visitors

Sunday, April 30, 2017

నేటి వసంత - నాటి లలిత


అనుకోడానికి సప్తస్వరాలే అయినా అవి 12 స్వరస్థానాలుగాను (16 పేర్లతో)*, 22 శృతులుగాను విభాగం చెందడం వల్ల ఆరోహణ, అవరోహణలలో ఔడవ, షాడవ, సంపూర్ణ స్వరాల కలయికతో – permutation and combination భేదాలతో అవి కొన్ని వేల రాగాల వరుసలు (మూర్ఛన – scale)గా రూపొందించవచ్చన్నది తెలిసిన విషయం. ఆ వరుసలలో కొన్నివేల రాగాలు పేర్లతో వ్యవహరించడానికి వీలుగా నామకరణ చేయబడ్డాయి. అవి సప్తస్వరాలూ ఉన్న సంపూర్ణ రాగాలయిన 72 మేళకర్త రాగాలలో ఏదో ఒకదానికి జన్యరాగాలు అయే అవకాశం ఉంది. జనాదరణ వల్ల వాటిలో కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పేరు లేనివి, ఉన్నా ప్రచారంలో లేని వరసలు కొన్ని వేలుంటాయి. అప్పుడప్పుడు కొందరు ఔత్సాహికులు పేరు తెలియని వరుసలకి కొత్త పేర్లు పెట్టడం జరుగుతుంది. సామాన్యులు దీనిని కొత్త రాగం కనిపెట్టడంగా భావిస్తుంటారు.

*సప్తస్వరాలు పదహారు పేర్లతో పన్నెండు స్వరస్థానాలుగా విభాగం చెందితే - 1. షడ్జమం. 2. శుధ్ధ రిషభం. 3. చతుశ్రుతి రిషభం (శుధ్ధ గాంధారం అని మరో పేరు). 4. సాధారణ గాంధారం (షట్ శ్రుతి రిషభం అని మరోపేరు). 5. అంతర గాంధారం. 6. శుధ్ధ మధ్యమం. 7. ప్రతి మధ్యమం. 8. పంచమం. 9. శుధ్ధ ధైవతం. 10. చతుశ్రుతి ధైవతం (శుధ్ధ నిషాదం అని మరో పేరు). 11. కైశిక నిషాదం (షట్ శ్రుతి దైవతం అని మరో పేరు). 12. కాకలి నిషాదం.  ఉదా: మొదటి మేళకర్త - కనకాంగి కి శుధ్ధ నిషాదం అంటే చతుశ్రుతి ధైవతానికే ఆ పేరు. 72 మేళకర్తల విభాగం ఈ 16 పేర్లను అనుసరించే చేయబడింది. న్యాయంగా 2 గాంధారాలు, 2 నిషాదాలు మొదలైన 12 స్వరాల ఆధారంగా అయితే 72 మేళకర్తలు రావు.

పండిత వెంకటమఖి రచించిన చతుర్దండి ప్రకాశిక (72 మేళకర్తలు), నాదముని పండితుల రచన- సంగీత స్వరప్రస్తార సాగరం (2044 రాగాలు) వంటి సంగీత గ్రంధాలను పరిశీలిస్తే  ఏ వరుసకి ఏ పేరు ఉంది అని తెలుసుకోవచ్చు. వీటిలో ప్రచారంలో ఉన్న అనేక రాగాల పేర్లు కనిపిస్తాయి.


ఆ విధంగా ప్రచారంలో లేని రాగ వరుసలో ఉన్న ఊహలు గుసగుసలాడే అన్న పాట సౌదామిని రాగంగా గుర్తించడం జరిగింది. ఒక అన్యస్వర ప్రయోగం వల్ల సుమనేశరంజని అన్న మరో ప్రచారంలో లేని రాగఛాయలు కూడా ఆ పాటలో ఉన్నాయి.

