visitors

Sunday, January 30, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవై ఆరవ భాగం

30.01.2022 - ఆదివారం భాగం - 66:

అధ్యాయం 2  భాగం 65 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

9 టు 9 రీ-రికార్డింగ్ కాల్షీట్. ఆరోజుతో ఎలాగైనా రీరికార్డింగ్ పూర్తిచేసేయాలనే దీక్షతో వచ్చారు ఘంటసాల మాస్టారు. ముందుగా ఆ రోజు చేయవలసిన సీన్స్ తెరమీద వేసి చూపారు.  స్టాప్ వాచ్ తో మొత్తం సీన్ ఎన్ని నిముషాలు వుందో అందులో ఎంతమేరకు మ్యూజిక్ అవసరమవుతుందో ఏఏ వాద్యాలు ఉపయోగించాలో నిర్ణయించుకున్నారు. ఆ సీన్ లో ముందు ఛేసింగ్స్,   తర్వాత ఒక లెన్తీ ఫైట్ సీక్వెన్స్. మాస్టారు, మా నాన్నగారు హార్మోనియం మీద, జడ్సన్ తబలామీద సహకరిస్తూంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. తనకు తృప్తి కలిగేంతవరకు చేర్పులు , మార్పులు చేసి నోట్స్ ఫైనలైజ్ చేసారు. మధ్యమధ్య ఏ విధమైన సౌండ్ ఎఫెక్ట్స్ ఏ వాద్యం మీద రావాలో తాత్కాలికంగా నిర్ణయించారు. ఓ ముఫ్ఫై నలభైమంది ఆర్కెష్ట్రా. వెస్టర్న్ స్ట్రింగ్, విండ్ ఇన్స్ట్ర్మెంట్స్ ఎక్కువగానే వున్నాయి. హై పిచ్ లో ఫాస్ట్ టెంపో నోట్స్ ను మాస్టారు కంపోజ్ చేశారు. ఒక్కొక్క సెక్షన్ నుండి ఒక్కొక్క ప్రతినిధి వచ్చి మా నాన్నగారు చెపుతూంటే వారి వారి భాషల్లో నోట్స్ రాసుకొని మిగతావారికి అందజేశారు. ముందుగా ఆ నోట్స్  ఒకటి రెండు సార్లు ప్రాక్టీసు చేశాక, తెర మీద సినీమాతో పాటు వాయింపజేసి నాన్ సింక్ లు ఏమైనా వున్నాయేమోనని చెక్ చేసుకొన్నారు. ఫస్ట్ మోనిటర్ లో చిన్న చిన్న మార్పులు అవసరమయాయి. వాటిని సరిచేసి మరో మోనిటర్ పిక్చర్ తో చూశారు. తృప్తికరంగానే వచ్చింది. టేక్ తీద్దామా అని సౌండ్ డిపార్ట్మెంట్ వారిని. ఆడిటోరియంలో ని ఆర్కెస్ట్రాను మైక్ లో అడిగారు మాస్టారు. టేక్ సమయంలో ఏ రకమైన  దగ్గులు, తుమ్ములు, ఆవలింతలు, బరబర చప్పుళ్ళు వినపడకూడదనడానికి ఇదొక హెచ్చరిక. సౌండ్ వాళ్ళు తాము రెడీ అని చెప్పాక ఆర్కెస్ట్రాను కండక్ట్ చేసే రాఘవులుగారు సైలెన్స్ అని ఓ అరుపు అరిచి, సీన్ నెంబర్ చెప్పి స్టార్ట్  అనగానే స్క్రీన్ మీద సినీమా ప్రారంభమై ఆడిటోరియంలో వాద్యాల మ్రోత ఆరంభమయింది. అన్ని వాద్యాలు ఒకేసారి జోరుగా మ్రోగుతున్నప్పుడు వినేవారికి చాలా ఉత్కంఠ కలుగుతుంది. వాద్యాలు స్పీడ్ అందుకున్నాయి.  సౌండ్ ఇంజనీర్ పక్కనే కూర్చున్న  ఘంటసాల మాస్టారు సడన్ గా కట్ అని అరిచారు. ఒక్కసారిగా వాద్యాలన్నీ ఆగిపోయాయి. మాస్టారు ఎందుకు కట్ చెప్పారో ఎవరికీ అర్ధం కాలేదు. మాస్టారికి తెలుసు ఏ సెక్షన్ లో పొరపాటని. అయినా  ఒక్కొక్క సెక్షన్ ను  మళ్ళీ వాళ్ళ వాళ్ళ నోట్స్ ను వాయించి చూపమన్నారు. అలా మళ్ళీ వాయించేప్పుడు  వైలిన్స్ సెక్షన్ లో ఎవరో నోట్స్ తప్పుగా రాసుకోవడం వలన ఒకచోట స్వరం తప్పి అపశ్రుతిగా వినపడింది. ఆ విషయం థియేటర్లో వాయిస్తున్నవారికి తెలియదు . ఏ చిన్న లోపం ఎక్కడ జరిగినా లోపల సౌండ్ కంట్రోల్ రూమ్ లో తెలిసిపోతుంది. మళ్ళీ మొత్తం సీన్ మొదటినుండి ప్రారంభించవలసిందే. ఇలాటి పొరపాట్లు ఎవరు చేసినా దాని ఫలితం అందరూ అనుభవించాలి. అందుకే ఆర్కెస్ట్రాలో బాగా అనుభవం ఉన్నవారిని, ప్రొఫెషనల్స్ ను పిలుస్తారు. ధియేటర్లోకి వచ్చాక ఒక్కొక్క నిముషం ఎంతో విలువైనది. అంతా అణా పైసలతో కూడుకున్నది. అనుకున్న రీతిలో పని సక్రమంగా జరగకపోతే అక్కడ నిర్మాత బిపి రేట్ పెరిగిపోతూంటుంది. అటువంటి దురవస్థ నుండి నిర్మాతకు తప్పించవలసిన బాధ్యత ఇప్పుడు సంగీతదర్శకుడిదే. నిర్ణీత సమయంలో పనిపూర్తి చేయాలి, తను చేస్తున్న సీన్ తనకు ఇతరులకు పూర్తి సంతృప్తిని కలిగించాలి. ఇందుకుగానూ ఘంటసాలగారు ఎంతో శ్రమించేవారు. ఆఖరు నిముషం వరకూ అన్నీ సక్రమంగానే వున్నా టేక్ కు వెళ్ళేప్పటికి ఎదో అంతరాయం. సౌండ్ విభాగంలో కరెంట్ ఫ్లక్చువేషన్ వల్ల మైకులు పనిచేయకపోవడం, శ్రుతుల బిగింపు ఎక్కువై వైలిన్ తీగెలు తెగిపోవడం, తబలా,డ్రమ్ముల శ్రుతులు జారిపోవడం, లేదా హార్మోనియం మెట్లు  జామ్ అయి హ్యాంగ్ కావడం,ఆర్కెస్ట్రా రూమ్ లోని కుర్చీలో, టేబిల్సో జరిగి చప్పుడు కావడం ఇత్యాది అనివార్య అవాంతరాలతో టేక్ సగంలో కట్ చేసి మళ్ళీ మొదలుపెట్టవలసి వచ్చేది. ఇప్పటి మోడర్న్ టెక్నాలజీ ఆనాడే వుండివుంటే మరెంతో ఉత్తమ సంగీతం లభించేది.   ప్రపంచ సినీమా ఇండస్ట్ట్రీలతో పోలిస్తే భారతీయ చలనచిత్ర సాంకేతిక నైపుణ్యం ఎప్పుడూ ఒక దశాబ్దం వెనకే అని సినీ పండితుల అభిప్రాయం. హాలీవుడ్ లో ఔట్ డేట్ అయిన తర్వాత ఆ సాంకేతికత ఇండియాకు దిగుమతి అవుతుందని మా వీడియో టెక్నిషియన్స్ అనడం నేను విన్నాను. ఈ రకమైనటువంటి పొరపాట్లవలన, లోపాల వలన నిర్ణీత సమయంలో సక్రమంగా పని పూర్తికాదు.  అందువల్ల ఏర్పడే స్ట్రెస్,  స్ట్రైన్ కళాకారుల మీద చాలా తీవ్రంగా వుంటుంది. ఈ విధమైన ఒత్తిళ్ళు తట్టుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. 

