visitors

Sunday, August 31, 2014

ఆటపాటలమేటి - లేరతనికి సాటి!!


( (శ్రీ పట్రాయని సంగీతరావుగారు తన "చింతాసక్తి "అనే పుస్తకంలో ఆనాటి విజయనగరం జ్ఞాపకాలతో శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు(1864-1945)గారి గురించి  వ్రాసిన వ్యాసం ఇది. నేడు శ్రీ ఆదిభట్ల 

నారాయణదాసుగారి 150వ జయంతి. ఈ సందర్భంగా నారాయణదాసుగారికి  నివాళులు అర్పిస్తూ  

దాసుగారి ముచ్చట్లను ఇక్కడ ఉంచుతున్నాను.)

                     ఆటపాటల మేటి - శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు


ఆటపాటలమేటి శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారి పుట్టుక నెత్తురు కంటి ఏడు(రక్తాక్షి నామ సంవత్సరం అన్నమాట) తూరుపురిక్క నెలలో (అంటే పూర్వఫల్గుని నక్షత్రపు నెల, ఫాల్గుణమాసం కాబోలు) తిథి,వార నక్షత్రాలు జ్ఞాపకం లేదు. ఆయన విజనయనగరం దొరపాట బడిపెద్ద. ఆ పాట బడిలో గీటు మీటు చాటు జంత్రముల పలికింపు సొంపు నేర్పడమవును. పై మాటలు శ్రీ దాసుగారు అక్కడా ఇక్కడా అన్నవి. ఆయన పేరూరు ద్రావిడ బ్రాహ్మణ వైదీక కుటుంబంలో జన్మించినా ఆయనది అచ్చతెనుగు హృదయం.
విజయనగరం మహారాజా వారి సంగీత కళాశాల, ప్రేమాస్పదుడైన సంస్థానోద్యోగి, కుమారుడు జాత్సంధుడైన చాగంటి గంగబాబు నిమిత్తం నిర్మింపడిందని అనుకోవడం ఉంది. 1919లో అనుకుంటాను. మ్యూజిక్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్ కానుకుర్తి బుచ్చిబాబు గారట. కానుకుర్తివారిది సుప్రసిద్ధ బ్రాహ్మణ సంపన్న కుటుంబం. కానుకుర్తి వారి సత్రం ఆ రోజుల్లో ప్రముఖమైనది విజయనగరంలో.
మధ్వ స్వాములవారు ఎప్పుడు వచ్చినా చాతుర్మాస్య దీక్ష విజయనగరంలోనే. ఆస్థాన సంగీతవిద్యా గురువు పెద గురాచార్యులవారు ఆయన కుమారుడు వీణా రమణయ్యదాసుగారూ మధ్వులే. కానుకుర్తి బుచ్చిబాబుగారి అన్నగారు మూలరామ ప్రియ కానుకుర్తి క్రిష్ణారావుగారు. శ్రీ మహానంద గజపతి మహారాజుగారు, వీణారమణయ్యగారు సహాథ్యాయులట. సంగీతంలో వారి గురువు గురాచార్యులవారు.
సరీ. శ్రీ కానుకుర్తి బుచ్చిబాబుగారు సంగీత ప్రియులు. సరదాగా వయొలిన్ వాయించేవారు. బుచ్చిబాబుగారే సంగీత కళాశాలకి అర్హమైన ప్రిన్సిపాల్ గా శ్రీ నారాయణదాసుగారిని ఎన్నిక చేసి పదవీ బాధ్యత అప్పగించారట ప్రభువు వారి అనుమతితో. 

