మ్రోగేది. 

గోడకు మరోవైపు G.K.Vale&Co వారు తీసిన ఘంటసాలవారు, సావిత్రమ్మగార్ల జంట ఫోటోలు పెద్దవి ఉండేవి. ఇవికాక కొత్తగా మాస్టారి ఆయిల్ పెయింట్ ఫోటో ఒకటి వచ్చింది. అది బహుశా ప్రముఖ చిత్రకారుడు గెనిసెట్టి వేసిన చిత్రమే అయ్యుండాలి. మాస్టారి అభిరుచుల మేరకు గెనిసెట్టిగారు వేసినవే శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామీ వివేకానంద, రవీంద్రనాథ్ టాగూర్, ఆయిల్ పెయింట్స్ తో పాటు మరో పెద్ద సీనరీ పటం కూడా మేడమీది హాలులోకి అదనంగా వచ్చి చేరాయి. పెద్దబాబు పుట్టినప్పుడెప్పుడో కొన్నఆకుపచ్చ తెలుపు చారల దూది సోఫాసెట్లు మేడమీదిల్లు కట్టాక మారాయి. పాతవాటికి బదులు  పేమ్ తో అల్లిన వుడెన్ సోఫాసెట్ స్కైబ్లూ కలర్ మెత్తలు, గలీబులతో గోడ రంగులతో పోటీపడుతూ కనిపించేవి. రెండుగోడల కార్నర్ లో వుండే ఆ కొత్త టీపాయ్ మీద ఓ చిన్న ఫ్లవర్ వాజ్, దానికి రెండుప్రక్కలా ఓ రెండు ఏనుగు బొమ్మలు వుండేవి. అందులో ఒక ఏనుగుకు ఒక పక్క దంతం విరిగిపోయివుండేది.

ఘంటసాలవారింటికి వాచ్ మేన్, గూర్ఖా అంటూ ఎవరినీ నియమించుకోలేదు. మాస్టారిని చూడ్డానికి సినీమా కంపెనీలవాళ్ళో, కోరస్ పాడేవాళ్ళో, ఆర్కెస్ట్రావాళ్ళో, అభిమానులో, ఎవరో ఒకరు  నిరంతరం వస్తూనే వుంటారు. తనకు వాళ్ళకు మధ్య ఒక అడ్డుగోడలా ఒక గూర్ఖాను పెట్టుకోవడం మాస్టారికి ఇష్టంవుండేదికాదు. 

ఒకరోజు సాయంత్రం ఆరు గంటల వేళ ఒకతను వచ్చాడు. బయటవూరినుంచి వచ్చానని, ఘంటసాలవారి అభిమానినని ఆయనను చూడాలని అడిగాడు. ఆ సమయంలో మాస్టారు ఇంట్లోలేరు. ఆ విషయమే ఎవరో చెప్పి చూడాలనుకుంటే మర్నాటి ఉదయం రమ్మన్నారు. చాలా దూరంనుండి వస్తున్నానని దాహంగా వుంది. కొంచెం మంచినీళ్ళివ్వమని అడిగాడు. గుండుమామయ్య మంచినీళ్ళు తెచ్చేలోపు ఆ మనిషి మాయమయ్యాడు. కొన్ని క్షణాల తర్వాత క్రింద గేట్ దగ్గర గోల వినపడింది. ఏమిటాని వెళ్ళి చూశాము. ఎవరో ఒక మనిషిని మావయ్యకృష్ణో లేక సుబ్బారావో సరిగా గుర్తులేదు, పట్టుకొని గదమాయిస్తున్నారు. ఆ మనిషి చేతిలో మేడమీది హాలులోని ఒక ఏనుగు బొమ్మ కనిపించింది. మంచినీళ్ళని అడిగి తెచ్చేలోగా ఆ బొమ్మతో ఉడాయించాలని చూశాడు. ఈ ఏనుగు ఒక్కటే అందుబాటుగా దొరికింది. వాడిని నాలుగు తన్ని టి.నగర్ బస్ స్టాండ్ దగ్గర మాడ్లీ రోడ్ పోలిస్ స్టేషన్ కు లాక్కెళ్ళారు. నరసింగ, నేనూ కూడా వెళ్ళాము. అక్కడ మావాళ్ళకు తెలిసిన  బీట్ కానిస్టేబుల్ కనపడ్డాడు. పండగలకు పబ్బాలకు ఇంటికొచ్చినప్పుడు చూసేవాడిని.  అతను జరిగిన విషయం తెలుసుకొని ఆ వచ్చినవాడిని గదమాయించేప్పటికి ఏనుగు బొమ్మను తీసినట్లు ఒప్పుకున్నాడు. ఆ సమయానికి ఎస్.ఐ లేడు. ఒక గంటసేపు వాడిని లాకప్ లో వుంచి ఎస్.ఐ వచ్చాక విషయమంతా చెప్పి మరో రెండు లాగించారు.

💥కొసమెరుపు:
చివరకు జరిగిందేమిటంటే దొంగలింపబడిన వస్తువు విలువ దృష్ట్యా వాడిని ఒదిలేయడమే ఉత్తమమని లేకపోతే వాడిని లాకప్ వుంచినంతకాలం వాడి భోజనవసతులు వంటి ఖర్ఛులన్నీ  మనమే భరించవలసి వుంటుందనేలాటి కబుర్లేవో చెప్పి ఆ ఏనుగు బొమ్మను దొంగలించినవాడికి గట్టిగా బుధ్ధి చెప్పి వదిలేశారు. ఇది జరిగేకే అని గుర్తు, మరింత భద్రతకోసం మేడమీది ఇంటి ప్రధాన ద్వారానికి అదనంగా ఒక గ్రిల్  డోర్ అమర్చడం జరిగింది.

మరికొన్ని విషయాలతో... వచ్చే వారం.....
       ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, August 22, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై అయిదవ భాగం

22.08.2021 -  ఆదివారం భాగం - 45*:
అధ్యాయం 2 భాగం 44  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

నేను పుట్టాను. ఈ లోకం నవ్వింది. నిజం. మనసారా నవ్వుకోవడమే కాదు, సంబరాలు జరుపుకుంది. నేను పుట్టిన మూడు వారాలకు ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన రెండవ ప్రపంచయుధ్ధం ముగిసింది. శాంతియుత వాతావరణానికి శుభోదయమయింది.

నేను పుట్టిన కొన్ని మాసాలకు ముందే లలితసంగీత వినీలాకాశంలో మహాకాంతివంతమైన తార దర్శనమిచ్చింది.  తన విలక్షణమైన కంఠస్వరంతో, అనితరసాధ్యమైన గానప్రతిభతో రసహృదయులను తన్మయులనుజేసింది. ఆనంద పరవశులనుజేసింది. ఈనాటికీ లలిత సంగీతప్రపంచంలో సాటిలేని మేటి ధృవతారగా వెలుగొందుతూనేవుంది.

ఎవరా ధృవతార? 

ఇంటింటా గంట గంటకూ కంచుఘంటలా మార్మోగే కంఠస్వరం కలిగిన గాన గంధర్వుడు ఘంటసాలే ఆ ధృవతార. అటువంటి మహోన్నతగాయకుని ఇంటి ప్రాంగణంలో వారి కనుసన్నలలో రెండు దశాబ్దాల కాలం సన్నిహితంగా మెలగిన అదృష్టవంతుడిని నేను. 

నేను పుట్టాక, నాకు ఊహ తెలిసాక నేను విన్న మొట్టమొదటి పాట ఘంటసాలవారిదే. అదే "పలుకరాదటే చిలకా". కలివరం గంగుల అప్పలనాయుడుగారింటి బాకా గ్రామఫోను లోనుండి వెలువడి నాగావళీ ఏటి గాలి తరంగాలలో తేలియాడుతూ నా చెవులకు సోకిన తొలి మధురగీతం. ఈ పాట పాడేనాటికి గాయకుడిగా ఘంటసాల వయసు ఐదేళ్ళే. నా వయసు ఐదేళ్ళే. 

1944 లో ఒక అనామక గాయకుడిగా చిత్ర రంగప్రవేశం చేసిన వామనమూర్తి (కొందరికి) ఘంటసాల వెంకటేశ్వర్లుగా, ఘంటసాల వెంకటేశ్వరరావుగా, జి.వి.రావుగా, అంచెలంచెలుగా ఎదిగి ఘంటసాల అనే గాన త్రివిక్రముడిగా దిగంతాలకెదిగి అక్కడే ధృవతారగా స్థిరపడి అక్కడినుండే  తన గానామృతాన్ని ఈలోకంలో ఈనాటికి పంచిపెడుతూ గానప్రియులకు మహదానాందాన్ని, రసానుభూతి ని కలిగిస్తున్నాడు.

ఘంటసాల ఈ స్థితికి చేరుకోవడానికి కారణకర్తలైన మహానుభావులెందరో.

జన్మనిచ్చిన ఘంటసాల సూర్యనారాయణ, రత్తమ్మ దంపతులు, పెరిగి పెద్దవడానికి దోహదపడిన మేనమామ ర్యాలి పిచ్చిరామయ్యగారు, నాలుగైదేళ్ళపాటు తన సొంత బిడ్డలా సాకి సంగీత విద్యను నేర్పిన గురువర్యులు పట్రాయని సీతారామశాస్త్రి గారు, తన విద్యాకాలంలో అన్నం పెట్టి ఆదుకున్న విజయనగరం అన్నదాతలు,  మద్రాస్ చలనచిత్ర రంగంలో కాలూనడానికి చేయూతనిచ్చిన మాన్యశ్రీ - సముద్రాల రాఘవాచార్యులవారు, బృందగానాలలో పాడడానికి, తన సినీమా లో చిల్లర వేషాలు వేయడానికి అవకాశం కల్పించి, నెల జీతమిచ్చి ఆదుకున్న ప్రతిభా బలరామయ్యగారు (ఘంటసాల) (ఇద్దరిదీ వేర్వేరు కులం. కానీ ఇద్దరిదీ ఒకటే కులం - సినీమా కులం),  రేణుకా కంపెనీ చిత్తూరు వి నాగయ్య, ఆలిండియా రేడియో ద్వారా తన కంఠాన్ని తెలుగువారికి పరిచయం చేసి నిరంతర జీవనోపాధి కల్పించిన బాలాంత్రపు రజనీకాంతరావుగారు, గాయకుడిగా సినీమాలలో తొలి అవకాశం కల్పించిన దర్శకనిర్మాత శ్రీ బి ఎన్ రెడ్డి , సంగీత దర్శకుడు శ్రీ చిత్తూరు వి.నాగయ్య, సహాయ సంగీతదర్శకుడిగా పరిచయం చేసిన భరణీ భానుమతి, రామకృష్ణారావు దంపతులు - వీరు చూపించిన ఆదరణ, సహాయ సహకారాలు, ప్రేమానురాగాల గురించి ఘంటసాలవారు తలచుకోని క్షణమేలేదు. తన ప్రతీ ఇంటర్వ్యూలలో వీరందరికి తన కృతజ్ఞతలు తెలుపుకున్న గొప్ప సహృదయుడు శ్రీ ఘంటసాల.

వీరితోపాటూ తన పురోభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడిన మరో ప్రముఖ వ్యక్తి పేకేటి శివరాం. ప్రతిభా పిక్చర్స్ ప్రొడక్షన్ మేనేజర్ గా ఘంటసాల వెంకటేశ్వరరావును తమ యజమాని ఘంటసాల బలరామయ్యగారికి పరిచయం చేసి అక్కడ ఒక చోటు లభించేలా తోడ్పడిన సహృదయుడు. మరాఠీ బాణి రంగస్థల నాటక పద్యాలకు, దాక్షిణాత్య యాసతో కూడిన సంప్రదాయ సంగీత విద్వాంసుల పాటలకు అలవాటు పడ్డ హిస్ మాస్టర్స్ వాయిస్ (HMV) కార్యక్రమ నిర్వాహకుల చెవులకు ఘంటసాల యొక్క వైవిధ్యభరితమైన, విలక్షణమైన పాట, పద్యం నచ్చలేదట. ఘంటసాలను తిరస్కరించారట. సహజమే. అక్కడున్నవారి సంగీత సంస్కారం అంతవరకే. తర్వాత, ప్రతిభాలో పనిచేసిన పేకేటి హెచ్.ఎమ్.వి.కి ప్రోగ్రామ్ ఎక్సిక్యూటివ్ గా రావడం జరిగింది. వెంటనే, పేకేటి శివరాంగారు శ్రీఘంటసాలగారిని పిలిపించి 'నగుమోమునకు నీ నిశాబింబము' అనే పద్యాన్ని, 'గాలిలో నా బ్రతుకు' పాటను రికార్డ్ చేయించారు. అవే ఘంటసాలవారి రికార్డైన మొదటి పాట, పద్యము. 


కానీ ఇవి ప్రజల మధ్య రావడానికి ముందేస్వర్గసీమ సినీమా విడుదలై భానుమతి గారితో కలసి పాడిన గాజులపిల్ల పాట తెలుగు జనాలకు చేరింది.  ఇదంతా నేను పుట్టిన సంవత్సరంలోనే జరిగింది. 


ఆ రోజుల్లో హెచ్.ఎమ్.వి.వారి పాటలు మెడ్రాస్ లోనే రికార్డ్ చేసినా వాటి ప్రాసెసింగ్, ఫైనల్ రికార్డ్ గా విడుదల కావడం అంతా కలకత్తా డమ్ డమ్ లో జరిగేది. ఆ కారణంగా ఘంటసాలగారి మొదటి పాట, పద్యం ఆ మరుసటి సంవత్సరం తెలుగు శ్రోతల శ్రవణాలకు చేరింది. అంతే, గాయకుడిగా ఘంటసాల పేరు మార్మోగింది. ప్రతీ మూడు మాసాలకు ఒకసారి ఘంటసాల ప్రైవేట్ రికార్డ్ లను విధిగా విడుదల చేయడం మొదలుపెట్టారు. ఘంటసాలవారి కరుణశ్రీ పద్యాలు, తిరుపతి వెంకటేశ్వరుడిమీద భక్తిగీతాలు తెలుగునాట ఎంతటి సంచలనం సృష్టించాయో, ఎంతటి ప్రజాదరణ పొందాయో జగమంతటికి తెలుసు.

ఈ విధంగా ఆదిలో ఘంటసాలవారి గానవిశిష్టత ను ప్రజలకు చేరవేయడంలో  పేకేటి ప్రముఖ పాత్ర వహించారని చెప్పాలి.

తర్వాతి కాలంలో పేకేటి నటుడిగా మారారు. ఘంటసాల గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఉన్నతశిఖరాలకు ఎదిగిపోయారు. పేకేటి నటించిన సినిమాలలో ఘంటసాల మాస్టారు పాడిన పాటలు ఏవీ లేవనే అనుకుంటాను. విన్న గుర్తులేదు. 

పేకేటి నటుడిగా కన్నా కార్యనిర్వాహకుడిగా బహు ప్రజ్ఞావంతుడు. ఈనాడు అందరూ అనే పబ్లిక్ రిలేషన్స్ లో అందెవేసిన చేయి. సినీమారంగం, ముఖ్యంగా ఎన్.టి.రామారావు నిర్వహించిన అనేక సంక్షేమ కార్యక్రమాలలో పేకేటి ప్రముఖ పాత్ర వహించేవారు. విదేశాలలో ఆయనకు మంచి పరిచయాలుండేవంటారు. ఫారిన్ లొకేషన్స్ లో సినీమా ఔట్ డోర్ షూటింగ్ లు నిర్విఘ్నంగా జరగాలంటే పేకేటిని సంప్రదిస్తే సునాయాసంగా జరిగిపోతాయనే ఖ్యాతి ఆయనకు వుండేది. ఘంటసాలవారు నిర్మాతగా తాను తీసిన 'భక్త రఘునాథ్' చిత్రంలో పేకేటి కూడా నటించారు. ఇటీవలే దివంగతురాలైన సుప్రసిధ్ధ బహుభాషా నటీమణి జయంతిని కమలకుమారిగా ఉన్న రోజులలో సినీమా రంగానికి పరిచయం చేసినది పేకేటి శివరామే. ఆమె తొలి చిత్రాలలో ఘంటసాలవారి 'భక్త రఘునాథ్' కూడా ఒకటి. ఆ తర్వాత ఘంటసాల, పేకేటి కలసి పనిచేసే అవకాశమే రాలేదు.

🌿


శ్రీదేవీ ప్రొడక్షన్స్ తోట సుబ్బారావు గారి కోట్స్ రోడ్ ఆఫీసులో తమ కొత్త సినీమా పాటల కంపోజింగ్ మొదలయింది. ఆ బ్యానర్ తీసిన అన్ని సినీమాలకు ఘంటసాలవారే సంగీత దర్శకత్వం వహించారు. ఆ పాటల కంపోజింగ్ సమయంలో పేకేటి శివరాంగారిని అక్కడ చూడడం జరిగింది. ఆయన ఆ సినీమాలో ఏక్ట్ చేస్తున్నారేమోనని భావించాను. కాని రెండు మూడుసార్లు వరసగా ఆయన అక్కడ కనిపించి పాటల కంపోజింగ్ లో పాల్గొని ఆ సినిమా గురించి వివరించినప్పుడు తెలిసింది ఆ సినీమాకు డైరక్టర్ పేకేటి అని. అదొక కన్నడ సినిమాకు రీమేక్. రాజ్ కుమార్, జయంతిలతో వచ్చిన ఒక నవలా చిత్రం ' చక్రతీర్థ'. ఆ సినీమాకు కూడా పేకేటి శివరామే డైరక్షన్. ఆ సినీమా రైట్స్ కొని శ్రీదేవి తోట సుబ్బారావుగారు తెలుగులో 'చుట్టరికాలు' గా మొదలుపెట్టారు. జగ్గయ్య జయంతి ఒక జంట. గుమ్మడి, హేమలత ఒక జంట. కాంతారావు, కృష్ణకుమారి ఒక జంట.  

