visitors

Saturday, September 26, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పధ్ధెెనిమిదవ భాగం

25.09.20 - శుక్రవారం భాగం - 18*:
పదిహేడవ భాగం ఇక్కడ

అశృనివాళిగత రెండు మాసాలుగా తీవ్ర అస్వస్థతతో  బాధపడుతున్న మధుర గాయకుడు శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు  నేడు స్వర్గస్తులయ్యారన్న వార్త మాకెంతో విచారాన్ని, ఆవేదనను కలిగిస్తున్నది. వారి మృతిపట్ల మా పట్రాయని కుటుంబం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నది. శ్రీ బాలసుబ్రహ్మణ్యంగారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాము.

ఘంటసాలవారి తర్వాత, గాయకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా కోట్లాది సంగీతాభిమానుల ప్రేమాభిమానాలను చూరగొన్న వ్యక్తి శ్రీ బాలసుబ్రహ్మణ్యంగారు. గాయకుడిగానే కాక హృదయమున్న మంచి వ్యక్తిగా,  స్నేహశీలిగా బాలూగారు అందరి ప్రేమాభిమానాలను పొందారు.
 
1970  లో మొదటిసారిగా ఘంటసాలవారి రజతోత్సవ సందర్భంగా వారిని రెండుసార్లు కలిసాను. అదే ప్రధమ పరిచయం. తరువాత, 1981 నుండి బిసిఐసి, మద్రాస్ తెలుగు అకాడెమీ కార్యకలాపాలలో దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు బాలుగారితో పరిచయం మరింత దృఢపడింది. సాటి కళాకారుల పట్ల ఎంతో అభిమానం కనపరుస్తూ, వర్ధమాన కళాకారుల పురోభివృధ్ధికి ఎంతగానో కృషిచేశారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యంగారి వంటి అనుభవశాలిని భారతీయ సినీ సంగీత జగత్తు కోల్పోవడం తీరని లోటు. ఆ దివంగత కళాకారునికి నా హృదయపూర్వక శ్రధ్ధాంజలి ఘటిస్తున్నాను.
            స్వరాట్


మద్రాస్ సిటిజన్స్ కమిటీ (1980)

భాగం 18

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
విజయనగరంలో ఫస్ట్ ఫారమ్ చదివిన నేను సెకెండ్ ఫారమ్ అక్కడ చదవలేదు.  నా చదువు బొబ్బిలికి మారింది. కారణం, మా నాన్నగారు వృత్తిపరంగా ఆ వూరొదిలేయడం కూడా కావచ్చును. బొబ్బిలిలో మా అమ్మగారి మేనమామ, సామవేదుల నరసింహంగారింటికి చేరాను. 

శ్రీ సామవేదుల నరసింహంగారు రెండో అక్కగారి మనుమలు మనుమరాండ్రతో

ఆయన బొబ్బిలి కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో పెద్ద గుమస్తాగా, క్యాషియర్ గా పని చేసేవారు.  పిన్నవయసులోనే ఆ ఉద్యోగంలో చేరారు. ఆయన అందులో ప్రవేశించినప్పుడు ఆయన జీతం నెలకు 15 రూపాయలు. ఆ జీతంతో తన అక్కగారిని (మా నాన్నగారి చిన్నత్త, మా అమ్మగారి తల్లిగారు), ఆవిడ పెద్ద కూతురిని, ఆ కూతురి ఒక్కగానొక్క కూతురిని పోషించేవారు. ఆయన జీవితమంతా ఆ బ్యాంక్ లోనే గడిచింది. ఆయన మా బొబ్బిలి తాతగారు. ఆయన భార్య చిన్నతనంలోనే ప్రసవ సమయంలో, పుట్టిన బిడ్డతో సహా పోయింది. ఆ తరువాత, మా తాతగారు మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. తన ఇద్దరి అక్కగార్లను, రెండో అక్కగారి పిల్లలను, మనుమలను, మనవరాండ్రను సంరక్షించడంతోనే కాలం గడచిపోయింది. మా అమ్మగారు శ్రీలక్ష్మి (బొబ్బిలిలో తెలిసినవాళ్ళంతా సుందరి అని పిలిచేవారు). ఆవిడకు మూడేళ్ళ వయసులో మా నాన్నగారితో వివాహం జరిగింది. అప్పటికి ఆయన వయసు తొమ్మిదేళ్ళు. శారదా ఆక్ట్ అమలవుతుందని తెలిసిన వెంటనే అంత చిన్న వయసులో పెళ్ళి జరిపించేశారు. 

   


   శారద చట్టం
బిడ్డయగు నొక స్త్రీని యిరువదియొక్క యేండ్లకులోపు వయసుగల పురుషుడు పెండ్లియాడినచో వానికి శిక్ష 1000 రూపాయలు జుల్మానా. అంతకు మించిన వయసున్న పురుషుడైతే శిక్ష ఖైదు జుల్మానా రెండూను.

శారదా ఆక్ట్ అమలులోకి వచ్చాక పెళ్ళిళ్ళు జరపాలంటే వరునికి 21 సంవత్సరాలు, వధువుకు 14 సంవత్సరాలు పూర్తికావాలనేది చట్టం.

మా అమ్మమ్మగారు ఆకుండి అప్పలనరసమ్మ (బంధుజనానికి అప్పడు)గారు మా నాన్నగారికి వేలు విడిచిన మేనత్త. బొబ్బిలిలో మా తాతగారు సింహాలు బాబుగా చిరపరిచితులు. ఆయన నివసించే పూరిల్లు ఆయన సొంతం కాదు. ఆయన కజిన్ ది. ఆయన పేరు కూడా సామవేదుల వరాహ నరసింహమే. ఆయనను అందరూ వరహాలుగారని పిలిచేవారు. ఆయన రైల్వేలో గార్డ్ గా   పనిచేస్తూ ఒరిస్సా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఉండేవారు. బొబ్బిలి ఎప్పుడోకాని వచ్చేవారు కాదు డ్యూటీ మీద తప్ప. ఆ వరహాలు గారికి మాతాతగారు అన్నా, ఆ అక్కచెల్లెళ్ళనా అభిమానం. ఆ కారణంగా తన ఇంటిని పూర్తిగా మా తాతగారికి అప్పగించేసారు. ఆ యింటికి సంబంధించిన మంచి చెడ్డలన్నీ మా తాతగారి మీదే ఒదిలేశారు. వరహాలుగారు కానీ, ఆయన డాక్టర్ కొడుకు కానీ, నాకు తెలిసి, వారీ బొబ్బిలి ఇంటివిషయంలో ఏనాడు కలగజేసుకోలేదు. మా బొబ్బిలి తాతగారు పరమ సాత్వికుడు. అతిమిత భాషి. చాలా తెలివైనవారు. ఆయన మితభాషిత్వమే నాకూ అబ్బింది. వివాదాలకు ఆమడ దూరం. (ఆమడ అంటే రెండు మైళ్ళా? నాలుగు మైళ్ళా? గుర్తులేదు).

సింహాలు బాబుగారు త్రికాలాలో సంధ్యవార్చేవారు. వండిన వంటలు దేవతార్చన అయ్యేకనే భోజనకార్యక్రమం. ఆ సమయంలో తడిపి ఆరేసిన వేరే బట్టలు కట్టుకునే భోజనాలు చేయాలి.  భోజనాలు అరటి ఆకుల్లోనే. భోజనానంతరం ఆయనకు తాంబూలం వేసుకునే అలవాటు. ఆయన దగ్గర  నగిషీలు చెక్కిన ఒక పాన్దాన్ వుండేది. అందులో ఆకు, వక్క, సున్నం, లవంగం, ఏలక్కాయ వంటి వస్తువులు పెట్టుకునేందుకు వీలుగా వుండేది. తన తాంబూల సేవనం అయ్యాక, నాకు బాగా గుర్తు,  నాకు బాగా చిన్నప్పుడు, నన్ను తన గుండెలమీద కూర్చోపెట్టుకొని  పాటలు, పద్యాలు, శ్లోకాలు చదివేవారు. అలాటివాటిలో "చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ" ఒకటి. ఆ పద్యంలో "బంగారు మొలతాడు పట్టుదట్టీ"లు మాత్రం బాగా జ్ఞాపకం ఉండిపోయాయి.

మా సామవేదుల వారి సందులో మొదటి మూడిళ్ళూ పూరిళ్ళే. మేమున్నదానికి  మిద్దె. ఆ పైన కప్పు వుండేది. ఆ ఇల్లు మట్టితో సున్నంతో కట్టేరట. నాకు తెలిసే సరికే ఆ యిల్లు కట్టి వంద సంవత్సరాలు దాటిందని చెప్పుకునేవారు. ముందు వెనకల ఇల్లు. మధ్యవాకిలి. వీధిలో ఒక వసారా. ఆ వసారాలోని గోడల మీద రెండు వరసల్లో కొన్ని నిలువుగీతలు , కొన్ని చుక్కలు ఉండేవి. అవి ఎందుకో ఎవరు పెట్టేవారో తెలిసేది కాదు. అలాటి నిలువు గీతలు, చుక్కల బొట్లు మరికొంతమంది ఇంటి గోడలమీదా చూసాను. ఇలాటి గీతలు భానుమతి నటించిన ఆలీబాబా 40 దొంగలు సినీమాలో కూడా తరువాతెప్పుడో చూసాను. ఒకసారి అరటి ఆకులు సప్లై చేసేవాడు, తమలపాకులు సప్లై చేసేవాడు వచ్చి అరటి ఆకుల కట్ట ఇచ్చి గోడమీద  ఆకు పసరుతో ఒక నిలువు గీత పెట్టేడు. తర్వాత వచ్చిన తమలపాకుల వాడు ఓ కట్ట తమలపాకులు ఇచ్చి గోడమీద  ఆకు పసరుతో ఒక బొట్టు పెట్టాడు. ఇలా వాళ్ళు నెలంతా గీతలు, బొట్లు పెట్టి నెలాఖరున వాటి లెఖ్ఖకట్టి డబ్బులు తీసుకునేవారు. వాళ్ళ దగ్గర వేరే ఎకౌంట్ బుక్సేం ఉండేవి కావు. గోడలే ఎకౌంట్ బుక్స్. ఆ గీతల డబ్బులు చేతిలో పడగానే గోడలమీది గీతలను‌, బొట్లను తుడిపేసేవారు. కొత్త నెలకు మళ్ళీ ఫ్రెష్ గా నిలువుగీతలు, పెద్ద బొట్లు తయారయేవి. అలాటి వసారాను దాటుకొని లోపలకు వెళ్ళగానే కుడిచేతివేపు ఒక గది (దానికి మిద్దె ఉండేది). తర్వాత వాకిలి దాటాక మరో వసారా. లోపల నట్టిల్లు. పూజాగది కూడా అదే. అక్కడ ఒక అటక. తర్వాత వంటిల్లు. కర్రలు, బొగ్గుల పొయ్యిలు, కుంపట్లు వుండేవి. అది దాటితే వెనక పెరడు. మంచినీళ్ళ నుయ్యి. ఆ నూతి చప్టాలమీదనే  స్నానం. ఆ నుయ్యి రెండిళ్ళవారికి కామన్. వారికి, వీరికి సంబంధంలేకుండా మధ్యన మట్టిగోడలు. ఇంటికి దూరంగా టాయ్లెట్స్. వర్షాకాలంలో చాలా ఇబ్బంది అయేది. పెరట్లో జామి, నారింజ, కరివేపాకు చెట్లు, దట్టమైన మల్లి, కనకాంబరం, చామంతి పూల మొక్కలు. పొట్ల, బీర, ఆనప, దొండ, చిక్కుడు పాదులు, గోంగూర మొక్కలతో పచ్చపచ్ఛగా ఉండేది. అందరి పెరళ్ళూ ఇలాటి పాదులు, మొక్కలతో కలకలలాడేవి. పెరళ్ళలో ఐంటికి ఇంటికి మధ్య గోడలున్నా, అవి దాటి ఇతరుల ఇళ్ళకు వెళ్ళే ఎత్తులోనే వుండేవి. మా ఇంటి మధ్య వాకిట్లో మందార, రంగు రంగుల పట్టెడ పూల మొక్కలు (చంద్రకాంతలు), గులాబీ, ఎర్రగన్నేరు (కొన్ని ప్రాంతాల్లో 'కరివేరు' అంటారు) చెట్లుండేవి. గోడవారగా వరసగా రుద్రజడ మొక్కలుండేవి. ఆ ఆకు రసం చెవిపోటుకు దివ్యౌషధం. ఎంతటి నొప్పైనా వెంటనే తగ్గిస్తుంది. ఆ రుద్రజడ గింజలను సబ్జాగింజలంటారు. ఎండాకాలంలో ఆ గింజలతో బళ్ళమీద, షాపుల్లోనూ షర్బత్ లు అమ్మేవారు. సబ్జాగింజలు ఒంటికి చలవచేస్తుందట. ఇల్లు పాతకాలంది కావడంవల్ల గోడలన్నీ పచ్చ తివాసిలా పాకుడుపట్టివుండేది. అక్కడ రోకలిబండలు, నల్లగా నిగనిగలాడుతూ పసుపురంగు చుక్కలతో కలర్ ఫుల్ గా గాజుపురుగులు గుంపులుగా పరిగెడుతూ ఉండేవి. తరచూ బొరిగెలతో గోడలను చెక్కుతూ శుభ్రపరుస్తూండేవారు. ప్రతీ పండగకు గోడలన్నీ పేడతో అలికి, సున్నం వేసి గోడల క్రిందిభాగం ఎర్ర జేగురుతో పూసి వాటి మీద వరిపిండి, సున్నం పేస్ట్ మిక్స్ తో చక్కగా బొట్లు, ముగ్గులు పెట్టేవారు.  ఆ సమయంలో వసారా గోడమీది  ఎకౌంట్స్ మాయమైపోయేవి.
ఈ రకమైన ఇంటిపనులన్నీ మా అమ్మమ్మగారు, దొడ్డమ్మగారే చేసుకునేవారు.  ఇళ్ళు నేయడం , పురిగడ్డితో కప్పడం వంటి పనులకు  బయట మనుషులు వచ్చేవారు. అలా ఇంటి కప్పులు పాతవి మార్చి కొత్తవి వేసేప్పుడు తేళ్ళు, జెర్రిలు, పాములు బయటపడేవి. వాటన్నిటిని తొలగించి రెల్లుగడ్డితో కప్పేవారు. ఒకసారి ఇల్లు నేయిస్తే కనీసం మూడేళ్ళవరకు తిరిగి చూడనక్కరలేదు. ఆ ఇళ్ళమీద పుల్లగుమ్మడి, తియ్యగుమ్మడి, ఆనప, దోస, బీర పాదులుండేవంటే ఆనాటి ఇళ్ళనేత ఎంత పటిష్టమైనదో ఊహించుకోవచ్చును.

