visitors

Sunday, October 17, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై మూడవ భాగం

17.10.2021 -  ఆదివారం భాగం - 53*:
అధ్యాయం 2 భాగం 52 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు, వ్యక్తులతో పరిచయాలు, తిరిగే పరిసరాలు యాదృఛ్ఛికంగా జరిగేవే అయినా వాటితో అనుబంధం, మమకారం మనలను అంటిపెట్టుకునే వుంటాయి.

మేము నెం.35, ఉస్మాన్ రోడ్ లో 28 సంవత్సరాలున్నాము. అలాగే ఆ ఇల్లు వదలిపెట్టి కూడా 38 సంవత్సరాలయింది. ఆ ఇల్లు మన్నందర్నీ వదిలి 20 ఏళ్ళైంది. అయినా, ఆ యింటితో, ఉస్మాన్ రోడ్ తో, టి.నగర్ ప్రాంతంతో వున్న అనుబంధం, మమకారం నన్ను అంటిపెట్టుకునేవున్నాయి. ఆనాటి జ్ఞాపకాలు సదా మదిలో మెదులుతూనే వుంటాయి. 

అలాగే  మా లయొజన్ ఆఫీస్ ఉన్న అడయార్ ప్రాంతం. మైలాపూర్ నుండి ఆఫీస్ షిప్ట్ చేసేనాటికి ఆ ప్రాంతం ఎక్కడ వుందో,ఎలా వుంటుందో నాకు తెలియదు. టి.నగర్ నుండి  47, 47A బస్ లలో వెళ్ళడం మొదలు పెట్టినా సరిగ్గా మా ఆఫీస్ వీధికి దగ్గరలో వున్న స్టాపింగ్ లో దిగడం గాంధీనగర్ ఫోర్త్ క్రాస్ స్ట్రీట్ లో వుండే ఆఫీస్ కు వెళ్ళడం మళ్ళా మెయిన్ రోడ్ కు వచ్చి బస్ ఎక్కి పానగల్ పార్క్ దగ్గర దిగడం, ఇదే దినచర్యగా వుండేది. అడయార్ లోని మిగిలిన ప్రాంతాలగురించి ఏ అవగాహన వుండేదికాదు. కానీ, ఎప్పుడైతే మా లయొజన్ ఆఫీసర్ వసంతకుమార్ బావా గారు నన్ను తానుండే ఇంటికి ఆఫీస్ పనిమీద రమ్మనడం మొదలెట్టారో అప్పటినుండి అడయార్ ప్రాంతం గురించి తెలియడం ప్రారంభించింది. అప్పట్లో ఆయన ఉండే ఫ్లాట్స్  లోనే  ఇప్పుడు అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ  'మలర్' హాస్పిటల్ వుంది. ఆ ప్రాంతంలోనే శ్రీ అనంతపద్మనాభ స్వామి వారి ఆలయం వుంది. స్వామివారు శయనభంగిమలో చాలా పెద్ద విగ్రహం. అప్పటికి ఆ ఆలయం కట్టి ఆరేడు సంవత్సరాలు మాత్రమే. త్రివేండ్రమ్ ఆలయంలోని మూలవిరాట్ లానే వుంటుంది. ఆ ఆలయనిర్మాణానికి స్థలాన్ని దానం చేసింది కూడా త్రివాన్కూర్  ఆఖరి మహారాజే. ఎప్పుడైతే బస్ లో  మానేసి సైకిల్ మీద వెళ్ళడం ప్రారంభించానో అప్పుడే అడయార్ ఎంత పెద్ద ప్రాంతమో తెలియడం ఆరంభమయింది. 1970ల నాటికి నేను ఆ ఆఫీస్ వదిలేశాను.  కానీ  ఓ దశాబ్దంన్నర తర్వాత మళ్ళీ అదే గాంధీనగర్ కు మా టివికె శాస్త్రిగారితో వెళ్ళవలసి వచ్చేది.  ఆదినుండి మా సాంస్కృతిక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించే శ్రీమతి జయలక్ష్మి తన తల్లిదండ్రులతో అదే గాంధీనగర్ లో మా ఆఫీస్ వుండిన వీధిలోనే వుండేది. 

ఇప్పటికీ ఆ అడయార్ తో నా అనుబంధం ముగియలేదు. ఇప్పుడు మేముంటున్న OMR (IT Express way) కు కూడా అడయార్ మీదుగానే రావాలి. ఏ పెద్ద షాపింగ్ చేయాలన్నా అడయార్ గాంధీనగర్ మెయిన్ రోడ్ కు వెడుతూనేవుంటాము.
అలా అడయార్ కూడా మా జీవితంలో ఒక భాగమైపోయింది.

అసలు ముఖ్యమైన విషయం ఒకటి ఇక్కడ చెప్పవలసివుంది. 

నేను ఈ అడయార్ ఆఫీస్ కు రావడానికి ఓ రెండేళ్ళముందే మా నాన్నగారి తో కలసి ఒకసారి ఈ అడయార్ గాంధీనగర్ కు వచ్చాను. అప్పుడు అడయార్ ప్రాంతం చాలా ప్రశాంతంగా  వుండేది. ఇప్పుడు వున్నంత జనసమర్దత కానీ, షాపింగ్ మాల్స్ కానీ, ఫ్లై ఓవర్స్ కానీ ఏవీ లేవు. రోడ్లకు రెండుప్రక్కలా పెద్ద పెద్ద చెట్లతో  చాలా చల్లగా వుండేది. పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియాగా వుండేది. అప్పట్లో శ్రీ వి.జి.కె.చారి (వింజమూరి గోపాలకృష్ణమాచారి)గారు ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు శ్రీ వింజమూరి వరదరాజయ్యంగార్ గారి సోదరుడి కుమారుడు,  అడయార్ గాంధీనగర్ లో  వుండేవారు. వరదరాజయ్యంగార్ గారి కుమార్తె మా పెద్దచెల్లెలు డాక్టర్ కె.వి.రమణమ్మకి కాలేజీలో ఒక సంవత్సరం సీనియర్. వి.జి.కె.చారిగారు వృత్తిరీత్యా ఛార్టర్డ్ ఎక్కౌంటెన్సీ కన్సల్టెంట్. మా నాన్నగారికి అంతవరకూ లేదు కానీ ఆ  ఒక్క ఏడాది మాత్రం  ఆదాయం పన్ను కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ లెక్కల వ్యవహారాలు సరిచూడడానికి మా నాన్నగారు చారీగారి వద్దకు వచ్చారు. ఆయన తెలుగువారే. వృత్తిరీత్యా ఆడిటర్  అయినా ప్రవృత్తి భక్తిగీత రచనలు. సంగీతం పట్ల మంచి ఆసక్తి వుండేది. 


వి.జి.కె. చారిగారు


వింజమూరి వరదరాజ అయ్యంగార్ గారు

ఆయన మా నాన్నగారి ఆదాయ వ్యయాలు సరిచూసి చివరకు ఒక నూరు రూపాయలు టాక్స్ కట్టాలని తేల్చి 'are you happy?' అని నన్ను అడిగారు. ఈ సందర్భంగా నేను మాత్రం ఆయన వద్దకు రెండుసార్లు వెళ్ళాను. ఈ వ్యవహారం చూసేందుకు మా నాన్నగారు ఆయనకు ఫిజు ఎంత ఇచ్చారో తెలియదు. ఇవన్నీ మా నాన్నగారున్న స్థితిలో మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందమయింది.
 
ఈ టాక్స్ ల వ్యవహారం అయిన తర్వాతే అని గుర్తు వి.జి.కె.చారిగారు వ్రాసిన రెండు పాటలను శ్రీ ఘంటసాలవారు ప్రైవేట్ రికార్డ్ లుగా పాడారు. అవే తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి మీద పాడిన 'శేషాద్రి శిఖరాన', 'తిరువెంకటాధిశ జగదీశా' పాటలు. 

ఈ రెండు పాటలు బహుళ జనాదరణ పొందాయి. ఈ పాటలు ఈనాటికీ తిరుమల శిఖరాలలో నిత్యమూ ప్రతిధ్వనిస్తూ యాత్రికులలో భక్తిభావాన్ని పెంపొందిస్తూనేవున్నాయి.

