visitors

Saturday, November 28, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఎనిమిదవ భాగం


28.11.2020 - శనివారం భాగం - 8*:
అధ్యాయం 2  భాగం 7 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్


మెడ్రాస్ లో మళ్ళీ నా స్కూల్ జీవితం ప్రారంభమయింది. 1956 లో టి.నగర్ పానగల్ పార్క్ కు ఎదురుగా వున్న 'శ్రీ రామకృష్ణా మిషన్ హైస్కూల్' లో III ఫారమ్ (8వ తరగతి) లో చేర్చారు. త్యాగరాయనగర్ మెయిన్ బ్రాంచ్ అది. రామకృష్ణ మిషన్ స్కూల్స్ చక్కటి చదువు, క్రమశిక్షణలకు చాలా ప్రసిధ్ధి. ఆ హైస్కూల్ కు  టి.నగర్ లో చాలానే బ్రాంచ్ లు ఉండేవి. బజుల్లా రోడ్, గ్రిఫిత్ రోడ్, రామనాధన్ స్ట్రీట్, బర్కిట్ రోడ్ లలో  ఎలిమెంటరీ /మిడిల్ క్లాస్ స్కూల్స్ వుండేవి. మెయిన్ స్కూల్ కు సంబంధించిన ఆటస్థలాలు జి.ఎన్.చెట్టి రోడ్ లో, గ్రిఫిత్ రోడ్ ముప్పత్తమ్మా ఆలయం దగ్గర ఉండేవి. రామకృష్ణా మిషన్ బాయ్స్ హాస్టల్ ఈ ప్లేగ్రౌండ్ కు ఆనుకొని వుంటుంది. హాస్టల్ విద్యార్ధులు గ్రౌండ్ లోకి వెళ్ళే మార్గమూ వుంది. ఆ హాస్టల్ ప్రధాన ద్వారం దొరైసామీ రోడ్ వేపు వుంటుంది. రామకృష్ణా మిషన్ శారదా గర్ల్స్ హైస్కూల్  ఉస్మాన్ రోడ్ లో పానగల్ పార్క్ దగ్గర వుంది. ఆ స్కూల్ లో రోడ్ వేపు ప్రహారీలో చాలా పెద్ద నాగమల్లి చెట్టుండేది. ఆ చెట్టు, నాగమల్లి పుష్ప సౌరభం ఆ స్కూలుకు ఒక ప్రత్యేక ఆకర్షణ. నేను, మా తమ్ముడు గోపి, చెల్లెళ్ళు రమణమ్మ, పద్మ, లలిత,  సుమబాల అంతా రామకృష్ణా మిషన్ విద్యార్ధులమే.

ఘంటసాల మాస్టారి ముగ్గురు ఆడపిల్లలు శ్యామల, సుగుణ, శాంతి(రాధ) కూడా  రామకృష్ణ మిషన్ శారదా గర్ల్స్ హైస్కూల్ లోనే చదువుకున్నారు. ఎలిమెంటరీ క్లాసులు జిఎన్ చెట్టి రోడ్ లోని కమలాబాయి స్ట్రీట్ లో వున్న 'బాల గురుకుల్' లో చదువుకున్నారు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఒక యూరోపియన్. పేరు డంకన్. అప్పుడప్పుడు మాస్టారి పిల్లలను దింపడానికి, తీసుకురావడానికి వెళ్ళేప్పుడు చూసేవాడిని. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. గేట్ ముందు నిల్చొని వచ్చే పోయే పిల్లలకు షేక్ హాండ్స్ ఇస్తూ ప్రేమగా పలకరించేవారు. 

మైలాపూర్ లోని వివేకానంద కాలేజి కూడా రామకృష్ణ మిషన్ వారిదే. రామకృష్ణ మిషన్ ప్రధాన ఆశ్రమం, మైలాపూర్ కపాలేశ్వరాలయం పుష్కరిణి పక్కనుంచి  మందవళ్ళి వెళ్ళే రోడ్ మీద వుంది. రామకృష్ణ ఆశ్రమ ప్రధాన కార్యనిర్వాహక స్వామీజీలంతా అక్కడే వుంటారు. చాలా విశాలమైన కట్టడం. నిత్యమూ ఏవో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూనేవుంటాయి. నేను రామకృష్ణా మిషన్ హైస్కూల్ లో మూడు సంవత్సరాలు చదివినా ఒక్కసారి కూడా, ఆ తరువాతికాలంలో కూడా ఆ ఆశ్రమంలోకి వెళ్ళే అవకాశం దొరకలేదు, బయటనుండి చూడడమే తప్ప. వయసు ప్రభావం కావచ్చును. మద్రాస్ సైట్ సీయింగ్ కు వచ్చే బంధువులను, మిత్రులను నేనే దగ్గరుండి మద్రాసులోని అన్ని ఆలయాలకు, విహార ప్రదేశాలకు తీసుకువెళ్ళేవాడిని. కానీ, ఎవరూ కూడా రామకృష్ణ పరమహంసకు, స్వామీ వివేకానందకు చెందిన ఈ ఆశ్రమాన్ని దర్శించాలని ఎప్పుడూ అనుకోలేదు. బహుశా, సాధవులు, సన్యాసాశ్రమం లోని వారే అక్కడకు వెళ్ళాలనే భావనేమో? తెలియదు. పాండిచ్చేరి అరబిందో ఆశ్రమానికైతే చాలా సార్లే వెళ్ళాను. అలాగే ఆరోవిల్ మెడిటేషన్ సెంటర్ నిర్మాణంలో వున్నప్పుడు చూడడం జరిగింది. (మా జ్యోతి, శశి శేఖర శాస్త్రి గార్ల సౌజన్యంతో).

టి.నగర్ లో రామకృష్ణా మిషన్ స్కూల్సే కాకుండా తెలుగు విద్యార్ధుల సౌకర్యార్ధం, పాండీబజార్ చివర్లో మౌంట్ రోడ్ జంక్షన్ కు ముందు బోగ్ రోడ్ దాటాక ఎడమచేతివేపు గిరియప్పా రోడ్ మీద ఉన్న స్కూలు 'కేసరి హైస్కూల్'. ఈ హైస్కూల్ కు మెయిన్ స్కూల్ మైలాపూర్ లో వుంది. నాకు ఆ స్కూల్ చూసిన గుర్తులేదు. మా ఆవిడ ఆ స్కూల్ విద్యార్ధినే.

కేసరీ హైస్కూల్స్ వ్యవస్థాపకుడు డా. కె.ఎన్. కేసరి. సుప్రసిధ్ధ ఆయుర్వేద వైద్యాలయం కేసరీ కుటీరమ్ అధినేత. ఈ సంస్థ తయారు చేసే 'లోధ్ర' దేశవ్యాప్తంగా చాలా ప్రసిధ్ధి పొందిన ఔషధం. మా చిన్నప్పుడు అన్ని వార్తా పత్రికలలో  మహిళలకు ఉద్దేశించిన ఈ లోధ్ర ప్రకటనలు విరివిగా కనపడేవి.

డా. కేసరిగారు  మన తెలుగు వెలుగులలో ఒకరు. ఒంగోల్ జిల్లాకు చెందిన వ్యక్తి. గొప్ప వైద్యుడు, విద్యావేత్త, దాత, గృహలక్ష్మి పత్రిక స్థాపకుడు. ఈతరంవారికి ఇంకా బాగా అర్ధంకావాలంటే, సుప్రసిధ్ధ బహుభాషా గాయకుడు ఉన్నికృష్ణన్ ముత్తాతగారాయన . 

అలాగే, విల్లివాక్కంలోని ఎస్ కే పి డి - శ్రీ కనకదుర్గ హైస్కూల్ తెలుగు పిల్లలకోసం స్థాపించబడింది. ఇలాటి తెలుగు స్కూల్స్ పరశువాకం, ముత్యాలపేట (జార్జ్ టౌన్) మొదలైన ప్రాంతాల్లో వుండేవి. నా దురదృష్టంకొద్దీ ఈ తెలుగు స్కూల్స్ అన్నీ మేముండే నెం. 35, ఉస్మాన్ రోడ్ కు చాలా దూరం. సిటి బస్సులో ఒక్కొణ్ణే పంపడానికి సిద్ధంగా లేరు మావాళ్ళు. పాండీ బజార్ చివరున్న కేసరి హైస్కూల్ కూడా నడకకు చాలా దూరం. బస్సు లో వెళ్ళాలంటే అప్పట్లో వడపళని నుండి శాంథోమ్ వెళ్ళే 12B రూట్ బస్ ఒక్కటే ఉండేది . అందుకు బజుల్లా రోడ్ బస్ స్టాపింగ్  వరకూ వెళ్ళాలి. బస్సులకోసం పడిగాపులు పడాలి. అందుచేత, కేసరీ స్కూల్ లో చేరే విషయం రూల్డౌట్. తెలుగు సినిమా రంగానికి చెందిన చాలామందికి పనగల్ పార్క్, పాండీబజార్ కేర్ ఆఫ్ అడ్రస్. అలాగే తెలుగు సినిమా రంగానికి చెందిన చాలామంది సాంకేతిక నిపుణుల పిల్లలందరూ ఈ ప్రాంతంలో తెలుగు మీడియం ఉన్న ఈ  కేసరీ హైస్కూల్ లో నే చదువుకునేవారు. అనంతరం కాలంలో తమ తమ రంగాల్లో ప్రసిద్ధులయ్యేరు. అంతేకాక ఈ స్కూలు ప్రత్యేకత ఏమిటంటే ఆ స్కూలు టీచర్లు, ఆఫీసుస్టాఫ్ చాలామంది తెలుగు సినిమా రంగంతో సంబంధం ఉన్నవారే. మన తెలుగు సినీమాలలో అడపాతడపా కనపడేవారు. ఆ కేసరీ హైస్కూల్ లో డ్రిల్ మాస్టర్ గా పనిచేసిన భక్తవత్సలం నాయుడు నటుడిగా, నిర్మాతగా, విద్యాలయాల స్థాపకుడిగా తెలుగు సినీమా ప్రేక్షకులందరికీ చిరపరిచితుడు. ఆ ప్రముఖుడెవరో నాకన్నా మీకే బాగా తెలుసు. 

తెలివైన విద్యార్థులు ఎక్కడ చదివినా రాణిస్తారు. పురోభివృద్ధి చెందుతారు. నా వరకూ, అన్నిటికంటే ముఖ్యమైనది రామకృష్ణా స్కూల్ మా ఇంటికి చాలా దగ్గర. నడిచి వెళ్ళి రావచ్చును. రామకృష్ణ మిషన్ హైస్కూల్ లో ఆరవ తరగతి నుండి SSLC వరకు వుంది. అందులో  'A' సెక్షన్ పూర్తిగా తెలుగు మీడియం విద్యార్ధులకు కేటాయించబడింది. 'B' నుండి ఐదారు సెక్షన్లు తమిళ విద్యార్ధుల కోసం. ఒక్కో సెక్షన్ లో ముఫ్ఫైమంది విద్యార్ధులు. దాదాపు వెయ్యిమంది విద్యార్థులతో రామకృష్ణా మిషన్ బోయ్స్ మెయిన్ హైస్కూల్ రెండు అంతస్థుల విశాల భవనంలో కళకళలాడుతూ వుండేది. ఆ స్కూలే కాదు, స్కూల్ కు ఎదురుగా వున్న పానగల్ పార్క్ కూడా. స్కూల్ ప్రారంభం కావడానికి గంట ముందు, స్కూలు వదిలాక సాయంత్రం ఐదున్నర వరకూ సగంమంది పిల్లలు ఆ పార్క్ లోనే ఆటలాడేవారు. హాస్టల్ విద్యార్ధులు మాత్రం ఇలాటి ఆటపాటలకు దూరం. బోయ్స్ హాస్టల్ దొరైసామీ రోడ్ లో వుండేది. ఆ హాస్టల్ వుండి చదువుకునే విద్యార్ధులకు కట్టు, బొట్టు, కట్టుబాట్లు చాలానేవుండేవి. అప్పట్లో చాలామంది తమిళ విద్యార్ధులు తెల్ల వేష్టీ (లుంగీ), తెల్ల చొక్కాలు ధరించేవారు. నుదుట విబూదిరేఖలతో గురుకులం విద్యార్ధుల్లా సంప్రదాయబధ్ధంగా వుండేవారు. తెలుగు సెక్షన్ పిల్లలు నిక్కర్లు, ప్యాంట్ షర్ట్ లతో వచ్చేవారు. చాలామంది తమిళ అయ్యర్, అయ్యంగార్ల పిల్లలు తల ముందుభాగం గుండుతో, వెనుక శిఖలతో  వచ్చేవారు. అది ఆనాటి ఆచారవ్యవహారాలకు ఇచ్చే గౌరవమర్యాదలు.  ఈ వాతావరణం అంతా నాకు చాలా కొత్త , ఎంతో వింత.

ఆ స్కూల్ లో చేరాక నా చదువు కష్టాలు ఇంకా ఎక్కవైయాయి. మా తెలుగు మాస్టారి పేరు వేదం వెంకటరాయ శాస్త్రిగారు. ఈయన, ప్రముఖ వేద పండితులు, కవి అయిన వేదం వెంకటరాయ శాస్త్రిగారి కుటుంబం వాడని చెప్పుకునేవారు. ఆయన తప్ప ఇంకెవరు తెలుగు మాట్లాడినా నా చెవులకు అరవంలాగే వినపడేది. తెలుగు విద్యార్థులు కూడా వాళ్ళలో వాళ్ళు తమిళంలోనే మాట్లాడుకునేవారు. మొదట్లో నాకేమీ అర్ధమయేదికాదు. అందుచేత స్కూల్ లేని సమయాలలోఎప్పుడూ ఘంటసాలవారింట్లో పెద్దబాబు తో కాలక్షేపం చేయడం, గ్రామఫోన్ లో వేసే పాటలు వినడం పట్ల మహా ఆసక్తిగా వుండేది. అయ్యగారు ఇంట్లో వున్నంతసేపు ఇల్లంతా మహా నిశబ్దంగా వుండేది. ఆయన బయటకు వెళ్ళిన తరువాతే గ్రామఫోన్ లో పాటలు, రేడియో వినడం. తిరిగి ఆయన కారు గేట్లోకి రాగానే గోవింద్ హారన్ మ్రోగించేవాడు. దానితో ఎక్కడివారక్కడే ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయేవారు. రికార్డింగ్ లలో, రిహార్సల్స్ లో పాడి పాడి వచ్చాక తిరిగి తన పాటలు తాను వినడానికి అయ్యగారు పెద్దగా ఇష్టపడేవారు కాదు. రాత్రి తొమ్మిది తర్వాత  శనివారం నాడు ఆలిండియా రేడియో  ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమయే నేషనల్ ప్రోగ్రామ్స్ కచేరీలు కొంతసేపు వినేవారు. ఆ సమయంలో ప్రాంతీయ కేంద్రాలకు కూడా అవే కచేరీలు ప్రసారం చేసేవారు.

