visitors

Sunday, September 15, 2013

వెలిగించని దీపాలు - దేవులపల్లి గీతాలు


వెలిగించని దీపాలు - దేవులపల్లి గీతాలు

గిరిజా కల్యాణం  గీతం తెలుగు చిత్రసీమ ప్రేక్షకులందరికీ పరిచయమే. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు రచించిన  యక్షగాన ప్రబంధం  ఇది. రహస్యం సినిమా నిర్మాణసంస్థ లలితా శివజ్యోతి ఫిలింస్ వారు. ఈ సినిమాకోసం ఇంకా చాలా పాటలు చిత్రించాలని అనుకున్నారు నిర్మాతలు. అందుకోసమే  దేవులపల్లి 
 వెంకట కృష్ణశాస్త్రిగారితో కొన్ని గీతాలు రాయించారు. వాటికి బాణీలు కట్టి రికార్డు కూడా  చేసారు  ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన ఘంటసాలగారు. కానీ  ఏ కారణం వల్లనో ఆ పాటలను రహస్యం చిత్రానికి  ఉపయోగించుకోలేదు. ఘంటసాలగారికి స్వరసహచరులుగా ఉన్న సంగీతరావుగారు ఆ గేయాలను తాను కూచిపూడి నృత్యరూపకాలకు సంగీత దర్శకత్వం వహించిన సమయంలో అర్థనారీశ్వరం అనే నృత్యరూపకానికి ఉపయోగించారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు రచించిన  ఆ పాటల్లో ఒకటి - భ్రమించు ముద్దు మోముతో.

అమ్మవారి గురించి వర్ణిస్తూ చిత్రించాలనుకున్న సందర్భం కోసం దేవులపల్లిగారు ఈ పాటను రచించారు.
భ్రమించు ముద్దుమోముతో
చలించు కుంతలాలతో
సుమించు లేత నగవుతో
రహించు గండపాణితో
విలాస నాట్యమాడు మాతృదేవికిన్
నమస్కృతుల్ నమస్కృతుల్
నమస్కృతుల్ 

ఈ పాటని ఘంటసాల గారు హమీర్ కల్యాణి రాగంలో స్వర పరిచారు. సంగీతరావుగారు దీన్ని  శ్రీ వెంపటి చినసత్యంగారి దర్శకత్వంలో రూపొందిన కూచిపూడివారి అర్థనారీశ్వరం నృత్య రూపకం కోసం ఉపయోగించారు. 

మరొక పాట-
ఈ పాటని ఈశ్వరుడి అర్థనారీశ్వర స్వరూపాన్ని వర్ణించేసందర్భంలో చేయాలనుకున్నారు. ఇది కూడా రికార్డు చేసారు కానీ ఉపయోగించుకోలేదు. ఈ పాటను ఘంటసాల గారు హంసధ్వని రాగంలో స్వరపరిచారు.
 మరొక గీతం - అఖిల లోకేశ్వరా అర్థనారీశ్వరా
పల్లవి          అఖిల లోకేశ్వరా అమర గంగాధరా
                   అహి హార అర్థనారీశ్వరా
                    అమృత కర కోటీర
                  అతిలోక సుందరా
                 అఘహరా అర్థనారీశ్వరా
చరణం           పులితోలు నీటుతో
                   వలువ వలెవాటుతో
                   చెలువొందు అర్థనారీశ్వరా
                   నిటల నయనమ్ముతో
                   నిడుద తిలకమ్ముతో
                   నెగడొందు అర్థనారీశ్వరా                                  “అఖిల లోకేశ్వరా అమర గంగాధరా
చరణం          వలకేల శరము
                 దాపల కేల సుమ శరము
                 వలెమించు అర్థనారీశ్వరా
                 తల్లివై  అలరింప తండ్రివై రక్షింప
                 ఏకమూర్తి ధరించు లోకేశ్వరా          
                 అర్థనారీశ్వరా....అర్థనారీశ్వరా...అర్థనారీశ్వరా.                  అఖిల లోకేశ్వరా అమర గంగాధరా                 
 చక్కని తెలుగు పదాలతో ఒక పాదంలో  శివమూర్తిని, మరొక పాదంలో గౌరిని
 వర్ణిస్తూ  దేవులపల్లిగారు ఎంత చక్కగా రచించారో ఈ   పాటని.