🌿🌺🌿


ఒకరోజు శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి గారు నన్ను వారింటికి రమ్మని కబురుచేశారు. అప్పటికి USEFI  అమెరికన్ కాన్స్యులేట్ కి వెళ్ళడం వల్లనో లేక డి.ఎన్ రావుగారు USEFI వదలి ఇండో-కెనెడియన్ ఫౌండేషన్ లో రీజినల్ డైరెక్టర్ గా చేరడం వల్లనో తెలియదు, మొత్తానికి వారిల్లు విజయరాఘవాచారి రోడ్  'పూర్ణిమ' నుండి బజుల్లా రోడ్ - తిరుమలపిళ్ళై రోడ్ జంక్షన్ లోని ఇంటికి మారింది. ఆ కొత్త ఇంటికి వెళ్ళగానే విశాలాక్షి గారు తాను వ్రాసిన ఒక పుస్తకాన్ని నా చేతిలో పెట్టారు. ఆ నవలను ఎవరో నిర్మాత తెలుగులో సినీమాగా తీయాలని సంకల్పించారని, ఆ నవలకు ఒక సినాప్సిస్ వ్రాయాలని , ఆ పనిని నేను చేయాలని అడిగారు. పుస్తకాలు సరిగా చదవడమే రాదు, వాటికి సినాప్సిస్ నేను రాయడమా? అలవాటు లేని ఔపాసన అని అనుకున్నాను. కానీ, ఆవిడ ధైర్యం చెప్పి ఎలా రాయాలో చెప్పి నాలో ఒక కొత్త ఉత్సాహాన్ని పురిగొల్పారు. ఆవిడ చెప్పిన పధ్ధతులలోనే ఆ నవలకు కావలసిన సినాప్సిస్ తెలుగులో వ్రాసి ఆవిడ చెప్పిన గడువుకు ముందే వ్రాసి ఇచ్చేశాను. ఆవిడ అది చదివి చాలా సంతోషించారు. నేను వ్రాసినదానికి ఏ మార్పులు చేయకుండా యథాతథంగా ఆ నిర్మాతకు అందజేసినట్లు తర్వాత చెప్పారు. ఆ నిర్మాత దర్శకులకు కూడా ఆ కథాసంగ్రహం నచ్చిందని దానినే సినిమా గా తీయడానికి విశాలాక్షి గారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ నవలే ' వారధి'. ఆ సినీమాయే 'రెండు కుటుంబాల కథ'.  ఈ నవలకు సినాప్సిస్ వ్రాసినందుకు నాకు కొంత పారితోషికం కూడా లభించింది. ఈ సినీమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తర్వాత చూద్దాము. 

🌿🌺🌿


ఘంటసాలవారు చలనచిత్ర సీమకు వచ్చి 25 సంవత్సరాలు అవుతున్నది. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా, స్వాతంత్య్ర పోరాటంలో తన పాటలతో ప్రజలను ఉత్తేజపర్చి తనవంతు పాత్రను పోషించిన ఒక ఉత్తమ పౌరుడిగా, ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలనే ఒడ్డిన పొట్టి శ్రీరాములుగారి నిరాహారదీక్షలో తనవంతు చేయూతనిచ్చి ప్రవాసాంధ్రులలో చైతన్యం తెచ్చిన ప్రజాగాయకుడిగా ఘంటసాలవారి కృషి, చేసిన సేవ నిరుపమానం.

అటువంటి ఘంటసాల చలనచిత్ర రజతోత్సవాన్ని ఘనంగా జరపాలని దేశవ్యాప్తంగా వున్న ఘంటసాల అభిమానులంతా కోరుకున్నారు. అందుకు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్దలంతా కూడా సహకరించడానికి తమ సంసిధ్ధతను తెలియజేశారు. దక్షిణ చలనచిత్ర సీమలలోని ప్రముఖులంతా కూడా  ఘంటసాల చలనచిత్ర రజతోత్సవ సంగీత సంబరాలలో పాల్గొనడానికి తమ పరిపూర్ణ సహకారాన్ని ప్రకటించారు.

ఘంటసాలవారు తన 25 సంవత్సరాల సినీ సంగీత యానంలో తన పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డ నిర్మాత, దర్శకులు, సంగీతదర్శకులు, నేపథ్యగాయనీగాయకులు, వాద్యకళాకారులు, అంతకు మించి తాను పాడిన పాటలను, స్వరపర్చిన గీతాలను మెచ్చుకుంటూ తమ ప్రశంసలతో, అభిమానంతో ప్రోత్సహిస్తూ వస్తున్న అశేష ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలుపుకునే విధంగా అందరి సమక్షంలో ఈ బ్రహ్మాండమైన ఉత్సవం జరగాలని  ఘంటసాలగారు కోరుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమ అంతా ఒకే కుటుంబమని, వారందరి సహాయ సహకారాలతోనే తాను వివిధ భాషలలో ఎన్నో పాటలు పాడే అవకాశం లభించిందని, అందువలన ఈ రజతోత్సవం కళాకారులందరి ఉత్సవంగా అందరూ పదికాలాలపాటు తలచుకునేలా భాసిల్లాలని ఆశించారు. 

1944 లో మద్రాసు సినీమా రంగంలో అడుగుపెట్టిన ఘంటసాల సినీ సంగీత ప్రస్థానం 1969 నాటికి 25 సంవత్సరాలు  పూర్తి చేసుకున్నది. 

"శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు చలనచిత్ర జీవిత రజతోత్సవ సంఘం " (Sri Ghantasala Venkateswara Rao Movie Career Silver Jubilee Celebrations Committee) పేరిట ఒక కార్యనిర్వాహక సంఘాన్ని ఏర్పర్చారు.

ఘంటసాల ప్రజల మనిషి గా అందరి ఆదరాభిమానాలు పొందిన వ్యక్తి కావడంతో ఆనాటి రాజకీయ ప్రముఖులు ఈ ఉత్సవ నిర్వహణలో ఉత్సాహం కనపర్చారు.

శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు చలనచిత్ర జీవిత రజతోత్సవ సంఘం -

అధ్యక్షులు :  గౌ. శ్రీ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డిగారు (ఆనాటి ఆంధ్రప్రదేశ్  రెవెన్యూ శాఖామాత్యులు);

ప్రధాన కార్యదర్శి : గౌ.శ్రీ అక్కిరాజు వాసుదేవ రావు గారు (ఆనాటి ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖామాత్యులు);

ఉపాధ్యక్షులు : శ్రీ పి. రామచంద్రా రెడ్ఠి, B.A.B.L;

కోశాధికారి : శ్రీ రాజా ఎ. రామచంద్రారెడ్డి (ఆనాటి ఆంధ్రప్రదేశ్ క్రీడామండలి అధ్యక్షులు);

కార్యదర్శి : శ్రీ ఆర్ వి రమణమూర్తి

🌷రిసెప్షన్ కమిటీ మెంబర్స్ గా - సర్వశ్రీ - గౌరవనీయులు -
జె.వి. నరసింగరావు (డెప్యూటీ చీఫ్ మినిస్టర్),
కె. విజయభాస్కర రెడ్డి (మినిస్టర్ ఫర్ ఫైనాన్స్),
ఆర్. రామలింగరాజు (మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్),
పి.వి. నరసింహారావు (మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్),
వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు (మినిస్టర్ ఫర్ పవర్),
ఎ. భగవంతరావు (మినిస్టర్ ఫర్ హ్యాండ్ లూమ్స్), 
ఎమ.ఎన్. లక్ష్మీనరసయ్య (మినిస్టర్ ఫర్ ట్రాన్స్ పోర్ట్),
రోడా మిస్త్రి (మినిస్టర్ ఫర్ టూరిజం),
వి.పురుషోత్తమ రెడ్డి (మినిస్టర్ ఫర్ మైనర్ ఇరిగేషన్);

🌺రిసెప్షన్ కమిటీలో చలనచిత్ర సీమ ప్రముఖులు:

సర్వశ్రీ - బి.ఎన్.రెడ్డి, ఎ వి మెయ్యప్పన్, డి.మధుసూదనరావు,
ఎ.ఎల్.శ్రీనివాసన్, సుందర్లాల్ నహతా, జి. కామరాజు, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు, కె.జగ్గయ్య, వి.నాగయ్య, శివాజీ గణేశన్, ఎమ్.జి.రామచంద్రన్, పి.పుల్లయ్య, టి.ఎల్.కాంతారావు, రేలంగి, సావిత్రి గణేష్, షావుకారు జానకి, అంజలీదేవి, కె.శ్రీనివాసరావు, ఎన్,త్రివిక్రమరావు, డి.రామానాయుడు; డా.సి.నారాయణరెడ్డి, రావూరు వెంకట సత్యనారాయణ, వి.వి.మాణిక్యాలరావు, ఎ.కెచెలువరాజు, జి.హనుమంతరావు, పోతుకూచి సాంబశివరావు, జి.ఎస్.వరదాచారి, పి.ఎస్.ఆర్.ఆంజనేయశాస్త్రి, బాసాని సుదర్శనరెడ్డి, కె. సుబ్రహ్మణ్యం, ఎ.ఆర్ కృష్ణ, బి.కృష్ణంరాజు. (సేకరణ : ఘంటసాల రజతోత్సవ ప్రత్యేక సంచిక)

ఈ రజతోత్సవ ప్రత్యేక కమిటీలు ఏర్పడకముందు, ఏర్పడిన తర్వాత కూడా ఆర్.వి.రమణమూర్తి తరచూ మద్రాస్ వచ్చి ఘంటసాలవారి తో సంప్రదించేవారు. కమిటీ అధ్యక్షుడు గౌ. మంత్రివర్యులు శ్రీయుతులు పి. తిమ్మారెడ్డిగారు, అక్కిరాజు వాసుదేవరావు గారు కూడా  ఓ రెండుసార్లు మద్రాస్ వచ్చి  ఘంటసాల మాస్టారింట్లో చాలా సేపు ఈ ఉత్సవ విషయమై చర్చించేవారు. వీరితోపాటు మరికొందరు రాజకీయనాయకులు కూడా వచ్చేవారు. వీరందరి చర్చలతో మాకు పొద్దే తెలిసేదికాదు. స్థానికంగా వున్న దక్షిణాది సినీ ప్రముఖులందరిని కలిసి ఈ బ్రహ్మండమైన రజతోత్సవంలో పాల్గొనేలా సమ్మతింపజేశారు. వాసుదేవరావుగారు వచ్చినప్పుడల్లా ఆయనతో నటుడు కాంతారావు కూడా వచ్చేవారు. వారిద్దరూ కోదాడకు చెందినవారు కావడాన ఆ స్నేహం కావచ్చు. వారిద్దరూ బంధువులని కూడా విన్నాను. ఎంతవరకూ నిజమో నాకు తెలియదు. రమణమూర్తిగారికి ఘంటసాల మాస్టారంటే చాలా గౌరవం, అభిమానం వుండేవి. 