అప్పట్లో ఆకాశవాణివారు 'వాణి' పత్రిక ప్రచురించేవారు. అందులో ఆ నెలలో వివిధ కేంద్రాలు  ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలుండేవి. అందులో ప్రముఖ సంగీత విద్వాంసుల ఫోటోలు, వారి వివరాలు కూడా ఇచ్చేవారు. 

ఘంటసాలవారు తాను ఎంత గొప్పగాయకుడైనా, ప్రతిభ కలిగిన సంగీత దర్శకుడైనా ఎక్కడ ఏమంచి పాట వినపడినా అది కర్నాటిక్ అయినా, హిందుస్థానీ అయినా సినీమా పాట అయినా విని ఆనందించేవారు. ఆయా గాయకుల ప్రతిభను గుర్తించి అభినందించేవారు. తాను తప్ప వేరే గొప్ప గాయకులు లేనే లేరనే భావన, ఆ విధమైన అహంకారం  ఏనాడూ వారిలో వుండేదికాదు. 

అదేవిధంగా, శృతిలయలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, భావ రహితంగా, లోపభూయిష్టంగా పాడే పాటగాండ్రను ఏమాత్రం ఉపేక్షించేవారు కాదు. 

ఒకరోజు ఉదయం, ఆనాటి సాయంత్రం ఆరుగంటలకు ఏదో స్టూడియో లో 'చిరంజీవులు' సినీమా ప్రివ్యూ వేస్తున్నారని ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తి వచ్చి చెప్పి వెళ్ళారు. ఆ సినీమాకు ఘంటసాలవారిదే సంగీతం. మా నాన్నగారు అందులోని పాటలకు హార్మోనియం వాయించారు. అందుచేత, అందరూ ఆ ప్రివ్యూకు వెళ్ళవచ్చును. సాయంత్రం వేసే ప్రివ్యూను తల్చుకొని నాకు ఉదయంనుండి మహా ఆనందం. అయితే, మా నాన్నగారు అందరిని తీసుకువెళతారా? ఎవరితో ఎలా వెళ్ళాలి అనే ఆలోచనలతోనే గడిచిపోయింది. మొత్తానికి మా ఇంట్లోవారంతా కూడా స్టూడియో లో వేసే 'చిరంజీవులు' సినీమాకు వెళ్ళడం జరిగింది. కోడంబాక్కం రైల్వే లెవెల్ క్రాస్ దాటి వడపళని వేపు వెళ్ళడమనేది బ్రహ్మయత్నం. ఏనాడు వెళ్ళగానే రైలుగేట్ తెరిచి వుండదు. కనీసం, పావుగంటసేపైనా వచ్చేపోయే లోకల్ ట్రైన్స్, సౌత్ కు వెళ్ళే రైళ్ళు చూడడంతోనే  కాలం గడిచిపోయేది. 

స్టూడియోలలో వేసే ఏ ప్రివ్యూ సినీమాలు కూడా పూర్తిగా టైటిల్స్ నుండి చూడడం బహు అరుదు. మేము వెళ్ళేప్పటికి ఎప్పుడూ ఒకటి రెండు రీళ్ళు తర్వాత నుండే చూసేవాళ్ళం. సినిమా చూసిన తృప్తి వుండేదికాదు. ఒక సినీమాకైతే మేము వెళ్ళి కూర్చున్న ఐదు నిముషాలకే ఇంటర్వెల్ కార్డ్ వేసేసారు.

టైటిల్స్ తో సహా పూర్తి సినీమాలు చూడలేకపోయిన కొరత అమ్మగారి (సావిత్రమ్మగారు)లోను వుండేది. సినీమా ప్రొజెక్షన్ రోజున "సాయంత్రం అందరూ రెడీగా వుండండి,నేను వచ్చి తీసుకువెళతాను, లేదా కారు పంపిస్తాను మీరు వెళ్ళండి" అనేవారు. రెండోదే ఎక్కువగా జరిగేది. మాస్టారు చాలా అరుదుగా, బయటవారి సినీమా ల ప్రివ్యూకు హాజరయ్యేవారు. అందుకు కారణం ఆ రోజుల్లో అంత బిజీగా వుండేవారు. 

పోనీ మనసుకు నచ్చిన తెలుగు సినీమాలు బయట ధియేటర్స్ లో చూద్దామంటే మద్రాస్ లో తెలుగు సినీమాలే రావు. సినీమాలు తీసేది మెడ్రాస్ లో నైనా ఆ వూళ్ళో తెలుగు సినీమాలు ఆడవు. జార్జ్ టౌన్ తాతముత్తియప్పన్ వీధిలోని సెలెక్ట్ ధియేటర్లో మాత్రం తెలుగు సినీమాలు ఆడుతాయి. శుక్రవారం నుండి గురువారం వరకు ఒక్కవారం మాత్రమే. కానీ మేముండే టి.నగర్ నుండి ఆ సినీమా ధియేటర్ కు వెళ్ళిరావడమంటే ఒక ఊరినుండి మరోవూరు వెళ్ళడమే. ఆ సెలక్ట్ ధియేటర్ కూడా అంత పెద్దదికాదు. పాతకాలం హాలు. తెలుగు సినీమా మీది వ్యామోహంతో స్థానిక తెలుగులు ఆ ధియేటర్ కు వెళతారు.

అలాటి సెలెక్ట్ టాకీస్ కు అమ్మగారు, అయ్యగారు, నేను మాత్రమే  ఒక సినీమా చూడ్డానికి వెళ్ళాము. ఆ విశేషాలు మరోభాగంలో ముచ్చటిస్తాను.

మద్రాసులో  కొన్ని తెలుగు సాంస్కృతిక సంస్థలు 1970 తరువాత ఆవిర్భవించాయి. అప్పటినుండి ఆ సంస్థలు తమ సభ్యుల వినోదం కోసం పాతవో, కొత్తవో నెలకు ఒకటి రెండు తెలుగు సినిమాలు ఆదివారం ఉదయం 10 గంటలకు ఏదో ధియేటర్ లో వేసేవారు. ఆ సినిమా లు చూడడం కోసం తెలుగు ప్రజలు చందాలు కట్టి సభ్యులయేవారు. 

చిరంజీవులు చిత్రం లోని సంగీతం, సాహిత్యం విలువలు పెద్దయ్యాక తెలుసుకున్నవే. ఆ సినీమా ప్రివ్యూ చూసినప్పుడు అవేవీ తెలియదు. పైగా 'చిరంజీవులు' సినీమా లో వినోదం పాలు తక్కువ. చిత్రం విషాదాంతం. ఆ సినీమా లోని అన్ని పాటలు వీనులవిందే . నాకు బాగా ఇష్టమైనది మనసునీదే మమత నాదే' ఎడ్లబండిపాట. అందులోని రిథిమ్ , మాస్టారి వాయిస్ ఎఫెక్ట్స్ ఎన్నటికి మరపురావు.
 


అలాగే‌, 'కనుపాప కరువైన కనులెందుకు' పాట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో వినవచ్చే తబలా, డ్రమ్స్, వీణ, వైలిన్  బిట్స్ ఇప్పటికీ చెవుల్లో మారు మోగుతూనే వుంటాయి. 



'తెల్లవార వచ్చె తెలియక నా సామీ' లీల పాడిన సుప్రభాత గీతం. ఎంతో మనోజ్ఞం. 



ఈ పాటను  సుప్రసిధ్ధ హిందీ గాయని లతా మంగేష్కర్ చేత పాడించాలని అనుకున్నారనే వార్త గురించి  నాకు తెలియదు. సినీమా ఆఖరులో రెండు బొమ్మలు నీటిలో తేలుకుంటూ పోవడం ఒకటి బాగా గుర్తుండి పోయింది. ఈ సినిమాలో గుడ్డివాడిగా నటించిన ఎన్ టి రామారావుకు, షూటింగ్ సమయంలో నిరంతరం వాడిన కృత్రిమ కనుగుడ్ల వల్ల నిజంగానే కొంతకాలం కంటిసమస్య ఏర్పడిందని, అయినా రామారావు లెఖ్ఖచేసేవారు కాదని చెప్పుకునేవారు. 

దేవదాసు, కన్యాశుల్కం సినీమా లు తీసిన వినోదా పిక్చర్స్ డి.ఎల్ నారాయణ గారిదే ఈ చిరంజీవులు సినీమా కూడా. ఈ సినీమా లోని ఘంటసాలవారి సంగీతం గురించి,పాడిన పాటల గురించి పత్రికలలో చాలా గొప్పగా రాశారు. స్టూడియోలలో చూసిన చాలా సినీమాలు పెద్దయ్యాక టివి ఛానల్స్ లో చూసాను. రెండుగంటలలో సినీమాలు పూర్తిచేయడంకోసం కొంత సినీమా కట్ చేసేస్తారు. కొన్ని మంచిపాటలు కూడా కనపడవు. ఒరిజినల్ సినీమా చూసిన ఆనందం, తృప్తి టివి సినీమా లలో వుండదు.

మా నాన్నగారు, అమ్మగారు కూడా పిల్లలతో ఏ విషయంలో కఠినంగా వ్యవహరించేవారు కాదు.  కొట్టి తిట్టడం ద్వారా పిల్లలు బాగా చదువుతారు, క్రమశిక్షణతో వుంటారనే విషయంలో మా పెద్దలకు నమ్మకం లేదు. 

ఘంటసాలవారి పెద్దబాబు (విజయకుమార్)ను కూడా స్కూల్లో చేర్చారు. పాండీబజార్ లోని హోలీ ఏంజెల్స్ కాన్వెంట్. అతనికి చిన్నతనం కావడం వలన  రోజూ స్కూలుకు వెళ్ళడానికి చాలా మారాం చేసేవాడు. నేను శెలవుదినాలలో పాప పిన్నిగారితో కలసి ఆ నాష్ కారులో వెళ్ళి కాన్వెంట్ లో దింపడం, తిరిగి తీసుకురావడం జరిగేది. చదువు, తెలివితేటల విషయంలో పెద్ద బాబు, నేనూ సేమ్ టు సేమ్. 

బాబూ వాళ్ళమ్మగారు పిల్లల పెంపకం విషయంలో మా అమ్మగారికి పూర్తి విరుధ్ధం. కోపం వస్తే చాలా కఠినంగానే వుండేవారు. ఆవిడ గట్టిగా అరిచారంటే పిల్లల లాగూలు తడిసిపోయేవి. వారి పిల్లలందరికీ ఆవిడ పెట్టే తొడపాశాలు అనుభవమే. అలాటి సందర్భాలలో పిల్లలను అనునయించి, సముదాయించడం మా అమ్మగారు, పాప పిన్నిగారి వంతు. అయితే ఈ రకమైన థర్డ్  డిగ్రీ పనిష్మెంట్లు అన్నీ అయ్యగారు ఇంటిలో లేనప్పుడే. ఆయన పిల్లలను ముద్దుగానే చూసుకునేవారు. కానీ, పెద్దబాబుకు కూడా నాలాగే వాళ్ళ నాన్నగారి దగ్గర చనువు తక్కువే. సాధ్యమైనంతవరకూ మాస్టారి ఎదుటపడేవాడు కాదు. 

విజయకుమార్ కు చదువు చెప్పడానికి ఇంటికి ఒక ముసలి అయ్యవారు వచ్చేవారు. స్కూల్ లో చదువు చెప్పే మాస్టర్లను అయ్యవారని పిలవడం పరిపాటి. ఆ ముసలి అయ్యవారి దగ్గర పెద్దబాబు చదువు చాలా వినోదాత్మకంగా వుండేది. 

ఆ విశేషాలన్నీ వచ్చేవారం.....
                    ...సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Saturday, November 21, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏడవ భాగం

20.11.20 - శుక్రవారం భాగం - 7*:
అధ్యాయం 2 భాగం 6 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

35, ఉస్మాన్ రోడ్ లో దీపావళి పండగ చాలా సంతోషంగా దేదీప్యమానంగా జరిగేది. దీపావళీ అమావాస్య మర్నాడు ఉత్తర భారతదేశంలో లక్ష్మీపూజ చాలా ఘనంగా జరుపుతారు. అదేరోజున కార్తీకమాసం ప్రారంభం. కార్తీకమాసమంతా పూజలు, వ్రతాలు, దానధర్మాలు, సంతర్పణలు జరిపే మాసం. ఉత్తరాది వ్యాపారస్తులంతా దీపావళీ మర్నాడు లక్ష్మీకుబేర పూజలు చేసి కొత్త పద్దులకు శ్రీకారం చుట్టుతారు. వ్యాపారానికి కొత్త సంవత్సరం ఆనాటినుండే ప్రారంభం. గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్1-మార్చ్31. కానీ చాలా మంది వ్యాపారస్తులు నవంబరు1-అక్టోబర్31 పరిగణిస్తారు. గతంలో నేను పనిచేసిన  కంపెనీలో కూడా నవంబర్-అక్టోబర్ ఎక్కౌంటింగ్ ఇయర్ గా పనిచేసేవారు. వర్కర్లకు, ఉద్యోగస్తులకు అక్టోబర్ లోనే దసరా, దీపావళీ సందర్భంగా బోనస్ లు బట్వాడా చేసేవారు.