ఒక సినిమాకు సంగీత దర్శకత్వం వహించి అనుకున్న సమయానికి నిర్మాత, దర్శకుల తృప్తిమేరకు పాటలను, రీరికార్డింగ్, మిక్సింగ్ లను పూర్తి చేయడమనేది  ప్రసవ వేదన అనుభవించడంలాటిది. ప్రతి మనిషి జీవితంలో ఏదో దశలో ఏవో అపశ్రుతులు ధ్వనిస్తూనేవుంటాయి. దానికి కారణం స్వయంకృతాపరాధాలు కావచ్చు, లేదా తన చుట్టూవుండే తనవారి పొరపాటు వల్ల కూడా కావచ్చు. కానీ అందువల్ల కలిగే దుష్ఫలితాలు ఆ మనిషి జీవితాంతం వెంటాడుతూనేవుంటాయి. ఆ మనిషిని అన్ని విధాలా భౌతికంగా, మానసికంగా కృంగదీస్తూనేవుంటాయి.

1972 సెప్టెంబర్ లో జరిగిన ఒక సంఘటన ఘంటసాలవారిని మనోవేదనకు గురిచేసింది. సుప్రసిద్ధ దర్శకుడు, నిర్మాత శ్రీ కె.వి రెడ్డిగారు కాలధర్మం చెందారు. విజయా  వాహినీ సంస్థల పురోభివృధ్ధికి ఎంతగానో శ్రమించిన వ్యక్తి. ఘంటసాలవారంటే సదా ఎంతో ప్రేమ,అభిమానం కనపరుస్తూ ఆయన సంగీత ప్రతిభను ఎంతగానో గౌరవించిన వ్యక్తి. కె.వి.రెడ్డిగారి ఇల్లు వెనక భాగం మాస్టారింటికి ఎదురుగానే వుండేది. ఇద్దరూ దాదాపుగా ఒకే సమయంలో రాత్రిపూట స్టూడియో నుండి ఇళ్ళకు చేరేవారు. కె.వి.రెడ్డిగారు పోయినరోజు  ఆ ఇంట్లోవారిని పరామర్శ చేయడానికి మాస్టారు వెళుతూ నన్ను కూడా వెంట తీసుకువెళ్ళారు. మేము వెళ్ళే సమయానికి బయటవాళ్ళెవరూ పెద్దగా కనపడలేదు. ప్రముఖ నటి వాణిశ్రీ ఉన్నారు. కె.వి.రెడ్డిగారి అబ్బాయిలలో ఒకరు రామకృష్ణ స్కూల్ లో సహధ్యాయే అయినా నేనెప్పుడూ నా చిన్నతనంలో వారింటికి వెళ్ళలేదు. ఒకరకమైన భయం. కె.వి.రెడ్డిగారు పిల్లల క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవారని చెప్పుకునేవారు. వారు సొంతంగా చిత్రనిర్మాణం మొదలెట్టి జయంతి పిక్చర్స్ బ్యానర్ మీద 'పెళ్ళినాటి ప్రమాణాలు' తీస్తున్న రోజులలో ఆ ఆఫీసుకు అప్పుడప్పుడు వెళుతూ అక్కడ ఆయనను దూరం నుండి చూసేవాడిని. ఆ  మొదటి సినీమాకు ఘంటసాల మాస్టారే సంగీత దర్శకత్వం వహించారు. మా నాన్నగారు సహాయకుడు. కొన్నిపాటలకు వీణ కూడా వాయించారు. మా నాన్నగారు ఎన్నో కంపెనీలకు అసిస్టెంట్ గా పనిచేసినా ఒక్క కె.వి.రెడ్డిగారి జయంతి బ్యానర్లో మాత్రమే  ఆ సినీమా అయినన్నాళ్ళు అదనంగా నెల జీతం క్రింద కొంత పైకం ఇచ్చేవారు. అదెన్నడూ మరచిపోలేను.  ఇంట్లోగానీ, బయటగానీ ఎటువంటి చెడువార్తలు విన్నా ఘంటసాలవారు అమితంగా చలించిపోయేవారు. ఇంటికి ఎదురుగా వుండే చిరకాల సన్నిహితుడు కె.వి.రెడ్డిగారు పోవడం ఘంటసాల మాస్టారికి ఎంతో ఆవేదన కలిగించింది.

ఘంటసాలవారు ఏభైవపడి చేరేసరికి మనిషిలో వృధ్ధాప్య ఛాయలు, వైరాగ్య ధోరణి కనపడసాగాయి.  వంశపారంపర్యంగా వస్తున్న మధుమేహ వ్యాధి వారికి తమ 33వ ఏటనే సంక్రమించింది. అది అంతకుముందే ఎప్పటినుండి వుండేదో తెలియదు. ఈరోజుల్లోలా ఆనాడు ఇళ్ళలో గ్లూకోమీటర్లు, బిపి చెకింగ్ మీటర్లు అందుబాటులో వుండేవికావు. యూరిన్ టెస్ట్ లు చేసుకోవడానికి తగినంత సమయమూ దొరికేదికాదు. బిపి, సుగర్ లు రెండూ బాగా పెరిగిపోయాయి. ఎప్పుడూ అరికాళ్ళ మంటలతో బాధపడేవారు. రికార్డింగ్, రీరికార్డింగ్ సమయాలలో గంటల తరబడి నిలబడే వుండవలసి వచ్చేది. దానితో కాళ్ళమంటలు మరింత ఎక్కువయేది. ఇంటికీ రాగానే తమ్ముడు కృష్ణగానీ , సావిత్రమ్మగారు గానీ అరికాళ్ళకు కర్పూరం వేసిన నూనెతో మర్దనా చేస్తే కొంత సర్దుకునేది.