అర్థనారీశ్వర తత్వంలో రూపాన్ని వర్ణించడంతో పాటు వారిని జగన్మాతా పితరులుగా చూపించిన విధానం ఎంతో బావుంది.

ఇంకొక పాట
శివుడు తాండవమాడెనపుడూ.....

ఈ పాటను దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు  రచించారు. ఘంటసాల గారు ఈపాటను శ్రీరాగంలో స్వరపరిచారు. సంగీతరావుగారు దీన్ని శంకరాభరణం రాగంలో స్వరపరిచారు. కూచిపూడి నాట్యం చేసేవారికి సోలో డాన్స్ కోసం ఈ పాటను స్వరపరిచారు సంగీతరావుగారు.

శివుడు తాండవమాడేనపుడూ............

పల్లవి             శివుడు తాండవమాడెనపుడూ
                   శివుడు తాండవమాడేనపుడు
                   జగదంబ సహితముగ శివుడూ తాండవమాడెనపుడు

                     శౌరి మృదంగము మ్రోయింప 
                     పాకారి వేణువును పూరింప,
                     వారిజాసనుడు తాళము నదింప(శబ్దం చేయడం)
                     భారతి విపంచి   మ్రోయింప      
                          క్షీర వారాశి తనయ పాడ
                     అచ్చరలు క్రమ లయ న్యాసము తోడ
                     నారదాది మునివరులు తిలకింప
                     పారవశ్యమున జగతి పులకింప.........
ఈ పాట లో శివతాండవ దృశ్యం వర్ణించబడింది. విష్ణువు ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, సరస్వతి, లక్ష్మీదేవి, అప్సరసలు నారదుడు ఇలా దేవతలందరూ ఆ కొలువులో తమ కళా ప్రదర్శన చేస్తూ ఉండగా జగదంబ అయిన పార్వతీ సహితంగా  శివుడు తాండవ నాట్యం చేసాడు.
ఈ పాట లో దృశ్యాల వర్ణన వింటే సి. నారాయణరెడ్డిగారు రచించిన ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు పాట గుర్తు రావడం యాదృచ్ఛికమేనా. ఆ పాటలో కూడా దేవతలందరూ కలిసి ఒక్కోవిధమైన కళా ప్రదర్శన చేస్తున్నట్టు వర్ణించబడింది.
ఆ పాట సాహిత్యంలో విరించి తాళము వేయగా, హరి మృదగము మ్రోయింపగా ప్రమధులాడగా అప్సరసలు పాడగా....అంటూ ఆ తాండవ దృశ్యాన్ని వర్ణిస్తారు. మరి నారాయణరెడ్డిగారు ఈ పాట విన్న తరువాత రాసారో - కాదో మరి. 
రహస్యంలో గిరిజా కల్యాణం యక్షగానంతో పాటుగా ఈ పాటలు కూడా ఉండి ఉంటే సంగీతప్రియులైన సినీశ్రోతలకు వీనులవిందుగా ఉండేది. అయినా కూచిపూడి నృత్యరూపకాల ద్వారా ఆ లోటు కొంత తీరిందని సంతోషించవచ్చు కూడా.