ఘంటసాల చలనచిత్ర జీవిత రజతోత్సవాన్ని ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యపట్టణం హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో లక్షలాది చలనచిత్రాభిమానుల సమక్షంలో జరపడానికి పెద్దలంతా కలసి నిర్ణయించారు.

రజతోత్సవ సంఘం కార్యదర్శిగా ఆర్.వి.రమణమూర్తిగారు చేసిన కృషి, పడిన శ్రమ అసమాన్యం. ఈ ఉత్సవం చేయాలని సంకల్పించినది మొదలు అది  'నభూతో నభవిష్యతి' అనే రీతిలో ముగిసేవరకు ఒక్క క్షణం కూడా విశ్రమించలేదు. కాలికి చక్రాలు కట్టుకున్నట్లుగా హైదరాబాద్ మద్రాసుల మధ్య ఎన్నిసార్లు తిరిగారో లెఖ్ఖలేదు. రమణమూర్తి చాలా ఉత్సహవంతుడు. హైదరాబాద్ లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంలో ఆరితేరిన వారు. రాజకీయ రంగంలో, సినీమా రంగంలో గల ప్రముఖులందరితో మంచి పరిచయాలు గల వ్యక్తి. అందరిళ్ళలో  వాళ్ళ వంటింటి వరకూ వెళ్ళి  కబుర్లు చెప్పేంత చొరవగల మనిషి అని ఘంటసాల మాస్టారు చెప్పేవారు. అతనితో రెండుసార్లు తిరిగాక ఆ మాట నిజమే అనిపించింది. ఒకసారి మద్రాస్ వచ్చి ఈ రజతోత్సవం తిరుపతి వేంకటేశ్వరుడి ఆశిస్సులు తోనే జరగాలి. అందువల్ల  వెంటనే తిరుపతి వెళ్ళి రాత్రికి వచ్చేస్తానని, నరసింగడిని, నన్ను కూడా తనతో బయల్దేరదీసాడు. అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను, నేను కూడా ఎలాగైనా ఏదో రకంగా  ఘంటసాలవారి రజతోత్సవం లో పాలుపంచుకోవాలని. ఆరోజు మధ్యాహ్నం సమయాన మేము ముగ్గురం కారులో తిరుపతి బయల్దేరాము. ముందుగా దారిలో వచ్చే తిరుత్తణి కొండమీద వున్న సుబ్రమణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నాము. మేము వెళ్ళిన సమయానికి ఆలయంలో పెద్ద రద్దీలేదు. దర్శనం బాగా జరిగింది. రమణమూర్తి అక్కడ ఏవో అర్చనలు జరిపించారు. నేను తిరుత్తణి వెళ్ళడం అదే మొదలు, ఆఖరు కూడా. ఆ తర్వాత ఎన్నోసార్లు వెళ్ళాలని ప్రయత్నించినా కుదరనేలేదు. ఈ సదవకాశం రమణమూర్తి పుణ్యమే అని చెప్పాలి. అక్కడ నుండి బయల్దేరి సాయంత్రం చీకటి పడే సమయానికి తిరుమలలో వేంకటేశ్వర సన్నిధికి చేరుకున్నాము. అక్కడ ఎంతసేపు క్యూలో నిలబడాలో, ఎంత సమయం పడుతుందోనని నేను భయపడ్డాను. కానీ రమణమూర్తి డైరక్ట్ గా ప్రధాన ద్వారం లోపలనుండే మమ్మల్ని గర్భగుడిలోకి తీసుకువెళ్ళిపోయారు. ఎవరూ అడ్డగించలేదు. లోపల దేవుడికి అతి చేరువలో నిలబడి దర్శనం చేసుకున్నాము. అంత దగ్గరలో, అంత ఎక్కువసేపు వెంకన్న సన్నిధిలో నేను ఏనాడు గడపలేదు. (కానీ అలాటి సదవకాశం మరల కొన్ని దశాబ్దాల తర్వాత వరసగా ఐదురోజులపాటు లభించింది. ఆ వివరాలు వేరే అధ్యాయంలో).

రమణమూర్తి కోరిక నెరవేరింది. వచ్చిన పని సక్రమంగా ముగించుకొని అర్ధరాత్రి కి మద్రాసు చేరుకున్నాము. ఆ మర్నాడు ఉదయం ఫ్లైట్ లో రమణమూర్తి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు.

ఈ తిరుపతి ప్రయాణంలో కలిగిన పరిచయమే. ఈ ఉత్సవం జరిగిన మధ్యకాలంలో చాలా తరచుగానే కలిసి తిరిగేవాళ్ళం. మాట్లాడుకునేవాళ్ళం. హైదరాబాద్ లో జరిగిన రజతోత్సవం తర్వాత నేను రమణమూర్తి గారిని మళ్ళీ  ఘంటసాలవారి విదేశ యాత్ర సమయంలో చూసాను. ఆ తర్వాత మరల ఎక్కడా కలవనూ లేదు, చూసిన గుర్తూ లేదు. పత్రికలలో చూడడం తప్ప. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కల్చురల్ కౌన్సిల్ కు చైర్మన్ గా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చాలా పేరుపొందారు. సినీమా నిర్మాతగా కూడా 'నీరాజనం', 'అభినందన' వంటి చిత్రాలు నిర్మించి ఎన్నో నందీ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు  కూడా పొందారు. ఈ చిత్రాలలో నీరాజనం చిత్రానికి O.P.నయ్యార్, అభినందన చిత్రానికి ఇళయరాజా వంటి  జాతీయస్థాయి సుప్రసిధ్ధ సంగీత దర్శకులు పనిచేయడం ఒక విశేషం.

ఘంటసాల సినీ జీవిత రజతోత్సవానికి ఇంకా చాలా సమయం వుంది. ఇందుకు సంబంధించిన మరెన్నో విశేషాలు వచ్చేవారాలలో ....అంతవరకూ.....
                      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, October 10, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై రెండవ భాగం

10.10.2021 - ఆదివారం భాగం - 52*:
అధ్యాయం 2  భాగం 51 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఘంటసాలవారు గాయకుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నకాలంలో తెలుగు సినీమాలలో కథకు, కథకుడికి కూడా ప్రాధాన్యత వుండేది. ఒక సినీమా విజయవంతం కావాలంటే కథ, మాటలు, పాటలు, నేపథ్యసంగీతం, దర్శకత్వ, సాంకేతిక వర్గ నైపుణ్యం, అన్నీ సమపాళ్ళలో వుండాలి. అప్పుడే ఆ సినీమా ప్రజారంజకమవుతుంది. ఆ చిత్రంలోని పాటలు ప్రజల హృదయాలలో నిలిచిపోతాయి.

మల్లీశ్వరి, పాతాళభైరవి కాలంలో, సినీమా పరిభాషలో చెప్పాలంటే, కథ మీద కూర్చునే (చర్చలు జరపడం) సమయమే ఎక్కువగా వుండేది. ఆ కథకు పకడ్బందీగా కథా సంవిధానం తయారు చేసుకొని, మాటలు వ్రాయించి, ఆ తర్వాతే సందర్భోచితంగా పాటల దృశ్యాలను నిర్ణయించి సంగీతదర్శకుడిచేత వరసలు కట్టించి, ఆ పాటలు పాడగల సమర్థులైన గాయకులచేత పాడించి రికార్డింగ్ చేయించేవారు. కథలో సన్నివేశబలం గల చోట్ల వచ్చిన పాటలు తప్పక బహుళ జనాదరణ పొందేవి. 

1960లు దాటేవరకు మన తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు  చాలావరకు తమ కథల కోసం పరాయి భాషల మీదే ఆధారపడేవారు. బెంగాలి శరత్ బాబు, ఆశాపూర్ణాదేవి, షేక్స్పియర్, అలెగ్జాండర్ డ్యూమాస్, అరేబియన్ నైట్స్  కథల ఆధారంగానే మన తెలుగు సినీమాలు వుండేవి. గుణసుందరి కథ, మనదేశం, పాతాళభైరవి, మిస్సమ్మ, బాటసారి, మాంగల్యబలం, ఆరాధన, వెలుగునీడలు వంటి ఎన్నో కథలు పరాయి భాషలనుండి దిగుమతి చేసుకొని మన తెలుగు వాతావరణానికి తగినట్లుగా ఆ కథలను మలచుకొని తెరకెక్కించారు. తెరానువాదం సక్రమంగా జరిగిన సినీమాలు కొన్ని విజయంపొందాయి. మరికొన్ని ప్రేక్షకుల ఆమోదం పొందలేదు. ఎందుకంటే మరేవో లోపాలు. ప్రేక్షకులు ఏ సినిమాలు నచ్చుతారు ఏ సినిమాలు నచ్చరు అన్నదానికి సినిమా విశ్లేషకులు, విమర్శకుల 'సహేతుక' వివరణలన్నీ కాయితాలకి పరిమితమైన థియొరీలే. పాండిబజార్ లో సినిమా సారాన్నంతా గ్రహించి రోడ్డుమీదే అందరికీ పంచే తత్త్వజ్ఞానులూ ఉండేవారు. 