మిగిలిన రంగాలతో పోల్చి చూస్తే ఆనాడు సినీమావాళ్ళకు ఆహారం విషయంలో కంట్రోల్ వుండేదికాదు. నిర్ణీత సమయానికి భోజనం, నిద్ర వుండేవికావు. ఇవన్నీ కూడా మనిషి ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా ఎంతో జాగ్రత్త అవసరం. మనిషికి 45 ఏళ్ళ వరకూ మంచి రెసిస్టెన్స్ పవర్ వుంటుంది. ఆ వయసులో ఎలాటి ఆహారనియమాలు పాటించకపోయినా మనిషి దృఢంగానే వున్నట్లు కనిపిస్తాడు. అక్కడనుండే ఆరోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. ఘంటసాల మాస్టారు రుచికరమైన ఆహార పదార్ధాల విషయంలో నిగ్రహం పాటించలేకపోయేవారు.  చిన్నవయసులో ఎలాగూ సరైన తిండికి నోచుకోలేదు, ఇప్పుడు బాగా సంపాదిస్తున్న కాలంలో కూడా సుష్టుగా భోజనం చేయకపోతే ఎలా అనేవారు. సాధారణంగా డైబెటిక్స్ అందరూ తీపి పదార్ధాలకు లోబడిపోతారు. ప్రముఖ హాస్యనటుడు రేలంగి గారు కూడా ఇదే మనోస్థితిలో వుండేవారు. చిన్న వయసులో రాళ్ళనైనా హరాయించుకోగల శక్తి వున్నప్పుడు చేతిలో పైసలు లేక అన్నంకోసం మొహంవాచి మంచినీళ్ళతోనే ఆకలితీర్చుకోవలసి వచ్చింది. నాలుగు డబ్బులు సంపాదించి హాయిగా కడుపునిండా తిందామనుకునేసరికి రకరకాల జబ్బులు ఒంటిని పట్టి కావలసినవి తినడానికి నోచుకోలేకపోతున్నాని ఎన్నోసార్లు అందరితో చెప్పి బాధపడేవారు. సుగర్, బిపి రెండూ ఆప్తమిత్రులు. ఎవరికైనా ఒకటుంటే పక్కనే రెండోదికూడా వచ్చి చేరుతుంది. ఈ రెండూ వుంటే మిగిలిన వ్యాధులు ఒక్కొక్కటే కాలక్రమేణా బయటపడతాయి. అందులోనూ ఘంటసాల మాస్టారు కృష్ణాజిల్లా వ్యక్తి. ఆహార పదార్థాలు అన్నిటిలో ఉప్పు కారాలు మరీ మితిమీరకపోయినా బాగానే పడేవి. సావిత్రమ్మగారి నేతృత్వంలో తయారైన రకరకాల ఆవకాయలు, కొరివికారం, దోసావకాయ వంటి ఊరగాయలు సంవత్సరం పొడుగునా వుండేవీ. చిరకాలం నిల్వ వుండే ఊరగాయలు కావాలంటే ఘాటైన గుంటూరు మిరపకాయలు, అక్కడి సన్న ఆవాలు, శుధ్ధమైన నువ్వులనూనె మాత్రమే ఉపయోగించాలని ఊరగాయ శాస్త్రాలు ఘోషిస్తాయి. ఈనాడు మనకు షాపుల్లో దొరికే ఊరగాయలన్నింటిలో వినిగర్ వంటి ప్రిసర్వేటివ్స్ వేసేస్తారు. దానివలన  మామిడికాయ, నిమ్మకాయ, ఉసిరికాయ, టొమేటొ, గోంగూర ఇలా ఏ ఊరగాయ చూసినా అన్నిటి రుచులు ఒక్కలాగే వుంటాయి. ఒకదానికొకటి తేడానే తెలియదు. షాపుల్లో దొరికే ఊరగాయలు తెలుగువారి ఊరగాయ సంస్కృతిని ముమ్మాటికి ప్రతిబింబించవు. ఏభై అరవై ఏళ్ళ క్రితం మన బామ్మలు, అమ్మమ్మలు పెట్టే ఊరగాయలు, సీమమిరప పొడి కలిపిన అప్పడాలు, ఒడియాలు ఈనాడు ఏ ఇంటా కనపడవు.  శాస్త్రోక్తంగా నిబధ్ధతతో ఇంట్లో  ఊరగాయలు పెట్టే ఓపికగానీ, తిని హరాయించుకునే ఆరోగ్యాలు కానీ ఈకాలంలో  ఎవరికీ లేవు. ఆనాటి ఆహారపు సంస్కృతే వేరు.

సినీమా రంగంలో అడుగుపెట్టి రెండున్నర దశాబ్దాలుగా  సినీ సంగీత సామ్రాజ్యంలో  మధురగాయకుడిగా, విశిష్ట సంగీతదర్శకుడిగా కీర్తి పొంది మకుటంలేని మహారాజుగా తెలుగువారందరిచేతా నీరాజనాలు పట్టించుకున్న ఘంటసాల మాస్టారికి నిరంతరంగా కాకపోయినా తగిన విశ్రాంతి పొందేలా తగు మార్పులు చేసుకోవాలని ఆశించారు. వయోధర్మానికి తగిన మంచి సాహిత్యం గల పాటలేవైనా తనకు వస్తే మాత్రమే పాడాలని, ఆకతాయి అల్లరి చిల్లరి పాటలు, ద్వంద్వార్ధాల పాటలు పాడకూడదని, బాగా పాడే కొత్త కుర్రాళ్ళను తన పరిధులమేరకు ప్రోత్సహించాలని అనుకునేవారు. ఘంటసాలవారు మొదటినుండీ లైట్ మ్యూజిక్ కచేరీలతో పాటు ఫక్తు కర్ణాటక సంగీత కచేరీలు దేశవ్యాప్తంగా చేయాలని ఆశపడేవారు. కానీ ఆ ఆశ ఆశగానే మిగిలిపోయినందుకు బాధపడేవారు. గాయకుడిగా సినీమా టెక్నిక్ వేరే, కర్ణాటక సంగీత బాణీ వేరే. రెండింటిని సమన్వయ పర్చి సమన్యాయం చేకూర్చడం అంత సులభమైన పనికాదు. శాస్త్రీయ సంగీత కచేరీ చేయడానికి చాలా సాధన అవసరం.  నిరంతరం ఏవో వ్యాపకాలతో క్షణం తీరికలేని ఘంటసాల మాస్టారికి అంత సమయం వుండేది కాదు. తాను ఎంత వద్దనుకున్నా నిర్మాతల ఒత్తిడిని, ఆదరాభిమానాలను  త్రోసిపుచ్చలేక అన్ని రకాల పాటలు చివరివరకూ పాడుతూనే వచ్చారు. ఎప్పుడైతే శరీరం విశ్రాంతి  కోసం తొందరచేస్తున్నదో అప్పుడే ఆయన తన జీవితంలో సార్ధకత చెందే, చిరస్థాయిగా అందరి  మన్ననలు పొందే ఉత్తమ కార్యం ఏదైనా చేసి సినీమా రంగం నుండి విశ్రాంతి పొందాలనే దృఢ నిశ్చయానికి వచ్చారు.  గాయకుడిగా సార్ధకత చెందే కార్యం ఏదని తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో ఘంటసాలవారికి లతామంగేష్కర్ గారి భగవద్గీత గుర్తుకు వచ్చింది.  ఆవిడ భగవద్గీత కు భిన్నంగా పండిత పామరులంతా విని,  దాని సారాంశం అర్ధం చేసుకొని ఆనందించే రీతిలో రూపొందించాలని తీర్మానించారు. 
 