Thursday, August 1, 2013

శ్రీ నూకల చిన సత్యనారాయణ - రాగ ప్రస్తారంలో స్వతంత్రుడు, సరసుడు





 
శ్రీ నూకల చినసత్యనారాయణగారితో సంగీతరావుగారికి చిన్నతనంలోనే పరిచయం ఉంది. నూకల సత్యనారాయణగారికి చిన్నతనంనుండే గాత్రసంగీతం పట్ల ఎంతో ఆసక్తి కనపరిచేవారు. కొంతకాలం కంభంపాటి అక్కాజీరావుగారి వద్ద వయొలిన్ నేర్చుకున్నారు. తరువాత విజయనగరంలోన మహారాజావారి సంగీత కళాశాలలో విద్యార్థిగా చేరి శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారి వద్ద వయొలిన్ నేర్చుకున్నారు. కొంతకాలం తర్వాత శ్రీ పినాకపాణివారి వద్ద శిష్యుడిగా చేరి, కర్ణాటక సంగీతంలో ఎన్నోఉన్నత శిఖరాలను అథిరోహించారు. సంగీతరావుగారి తండ్రి శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారు ఈ విజయనగరం మహారాజావారి సంగీత కళాశాలలో వోకల్ పండితులుగా ఉండేవారు. ఆ విధంగా సంగీతరావుగారికి నూకలవారితో చిన్నతనంలోనే పరిచయం ఉంది. ఒక సంగీత కచేరీలో సంగీతరావుగారి పాటకి పక్కవాద్యంగా నూకల సత్యనారాయణగారు వయొలిన్ వాయించి వాద్య సహకారం చేసారు కూడా.

శ్రీ సంగీతరావుగారు 1976లో ఆంధ్ర ప్రభ దినపత్రికలో ఆనాటి ప్రసిద్ధ సంగీత విద్వాంసుల పరిచయ పరంపర వెలువరించారు. ఆ వరుసలో శ్రీ నూకల చిన సత్యనారాయణగారి గురించి వ్రాసిన వ్యాసం ఇది. 1976తర్వాత 2013వరకు (దాదాపు 37 సం)జరిగిన ఇన్ని సంవత్సరాలలో నూకలవారు సాగించిన ప్రస్థానం, చేసుకున్న విజయోత్సవాలు ఎన్నో. అయితే ఈ వ్యాసం 1976 నాటికి శ్రీ సంగీతరావుగారికి పరిచయం ఉన్న నూకల చినసత్యనారాయణగారి ప్రతిభకు సంబంధించిన అంశాలకు పరిమితమయినది.
" రాగ ప్రస్తారంలో స్వతంత్రుడు, సరసుడు" ఇది ఆనాటి వ్యాసానికి శీర్షిక.



"నూకల చిన సత్యనారాయణ-
రాగ ప్రస్తారంలో స్వతంత్రుడు, సరసుడు" 

సంగీతం శాస్త్రంగా, వృత్తిగా పరిగ్రహించి సంపూర్ణమైన సత్ఫలితాలు సాధించిన సంగీత పట్టభద్రుడు శ్రీ నూకల చిన సత్యనారాయణ. కర్ణాటక సంగీత రసికులకు ఈనాడు శ్రీ సత్యనారాయణ సంగీతం ఎడల ఎంతో కుతూహలం, ఆసక్తి ఉన్నాయి. సుశ్రావ్యమైన ఆయన కంఠస్వరమూ, రాగ తాళములలో గల స్వాతంత్ర్యమూ, సరసత, కచేరీ నిర్వహించడంలో గల అభినివేశమూ శ్రీ సత్యనారాయణ సంగీతంలోని సహజ ఆకర్షణ.


మూడు పదులు దాటిన శ్రీ సత్యనారాయణ సంగీత   జీవితానుభవం గణనీయమైనది. సంప్రదాయ సంగీతం సక్రమమైన పద్ధతిలో గురుముఖతః సాధన చేసిన శ్రీ సత్యనారాయణ సంగీతం ఆయనను ప్రభావితం చేసిన అనేకమంది విద్వాంసుల ప్రతిభతో తాదాత్మ్యం చెందడం ఆయన రసజ్ఞతను, సహృదయత్వాన్నీ వ్యక్తం చేస్తుంది. కళాపరంగా ఎక్కడ ఏ మంచి వినిపించినా దానిని గ్రహించడం వలన శ్రీ సత్యనారాయణ పాండిత్యంలో ఎంతో వైశాల్యమూ, గాంభీర్యమూ ఏర్పడ్డాయి. ఈ విధమైన పాండిత్యం ఉత్తమ గురుత్వానికి లక్షణం.