ఈ విధంగా నారాయణదాసుగారు ప్రిన్సిపాల్ గా నిర్ణయం అయిన తరువాత నారాయణదాసుగారి అభిప్రాయాన్ని పురస్కరించుకొని మిగిలిన పండితుల నియామకం అయిందట.
విద్యార్థిగా వచ్చిన ద్వారం వెంకటస్వామి నాయుడుగారినే వాయులీన పండితుడిగా తీసుకున్నారుట. ఇక వీణపండితుడుగా ఎవరిని నియమించాలీ అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆ  రోజుల్లో ఆ ప్రాంతంలో వైణుకుడిగా పొడుగు రామ్మూర్తిగారికి మంచి పేరు ఉండేది. అయితే నారాయణదాసుగారు అన్నారూ –ఒరే ఇది గాంధర్వ వేదం. అందులోనూ వీణ. కోళ్ళు కోసుకొనేవాడూ, గొర్రెలు కోసుకునేవాడూ పనికిరాడ్రా. అది ఫిడేలులాగ పిల్లపేగుల వాద్యం కాదు (వయొలిన్ స్ట్రింగ్స్ దాంతో తయారయ్యేవి) స్వచ్ఛమయిన లోహ తంత్రులు. పరమ పవిత్రమయిన వాద్యం. రసాధి దేవత చేపట్టిన వాద్యం. అందుచేత సంప్రదాయజ్ఞుడు, శ్రోత్రియుడయిన వైణికుణ్ణి నియమించుకోవాలీ  అని అన్నారట. ఈనాడు ఇంత కుల ద్వేషం పెరగడానికి కారణం ఈ ధోరణే. అప్పుడు బొబ్బిలి ఆస్థాన వైణిక కుటుంబీకుడైన వాసా వెంకటరావుగారిని నియమించారు వీణ పండితుడుగా.
ఆ రోజుల్లో మార్దంగికుడిగా మంచి మోజు కలిగిన లింగం అప్పగారినిమృదంగం పండితుడిగానూ, దాక్షిణాత్య నాదస్వర విద్వాంసుడు మునిస్వామి గారిని నాదస్వర పండితునిగా నియమించారట. పేరిబాబుగారు (రామమూర్తి)గాత్రము, వీణ అన్నీ చెప్పేవారు. అయితే ఆ రోజుల్లో సంగీత కళాశాలలో దాసుగారి హయాంలో హరికథ శిష్యులే చాలామంది ఉండేవారుట. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న మహారాజావారి స్టూడెంట్ బోర్డింగ్ హౌస్ లో ఒక పదిహేనుమంది వరకూ సంగీత విద్యార్థులకు భోజనం పద్దు ఉండేది. దాసుగారు ఒక విద్యార్ధికి పద్దు వేస్తే, ఆ విద్యార్థి వాడి బ్రతుకు వాడు బ్రతుకుతున్నట్టు చూపిన తర్వాతే ఆ పద్దు మరొకరికి ఇచ్చేవారుట. దాసుగారి హయాంలో సంగీత కళాశాలకి మూడు మాసాలు వేసవి సెలవలు. సంగీతమా మజాఖావా, చెమటల్తో సాధకం ఎలారా అనేవారట. తరువత కూడా చాలాకాలం ఆ ఆనవాయితీయే నడిచింది. దాసుగారి హయాంలో ఎంతోమంది హరికథకులు తయారయ్యారు.
వాజపేయల సుబ్బయ్యగారు, నేతి లక్ష్మీనారాయణగారు, వడ్లమాని నరసింహాదాసుగారు వీరంతా సుప్రసిద్ధ హరిదాసులో ఆరోజుల్లో. ఈనాడు మనకి జ్ఞాపకంలేని పేర్లు ఎన్నో. విజయనగరం నిండా హరిదాసులుండేవారు. దాసుగారు పోయిన తర్వాత కూడా విజయనగరం హరిదాసులకు స్థావరమే. అదేవిధంగా వైణికులు ఎంతోమంది తయారయ్యాడు. పూజ్యులు వాసా వెంకటరావుగారి అంతేవాసులు, మండా సూర్యనారాయణ ద్యయం, చెళ్ళపిళ్ళ రామమూర్తి పెనుమర్తి రామశర్మ, మేడేపల్ల నరసింగరావు వీళ్లంతా దాసుగారు ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు తయారయినవారే. అదే విధంగా నాయుడుగారి దగ్గర, కోటిపల్లి గున్నయ్యగారు, మట్టెల సత్యమూర్తి, చాగంటి గంగబాబూ, వీళ్ళంతా పాతతరం సంగీతకాలేజి విద్యార్థులే. నాదస్వరం క్లాసులో గాడిపిల్లి పైడిస్వామి, ఇనపకుర్తి నారాయణలు ముఖ్యులు. గాడిపిల్లి పైడిస్వామిది రాజమహేంద్రవర. దేశానికి బాగా సుపరిచితులు. మామిళ్ళపల్లి బాలసుబ్రహ్మణ్యశర్మ ఆయన శిష్యుడే. ఇనపకుర్తి నారాయణ అనారోగ్యం చేత నాదస్వరం మానుకుని ఫ్లూటు సాధన చేసారు. ఆయన సంగీతకళాశాలలో జూనియర్ విద్వాంసుడిగా ఉండేవారు.