అందుకు గానూ ఘంటసాలవారు ...
ఏం చేసారో ఎలా ముందుకు సాగారో
వచ్చేవారం 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో...

                   ... సశేషం

Sunday, January 23, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవై ఐదవ భాగం

23.01.2022 - ఆదివారం భాగం - 65*:
అధ్యాయం 2 భాగం 64 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1970లో ఘంటసాలవారికి భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' బిరుదుప్రదానం చేసింది. ఆ మరుసటి నెల ప్రారంభంలోనే ఆయన సినీ జీవిత రజతోత్సవం సినీమా ప్రముఖుల, రాజకీయ నేతల సమ్మేళనంతో హైదరాబాద్ లో అతివైభవంగా జరిగింది. ఆ మరుసటి సంవత్సరం అదే హైదరాబాద్ లో సుప్రసిధ్ధ హిందీ నేపధ్యగాయని లతామంగేష్కర్ ఆధ్వర్యంలో ఘంటసాలవారి సంగీత కచేరీ, వారికి ఘన సన్మానం జరిగింది. తన తండ్రిగారి పేరు మీద ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక 'దీనానాధ్ మంగేష్కర్' పురస్కారాన్ని ఘంటసాలవారికి ఇచ్చారు. ఆ సందర్భంగా లతామంగేష్కర్ తాను గానం చేసిన 'భగవద్గీత' ఎల్.పి.రికార్డులను ఘంటసాల మాస్టారికి బహుకరించారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గాయని చేతుల మీదుగా ఒక ఉత్తమ పురస్కారం అందుకోవడం ఘంటసాలవారికి చాలా ఆనందం కలిగించింది.

లతామంగేష్కర్ భగవద్గీత ఘంటసాల మాస్టారి మరో నూతన ఆశయానికి బీజం వేసింది. 1972 వచ్చేసరికి తెలుగు సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయి కొత్త కొత్త నటీనటులు రాసాగారు. నూతన సంగీత దర్శకులు అవకాశాలు పొందసాగారు. సాంకేతికంగా కూడా మార్పులు చోటుచేసుకోవడం ప్రారంభమయింది. కలర్ సినిమాలు ఎక్కువైనాయి. చిత్రనిర్మాణం అధికమయింది. ఈ రకమైన నూతన పరిణామాలు సంగీత రంగంలోనూ కనిపించాయి.  సంగీత సరళి మారుతూ వచ్చింది. మల్టీ ఛానల్ రికార్డింగ్ సిస్టమ్ వచ్చింది. దానితో లైవ్ రికార్డింగ్ తో పాటూ ట్రాక్ మిక్సింగ్ సౌకర్యాలు ఎక్కవయాయి.  ట్రాక్ సింగర్స్ కు కొత్త జీవనోపాధి కలిగింది. ఆర్కెస్ట్రేషన్ లో కూడా ధ్వని ప్రధాన వాద్య పరికరాల ప్రాముఖ్యత పెరిగింది.

1972లో ఓ 25 సినీమాలలో ఘంటసాల మాస్టారు దాదాపు నూరు పాటలు, పద్యాలు పాడారు.  వాటిలో ముఖ్యమైనవి - భార్యాబిడ్డలు, సంపూర్ణ రామాయణం, వంశోవధ్ధారకుడు, మంచోరోజులొచ్చాయి, శ్రీకృష్ణాంజనేయ యుధ్ధం, దత్తపుత్రుడు, మేనకోడలు, పండంటి కాపురం, విచిత్రబంధం, కులగౌరవం, బడిపంతులు, కాలంమారింది, బాలభారతం, కొడుకు కోడలు, వంటి చిత్రాలలో పాడిన పాటలు ఘంటసాలవారికి మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఈ నాటీకీ ఆ పాటలు ప్రచారంలోనే వున్నాయి. 

ఆ సంవత్సరంలో ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు  రెండు. అవి - వంశోధ్ధారకుడు, మేనకోడలు, మొదటి చిత్రంలో శోభన్ బాబు , రెండవచిత్రం లో కృష్ణ హీరోలు. వంశోధ్ధారకుడు సినీమా మాధవీ ప్రొడక్షన్ ఆంజనేయులుగారిది. ఈ చిత్రంలోని 'నువ్వు నవ్వు జతగా', 'నానీ నా పేరును నిలపాలి' పాటలు అందరినోటా వినిపించాయి.

నానీ నా పేరును నిలపాలి - వంశోద్ధారకుడు

ఈ 'నానీ నా పేరును నిలపాలి' పాటను తననుద్దేశించే పాడినట్లుగా భావించుకుంటూ ఘంటసాలవారి రెండవ కుమారుడు ఘంటసాల రత్నకుమార్ తన ప్రతీ సంగీత కార్యక్రమంలో ఈ పాటను పాడుతూ తండ్రిగారిని గుర్తుచేసుకునేవాడు. ఘంటసాలగారు మాధవీ ప్రొడక్షన్స్ కు చేసిన ఆఖరి చిత్రం ఇదే. 

మేనకోడలు చిత్రంలో దాశరధి వ్రాసిన ' 'తిరుమల మందిర సుందరా' పాట ఘంటసాలవారికి గాయకుడిగా , సంగీతదర్శకుడిగా మంచిపేరునే తెచ్చిపెట్టింది. సినీమాలో ఈ పాటను సుశీలగారు పాడగా జమున మీద చిత్రీకరించారు. 