శ్రీ సత్యనారాయణ మొదట వాయులీన వాదకులైన తరువాతనే గాయకులయ్యారు. వాద్య నైపుణ్యం కూడా కలిగిన గాయకునిలో శాస్త్రీయంగా సునిశితమైన అవగాహన, సుస్పష్టమైన గమక స్ఫూర్తీ ఉంటాయి.


పరిశోధన:


శ్రీ సత్యనారాయణ సంగీత శాస్త్రంలో పరిశోధనలు సలిపిన పండితులు. భారతీయ సంగీతంలోని రాగ విధానానికి సంబంధించిన దాక్షిణాత్య, ఔత్తరాహ సంగీతం సంప్రదాయ రీతుల తులనాత్మక పరిశీలన వారి ప్రత్యేక కృషి.

రాగవిధానం భారతీయ సంగీతం విశిష్టతను నిరూపిస్తుంది. భారత హృదయ సంవేదన రాగ విధానంలోనే సంగీత మయంగా వ్యక్తం అవుతుంది. రాగములు దేవతా మూర్తులుగా ధ్యానించబడ్డాయి. అనేక రాగములు రూపకల్పన చేయబడి, చిత్రీకరించబడ్డాయి.


రాగ నిర్వచనం


రాగం అంటే ఏమిటి  ఆరోహణావరోహణ క్రమంలో గల సర్వ సముదాయం అని స్థూలంగా చెప్పడం కన్నా, రాగం అంటే సంగ్రహ రూపంగా ఉన్న ఒక స్వర రచన అనడం ఉచితం. అయితే  ఆ రచన గాయకుని  ఊహా పోహల ననుసరించి సంకోచ వ్యాకోచాలకు అవకాశం కలిగిస్తుంది. అనేక రాగాలకు రసనిర్ణయం జరిగింది. అయితే, ఆ నిర్ణయం సక్రమంగా అనుసరించబడలేదు. 

నిజానికి వివిధ రసములకు లక్ష్య ప్రాయమైన స్వర రచనలు లేవు. యక్ష గానాలలోనూ, నాట్య రూపకాలలోనూ, ఆయా రాగాలను వివిధ రస నిష్పత్తికి ప్రయోగించేవారేమో. ఆయా రసభావములను పోషించే సందర్భంలో తీవ్ర కోమల స్వర సమ్మేళన గాయకుని సరసమైన ప్రతిభే ప్రధానంగా ఉంటుంది. రస నిష్పత్తికి రాగ ప్రాధాన్యాన్ని చెప్పినట్టు, తాళ ప్రాధాన్యాన్ని చెప్పడం కనబడదు. అనుభవంలో తాళ ప్రాధాన్యం, ఎంతో కనిపిస్తుంది. రస భావ పోషణలో.


రాగముల పరిథి నిర్ణయించడం పరిశోధకుల సమస్య. అనేక ప్రసిధ్ధ రాగములు శతాబ్దాల తరబడి ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తుంది. కాలక్రమాన మేళకర్త పద్ధతి అమలు లోకి వచ్చిన తర్వాత ఔడవ షాడవ భేదాలననుసరించి ఏర్పడ్డ రాగాలు వేలకు వేలు తయారయ్యాయి. మనకు కావలసిన మూర్ఛనకి సరిపడే పేరు పుస్తకాల్లో కనపడకపోతే ఏ శక్తి ప్రియ అనో పేరు పెట్టుకోవలసి ఉంటుంది. ఆరోహణావరోహణ క్రమంలో, చిత్ర సంచారంలో ఉన్న ప్రతి చిన్న మార్పుకు వేరే రాగంగా వ్యవహరించ వలసి వచ్చింది.