దాసుగారు ప్రిన్సిపాల్ గా ఉన్నరోజుల్లో సంగీత కళాశాలకి సంబంధించిన ముచ్చట్లు కొన్ని.
విజయనగరంలోని మహారాజావారి సంగీత కళాశాల
రాజావారి సంగీతకళాశాల కేవలం సంస్ధానానికి చెందినది. ఆరోజుల్లో ఎవరో ప్రభుత్వాధికారి సంగీత కళాశాలకి వచ్చారుట. దాసుగారు ఆఫీసురూంలో గోచీ కట్టుకుని ఆయన స్పెషల్ ఛైర్ లో పడుకొన్నారుట. ఆ ప్రభుత్వాధికారికి ఏమీ తోచలేదు. "ఏమిటీ వేషం, ఇది సంగీత కాలేజీయేనా పండితులెవరూ సంగీతం విద్యార్థులకు చెప్తున్నట్టు కనిపించదు. అబ్బే ఏమీ బాగులేదు" అన్నాడట. దాసుగారు నిదానంగా చూసి " ఎవరు నువ్వు, ఎందుకు వచ్చేవు నా పర్మిషన్ లేకుండా" అని అడిగేరట. ఆ ప్రభుత్వాధికారి తనిఖీ చేసే అధికారం తనకి ఉందన్నాడట. "నువ్వు రాదలచుకుంటే నాకు మొదట తెలియజేయాలి. మాకాలేజి మా పద్ధతిలోనే నడుస్తుంది" అన్నారట. "పండితులెవరూ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్టేలేదే" అన్నారుట ఆయన. "అవును చెప్పరు" అన్నారుట దాసుగారు. " మరెందుకు తమరున్నట్టు" అన్నారుట ఆయన. "ఏనుగుల శాలలో ఏనుగులు ఎందుకుంటాయి" అని అన్నారుట దాసుగారు. ఇక లాభంలేదనుకుని ఆయన వెళ్ళి పోయాడట.
చిత్రం ఏమిటంటే ఏ విధమైన రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకపోయినా అన్ని శాఖలలోను, ఎంతోమంది విద్యార్థులు విద్వాంసులుగా రూపొందారు. ఈనాటి మన కొలతలలో, ఆ రోజులను ఆనాటి కళాకారులను వారు సాధించిన విజయాన్ని, ధనం, కీర్తిని బట్టీ అంచనా వేయకూడదు. ఈనాడు కళాకారులు కీర్తిమంతులుగా, ధనవంతులుగా విజయం సాధించే అవకాశాలు, అడ్డుదారులూ ఆనాడు లేవు. జనసామాన్యంలో  కీర్తిని ఆనాటి విద్వాంసులెవరూ కోరుకునేవారు కాదు. సరి, ఇది వేరే విషయం.
అసలు సంగీత కళాశాల వాతావరణమే వాళ్ళని విద్వాంసులను చేసేది. ఆగురువుల సామీప్యమే, గురుభక్తి వారిని విద్వాంసులుగా చేసేది. సంగీత విద్య క్లాసులవారీగా, సిలబస్ ప్రకారమే జరగాలని లేదు. నిరంతర శ్రవణం, నిరంతర సాధన, విద్యలకు అంకితమైన ఆసక్తి ప్రధానం. ఆ రోజుల్లో ఏ వాద్యం సాధన చేసినా సంగీత విద్య అందరికీ సమానమే కదా. అందుచేత వీణ క్లాసు విద్యార్థులు గాత్రం క్లాసు విద్యార్థులు నేర్చుకున్న గీతమో, వర్ణమో, కృతో కొత్తదైతే వాళ్ళు పరస్పరం నేర్చుకుంటూ ఉండేవారు. గ్రహణశక్తి, ఆరాధన ఉన్న విద్యార్థులు ఎక్కడ ఏ విధమైన సంగీతం వినపడినా స్వంతం చేసుకోగలిగేవారు.
మరో చిత్రమైన ముచ్చట –శ్రీ నారాయణదాసుగారు చినగురుణ్ణి (చిన్నగురుడంటే భంగు). పెదగురుణ్ణి (పెద్దగురుడంటే బ్రాందీ విస్కీలాంటివి),సేవించడం తెలిసినా, తాగినవాణ్ణి చూస్తే ఆయనకి భయంట. సంగీత విద్యార్థులకి సత్రంలో పద్దులుండడం చేత వచ్చిన చిక్కు. ఎవడో ఒక మొండివాడు బాగా పట్టింటి, దుడ్డుకర్ర పట్టుకుని దాసుగారికి దండం పెట్టి, బాబూ! నాకు సంగీత నేర్చుకోవాలని ఉంది. ముందు సత్రంపద్దు వేయించండి. లేదా ఈ దుడ్డు కర్రతో మీ తల పగలకొట్టి నా తల పగలకొట్టుకుంటాను, ఏమి సెలవు? అన్నాడుట. దాసుగారు ఒరే ఉండరా, నీకు సత్రం పద్దు కావాలిట్రా, అంతేనా. సరే నాతో రారా!! “ అని తనతో వాణ్ణి మెల్లగా పోలీసు స్టేషన్కి తీసుకొని వెళ్ళి అక్కడ  సబ్ ఇన్స్ పెక్టర్ తో బాబూ,వీడిసంగతి చూడండి. సత్రం పద్దు వేయకపోతే నా తల బద్దలు కొడతాడట”-  అని అప్పజెప్పేరుట.
 
