visitors

Saturday, December 26, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పన్నెండవ భాగం

26.12.2020 - శనివారం భాగం - 12*:
అధ్యాయం 2  భాగం 11 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

నెం.35, ఉస్మాన్ రోడ్ లోగిలి నిశ్శబ్దంగా వుందీ అంటే ఘంటసాల మాస్టారు ఇంట్లోవున్నారని అర్ధం. ఆయన వున్న సమయాలలో రేడియో శబ్దాలు కాని, గ్రామఫోన్ పాటలు కానీ వినిపించేవి కావు. అలాగే, అనవసర సంభాషణలు గట్టిగా వినపడేవికావు. వారు ఇంట్లో ఉన్న సమయంలో ప్రశాంతంగా వుంచాలని ఇంట్లోవారంతా తాపత్రయపడేవారు. ఆయన రికార్డింగ్ లకో, రిహార్సల్స్ కో బయటకు వెళ్ళిన సమయాలలోనే పాటలు వినడం జరిగేది. అలాగే, సాయంత్రం సమయాలలో బాల్కనీలో అందరూ కలసి సత్కాలక్షేపం చేసేవారు. అప్పుడప్పుడు కధలమీద, సాహిత్యం మీద కబుర్లు సాగేవి. అలాటప్పుడు మా నాన్నగారే వక్త. సావిత్రమ్మగారు, పాప పిన్నిగారు, సుబ్బారావు, రామచంద్రరావు, బ్రహ్మంగారు మొదలైనవారంతా శ్రోతలు. శ్రీ సంగీతరావుగారు (మా నాన్నగారు) ఏ విషయం మీదనైనా రసవత్తరంగా మాట్లాడేవారు. ఆయన శరత్, టాగోర్, ప్రేమ్ చంద్ కథలను కళ్ళకుకట్టినట్లుగా, హృదయానికి హత్తుకునేలా చెప్పేవారు. ముఖ్యంగా, ఆయన చెప్పే 'కుక్క-యజమాని', 'గోపాల్' వంటి కరుణరస ప్రధానమైన కథలు దుఖః కలిగించేవి. అయినా ఆ కథలను ఎప్పుడు చెప్పినా వినాలనిపించేవి. 

సర్వశ్రీ - పంతుల శ్రీరామశాస్త్రి (రాయఘడాలో హైస్కూల్ మాస్టర్), భట్టిప్రోలు కృష్ణమూర్తి (OAS, ఒరిస్సా జైపూర్ ఎస్టేట్ ఆఫీసర్), మంథా రమణరావు (రూర్కేలా ఐరన్&స్టీల్ ఫ్యాక్టరీ లో పెర్సనల్ మేనేజర్) వంటి ఆనాటి ప్రముఖ రచయితలు ఆయనకు విజయనగరం కాలంనాటి నుండీ మంచి మిత్రులు. 

  

పంతుల, భట్టిప్రోలు, మంథా మిత్రులతో నాన్నగారు

(ఈ రచయితల కథలు వ్యాసాలు భారతి లో ప్రకటించబడేవి. ఆకాలంలో 'భారతి' పత్రికలో రచనలు ప్రచురించబడ్డాయంటే అదొక అమూల్యమైన గొప్ప ప్రశంసాపత్రం. తెలుగు భాషలో నిష్ణాతులైన వారి రచనలు మాత్రమే భారతిలో చోటుచేసుకునేవి). 

విజయనగరంలో వున్న రోజుల్లో వ్రాసిన కధలు కొన్ని ఆంధ్రపత్రిక(వారపత్రిక)లో ప్రచురితమయ్యాయి. ఈ ముగ్గురు శెలవుల్లో మద్రాస్ వచ్చి మా నాన్నగారితో కొన్నాళ్ళు గడిపేవారు. అలాటప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా, సర్వశ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు, యామిజాల పద్మనాభ స్వామి, జలసూత్రం రుక్మిణీ నాధ శాస్త్రి, మాలతీ, ఎన్నార్ చందూర్ దంపతులను కలిసేవారు. వృత్తిపరంగా, సముద్రాల, మల్లాది, దాశరధి, ఆరుద్ర, సి.నారాయణ రెడ్డి, ఆత్రేయ వంటి కవులతో మంచి అనుబంధం వుండేది. మా నాన్నగారు ఎవరైనా మరీ బలవంతపెడితే తప్ప ఏ రచనలు చేసేవారు కాదు. ఆయనలోని రచనాశక్తిని గ్రహించిన చందూర్లు బలవంతం మీద ఆంధ్రమహిళ, జగతి వంటి పత్రికలకు కొన్ని కధలు వ్రాశారు. సమకాలీన సంగీత విద్వాంసులమీద ఆంధ్రప్రభ దిన పత్రికలో సంగీత వ్యాసాలు వ్రాయడం జరిగింది. అలాగే ఆయన జీవితంలో తారసపడిన ప్రముఖ వ్యక్తులందరితో తనకు గల అనుబంధాన్ని, జ్ఞాపకాలను 'చింతాసక్తి' పేరిట, తన ఆత్మ సంతృప్తికోసం, ఒక పుస్తకం వ్రాసుకున్నారు. వాటన్నిటినీ సంకలనపరచి ఒక పెద్ద పుస్తకంగా ప్రచురించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ పుస్తకం మీముందుకు వస్తుంది. మా నాన్నగారి రచనా వ్యాసాంగానికి 'నెం.35, ఉస్మాన్ రోడ్' లోని వ్యక్తులు,  వాతావరణం కూడా ఎంతో దోహదపడ్డాయి.

మాస్టారు ఉదయం రికార్డింగ్ ఉంటే మధ్యాహ్నం 1.30 తరువాత, మధ్యాహ్నం రికార్డింగ్ అయితే రాత్రి 9.30 తరువాత ఇంటికి చేరేవారు. మాస్టారు వచ్చేలోపల, రేడియో సిలోన్, వివిధభారతిలో వచ్చే తెలుగు, తమిళ, హిందీ సినిమాల పాటలను మార్చి మార్చి వినేవాళ్ళం. అలాగే కొత్తగా వచ్చిన గ్రామఫోన్ రికార్డులను అరగదీసేవాళ్ళం. మాస్టారు సినీమా లలో పాడిన తెలుగు, తమిళ, కన్నడ భాషా చిత్రగీతాలను హెచ్ ఎమ్ వి, కొలంబియా కంపెనీ వారు విడుదల చేసేవారు. అలాటి పాటలను మాస్టారికి 'కాంప్లిమెంటరీ'లుగా పంపేవారు. అయితే,  ఒక సినీమాలో పదిహేను,  ఇరవై పాటలు, పద్యాలు వుంటే అవన్నీ రికార్డ్ రూపంలో వచ్చేవికావు. బాగా అమ్ముడుపోతాయనే నమ్మకం వున్న పాటలనే రికార్డులుగా వేసేవారనుకుంటాను. అలాటి రికార్డులు మాత్రమే మాస్టారింటికి వచ్చేవి. 

నాకు తెలిసినప్పటినుండీ HMVలో శ్రీ మంగపతిగారే ప్రోగ్రామ్ ఇన్ ఛార్జ్ గా వుండేవారు. మూడు మాసాలకు ఒకసారైనా ఓ రెండు లలితగీతాలు మాస్టారివి రికార్డ్ చేసేవారు. ఆ లలితగీతాల కంపోజింగ్ మాస్టారింటి హాల్ లోగానీ, లేదా మేడమీది ఫ్రంట్ రూమ్ లో కానీ జరిగేవి. అలాటి సందర్భాలలోనే సర్వశ్రీ - రావులపర్తి భద్రిరాజు, ఎ వేణుగోపాల్, సముద్రాల ఆంజనేయులు, విజికె చారి, సి.సుబ్బారావు వంటి గీత రచయితలను చూడడం జరిగింది.

HMVలో పెరుమాళ్ అని ఒక ఎటెండర్ వుండేవాడు. మధ్యపాపిడి, సగం నెరసిన నొక్కులజుత్తు. కళ్ళజోడు, ఖాకీడ్రెస్. వారానికి ఒకసారైనా సైకిల్ మీద వచ్చి రెండో మూడో రికార్డులు ఇచ్చివెళ్ళేవాడు. (అంటే ఆరు పాటలు). సాధారణంగా అతను వచ్చే సమయానికి నేనే వాకిట్లో వుండేవాడిని. పెరుమాళ్ పుస్తకంలో సంతకం చేసి ఆ రికార్డులను తీసుకునేవాడిని. ఆ రికార్డులు నాలుగుపక్కలా ట్వైన్ దారంతో కట్టబడివుండేవి. వాటిని తీసుకువెళ్ళి అమ్మగారికి అప్పగించి వాటిని వినే అవకాశం కోసం ఎదురుచూసేవాడిని. 

ఘంటసాల మాస్టారి ఇంట్లో మొదట్లో ఒక పెద్ద పాతకాలపు వాల్వ్ రేడియో, ఒక HMV గ్రామఫోన్ ప్లేయర్ మెయిన్ హాల్ లో వుండేవి. ఆ హాలుగోడలన్నీ  స్కై బ్లూ  కలర్ లో కళ్ళకు చల్లదనాన్ని ఇచ్చేవిగా వుండేవి.  వీధి గుమ్మంనుండి లోపలి హాలు చివరివరకు ఒక ఆకుపచ్చ తివాసి (కొబ్బరినారుతో చేసినది) ఉండేది. ఎడమప్రక్క పడమట గోడంతాపూర్తిగా అద్దాల బీరువా. దానినిండా మాస్టారికి వచ్చిన షీల్డ్ లు, వెండి కప్పులు, పతకాలతో పూర్తిగా నిండివుండేది. హాలుకు మధ్య రంగురంగుల ముఖమల్ తివాసీ దానిమీద ఒక పెద్ద సోఫా ఎదురెదురుగా సింగిల్ సోఫాలు. ఈ సోఫాలు దూదితో చేయబడినవి. తెలుపు ఆకుపచ్చల చారలతో చాలా ఆకర్షణీయంగా వుండేవి. అక్కడే ఒక పక్కగా మాస్టారి పేము పడకకుర్చీ, రెండు కాళ్ళు జాపుకొని హాయిగా పడుక్కునేందుకు వీలుగా పొడుగాటి మడత చేతులతో ఉండేది. గ్రామఫోన్ కు దక్షిణం  గోడవేపు ఒక స్టాండ్ మీద గ్రామఫోన్, పక్కనే రేడియో గ్రామ్ . దానికి ముందు ఒక పేము కుర్చీ. తూర్పు గోడమీద అయ్యగారు , అమ్మగారి పెద్ద కలర్ ఫోటోలు. తరువాత కాలంలో జలాల్ కంపెనీ వారి సిల్వర్ డయల్ పెండ్యులమ్ వాల్ క్లాక్ వచ్చాయి. ఆ వాల్ క్లాక్ ను తుడిచి , కీ ఇచ్చే భాధ్యత తమ్ముడు కృష్ణదైతే అతనెక్కిన కుర్చీని పట్టుకోవడం నా అలవాటు గా మారింది. ఆ HMV గ్రామఫోన్ కు రెండు మూతలుండేవి. ఒకటి పైవేపు. మరొకటి ముందువేపు. ఆ మూతలు వేసేసినా కూడా పాట స్పష్టంగా వినబడేది. ముందువేపు స్పీకర్లు వుండేవి. అందులో వినపడే పాట స్టూడియో ధియేటర్లో వినేపాటలాగే నిర్దిష్టంగా వినపడేది. అలాటి గ్రామఫోన్ మరల నేను ఎవరింట్లోనూ చూసిన గుర్తులేదు. ఆ గ్రామఫోన్ లో పాటలు పెట్టి, కీ ఇవ్వడమన్నా,  ముల్లు మార్చడమన్నామహదానందంగా వుండేది. రామచంద్రరావో, అమ్మగారో పెడుతునప్పుడు చూసి తెలుసుకున్నాను. కొంచెం పెద్దయ్యాక నేనే ఆ గ్రామఫోన్ లో రికార్డులు పెట్టేవాడిని. తరువాత కొన్నేళ్ళకు (1967-68లో ఇంటి రినొవేషన్ ఫస్ట్ ఫ్లోర్ లో మరో ఇల్లు కట్టిన తరవాత) ఆ పాత రేడియో స్థానే ఒక నాలుగు బ్యాండ్ల ఫిలిప్స్  రేడియో గ్రామ్ వచ్చింది. అందులోనే రేడియో, గ్రామఫోన్ కూడా వుండేది. ఒకేసారి ఎనిమిది రికార్డులు లోడ్ చేస్తే ఒకదాని  తరవాత ఒకటి వరసగా టర్న్ టేబుల్ మీద ఆటోమేటిక్ గా పడి ఆటోమేటిక్ గానే పికప్ రికార్డ్ మీదకి దిగి ఒక పాట తరువాత మరో పాట ప్లే అయేవి. ఆ రేడియో గ్రామ్ క్రింది భాగంలో రెండు మూడు వరసల్లో రికార్డులు భద్రపరిచే స్థలముండేది. కొన్ని వందల రికార్డులు వాటిలో దాచవచ్చును. ఇవన్నీ 1965 తర్వాత వచ్చినవి. అప్పటినుండే ఇంట్లో అందుబాటులో వున్న గ్రామఫోన్ రికార్డులకు ఒక ఇండెక్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచన రావడం, (రికార్డులు మీద నెంబర్లు కూడా వేసేమేమో!) నెంబర్ ప్రకారం కొంత లిస్ట్ తయారు చేయడం జరిగింది. అందులో నా పాత్ర కూడా వుందని చెప్పడానికి ఆనందంగానేవుంది.

నాకు పది పన్నెండేళ్ళ వయసులో ఆ పాత HMV గ్రామఫోన్ లో చాలా పాటలే విన్నాను. అందులో ముఖ్యంగా, పుష్పవిలాపం, కుంతీకుమారి, సాంధ్యశ్రీ, పాపాయి పద్యాలు, షావుకారు, పాతాళభైరవి, చంద్రహారం, దేవదాసు, చిరంజీవులు, కన్యాశుల్కం, సంతానం,  మాయాబజార్, సారంగధర, ఇలా ఎన్నో సినీమా పాటలు. అప్పటికి నా వయసు సుమారు పన్నెండేళ్ళు. 

ఆ సమయంలోనే 'సతీ అనసూయ' సినీమా వచ్చింది. సినీమా 1957 లో వచ్చినా  కొన్ని పాటల రికార్డింగ్ 1956 లోనే వాహినీలో జరిగిన గుర్తు. వాహినీలో ముందు కృష్ణన్ సౌండ్ ఇంజనీర్. తరువాత వల్లభజోస్యుల శివరాంగారు వచ్చారు. పెద్ద పెద్ద మీసాలు. భారీ శరీరం. ఈయన  పోతన, షావుకారు, గుణసుందరి వంటి అనేక సినీమాలలో కూడా  నటించారు. విజయాగార్డెన్స్ రికార్డింగ్ ధియేటర్ రాకముందు మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన అనేక సినీమా పాటలను వాహినీ స్టూడియో లో శివరాంగారి ఆధ్వర్యంలోనే రికార్డ్ అయాయి. విజయాగార్డెన్స్ వచ్చాక మాస్టారి సినీమా పాటలు అక్కడే రికార్డింగ్ జరపడం మొదలెట్టారు. అక్కడ ఏ ఆర్ స్వామినాథన్ సౌండ్ ఇంజనీరు. అప్పట్లో భరణీలో కోటేశ్వరరావుగారు (ఆయన తరువాత జెమినీ స్టూడియోకు మారారు), ఏవిఎమ్ లో జె జె మాణిక్యం , ప్రసాద్ లో ఎస్పి రామనాధన్ వంటివారు సౌండ్ ఇంజనీర్లుగా వుండేవారు.

సతీ అనసూయ పాటల రికార్డింగ్ వాహినీలో జరిగినా, రీరికార్డింగ్ మాత్రం వేరే స్టూడియో జరిపారు. అది కూడా వడపళని దాటాకే అర్కాట్ రోడ్ లోనే ఉండేది. (ఆ రోజుల్లో వాహినీ, ఏవిఎమ్ దాటాక అంతా నిర్మానుష్యంగా వుండేది. సినీమా వారి వాహనాల రాకపోకలే కనిపించేవి. ఆ ఆర్కాట్ రోడ్   పోరూర్, పూనమల్లి హైరోడ్ కు వెళుతుంది. అప్పట్లో పొలాలు, కొబ్బరితోటలతో నిండిన ఆ ప్రాంతమంతా ఇప్పుడు ఒక కాంక్రీట్ జంగిల్. హెవీ ట్రాఫిక్ జామ్ లతో, వాతావరణ కాలుష్యంతో మనుషులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.)