సెకెండ్ హీరో శోభన్ బాబుకు జోడీగా ఒక కొత్త అమ్మాయిని పరిచయం చేశారు. ఆ అమ్మాయే లక్ష్మి. తర్వాతి కాలంలో  సర్వ సమర్థురాలైన బహుభాషానటిగా పేరు పొందారు.  నిన్న మొన్నటి 'మిథునం' సినీమాలో కూడా లక్ష్మి అసామాన్యమైన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆమె తండ్రి వై.వి.రావు, తల్లి రుక్మిణి కూడా మొదటి తరం తారలు. లక్ష్మి (భర్తలు కూడా సినీమా నటులే.) కుమార్తె ఐశ్వర్య కూడా అనేక తమిళ, తెలుగు చిత్రాలలో నటించింది.

నవలలు ఆధారంగా తీసుకొని తీసే చిత్రాలలో ఎక్కువగా మెలోడ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఎక్కువుంటాయి.  ఆనాటి మహిళా ప్రేక్షకులు అలాటి కుటుంబ కధా చిత్రాలనే ఆదరించేవారు. అలాటి చిత్రమే ' చుట్టరికాలు'. ఈ సినిమాలో పాటలను ఆనాటి మేటి గీత రచయితలైన దాశరధి, సి.నారాయణరెడ్డి, కొసరాజు, శ్రీశ్రీ వ్రాసారు. ఈ పాటల రికార్డింగ్, రీరికార్డింగ్ కూడా విజయాగార్డెన్స్ లో సౌండ్ ఇంజనీర్ ఆర్.స్వామినాథన్ పర్యవేక్షణలోనే జరిగాయి. స్వామినాథన్ తమిళుడు. ఎక్కువగా మాట్లాడరు. ఎప్పుడూ మూతి బిగించుకునేవుంటారు. కారణం సదా ఆయన నోటినిండా తాంబూలం ఉంటుంది. నోరు విప్పరు. ఐదేసి నిముషాలకు ఒకసారి లేచి బయటకు వెళ్ళి నోరు కడుక్కొని వచ్చేవారు. మరల మరో రెండు మూడు నిముషాల్లో మళ్ళీ తమలపాకులు నోటినిండా దట్టించేవారు. ఆయన పక్కనే ఘంటసాల మాస్టారు కూర్చొని ఆడిటోరియంలోని ఆర్కెష్ట్రావారికి సూచనలు ఇచ్చేవారు. చుట్టరికాలు సినీమాలోని పాటలు గొప్ప హిట్సని చెప్పలేము. కానీ, ఘంటసాల సుశీల పాడిన 'నీవే నా కనులలో',

'అందాల అలివేణివి' పి.బి.శ్రీనివాస్, సుశీల పాడిన 'ఏమిటో ఈ వింత ఎందుకో పులకింత', 

ఘంటసాలగారు పాడిన సోలో "గాలి వీచెను అలలు లేచెను", 

ఎల్లారీశ్వరి , సుశీల "ఆడవా ఆటాడవా ఎగిరి ఎగిరి గంతులేసి..." వంటి పాటలు ఘంటసాలవారి మినిమమ్ గ్యారెంటీతో శ్రావ్యంగా వినసొంపుగా వుంటాయి. సినీమా అంటే కేవలం వినోదం మాత్రమేనని ఆశించి వెళ్ళే ప్రేక్షకులకు  నచ్చని అంశం ఈ సినీమాలోని మూడు ప్రధాన పాత్రలను చంపేసి సినీమాను శోకమయం చేయడం. సమైక్యాంధ్రదేశంలో తెలుగు ప్రేక్షకులు 'చుట్టరికాలు' ను ఎంతవరకు ఆదరించారో తెలుసుకునే అవకాశం, ఉద్యోగాల వేటలో పడిన,  నాకు కలగలేదు. తోట సుబ్బారావుగారు మాత్రం తమ చిత్ర నిర్మాణం కొనసాగించారు.

🌺

' పి బి టి డి చె జె కె గె '

పై అక్షరాలు మీకు ఏమైనా గుర్తు చేస్తున్నాయా ?

నేను ఆంధ్రా సిమెంట్స్ లో పనిచేసిన నెల రోజులలో నాకు ఒక విషయం అర్ధమయింది. ఒక సుమారైన ఉద్యోగం దొరకాలంటే నాకున్న అర్హతలు చాలవు. మరింకేదైనా సర్టిఫికెట్లు సంపాదించాలి. టైపిస్ట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్ళితే బుక్కీంపింగ్ తెలుసా? షార్ట్ హ్యాండ్ తెలుసా? అని అడిగేవారు. ఒకసారి IDPL-SIP (Surgical Instruments Plant-Chennai)లో పనిచేస్తున్న మాస్టారి తమ్ముడు సదాశివుడుగారు వీకెండ్స్ కు టి.నగర్ అన్నగారింటికి వచ్చినప్పుడు మౌంట్ రోడ్ లో శ్రీరామ్ గ్రూప్ వాళ్ళు కొత్తగా ఏదో ఆఫీసు తెరిచారట, అందులో ఏవో ఉద్యోగాలకు ఖాళీలున్నాయట, వెళ్ళి చూడమని సలహా ఇచ్చారు. పూర్తి వివరాలు ఆయనకు తెలియవు. మౌంట్ రోడ్ ఎల్.ఐ.సి.కి దగ్గరలో వుందని మాత్రం చెప్పారు. సరేనని ఒక రోజు ఉదయం తొమ్మిది తర్వాత పానగల్ పార్క్ దగ్గర 11వ నెంబర్ బస్ పట్టుకొని మౌంట్ రోడ్  ఆర్ట్స్ కాలేజ్ స్టాపింగ్ లో దిగి రోడ్ క్రాస్ చేసి ఎల్.ఐ.సి. బిల్డింగ్ వరసలో ఎక్కడైనా శ్రీరామ్ పేరిట ఏవైనా కంపెనీలు వున్నాయేమోనని తెగ వెతికాను. ఎక్కడా ఆ పేరుతో ఏ ఆఫీసు బోర్డ్  కనపడలేదు. ఆ చుట్టుపక్కలున్న రోడ్లన్నీ గాలించినా ఆ పేరుతో ఏదీ కనపడలేదు. ఇక విసుగెత్తి తిరిగి ఎల్.ఐ.సి. దగ్గర టి.నగర్ బస్ పట్టుకుందామని గోవ్ బిల్డింగ్ పక్కనుండి వస్తూంటే ఒక దగ్గర ఉషా కంపెనీ బోర్డ్ కనిపించింది. "ఉష" అంటే ఆ రోజుల్లో కుట్టుమిషన్లకు, ఫ్యాన్లకు చాలా ప్రసిధ్ధి. ఆ ఆఫీసు ఒక మేడమీద వుండేది. అందులో పనిచేసే వాళ్ళెవరో ఇద్దరు క్రింద నిలబడి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళదగ్గరకు వెళ్ళి అడిగాను ఈ శ్రీరామ్ వినైల్స్ కంపెనీ ఎడ్రస్ గురించి. నా అదృష్టం. ఆ కంపెనీ ఆ మేడ మీదే వుందని చెప్పారు. మెల్లగా మెట్లెక్కి పైకి వెళ్ళాను. ఆ ఆఫీసు ఒక మూలగా ఒకే ఒక పాతగదిలో వుంది. అక్కడ ఎవరూ కనపడలేదు. కొంతసేపు అక్కడే తచ్చాడుతుండగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి నన్ను ఏం కావాలని అడిగాడు. అతను తెలుగో, తమిళియనో కాదు. నార్త్ ఇండియన్. అతనే ప్రస్తుతం అక్కడి ఆఫీస్ ఇన్ ఛార్జ్. స్టాఫ్ ఇంకా నియమించబడలేదు. వచ్చిన విషయం తడబడుతూ ఇంగ్లీష్ లో చెప్పాను. తమకు ప్రస్తుతం వెంటనే ఒక స్టోర్ కీపర్ కావాలని, అందులో నా అనుభవం గురించి అడిగాడు. పైగా ఆ ఉద్యోగంలో చేరిన వెంటనే 7000 రూపాయలు సెక్యూరిటి డిపాజిట్ కట్టాలని ఏవో రూల్స్, కండిషన్స్ చెప్పడం మొదలెట్టాడు. స్టెనోగ్రఫీ వచ్చా అని అడిగాడు.  అతను అడిగిన అనుభవమూ లేదు, ఏడువేలు డిపాజిట్ కట్టే స్థోమతాలేదు. కిక్కురుమనకుండా  అతనికి ఒక ధ్యాంక్స్ చెప్పేసి తిరిగి చూడకుండా ఇంటిమార్గం పట్టాను. 

🍀

ధైర్యం చేసి ఏదైనా మంచి  సినీమా కంపెనీలో ఏ అసిస్టెంట్ గానైనా చేరితే ఎలావుంటుంది అనే ఆలోచన పురుగులా నా మెదడును దొలచడం మొదలెట్టింది. ఇందుకు ఘంటసాల మాస్టారితో మాట్లాడమని మా నాన్నగారిని అడిగితే... ఒప్పుకుంటారా? ఇద్దరూ ససేమిరా ఒప్పుకోరు. వేరే మార్గాలు చూడవలసిందే. ఏ ఉద్యోగం రావాలన్నా మరేవైనా క్వాలిఫికేషన్లు సంపాదించాలి. ఇక ఆ ప్రయత్నాలు మొదలెట్టాలనే నిర్ణయానికి వచ్చాను. 

పానగల్ పార్క్ దగ్గర ఇప్పుడున్న నల్లీస్ 100, పోతీస్, ఫ్లైఓవర్  ఆ రోజుల్లో లేవు. దొరైసామి రోడ్ కు మంగేష్ స్ట్రీట్ కు మధ్య సలామ్ స్టోర్స్, రామన్స్ కాఫీ వర్క్స్, పార్క్ హెయిర్ డ్రెసెస్ వంటివి వుండేవి. ఆ పక్కనే ఒక మేడ మీద 'నియో కమర్షియల్ ఇన్స్టిట్యూట్' అని ఎర్రటి బోర్డ్ మీద తెల్లటి అక్షరాలతో వ్రాసి వుంది. అక్కడ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్, బుక్ కీపింగ్ వంటి కోర్స్ లకు కోచింగ్ ఇస్తారని వ్రాసి వుంది.  అందులో చేరి షార్ట్ హ్యాండ్, బుక్ కీపింగ్ కోర్స్ లు చేయాలనే నిర్ణయానికి వచ్చి నియో కమర్షియల్ ఇన్స్టిట్యూట్ లో చేరాను. వాళ్ళు షార్ట్ హ్యాండ్ కు పిట్స్మన్ బుక్,  లాంగ్ నోట్ బుక్, పెన్సిల్, ఎక్కౌంట్స్ కు మరేవో పుస్తకాలు కొనుక్కోమని ఒక లిస్ట్ ఇచ్చారు. రోజుకు రెండు గంటలు. ఇదో గంట, అదో గంట. ఇంటికి దగ్గరే కావడం వలన వెళ్ళి రావడం సమస్య కాదు. ముందుగా కోచింగ్ సెంటర్లో కొనమన్న పుస్తకాలు సంపాదించాలి. అందుకు ముందుగా మా నరసింగడిని సంప్రదించాను. నా అదృష్టం. అతను తన దగ్గరున్న పిట్స్మన్ షార్ట్ హాండ్ టెక్స్ట్ బుక్ ఉదారంగా ఉచితంగా ఇచ్చేసాడు. అతను కొన్నాళ్ళు  షార్ట్ హ్యాండ్ ప్రాక్టీసు చేసి అతనివల్ల కుదరక స్వస్తి చెప్పేసాడట. అతనిచ్చిన ఆ పుస్తకం పట్టుకొని ఓ మంచిరోజు చూసి నియో కమర్షియల్ ఇన్స్టిట్యూట్ లో చేరాను.

మొదటిరోజు క్లాసుకు నాలాటివారే నలుగురైదుగురు కొత్తవాళ్ళు వచ్చారు. మధ్య వయసులో వుండే ఒకాయన టీచర్ .  ఆయన  బోర్డ్ మీద కొన్ని గీతలు నిలువుగా, అడ్డంగా, వంపుగా, లైట్ గా,థిక్ గా వ్రాసి  pee bee tee dee che jay kay gay అంటూ వ్రాసి చూపించి పెన్సిల్ తో అలాగే వ్రాయడం ప్రాక్టీసు చేయమన్నారు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ a b c d లు కాకుండా ఈ పీ బీ టీ డీల వరసేమిటో అర్ధం కాలేదు. షార్ట్ హాండ్ అంతా సింబల్స్ కోడ్స్ తోనే నిండివుంటుంది. అవన్నీ అర్ధం చేసుకోవడానికే నాకు చాలా రోజులు పట్టింది. అలాగే, బుక్ కీపింగ్ అంతా లెఖ్ఖల మయంగా కనిపించింది. డెబిట్, క్రెడిట్, ప్రాఫిట్, లాస్, ఇన్కమ్, ఎక్స్ పెండిచర్, ఎస్సెట్స్, లయబిలిటీస్, జర్నల్ ఎంట్రీస్, బ్యాలన్స్ షీట్ -- ఇవేవీ నా బుర్రకెక్కలేదు.  కొన్నాళ్ళు కష్టపడి ప్రయత్నించినా నాకంతా అయోమయంగానే వుండిపోయింది. దానితో బుక్కీపింగ్ కు స్వస్తిపలికి షార్ట్ హాండ్ ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాను. అలాగే టైప్ రైటింగ్ 100 వర్డ్స్ టెస్ట్ కు వెళ్ళడానికి టైప్ రైటింగ్ మొదలెట్టాను. కనీసం ఒక ఏడాదైనా బాగా ప్రాక్టీస్ చేస్తే తప్ప పరీక్షలకు వెళ్ళే అర్హత రాదు. 

ఇలా షార్ట్ హాండ్, హైస్పీడ్ టైపింగ్ లతో కాలం వెళ్ళదీస్తున్న కాలంలో ఒక రోజు మా నాన్నగారు నన్ను డా.డి.ఎన్.రావుగారిని వెళ్ళి కలవమని చెప్పారు. నా గుండెల్లో రాయి పడింది.

ఆ విశేషాలేమీటో వచ్చేవారం ... 

             ... సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, August 15, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై నాలుగవ భాగం

15.08.2021 - ఆదివారం భాగం - 44*:
అధ్యాయం 2  భాగం 43 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్


డెబ్భై అయిదవ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా స్వతంత్ర భారతావనికి అభినందనలు


35, ఉస్మాన్ రోడ్డు టెర్రస్ మీద ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం నాడు మువ్వన్నెల జెండా ఎగిరేది.

ఘంటసాలవారు ఉన్న కాలంనాటికి తెలుగు సినీమాల నిర్మాణం తక్కువగానే ఉండేది. 1970ల నాటికి అధికపక్షంగా సుమారుగా  సంవత్సరానికి 70 సినీమాలు విడుదల అయేవి. వాటిలో ఓ పది డబ్బింగ్ చిత్రాలు. తెలుగు సినీమా మొదటి దశలో ప్రతీ సినీమాలో పాటల సంఖ్య అధికంగానే వుండేది. పౌరాణిక చిత్రాలైతే పాటలు, పద్యాలు అధికసంఖ్యలోనే పెట్టేవారు. ఆనాటి పాటలన్నీ కూడా ఒక్కొక్కటి మూడు నిముషాలలోపే ఉండేవి. 1970లు వచ్చేసరికి తెలుగు సినీమాలలో పాటల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఒక్కో సినీమాకు ఆరేడు పాటలకంటే ఎక్కువ పెట్టడం మానేసారు. 