రాజశ్రీ/శ్రీ/రాజలక్ష్మీ ప్రొడక్షన్స్ అన్న మూడు సినిమా నిర్మాణ సంస్థల అధినేత సుందర్లాల్ నహతా ప్రముఖ మార్వాడీ వ్యాపారవేత్త. ఆయనకు చిత్రనిర్మాణం, సినీమాల డిస్ట్రిబ్యూషన్లతో పాటూ సినీమాలకు ఫైనాన్స్ చేయడం వంటివి ఉండేవి. సుందర్లాల్ నహతాగారికి ఘంటసాలవారంటే చాలా గౌరవం, మంచి స్నేహం వుండేవి. దీపావళీ మరుసటిరోజు సాయంత్రం సుందర్లాల్ గారు తమ స్వగృహంలో జరిగే లక్ష్మీపూజకు ఘంటసాలవారిని ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవించి సత్కరించడం ఒక ఆనవాయితి. ఘంటసాల మాస్టారు సర్వసాధారణంగా అరవవాళ్ళ పద్ధతిలో తెల్ల వేష్టీ - లుంగీ ధరించేవారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం  పంచె కట్టుకునేవారు. సుందర్లాల్ గారింటి లక్ష్మీపూజలకు సంప్రదాయబధ్ధంగా తెల్లటి పంచె, తెల్లటి అరచేతుల చొక్కా ధరించి వెళ్ళడం బాగా గుర్తు.

సుందర్లాల్ నహతా నిర్మించిన మొట్టమొదటి తెలుగు చిత్రం 'జయం మనదే' మొదలు 'సతీ అనసూయ', మంచి మనసుకు మంచిరోజులు', 'శభాష్ రాముడు', 'రక్తసంబంధం', 'శాంతినివాసం', 'అభిమానం', 'శభాష్ రాజా', 'బందిపోటు', 'వీర కేసరి' (కన్నడం) చిత్రాల వరకూ వరసగా ఘంటసాలవారే సంగీత దర్శకత్వం నిర్వహించారు. ఈ చిత్రాలన్నిటికీ మా నాన్నగారు కూడా సహాయ సంగీత దర్శకులలో ఒకరుగా పనిచేశారు. కానీ, సినీమా టైటిల్స్ లో పేరు వేయడమనేది 'అభిమానం' చిత్రంతోనే ప్రారంభమయింది. 1955 నుండీ ఘంటసాలవారి వద్ద సంగీత సహాయకుడిగానే పనిచేస్తున్నా కొన్ని సినీమాలలో పేర్లు వేయడానికి, మరికొన్ని సినీమాలలో పేరు కనపడకపోవడానికి కారణమేమిటో నాకు అర్ధం కాదు. 'అభిమానం' సినీమాకు పూర్వం సినీమా టైటిల్స్ లో 'సంగీతరావు' అనే పేరు చూసిన గుర్తు లేదు.


శాంతినివాసం చిత్రంలో మా నాన్నగారు తొలిసారిగా వీణ వాయించిన గుర్తు. అలాగే అదే సంవత్సరం విడుదలైన 'భక్త రఘునాధ్' చిత్రం లో కూడా వీణవాయించేరు. అప్పటినుండి అవసరాల మేరకు హార్మోనియంతో పాటూ వీణను కూడా సినీమాలలో వాయించేవారు.

అసలు సినిమాలలో టైటిల్స్ కు అథారిటీ ఎవరో? అసిస్టెంట్ డైరక్టరా? ప్రొడక్షన్ మేనేజరా? నిర్మాత? సంగీత దర్శకుడా? ఎవరు ఎవరిని సంప్రదించి  నటీ నటులు, ఈ సాంకేతిక నిపుణుల పేర్లు టైటిల్స్ వేస్తారు? ఎందుకంటే 'పాండురంగ మహత్యం' సినీమాలో నేపధ్యగాయకునిగా ఘంటసాలవారి పేరు లేదు. ( సింగర్స్ కార్డే మిస్సింగ్).

సినీమా టైటిల్స్ లోని పేర్ల విషయంగా మా నాన్నగారిని అడిగితే, సమాధానం 'తెలియదు'. అంటే ఆ విషయం పట్ల ఆసక్తి లేదని అర్ధం. బందిపోటు/వీరకేసరి చిత్రాల తరువాత ఘంటసాల మాస్టారు సుందర్లాల్ నహతాగారి సొంత చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేయలేదు. కానీ, తాము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న కొన్ని సంస్థలకు ఘంటసాలవారే సంగీత దర్శకుడిగా నియమించబడేందుకు ప్రోత్సహించేవారని వినికిడి. 

ఇంక, దీపావళీ ముచ్చట్ల నుండి అసలు కథలోకి వద్దాము. 

ఘంటసాలవారింట్లో చాలామంది వ్యక్తులుండేవారు. ఎవరు ఎవరో తెలిసేది కాదు. తరుచూ, 'తాతా', 'పాపా' అనే పేర్లు వినబడేవి. కానీ, ఆ వయసువాళ్ళెవరూ కనపడేవారు కాదు. ఒకరోజు ఆ గుట్టు తెలిసిపోయింది. పక్కపాపిడి, వంకీల ఒత్తైన నల్లటి జుత్తు సాఫీగా దువ్వుకున్న ఒక పాతికేళ్ళ యువకుడినే ఈ పెద్దవాళ్ళందరూ తాతా అని పిలుస్తున్నారు. ఆయనే పిల్లలందరూ బాబాయి అని పిలిచే ఘంటసాలగారి తమ్ముడు సదాశివుడుగారు. నాన్నగారు కూడా ఆయన్ని తాతగారనే అనేవారు. ఇక పాప అంటే చిన్నపాపేంకాదు. ఆయన భార్య, పిల్లలందరికీ పిన్ని, ఘంటసాలవారి మేనకోడలు, వాళ్ళ అక్కగారు జయప్రద, బావగారు ర్యాలి పిచ్చిరామయ్యగారి పెద్దకుమార్తె, సుబ్బలక్ష్మి.  తాత, పాప జోడీ అప్పట్లో వింతగా అనిపించేది. వీరు కాక రామచంద్రరావు. మెడ్రాస్ హార్బర్ లో పనిచేసేవారు. మొదట్లో బంధువేమో అనుకునేవాడిని. కారణం, ఆయన ఇంట్లో వారందరితో చాలా చనువుగా ఉండేవారు. ఒక్క ఘంటసాలవారిని మాత్రం 'అయ్యగారు' అని పిలిచేవారు. మిగతావారందరినీ ఏకవచన ప్రయోగమే. ఆయనకి ఘంటసాలవారికి పానగల్ పార్క్ కాలంనుండీ స్నేహం. ఆయనకు సంసారం లేదు. ఘంటసాలవారి కుటుంబమే తన కుటుంబం. ఆ ఇంట్లో ఇద్దరు కృష్ణులు. ఒకరు తమ్ముడు కృష్ణ. పిల్లలందరికీ గుండుమాఁవయ్య, బందరువాసి కొమరవోలు కృష్ణారావు.  వాళ్ళ సొంతవూరు బందరు గురించి ఎప్పుడూ చెప్పేవారు. ఊరు ప్రయాణాల్లో ఘంటసాలవారి పర్సెనల్ అసిస్టెంట్. మరొకరు మామయ్య కృష్ణ, సావిత్రమ్మగారి మేనమామ. కేరళ పాలక్కాడుతో సంబంధం ఉన్న వ్యక్తి. తమ్ముడు కృష్ణ సావిత్రమ్మగారిని, పాపగారిని అక్కయ్య అని పిలిచేవారు.  వాళ్ళ మధ్య ఏ రకమైనా పోలికలు వుండేవికావు. ఇదంతా, 35, ఉస్మాన్ రోడ్ ఇంట్లోని వ్యక్తుల గురించి ఏమాత్రం అవగాహన లేని రోజుల్లో నాలో మెసిలే ఆలోచనలు. 

తమ్ముడు కృష్ణ ఇంటిపనుల్లో చేదోడువాదోడుగా ఉండేవారు. సదాశివుడుగారు, మామయ్య కృష్ణ జివిఎస్ ప్రొడక్షన్స్ నిర్మాణ కార్యకలాపాలు చూసేవారు. ఉదయం తొమ్మిది గంటలు అయేసరికి ఆ ఇల్లంతా వచ్చేపోయే జనాలతో కలకలలాడూతూండేది. పామర్తిగారు, రాఘవులుగారు (మాస్టారి సహాయకులు), సుబ్బు (ప్రొడక్షన్ మేనేజర్), బి.హరినారాయణ, దేవేంద్ర (ఫిల్మ్ ఎడిటర్స్) తరుచూ కనిపించేవారు. ప్రొడక్షన్ ఆఫీస్ కూడా మేడమీదే కావడంవలన వీళ్ళంతా సాయంత్రం వరకూ అక్కడే వుండి ఆ వ్యవహారాల గురించి చర్చించుకునేవారు. షూటింగ్ రోజుల్లో లొకేషన్స్ కు వెళ్ళి ఏ రాత్రికో తిరిగి వచ్చేవారు. వీళ్ళే కాక సినీమాలలో పాటలు పాడే కోరస్ ఆర్టిస్ట్ లు, కొంతమంది టెక్నిషియన్స్ వస్తూండేవారు. వీళ్ళలో చాలామంది ఘంటసాలవారిని 'అయ్యగారూ' అని, సావిత్రమ్మగారిని 'అమ్మగారూ' అని పిలిచేవారు. దీనివల్ల నాకు ఒక క్లూ దొరికింది. అవసరమైనప్పుడు నేను కూడా అయ్యగారు, అమ్మగారు అని పిలవడం అలవాటు చేసుకున్నాను. వారిని ఎలా పిలవాలి అనే ప్రశ్నకు సమాధానం దొరకడంతో చాలా రిలీఫ్ గా అనిపించింది. 

అయ్యగారు సాధారణంగా ఉదయం ఎనిమిది గంటలకు రెడీ అయిపోయేవారు. ఈలోగా రాఘవులుగారు వచ్చేవారు. ఆయన, పామర్తిగారూ కూడా అయ్యగారు, అమ్మగారు అనే పిలిచేవారు. మా నాన్నగారు మాత్రం ఘంటసాలవారిని మాస్టారు అని పిలిచేవారు. ఆయన 'సంగీతబాబూ' అని సంబోధించేవారు. సావిత్రమ్మగారు, పాపగారు, మొదలైన వారంతా  'సంగీతం'గారు అని పిలిచేవారు.  మాస్టారితో కూడా తోడుగా రికార్డింగ్ లకు, రిహార్సల్స్ కు రాఘవులుగారు మాత్రమే వెళ్ళేవారు. మాస్టారి సంగీత దర్శకత్వం వహిస్తున్న సినీమాల కంపోజింగ్, రిహార్సల్స్, రికార్డింగ్, రీరికార్డింగ్ ల సమయంలో మాత్రమే మా నాన్నగారు, పామర్తిగారు, రాఘవులుగారు కలిసి పనిచేసేవారు. మిగతా సమయాలలో మాస్టారు  పిలిపిస్తేనే తప్ప మా నాన్నగారు వెళ్ళేవారు కాదు. మేముండే ఔట్ హౌస్ లోనే సంగీత సాధనలోనో, గ్రంధపఠనంలోనో, రచనా వ్యాసాంగంలోనో నిమగ్నమైవుండేవారు. ఆయనకు ఇతరుల విషయాల్లో అనవసర జోక్యం, హస్కు, గాలికబుర్లు అంటే ఇష్టముండేదికాదు. పిల్లలం మాకూ  కూడా తరవాత అదే అలవాటయింది. 

పామర్తిగారి సతీమణి రాజమ్మగారు (రాజ్యలక్ష్మి), వారి అమ్మాయి రావమ్మ (రామలక్ష్మి) తరుచూ మాస్టారింటికి వచ్చేవారు. చాలా చనువుగా వుండేవారు. ఆ అమ్మాయి సావిత్రమ్మగారిని, పాపగారిని అక్కయ్యా అని పిలిచేది. ఘంటసాలవారిని మావయ్యా అనేది. సదాశివుడిగారిని తాత అనేది. వారంతా ఒకరికొకరు బంధువులనుకునేవాడిని చాలా రోజులు. కానీ కాదు. పక్క పక్క గ్రామాలవారు. ఈ వరసలు నాకు వింతగావుండేవి. అక్కయ్య భర్త బావ అవుతారు. మావయ్య భార్య అత్త కదా! ఈ రకమైన చుట్టరికాలు నాకు కొత్త. అర్ధం చేసుకోవడానికి చాలాకాలమే పట్టింది. రావమ్మ నాకంటే కొంచెం పెద్దది. అప్పటి నా దృష్టిలో చాలా ధైర్యస్థురాలు. ప్రాథమికదశలో స్పోకెన్ తమిழ்కి నాకు కోచ్. అప్పట్లో పామర్తిగారి కుటుంబం జి.ఎన్.చెట్టి రోడ్ లో వాణీమహల్ దగ్గర నార్త్ క్రిసెంట్ రోడ్ లో వుండేవారు. సంగీత దర్శకుడు టి.చలపతిరావుగారు, దర్శకుడు టి. ప్రకాశరావుల ఇళ్ళుకూడా ఆ ప్రాంతమేనని గుర్తు. ఆ రోడ్ మీదే మరికొంచెం ముందుకు వెళితే ఎడమవేపు లక్ష్మీ కాలనీ. అందులో మాధవపెద్ది సత్యం, మాధవపెద్ది గోఖలే, పింగళి నాగేంద్రరావుగార్ల ఇళ్ళుండేవి. 