తిరుమల మందిర సుందరా - మేనకోడలు

తిరుపతి వెంకటేశ్వరుడికి సంబంధించిన గీతం కావడం వలన ఇదే పాటను ఘంటసాలగారు కూడా పాడేందుకు ఆసక్తి చూపారు. ఆ పాటను సినీమాతో సంబంధం లేకుండా  రికార్డు చేసి విడుదల చేసారు. ఈనాటికీ ఆ  రెండు పాటలు  అందరూ పాడుతూనే వున్నారు. 1960లకు ముందెప్పుడో పాడిన 'ఏడుకొండల సామీ ఎక్కాడున్నావయ్యా' మొదలుకొని 'తిరుమల మందిర సుందరా' వరకు తిరుపతి వేంకటేశ్వరుని మీద ఘంటసాల వెంకటేశ్వరుడి గానాభిషేకం కొనసాగుతూనే వచ్చింది.  నాటి నుండి నేటివరకూ ఆ భక్తి సంగీతామృతంతో తెలుగు శ్రోతలంతా పరవశత్వం చెందుతూనే వున్నారు.

సుప్రసిధ్ధ దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి నారాయణ రావు గారు, ఘంటసాలగారు కలసి పనిచేసిన ఏకైక చిత్రం మేనకోడలు. దాసరి నారాయణరావుగారు ఈ చిత్రానికి సహాయ దర్శకుడు. డైరెక్టర్ బి.ఎస్.నారాయణగారికి అసిస్టెంట్. ఆ హోదాలో ఆయన పాటల కంపోజింగ్ సమయంలో మాస్టారిని కలసి సన్నివేశాల గురించి క్షుణంగా వివరించేవారు. దాసరి కథ, సన్నివేశం చెప్పే తీరుకు, అత్యుత్సాహానికి ఘంటసాలవారు ముచ్చటపడి ఆసక్తిగా వినేవారు.   ఈ సినీమా విడుదలకు ముందే దాసరి దర్శకత్వంలో 'తాతా మనవడు' చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. రాజబాబును హీరోను చేసింది. ఈ రెండు సినీమాలు 1972 లోనే రిలీజ్ అయాయి. మేనకోడలు తర్వాత దాసరి నారాయణరావు, ఘంటసాల కలయిక లో మరే సినీమా రాలేదనే అనుకుంటున్నాను.

1972 లో రిలీజైన వంశోధ్ధారకుడు, మేనకోడలు చిత్రాల తర్వాత ఘంటసాల మాస్టారి చేతిలో రామవిజేతా వారి 'రామరాజ్యం' తప్ప వేరే సినీమాలు లేవు. గౌతమీ రామబ్రహ్మంగారు, లలితా శివజ్యోతి శంకరరెడ్డిగారు, టి.గోపాలకృష్ణగారి సినీమాలు రావచ్చని అనుకునేవారు. 

గౌతమీ రామబ్రహ్మంగారు ఆలీబాబా 40 దొంగలు చిత్రం తర్వాత ఒక క్రైమ్ సబ్జెక్ట్ మొదలెట్టారు. కారణాలేమిటో నాకు తెలియవు కానీ, ఆ సినిమాకు సంగీత దర్శకుడిగా సత్యంగారిని నియమించుకున్నారు. ఎవరు ఎవరిని సంగీతానికి పెట్టుకున్నా, ఆయనే వద్దంటే తప్ప, పాటలు పాడించుకోవడానికి ఘంటసాల మాస్టారి వద్దకే రావాలి.  ఆనాటికి నూతనగాయకుల ఉనికి అంతంతమాత్రంగానే వుండేది.

ఘంటసాలవారు సంగీత దర్శకత్వం చేయకపోతే ఇబ్బందులపాలయేది మా నాన్నగారిలాటి ఒకరిద్దరు మాత్రమే.

టి.గోపాలకృష్ణగారు 'వస్తాడే మా బావ' చిత్రానికి ప్రారంభోత్సవం చేసి మాస్టారి చేత కంపోజింగ్ మొదలెట్టారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వ్రాసిన పాట 'వాగూ ఓ కొండ వాగూ' అనే పి.సుశీలగారితో పాడిన  యుగళగీతం మాత్రం మాస్టారు రికార్డు చేసారు. తర్వాత నిర్మాణ కార్యక్రమాలు అంత చురుకుగా సాగలేదు. 

వాగు ఓ కొండవాగు - వస్తాడే మా బావ

రహస్యం' అపజయం తర్వాత మరో సినీమా మొదలెట్టడానికి శంకరరెడ్డి గారికి మరో ఐదేళ్ళు పట్టింది. ఆయన సినీమాలన్ని భారీగా పంచవర్ష ప్రణాళికలా తాపీగా సాగుతాయి. ఈసారి ఆయన ఒక పౌరాణిక వర్ణచిత్రం మొదలెట్టారు. అదే 'సతీ సావిత్రి' . విభిన్న తరహా పాత్రలంటే మోజుపడే ఎన్.టి.ఆర్ ఈ చిత్రంలో యమధర్మరాజు. వాణిశ్రీ, సావిత్రిగా, కృష్ణంరాజు సత్యవంతుడిగా నటిస్తారని తెలిసింది. ఘంటసాల మాస్టారే సంగీతం. అయితే ఈ సినీమాలలోని పాటలేవీ వెంటవెంటనే రికార్డ్ చేయబడలేదు. మధ్యమధ్యలో మాస్టారికి సైనస్ కారణంగా చిన్న చిన్న అనారోగ్యాల వలన  ఎప్పుడు  ఏ పనులుంటాయో తెలియని స్థితి ఏర్పడింది. సతీ సావిత్రి సినిమా కోసం ఓ రెండు పాటలను ఒక శ్లోకాన్ని ఘంటసాలమాస్టారు కంపోజ్ చేసివుంచారు. బయటవూళ్ళ కచేరీలు కూడా ఏవీ వుండేవి కావు. 

ఇటువంటి ఇబ్బందికర సమయంలో మా నాన్నగారు జీవనోపాధికి మార్గాలు ఇతరత్రా, ఘంటసాలవారి అనుమతితోనే, అన్వేషించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలో జరిగే తమ కూచిపూడి నాట్య కార్యక్రమంలో పాడడానికి  రమ్మని డా.వెంపటి చిన సత్యం కోరారు. అప్పటికి రికార్డింగ్ పనులేవి లేక,  ఆయన మాటను కాదనలేక  వారి బృందంతో ఢిల్లీ వెళ్ళి మొదటిసారిగా నృత్యకార్యక్రమంలో పాడారు. ఘంటసాలవారి దగ్గర సహాయకుడిగా చేరిన తర్వాత ఇతరుల వద్ద పనిచేయడం అదే మొదటిసారి. మా నాన్నగారు ఢిల్లీ వెళ్ళి వచ్చేసరికి 'సతీ సావిత్రి' కోసం కంపోజ్ చేసిన పాట 'ఓం నాదబిందు కళాధరీ' పాట ' శ్రీవాగ్దేవీ మహాకాళీ' శ్లోకం  రికార్డింగ్ పూర్తి అయపోయింది. 