ఇంట్లో పూచిన పువ్వులు ఆడవారి పూజలకు వినియోగించేవారు. మా తాతగారు తన పూజా పుష్పాలు తను పని చేసే బ్యాంకు నుండి కోసుకు తెచ్చుకునేవారు. అక్కడ ఆ పువ్వుల మొక్కలను నాటి పెంచి పోషించేది ఆయనే. బ్యాంక్ తాళాలు ఆయన దగ్గరేవుండేవి. ఇంటి బాధ్యత అంతా తానే చూసుకునేవారు. ఇంట్లోవారికి ఏది అవసరమైనా వెంటవెంటనే గమనించి అమర్చిపెట్టేవారు. చాలా గోప్యమైన వ్యక్తి. ఎటువంటి ఆర్భాటం, హడావుడి లేకుండా గుట్టుగా సంసారం నడిపేవారు. నిర్వికార యోగి. బ్యాంక్ స్టాఫ్ కు ఆయనొక దైవం. అతి మర్యాదగా వ్యవహరించేవారు. ఈయన కూడా ఎవరి విషయాల్లో జోక్యం చేసుకునేవారు కాదు. తనేమిటో,తన పనేమిటో అంతవరకే. విజయనగరం తాతగారింటి వాతావరణానికి, బొబ్బిలి తాతగారింటి వాతావరణానికి పరస్పర విరుధ్ధం. విజయనగరం ఇల్లు ఇరవైనాలుగు గంటలు పాటలు పద్యాలు, వచ్చేపోయే జనాలతో ఒకే హడావుడి. బొబ్బిలి ఇల్లు ప్రశాంతంగా ఒక మునివాటికలా ఉండేది. ఎప్పుడో సాయంత్రం పూట మాఇంటి నూతినీరు తియ్యగా వుంటుందని మాకు పరిచయస్తుల కుటుంబాల ఆడవారు బిందెలతో వచ్చేవారు. మా ఇంటిలో పువ్వులు పెట్టుకునేవారు లేనందున పెరట్లోని పువ్వులను కోసి ఆ వచ్చే ఆడవాళ్లకు పంచేవారు. అలాగే, పండగలకు, పబ్బాలకు కూరగాయలు, కరివేపాకు, నారింజ వంటివి పంచిపెట్టేవారు. హడావుడి జీవితానికి అలవాటు పడ్డవాళ్ళు బొబ్బిలి ఇంటిలో ఒకరోజు కూడా గడపలేరు. ప్రశాంతమైన, నియమబధ్ధ జీవితానికి అలవాటుపడినవారికి ఆ యిల్లెంతో చాలా ఆహ్లాదకరంగా వుంటుంది. నా బాల్యం, చదువు అలాటి వాతావరణం లో జరిగింది. అందువలన నాకు ఎక్కువగా ఒంటరిగా గడపడంలోనే  ఆనందం లభించేది. కానీ దీనివలన నేను పదిమందితో స్వేఛ్ఛగా, ధైర్యంగా నా భావాలను చెప్పలేకపోయేవాడిని. మా ఇంటికి ఎదురుగానే బ్రాంచ్ స్కూల్. మధ్యలో స్కూల్ ప్రహరీ గోడ ఒక్కటే అడ్డు. అందులోనే నన్ను సెకెండ్ ఫారమ్ లో చేర్పించారు. ఆ స్కూల్ రాజావారిది. మా నాన్నగారి కాలంలో ఆడపిల్లల బడి. ఎనిమిది క్లాసులవరకు ఉండేది. తొమ్మిదవ క్లాసు నుండి హైస్కూల్ కు వెళ్ళాలి. అదీ రాజావారిదే. ఈ గర్ల్స్ స్కూల్లో ఆడపిల్లలు ఎనిమిదో క్లాసు ముగించి వెళ్ళిపోయేప్పుడు ఈ స్కూలు గుర్తుండిపోయేలా ఏవో చక్కటి కానుకలు ఇచ్చి పంపేవారట. ఆనాడు విద్యలను, విద్యార్ధులను ప్రోత్సహించే తీరు అలావుండేది. మా కాలం వచ్చేసరికి అది కో ఎడ్యుకేషన్ బ్రాంచ్ స్కూల్ గా మారింది. మా ఇంటివేపు గేట్ లేదు. స్కూల్ ముందు గేట్ లోనుండే స్కూలుకు వెళ్ళాలి. మా ఇంటినుండి మూడు, నాలుగు నిముషాలు. వీధిలో పెద్దలెవరూ కనపడకపొతే మా ఇంటివేపున్న గోడలు దాటి అవతలవేపున్న క్లాసుల్లోకి పరిగెత్తేవాళ్ళం. అలాచేయడంలో ఒక్కొక్కసారి కాళ్ళు చేతులు చెక్కుకుపోయేవి, క్లాసుకి పరగెత్తే తొందరలో. ఆ బ్రాంచ్ స్కూలు చాలా పెద్దదే. ఒక్కొక్క క్లాసుకు చాలా సెక్షన్సే ఉండేవి. స్కూల్ మధ్య ఖాళీస్థలంలో, లేదా ముందు గేటు దాటాక వచ్చే స్థలంలో కానీ ప్రేయర్స్, జండా వందనాలు, ఆటలు జరిగేవి. స్కూలు చుట్టూర పెద్ద పెద్ద రంగు రంగు పువ్వులతో గరుడవర్ధనం, నందివర్ధనం చెట్లుండేవి. అప్పట్లో నాతో చదివిన వారిలో మహమ్మద్ హాజీ, నంబియార్ వేణుగోపాల్, ముప్పాళ అప్పన్న పేర్లు మాత్రమే గుర్తున్నాయి. (ఈ ముగ్గురిని మరల ఓ 43 ఏళ్ళ తరువాత బొబ్బిలిలో జరిగిన మా బిసిఐసి ఉత్సవాలలో, అందులోనూ లోకల్ కమిటీ మెంబర్స్ గా కలుసుకుని మూడు రోజుల ఉత్సవాలలో వాళ్ళతో గడపడం నేను ఊహించలేని విషయం). ఈ ముప్పాళ అప్పన్న అనే అతను వయసులో మా అందరికంటె  బాగా పెద్ద.అప్పటికే మీసాలొచ్చేసాయి. ఆటల్లో ఫస్ట్. చదువులో లాస్ట్. అదే క్లాసులో ఏడు సంవత్సరాలుగా ఉంటున్నాడనేవారు. మంచి ఫుట్ బాల్ ప్లేయరన్న కారణంగా స్కూల్లోంచి తీసేయలేదని అనేవారు (వినడానికి అతిశయోక్తిగానే వుంటుంది). స్కూల్లోని పిల్లలకే కాక, టీచర్లకు అతనంటే పక్క బెదురుండేదనేది నిజం. 
ఆ స్కూల్ నాలుగు పక్కలా రూఫ్ ల క్రింద గోడలకు వెంటిలేషన్ కోసమని పెద్ద పెద్ద రంధ్రాలుండేవి. లోపలివేపు జాలీలతో మూసేసివుండేవి. బయటవేపు, చీకటి పడే సమయానికి ఎక్కడనుండి వచ్చేవో గుడ్లగూబలు వచ్చి అందులో చేరేవి. ఆ వూరు వెళ్ళిన కొత్తలో ఆ గుడ్లగూబల అరుపులు భయంగా ఉండి నిద్రపట్టేది కాదు. అలాగే, మా పక్కింటాయన గురక ఒకటి. (ఆ ఇల్లు పాల్తేరు మధురకవి వారిది) ఆయన పేరు సూర్యనారాయణ రాజు. ఆ ఇంట్లో అద్దెకుండేవారు. హైస్కూల్ రైటర్. చాలా ఎర్రగా బొద్దుగా ఉండేవారు. గొడుగు లేకుండా బయటకు వెళ్ళేవారు కాదు. ఆయనకు ఆస్త్మా వుండేది. రాత్రుళ్ళు విపరీతంగా దగ్గుతూ ,మూలుగుతూవుండేవారు. విపరీతమైన  ఆ గురక చాలా భయంకరంగా వుండేది. ఆయన గొంతు కూడా చాలా బొంగురుగావుండి, పగటి పూట కూడా ఆయనను చూస్తేనే భయంవేసేది. ఆయన భార్య లలితమ్మగారు. ఒక అబ్బాయి. నా ఈడువాడే. పేరు గోపాలకృష్ణ రాజు. 

ఆ స్కూల్లో చేరడానికి ముందో తరువాతో గుర్తులేదు కాని రాత్రిపూట, మా ప్రక్క అగ్రహారం వీధిలోని ఒక మాస్టారింటికి ట్యూషన్ కు వెళ్ళేవాడిని. ఆయనను అందరూ N L మాస్టర్ అనేవారు. (నడిమింటి లక్ష్మీ నరసింహం ఆయన పూర్తి పేరు). ఆయన అన్ని సబ్జెక్ట్స్ చెప్పేవారు. బ్రాంచ్ స్కూల్ మాస్టర్. చాలా కోపిష్టి. చాలా కఠినుడు. ఏ చిన్న తప్పు చేసినా కర్రతో కొట్టడం, తొడపాశం పెట్టడంలాటివి చేసేవారు. స్వపర భేదం వుండేది కాదు. తన పిల్లలైనా, బయట పిల్లలైనా, ఆడైనా, మగైనా శిక్షమాత్రం ఒకలాగే వుండేది. ఆనాటి తల్లిదండ్రులకు తమ పిల్లలు బాగా చదివి ప్రయోజకులు కావాలి. ఆ క్రమంలో వారి బాగుకోసం స్కూల్లో మాస్టర్లు శిక్షించినా, కఠినంగా వున్నా తల్లిదండ్రులు జోక్యం చేసుకునేవారు కాదు. (అదే యిప్పుడైతే, తమ పిల్లల మనోభావాలు ఏమాత్రం దెబ్బతిన్నా స్కూల్ ముందు ధర్నాలు, HRCకి ఫిర్యాదులు, టీచర్లకు suspensions, dismissal orders). ఇంత జరిగాక కూడా చదువు అబ్బకపోతే వాడి ఖర్మంతే అని ఏ వృత్తి విద్యల్లోకి, చిల్లర పనులకి తోలేవారు. NL మాస్టారి దగ్గరకు మగపిల్లలతో పాటు, ఆడపిల్లలు వచ్చేవారు. వారిలో వఝ్ఝల సంగమేశ్వరరావు మాస్టారి అమ్మాయిలు కళ్యాణి, మురళీ కూడా ఉండేవారు. సంగమేశ్వరరావు గారు అప్పటికే బొబ్బిలి హైస్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. అయినా, ఆయన పిల్లలు ఈయన దగ్గర ట్యూషన్ కు వచ్చేవారు. రాత్రిపూట ట్యూషన్ కు వెళ్ళేప్పుడు పిల్లలు ఎవరి లాంతరు వాళ్ళే తెచ్చుకోవాలి. ఆ రోజుల్లో చాలా ఇళ్ళల్లో కరెంట్ ఉండేది కాదు. (నా కోసమని మా తాతగారు ప్రత్యేకంగా ఒక పెద్ద లాంతర్ కొన్నారు. మా ఇంట్లో రెండుమూడు రైల్వే స్టేషన్లలో లైన్ మేన్లు వాడే దీపాల్లాంటివి ఉండేవి. వాటికి నాలుగు పక్కలా అద్దాలు ,ఒక ద్వారం ఉండేవి. వీటినెప్పుడో రైల్వే చుట్టాలు తెచ్చి పడేసారు. ఇవికాక రెండు లాంతర్లు, రెండు బుడ్డి దీపాలు వుండేవి).

సెలవు రోజుల్లో ట్యూషన్ మధ్యాహ్నం వుండేది. మాస్టారు ఇంట్లో లేకపోతే రణగొణధ్వనే. ఉన్నట్టుండి ఒక్కోసారి ఏ మబ్బు లేకుండానే వర్షం పడేది. ఒక పక్క ఎండ కాచేది. అది చూచి ఈ ఆడ,మగపిల్లలంతా ఒకేసారి గాఠిగా 'ఎండా వానా, నక్కల కుక్కల పెళ్ళి' అని అరుస్తూ గంతులేసేవారు. అలా ఎందుకు అరిచి గంతులేసేవారో నాకు తెలిసేది కాదు. వాళ్ళతో సమానంగా గంతులేసి అరవడానికి ధైర్యం చాలేది కాదు. 

మా సామవేదుల వారి సందులోనే నా వయసు పిల్లలు చాలామందే ఉండేవారు. పాలకొండ డాక్టర్ గారి పిల్లలు, మధ్య కామేశ్వరిగారి భాస్కరం ( బాచీ), రైటర్ రాజుగారి గోపి ఒకే వయసువాళ్ళం. ఒక్క స్కూల్ టైము, రాత్రుళ్ళు తప్ప మిగతా కాలమంతా ఆ సామవేదుల వారి సందులోనే ఆటలతో గడిపేవాళ్ళం. బొంగరాలు , కర్రా బిళ్ళ, గోళీలు, తొక్కుడుబిళ్ళ సహా. అలాగే బచ్చాలాట కూడా - సిగరెట్ పెట్టెల అట్టలను పేకముక్కల్లా చింపి వాటిని  నేల మీద ఒక పెద్ద రౌండ్ లో పెట్టి వాటిని దూరం నుంచి వెడల్పాటి రాళ్ళు లేక పెంకులతో గురిచూసి కొట్టాలి. అలా కొట్టినప్పుడు ఎన్ని అట్టముక్కలు గిరికి అవతలవేపుకు వెళితే అవన్నీ కొట్టినవాడి సొంతం. నిజానికి ఇదీ నిషేధింపబడిన లిస్ట్ లో ఉండే ఆటే. కొంతమంది పందేలు కాసి నిజం డబ్బులతోనే ఆడేవారు. అది వ్యసనంగా మారిపోతుందని భయం. అలాగే కర్రాబిళ్ళ ఆట కూడా. దాని వల్ల దెబ్బలు, దెబ్బలాటలు వస్తాయని ఆ ఆటనీ మాకు నిషేధించారు. వీటితో పాటూ మరో కాలక్షేపం కూల్ డ్రింక్స్ మూతలను రౌండ్ గా చేసి వాటి మధ్య రెండు కన్నాలు పెట్టి వాటి మధ్య దారం కట్టి వాటిని తిప్పడం. కంటికి కనపడనంత స్పీడ్ గా తిరిగేవి. అయితే అవి కూడా ప్రమాదమే. పొరపాటున శరీరానికి తగిలితే గీసుకుపోతుంది. ఇవి తర్వాత కిల్లీ కొట్లలో పెప్పర్ మెంట్లుగా అమ్మేవారు. ఆడినంతసేపు ఆ దారం సాయంతో ఆడడం, తరువాత దారం తీసేసి నోట్లో వేసుకొని చప్పరించడం. 

పాలకొండ డాక్టర్ గారి పేరు ర్యాలి కామేశ్వరరావు. ఆయన తండ్రి పేరు గుర్తులేదు. రిటైర్డ్ హెడ్మాస్టర్. ఆజానుబాహువు. బట్టతల, పంచెకట్టు, పొడుగుచేతుల లాల్చీ. చాలా గంభీరమైన కంఠం. ఆయన బయటకు వస్తున్నారంటే పిల్లలందరికీ హడల్. ఒక్కడు కూడా బయట కనపడేవారు కాదు. వారిది చాలా పెద్ద డాబా ఇల్లు. పెద్ద పెద్ద వరండాలు. ఒక పక్క క్లినిక్. పేరేదీ వుండేది కాదు.(పాలకొండ డాక్టర్ అంటేనే చాలు). 

ఆ ఇంటి వరండాలలో గాంధీ, నెహ్రూ, నేతాజీ, పటేల్, రవీంద్రనాథ్ టాగూర్, మొదలైన ప్రముఖుల నిలువెత్తు సైజులో పటాలు గ్రేకలర్ లో గోడలకు వెలాడుతూండేవి. నలుగురో, ఐదుగురో డాక్టరు గారి సంతానం. అందరిలోకి పెద్దావిడ నరసుబాయి. ఆఖరి యిద్దరూ దినకర్ (దిన్ను), శాంబూ. పెద్దయ్యాక ఒకరు సి.ఎ. మరొకరు డాక్టర్ అయ్యారట. వాళ్ళింట్లో చిన్న పెద్ద అందరికీ కళ్ళజోళ్ళుండడం నాకొక వింత. అన్నిటికన్నా మరో పెద్ద వింత ఆ ఇంట్లో చిన్నవాళ్ళను కూడా పెద్దవాళ్ళు 'గారు' అని సంబోధించేవారు. ఆ ఇంటిని ఆనుకునే పెద్ద కామేశ్వరిగారి పసుపురంగు మేడ. ఆవిడ కుమారుడు ఎస్ ఎమ్ రావుగారు. మధ్యప్రదేశ్ లో రైల్వే లో స్టేషన్ మాస్టర్. ఆయనకు కొడుకులు, కూతుళ్ళు పెద్ద సంసారమే. అందులో ఒక అమ్మాయి లక్ష్మి(సుగుణ) చక్రవర్తుల సత్యనారాయణ గారి భార్య. ఆయన చెల్లెలు లక్ష్మి  మా మురళీ భార్య. ఎస్ ఎమ్ రావు గారి మరో అమ్మాయి జయలక్ష్మి(రాణి). కొల్లూరి కోటేశ్వరరావు గారి భార్య. వీరందరితోటి అనుబంధం పెరిగింది మద్రాసులోనే. అందుచేత వీరి ప్రస్తావన రాబోయే అధ్యాయాలలోనే. మా ఇంటికి ఆనుకొని ఎడంచేతివేపు ఒక డాబా ఇల్లు. అందులో ఒక సానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఉండేవారు. ఒకే కొడుకు. చిరంజీవి. ఎర్రగా, పొడుగ్గా నిన్నటి తరం హీరో శ్రీకాంత్ లా వుండేవాడు. వైజాగ్ కాలేజీలో చదువు. హాస్టల్ లో ఉంటూ సెలవులకు తల్లిదండ్రుల దగ్గరికి బొబ్బిలి వచ్చేవాడు. ఆ ఇంట్లో అందరూ దొరల తెలుపులో ఉండేవారు. ఆ పెద్దాయన డ్యూటిలో ఉంటే ఖాకీ నిక్కర్, షర్ట్, ఖాకీ టోపి, ఎర్రబూట్లతో వెళ్ళేవారు. మొదట్లో పోలీసాయన అనుకునేవాడిని తేడా తెలియక. 