సతీ అనసూయలో కూడా ఇరవైకి పైగానే పాటలు పద్యాలు వున్నాయి. ఇవన్నీ గ్రామఫోన్ రికార్డులు గా వచ్చాయా అనేది నాకు సందేహమే. అందులోని పాటలన్నింటికీ చాలా శ్రావ్యమైన సంగీతాన్నే ఘంటసాల మాస్టారు సమకూర్చారు. ఆ పాటలన్నీ గ్రామఫోన్ లో వేసుకొని వినేవాళ్ళం. 


ముఖ్యంగా ఎమ్మెల్ వసంతకుమారి పాట 'మారు పల్కవదేమిరా', 'పోనేల మధుర పోనేల కాశి', 'జయ జయ దేవహరే, 'ఓ నాగదేవతా నా సేవగొని', 'ఊగేరదిగో మువ్వురు దేవులు ఉయ్యాలలో పసిపాపలై', 'కదిలింది గంగా భవానీ' వంటి పాటలను, మళ్ళీ మరేవైనా కొత్త రికార్డ్ లు వచ్చేవరకు వేసుకు వినేవాళ్ళం. గ్రామఫోన్ లో ఈ పాటలు వినడానికి నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలి. అందుకు పిన్నిగారిని ఆశ్రయించేవాడిని. ఈ రకంగా మాస్టారు లేని సమయంలో పాటల కార్యక్రమం జరిగేది.

'ఓ సఖా ఓహో సఖా' పాట డ్యూయెట్. జిక్కి, మాస్టారు పాడారు. ఈ పాటకు మూలం 'ఝనక్ ఝనక్ పాయల్ బాజే' లో లతామంగేష్కర్, హేమంత్ కుమార్ పాడిన 'నయన్ సొ నయన్ నహీ మిలో" పాట. చాలా మంచి పాట. స్లో రిధిమ్ లో ఉండే ఈ పాటను రతీ మన్మధుల నృత్యగీతికి తగినట్లు మార్చి మాస్టారు వరసను కూర్చారు. సతీ అనసూయ లేడీ ఓరియెంటెడ్. హీరో లేని సినీమా. అంజలీ, జమునలే ఈ చిత్రానికి జీవం. గుమ్మడి, కెవి శర్మ,  పద్మనాభం, రేలంగి, ముక్కామల, రాజనాల ముఖ్యపాత్రలు.  కాంతారావు, అమర్ నాధ్ కూడా ఉన్నారు. ఆఖరున ఒక సీన్ లో శాపం తీరిన కౌశికుడుగా, జమున భర్తగా ఎన్ టి రామారావు కనిపిస్తారు. కానీ యూట్యూబ్ పొస్టర్స్ లో ఎన్టీఆర్ ఫోటోను, పేరును ప్రముఖంగా చూపిస్తున్నారు.

సతీ అనసూయ రాజశ్రీ ప్రొడక్షన్స్ సుందర్లాల్ నహతాగారి రెండవ సినీమా. కడారు నాగభూషణం గారు డైరక్టర్. ఈ సినీమా రీ రికార్డింగ్ వడపళని దాటాక అదే ఆర్కాట్ రోడ్ లోని పేరమౌంట్ స్టూడియో లో జరిగిన గుర్తు. పక్క పక్కనే శ్యామలా స్టూడియో,  ప్రకాష్,  మెజెస్టిక్, వాసూ స్టూడియో,  గోల్డెన్ స్టూడియో, ఫిలింసెంటర్ వంటి చిన్న స్టూడియోలుండేవి. ఆ తరువాత కొంతకాలానికి కర్పగం, ఎ ఆర్ ఎస్ గార్డెన్స్ వంటి స్టూడియో లు వచ్చాయి. ఆ రోజుల్లో ఈ స్టూడియో లన్నీ చాలా బిజిగా కళకళలాడుతూ పనిచేసేవి. ఈనాడు ఆర్కాట్ రోడ్ లోని సినీమా స్టూడియోలన్నీ మూతబడి, వాటి నామరూపాలే తెలియకుండా ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళ గొడౌన్లుగా, మల్టీస్టోరీడ్ హైటెక్ బిల్డింగ్స్ గా రూపాంతరం చెందాయి. 

సినీమా నిర్మాణం పూర్తిగా బజారుకు ఎక్కింది. పెద్ద పెద్ద భవంతులలో , బీచ్ రిసార్ట్స్ లో, పూర్తి ఔట్ డోర్ లలో సినీమా షూటింగ్ లు జరుపుతున్నారు. సినీమా  టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ఆ మార్పే నేటి సినీమా సంగీతంలో కనిపిస్తోంది. అంతా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తో, గ్రాఫిక్స్ ,ఏనిమేషన్స్ తోనే సినీమా తయారౌతున్నది. గతకాలపు విలువలేవీ ఈ నాటి సినీమా కు అవసరం లేదు.

పారమౌంట్ స్టూడియోలో జరిగిన రీరికార్డింగ్ లో కొన్ని సీన్లను చూశాను. పారమౌంట్ స్టూడియో మరీ పెద్దదేం కాదు. ఆ స్టూడియో కు వెళ్ళాలంటే డైరక్ట్ బస్ సౌకర్యం లేదు. మా నాన్నగారితో కానీ, లేదా, మాస్టారి తో కానీ వెళ్ళేవాడిని. మా నాన్నగారిని , ఇతర ఆర్కెష్ట్రా వారిని తీసుకు వెళ్ళడానికి ప్రొడక్షన్ మేనేజర్  బి. సుబ్బారావు (సుబ్బు) కారో, వ్యానో తీసుకువచ్చేవారు. ఆ సుబ్బునే మాస్టారి సొంత చిత్రాలకు కూడా ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశారు.

ప్రొడక్షన్ మేనేజర్ల ఉద్యోగాలు నిరంతరం కాదు. ఆ సినీమా పూర్తి అయ్యేవరకే. వెంటవెంటనే మరో సినీమా తీసే కంపెనీ అయితే ఫర్వాలేదు. లేకపోతే జీవనం కోసం మరో సినీమా కంపెనీకోసం వెతుకులాట తప్పదు. సినీమా లోకంలో అనుభవమున్నవారు వెంటవెంటనే ఏదో కంపెనీలో చేరిపోతూంటారు. సినీమాలలో ఎవరికీ Job guarantee లేదు. ఆనాడు సినీమా నిర్మాణం most unorganized. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకున్నవారు బ్రతికి బాగుపడ్డారు. లేనివారు తెరమరుగైపోయారు.

సరి, ఇప్పుడు, 'సతీ అనసూయ' ను చూద్దాము. ఈ సినీమా రీరికార్డింగ్ మధ్యాహ్నం నుండి మర్నాటి ఉదయం వరకూ డబుల్ కాల్షీట్లు లో పనిచేసిన జ్ఞాపకం. రీరికార్డింగ్ చూడ్డానికి వెళ్ళినవాళ్ళం ఏ తొమ్మిందింటి వరకో వుండి తిరిగి వచ్చేసేవాళ్ళం. సతీ అనసూయ లో రీరికార్డింగ్ సమయంలో నేను చూసినవి,  నాకు బాగా జ్ఞాపకం వున్న సీన్లు - మనుషులు చేసిన పాపాలు పిశాచాలై పవిత్ర గంగాదేవిని పీడిస్తూ వెంటపడేప్పుడు  వచ్చే స్పెషల్ ఎఫెక్ట్స్, అత్రి మునిని కాటేయమని పార్వతీదేవి శివుడి మెడలోని నాగరాజును ఆజ్ఞాపిస్తుంది. ఆ సందర్భంలో ఆ నాగుపాము వెళుతున్నప్పుడు వచ్చే మ్యూజిక్. ఆ సీన్ లో యూనివాక్స్, ఘటసింగారి లేక పంబలాటి వాద్యం నేపథ్యంలో వినిపిస్తుంది. అనసూయ పాతివ్రత్యబలం వలన కాటేయడానికి వెళ్ళిన నాగరాజు పూలహారంగా మారేప్పుడు వినిపించే వీణ బిట్స్, సింబల్స్, బేస్ డ్రమ్స్ వంటి వాద్యాలతో నేపధ్యసంగీతం సమకూర్చారు. 

అలాగే, ఇంద్రుడు నర్మద మీదకు పంచభూతాలను ప్రయోగించి భీభత్సాన్ని సృష్టించే సమయంలో వచ్చే స్పెషల్ ఎఫెక్ట్స్, మధ్య మధ్య త్రిమూర్తులు ప్రత్యక్షం అయ్యేప్పుడు వచ్చే మ్యూజిక్, త్రిమూర్తులు పసిపాపలుగా మారడానికి ముందు, వెనక వచ్చే మ్యూజిక్ స్వయంగా రికార్డింగ్ థియేటర్లో కూర్చోని సినీమా చూస్తూ, వినడం ఆ వయసులో గొప్ప థ్రిల్లింగ్. 

నాకు సినీమా షూటింగ్ లు చూడడంలో ఏనాడు పెద్ద ఆసక్తి వుండేదికాదు. అవకాశం దొరికితే మాత్రం రీరికార్డింగ్ లకు మాత్రం తప్పక హాజరయేవాడిని.

ఈ సినీమా ప్రివ్యూ కూడా ఇంట్లో అందరం చూశాము.

1960-70ల మధ్య ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక వంటి ప్రముఖ తెలుగు వార పత్రికలు, యువ, జ్యోతి వంటి మాస పత్రికలు దసరా, దీపావళి, సంక్రాంతి సమయాలలో ప్రత్యేక సంచికలు ప్రచురించి నవలలు, కథల పోటీలు నిర్వహించి ఉత్తమ రచనలకు మొదటి బహుమతి 5000, రెండవ బహుమతి, 3000, మూడవ బహుమతి 1500/- రూపాయలు ప్రకటించి ఆయా నవలలను, కధలను ధారావాహికలుగా తమ తమ పత్రికలలో ప్రచురించేవారు. పండగల సందర్భంలో వచ్చే ఆ ప్రత్యేక సంచికలు తెరచి చూడగానే ఘాటైన ఒక సెంట్ వాసన పాఠకులను మత్తెక్కించేది. ఆ సెంట్ పేరు 'కునేగా మరికొళందు'. 

 

 


పత్రికలవారు, ఆ సెంట్ కంపెనీవారు సంయుక్తంగా తమ వ్యాపారాభివృధ్ధికోసం ఈ విధంగా ప్రజలను ఆకర్షించేవారు. 

ఒకసారి మా హైస్కూలులో మా క్లాస్ పిల్లలందరిని స్టడీ టూర్ లాటిదానికి తీసుకువెళ్ళారు. కొంతమంది మా క్లాస్ అయ్యవారితో  టి.నగర్ నుండి బస్ లో వెళితే మరికొందరు తమ సొంత వాహనాలమీద వెళ్ళారు. నేను, వెస్ట్ మాంబళం ప్యాడీఫీల్డ్ రోడ్ లో వుండే  ఎస్ ఎస్ వాసన్, వంటి పిల్లలు మరికొంతమందిని కలుపుకొని మాంబళంనుండి నడచుకుంటూ   జయరాజ్ థియేటర్ మీదుగా సైదాపేట బస్ స్టాండ్ దగ్గర  47 నెం. బస్ ఎక్కి అడయార్ లో దిగి అయ్యవారు చెప్పిన ఎడ్రస్ కు వెళ్ళాము. అదొక ఫ్యాక్టరీలాగా వుంది. ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళగానే పరిచయమున్న ఘాటైన సెంట్ వాసన తగిలింది. అది ఆంధ్రపత్రిక ప్రత్యేక సంచికల్లో వచ్చిన కునేగా సెంట్ వాసనే. ఆ ఫ్యాక్టరీ పేరు 'గంగా సోప్ ఫ్యాక్టరీ' అని జ్ఞాపకం. దీనికి సమీపంలోనే అడయార్ నుంచి OMR (Old Mahabalipuram Road) దారిలో లాటిస్ బ్రిడ్జ్ రోడ్ మీద 'ఈరోస్' సినీమాహాలు చూసిన జ్ఞాపకం.  ఇప్పుడు ఆ స్థలాలన్నీ గొప్ప రియల్ ఎస్టేట్ వెంచర్స్ గా మారిపోయాయి.
 
మేమందరం కలసి అయ్యవారితో లోపలకు వెళ్ళాము. అక్కడ ఒకాయన ఆ ఫ్యాక్టరీని అంతా చూపించి, అరవంలో సబ్బులు ఎలా చేస్తారో, ఏ ఏ కెమికల్స్ ఎంతెంత పాళ్ళలో కలుపుతారో, ద్రవపదార్ధం గట్టి సబ్బుబిళ్ళగా ఎలా మారుతుందో అన్నీ వివరించి చెప్పారు. ఆయన చెప్పింది కొంత అర్ధమయింది. కొంత కాలేదు. అప్పటికి మధ్యాహ్నం మూడు దాటింది. లోపలనుండి బయటకు వచ్చి చెట్లక్రింద మేము తెచ్చుకున్న ఫలహారాలు తినడం మొదలెట్టాము. వచ్చేప్పుడే స్కూలుకు ఎదురుగా వున్న టి.నగర్ సోషల్ క్లబ్ క్యాంటిన్ లో ఎవరికి కావలసిన టిఫిన్ వారు ప్యాక్ చేయించుకొని తెచ్చుకున్నారు. "ఆబ లావు పీక సన్నం" అని మావేపు ఒక సామెత ఉంది. తెలీసీతెలియక ఒక నాలుగు ఇడ్లీలు కట్టించాను. అక్కడ వాటిని విప్పి చూసేసరికి  బాగా చల్లారిపోయి గట్టిపడిపోయాయి. చాలా పెద్ద పెద్ద ఇడ్లీలు. దానినిండా కారప్పొడి, మంచి నూనే వేసి వుంది. వేడివేడిగా ఉన్నప్పుడైతే మహారుచిగా వుండే ఆ ఇడ్లీలను రెండుకంటే తినలేకపోయాను. మిగతావాళ్ళందరిదీ కూడా అదే పరిస్థితి. ఎవరూ తెచ్చుకున్న ఫలహారాలు పూర్తిగా తినలేదు. సగం సగం అక్కడే పారేసారు. కొంతమంది పిల్లలు తాము తిన్న ఫలహారాల ఆకులు, కాగితాలు చెత్తకుప్ప తొట్టిలో వేయకుండా తిన్నచోటే చెట్లక్రింద వదిలేయడంతో అక్కడి వాచ్ మేన్ కోపగించుకొని చీవాట్లు పెట్టాడు. మా అయ్యవారు సర్దిచెప్పి మా అందరికి శుభ్రమైన మంచి అలవాట్లు గురించి ఒక క్లాస్ తీశారు. ఆ తర్వాత, అందరం బయటకు వచ్చి అడయార్ బస్ స్టాండ్ లో  బస్సెక్కి సైదాపేట లో దిగి అక్కడ టి.నగర్ బస్ పట్టుకొని ఇంటికి చేరేసరికి బాగా చీకటి పడిపోయింది.