ఘంటసాలవారింటి పోర్టికోలో ఎప్పుడూ రెండు మూడు కార్లుండేవి. ఒకటి వాక్సాల్ కారు. ఒకటి ముదురాకుపచ్చ రంగులోని మారీస్ మైనర్. మూడవది నాష్  కారు. నలుపు రంగు కారు. పాతకాలం మోడల్. పెద్దదిగా సోఫాలాంటి సీట్లతో కుటుంబం అంతా ఒకేసారి వెళ్ళడానికి అనువుగా వుండేది. ఆ కారుకు రెండు పక్కలా ప్లాట్ ఫారమ్ లాటిది వుండేది. కిందకు దిగడానికి. కారు డిక్కీ కూడా విశాలంగా వుండేది. అయితే ఆ కారుకు స్టార్టింగ్ ట్రబుల్ . హేండిల్ వేసి స్టార్ట్ చేయడానికి  తెగ యాతన పడేవారు. ఆ కారును సుబ్బు (బి.సుబ్బారావు) అవసరానికి ఉపయోగించేవారు. మాస్టారు వాక్సాల్ కారులో వెళ్ళేవారు. డ్రైవర్ పేరు గోవిందు. అరవ తెలుగులో మాట్లాడేవాడు. 

ఆ నాష్ (Nash) కారు పెద్ద బాబుకు, నాకు ఆటస్థలం. అతను స్టీరింగ్ వీల్ ముందు కూర్చొని దాన్ని అటు యిటూ తిప్పుతూండేవాడు. నేను పక్కన కూర్చొని గట్టిగా అరుచుకుంటూ ఆడేవాళ్ళం. నాకు ఈ కార్లు పేర్లు కొన్ని తెలిసాయంటే దానికి కారణం పెద్దబాబే. ఇద్దరం వీధి గేటు బయట నిలబడి వచ్చేపోయే కార్లను చూస్తూండేవాళ్ళం. ఎక్కడో బజుల్లా రోడ్ దగ్గర కారుకు హారన్ వేస్తే ఆ కారు పేరు ఏమిటో చెప్పేసేవాడు. ఏ కారు హారన్ ఎలావుంటుందో చెప్పేవాడు. చాలావరకు నిజమే అయివుండేవి. అంతవరకూ నేను విన్న కారు పేరు ఫోర్డ్ మాత్రమే. బొబ్బిలి రాణీగారిది. ఈ ఉస్మాన్ రోడ్ ఇంటికి వచ్చాక పెద్దబాబు ద్వారా ప్లిమత్, డాడ్జ్, కాడిలాక్, ఆస్టిన్ ఇంగ్లాండ్, ఫియట్, మారీస్ మైనర్, ల్యాండ్ మాస్టర్ వంటి కొన్ని కార్ల పేర్లు తెలిసాయి. అలాగే, ఆకాశంలో ఎక్కడో ఎగిరే ఏరోప్లేన్ల గురించి కూడా వర్ణించేవాడు. వాళ్ళ నాన్నగారు ఏరోప్లేనులో ప్రయాణం చేసినప్పుడు ఆయనతోపాటూ ఏర్ పోర్ట్ దాకా వెళ్ళిన అనుభవం కావచ్చును. డకోటా అని, బోయింగ్ అని, జెట్ అని ఏవేవో పేర్లు చెప్పేవాడు. కనీకనిపించకుండా ఆకాశంలో ఎగిరే ఆ ప్లేన్ లు ఎక్కడినుండి ఎక్కడికి వెడుతున్నాయో కూడా వివరించి చెప్పేవాడు. అయితే ఆ మాటలు నిజంకావని అతని ఊహాగానం అని తరువాత తెలుసుకున్నాను. 

పెద్దబాబుకు పామర్తి గారి దగ్గర చాలా చనువుండేది. మావయ్యా అని పిలిచేవాడు. (నాకు ఈ వరస కూడా తికమకగానే వుండేది). ఆయన వచ్చినప్పుడల్లా కార్ల గురించే ఏవో ప్రశ్నలు వేసేవాడు. ఆయన కూడా మరింత ఉత్సహాంతో మౌంట్ రోడ్ ఖివ్ రాజ్ మోటార్స్ లో కొత్త మోడల్ కారు చూశానని అది బుక్ చేద్దామనుకుంటున్నాని అనేవారు. సావిత్రమ్మగారితో కూడా ఆ కొత్త కార్లు వాటి రేట్ల గురించి వివరించి చెప్పేవారు. 

ఒకరోజు నేనూ, పెద్దబాబు ఆ నాష్ కారులో కూర్చొని ఆటలు మొదలెట్టాము. కొంతసేపు అయ్యాక పెద్దబాబు ఇప్పుడే వస్తాను కూర్చోమని చెప్పి కారు దిగి కారు డోర్ గట్టిగా మూసి లోపలకు వెళ్ళాడు. ఆ అదురుకి ఈ కారు సడన్ గా 'బొయ్'మని హారన్  మ్రోగడం మొదలెట్టింది. నాకు కంగారు పుట్టింది. ఆ హారన్ ఎలా ఆపాలో ఏమిటో ! ఎక్కడ ఏమయిందో తెలీదు. ఆ సౌండ్ కు ఇంట్లోవారంతా బయటకు వచ్చేసారు. ఈలోగా సుబ్బు వచ్చి ఏవో రెండు వైర్లను విడదీయడంతో హారన్ మ్రోగడం ఆగింది. పెద్దవాళ్ళెవరూ లేకుండా కారులో ఆడకూడదని, కారు గేర్ సరిగాలేకపోతే ముందుకెళ్ళి దేన్నైనా గుద్దేస్తుందని మందలించారు. నాకు అవమానంగా తోచింది. నేనుగా ఆ కారు ఎక్కలేదని, అంతవరకు పెద్దబాబు కూడా అక్కడే ఉన్నాడని చెప్పలేకపోయాను. అలా చెపితే అతనిమీద పితూరీలు చెప్పినట్లవుతుందని నా భావన. పిల్లల్లో complaining nature వుండకూడదని, సద్దుకుపోయే స్వభావం వుండాలని మా నాన్నగారు చేసే హితబోధలవలన నేను నోరు మెదపలేదు. ఆ సంఘటన జరిగాక నేను అక్కడున్న ఏ కారువైపుకి తిరిగి చూడలేదు. పెద్దవాళ్ళెవరైనా పిల్చి కారు ఎక్కమనేదాకా ఎక్కేవాడిని కాదు. 

తర్వాత, మా ఆట స్థలం  మేడమీదికి మారింది. అక్కడ ఒక గదిలో బోల్డెన్ని రంగు రంగుల చమ్కీల ముఖమల్, సాటీన్ బట్టలు పడివుండేవి. అవన్నీ సినీమాలో ఉపయోగించడానికని చెప్పాడు.  ఆ రంగు రంగుల బట్టలు సినీమాలలో తెలుపు, నలుపు రంగులలోనే ఎందుకు కనిపించేవో తెలిసేది కాదు. అక్కడే ఒక తోరణానికి ఒక పెద్ద గంట వేలాడుతూండేది. ఆ తోరణానికి క్రింద 'GVS PRODUCTIONS' అని ఇంగ్లీష్ లో రాసివుండేది. గుడిగంటలా కనపడే ఆ పెద్ద గంటను మ్రోగించి చూసాను. దేవాలయం గంటలా మ్రోగనేలేదు. 'డబ్ డబ్ డబ్' మనేది. నాకు చాలా విచిత్రమనిపించింది. అక్కడే కొన్ని ఫోటో ఆల్బంలు వుండేవి. అందులో ఎన్.టి.రామారావు, జానకి, రాజసులోచన, సిఎస్ఆర్, మొదలైనవారి ఫోటోలుండేవి. 

అప్పట్లో 'సొంతవూరు' సినీమా నిర్మాణంలో వుంది. ఈ సినీమాను ఘంటసాల వారే నిర్మించారు. ఇది వారి రెండవ చిత్రం. మొదటి చిత్రం 'పరోపకారం'. 

ఈ సొంతవూరు  సినీమాలోని 'మనవూరే భారతదేశం మనమంతా భారతీయులం' పాట రికార్డింగ్ కు వెళ్ళాను. మాస్టారు పాడిన ఈ కోరస్ పాటలో  రావూరి వీరభద్రం కూడా కోరస్ పాడారు. భద్రంగారు కూడా విజయనగరం మ్యూజిక్ కాలేజీలో మా తాతగారి దగ్గరే సంగీతం నేర్చుకున్నారు. 


తాతగారితో ఆర్.వి. భద్రం ఇతర శిష్యులు

పైనున్నగ్రూప్ ఫోటోలో తాతగారికి ఎడమవైపు కింద కూర్చునున్నాయన. సినిమాలలో పాటలు పాడాలని మద్రాస్ వచ్చి  పాపం చాలా అవస్థలే పడ్డారు. కొన్నాళ్ళు కోరస్ లు పాడాక, గాయకుడిగా మనుగడ సాగించడం కష్టమని గ్రహించి ఘంటసాలవారి సలహాతో వైలిన్ సాధన ప్రారంభించి ఎట్టకేలకు ఘంటసాల ఆర్కెష్ట్రా లో స్థానం సంపాదించారు. సొంతవూరు సినీమా పాటల రికార్డ్ లు 78 RPM నల్లటి రికార్డులు కావు. నేను చూసినప్పుడు అవి తెల్లగా చిన్నవిగా వుండేవి. అవి వినైల్ రికార్డ్ లని బాబూ వాళ్ళమ్మగారు చెప్పారు. ఈ సినిమా పాటలు ఎందుకనో HMVకి గాని, కొలంబియాకు గాని ఇవ్వలేదు. వేరెవరో రిలీజ్ చేశారు. 
                        


ఎన్ టి రామారావు శ్రీకృష్ణుడి వేషంలో మొట్టమొదటిసారిగా తెరపైన కనిపించింది ఈ సొంతవూరు చిత్రంలోనే ఒక (డ్రీమ్ సాంగ్ కావచ్చును. గుర్తులేదు). నటి రాజసులోచనకు తెలుగులో హీరోయిన్ అంతస్తు కల్పించినది కూడా ఈ సొంతవూరు చిత్రమేనని అనుకునేవారు.



1956 వేసవి శెలవులు తర్వాత నన్ను పనగల్ పార్క్ ఎదురుగా పాండీబజార్ రోడ్ దగ్గర రామకృష్ణ మిషన్ హైస్కూల్ మెయిన్ బ్రాంచ్ లో 8 వ తరగతిలో చేర్పించారు.

ఆ విశేషాలన్నీ..... వచ్చేవారం... 
...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.


Friday, November 13, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఆరవ భాగం

13.11.2020 - శుక్రవారం భాగం - 6*:
అధ్యాయం 2  భాగం 5 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్


బుద్ధి, మనసు పరస్పరం విరుద్ధం. బుద్ధి చెప్పినది మనసుకెక్కదు. మనసులోని మాట బుద్ధికెక్కదు.

ఈ ఉపోద్ఘాతం ఎందుకంటారా?! 

జీవనక్రమంలో నెం. 35, ఉస్మాన్ రోడ్ ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్ళడమా, పండుగ సీజన్ కనుక ఆఇంట్లో జరుపుకున్న పండుగ ముచ్చట్లను ముందుగానే  పంచుకోడమా? అంటే మనసు పండుగలవేపే మొగ్గుతోంది. 

నెం.35, ఉస్మాన్ రోడ్ దీపావళి గురించి ముచ్చటించే ముందు, దానికి ముందుగా వచ్చే దసరా నవరాత్రుల గురించి కూడా చెప్పవలసి వస్తుంది. 

బాబూ వాళ్ళమ్మగారు (ఘంటసాల సావిత్రమ్మగారు) దసరా నవరాత్రుల సందర్భంగా తొమ్మిదిరోజులపాటు బొమ్మలకొలువు చాలా గ్రాండ్ చేసేవారు. మేము ఆ ఇంటి ఔట్ హౌస్ లోకి వెళ్ళాక వరసగా నాలుగైదు సంవత్సరాలు బొమ్మల కొలువులు పెట్టిన గుర్తు. ఘంటసాలవారింటి హాలు చాలా విశాలమైనది. దక్షిణం వేపు గోడను ఆనుకొని ఐదు వరసల మెట్లమీద రంగురంగుల దేవతా విగ్రహాలను, పెద్దా, చిన్నా  రకరకాల బొమ్మలను అలంకరించేవారు. అలాగే, నేలమీద దట్టంగా ఇసకపోసి, చదునుచేసి ముందువేపు మెడ్రాస్ మౌంట్ రోడ్, కాసినో, గెయిటీ వంటి సినిమా హాల్స్ నమూనాలు, జి.ఎన్ చెట్టి రోడ్ లోని కొన్ని భవంతుల నమూనాలు, వీధి దీపాల స్థంభాలు, పార్కులలో చెట్లు, మొక్కలు, మినియేచర్ కుర్చీలు, బెంచీలు, వాటిమీద కూర్చుని ఉన్న మనుషులు, ప్లాస్టిక్ కార్లు, సైకిళ్ళు, సైకిల్ రిక్షాలు, రంగురంగుల సీసపు బడ్లు, తోరణాలు. వెనకవేపు పొలాలు, పల్లెటూళ్ళు, కొండపైన ఆలయాలు, అక్కడికి వెళ్ళడానికి రహదార్లు ఉండేవి. Concealed wiringతో series lighting వంటి వ్యవహారమంతా బాబూవాళ్ళ అమ్మగారు, పిన్నిగారి సలహాలు సూచనలమేరకు సుబ్బు ఏర్పాటుచేసేవారు. సుబ్బు అనబడే బి.సుబ్బారావు ఘంటసాలవారి జివిఎస్ ప్రొడక్షన్స్ లో ప్రొడక్షన్ మేనేజర్. ఘంటసాలవారి కుటుంబంలోని వ్యక్తిగా మెసిలేవారు. సావిత్రమ్మగారి అన్నగారి పేరు కూడా సుబ్బారావే. ఆయన అందరికీ సుబ్బారావు అన్నయ్య, పిల్లలకి మాఁవయ్య. ఈయన సుబ్బు. 