తెలుగు సినీమా స్వర్ణయుగంలో తెలుగు కథకు పట్టాభిషేకం చేసి శిఖరాగ్రాన కూర్చోబెట్టిన మహాకథకులెందరో వుండేవారు. సినీమారంగంతో సంబంధం లేని కథా రచయిత లెందరో తమ అద్భుత రచనా చాతుర్యంతో తెలుగు రచనా ప్రాభవాన్ని చాటిచెప్పారు. ఆరోజుల్లో ఇప్పటికన్నా ప్రజలలో పఠనాసక్తి ఎక్కువగానే వుండేది. నిత్యజీవితంలోని సమస్యలనే ప్రధానాంశాలుగా తీసుకొని వాటిని విభిన్నకోణాలలో విశ్లేషించి రచయితలు తమ రచనలు కొనసాగించారు. ఉత్తమ సాహిత్యానికి విలువనిచ్చే తెలుగు దిన, వార, పక్ష, మాస పత్రికలెన్నో మంచి మంచి కథలను, నవలలను తమ తమ పత్రికలలో ప్రచురించేవారు.

నాకు కొంత ఊహ తెలిసేనాటికి నేను చూసిన మొదటి వార పత్రిక 'ఆంధ్రపత్రిక', అలాగే 'ఆంధ్రపత్రిక' దిన పత్రిక. 'దేశోధ్ధారక' నాగేశ్వరరావు పంతులుగారు స్థాపించినది. వారి స్థాపనంలో వచ్చిన మరో అద్భుత మాస పత్రిక 'భారతి'. భారతి విద్యావేత్తల, సాహితీ మేధావుల పత్రిక. కవిత్వంలో ఆరితేరిన మహామహుల రచనలు, విమ‌ర్శలు, విశ్లేషణలు, చర్చలు, వాదోపవాదాలుతో నిండివుండేది. విశ్వనాథ సత్యనారాయణ, తిరుపతి వెంకటకవులు, శ్రీపాదకృష్ణమూర్తి, గురజాడ, శ్రీశ్రీ, చలం వంటి గొప్ప కవుల రచనలు ఆ భారతిలో వచ్చేవి. 'భారతి'లో ఎవరి కథైనా, వ్యాసమైనా ప్రచురించబడితే ఆ రచయిత ఒక విశిష్ట రచయితగా సాహితీలోకంలో గుర్తింపబడి గౌరవించబడేవాడు. ఆ స్థాయిని అందుకోవడం కోసం ఆనాటి రచయితలంతా తపించేవారు. అలాటి 'భారతి' లో మా నాన్నగారి స్నేహితులు - పంతుల శ్రీరామశాస్త్రి, భట్టిప్రోలు కృష్ణమూర్తి, మంథా రమణరావుగార్ల కథలు, చందోభధ్ధ కవితలు ప్రచురించబడేవి. భారతిలో వచ్చిన మంథా రమణరావుగారి 'మంటలు' నేనూ చదివాను. ఆయన వ్రాసిన మరో నవల 'చలిచీమలు' ను సినీమాగా కూడా  తీసారు. మంథా రమణరావు తాను వ్రాసిన ఒక పుస్తకాన్ని మా నాన్నగారికి అంకితం కూడా చేశారు. మంథా రమణరావు వృత్తిరీత్యా రూర్కెలా స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నతోద్యోగి. ప్రవృత్తి రచనా వ్యాసాంగం. భట్టిప్రోలు  కృష్ణమూర్తిగారు ఒరిస్సా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో ఉన్నతాధికారి. జయపూర్, జునాఘడ్, కెయింఝోర్ లోని ప్రవాసాంధ్ర కవి, రచయిత. పంతుల శ్రీరామశాస్త్రి రాయఘడా హైస్కూలులో మాస్టర్. చందోబధ్ధంగా కవిత్వం రాసేవారు. ఈ ఇద్దరూ, మా నాన్నగారు కలసి వ్రాసిన గొలుసుకట్టు కథలు 1950లలో ఆంధ్రపత్రికలో ప్రచురించబడ్డాయి. అయితే కథలు చదివేంత వయసు ఆనాడు నాకు లేదు. 

మేము విజయనగరంలో వుండేనాటికి ఆనాటి ప్రముఖ పత్రికలుగా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, కృష్ణాపత్రిక, విశాలాంధ్ర, ప్రజామాత, జాగృతి, గృహలక్ష్మి  కనిపించేవి. ఇందులో కొన్ని దినపత్రికలు, కొన్ని వార, పక్ష మాస పత్రికలు. వీటన్నిటిలో  చాలా మంచి కథలు, నవలలు, వ్యాసాలు వచ్చేవి. ఈ పత్రికలన్నింటిలో కొన్ని పేజీలు సినీమా వార్తలకోసం ఫోటోల కోసం కేటాయించేవారు.అప్పుడు ఇప్పుడూ కూడా వారపత్రికల ముఖచిత్రాలుగా సినీమా తారల బొమ్మలే వేయడం ఆచారంగా వస్తోంది.

మేము విజయనగరం లో వుండేప్పుడు ఆంధ్రపత్రికలో వచ్చిన ఒక సీరియల్ పేరు మాత్రం బాగా గుర్తుండిపోయింది. ఆ సీరియల్ పేరు 'మంచి-చెడు' రచయిత శారద. ఆ పేరు వల్లే నాకు ఆ సీరియల్ పేరు గుర్తుండిపోయింది. కారణం 'శారద'. శారద మా దొడ్డమ్మగారి ఏకైక కుమార్తె. ఆమె నన్ను ఎప్పుడూ తమ్ముడూ అని  ప్రేమతో లాలించి పిల్చినా నేను మాత్రం శారద అనే పిలిచేవాడిని 'అక్క' అని ఎప్పుడూ పిలవలేదు. నాకు ఎవరిని వరసలు పెట్టి పిలిచే అలవాటు అలవడలేదు.

శారద పేరు ఇంతగా గుర్తుండిపోవడానికి మరో కారణం.  1930లలో మా తాతగారు సాలూరులో నెలకొల్పిన సంగీత పాఠశాల పేరు 'శారదా గాన పాఠశాల'.

ఇంతకూ ఈ 'మంచి-చెడు'  శారద ఎవరు? విజయనగరంలో ఉన్నంతకాలం పత్రికలలో కనపడే శారద మహిళా రచయితనే అనుకునేవాడిని. శారద అనేది మగ రచయిత కలం పేరని, ఏదో ఊళ్ళో ఒక హోటల్ లో సర్వర్ అని మెడ్రాస్ వచ్చాకే తెలిసింది. ఈమధ్య కాలం వరకూ  శారద పూర్తి చరిత్ర నాకు ఏమాత్రం తెలియదు. తెలుగు కథకు వందేళ్ళు పూర్తయిన సందర్భంగా  వెలువడిన ఒక వీడియోలో 'పిరికి ప్రియుడు' అనే కథను పరిచయం చేసారు శ్రీగొల్లపూడి మారుతీరావుగారు. ఆ కథను వ్రాసింది శారద. శారద గురించి శ్రీ మారుతీరావుగారు చెప్పింది విన్నాక మనసు వికలమయింది.  

శారద తెలుగువాడు కాదు. ఒక తమిళుడు. పేరు నటరాజన్. అతి పేద కుటుంబంలో పుట్టాడు. పుట్టినగెడ్డమీద బ్రతికే ఆస్కారం లేక పొట్ట చేతబట్టుకొని తండ్రితో ఆంధ్రదేశంలోని తెనాలి చేరుకున్నాడు. అప్పటికి అతని వయసు 13 సంవత్సరాలు మాత్రమే. పరాయి రాష్ట్రంలో భాష తెలియని ప్రాంతంలో తండ్రీ కొడుకులు ఇద్దరూ నానా అవస్థలు పడ్డారు. నటరాజన్ కు తమిళ సాహిత్యం మీది మక్కువతో ఆ వయసుకే కథలు వ్రాసేవాడట. తెనాలి వచ్చాక తండ్రి మరణించాడు. శారద అనాథయ్యాడు. తెలుగు భాష మీద మక్కువ పెంచుకొని,  నోటు బుక్కులు కొనే స్థోమత లేక  రోడ్లమీద దొరికే సిగరెట్ ప్యాకెట్లు ఏరుకొని వాటి వెనక తెలుగు మాటలకు అర్ధం తెలుసుకొని వాటిని వ్రాసుకొని తెలుగు నేర్చుకొని తెలుగులో వ్రాసిన అద్భుతమైన కధలు ఆనాటి ప్రముఖ తెలుగు రచయితలను, పాఠకులను ఉలిక్కిపడేలా చేశాయి.

