visitors

Sunday, September 15, 2013

వెలిగించని దీపాలు - దేవులపల్లి గీతాలు


వెలిగించని దీపాలు - దేవులపల్లి గీతాలు

గిరిజా కల్యాణం  గీతం తెలుగు చిత్రసీమ ప్రేక్షకులందరికీ పరిచయమే. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు రచించిన  యక్షగాన ప్రబంధం  ఇది. రహస్యం సినిమా నిర్మాణసంస్థ లలితా శివజ్యోతి ఫిలింస్ వారు. ఈ సినిమాకోసం ఇంకా చాలా పాటలు చిత్రించాలని అనుకున్నారు నిర్మాతలు. అందుకోసమే  దేవులపల్లి 
 వెంకట కృష్ణశాస్త్రిగారితో కొన్ని గీతాలు రాయించారు. వాటికి బాణీలు కట్టి రికార్డు కూడా  చేసారు  ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన ఘంటసాలగారు. కానీ  ఏ కారణం వల్లనో ఆ పాటలను రహస్యం చిత్రానికి  ఉపయోగించుకోలేదు. ఘంటసాలగారికి స్వరసహచరులుగా ఉన్న సంగీతరావుగారు ఆ గేయాలను తాను కూచిపూడి నృత్యరూపకాలకు సంగీత దర్శకత్వం వహించిన సమయంలో అర్థనారీశ్వరం అనే నృత్యరూపకానికి ఉపయోగించారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు రచించిన  ఆ పాటల్లో ఒకటి - భ్రమించు ముద్దు మోముతో.

అమ్మవారి గురించి వర్ణిస్తూ చిత్రించాలనుకున్న సందర్భం కోసం దేవులపల్లిగారు ఈ పాటను రచించారు.
భ్రమించు ముద్దుమోముతో
చలించు కుంతలాలతో
సుమించు లేత నగవుతో
రహించు గండపాణితో
విలాస నాట్యమాడు మాతృదేవికిన్
నమస్కృతుల్ నమస్కృతుల్
నమస్కృతుల్ 

ఈ పాటని ఘంటసాల గారు హమీర్ కల్యాణి రాగంలో స్వర పరిచారు. సంగీతరావుగారు దీన్ని  శ్రీ వెంపటి చినసత్యంగారి దర్శకత్వంలో రూపొందిన కూచిపూడివారి అర్థనారీశ్వరం నృత్య రూపకం కోసం ఉపయోగించారు. 

మరొక పాట-
ఈ పాటని ఈశ్వరుడి అర్థనారీశ్వర స్వరూపాన్ని వర్ణించేసందర్భంలో చేయాలనుకున్నారు. ఇది కూడా రికార్డు చేసారు కానీ ఉపయోగించుకోలేదు. ఈ పాటను ఘంటసాల గారు హంసధ్వని రాగంలో స్వరపరిచారు.
 మరొక గీతం - అఖిల లోకేశ్వరా అర్థనారీశ్వరా
పల్లవి          అఖిల లోకేశ్వరా అమర గంగాధరా
                   అహి హార అర్థనారీశ్వరా
                    అమృత కర కోటీర
                  అతిలోక సుందరా
                 అఘహరా అర్థనారీశ్వరా
చరణం           పులితోలు నీటుతో
                   వలువ వలెవాటుతో
                   చెలువొందు అర్థనారీశ్వరా
                   నిటల నయనమ్ముతో
                   నిడుద తిలకమ్ముతో
                   నెగడొందు అర్థనారీశ్వరా                                  “అఖిల లోకేశ్వరా అమర గంగాధరా
చరణం          వలకేల శరము
                 దాపల కేల సుమ శరము
                 వలెమించు అర్థనారీశ్వరా
                 తల్లివై  అలరింప తండ్రివై రక్షింప
                 ఏకమూర్తి ధరించు లోకేశ్వరా          
                 అర్థనారీశ్వరా....అర్థనారీశ్వరా...అర్థనారీశ్వరా.                  అఖిల లోకేశ్వరా అమర గంగాధరా                 
 చక్కని తెలుగు పదాలతో ఒక పాదంలో  శివమూర్తిని, మరొక పాదంలో గౌరిని
 వర్ణిస్తూ  దేవులపల్లిగారు ఎంత చక్కగా రచించారో ఈ   పాటని.

అర్థనారీశ్వర తత్వంలో రూపాన్ని వర్ణించడంతో పాటు వారిని జగన్మాతా పితరులుగా చూపించిన విధానం ఎంతో బావుంది.