ఆ ఇంటి పక్కన సామవేదుల సూరమ్మగారిల్లు. ఆ పక్కన భాగవతుల రామావతారంగారిల్లు. వీరంతా మా తాతగారికి దగ్గర బంధువులే. ఆ ఇళ్ళవారంతా రైల్వేలలో పనిచేయడం వలన ఆ ఇళ్ళలో వేరెవరో అద్దెలకుండేవారు. ఆ ఇళ్ళలో కరెంట్ లైట్లుండేవి. ఆ రెండిళ్ళలో ఒక ఇంటిలో
టొబాకో డిపార్ట్మెంట్ లోని ఆఫీసర్ ఉండేవారు. పొగాకు ఇన్స్పెక్టర్ అనేవారు. వారికి ఒకే అమ్మాయి. నాకంటే పెద్దదే. పేరు సీతాలక్ష్మి. థర్డ్ ఫారమ్ లో చేరింది. చాలా చొరవగా కలివిడిగా మాట్లాడేది. స్కూల్ లో చేరిన మొదటి రోజుల్లో స్కూలుకు తనకు తోడుగా వెళ్ళడానికి నన్ను పురమాయించారు. కానీ, నేను కూడాకలసి వెళ్ళలేదు. వెళ్ళిన రెండు మూడు రోజులు ఆ అమ్మాయికి వంద గజాలు ముందో, వెనకో ఉండేవాడిని. ఇది చూసి ఆ సీతాలక్ష్మి నా సాయం ఏమీ అఖ్ఖరలేదని తానే ఒంటరిగా వెళ్ళిపోయేది. నాకు పెద్ద రిలీఫ్.  

సామవేదుల వారి సందుకు ఎదురుగా ఒక మేడ ఇల్లు. ఉప్మాకవారిది. నారాయణప్పవలసవారు. ఆ ఇంట్లో అబ్బి, కామేశ్వరావు గార్లు అన్నదమ్ములు, వారి సంసారాలు ఉండేవి. సంగీతం పట్ల, ముఖ్యంగా పౌరాణిక నాటకాల పద్యాలంటే విపరీతమైన మోజు. హార్మోనియం వాయిస్తూ చాలా బాగా పద్యాలు చదివేవారు. ఆ ఇంటి హడావుడి వీధంతటికీ తెలిసేది. ఆ ఇంట్లనే గుమ్మా అమ్మన్నగారి కుటుంబం వుండిన గుర్తు. ఆవిడ మా అమ్మమ్మగారికి, దొడ్డమ్మగారికి చాలా సన్నిహితురాలు. ఆవిడ కుమార్తె సుగుణకు మా అమ్మగారికి, శారదకు మంచి స్నేహం. ఆ అమ్మన్నగారి పెద్దబ్బాయి విశ్వనాధం సుగర్ ఫాక్టరీలో పనిచేసేవారు. ముగ్గురో నలుగురో అన్నదమ్ములు. ఒకాయన ప్రభు  అందులో ప్రసన్నకుమార్ గారు మా మరదలు సుధారాణి  పినతల్లిగారి భర్త. బొబ్బిలి వదిలాక ఆయనను చూసింది పాతికేళ్ళ తరవాత మా గోపి పెళ్ళిలోనే. వాళ్లంతా వయసులో నాకన్నా పెద్ద. ఈ ఉప్మాక వారింటికి కుడిపక్కన మహమ్మద్ గౌస్ఖాన్ గారిల్లు. ఆయనకు పెద్ద బజార్లో ఒక కాఫీ హోటలుండేది. ఆ గౌస్ ఖాన్ గారు తమ చిన్నతనంలో బొబ్బిలి రాజావారితో గుర్రాల మీద పోలో ఆట ఆడేవారట. ఆయన ఇంటి పక్కనే బొబ్బిలికి ల్యాండ్ మార్క్ లాటి ఆంజనేయస్వామి గుడి. ఆ కోవెల పూజారి పూరిల్లు కూడా అందులోనే. ఆయన కొడుకు నాకు పరిచయం. ముఖ్యప్రాణేశ్వరరావు. అరుదైన పేరు. అందుకే ఆ మనిషి రూపు నా మనస్సులో మాసిపోయినా పేరు మాత్రం గుర్తుండిపోయింది. ఆంజనేయస్వామి కోవెల వెనకవేపు పాత బస్టాండ్. బస్టాండ్ వుంటే దానిని ఆనుకొని టీ స్టాల్స్, కిల్లీకొట్లు , పాక హొటల్స్ ఉండకతప్పదు. ఉల్లిగార్లకు, పకోడీలకు ఆ పాక హోటల్స్ ప్రసిధ్ధి. ఆ పాకల తడకలకు కొత్త, పాత సినీమాలలో వాల్ పోస్టర్లు, జమున, అంజలి, సావిత్రి అంటూ వాళ్ళ ఫోటోలు అంటించివుండేవి. కీచుమని కిళ్ళీబడ్డీలలోని గోలీసోడాల చప్పుళ్ళు, వచ్చీపోయే బస్సుల రొదలు. అమ్మకాల వాళ్ళ అరుపులతో రాత్రి తొమ్మిది వరకు ఆ ప్రాంతమంతా చాలా హడావుడి గా ఉండేది. విజయనగరం, రాజాం, సాలూరు, పార్వతీపురం, వంత్రం వంటి ఊళ్ళకు ఆ బస్ స్టాండ్ నుంచే బస్సులు వెళ్ళేవి.

ఆ బస్ స్టాండ్ నుండి తిన్నగా ముందుకు వెడితే ఒక పక్క హైస్కూల్ రోడ్, మరోపక్క చెలికాని వెంకట్రావు, అచ్యుతరావు గార్ల రైస్ మిల్. ఆదే  చీపురుపల్లిరోడ్. అక్కడే బొబ్బిలియుధ్ధం నాటి తాండ్రపాపయ్య సంస్మరణార్ధం ఒక చావడి వుండేది. అందులో  ఆయన పేరిట ఒక ఎలిమెంటరీ స్కూల్ వుండేది. అవన్నీ దాటుకొని ముందుకు సాగితే రైల్వే స్టేషన్.   

ఆంజనేయ స్వామి గుడినుండి బొబ్బిలి రాణీగారి పూలబాగ్ కు వెళ్ళే వీధి అగ్రహాం వీధి. ఎడమ ప్రక్క సామవేదులవారి సందు, జూబ్లీ రోడ్, అడ్డు అగ్రహారం వీధులు.  అగ్రహారం వీధిలో నడిమింటి కుటుంబాలు మూడు ఉండేవి. సూర్యనారాయణ స్వామిగారిల్లు, NVG మాస్టారు (నడిమింటి వేణుగోపాలస్వామిగారు), NL మాస్టారి కుటుంబం. వీరంతా తాతా సహోదరుల పిల్లలు. నడిమింటి వేణుగోపాలస్వామిగారు బొబ్బిలి హైస్కూల్  హెడ్ మాస్టర్ గా చాలా ప్రసిధ్ధులు. ఎప్పుడూ పంచె, చొక్కా, కోటుతోనే వుండేవారు. ఆయన తమ్ముడో, కజినో తెలియదు ఎన్ ఆర్ శివస్వామి ఢిల్లీలో ఇన్కమ్ టాక్స్ ట్రిబ్యునల్ లో చాలా పెద్ద పోస్ట్ లో ఉండేవారు.  సూర్యనారాయణ స్వామిగారు వీరందరిలో పెద్ద. వారి తండ్రిగారేదో వడ్డీలకు డబ్బు తిప్పేవారని చెప్పేవారు. భూవసతి వుండడంతో ఎవరికీ ఉద్యోగాలు చేయవలసిన అవసరం లేదు. ఈ సూర్యనారాయణ స్వామిగారు మా తాతగారికి స్నేహితుడు. ఆయనకు క్రాఫ్ ఉన్నా వెనకాల చిన్న పిలక కూడా వుండేది. రోజూ రాత్రి భోజనాలయాక మా తాతగారు కనీసం ఒక గంటైనా  వాకింగ్ చేసి వచ్చి వారింటి అరుగుల మీద ఇరుగు పొరుగు వారంతా కూర్చొని  లోకాభిరామాయణం మాట్లాడుకునేవారు. సెకెండ్ షో సినీమా మొదలెట్టాక, రాయపూర్ రాత్రి బండి వెళ్ళాక, స్టేషన్ నుండి వచ్చే జట్కా బళ్ళను చూసి తర్వాత నిద్రలకు లేచేవారు. ఇది ఒక రోజూ రెండు రోజులు కాదు. దశాబ్దాలపాటు ఇదే దినచర్య. 

ఈ కుటుంబాలలో శివస్వామి పేరు చాలా కామన్ గా వినిపించేది. సూర్యనారాయణ స్వామిగారి పెద్దబ్బాయి శివస్వామి నా కంటే కొంచెం పెద్ద. నాటకాలంటే విపరీతమైన పిచ్చి. తనే నాటకాలు రాసి జిల్లాస్థాయి నాటక పోటీలలో పాల్గొనేవాడు. 'అంతర్వాణి' అనే నాటకం తరుచూ ఆడేవారు. దీనితో చదువు కుంటుపడింది. తర్వాత ఎప్పుడో ప్రైవేట్ గా MA పూర్తి చేశాడట. అతని తమ్ముడు లక్ష్మణస్వామి. వీళ్ళకు ఒక అక్కగారుండేది. ఆవిడ పేరు అన్నపూర్ణ అని గుర్తు ఆవిడ మా శారదకు స్నేహితురాలు. వాళ్ళింట్లో ఒక టాయ్ పెడల్ కారు ఉండేది. నా చిన్నతనంలో దాంట్లో కూర్చొని ఆ ఇంటి మధ్య వాకిట్లో తిరగడం ఒక థ్రిల్ గా ఉండేది.  

             ....సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.


Friday, September 18, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదహేడవ భాగం

18.09.20 - శుక్రవారం భాగం - 17*:
పదహారవ భాగం ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

చెళ్ళపిళ్ళ వరహాలమ్మ గారు మా దొడ్డమ్మగారు. మహా దొడ్డ వ్యక్తి. ఎవరైనా ఆదర్శ మహిళ పేరు చెప్పమంటే ఆవిడ పేరే చెపుతాను. ఆవిడ జీవితాన్ని చూసి నేర్చుకోవలసినవి, నేర్చుకున్నవి చాలానే ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు ఆ విషయాలను ప్రస్తావిస్తాను. 

(తోటపల్లి కొండలు శాంతి ఆశ్రమంలో  దొడ్డమ్మ చెళ్ళపిళ్ళ వరహాలమ్మగారితో పెద్ద చెల్లెలు రమణమ్మ రెండో చెల్లెలు పద్మావతి) 

ఆవిడ ఒకే కూతురు మా శారదక్క. మా శారద చిన్నతనంలోనే తండ్రి పోయారు. ఆయన పేరు చెళ్ళపిళ్ళ అప్పల నరసింహంగారు. ప్రస్తుత ఒరిస్సాలోని రాయఘడాలో వుండేవారు. మా దొడ్డమ్మగారికి ఆయనకు  పదమూడేళ్ళకు తక్కువ లేకుండా వయోభేదం వుండేది. బాల్య వివాహమే. ఆయన ఆయుర్వేద డాక్టర్ కమ్ సంగీతం మాస్టర్. ఆయన గొప్ప సంగీత శాస్త్రపరిజ్ఞానం కలిగినవాడు. ఈరోజుల్లో అలాటివారు మ్యూజికాలజిస్ట్ లుగా గొప్ప గుర్తింపు పొందుతున్నారు. ఆయనదంతా మాటల సంగీతం. వారి నలుగురన్నదమ్ములకూ సంగీతమే వృత్తి. ఆయన సంగీతం మీద కాకుండా ఆయుర్వేదం మీద దృష్టిపెట్టి వుంటే బాగా రాణించివుండేవారని మా నాన్నగారి అభిప్రాయం. నేను పుట్టడానికి చాలా కాలం మునుపే ఆయన పోయుండాలి. నాకు ఊహ తెలిసినప్పటినుండి, మా దొడ్డమ్మగారు, శారద మా బొబ్బిలి తాతగారి సంరక్షణలోనే వుండేవారు.

మా దొడ్డమ్మగారు వారి రాయఘడా గురించి చెప్పిన వాటిలో ఒక విషయం మాత్రం భయంకరంగా ఒళ్ళు గగుర్పొడిచేదిగా ఉండి గుర్తుండిపోయింది. రాయఘడా ఊరు చుట్టూ కొండలు అడవులు వుండేవి. సాయంత్రమైతే నరసంచారం ఉండేదికాదు. అందరు ఇళ్ళలో తలుపులు మూసుకునే ఉండేవారట. కొంచెం రాత్రి పడగానే పక్కనున్న కొండల్లోంచి చిరుతలు, ఎలుగుబంట్లలాటివి ఊళ్ళో వీధుల్లోకి వచ్చి మూసి ఉన్నతలుపులు మీద పంజాలతో బాదుతూ నానా హంగామా చేసేవిట. ఆవిడ ఆ విషయాలు చెపుతూంటే నాకు చాలా భయంగా అనిపించేది. మరి అలాటి ఊళ్ళో వుండేకంటే వేరే మంచి ఊళ్ళో వుండవచ్చు కదా అని అమాయకంగా అడిగేవాడిని. ఉన్న ఊరు మారడం అంత సులభమా? విధి నిర్ణయప్రకారమే కదా ఏదైనా జరిగేది. ప్రయత్నం మాత్రమే మానవుడు చేయగలడు.

మా శారద ఎనిమిదో క్లాసు వరకూ బొబ్బిలి గర్ల్స్ స్కూల్ లో చదివి మానేసింది. తన పదహారవ ఏట వివాహం నిశ్చయమయింది. ఈ విషయంలో మా నాన్నగారి తోడ్పాటు, ప్రమేయం ఉన్నట్లు విన్నాను. వరుడు భళ్ళమూడి సత్యనారాయణ. వారిది కుద్దిగాం అనే కుగ్రామం. ఇది ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ లో శ్రీకాకుళం జిల్లాలో ఉంది. 