విజయవాడలో జరిగిన ఒక సాహితీ సదస్సులో విశ్వనాథ, జాషువా వంటి మహా రచయితలను చూసి వారి స్ఫూర్తితో తెలుగు భాషమీద పట్టును సాధించినవాడు శారద. తమ హోటల్ కు వచ్చిన ప్రతీ ఒక్కరిని వారికి పుస్తకపఠనాభిలాష వుందా అని అడిగి తెలుసుకొని వారి వద్దనుండి తెలుగు పుస్తకాలు అడిగి పుచ్చుకొని విస్తృతంగా చదివేవాడట. శారద హోటల్ లో సర్వర్ గా పనిచేస్తున్న రోజులనుండి అంటిపెట్టుకున్న ఆయన స్నేహితుడు ఆలూరి భుజంగరావు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననాడు శారద, భుజంగరావు, అతని తల్లి తినేందుకు తిండి దొరకక పస్తుండి మంచినీళ్ళతో కడుపునింపుకున్నారట. శారదకు మూర్ఛ జబ్బు. నయం చేసుకునే ఆర్థిక స్తోమత లేదు.  అప్పుడప్పుడు నడిరోడ్ మీదే మూర్ఛ వచ్చి పడిపోతూండేవాడట. చివరకు ఆ మూర్ఛ జబ్బు వల్లనే శారద తన 30వ ఏట 1955లో  అతి పిన్న వయసులో ఈ లోకాన్ని విడిచిపోయాడట. శారద తన జీవితకాలంలో చిల్లర నాణేలు, రూపాయి, ఐదు, పది రూపాయల నోటు తప్ప నూరు రూపాయల నోటు ఎలా వుంటుందో  తెలియదట. 'మంచి- చెడు', 'అపస్వరాలు', ఏది సత్యం' వంటి అధ్భుతమైన తెలుగు నవలలు వ్రాసిన తమిళుడు  శారద అనబడే ఎస్.నటరాజన్ దుర్భర లేమిలో కనుమూసాడు. ఎంతటి దౌర్భాగ్యస్థితి.  సామాన్య ప్రజల జీవితం నుండి, మనచుట్టూ వున్న సమాజం నుండే తన కథలను, కథాపాత్రలను ఎంచుకొని సహజమైన కథలను వ్రాసిన ప్రతిభాశాలి శారద. ఆయన వ్రాసిన 'ఏది నిజం' నవల పబ్లిష్ అయిన రెండు నెలలలోనే అన్ని పుస్తకాలు అమ్ముడుపోయి ద్వితీయ ముద్రణ వేయవలసి వచ్చిందట.

ఈ రచయిత విషాద గాధలో  ఒక సినీమాకు సరిపడేంత జీవిత సత్యాలు నిండివున్నాయి.

మా నాన్నగారికి వున్న సాహిత్యాభిలాషతో ఆయన చాలా మంచి పుస్తకాలనే సేకరించారు. టాగోర్, శరత్, మున్షీ ప్రేమ్ చంద్, విశ్వనాధ, గురజాడ, చలం, కొడవటిగంటి, రావూరి భరద్వాజ వంటి ప్రముఖుల పుస్తకాలతోపాటూ మాక్సిమ్ గోర్కి, టాల్ స్టాయ్, సోమర్సెట్ మామ్, మార్క్ ట్వైన్ వంటి విదేశీ రచయితల అనువాద సాహిత్యం, సంగీత నృత్యాలకు సంబంధించిన ప్రాచీన గ్రంథాలు అంతా మా నాన్నగారు కొనేవారు. ఈ ఉత్తమ సాహిత్యంలోని చాలాభాగం పాండీబజార్లో రాజకుమారి థియేటర్ ముందున్న ప్లాట్ ఫారమ్ బుక్ షాపులో సెకెండ్ హ్యాండ్ లో కొన్నవే. ఎంతో విలువైన పుస్తకాలు. పుస్తకాలకు మించిన మంచి స్నేహితులుండరని మా నాన్నగారి అభిప్రాయం. రికార్డింగ్ ల విరామ సమయంలో, ఘంటసాలవారితో బయట వూళ్ళు కచేరీలకు వెళ్ళేప్పుడు ప్రయాణాలలో ఈ పుస్తక పఠనంతోనే కాలక్షేపం చేసేవారు.

మా ఇంట్లోని ఈ సాహిత్యం పూర్తిగా కూలంకషంగా చదివేంత విజ్ఞానం నాకు లేకపోయింది. వార పత్రికలలో వచ్చే కధలతోటే నాకు గడచిపోయేది. అప్పుడే నాకు చాలామంది రచయితలు, రచయిత్రుల పేర్లు తెలిసాయి. ఆనాటి పత్రికలలో ఎక్కువగా  చక్రపాణి, గోపీచంద్ (అసమర్ధుని జీవిత యాత్ర),  కొడవటిగంటి కుటుంబరావు (చదువు), బలివాడ కాంతారావు, మధురాంతకం రాజారామ్, కొమ్మూరి వేణుగోపాలరావు (పెంకుటిల్లు), మద్దిపట్ల సూరి, బుచ్చిబాబు (చివరకు మిగిలేది), ధనికొండ హనుమంతరావు, ఎన్.ఆర్.నంది, కొండముది హనుమంతరావు, మహీధర రామ్మోహనరావు, పిలకా గణపతిశాస్త్రి (విశాలనేత్రాలు), తిరుమల రామచంద్ర (హంపీ నుండి హరప్పా దాకా), రాచకొండ విశ్వనాధ శాస్త్రి (ఆరు సారా కథలు, రాజు-మహిషి, గోవులొస్తున్నాయి జాగ్రత్త), ముళ్ళపూడి వెంకట రమణ (ఋణానందలహరి), పోలాప్రగడ సత్యనారాయణ (దీపశిఖ ) వంటి చేయి తిరిగిన రచయితలెందరో  తెలుగు కథాధా ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. 

పురుష రచయితలకు సమానంగా స్త్రీ రచయితలు కూడా ఎంతోమంది వినూత్న పంథాలో రచనలు సాగించారు. కొమ్మూరి పద్మావతి , ఇల్లిందల సరస్వతీ దేవి, భానుమతి, లత (ఊహాగానం), మాలతీ చందూర్ (చంపకం-చెదపురుగులు, ప్రమదావనం), కె. రామలక్ష్మి, ద్వివేదుల విశాలాక్షి (వైకుంఠపాళి, గ్రహణం విడిచింది, వారధి),  వేల్పూరి సుభద్రాదేవి (మంచుబొమ్మలు), డా.త్రివేణి (వెండిమబ్బు), ముప్పాళ రంగనాయకమ్మ (బలిపీఠం, కృష్ణవేణి ,పేకమేడలు), కోడూరి కౌసల్యాదేవి (చక్రభ్రమణం, ప్రేమ నగర్), యద్దనపూడి సులోచనారాణి (సెక్రెటరి, జీవన తరంగాలు, మీనా), డా.శ్రీ దేవి (కాలాతీత వ్యక్తులు), డి. కామేశ్వరి, పవని నిర్మలా ప్రభావతి, సి. ఆనందారామం మొదలైన రచయిత్రులు తెలుగువారి సాహితీ వికాసానికి ఇతోధికంగా తోడ్పడ్డారు. 

(బ్రాకెట్లలో ఉన్నవి నేను చదివిన వారి వారి పుస్తకాలు).

ఒక దశలో  తెలుగు సినిమా నిర్మాతాదర్శకులు ఆనాటి పత్రికలలో వచ్చిన నవలలు, సీరియల్స్ ఆధారంగా ఎన్నో విజయవంతమైన సినీమాలను తీశారు. తమ కథల ద్వారా ముప్పాళ రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి, ద్వివేదుల విశాలాక్షి, పోలాప్రగడ ఇత్యాదులు సినీప్రేక్షకుల ఆదరాభిమానాలు కూడా చూరగొన్నారు. 1980ల తర్వాత వచ్చిన యండమూరి వీరేంద్రనాధ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి, కొమ్మనాపల్లి గణపతిరావు వంటి ప్రముఖ పత్రికా రచయితలు కూడా సినీమా కథకులుగా లబ్దప్రతిష్టులు.

నాతరం వారందరికీ కూడా బాగా తెలిసిన  పాల మనసులు (డా.త్రివేణి వెండిమబ్బు), డా.చక్రవర్తి, ప్రేమనగర్,  సెక్రెటరి, చదువుకున్న అమ్మాయిలు, మీనా, జీవన తరంగాలు, బలిపీఠం, భార్యాభర్తలు (డా.లక్ష్మి అనే తమిళ రచయిత్రి నవల), తల్లిదండ్రులు, రెండు కుటుంబాల కథ, చలి చీమలు వంటి సినీమాలన్నీ సినీమా రంగానికి సంబంధంలేని పత్రికా రచయితల కథల ఆధారంగా తీసినవే.

సినీమా నిస్సందేహంగా వినోదం ముడిసరుకుగా ఉన్న వ్యాపారం. ఏ నిర్మాత సినీమా తీసినా ముఖ్యోద్దేశం  సినీమా వ్యాపారం ద్వారా ధనార్జనే. అందుకే ఈ నాటి సినీమాలలో వాసి కంటె రాశికే ప్రాధాన్యత. నిర్మాతలంతా  వివిధ ప్రసార ప్రచార సాధనాలతో తమకు గల వ్యాపార దక్షత అంతా ఉపయోగించి వందల కోట్ల బడ్జెట్ తో   ప్రేక్షక వినోదమే ప్రధాన లక్ష్యంగా, సంచలనమే ముఖ్యాకర్షణగా సినీమాలు నిర్మిస్తున్నారు. అయితే  విజయవంతమయ్యేవి పది సినీమాలలో  ఏ రెండో మూడో. మిగిలినవన్నీ మఖలో పుట్టి పుబ్బలో గిట్టే సినీమాలే. వందలాది కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరే. ఆ సినీమాలలోని కథ, మాటలు, పాటలు, నటీనటులు, ఏ అంశమూ ప్రేక్షకులకు జ్ఞాపకమే వుండవు.

