1897లో ఆంధ్రదేశంలో జన్మించిన దేవులపల్లి
కృష్ణశాస్త్రిగారి మీద ఆ కాలంలోని అనేక ఉద్యమాల ప్రభావం కనిపిస్తుంది. ఆంధ్రదేశంలో
భాష, సంస్కృతి, సమాజం ఈరంగాలలో అనేక మార్పులు చోటుచేసుకున్న కాలంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం
పట్టారు. ఆనాటి సాహిత్యంలో ప్రధాన మైన ధోరణి, ఉద్యమ స్థాయినందుకున్న కవితా పద్ధతి
భావకవిత్వం. గురజాడ, రాయప్రోలు
సుబ్బారావుగారు తో ప్రారంభమై భావకవిత్వం శాఖోపశాఖలుగా విస్తరించింది. కవిత్వం చెప్పడంలోనే
కాక ఆ కవిత్వం చెప్పేవారి రూపురేఖావిలాసాలు కూడా
కొత్తపోకడలు సంతరించుకుని భావకవులల్లిన కవిత్వం ప్రజా బాహుళ్యంలో విశిష్టమైన
స్థానం సంపాదించింది.
ఆ భావకవిత్వ
యుగంలోని అచ్చమైన భావకవి, దేవులపల్లి కృష్ణశాస్త్రి. భావకవితా యుగంలోని అన్ని
లక్షణాలు దేవులపల్లి కవిత్వంలో కనిపిస్తాయి. ప్రణయం, ప్రకృతి, దేశ భక్తి,
ఆథ్యాత్మికత, సంఘ సంస్కరణ, మానవత్వం, కాల్పనికత, మార్మికత ఇలా భావకవులు ఆ కాలంలోని
ఇతర భాషా సాహిత్యాల ప్రభావంతో చేసిన రచనలలోని ప్రధానమైన వస్తువులు.
దేవులపల్లి కవిత్వంలో ఈ అంశాలకు చెందిన
గేయాలెన్నో కనిపిస్తాయి.
దేవులపల్లి గీతాలలో
దేశ భక్తి గీతంగా ఎంతో ప్రసిద్ధి పొందిన గీతం -జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి.
భారతదేశాన్ని
తల్లిగా భావించి దేవులపల్లిగారు రాసిన ఈ గేయం జాతీయపండుగల సందర్భాలలో తెలుగు వాళ్ళ నోట పారాయణంగా మ్రోగుతుంది.
అయితే దేశభక్తి అనే ఛాయతోనే ఆంధ్రదేశాన్ని తల్లిగా ఆరాధిస్తూ దేవులపల్లి కష్ణశాస్త్రిగారు
రచించిన మరొక గేయం చాలామంది తెలుగు వారికి తెలియదు. ఆంధ్రదేశ వైభవాన్ని వర్ణిస్తూ సాగే గేయం జయ జయ ప్రియాంధ్ర జనయిత్రీ .
జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ గేయం పూర్తిగా సంస్కృత పదాలతో కూర్చిన గేయం అయితే, ఈ "జయ జయ మహాంధ్ర జనయిత్రీ గేయంలో ఎక్కువగా తెలుగు పదాలను కూర్చడమే కాక తెలుగు దేశంలోని ప్రకృతి వర్ణన కూడా చేసారు కృష్ణశాస్త్రిగారు.
జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ గేయం పూర్తిగా సంస్కృత పదాలతో కూర్చిన గేయం అయితే, ఈ "జయ జయ మహాంధ్ర జనయిత్రీ గేయంలో ఎక్కువగా తెలుగు పదాలను కూర్చడమే కాక తెలుగు దేశంలోని ప్రకృతి వర్ణన కూడా చేసారు కృష్ణశాస్త్రిగారు.