(శారదక్క, బావగారు భళ్ళమూడి సత్యనారయణగారు)
సాధారణంగా తెలుగువారిళ్ళల్లో పెళ్ళిళ్ళు ఆడపిల్లవారింటనే జరగడం ఆనవాయితి. కానీ, మా శారద పెళ్ళి వరుని ఇంట జరిగింది. బొబ్బిల్నుంచి ఆ కుద్దిగాం ఇప్పటి రోడ్, రైలు రవాణా సౌకర్యాల దృష్ట్యా ఇప్పుడు ఓ నాలుగైదు గంటల ప్రయాణం. కానీ, మేము 1953లో ఉదయం బయల్దేరితే, అర్ధరాత్రికి ఆ ఊరు చేరుకోగలిగాము. బస్, రైలు, ఎడ్లబళ్ళంటూ అన్ని వాహనాలు ఎక్కేము. పెళ్ళి వైశాఖ మాసం(ఎండాకాలం) కావడాన పడవ ఎక్కే అవకాశం రాలేదు. అదే వర్షాకాలమైతే వరద పరిస్ధితిని బట్టి వంశధారానది ప్రతాపాన్ని చూడవలసి వచ్చేది. మా రైలు ప్రయాణంలో మధ్యాహ్న భోజనాల సమయంలో ఏదో స్టేషన్ లో రైలు వచ్చి ఆగింది. నా జ్ఞాపకం ప్రకారం అది నౌపడా స్టేషన్ కావచ్చు. అది వాటరింగ్ స్టేషన్ కూడాను. మళ్ళీ బండి బయల్దేరడానికి మరో గంటన్నా పడుతుందని ప్రయాణీకులంతా స్టేషన్ బయటకు భోజనాలకు వెడుతూంటే మా పెళ్ళి బృందంలో కొందరు భోజనాలకు బయల్దేరారు.  వారిలో నేనూ ఉన్నాను. ఆరోజుల్లో మా ఇళ్ళలోని ఆడవారు బయట భోజనాలు చేయడం అన్నది కనీవినీ ఎరుగరు. అరటిపళ్ళు, మంచినీళ్ళతోనో సరిపెట్టుకోవలసిందే. అక్కడ స్టేషన్ బయట హోటలు అని అందరూ అంటున్నది ఒక పూటకూళ్ళమ్మ సత్రంలాటిది. పూరిల్లు. అక్కడ అందరూ రెండు మూడు వరసల్లో క్రిందనే కూర్చునేవారు. విస్తరాకులలో వడ్డన.  మా ఛాన్స్ వచ్చేప్పటికి అన్నంతో పాటు ఉడికించిన పెసరపప్పు, ఏదో కూర, గోంగూర పచ్చడి వంటి పదార్ధాలుతో భోజనం వడ్డించారు. అయితే, మేము ఎవరమూ ఆ పదార్ధాల రుచిని మెచ్చుకుని తినే స్థితిలో లేము.  నాకైతే తినడం లేటయితే రైలు వెళ్ళిపోతుందనే భయం. మా రైలు మళ్ళా ప్రయాణం సాగించి మమ్మల్ని పర్లాకిమిడి స్టేషన్ లో పడేసింది. ఇప్పుడు ఆ ఊరు పేరు పర్లాఖముండీగా మారింది. అక్కడనుండి వేరే రైలు ఎక్కి హద్దుబంగీ అనే స్టేషన్ లో దిగాలి. హద్దుబంగీలో ఎడ్లబండి  ఎక్కి మరికొన్ని మైళ్ళు ప్రయాణం చెయ్యాలి. అప్పటికే చీకటి పడింది. పర్లాకిమిడి నుంచి నేరోగేజ్ రైలు. ఊటీ హిల్ ట్రైన్ లా ఆ రైళ్ళు చాలా నెమ్మదిగా నడిచేవి. ఆనాటి ట్రైన్స్ అన్నిటికీ స్టీమ్ ఇంజిన్లే. రాక్షసిబొగ్గు సహాయంతో నడిచే స్టీమ్ ఇంజిన్లు. (ఇంగ్లీషులో రైల్/రైల్స్  అంటే పట్టా/పట్టాలు. తెలుగులో రైలు/రైళ్ళు అంటే ట్రైన్. ఇంగ్లీష్ రైల్స్ మీద నడిచే బళ్ళు తెలుగు రైళ్ళు. ట్రైన్ అనగా తెలుగులో రైలు!)  

ఈ పొగబళ్ళ ప్రయాణాల తరవాత మనుషుల ఆకారాలు వికారాలయ్యేవి.  ఎంతటి వైజయంతీమాలలైనా  'నాదీ ఆడజన్మే' సావిత్రిలయిపోతారు. లక్స్ సబ్బు బిళ్ళలు అరగదీసి మొహానికి కాశ్మీర్ స్నోలు, హిమాలయా పౌడర్లు దట్టంగా పట్టించవలసిందే. 

ఈ రైలు ఇంజిన్లు ఘాట్ సెక్షన్ లలో పరిగెత్తలేవు. నెమ్మదిగా నడుస్తూ వెళ్తాయి. ఎత్తుకి వెళ్ళవలసి వచ్చినప్పుడు వేగం మరింత తగ్గిపోయి కాలినడకన వెళ్ళడమే సుఖమనుకునేలా ఉండేవి. ఆ రైలు ఇంజన్లకు' రాముడు‌, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు' అని పేర్లుండేవి. ఇవేళ్టి ఇంజన్ రాముడా, హనుమంతుడా అని అనుకునేవారు. అలాటి ఒక రైలెక్కి హద్దుబంగీ స్టేషన్ లో దిగేప్పటికి రాత్రి పది దాటిందనుకుంటాను. స్టేషనంతా చిమ్మచీకటి. స్టేషన్లో అక్కడక్కడ చిన్న చిన్న లాంతర్లు. ఆ వెలుగులో బయటకు వచ్చి మగపెళ్ళివారు పంపిన  రెండో మూడో ఎడ్లబళ్ళలో మా పెళ్ళి బృందమంతా ఎక్కి కుద్దిగాంకు ప్రయాణం కట్టాము. వేసవి కావడం వలన వంశధారలో నీళ్ళు ఎక్కువగా లేకుండా బళ్ళు ఏటిలోనుండే వెళ్ళాయి. పెళ్ళివారింటికి చేరేసరికి బాగా రాత్రయిపోయింది. నేనైతే బండిలోనే నిద్రపోయాను.

నేను మర్నాడు ఉదయం లేచి చూసేసరికి ఊరంతా పూరిళ్ళమయం. ఈ పెళ్ళివారింట్లో ఒకపక్క గొడ్ల సావిడి. మరో పక్క ఒక నల్లబల్లతో చిన్న  గది. అది ఒక ఎలిమెంటరీ స్కూలని చెప్పారు. అక్కడ కూడా ఏవో బస్తాలు, పాత సమాన్లతో నిండివుంది.

పెళ్ళికొడుకు తండ్రిగారి పేరు కూడా సత్యనారాయణగారే. ఇంట్లోని పెద్దకొడుకులకు సత్యనారాయణ పేరు పెట్టడం ఆనవాయితిట. ఆయన పేరుకు ముందు 'ఈశ్వర' అని ఉంటుంది. కొడుకు పేరు ముందు  'అప్పల' అని గుర్తు.  ఇప్పుడు ఆయన పెద్దమనవడి పేరు కూడా ఈశ్వర సత్యనారాయణే. మేమంతా ఈశ్వరుడు అంటాము. 

(ఈశ్వరుణ్ణి ఎత్తుకున్న శారదక్క)
ఆ భళ్ళమూడి సత్యనారాయణగారు కుద్దిగాంలో సింగిల్ స్కూల్ టీచర్. పేరుకే స్కూలు. పిల్లలెవరూ వుండరు అందరూ పొలంపనులకో, ఆవులను మేపుకుందుకో పోతూంటారు. జన్మానికో శివరాత్రిగా ఎవరైనా స్కూళ్ళ ఇన్స్పెక్టర్ పొరపాటున ఆ నది దాటుకొని రాగలిగితే, విషయం ముందే తెలుసుకొని పదిమంది పిల్లలను పోగేసి  అల, వల, తల, రెండొకట్ల రెండూ, మూడు నాలుగులు పన్నెండని అరిపించి, వచ్చిన అధికారికి తగిన ఆతిధ్యమిచ్చి పంపించేస్తారు. ఈ తతంగమంతా వచ్చిన అధికారికి తెలుసు. పిల్లలు లేరంటే స్కూల్ ఎందుకని మూసేస్తారు. వచ్చే నాలుగురూకలు రాకుండా పోతాయి. అయితే వీరికి ముఖ్యమైన వృత్తి ఆయుర్వేద వైద్యం. ఇంట్లో అందరూ వైద్యులే. అలాగే తండ్రీకొడుకులు ఇద్దరూ మంచి మార్దంగికులు. చుట్టుపక్కల జరిగే హరికథా కాలక్షేపాలకు మృదంగ సహకారం అందిస్తారు. వీరికి మంత్ర శాస్త్రంలో ప్రవేశముందని చెపుతారు. ఆరోజుల్లో సుప్రసిధ్ధ మంత్రశాస్త్రవేత్తగా పేరుపొందిన మండా సూర్యనారాయణ శాస్త్రిగారి శిష్యులు. 

శ్రీ మండా సూర్యనారాయణ శాస్త్రిగారు

శ్రీ మండా సూర్యనారాయణ శాస్త్రిగారు ప్రముఖ హరికధా కళాకారిణి మండా కమలకుమారిగారి తండ్రి. 'ముత్యాలముగ్గు' రావు గోపాలరావు గారికి మామగారు.

నాకు ఊహ తెలిసాక జరిగిన, నేను వెళ్ళిన మొట్టమొదటి పెళ్ళి మా శారదదే. పెళ్ళిళ్ళు, పెళ్ళితతంగాలు ఎలా వుంటాయో మొదటిసారిగా చూసింది అక్కడే. అందుచేత ప్రతీ విషయమూ ఒక వింతే, విశేషమే.

ఉదయాన్నే పెళ్ళివారందరికీ అల్పాహార విందుగా అడ్డాకుల విస్తళ్ళలో ఉప్మాలాటి ఉప్పుపిండి, లేదా ఉప్పుపిండిలాటి ఉప్మాను తీసుకువచ్చి పెట్టారు. పక్కనే పెద్ద పెద్ద ఇత్తడి గ్లాసుల్లో ఫుల్ గా కాఫీ అనే ద్రవ పదార్ధం. పేరుకు అల్పాహారం. కాని విస్తరినిండా వున్న ఆ రాశిని చూస్తే  మరో రెండురోజుల వరకూ భోజనమే అవసరం లేదనట్లు అనిపించింది. నాకు ముందునుంచీ ఉప్మా అంటే చిన్నచూపే. ఆ పెళ్ళివారింట ఉప్మాలాటి ఆ పదార్ధం తిన్న కొన్ని దశాబ్దాల వరకు ఉప్మా పేరును కూడా నా తలపులలోకి రానిచ్చేవాడిని కాదు. (అలాటిది ఇప్పుడు, కాలమహిమ, రెండ్రోజులకు ఒకసారి మా ఆవిడ పెట్టే రవ్వ ఉప్మావో, సేమ్యా ఊప్మావో, ఉప్పుడుపిండో మహదానందంగా తినేస్తా.) కానీ అవేళ అక్కడ వద్దని చెప్పడానికి నాకు తెలిసిన మావాళ్ళెవరు పక్కనలేరు. మా పెద్ద చెల్లెలు రమణమ్మ అప్పటికి  నెలల పిల్ల. అందువల్ల తనను చూసుకుంటూ మా అమ్మగారెక్కడో ఉన్నారు. ఆ పెళ్ళికొడుకు ఇంట్లో ఆడవాళ్లు ఎవరూలేరు. ముగ్గురూ మగపిల్లలే. వంటలూ, వార్పులూ, వడ్డనలకు ఊళ్ళోనే వున్న వారి బంధుజనం వచ్చి సహాయం చేసినట్లు విన్నాను. తరువాత, ఓ పదిగంటలకు స్నానాల కార్యక్రమం అని ఏటి ఒడ్డుకు పదమన్నారు. నాకు నూతి దగ్గర వేడినీళ్ళతో స్నానమే అలవాటు. ఏటి స్నానమంటే భయం. కలివరం ఏట్లో ములిగిపోయిన అనుభవం తరువాత పారే ఏరన్నా, నదన్నా భయమే. ఈలోగా, పెళ్ళికొడుకు తమ్ముళ్ళతో మాట్లాడేందుకు మరో యిద్దరు వచ్చారు. వారిని నా దగ్గరకు తీసుకువచ్చి మా 'నేస్తులు' అని వాళ్ళ పేర్లేవో చెప్పారు. ఆ ప్రాంతాలలో స్నేహితులను 'నేస్తాలు' అని అంటారని అప్పుడే విన్నాను. మా నాన్నగారు అప్పటికి రెండుసార్లు మెడ్రాస్ వెళ్ళి వచ్చారని తెలిసి అక్కడి ఎన్టీవోడు, నాగయ్య, రేలంగి నాగెస్సర్రావు,  అంజలి, శివరావు, ఘంటసాల అంటూ ఏవో సినీమా విషయాలేవో అడగబోయారు. నిజానికి నాకప్పటికి ఆ విషయాలేవీ తెలియవు. ఇంతలో మా కాబోయే అల్లుడిగారి తమ్ముడొకరు అడ్డు తగిలి 'మరీ బెంటులా మాట్లాడతావేటి ఇప్పుడూ..' అంటూ విసుకున్నాడు. ఆ 'బెంటు' అనే మాటకు  సరైన అర్ధం నాకు తెలియదు. బహుశా 'పల్లెటూరి బైతు' లాటి మాట కావచ్చును. మొత్తానికి వీళ్ళందరూ కలసి నన్ను స్నానం పేరిట వంశధారలో ముంచారు. అలవాటు లేని ఔపాసన. వాళ్ళంతా నన్ను ఒక్కసారిగా నీళ్ళలో ముంచేప్పటికి నీళ్ళన్ని తాగి,  అవి ముక్కుల్లోకి వెళ్ళి చాలా ఉక్కిరిబిక్కిరి అయింది. వాళ్ళూ కొంత భయపడ్డారు. కొంతసేపయాక సద్దుకుంది. ఆ ఏటి ఒడ్డునుండి నాలుగుపక్కలా ఉన్న ప్రాంతాలను చూపిస్తూ అటుపక్క నివగాం, అక్కడ కొత్తూరు అంటూ చుట్టుపక్కల ఊళ్ళ గురించి చెప్పారు. 

అక్కడికి కొంత దూరంలో గుణుపూర్ అనే ఊరుంది. ఆ ఊళ్ళో మా తాతగారి దగ్గర సంగీతం నేర్చుకున్న ముద్దు పాపారావు అనే ఆయన వుండేవారు. 

(శిష్యులతో తాతగారు పట్రాయని సీతారామశాస్త్రిగారు

ఆయన ఘంటసాలగారికి విజయనగరం సంగీత కళాశాలలో సహధ్యాయి. ఇద్దరూ ప్రాణస్నేహితులు. పైనున్న తాతగారితో ఘంటసాలగారు ఇతర శిష్యులు ఉన్న ఫోటోలో తాతగారి వెనక ఉన్నవారే ముద్దు పాపారావుగారు. 

ఈ ఊళ్ళన్నీ  శ్రీకాకుళం జిల్లాలోని తెలుగు ప్రాంతాలే. కాకపోతే  అక్కడివారి మీద ఒరియా ప్రభావం కనిపిస్తుంది. నా వరకూ, మీఠాకిళ్ళీలు, కారా(జరదా)కిళ్ళీలు నమలడం ఉమ్మడంలాటి అలవాట్లు, మగాళ్ళందరి హెయిర్ స్టైల్, ఇలా కొన్ని విషయాల్లో అందరూ ఒకేలా కనిపించారు. ఇక వాళ్ళు  ఏవో కబుర్లు చెపుతూంటే, నేను వింటూ మళ్ళీ ఊళ్ళోకి వచ్చేము. 

మధ్యాహ్నం ఓ రెండు గంటల ప్రాంతంలో భోజనాలకు పిలుపులు వచ్చాయి. మేము బొబ్బిలిలో అరటి ఆకులలో భోజనం చేసేవాళ్ళం. ఇక్కడ ఈ పెళ్ళివారు పెద్ద పెద్ద తామరాకులు తీసుకువచ్చి పెట్టారు. తామరాకులలో కూడా భోజనం చేస్తారని అప్పుడే తెలిసింది. ఆ ఆకుల్లో వేడి వేడి అన్నం, పప్పు, కూరలు, పులుసులాటివి వడ్డించేసరికి ఆకు మధ్యలోని బుడిపెల్లోంచి ఆవిరి బుడగలు రావడం ఒక తమాషాగా అనిపించింది. అలాగే, నేను పుట్టిన ఎనిమిదేళ్ళలో మొదటిసారిగా ఆవపెట్టిన పనసపొట్టు కూర తినడం అక్కడే జరిగింది. నిజం చెప్పొద్దూ, ఆ పనసపొట్టు కూర మహాద్భుతం. అంత రుచికరమైన కూర అప్పటివరకూ తినలేదు. మా ప్రాంతాలలో జరిగే  పెళ్ళిళ్ళలో పనసపొట్టు కూర ఒక స్పెషల్ డిష్. ఆ కూరను వండడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఆ పనసపొట్టు కూర తినేవాళ్ళకు అమృతతుల్యమే అనిపించినా వండడం మహా పీకులాట వ్యవహారమని తర్వాత తెలిసింది.  కూరకు పనికివచ్చే పనసకాయను ఎంచుకోవడం దానిని కొయ్యడానికి తగిన కత్తి, తరిగేప్పుడు జిగురు అంటుకోకుండా ఏదో నూనెలు పూసుకోవడం, కూరకు తగిన విధంగా పదునుగా పొట్టుగా నలగగొట్టడం, అది కూరగా వండడానికి సమపాళ్ళలో కావలసిన దినుసులు - వీటన్నిటితో రుచికరంగా చేయడమనేది సాధారణ  ఇంటి ఇల్లాళ్ళకు సాధ్యమయే పనికాదు. పాకశాస్త్రంలో ఆరితేరినవాళ్ళే ఈ competitive పనసపొట్టు కూరను వండి మెప్పించగలరు. 