ఘంటసాల మాస్టారి కాలంనాటికి గాయనీగాయకులు, సంగీతదర్శకులు అధికసంఖ్యలోనే వుండేవారు. ఆనాటి తెలుగు సినీమాలు వీరందరికీ సమానమైన వృత్తి అవకాశాలను, ఆదాయాన్ని కల్పించగలిగినదా అంటే లేదనే చెప్పాలి. ఘంటసాలవారితో పాటు, సర్వశ్రీ - ఎస్.రాజేశ్వరరావు, పెండ్యాల, టి.వి.రాజు, టి.చలపతిరావు, మాస్టర్ వేణు, సుసర్ల దక్షిణామూర్తి, సాలూరి హనుమంతరావు, అద్దేపల్లి, ఓరుగంటి, గాలి పెంచల, పామర్తి, విజయాకృష్ణమూర్తిలతో పాటు పరభాషా సంగీత దర్శకులైన కె.వి.మహాదేవన్, ఎమ్.ఎస్.విశ్వనాథన్-రామమూర్తి, సుదర్శనం-గోవర్ధనం, వేదా, శంకర్-గణేష్, రాజన్-నాగేంద్ర, విజయభాస్కర్, జి.కె.వెంకటేష్, టి.జి.లింగప్ప, శంకర్-జైకిషన్  వంటి సంగీత దర్శకులెందరో ఆనాటి తెలుగు సినీమాలకు సంగీత దర్శకత్వం వహించారు. వీరితో పాటూ ఓ రెండు మూడు సినీమాలకు మాత్రమే పనిచేసి కనుమరుగైన సంగీత దర్శకులు, 1970ల తర్వాత కొత్తగా పరిచయం కాబడిన సంగీత దర్శకులు మరెందరో కనిపిస్తారు. ఈ మ్యూజిక్ డైరక్టర్లందరికీ ఏడాదిపొడుగునా నిశ్చింతగా కాలం గడపడానికి కావలసిన ఆదాయం లభించేలా సంగీతావకాశాలు లభించేవా అంటే అనుమానాస్పదమే. పైన చెప్పిన సంగీత దర్శకులలో సగం మంది మాత్రమే నిరంతరావకాశాలు కలిగినవారు. అందరు సంగీత దర్శకులకు ఒకే విధమైన  పారితోషకాలు ఉండేవికావు. ఒకరికి పదిహేను వేలయితే, మరొకరికి పదివేలు, ఇంకొకరికి ఏడువేల ఐదొందలు, ఐదువేలు, మూడువేలు, రెండువేలు, పదిహేను వందలకు కూడా పనిచేసే సంగీత దర్శకులుండేవారు. వీరిలోకొంతమంది ఆదాయాలకంటే అనేకమంది సంగీత దర్శకుల దగ్గర పనిచేసే వాద్య కళాకారుల ఆదాయమే గణనీయంగా వుండేది.  నేపథ్యగాయకుల పరిస్థితి ఇలాగే వుండేది. 1965ల వరకూ నేపధ్యగాయకుల పారితోషికం   వారి వారి డిమాండ్ ను బట్టిఒక్కొక్క పాటకు అధిక పక్షం 750/- అయితే అధమపక్షం 200/-గా వుండేది. కొరస్ సింగర్స్ కు అయితే వంద రూపాయల లోపే. ఎవరికీ నికరంగా నెలకు ఇంత ఆదాయం వస్తుందని చెప్పుకునే ఆస్కారం లేదు.ఱ

ఇదేవిధంగా వాద్యకళాకారుల ఆదాయం కూడా చాలా దయానీయంగానే వుండేది. వాయించే వాద్యాలను బట్టి నలభై రూపాయలనుండి నూరు, నూట ఏభైవరకు మాత్రమే ఇచ్చేవారు. ఎన్నో వందలమంది ఆర్కెష్ట్రా ప్లేయర్స్ వున్నా రోజూ  పని దొరికేది చాలా కొద్దిమందికే. నెలల తరబడి ఏ పని దొరకని సంగీత దర్శకులు,గాయకులు,వాద్యకళాకారులెందరో మద్రాస్ మహానగరంలో అల్లల్లాడుతూండేవారు. ఒక సంఘటన నాకు బాగా గుర్తు నేను కాలేజీలో చేరేముందు ఒకాయన మా నాన్నగారి దగ్గర అప్పుకు వచ్చారు ఒక ఏభై రూపాయలు ఇవ్వమని. మానాన్నగారూ అంత సొమ్ము అప్పుగా ఇచ్చే స్థితిలో లేరు. ఆ వచ్చినాయన చాలా అత్యవసరమని తన దగ్గరున్న వాచీని మా నాన్నగారి చేతిలోపెట్టి, డబ్బు తిరిగి ఇచ్చేవరకూ వాచీని ఉంచుకోమని బలవంతపెట్టి మొత్తానికి తానడిగిన డబ్బును పట్టుకెళ్ళారు. మళ్ళీ ఆ అప్పు తీర్చనూ లేదు. తన వాచీని పట్టుకెళ్ళనూ లేదు. ఆ వాచి చాలా మంచి వాచి. టైటస్ కంపెనీది. ఇప్పటికీ నా దగ్గర వుంది.  ఔటర్ డయల్ మారింది అంతే. ఆ వాచీ ఇప్పటికీ బాగానే పనిచేస్తూ నా కంటే మంచి కండిషన్ లో వుంది. నాకు మొదట్లో అమరిన సైకిలు అలాటిదే. సెకెండ్ హాండ్ లో వచ్చినదే. చాలా ఏళ్ళు ఆ సైకిల్ నన్ను మోసింది. ఈ విధమైన సంగీత కళాకారుల దుస్థితికి సినీ మ్యుజిషియన్స్ యూనియన్  ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా  ఘంటసాల మాస్టారు చాలా ఆవేదన పడేవారు.

తెలుగు చలనచిత్ర సీమలో నెంబర్ వన్ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాల మాస్టారు తన  సినీమా పాటలతో, లలిత సంగీత కచ్చేరీలతో, హిస్ మాస్టర్స్ వాయిస్ కంపెనీవారి ప్రైవేట్ రికార్డుల గానంతో  నిరంతరం బిజీగానే వుండేవారు. ఆదాయానికీ ఏ కొరతాలేదు. మొదటినుండి వున్న డయబెటిస్, బి.పి.ల వలన అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు. వాటికి నిరంతరం ఏవో మందులు, మాత్రలు వాడేవారు. క్రమక్రమంగా ఓపిక తగ్గుతూండడం వలన సంగీత దర్శకత్వం పట్ల ఆసక్తి సన్నగిల్లుతూ వచ్చింది.  కొత్త  నిర్మాత ల సినీమాలకి సంగీత దర్శకత్వం వహించడానికి సుముఖత చూపలేదు. సంగీత దర్శకత్వం వహించే సమయంలో మరిన్ని పాటలు పాడుకుంటే చాలనే అభిప్రాయం లో వుండేవారు. ముఖ్యంగా, ఘంటసాలగారు సినీమా కంపెనీల చుట్టూ తిరుగుతూ పనికోసం ప్రాకులాడడం అనేది 1950 లకు ముందే మానేసారు. ఘంటసాలే తమ సినీమా పాటలు పాడాలి, ఆయనే మా సినీమాకు సంగీతం చేయాలని వచ్చి అడిగే నిర్మాతలకే చివరివరకూ పనిచేసారు. అలాగే, తననే సంగీతదర్శకుడిగా పెట్టుకుంటామని చెప్పి చివరి క్షణాలలో మరొకరిని తీసుకున్నప్పుడు కూడా ఆయన బాధపడలేదు. మరో సంగీత దర్శకుడికి కొంత ఉపాధి లభించిందని భావించేవారు. ఈ విధమైనటువంటి పరిస్థితులు వ్యక్తిగతంగా ఘంటసాల మాస్టారికి ఇబ్బందులు కలిగించకపోయినా, పూర్తిగా ఆయన సంగీత దర్శకత్వం వహించే సినీమాలకు మాత్రమే పనిచేసే మా నాన్నగారికి, మరో ముగ్గురు వాద్యకళాకారులకు నిరంతరాదాయం లభించని దుస్థితులు ఎదురైనాయి. ఘంటసాలవారు, వారి సతీమణి శ్రీమతి సావిత్రమ్మగారి ఔదార్యం వలన మేము నెం.35, ఉస్మాన్ రోడ్ ఔట్ హౌస్ లో ఉన్నంతవరకూ ఇంటద్దె సమస్య లేకుండా తమ ప్రేమాభిమానాలు మా నాన్నగారిపట్ల, మా కుటుంబంపట్ల కనపర్చారు. 

ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో నా డిగ్రీ పూర్తయింది.

తరువాత ఏం చేయాలి. పి.జి. చేయాలా? అంటే మరో రెండేళ్ళు. అప్పుడు కూడా ఫస్ట్ క్లాసు వస్తేనే ఏదైనా ఓ చిన్న కాలేజీలో  ట్యుటర్  ఉద్యోగం. లేకపోతే టీచర్ ట్రైనింగ్ చేసి బడిపంతులుగా తయారవ్వాలి. మా రోజుల్లో 'బ్రతకలేక బడిపంతులు' అనే నానుడి బహుళ ప్రచారంలో వుంది. అలాగే బి.ఎ. చదువు అంటే కూడా ' బి - బొత్తిగా ఎ - అధ్వానం( బి.ఎ. - బొత్తిగా అధ్వానం) అనే చిన్నచూపు అందరిలోనూ వుండేది. అది ఆనాటి పరిస్థితి. మరి ఈనాటి బడి పంతుళ్ళ జీవన ప్రమాణం చాలా బాగుందనే చెప్పాలి. ('పీత కష్టాలు పీతవి' అన్నట్లుగా వారికుండే సాధకబాధకాలు వారికీ ఉంటాయనుకోండి). కానీ రోజులు మారేయి. అందుకే మా ఈశ్వరుడు (మా శారదక్క కొడుకు) తన తండ్రి తాతలు, అమ్మమ్మల వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవడమే కాక తన తమ్ముడిని, తన పిల్లలందరినీ కూడా స్కూల్ టీచర్లుగానే తయారు చేసాడు. మావాడిని పెంచి, చదివించి, పెద్దచేసిన అమ్మమ్మ, మాదొడ్డమ్మగారు కూడా తోటపల్లి కొండలు, శాంతి ఆశ్రమం స్కూల్ లోనే టీచర్ గా పనిచేసారు. ఆవిడ ఒక ఆదర్శ మహిళ. ఆవిడ గురించి ఇక్కడ కాదు. మరొక అధ్యాయంలో ప్రత్యేకంగా రాయాలి.

మొత్తానికి నా మనస్తత్త్వానికి నేను ఉపాధ్యాయుడిగా పనికిరానని తలంపు కలిగింది. వీటన్నిటికంటే ముఖ్యంగా, చిన్నదో చితకదో ఏదో ఒక ఉద్యోగంలో చేరి ఏమాత్రం సంపాదించినా నేను మా నాన్నగారికి  బరువు కాకుండా వుంటాననే సంకల్పం కలిగింది. అయితే ఈ భావాలను స్పష్టంగా ఎవరి దగ్గరా (మా అమ్మగారి దగ్గర కూడా) చెప్పలేకపొవడం నా దౌర్బల్యం. అందుకే నా డిగ్రీ అయ్యాక ఎమ్.ఎ. చేస్తావా అని ఘంటసాలవారు అడిగినప్పుడు ధైర్యంగా స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయాను.

ఇక, నా ఉద్యోగ ప్రయత్నాలు మొదలయాయి. మా నాన్నగారి వృత్తి ప్రవృత్తి రెండూ సంగీతమే కావడం వలన వారికి మామూలు చదువులు, వాటి వల్ల దొరికే ఉద్యోగాలు, ఆదాయల పట్ల ఏమాత్రం ఆసక్తిగాని, అవగాహన కానీ నా ఉద్యోగ ప్రయత్నాలకాలం నాటికి వుండేది కాదు. నా ఉద్యోగం గురించి తన మిత్రుల దగ్గర ప్రస్తావించడానికి కూడా అంత సుముఖత చూపేవారు కాదు. నాలోనూ తగినంత చొరవ, ధైర్యమూ లేకపోవడంతో నా ఉద్యోగ ప్రయత్నాలు చురుకుగా సాగలేదు. 

🌿


1950లో భారతదేశం గణతంత్ర రాజ్యంగా రూపొందింది. అమెరికా లో లా ఇక్కడ ప్రెసిడెంట్ వుంటారు. గ్రేట్ బ్రిటన్ విధానంలోలా పార్లమెంట్ ఎక్సిక్యూటివ్ గా ప్రైమ్ మినిస్టర్ వుంటారు. 

మన భారత దేశ మూడవ ప్రెసిడెంట్ గా డా.జకీర్ హుస్సేన్ పదవిలో వున్నప్పుడు డా.వి.వి.గిరిగారు (వరహాగిరి వెంకటగిరి) వైస్-ప్రెసిడెంట్ గా వుండేవారు. శ్రీ గిరిగారు లాయర్ గా, ట్రేడ్ యూనియన్ లీడర్ గా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి. మన తెలుగువారు, శ్రీ పి.సూర్యారావుగారు శ్రీ గిరిగారి అల్లుడు. శ్రీ గిరిగారికి ఆడ, మగ సంతానం చాలా ఎక్కువే. అందులో ఒక అమ్మాయి భర్త శ్రీ సూర్యారావుగారు. ఆయన మద్రాస్ లో నున్న ఆంధ్రా సిమెంట్స్ కంపెనీ (దుర్గా బ్రాండ్ సిమెంట్) అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ లో డెప్యూటీ ప్లాంట్ మేనేజర్ గా పనిచేసేవారు. మౌంట్ రోడ్ లో  ఈ ఆంధ్రా సిమెంట్స్ ఆఫీస్ పక్కనే  కె.సి.పి. సిమెంట్స్, కె.సి.పి. సుగర్స్ కంపెనీల ఆఫీసులు వుండేవి. ఇవన్నీ రామకృష్ణ బిల్డింగ్స్ ప్రాంగణంలోనే వుండేవి. ఇవి దాటాక అతి పెద్ద  టి.వి.సుందరం మోటార్ కంపెని వుండేది.
 
శ్రీ సూర్యారావుగారి ఆఫీస్ లో తాత్కాలిక టైపిస్ట్ ఉద్యోగం ఖాళీ వుంది, మీ అబ్బాయిని వెళ్ళి ప్రయత్నించమని మా నాన్నగారికి ఆయన స్నేహితులెవ్వరో చెప్పారు. నేను వెంటనే నా దగ్గరున్న ఉద్యోగ అర్హతలన్నిటితో ఆ ఆఫీసుకు వెళ్ళాను. నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆయన ఎదో ఒక మ్యాటర్ ను టైప్ చేసి చూపమన్నారు. చేసి చూపించాను. వారికి సంతృప్తి కలిగింది. నాకు ఆ టెంపరరీ టైపిస్ట్ ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించారు. ఆ ఆంధ్రా సిమెంట్స్ లో అనేకమంది షేర్ హోల్డర్స్. వారందరికీ సంవత్సరానికి ఒకసారి షేర్ సర్టిఫికెట్లు పంపుతారు. ఆ షేర్ సర్టిఫికెట్లు టైప్ చేయడానికి వారికి అదనపు టైపిస్ట్ అవసరమయ్యాడు. ఆ పని వరకే ఆ టైపిస్ట్. ఆ తర్వాత అతని అవసరం వుండదు. అలాటి ఉద్యోగం సుమారు నెలో రెండు నెలలో పనిచేశాను. 9 to 5 ఉద్యోగం. ఆ ఆఫీస్ లో శ్రీ సూర్యారావుగారు మేనేజర్. చౌదరి అనే ఆయన ఎక్కౌంటెంట్. శేషసాయి అనే అతను స్టెనో టైపిస్ట్. వీరు చెప్పిన ప్రకారం పాత సర్టిఫికెట్లు ఆధారంగా కొత్త సర్టిఫికెట్లు తప్పులు లేకుండా టైప్ చేయాలి.  అదే నామొదటి ఉద్యోగం. కొత్త అనుభవం. అప్పట్లో 

నా నైజం 'ఇంట్లో పులి వీధిలో పిల్లి' తరహగా వుండేది. తెలియనివారిని కలసుకొని మాట్లాడడానికి ఏదో బెరుకు, భయం. ఈ లక్షణాలతో ఆంధ్రా సిమెంట్ కంపెనీలో ప్రవేశించాను. ఆ ఆఫీస్ లోని నా మొదటి రోజు అనుభవం నా జీవితంలో మరవలేను. అక్కడ ఎక్కౌంటెంట్, స్టెనోలకు పక్కనే నాకు ఒక టేబిల్, టైప్ రైటర్, తదితర టైపింగ్ సామగ్రి ఏర్పాటు చేసారు. నేను ఆఫీసుకు వెళ్ళి నా సీటులో కూర్చున్న కొంతసేపటికి శేషసాయి వచ్చి మేనేజర్ గారు పిలుస్తున్నారని చెప్పారు. నేను భయం భయంగా ఆయన రూమ్ లోకి వెళ్ళాను. లోపల ఒక పెద్ద ఛైర్లో కూర్చున్న ఆయన చాలా సౌమ్యంగా నన్నేవో మామూలు ప్రశ్నలడిగి ఒక చెక్కును నా చేతిలో పెట్టి బ్యాంక్ లో జమచేసి రమ్మన్నారు.  నా అదృష్టం. ఆ ఆ ఫీసులో వున్నవారంతా స్పష్టమైన తెలుగులోనే మాట్లాడుకునేవారు. మేనేజర్ గారు ఇచ్చిన చెక్కు తీసుకొని చౌదరిగారి దగ్గరకు వెళ్ళి చెప్పాను. " వెళ్ళి రండి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దగ్గరే. మన ఆఫీసుకు ఎదురు వరసలోనే వుంది. వెళ్ళి కట్టేసిరండి" అన్నారు.  నేను ఆ చెక్కును పట్టుకొని బయటకు నడిచాను. మౌంట్ రోడ్ ఎప్పుడూ వాహనాలతో చాలా జన సమర్ధంగానే వుండేది. అయితే ఇప్పుడున్నంతగా కాదు. రోడ్ ఇవతల వేపునుండి అవతలవేపుకు సులభంగానే వెళ్ళగలిగాను. అప్పట్లో IOB మౌంట్ రోడ్ బ్రాంచ్ సామాన్యంగానే వుండేది. వెనకవేపు ఇప్పుడున్న మల్టీస్టోరీడ్  కార్పరేట్ బిల్డింగ్ అప్పుడు లేదు. ఆ చెక్ పట్టుకొని బ్యాంక్ లోపలికి వెళ్ళాను. స్వతంత్రంగా బ్యాంకుకు వెళ్ళడం అదే మొదటిసారి. అంతకుముందు ఈ వూరు వచ్చిన కొత్తల్లో  ఒకసారి మా నాన్నగారి తో పాండీబజార్లోని బరోడా బ్యాంకు వెళ్ళాను. అప్పుడు ఆయన చెక్కు కట్టడానికి వచ్చారా, లేక డబ్బులు తీసుకుందికి వచ్చారా అని కూడా తెలియని స్థితి. ఇప్పుడు ఈ IOB లో బొల్డన్ని కౌంటర్స్. అన్నిటిముందు చాలా మంది జనాలు. ఎక్కడికి వెళ్ళాలో ఎవరికి ఇవ్వాలో తెలియదు. చివరకు ఎవరినో అడిగాను. అతను ఆ పక్కన చలాన్ వుంటుంది అది ఫిలప్ చేసి అక్కడి కౌంటర్లో ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను ఆ చలాన్స్ వున్నచోటికి వెళ్ళి చూస్తే అక్కడ సినీమా పాంప్లెట్స్ లా రోస్,బ్లూ,ఎల్లో,వైట్ కలర్స్ లో రంగురంగు కాగితాలు కనిపించాయి. వాటిలో దేనిని తీసుకోవాలో తెలియలేదు. దానికి మళ్ళీ మరొకరిని అడిగాను. కరెంట్ ఎక్కౌంట్ అయితే ఇది, సేవింగ్స్ ఎక్కౌంట్ అయితే ఇది అని ఏవో కాగితాలు చూపి వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను అయోమయంలో పడ్డాను. నా దగ్గరి చెక్కు సేవింగ్సా? లేక కరెంట్ ఎక్కౌంటా? అది కూడా తెలియని ప్రాథమికావస్థ. ఈ కాగితాలు పట్టుకొని మరల ఆఫీసుకు వెళ్ళి ఆ శేషసాయి చేతే నింపించి బ్యాంకులో జమ చేస్తే ఎలా వుంటుందని ఒక ఆలోచన. కానీ అలాచేస్తే వీడికి చెక్కు కట్టడం రాదు. ఉద్యోగానికి అన్ఫిట్ అని ఇంటికి పంపించేస్తే ? ఒంటికి చెమటలు పట్టేసాయి. మళ్ళి మరో దగ్గర కొంచెం ఫ్రీగా వున్న మనిషి దగ్గరకు వెళ్ళి సిగ్గువిడిచి అడిగాను ఈ చెక్కు డిపాజిట్ చెయ్యడానికి ఛలాన్ నింపిపెట్టమని. అతను నన్ను ఎగాదిగా చూసి, ఏ కళననున్నాడో మారు చెప్పకుండా ఛలాన్ పూర్తిచేసి క్రిందన నన్ను సంతకం చెయ్యమన్నాడు. తెలుగులో చెయ్యాలా? ఇంగ్లీషులోనా? సందేహం. అతను ఇంగ్లీషు లో రాశాడు కనక ఇంగ్లీష్ లోనే ధైర్యంగా సంతకం చేశాను పట్రాయని ప్రణవ స్వరాట్ అని. ఆ చెక్కును  ఛలాన్ కు గుండుసూదితో జతపర్చి ఏ కౌంటర్లో ఇవ్వాలో చెప్పి పుణ్యం కట్టుకున్నాడు ఆ మహానుభావుడు. నా విషయంలో అలాటి మహానుభావులెందరో. ఆ సమయంలో నాకు ఒక బ్రైటెస్ట్ అవిడియా వచ్చింది. భవిష్యత్ లో ఇలాటి సమస్య ఎదుర్కోకుండా అతను రాసినట్లే ఒక నమూనాను మరో ఛలాన్ మీద వ్రాసి నా జేబులో పెట్టుకొని మొత్తానికి ఆ చెక్కును డిపాజిట్ చేసి స్టాంప్ వేసిచ్చిన కౌంటర్ ఫాయిల్ ను మరో జేబులో భద్రంగా పెట్టుకొని విజయవంతంగా ఆఫీసుకు చేరుకున్నాను. ఒక పది నిముషాలలో చెక్ డిపాజిట్ చేసి రావలసిన మనిషి ఒక గంటైనా తిరిగి రాకపోయేప్పటికి  చౌదరీగారు కాస్తా కంగారుపడి నాకోసం శేషసాయిని పంపే యోచనలో పడ్డారు. నన్ను చూడగానే ఆయన ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. నేను అంతకంటే ఎక్కువగా హాయిగా ఊపిరి పీల్చుకున్నాను.   ఒక నెలకో రెండు నెలలకో   షేర్ సర్టిఫికెట్లు తయారయాయి. ఆంధ్రా సిమెంట్ కంపెనీలో నా ఉద్యోగమూ ముగిసిపోయింది. నా మొదటిరోజు ఆఫీసు అనుభవాన్ని మాత్రం జీవితాంతం మర్చిపోలేను. 