పట్రాయని సంగీతరావుగారు మద్రాసు కూచిపూడి ఆర్ట్ ఎకాడమీ - రూపొందించిన ఎన్నో నృత్యనాటకాలకు సంగీతం సమకూర్చారు. ఆ సమయంలో మాష్టరు గారు వెంపటి చినసత్యంగారి వద్ద నాట్యం నేర్చుకున్న అనేకమంది ప్రముఖ నర్తకీమణులలో సినీనటి కాంచన ఒకరు. ఆమె తన నాట్యం లో ప్రదర్శించడంకోసం దక్షయజ్ఞం అనే రచన ప్రారంభించారట కృష్ణశాస్త్రిగారు. దక్షయజ్ఞం రచన కొసవరకు సాగలేదు, కానీ ఆసమయంలోనే కృష్ణశాస్త్రిగారు, " ప్రతిదినము నీ గుణకీర్తనమే పారవశ్యమున పాడెదమూ",
" పూవులేరి తేవే చెలి" అనే లలితగేయాలను రచించారుట. అప్పుడు కూచిపూడి నాటకాలకు సంగీత దర్శకుడిగా ఉన్న పట్రాయని సంగీతరావుగారు కృష్ణశాస్త్రిగారిని తరచు కలుసుకుంటూ ఉండేవారు. ఆ సందర్భంలోనే ఈ గేయాలను సంగీతరావుగారు స్వరపరిచారు. ప్రతిదినమూ నీ గుణకీర్తనమే గేయాన్ని శహనా రాగంలోను, పూ లేరి తేవే చెలి పోవలె గేయాన్ని యదుకుల కాంభోజి రాగంలోను, ఈ "జయ జయ మహాంధ్ర జనయిత్రీ " పాటను కల్యాణి, మధ్యమావతి రాగాలలోను కూర్చారు సంగీతరావుగారు.
ఈ క్రమంలో దేవులపల్లివారు రాసుకున్న పాట వారి స్వహస్తాలతో ఇదిగో ఇది.
ఈ క్రమంలో దేవులపల్లివారు రాసుకున్న పాట వారి స్వహస్తాలతో ఇదిగో ఇది.
ఈ పాట సాహిత్యం ప్రారంభం ఇలా ఉంటుంది.
జయ జయ మహాంధ్ర జనయిత్రీ
జయ జయ ప్రియాంధ్ర జనయిత్రీ
జయ జయ ప్రియతమ భారతధాత్రీ ప్రియపుత్రీ
శుభ ధాత్రీ
భారతదేశాన్ని తల్లిగా భావించి జయజయప్రియభారత జనయిత్రీ అని రాసిన
కృష్ణశాస్త్రిగారు, ఆ భారతదేశంలో ఒక భాగమైన ఆంధ్ర దేశాన్ని భారతధాత్రీ ప్రియపుత్రీ
అంటూ ఆ భారతమాత పుత్రికగా ఊహించారు ఈ పాటలో.
మొదటి చరణంలో పచ్చని పంటపొలాలతో సస్యాలతో కొత్త చిగుళ్ళు వేసి పచ్చగా ఉన్న
ఆంధ్ర దేశాన్ని, అరటి, మామిడి, కొబ్బరి
మొదలైన వృక్షచ్ఛాయలతో నిండి వాటినుండి వచ్చే మృదువైన గాలులు వింజామర వీచగా అతి సుందరంగా శోభిల్లే భూమిగా
ఆంధ్రదేశాన్ని ఊహించారు.
రెండవ చరణంలో ఆంధ్రదేశానికి చెందిన ఘనమైన చరిత్రను స్మరించి, రాబోయే కాలాన్ని
మరింత ఘనంగా ఊహించి ఇటు మంజీరా నది, అటు వంశధార నదులు ఆ తల్లిని ఘనంగా కీర్తిస్తూ
ఉన్నాయట. కబరీ కాశ కదంబములూగ అంటే కొబ్బరిచెట్ల కొమ్మలు, రెల్లు పొదలు,
కడిమిచెట్లు వంటి అంగాలతో చలిస్తూ ఉండగా శబరీ,
పెన్నా మొదలయిన నదులు సంతోషంతో నృత్యం చేస్తాయట. ఈ సంబరమంతా చూసి
గోదావరి, కృష్ణా నదులు తమ ప్రవాహాలనే తలలను ఊపుతూ సంతోషాన్ని తెలియజేస్తాయని
వర్ణిస్తారు కృష్ణశాస్త్రి.
మూడవ చరణం లో ఈ ఆంధ్రదేశంలో వసించే
వారి అన్ని కోరికలు తీరాలని, ఇటు తెలంగాణలోను, అటు కళింగదేశమయిన ఉత్తర
ప్రాంతంలోను, రాయలసీమ లోను మొత్తం తెలుగు ప్రాంతాలన్నిటా వేల వేల గుమ్మాలలో
మంగళనాదంగా ఆంధ్రగానం మోగాలని కోరుకుంటారు.
పాట ముగింపులో కవి తన ప్రబోధాన్ని తెలియజేస్తారు. జగమంతా తన కుటుంబమే అని నమ్మే
విశాలహృదయం కవిది. అందుకే విశాల మానవతా సమతా వాదమే మా మనోరథం అంటూ ఏ కులమతాలు, వైషమ్యాలు లేని సమానత్వంతో మానవత్వాన్ని
సాధించి మనుషులంతా ఒకే కుటుంబంగా జీవించే ఆశయాన్ని సాధించాలంటారు. అందుకోసం నడుం
కట్టాలంటారు.