ఇక పెళ్ళి అర్ధరాత్రి ముహుర్తం. అది తెలుగువారి ప్రత్యేకత. తమిళనాడు ముహుర్తాలు చాలా హాయి. తొమ్మిది నుండి పదకొండు లోపల ముహుర్తాలే ఎక్కువ. శుభ్రంగా ఉదయం పెళ్ళికి హాజరేయించుకొని , పదకొండు గంటలకు భోజనాలు కానిచ్చేసి, హాయిగా ఆఫీసులకు వెళ్ళిపోవచ్చు. ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం రెండు లోపల అన్ని తతంగాలు ముగించేసి కళ్యాణమండపం ఖాళీ చేసేస్తారు. ఒకానొక కాలంలో పెళ్ళిళ్ళు ఒక్కో రోజు ఒక్కొక్క ఐటమ్ చొప్పున పదహారు రోజులపాటు జరిపేవారట. ఇప్పుడు పదహారు గంటలే ఎక్కువగా భావిస్తున్నారు. ఇప్పటి పెళ్ళిళ్ళలో పెళ్ళి తంతుకన్నా బ్యూటీ పార్లర్లలో ఒంటి డెకరేషన్ కే ఎక్కువ సమయం పడుతుంది. లేకపోతే  రిసెప్షన్, పెళ్ళి వీడియోలలో మొహం అసయ్యంగా ఉంటుంది కదా. కలకాలం ఆ మొహాలు చూసుకోడం భయంకరం కదా. ఈనాడు మన భారతీయ వివాహ ప్రక్రియే పూర్తిగా మారిపోయింది.

మా శారద పెళ్ళికి ముందే సాయంత్రం మా నాన్నగారి సంగీత కచేరీ జరిగింది. పెళ్ళికొడుకే మృదంగం వాయించారు. చీకటి పడుతున్న సమయానికి ఎక్కడినుండో మూడు పెట్రోమాక్స్ లైట్లను తీసుకువచ్చారు. అలాటి లైట్లను కలివరంలో దూరం నుంచి చూశాను. కానీ అవి వెలగడానికి ఎంత శ్రమపడాలో ఇక్కడే దగ్గర నుంచి చూసాను. వాటి టాంక్ లో కిరొసిన్ పోసి పంపు కొట్టడం, గేస్ మేంటల్ మాత్రమే అంటుకునేలా వెలిగించడం, మంచి వెలుగు వచ్చేవరకూ కుస్తీలు పట్టడం చికాకు పనే. 
ఒకసారి వెలిగిస్తే కొన్ని గంటలపాటూ దేదీప్యమానంగా వెలుగుతాయి. అలాటి లైట్ల వెలుగులో మా నాన్నగారి కచేరీ, రాత్రి భోజనాలు, అర్ధరాత్రి పెళ్ళి ముహుర్తం, ఇతర తంతులన్నీ సవ్యంగా ముగిసాయని చెప్పారు. ఒక రాత్రయాక నేను పూర్తిగా నిద్రపోయాను. ఏం జరిగింది నాకు తెలియనే తెలియదు. అలాగే, కాశీయాత్ర సమయంలో పెళ్ళికూతురి తమ్ముడిగా చేయవలసిన తంతులో పాల్గొన్నానో లేదో ఆ విషయాలేవి నా జ్ఞాపకాలలో లేవు. అవన్నీ నెమరు వేసుకుందుకు ఇప్పటిలా  విడియో కేసట్లు, కలర్ ఆల్బంలు, కనీసం, బ్లాక్&వైట్ ఫోటోలు కూడాలేవు. పెళ్ళయ్యాక ఆ కుద్దిగాంలో ఎన్నాళ్ళున్నామో సరిగా గుర్తులేదు,కానీ, అక్కడ నుండి మేము విజయనగరం/బొబ్బిలి వేపు ప్రయాణం కట్టడం జరిగింది. 
             
1954 లో ఒకసారి మా నాన్నగారు కలివరం నాయుడిగారి ఆహ్వానం మీద తిరుపతి వెళ్ళారు. అక్కడికి వారికి బంధువు, ప్రముఖ చిత్ర దర్శకుడైన బి ఎ సుబ్బారావు రాగా వారందరూ స్వామి దర్శనం తరువాత మెడ్రాస్ ప్రయాణం కట్టారు. మెడ్రాస్ లో వీళ్ళంతా కలసి ఘంటసాలవారి ని చూడాలని త్యాగరాయనగర్ (టి.నగర్)లో నెం.35, ఉస్మాన్ రోడ్ కి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన సమయానికి ఘంటసాలగారు ఇంట్లోలేరట. 'కన్యాశుల్కం' సినీమా పాటల రికార్డింగుకు వెళ్ళారట. మా నాన్నగారు, నాయుడుగారు కొంతసేపు అక్కడ గడిపి తిరిగి బసకు వచ్చేశారు. మర్నాడు ఉదయమో, సాయంత్రమో రైలుకు బయల్దేరే సమయానికి ఘంటసాలగారు ఆ హోటల్ కు వచ్చి, మా నాన్నగారిని వెళ్ళడానికి వీలులేదని, చేతినిండా సినీమాలపని ఉందని తనతోనో ఉండిపొమ్మని బలవంతపెట్టి నాయుడిగారిని మాత్రం తిరిగి వెళ్ళమని చెప్పి మా నాన్నగారిని తనతో కూడా కారులో తమ ఇంటికి తీసుకువచ్చేశారట. తరువాత ఒక ఏణ్ణర్ధం పాటు నేను మా నాన్నగారిని చూడలేదు. మధ్య మధ్య క్షేమ సమాచారాలతో ఉత్తరాలు వచ్చేవి. అప్పుడే, నా చదువు బొబ్బిలికి ట్రాన్సఫర్ అయింది. 1955లో బొబ్బిలి బ్రాంచ్ హైస్కూలులో సెకెండ్ ఫారమ్ లో జాయిన్ అయ్యాను. 

ఆ స్కూల్ విశేషాలు, బొబ్బిలి టూరింగ్ టాకీస్ లలో సినీమాలు ...
వచ్చేవారం....
                    ....సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.


Friday, September 11, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదహారవ భాగం

11.09.20 - శుక్రవారం భాగం - 16*:
పదిహేనవ భాగం ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

నా బాల్యమంతా కలివరం, విజయనగరం,బొబ్బిలి మధ్యనే జరిగింది. పుట్టింది బొబ్బిలి. మొదటి ఐదేళ్ళూ నాగావళీ తీరాన. మూడేళ్ళు తెలుగువారికి సాంస్కృతిక కేంద్రమైన విజయనగరంలో. చదువు బొబ్బిలి - మద్రాస్ - బొబ్బిలిలో. ఉద్యోగరీత్యా మద్రాస్ లోనే స్థిరనివాసం. 

నేను ఓ మూడేళ్ళపాటు విజయనగరం లోనే ఉన్నా మా అమ్మగారి ఊరైన బొబ్బిలి తరుచూ వెళ్తూండేవాడిని. అక్కడ మా అమ్మమ్మగారు ఆవిడ తమ్ముడు సామవేదుల నరసింహంగారు, మా దొడ్డమ్మగారు చెళ్ళపిళ్ళ వరహాలమ్మ, ఆవిడ ఒకే కూతురు శారద. వీరందరి సంరక్షణాభారం మా తాతగారిదే. ఆయన బొబ్బిలి కోపరేటివ్ అర్బన్ బ్యాంకు లో పెద గుమస్తా, కేషియర్ గా పనిచేసేవారు. ఆయన భార్య సుందరి చిన్నతనంలోనే పోయింది. మా అమ్మమ్మగారు, దొడ్డమ్మగారు ఇద్దరూ వితంతువులే. మా అమ్మగారి పేరు శ్రీలక్ష్మి అయినా తెలిసిన వారంతా సుందరి అనే పిలిచేవారు. ఆవిడకు ఒక అన్నగారుండేవాడట. నాకు తెలియదు. పేరు రామం. పదహారేళ్ళకే పోయాడట. మా బొబ్బిలి తాతగారి పెద్దక్కగారే విజయనగరం ఇంటి సంరక్షకురాలు. మా తాతగారు సీతారామశాస్త్రిగారి ముగ్గురు కొడుకులను పెంచినావిడ. బొబ్బిలిలో మా తాతగారింట్లో ఉన్నవారందరిదీ సాత్వికమైన  ఆశ్రమ జీవితం. అందుకు తగినట్లుగా వారుండేది ఒక పూరిల్లు. ముందు వెనుకల ఇల్లు. మధ్యలో చిన్న వాకిలి. అందరూ బహు సౌమ్యులు. ఎవరినోటా ఏ విధమైన పరుషపు మాటలు, వ్యాఖ్యానాలు వినవచ్చేవి కాదు. మా బొబ్బిలి తాతగారిని అందరూ 'సింహాలు బాబూ' అని చాలా గౌరవంగా చూసేవారు. అగ్రహారపు జీవనం. అలాటి వాతావరణంలో పెరగడం నా అదృష్టం. మా తాతగారుండే వీధిలో మొదట్లో అందరూ సామవేదులవారి కుటుంబాలే ఉండేవి . అందుకే ఆ వీధిని సామవేదులవారి సందు అని అనేవారు. పోస్టల్ రికార్డ్స్ లో కూడా అలాగే ఉండేది. మా తాతగారి పూర్వీకులు బొబ్బిలి సంస్థానంలో సామవేద పండితులుగా, ఆయుర్వేద వైద్యులుగా ఉండేవారని చెపుతారు.

మా నాన్నగారి తన  నాలుగు, ఐదు క్లాసుల చదువు బొబ్బిలిలో జరిగింది. అప్పుడే, శ్రీ ఆకుండి నారాయణ శాస్త్రిగారి వద్ద కొంత సంగీతం నేర్చుకున్నారు. ఆ నారాయణ శాస్త్రిగారు బొబ్బిలి కోటలో రాజవంశీయుల పిల్లలకు సంగీతం నేర్పేవారు. బొబ్బిలి రాజావారి పట్టాభిషేకం చాలా ఘనంగా జరిగింది. ఆ సందర్భంగా రాజావారి మీద నారాయణశాస్త్రి గారు  ప్రశంసా గీతం ఒకటి స్వయంగా రాసి రాగమాలికలో స్వరపరచేరు. ఆ తరువాత కూడా ప్రతీ సంవత్సరం బొబ్బిలి ప్రాంతంలో పట్టాభిషేకం దినోత్సవం అని జరుపుకునేవారట. అలాంటి ఒక సందర్భంలో  పట్టాభిషేక దినోత్సవంనాడు బొబ్బిలి ఆస్థానంలో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటున్న  మా నాన్నగారి చేత ఆ కీర్తన పాడించేవారట వారి గురువుగారు నారాయమ శాస్త్రిగారు. ఆ పట్టాభిషేక గీతాన్ని మా నాన్నగారు తొంభై ఏళ్ళ వయసులో మళ్ళీ 2010లో పాడినప్పుటి రికార్డింగ్ ఇక్కడ
సుమారు 263 సంవత్సరాలకు ముందు ఒక సాధారణ కోడి పందేలు కారణంగా చిన్నగా వైషమ్యాలు ఏర్పడి అవి పెరిగి పెద్దవై ఇరుగు పొరుగు సంస్థానాల మధ్య పోరు పెరిగి విజయనగరం, బొబ్బిలి రాజుల మధ్య యుధ్ధానికి దారి తీసింది. హైదరాబాద్ నవాబ్, ఫ్రెంచ్ బుస్సీల ఫిరంగి సైనికుల సహాయంతో బొబ్బిలి కోటను నేలమట్టం చేసి బొబ్బిలి వీరులందరినీ హతమార్చారు. బొబ్బిలి కోటలోని అంతఃపుర స్త్రీలంతా ఆత్మాహుతి చేసుకున్నారు. ఇందుకు ప్రతీకారంగా బొబ్బిలి రాజు బావమరిది తాండ్ర పాపారాయుడు విజయరామరాజును దారుణంగా హత్యచేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తరువాత, ఒక 150 సంవత్సరాలకు బొబ్బిలి వంశీయులు ఇప్పుడున్న చోట కొత్తగా ఒక కోట నిర్మించుకున్నారు. దాని చుట్టూ ఒక ఊరు వృధ్ధి చెందింది. ఆనాటి  అసలు రాజ వంశస్థులెవరూ లేని కారణంగా ఇతర సంస్థానాలనుండి దత్తత కు వచ్చినవారే సంస్థానాధీశులు అయినట్లు చెప్పుకుంటారు. ఇప్పుడున్న విజయనగర రాజుల పూర్వీకులు ఉత్తరప్రదేశ్ లోని  రేవా సంస్థానం నుండి దత్తతకు వచ్చినవారే. అందుకే ఇన్నాళ్ళైనా వారెవరూ స్వఛ్ఛమైన తెలుగు మాట్లాడలేరు. పివిజి రాజు పెత్తండ్రి - సర్ విజ్జీ ప్రముఖ క్రికెటర్. రన్నింగ్ కామెంటేటర్ గా కూడా చాలా ప్రసిధ్ధి పొందారు.

ఉత్తరాంధ్రాలో ఉన్న జమిందారి సంస్థానాలలో ప్రముఖమైనవి విజయనగరం, బొబ్బిలి, సాలూరు. అందులో ఉన్నతంగా, పెద్ద ఆదాయం కలిగినది విజయనగరం, తరువాత బొబ్బిలి, చివరగా సాలూరు. ఈ సంస్థానాల గురించి ఒక జోకు ప్రచారంలో ఉండేది. ఈ మూడు సంస్థానాలలో నగారాలు మ్రోగించేవారట. ఆ నగారాల నాదం ఆ ఆస్థానాల ఆర్ధికస్థితిని పోలి ఉండేదట.  విజయనగరం నగారా ఘనం ఘనం అని ఘనంగా మ్రోగేదట. బొబ్బిలి నగారా ధనం ధనం అంటూ ధనం కోసం మ్రోగేదట. ఇక, సాలూరు నగారా ఋణం, ఋణం అంటూ ఋణనాదం చేసేదట. ఆయా సంస్థానాల ఆదాయ స్థితిగతులని ఇలా ఈ జోక్ చేసేవారు. 

అలాటి మూడు సంస్థానాలతోనూ మా పూర్వీకులకు సత్సంబంధాలు వుండేవి.

1952లో విజయనగరంలో ఉన్నప్పుడు విజయావారి  "పెళ్ళిచేసి చూడు" చిత్రం వచ్చింది. ఆ సినీమాను అక్కడ చూసినా పూర్తి అవగాహన లేని వయసు. "బ్రహ్మయ్యా! బ్రహ్మయ్యా!" పాట, "అమ్మా! నొప్పులే, అమ్మమ్మా నొప్పులే" పాట, ఎన్ టి రామారావు పిచ్చివాడిలా బస్సు నడపడం, పుష్పలత, మహంకాళి వెంకయ్య నూలు దారంతో ఆడడంవంటివేవో గుర్తున్నాయి తప్ప, పూర్తి సినీమా గుర్తులేదు. నేను, మా అమ్మగారు 1953లోనో ఎప్పుడో బొబ్బిలి వచ్చినప్పుడు రాజావారి హాలుకి పెళ్ళి చేసి చూడు సినీమా రాబోతున్నదని వార్త వచ్చింది. ఆ సినీమాకు ఘంటసాలవాడే సంగీతం సమకూర్చాడని, అందులో అతని పాటలున్నాయని అందరూ ఘనంగా చెప్పుకున్నారు. ఘంటసాల విజయనగరం మ్యూజిక్ కాలేజీలో అందులో సాలూరు చినగురువుగారి దగ్గర సంగీతం నేర్చుకోవడం వలన, ఆ ప్రాంతాలవారందరికీ ఘంటసాల అన్నా ఘంటసాల సంగీతమన్నా, పాడిన పాటన్నా, పద్యమన్నా విపరీతమైన అభిమానం, గౌరవం ఇప్పటికీ వున్నాయి. ఘంటసాల తప్ప మరో గొప్ప గాయకుడున్నాడంటే ససేమిరా ఒప్పుకోరు. 