ఆ ఉద్యోగం తర్వాత కొన్నాళ్ళపాటు  మళ్ళీ రికార్డింగులు, రీరికార్డింగ్ లతోనే కాలం గడిపాను. ఎన్ టి రామారావు గారితో 'శకుంతల' సినీమా నిర్మించిన రాజ్యం పిక్చర్స్ వారు ఈ సారి అక్కినేని నాగేశ్వరరావుగారి ద్విపాత్రాభినయం లో ఒక సాంఘిక చిత్రాన్ని మొదలుపెట్టారు. కన్నడంలో రాజ్ కుమార్ హీరోగా ఎంతో విజయం పొందిన 'ఎమ్మె తమ్మన్న' ఈ తెలుగు సినీమాకు మూలం.  కన్నడంలో నటించిన భారతి, రాజశ్రీలు హీరోయిన్లు. వినోదమే ప్రధానంగా గల ఈ సినీమా తర్వాత హిందీలో జితేంద్రతో ' జిగ్రిదోస్త్' గా, తమిళంలో  ఎమ్జీయార్ తో ' మాట్టుక్కార వేలన్' గా ఘన విజయాన్నే సాధించాయి. అదే తెలుగులో 'గోవుల గోపన్న'. ఘంటసాల మాస్టారిదే సంగీతం. డైరక్షన్ సి ఎస్ రావు. కొన్ని పాటల కంపోజింగ్ మాస్టారింట్లోనే జరిగాయి. ఆ సమయంలో దాశరధిగారు,  కొసరాజుగారు, అసిస్టెంట్ డైరక్టర్ జగన్నాధరావు, డైరక్టర్ బాబ్జి మాస్టారింటికి వచ్చేవారు. ఘంటసాలవారు సి.ఎస్ రావు గారిని బాబ్జీ అని ఆప్యాయంగా పలకరించేవారు. రావుగారు అందరిలాగే ఘంటసాలగారిని మాస్టారు అనే గౌరవంగా పిలిచేవారు.

ఈ సినీమాలోని ఎనిమిది పాటలను శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, ఆరుద్ర రాశారు. ఈ పాటలను ఘంటసాలవారితో పాటు సుశీల, ఎస్.జానకి, బెంగుళూరు లత , జె.వి.రాఘవులు పాడారు. పాటల రికార్డింగ్, రీరికార్డింగ్ వడపళని సాలిగ్రామంలో వున్న అరుణాచలం స్టూడియోలో జరిగాయి. దాశరధిగారు వ్రాయగా ఘంటసాలవారు, సుశీలగారు ఆలపించిన  యుగళగీతం 'ఆకాశంలో హంసలమై హాయిగ ఎగిరే జంటలమై', 'కన్నెల వలపుల వెన్నలు దోచే కన్నయ్యా యీ మాయ ఏలా' , శ్రీశ్రీగారు వ్రాసిన ' ఈ విరితోటల లోగిటిలో', కొసరాజు గారు వ్రాసిన 'వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా" (ఈ పాట సినీమాలో రెండుసార్లు వస్తుంది. ఒకటి మాస్టారి సోలో. మరొకటి సుశీలగారితో డ్యూయెట్). మరొకటి ఎస్ జానకిగారు పాడిన 'హడావుడి పెట్టకోయ్ బావా'. ఆరుద్ర రచన . కొన్ని పాటల రికార్డింగ్ లకు నేనూ వెళ్ళాను. ఈ చిత్రంలో పాటలన్నీ చాలా మెలోడియస్ గా, హుషారుగా వుంటాయి. ఈ సినీమాలో ఘంటసాలవారు వెస్టర్న్ వాద్యాలను బాగా ఉపయోగించారు. ఓ రెండు డ్యూయెట్లు వెస్టర్న్ వాల్జ్ బాణీలో  శ్రావ్యంగా వినిపిస్తాయి. పాటల మధ్య వైవిధ్యం కనిపిస్తుంది. సి.ఎస్.రావుగారి చాలా సాంఘికాలలో శాస్త్రీయ సంగీత శైలిలో నృత్యగీతాలు కనిపిస్తాయి. ఈ సినిమాలో కూడా హిరో డ్రీమ్ లో రాధాకృష్ణుల రాసలీల పాటను ఎంతో మనోజ్ఞంగా చిత్రీకరించారు అక్కినేని, భారతి నటించిన ఆ పాట 'కన్నెల వలపుల వెన్నలు దోచే' దాశరధిగారి పాట.  హాయినిగొలిపే ఆ పాట నాకెంతో యిష్టం.  
ఈ సినీమా రీరికార్డింగ్ కు నేను వెళ్ళినప్పుడు విలన్ ఇంటిలో, అతని రహస్య స్థావరంలో జరిగిన ఫైట్స్, సీన్స్ కు మ్యూజిక్ పోస్ట్ చేశారు. అలాగే  సినీమా టైటిల్ మ్యూజిక్  కూడా  ఆద్యంతం చాలా ఉత్సాహభరితంగా చేయడం చూశాను. ఎన్నో రకరకాల వాద్యాలు ఒకేసారి లైవ్ లో వాయిస్తుండగా వినడం నాకెప్పుడూ థ్రిల్లింగ్ గా వుండేది. ఈ అనుభవం కోసమే ఘంటసాల మాస్టారు పని చేసిన చాలా చిత్రాల రీరికార్డింగ్ లకు పనికట్టుకు వెళ్ళి చూసి, విని ఆనందించేవాడిని. 

💥కొసమెరుపు💥

గోవుల గోపన్న సినిమా కు సి.ఎస్.రావుగారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన జగన్నాధరావుగారు ఆ సినిమా లో కొన్ని సీన్లలో  అక్కినేని డూప్ గా కనిపిస్తారు. 

వచ్చేవారం మరికొన్ని సినిమా విశేషాలతో....
                  ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, August 8, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై మూడవ భాగం

8.08.2021 -  ఆదివారం భాగం - 43*:
అధ్యాయం 2 భాగం 42  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
" దేవుడనేవాడున్నాడా యని
ఆత్రేయకు కలిగెను సందేహం"

ఒక్క ఆత్రేయగారే అనేమిటి మానవుడై పుట్టిన ప్రతీ మనిషికి ఏదో దశలో ఈ సందేహం కలుగుతుంది. అంతవరకెందుకు‌, మహాభాగవతాన్ని వ్రాసిన పరమ భాగవతోత్తముడైన బెమ్మెర పోతన్న గారికే కలిగింది సందేహం - "కలడు కలండెనువాడు కలడోలేడో" అని. కానీ, మన ఘంటసాల మాస్టారికి అలాటి అనుమానాలు, సందేహాలు ఏనాడులేవు. ఆయన దేవుడిని పరిపూర్ణంగా విశ్వసించారు. మనస్ఫూర్తిగా దైవనామ సంకీర్తనం చేశారు. అవి సినీమా పాటల రూపంలో, ప్రైవేట్ గీతాల రూపంలోనూ ఈ లోకంలో ప్రచారమై ప్రజలలో ఆధ్యాత్మిక చింతన పెంపొందడానికి దోహదమయింది. శివుడా, విష్ణువా? విద్యల తల్లా, సిరుల తల్లా? లేక ముగ్గురమ్మలు కలసిన ఆది పరాశక్తియా  అనే తరతమ భేదం వారికిలేదు. అందరూ వారికి ఇష్టదేవతలే. సత్పురుషులు, సచ్చింతన కలవారందరిలోనూ ఘంటసాలవారు దైవాన్ని దర్శించి వారి సన్నిధిలో తన దేవగానామృతంతో ఆయా మహనీయులను సేవించారు. వారి ఆశిస్సులు పొందారు. 

కలియుగ దైవంగా, భగవాన్ గా  ప్రపంచం నలుమూలలావున్న కోట్లాది ప్రజలచేత కొనియాడబడిన శ్రీ సత్యసాయి బాబావారి సాంగత్యం ఘంటసాలవారికి మొదటిసారిగా ఏనాడు కలిగిందో నాకు తెలియదు కానీ బాబా మద్రాస్ వచ్చినప్పుడల్లా ఘంటసాలవారు ఆయనను దర్శించేవారు. మైకా బారన్ గా ప్రసిధ్ధిపొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ గోగినేని వెంకటేశ్వరరావుగారు పుట్టపర్తి సాయిబాబా భక్తులు. మద్రాసు లో బాబావారు వారింటికి అతిధిగా వేంచేసినప్పుడు స్థానిక ప్రముఖులెందరో వారిని దర్శించారు. అలాటివారిలో ఘంటసాలవారు ఉన్నారు. తర్వాత కాలంలో, బాబావారు అంజలీదేవి, ఆదినారాయణ రావు దంపతుల గృహానికి వచ్చినప్పుడల్లా ఘంటసాలవారు వారిని కలిసేవారు.

ఒకసారి ఘంటసాల మాస్టారు తన బృందంతో పుట్టపర్తి ప్రశాంతినిలయంలోనో లేక వైట్ ఫీల్డ్స్ లోనో సాయిబాబా సమక్షంలో కచేరీ చేసి బాబా ప్రశంసలకు పాత్రులయ్యారు. (అప్పటికి నాకు సాయిబాబా అంటే ఏవిధమైన అవగాహన లేదు). ఆ సందర్భంగా సత్యసాయిబాబా తన హస్తచాలనంతో ఒక వజ్రాల ఉంగరాన్ని సృష్టించి ఘంటసాలవారికి బహుకరించారు. మిగిలిన వాద్యబృందానికి తలా ఒక బంగారు కాసు బహుకరించారు. ఆ సందర్భంలో మాస్టారితోపాటు సావిత్రమ్మగారు కూడా వెళ్ళారు. ఘంటసాల మాస్టారు చాలా తీవ్రంగా చలించిపోయే మనస్తతత్త్వం కలవారని, చాలా వేగంగా భావోద్వేగాలకు లోనయేవారని మా నాన్నగారు చెపుతూండేవారు. ఆరోజున సత్యసాయి బాబా వారి సమక్షంలో కూడా ఘంటసాల వారికి అలాటి దివ్యానుభూతికి గురయ్యారని అనుకునేవారు. అదే సందర్భంలో అక్కడే వున్న మా నాన్నగారిలో కానీ,  సావిత్రమ్మగారిలో కానీ ఎటువంటి సంచలనాలు కలగలేదని చెప్పగా విన్నాను. దేవుడి విషయంలో కానీ, సాధు సత్పురుషుల విషయంలోకానీ అందరి అనుభవాలు ఒకేలావుండవు. ఆయా మనుషుల జిజ్ఞాస మనోప్రవృత్తి, జీవితానుభవం దృష్ట్యా కూడా దైవ విశ్వాసాల అంతరం, స్థాయి మారుతూంటాయి. ఘంటసాల మాస్టారు తన ఆరోగ్యం బాగాలేని దశలో కూడా సత్యసాయి బాబావారిని దర్శించి వారినుండి ఉపశమనం పొందారు. వారిపై పాటలు వ్రాసి,స్వరపర్చి తన భక్తప్రపత్తులను చాటుకున్నారు. ఘంటసాల మాస్టారు జరిపిన అనేక సంగీత కచ్చేరీలు ఆధ్యాత్మిక కేంద్రాలు, సత్కార్యాలకోసం జరిపినవే. స్వలాభాపేక్ష వుండేది కాదు. స్టూడియోలలో మైక్రోఫోనుల ముందు పాడడంలో కన్నా, చిన్న చిన్న వూళ్ళలో వేలాది అభిమానుల మధ్య వారి కోసం పాడడంలోనే ఘంటసాలవారు ఎక్కువ ఆనందం అనుభవించేవారు. ఆ సమయంలో కలిగిన శ్రమ, కష్టనష్టాలను కూడా ఆయన లెఖ్ఖచేసేవారు కాదు. అందుకే 'ఘంటసాల మా మనిషి' అని, ' ప్రజల గాయకుడు' అని ఈనాటికీ కొనియాడబడుతున్నారు. 

🍄


'ఏరా... పెద్ద బాబూ... ఎక్కడున్నావు... సంగీతం మాస్టారొచ్చి ఎంతసేపయింది..." ఓ పెద్ద కేక. 'వస్తున్నానమ్మా' అంటూ మరెక్కడినుండో మెల్లగా సమాధానం. కొన్ని క్షణాల తర్వాత మాస్టారింటి హాలులో నుండి తంబురా శ్రుతుల మధ్య సంగీత పాఠం ప్రారంభమయేది. శిష్యుడు ఘంటసాలవారి పెద్ద కుమారుడు విజయకుమార్. గురువుగారు నూకల పెద సత్యనారాయణ గారు. సుప్రసిధ్ధ సంగీత విద్వాంసుడు నూకల చిన సత్యనారాయణ గారికి వీరికి ఏమైనా బంధుత్వం వుందేమో తెలియదు. పెద సత్యనారాయణ గారు కూడా అడపాదడపా ఆలిండియా రేడియో లో పాడేవారు. ఆయన మా పెదబాబుకు సంగీతం గురువుగారు. మనిషి పొట్టిగా, సన్నగా ఖద్దరు పంచ, జుబ్బా, చేతిలో గొడుగుతో మధ్యాహ్నం 4.30- 5.00 ప్రాంతాలలో వచ్చేవారు. సంగీతపాఠం జరిగినంతసేపూ ఎవరూ ఆ హాలు ప్రాంతాలకు వెళ్ళేవారు కాదు. ఘంటసాల మాస్టారయితే ఆ దరిదాపులకే వెళ్ళేవారు కాదు. ఆయన కనిపిస్తూంటే గురుశిష్యులిద్దరూ బిగదీసుకుపోయేవారు. అందుకని పాఠం అయేకే మాస్టారు హాలులోకి వచ్చి నూకలవారిని పలకరించేవారు. ఆయనకు ఆదరణ కల్పించే ఉద్దేశంతో తన స్వీయ సంగీతంలో ఎప్పుడైనా తంబురా శ్రుతికి ప్రాధాన్యం వుంటే ఆ అవకాశం వారికి కల్పించేవారు. నూకల పెద సత్యనారాయణ గారికి హియరింగ్ ఎయ్డ్ అవసరం బాగానే ఉండేది. కర్ణాటక సంగీత బాణీకి అలవాటు పడిన గాయకులు కానీ, వాద్యకారులు కానీ  సినీమా సంగీతంలో ఇమిడిపోయి రాణించినవారు బహు అరుదు. వారి సంగీత ప్రతిభ సినీమాలోకంలో అక్కరవచ్చేది కాదు. 1980ల తర్వాత  ఫ్యూజన్ సంగీతం ప్రారంభమయ్యాక ట్రెండ్ కొంత మారిందనుకోండి. అది వేరే విషయం. అలాటి మంచి గాయకులు, వాద్యకారులు సినీమాలలో అవకాశాలకోసం ఘంటసాల మాస్టారి వద్దకు వచ్చేవారు. అలాటివారికి తగిన ప్రోత్సాహం, ఆదరణ కల్పించలేకపోతున్నందుకు మాస్టారు చాలా బాధపడేవారు. 