పొలాలను పండించడానికి ఒక వారగా ఏర్పాటు చేసిన మట్టిలో ఆవాలు, మెంతులు, ధనియాలు జల్లి వాటిమీద నీరు జల్లి వుంచితే రెండురోజుల్లో పంట పొలాలు తయారయేవి. అటకలమీదవుండే ఈ బొమ్మలను పెట్టెల్లోంచి దింపి వాటిని తుడవడంలో, కొలువులైపోయాక తిరిగి పెట్టెల్లో సద్దడంలో, పల్లెటూరు, పట్టణం మోడల్స్ తయారు చేయడానికి కావలసిన ఇసకను సేకరించడంలోనూ నా వయసుకు తగిన సాయం నేను చేసేవాడిని. మా ఇంటికి ఎదురుగా చాలా దగ్గరలోనే  సొమసుందరం స్ట్రీట్ లో పెద్ద కార్పరేషన్ గ్రౌండ్ వుంది. అక్కడ కబాడీ ఆడ్డానికి, ఉయ్యాళ్ళు ఊగే దగ్గర కావలసినంత ఇసక ఉండేది. ఆ ఇసకను తీసుకురావడానికి నేను, పెద్దబాబు (విజయకుమార్), తమ్ముడు కృష్ణ గోనె సంచులు పట్టుకెళ్ళి మోయగలిగినంత ఇసకను తెచ్చేవాళ్ళం. అలాగే, నవరాత్రి కొలువులు పూర్తి అయిపోయాక ఆ ఇసకనంతా తిరిగి ఆ కార్పరేషన్ గ్రౌండ్ లో తెచ్చిన చోటనే పోసేసి వచ్చేవాళ్ళం. ఆ కండిషన్ కు ఒప్పుకుంటేనే  ఆ మట్టిని తీసుకురావడానికి బాబూవాళ్ళ నాన్నగారు (ఘంటసాలగారు) ఒప్పుకునేవారు. ఈ బొమ్మలకొలువు తీర్చిదిద్దే వ్యవహారమంతా ఘంటసాలవారు ఇంటిలో లేనప్పుడు, లేదా రాత్రి అందరూ పడుకున్న తరువాత ప్రారంభించేవాళ్ళం. ఇలాటి నవరాత్రుల సమయంలోనే ఒకసారి, అదే మొదటిసారి కూడా, సోమసుందరం స్ట్రీట్ ప్లే గ్రౌండ్ లో ఆ ఇసకలో కొంతమంది ఫైట్ చేసుకోవడం చూసాను. అయితే అవి నిజమైన ఫైట్లుకావు. సినీమా ఫైట్లు. కొంతమంది స్టంట్ ఆర్టిస్ట్ లు ఫైట్స్ కంపోజ్ చేస్తూ ప్రాక్టీస్ చెసేవారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని గాలిలో పల్టీలు కొట్టడం, ఒంటిమీద చేయిపడకుండా పిడికెళ్ళతో గుద్దుకోవడం, ఒకళ్ళనొకళ్ళు తోసుకోవడం చూడ్డానికి చాలా సరదగా వుండేది.  ఆడుకోవడానికి గ్రౌండ్ కు వచ్చే చిన్నపిల్లలంతా ఆసక్తిగా చూసి ఆనందించేవారు. తరువాత, వాళ్ళూ అలాగే కొట్టుకునేవాళ్ళు. మరొక రోజు ఒక వస్తాదు లాటి వ్యక్తి కూడా అక్కడికి వచ్చి ఈ రకమైన ఫైటర్స్ అందరికీ ఏవో  సలహాలు చెపుతూ తానూ చేసి చూపించాడు. బాగా వయసైన మనిషే. ఆయన పేరు చక్రపాణి అని, MGR కు అన్నగారని చెప్పుకోవడం విన్నాను. అలాటి వీరుల క్రీడా స్థలంలోని మట్టిని మా ఇంటి బొమ్మలకొలువులో ఉపయోగించేవాళ్ళము.  

ఘంటసాలవారింటి దసరా నవరాత్రుల కొలువులు చూచేందుకు ప్రతీరోజు చాలామంది సినీమా కుటుంబాలకు చెందిన ఆడవాళ్లు, పిల్లలు వచ్చేవారు. నేను మొదటిసారిగా గిరిజ అనే సినీమా నటిని చూసింది సావిత్రమ్మగారి బొమ్మలకొలువులోనే. చూడ్డానికి చాలా తెల్లగా నొక్కుల జుత్తుతో, చెవులకు ఎర్రపొడులున్న  చిన్న రింగులతో  చాలా అందంగా  తెల్లటి చీరలో స్లిమ్ గా కనిపించేరు. నాకు తెలియనివాళ్ళెందరో వచ్చేవారు. భానుమతి, జమునగార్ల ఇళ్ళలో కూడా బొమ్మలకొలువు సంబరాలు బాగానే జరిగేవని చెప్పుకునేవారు. భానుమతిగారంటే   సావిత్రమ్మగారికి చాలా ఇష్టం. అవకాశమున్నప్పుడు వెళ్ళి ఆవిడను చూసేవారు. ఈ నవరాత్రుల బొమ్మల కొలువు పేరంటాళ్ళు వచ్చే సమయంలో ఇంట ఘంటసాలవారు వుండేవారుకారు. వచ్చిన ఆడవాళ్ళంతా వెళ్ళాక ఏ ఎనిమిదింటికో ఇంటికి చేరేవారు. 

బొమ్మలకొలువు పేరంటాళ్ళు వచ్చేప్పుడు పామర్తిగారి పెద్దమ్మాయి రావమ్మ (రామలక్ష్మి), సావిత్రమ్మగారి అక్క కుమార్తె ఝాన్సీ చాలా చురుకుగా పాల్గొనేవారు. వాళ్ళు అట్నుండొకసారి, ఇట్నుండొకసారి తిరుగాడుతూ పేరంటాళ్ళకోసం వుంచిన శెనగలు, వక్కలు ఒక్కొక్కటిగా ఎవరూ చూడకుండా నోట్లో వేసుకోవడం నాకు వింతగాను, భయంగానూ వుండేది, ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తే తిడతారేమోనని. కానీ, వాళ్ళకు ఆ భయం వుండేదికాదు. చాలా సహజంగా, చొరవగా తీసుకోవడమే కాక  రావమ్మ నా చేతిలో కూడా  కొంచెం శనగ్గింజలు, వక్కపొడి పెట్టేది. నాకు అప్పటినుండే వక్కపొడి నమలడం ప్రారంభమయింది. నాకు మరే అలవాటు లేకపోయినా, అందుబాటులో వుంటే ఇప్పటికీ వక్కపొడి నమిలే అలవాటుంది. మెడ్రాస్ లో 'అశోకా' వక్కపొడి 'సవరిన్' వక్కపొడి చిన్న చిన్న పేకట్లలో దేవాలయాల దగ్గర, తామలపాకుల దుకాణాలలో, కిరాణా కొట్లలో అమ్మేవారు. ఒక్కొక్క పొట్లం మూడు నయాపైసలుండేది. పెళ్ళిళ్ళలో, పేరంటాలలో తాంబూలం పేకట్లలో పెట్టడానికి ఈ వక్కపొడి పొట్లాలు తప్పనిసరిగా ఉపయోగించేవారు. 

నాకు వక్కపొడి కొంత అలవాటు కావడానికి కారణమైన మరొక వ్యక్తి మా దొడ్డమ్మగారు, చెళ్ళపిళ్ళ వరహాలమ్మ. భోజనం చేసే సమయం , నిద్రపోయే సమయంలో తప్ప మిగిలిన కాలమంతా ఆవిడ నోట్లో పోకచెక్కలు నానుతూనేవుండేవి. ఆవిడ చీరకొంగుముడిని ఎప్పడూ ఆ చెక్కలుండేవి. వాటిని ఉప్పుచెక్కలనేవారు. మా ప్రాంతాల్లో ఈ వక్కలు రెండు రకాలుగా తూకంవేసి అమ్మేవారు. పోకచెక్కలు. పీటి వక్కలు. 

  

మొదటిరకం రూపాయి నాణెంలా తెలుపు, ఎరుపు చారలతో వుంటాయి. మద్రాసులోను, తమిళనాట ఈ పోక్కాయల చెక్కునే సీవల్ గా అమ్ముతుంటారు. సన్నపొరలాగ సీవల్ చెక్కడానికి ప్రత్యేకమైన కత్తెరలాంటి సాధనాలువాడతారు.వీటిని అడకత్తెరలు అంటారు.

  


రెండవ రకంగా నల్లగా చిన్నవిగా పిక్కల్లా ఉంటాయి. 


ఆరోజుల్లో మద్రాసు తాంబూలసేవనకి, ఎక్కడపడితే అక్కడ, ముఖ్యంగా సినిమా థియేటర్లలో, ఎఱ్ఱటి ఉమ్ముల మరకలకి ప్రసిద్ధి. 

తమిళనాట వెత్తలె పాక్కు ప్రసిద్ధి

ఆ అలవాటు మితిమీరి చివరకి ప్రభుత్వం వక్కపొడుల అమ్మకంమీద ఆంక్షలు విధించే దాకా వెళ్ళింది. ఆఖరికి 'సవరిన్' 'అశోకా' వక్కపొడి కంపెనీలూ మూతపడ్డాయి. ప్రస్తుతం ఇంకా వాడుకలో త్రివేణి, క్రేన్, రత్నం వక్కపొడులు ప్రసిద్ధంగానే ఉన్నాయి. తమిళనాడులో 'రోజా' వక్కపొడి 'నిజాం పాక్కు' వాడకంలో వున్నాయి. పండగలు, పబ్బాలు, పూజలు, వ్రతాలు అంటే ఆకు వక్క తప్పనిసరి.

తమిళనాడు లో అత్యంత వైభవంగా జరుపుకునే పండగలు రెండే రెండు ఒకటి జనవరి లో వచ్చే పొంగల్; మరొకటి అక్టోబర్/నవంబర్ నెలలో వచ్చే దీపావళి. ఈ రెండు పండగల తర్వాతే మిగిలిన పండగలన్నీ. ఈ రెండు పండగలను అన్ని వర్గాలవారు ధనికులు, బీదలు అనే తేడా లేకుండా తమకున్నంతలో ఘనంగా జరుపుకుంటారు. తమిళనాడులో దీపావళీ అమావాస్యకన్నా నరకచతుర్దశికే ప్రాముఖ్యత. 

తెల్లవారుజామున లేచి స్నానాలు ముగించుకొని నూతన వస్త్రాలు ధరించి సూర్యోదయం అయేవరకు బాణసంచా కాల్చడం పరిపాటి. వారికి  దీపావళి వెలుగులకన్నా శబ్దంలోనే ఆనందం. సీమ టపాకాయలు మొదలు బాంబుల వరకు ధ్వని ప్రధానమైన  బాణసంచామీదనే వందలు, వేల రూపాయలు ఖర్చుపెడతారు. ఆ శబ్దకాలుష్యాన్ని ఆనందించాక విందులు, వినోదాలు, దీపావళికి విడుదలైన సినిమాలకి  కుటుంబ సమేతంగా వెళ్ళి మళ్ళీ ఏ రాత్రికో ఇళ్ళకు చేరుతారు. మన తెలుగువారిలా అమావాస్య రోజు రాత్రి దీపాల పండగ జరపరు. 
దీపాలంకరణ వుండదు. కార్తీక పౌర్ణమి రోజున రాత్రిపూట దివ్వెలు వెలిగించి   దేవాలయ పుష్కరిణి జలాలలో వదులుతారు. తమ ఇళ్ళలో ఆచారాన్ని పాటిస్తూ సంప్రదాయబధ్ధంగా దీపాలను వెలిగిస్తారు. అందుచేత దీపావళి అమావాస్య కళ ఆనాటి రాత్రి పెద్దగా కనపడదు. అసలు సిసలు తెలుగువారున్న ప్రాంతాలలోమాత్రం కొంతమంది అమావాస్య నాటి రాత్రి తమ ఇళ్ళముందు దీపాలు పెట్టి బాణసంచా వెలిగిస్తారు.

నెం.35,ఉస్మాన్ రోడ్ లో మాత్రం దీపావళి అమావాస్య చాలా వైభవంగా కళకళలాడుతూ జరిగేది. ఎన్ని వేల రూపాయలకు టపాకాయలు కాల్చారన్నది ముఖ్యం కాదు. దీపావళి రోజున భవనం మొత్తం ప్రమిద దీపాలతో  ఆ ఇంట దీపలక్ష్మి తాండవించేది. నా చిన్నతనంలో ఘంటసాల మాస్టారికి కానీ, ఇంట్లోవారికి కానీ శబ్దాలతో కూడిన బాణసంచా అంటే ఇష్టముండేదికాదు. వెలుగులు చిమ్మే బాణ సంచానే కొనేవారు.
అలాటి క్రేకర్సన్నీ పాండీబజార్ లో , రంగనాధన్ స్ట్రీట్ మార్కెట్లో చాలా విరివిగానే దొరికేవి. కానీ ప్యారీస్ కార్నర్ గొడౌన్ స్ట్రీట్, బందర్ స్ట్రీట్ వంటి ప్రాంతాల్లో హోల్ సేల్ మార్కెట్లలో ఎక్కువ వెరైటీలు దొరుకుతాయని అలాటి చోట్ల క్రేకర్స్ కొనడానికి ఘంటసాలగారు ఉత్సాహం చూపేవారు.

ఈ విషయాలన్నీ 1962 కు ముందు సంగతులు.