సంప్రదాయం, బానీ, ప్రాంతీయ పధ్ధతులననుసరించి కొన్ని రాగలక్షణాలు, పేర్లలో తేడాలు గమనించవచ్చు. రాగవిభాగంలో ఏ రకమైన తేడాలు లేకుండా ఏకరూప్యత సాధించడానికి, దక్షిణ భారత సంగీత విద్యార్ధులందరూ ఏకీకృత పాఠ్యప్రణాళికను అనుసరించడానికి వీలైన ప్రయత్నాలు సంగీత విద్వాంసుల సదస్సుల్లో జరుగుతూంటాయి. చాలా కాలం క్రితం మద్రాసు మ్యూజిక్ అకాడమి expert’s committee లలిత, వసంత రాగాల  విషయంలో ఈ విధమైన మార్పులు చేయడం జరిగింది.  


ఇప్పటి వసంత అప్పట్లో లలిత. నాడు వసంత నేడు లలిత. ఉదాహరణకి  ఒకనాడు లలిత రాగంలో ఉన్న "సీతమ్మ మాయమ్మ  "కీర్తనను  ఈనాడు వసంత రాగంగా గ్రహిస్తున్నారు. 

పట్రాయని సీతారామశాస్త్రిగారి కృతి - లలితే సరసగాన కళాశ్రితే ని   లలిత రాగంలో సమకూర్చినా,  దాన్ని ప్రస్తుతం వసంత రాగంగా భావించడానికి గల నేపధ్యం, ఈ లలిత, వసంత  రాగాల లక్షణాలు, గురువుగారి సంగీత రచన, సంగీతరావుగారి మాటల్లో.... గాత్రంలో... వినండి.

 


Monday, April 24, 2017

వాసా అప్పయ్యగారు


ఉత్తరాంధ్రలో వాసా వారిది సుప్రసిద్ధ సంగీత కుటుంబం.  వారి నివాస స్థలం బొబ్బిలి. బొబ్బిలి ఆస్థాన పండితులు వారు.  

వాసావారి సంప్రదాయంలో బిలహరి, కల్యాణి, లలిత, నవరోజు మొదలైన రాగాలలోని స్వరపల్లవులు ప్రసిద్ధమైనవి. 


వాసా అప్పయ్యగారికి సాంబయ్య, కృష్ణమూర్తి అని ఇద్దరు కొడుకులు.వీరు వీణ విద్వాంసులు. సాంబయ్యగారికి సంతానం లేక తమ్ముడి కొడుకు వెంకటరావుగారిని దత్తత తీసుకున్నారు.


ఆదిభట్ల నారాయణదాసుగారు కొంతకాలం వాసా సాంబయ్యగారివద్ద వీణాభ్యాసం చేసానని తన ఆత్మకథ "నా ఎరుక" లో రాసుకున్నారు.


వాసా వెంకటరావుగారు తరువాత కాలంలో విజయనగరం సంగీత కళాశాలలో వీణాచార్యులుగా పనిచేసారు.ఆయన కొడుకే ప్రసిద్ధ వీణ విద్వాంసుడు శ్రీ వాసా కృష్ణమూర్తి.ఇదొక తెలుగు సంగీతకుటుంబం. 

పట్రాయని సంగీతరావుగారు తన చిన్ననాటి జీవితంలో పరిచయమైన అనేక వ్యక్తుల, ప్రదేశాల గురించి చింతాసక్తి పేరుతో రాసిన తన స్మృతులలో శ్రీ వాసా అప్పయ్యగారి గురించి ప్రస్తావించారు. 

వాసా అప్పయ్యగారి శిష్యుడు గుమ్ములూరి వెంకటశాస్త్రిగారు గురస్తుతిగా మలహరి రాగంలో గీతాన్ని రచించారు. ఆ గీతాన్ని వారి శిష్యపరంపర పిళ్ళారిగీతాలతో పాటు నేర్చుకునేవారు.