పెదబాబు విజయకుమార్, నేనూ సమవయస్కులం కాకపోయినా ఇద్దరమూ స్నేహ భావంతోనే వుండేవాళ్ళం. మా అమ్మగారికి పిల్లలపట్ల గల ప్రేమాభిమానాల వలన పెద్దబాబుకు మా అమ్మగారి దగ్గర చనువుండేది. తరచూ మేముండే ఔట్ హౌస్ లో మాతో గడిపేవాడు. చదువులో రాణించలేడనే విషయం అర్ధమయ్యాక అతని దృష్టిని పూర్తిగా సంగీతంవేపు మళ్ళించేలా ఘంటసాల మాస్టారు ప్రయత్నించారు. మొదట్లో మాస్టర్ వేణుగారి దగ్గర హార్మోనియం, పియోనా నేర్పించారు. క్రమక్రమంగా విజయకుమార్ సంగీతవిద్యలో అభివృద్ధి కనపర్చడంతో మౌంట్ రోడ్ లోని 'మ్యూసీ మ్యూజికల్స్ ' లో చేరి పియానో వాద్యంలో కృషి చేసి ట్రినిటి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్, లండన్ వారి డిప్లమో సాధించాడు. 

ఆ మ్యూసీ మ్యూజికల్ స్కూల్ లో చాలా ప్రఖ్యాతి పొందిన వెస్టర్న్ సంగీత కళాకారుడు, ఆంగ్లో-ఇండియన్ ఒకాయన ఉండేవారు. హేండల్ మాన్యుల్.


హేండల్ మాన్యుల్

మెడ్రాస్ సినీమా ప్రపంచంలో పేరు పొందిన సంగీత దర్శకులు, వాద్యకళాకారులు ఎందరో ఆయన శిష్యులే. ఆయన విధిగా మద్రాస్ శాంథోమ్ కేతిడ్రల్ లాటి అనేక పెద్ద పెద్ద చర్చ్ లలో ప్రేయర్, హిమ్స్, కేరోల్స్ ఖ్వయర్  సంగీతకార్యక్రమాలని కండక్ట్ చేసేవారు. అలాటి ప్రముఖుని వద్ద పియోనా నేర్చుకునే అదృష్టం పెద్దబాబుకు లభించింది. తర్వాత, తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలలో సంప్రదాయబధ్ధంగా కర్ణాటక సంగీతం నేర్చుకొని అందులో డిప్లమో పొందాడు. మంచి గాత్రం. 

సంగీత సాధన చేస్తున్నరోజులలో పెద్దబాబు పాడే ఒక కృతి నాకు బాగా గుర్తు. ముత్తయ్య భాగవతార్ రచించి, స్వరపర్చిన  'విజయాంబికే విమలాత్మికే' అనే కృతి. 'విజయనాగరి' రాగం. పెద్దబాబు పియోనాకు మొదటి శ్రోతను (మెచ్చుకర్తను?) నేనే. అతను మాస్టర్ వేణుగారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్న కాలంనుంచే ఇంట్లోనే ఒక పియోనో ఉండేది అతని ప్రాక్టీస్ కోసం మేడమీద స్టడీ రూంలో. మేడ మీద రినొవట్ చేసాక, పిల్లలందరూ స్కూళ్ళనుంచి వచ్చేక హోం వర్కులు, చదవుకోడాలు, ట్యూషన్లు ఆ స్టడీ రూంలోనే. సొంత చిత్ర నిర్మాణ కాలంలో ఆ రూమ్ టైలర్స్ రూమ్.  

పది పన్నెండేళ్ళ వయసులోని పిల్లలు ఏం మాట్లాడినా, ఏంచేసినా పెద్దలకు తప్పుగానే కనిపిస్తుందట. మా నాన్నగారి స్నేహితులు శ్రీ పంతుల శ్రీరామశాస్త్రిగారు అనేవారు. ఆ వయసులోని పిల్లలు గట్టిగా మాట్లాడినా, ఆట్లాడినా, పాటలు పాడినా, పని చేసినా, చేయకపోయినా, అల్లరిచేసినా, చేయకపోయినా ఏదో దానికి పెద్దలు విమర్శిస్తూ,  పిల్లలమీద తమ  విసుగుదలను ప్రదర్శిస్తారని, ఇది పెద్దలకుండే అవలక్షణమని ఆయన చెప్పేవారు. తనలో ఉండే ఆ లక్షణం గురించే ఆయన చెప్పారని ఒకసారి రాయఘడా వెళ్ళినప్పుడు తెలుసుకున్నాను. కారణమేమిటో తెలియదు కానీ, నేను కానీ, పెద్దబాబు కానీ మా తండ్రుల దగ్గర చాలా చనువుతో, స్వేఛ్ఛగా మాట్లాడలేకపోయేవాళ్ళం, మెలగలేకపోయేవాళ్ళం. మా తరం పిల్లల్లో చాలామందిలో ఆ లక్షణం వుండేదనిపిస్తుంది. పెద్దల పట్ల భయం భయంగానే ప్రవర్తించేవారు. ఇది సాకుగా చేసుకొని మాస్టారింట్లో వుండే గుండు మామయ్య, సుబ్బు,  పనిమనిషి తాయి కొడుకు పయ్యా లాటివాళ్ళు కూడా పెద్దబాబును అదలించడం, కన్నెర్రజేయడం నాకు చాలా చికాగ్గా వుండేది. అయితే అదంతా వారి దృష్టిలో పిల్లలను సక్రమంగా తీర్చిదిద్దుతున్నామనే భావన. ఏమైతేనేం, చిన్నప్పుడు నాలో చాయాస్వర జ్ఞానం బాగా వుండేదని మానాన్నగారు అనడం నాకు బాగా గుర్తు. అకారంలో ఏం పాడినా వాటి స్వరాలు గుర్తించేవాడినట. చిన్నతనంలో ఆయన ముఖతః సంగీతం నేర్చుకోలేకపోయాను. ఆయనకూ తన వృత్తి కార్యకలాపాలలో నన్ను దగ్గర కూర్చోపెట్టుకొని సంగీతం నేర్పే సమయమూ వుండేదికాదు. తర్వాత కాలంలో చదువురీత్యా నేను మద్రాసులో లేకపోవడం వల్ల నా సంగీత శిక్షణ ఆగిపోయింది. నాకు మా నాన్నగారిపట్ల అకారణ భయం మరో కారణం కావచ్చు. కానీ  అదంతా ఏనాటి మాటో!

పెద్దబాబు విజయకుమార్ పియానో వాద్యం నాకు చాలా ఉత్సాహం గాను, ఆశ్చర్యం కలిగించేదిగానూ వుండేది. ఎంతో వేగంగా సాగే ఆ వేళ్ళ కదలిక, గమనం ఆనందంగా వుండేది. వెస్టర్న్  మొజార్ట్, జాజ్, కర్ణాటక రాగాలు అన్నిటినీ చాలా సునాయాసంగా పియానో మీద  గంటల తరబడి వాయించేవాడు. సమయమే తెలిసేది కాదు. హార్మోనియం మీద కూడా  ఘంటసాల మాస్టారి మంచి మంచి పాటలెన్నో అవలీలగా వాయించి వినిపించేవాడు. సినీమా సంగీతానికి కావలసిన అర్హతలన్నీ అతనిలో పుష్కలంగానే వుండేవి.  జరిగిన కథ చిత్రంలో 'ఇదిగో మధువు, ఇదిగో సొగసు' అన్న పాటలో అతని సోలో పియానో బిట్ ప్రత్యేకంగా వినిపిస్తుంది. క్రమక్రమంగా తండ్రిగారికి సహకారం అందించే స్థితికి చేరుకున్నాడు.  సంగీత దర్శకుడై  తన సంగీతదర్శకత్వలో వచ్చిన 'వస్తాడే మా బావ' చిత్రంలో తన తండ్రిగారి చేతే ఒక పాట పాడించి ఆయనకు   ఆనందాన్ని కలగజేశాడు. ఆ సినీమాకు చేసిన పాటలు, తర్వాత మరెప్పుడో తన సోదరుడు రత్నకుమార్ తీసిన తమిళ  సినిమా  'తేన్ కూడు' కు చేసిన పాటలు   నాకు హార్మోనియం మీద వాయిస్తూ పాడి వినిపించేవాడు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా రాణించే లక్షణాలన్నీ వుండేవి. కానీ,  తెలుగు సినీమా పరిశ్రమ అతని ప్రతిభను గుర్తించి మంచి అవకాశాలు కల్పించలేకపోయింది. భగవంతుడు కూడా పెద్దబాబు కు అర్ధాయుష్షునే ప్రసాదించి ఈ లోకంనుండే తీసుకుపోయాడు. భోళాశంకరుడి వంటి పెద్దబాబు జ్ఞాపకాలు సదా నా వెంటనే వుంటాయి. నెం.35, ఉస్మాన్ రోడ్ లో మరపురాని మనిషి మా పెద్దబాబు. 

💐

" ఇలా ఇలా జీవితం పోతే పోనీ 
ఈ క్షణం నరకమను, స్వర్గమను
ఏది ఏమను... ఇలా ఇలా జీవితం" అంటూ గుండు మామయ్య ఇచ్చిన కాఫీని ఆస్వాదిస్తూ ఎన్టీఆర్ స్టైల్లో  కాఫీగ్లాసును పట్టుకొని తూలుతూ పాడుతూ అందరికి వినోదం కలిగించేవాడు ఒక కుర్రవాడు. గుండు మామయ్య కాఫీ  ఆ కుర్రవాడికి అంత నిషాను, మజాను ఇచ్చేదనుకుంటాను. ఉన్నచోట వుండకుండా తుళ్ళుతూ, గెంతుతూ, చాలా హుషారుగా వుండేవాడు. ఒట్టి కబుర్లపోగు. అతనే వేణు. సావిత్రమ్మగారికి చెల్లెలి కొడుకు. రతన్, శ్యామల వయసే వుండవచ్చు. ఆ అబ్బాయి తండ్రి నరసింహమూర్తి. ఆయన కూడా చాలా హడావుడిగా, గట్టిగా, గలగలా మాట్లాడుతూండేవారు. ఘంటసాల మాస్టారి ఇల్లు ఎప్పుడూ బంధుమిత్రులతో కలకలలాడుతూవుండేది. అందులోనూ వేసవికాలం వస్తే మరింతమంది వచ్చేవారు. సావిత్రమ్మగారి అన్నగారు, పిల్లలు, చెల్లెలు, మరది, పిల్లలతో ఒకటే సందడిగా వుండేది. పిల్లల పాటలు, ఆటలతో పొద్దుపోవడమే తెలిసేదికాదు. నరసిమ్మూర్తి బాబాయి, సుబ్బారావు మామయ్య ఊరినుంచి వచ్చేరంటే మా ఔట్ హౌస్ మీది కొట్టాయ్ (కొబ్బరాకుల పాక)లో కూడా ఉత్హాహం హడావుడి ఎక్కువయేది. ప్రతీ రోజూ మధ్యాహ్నం మూడు నుండి ఆరు వరకూ చతుర్ముఖ పారాయణం జరిగేది. రమ్మీ. పదమూడు ముక్కలాట. పండగ దినాల్లో అయితే రాత్రి పది పదకొండు దాకా సాగేది. ఈ రమ్మీ క్లబ్ లో మా నాన్నగారు, సదాశివుడుగారు, నరసింగ, సుబ్బారావుగారు, నరసింహమూర్తి గారు, క్రిందింట్లో అద్దెకుండే కొల్లూరి వారి బంధువు రామకృష్ణ, ప్రముఖ నటుడు లింగమూర్తిగారు, ప్రముఖ నటి శ్రీదేవి పినతల్లి భర్త మోహన్ రెడ్డి (1980లలో నటి శ్రీదేవి కుటుంబం మా పక్కిల్లు 36, ఉస్మాన్ రోడ్  క్రింది పోర్షన్ లో అద్దెకు వుండేవారు), మా నాన్నగారి మేనమామ కుమారులు మురళి, శాస్త్రి, వయోలా (మేడూరి)రాధాకృష్ణమూర్తిగారు సభ్యులు.  రాధాకృష్ణమూర్తిగారు ఆలిండియా రేడియోలో వయోలా వాద్యంలో బి హై గ్రేడ్ కళాకారుడు. సినీమా వాద్యబృందాలలో కూడా పనిచేయాలని చాలా కోరిక. సంగీత దర్శకులందరిని కలుస్తూండేవారు. కానీ ఆయనది సినీమా సంగీతానికి అతకని శాస్త్రీయ బానీ. దానితో ఆయనకు సరైన అవకాశాలు వచ్చేవికావు. ఘంటసాల మాస్టారు మాత్రం అప్పుడప్పుడు తన పాటలకు పిలిచేవారు. రాధాకృష్ణమూర్తిగారు చాలా మంచి వ్యక్తి. మా నాన్నగారికి మంచి స్నేహితుడు.

వీరంతా రోజూ వచ్చి పేకాట ఆడేవారని కాదు. వారి వారి అవకాశాలను బట్టి వస్తూండేవారు. వీరిలో నలుగురు విధిగా వచ్చేవారే. ఒక చెయ్యి తగ్గినప్పుడు నేను కూడా ఒక చేయి వేసేవాడిని. రామకృష్ణ వెయ్యిళ్ళ పూజారి. అటు మాధవపెద్దివారి లోగిట్లో, మరోపక్క ఆంధ్రా క్లబ్ లో, ఇంకా అనేక చోట్ల చతుర్ముఖ పారాయణం చేయించేవాడు. అతనికి పేక ముక్క నలిగితే నచ్చేదికాదు. కొత్త సెట్లు కావాలనేవాడు.

ఆంధ్రా సోషల్ క్లబ్ లో తెలుగు సినీమా రంగానికి చెందిన హేమాహేమీలెందరో రమ్మీలో నిష్ణాతులు. రోజుకు వందలు, వేలు చేతులు మారేవి. పేకముక్క ఏమాత్రం నలిగినా అదేమిటో కనిపెట్టగల పేకాట నిష్ణాతులుండేవారట. రామకృష్ణే చెప్పేవాడు. అందుచేత ఏ రోజుకారోజే కొత్త పేకలు వాడతారట. పాతవాటిని  క్లబ్ వాళ్ళు చీప్ గా బయటవాళ్ళకు అమ్మేస్తారట. అలాటి పేకలేవో మా ఇంటికొచ్చినప్పుడు తెచ్చేవాడు. ఆటలో  హుషారు వుండేందుకు పైసల స్టేక్స్ తోనే  ఆడేవారు. నాకు గుర్తున్నంత వరకు డ్రాప్ కు ఐదు పైసలు, మిడిల్ 15, ఫుల్ కౌంట్ పావలా తో మొదలెట్టి కాలక్రమేణా 1980లు వచ్చేసరికి పావలా, అర్ధ, రూపాయి.  పాయింట్ కు పైసా. మా మురళీ, శాస్త్రిలాటి వారెవరైనా ఈ ఎపిసోడ్ చదివితే  ఈ ఫిగర్స్ ను సరిచేయవచ్చును.

ఈ చతుర్ముఖ పారాయణ సమయంలో లోకాభిరామాయణంతో పాటు సంగీత, సాహిత్య, వేదాంత విషయాల మీద కాలక్షేప ప్రసంగాలు కూడా జరిగేవి. చాలా సుహృద్భావ వాతావరణంలో ఏ హడావుడి, ఉద్రేకాలు లేకుండా చాలా సరదాగా ప్రశాంతంగా ఈ పారాయణం కొన్ని దశాబ్దాల పాటు జరిగింది. ఘంటసాల మాస్టారికి ఈ ఆటల మీద, పుస్తక పఠనం మీద  పెద్ద ఆసక్తి వుండేదికాదు.  వారికి ఇంట్లో వున్నంతసేపూ హాయిగా విశ్రాంతిగా కళ్ళుమూసుకు పడుక్కోవడంలోనో లేక పిల్లలతో కాలక్షేపం చేయడంలోనో ఆనందంవుండేది. 

ఆ రోజులు, ఆనాటి సరదాలు తిరిగి రానేరావు. ఆ రోజులను ఎంత మననం చేసుకున్నా తనివితీరదు. ఈ మాటలు ఘంటసాల మాస్టారు పాడిన ఒక ప్రైవేట్ లలితగీతాన్ని గుర్తు చేస్తోంది కదూ! 


💐

మరిన్ని విషయాలతో, విశేషాలతో వచ్చే వారం...
అంతవరకు ...
                      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, August 1, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై రెండవ భాగం

01.08.2021 - ఆదివారం భాగం - 42*:
అధ్యాయం 2  భాగం 41 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

కొట్టబడును... నేర్పబడును...

👆పై అక్షరాలు బొబ్బిలి అగ్రహారం వీధిలోని కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ కు ఎదురుగా వుండే జూబ్లీ రోడ్ కు ఆనుకొని వుండే ఇంటి గోడమీదో లేక ఆ పక్కింటి గోడమీదో పెద్దవిగా దూరం నుంచే కొట్టచ్చేలా  వచ్చేపోయే వాళ్ళందరినీ ఆకర్షించేవి. ఆకతాయి పిల్లలకు మంచి తాయిలం. "ఒరేయ్! ఇక్కడ కొట్టడం నేర్పుతారట, మనమూ పోయి నేర్చుకుందామా" అంటూ అల్లరిగా గోలచేస్తూ పోయేవారు. నల్లటి చెక్కబల్లమీద పెద్ద తెల్ల అక్షరాలతో ఈ బోర్డ్ ను నేను హైస్కూలులో జాయిన్ అప్పటినుండి చూస్తూండేవాణ్ణి. ఆ బోర్డ్ కు దగ్గరగా వెళ్ళి చూస్తే ఆ బోర్డ్ ఇలా కనపడేది 👇ఆ బోర్డ్ లోని "ఇచ్చట", "టైప్" అనే అక్షరాలు చాలా చిన్నవిగా వుండి "కొట్టబడును, నేర్పబడును" అనే పదాలు మాత్రం చాలా పెద్దవిగా వుండేవి. ఇది తెలియకో, పొరపాటునో చేసిన పనికాదు.  అదొక ఎడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీ.  జనాలను ఆకర్షించే గొప్ప చిట్కా.  