ఈ రకమైన ఫక్తు వ్యాపార  దృక్పథం గడచిన తరం నిర్మాతా దర్శకులలో తక్కువ. అధిక లాభాలు రాకపోయినా తాము ఆ సినీమా మీద పెట్టిన సొమ్ము తిరిగి వస్తే చాలని ఆనందంగా సినీమాలు తీసేవారు. తమ సినీమాల ద్వారా సమాజానికి ఏదో ఒక మంచిని చేయాలని,  ఆదర్శ ప్రాయమైన సందేశాన్ని వినిపించాలని తలచేవారు. అందుకే కథ విషయంలో, సభ్యత గల  భాషను వాడే విషయంలో,  వీనులకు విందు చేసే శ్రావ్యమైన సంగీతం విషయంలో, సందర్భోచిత నటన విషయంలో ఎంతో  జాగ్రత్తలు వహించేవారు. 

ఆ రోజుల్లో ఒక సినీమా వరసగా  50 రోజులు ఆడితే వారి పెట్టుబడి వారికి వచ్చి రెండవ సినీమా తీయడానికి కావలసిన డబ్బు చేతికందే పరిస్థితి. ఆనాడు గోల్డెన్ జూబ్లీలు చేసుకున్న చిత్రాలు వచ్చాయి. కేవలం వారం, రెండు వారాలలోనే ఫిలిం డబ్బాలు వెనక్కి తిరిగి వచ్చినవీ ఉన్నాయి. నాటికీ నేటికీ సినీమా నిర్మాణ దృక్పథంలో ఎంతో తేడా వచ్చింది. ప్రేక్షకుల అభిరుచిలోనూ మార్పువచ్చింది. 

ఈనాటి సినీమాలలో ఉత్తమ సాహిత్యాన్ని, సుశ్రావ్యమైన మనసులను పరవశింపజేసే సంగీతాన్ని ఆశించడమనేది నేతి బీరకాయలో నేయికోసం వెతకడంలాటిదే అవుతుంది. 

💐

మాస్టారుగా తెలుగు చిత్ర పరిశ్రమలోని వారందరిచేత ఆప్యాయంగా  గౌరవింపబడిన సుప్రసిధ్ధ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వేంకటేశ్వరరావుగారు చలనచిత్రసీమకు వచ్చి 25 సంవత్సరాలు అయింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఘంటసాల సినీ జీవిత రజతోత్సవాన్ని(ఆనాటి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానియైన హైదరాబాద్ లో అత్యంతభారీగా, వైభవోపేతంగా జరపడానికి నిశ్చయించబడింది. అందుకుగాను వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతో ఒక ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 

ఆ మహోత్సవ విశేషాలు... వచ్చే వారం...
...సశేషం
Sunday, October 3, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభైయొకటవ భాగం

03.10.2021 -  ఆదివారం భాగం - 51:
అధ్యాయం 2 భాగం 50 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఇప్పటి చెన్నైలో మౌంట్ రోడ్ స్పెన్సర్స్ ప్లాజాకు ఎదురుగా సిటీ బ్యాంక్ వుంది. ఆ బ్యాంక్ మొదటి పేరు ఫస్ట్ నేషనల్ సిటి బ్యాంకు, ఒక విదేశీ సంస్థ. మద్రాసులో లో కొత్తగా తెరిచారు. ఆ బ్యాంక్ లో స్టెనో టైపిస్ట్ ల ఉద్యోగానికి పత్రికలలో ప్రకటన చేశారు. అది చూసి నేను  నా అప్లికేషన్ ను పంపాను. 

డా. డి.ఎన్.రావు గారి అబ్బాయి  శ్రీనాధ్ అదే ఫస్ట్ నేషనల్ సిటి బ్యాంక్ బొంబాయి బ్రాంచ్ లో ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. కొత్తగా జాయిన్ అయ్యారు. ఒంటరిగా ఉండేవాడు. బొంబాయి మహానగరంలో ఇంటి అద్దెలు చాలా ఎక్కువ. ఇండియాలో ఫ్లాట్స్,అపార్ట్మెంట్స్ సంస్కృతి ముందుగా అభివృద్ధి చెందినది బొంబయిలోనే.  1970ల తర్వాతే మద్రాస్ లో మల్టీస్టోరీడ్  రెసిడెన్షియల్ ఫ్లాట్స్ సిస్టమ్ డెవలప్మెంట్ ప్రారంభమయింది. ఎగ్మూర్ పోష్ లొకాలిటీస్ లో ఈ ఫ్లాట్స్ ఒకటో రెండో వుండేవి. వాటిలో ఎక్కువగా మార్వాడీలు, గుజరాతీలు వుండేవారు. దాక్షిణాత్యులంతా విశాలమైన  కాంపౌండ్ తో ఇండివిడ్యువల్ భవంతులు, ఇళ్ళకే ప్రాధాన్యత ఇచ్చేవారు. మరి మద్రాస్ లో వాళ్ళుండే 'పూర్ణిమ' లాగే బొంబాయిలో శ్రీనాధ్ వుండేది ప్రత్యేకమైన పెద్ద ఇల్లేనా అని అడిగితే అతను చెప్పిన సమాధానం అప్పట్లో షాక్ నే కలిగించింది. ఒక మల్టీస్టోరీడ్ బిల్డింగ్ లో ఒక చిన్న 12'×12' రూమ్ లో మరొకరితో షేర్ చేసుకొని వుంటాడట. ఆ చిన్న రూమ్ కు ఇతని వంతు అద్దె 2500/- రూపాయలని చెప్పిన గుర్తు. అంత అద్దెకు మద్రాస్ లో  నాలుగేసి గదులున్న చాలా పెద్ద ఇళ్ళే అద్దెకు దొరికేవి.  బొంబాయి లైఫ్ స్టైల్ గురించి అతను చెప్పే మాటలను ఆశ్చర్యంగా వినేవాడిని.

అలాటి పెద్ద బ్యాంక్ నుండి నన్ను ఇంటర్వ్యూకు రమ్మని పిలవడం నాకు ఆశ్చర్యమే. మద్రాసులోని ఫస్ట్ నేషనల్ సిటీ బ్యాంక్ అప్పట్లో ప్యారీకార్నర్ వెనక ఆర్మీనియన్ స్ట్రీట్ లో వుండేది. మా పానగల్ పార్క్ బస్ స్టాప్ లో 11 నెంబర్  బస్ పట్టుకొని ఆఖరి స్టాపింగ్  అయిన ప్యారీస్ కార్నర్ లో దిగి ఆర్మీనియన్ స్ట్రీట్ లోని ఫస్ట్ నేషనల్ సిటీ బ్యాంక్ కు నడుచుకుంటూ వెళ్ళాను. అలాటి పెద్ద బ్యాంక్ లకు వెళ్ళడం కొత్త. అక్కడ అందరూ చాలా టిప్ టాప్ గా సూటూ బూట్లతో హైలెవెల్ లో కనిపించారు. ఇంటర్వ్యూ కు వచ్చినవారు కూడా చాలా స్టైలిష్ గా వున్నారు. అందరిలోకి అతి సామాన్యంగా వున్నది నేను మాత్రమే. నేను డి.ఎన్.రావుగారి USEFI లో పనిచేసేప్పుడు నా సర్టిఫికెట్లు అన్ని పెట్టుకోవడానికి అక్కడి సెక్రెటరీ కుప్పుస్వామి ఒక బ్లూకలర్ థిక్ ప్లాస్టిక్ క్లోజ్ట్ ఫోల్డర్ ఒకటి ఇచ్చారు. ముందువేపు స్కైబ్లూ , వెనకవేపు డార్క్ బ్రోన్. నా సర్టిఫికెట్లు అన్నీ ఇంకా అదే ఫోల్డర్ లో నా దగ్గర భద్రంగా వున్నాయి. ఆ ఫోల్డర్ తోనే ఆ రోజు ఇంటర్వ్యూ కు వెళ్ళాను. ప్రతి ఇంటర్వ్యూ లాగే సాగింది.  ఒక  పావుగంటలో ఇంటర్వ్యూ ముగిసింది. ఏ సంగతీ తర్వాత తెలియజేస్తామన్నారు. నేను సరేనని వెనక్కి తిరిగి వచ్చేసాను. 