నాద బిందు కళాధరీ - సతీ సావిత్రి

ఆ రికార్డింగ్ లలో పాల్గొనే అవకాశం మా నాన్నగారు కోల్పోయారు. ఆ తర్వాత ఆ సినీమా నిర్మాణ కార్యక్రమాలు మూలబడ్డాయి. 

ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని తాను చేయాలనుకున్న బృహత్ ప్రణాళిక గురించి ఘంటసాల మాస్టారు తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టారు.

ఆ విశేషాలేమిటో వచ్చే వారం చూద్దాము ... 
                                ...సశేషం

Sunday, January 2, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవైనాలుగవ భాగం

02.01.2022 - ఆదివారం భాగం - 64:

అధ్యాయం 2  భాగం 63 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్


"ఏ దేశమేగినా ఎందు కాలిడినా... పొగడరా నీ తల్లి భూమి భారతిని"

1971 అక్టోబర్ 9న వెస్ట్ జర్మనీ చేరిన ఘంటసాలవారి బృందం తమ  విదేశీయానంలోని మొదటి సంగీత కచేరీని పదవ తారీఖున గొటింజెన్ నగరంలోని పెడగోగియా ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో జరిపారు. జర్మన్ శ్రోతలే అధిక సంఖ్యలో హాజరయి ఘంటసాలవారి సంగీతాన్ని ఆద్యంతం ఆస్వాదించి ఆనందించారు. భాష తెలియకపోయిన భారతీయ సంగీతంలోని భావం, శ్రుతి లయలు, ఘంటసాలవారి గాత్రంలోని మార్దవం, గంభీరత అక్కడి శ్రోతలనెంతో ఆకట్టుకున్నాయి. అనుకున్న సమయం కంటే ఎక్కువసేపు కచేరీ జరిపారట. ఈ సంగీత కచ్చేరీ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఒక సత్కార్యం కోసం ఉపయోగించారు.

ఈస్ట్ పాకిస్థాన్ నుండి తరలివచ్చిన శరణార్ధుల సంక్షేమం కోసం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి తమ విరాళంగా కార్యనిర్వాహకులు, ఘంటసాల బృందం సమర్పించడం అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. స్వదేశంలోనే కాక విదేశాలలో కూడా ఘంటసాలవారు తన ఔదార్యాన్ని సత్కార్యాలపట్ల తనకు గల భక్తి శ్రధ్ధలను చాటిచూపారు. అక్కడ ఘంటసాలవారికి జర్మన్ సంగీతాభిమానులు ఏర్పడి తర్వాత కాలంలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. ఘంటసాలవారి బృందం గొటింజెన్ నుండి ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళేప్పుడు అనేకమంది జర్మన్ విద్యార్ధులు రైల్వే స్టేషన్ కు వచ్చి ఉత్సాహంగా వీడ్కోలు చెప్పి ఘంటసాలవారి ని తిరిగి జర్మనీలో పాడాలని మరీమరీ కోరారట. అలాగే ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్ పోర్ట్ లో కూడా అధిక సంఖ్యలో అక్కడి భారతీయులు వచ్చి వీడ్కోలు పలకడం, తన తొలి విదేశీ కచేరీ ఎటువంటి అవాంతరాలు లేకుండా దిగ్విజయం గా జరగడం ఘంటసాలవారికి, ఇతర బృందానికి ఎంతో ఆనందం కలిగించింది.

ఫ్రాంక్ఫర్ట్ నుండి లండన్ వచ్చిన ఘంటసాల మాస్టారికి, వారి బృందానికి శ్రీమతి టంగుటూరి సూర్యకుమారిగారు  తన మిత్రులతో వచ్చి ఘనస్వాగతం ఇచ్చారు. అక్టోబర్ 11న లండన్ లో శ్రీమతి సూర్యకుమారి నిర్వహిస్తున్న నృత్య కళాశాలలో ఘంటసాలవారి గౌరవార్థం ఒక అభినందన సభను, సంగీత కచేరీని ఏర్పాటు చేశారు.  ఆ సభకు సంగీత నృత్యాభిమానులే హాజరు కావడం వలన వారంతా  భారతీయ సంగీతాన్ని గురించి కొంత అవగాహన కలిగినవారే కావడంతో వారంతా ఘంటసాలవారి సంగీతం వారిని అమితంగా ఆకర్షించింది. పదే పదే అడిగి మరీ పాడించుకున్నారట. అక్కడి వారి సంగీతాభిలాషకు, ప్రశంసలకు ఘంటసాలవారు ఎంతగానో చలించిపోయారట. తరచూ లండన్ వచ్చి మరింత పెద్ద బహిరంగ స్థలాలలో పాడాలని మరీ మరీ కోరడం ఘంటసాలవారి కి రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించింది. లండన్ లో తనకు, తన వాద్య బృందానికి లభించిన ఆదరణతో పొంగిపోయిన ఘంటసాలవారు రెట్టింపు ఉత్సాహంతో యునైటెడ్ స్టేట్స్ వేపు పయనించారు. ఈ పర్యటనలో అధిక సంఖ్యలో కచేరీలు ఏర్పాటు అయినవి యునైటెడ్ స్టేట్స్ లోనే. 

ఘంటసాలవారు తమ విదేశీ పర్యటనలో ఎటువంటి సంగీతాన్ని వినిపించాలనే విషయంలో చాలా స్పష్టంగానే వున్నారు. భారతీయ సంగీతం, ముఖ్యంగా మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే కర్ణాటక, హిందుస్థానీ సంగీత రీతులలో చేయబడిన గీతాలను, లలిత, శృంగార, జానపద రీతులలో బహుళ జనాదరణ పొందిన తెలుగు చిత్రగీతాలను,  అన్నమయ్య, జయదేవ, రామదాసు భక్తి సంగీత గీతాలను తన విదేశీ కచేరీలలో సమయ సందర్భాలననుసరించి గానం చేశారు. వివిధ ప్రక్రియలతో కూడిన ఘంటసాలవారి సంగీతం వారు వెళ్ళిన ప్రతీ స్థలంలోనూ అక్కడి సంగీతాభిమానులను విశేషంగా ఆకర్షించింది. అలాగే  తన వాద్యబృందంలోని సితార్ జనార్దన్, ఫ్లూట్ నంజప్ప, సంగీతరావు హార్మోనియం, ప్రసాద్-మురుగేశన్ల తాళ వాద్య ప్రతిభ రసజ్ఞుల మెప్పులను, ప్రశంసలందుకున్నట్లు చెప్పారు. 