ఆనాటి స్టూడెంట్ బోర్డింగ్ హౌస్ ఇదే.
దాసుగారి ఆత్మకథ నా ఎరుక లో ఆయన బాల్య, యవ్వన జీవితం గడిచిన తీరు వివరించారు. గాయకుడిగా, వైణికుడిగా, హరికథా పితామహునిగా ఆయన ఘనతను పండిత పామర జనసహితంగా యావదాంధ్రదేశం ఆయనకి నీరాజనమెత్తింది. ఆయన గురించి నాలాంటివాడు ప్రత్యేకంగా రాయవలసిన  అవసరం లేదు. రాసుకుంటున్నదంతా నాకు తెలిసినదాసు గురించే.

 విజయనగరం సంగీత కళాశాల ఉద్యోగానికి మానాన్న (శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారు) దరఖాస్తు పెట్టినప్పుడు ఆయనకి ఏ సర్టిఫికెట్లు లేవు కదా. అందుచేత విజయనగరంలోని పెద్దలందరి వద్ద నుంచియోగ్యతా పత్రాలు తీసుకోవలసి వచ్చింది. ఆ సందర్భంలో మా నాన్న దాసుగారింటికి వెళ్ళారట. మా నాన్నని దాసుగారికి తెలుసు. ఏమిరా పేరాసాహెబ్ ! నువ్వు మా నరసింహ కొడుకువు కదూ ఆని పలకరించారుట. మా తాతయ్యని ఆయనకి బాగా తెలుసు. అసలు ఆయన మా తాతయ్యకంటే పదేళ్ళు పెద్ద. ఇక పేరా సాహెబు ఎవరూ. ఆ రోజుల్లో గొప్పహిందుస్థానీ గాయకుడు. అతని గ్రామఫోన్ రికార్డులు చాలా ప్రచారంలో ఉండేవి కూడ. హిందుస్థానీ భైరవిలో అతని రికార్డు బహుతేరా ముజాయురీలాగగునా అనేది ఉండేది. పాటలో నేను రాసిన మాటలు తప్పుకావచ్చు. చాలా సన్నవిడి గాత్రం. తారస్థాయిలో వినబడేది ఆయన పాట. ఆ పేరా సాహెబు ఫోటోలు కూడా రసికుల ఇళ్ళలో గోడలమీద వేలాడేవి . మా నారాయణశాస్త్రిగారింట్లో చూసేను పేరాసాహెబు ఫోటో. పెద్దదే. మా నాన్నకి అతనికి ఏవో కొన్ని పోలికలు ఉండేవి. ముఖ్యంగా పొడుగు మెడ. పచ్చటి రంగు లుంగీ కట్టుకుని తిరగడం, హార్మోనియం వాయిస్తూ పాడడం కారణం అనుకుంటాను,  దాసుగారి ఆ పలకరింపుకి కారణం. ఒరే! నీకెందుకురా ఆ బాడఖావు ఉద్యోగం. సలక్షణంగా పాఠశాల కట్టేవు, స్వతంత్రంగా ఉన్నావు , నీ ప్రారబ్ధం అలా ఉంది! తప్పదు!” అని ఆయన యోగ్యతా పత్రం రాసి ఇచ్చారుట. పక్కనున్నవాళ్ళతో అన్నారట –“ ఆ హార్మోనియం లేదూ, అదొక కొయ్య. దానిలోంచి అమృతం పిండుతాడు వీడు అని.