అదొక టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్, మరియు, జాబ్ టైపింగ్ సెంటర్. బొబ్బిలిలో ఆనాటికి అదే ఏకైక టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్. బొబ్బిలి చుట్టుప్రక్కల గ్రామాలనుండి ఎంతోమంది  పిల్లలు ఇక్కడికి కాలినడకన, సైకిళ్ళ మీద టైప్ నేర్చుకోవడానికి వచ్చేవారు. ఆరోజుల్లో మధ్యతరగతి కుటుంబీకులు తమ పిల్లలు ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివి టైప్ లోయరో, హయ్యరో అయిందనిపించుకుంటే ఏదో ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో వుండేవారు. మా చిన్ననాటికి ఆ తరంవారిని ఆదరించి పోషించిన సంస్థ సౌత్ ఈస్టర్న్ రైల్వే. ఉత్తరాంధ్రకు చెందిన అనేక వేలమంది ప్రజలు సౌత్ ఈస్టర్న్ రైల్వేలో వివిధ శాఖలలో పని చేస్తూ ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలో స్థిరపడిపోయి ప్రవాసాంధ్రులుగా మారిపోయారు. వీరిలో అత్యున్నత పదవులు అలంకరించిన వారు ఉన్నారు, కేవలం కార్మికులుగా సేవలందించినవారూ ఉన్నారు.   అలాగే టాటా వారి టిస్కో, టెల్కో, భిలాయ్ స్టీల్ ప్లాంట్, రౌర్కేలా స్టీల్ ప్లాంట్ లలో కూడా మా విశాఖపట్నం, శ్రీకాకుళం  ప్రాంత ప్రజలు పనిచేస్తూ ఆయా ప్రాంతాల్లో స్థిరపడిపోయారు. తండ్రి రిటైర్ అయితే అతని కొడుకుకు కూడా అదే కంపెనీలో ఏదో ఉద్యోగం లభించే అవకాశం, సహృదయత ఆరోజుల్లో వుండేది. నా చిన్ననాటికే మా బొబ్బిలికి చెందిన అనేక కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ ను వదలి పక్క రాష్ట్రాలకు వలసపోయారు.

ఈ 'కొట్టబడును' 'నేర్పబడును'  టైపింగ్ కు యజమాని భళ్ళమూడి గోపాలరావుగారు. ఆయన ఏ ఉద్యోగం చేసేవారో తెలియదు కానీ, నాకు తెలిసినప్పటినుండి ఈ  టైపింగ్ స్కూల్ వుండేది. అప్పటికే ఆయనకు అరవై ఏళ్ళు దాటివుంటాయి. ఆజానుబాహువు. దృఢంగానే వుండేవారు. తెల్లటి పంచెకట్టు, పొడుగుచేతుల లాల్చీ, మెడలో కండువాతో అర్బన్ బ్యాంక్ లోనో, ఆంజనేయస్వామి గుడి పక్కనుండో వెడుతూ దారిలో కావిళ్ళలో వెళ్ళే పెద్ద పెద్ద ఆకుపచ్చ ముళ్ళ వంకాయలను బేరమాడుతూ కనిపించేవారు. 

భళ్ళమూడి గోపాల్రావుగారు

మా ఉత్తరాంధ్రాలో ఆకుపచ్చని ముళ్ళ వంకాయలు చిన్న, మధ్య, పెద్ద, అతి పెద్ద రకాలలో  నిగనిగలాడుతూ మహా తాజాగా దొరికేవి. ఆ పెద్ద ఆకుపచ్చ వంకాయల వల్లనే విజయనగరం ప్రాంతాలలో బోదకాలు (ఫైలేరియా) వ్యాధి ప్రబలివుండేదనే అపవాదు వుండేది. కానీ, వంకాయ అంటే ఇష్టపడని తెలుగువారుంటారా? అలాటి ఆకుపచ్చ పెద్ద వంకాయలన్నా, పొదుపరితనమన్నా, గోపాలరావుగారికి మహా ప్రాణం.  

బొబ్బిలిలో అనేక సంస్థలలో టైపిస్ట్ లుగా పనిచేసే అనేకమంది ఆయన వద్ద టైపింగ్ నేర్చుకున్నవారే. అర్బన్ బ్యాంక్ లో మరో భళ్ళమూడి వుండేవారు. రమణ. ఎక్కౌంటెంట్. విశాఖపట్నం స్వస్థలం. అక్కడే చదువు ముగించుకొని ఇల్లరికపు అల్లుడిగా బొబ్బిలి వచ్చేసారు. మేనమామే మామ కూడా. మామ సామవేదుల జగన్నాధంగారు కూడా అర్బన్ బ్యాంకు ఉద్యోగే. మా తాతగారికి (మా అమ్మగారి మేనమామ, సామవేదుల నరసింహంగారు, సింహాలుగారనేవారు) కజిన్ వరస. తాతా సహోదరుల పిల్లలు. ఈ జగన్నాధంగారి గురించి మా అమ్మమ్మగారు చెప్పిన ఒక సంఘటన నా మనసులో బాగా నాటుకుపోయింది. ఈ జగన్నాధంగారికి పెళ్ళికాక ముందు యువకుడుగా వుండే రోజుల్లో విపరీతంగా సినీమాలు చూసేవారట. తల్లి ఒక్కతే ఇంట్లో వుండేదట. ఇతను సినీమాకు వెళ్ళి ఏ రాత్రికో ఇల్లుచేరుకుంటే అప్పటిదాకా మేల్కొని, కాచుకొని వుండి కొడుక్కు భోజనం వడ్డించేదట. అప్పటికే ఆవిడ వృధ్ధురాలట. ఒకనాడు కొడుకు దగ్గర దీనంగా చెప్పుకున్నదట, ఇలా రోజూ ఆలస్యంగా ఇంటికి చేరితే వండి వడ్డించే ఓపిక తగ్గిపోతోందిరా నాయనా! అని. అంతే. ఆ రోజుతో జగన్నాధంగారు సినీమాలు, షికార్లు బంద్ అయిపోయాట. సినీమాలు చూడనని శపథం చేసారట. ఆ తర్వాత జీవితాంతం వరకూ సినీమాలే చూడలేదు. వారింట్లో భార్యా పిల్లలంతా వచ్చిన సినీమాలన్నింటికి వెళ్ళేవారు, కానీ, ఈయన మాత్రం ఇంటిపట్టునే వుండేవారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఆనాటి వ్యక్తులలోని మానవత్వం, సంస్కారం, పట్టుదల ఆశ్చర్యం కలిగిస్తుంది.

అన్నట్టు బ్యాంక్ సెక్రెటరీ పేరు కూడా రమణే. అయితే ఆయన గుణుపూడి. మేనేజర్ నే కోపరేటివ్ బ్యాంక్ స్ట్రక్చర్ లో సెక్రటరీ అనేవారనుకుంటాను. ఈయన భళ్ళమూడి. మా సింహాలు తాతగారికి వయసులో, అనుభవంలో వీరిద్దరూ జూనియర్లే. భళ్ళమూడి రమణ మహా స్పీడ్ గా టైప్ చేసేవారు.  కాలుక్యులేటర్స్, టోటలింగ్ మెషిన్ల కంటే స్పీడ్ గా మాన్యువల్ గా టోటలింగ్  చేసేవారు . మహా పక్కాగా వుండేవి రమణ ఎక్కౌంట్స్. రాత్రుళ్ళు తాలూకా ఆఫీస్ లో జాబ్ టైపింగ్ చేసేవారు. చదివింది హైస్కూలు వరకే కానీ తన స్వయంకృషితో ప్రైవేట్ గా కామర్స్ డిగ్రి సంపాదించి చివరకు అర్బన్ బ్యాంక్ కు సెక్రటరీ అయ్యారు. రమణ వయసులో నాకంటే పెద్దే అయినా ఒక స్నేహితుడుగానే చూసేవారు. ఆయన నాకు ఒక రోల్ మోడల్ గా వుండేవారు. ఆ రమణను చూసి నేనూ ఎప్పటికైనా అంత స్పీడ్ తో టైప్ చేయగల ప్రావీణ్యం సంపాదించాలని అనుకునేవాడిని. భళ్ళమూడి రమణ పని విషయంలో ఎంతటి చురుకో, స్పీడో, సిగరెట్లు కాల్చడంలో కూడా అంతకన్నా యమస్పీడ్. పెట్టెలకు పెట్టెలు ఊదేసేవాడు. అదే అతని కొంపముంచింది.  రిటైర్మెంట్ కు ముందే జాబ్ లో వుండగానే మంచానికి అంటుకుపోయేలా చేసింది. Cigarette Smoking is injurious to health అని సిగరెట్ల కంపెనీ వాళ్ళచేతే statutory warning ఇప్పించడానికి కారణం ఇలా చాలామంది శ్వేతకాష్టాలకు బానిసలై, బలైపోవడమే. ఈ విషయంలో కూడా ఆయన రోల్ మోడలే. ఆ జోలికి వెళ్ళకుండా ఉండడానికి.

హైస్కూలు చదువు అయ్యాక మరల అదే బొబ్బిలిలో కాలేజీలో చేరాక ఒక కాలక్షేపంగా, అవసరార్ధం ఉపయోగపడే ఒక సైడ్ క్వాలిఫికేషన్ క్రింద టైప్ రైటింగ్ ఎందుకు నేర్చుకోకూడదు అని అనిపించింది. మా తాతగారితో చెప్పాను. మనవడు ఏదో ఓ మంచి పనిచేసి బాగుపడతానంటే ఒద్దనే తాత వుంటారా! వెంటనే భళ్ళమూడి గోపాలరావుగారితో మాట్లాడారు. ఒక శుభ ముహుర్తాన 'కొట్టబడును, చేయబడును' లోకి చేర్చబడ్డాను. 

మొదటిరోజున గోపాలరావుగారు  ఒక పాతకాలపు టైప్ మెషిన్లో ఒక తెల్లకాగితాన్ని పెట్టి మొదటి ఫింగరింగ్ ఎలా కొట్టాలో చేసి చూపించి ఒక లైన్ టైప్ చేసి చూపించారు. అలాగే పేజీ అంతా కొట్టమన్నారు. నేను టైప్ రైటర్ ముందు కూర్చున్నాను. ఆయన నా చేతివేళ్ళను పట్టుకొని ఏ కీ మీద ఏ వేలు ఉండాలో చూపి అలాగే ఒక్కొక్క లెటర్ టైప్ చేయమన్నారు. టైప్ చేసేప్పుడు వేళ్ళన్ని ఆయా లెటర్ కీ ల మీదే ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనూ వేళ్ళు పైకెత్తకూడదని ఏవేవో కండిషన్స్ చెప్పారు. సరేనని ఆయన టైప్ చేసిన ఫస్ట్ ఫింగరింగ్ చూశాను. అవి - asdfgf ;lkjhj - ఈ 'కీ' లను క్రమం తప్పకుండా వరసగా లైన్ కింద లైన్ ఆ పేజీ అంతా కొట్టమన్నారు. మొదటిరోజు ఉత్సాహం, ఆ ఫస్ట్ ఫింగరింగ్ కొడుతూనే వున్నాను. కొడుతూనే వున్నాను. దించిన తల ఎత్తకుండా కొడుతూనే వున్నాను. ఇంతలో ఒక గంటకాలం అయిపోయింది. తర్వాతి బ్యాచ్ కుర్రాళ్ళు తయారయిపోయి మేమున్న టేబిల్స్ వద్దకు రావడం మొదలెట్టారు. అందరూ తాము టైప్ చేసిన కాగితాలను గోపాలరావుగారికి అందజేసారు. నేనూ నా కాగితాన్ని చూపించాను. ఆ గంట కాలంలో ఒక ఐదారు లైన్లు మాత్రమే కొట్టాను. అది కూడా అక్కడో అక్షరం ఇక్కడో అక్షరం. a వుండవలసినచోట g ; l కొట్టాల్సిన చోట h  ఇలా ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా ఎగుడు దిగుళ్ళుగా ఒక కొత్త రకం డిజైన్ లా పేపరు తయారయింది. ఆయన వాటన్నిటికి రౌండాఫ్ లు చేసి మర్నాడు కూడా అవే అక్షరాలు అదే వరసలో టైప్ చేయాలని చెప్పి పంపేసారు. నాకు వేళ్ళు నొప్పులు పుట్టాయి. హాయిగా వరసగా a to z టైప్ చేయడం నేర్పకుండా ఈ asdfgf బెడద ఏమిటనిపించింది. మర్నాడు మళ్ళీ కాలేజీకి వెళ్ళేముందు ఒక గంట క్లాసు. మళ్ళీ అవే asdfgfలు. అలా ఫస్ట్ ఫింగరింగ్ నేర్చుకోవడానికి నాలుగైదు రోజులు పట్టింది. ఒక గంట సమయంలో కనీసం నాలుగు పేజీలైనా టైప్ చేయమనేవారు. ఈవిధంగా టైప్ రైటర్ కీబోర్డ్ లోని నాలుగు ఫింగరింగ్ లు నేర్చుకునేప్పటికి రెండు మాసాలు పట్టింది. అదయ్యాక అప్పుడు వరసగా a to z వరకు స్పీడ్ గా టైప్ చేయించేవారు. ఇలా అడ్డదిడ్డంగా టైప్ రైటర్ కీ లలో ఉన్న అక్షరాలను వరసగా ఇంగ్లీషు ఆల్ఫబెట్ గా టైప్ చెయ్యడం నేర్చుకునే క్రమంలో రివర్స్ లో కూడా Z నుంచి A వరకు అక్షరాల వరస గుర్తుండిపోతుంది. ఆ తర్వాత చిన్న చిన్న మాటలు; వాక్యాలు, పేసేజ్ లు ఇవన్నీ నేర్చుకోవడానికి ఆరు మాసాలు పట్టింది. తర్వాత నిముషానికి నలభై వర్డ్స్ పదిహేను నిముషాలపాటు ఒక మేటర్ చేయడం అలవాటు చేసారు. "A quick brown fox jumps over the lazy dog", "Amazingly few discotheques provide jukeboxes" లాంటి pangrams - అంటే ఇంగ్లీషు భాషలోని అన్ని అక్షరాలూ ఉన్న వాక్యాలు - త్వరగా టైప్ చెయ్యడం అలవాటయితే కీ బోర్డ్ మీద వేళ్ళు సునాయాసంగా కావలసిన 'కీ' లను కళ్ళుమూసుకుని కూడా గుర్తించగలుగుతాయి. టైప్ మెషిన్ లోని సెగ్మంట్ సక్రమంగా పనిచేస్తున్నదీ లేనిదీ పరిక్షించడానికి ఈ "A quick brown fox jumps over the lazy dog" అన్న పేన్గ్రాం వాక్యమే 1890వ సంవత్సరం నుంచే వాడుకలో ఉందట.

సరే, తర్వాత క్రమక్రమంగా లెటర్స్ టైప్ చేయడం, స్టేట్మెంట్ లు, బ్యాలన్స్ షీట్లు టైప్ చేయడం నేర్పేవారు. ఇవన్నీ కూడా, శంకరశాస్త్రి పరిభాషలో చెప్పాలంటే ఒక నిర్దిష్టమైన పద్ధతిలో,  టైపింగ్ నియమాలను పాటిస్తూ శ్రద్ధాభక్తులతో  నేర్చుకోవలసినవి. ఏదో కొట్టాము అనుకోవడానికి వీలులేదు. టైప్ చేస్తున్నప్పుడు కీబోర్డ్ ను చూడకూడదు. వేళ్ళు కీబోర్డ్ మీదే వుండాలి. ఏ మేటర్ ను టైప్ చేస్తున్నామో దాని వేపే చూస్తూ టైప్ చేయాలి వంటి రూల్స్ ఎన్నో. అలా టైప్ చేయాలంటే బ్లైండ్ టచ్ ప్రాక్టీస్ కావాలనేవారు. మొదట్లో విద్యార్ధుల కళ్ళకు గంతలు కట్టి ప్రాక్టీస్ చేయించేవారని అనుకునేవారు. మాకాలం వచ్చేసరికి,  మాస్టారికి వయసు కారణంగా ఓపికపోయి కళ్ళకు గంతలతో ప్రాక్టీసునుండి మేము తప్పించుకున్నాము. 

ఆ ఇన్స్టిట్యూట్ లో వర్కింగ్ కండిషన్ లో పది పన్నెండు టైప్ మిషన్లు వుండేవి. పాతకాలపు అండర్వుడ్, ఒలివెట్టి ,  రెమింగ్టన్ , హాల్డా కంపెనీ టైప్ రైటర్స్ వరకూ చాలా రకాల టైప్ మిషన్లు వుండేవి. అప్పటికింకా గోద్రెజ్ మిషన్లు రాలేదు. రెమింగ్టన్ మిషన్లు గ్రే కలర్ లో గ్లాసీ కేబినెట్ తో వుండేవి. హాల్డా మిషన్లు బాటిల్ గ్రీన్ కలర్ లో మ్యాటీ కేబినెట్ తో వుండేవి. హాల్డా టైప్ రైటర్స్ కంపెనీ బొబ్బిలి రాజావారిది. మద్రాస్ గిండీలో రాయలా కార్పరేషన్ కంపెనీ ద్వారా హాల్డా మిషన్లు ఉత్పత్తి అయేవి. 