రామకృష్ణా స్కూల్ లో ఏన్యువల్ డే సెలిబ్రేషన్స్ ఘనంగానే సాగేవి. మేడ మీద ప్రేయర్ హాలులో గానీ, క్రిందనున్న ఖాళీ స్థలంలోగానీ జరిగేవి. ఇది పూర్తిగా మగపిల్లల స్కూల్ కావడం వలన డాన్స్ లు తప్ప మిగిలిన  సంగీతం, నాటికలు, మ్యాజిక్ వంటి కార్యక్రమాలన్నీ జరిగేవి. ఇందులో మాక్లాస్ కు చెందిన త్యాగరాజు, అతని తమ్ముడు శివశంకర్ (లింగమూర్తిగారి అబ్బాయిలు) వైలిన్, మృదంగం కార్యక్రమం తప్పనిసరిగా వుండేది. అతను త్యాగకీర్తనలు ఓ రెండు వాయించిన తరువాత సినీమా పాటలు ఓ రెండు వాయించేవాడు. ఒకటి దేవదాసు లోని 'జగమే మాయ' పాట. పాట చివరలో వచ్చే దగ్గులను కూడా వైలిన్ మీద పలికించే ప్రయత్నం చేసేవాడు. పిల్లలందరూ సంతోషంగా చప్పట్లు కొట్టేవారు. మరొక పాట మాయా బజార్ లోని 'వివాహ భోజనం' అందులో వచ్చె నవ్వులను వైలిన్ మీద వాయిస్తూంటే పిల్లలంతా కోరస్ గా పాడేవారు. చాలా సరదాగావుండేది. దేవదాసు, మాయాబజార్ రెండూ తమిళనాట దిగ్విజయం పొందిన సినీమాలు. ఆ రెండు చిత్రాలతోనూ ఘంటసాలవారి కి సంబంధం వుండడం నాకు గర్వకారణం. స్కూల్ ప్రోగ్రామ్స్ అయ్యాక ఆ సినీమాల పాటలగురించే కబుర్లు చెప్పుకుంటూ, మెల్లగా నడచుకుంటూ ఇళ్ళకు చేరుకునేవాళ్ళం.

మరిన్ని విశేషాలతో... వచ్చే వారం...   
...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Saturday, December 19, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పదకొండవ భాగం

19.12.20 - శుక్రవారం భాగం - 11*:
అధ్యాయం 2 భాగం 10 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

జీవితం ఎప్పుడూ ఒకేలా సాఫీగా సాగిపోతుందని అనుకోవడానికిలేదు. వెలుగు తర్వాత చీకటిలాగే, సంతోషంతో పాటే దుఃఖము, అంతులేని విచారము కూడా చోటు చేసుకుంటాయి. 

మా గోపి పుట్టిన సరిగ్గా నెల రోజులకు, అంటే 1957, ఏప్రిల్ 17 వ తేదీన పూజ్యులు, మా తాతగారు, సాలూరు చినగురువుగారు, శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారు విజయనగరంలో స్వర్గస్తులయ్యారు. వయసేమీ మీరిపోలేదు. కేవలం 57 ఏళ్ళు మాత్రమే. విజయనగరం నుండి మా ప్రభు చిన్నాన్నగారు టెలిగ్రామ్ పంపారు. ఇంట్లో ఒక నెలల పిల్లవాడున్నకారణంగా, దూరాభారం మూలంగా, మా నాన్నగారు మాత్రం వెంటనే విజయనగరం వెళ్ళారు. మేమెవరమూ వెళ్ళలేకపోయాము. విజయనగరం వదలి వచ్చాక మరల మా తాతగారిని చూడలేదు. మా గోపిలో ఆయన పోలికలు కొన్ని ప్రస్ఫుటంగా వున్నాయి. ఘంటసాల మాస్టారు కూడా, పనుల ఒత్తిడి వల్లనే అనుకుంటాను, వెళ్ళలేకపోయారు. సీరియస్ అని టెలిగ్రామ్ వచ్చినా మా నాన్నగారు వెళ్ళేవేళకు మా తాతగారు కాలం చేయడం జరిగింది. అప్పటికి ఒక సంవత్సరం ముందే విజయనగరం సంగీత కళాశాల గాత్ర ఆచార్యుడిగా పదవీ విరమణ చేయడం జరిగింది.  ఇంటి పెద్ద కుమారుడిగా మా నాన్నగారు కర్మకాండ అంతా ముగించారు. విశాఖపట్నం నుండి మా పెద్ద చిన్నాన్నగారు పట్రాయని నారాయణ మూర్తిగారు కూడా తండ్రిగారి కడసారి చూపులకు అందుకోలేకపోయారని విన్నాను. స్థానికంగా వున్న మా తాతగారి మిత్రులు, శిష్యులు, కొంతమంది బంధువర్గం ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారని చెప్పగా తెలిసింది. 19వ శతాబ్దం ఉత్తరార్ధానికి చెందిన ఒక వాగ్గేయకారుని శకం ముగిసింది. కారణాలేవైనా కావచ్చు, శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రిగారి విద్వత్ కు తగిన గుర్తింపు అటు సంగీత కళాశాలలో కాని, తరువాత ప్రభుత్వపరంగా కానీ లభించలేదు.

  

ఈ అభ్యర్ధనలేవీ దున్నపోతుని కదిలించలేకపోయాయి. తాతాగారు అర్ధాంతరంగా కన్నుమూయడానికి ఈ మనోవ్యధ కూడా ఒక కారణం

కారణం ఏదైనా ఆయనకు రావలసిన పెన్షన్ కూడా ఆయనకు దక్కలేదు. ఆయన కాలం చేసిన ఐదేళ్ళ తరవాత సరైన కారణాలు చెప్పకుండానే శ్రీ ప్రభుత్వంవారు ఆయన పెన్షన్ కేసు మూసేసిన విషయం తెలియజేసేరు. ఇది నిజంగా విచారకరమైన విషయం. 

ఐదేళ్ళపాటు మా తాతగారి పెన్షన్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ వృధాకావడంతో, విజయనగరం మహరాజా సంగీత కళాశాలలో ఉద్యోగం కోసం తగిన అర్హతలతో చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలివ్వకపోడంతో ఆయన మూడవ కుమారుడు శ్రీ పట్రాయని ప్రభాకరరావు తన భార్య(కమలమ్మ), ఇద్దరు చిన్న పిల్లలతో (పివిఎన్ఎస్వి ప్రసాద్, మంగమాంబ) విజయనగరం వదలి సాలూరులో తమ తండ్రిగారు నిర్మించిన శారదా గాన  పాఠశాలలోనే ఒక వారగా ఆవాసం ఏర్పర్చుకొని అక్కడకు వచ్చే సంగీతాభిలాషులకు విద్య నేర్పడం ప్రారంభించారు. 


సాలూరులో శారదా గాన పాఠశాల విద్యార్ధులు - కుమారుడు పివిఎన్ఎస్ ప్రసాద్, కుమార్తె మంగమాబంలోతో  శ్రీ పట్రాయని ప్రభాకరరావు

విజయనగరంలో మా తాతగారి అంత్యక్రియలు జరిపి మద్రాస్ వచ్చిన మా నాన్నగారిలో బాహ్యంగా ఒక మార్పు కనిపించింది. కొన్నాళ్ళపాటు తన తలమీద ఒక నల్లటి టోపీ పెట్టుకొనేవారు. ఎప్పుడూలేనిది ఆ టోపి ఎందుకు పెట్టుకున్నారో ఆ వయసులో నాకు తెలియలేదు. మా తాతగారి మరణానికి సంబంధించిన వివరాలు కూడా మా నాన్నగారు చెప్పిన గుర్తులేదు. పెద్దయ్యాక తెలుసుకున్నవే. 

మా తాతగారు పోయాక నా వరకు విజయనగరం సంగీత కళాశాలతో కానీ, విజయనగరం ఊరుతో కానీ, కొన్ని దశాబ్దాలపాటు ఏ రకమైన సంబంధం లేకుండాపోయింది. రైల్లో  ఆ ప్రాంతాలకు వెళ్ళేప్పుడు విజయనగరం రైల్వే స్టేషన్ ను చూడడం తప్ప ఊళ్ళోకి వెళ్ళలేదు. 1980ల నుండి సాంస్కృతిక కార్యక్రమాలతో సత్సంబంధాలు ఏర్పడినప్పటినుండి అప్పుడప్పుడు విజయనగరం ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది.

సంగీత దర్శకుడిగా 1957 వ సంవత్సరం ఘంటసాల మాస్టారికి చాలా విజయవంతమైన సంవత్సరం. ఆ సంవత్సరంలో ముందుగా 'రేపు నీదే', 'మాయాబజార్', 'వినాయకచవితి', 'సతీ అనసూయ', 'సారంగధర' చిత్రాలు విడుదలయి సంగీతపరంగా మాస్టారికి, కాసులపరంగా నిర్మాతలకు సంతోషాన్ని కలుగజేసాయి.

'సారంగధరుడు' 11 వ శతాబ్దానికి చెందిన ఆంధ్ర చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని కుమారుడు. కవిత్రయంలో ఆద్యుడు, ఆంధ్ర మహాభారతం రెండున్నర ఆశ్వాసాలను  రచించిన నన్నయ భట్టారకుడు ఈ రాజరాజనరేంద్రుని ఆస్థాన కవీశ్వరుడే. 'సారంగధర' చరిత్ర బుర్రకథగా ఆంధ్రదేశంలో విస్తృతంగా ప్రచారం పొందింది. ఇందులో చారిత్రక సత్యాలకన్నా కల్పితమే ఎక్కువని చెపుతారు. ఈకథ జరిగిందనడానికి నిదర్శనంగా రాజమహేంద్రవరంలో సారంగధరమెట్ట, చిత్రాంగిమేడ, రత్నాంగిమేడవంటి అవశేషాలు కొన్ని ఇటీవలి కాలం వరకూ వున్నాయి. శ్రీ గురజాడ అప్పారావుపంతులుగారు ఈ సారంగధర చరిత్రను ఇంగ్లీషులో ఒక పద్యకావ్యంగా వ్రాసి ప్రచురించారని చెపుతారు.

'సారంగధర' సినీమాను మినర్వా పిక్చర్స్ బ్యానర్ మీద నామదేవ రెడ్డియార్ అనే ఆయన తెలుగు, తమిళ భాషలలో నిర్మించారు. వి.ఎస్.రాఘవన్, రామచంద్రరావు ద్వయం దర్శకత్వం వహించారు. తెలుగులో సారంగధరుడిగా ఎన్.టి.రామారావు, తమిళంలో శివాజీ గణేశన్ నటించారు. భానుమతి (చిత్రాంగి), శాంతకుమారి (రత్నాంగి), రాజసులోచన (కనకాంగి,) ఎస్.వి.రంగారావు (రాజరాజనరేంద్రుడు) తమిళంలో కూడా వారే నటించారు.  తెలుగులో నన్నయభట్టుగా మిక్కిలినేని, మంత్రిగా గుమ్మడి నటించారు. తమిళం వెర్షన్ కు  జి.రామనాధన్, తెలుగుకు ఘంటసాల సంగీత దర్శకత్వం వహించారు. ఎవరి బాణీవారిదే. రెండు భాషలకు వేర్వేరు వరసలు. చిత్రాంగి పాత్రధారిణి పి.భానుమతి రెండు సోలోలు, కొన్ని పద్యాలు పాడారు. ఆ రోజుల్లో భానుమతిగారికి, ఘంటసాలవారికి మధ్య గాత్రధర్మానికి సంబంధించిన అభిప్రాయభేదాలుండేవని చెప్పుకునేవారు. కానీ, ఈ సారంగధర లోని భానుమతి గారి పాటలను ఘంటసాల మాస్టారే స్వరపర్చారు. వారి నిర్వహణలోనే ఆవిడ పాటలన్నీ రికార్డ్ చేయడం జరిగిందని మా నాన్నగారు, శ్రీ పట్రాయని సంగీతరావు గారు స్పష్టం చేసారు. సినీమా టైటిల్స్ లో ఆయన పేరు వేయకపోయినా ఈ సినిమా  సంగీత సహాయకుడిగా ఆయన పనిచేశారు. భానుమతి గారిచేత  పాటలు రిహార్సల్స్ చేయించేప్పుడు ఆయన కూడా వున్నారని చెప్పడం జరిగింది.

సారంగధర సినిమా రీరికార్డింగ్ ముందు రషెస్ వేసి చూపించారు. నేను ఆ ప్రొజెక్షన్ కు వెళ్ళాను. రీరికార్డింగ్ మౌంట్ రోడ్ రేవతీ స్టూడియోలో జరిగింది. కోడంబాక్కంలో ఒక రేవతీ స్టూడియో వుండేది. రెండింటికి ఒకరే అధినేత. మౌంట్ రోడ్ లో తేనాంపేట DMS (Directorate of Medical Sciences)కు ఎదురు వేపు వుండేది. దాని పక్కనే కాంగ్రెస్ గ్రౌండ్స్ వుండేది.  తరువాతి కాలంలో ఈ రేవతీ రికార్డింగ్  స్టూడియో ఆవరణలో (ECIL) వారి ఆఫీసులు వచ్చాయి. ఇప్పుడు అక్కడ ఒక సబ్ వే, ఒక   అండర్ గ్రౌండ్ మెట్రో రైల్వే స్టేషన్ వచ్చాయి. ఇటీవలి కాలం వరకూ ఆ పాత రేవతీ స్టూడియో భవనం అక్కడ వుండేది.

సారంగధర ప్రారంభం సీన్, ఆఖరి క్లైమాక్స్ సీన్ లలోని రీరికార్డింగ్ కు నేను వెళ్ళాను. సారంగధరుని శీలాన్ని శంకించి తండ్రి రాజరాజనరేంద్రుడు కొడుకుకు శిరచ్ఛేదం శిక్ష విధించి, అది అమలుపర్చేంతవరకు చాలా హెవీ సీన్స్. మధ్యలో చాలా పొడవైన హార్స్ ఛేజింగ్. సారంగధరుని స్నేహితుడు సుబుద్ధి(చలం), విలన్ గంగన్న (ముక్కామల)ల మధ్య కత్తియుద్ధం, సారంగధరుని వధించాక ఒక సాధువు ప్రత్యక్షమై తిరిగి సారంగధరుని బ్రతికించడం, కనకాంగి (రాజసులోచన)తో వివాహంతో చిత్రం 'మంగళమ్' కార్డ్ వరకు ప్రతీ బిట్ లో   నేపథ్యసంగీతం వినిపిస్తుంది. ఈ బిట్ల్ కు మాత్రం ఓ మూడు కాల్షీట్లు పనిచేసిన గుర్తు. 

ఈ సారంగధర చిత్రం నాటికి ఘంటసాలవారి సొంత ఆర్కెష్ట్రా ఏర్పడింది. ఈ సీన్లలో ఎక్కువగా వెస్టర్న్ వాద్యాలే ఉపయోగించారు. ఎక్కువగా వైలిన్స్ (లాజరస్, రామసుబ్బు, సుబ్రమణ్యం (వయోలా), కృష్ణమాచారి, వై.ఎన్.శర్మ, చిత్తూర్ సుబ్రమణ్యం మొదలైనవారు), సెల్లో, డబుల్ బేస్ (బిన్ని) గిటార్స్ (జార్జ్, లూయీ), సాక్సోఫోన్, ట్రంపెట్స్,  పియోనో, క్లారినెట్ (సుభాన్), బేస్ డ్రమ్స్, వైబ్రోఫోన్స్ (ఉపద్రష్ట రామచంద్రరావు (ఈయన కుమారుడు ప్రముఖ సంగీత దర్శకుడు విద్యాసాగర్. కొంతకాలం మా నాన్నగారి వద్ద సంగీతం నేర్చుకోవడానికి వచ్చేవారు), రాజేంద్రన్ (ఫ్లూట్), ఆర్గన్ (హుస్సేన్ రెడ్డి), హార్మోనియం (పి. సంగీతరావు), తబలా (పామర్తి, లక్ష్మణరావు, భోగీలాల్. తర్వాతి కాలంలో ఉరిమి లలిత (పెద్ద) ప్రసాద్, జడ్సన్, ఆయన తమ్ముడు చిన్న ప్రసాద్, సుబ్బారావు, కణ్ణన్ (రిథిమ్స్). 

ఈ వాద్యకళాకారులే ఘంటసాల మాస్టారి తొలినాటి సినీమాలలో ఎక్కువగా పనిచేశారు. సితార్ జనార్ధన్ పరిశ్రమకు రావడానికి ముందు అన్నపూర్ణ అనే ఆవిడ మాస్టారి ఆర్కెష్ట్రాలో పనిచేశారు. అలాగే, వీణ వాయించడానికి ఎమ్మెస్.రాజు, ఎమ్.రంగారావు వచ్చేవారు. అరవైల తర్వాత, మా నాన్నగారు కొన్ని సినిమాల్లో వీణ కూడా వాయించేరు. పాటకు, సన్నివేశానికి తగినట్లుగా పై ఆర్కెష్ట్రాలోని వాద్య కళాకారులను  పిలిపించేవారు. 

