visitors

Tuesday, July 5, 2011

నవ్య మార్గ ప్రవర్త - బాలమురళీకృష్ణ

పట్రాయని సంగీతరావుగారు 1976 సం.లో ఆంధ్ర ప్రభ దినపత్రిక ఆదివారం అనుబంధంలో కొన్ని వారాల పాటు  అనేకమంది  కర్ణాటక సంగీత విద్వాంసుల గురించి  అనేక వ్యాసాలను వెలువరించారు.


 ఆ పరంపరలో  శ్రీ మంగళంపల్లి బాలమురళికృష్ణగారి గురించి వెలువరించిన వ్యాసం ఇది.
శ్రీ మంగళం పల్లి బాలమురళీకృష్ణ

ప్రతి కళారంగంలోను సంప్రదాయ పరిరక్షకులు కొందరు, నవ్యమార్గ ప్రవర్తకులు కొందరు ఉంటారు. కర్ణాటక సంగీత ప్రపంచంలో శ్రీ బాలమురళీకృష్ణ రెండవ కోవకు చెందిన కళా తపస్వి.


ప్రతిభ, వ్యుత్పత్తి సమానస్థాయిలో శ్రీ బాలమురళీకృష్ణలో మేళవించిన విధం చాలా అరుదుగా కనబడతూంటుంది. నైసర్గికమైన తన ప్రతిభా విశేషంతో కర్ణాటక సంగీత ప్రపంచంలో ఒక అపురూపమైన సంచలనాన్ని, నూతనోత్తేజాన్ని, ఆత్మవిమర్శను శ్రీ బాలమురళీకృష్ణ కలిగించారు.


ఈనాడు దక్షిణభారతంలో గాయకలోకానికి ఆదర్శ సంగీతమూర్తిగా నిలిచి ఉన్నారు శ్రీ బాలమురళీకృష్ణ.


శాస్త్రము, సంప్రదాయము పరస్పర విరుధ్ధ విషయలేమీ కావు. ఆయా కళారూపాల అవగాహనకు శాస్త్రం ఆధారభూతంగా ఉంటే, ఆచరణలో తరతరాల అనుభవానికి ప్రాధాన్యం ఇస్తుంది సంప్రదాయం. అంతేకాదు, సంప్రదాయం తన విశిష్టతను కాపాడుకునేందుకు ఏవిధమైన మార్పులను, చేర్పులను అంగీకరించదు. ప్రతి చిన్న విషయానికి విధి నిషేధాలు అమలుపరుస్తుంది. సంప్రదాయం వెర్రితలలు వేసే పరిస్థితికి దిగజారినప్పుడు సంప్రదాయ పరిధిలో ఉన్నవారికి ఆది బయట ప్రపంచంలో నుంచి గాలి, వెలుతురు కూడా రాకుండా ప్రాకారాలు నిర్మిస్తుంది. ఏ విధమైన సమరసభావాన్ని గాని, భావౌన్నత్యాన్ని గాని అంగీకరించదు.


ఈ పరిస్థితి మన సంగీత సంప్రదాయనికి కూడా వర్తిస్తుంది. సాధన లోపం వల్లనేకాక, ధన సంపాదనాభిలాష వల్ల మాత్రమే కాక, కేవలం కళాపరమైన స్వేచ్ఛకోసం    కూడా అనేకమంది సంగీతజ్ఞులు మతం మార్చుకున్నట్టు ఏ విధమైన సంప్రదాయపు ఒత్తిడి లేని సంగీత కళారీతులను ఆశ్రయించడం జరుగుతూ ఉంది.


 లలిత సంగీతం అనండి, సుగమ సంగీతం అనండి సినిమా సంగీతం సరేసరి... ఈ ప్రక్రియలన్నీ సంప్రదాయ సంగీతం ఆంక్షల నుంచి తప్పించుకొన్న సంగీత కళారూపాలే.


అంత మాత్రాన సంపూర్ణంగా శాస్త్రీయ దృక్ఫథము, శృతిలయలు విస్మరింపబడతాయని అపోహ పడకూడదు.