సంగీతరావుగారు ఈ తరం ప్రాథమిక సంగీత విద్యార్థులకి ఆ గీతాన్ని పరిచయం చేస్తున్నారు.

ఈ గీతంల ధాతువు యథాతథం కాగా, మాతువు, ప్రారంభం మాత్రమే మూలంలో ఉన్నది. మిగిలినది పూరణం.Monday, April 17, 2017

1957 ఏప్రిల్ 17 న శ్రీ సాలూరు చినగురువుగారి నిర్యాణం. అంటే ఈనాటికి సరిగ్గా  60 సంవత్సరాలు. 2010 సం. లో  గురువుగారి 110వ జయంత్యుత్సవం సందర్భంగా  మద్రాసు మ్యూజిక్ అకాడెమీ (మినీ)హాల్ లో ఆయనకు స్వరనివాళి సమర్పిస్తూ ఒక కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంలో ఔత్సాహికులు సాధన చేయడానికి  వీలుగా,  ఈ తరానికి గురువుగారి కృతులు,  పద్యాలను పరిచయం చేసే ఉద్దేశంతో  సంగీతరావుగారు పాడగా  చేసిన రికార్డింగ్స్ లో ఒకటి ఇక్కడ సమర్పిస్తున్నాం. ఈ రికార్డింగ్స్ చేసినప్పటికి సంగీతరావుగారి వయస్సు 90 సంవత్సరాలు అన్న విషయాన్ని  శ్రోతలు గుర్తుంచుకోవాలి.


ఈ క్రింది వాక్యం పైన నొక్కి ఆ పద్యాన్ని వినండి.
గురువుగారి రాగమందనురాగము సీసపద్యంసంగీతంతో నాదోపాసన చేసిసరస్వతీ పుత్రులుగా ఆనాటి ప్రజల అభిమానాన్ని పొందారు శాస్త్రిగారు. తనకు ఈ విద్యను ప్రసాదించిన సరస్వతీదేవిని తల్లిగాపుత్రుడి లాగే ఆరాధించారు శాస్త్రిగారు. తన ఆనందాన్నిదుఃఖాన్ని కూడా సరస్వతి అమ్మవారితో పంచుకున్నారు.
సంగీతకళా మూర్తి శారదాదేవిని తల్లిగా భావించి ఆమెకు చేసుకున్న నివేదన-
సీ.
రాగమందనురాగ రసమునొల్కించుటే అమ్మరో నీ మందహాసమమ్మ
గడియారమునకె సద్గతి జూపు లయతాళ గతులెన్న నీ మందగమనమమ్మ
పూలమాలికల కూర్పును బోలు స్వరకల్ప నలు నీదు మృదుల భాషలు గదమ్మ
శ్రుతి యందు లీనమౌ గతి మది నిల్పుటే భారతీ నీ శాంత భావమమ్మ

నవరసంబుల సముద్భావమంద జేయుటే శారదా నీ కటాక్షము గదమ్మ
తే.గీ.
భావ రాగంబులనుతాళ ఫణితిశ్రుతియు
గలియ గానంబు చేసెడి గాయకునకును
శ్రుతి పుటంబుల నీ నృత్య గతులు నిండ
కున్న ఆ గాయకుడు గాయకుండె జనని
శరణు ముఖజిత శశి బింబ శారదాంబ

పద్యంలో కనిపిస్తుంది. ఇందులో వస్తువు సరస్వతిని స్తుతించడం. రాగమందు అనురాగ రసమునొల్కించుట ఆమె మందహాసమనిగడియారమునకే గతులు చూపే లయతాళగతులు ఆమె మందగమనమనిపూలమాలికలవలె కూర్చిన స్వర కల్పనలు ఆమె భాషలనిఈ విధంగా చేసే నవరస సముద్భవం ఆమె కటాక్షమనిభావరాగ తాళాలతో శ్రుతిపక్వంగా పాడి ఆమెను ఆనందింపచేయని గాయకుడు గాయకుడే కాదని వర్ణించారు.