గతంలో చెప్పుకున్నట్లు సీన్ బై సీన్  సారంగధర సినీమాను వేసి చూసుకుంటూ స్టాప్ వాచ్ తో  టైమ్ నోట్ చేసుకుంటూ సన్నివేశం రక్తి కట్టించే విధంగా  ఘంటసాల మాస్టారు నేపథ్య సంగీతం సమకూర్చారు. ఈ సీన్లలో  సంతోషం, విషాదం, కరుణ,  భీభత్సం అని అన్ని రసాలకు తగిన సంగీతం సమకూర్చవలసి వచ్చింది. ఈ రీరికార్డింగ్ రేవతీ స్టూడియో సౌండ్ ఇంజనీర్ కణ్ణన్ ఆధ్వర్యంలో జరిగిన గుర్తు.

ఈ సినీమా రీ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం. ఒక రోజు సాయంత్రం ఆరున్నర సమయంలో టిఫిన్ బ్రేక్ అని అందరు బయటకు వచ్చి ఆ సినిమా కంపెనీ తెప్పించి ఇచ్చిన మైసూర్ బోండా, ఊతప్పమ్, కాఫీలు సేవిస్తూ సరదాగా కబుర్లు  చెప్పుకుంటూన్నారు. అప్పటికి  సాయంకాలపు వెలుగు తగ్గి చీకట్లు కమ్ముతూన్నాయి. ఇంతలో, తూర్పు వేపు ఆకాశంలో  చాలా ఎత్తున ఒక నక్షత్రంలాటిది కదలాడడం కనిపించింది. అది ముందు నేనే చూసాను. అది విమానం లైట్ లా లేదు. ఏమైయ్యుంటుంది. అలా కొంతసేపు ఉన్నచోటే నిశ్చలంగా కనిపించింది. నేను మా నాన్నగారికి చూపించి అడిగాను. ఈ లోగా అక్కడున్న ఇతర ఆంగ్లోఇండియన్ ప్లేయర్స్ కూడా వింతగా చూడడం ప్రారంభించారు. ఒక్కొక్కరు ఒక్కోలా వ్యాఖ్యలు చేయడం మొదలెట్టారు. కొందరు జెట్ ఫ్లైట్ లైటని , మరికొందరు ఫ్లైయింగ్ సాసరని నిర్ధారించారు. అంతకు కొన్ని రోజుల ముందు ఇండియాలో కూడా కొన్ని ప్రాంతాలలో ఫ్లైయింగ్ సాసర్లు కనిపించాయని రూమర్లు వచ్చాయి. ఇది ఆ రకమే అని కొందరు అభిప్రాయపడ్డారు. ఈలోగా టిఫిన్ బ్రేక్ ముగిసి, అందరినీ రికార్డింగ్ ధియేటర్ కు రమ్మనమని పిలుపురావడంతో అందరూ ఆ ఫ్లైయింగ్ సాసర్ విషయం వదలిపెట్టి తమ పనులలో నిమగ్నమయ్యారు. ఆ మర్నాడు తెలిసింది, గత సాయంత్రం ఆకాశంలో కనిపించింది ఒక హాట్ ఎయిర్ బెలూన్ తాలూకు వెలుగని. ఏది ఏమైనా ఆ వెలుగు కారణంగా అందరికీ మంచి కాలక్షేపం జరిగింది.

ఘంటసాల మాస్టారి పాత సినీమాలన్నింటిలో పాటలు ఎక్కువగానే వుండేవి. ఈ సారంగధర చిత్రం లో కూడా పాటలు, పద్యాలు అన్ని కలిపి ఇరవైకి పైగానే ఉన్నాయి. వాటిని ఘంటసాల, పి.భానుమతి, పి.లీల, జిక్కి, మాధవపెద్ది, పిఠాపురం, ఎమ్మెస్.రామారావు, రాఘవులు, స్వర్ణలత ఆలపించారు. అన్నానా భామినీ, ఓ నా రాజా,  అడుగడుగో అల్లడుగో,  సాగేను బాలా  నీ చెంత చేర, కలలు కరగిపోవునా, జయ జయ మంగళగౌరీ, పోయిరా మాయమ్మ వంటి పాటలు చాలా జనాదరణ పొంది ఇప్పటికీ శ్రోతలను రంజింపజేస్తున్నాయి. అలాగే, సారంగధరుడు చిత్రాంగిల మధ్య సంవాద పద్యాలు కూడా ఘంటసాల, భానుమతి గార్ల అభిమానుల మధ్య మంచి ఆసక్తిని, ఆనందాన్ని రేకెత్తించాయి. 

సారంగధర సినీమాకు సంబంధించిన మరొక విశేషం వుంది. అది ఆ సినిమా టైటిల్ మ్యూజిక్. ఈ టైటిల్ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి ఘంటసాల మాస్టారు తమ గురుదేవులు కీ.శే. శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారి స్వరరచనను ఉపయోగించుకున్నారు. అది గురువుగారు, ఆనాటికి వాడుకలో సూర్యకాంతి జన్యరాగంగా ఉన్న  లలితరాగంలో చేసిన 'లలితే సరసగాన కళాశ్రితే' అనే కృతి. ఈ కృతిని టైటిల్ మ్యూజిక్ గా ఉపయోగించి ఘంటసాలవారు తమ గురువుగారు శ్రీ సీతారామశాస్త్రిగారి పట్ల తమకు గల భక్తిని, వినయవిధేయతలను చాటుకున్నారు. గురువుగారు పరమపదించిన సంవత్సరంలోనే సారంగధర సినీమా విడుదలకావడం, గురువుగారి కృతి ఈ సినీమాలో వినపడడం సాలూరి చినగురువుగారి శిష్యులకు, స్నేహితులకు, సహజంగానే కుటుంబ సభ్యులకు అమితానందం కలిగించింది. ఘంటసాలవారి సహృదయతను అందరూ హర్షించారు.


సారంగధర టైటిల్ మ్యూజిక్ - తాతగారి కృతి - సాహిత్యంతో


సారంగధర టైటిల్ మ్యూజిక్ - తాతగారి కృతి - వాద్యసంగీతం

ఘంటసాల మాస్టారు తీరికగా వుండే సమయాలు చాలా తక్కువ. ఎప్పుడూ ఉదయం, సాయంత్రం రికార్డింగ్ లనో, రిహార్సల్స్ అనో, కంపోజింగ్ అనో బయటే గడిపేవారు. మధ్య మధ్యలో బయట వూరు కచేరీలకు వేరే వెళుతూండడంతో ఇంట్లోవారితో సరదాగా గడిపే సమయం వుండేదికాదు. అలా ఎప్పుడైనా సమయం దొరికితే ఇంట్లోవారిని బీచ్ కో లేక స్నేహితుల ఇళ్ళకో తీసుకువెళ్ళేవారు. అప్పుడప్పుడు నేనూ వెళ్ళేవాడిని. అలా ఒకరోజు రాత్రి ఏడు గంటలయ్యాక మాస్టారు, సావిత్రమ్మగారు , పెద్దబాబు, నేనూ కలసి పాత నల్ల న్యాష్ కారులో బయల్దేరాము. ఎక్కడికి వెడుతున్నమో నాకు సరిగా తెలియదు. బీచ్ కు అనుకున్నాను. కానీ, కారు బీచ్ రోడ్ వేపు కాకుండా అడయార్ వేపు మళ్ళింది. వెళ్ళేది బీచ్ కు కాదని అర్ధమయింది. కారు విండోలోనుండి బయటకు చూస్తూవున్నాను. కారు ఒక పెద్ద బ్రిడ్జ్ మీద చీకట్లో వెళుతోంది. క్రింద పెద్ద నదిలాటిది వుంది. దానిని అడయార్ రివర్ అంటారని అందులోని నీరు వెళ్ళి సముద్రంలో కలుస్తుందని చెప్పారు. చీకట్లో స్పష్టంగా తెలియలేదు. (కొన్నాళ్ళకు ఆ అడయార్ బ్రిడ్జ్ శిథిలావస్థకు వచ్చి రాకపోకలు పూర్తిగా ఆపివేశారు. అప్పట్లో ఇవతల ఒడ్డున నెప్ట్యూన్ స్టూడియో, అవతలివేపు థియోసాఫికల్ సొసైటీ, అడయార్ మర్రిచెట్టు వంటి ప్రసిద్ధికెక్కిన స్థలాలుండేవి. ఆ నెప్ట్యూన్ స్టూడియోను ఎమ్.జి.ఆర్. కొని సత్యా స్టూడియోగా మార్చి తన సొంత సినీమాలు ఆ స్టూడియోలో నిర్మించేవారు. ఇప్పుడు అది కూడా మూతబడింది. దానిస్థానే ఎమ్జీయార్ జానకీ రామచంద్రన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి ఉమెన్స్ కాలేజీ నడుస్తున్నది. దానికి ఎదురుగానే దుర్గాబాయి దేశ్ ముఖ్ గారి ఆంధ్రమహిళా సభ హాస్పిటల్, హాస్టల్ వున్నాయి. ఇప్పుడు నది రెండు ప్రక్కలను కలుపుతూ ఒక కొత్త బ్రిడ్జ్ , ఓ ఫ్లై ఓవర్ కట్టారు. పాత జ్ఞాపకాలకు చిహ్నంగా శిధిలమైపోయిన  పాత అడయార్ బ్రిడ్జ్ ఇంకా నిలిచేవుంది. ఆనాటికి వాడుకలోనే ఉన్న ఆ పాత బ్రిడ్జ్ మీదుగా డ్రైవర్ గోవింద్ కారును పోనిచ్చి బిసెంట్ నగర్ బీచ్ కు వెళ్ళే రోడ్ లో ఒక సైడ్ వీధిలో ఒక ఇంటిముందు ఆపాడు. మాస్టారో, అమ్మగారో ఇంటినుండి బయల్దేరేముందే గోవింద్ తో ఎక్కడికి వెళ్ళాలో చెప్పివుంటారు. 

మేము కారు దిగి గేట్లోకి వెళుతూండగానే ఆ ఇంట్లోని ఒక పెద్ద వయసాయన, ఓ నలుగురు ఆడవాళ్లు బిలబిలాడుతూ బయటకు వచ్చి మాస్టారికి, అమ్మగారికి స్వాగతం చెప్పారు. అందరూ కలసి కోరస్ గా "కూర్చుండ మా ఇంట కురిచీలు లేవు..." అంటూ గట్టిగా, సంతోషంగా పాడడం మొదలుపెట్టారు. నాకు వారి ధోరణి చాలా వింతగా అనిపించింది. వారంతా ఎవరో , అలా ఎందుకు పాడారో నాకు తెలియదు. తర్వాత పెద్దయాక తెలిసింది, వారంతా కోరస్ గా పాడినది జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి 'ఉదయశ్రీ' కావ్య ఖండికలోనిదని.

మేమంతా ఒక గదిలో కూర్చున్నాము. మేము వెళ్ళినందుకు ఆ ఇంటివారు బ్రహ్మానందం పొందారు. ఆ ఇంటాయన జడ్జ్ గానో, మేజిస్ట్రేట్ గానో పనిచేసేవారట. భార్య , ముగ్గురు అమ్మాయిలు. అప్పటికి అవివాహితలు. అందరికీ ఘంటసాలవారన్నా, ఆయన పాటన్నా ప్రాణం. నాకు ఆ మనుషులు, వాతావరణం చాలా వింతగా, కొత్తగా తోచింది. చాలాసేపు ఏవో కబుర్లతో గడిచింది. వారంతా ఏవేవో  పాటలు పాడడమే కాకుండా ఘంటసాల మాస్టారిచేత కూడా పాడించి విని ఆనందించారు. సమయం మించిపోతున్నదని తిరిగి బయల్దేరబోతున్న మమ్మల్ని, భోజనం చేసే వెళ్ళాలని పట్టుబట్టి ఆపేసారు. కొంతసేపయ్యాక మా అందరికీ, పెద్ద పెద్ద ప్లేట్లలో అరిటాకులు పెట్టి అందులో నాలుగేసి పెద్ద ఇడ్లీలు, కొబ్బరి చట్నీ వేసి మాముందుంచారు. భోజనం అని చెప్పి ఇప్పుడు ఇడ్లీలు తెచ్చారు. భోజనానికి ఎంతసేపు అవుతుందో. వారింట్లో టిఫిన్, భోజనం చేయాలంటే నాకు మొగమాటంగా అనిపించి వద్దన్నాను. అమ్మగారు, వీళ్ళంతా మనవాళ్ళే, ఫర్వాలేదు తినమని చెప్పారు. ఆ కార్యక్రమం ముగిసిన కాసేపటికి అక్కడనుండి బయల్దేరి ఇంటికి వచ్చాము. కారులో కూర్చున్నంతసేపూ నాకు ఒకటే ఆలోచన. భోజనాలు చేసి వెళ్ళాలని బలవంతపెట్టి, కేవలం టిఫిన్ మాత్రమే పెట్టారని. కొంత వయస్సు వచ్చాక తెలిసింది, తమిళనాట చాలామంది రాత్రిపూట అన్నానికి బదులు ఏవో ఫలహారాలే చేస్తారని, దానినే భోజనం అంటారని.  అప్పట్లో అది నాకు చాలా వింత. మా ఇంటావంటా లేని విషయం. అయితే ఇప్పుడు అందరూ ఏవో కారణంగా రాత్రిపూట అన్నాలకు స్వస్తి చెప్పి ఫలహారాలతోనే గడిపేస్తున్నారు. ఎక్కడో మా నాన్నగారిలాటి పాత తరం పెద్దలు తప్ప.  

ఆ అడయార్ అభిమాన స్నేహితులు మాస్టారింటికి అప్పుడప్పుడు వచ్చేవారు. ఆ అమ్మాయిలు ఘంటసాలవారి ని అన్నయ్య అని, సావిత్రమ్మగారిని వదినా అని పిలిచేవారు. వారి అభిమానం అవధులు దాటిన అభిమానంగా అనిపించేది. 'సావిత్రీ! మీ అడయారు పిచ్చివాళ్ళు వస్తున్నారు' అంటూ ఇంట్లోని రామచంద్రరావులాటి వారు వ్యాఖ్యానించేవారు. ఆయన అలా అనడం నాకు ఇబ్బందికరంగా తోచేది. ఆ కుటుంబమంతా ఎంతో ప్రేమతో అంత దూరం నుండి చూడాలని వస్తే ఈయన అలా వ్యాఖ్యానించడం న్యాయమేనా అనిపించేది. కానీ, ఇంట్లోవారు చెప్పుకునే విషయాలు విన్న తర్వాత తప్పులేదేమో అనిపించింది. ఘంటసాలవారికి, వారికి గల అన్నాచెల్లెళ్ళ బంధం ఈనాటిది కాదని, గత జన్మలో కూడా మాస్టారే తమ అన్నగారని చెప్పేవారట. అలాగే,  ఆనాటి మరొక ప్రముఖ గాయకుడు ఏ.ఎమ్.రాజా, ఆ అమ్మాయిలలో ఒకరికి భర్త అని, అదికూడా పూర్వజన్మ బంధమని, మాస్టారిని చూసిన తరువాత రాజా గారింటికి వెళతామని చెప్పేవారట. ఈ రకమైన వీరాభిమాన కధనాలు విన్నాక, మనుషులలో ఇన్ని రకాల మనస్తత్త్వాలవారు ఉంటారని తెలుసుకున్నాను. ప్రముఖుల పట్ల  వారి అనుయాయులు, అభిమానులు  తమ గౌరవాన్ని, భక్తిని, ప్రేమను వ్యక్తపర్చడంలో ఇదొక భాగమని అర్ధమయింది. అలాటివారిని  సానుభూతితో అర్ధం చేసుకోవాలే తప్ప విమర్శించకూడదని తెలుసుకున్నాను.

1957 డిసెంబర్ లో మరొక ముఖ్య విశేషం చోటు చేసుకుంది. 