పెళ్ళిచేసి చూడు చిత్రమూ అందులోని పాటలు అప్పటికే బహుళ జనాదరణ పొందడంతో బొబ్బిలిలో ఆ సినీమా కోసం అందరూ ఎదురు చూసారు. బొబ్బిలిలో అప్పటికి ఒకటే పెర్మనెంట్ సినీమా హాలు. అదే రాజావారి శ్రీరామా టాకీస్. అదికాక ఓ రెండు మూడు టూరింగ్ టాకీస్ లు ఉండేవి.  టెంట్ హాల్స్. అవి వర్షాకాలంలో పనిచేయవు. రాజావారి హాలులో సౌండ్ బాగుంటుందని, డబుల్ ప్రొజెక్టర్ తో పని చేస్తుందని, ఆ హాలులో స్క్రీన్ సిల్వర్  స్క్రీన్ అని చెప్పేవారు. స్క్రీన్ క్లాత్ కాదు. అలాటి హాలులో సినీమా చూడడం ఆనందంగా భావించేవారు. సినీమా రిలీజ్ డేట్ తెలియగానే పోస్టర్లు అంటించిన బళ్ళు ఊరేగించారు. ఆ బళ్ళకు ముందు ఓ ముగ్గురు డప్పులు వాయించుకుంటూ వచ్చేవారు. ఊళ్ళోని ప్రతీ వీధి జంక్షన్ లో నిలబడి లౌడ్ స్పీకర్లలో ఆ సినీమా గురించి గట్టిగా అరిచి చెప్పేవారు. ఐదేసి నిముషాలకు ఒకసారి గ్రామఫోన్ లో ఆ సినీమాలో పాటలు పెట్టేవారు . గ్రామఫోన్ కీ తగ్గినా, స్పీడ్ లెవెల్స్ కదిలిపోయినా పాట మహా బొంగురుగానో, లేదా కీచుగానో వినిపించేది. ఒక్కొక్కసారి జట్కా బండికి పోస్టర్ తడకలు కట్టి, సినిమా రంగు కాగితాలు గాలిలోకి విసురుతూ పంచేవారు. మరి, అలాటి ఘంటసాలవాడి సినీమా చూడడం మానేస్తామా?

మా సామవేదుల వారి వీధిలో ఆఖరి మూడిళ్ళూ సామవేదులవారివే. వారంతా కజిన్స్. తాతా సహోదరుల పిల్లలుఆ మూడిళ్ళ కోడళ్ళ పేరూ ఒకటే. కామేశ్వరి. పెద కామేశ్వరి, మధ్య కామేశ్వరి, చిన్న కామేశ్వరి. ఆ చిన్న కామేశ్వరిగారి భర్త సత్తేలు(సత్యనారాయణ). ఒకే కొడుకు తరణీరావు. చిన్నప్పటినుండీ ఏదో అనారోగ్యం. మెడ ఒక పక్కకు వంగిపోయి భుజానికి అంటుకుపోయినట్లుగా వుండేది. నెలల పిల్లాడిగా ఉన్నప్పటినుండి చిన్న ఊగుడు కుర్చీలో పడుక్కోబెట్టడం వలన అలాటి అవకరం వచ్చిందనేవారు. మరేదో కారణం కావచ్చు. బాగుపడలేదు.  వారిల్లు విశాలమైన పెంకుటిల్లు. రెండు వీధులవేపునుండి ఇంట్లోకి ప్రవేశముండేది.
వారింటికి మా వీధివేపుండే గుమ్మం మాకు దగ్గర.  నిమ్మ, నారింజ, పంపర పనస, జామి వంటి చాలా చెట్లు,   మల్లి, బంతి చామంతి వంటి రకరకాల పువ్వుల మొక్కలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ ఇల్లుండేది. ఆ సత్తేలుగారు చెలికాని అచ్యుతరావుగారి రైస్ మిల్లులో పనిచేసేవారు. అచ్యుతరావుగారు బొబ్బిలి రాజా వారికి బావమరది అని విన్నాను. వారంతా వెలమ  దొరలు. అలాటి దొరల కొలువులో పనిచేయడం వలన మిగిలిన వారికంటే కొంచెం ఉన్నతమే. వాళ్ళింటికి అన్నీ దొరగారి దివాణం నుంచే వస్తాయని ఆ చిన్నకామేశ్వరిగారు గొప్పగా చెపుతూండేది. మా తాతగారి కుటుంబానికి కూడా దగ్గరే. మా అమ్మమ్మగారిని వదినా అని పిలిచేది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఒక పెద్ద చెంబుతో పాలో, లేక మజ్జిగో నిమ్మాకులు, దబ్బాకులు వేసి ఇచ్చి ఇంటికి తీసుకువెళ్ళమనేది. మనిషి మంచిదే. కానీ నోటి ధాటీ వుండేది. వాళ్ళ ఇంటి పక్కనున్న మధ్య కామేశ్వరి గారికి భర్త లేడు. ముగ్గురు పిల్లలు రమణ, వరహాలు, భాస్కరం. బాచీ అని పిలిచేవారు. అతను నాకు బొబ్బిలిలో మొదటి స్నేహితుడు. పెద్దతను అప్పటికే  ఉద్యోగరీత్యా (రైల్వేలోనే అని గుర్తు) వేరెక్కడో ఉండేవాడు. రెండో అతను వరహాలు. హైస్కూలు లో పేరు మోసిన ఫుట్ బాల్ ప్లేయర్. గోల్ కీపర్ గా మంచి పేరుండేది. స్పోర్ట్స్ కోటాలోనే అతనికీ రైల్వేలో ఉద్యోగం దొరికింది. అతనికి బ్రహ్మాండమైన చెముడు. వాళ్ళిల్లు కూడా మా ఇల్లులాగే పూరిల్లు. ఆ పక్కన పెద కామేశ్వరిగారిల్లు. మేడ ఇల్లు. ఎస్ ఎమ్ రావ్ గారూ రైల్వేలోనో పనిచేసేవారు. ఆరోజుల్లో ఉత్తరాంధ్రాలోని చాలామంది SSLC పూర్తికాగానే చిన్నో, చితకో రైల్వే ఉద్యోగం కోసం తెగ తాపత్రయ పడి ఆ ఉద్యోగంలోనే జీవితాంతం గడిపేవారు. ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్ లో స్థిరపడిన సగంమంది తెలుగువారంతా రైల్వే ఉద్యోగులే. ఉత్తరాంధ్రాకు చెందినవారే. వారంతా తమ తమ ఊళ్ళలో తెలుగు సంస్కృతిని కాపాడుకోవడంలో ఇతోధికంగా కృషిచేశారు. 

ఆ రోజుల్లో  బొబ్బిలి కోటకు ఎదురుగా, రాజవీధిలో ఒక టౌన్ హాలుండేది. అందులో తరచూ బొబ్బిలి రాణీగారి ఆధ్వర్యంలో పురాణ కాలక్షేపాలు, భజన కార్యక్రమాలు నిర్వహించేవారు. వాటిలో మా వాళ్ళంతా కూడా వెళ్ళి పాల్గొనేవారు. మా దొడ్డమ్మగారు, చెళ్ళపిళ్ళ వరహాలమ్మ గారు బాగా పాడేవారు హార్మోనియం కూడా వాయించేవారు. బొబ్బిలిలో ఉండే అనేక సత్సంగ కార్యక్రమాలన్నింటికీ విధిగా హాజరయి భజనగీతాలు ఆలపించేవారు. రాణీగారి టౌన్ హాల్ లో జరిగే భజనలకు స్త్రీలకు మాత్రమే ప్రవేశం. రాణివాసపు ఘోషా అమలులో ఉండేది. మగవారికి వేరేగా ఏర్పాటు చేసేవారు. మా కుటుంబానికి ఈ రకమైనటువంటి పరిచయాలు బొబ్బిలి సంస్థానంతో ఉండేవి.శ్రీ వి ఏ కే రంగారావు

మనందరికీ బాగా తెలిసిన ప్రముఖ సంగీత, నృత్య విమర్శకుడు శ్రీ విఏకె రంగారావు (వేంకట ఆనంద కృష్ణ)గారిది ఆ వూరే. బొబ్బిలి రాజా శ్వేతాచలపతి రామకృష్ణ రంగారావు గారి తమ్ముడు, కిర్లంపూడి జమిందారు శ్రీ జనార్ధన రంగారావుగారి కుమారుడు. వారి బంగళా ఊరికి కొంచెం దూరంగా విశాలమైన తోటలో వుండేది. విఎకే రంగారావుగారికి నృత్యంలో మంచి ప్రవేశముండేది. ఆయనకు పదహారేళ్ళ వయసులో కాలికి గజ్జె కట్టి వారి రామ్ మహల్ లో నృత్యం చేయడం బాగా గుర్తు. బహుశా గోకులాష్టమి ఉత్సవాల సమయం కావచ్చు. ఈవయసులో కూడా ప్రతీ సంవత్సరం కార్వేటినగర్ వేణుగోపాలుని సన్నిధిలో గజ్జె కట్టి నాట్యం చేస్తారట. అయితె, ఆయనతో నా పరిచయమంతా ఘంటసాలవారింట్లో ఉన్నప్పుడే. బొబ్బిలిలో కృష్ణాష్టమి సమయంలో డోలాయాత్ర చాలా ఘనంగా జరిపేవారు. మా అగ్రహారం వీధి చివరన ఉన్న పూల్ బాగ్ లో ఉన్న మండపంలో  పెద్ద ఊయలను అలంకరించి అందులో కృష్డ విగ్రహాలు పెట్టి పూజా పునస్కారాలు జరిపేవారు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకూ మా వీధంతా రకరకాల షాపులతో, చుట్టుపక్కల గ్రామాలనుండి ఎడ్లబళ్ళమీద   వచ్చే జనాలతో మహా కోలాహలంగా వుండేది. అలాటి సమయాలలో మా తాతగారి బంధువులు కొందరు పక్కనున్న పాల్తేరు నుండో లేక రాయపూర్ నుండో వచ్చి ఈ డోలాయాత్ర, ఊళ్ళో ఉన్న తెలుగు సినిమాలు మూడాటలు చూసి ఆ మర్నాడు తిరిగి వెళ్ళిపోతూండేవారు. మా వీధి చివరన ఉన్న పూలబాగ్ లో చాలా మంచి టెన్నిస్ కోర్ట్ వుండేది. అక్కడ టెన్నిస్ ఆడడానికి బొబ్బిలి రాణిగారు తమ నల్ల ఫోర్డ్ కారులో ప్రతీరోజూ సాయంత్రం నాలుగైదు గంటల ప్రాంతంలో దుమ్ము రేపుతూ వెళ్ళేవారు. ఆ కారంతా తెల్లటి సిల్క్ తెరలు కప్పేసి ఉండేవి. యువరాణి లావణ్యకుమారి మంచి టెన్నిస్ ప్లేయర్. ఆవిడ మద్రాస్ లో  స్టేట్ లెవెల్  పోటీల్లో  చాలా వాటిలో పాల్గొన్నారు.

బొబ్బిలిలోని రాజావారి కోట, వేణుగోపాలస్వామి ఆలయం, సంస్థానం హైస్కూల్, సుగర్ ఫాక్టరీ, ఊరు చివరి తాజ్ మహల్ లాటి గెస్ట్ హౌస్, ఇవే  ఆ వూరి ప్రతిష్టా చిహ్నాలు. దివాణంలోని గంటలు, సుగర్ ఫ్యాక్టరీ సైరన్ లు బొబ్బిలి ప్రజలకు సమయపాలనం గురించి గుర్తు చేసేవి.

సినీమాలకు సంబంధించినంత వరకూ బొబ్బిలి B సెంటర్. అందువలన ఫస్ట్ రిలీజ్ సినీమాలు బహు అరుదు. పక్కనున్న పార్వతీపురం బిజినెస్ సెంటర్ అందువలన అది A గ్రేడ్ . ప్రతి కొత్త సినీమా ఆ ఊళ్ళో ఆడుతుంది. ఆ A సెంటర్స్ లో ఆడి వెళ్ళిన తరువాత ఎప్పుడో బొబ్బిలిలో  సినీమాలు రిలీజయేవి. అప్పట్లో సినిమాలన్ని ఏ పదిహేను కాపీలో, ఇరవై కాపీలో మాత్రమే తీసి ఆంధ్రదేశమంతా ఆడేవారు. బొబ్బిలిలాటి ఊళ్ళో బొమ్మ నాలుగు వారాలాడితే అది హిట్ సినీమా క్రిందే లెక్క. మామూలు సినీమాలన్నీ రెండు వారాలాడితే గొప్ప.


అలాటి సందర్భంలో, ఈ పెళ్ళిచేసి చూడు సినీమా వచ్చింది. బొబ్బిలి రాణిగారి అనుయాయులంతా పాసుల మీద  ఈ  సినీమా చూసేందుకు అవకాశం వచ్చిందని, అందరం కలసి సాయంత్రం ఆటకు వెళదాం రమ్మనమని మా వీధిలోని చిన కామేశ్వరిగారు మా అందరిని బయల్దేరదీసింది. సాధారణంగా ఈ సినీమాలకు పాసులు సినీమా ఇంక వెళిపోతుందనగా, పోలీసులకు, సానిటరీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లవారికి ఇచ్చేవారు. ఎందుకంటే ఆయా శాఖలవారి నిరంతర సహకారం సినీమా ధియేటర్లకు అవసరం. అందుకోసం వాళ్ళకి ఫ్రీ. 

మేము వెళ్ళినది సినిమా విడుదలైన వారంలోనే. అందులోనూ ఆడవారికి మాత్రమే. నేను చిన్నపిల్లవాడిని కావడం వలన నాకు ఇబ్బంది లేదు. కానీ, వచ్చిన ఇబ్బంది అంతా శ్రీరామా టాకీస్ లోనే. మేమంతా రాణివాసం వారికి కావలసినవాళ్ళం కావడం వలన మమ్మల్నందరినీ తీసుకువెళ్ళి బాక్స్ లో కూచోపెట్టారు. హాలుకు రెండు ప్రక్కలా రెండు బాక్స్ లు ఒక్కొక్కదాంట్లో పదిహేనుమందో ఇరవైమందో కూర్చోవచ్చును. రాయల్ ఫేమీలి వారికోసం మాత్రమే. ధియేటర్లోని ఇతర ప్రేక్షకులు ఎవరూ కనపడకుండా పూర్తిగా తెరలు కప్పేసి ఉంచుతారు, ఘోషా కోసం.  హాలులో హైక్లాస్ కుర్చీ టికెట్ తప్ప మిగిలిన క్రింది క్లాసులు ఆడవారికి వేరే, మగవారికి వేరే. మధ్యలో  కర్ర డివైడర్స్ ఉండేవి. సినీమా వేసేముందు ధియేటర్లోని లైట్లన్నీ పూర్తిగా ఆర్పివేశాక అప్పుడు బాక్స్ లోని తెరలు తొలగించేవారు. అసలే పొట్టివాడిని. దానికి తోడు అడ్డంగా  బాక్స్ ముందు పిట్టగోడలు (parapet wall). నిక్కి నిక్కి చూడాలి.
 
తెరమీద 'పొగ త్రాగరాదు' 'No Smoking', 'ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు' వంటి హితోపదేశాల స్లైడ్స్ తరువాత ఇండియన్ న్యూస్ రీల్ విమానాలతో ఏదో ఒక పది నిముషాల వార్తా విశేషాలు. తర్వాత, అసలు సినీమా. అప్పటిదాకా హాలు బయట డప్పుల మ్రోత, టిక్కెట్ల అమ్మకం జరిగేది. మెయిన్ సినీమా ప్రారంభించాక టికెట్ కౌంటర్లు మూసివేశేవారు. డప్పుల మ్రోత ఆగేది. సాయంత్రం ఆరుగంటల వేళ ఊళ్ళో ఉన్న మూడు సినీమా హాల్స్ డప్పుల మ్రోత ఊరంతటికి వినపడేది. 