భళ్ళమూడి గోపాలరావుగారు విద్య విషయంలో చండశాసనుడు. ఏడాదికి రెండుసార్లు టైపింగ్ ఎక్సామ్స్  లోయర్ గ్రేడ్ కు, హయ్యర్ గ్రేడ్ కు అయేవి. విద్యార్ధుల అర్హత పట్ల తనకు సంపూర్ణమైన నమ్మకం కలిగే వరకు పరీక్షకు పంపేవారు కాదు. వీక్లీ టెస్ట్ లలో నిల్ మిస్టేక్స్ తో సెంట్ పెర్సెంట్ మార్కులు వస్తేనే పరీక్షలకు పంపుతాననే వారు. అంతవరకు రాచి రంపాన పెట్టేవారు. అలాగే విద్యార్ధులకు మంచి incentives కూడా ప్రకటించేవారు.  స్పీడ్ టెస్ట్ లో సెంట్ పెర్సెంట్ మార్కులు తెచ్చుకుంటే తన దగ్గరున్న టైప్ రైటర్స్ లో వారు కోరుకున్న మెషిన్ బహుమతిగా ఇచ్చేస్తానని చెప్పేవారు. అలా టైప్ మిషన్ ను గెల్చుకున్న విద్యార్ధులూ వున్నారని అనుకోవడం ఉంది.  అయితే అది ఒక వెయ్యిమందిలో ఒకరో ఇద్దరో ఉంటారు అలాటి టైపింగ్ విజర్డ్స్. గోపాలరావు గారి దగ్గర టైపింగ్ నేర్చుకున్నవాళ్ళెవరూ ఫెయిల్ అయ్యారనే మాటే వుండేదికాదు. ప్రతీ ఏటా ఆయన ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ర్యాంక్ లోనే వుండేది. అయితే ఆయన శిక్షణా విధానాన్ని తట్టుకోలేక కొందరు మధ్యలోనే మానేసి వెళ్ళిపోయేవారు. నేను మాత్రం ఎలాగో అలా ఆయన శిక్షణలో ఓ రెండేళ్ళు నిర్విరామంగా నేర్చుకొని టైప్ లోయర్ (40 words/minute for 15 minutes speed);  హయ్యర్ (80  words/ minute for 15 minutes speed) పరీక్షలకు కట్టి ఓ అరవై, డెభ్భై శాతం మార్క్ లతో పాసయ్యాను. 

ఈ పరీక్షలు మా బొబ్బిలిలో జరిగేవి కావు. అక్కడ ఎగ్జామ్స్ సెంటర్ లేదు. అందుకు విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ వెళ్ళవలసి వచ్చేది. గోపాలరావుగారు తన స్టూడెంట్స్ ను పక్కనున్న విజయనగరం కాకుండా పరీక్షలకు వాల్టేర్ ( విశాఖపట్నం) తీసుకువెళ్ళేవారు. అలా నేను ఈ పరిక్షలకోసం రెండుసార్లు వైజాగ్ వెళ్ళాను. మా నారాయణమూర్తి చిన్నాన్నగారు అప్పట్లో వైజాగ్ లోనే ఉండేవారు. హాయిగా ఓ రెండు రోజులు వారింట్లో వుండవచ్చునని అనుకున్నాను. కానీ, గోపాలరావుగారు ముందే విద్యార్ధులకు కండిషన్ పెట్టారు. పరీక్ష పూర్తయేవరకూ అందరూ తన పర్యవేక్షణలో, తన ఆధీనంలోనే వుండాలి, తర్వాతే చుట్టాలు, చుట్టడాలు, సినీమాలు సరదాలు అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి మరీ మమ్మల్ని వైజాగ్ తీసుకు వెళ్ళేవారు. బొబ్బిలి నుండి రాయపూర్ ప్యాసెంజర్లో ప్రయాణం. ఉదయాన్నే రైలెక్కితే నాలుగైదు గంటల తర్వాత వాల్టేర్ చేరేది. ప్యాసెంజర్ అవడం వలన డొంకినవలస, బొండపల్లి, గరుడబిల్లి, కంటకాపల్లి, సింహాచలం, గోపాలపట్నం అంటూ సవాలక్ష స్టేషన్లలో ఆగుతూ, ఎదురుగా వచ్చి పోయే ఎక్స్ప్రెస్ రైళ్ళకు దారి వదులుతూ నింపాదిగా ఒక గంట, రెండుగంటలు లేటుతో గమ్యం చేరేది. ఆనాటికి ప్యాసెంజర్ రైళ్ళలో రిజర్వేషన్లు వుండేవికావు. అందుచేత త్రొక్కిసలాటలోనే రైళ్ళు ఎక్కవలసి వచ్చేది. అసలు ప్రయాణీకులకంటే రైళ్ళలో అమ్మకాలు సాగించేవారి సంఖ్యే ఎక్కువ. శనగలు, బఠాణీలు, జంతికలు, చేగోడీలు, కోవాబిళ్ళలు, తాటిముంజెలు, సూదులు, దారాలు, మొలత్రాళ్ళు, ఘంటసాల పాటల పుస్తకాలు, వేమన పద్యాలు, బ్రహ్మంగారి తత్త్వాలు ఇలా సమస్తమూ ఈ నాలుగు గంటల ప్రయాణంలో లభించేవి. అంతేకాదు ఆరున్నర శృతిలో కొంతమంది గుడ్డివాళ్ళు ఇతరుల సాయంతో హార్మణీ వాయిస్తూనో లేక  రెండు చిన్న కుండపెంకులతో చిడతలు వాయిస్తూనో ఘంటసాల పాటలు పాడుతూ రైళ్ళలో ముష్టెత్తుకునేవారు. ఈ గాయకులలో కొంతమంది వినికిడి జ్ఞానంతోనే శ్రుతిలయలు తప్పకుండా సుశ్రావ్యంగా పాడేవారు. మరికొంతమంది పాడుతూవుంటే కర్ణకఠోరంగా వుంటూ, పాట ఆపేస్తే చాలు అణావో, బేడో డబ్బులు ఇస్తాము అనే రీతిలో వుండేవి. ఇంత గోల, ఘోషల మధ్య మా వైజాగ్ ప్రయాణం సాగేది. వైజాగ్ మెయిన్ రోడ్ లోని టర్నర్స్ చౌల్ట్రిలో  మా నివాసం. ఒక పెద్ద హాలులోనో, డార్మెటరీలోనో పరీక్షలకు వెళ్ళే పది పదిహేను మందికీ భళ్ళమూడి గోపాలరావుగారు బసలు ఏర్పాటు చేసేవారు. ఎప్పుడు వెళ్ళినా అక్కడే అందరూ బస చేయాలి. ఎవరి టైప్ మెషిన్లు వారే పట్టుకెళ్ళాలి. కొన్నింటిని స్థానికంగా ఏర్పాటు చేసేవారని గుర్తు. 

స్టేషన్ నుండి సైకిల్ రిక్షాలలో ప్రయాణం. ఆ రోజుల్లో వైజాగ్ అంతా సైకిల్ రిక్షాలే. ఎంత దూరం అయినా అర్ధరూపాయి లోపే. అదివ్వడానికి ఓ అరగంట బేరాలు. వాదోపవాదాలు జరిగేవి. వైజాగ్ రోడ్లు పూర్తిగా ఎగుడుదిగుళ్ళుగా, ఎత్తుపల్లాలతో వుంటుంది. తప్పనిసరైతే తప్ప మానవత్వం వున్నవారెవరూ వైజాగ్ లో సైకిల్ రిక్షా ఎక్కరు. కానీ అప్పట్లో అవే ప్రయాణ సాధనాలు. 

బస టర్నర్స్ చౌల్ట్రీ అయినా, పరీక్షా కేంద్రం వేరొక చోట వుండేది. పరీక్ష సమయం వరకూ గోపాలరావుగారు విద్యార్థులకు రకరకాల సూచనలు ఇస్తూ ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించేవారు. ఎన్నో విషయాలు చెప్పి ఉత్సాహపర్చేవారు. పిల్లలందరిని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. 

పరీక్ష హాలులో సుమారు ఏభై, అరవై మంది టైపింగ్ పరీక్ష సమరానికి సంసిద్ధంగా  వుండేవారు. స్పీడ్ టెస్ట్ కు స్టార్ట్అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రేసు గుర్రాల చప్పుడులా ఒకేసారి అన్ని టైప్ మిషన్లు టకటకమని గట్టిగా మ్రోగుతూంటే ఆ ధ్వనికి కొత్తవాళ్ళకి జంకూ, కంగారు పుట్టేవి. పదిహేను నిముషాలలో స్పీడ్ టెస్ట్ ముగించగలమా అని భయం పుట్టేది. అలాటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ముందుగానే గోపాలరావుగారు శిక్షణ ఇచ్చేవారు. హైయ్యర్ గ్రేడ్ స్టూడెంట్స్ కు ఒక రోజు ప్రాక్టికల్స్ వుండేవి. ఎవరో వచ్చి టైప్ రైటర్ లోని భాగాల గురించి, వాటి మెకానిజం గురించి అవసరమైనవి, అనవసరమైనవీ ఏవో ప్రశ్నలు వేస్తే వాటికి సరైన సమాధానాలు చెప్పాలి. ప్రాక్టికల్స్ లోని మార్కులు కూడా కలుపుతారు. 

పరీక్ష ముగిసినప్పటినుండి మర్నాడు సాయంత్రం మళ్ళీ దుర్గ్ ప్యాసెంజర్ ఎక్కేవరకు పిల్లలందరికీ ఆటవిడుపు. బంధువుల ఇళ్ళకు వెళ్ళవచ్చు, సినీమాలు చూడవచ్చు. కానీ అందరూ ప్రయాణానికి ముందు టర్నర్స్ చౌల్ట్రీ లో హాజరవాలి. అక్కడినుండి అందరూ కలిసే స్టేషన్ కు వెళ్ళాలి. నేను ముందుగా మా చిన్నాన్నగారి ఇంటికి నడిచే వెళ్ళేవాడిని. వారిల్లు ఆసీలుమెట్ట డౌన్ లో వుండేది. డాబా గార్డెన్స్ మీదుగా, ఓల్డ్ జైలు పక్కనుండి వెళ్ళవలసి వచ్చేది. అప్పట్లో  పగటిపూటే మహా నిర్మానుష్యంగా వుండేది. ఇప్పుడు ఆ ప్రాంతమంతా  RTC కాంప్లెక్స్, ఫ్లైఓవర్ల్, షాపింగ్ మాల్స్‌, సినీమా హాల్స్, త్రీస్టార్ హోటల్స్ తో  క్రిక్కిరిసి ఒక పెద్ద జనారణ్యమయిపోయింది. 

అలా నిర్మానుష్యంగా వుండే రోడ్లమీద ఒంటరిగా మా చిన్నాన్నగారింటికి వెళ్ళేవాడిని. ఆయన మ్యూజిక్ క్లాసెస్ డాబాగార్డెన్స్ లో. ఇల్లు ఇక్కడ. ఇంటి దగ్గరి వీణ, గాత్రం క్లాసెస్ ను మా పిన్నిగారు నిర్వహించేవారు. ఆవిడ అందరితో చాలా సరదాగా ప్రేమతో స్నేహపూర్వకంగా వుండేవారు. ఆడామగా శిష్యులంతా  కాఫీ టిఫిన్లు లాగిస్తూ ఇంట్లో వ్యక్తుల్లా మసిలేవారు. వీరింటికి ఒక పక్క ఒక ఆశ్రమం, మరోపక్క కోళ్ళ ఫారమ్ ఉండేవి. ఆ వీధిలో మహా అయితే మరో రెండు ఇళ్ళు, అంతకు మించి మరేవీ ఉండేవి కావు. ఇప్పుడు ఆ ప్రాంతమంతా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. 

మా చిన్నాన్నగారికి ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి వెంకట రాజరాజేశ్వరి ప్రసన్న జ్యోతిర్మయి. అప్పటికి ఓ పన్నెండేళ్ళు. రెండవ అమ్మాయి కిరణ్మయి. బాగా చిన్న పిల్ల అని గుర్తు. ఆ ఇంటిలోని వీణలు,  సంగీత వాతావరణం మరల మా విజయనగరం ఇంటిని గుర్తుకు తెచ్చేవి. మధ్యాహ్నం మరల మా చిన్నాన్నగారు తన క్లాసులకు వెళ్ళేవరకు అక్కడ గడిపి ఆయనతోపాటే రిక్షాలో డాబాగార్డెన్స్ లోని ఆయన స్కూలుకు వెళ్ళేవాడిని. అది లీలామహల్ కు సమీపంలో వుండేది. అక్కడ కాసేపు కూర్చొని ఆయన దగ్గర సెలవు పుచ్చుకొని కె.జి.హెచ్. మీదుగా ఆ డౌన్ లో వున్న బీచ్ కు వెళ్ళేవాడిని ఆ ఏరియాలో కూడా పెద్దగా మానవ సంచారం వుండేదికాదు. అక్కడ బీచ్ లో మొండిగోడలతో ఒక గోడౌన్ లాటిది వుండేది. ఒకప్పుడది ఒక వెలుగు వెలిగిన సినీమా హాలని చెప్పగా విన్నాను. సముద్రపు ఉప్పుగాలికి ప్రొజెక్టర్లు బాగా పాడైపోవడంతో ఆ సినీమా హాలు మూతపడిందనేవారు. ఆ హాలు పేరు గుర్తులేదు.

అలా సాయంత్రం సినీమా టైమ్ అయేవరకు గడిపి తిరుగుదలలో పూర్ణాలోనో, సరస్వతీ టాకీస్ లోనో లేక లీలా మహల్ లోనో ఏదో సినీమా చూసి పక్కనే ఏదో హోటల్ లో  పూరీయో , చపాతీయో తిని మెల్లగా టర్నర్స్ చౌల్ట్రీకి చేరేవాడిని. అందరు నాలాగే బయట తిరిగి రాత్రి పడకలకు అక్కడికి చేరేవారు. ఆ మర్నాడు మళ్ళి అందరం కలసి దుర్గ్ ప్యాసెంజర్లో బయల్దేరి రాత్రి పది గంటల ప్రాంతానికి  బొబ్బిలి చేరేవాళ్ళం. తర్వాత కొన్ని నెలలకు టైపింగ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్, మరికొన్నాళ్ళ తర్వాత సర్టిఫికెట్లు వచ్చి చేరేవి. 

టైపింగ్ పరీక్షలకు ముందో, అయిన తర్వాతో పరీక్షలకు హాజరయ్యే/హాజరైన విద్యార్ధులందరితో కలసి ఒక గ్రూప్ ఫోటో దిగడం అనేది భళ్ళమూడి గోపాలరావుగారి ఆనవాయితి. సంప్రదాయం. ఆ ఫోటోలే ఆయన రికార్డ్ గా భావించేవారనుకుంటాను.  ఫోటోలో తమ తమ ముఖాలు చూసుకోవాలనే ఆసక్తి కలవారి దగ్గర డబ్బులు వసూలు చేసి ఒక కాపీ ఇచ్చేవారు. అలాటి గ్రూప్ ఫోటో ఒకటి నా దగ్గరా వుంది. బహుశా టైప్ రైటింగ్ హయ్యర్ పరీక్షలనాటిదే అయివుంటుంది. ఆ గ్రూప్ ఫోటోలో సెంటర్లో గోపాలరావుగారు, ఆయనకు ముందు నేలమీద ఒక టైప్ రైటర్, గ్రూప్ అంతటికీ ఒకే ఒక అమ్మాయి, క్రిందనే కూర్చొని ఒక చిన్న కుర్రవాడు కనిపిస్తారు. ఆ పిల్లవాడు గోపాలరావుగారి మనవడు. ఉద్యోగరీత్యా ఏ ఒరిస్సాలోనో, బీహార్ లోనో వుండే అతని తల్లిదండ్రులు తెలుగు చదువుకోసం బొబ్బిలిలో తాతగారి వద్ద వుంచారనుకుంటాను. అతనిపేరు కూడా గోపాల్రావు. అందరూ గోపాల్ అని పిల్చేవారు. గోపాలరావుగారి (కూతురు కొడుకు) మరో మనమడు, చెళ్ళపిళ్ళ వేణుగోపాలరావు (మురళి)  కొన్ని దశాబ్దాల తర్వాత  హైదరాబాద్ లో మా మరదలు సుధారాణికి చిన్నాన్నగారు(పిన్నిగారి భర్త) గా నాకు పరిచయం అయ్యారు. అలాగే మరో వ్యక్తి బొబ్బిలి గుమ్మావారి అబ్బాయి ప్రభు. ఆయన తల్లి అమ్మన్నగారు, అన్న విశ్వనాధంగారు, అక్క సుగుణ మా అమ్మమ్మగారికి, దొడ్డమ్మగారికి అతి సన్నిహిత మిత్రులు. శ్రేయోభిలాషులు. ఎవరికి తెలియని సుందరి పేరుతో మా అమ్మగారిని (శ్రీలక్ష్మి) పలకరించే ఆత్మీయులు. ఆయన మరో సోదరుడు, గుమ్మా ప్రసన్నకుమార్ మా సుధారాణికి చిన్నాన్నగారు (మరో పిన్నిగారి భర్త)గా పరిచయం అవడం మరో విశేషం. అదే ఆశ్చర్యం. ఎక్కడ వాళ్ళు,  ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలుస్తారో కదా! 

సందర్భం వచ్చింది కనుక, ఈ నా 35, ఉస్మాన్ రోడ్ ని కేవలం చదువరులకు ఒక వ్యాససంపుటిగానే కాకుండా, శబ్ద, దృశ్య చలనచిత్రమాలికగా చిత్ర, విచిత్రంగా, శోభాయమానంగా సమర్పిస్తున్న మా సుధారాణికి నా శుభాశీస్సులు.    

ఈ వారపు ఈ విషయాలన్నీ, డిగ్రీ చేతికి వచ్చాక మద్రాస్ మహానగరంలో నెం.35, ఉస్మాన్ రోడ్ నుంచి నేను మొదలుపెట్టబోయే ఉద్యోగపర్వానికి నాంది ప్రస్తావన.

ఆ విశేషాలలోకి వెళ్ళబోయేముందు ఈ వారపు సినీమా చూద్దాము. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఘంటసాల మాస్టారి సంగీత ప్రతిభకు గీటురాయి  "రహస్యం ". ఉన్నత సంగీత సాహిత్యాలకు సమున్నత స్థానం కల్పించిన చిత్రం 'రహస్యం'. సత్త్వ, రజస్తమో గుణాలకు ప్రతీకలుగా నిలిచే పలువురు వ్యక్తుల  మధ్య జరిగిన పోరాటమే "రహస్యం " చిత్రకథ. 