ఆ విశేషాలన్నీ వచ్చే వారం......
                   ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Saturday, December 12, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పదవ భాగం

12.12.2020 - శనివారం భాగం - 10*:
అధ్యాయం 2  భాగం 9 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
1955 ల నాటికి మెడ్రాస్ లో ఆటోరిక్షాల సౌకర్యం వచ్చినా అంత విరివిగా ఉండేవికావు. టాక్సీలే ఎక్కువగా కనిపించేవి. దగ్గర దూరాలైతే తోపుడు రిక్షాలనే ఆశ్రయించేవారు. మద్రాస్ సెంట్రల్ స్టేషన్ నుండి ఎగ్మూర్ స్టేషన్ కు వెళ్ళేత్రోవలో రిప్పన్ బిల్డింగ్ ఎదురుగా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ క్రింద, ఎవరెస్ట్ హోటల్ ను అనుకొని ఒక జట్కా స్టాండ్ వుండేది. ఆంధ్రాలోని పల్లెటూళ్ళనుండి వచ్చే యాత్రికులు తమ సైట్ సీయింగ్ కు ఈ జట్కాబళ్ళవాళ్ళనే ఆశ్రయించేవారు. అలాగే సినీమా షూటింగ్ లలో హీరోహీరోయిన్లు పాటలు పాడుకుంటూ విహారార్ధం  వెళ్ళే అలంకార గుర్రబగ్గీలు కూడా అక్కడ కనిపిస్తాయి. (ఇప్పటికీ, అంటే మొన్న మెట్రో రాని రోజుల వరకూ కూడా అక్కడ ఒక గుర్రాలశాలలాంటిది, శిధిలావస్థలోనున్న ఊరేగింపులకోసం సిద్ధంచేసే గుఱ్ఱపు బగ్గీ శకలాలు కనిపిస్తూండేవి). ఎలక్ట్రిక్ ట్రైన్స్, మెట్రో ట్రైన్స్ ఇంత అభివృద్ధి చెందినా, అప్పుడూ  ఇప్పుడూ కూడా మద్రాస్ లో సిటీ బస్సులలో ప్రయాణమే చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. ఆనాడు ఉస్మాన్ రోడ్ చాలా విశాలంగా  రెండు ప్రక్కలా చల్లని నీడనిచ్చే వృక్షాలతో ప్రశాంతంగా వుండేది. ఇప్పుడున్నంత రద్దీగానీ, గృహసముదాయాలు గానీ అప్పుడు వుండేవి కావు. పాతకాలపు మేడలు, పెంకుటిళ్ళు తీర్చిదిద్దినట్లుండేవి. మల్టీస్టోరీడ్ ఫ్లాట్ సిస్టమ్ వచ్చిన మెట్రోపోలిటన్ సిటీస్ లో ఆఖరిది మద్రాస్. ఇటీవలి కాలం వరకు ఇండిపెండెంట్ హౌస్ లు కట్టుకోవాడానికి, అలాటి ఇళ్ళలోనే అద్దెలకు ఉండడానికే మద్రాస్ ప్రజలు ఇష్టపడేవారు.

నెం.35, ఉస్మాన్ రోడ్ కు ఎదురుగా ఒక పాతకాలపు మేడ వుండేది. అది డా. నామగిరిగారిది. నామగిరి అంటే మగవాడనే చాలా రోజులు అనుకునేవాడిని. తర్వాత తెలిసింది, నామగిరి అంటే మధ్య వయసు దాటిపోయిన ఒక మహిళ అని. ఆ ఇంటికి వెనకవేపు ఖాళీస్థలంలో ఒక లాండ్రీ షాప్ ఉండేది. ఆ షాప్ వ్యాసారావు స్ట్రీట్ లోకి వస్తుంది. ఆ ఇంటికి ఎదురుగా కె వి రెడ్డిగారి ఇంటి వెనుక భాగం. అప్పట్లో ఘంటసాలవారు, కె వి రెడ్డిగారు ఇద్దరూ విజయా చిత్రాలకు పనిచేసేవారు. రాత్రిపూట వారింటి లైట్ల వెలుగును బట్టి రెడ్డిగారు స్టూడియో నుండి వచ్చారో లేదో చూసుకొని ఘంటసాల మాస్టారు రావడానికి ఎంత సమయం పడుతుందోనని అమ్మగారు నిర్ధారించుకునేవారు. మాస్టారు ఇంటికి వచ్చేవరకు పోర్టికోలోని ట్యూబ్ లైట్ వెలుగుతూండేది. అయ్యగారు ఇంటికి వచ్చిన తరువాత వాకిట్లో లైట్లు ఆర్పేసేవారు. అంతవరకూ నేను కూడా బయట వాకిట్లోనే కాలక్షేపం చేసేవాడిని. కె వి రెడ్డిగారి ముందుభాగం గేటు మురుగేశ మొదలియార్ రోడ్ లో వుండేది. ఆ వీధిని ఆనుకొని ఉస్మాన్ రోడ్ మీద ఒక నాడార్ కట్టెల అడితి. అక్కడ సమస్త వంటచెరకు, రిటైల్ లో బొగ్గులు, సరుగుడు రాటలు, వెదురు బొంగులు, నిచ్చెనలు, వంటి గృహోపకరణ వస్తువులు అమ్మేవారు. దాని యజమాని కె టి సోమసుందరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు. 1965-66 ప్రాంతంలో పార్టీ ఎమ్ ఎల్ సిగా ఎన్నికైనవాడు. ఎప్పుడూ తెల్లటి ఖధ్ధర్ బట్టలు ధరించి పదిమంది జనాలతో కనిపించేవాడు.

ఆ వీధి దాటాక కోట్స్ రోడ్. ఆ రోడ్ ను ఆనుకొని కుమారి అనే పాతకాలం నటీమణి మేడ. ఆవిడ పాత సుమంగళి, దేవత, మల్లీశ్వరి, కాళహస్తీమహత్యం వంటి సినీమాలలో నటించారు. ఆవిడ మేడ పువ్వుల డిజైన్లతో కూడిన పసుపు, ఆకుపచ్చ రంగుల అద్దాల కిటికీలతో వుండేది. ఆవిడను నేను ఎప్పుడూ ఆ ఇంట్లో చూడలేదు. అయితే, మా నాన్నగారు వాడిన మొదటి వీణ ఆవిడ దగ్గరే కొన్నారని చెప్పిన గుర్తు. ఆ మేడకు ముందో, పక్కనో ఒక హాండ్ రిక్షా స్టాండ్. మా ఇంటికి రెగ్యులర్ గా ఒక వయసైపోయిన రిక్షా అతను అక్కడే వుండేవాడు. పేరు వీరప్పన్  అని గుర్తు. అరవతనే. చాలా నెమ్మదస్తుడు. మా అమ్మగారు, సావిత్రమ్మగారు కూడా ఆ రిక్షా అతను ఉంటేనే తీసుకురమ్మనేవారు. అక్కడే, నాయర్ టీ దుకాణం. ఆ నాయర్ దుకాణం లో టీ, కాఫీ, బన్నులు, బీడీ, చుట్ట, సిగరెట్లు, వక్కపొడి, తామలపాకులు, సీవల్, పొగయిల్ (చిన్న చిన్న పుగాకు కాడలముక్కలు), తమిళం దిన పత్రికలు మొదలైనవి ఆ షాప్ లో దొరికేవి. కార్పరేషన్ ఆఫీసులలో పనిచేసే లేబర్ ఆడా, మగా పనివాళ్ళు, ఇళ్ళలో పాచిపనులు చేసే ఆడవాళ్ళు, అందరూ ఉదయాన్నే ఆ నాయర్ కొట్లో టీ తాగి, సంప్రదాయబధ్ధంగా అన్నింటితో కూడిన తమలపాకులు సేవించి, విధిగా తమిళ పత్రికలలోని వార్తలు చదివి, విని ఆ పిమ్మటే తమ తమ పనులకు బయల్దేరేవారు. ఆ రోజుల్లో మెడ్రాస్ రోడ్లమీది వీధి దీపాల స్థంభాలన్నీ చెయ్యెత్తు మేరకు తెల్లని మరకలతో నిండివుండేవి. ఆ వూరు వెళ్ళిన కొత్తల్లో లైట్ స్తంభాలకు ఆ తెల్ల మరకలు ఎందుకుండేవో తెలిసేదికాదు. మెడ్రాస్ లో అధిక సంఖ్యాకులు ఆడా, మగా ఉదయాస్తమానం వరకూ తమలపాకులు నములుతూనే వుంటారు. అది వారి సంస్కృతి లో భాగమైవుండేది. ఇతర ప్రాంతాలలోలాగా ఇక్కడ మీఠాకిళ్ళిలు, కారాకిళ్ళీలు కట్టి అమ్మే అలవాటు లేదు. ఒక అణాపెడితే ఆకు, వక్క, సీవల్, పుగయిల్, సున్నం ఇత్యాది తాంబూల సామగ్రి దొరికేది. తామలపాకులకు రాసిన సున్నం వేళ్ళను  పక్కనున్న లైట్ల స్థంభాలకు పూయడం, ఒకటి రెండు మీటర్ల దూరం ఊయడం అప్పటి వారి సంస్కృతిలో భాగం.
 
ఆ టీ స్టాల్ నాయర్ ఒక మలయాళీ. చాలా సన్నగా పొడుగ్గా మన రమణారెడ్డిగారిలా వుండేవాడు. మధ్యవయస్కుడు. చామనచాయ. ముందువేపు కొంచెం బట్టతల. వెనకాల భుజాలవరకు గిరజాలజుత్తు వేలాడుతూండేది. గళ్ళలుంగీ, చేతుల బనీన్ ధరించేవాడు. నడుముకు బిగువుగా వెడల్పాటి ఆకుపచ్చ పటకా(బెల్ట్) వుండేది. మా నాన్నగారు తన సిగరెట్లకోసం నన్ను ఆ నాయర్ కొట్టుకే పంపేవారు. నన్ను చూడగానే ఆ నాయర్ ఓ రెండు సిజర్స్ సిగరెట్లు తీసి ఒక ఖాళీ పెట్టెలో పెట్టి ఇచ్చేవాడు.  నేను నోరు తెరచి అడగవలసిన పనేలేదు. మా నాన్నగారి బ్రాండ్ అతనికి బాగా తెలుసు. పాకెట్ ఫుల్ గా సిగరెట్లు కొనిపెట్టుకునే అలవాటు మా నాన్నగారికి ఏనాడు లేదు. ఈ సిజర్స్ కు ముందు బెర్కిలీ బ్రాండ్ సిగరెట్లు కాల్చడం గుర్తుంది. (ఈ బ్రాండ్లు ITC వి. అప్పట్లో ఇంపీరియల్ టొబాకో కంపెనీ. తరువాత, ఇండియన్ టొబాకో కంపెనీగా మారింది.  ఈ ITC  ప్రింటింగ్, ప్యాకింగ్ డివిజన్ మద్రాస్ తిరువొత్తియూరు స్టేషన్ సమీపంలో రైల్లో వచ్చే వాళ్ళకు సిగరెట్ వాసనలు వెదజల్లుతూ దర్శనమిచ్చేది.ఆ రోజుల్లో ఛార్మీనార్ సిగరెట్లకు  కూడాఎక్కువ గిరాకీయే వుండేది. ఆ బ్రాండ్ వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ వారిది (VST). ఈ సిగరెట్ల పొగరెట్ల బారిన నేను ఎప్పుడూ పడలేదు. Smoking is injurious to health' అన్న statutory warning అవసరం నాకెప్పుడూ పడలేదు.

మా నాన్నగారికి జరడా కారా కిళ్ళీల అలవాటు వుండేది. అయితే ఆయన అలవాట్లన్నీ చాలా పరిమితంగా ఆయన స్వాధీనంలోనే వుండేవి. వద్దనుకుంటే ఒక్క క్షణంలో  స్విచ్ ఆఫ్ చేసినట్లు మానేసేవారు. అలాంటి నియంత్రణ చాలా తక్కువమందిలో కనిపిస్తుంది.

జరడా ఖారా కిళ్ళీలు చాలా తక్కువ షాపుల్లోనే దొరికేవి.  అలా దొరికే ఒకే ఒక షాపు పాండీబజార్ మొదట్లో వుండే కైలాసం షాపు. దానిని ఆంధ్రా కిళ్ళీ షాపు అనేవారు. టి.నగర్ ప్రాంతంలో ఈ అలవాటున్న తెలుగువారంతా అక్కడికి చేరేవారు. గీతా కేఫ్, నారాయణ కేఫ్ లలో కాఫీ టిఫిన్లు ముగించుకొని సిగరెట్లు, ఖారాకిళ్ళీల కార్యక్రమం కైలాసం ఆంధ్రా కిళ్ళీషాప్ దగ్గర పెట్టేవారు. నారాయణ కేఫ్ ప్రముఖ నటుడు సి ఎస్ ఆర్ గారికి కేరాఫ్ ఎడ్రస్. నారాయణ కేఫ్ లో టిఫిన్ కాఫీలు సేవించి వచ్చి బయట చెట్టుక్రింద తన బ్రౌన్ కలర్ బ్యూక్ కారును ఆనుకొని చిద్విలాసంగా సిగరెట్ పీలుస్తూ చుట్టూ చేరిన జనాలతో పిచ్చాపాటి సాగించడం సి.ఎస్.ఆర్.గారి నిత్యకృత్యం. ఆంధ్రానుండి వచ్చే తెలుగు సినిమా అభిమాన యాత్రికులకు ఒక అపురూప దృశ్యం. ఆయన ఇల్లు తేనాంపేట ఎల్డామ్స్ రోడ్ లోఎక్కడో వుండేది. కానీ, సిఎస్ ఆర్ గారిని కలుసుకోవాలంటే మాత్రం ఉదయాన్నే నారాయణ కేఫ్ కు వస్తే తప్పక దొరికేవారు. ఇప్పుడు ఆ నారాయణ కేఫ్ లేదు, దానిముందు చెట్టులేదు, చెట్టుక్రింద కారు, కారును ఆనుకొని కబుర్లు చెప్పే సిఎస్ ఆర్ లేరు, ఆ తరం మనుషులెవరూ లేరు. ఇప్పుడు ఆ హోటల్ స్థానంలో అడయార్ ఆనందభవన్ వారి స్టార్ స్వీట్ స్టాల్, దానికి అనుబంధ రెస్టారెంట్ వెలసాయి. 

స్కూల్ కు వెళ్ళే త్రోవలో  పానగల్ పార్క్ బయట చాలా పెద్ద చెట్లుండేవి అందులో ఒక చెట్టుకు దట్టంగా ఆకుపచ్చ రంగులో సన్నటిగొట్టంతో నాలుగైదు తెల్లరేకుల పువ్వులుండేవి. వచ్చేపోయే జనాలమీద పూలజల్లు కురిపిస్తూండేవి. అది దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే నెత్తిమీద ఠంగుమని మొట్టికాయ పడేది. కంగారుగా నాలుపక్కలా చూస్తే గుబురుగా ఊలుబంతి లాటి తెల్లటిపువ్వు. ఆ పువ్వు కాడ చాలా పొడుగుగావుండేది. ఆ పువ్వును చేతిలోకి తీసుకోగానే రేకలన్నీ విడిపోయి ఒక  చిన్న తెల్లటి కాయ బయటపడేది. ఆ కాయ చాలా గట్టిగావుండేది. ఆ కాయ తగిలితే చాలు  ప్రాణం పోయేంత పనేయ్యేది. అలాటి చెట్లు రెండువుండేవి. వాటిక్రిందనుండి వెళ్ళేప్పుడు క్రిందికి పైకి చూస్తూ జాగ్రత్తగా నడవవలసి వచ్చేది. క్లాసులోని కొంతమంది కొంటెపిల్లలు ఆ కాయలతో నెత్తిమీద, మోచేతి ఎముకలమీద, వేళ్ళ కణుపుల మీద కొడుతూ అవతలవాళ్ళు నొప్పితో  ఏడవడం ఒక్కటే తక్కువగా బాధపడుతూంటే చూసి హింసానందం పొందేవారు. కొందరు మాటలతో హింసిస్తారు. కొందరు చేష్టలతో హింసిస్తారు. బలవంతుడి చేతిలో బలహీనుడు ఎప్పుడూ లోకువే. పానగల్ పార్క్ కు నాలుగు పక్కలా ఇనపగేట్లున్నాయి. మూడు పక్కల గేట్లు సాయంత్రం వరకు తాళాలు వేసి మూసేవుంటాయి. స్కూలుకు చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళంకాదు. ఇనపగేటుకు ఇటిక స్థంభాలకు మధ్య పిల్లలు దూరేంత ఖాళీస్థలం వుండేది. ఆ స్థలంలోనుండి పార్క్ లోకి వెళ్ళి మెయిన్ గేటు ద్వారా స్కూలుకు వెళ్ళేవాళ్ళం. పానగల్ పార్క్ లో చాలా పొగడ చెట్లుండేవి. ఆ చెట్లపువ్వులన్ని ఉదయం అయేసరికి క్రిందకు రాలి నేలంతా దట్టంగా గోధుమ రంగు తివాసిలా పరచుకునివుండేది. చల్లటిగాలి, పొగడపూల పరిమళం మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా వుండేది. 