కొన్నిరోజుల తర్వాత  బొంబాయి నుండి శ్రీనాధ్ వీకెండ్స్ కు మద్రాస్ వచ్చారు. అతని బ్యాంకు లోనే నన్ను ఇంటర్వ్యూకు పిలిచారన్న విషయం శ్రీనాధ్ కు  చెప్పడానికి వెళ్ళాను. అతను నాకంటే వయసులో మరీ పెద్దవాడేమీ కాదు. ఉంటే ఒకటి రెండేళ్ళు పెద్దవాడేమో, తెలియదు. కానీ, చాలా తెలివైనవాడు, చొరవగలవాడు. అతనికి నా ఇంటర్వ్యూ వివరాలన్ని చెప్పాను. అన్నీ విని అతను ఒకే మాటన్నాడు 'ఆ స్టెనోగ్రాఫర్ ఉద్యోగం నీకు రాదు' అని. దానికి శ్రీనాధ్ చెప్పిన కారణం నాకు ఒక గుణపాఠం. ఆ బ్యాంక్ లో నన్ను ఇంటర్వ్యూ చేసిన పెద్దమనిషి అన్ని వివరాలు అడుగుతూ ఆ బ్యాంకు లో నాకు తెలిసినవారెవరైనా ఉన్నారా అని అడిగాడు. నేను మహాగొప్పగా శ్రీనాధ్  పేరుచెప్పి బొంబాయి బ్రాంచ్ లో పనిచేస్తున్నారని చెప్పాను. అదే నా కొంపముంచిందిట. తెలిసినవాళ్ళున్నారని చెప్పడం అలాటి పెద్ద కంపెనీలలో ఒక డిస్క్వాలిఫికేషన్ క్రింద పరిగణిస్తారట. అలాటి అప్లికెంట్స్ ను పూర్తిగా పక్కన పెట్టేస్తారట. కారణాలేమైనా  ఆ తర్వాత మళ్ళీ నేను ఆర్మీనియన్ స్ట్రీట్ ఫస్ట్ నేషనల్ సిటీ బ్యాంక్ ఛాయలకు వెళ్ళనేలేదు. 
🌷

మా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లయొజన్ ఆఫీస్ మైలాపూర్ నుండి అడయార్ కు మారాక నేను 12B బస్సులకోసం కాచుకోవడం మానేశాను. బస్ లో వెళితే ICF నుండి వచ్చే 47Aలో కానీ, విల్లివాక్కం నుండి వచ్చే 47 బస్ లో కానీ వెళ్ళాలి. ఆ బస్ స్టాప్ లు పానగల్ పార్క్ బస్ స్టాపింగ్ లకు కొంచెం దూరంలో వున్న రామకృష్ణ మెయిన్ స్కూల్ దాకా వెళ్ళాలి. ఆ బస్సులు సరియైన  సమయానికి వచ్చేవి కావు. వచ్చినా ఆ బస్సులు ఫుల్ గా జనాలు వేలాడుతుండేవారు. ఆ స్టాప్ లో ఆగకుండానే వెళ్ళిపోయేవి. ఆ బస్సుల కోసం కాచుకొని కూర్చుంటే ఆఫీసుకు బాగా లేటయిపోయేది. ఎంత నాకు పనిలేని గవర్నమెంట్ ఆఫీసయినా వారిచ్చే జీతానికి విశ్వాసంగా, సక్రమంగా పనిచేయాలనే నియమం నాకు వుండేది. అందువల్ల ఇంక సిటి బస్సులను నమ్ముకోకుండా ఆఫీసుకు సైకిల్ మీద వెళ్ళడం ప్రారంభించాను. వ్యాయామానికి వ్యాయామం. డబ్బుకు డబ్బు ఆదా. దీనివల్ల మా అమ్మగారికి ఆనందమే. బస్సులు వెళ్ళిపోతాయనే నెపంతో తన కొడుకు తాను వండి కట్టిచ్చే టిఫిన్ బాక్స్ పట్టుకెళ్ళకుండా పారిపోయే అవకాశం ఇప్పుడులేదు. మొత్తానికి ఓ నలభైయైదు నిముషాలలో సైకిల్ మీద అడయార్ గాంధీనగర్ లోని ఆఫీసుకు చేరేవాడిని. మా ఇంటినుండి సౌత్ ఉస్మాన్ రోడ్ చివరనున్న మౌంట్ రోడ్ వరకూ ఒకటే తిన్నటి రోడ్. ఇప్పటిలా ఫ్లైఓవర్ లు, వన్ వే ట్రాఫిక్ ల బెడద వుండేది కాదు. టి.నగర్ రంగనాథన్ స్ట్రీట్ నుండి టి నగర్ బస్ స్టాండ్ దాటేవరకే వాహనాల రద్దీ ఎక్కువగా వుండేది. ఆ తర్వాత  ప్రయాణం ఫ్రీగా సాగేది. ఆ తర్వాత మళ్ళి మౌంట్ రోడ్ లో సైదాపేట బ్రిడ్జ్ దాటేవరకు వాహనాల రాకపోక ఎక్కువే. లిటిల్ మౌంట్ దాటి రాజభవన్ రోడ్ ప్రవేశించాక, అడయార్ ఆఫీస్ కు వెళ్ళేవరకు చక్కనీ రాజమార్గమే. చాలా నిర్మానుష్యంగా, చల్లటి సముద్రపుగాలి, ప్రశాంతమైన వాతావరణంతో చాలా ఆహ్లాదకరంగా వుండేది.  రాజభవన్, గిండీ ఇంజనీరింగ్ కాలేజ్, గాంధీ మండపం దాటి IIT క్యాంపస్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, దాటేవరకూ రోడ్ కు రెండు ప్రక్కలా దట్టమైన చెట్లతో లోపలనున్న గిండీ ఫారెస్ట్ లోని లేళ్ళు, దుప్పులు రోడ్ ను క్రాస్ చేసుకుంటూ ఛెంగు ఛెంగున దుముకుతూ వచ్చేపోయే వాహనాలకు అడ్డుతగులుతూండేవి. సాయంత్రం ఏడు గంటలు దాటితే ఆ రోడ్ మీద నర సంచారమే వుండేదికాదు, అప్పుడప్పుడు తిరిగే బస్సులు,కార్లు తప్ప. అలా ఆ ఆఫీసుకు ఓ రెండేళ్ళపాటు సైకిల్ మీదే వెళ్ళివచ్చేవాడిని. ఆ ఆఫీస్ లో ఫెర్టిలైజర్స్ షిప్మెంట్ టైములో తప్ప మిగిలిన సమయాలలో పెద్దపని వుండేదికాదు. పని తగినట్లుగానే జీతాలు తక్కువే. అక్కడ పనిచేసేప్పుడు ఖాళి సమయమంతా నా షార్ట్ హాండ్ ప్రాక్టీస్, పుస్తకపఠనం, లంచ్ టైమ్ కునుకుపాట్లతో గడిచిపోయేది. సాయంత్రం ఐదు దాటినదగ్గరనుండీ స్టాఫ్ అంతా ఒక్కొక్కరూ మెల్లగా ఇళ్ళకు జారుకునేవారు. లయొజన్ ఆఫీసర్  బావా, IAS గారి నివాసం కూడా అడయార్ లోనే. కుటుంబం వుండేది కాదు. ఒంటరిగా ఒక గెస్ట్ హౌస్ లో వుండేవారు. మనిషి పొడుగ్గా ఏదో అనారోగ్యంతో వున్నట్లు కనపడేవాడు. ఆయన ఆహారం ముప్పొద్దులా బ్రెడ్, గ్రేప్స్, ఆపిల్స్,ఆరెంజ్ లు తోనే గడిపేవాడు. అప్పుడప్పుడు నన్ను తన రూమ్ కి పిల్చి అక్కడ లెటర్స్ డిక్టేట్ చేసేవాడు. ఆయనా ఆ ఆఫీస్ లో ఎక్కువ రోజులు పనిచేయలేదు. ట్రాన్స్ఫరై వెళ్ళిపోయాడు. Men may come,men may go, but the institutions remain the same. మాలాటివాళ్ళు మాత్రం మరో గత్యంతరం లేక అలాటి ఆఫీసులను పట్టుకు వేళ్ళాడుతుంటారు.

ఒక రోజు ఆఫీసులో పని వుండి సాయంత్రం ఇంటికి బయల్దేరడం ఒక గంట లేటయింది. సైదాపేట బ్రిడ్జి దాటి జయరాజ్ థియేటర్ దగ్గరకు వచ్చేసరికి బాగా చీకటిపడి రోడ్ లైట్లు వెలిగించేసారు. నేను సైదాపేట పోలీసు స్టేషన్ ప్రాంతానికి వచ్చేసరికి ఒక ట్రాఫిక్ పోలిస్ అటకాయించాడు. సైకిల్ కు లైట్ లేదని ఫైన్ కట్టమన్నాడు. ఇప్పుడే కదా లైట్లు వేసారు. మరో పావుగంటలో ఇంటికివెళ్ళిపోతానంటాను నేను. సైకిల్ కు వెనకవేపుండే రెడ్ షేడ్ లేదని మరో అభియోగం. అది కొన్ని రోజులముందే ఏ గోడకో కొట్టుకొని ముక్కలైపోయింది. కొత్తది వేయించడానికి బధ్ధకించడంతో ఆ రోజున పోలీస్ కు బలైపోయాను. సాధారణంగా ఆరు లోపల ఇంటికి చేరుకోవడం వలన ఈ సైకిల్ లైట్, వెనక రెడ్ షేడ్ గురించి ఎవరూ పట్టిచ్చుకునేవారు కాదు. బీట్ కాన్స్టేబుల్ సైకిల్ ను పోలీస్ స్టేషన్ లో పెట్టేసి ఓ రెండురోజుల తర్వాత ఫైన్ కట్టేసి సైకిల్ ను తీసుకుపొమ్మన్నాడు. ఎంత బ్రతిమాలినా కనికరించలేదు. బహుశా చేయి తడిపితే వదిలేసేవాడేమో! అందుకు నేను సిధ్ధంగా లేనే. సైకిల్ అక్కడ వదలేసి అడయార్ నుండి వచ్చే 47A. బస్ పట్టుకొని పానగల్ పార్క్ దగ్గర దిగి మెల్లగా ఇంటికి చేరుకున్నాను.

