అనుకోడానికి
సప్తస్వరాలే అయినా అవి 12 స్వరస్థానాలుగాను (16 పేర్లతో)*, 22 శృతులుగాను విభాగం చెందడం వల్ల ఆరోహణ, అవరోహణలలో ఔడవ, షాడవ, సంపూర్ణ స్వరాల
కలయికతో – permutation and combination భేదాలతో – అవి కొన్ని వేల రాగాల వరుసలు (మూర్ఛన – scale)గా రూపొందించవచ్చన్నది తెలిసిన విషయం. ఆ వరుసలలో కొన్నివేల రాగాలు పేర్లతో
వ్యవహరించడానికి వీలుగా నామకరణ చేయబడ్డాయి. అవి సప్తస్వరాలూ ఉన్న సంపూర్ణ రాగాలయిన 72 మేళకర్త రాగాలలో ఏదో ఒకదానికి
జన్యరాగాలు అయే అవకాశం ఉంది. జనాదరణ వల్ల వాటిలో కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
పేరు లేనివి, ఉన్నా ప్రచారంలో లేని వరసలు కొన్ని వేలుంటాయి. అప్పుడప్పుడు కొందరు
ఔత్సాహికులు పేరు తెలియని వరుసలకి కొత్త పేర్లు పెట్టడం జరుగుతుంది. సామాన్యులు దీనిని
కొత్త రాగం కనిపెట్టడంగా భావిస్తుంటారు.
*సప్తస్వరాలు పదహారు పేర్లతో పన్నెండు స్వరస్థానాలుగా విభాగం చెందితే - 1. షడ్జమం. 2. శుధ్ధ రిషభం. 3. చతుశ్రుతి రిషభం (శుధ్ధ గాంధారం అని మరో పేరు). 4. సాధారణ గాంధారం (షట్ శ్రుతి రిషభం అని మరోపేరు). 5. అంతర గాంధారం. 6. శుధ్ధ మధ్యమం. 7. ప్రతి మధ్యమం. 8. పంచమం. 9. శుధ్ధ ధైవతం. 10. చతుశ్రుతి ధైవతం (శుధ్ధ నిషాదం అని మరో పేరు). 11. కైశిక నిషాదం (షట్ శ్రుతి దైవతం అని మరో పేరు). 12. కాకలి నిషాదం. ఉదా: మొదటి మేళకర్త - కనకాంగి కి శుధ్ధ నిషాదం అంటే చతుశ్రుతి ధైవతానికే ఆ పేరు. 72 మేళకర్తల విభాగం ఈ 16 పేర్లను అనుసరించే చేయబడింది. న్యాయంగా 2 గాంధారాలు, 2 నిషాదాలు మొదలైన 12 స్వరాల ఆధారంగా అయితే 72 మేళకర్తలు రావు.
పండిత వెంకటమఖి రచించిన చతుర్దండి ప్రకాశిక (72 మేళకర్తలు), నాదముని పండితుల రచన- సంగీత స్వరప్రస్తార సాగరం (2044 రాగాలు) వంటి సంగీత గ్రంధాలను పరిశీలిస్తే ఏ వరుసకి ఏ పేరు ఉంది అని తెలుసుకోవచ్చు. వీటిలో ప్రచారంలో ఉన్న అనేక రాగాల పేర్లు కనిపిస్తాయి.
ఆ విధంగా ప్రచారంలో లేని రాగ
వరుసలో ఉన్న ఊహలు గుసగుసలాడే అన్న పాట సౌదామిని రాగంగా గుర్తించడం జరిగింది. ఒక
అన్యస్వర ప్రయోగం వల్ల సుమనేశరంజని అన్న మరో ప్రచారంలో లేని రాగఛాయలు కూడా ఆ పాటలో
ఉన్నాయి.
సంప్రదాయం, బానీ, ప్రాంతీయ పధ్ధతులననుసరించి కొన్ని రాగలక్షణాలు, పేర్లలో
తేడాలు గమనించవచ్చు. రాగవిభాగంలో ఏ రకమైన తేడాలు లేకుండా ఏకరూప్యత సాధించడానికి,
దక్షిణ భారత సంగీత విద్యార్ధులందరూ ఏకీకృత పాఠ్యప్రణాళికను అనుసరించడానికి వీలైన
ప్రయత్నాలు సంగీత విద్వాంసుల సదస్సుల్లో జరుగుతూంటాయి. చాలా కాలం క్రితం మద్రాసు
మ్యూజిక్ అకాడమి expert’s committee లలిత, వసంత రాగాల విషయంలో ఈ విధమైన మార్పులు
చేయడం జరిగింది.
ఇప్పటి వసంత అప్పట్లో లలిత. నాడు వసంత నేడు లలిత. ఉదాహరణకి ఒకనాడు లలిత రాగంలో ఉన్న "సీతమ్మ మాయమ్మ "కీర్తనను ఈనాడు వసంత రాగంగా గ్రహిస్తున్నారు.
పట్రాయని సీతారామశాస్త్రిగారి కృతి - “లలితే సరసగాన కళాశ్రితే” ని లలిత రాగంలో సమకూర్చినా, దాన్ని ప్రస్తుతం వసంత రాగంగా భావించడానికి గల నేపధ్యం, ఈ లలిత, వసంత రాగాల లక్షణాలు,
గురువుగారి సంగీత రచన, సంగీతరావుగారి మాటల్లో.... గాత్రంలో... వినండి.
No comments:
Post a Comment