ఒక ఏడాది దీపావళికి ఓ మూడు రోజుల ముందు క్రేకర్స్ కొనడానికి ఘంటసాలగారు నన్ను వెంటబెట్టుకువెళ్ళారు. నేను, ఆయన మాత్రమే కారులో వెళ్ళాము. సాధారణంగానే మెడ్రాస్ లో దీపావళికి సమయంలో కొద్దో గొప్పో వానలు పడడం ఆనవాయితి. మేము ఉదయం పది గంటల ప్రాంతంలో బయల్దేరాము. వాతావరణం మబ్బులు కమ్మివుంది. గేటులోనుండి కారు బయటకు వచ్చాక, ఘంటసాలవారు డ్రైవర్ గోవింద్ తో "అణ్ణామలైపురం కెనాల్ రోడ్ ప్రొడ్యూసర్ ఆఫీసుకు పోడా" అని అన్నారు. ఇదేమిటి మందుగుండు సామాను కొందాము రమ్మని, వేరేదో చోటుకు వెళ్ళమంటున్నారే! అయితే ఈవేళ క్రాకర్స్ కొనడానికి వెళ్ళడం లేదేమో అని అనుకుంటుండగా, నా ఉద్దేశం గ్రహించినట్లుగా "నాయనా! ముందు ఆ పని చూసుకొని తరువాత, జార్జ్ టౌన్ వెళదాం" అని అన్నారు. నేను తల ఊపాను. కారు రాజా అణ్ణామలైపురంలో కెనాల్ రోడ్ లో చివరగా కుడిచేతి వేపు ఒక ఇంటిముందు ఆగింది. ఎడమవేపు కెనాల్. "నాయనా! నువ్వు కారులో కూర్చో. ఓ పది నిముషాలలో వస్తాను" అని చెప్పి కారు దిగి లోపలకు వెళ్ళారు. నేను కూడా క్రిందికి దిగి ఆ ప్రాంతాన్ని చూస్తున్నాను. ఒక ఐదు నిముషాల తరువాత అక్కడికి ఒక వాక్సాల్ కారు వచ్చి ఆగింది. అందులోనుండి ఒకావిడ క్రిందికి దిగింది. ఆవిడే ఆ కారును డ్రైవ్ చేస్తూ వచ్చారు. అది నాకెంతో ఆశ్చర్యం. ఎంత గొప్పావిడో, ఎంత తెలివైనదో అని అనుకున్నాను. కారు డ్రైవ్ చేయడానికి తెలివితేటలుండాలో అఖ్ఖరలేదో నాకు తెలియదు. ఆవిడ లోపలకు వెడుతూంటే మాస్టారు బయటకు వచ్చారు. ఆ వచ్చినావిడ ఘంటసాలవారి కి వినయంగా నమస్కారం పెట్టింది. "ఏమ్మా! బాగున్నారా" అంటూ పలకరించారు. ఆవిడ తలూపుతూ లోపలికి వెళ్ళింది. మేము మళ్ళీ కారులో ప్యారీస్ వేపుకి బయల్దేరాం. కారులో కూర్చొని బయట వింతలన్నీ చూస్తూవున్నా, నా బుర్రలో ఆ ఆడమనిషి గురించే ఆలోచిస్తున్నాను. ఆవిడను ఎక్కడో చూశాను. ఎవరో గుర్తు రావడం లేదు. కొంతదూరం వెళ్ళాక ఈ పోలికలున్న అమ్మాయి శభాష్ రాముడు సినీమా లో రమణమూర్తికి జోడీగా పార్క్ లో డ్యూయెట్ పాడింది. ఆ! గుర్తుకు వచ్చింది. కుసుమ కుమారి. తమిళంలో శివాజీ గణేశన్ తో శభాష్ మీనాలో నటించిన మాలిని. తెలుగులో సంతానం వంటి ఓ నాలుగు సినీమాలలో నటించింది. బావామరదళ్ళు సినీమాలో కూడా రమణమూర్తితో నటిస్తున్నట్లు పత్రికలలో చూశాను. (ఒక ఆరేళ్ళ వ్యవధిలో ఓ డజన్ సినీమాలలో నటించి ఎవరో తమిళ డైరక్టర్ ను పెళ్ళిచేసుకొని సినీమాలకు గుడ్ బై చెప్పేసిందని వార్త.)

ఆ ఆలోచన ముగియగానే మరో ఆలోచన. అయితే ఘంటసాలవారు వెళ్ళిన సినీమా కంపెనీ ఎవరిదని. తరువాత, తెలిసింది అది బావామరదళ్ళు సినిమా తీస్తున్న నిర్మాత ఆఫీసని. పాడిన పాటల  రెమ్యునరేషన్ కోసం ఘంటసాలగారు ఆ ఆఫీసుకు వెళ్ళారని. సాధారణంగా ఈ పనులు నరసింగడికి అప్పగిస్తారు. అతనివల్ల సాధ్యం కాకపోతే ఆయనే వెళ్ళేవారు. 

కారు ఫ్లవర్ బజార్ పోలిస్ స్టేషన్ ప్రాంతాలకు వచ్చాక ఒక వారగా గోవిందు బండిని ఆపాడు. అప్పటికే ఒక పెద్ద జల్లుపడి వెలిసింది. రోడ్లన్నీ బురద బురదగా వున్నాయి. అలాగే, ఆ లోపలి గౌడౌన్ స్ట్రీట్ , మింట్ స్ట్రీట్ ల్లోని క్రేకర్స్  షాపులన్నీ చూస్తూ ఎక్కడెక్కడ ఏ ఏ రకాలున్నాయో చూసుకుంటూ వెళ్ళాము.  ఘంటసాలవారి ముఖం గుర్తుపట్టిన కొంతమంది మంది వచ్చి నమస్కారం చేసి పలకరించారు. వారికి నవ్వుతూనే నమస్కారం చేస్తూ ముందుకు సాగారు. అక్కడ ఓ అరగంట గడిపాక ఒక పెద్ద షాపులో మాకు కావలసిన క్రేకర్స్ కొనుగోలు చేసాము. ఈ బాణసంచా కొనడానికి వెళుతున్నానని తెలిసి మా అమ్మగారు నాకు కొంత డబ్బు ఇచ్చారు. ఆ డబ్బులోనే నాకిష్టమైన క్రేకర్స్ కొనుకున్నాను. ఇద్దరికీ కలిపి చాలా క్రేకర్సే వచ్చాయి. మేమిద్దరం కలిపి కొన్న వస్తువుల ఖరీదు చెప్పితే మీరు ఆశ్చర్యపోతారు. వాటన్నిటి వెల అంతా కలిపి తొంభై రూపాయలే. నేను కొన్నవి పదిహేను రూపాయలకు. (ఈనాడు ఆ డబ్బులకి ఏవో రెండు వస్తువులు వస్తాయేమో. క్రేకర్స్ కొనడం మానేసి నాలుగు దశాబ్దాలయింది. కారణం. క్రేకర్స్ పొగ పడక. అవి కాల్చడంలోని ఆసక్తి ఎప్పుడో పోయింది.)

ఇక దీపావళీ ఉదయం నుండీ హడావుడే. తలంటు స్నానాలు, ఉన్నంతలో పిండివంటల తయారీలలో ఇంట్లోని ఆడవారంతా తలమునకలై వుండేవారు. బాబూ వాళ్ళమ్మగారు ముందురోజే దాచివుంచిన ప్రమిదలన్నింటినీ నీట్లో నానబెట్టి ఆరబెట్టించేవారు. ఇల్లంతా దీపాలు అలంకరించడమంటే మాటలా! నాలుగు ప్రహారీ గోడలు, పోర్టికోలో, బాల్కనీలో డాబామీది గోడలు అన్నింటినీ నూనె దీపాల ప్రమిదలు సిధ్ధం చేసేవాళ్ళం. చీకటి పడడం ఆరంభం కాగానే  సావిత్రమ్మగారు ప్రమిదల్లోని దీపాలు వెలిగించడం మొదలెట్టేవారు. వెనకాల ఔట్ హౌస్ వాకిట్లో కూడా మా అమ్మగారు దీపాలు వెలిగించేవారు. ఆనాటికి  ఘంటసాలవారింట్లో దీపావళి సెలబ్రేట్ చేసే పిల్లలం ముగ్గురం  మాత్రమే. మరో ముగ్గురు నలుగురున్నా వాళ్ళంతా మరీ చిన్నవాళ్ళు. అందుచేత కొన్న క్రేకర్సన్నీ  కాల్చేది నేనూ, పెద్దబాబే. మా బొబ్బిలి, విజయనగరంలో లాగా బాణా సంచా కాల్చడానికి ముందు 'దిబ్బు దిబ్బు దీపావళీ' కొట్టడానికి ఆముదం కొమ్మలు దొరికేవికావు. అందుకోసం బొప్పాయిచెట్టు కొమ్మలు కోసి ఆ ఆకులకు నూనెగుడ్డలు కట్టి వాటిని ముట్టించి వాటితో లాంఛనప్రాయంగా దీపావళీ బాణసంచా కాల్చడం చెసేవాళ్ళం. ఘంటసాలవారితో సహా వారింట్లోని కుటుంబసభ్యులు, ఇతర మిత్రబృందమంతా కూడా చాలా సరదాగా ఈ దీపావళి సంబరాల్లో పాల్గొనేవారు. మా పక్కింటిలోని పిల్లలు కూడా వచ్చి మాతో క్రేకర్స్ కాల్చేవారు. మేము చైనా బజార్లో కొన్న బాణసంచా రాత్రి తొమ్మిది గంటలవరకూ సరిపోయేవి. ఈలోగా గాలికి ప్రమిదలు ఆరిపోకుండా ఆరారగా నూనెపోస్తూవుండడం ఒక పెద్దపని.  నూనె దీపాలు వెలుగుతున్నంతసేపు ఇంట్లోని కరెంట్ దీపాలన్నీ ఆర్పేసి వుంచేవారు. నెం.35, ఉస్మాన్ రోడ్ లోని ఈ నూనె దీపాలకాంతి రోడ్ మీద చాలా దూరంవరకు ఆకర్షణీయంగా కనపడేది. మొత్తం మీద మా నార్త్ ఉస్మాన్ రోడ్ లో ప్రమిద దీపాలతో దీపావళి అమావాస్యను వైభవంగా జరిపేది ఒక్క ఘంటసాలవారింట్లోనే. 

మరొక ఏడాది దీపావళికి ఇంట్లోనే మతాబాలు, చిచ్చుబుడ్లు తయారు చేస్తే ఎలావుంటుందనే సంకల్పం నాకూ, నరసింగకు కలిగింది. మేమిద్దరం ఒకే జిల్లాకు చెందినవాళ్ళం కావడాన మతాబులు , చిచ్చుబుడ్లు తయారు చేయడానికి కావలసిన సరంజామా ఏమిటో బాగా తెలుసు. అయితే ఆ  ముడి వస్తువులు  దొరికే స్థలాలను కనిపెట్టడం చాలా కష్టమయింది. కోడంబాక్కం హైరోడ్ మీద కొన్ని కుండలు, మట్టివస్తువులు దొరికే కొట్లుండేవి. వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఖాళీ చిచ్చుబుడ్లు కోసం ఆర్డర్ ఇస్తే వాళ్ళు రెండు మూడురోజుల తర్వాత రమ్మనేవారు. ఈలోగా మళ్ళీ జార్జ్ టౌన్ ఇరుకు సందుల్లో తిరిగి సురేకారం, గంధకం, అల్యుమినియం బీడు (రజన్) మొదలైనవన్నీ కొని వాటిని కల్వాలలో నూరి  మతాబులకి, చిచ్చుబుడ్లకి కావలసిన పాళ్ళు రెడీ చేసి, ఖాళీ చిచ్చుబుడ్లకి వెళితే వాడు కన్నాలు లేని బుడ్లు చేసిచ్చాడు. ఆ బుడ్లు పగిలిపోకుండా జాగ్రత్తగా వాటికి కన్నాలు పెట్టించడానికి మరొకరోజు ఆలస్యం. సొంత దీపావళి మీద ఆసక్తితో రాత్రింపగళ్ళు కష్టపడి నేను, నరసింగ అనుకున్నవాటిని  సమయానికి సిధ్ధం చేశాము. వీటితో పాటు మరికొంత బాణసంచాను బజార్లో కొన్నాము. యధాప్రకారం భవనమంతా దీపాలు వెలిగించి క్రేకర్స్ వెలిగించడం మొదలెట్టాము. మా ప్రతిష్టాత్మక చిచ్చుబుడ్లు , మతాబాలు మమ్మలిని చీదరపెట్టాయి. చిచ్చుబుడ్లలోంచి పొగతప్ప పువ్వులు రాలేదు. మతాబాలు అంతే పొగతోపాటు గెడ్డలుకట్టిన నిప్పురవ్వలే రాలేయి తప్ప తెల్లటి పువ్వులు రాలేదు. మా ఆపరేషన్ ఫెల్యూరుకి పరిశోధన మొదలెట్టాక తేలిందేమిటంటే  మేము కలపిన మతాబా పాళ్ళలో ఆముదం పాలు అనుకున్నదానికంటే ఎక్కువ పడింది. అందుకే తెల్లటిపువ్వులు రాలలేదని, వచ్చే సంవత్సరం ఈ లోటును సరిచేయాలని సరిపుచ్చుకున్నాము. అంతమాత్రాన దీపావళి ఏమీ ఆగిపోలేదు. మిగతా ఐటెమ్స్ తో గ్రాండ్ గానే జరిగింది. ఆ పై సంవత్సరం దీపావళి కి కూడా సొంత తయారీ మొదలెట్టాము. ఆదిలోనే హంసపాదు ఆ ఏడాది అల్యూమినియం రజన్ ఎక్కడా దొరకలేదు. ఎవరో మహానుభావుడు సలహా ఇచ్చాడు అల్యూమినియం పాత్రలు తయారు చేసే చోట్లకు వెళితే రజన్ దొరుకుతుందని. కానీ మాకు కావలసిన రజన్ దొరకలేదు. వాడు కొంచెం ముతకగా వున్న అల్యూమినియం పొడి మాకు అంటగట్టాడు. దానిని తెచ్చి కల్వంలో ఎన్నిగంటలు దంచినా మాకు కావలసిన పధ్ధతికి రాలేదు. అసలు ఇంతకి అది అసలైన ముడి పదార్ధంకాదు. ఆ ఏడాది మా సొంత తయారీ అట్టర్ ఫ్లాప్. మనకు సొంత తయారీలు ఏవీ అచ్చిరావని ఎవరికివారే గత అనుభవాలు గుర్తుచేసుకోవడం జరిగింది. 

దీపావళినాడు ప్రమిద దీపాలు పెట్టడంలో వుండే ఆనందం, తృప్తి, క్రేకర్స్ కాలిస్తే రాదు అని బాగా అర్ధం చేసుకున్నాం.  