ఆ మర్నాడు ఆఫీసుకు బస్ లో వెళ్ళవలసి వచ్చింది. పానగల్ పార్క్ దగ్గరకు వచ్చేసరికి 12B స్టాపింగ్ దగ్గర గతంలో కనపడ్డ తెలుగాయన మళ్ళీ కనపడ్డారు. ఆయనతో మా ఆఫీస్ లో పనిచేసే జ్యోతిషం  గోపాలకృష్ణ ఏదో మాట్లాడుతున్నారు. నేను వాళ్ళను దాటుకొని రామకృష్ణా స్కూల్ స్టాపింగ్ కు నడిచాను. నేను వెళ్ళిన కాసేపటికి గోపాలకృష్ణ కూడా నేనున్న బస్ స్టాప్ దగ్గరకే వచ్చారు. ఆ తెలుగాయన గురించి ఈ తెలుగాయనను అడిగాను. ఆయనపేరు సూర్యప్రకాశరావు గారని, ఆలిండియా రేడియో లో పనిచేస్తున్నారని చెప్పారు. అయితే మరో సంగీతం మనిషన్నమాట అని అనుకున్నాను. అప్పుడప్పుడు బస్ స్టాప్ ల దగ్గర కలుసుకున్నా వయోభేదం చేత ఆయనతో నాకు పరిచయం పెరగలేదు. కానీ దాదాపు ఒకటిన్నర దశాబ్దం తర్వాత మా రెండో చెల్లెలు మామగారిగా శ్రీ కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావుగారితో పరిచయం ఏర్పడింది. వారి మరో అబ్బాయి రాజేశ్వరశర్మగారే  పానగల్ పార్క్ దగ్గరవున్న  నియో కమర్షియల్ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ లో  నాకు సహాధ్యాయి. నేను శ్రీ సూర్యప్రకాశరావుగారితో స్వయంగా వారింటివద్ద  మాట్లాడింది 1994 లో నేను హైదరాబాద్ కు ట్రాన్సఫర్ మీద వెళ్ళినప్పుడే. మనుషుల మధ్య స్నేహాలు, అనుబంధాలు చాలా చిత్రంగా అనూహ్యంగా ఏర్పడతాయి.

🌺🌿🌺


తిరుపతి వేంకటేశ్వర స్వామివారికి పరమ భక్తుడు ఘంటసాల వేంకటేశ్వరరావుగారు.  పౌరాణిక సినీమాలలో వచ్చే దైవ సంబంధమైన గీతాలెన్నింటికో ఘంటసాలవారు ప్రాణప్రతిష్టచేశారు. వారి కంఠంలోని మాధుర్యం, భావం, భక్తితత్పరతల వలన  అనేక భక్తిగీతాలు ప్రజా బాహుళ్యంలోనికి చొచ్చుకుపోయాయి. అనేకమందికి దేవుడిపట్ల భక్తివిశ్వాసాలు ఏర్పడ్డాయి. వివిధ దేవతామూర్తులమీద ఘంటసాలవారు పాడినన్ని భక్తి గీతాలు, పద్యాలు, శ్లోకాలు, అంత సార్ధకంగా మరే గాయకుడు పాడివుండరు. 

1960ల తర్వాత తిరుపతి వెంకటేశ్వరుడి మీద ఘంటసాలవారు వెలువరించిన గ్రామఫోన్ రికార్డులు పల్లె పల్లెలలా, పట్టణాలలో, నగరాలలో, మహానగరాలలో, విదేశాలలోని తెలుగువారందరికీ  దైవప్రార్ధనా గీతాలు అయినాయి. HMV గ్రామఫోన్ కంపెనీ వారికి విపరీతమైన ప్రచారాన్ని, ధనాన్ని సంపాదించిపెట్టాయి.

తెలుగునాట గల ప్రతీ సినీమా హాలు వాళ్ళు మూడాటలకు  ముందుగా ఘంటసాలవారు పాడిన 'ఏడు కొండలా సామి', 'నమో వెంకటేశా' పాటలను విధిగా వినిపించిన తర్వాతే తమ టిక్కెట్ కౌంటర్లు తెరిచేవారు. అదొక సంప్రదాయంగా, సదాచారంగా మారింది. ఆ తర్వాతే మిగిలిన పాటలను లౌడ్ స్పీకర్లలో వినిపించేవారు. ఘంటసాలవారి భక్తిగీతాలు తెలుగువారిని అంత ప్రభావితులను చేశాయి. శ్రీ వేంకటేశ్వర మహత్మ్యంలో ఘంటసాలవారు తెరమీద కనిపిస్తూ పాడిన ఏకాంతసేవా గీతం 'శేషశైలా వాసా' రంగుల రాట్నంలోని 'నడిరేయి ఏ జాములో' పాటలు తెలుగు హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే పాటలు.

తిరుపతి వెంకన్న మీద ఘంటసాల పాడిన - 'ఏడు కొండల సామీ', 'నమో వెంకటేశా', 'వేంకటేశ్వర సుప్రభాత పద్యాలు', 'వేంకటేశ్వరుని బుర్రకథ', 'తీయని వెంకని నామామృతం', 'వెంకన్న నామమే భక్తితో కొలిచితే,' 'జయ జయ జయ శ్రీ వేంకటేశా', 'శేషాద్రి శిఖరానా', 'తిరువెంకటాధీశ జగదీశా', 'నీ కొండకు నీవే రప్పించుకో ' 'భువనమోహన నిను పొడగన్న కనులతో'', భక్త జయదేవుని అష్టపదులు, తన జీవిత చరమాంకంలో ఆలపించిన తాత్పర్య సహిత భగవద్గీత  ఘంటసాలవారి భక్తి సంగీతానికి అజరామరత్వం కల్పించాయి.  భక్తికి, ముక్తికీ ఘంటసాల గాన శ్రవణమే పరమావధిగా ప్రతీ తెలుగువారూ భావించారు.ఘంటసాల, జలసూత్రం, దేవులపల్లి, యామిజాలఅటువంటి గానగంధర్వుడిని తిరుపతి వేంకటేశ్వరుడు కరుణించాడు. తన ఏడుకొండలలో ఘంటసాల భక్తిగానం నిరంతరం  ప్రతిధ్వనింపజేస్తూ  తనను చేరవచ్చే భక్తుల అలసటను, అలసత్వాన్ని తొలగించే దివ్యౌషధంగా వరం ప్రసాదించాడు. అంతేకాదు, ఎంతటి పుణ్యమో చేసుకుంటే తప్ప సామాన్యులెవ్వరికీ లభించని పదవిని, తన ఆస్థాన గాయక పదవిని ఘంటసాలవారికి లభించేలా ఆ శ్రీనివాసుడు అనుగ్రహించాడు. తిరుమల- తిరుపతి దేవస్థానం వారు ఘంటసాలవారిని తమ ఆస్థాన గాయకునిగా నియామకం చేసి ఆ భక్తగాయక శిఖామణిని సముచితంగా గౌరవించారు. మూడేళ్ళపాటు అపురూపమైన స్వామివారి సన్నిధిలో గానం చేసే అదృష్టాన్ని ఘంటసాలవారికి కల్పించారు. టి.టి.డి.వారి అత్యున్నత ఆస్థాన గాయక పదవిని పొందిన తొలి లలిత/ సినీమా సంగీత గాయక శ్రేష్టుడు ఘంటసాలవారు. ఇంతకు మించిన ఉన్నత స్థానాన్ని, పదవిని ఏ మానవమాత్రుడు ఇవ్వగలడు? ఇచ్చినా భగవంతుని వరప్రసాదంతో సమానమౌతుందా ? ఘంటసాలవారి సంగీత విద్య, గాన ప్రతిభ సార్ధకత చెందాయి. ధన్యజీవి ఘంటసాల.

తన ఆరాధ్యదైవం తిరుపతి వేంకటేశ్వరుని కరుణా కటాక్షాలతో తన సదాశయాలన్నీ సిధ్ధించాలని నూతనోత్సాహం తో ముందడుగు వేసారు ఘంటసాల. కొత్తగా అజంతా మూవీస్ వారి 'మెరుపువీరుడు', శ్రీ గౌతమీ పిక్చర్స్ వారి 'ఆలీబాబా 40 దొంగలు', రామవిజేతా వారి 'తల్లిదండ్రులు', గిరిధర్ ప్రొడక్షన్స్ వారి 'రెండు కుటుంబాల కధ', రాజ్యం ప్రొడక్షన్స్ వారి 'రంగేళీ రాజా'  తో పాటూ మరో రెండు చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేయడానికి ఒప్పుకున్నారు.

ఆ చిత్ర గీతాల విశేషాలు వచ్చేవారం ... అంతవరకూ...

                ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.