శ్రీ బాలమురళీకృష్ణ శాస్త్ర మర్యాదను, సంప్రదాయములను సంపూర్ణంగా అవగాహన చేసుకొని వాటి ఎడల గౌరవ ప్రపత్తులుగల ప్రజ్ఞావంతుడు. ఆయన భావుకత, రసదృష్టి శాస్త్ర సంప్రదాయ రీతికి అనుగుణములయినవి. ఆయన శాస్త్ర మర్యాదలనెప్పుడూ అతిక్రమించకపోయినా, సంప్రదాయ ఆంక్షలను అధిగమించినవాడు కనుక విన్యాసంలోనూ, రాగసంచారంలోనూ అనేక సందర్భాలలో శిల్పదృష్ట్యా, రసదృష్ట్యా తన స్వేచ్ఛా      స్వాతంత్ర్యాలను ప్రకటించుకున్న ధీరుడు, శ్రీ బాలమురళీకృష్ణ..


కర్ణాటక సంగీతంలోని సత్యాన్ని మాత్రమే కాకుండా సౌందర్యాన్ని కూడా ప్రదర్శించగల  ప్రతిభాశాలి ఆయన.


హిందుస్థానీ  సంగీతంలో గల హాయి  కర్ణాటక సంగీతంలో లేదనే ఆవేశపూరిత అపప్రథ   శ్రీ బాలమురళీకృష్ణ సంగీతానికి వర్తించదు.


అతి చైతన్యవంతంగా సంగీత కచేరీ నిర్వహించే నైపుణ్యం శ్రీ బాలమురళీకృష్ణకు నైసర్గికమైనది. ఆ ప్రజ్ఞ అనితర సాధ్యమైనది కూడా.


రాగాలాపన చేసినప్పుడుగాని,   స్వరకల్పన చేసినప్పుడుగాని కీర్తన గానం చేసేనప్పుడుగాని అనుక్షణం శ్రోతల ఉత్కంఠతను, రసికతను ఆకట్టుకోడంలో ఆయనకు గల ప్రజ్ఞ అద్వితీయమైనది. శ్రీ బాలమురళీకృష్ణ కచేరీ వినడం గొప్ప అనుభవం.


శాస్త్రమర్యాద తెలిసిన రసికులు ఆయన గానంలో తన్మయులవడం సహజం. కాని ఏమాత్రం పారిభాషిక జ్ఞానం కూడా లేని సామాన్య శ్రోతలను కూడా ఆయన తన గానం చేతనే కాకుండా, హావభావాలచేత కూడా ఆకర్షించడం ఎంతో ముచ్చటగొలిపే విషయం.


మహాసభలలో, మహాపండితుల సమక్షంలో కత్తి మీద సాము చేసే పధ్ధతిలో అతి క్లిష్టమైన గతి భేద పల్లవి గానం చేసినప్పుడు, ఆయన ప్రౌఢమైన పోకడలను ఆశ్చర్యంతో గమనిస్తూ ఎప్పుడు, ఏ క్షణంలో గాయకుని వల్లగానీ, సహకార వాద్యబృందం వల్లగానీ స్ఖాలిత్యం ఏర్పడుతుందా అని పండిత శ్రోతలు ఆందోళన పడుతుంటే, గొప్ప ఆత్మవిశ్వాసంతో అనాయాసంగా భక్తిరంజని కార్యక్రమం అంత ప్రశాంతంగా గానం చేయడం శ్రీ బాలమురళీకృష్ణకే చెల్లుతుంది.


మూడు స్థాయలలోనూ గమకస్ఫూర్తితో అనాయాసంగా గానం చేయగల గాయకశ్రేష్ఠుడాయన.


సాహిత్యంలోని భావాన్ని పోషిస్తూ, రసదృష్టితో సంప్రదాయ రీతిని గానం చేయడంలో ఆయన నిరుపమానుడు.


శ్రీ బాలమురళీకృష్ణ ఉత్తమ గాయకుడు మాత్రమేకాదు, ఉత్తమ వాగ్గేయకారుడు కూడా.


సంగీతమూర్తి త్రయం తరువాత అంత విపులమైన సంగీత రచన చేసిన వాగ్గేయకారులు లేరనడం సాహసంకాదు.