ఈ బృందానికి మరొక ముఖ్య ఆకర్షణ నేరెళ్ళ వేణు మాధవ్ గారి మిమిక్రి. మన తెలుగు, హిందీ నటుల, గాయకుల గాత్రాలనే కాక హాలీవుడ్ నటుల గాత్రాలను అనుకరించి  బెన్ హర్ , టెన్ కమాండ్మెంట్స్, క్లియోపాట్రా  వంటి భారీ చిత్రాలలో వచ్చే యుధ్ధ సన్నివేశాలలోని వినవచ్చే డైలాగ్స్, వాద్యాల ధ్వనులను ఏకకాలంలో పలికించి  వెళ్ళిన చోటల్లా విదేశీ ప్రేక్షకులను ఆశ్చర్యసంభ్రమాలలో ముంచెత్తేవారని చెప్పేవారు. 

🌅

1971 అక్టోబర్ 31న ఘంటసాల మాస్టారు తన బృందంతో న్యూయార్క్ చేరుకున్నారు. ఘంటసాలవారి నార్త్ అమెరికా పర్యటనను పురస్కరించుకొని అక్కడి స్టూడియోలో మాస్టారి తొలి పలుకులతో పాటు  మరో ఎనిమిది పాటలను పాడగా రికార్డ్ చేసారు. అవి తర్వాత లాంగ్ ప్లేయింగ్  " గోల్డెన్ రికార్డ్" గా  విడుదలయింది. ముందుగా, శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారి "ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గర్వమ్ము..."అన్న రాయప్రోలువారి మాటలను తలచుకుంటూ అమెరికాలోని తెలుగు సోదరులకు ఆవేశపూరితమైన స్ఫూర్తిని కలుగజేశారు. 

"అమెరికాలో ఉన్న తెలుగువారికి ఘంటసాలవారి సందేశం" 

ఆ తర్వాత పాడిన ఎనిమిది గీతాలు తన స్వంత స్వర రచనలో చేసిన పాటలనే ఎన్నుకున్నారు.  ఇతర సంగీత దర్శకుల పాటలేవీ ఈ రికార్డ్ లో లేకుండా చూసి జాగ్రత్త వహించారు.  ఆ గోల్డెన్ రికార్డ్ ఒక ప్రక్క - *వినాయక చవితి చిత్రం నుండి తన ఫేవరిట్ గీతం 'దినకరా శుభకరా',

"దినకరా శుభకరా"

*జయదేవుని అష్టపది 'యారమితా వనమాలినా', 

"యారమితా వనమాలినా"

*అన్నమాచార్యులవారి 'కొలనిదోపరికి గొబ్బిళ్ళో,

"కొలని దోపరికి గొబ్బిళ్ళో"

*కంచెర్ల గోపన్న( భక్త రామదాసు) గారి 'నను బ్రోవమని చెప్పవే' పాటలు వున్నాయి. 

"నను బ్రోవమని చెప్పవే"

అదే రికార్డ్ లో రెండవ ప్రక్క - *త్యాగరాజకీర్తన 'చలమేలరా సాకేతరామా', *జరిగిన కథ' చిత్రంలోని 'భలేమంచి రోజు', *'నిర్దోషి' చిత్రంలోని 'సింగారి చెకుముకి రవ్వ',

"సింగారి చెకుముకి రవ్వ"

*'బ్రతుకు తెరువు' లోని 'అందమె ఆనందం' పాటలు వున్నాయి.

వినాయక చవితి సినిమా విడుదలైన నాటినుండి తన ఆఖరి కచేరీ వరకూ ప్రతీసారి తన కచేరిని 'దినకరా శుభకరా' తో ప్రారంభించి 'బ్రతుకు తెరువు' లోని 'అందమె ఆనందం' పాటతో ముగించేవారు. ఈ మధ్యలో మరెన్నో పాత,  కొత్త సినీమా పాటలు పాడినా ఈ రెండు పాటలు లేకుండా వారి కచేరీ ఏది జరగలేదు. ఆ సంప్రదాయాన్నే ఘంటసాల మాస్టారు అమెరికాలో కూడా అనుసరించారు.

"రాధికా కృష్ణా రాధికా"

అమెరికా, కెనడా దేశాలలోని ప్రముఖ నగరాలన్నింటిలో అక్టోబర్ 13 నుండి నవంబర్ 1వ తేదీ వరకు వరసగా దాదాపు పదిహేను కచేరీలు బహిరంగ స్థలాలోను, స్థానిక  భారతీయుల గృహాలలోనూ చేసి ఘంటసాలవారు అక్కడి భారతీయులందరికీ మరింత ఆప్తుడు, ఆత్మీయుడు అయ్యారు. 

"ఉలగే సమాదాన ఆలయమా"

వారంతా ఘంటసాలవారిని, వారి బృందాన్ని చిరుకానుకలతో సత్కరంచారు. 

ఘంటసాలవారి బృందం తొలిసారిగా విదేశాలంటే వెళ్ళింది కానీ ఆ పర్యటన లో వారెవరికీ తగినంత ఫారిన్ కరెన్సీ లభ్యపడలేదు. ఒక్కొక్క సభ్యుడికి కేవలం ఎనిమిది డాలర్లు మాత్రమే ఇచ్చారు. ఆ ఎనిమిది డాలర్లతో ఆ యా దేశాలలోని వింతలే చూస్తారా ? లేక ఆనాటికి ఇండియా లో దొరకని అపురూప వస్తవులే కొంటారా ? వెళ్ళినచోట్లలోని వింతలు విశేషాలు చూసి ఆనందించడం వరకే వీరంతా చేయగలిగారు. అయితే అక్కడి కళాభిమానులు కొందరు బృంద సభ్యులకు విడివిడిగా తమకు తోచినంత డాలర్ల రూపంలో ఇచ్చి సహకరించారు. అలాంటి కానుకలతో ఏవో చిన్న చిన్న వస్తువులు  ఇండియా లోని తమవారికోసం కొనుక్కోగలిగారు.  స్థానిక నిర్వాహకులు వీరందరినీ నయగారా ఫాల్స్, డిస్నీలాండ్, రేడియో హాల్   వంటి ఎన్నో పర్యాటక కేఃద్రాలను సందర్శించే ఏర్పాట్లు చేసారు. నిర్దిష్టమైన ప్రణాళికలతో ఎక్కడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఘంటసాలవారి విదేశీ పర్యటన జరగడానికి అందరూ కలసికట్టుగా కృషిచేసారు.  ఈ దేశాలలో జరిగిన ప్రతీ సంగీత కచేరీ విదేశీ శ్రోతలకు, మన భారతీయులకు చాలా తృప్తిని కలిగించింది. వారందరూ కూడా ఘంటసాలవారు మరల మరల తమ దేశాలలో సంగీత కచ్చేరీ చేయాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా ప్రశంసలందించారు. 