తాత్త్విక, వేదాంత  విషయ పరిజ్ఞానం  లేని సామాన్య ప్రేక్షకులకు  ఈ సినీమా ఒక రహస్యంగా మారింది. తత్ఫలితం, రహస్యం అపజయం పాలయింది. లలితా శివజ్యోతి  ఫిలింస్ అధినేత ఎ.శంకరరెడ్డి గారు ఒక సంచలన వ్యక్తి. విద్యాధికుడు, విలక్షణమైన వ్యక్తి. ఇరవై ఏళ్ళకు పైగా చిత్రసీమలో వున్నా ఆయన తీసిన సినీమాలు ఐదే . అవి - చరణదాసి, లవకుశ (తెలుగు, తమిళం), రహస్యం , సతీ సావిత్రి. అన్ని పంచవర్ష ప్రణాళికా చిత్రాలే.

లవకుశ సినీమా కోట్లు వసూలు చేసినా అందులో ఒక పైస కూడా నిర్మాతగా శంకరరెడ్డి గారికి దక్కలేదు.  ఫైనాన్స్ చేసి నెగెటివ్ రైట్స్ కొనుకున్న సుందర్లాల్ నహతా బాగుపడ్డారు. తర్వాత వెంచర్ గా శంకరరెడ్డి రహస్యం మొదలుపెట్టారు. హీరోగా జానపదాలకు తిరుగులేని హీరో ఎన్టీఆర్ నే బుక్ చేసి వుండవచ్చును. కానీ, శంకరరెడ్డిగారికి జ్యోతిషం మీద, అంజనాల మీద నమ్మకం ఎక్కువ. ఆ కారణంగా, జ్యోతిష్కుల సలహా ప్రకారం అంజనం వేయించి అందులో వచ్చిన వారి పేర్ల ప్రకారం ముఖ్య నటీనటులను, ముఖ్య సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేశారట. అలా ఎంపిక అయినవారేనట మన ఘంటసాల మాస్టారు, అక్కినేని, రంగారావు, గుమ్మడి, మరికొందరు. రహస్యం సినీమాను రంగులలో మొదలెట్టారు. వెంపటి సదాశివబ్రహ్మంగారు రహస్యం సినీమాకు కథ, మాటలు, కొన్ని పాటలు , పద్యాలు సమకూర్చారు. ఆయన పండితుల కోవకు చెందిన రచయిత. సినీమారంగంలో ఆరితేరిన కవి. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు, సముద్రాల రాఘవాచార్యులవారు, సి.నారాయణరెడ్డిగారు, ఆరుద్రగారి వంటి ఉద్దండులు అద్భుతమైన పాటలు వ్రాశారు. వాటికి ఘంటసాలవారు సమకూర్చిన సంగీతం అసామాన్యం. అజరామరం. మరి పాడిన వారంతా శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులే. ఘంటసాల, పి.సుశీల, లీల, కోమల, మల్లిక్,  మాధవపెద్ది, వైదేహి, సరోజిని యిత్యాదులు రహస్యం చిత్రంలోని పాటలకు ప్రాణప్రతిష్ట చేశారు. అక్కినేని, ఎస్.వి.రంగారావు, గుమ్మడి,  కాంతారావు, నాగయ్య, రమణారెడ్డి, రేలంగి, హరనాథ్,  రాజనాల, బి.సరోజాదేవి, కృష్ణకుమారి, జి.వరలక్ష్మీ, సూర్యకాంతం, అంజలీదేవి,  గిరిజ, గీతాంజలి అంటూ తెలుగు సినీమా అతిరథ, మహారథులంతా రహస్యం సినీమా తారాగణం. పి.ఎల్.రాయ్ కెమేరామన్. వెంపటి పెద సత్యంతో పాటు నృత్య దర్శకత్వం, దానితోపాటు చిత్రదర్శకత్వం కూడా వహించారు వేదాంతం రాఘవయ్య. 

'రహస్యం' సినీమా రీరికార్డింగ్ జరిగినన్నాళ్ళు నేను స్టూడియోకు వెళ్ళేను. కాంతారావు, నాగేశ్వరరావులు పాల్గొన్న ఔట్ డోర్లో జరిగిన యుధ్ధం దృశ్యాలు, ఎస్.వి.రంగారావు అమ్మవారి పాదాల క్రింద వున్న సొరంగ మార్గంలోకి వెళ్ళడం, అక్కడ వున్న పరాశక్తిని పూజించే సమయాలలో ఉపయోగించిన ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నాకెంతో థ్రిల్లింగ్ గా అనిపించింది. 

రహస్యం చిత్రానికి పెద్ద ఆస్తి, అస్తిత్వం సంగీతమే. రహస్యం సినీమాలో సాహిత్యం, సంగీతం పోటాపోటీగా నడిచాయి. ముఖ్యంగా మల్లాది, సదాశివ బ్రహ్మంగార్ల సాహిత్యం (సామాన్య ప్రేక్షకుల స్థాయికి మించినది), వాటికి ఘంటసాలవారు సమకూర్చిన సంగీతం అనితరసాధ్యం.

ఈ సినీమాలోని పాటలను, గిరిజాకళ్యాణం యక్షగానాన్ని విన్న సుప్రసిద్ధ దాక్షిణాత్య సంగీత విద్వాంసుడు శ్రీ చిత్తూర్ సుబ్రహ్మణ్యం పిళ్ళై గారు 'సినిమాలలో శుద్ధ శాస్త్రీయ సంగీతం లేదని ఎలా అంటారు' అని వ్యాఖ్యానించారు. 'లలితభావ నిలయ', 'శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా', 'సాధించనౌనా జగానా', 'మగరాయా వలరాయా', 'ఉన్నదిలే దాగున్నదిలే', మొదలైన పాటలలో సంగీతం రసవాహినిగా సాగింది. రాగమాలిక 'లలిత భావ నిలయ' గీతానికి రాగ నిర్దేశం చేసినది మల్లాది వారైనా ఆ సరస్వతి, లలిత, శ్రీ రాగాలను శాస్త్రీయ నృత్యానికి అనుగుణంగా శ్రవణానందంగా మలచడంలో ఘంటసాలవారి సంగీత విద్వత్తు ద్యోతకమవుతుంది.రహస్యం చిత్రంలో రమణారెడ్డికి మాస్టారు పాడిన వేదాంత తత్త్వాలు ఎంతైనా కొనియాడతగ్గవి. అలాగే,  గుమ్మడి, అక్కినేని,  కాంతారావు, హరనాథ్ లకు మాస్టారు, మాధవపెద్ది పాడిన పద్యాలు ఎంతో ఔన్నత్యాన్ని సంతరించుకున్నాయి. అక్కినేని, రమణారెడ్డి, కాంతారావు, హరనాథ్, గుమ్మడి వీరి హావభావాలకు తగినట్లుగా తన గాత్రాన్ని  మలచుకోవడంలో గాయకుడిగా ఘంటసాలవారి ప్రతిభ, వైవిధ్యం సుస్పష్టమయ్యాయి. 

'రహస్యం' చిత్రానికి మకుటాయమానం  మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు వ్రాసిన 'గిరిజాకళ్యాణం యక్షగానం'. ఈ యక్షగానానికి వున్నంత చరిత్ర మరే సినిమా పాటకు లేదు. 

గిరిజాకళ్యాణం వైశిష్ట్యం గురించి సుప్రసిధ్ధ విశ్లేషకులు ఎందరో  ఎంతగానో వర్ణించి చెప్పేరు. నేను కూడా లోగడ నా పరిజ్ఞానం మేరకు వ్రాసేను. ఎన్నో సుమధుర రాగాల సమాహారం " గిరిజాకళ్యాణం" కూచిపూడి యక్షగానం. ఘంటసాలవారి అద్వితీయ సంగీత ప్రతిభ , వేదాంతం రాఘవయ్యగారి నాట్యశాస్త్ర ధురీణత్వం ఈ పదమూడు నిముషాల  సంగీత, నృత్య రూపకంలో  అణువణువునా గోచరిస్తాయి. 

కురంజి, హంసధ్వని, మధ్యమావతి, కాంభోజి, అఠాణా, కేదారగౌళ, వసంత, రీతిగౌళ, శహన, సరస్వతి, హిందోళ, నాదనామక్రియ, కానడ, సామ, సౌరాష్ట్ర వంటి శాస్త్రీయ రాగాలను అతి సమర్ధవంతంగా, సందర్భానుసారంగా ప్రయోగించారు ఘంటసాల.

సినీమా ప్రపంచంతో సంబంధంలేని కూచిపూడి కళాస్రష్టలు కోరాడ నరసింహారావు, వేదాంతం సత్యనారాయణ శర్మ, వేదాంతం రత్తయ్యశర్మ, భాగవతుల యజ్ఞనారాయణ శర్మ, మొదలైన వారితో  సినీ నటీమణులు బి.సరోజాదేవి , గీతాంజలి కూడా ఈ అపూర్వ కూచిపూడి నృత్య నాటకంలో పాల్గొన్నారు.

మన భారతీయ నృత్యకళా వైశిష్ట్యాన్ని ఈ గిరిజాకళ్యాణం ద్వారా విదేశాలలో ప్రచారం చేయాలనేది నిర్మాత శంకరరెడ్డిగారి అభిలాష. అందుకే ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ రహస్యం చిత్రాన్ని, గిరిజాకళ్యాణం నృత్య రూపకాన్ని తయారు చేశారు. ఘంటసాలవారు తన శాయశక్తులా కష్టపడి రహస్య చిత్ర సంగీతానికి చిరంజీవత్వం కల్పించారు. 
               
శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు ఈ గిరిజా కళ్యాణాన్ని ఎప్పుడు వ్రాసారో సరిగ్గా తెలియదు కానీ , ఇది ఆయన వ్రాసిన 'కేళీ గోపాలమ్' అనే పుస్తకంలో వుండేది. ఆ భాగాన్ని 1963 ప్రాంతాలలో వివి రాఘవయ్యగారి 'జ్యోతి' మాస పత్రికలో ప్రచురితమయింది. ఆ తర్వాతే శ్రీ శంకర రెడ్డిగారు తన 'రహస్యం' చిత్రానికి ఒక యక్షగానం కావాలని శ్రీ మల్లాదివారిని సంప్రదించినప్పుడు ఈ గిరిజా కళ్యాణాన్ని ఇవ్వడం జరిగింది.

ఈ గిరిజా కళ్యాణం యక్షగానం మన సంగీత నృత్యరీతులకు ఒక దర్పణంగా, కలకాలం ఒక మార్గదర్శిగా నిలిచిపోవాలని, ఆ నృత్య రూపకాన్ని భారతీయ సంస్కృతి లో భాగంగా విదేశాలలో ప్రచారం చేయాలని భావించిన నిర్మాత శంకరరెడ్డిగారు, సంగీత దర్శకుడు ఘంటసాలవారు, చిత్రానికి దర్శకత్వం, నృత్య దర్శకత్వం బాధ్యత లు చేపట్టిన వేదాంతం రాఘవయ్యగారు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి తమ విద్వత్ ను అంతా ధారపోసి రూపొందించిన కళాఖండం గిరిజా కళ్యాణం. ఇచ్చిన కథావస్తువును యథాతథంగా కంపోజ్ చేసినప్పుడు 25 నిముషాలకు పైనే వచ్చింది. మధ్య మధ్యలో బ్యాక్ గ్రౌండ్స్ తో కలిపి అరగంట వరకు వచ్చింది. ఒక్క నృత్య సన్నివేశానికే అరగంట సేపు వెచ్చిస్తే సినీమాలో టెంపో తగ్గుతుందని, ప్రేక్షకులకు అసహనంగా వుంటుందని భావించి మరల సాహిత్యాన్ని కుదించి పధ్నాలుగు పదిహేను నిముషాలకు తయారు చేసి ఫైనలైజ్ చేశారు. అదే సినీమాలో పెట్టారు. కానీ మన దురదృష్టం 'గిరిజా కళ్యాణం' యక్షగానం ఇప్పుడు మనకు లభిస్తున్న "రహస్యం'  ప్రింట్లలో అలభ్యంగానే వుంది. 

ఇప్పుడు రంగులు వెలిసిపోయి మనకు కనిపిస్తున్న ఈ నృత్య సన్నివేశం అతి దుర్లభంగా ఎంతో కష్టపడి వెదికిన పిమ్మట లభించినది. దాదాపు ఓ  పదిహేడేళ్ళ క్రితం డా. వెంపటి చిన సత్యంగారి ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యోత్సవాలు  ఒక వారం పాటు వారి స్వగ్రామం కూచిపూడిలో అతి ఘనంగా జరిగాయి. అందులో ఒక రోజు కూచిపూడి నాట్యంలో నిష్ణాతుడైన శ్రీ వేదాంతం రాఘవయ్యగారి సంస్మరణకు కేటాయించారు. ఆనాడు వారి ప్రతిభను కొనియాడుతూ ఏదైనా ఒక చిత్రం చూపించాలని నిర్ణయించినప్పుడు రహస్యంలోని గిరిజాకళ్యాణం దృశ్యాన్ని తెరమీద చూపాలని సంకల్పించారు. కానీ అది ఎక్కడా దొరకలేదు. అప్పుడు కూచిపూడికి చెందిన దండిభొట్ల శ్రీనివాస శాస్త్రిగారు ఎన్నిచోట్లో వెతికి వెతికి చివరకు విజయవాడలో ఏదో ఒక ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో వున్నట్లు తెలుసుకొని, మొత్తం మీద దానిని శోధించి, సాధించి అనుకున్న సమయానికి  కూచిపూడి నాట్యోత్సవాలలో తెరపై ప్రదర్శించారు. పిక్చర్ క్వాలిటీ అందరినీ నిరాశపర్చినా అందులోని సంగీత, నృత్యాలకు అందరూ ముగ్ధులయ్యారు. ఆ ప్రింటే ఇప్పుడు మనకు యూట్యూబ్ లో కనిపిస్తున్నది.

ఘంటసాల మాస్టారు ఈ సినీమా రిలిజ్ కు ముందే తన కచేరీలలో ఈ గిరిజా కళ్యాణం మొత్తం 25 నిముషాల వెర్షన్  గానం చేసేవారు. స్థలాన్నిబట్టి, ప్రేక్షకుల మనోభావాలను అనుసరించి గిరిజాకళ్యాణాన్ని మొత్తం పాడడమో, తక్కువ చేసి పాడడమో చేసేవారు. అలా ఘంటసాలవారు అతి తక్కువగా రెండు మూడు వాద్యాలతో, మా నాన్నగారు శ్రీ  పట్రాయని సంగీతరావుగారు హార్మోనియం, గాత్ర సహకారం అందిస్తూండగా, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ పరమాచార్యుల వారి సమక్షంలో హైదరాబాద్ లో గానం చేసారు.అప్పుడు రికార్డ్ చేసి, ఎడిట్ చేసిన అసంపూర్ణ భాగాన్ని ఆలిండియా రేడియో వారు వారి సమయానుకూలంగా వారి తెలుగు కేంద్రాలనుండి ప్రసారం చేసేవారు. అలాగే, పుట్టపర్తి సాయిబాబా, తదితర మఠాధిపతుల సమక్షంలో సమయం సందర్భాన్నిబట్టి ఈ గిరిజాకళ్యాణంలోని కొన్ని భాగాలను ఘంటసాలవారు గానం చేసేవారు.  అయితే మొత్తం గిరిజాకళ్యాణం ఎక్కడా రికార్డ్ చేయబడలేదు.

ఈ గిరిజాకళ్యాణం మొత్తం కంపోజింగ్ నొటేషన్స్ మా నాన్నగారు శ్రీ సంగీతరావుగారి జిహ్వాగ్రంమీద, ఆయన మస్తిష్కంలోనే నిక్షిప్తమైపోయాయి.  అంత ఘన చరిత్ర కలిగిన ఏకైక సినీమా గీతం 'రహస్యం' లోని గిరిజా కళ్యాణం కూచిపూడి యక్షగానం. ఇంత శ్రమపడి రూపొంచిన ఒక అపూర్వమణి సినీమా అపజయం పాలైన కారణంగా మరుగున పడిపోవడం చాలా దురదృష్టం.

విజయవంతమైన అనేక జానపద చిత్రాలకేమీ తీసిపోని చిత్రం రహస్యం. అయినా ప్రేక్షకాదరణకు నోచుకోకపోవడం ఒక రహస్యం.   ఏ సినీమా ఎందుకు విజయవంతమవుతుందో, ఎందుకు ఫెయిల్ అవుతుందో ఎవరికీ అంతుపట్టని రహస్యం. అసలు తెలుగు సినీమా  ప్రేక్షకుల అభిరుచి, మనస్తత్త్వమే ఒక పెద్ద రహస్యం.

ఏమైనా గిరిజా కళ్యాణం వంటి అపూర్వ  సంగీత నృత్యనాటకం మొత్తం దృశ్యరూపం అందుబాటులో లేకపోవడం నిజంగా తెలుగువారి దురదృష్టమే. ఘంటసాలవారి నిజమైన అభిమానులంతా ఈ గిరిజా కళ్యాణం కూచిపూడి నృత్యనాటకాన్ని విస్తృతంగా ప్రదర్శింపజేసి, ప్రచారం చేసి ఘంటసాలవారి పట్ల తమకు గల అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకోవాలి. రానున్న శతజయంతి ఉత్సవాలలో ఘంటసాలవారి గిరిజా కళ్యాణానికి ఉన్నతస్థానం తప్పక కల్పించేలా కృషిచేయాలి. అదే ఈ శతాబ్ది గాయకునికి అర్పించగల గొప్ప నివాళి. 

ఘంటసాలవారి కి సంబంధించిన మరిన్ని పాటల విశేషాలతో.... వచ్చే వారం...
                      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.