"పెళ్ళి చేసి చూడు" సినీమాకు ముందు ఆ సినీమా ట్రైలర్ వేశారు. అయితే బొమ్మలేకుండా మాటలతోనే ఆ సినీమా వివరాలు, పాటలు వినిపించిన గుర్తు. అందులో పని చేసిన వారిగురించి చెపుతూ, "ఇంట ఇంటనూ గంట గంటకూ ఎవ్వరి కంఠం వింటారో  ఆ ఘంటసాలవారీ చిత్రానికి నాదబ్రహ్మలండీ" అని ఆ సినీమాకు సంగీత దర్శకత్వం వహించి, పాటలు పాడిన ఘంటసాలవారి గురించి ప్రత్యేకంగా చెప్పడం ఒక విశేషం. నాకు మహా ఆనందం. 

అంటే అప్పటికే ఘంటసాలవారి గళం ఆంధ్రదేశాన్ని ప్రభావితం చేసిందని అర్ధమౌతుంది. ఆ సినీమాలో మిగతా అంశాలతో పాటు పిల్లలకోసమే నాలుగు పాటలు డాన్స్ లు పెట్టడం వలన పెళ్ళిచేసి చూడు, ఆ బాల గోపాలాన్ని అమితంగా ఆకర్షించింది. సినీమా పూర్తయి బాక్స్ లోని ఆడవాళ్లంతా కారులోనో, తెరలుకట్టిన జట్కాలలోనో వెళ్ళిపోయాక ధియేటర్ తలుపులు తీసేవారు. అప్పుడు మిగతా జనం బయటకు పోయేవారు. నాకు కట్టి పడేసినట్లుగా ఉండే ఈ బాక్స్ సినీమా తృప్తి కలిగించలేదు. మళ్ళీ  మా తాతగారి దగ్గర మారాం చేసి  ఆరణాల బెంచి టిక్కెట్టు కొనుక్కొని చుట్ట, బీడీ, సిగరెట్ పొగల మధ్య మరొకసారి 'పెళ్ళి చేసి చూడు' సినీమాను తృప్తిగా చూశాను. 

ఈ పెళ్ళి చేసి చూడు సినీమా చూశాక మర్నాడు మా శారద పెళ్ళికి కుద్దిగాం తరలివెళ్ళేం.

ఆ వివరాలు వచ్చేవారం....
                 ....సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Friday, September 4, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదిహేనవ భాగం

04.09.20 - శుక్రవారం భాగం - 15:
పధ్నాలుగవ భాగం ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"శ్రీమతి లీలమ్మ గారికి,
అంటూ తన కృతులను రేడియోలో, కచేరీలలో పాడేందుకు తన అనుమతి పత్రాన్ని ఒక పోస్ట్ కార్డ్ మీద మా తాతగారి తరఫున మా ప్రభూ చిన్నాన్నగారు ముత్యాలకోవ వంటి దస్తూరీతో తన దగ్గరున్న మెరూన్ కలర్ 'రత్నం' పాళీ పెన్ తో వ్రాసి చదివి వినిపించగా, ఆ బరువైన లావుపాటి పెన్ తో మా తాతగారు ఉత్తరం క్రింద 'పట్రాయని శీతారామశాస్త్రి' అని సంతకం చేశారు. 

ఆ తరువాత, ఆ ఉత్తరాన్ని, అప్పటికే సినీమాలలో పాడుతూ మంచి పేరు తెచ్చుకుంటున్న గాయని శ్రీమతి పి.లీల గారి మెడ్రాస్ ఎడ్రస్ కు  మా చిన్నాన్నగారు పోస్ట్ చేశారు. ఆయన  తెల్ల చొక్కాజేబులు చాలా పెద్దవి. అందులో మనీపర్స్, పద్దులపుస్తకం, కాగితాలు, పోస్ట్ కార్డులు‌, పెన్నులు, ఇలా ఎన్ని వస్తువులైనా పట్టేవిగా ఉండేవి. 

నాకు మా తాతగారు తన సంతకాన్ని తప్పుగా పెడుతున్నారనిపించింది. 'సీతారామశాస్త్రి' కి బదులుగా 'శీతారామశాస్త్రి' అని వ్రాయడం  ఒక ఆశ్చర్యం. అయితే, 'శీ' అని వ్రాయడం ఆయన అలవాటని తెలిసింది.

మా తాతగారు, పట్రాయని సీతారామ శాస్త్రిగారు ఒక వాగ్గేయకారుడు. భావప్రాధాన్యమున్న ఎన్నో కృతులు వ్రాశారు. చందోబధ్ధంగా పద్యాలు వ్రాసారు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ తనదైన బాణీని వినిపించిన శాస్త్రిగారే 'కౌముదీ పరిషత్' కు ఉచితమైన అధ్యక్షుడిగా ఇతర కవులందరిచేత ఎన్నుకోబడి తన జీవితాంతం ఆ పదవిలో కొనసాగారు. ఇంతకూ సీతారామశాస్త్రిగారికి ఏ స్కూల్ చదువులేదు. వారి తాతగారు (తల్లిగారి తండ్రి) ఇసకలో దిద్దించిన ఓనామాలు తప్ప ఎక్కడా ఏ పాఠశాల గడప తొక్కలేదు. 

మా ముందు తరంలోని పెద్దలెవరికీ హైస్కూలు, కాలేజీ సర్టిఫికెట్లు లేవు. అందువలన వారందరూ పూర్తిగా తమ సంగీతాన్నే నమ్ముకొని జీవించవలసివచ్చింది. చదువుకు సంబంధించిన సర్టిఫికెట్ లేని కారణంగా మా తాతగారికి రావలసిన మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్ పదవి రాలేదు. ఆ పదవి దక్కకపోవడానికి గల అనేక కారణాలలో ఇది కూడా ఒక కారణంగానే ఒప్పుకోవాలి. కారణాలేవైనా ఉద్యోగ విరమణానంతరం రావలసిన పెన్షనూ రాలేదు. 

పూర్వజన్మ సుకృతం, స్వయంకృషి సీతారామ శాస్త్రిగారిని ఒక ఉన్నత వాగ్గేయకారుడిని చేసింది. ఒక విలక్షణ వ్యక్తిగా నిలబెట్టింది. సర్వశ్రీ - పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి, క్రొవ్విడి రామం, క్రొవ్విడి లక్ష్మణ్, నల్లాన్ చక్రవర్తుల సోదరులు, భళ్ళమూడి నరసింహం, ఆకుండి వెంకటశాస్త్రి, బుర్రా శేషగిరి రావు, జీవన ప్రభాత వంటి లబ్ధప్రతిష్టులైన సాహితీవేత్తలతో పాటు మా తాతగారి శిష్యులందరూ, ఘంటసాల సహా, కౌముదీ పరిషత్ సభ్యులే. మా నాన్నగారి ముఖ్యస్నేహితులు జీవన ప్రభాత, పంతుల శ్రీరామశాస్త్రి, భట్టిప్రోలు కృష్ణమూర్తి, మంథా వెంకట రమణారావు. వీరంతా కౌముదీ పరిషత్ కార్యకలాపాలలో పాల్గొనేవారు. వీరు అప్పటికే రచయితలుగా పేరుపొందివున్నారు. వీరి రచనలు 'భారతి' లో వస్తూండేవి. కౌముదీ పరిషత్  సంస్థ రాజమండ్రిలో కూడా జీవన ప్రభాత ఆధ్వర్యంలో నడిచింది. మా తాతగారి ఆధ్వర్యంలోని 'కౌముదీ పరిషత్', 'భారతీ తీర్థ' (ఆంధ్రా వేదిక్ రీసెర్చ్ యూనివర్సిటీ)కు అనుబంధ సంస్థగా మారి కవి, గాయక, పండితుల సమ్మేళనంతో ఒక ప్రముఖ వేదికగా అందరి మన్ననలు పొందింది. తరుచూ, సంగీత, సాహిత్య గోష్టులు జరిపేవారు. 

పండగలు పబ్బాలు వస్తే విజయనగరం సంగీత, సాహిత్యగోష్టులతోనే కాదు, పేకాటలతోనూ హోరెత్తేది. మా నాన్నగారి సాహితీ మిత్రబృందం అంతా ఒరిస్సాలోని రాయగఢా, జయపూర్ రూర్కెలా ఇతర ప్రాంతాలనుంచి వచ్చి  కౌముదీ పరిషత్ సభలలో పాల్గొనడంతో పాటు మా ఇంట్లో నిర్విరామ చతుర్ముఖ పారాయణం నిర్వహించేవారు. నిరంతర శ్వేతకాష్టాల ధూపం ఇంట్లో ఆడవాళ్ళను ఇబ్బంది పెట్టేది. 'ఇస్తోకు రాణి' అనే మాట  వాళ్ళ ఆటలో తరుచూ వినపడేది. ఎత్తడం, అడ్డాట, నేషనల్ బ్రిడ్జ్, మూడు ముక్కలాట వంటి పేర్లు అప్పుడే తెలిసింది. రాత్రుళ్ళు హరికేన్ లాంతర్ వెలుగులోనే పేకాడడం గుర్తు. పిల్లల కోసం చిన్న సైజ్ పేకదస్తాలు వుండేవి. వాటితో 'తరగనితంపి' అనే ఆటను  పిల్లలం ఆడేవాళ్ళం. వీరందరి భోజనాలు, బసలు మా ఇంట్లోనే. సందట్లో సందడిగా చామలాపల్లి, డొంకాడ , భీమవరం, పెంట, గుడివాడ, బొబ్బిలి ప్రాంతాల నుండి  వచ్చి పోయే బంధువుల రాకపోకలతో పండుగలు, వేసవి శెలవుల హడావుడి అంతా మా ఇంట్లోనే కనిపించేది.

మా తాతగారికి దిన పత్రికల్లో వచ్చే దినసరి రాశి ఫలాలాను చదివి వాటిని ఆచరించడం ఒక సరదా. 'అమ్మీ! ఇవేళ నా రాశికి ప్రయాణం అని రాశారు. అందుచేత ఒకసారి బొబ్బిలి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయి ఆ మర్నాటికి చక్కా తిరిగి వచ్చి దినఫలాలను నిజం చేసేవారు. బొబ్బిలిలో ఆయన తమ్ముడు (పెత్తల్లి కొడుకు) సామవేదుల నరసింహంగారు (బొబ్బిలి కోపరేటివ్ బేంక్ సింహాలుగారు), ఆయన చెల్లెలు అప్పలనరసమ్మగారు, ఆవిడ పెద్దకూతురు చెళ్ళపిళ్ళ వరహాలమ్మ - ఆయన పెద్ద మేనకోడలు, ఆవిడ కూతురు శారద ఉండేవారు. మా అమ్మగారు సామవేదుల నరసింహంగారి రెండో మేనకోడలు. వీళ్ళందరినీ ఒకసారి చూసేసి ఒక రోజుండి విజయనగరం వచ్చేస్తూండేవారు. ఆయన అక్కగారు, మా తాతగారి కూడా అక్కగారే అయిన ఓలేటి వెంకట నరసమ్మగారే విజయనగరంలో ఇంటి కేర్ టేకర్. ఇంటి సంరక్షణ పర్యవేక్షణ ఆవిడదే. ఆవిడనే మా తాతగారు అమ్మీ అని పిలిచేవారు. ఆవిడే మా పెద్దమ్మమ్మ.

అలాగే, చోడవరం. ఆ ఊళ్ళో ఆయనకో  చెక్క భూముండేది. అది పేరుకే సొంతం. దానిని కౌలుకు తీసుకున్నవారెవరో కానీ ఆ భూమి మీద ఏవిధమైన ఆదాయం ఇచ్చేవారు కాదని వినికిడి. ఎప్పుడో ఒకసారి చోడవరం రావడం ఆ వ్యక్తిని చూడడం, అతను చెప్పే తీపి కబుర్లకు లొంగి అయ్యో పాపం! అని జాలిపడి తిరిగిరావడం జరిగేది. బస్సు ఖర్చులు, అలసట తప్ప ఒరిగిందేఁవీఁ లేదు. ఆ విషయం ఆయనకూ తెలుసు. ఆ తరువాత, ఆ చోడవరం భూమి కూడా సంసారం కొసం హరించుకుపోయింది.

నా విజయనగరం చదువు, బ్రాంచ్ కాలేజీకి మారింది. ఫస్ట్ ఫారమ్ లో జాయిన్ చేశారు. కొత్త స్కూలు, కొత్త వాతావరణం,కొత్త టీచర్లు, కొత్త స్నేహితులు. అలవాటు పడేందుకు టైమ్ పట్టింది. ఆ బ్రాంచ్ కాలేజీలో చేరినప్పుడే బాల్ పెన్ తో వ్రాయడం మొదలయింది. నాకు ఒక  రోస్ కలర్ టిప్, రోస్ కలర్ బాటమ్ ఉండే తెల్లటి బాల్ పెన్ కొనిచ్చారు. దానితో రాయడానికి కష్టపడవలసి వచ్చేది. అప్పుడే, మొదటిసారిగా చెప్పులు వేసుకోవడం మొదలయింది. బాటా చెప్పులు. పది రూపాయల లోపే. అంతవరకు ఎలాటి రోడ్లమీదైనా చెప్పుల్లేకుండానే తిరిగేవాడిని. కొత్త చెప్పులు అలవాటులేక వేళ్ళమధ్య కరవడం, దానికి మందు పూయడం ఒక పని. ఆ బ్రాంచ్ కాలేజీ, పొడుగాటి వరండాలతో, పెద్ద పెద్ద గదులతో బాగానే ఉండేది. ఆగస్ట్ 15 కి తరగతి గదులు అందంగా రంగు కాగితాలతో అలంకరించేవారు.  ఫస్ట్ ఫారమ్ తరగతిలోఉన్న పిల్లలందరిని స్క్వాడ్ ల క్రింద విభజించారు. నేను నెహ్రూ స్క్వాడ్. కొందరు గాంధీ స్క్వాడ్. మరికొందరు నేతాజీ స్క్వాడ్. అప్పుడే, మన దేశ నాయకుల ఫోటోలు చూడడం, వారి పేర్లు తెలుసుకోవడం. నేను నెహ్రూ స్క్వాడ్ లో ఉన్నందుకు ఒక నెహ్రూ ఫోటోను తీసుకురావాలని చెప్పారు. మా చిన్నాన్నగారి సాయంతో ఒక పేపర్ లోని ఫోటో కట్ చేసి దానిని అదే సైజ్ అట్టమీద అంటించి మధ్యలో ఒక కన్నంపెట్టి దారంతో కట్టి, ఆ నెహ్రూను మా క్లాస్ లో మేము కూర్చుండే చోట గోడకు మేకు కొట్టి తగిలించాము. ఆ పనులు వేరే పిల్లలు చేసారు. ఈ స్కూలుకు వెళ్ళాక విజయనగరంలో కొత్త వీధుల పేర్లు తెలిసాయి. పాలేపువారి వీధి, బొంకులదిబ్బ,  కానుకుర్తివారి వీధి , గుండాలవారి వీధి , లక్కపందిరివీధి , లంకవీధి, మూడు లాంతర్ల వీధి, గంటస్థంభం, కొత్తపేట వంటి పేర్లు తెలిసాయి. అయితే అవెక్కడున్నాయో ఇప్పటికీ నాకు తెలియదు. అప్పుడే బొడ్డువారి హాలని ఒక సినీమా హాలు తయారయింది. అదే శ్రీరామా టాకీసేమో గుర్తులేదు. (ఆ ధియేటర్ ఓనర్ గారి అమ్మాయి ఓ పుష్కరం తరువాత తిరుపతిలో మెడిసిన్ చేస్తూ మెడ్రాస్ మా ఉస్మాన్ రోడ్ ఇంటి పక్కింటి అరవాళ్ళ మేడమీద అద్దెకుండే తెలుగువారింటికి శెలవుల్లో వచ్చి గడపడం ఓ గొప్ప థ్రిల్లు. 

కృష్ణాహాలులో మా వాళ్ళతో కలసి 'పెళ్ళిచేసి చూడు' వంటి సినీమాలు చాలానే చూశాను. అయితే ఆ హాలులో ఇనప స్థంబాలు ఎక్కువగావుండి సినీమా సరిగా కనపడేదికాదు. అలాగే ఆ సీట్లు కూడా. ముందువాళ్ళ తలలు తప్ప సినీమా కనపడదు. అప్పట్లో చాలా సినీమా హాల్స్ సీట్లు అలాగే ఉండేవి. 