రామకృష్ణా మిషన్ హైస్కూల్ లో చదివేప్పుడు చాలామంది పిల్లలే పరిచయం అయ్యారు. మా ఇంటి వరసలోనే నార్త్ ఉస్మాన్ రోడ్ లోనే, బజుల్లా రోడ్ కు ముందు అల్లాడి రామచంద్రన్ అని ఒక అబ్బాయి. తండ్రి సహస్రనామంగారు, అన్నగారు శంకరన్ ఇద్దరూ పేరుమోసిన అడ్వొకేట్లు. వారింటి మేడమీది భాగం చాలాకాలంపాటు అసంపూర్తి కట్టడంగానే మిగిలిపోయింది. కారణం తెలియదు. ఆ రామచంద్రన్ చాలా తెలివైనవాడు. పెద్దయ్యాక వివేకానందా కాలేజీ ప్రొఫెసర్ అయ్యాడు. శ్రీధర్ అనే అబ్బాయి కోడంబాక్కం ట్రస్ట్ పురం నుండి నడుచుకుంటూ మా ఇంటి గేటు ముందు నిలబడేవాడు. ఇద్దరం కలసి స్కూలుకు వెళ్ళేవాళ్ళం. అతని తండ్రి ధనికొండ హనుమంతరావు గారు. సుప్రసిధ్ధ కధా రచయిత. జార్జ్ టౌన్ లో క్రాంతి ప్రెస్ కు యజమాని. సౌత్ ఉస్మాన్ రోడ్ చివర శివాజీ స్ట్రీట్ నుండి అమాత్య అనే కుర్రవాడు వచ్చేవాడు. పూర్తిపేరు గుర్తులేదు. చాలా సన్నగా, తెల్లగావుండేవాడు. మంచి మృదుస్వభావి. అతని తెలుగు అర్ధమయేది. మా ఇద్దరికి స్నేహం కలసింది, ఆ స్కూల్ లో చదివినంతకాలం. తరువాత, కొన్ని దశాబ్దాలకు తెలిసింది అమాత్య 'చందమామ' రామారావు (అందులో మేనేజర్) గారి అబ్బాయని. రామారావు గారు టివికె శాస్త్రిగారికి, రావి కొండలరావు గారికి మంచి మిత్రుడు. అలాగే, వెస్ట్ మాంబళం నుండి ఎస్ ఎస్ వాసన్ అనే కుర్రవాడు. అతని తెలుగు అరవ యాసే అయినా అతనితో స్నేహం బాగానే కుదిరింది. స్కూల్ వదిలాక శారదా హైస్కూల్ వరకు కలిసే వెళ్ళేవాళ్ళం. అతను అక్కడ ఆగిపోయేవాడు. అతని అక్క ఆ స్కూల్ లో చదివేది. ఆ అమ్మాయి వచ్చేవరకు వుండి, ఆమెతో కలిసి ఇంటికి వెళ్ళేవాడు. 'నీ పేరు ఎస్ ఎస్ వాసన్. జెమిని స్టూడియో నీదే కదా, ఈ పక్కనే వున్న వాసన్ స్ట్రీట్ నీదే. కష్టపడి వెస్ట్ మాంబళం వరకు ఎందుకు, వాసన్ స్ట్రీట్ లోకి వచ్చెయ్యొచ్చు కదా' అని అనేవాడిని, అదేదో గొప్ప జోకులా. నా మాట అర్ధమయేదో లేదో కానీ ఓ నవ్వు పారేసేవాడు. వీళ్ళేకాక, శ్యామసుందర్లాల్ (అతనిల్లు జి.ఎన్ చెట్టి రోడ్ లో రామకృష్ణా గ్రౌండ్స్ వెనకాల చాలా పెద్ద మేడ. వారింట్లో దట్టంగా సంపెంగ చెట్లుండేవి. దొరైసామీ రోడ్ నుండి వచ్చే యతిరాజులు, శేషశాయి, శేషగిరి వెంకటగిరి( పెద్దయ్యాక సి.ఎ. చేసి పెద్ద కన్సల్టెన్సీ నడిపాడు), విజయరాఘవాచారి రోడ్ లోని డి.ఎస్ శాస్త్రిగారి అబ్బాయి; సుబ్రి అనే సుబ్రహ్మణ్యం, నుంగబాక్కం నుండి వచ్చే చల్లావారి అబ్బాయి (పేరు గుర్తు లేదు). అతని అన్నగారు రాజశ్రీ ప్రొడక్షన్స్ లో ఆఫీస్ మేనేజర్ గా పనిచేసేవారు. అలాగే, మా ఇంటికి ఎదురు వీధి వ్యాసారావు స్ట్రీట్ చివరన వుండే నటుడు రమణారెడ్డిగారి అబ్బాయి ప్రభాకరరెడ్డి, తిరుమూర్తి స్ట్రీట్ నుండి ఒక అబ్బాయి వచ్చేవాడు. అతను శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రిగారి మేనల్లుడు. అలాగే శ్రీ ముదిగొండలింగమూర్తిగారి ఆఖరి ఇద్దరు అబ్బాయిలు మాస్కూల్ లోనే చదివేవారు. పెద్దతను మా క్లాస్ మేట్. త్యాగరాజనుకుంటాను. తమ్ముడు శివశంకర్, అన్నదమ్ములు ఇద్దరూ వైలిన్, మృదంగాలమీద శాస్త్రీయ సంగీత సాధన చేసేవారు. వాళ్ళ ఇల్లు స్కూలుకు ఆనుకొనివుండే నానారావు నాయుడు వీధి చివరలో వుండేవారు. ఆ వీధి టి.నగర్ పోస్టాఫీస్ కు, పాండీబజార్ కు వెడుతుంది.  స్కూలు అయ్యాక చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు లింగమూర్తిగారు కూడా సంధ్యావందనం చేసుకుంటూ కనిపించేవారు. ఆయన సినీమా నటుడంటే నమ్మలేనట్లుండేవారు.

అలాగే మొసలికంటి శరత్చంద్రకుమార్ మా స్కూలుకు ఒక స్టార్ అట్రాక్షన్. బాల నటుడిగా కొన్ని సినిమాలలో ప్రముఖ పాత్రలు వహించాడు. అంతేకాదు. అతను మంచి కర్నాటిక్ క్లాసికల్ వైలినిస్ట్. అతను విజయనగరం ద్వారం వారి శిష్యుడు. ఆయన పినతండ్రి ఎమ్ ఎస్ రావుగారు ఘంటసాలగారి పార్టీలో, కోదండపాణి పార్టీలో వైలినిస్ట్. తరువాత కాలంలో ఆయన కూడా శ్రీ వెంపటి చినసత్యంగారి నృత్యనాటకాలకు వైలిన్ వాయించేవారు. ఈ శరత్చంద్రకుమార్ మన మాస్టారి రెండో అబ్బాయి రత్నకుమార్ కు వైలిన్ గురువు. మౌంట్ రోడ్డులోని బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరిలో పనిచేసేవారు.

ఇలా చాలమంది తెలుగు పిల్లలు మా క్లాస్ లో వుండేవారు. ఈ పిల్లలంతా స్కూలు ప్రారంభం కావడానికి ఒక గంటముందే పార్క్ లో చేరి బొంగరాలాట, గోళీలాట మొదలెట్టేవాళ్ళు. అన్నిటికంటే 'నుండీ' (ఒంటికాలిమీద పరిగెడుతూ ఇతరులను తాకడం) ఆట చాలా పోటాపోటీగా ఆడేవాళ్ళు. 

నేను రామకృష్ణా మిషన్ లో చదివేప్పుడు తెలుగు విద్యార్ధులందరికీ చుక్కల్లో చంద్రుడిలా ఒక అబ్బాయి వెలిగిపోతూండేవాడు. నాకు ఒకటో రెండో క్లాసులు సీనియర్. ఎర్రటి హంబర్ సైకిల్ మీద బజుల్లా రోడ్ నుండి వచ్చేవాడు. రోజూ చూసేవాడిని, కానీ పరిచయం కలగలేదు. పేరు రామకృష్ణ. అతని చుట్టూ చాలా స్నేహబృందమే వుండేది. అందుకు కారణం తరువాత తెలిసింది. ఆ అబ్బాయి సుప్రసిద్ధ నటుడు ఎన్ టి రామారావు గారి పెద్ద అబ్బాయని. (పాపం! ఆ రామకృష్ణ 1962లో  వాళ్ళ తాతగారింటికి నిమ్మకూరు వెళ్ళి అక్కడ  చాలా అర్ధాంతరంగా కాలంచేశాడు. అసలు కారణం తెలియదు. కానీ నేను వినడం సన్ స్ట్రోక్ వల్ల చనిపోయాడని. ఏమైనా  ఈ దుర్మరణం రామారావు గారి దంపతులకు తట్టుకోలేని విఘాతమే. అతని పేరుమీదుగానే ఎన్ టి రామారావు గారు హైదరాబాద్ లో రామకృష్ణా హార్టీకల్చరల్   సినీమా స్టూడియో నిర్మించారు).

1957వ సంవత్సరంలో 'నెం.35,ఉస్మాన్ రోడ్' లో చాలా సంఘటనలు చోటుచేసుకున్నాయి. సంగీతదర్శకుడిగా ఘంటసాల మాస్టారికి 1957 చాలా విజయవంతమైన సంవత్సరం. ఆ ఏడాది మాస్టారివి ఐదు సినీమాలు విడుదలై మంచి విజయం సాధించాయి. అలాటివాటిలో ఒక సినీమా గురించి గత వారం ముచ్చటించడం జరిగింది. అదే వినాయకచవితి. ఈ వారం, ఘంటసాలవారి సంగీతదర్శకత్వంలో వచ్చిన మరో సెన్సేషనల్, ఆల్ టైమ్ రికార్డ్ సినీమా 'మాయాబజార్' సినీమా గురించి కొన్ని విశేషాలు. 'మాయాబజార్' విజయం గురించి సాధన గురించి, సంగీతపరంగా అందులోని పాటల గురించి నెలకొల్పిన రికార్డ్ ల గురించి మీ అందరికీ బాగా తెలిసిందే. నేను ప్రత్యేకించి చెప్పేదేమీ లేదు. మాయాబజార్ సినీమా వినాయక చవితి కంటే ఒక ఐదు మాసాలు ముందే రిలీజయింది. 1957 మార్చ్ 27 న మాయాబజార్ సినీమా విడుదలయింది. 

అంతకు పదిరోజుల ముందు నెం.35, ఉస్మాన్ రోడ్ లో ఒక శుభకార్యం చోటుచేసుకున్నది. మార్చ్ 17  రాత్రి  మా ఇంట శిశూదయం. మాకు తమ్ముడు పుట్టాడు. ఘంటసాలవారి లోగిట్లో నాలగవ శిశువు. మా తమ్ముడు పుట్టిన సమయంలో 'మాయాబజార్' క్లైమాక్స్ రీరికార్డింగ్ జరుగుతున్నది. ఆ సమయంలో ఘంటసాల మాస్టారు వాహినీ స్టూడియో లో వున్నారు. రాత్రంతా రీరికార్డింగ్ ముగించుకొని ఉదయం ఇంటికి చేరారు. మాస్టారు ఇంటికి రాగానే సావిత్రమ్మగారు ఈ శుభవార్తను మాస్టారికి తెలియజేశారు. ఆయన చాలా సంతోషించి ఈ పిల్లవాడు పుట్టిన సమయంలో రాత్రి స్టూడియోలో శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనం, దాని తరువాత వచ్చే క్లైమాక్స్ రీరికార్డింగ్ చేస్తూవున్నామని, అదే సమయంలో మన ఇంట గోపాలకృష్ణుడే జన్మించాడని అందుచేత, పిల్లవాడి పేరు గోపాలకృష్ణ అని సంతోషంగా ప్రకటించారట. మా తమ్ముడికి 'గోపాలకృష్ణ' పేరే పెట్టడం జరిగింది. బాలసారె రోజునో, అ తరువాతో గుర్తులేదు కానీ  ఘంటసాల మాస్టారు మా తమ్ముడికి తన పేరు, వాడిపేరు కలిసి వచ్చేలా నీలం రంగు 'G' అక్షరం గల ఒక ఉంగరాన్ని బహుకరించారు. మాస్టారు వాడిని ముద్దుగా చూసేవారు. వాడికి ఆరు మాసాలు వచ్చాక, ఆయనకు తీరికున్న సమయాలలో మా గోపిని తన గుండెల మీద కూర్చోపెట్టుకొని ముచ్చట్లాడేవారు.


ఘంటసాలగారు ఎత్తుకుని ఆడించినప్పటి గోపాలకృష్ణ

మాయాబజార్ చిత్రం పాటల రికార్డింగ్, రీరికార్డింగ్ లకు సంబంధించి నాకు ప్రత్యక్ష అనుభావాలు లేవు. కానీ నేను విన్న విషయం ఒకటుంది. మాస్టారి పెద్దబ్బాయి విజయకుమార్ కు చిన్నప్పటి నుండి లయజ్ఞానం బాగా వుండేదని అనుకునేవారు. అప్పుడప్పుడు మాస్టారు సంగీతం చేసే సినిమాల రికార్డింగ్ లు, రీరికార్డింగ్ లలో ఫైనల్ టేక్ వరకు రిధిమ్స్ సెక్షన్లో ఏదో ఒక వాద్యాన్ని తీసుకొని వాయించేవాడు. అంత చిన్న వయసులో అంత చక్కగా వాయించడం చూసి  అందరూ ముచ్చటపడేవారు. ఫైనల్ టేక్ లో మాత్రం వేరే ఆర్కెష్ట్రావారు వాయించేవారు. అలాగే, మాయాబజార్ సినీమాలో రధం గుర్రపు డెక్కల చప్పుళ్ళు మాస్టారి పెద్దబాబు వినిపించాడని అనేవారు. ఈ మాయాబజార్ విషయం తెలియదు, కానీ, వేరే సినీమా రీరికార్డింగ్ లో చూసాను. ఒక చిన్న కర్ర పలకమీద దట్టంగా ఇసుకపర్చి దానిమీద రెండు కొబ్బరిచిప్పలను బోర్లించి లయబధ్ధంగా చేతితో వాయిస్తే గుర్రపుడెక్కల చప్పుడు వచ్చేది. ఇప్పుడున్నన్ని ఎలక్ట్రానిక్ వాద్యపరికరాలు ఆ రోజుల్లో వుండేవి కావు. మామూలుగా దొరికే వస్తువులుతోనే కావలసిన సౌండ్ ఎఫెక్ట్స్ రాబట్టేవారు. గుహల తలుపులు తెరవడానికి బెలూన్లు; పక్షుల అరుపులకోసం ప్లాస్టిక్ చిలకబొమ్మలలో నీరుపోసి వేళ్ళు అడ్డంపెట్టి ఊదితే రకరకాల పక్షుల సౌండ్స్ వినిపించేవి. ఆకాశంలో ఉరుములు, పిడుగుల చప్పుళ్ళకి పల్చటి టిన్ షీట్లను మైకు ముందు టైమింగ్ ప్రకారం ఝాడిస్తే ఉరుముల్లా వినపడేవి. అలాగే రంపంమీద వైలిన్ కమాన్ పెట్టి వాయిస్తే కొన్ని భయంకరమైన సౌండ్స్ పుట్టేవి. అయితే ఈ రకమైన ఎఫెక్ట్స్ వాయించడానికి కూడా కృషి, సాధన, నేర్పు కావాలి. ప్రతి ఆర్కెష్ట్రా లో రిథిమ్ సెక్షన్లో ఇలాటి సౌండ్ ఎఫెక్ట్ స్పెషలిస్ట్ లు వుండేవారు. పెద్దబాబు చిన్నప్పుడు సరదాగా రిహార్సల్స్ టైములో మొరాకోస్, కబాష్, టాంబొరిన్, వంటి వాద్యాలను వాయించేవాడు. పెద్దయ్యాక పియోనో వాద్యం మీద మంచి పట్టు సాధించి తన తండ్రిగారి పాటలకు పియోనా వాయించాడు. ఆ విశేషాలన్నీ మరోసారి చూద్దాము.మాయాబజార్ సినిమా విడుదలకు ముందు స్టూడియో లో చాలాసార్లు ప్రివ్యూలు వేసారు. నేను స్టూడియోలోనే మూడుసార్లు చూసిన గుర్తు. సినీమా ప్రివ్యూ పూర్తికాగానే ఆ సినీమా కు సంబంధించిన ముఖ్యులంతా వరసగా ధియేటర్ బయట నిలబడగా,  సినీమా చూడడానికి వచ్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, గాయకులు, పత్రికలవారు ఒక్కొక్కరుగా వచ్చి దర్శక నిర్మాతలకు, ముఖ్య నటులకు, సంగీత దర్శకునికి తమ అభినందనలను తెలిపారు. మాయాబజార్ చూసినవారిదంతా ఒకే అభిప్రాయం.' సినీమా అధ్భుతం. నూరు రోజులు గ్యారంటీ'. 