ఒక రాగం శ్రవణ యోగ్యంగా ఉండడం, ఆ రాగంలోని స్వర సంబంధం పరస్పర సంవాది, ఆనువాది రూపంగా ఉండడం గ్రహించగలుగుతాం. ఈ ప్రాతి పదిక మీద రాగ విధానం పునః పరిశీలించబడడం అవసరమేమో. ప్రతి చిన్న సంచారాన్నీ  ప్రత్యేక రాగంగా పేర్కొనడం కన్నా ఈనాడు వివిధ రాగములుగా పేర్కొనబడిన రాగాలను సమన్వయ పరిచి ఒకే రాగంగా వివృత పరచవచ్చునేమో. సత్యనారాయణగారి వంటి పరిశోధకులు వివరాలు సేకరించవలసి ఉంటుంది.


రాగ మేళనం


ఈనాడు ఉత్తరాది సంగీతంలో రెండు భాగాలు కలిపి గానం చేయడం ఒక ప్రక్రియగా అమలులోకి వచ్చి ఉంది. రాగ విధానం వలన నిర్దిష్టమైన రాగ భావములకు ప్రత్యేకత ఏర్పడడం జరిగింది. ఆ రాగ స్వరూపానికి స్కాలిత్యం ఏర్పడకుండా అచంచలమైన  లక్షణం ఏర్పడింది. గ్రహస్వరం, న్యాస స్వరం, అంశ స్వరములను నిర్ణయించి ఆ రాగ స్వరూపానికి మార్పులు, చేర్పులకు అవకాశం లేకుండా చేయబడింది. దీని వలన ఆయా రాగాల స్వరూపాలు నిర్దిష్టంగా ఏర్పడ్డా, ఆయా రాగములలో రచింపబడిన రచనలలో వైవిధ్యం లోపిస్తుంది. ఒకే రాగంలో ఉన్న అనేక రచనలలో ఉన్న రాగ భావం ఒకటే. ఒక కీర్తన గాంధారంలో ప్రారంభం అయితే మరొకటి షడ్జమంలో ఎత్తుగడ జరిగిందన్న తృప్తి తప్పిస్తే మరోకటి లేదు.


అందుచేతనే రాగభావములను ఆధారం చేసుకున్న ఆయా రచనలలో స్వర రచయిత భావనకు అవకాశం లేదు. ఇంతకు పూర్వం శతాబ్దులుగా ప్రచారంలో ఉన్న రాగ భావాన్ని సాహిత్యానికి అమర్చడమన్నదే ప్రధానం. ఆయా విషయాలను వివరంగా రసికులు గ్రహించడానికి శ్రీ సత్యనారాయణగారి వంటి పండితుల పరిశోధనలు ఎక్కువ ఉపకరిస్తాయి.

శ్రీ సత్యనారాయణ ప్రథమ శ్రేణి గాయకులు. అనేక సంగీత కచేరీలు చేసి, రసికుల మన్ననలు పొందారు. రేడియో జాతీయ కార్యక్రమాల్లో తమ సంగీతం వినిపించారు. అనేక సంగీత రూపకములకు సంగీత సారథ్యం వహించారు. ప్రభుత్వ మర్యాదల ననుసరించి అనేక సత్కారాలు పొందారు. పీఠాధిపతుల ఆశీస్సులనందుకున్నారు.


ఉత్తమ సంగీత విద్వాంసులుగా, ప్రథమశ్రేణి గాయకులుగా, వాద్య నిపుణులుగా, స్వర రచయితగా, ఆచార్యులుగా కృతార్థులయిన శ్రీ సత్యనారాయణ స్వకీయమైన ప్రతిభతో రసిక లోకానికి ఇవ్వగలిగినది ఇంకా ఎంతో ఉన్నదనే అనిపిస్తుంది.

పట్రాయని సంగీతరావు


డిసెంబరు, 12, ఆదివారం, 1976
ఆంధ్రప్రభ