మరొక ఏడాది దీపావళి కి పిల్లలు కొంత పెద్దయ్యారు. కొందరు, కాకరపువ్వొత్తులు పట్టుకునే వయసుకు వచ్చారు. యధాప్రకారంగా చీకటి పడ్డాక భవనం నాలుగు పక్కలా మేడ సహా ప్రమిద  దీప తోరణాలంకరణతో దేదీప్యమానంగా వుంది. సుమారు ఏడున్నర ప్రాంతంలో వరసగా నాలుగైదు  నల్లని పొడుగాటి గవర్నమెంట్ కార్లు సైరన్ మ్రోగించుకుంటూ చాలా స్పీడ్ గా వెళ్ళిపోయాయి. ఎవరో, ఏమిటోనని  చూడ్డానికి మేము గేటు  బయటకు వచ్చాము. ఆఖరున వచ్చిన ఒక నల్లటి కారు మాత్రం నెం.35, ఉస్మాన్ రోడ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం స్లో అయింది. అక్కడ మిగతా ఇళ్ళకంటే వ్యత్యాసం గా కనిపించిన ఆ భవనంలోని ప్రమిదదీపాల కాంతులు  వారిని ఆకర్షించాయన్నది మాత్రం నిజం. తరువాత ఎవరో చెప్పగా తెలిసింది భారతదేశపు ప్రెసిడెంట్ డా. బాబూ రాజేంద్రప్రసాద్ గారు, ఉస్మాన్ రోడ్ మీదుగా రాజభవన్ కు వెళ్ళారని. పైలట్ కార్లన్నీ ముందు స్పీడ్ గా వెళ్ళిపోగా ప్రెసిడెంట్ కారు మాత్రం మా ఇంటి ప్రాంతంలో కొంచెం స్లోగా వెళ్ళిందని. 

ఆ తరువాత మరి కొన్ని నెలలకు తెలిసింది కోడంబాక్కం లెవెల్ క్రాసింగ్ దగ్గర పెద్ద ఫ్లై ఒవర్ కట్టబోతున్నారని. 1950ల నుండే అక్కడ బ్రిడ్జ్ కడతారని వార్తలు వచ్చినా ఆచరణలోకి రాలేదు. సడన్ గా ప్రెసిడెంట్ వస్తున్న వాహనమే ఆర్కాట్ రోడ్ లో లెవల్ క్రాసింగ్ దగ్గర చాలాసేపు నిలబడిపోవడంతో ఈ ఫ్లై ఓవర్ ప్రోజెక్ట్ విషయంలో ప్రభుత్వం ఉలిక్కిపడి నిద్రలేచిందని చెప్పుకున్నారు. కామరాజనాడార్ ముఖ్యమంత్రిగా పునాదిరాయి వేయగా , ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి ఎమ్ భక్తవత్సలం కాలంలో ఫ్లై ఓవర్ మీద రాకపోకలకు ప్రారంభోత్సవం జరిగింది. ఇంతటి చారిత్రాత్మక ఘట్టానికి మూలపురుషుడైన డా. బాబూ రాజేంద్రప్రసాద్ అప్పటికే కాలధర్మం చెందారు. 

నెం.35, ఉస్మాన్ రోడ్ లోని దీపావళి పండగలను తల్చుకున్నపుడల్లా షావుకారు సినీమా లోని మాస్టారు చేసిన దీపావళీ పాటే గుర్తుకు వస్తుంది.
 "దీపావళీ దీపావళి -మా ఇంటా మాణిక్య కళికావళీ ...దీపావళీ ... దీపావళీ".

మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు



వచ్చేవారం మరికొన్ని జ్ఞాపకాలు...
అంతవరకూ 
... సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Friday, November 6, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఐదవ భాగం

06.11.20 - శుక్రవారం భాగం - 5*:
అధ్యాయం 2 భాగం 4 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
నెం.35, ఉస్మాన్ రోడ్ మా చిరునామాగా మారింది. ఆనాటి మెడ్రాస్ లోని ప్రతీ భవనమూ ముందు విశాలమైన ప్రాంగణంతో, పూలమొక్కల వరసలు, కొబ్బరిచెట్లు, మామిడిచెట్లతో నిండివుండేది. భవంతి వెనకవేపు కారుషెడ్లు, ఆ ఇంటి యజమాని ఆర్ధిక స్తోమతనుబట్టి ఔట్ హౌస్ లువుండేవి. (ఔట్ హౌస్ కు తెలుగు పదమేమిటి చెప్మా!) అలాటి ఔట్ హౌసుల్లో ఆ భవంతిలో పనిచేసే ఉద్యోగస్తులో, కారుడ్రైవరో తమ కుటుంబంతో సహా అందులో ఉండేవారు.

ఘంటసాలవారి గృహం కూడా చాలా విశాలమైన పాతకాలపు భవంతే. నాలుగుప్రక్కలా ప్రహారీతో ఉండేది. తూర్పుముఖం ఇల్లు. వీధివేపు విశాలమైన స్థలం. పిల్లలు ఆడుకోవడానికి తగినంత స్థలం. ఇంటికి రెండుప్రక్కలా ఇంటి వెనకవేపున్న కార్ షెడ్ కి ఔట్ హౌస్ కి వెళ్ళడానికి మట్టి సందులు. ఎడంచేతి వెనకవేపు కారుషెడ్. దాని పక్కనే ఒక చిన్న ఔట్ హౌస్ (పెంకుటిల్లు). మొదట్లో డాబాలేదు. పిల్ల పాపా లేని చిన్న కుటుంబానికి అనువు. ఔట్ హౌస్ పక్కన ఇంటి పనిమనిషికి  చిన్న గుడిసె. ఆ పక్కనే టాయిలెట్. పనిమనిషి గుడిసెకు ఎదురుగా నైరుతిమూల మైన్ బిల్డింగ్ ఆనుకుని ఒక గిలక బావి.  అది 1955లో ఆ ఇంట్లో మా ప్రవేశం నాటికి 35, ఉస్మాన్ రోడ్ నైసర్గిక స్వరూపం. 

ఘంటసాలవారు ఆ ఇంటిని ఎవరో ఒక దొర దగ్గర కొన్నారట. అయితే అంతకు ముందో, తర్వాతో ఎవరో తమిళులు కూడా ఆ భవనంలో వుండి వుండాలి. ఎందుకంటే వీధిగుమ్మం మీద వరండాలో తూర్పువేపు గోడ మీద "వేలుమ్, మయిలుమ్ తుణై" అన్న వాక్యం తమిళం అక్షరాల్లో వుండేది. ఇది అరుణగిరినాదర్ "కందర్ అనుబూది" అన్న అద్వైత సిద్ధాంతం మీద రచించిన భాష్యంలోని మొదటి పద్యం తాత్పర్యం. అంటే, "(కుమారస్వామి) ఆయుధమైన శూలం (వేల్), వాహనమైన నెమలి రక్షించుగాక" అని స్థూలంగా చెప్పుకోవచ్చును.

ఘంటసాలగారి తమ స్వగృహంప్రవేశానికి ముహూర్తం 1951 జూన్ 21న అర్ధరాత్రి 1.30కి. అంతవరకు మోతీలాల్ స్ట్రీట్ లో కొన్నాళ్ళు, రామానుజం స్ట్రీట్ లో కొన్నాళ్ళు చిన్న అద్దె ఇళ్ళలో ఉండేవారట. ఈ గృహప్రవేశం సందర్భంగా సినీమారంగానికి చెందిన ప్రముఖులంతా హాజరయ్యారట. ఈ గృహప్రవేశానికి ఘంటసాలవారు తమ గురుదేవులు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారిని కూడా ప్రత్యేకంగా విజయనగరం నుండి తీసుకువచ్చి ఆయనను సముచితరీతిని సత్కరించారు. ఎంతో శ్రద్ధాసక్తులతో తనకు సంగీతవిద్యను నేర్పి తన ఉజ్జ్వల భవిష్యత్ కు బంగారు బాట వేసిన గురువుగారి ఎడల తనకు గల గురుభక్తిని చాటుకున్నారు ఘంటసాల. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన గురువుగారు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారి సంగీతకచేరీ చాలా జనరంజకంగా జరిగిందని చెప్పేవారు. 

  
1951లో గృహప్రవేశానికి ఘంటసాలవారి ఆహ్వాన పత్రిక 

ఈ గృహప్రవేశం సమయంలోనే ఘంటసాలవారు తనకు చేదోడువాదోడుగా వున్న తన మిత్రుడు దేవగుప్తాపు రామచంద్రరావుకు తానే పెద్దై దగ్గరుండి ఉపనయనం జరిపి  ఉత్తమ స్నేహితులు ఎలావుండాలో చాటిచెప్పారు. రామచంద్రరావు  విశాఖపట్నం జిల్లాలోని ఏదో ఒక చిన్న గ్రామానుంచి పొట్టచేతబట్టుకొని మెడ్రాస్ చేరుకున్నవాడు. వీరిద్దరిని స్నేహితులుగా చేసింది  టి.నగర్ పనగల్ పార్క్. రామచంద్రరావు సంగీతం మనిషికాడు. ఉదయమంతా ఎక్కడెక్కడో ఏవేవో పనులు చేసుకుని రాత్రుళ్ళు ఘంటసాలగారు ఈ పార్క్ చప్టాలమీద కూర్చొని పాటలు పాడుతుంటే ఆయన కూడా పక్కనచేరి  అగ్గిపెట్టె మీద తాళం వేస్తూ ఉత్సాహపరిచేవాడట. ఆకలి ఇద్దరిని ఒకటి చేసింది. విజయనగరంలో తన తొలి రోజులలో నేలనూతల నాగభూషణం, ముద్దు పాపారావు ఎలాటి స్నేహాన్ని కనపర్చారో మళ్ళీ  అలాటి స్నేహితుడే మెడ్రాస్ లో రామచంద్రరావు రూపంలో ఘంటసాలగారికి లభించాడు. ఘంటసాలవారికి సావిత్రిగారితో వివాహమయ్యాక తొలిసారిగా మెడ్రాస్ లో కొత్త ఊళ్ళో, కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టినప్పుడు ఆవిడకు కూడా వంటా-వార్పు నేర్పి ఇంటిపనులలో చేదోడు వాదోడుగా వుండేవారట. 

ఘంటసాలగారి నెం.35, ఉస్మాన్ రోడ్ ఔట్ హౌస్ లోకి మేము రాకముందు అందులో పామర్తిగారు ఉండేవారు.

ఔట్ హౌస్ ముందు పామర్తిగారితో నాన్నగారు

వారి స్వగ్రామం ఘంటసాలవారి స్వగ్రామమైన చౌటపల్లి సమీపంలోని సిధ్ధాంతం. జీవనాధారం లేక ఘంటసాలవారిని ఆశ్రయిస్తే, ఆయనకు డోలక్ వాయిద్యాన్ని సమకూర్చి దాన్ని వాయించే నైపుణ్యం సంపాదించుకునే దారి కూడా చూపారు. 1950లో వచ్చిన లక్ష్మమ్మ కధలో ఘంటసాలవారి పాటను  పాడుతూ రుక్మిణి (ప్రఖ్యాత నటీమణి లక్ష్మి తల్లిగారు) నృత్యానికి నట్టువాంగం చేస్తూ పామర్తి తెరమీద కనిపిస్తారు. 
ఆనాటినుండి ఘంటసాలవారికి సహాయకుడిగా పనిచేశారు. పామర్తిగారి పేరు కూడా వేంకటేశ్వరరావు. ఆయనకు మొదటినుండి స్వతంత్రంగా సినీమాలకు సంగీత దర్శకత్వం వహించాలనే తపన వుండేది. ఆ దిశగా అనేక ప్రయత్నాలు చేసేవారు. (ఇక్కడ, యీ 'వేంకటేశ్వర' నామం మీద ఒక సందేహం. నా భాషాజ్ఞాన పెంచుకోవలని ఈ ప్రశ్న. వేంకటేశ్వర అని రాసేప్పుడు 'వె' కు దీర్ఘం ఇస్తారు. మరి, అదే 'వెంకట, వెంకట్రావు, వెంకట్' అన్నప్పుడు ఆ 'వె' కు ఎందుకు దీర్ఘం ఉండదో?)

నేను పుట్టి పెరిగిన వాతావరణానికి, యీ ఇంటి వాతావరణానికి చాలా తేడా. ఈ పరిసరాలకు అలవాటు పడడానికి కొంత సమయం పట్టింది. ఆనాటికి, ఆ కాంపౌండ్ అంతటికీ ముగ్గురే పిల్లలం. నేను, మా పెద్ద చెల్లెలు రమణమ్మ, ఘంటసాలవారింట్లో వారి పెద్దబ్బాయి, విజయకుమార్ (అసలు పేరు ఇంకేదో వుంది 'సుబ్రహ్మణ్య' కూడా కలుస్తుంది. నిజానికి ఈ కుర్రవాడు రెండవవాడు. మొదటి సంతానం 1950లో పుట్టిన వారం రోజులలోనే ఋణానుబంధం త్రెంచుకొని, ఆ దంపతులకు గర్భశోకం మిగిల్చాడు).