ఇంకొక పాట
శివుడు తాండవమాడెనపుడూ.....

ఈ పాటను దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు  రచించారు. ఘంటసాల గారు ఈపాటను శ్రీరాగంలో స్వరపరిచారు. సంగీతరావుగారు దీన్ని శంకరాభరణం రాగంలో స్వరపరిచారు. కూచిపూడి నాట్యం చేసేవారికి సోలో డాన్స్ కోసం ఈ పాటను స్వరపరిచారు సంగీతరావుగారు.

శివుడు తాండవమాడేనపుడూ............

పల్లవి             శివుడు తాండవమాడెనపుడూ
                   శివుడు తాండవమాడేనపుడు
                   జగదంబ సహితముగ శివుడూ తాండవమాడెనపుడు

                     శౌరి మృదంగము మ్రోయింప 
                     పాకారి వేణువును పూరింప,
                     వారిజాసనుడు తాళము నదింప(శబ్దం చేయడం)
                     భారతి విపంచి   మ్రోయింప      
                          క్షీర వారాశి తనయ పాడ
                     అచ్చరలు క్రమ లయ న్యాసము తోడ
                     నారదాది మునివరులు తిలకింప
                     పారవశ్యమున జగతి పులకింప.........
ఈ పాట లో శివతాండవ దృశ్యం వర్ణించబడింది. విష్ణువు ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, సరస్వతి, లక్ష్మీదేవి, అప్సరసలు నారదుడు ఇలా దేవతలందరూ ఆ కొలువులో తమ కళా ప్రదర్శన చేస్తూ ఉండగా జగదంబ అయిన పార్వతీ సహితంగా  శివుడు తాండవ నాట్యం చేసాడు.
ఈ పాట లో దృశ్యాల వర్ణన వింటే సి. నారాయణరెడ్డిగారు రచించిన ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు పాట గుర్తు రావడం యాదృచ్ఛికమేనా. ఆ పాటలో కూడా దేవతలందరూ కలిసి ఒక్కోవిధమైన కళా ప్రదర్శన చేస్తున్నట్టు వర్ణించబడింది.
ఆ పాట సాహిత్యంలో విరించి తాళము వేయగా, హరి మృదగము మ్రోయింపగా ప్రమధులాడగా అప్సరసలు పాడగా....అంటూ ఆ తాండవ దృశ్యాన్ని వర్ణిస్తారు. మరి నారాయణరెడ్డిగారు ఈ పాట విన్న తరువాత రాసారో - కాదో మరి. 
రహస్యంలో గిరిజా కల్యాణం యక్షగానంతో పాటుగా ఈ పాటలు కూడా ఉండి ఉంటే సంగీతప్రియులైన సినీశ్రోతలకు వీనులవిందుగా ఉండేది. అయినా కూచిపూడి నృత్యరూపకాల ద్వారా ఆ లోటు కొంత తీరిందని సంతోషించవచ్చు కూడా.


4 comments:

Voleti Srinivasa Bhanu said...

MANCHI VISHAYAANNI VELUGU LOKI TEESUKU VACCHINA MEEKU ABHINANDANALU

Unknown said...

సాలూరు చిన గురువు గారిగురించి వ్రాసినప్పుడు వారి సంతానం ముగ్గురుని ఉదహరించాలి . పట్రాయని నారాయణ మూర్తి ప్రభు కూడా చిరస్మర నీయులు.

Sudha Rani Pantula said...

@Ramalingaswamy Gumma గారు, చినగురువుగారు వ్యాసంలో నిడివి ఎక్కువవుతోందని ఆ వివరాలు అక్కడ రాయలేదు. పట్రాయని వారు అనే వ్యాసం లో కుటుంబం వివరాలను రాసినప్పుడు రాసాను. ఈ బ్లాగులోనే ఆ వ్యాసాన్ని కూడా చూడగలరు.

Unknown said...

అలనాటి చిత్త్రం శ్రీ లలితా శివజ్యోతి వారి రహశ్యం కోసం దేవులపల్లి క్రిష్ణశాస్త్రి గారు రచించిన కొన్ని పాటలు రెకార్డింగ్ చేయబడినా అవి చిత్రములో వాడుకోలేదన్న క్రొత్త విషయాన్ని తెలియజేస్తూ, ఆ పాటలని గురించి విశదముగా తెలిపినందుకు ధన్యవాదాలు. ఇలాంటివి మీనుండి మరెన్నో ఆశిస్తాను.