ప్రపంచ దేశాల దౌత్య ప్రతినిధులతో  నిండిన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో తమ ప్రతిభను చాటుకునే అవకాశం అతికొద్దిమందికే లభిస్తుంది. అటువంటి అరుదైన  గొప్ప అవకాశం ఘంటసాల మాస్టారికి, ఆయనతో వున్న కళాకార బృందానికి  లభించింది. UNO లో జరిగిన ఘంటసాలవారి కచ్చేరికి దేశదేశాల ప్రతినిధులంతా విచ్చేసి వారి అద్భుత గానాన్ని విని ఆనందించారు. ఘంటసాలవారి గాన ప్రతిభను ప్రశంసిస్తూ వారికి అతి ప్రతిష్టాత్మకమైన  'శాంతి పతకం' బహుకరించారు.  వాద్యబృందాన్ని కూడా సముచితంగా సత్కరించి కానుకలు అందజేశారు. ఈ సంఘటన తన జీవితంలో మరువలేని మధురక్షణంగా ఘంటసాలవారు భావించేవారు. యునైటెడ్ స్టేట్స్ లో ఆఖరుగా నవంబర్ ఒకటవ తేదిన  న్యూయార్క్ లోని తెలుగు సాంస్కృతిక సంఘంవారు ఘంటసాలవారికి, వారి  వాద్యబృందానికి ఒక ఘనమైన సన్మాన సభ ఏర్పాటు చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. అమెరికాలో జరిగిన ఘంటసాల వారి కచ్చేరీలు అన్నింటికి స్థానిక భారతీయులే కాక మూడు వందలు,  నాలుగువందల మైళ్ళ దూరంలో వున్న తెలుగువారంతా తమ కుటుంబ సభ్యులతో ఎంతో ఉత్సాహంతో వచ్చి విని ఆనందించారట.

నవంబర్ 1న పారిస్  బయల్దేరిన ఘంటసాలవారికి న్యూయార్క్ తెలుగువరాంతా ఎయిర్ పోర్ట్ కు వచ్చి ఘంటసాలవారికి, వారి బృందానికి ఘనమైన విడ్కోలు పలికారు. పారీస్ లో ఘంటసాలవారి కచేరీలు ఏవీ ఏర్పాటు చేయబడలేదు. కేవలం రెండురోజులు విశ్రాంతి, ఆ సమయంలో  ఈఫిల్ టవర్  వంటి ముఖ్యమైన పర్యాటక స్థలాలు సందర్శన కోసం మాత్రం కేటాయించారు. 

ఘంటసాలగారు ఏ దేశం వెళ్ళినా ఎంతటి ఉన్నత వ్యక్తులను కలసినా తన సహజ వేష భాషలను మార్చుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా తన తెల్ల లుంగీ, తెల్ల చొక్కాతోనే హుందాగా వెళ్ళేవారు. అలాగే కచ్చేరీలు చేసేప్పడు కూడా. సూటూ బూట్లతో వేదికల మీదకు వెళ్ళడమనేది ఆయనకు అలవాటులేదు. సశాస్త్రీయంగా వేదిక మీద కూర్చోనే తన సంగీత కచేరీలు చేసారు. మన సంస్కృతి సంప్రదాయాలను తూచ పాటించేవారు.

ఘంటసాలగారి వంటి అపురూప మధురగాయకుడిని చూడడానికి వచ్చేవారు వారిచేత పాడించక వదులుతారా? మాస్టారిని తమ తమ ఇళ్ళకు విందుకు ఆహ్వానించి వారిళ్ళలోనే చిన్నపాటి కచేరీలు చేయించారట. అభిమానుల సంతృప్తికోసం పాడేందుకు మాస్టారు ఎప్పుడూ సిధ్ధమే.

ఎయిర్ ఇండియా సంస్థలో శ్రీ డి.ఎన్.లింగం ఉన్నతాధికారిగా వుండేవారు. ఆయన, ఆయన మిత్ర బృందం అంతా కలసి  ఘంటసాలవారి కచ్చేరీని కువైట్ లో నవంబర్ 5 వ తేదీన ఏర్పాటు చేసారు. వారి విదేశీ పర్యటనలో ఇదే చివరి కచేరీ. కానీ దురదృష్టవశాత్తు వీరు బయల్దేరే సమయానికి పారీస్ లో దట్టమైన మంచు కురిసి విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సకాలానికి కువైట్ ఫ్లైట్ అందుకోలేక పోవడంతో కువైట్ కచేరీ కాన్సిల్ చేయవలసి వచ్చింది. నిర్వాహకులు , ఘంటసాల మాస్టారు చాలా నిరాశచెందారు.  కువైట్ లోని ఘంటసాలవారి అభిమానులంతా ఎయిర్ పోర్ట్ కు వచ్చి 5వ తేదీ రాత్రి బొంబాయి ఫ్లైట్ ఎక్కేంతవరకు వారితోనే వుండి ఉత్సాహంగా వీడ్కోలు పలికారు. కువైట్ వాసులకోసం మరల మరొకసారి పర్యటన జరపి సంగీత కచేరీ చేయాలనే ఘంటసాలవారి కోరిక మరింక నెరవేరలేదు.

కువైట్ నుండి బయల్దేరి మర్నాడు ఉదయానికి ఘంటసాలవారి బృందం బొంబాయి చేరుకున్నారు. 1971 నవంబర్ 6 మధ్యాహ్నానికి ఘంటసాలవారు, వారి బృందం సురక్షితంగా మద్రాస్ వచ్చి చేరారు. ఘంటసాలవారికి ఘన స్వాగతం పలకడానికి సినీ ప్రముఖులెందరో మద్రాస్ విమానాశ్రయానికి వచ్చారు.

పదిమంది సభ్యులతో అమెరికాలో లలిత సంగీత కచేరీ జరిపిన తొలి భారతీయ గాయకుడిగా ఘంటసాలవారి గురించి చెప్పుకునేవారు. విదేశాలలో తెలుగు సంగీతాన్ని వినిపించాలనే ఘంటసాల వారి కోరిక సాఫల్యం చెందింది. మాస్టారు కూడా చెప్పలేనంత ఆనందాన్ని పొందారు. 

"అందమే ఆనందం ఆనందమె జీవిత మకరందం"

ఇప్పుడు రోజులు మరిపోయాయి. విదేశాలలో పర్యటించడానికి ప్రతిభావ్యుత్పత్తుల అవసరమేలేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి తన గొంతు వినిపించే సౌకర్యాలు వచ్చేసాయి.

నాలుగు వారాల విదేశ యాత్ర ముగించుకు వచ్చిన ఘంటసాల మాస్టారు తన వృత్తి వ్యాపకాలు మొదలెట్టారు. తన కోసం ఎదురు చూస్తున్న నిర్మాతలకు ఒక్కొక్కరికీ కాల్షీట్లు ఇచ్చి తాను పాడవలసిన పాటల ట్రాక్ మిక్సింగ్ లకు, రికార్డింగులకు హాజరుకావడం మొదలెట్టారు.

ఆ విశేషాలన్నీ వచ్చే వారం 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో చూద్దాము.

              ...సశేషం