      మాయాబజార్ లో మోహినీ భస్మాసుర నృత్య రూపకం

ఆ రోజున శ్రీసాలూరి రాజేశ్వరరావు గారు మాస్టారిని గట్టిగ వాటేసుకొని "మాస్టారు సంగీతం చాలా బాగా వచ్చింది. అన్నిపాటలు హిట్టవుతాయి" అని సంతోషంతో మాస్టారి చేతులు పట్టుకొని అన్న మాటలు నాకు బాగాగుర్తు. 

మాయాబజార్ చిత్రాన్ని ఘంటసాల మాస్టారి గురువుగారైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారి కి విజయనగరంలో ఆయన స్నేహితులు, శిష్యులు పట్టుపట్టి బలవంతాన తీసుకువెళ్ళి చూపించారని, గురువుగారు ఆ సినీమా చూసి చాలా సంతోషించారని వినికిడి. తన శిష్యుడి అభివృద్ధిని, ప్రతిభను స్వయంగా చూడగలిగారు.

మరిన్ని విషయాలతో వచ్చేవారం... 
                    ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.


Saturday, December 5, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - తొమ్మిదవ భాగం

05.12.20 - శుక్రవారం భాగం - 9*:
అధ్యాయం 2 భాగం 8 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1956 లో అశ్వరాజ్ ప్రొడక్షన్స్ వారు 'వినాయకచవితి' సినీమా నిర్మించబోతున్నారని, ఆ సినీమాకు ఘంటసాలవారే సంగీతం సమకూరుస్తారని తెలిసింది. నిర్మాత కె.గోపాలరావు. దర్శకత్వం సముద్రాల రాఘవాచార్యులవారు. కధ, మాటలు, పాటలు కూడా వారివే. ఎన్ టి రామారావు, జమున, కృష్ణకుమారి, గుమ్మడి, రాజనాల, ఆర్ నాగేశ్వరరావు,  మొదలగువారు నటిస్తారని తెలిసింది. ఈ సినీమా ప్రారంభోత్సవం అశ్వరాజ్ ప్రొడక్షన్స్ ఆఫీస్ లో జరపడానికి ముహుర్తం నిర్ణయించారు. ఆ ప్రారంభోత్సవానికి వెళ్ళడానికి సిధ్ధంగా వుండమని మా నాన్నగారికి కబురు అందింది. ఆ ఫంక్షన్ కు వెళ్ళడానికి అందరికంటే ముందు నేను సిధ్ధమైపోయాను. ఈ చిత్రంలో నటించేవారంతా వస్తారని నా ఉద్దేశం. 

ఆ కార్యక్రమం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో. ఆ రోజు వినాయకచవితి పండగరోజు కూడానేమో. సరిగా గుర్తులేదు. కానీ, ఆ సమయంలో అప్పుడప్పుడు వానలు పడేవి. 

అశ్వరాజ్ ప్రొడక్షన్స్ ఆఫీస్ కోడంబాక్కం యునైటెడ్ ఇండియా కాలనీలో ఫాతీమా చర్చ్  కు సమీపంలో ఒక మేడ మీద వుండేది. ముహూర్తం సమయం లోపునే మాస్టారు, మా నాన్నగారు, వారితో పాటు పామర్తిగారు, నేను ఆ ఆఫీస్ కు చేరుకున్నాము. అక్కడ ఒక హాల్ లో ఒక గోడవారగా పెద్ద టేబిల్ మీద పెద్ద వినాయకుడి విగ్రహం పెట్టి పువ్వుల దండలతో అనేక రకాల పళ్ళతో సకల అలంకారాలు చేసారు. ఆ విగ్రహమే వినాయకచవితి సినీమా టైటిల్స్ లో కనిపిస్తుంది. నిలువెత్తు విగ్రహం. చాలా ఆకర్షణీయంగా కనిపించింది. ఈ ప్రారంభోత్సవ పూజను  (తాండ్ర) సుబ్బయ్యశాస్త్రి గారు నిర్వహించారు. ఆయనను సినీమా శాస్త్రులుగారు అనేవారు. కొత్త సినీమా ప్రారంభోత్సవాలు, సినీమాలలో పెళ్ళిళ్ళకు పౌరాహిత్యం, అలాగే సినీమా వారిళ్ళలో పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఇతర శుభకార్యాలు అన్నీ ఆయన చేతులమీదుగా, మంత్రోచ్ఛాటనతోనే జరిగేవి. అన్నిరకాల కార్యక్రమాలు జరపడానికి కావలసిన మందీ మార్బలం ఆయనకు వుండేది. పాండీబజార్ చెరియన్ బ్రదర్స్ వెనకవేపు వారిల్లుండేది. ఘంటసాలవారింటి కార్యక్రమాలకు సుబ్బయ్యశాస్త్రి వచ్చేవారు. చాలా బిజీ పురోహితుడు. ఆ రోజుల్లోనే ఒక పురోహితుడు కారు, టెలిఫోన్ ఉపయోగించేవారంటే ఆయన కీర్తి ప్రతిష్టలు ఊహించుకోవచ్చును. (సుబ్బయ్య శాస్త్రిగారి వారసత్వాన్ని వారి ఇద్దరి కుమారులు ఆశ్వినిశాస్త్రి, రోహిణీశాస్త్రులు అందిపుచ్చుకొని తండ్రికి  తగ్గ తనయులుగా పేరుపొందారు. ఈ సోదరుల ఇల్లు మా ఔట్ హౌస్ గోడకు ఆనుకొని ఆనంద్ స్ట్రీట్ లో ఉండేది. నటుడు, నిర్మాత కృష్ణంరాజు, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, మాడా వెంకటేశ్వరరావుల తొలి రోజులు ఆ వీధిలోనే గడిచాయి.)

అశ్వరాజ్ ప్రొడక్షన్స్ వినాయకచవితి సినీమా ప్రారంభోత్సవానికి చాలామందే వచ్చారు. నటీనటులలో ఒక్క కృష్ణకుమారి తప్ప మిగిలినవారెవరిని చూసిన గుర్తులేదు. నిర్మాత కె. గోపాలరావు, డైరెక్టర్ సముద్రాల,  అసిస్టెంట్ డైరక్టర్ జి.ఎన్ స్వామి (ఆయనే ఆ సినిమాలో శివుడు కూడా), సంగీత దర్శకుడు ఘంటసాల, మరికొందరు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. సినీమా ప్రారంభోత్సవం రోజున వచ్చిన ముఖ్యులంతా దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితి.  ఘంటసాలవారు, సముద్రాల గారు, కొబ్బరికాయలు కొట్టారు. మొదటి దెబ్బకే కొబ్బరికాయ సమానంగా రెండు ముక్కలుగా విరిగిందంటే ఆ సినీమా హిట్టవుతుందని సినీమా సెంటిమెంట్. ఈ విధమైన ఉత్సాహభరిత విషయాలు చెప్పడంలో సుబ్బయ్యశాస్త్రిగారు దిట్ట. అదే సమయంలో వానపడింది. అదీ శుభసూచకమే అని చెప్పారు. 

నేను చూడాలని ఆశించిన నటులు కనపడలేదనే కొరత మిగిలిపోయినా, అక్కడి వినాయకచవితి పండగ వాతావరణం నాకు చాలా సంతోషం కలిగించింది. కొన్నాళ్ళకు, వినాయకచవితి సినీమా పాటల రికార్డింగ్ జరిగింది. సినీమా షూటింగ్ మొదలయింది

వినాయకచవితి చిత్రం ప్రారంభంలో ఆలయంలో వినాయక చతుర్ధి కథను బోధించె సాధువు వేషంలో మోపర్రు దాసు కనిపిస్తారు. ఆయన ఘంటసాల మాస్టారి చిరకాల మిత్రుడు. అసలు పేరు బసవలింగాచారి. ఆంధ్రదేశంలో హరికథకుడిగా మంచిపేరు వుండేది. అప్పుడప్పుడు సినీమాలలో హరికథకుడుగా నటించేవారు. షావుకారు, రోజులు మారాయి (ఏరువాక సాగాలోయ్ లో ఒక డప్పులవాడు), విప్రనారాయణ, వినాయకచవితి మొదలైన పాత సినీమాలు చాలా వాటిలో హరికథలు,  చిన్న చిన్న వేషాలలో కనిపించేవారు. అలాటి సమయాలలో సినిమా షూటింగ్ లకు మద్రాస్ వస్తే మాస్టారింటి మేడ మీదే బస చేసేవారు. బయట షూటింగ్ లు చూసుకొని ఏ రాత్రికో ఇంటికి వచ్చేవారు. మర్నాటి ఉదయం మిత్రులు ఇద్దరూ చుట్టలు కాల్చుకుంటూ కారు షెడ్  దగ్గర  కబుర్లు చెప్పుకునేవారు. 

మోపర్రు దాసుగారు ఆజానుబాహువు, గిరజాల జుత్తు. పచ్చటి శరీరం. చాలా మంచి గాత్రం. ఆ వయసులో నాకు ఆయన దగ్గరకు వెళ్ళాలన్నా, మాట్లాడలన్నా భయం భయంగా వుండేది. ఉదయాన్నే లేచినప్పుడు చూస్తే ఆయన కళ్ళు చాలా ఎ‌ర్రగా ఉండేవి.  

వినాయక చవితి పాటల కంపోజింగ్ అప్పుడప్పుడు మాస్టారి ఇంట్లోనే జరిగేది. అలాటి సమయాలలో సముద్రాల రాఘవా చార్యులుగారితో పాటు  ఆ సినీమా అసోసియేట్ డైరెక్టర్ జి.ఎన్. స్వామి, నిర్మాత కె. గోపాలరావు సోదరుడు, ప్రొడక్షన్ మేనేజర్ కె. హనుమంతరావు కూడా  మాస్టారింటికి వచ్చేవారు.  


జి.ఎన్ స్వామి  గడచిన తరం నటుడు. కొన్ని సినీమాలలో హీరోగా కూడా నటించారు. ఆయన వచ్చినప్పుడల్లా పెద్దబాబును చూసి బాల వినాయకుడి వేషం మన బాబు చేత వేయిస్తే బాగుంటుంది. చాలా ముద్దుగా వున్నాడు, నేను డైలాగ్స్ నేర్పుతాను, మేకప్ టెస్ట్ చేద్దాం అంటూ హడావుడి చేసేవారు. పెద్దబాబు (విజయకుమార్)ను ఇంటి వెనకవేపు కారు షెడ్ దగ్గర నిలబెట్టి, ఇలా నడు, అలా పక్కకు తిరుగు, చెయ్యి ఇలాపెట్టు, ఈ కర్ర యిలా పట్టుకో అంటూ హంగామా చేసేవారు. పెద్దబాబు చేత అలా చేయిస్తూంటే నాకు చాలా ఉత్సాహంగా వుండేది.  ఇంకేముంది, మర్నాటి నుండే షూటింగ్ కు పిల్చుకుపోతారని, నిజంగానే ఆ వేషం పెద్దబాబే వేస్తాడనుకునేవాడిని. అయితే ఈ విషయంలో అయ్యగారు కానీ, అమ్మగారు కానీ పెద్ద ఆసక్తి చూపలేదు. 

వినాయకచవితి సినిమా పూర్తి అయి రీరికార్డింగ్ స్టేజ్ కు వచ్చింది. ఒక రోజు మాస్టారి కోసం సినీమా ప్రొజెక్షన్ వేసారు. అలాటప్పుడు  నిర్మాత, దర్శకుడు, సంగీతదర్శకుడు, వారి సహాయకులు మాత్రమే హాజరవుతారు. నాకు మొదటినుండి సినీమా షూటింగ్ లు చూడడం కన్నా పాటల రికార్డింగ్, రీరికార్డింగ్ చూడడంలోనే చాలా ఆసక్తిగావుండేది. ఆవిధంగా ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన అనేక సినీమాల రికార్డింగ్ లకు, ప్రొజెక్షన్లకు, రీరికార్డింగ్ లకు వెళ్ళేవాడిని. రీరికార్డింగ్ కోసం ఒక రష్ ప్రింట్ ను తయారుచేస్తారు.  దానిని చూసి  ఏ ఏ సందర్భాలలో నేపథ్యసంగీతం అవసరమౌతుంది, ఒక్కొక్క సన్నివేశం ఎంతసేపు సాగుతున్నది, ఏ రకమైన వాద్యాల అవసరం వుంటుంది, రీరికార్డింగ్ కు ఎన్ని రోజులు తీసుకుంటుందనే విషయాలమీద సంగీత దర్శకుడు ఒక అవగాహనకు వస్తారు. దాని ప్రకారం నిర్మాత ధనం సేకరించుకొని స్టూడియో లో రికార్డింగ్ ధియేటర్ బుక్ చేసి ఆర్కెష్ట్రా వారికి టైమ్  తెలియజేస్తారు. 