లోక కల్యాణం కోసం భావితరాల సౌభ్రాతృత్వం కోసం, స్వేచ్ఛకోసం ధృఢమైన శపథం తీసుకోవాలని బోధిస్తారు. ఒక్క క్షణకాలం కూడా వృథా చేయకుండా ఈ ఆశయసాధనకోసం అంకితం అవుతామని, గమ్యంకోసం సాగే ప్రయాణంలో తమ అడుగులు చెదరవని సంకల్పాన్ని వెల్లడిస్తారు. ఇటువంటి మహదాశయంతో సాగిపోయే తమను తల్లిగా ఆశీర్వదించమని శుభము, శాంతి కలగాలని దీవించమని కోరుతారు.
లోక కల్యాణం కోసం భావితరాల సౌభ్రాతృత్వం కోసం, స్వేచ్ఛకోసం ధృఢమైన శపథం తీసుకోవాలని బోధిస్తారు. ఒక్క క్షణకాలం కూడా వృథా చేయకుండా ఈ ఆశయసాధనకోసం అంకితం అవుతామని, గమ్యంకోసం సాగే ప్రయాణంలో తమ అడుగులు చెదరవని సంకల్పాన్ని వెల్లడిస్తారు. ఇటువంటి మహదాశయంతో సాగిపోయే తమను తల్లిగా ఆశీర్వదించమని శుభము, శాంతి కలగాలని దీవించమని కోరుతారు.
సకల మానవకల్యాణమే విశ్వకవి కోరుకునే ఆశయం.
ఆ లోకకల్యాణంకోసమే కవి పూరించే ఈ మంగళకాహళి.
ఆ లోకకల్యాణంకోసమే కవి పూరించే ఈ మంగళకాహళి.
పాట సాహిత్యం :
జయ జయ మహాంధ్ర జనయిత్రీ
జయ జయ ప్రియాంధ్ర జనయిత్రీ
జయ జయ ప్రియతమ భారతధాత్రీ
ప్రియపుత్రీ శుభ ధాత్రీ
ప్రియపుత్రీ శుభ ధాత్రీ
1 చరణం. శ్యామల నవ సస్యాంబరా
కోమల సుమవల్లీ చికురా
కదళీ రసాల లాంగలీ ఛలచ్ఛద
మృదులానిల జామరా
సుందరాతి
సుందర వసుంధరా
"జయ జయ మహాంధ్ర"
"జయ జయ మహాంధ్ర"
2 చరణం. నీ పూర్వ చరిత స్మరియించి
నీ భావి ఘనత దర్శించి
ఇటు మంజీర అటు వంశధార
ఎలుగెత్తి నిన్ను కీర్తించూ
కబరీ కాశ కదంబములూగ
శబరీ పెన్నలు నర్తించు
శబరీ పెన్నలు నర్తించు
మరి మరి కృష్ణా గోదావరి
ఝరులు తలలూపి హర్షించు
ఝరులు తలలూపి హర్షించు
"జయ జయమహాంధ్ర"
3 చరణం ఎల్లర కోర్కులు నిండునని
మనమెల్లరమొక సంసారమని
ఇటు తెలంగాణ అటు కళింగాన
అట నట కోస్తా రాయలసీమల
సహస్ర సహస్ర మందిర గేహళి
సదా మ్రోగు
నీ మంగళ కాహళి "జయ జయమహాంధ్ర"
ముగింపు: శ్రీ
విశాల మానవతా సమతా
సాధనమే మా మనోరథం
సాధనమే మా మనోరథం
భావిలోక కల్యాణ
సుస్థిర
స్థాపనమే మా దృఢ శపథం
స్థాపనమే మా దృఢ శపథం
ఒక క్షణమేని వృథ
పోనీము
ఒక అడుగేని చెదరనీయము
ఒక అడుగేని చెదరనీయము
శ్రీరస్తు శుభమస్తని
శాంతి రస్తని దీవించు
( జయ జయ మహాంధ్ర జనయిత్రీ వినడానికి వీడియో పైన క్లిక్ చేయండి)
2 comments:
ఇప్పటి పిల్లలకు తప్పక నేర్పించవలసిన దేశభక్తి గేయం. చాలా బావుంది.
దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి గారి గురించి చక్కగా వ్రాశారు. వారి స్వదస్తూరీతో వ్రాసుకొన్న ఒక గీతాన్ని కూడా అందించటం ాగుంది. మరికొన్ని గీతాలను
ప్రక్రుతి మీద వ్రాసినవి, భక్తి గీతాలు కూడా అందిస్టే బాగుండేది.
Post a Comment