ఆయన సంగీత రచనలో ఎంతో వైవిధ్యం ఉంది. శిల్పం ఉంది. సమర్ధమైన రాగచిత్రణ ఉంది. ఢెభ్భైరెండు మేళకర్తలకు ఆయన రచించిన కీర్తనలు ఆయన పాండిత్యానికి తార్కాణంగా నిలుస్తాయి.


శ్రీ బాలమురళీకృష్ణ సంగీత రచన సంప్రదాయంతో ప్రారంభం అయి ఒక విశిష్టమైన స్థాయిని, శైలినీ నిరూపించుకొనడం గమనించగలం.


ఆయన కృతులు, తిల్లనాలు నేడు బహుళ ప్రచారాన్ని పొందుతున్నాయి. ఆయన సాహిత్యం ప్రాచీన వాగ్గేయకారులను తలపిస్తుంది.


వయోలా:


శ్రీ బాలమురళీకృష్ణ ఎంతటి గాయకోత్తముడో, అంతటి వాద్యనిపుణుడు కూడా. ఆయన వయోలా వాద్య నైపుణ్యం ఆయన గాత్ర సంగీతంతో తుల తూగుతుంది. అయితే, ఆయన గొప్ప గాయకుడు కావడం చేత, గొప్ప వాద్యనిపుణుడుగా  ప్రత్యేక  ప్రశంస అవసరం అవుతుంది.


ఆయన గొప్ప మార్దంగికుడు కూడా అని తెలిసిన వారు చాలా తక్కువ. సంగీతజ్ఞుడు ఇన్ని ప్రజ్ఞలు కలిగి ఉండడం వరప్రసాదం అనుకోవడం సమంజసం.


ఈనాడు మన సంగీత విమర్శ ఇంకా ప్రాథమికావస్థలోనే ఉంది.


శ్రీ  బాలమురళీకృష్ణ గానం విషయంలోనూ, ఆయన రచనల గురించి సలక్షణమైన, సహృదయమైన, సక్రమమైన సమీక్ష జరుగవలసి ఉంది. ఆ విధమైన సమీక్ష వర్ధమాన గాయక లోకానికి  మార్గ దర్శకమవుతుందనడంలో  సందేహం లేదు.


ఈనాడు దేశంలో ఉత్తర, దక్షిణ సంగీత సంప్రాదయములను సమన్వయ పరచడమనే ఆదర్శం ఉంది. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి శ్రీ బాలమురళీకృష్ణ కంటే అర్హుడైన  పండితుణ్ణి, కళావేత్తను ఊహించలేం.


పద్మశ్రీ, డాక్టర్ బాల మురళీకృష్ణ  గాన సుధాకరుడుగా  ఎన్నటికీ  సంగీత ప్రపంచంలో ప్రకాశించడం నిశ్చయం.

2 comments:

కమనీయం said...

మంగళంపల్లివారి గురించికొత్తగా చెప్పేదేముంది?భారతరత్నావార్డు కి తగిన కళాకారుడు.ఈ మధ్య ఆయన 80యస్సులో సం;వయస్సులో అనర్గళంగా చేసిన గానకచేరి విన్నాను.కాని ఒక్క అసంతృప్తి కలిగించీంది.త్యాగరాయ కీర్తనల వంటి సంప్రదాయసంగీతం ఎక్కువ పాడి స్వీయ రచనలను చివరలో కొన్ని పాడి వుంటే బాగుండేది.-రమణారావు.

Lakshman .M. V. said...

బాల మురళి గారికి భారత రత్న ఇవ్వాలి. మన తెలుగు వారు ముఖ్యంగా కళా ప్రపంచం, రాజకీయ వర్గాలు ఇందుకు కృషి చేయాలి. లత మంగేష్కర్, భిమ్సేన్ జోషి, MS లకు భారత రత్న ఇచ్చి గౌరవించిన ప్రభుత్వం, బాల మురళి గారి విషయం లో ఈ ఉపేక్ష ఏందుకో? తెలుగు వాడి గా పుట్టడం ఆయన చేసిన పాపమా? లేక అంతర్గత కుమ్ములాటలతో కొట్టు మిట్టడుతున్న మన తెగులు జాతి వీరిని పట్టించుకోక చేస్తున్న నేరమా?