రీరికార్డింగ్ జరిపేప్పుడు ముందు  సీన్ బై సీన్ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేస్తారు. ఆ సమయంలో డైలాగ్స్ మీద ఆడియో వుండదు సైలంట్ గా వుంటుంది. ఆ సైలంట్ సీన్ ఎంతసేపు జరుగుతున్నదో  స్టాప్ వాచ్  చూస్తూ ఎన్ని నిముషాలు, ఎన్ని సెకెండ్ల  టైమ్ పడుతున్నదో నోట్ చేసుకుంటారు. తరువాత, మాస్టారు హార్మోనియం మీద సందర్భోచితంగా మ్యూజిక్ కంపోజ్ చేయడం మొదలెడతారు. (హర్మోనియం వాయించడంలో అంత  అనుభవం లేదు) ఈలోగా వచ్చిన ఆర్కెష్ట్రా ప్లేయర్స్ ధియేటర్ బయట కులసాగా పేకాటతో, కబుర్లతో  కాలక్షేపం చేస్తూంటారు. థియేటర్లో మాస్టారు హార్మోనియం వాయిస్తూ పాడుతూండగా మా నాన్నగారు నోటేషన్స్ వ్రాయడం జరుగుతుంది. ఆ నొటేషన్స్ ను మా నాన్నగారు హార్మోనియం మీద వాయిస్తూండగా స్టాప్ వాచ్ సాయంతో టైమ్ నోట్ చేసి చూస్తారు. అనుకున్న టైముకు మ్యూజిక్ సెట్ అవగానే ఆ బిట్ కు ఏ ఏ వాద్యాలు అవసరమౌతాయో, ఎవరెవరు ఏ బిట్స్ వాయించాలో నిర్ణయించి వారికి ఆ నొటేషన్స్ చెపుతారు. ఎప్పటికప్పుడు వెంటవెంటనే నొటేషన్ చూసి వాద్యాలను నిర్దిష్టంగా వాయించాలంటే ఎంతో ప్రతిభ, అనుభవం కావాలి. అలాటివారే సినీమారంగంలో రాణించగలుగుతారు. సంగీతంలో నిష్ణాతులైనా సినీమా సంగీతం టెక్నిక్ కు అలవాటు పడకపోతే వాద్యకారులుగా నిలదొక్కుకోలేరు. గుంపులో గోవిందాగా కాకుండా సోలో స్పెషలిస్ట్ ప్లేయర్స్ గా రూపొందడానికి చాలానే కష్టపడాలి. కృషి చేయాలి. అలాటి వాద్యగాళ్ళకు మంచి డిమాండ్, రాబడి వుంటుంది.  ఓ పదిమంది వైలినిస్ట్ లు ఛిన్ క్రింద వైలిన్ ను నిటారుగా పెట్టి మహాస్పీడ్ గా వాయిస్తూంటే చాలా థ్రిల్ గా వుండేది. కర్నాటిక్ కచేరీలలో లా వైలిన్ ను కాలిమీద ఆన్చిపెట్టుకొని వాయించే పధ్ధతి సినీమా ఆర్కెష్ట్రా లో కుదరదు. ఒక్క రిధిమ్స్ సెక్షన్ తప్ప మిగిలిన వారంతా కుర్చీల మీద కూర్చునే వాయించాలి. ఎదురుగా నొటేషన్ స్టాండ్స్, మైకులు విడివిడిగా ఏర్పరుస్తారు. ఆర్కెష్ట్రా నొటేషన్స్ వ్రాసుకున్నాక ఒకసారి ప్లే చేస్తారు. అవసరమైన మార్పులు చేర్పులు జరుగుతాయి. ఒకటికి రెండు సార్లు రిహార్సల్ చేసి పిక్చర్ ను చూస్తూ  ప్రొజెక్షన్ మీద ఆ మ్యూజిక్ ను ప్లే చేస్తారు. తృప్తికరంగా అనిపిస్తే ఒకటి రెండు రిహార్సల్స్ చూసి ఫైనల్ టేక్ కు వెళతారు. ఆ సీన్ కు సింక్ అయేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అమరుస్తారు. ఈ క్రమంలో ఒక్క సెకెండ్ తేడా వచ్చినా సన్నివేశంలో అనుకున్న ఎఫెక్ట్ రాదు. అలాగే, డైలాగ్స్ పోర్షన్స్ మీద రీరికార్డింగ్ మ్యూజిక్ వాల్యూమ్  ఎంత లెవెల్ వుండాలి, సైలెంట్ షాట్లమీద ఎంత వాల్యూమ్ వుండాలనే విషయం మీద సంగీతదర్శకుడికి పూర్తి అవగాహన వుండాలి. మంచి సంగీతం అమరిందని హై వాల్యూమ్ లో మిక్స్ చేస్తే మాటలు సరిగా వినపడక గోలగోలగా వుంటుంది. రీరికార్డింగ్ మ్యూజిక్ సన్నివేశానికి బలం చేకూర్చడానికి, రసోత్పత్తిని కలిగించడానికి మాత్రమే అని గాఢంగా విశ్వసించే సంగీత దర్శకుడు ఘంటసాల. తన సంగీత ప్రతిభను చాటుకోవడానికి సన్నివేశాన్ని ఏనాడూ ఖూనీచేయలేదు. అలాగే, ఘంటసాలవారి టైటిల్ మ్యూజిక్ కాంపొజిషన్ కూడా చాలా విశిష్టంగా వుండేది. ఘంటసాలగారి సంగీతంలో వచ్చిన అనేక చిత్రాలలో నేపథ్య సంగీతం ఒక ప్రత్యేకత కలిగివుండి ప్రేక్షకులకు వీనులవిందు చేసేవి. జానపదం సినీమాలలో కత్తియుద్ధాలైనా, సాంఘిక సినీమా ఫైట్లయినా ఘంటసాలవారి సంగీతం సరళంగానే సాగేది. వక్ర స్వరాల సమ్మేళనం చాలా అరుదుగా వినిపించేవి. కత్తియుద్ధాల మీద వినిపించే నేపథ్యంలో కూడా అంతర్లీనంగా ఒక శ్రావ్యమైన పాట వింటున్న అనుభూతి నాకు కలిగేది.

ఇలా మొత్తం సినీమా అంతా పూర్తికావడానికి కనీసం మూడు నాలుగురోజులైనా పడుతుంది. అందుకోసం డబల్ కాల్షీట్లు (9 to 9) పనిచేస్తారు. పాతరోజులలో ఒక్కోసారి నైట్ కాల్షీట్లు కూడా పనిచేయవలసి వచ్చేది. మ్యుజీషియన్స్ యూనియన్ ప్రాబల్యం ఎక్కువైనాక ఆదివారాల రోజున, రాత్రి 10 గంటల తరువాత రికార్డింగ్ లు, రీరికార్డింగ్ లు జరపడం మానేసారు. ఈ విషయంలో కూడా ఘంటసాల మాస్టారి చొరవ, కృషి ఎంతో వుంది. ఆ విషయాలు మరోసారి చూద్దాము.

వినాయకచవితి రీరికార్డింగ్ చూచేందుకు నేనూ వెళ్ళేవాడిని. ప్రసేనుడు(రాజనాల), శతధ్వనుడు( ఆర్ నాగేశ్వరరావు) సత్యభామ అంతఃపురంలోకి వచ్చిన కృష్ణుడిని (ఎన్.టి.రామారావు) బంధించడానికి పడే పాట్లమీద వచ్చే నేపధ్య సంగీతం, ప్రసేనుడు వేటకోసం గుర్రం మీద వెళ్ళేప్పుడు వినవచ్చే సంగీతం, కృష్ణుడు ప్రసేనుడిని వెతుకుతూ రథం మీద వెళ్ళేప్పుడు వినపడే సంగీతం; జాంబవంతుని గుహలో కృష్ణుడు , జాంబవంతుని గదాయుధ్ధం సీన్ లో వినపడే సంగీతం; ఇవి రీరికార్డింగ్ జరిపినప్పుడు దగ్గరుండి చూశాను. పౌరాణికం సినీమా కావడం వలన చాలా హుషారుగా, సరదాగా గడిచిపోయేది. ఒక్కోసారి లంచ్ కూడా స్టూడియో లోనే జరిగేది. కృష్ణుడు, జాంబవంతుని గదాయుద్ధంలో గదల చప్పుడు వినపడేదికాదు. యుధ్ధం మ్యూజిక్ మాత్రమే రికార్డ్ చేశారు.ఎందువలన అలాజరిగింది? ఎందుకు గదలు మ్రోగడం లేదు అని అనిపించేది. ఆ గదల చప్పుడు ఎఫెక్ట్స్ అన్నీ ట్రాక్ మిక్సింగ్ టైమ్ లో వేస్తారని తరువాత తెలిసింది.

వినాయక చవితి సినీమాలోని పాటలు పద్యాలు ఈనాటికీ అజరామరం. 'దినకరా శుభకరా', 'రాజా ప్రేమ చూపరా' (హిందోళం), 'కలికి నే కృష్ణుడినే', 'హరే నారాయణ', 'చిన్ని కృష్ణమ్మ చేసిన వింతలు', 'నలుగిడరే నలుగిడరే' ఈ పాటలన్నీ బహుళజనాదరణ పొందాయి.

'నలుగిడరె నలుగిడరే' అనే నలుగు పాటకు స్ఫూర్తి సావిత్రమ్మగారు వినిపించిన ఒక నలుగు పాట. ఈ తరహా స్త్రీల పాటలు గత తరంలో పల్లెటూళ్ళలో మహిళ నోట వినవచ్చేవి  అని మా నాన్నగారు (శ్రీ సంగీతరావు గారు) ఘంటసాల మాస్టారి సంగీత విశిష్టత గురించి తెలియజేసే వ్యాసాలలో రాయడం జరిగింది.

"దినకరా శుభకరా" పాట జగద్విఖ్యాతి పొందిన అద్భుత గీతం. కామవర్ధని (పంతువరాళి)/పూర్యాధనశ్రీ (హిందుస్థానీ) రాగంలో స్వరపర్చారు. వినాయకచవితి సినిమా తర్వాత ఘంటసాల మాస్టారు తమ కచేరీలన్ని 'దినకరా శుభకరా' పాటతోనే ప్రారంభించేవారు. గతంలో కూడా చెప్పాను, ఘంటసాలవారి సంగీత కచేరీ వినడం ఒక గొప్ప అనుభూతి. అక్కడ సినిమా పాటలు వింటున్నామని అనిపించదు. సశాస్త్రీయమైన సంగీతానుభూతి ఘంటసాలవారి కచేరీలలో కలిగేది. ఈ 'దినకరా' పాట ఒక్కటే దాదాపు పది పన్నెండు నిముషాల పాటు రాగాలాపనలతో, నెరవల్ తో ఆలపించి శ్రోతలను తన్మయులను చేసేవారు. 

ఈ పాటకు మొదట్లో సముద్రాల వారు ఒక అనుపల్లవి కూడా రాసారు. 'సకలభువన సుఖకారణ కిరణా మౌనిరాజ పరిపూజిత చరణా నీరజాత ముఖ శోభన కారణ...దినకరా" ఏ కారణం చేతనో ఈ అనుపల్లవి సినీమాలో పెట్టలేదు. అలాగే, గ్రామఫోన్ రికార్డ్ లో కూడా వుండదు. కానీ, ఘంటసాల మాస్టారి కచేరీలలో మాత్రం విధిగా పాడేవారు. ఘంటసాలవారి విదేశాలలో జరిగిన కచేరీలలో కూడా ఈ అనుపల్లవితో కూడిన 'దినకరా శుభకరా' పాట పాడడం జరిగింది
సినీమా పూర్తయింది. ఈ చిత్రంతో సంబంధమున్న వారందరి కుటుంబాలకోసం స్టూడియో లో ప్రివ్యూ వేసారు. సినీమా చాలా బాగుంది. శ్రీకృష్ణుడిగా ఎన్ టి రామారావు చాలా అందంగా కనిపించారు. చాలా మంచి నటన ప్రదర్శించారు, సినిమాకు ఘంటసాలవారి సంగీతం హైలైట్  అనే టాక్ సర్వత్రా వినిపించింది. ఈ వినాయకచవితి సినిమా విషయంలో ఒక విమర్శకూడా వచ్చింది. పౌరాణికం సినీమాలో టెలిగ్రాఫ్ స్థంభాలు , వై‌ర్లు ఔట్ డోర్లో చూపించారని, ద్వాపరయుగంలో టెలిఫోన్ స్థంభాలు , వైర్లు ఎక్కడినుండి వచ్చాయనే వ్యంగ్య వ్యాఖ్యలు పత్రికా సమీక్షలలో వచ్చాయి. అయినా, ప్రేక్షకులు ఆ విమర్శలగురించి పెద్దగా పట్టించుకోలేదు. 1957లో విజయవంతమైన సినీమాలలో 'వినాయకచవితి' చిత్రం కూడా ఒకటి.


వినాయకచవితి ప్రివ్యూ చూశాక, జి ఎన్ స్వామిగారు చెప్పినట్లుగా బాలగణపతి రూపంలో  పెద్దబాబు కనపడకపోవడం నాకు కొంత నిరాశ కలిగించింది.

నెం.35, ఉస్మాన్ రోడ్ పోర్టికో లో నుండి మెట్లెక్కి వరండాలోకి రాగానే కుడిచేతి వేపు ఒక గది వుండేది. అలాటి గదే పైన మేడమీద కూడా ఒకటి వుండేది. ఈ క్రింది గదికి వరండాలోనుండి ప్రవేశం, పక్కనున్న సందులోనుండి మేడమీదికి ఒక ద్వారం. అక్కడ కూడా గదిలోకి ద్వారం వుండేది. ఈ క్రింది మీది గదులు ఆఫీసు రూమ్ లు గాను ఎవరైనా గెస్ట్ లకోసం ఉపయోగించేవారు. పెద్దబాబు ట్యూషన్ క్రింది రూమ్ లో జరిగేది. ఆ ట్యూషన్ చెప్పే మాస్టారు ఒక ముసలాయన, అరవై ఏళ్ళు దాటివుంటాయి. పేరు రంగయ్య పంతులు అని గుర్తు. ఎప్పుడూ చేతిగొడుగుతో వచ్చేవారు. పెద్దబాబు ను ఆ మాస్టారి ఎదుట కూర్చోపెట్టడానికి అమ్మగారు, పిన్నిగారు చాలానే కష్టపడవలసి వచ్చేది. రంగయ్య పంతులుగారు చాలా ఓపికగా అల, వల, తల అని, ఎబిసిడి అంటూ ఇంగ్లీష్ అక్షరాలు ఒకటి నుండి వంద వరకు, రెండో ఎక్కం వంటివి పుస్తకం చూపి చదివించేవారు. ఆయన చదివి వినిపించినవాటిని అలాగే చదివేవాడు. మధ్యలో నుండి అక్షరం అడిగినా, అంకెలు అడిగినా సమాధానం వచ్చేదికాదు. అలాగే తలదించుకొని మారుమాట లేకుండా కూర్చొనేవాడు. పాపం! రంగయ్యగారు ఓపికగా మళ్ళీ పుస్తకం చూపి ఒక్కొక్క అక్షరం, అంకె చెపితే వాటిని రిపీట్ చేసేవాడు. ఇలా ఒక గంట అయాక ట్యూషన్ ముగిసేది. మరల మర్నాడు సాయంత్రం ఇదే పధ్ధతి. మధ్య మధ్య అమ్మగారో, మాస్టారో వచ్చి పెద్దబాబు ప్రోగ్రెస్ గురించి అడిగేవారు. ఆ పంతులుగారికి ఏం చెప్పాలో తెలిసేదికాదు. ఎలాగైనా అడిగిన ప్రశ్నలకు పెద్దబాబు చేత సమాధానం చెప్పించాలని నానా యాతనా పడేవారు. ఇంగ్లీషు అక్షరాలన్నీ వరసపెట్టి చదివించేవారు. వాటిలో నుండి ఏదైనా ఒక అక్షరం చూపి అదే అక్షరమో చెప్పమంటే నోరు మెదిపేవాడు కాదు. అందులోనూ నాన్నగారు, అమ్మగారి సమక్షంలో అయితే ఒక్కమాట పెగిలేదికాదు. ఆ మస్టారికి ఎలాగైన సమాధానం చెప్పించాలి. P అక్షరం చూపి ఇదేం అక్షరం అని అడిగి ఆయనే సైలంట్ గా పెదవులతో ప్రామ్టింగ్ చేసేవారు. బాబు పంతులుగారి పెదవులు చూసి టక్కున 'B' అనేవాడు. ఆయన 'P' అని సైలంట్ గా చెప్పేవారు. అయినా సరైన సమాధానం వచ్చేది కాదు. అలాగే అంకెలు. 'నాలుగు తర్వాత ఎంత? అని అడిగి ఐదువేళ్ళు చూపి ఎంత చెప్పు అనేవారు. ఇతను నోటితో చెప్పకుండా ఐదువేళ్ళు తిరిగి చూపేవాడు. ఈ విధంగా పెద్దబాబు ట్యూషన్ ప్రహసనం కొన్నాళ్ళు సాగింది. ఆ రంగయ్య పంతులుగారు ఎన్నాళ్ళు చదువు చెప్పారో గుర్తులేదు. 

అయితే కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. కొన్నాళ్ళపాటు స్కూలుకు వెళ్ళిరావడం అలవాటు అయాక స్కూల్ లో టీచర్లు చెప్పేవి వినగా వినగా అన్నీ ఒంటబడతాయి. పెద్దబాబు అంతే.

పెద్దబాబు ట్యూషన్ గుర్తు చేసుకున్నప్పుడల్లా నాకు మరో ట్యూషన్ గుర్తుకు వస్తుంది. అది నటి శ్రీదేవి తమ్ముడు సతీష్ (పిన్ని కొడుకు, నటి మహేశ్వరి తమ్ముడు)కు నేను చెప్పిన ట్యూషన్. ఆ విశేషాలు తెలియాలంటే మరో అధ్యాయం దాకా ఆగాలి. 

నెం.35, ఉస్మాన్ రోడ్ లో మరికొన్ని జ్ఞాపకాలు... వచ్చేవారం.....
             ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.