ఒక రోజు స్కూల్ కు వెడుతున్నప్పుడో, వస్తున్నప్పుడో ఒక సైకిల్ వాడు స్పీడ్ గా వచ్చి నన్ను గుద్దేశాడు. కంటి మీద గాయమయింది. తెలిసినవాళ్ళెవరో  ఇంటికి చేర్చారు. తరువాత, సుసర్ల వెంకట్రావుగారి క్లినిక్, గాయానికి మందులు, మాకులు, స్కూలుకు డుమ్మా తప్పనిసరి. అదృష్టం ఏమంటే ఆ సైకిల్ బ్రేక్ రాడ్ ఎడమ కనుబొమ్మమీద గుచ్చుకుంది. అది ఏమాత్రం క్రిందికి తగిలినా ఎడమకన్నే పోయుండేదని డాక్టర్ గారు చెప్పారు. ఆ గాయం మచ్చ చాలా సంవత్సరాలవరకూ అలాగే వుండిపోయింది.

మా చిన్నప్పుడు మా ఇళ్ళలో ఎక్కడా గోడ గడియారాలు, చేతి వాచీలు లేవు. టైమ్ తెలుసుకోవాలంటే మా వీధిలో నాలుగైదు ఇళ్ళ తరువాత ఉండే పెద్దమ్మి - చిన్నమ్మి ఇంట్లో వుండే గోడ గడియారాన్ని బయటనుండే కటకటాల తలుపులుగుండా చూసి వచ్చేవాళ్ళం. ఒకరోజు ఉదయం టైమ్ చూడడానికి వెళుతూండగా ఏదో జరిగింది.  ఎవరో ముందుకు త్రోసినట్లయింది. ఒక వారగా నడుస్తున్న నేను రోడ్ అవతల వేపుకు జరిగిపోయాను. అదెలా జరిగిందో నాకే తెలియదు. ఆ సమయంలో ఏదో చిన్న ఉరుము లాటి శబ్దం వినిపించింది. అది కొద్ది క్షణాలు మాత్రమే. తర్వాత ఏమీ లేదు. ఇంటికి వచ్చాక తెలిసింది భూమి కంపిస్తే అలా జరుగుతుందట. విజయనగర ప్రాంతాలలో చాలాకాలం ముందు భూకంపాలు తరచూ వచ్చేవిట. అందుకు కారణం, హెర్కులిస్ భూమిని మోస్తూ ఒక భుజం మీదనుండి మరో భుజానికి మార్చుకోడమేనట. మా మిత్రబృందం చెప్పింది.

తరువాత, తెలిసిన విషయం ఏమంటే విజయనగరానికి సమీపాన రామతీర్థం అనే ఊరుంది. ఆ వూళ్ళోని కోదండ రామస్వామివారి ఆలయం చాలా పురాతనమైనది, ప్రసిధ్ధిచెందినదీను. ఈ ప్రాంతమంతా కొండలు. అవి ఒకప్పుడు గంధకం కొండలట. వాటిలోని గంధకం  లోపల్లోపల మండడం వలన ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో భూకంపాలు ఏర్పడేవట. ఇదంతా శతాబ్దాలకాలం నాటి మాట. వాటిమీద ఎక్కడా ఒక చెట్టుకానీ, పచ్చని మొక్కకానీ కనపడదు. ఆ ప్రభావం వల్లనే అప్పుడప్పుడు భూమి కంపిస్తుందని అనేవారు.
(రామతీర్థంలో కోదండరామస్వామి కోవెల)

మా ఫ్రెండ్స్ లో రీల్ మాస్టర్లు (సింపుల్ గా కోతలరాయుళ్ళు)‌ ఎక్కువే. విజయనగరం ఊళ్ళోనుండి ఎక్కడనుండి చూసినా ఊరి పొలిమేరల్లో ఉన్న మచ్చకొండ, సూదికొండ కనిపించేవి. ఆ మచ్చకొండ మీద ఏదో పాడుపడిన కట్టడం ఉండేది. అదేమిటో స్పష్టంగా గుర్తులేదు. అలాగే, మచ్చకొండకి మచ్చ ఎలా వచ్చిందంటే, విజయనగరం మహారాజావారు కోటలో నుండి కొండమీదున్న ఒక పక్షిని తన పొడుగాటి తుపాకీతో గురిచూసి కొట్టడంతో ఆ గుండు తాకిడికి పక్షితోపాటూ ఆ కొండ పెళ్ళకూడా రాలి మచ్చపడిందట. ఈ విషయాలు మా స్నేహితులు చెపుతూంటే నోరెళ్ళబెట్టుకొని మహా ఆసక్తిగా వినేవాడిని. విజయనగరం మహారాజావారు ఎంత గొప్పవారో అనిపించేది. 

ఇలాటి విషయాలన్నీ మంత్రిప్రగడ నాగభూషణం నోటమ్మట వినపడేవి. మంత్రిప్రగడ వారింటి పక్కనే మల్లాప్రగడవారు. ఆ ఇంటావిడ మా అమ్మగారి స్నేహితురాలు. ఈ నాగభూషణం చిన్నప్పుడే ముదిరిపోయాడు. అప్పుడు జగ్గయ్య నటించిన 'ప్రియురాలు' అనే సినీమా వచ్చింది. ఆ సినీమాలో హీరో సిగరెట్లు కాలుస్తూంటాడు. ఈ కుర్రాడు ఆ సినీమా చూసొచ్చి అందులో జగ్గయ్యలాగే సిగరెట్ కాలుస్తున్నట్లు నటిస్తూ ఆ డైలాగ్ లతో నటించి చూపేవాడు. అతనంటే ఎందుకో నాకు ఎక్కువ పడేదికాదు. కొంచెం దూరంగానే ఉండేవాడిని.

మా ఇంటి దగ్గరనుండి అయ్యకోనేరు గట్టుకు వెళ్ళాలంటే సుబ్రమణ్యంపేట వీధిలోనుండి తురకల చెరువు మీదుగా వెళ్ళాలి . ఆ వీధిలో అయ్యకోనేరు గట్టుకు ముందు కుడివేపు ఒక పెద్ద తెల్లటి మేడ వుండేది. ఆ ఇంటి వరండాలో పెద్ద పెద్ద డూమ్ లు, రంగురాళ్ళ షాండ్లియర్లు వుండేవి. ఆ ఇంట్లో ఎవరో పట్నాయక్ ఉండేవారు.  రంగురాళ్ళు సేకరించడం ఓ సరదా. మా పక్క వీధిలో ఒకరింట్లో అలాటి రాళ్ళను  మా యింట్లోని వారపత్రికలు ఇచ్చి సంపాదించినట్లు గతంలో చెప్పాను. వాళ్ళింటికి వెళ్ళి చాలారోజులయింది. కోటలోనుండి వచ్చే  కొత్త రంగురాళ్ళేమైన దొరుకుతాయేమోనని వాళ్ళింటికి వెళ్ళాను. నేను ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళేప్పటికి ఎవరెవరో చాలామంది మనుషులు గుమిగూడి వున్నారు. లోపలనుండి ఎవరో ఏడవడం వినిపించింది. నాకు భయంవేసి, ఒకే పరుగున ఇంటికి చేరుకున్నాను. తరువాత, మా చిన్నాన్నగారి మాటల్లో తెలిసిన విషయం ఏమంటే ఆ యింటివారి కొడుకుల్లో ఒకడు విశాఖపట్నం ఏవిఎన్ కాలేజీలో చదువుతూ శెలవులకి రైల్లో విజయనగరం వస్తున్నాడట. అతను రైల్లో చల్లగాలికోసం తలుపు దగ్గర కూర్చున్నాడట. రైలు స్టేషన్లోకి రావడం నిద్రమత్తులో గమనించలేదట. రైలుకి ప్లాట్ ఫారమ్ కి మధ్య కాళ్ళు ఇరుక్కుపోయి అతను పట్టాల మధ్య పడి అక్కడికక్కడే చచ్చిపోయాడట. ఆ సంఘటన వినడానికే చాలా భయంకరంగా అనిపించింది. చిన్నతనం కావడంవలన నేను మళ్ళీ ఆ యింటిలోకి వెళ్ళడానికి మనసురాలేదు.

ఒక రోజు మా ఇంటి వరండాలో కూర్చొని ఫ్లోర్ క్యారమ్స్ ఆడుతూంటే ఒక పెద్ద సినీమా వ్యాన్ వచ్చింది. సాధారణంగా, సినీమాల ప్రచారమంతా జట్కా బళ్ళకు, రిక్షాలకు సినీమా పోస్టర్లు అంటించి "నేడే చూడండి మీ అభిమాన పూర్ణా ధియేటర్లో" అని స్పీకర్లో అరుస్తూ సినీమా కాగితాలు పంచిపెట్టేవారు. వాటిని పేపర్ బండి అనేవారు. ఆ సినీమా పేంప్లట్స్ చాలా చీప్ పల్చటి కాగితాలమీద ఎరుపు, పసుపు, పచ్చ, నీలం రంగులలో పంచేవారు. వాటిమీద సినీమా వివరాలు, కధా సంగ్రహం ఉండేవి. ఆ కాగితాలకోసం పిల్లలంతా ఆ జట్కా ల వెనక, రిక్షాలవెనుక పరిగెత్తి వాటిని సంపాదించేవారు. అలాటిది, ఒక సినీమా ఎడ్వర్టైజ్మెంట్ కోసం ఒక పెద్ద వ్యాన్ లాటిది మా వీధిలోకి రావడం మహదానందం కలిగించింది. ఆ వ్యాన్ కు మూడు పక్కలా పూర్తిగా  బల్బులతో అలంకరించి పోస్టర్లు తగిలించారు. దానిమీద "చంద్రహారం" అని రాసివుంది. నాకు బాగా తెలిసిన ఎన్ టి రామారావు బొమ్మవుంది. వేరెవరి బొమ్మలో కూడా ఉన్నాయి. నాకెందుకో ఆ సినీమా పేపర్ సంపాదించాలనిపించి ఆ వ్యాన్ వెనకాల పడ్డాను.  ఆ వీధిలో కొంత దూరం వెళ్ళాక ఎలాగో ఒక పాంప్లెట్ నాకు దొరికింది. అలాటి సినీమా పేపర్ అంతవరకూ నేను చూడలేదు. మల్టీ కలర్స్ లో  గ్లేజ్డ్ పేపర్ మీద వీక్లి పత్రికల సైజ్ లో ఉంది. ఆ పేపర్ నాకెంతో అమూల్యమైనదిగా తోచింది. దానిని జాగ్రత్తగా మా అమ్మగారిచేతికిచ్చాను. చంద్రహారం సినీమా పెళ్ళి చేసి చూడు తీసినవాళ్ళదని ఇందులో కూడా ఘంటసాల పాటలున్నాయని తెలిసింది. ఆ పోస్టర్ మీద ఎన్ టి రామారావుతో పాటు శ్రీరంజని, ఎస్వీరంగారావు, సావిత్రి, రేలంగీ, మరెవరో ఉన్నారని తెలిసింది. నేను  ఆ రంగుల సినీమా పోస్టర్ ను నా పరీక్షల అట్టమీద అంటించి చాలా జాగ్రత్తగా చూసుకునేవాడిని. నేను విజయనగరంలో ఉన్నంతకాలం చంద్రహారం పోస్టర్ నా దగ్గరే ఉండేది. తరువాత, ఆ చంద్రహారం సినీమా వ్యాన్ మరో రెండుసార్లు రాత్రిపూట పూర్తి లైట్ల వెలుగుతో మా వీధిలోనుంచి వెళ్ళింది. అప్పటికీ, ఇప్పటికీ కూడా నాకు చంద్రహారం అంటే చాలా ఇష్టం. అందులోని మాలిగా ఎస్వీరంగారావు పాడిన 'ఏనాడు మొదలిడితివో ఓ విధి' పాట నాకు చాలా ఇష్టం. ఆ సీన్ లో మాలిని చూస్తే జాలిగా ఉండేది. కారణం తెలియదు. ఆ సినీమాలో  మిగిలిన పాటలంటే కూడా మహా ఇష్టం. కారణం, ఆ పాటలు పాడింది మా తాతగారి శిష్యుడని తెలియడం వలన. ఆ సినీమా చూసి వచ్చిందగ్గర్నుంచి పిల్లలంతా సావిత్రిలాగా కళ్ళు పెట్టి చేతివేళ్ళూపూతూ ఒకళ్ళనొకళ్ళు భయపెట్టుకునేవాళ్ళు. అలా చేస్తే ఎన్ టి రామారావు లాగా కళ్ళు తిరిగి పడిపోవాలని. కానీ, ఏ ఒక్కడూ కళ్ళు తిరిగి పడిపోలేదు. కానీ, మాలో మేము కాట్లాడుకోవడానికి కారణమయింది 'నువ్వు నన్ను శాపం పెట్టాలని చూస్తున్నావా' అని.
                       
(ఏ నాడు మొదలెడితివో పాట - చంద్రహారం లో మాలి పాడే పాట)

విజయావారు చంద్రహారం కోసం చాలానే కష్టపడ్డారు. భారీగా ఖర్చుపెట్టారు. కానీ, ప్రజలకే నచ్చలేదు. కారణం వాళ్ళ పాతాళభైరవి సినీమా. అందులోని నటులే ఇందులో ఉన్నా అందులోని మాయలు, మంత్రాలు, హాంఫట్, జై పాతాళభైరవి, కాపాలికా, నరుడా ఏమి నీ కోరికా వంటి మాటలు, గాలిలో ఎగిరే మహల్స్ లేకపోవడమే. అందులోనూ ఎన్ టి రామారావు యుధ్ధం చేయకుండా ఎప్పుడూ నిద్రపోతూండడం  సాదా ప్రేక్షకులకు తీరని ఆశాభంగం. అందులోనైతేనేం, చంద్రహారంలో అయితేనేం, ఘంటసాలవారి సంగీత ప్రతిభే ఈనాటికీ ఆ సినీమాల గురించి తల్చుకునేట్లు చేస్తోంది.)

పిల్లల ఆటలు సీజనల్. ఒక సీజన్ లో మా వీధిలో పిల్లలంతా ముమ్మరంగా బొంగరాలాటలో మునిగి వుండేవారు. వాళ్ళతో సమానంగా ఆడాలని నా కోరిక. నా పోరుపడలేక ఒక బొంగరం కొనిచ్చారు. అయితే దానికి తాడేసి చుట్టడం చేతనైయ్యేదికాదు. తోటిపిల్లలు దానిని తీసుకొని దానికి ముల్లులేదు, ఆటకు పనికిరాదని చెప్పడంతో కోపం వచ్చి ఒక రోజంతా బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చున్నాను. తర్వాత, మా చిన్నాన్నగారు ముల్లున్న బొంగరం కొనిచ్చి అదెలా తిప్పాలో నేర్పారు. బొంగరం నేలమీద పడకుండా అరచేతిమీద త్రిప్పడం సర్కస్ చూస్తున్న ఆనందం. (మరోచరిత్ర లో కమలహాసన్, సరితల బొంగరం సీన్ మరో సర్కస్). ఇలా రెండు మూడు రోజులు ఆడేనో లేదో పిల్లల్లో ఒకడు ఆడిస్తానని చెప్పి దానిని రెండు ముక్కలు చేసి చేతికిచ్చాడు. కొత్తది కొనిస్తానన్న వాగ్దానంతో.

ఇలా మూడు బొంగరాలు, ఆరుచెక్కలుగా కాలక్షేపం జరుగుతున్న సమయంలో మా శారదక్క పెళ్ళి నిశ్చయమయింది. శారద మా దొడ్డమ్మగారి అమ్మాయి. నాకంటే ఏడేళ్ళు పెద్దది. బొబ్బిలిలో మా తాతగారింట్లో వుంటుంది. పెళ్ళి కుద్దిగాం అనే ఒక పల్లెటూళ్ళో. (ఆ ఊరు ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దులలో వంశధారా నదీ తీరాన ఉంది).

ఆ పెళ్ళి విశేషాలు....
వచ్చే వారమే....
                   ....సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.