ఇంట్లో ఏమీ తోచేదికాదు. మా రమణమ్మ నాకంటే ఏడేళ్ళు చిన్నది. తనతో ఆడుకునే అవకాశంలేదు, ఎత్తుకొని ఆడించడం తప్ప. వెనకనున్న ఔట్ హౌస్ లోనుండి, గూట్లోని పక్షిలా బయటపడి వాకిట్లో ఉన్న కార్ల చుట్టూ తిరుగుతూ, గేటు బయట నిలబడి వచ్చేపోయే కార్లను, తోపుడు రిక్షాలను, ఎప్పుడో అరగంటకు ఒకసారి వచ్చి పోయే 12B (వడపళని-శాంథోమ్ రూట్) బస్సులను చూస్తూ ఆనందిస్తూండేవాడిని. మెడ్రాస్ లో అప్పట్లో - 1950-60 ప్రాంతంలో కలకత్తాలోలాగ ట్రామ్ వాహనాలు, హాండ్ రిక్షాలే అన్నీ. బస్సులు, కార్లు, బొంబాయిలోలాగ టాక్సీలు, వుండేవి. సైకిల్ రిక్షాలు, ఆటోరిక్షాలు 70ల నాటికి ఆ తరవాత వచ్చేయి.  1955 నాటికే బస్సు రవాణా, ట్రామ్ రవాణా సంస్థల మధ్య గొడవలు వచ్చి ట్రామ్ సర్వీస్ రద్దుచేసేసారట. మేము మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో మైలాపూర్, మౌంట్ రోడ్, చైనా బజార్ వంటి ప్రాంతాలలో రోడ్లమీద ట్రామ్ బళ్ళ ట్రాక్ లు (పట్టాలు) ఉండేవి. కాలక్రమేణా రోడ్ల మరామత్తు సమయంలో ఆ పట్టాలన్నింటినీ తొలగించడం జరిగింది. ఒక మైలు రెండు మైళ్ళ లోపు ప్రయాణానికి చిన్న పిల్లలు, ముసలివారు, డాక్టర్ల దగ్గరకు వెళ్ళే గర్భిణీ స్త్రీలు లాగుడు హాండ్ పుల్లింగ్ రిక్షా మీదే ఆధారపడేవారు. ఆ రిక్షాలో ఇద్దరికే కూర్చోనే స్థలం ఉంటుంది. ఇద్దరు మనుషులను మరోమనిషి మోసుకుంటూ పోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ, కొందరికి అదే జీవనోపాధి. క్రమేపీ 1970 లు వచ్చేసరికి కరుణానిధి ప్రభుత్వం ఈ లాగుడు రిక్షాల స్థానంలో సైకిల్ రిక్షాలను రిక్షా కార్మికులకి ఉచితంగా ఇచ్చింది. (ఆ రకమైన ఉచితాల జ్ఞాపకార్ధం మౌంట్ రోడ్ మీద సైదాపేట్ లోకల్ స్టేషన్ దారిలో నిర్మించిన ఒక ఆర్చ్ (హైదరాబాద్ భాషలో 'కమాన్') మీద ఒక రిక్షా, కళ్ళజోడు, ఇత్యాది బొమ్మలుంటాయి. అలాటి లాగుడు రిక్షా తరవాత మ్యూజియం పీస్ గా మారి మెడ్రాస్ ఎగ్మూర్ మ్యూజియం లో వుండేది.

మా ఇంటికి ఎదురుగా ఒక డాక్టర్ ఉండేవారు. ఆ ఇంటి గోడకు డాక్టర్ నామగిరి అని ఉండేది. అక్కడికి చాలామంది గర్భిణీ స్త్రీలు ఈ రిక్షాలలో వచ్చివెళ్ళేవారు. వాళ్ళు తిరిగి వచ్చేవరకూ ఆ రిక్షావాళ్ళు కాచుకునుండేవారు. వెళ్ళినవారు తిరిగి వచ్చేలోపల ఈ రిక్షావాళ్ళు తమిళం దినపత్రికలు చదువుతూండేవారు. ప్రతీ రిక్షావాడు  తప్పనిసరిగా తనకు నచ్చిన దిన పత్రికను చదవతూండడం చూసేవాణ్ణి. ఆ రోజుల్లో దేశం మొత్తం మీదే  అత్యధిక సంఖ్యలో అమ్ముడుపోయేవి మలయాళం దిన పత్రికలు, ఆ తరువాత తమిళ భాషా దినపత్రికలు. మిగిలిన భాషా దిన పత్రికల సర్కులేషన్ మలయాళ, తమిళ పత్రికలలో సగమే. దీనికి అక్కడి ప్రజలలోని అక్షరాస్యత,  రాజకీయ చైతన్యమే ముఖ్యకారణం. పత్రికా పఠనమయ్యాక   వక్క, పొగాకు, సున్నంతో తామలపాకులు, బీడీల పనిబట్టేవారు. కుంభకోణం వెత్తలై - వెట్రిలై (తమలపాకు) చాలా ప్రసిధ్ధి. ఈ తాంబూలసేవన ప్రక్రియ చాలా సమయమే తీసుకునేది. ఆ సరంజామా అంతా రిక్షావాళ్ళ నడుము దగ్గర లుంగీ మడతల్లోనే వుండేది. ఇదంతా నాకు వింతగా ఒక వేడుకగా వుండేది. వాళ్ళు మాట్లాడే మాటలు క్రమంగా అర్ధం అవడం ప్రారంభించాయి. మెడ్రాస్ లో వాళ్ళు మాట్లాడే తమిళం కాస్త సంకరం. స్వఛ్ఛమైన, ఉన్నతమైనది తమిళంగా మిగిలిన రాష్ట్ర ప్రజలు గుర్తించరు.  ఆ భాష, యాస మిగిలిన వారి దృష్టిలో అంత ఉన్నతమైనది కాదు. తిరుచ్చి, తంజావూరు, మదురై ప్రాంతాల తమిళమే శుధ్ధమైన తమిళమనే వాదన ఉంది. దేశంలో అన్ని ప్రాంతాలలోలానే ఈ మద్రాస్ రాష్ట్రంలో కూడా ఒక్కో ప్రాంతానికి ఒక్కో యాస. కోయంబత్తూరు ప్రాంతంలో ఒకలా, తిరునల్వేలి, కన్యాకుమారి ప్రాంతాలలో ఒకలా మాట్లాడతారు. ఇన్ని రకాల యాసలు వంటబట్టించుకోవడం కష్టమే. మన దేశంలోని అన్ని భాషల్లాగే తమిళం కూడా భ్రష్టు పట్టిపోతోందని, పరభాషా వ్యామోహంతో పెద్దలే తమ పిల్లలకు కనీస తమిళ భాషా జ్ఞానం కూడా లేకుండా చేస్తున్నారని తమిళ భాషాప్రియులు వాపోతుంటారు. ఆధునిక సినీమాలు,  టెలివిజన్ కార్యక్రమాలు అభివృద్ధి చెందాక స్పష్టమైన తమిళం మాట్లాడేవారే కరువైపోతున్నారని, ప్రాధమిక పాఠశాల స్థాయి నుండే ప్రతీ విద్యార్ధికి అరుణగిరినాదర్ వ్రాసిన తిరుపుగళ్ (15 వ శతాబ్దం) ఆధ్యాత్మిక గ్రంధం, 5వ శతాబ్దానికి ముందే తిరువళ్ళువర్ రచించిన తిరుక్కురళ్ (ధర్మార్దకామమోక్షాలు గురించి సూక్తులు) ద్విపదలు పాఠ్యాంశాలుగా పెట్టి చిన్నవయసునుండే పిల్లలకు వాటి మీద అవగాహన కల్పించాలని, అప్పుడే పిల్లలు స్వఛ్ఛమైన తమిళ ఉచ్ఛారణ చేయగలుగుతారని, తమిళ భాష సజీవంగా దృఢంగా నిలుస్తుందని భాషావేత్తలు ప్రభుత్వానికి సలహాలిస్తుంటారు. కానీ వినేదెవరని, చెవిటివాడి ముందు శంఖమేనని వాపోతుంటారు. దేశంలోని అన్ని ప్రాంతాలలోని భాషాపరంగా అందరు సంప్రాదయవాదుల ఆవేదన ఈ విషయంలో ఒకటే.  నేటి చదువులన్ని జీవనోపాధి కోసమే. భాషాజ్ఞానం, భాషౌన్నత్యం అనే భావాలు ఏనాడో ప్రాధాన్యతను కోల్పోయాయి.

మరీ, తప్పనిసరైతే తప్ప మాస్టారింట్లోకి తరుచూ వెళ్ళి ఇంట్లోవారికి ఇబ్బంది కలిగించకూడదని మా నాన్నగారు చేసిన హెచ్చరికవల్ల ఘంటసాలవారింటి లోపలికి వెళ్ళడానికి సంకోచించేవాడిని. 

ఇలా కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు వీధి వరండా మీద ఘంటసాలవారి పెద్దబాబు కనపడడం, మెల్లగా మాటలు కలపడం జరిగింది. అతను తెలుగులోనే మాట్లాడాడు. హమ్మయ్య, మాట్లాడేందుకు ఒక తెలుగువాడు దొరికాడని సంతోషమేసింది. వయసురీత్యా అతను నాకంటే ఐదేళ్ళు చిన్న. నాలో వయసుకు తగ్గ ఎదుగుదల కనపడేదికాదు. ఇద్దరమూ ఒకే వయసువాళ్ళం  అన్నట్లుండేది. పెద్దవాళ్ళంతా ఎవరి పనులమీద వారున్నప్పుడు, ఎవరూ చూడకుండా మెల్లగా వెనక వేపునుండి ఘంటసాలవారింట్లోకి వెళ్ళడం ప్రారంభం అయింది. ఒకరోజు ఉదయం బాబూ వాళ్ళ నాన్నగారు (ఘంటసాలవారి గురించి చెప్పుకున్నప్పుడల్లా మా ఇంట్లో వారందరం ఇలాగే సంబోధించేవాళ్ళం) బయటకు వెళ్ళిపోయాక పెద్దబాబును ఆడుకుందికి రమ్మని పిలవడానికి వెనక హాలుకి వెళ్ళాను. అప్పుడు అక్కడ బాబూ వాళ్ళమ్మగారు (సావిత్రమ్మగారు) అతనికి బట్టలు తొడిగి తల దువ్వుతున్నారు. నేను దగ్గరకు వెళ్ళి 'ఏమోయ్! రావోయ్, ఆడుకుందాం' అంటూ పిలిచాను. అందుకు, వాళ్ళ అమ్మగారు 'ఎందుకోయ్', 'ఎక్కడికోయ్' అంటూ ఆటపట్టించారు. నా మాటల్లో తప్పేముందో తెలియలేదు. ఆనాటి దాకా నేను పెరిగిన ఊళ్ళలో అందరూ స్నేహితులను 'ఏమోయ్' అనే పిలువడం వల్ల నాకూ అదే అలవాటయింది. మరీ, సన్నిహిత మిత్రులైతే 'ఒరేయ్', అని 'వాడూ, వీడూ' అని పిల్చుకునేవారు. నేను మాత్రం ఇంతవరకూ ఎవరిని 'ఒరేయ్' ' ఒసేయ్' అని పిలవలేదు, ఇంట్లోని పిల్లలతో సహా. బాబూ వాళ్ళమ్మగారు అలా ఆటపట్టించడం నాకు చిన్నతనంగా అనిపించి మారుమాట్లాడకుండా అక్కడినుండి వెళ్ళిపోయాను. మరొకరోజు, నేను బయట వాకిట్లో నిల్చొని వచ్చేపోయే వాహనాలు చూస్తుండగా ఎవరో వచ్చి 'ఘంటసాలగారున్నారా' అని అడిగారు. ఆ వచ్చినవారెవరు, పేరేమిటి, ఎందుకోసం వచ్చారని? అడిగి తెలుసుకునే జ్ఞానం వుండేది కాదు అప్పట్లో. సరాసరి లోపలకు వెళ్ళాను చెప్పడానికి. అక్కడ బాబూ వాళ్ళమ్మగారు (సావిత్రమ్మగారు) కనిపించారు. ఎవరో వచ్చారని చెపితే సరిపోయేది. అది మానేసి 'వారున్నారాండీ' అని అడిగాను. 'ఎవరా వారు'? తిరుగు ప్రశ్న. నా మాట తడబడింది. మళ్ళీ 'ఆయన లేరాండీ' అని అడిగాను. 'ఎవరా ఆయన'? మళ్ళీ ప్రశ్న. నా నోట తడారిపోయింది. ఆవిడ ధోరణికి ఆవిడ ఎదట పడాలంటే నాకు భయం పట్టుకుంది. మెల్లగా అక్కనుండి తప్పుకున్నాను. ఆ వచ్చినాయనకు మరెవరో సమాధానం చెప్పిపంపడం జరిగింది. ఈ సంఘటన తరువాత  చాలాకాలం పాటు బాబూ వాళ్ళ అమ్మగారి ఎదుటపడే ప్రయత్నం చేయలేదు. మా ఇంట్లోనే గడపడం మొదలెట్టాను. ఇంట్లో ఉంటే పాత క్లాసు పుస్తకాలు చదవమని లేకపోతే కొత్త స్కూల్లో పాఠాలు అర్ధం కావని మా అమ్మగారు పోరుతూండేది. పుస్తకం తీసేసరికి ఎక్కడినుండో మా రమణమ్మ వచ్చి ఆ పుస్తకం లాగేయడమో, గిల్లడమో, కొరకడమో చేసేది. వద్దని ఏమాత్రం వారించినా గుక్క తిప్పుకోకుండా ఏడుపు మొదలెట్టేది. ఆ ఏడుపును మాన్పించడానికి పెద్దలు నానా యాతనా పడేవారు. మా రమణమ్మకు చిన్నప్పడు చిలిపితనం ఎక్కువే. విజయనగరంలో వున్నప్పుడే తన కంటే పెద్దదైన మంగమాంబను, చిన్నదైన జ్యోతిని కొరకడం, జుత్తుపట్టుకు పీకడం వంటి చేష్టలన్నీ చేసేది. "దొడ్డా! రమణమ్మ కొరికింది, జుత్తుపీకింది" అంటూ  అంబిక ఏడుపు లంకించుకునేది. జ్యోతికి ఏడవడం తప్ప మాటలు రావు అప్పటికి. వాళ్ళు ఏడుస్తూంటే తానంతకంటే గాఠిగా ఏడుపు లంకించుకునేది. అలాటి పిల్లను ఎత్తుకొని ఆడించడం, ఉయ్యాలూపి నిద్రపెట్టడం వంటి పనులలో మా అమ్మగారికి సహాయం చేసేవాడిని. అలాటప్పుడు ఆ గిల్లుళ్ళు, జుత్తు పీకించుకోవడం అనుభవైకవేద్యమే. పెద్దవాడిని కదా! "చెల్లి చిన్నదిరా, సద్దుకుపోవాలి" అనేవారు. అలా అన్నిటికీ సద్దుకుపోవడం అలవాటయింది.

మెల్లగా, ఘంటసాల వారింటి వ్యక్తులతో పరిచయాలు కలిగాయి. తరుచూ , "తాతా!", "పాపా!" అంటూ ఎవరో ఎవరినో పిలవడం వినబడేది. కానీ ఆ తాతగారు కానీ, ఆ పాప కానీ నాకంట పడనేలేదు. 

ఆ విషయాలన్నీ వచ్చేవారం....

                ...సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.