అందరినీ ఆయన ఒరే అని పిలవడమే అలవాటు. ఎవరూ ఏమీ అనుకునే వారు కాదు. మీదు మిక్కిలి అలా అనకపోతే బాధపడేవారు. ఆయన తిడుతుంటే ఆనందించేవారు. అదో జాతకం. ఆయనకి అలవాటయిన తిట్టు దొంగమాదిగాడి కొడుకు. అని ఆయన పండితులతోటి, పామరులతోటి ఒకే విధంగా సరదాగా మాట్లాడేవాడు.
మహా మహోపాధ్యాయ తాత సుబ్బరాయ శాస్త్రిగారిని –“ ఒరే తాతా! నీ ముక్కు ఇకొయణచి లా ఉందిరా అనేవారట. ఇకొయణచి - ఇదొక వ్యాకరణ సూత్రంట. రాయుడు శాస్త్రిగారి మహా వయ్యాకరణి.
ఆరోజుల్లో హరి నాగభూషణంగారు ఆయనకి ప్రత్యర్థిగా అనుకునేవారు. నాగభూషణంగారు సంగీత సాహిత్యాలలో అపారమైన పాండిత్యం కలిగినవాడు. వాగ్గేయ కార రత్న, దివనామగాయనీ ఇత్యాది బిరుదులుండేవి. పైగా జంత్రగాత్రములతో సాగేది ఆయన కచేరీ. ఆయన త్యాగరాజస్వామిని అనుసరించి సన్యాసం కూడా స్వీకరించారు. దాసుగారికన్నా చిన్నవాడే వయసులో. అతనిని ఆట పట్టించేవారుట దాసుగారు.
ఒకసారి నాగభూషణంగారి కచేరీ అవుతోంది. ఆయన స్వరకల్పనకు బదులు రామనామంతో లయవిన్యాసంతో గానం చేసేవారట. అందుకే ఆయనకి దివ్యనామ గాయనీ బిరుదు. కచేరీలో కొంతసేపు స్వరకల్పన చేసి దివ్యనామం అందుకొన్నారు. రమరామరామ రమరామరామ అంటూ తర్వాత అదే ఫిడేలుమీద వాయిస్తున్నారు. నారాయణదాసుగారు ఎదురుగా వింటూ ఆహా ఓహో అని మెచ్చుకుంటూ నాగభూషణం మహాభక్తుడు చూడండయ్యా ఆ ఫిడేలు కూడా ఎలా రామ రామ అంటుందో అన్నారట.
మేము ఆయనను చూసేనాటికి ఆయన అస్తమిస్తున్న సూర్యదేవుడు. స్వయంగా మేము ఆయన ప్రతిభను గ్రహించడానికి మరేమీ మిగిలిలేదు. కీర్తి ప్రభ మాత్రం తగ్గలేదు. మేము ఎరిగిన నాటికి దాసుగారు డెబ్భయిఏళ్ళ వయోవృద్ధు. అదే ఆయన చివరి దశ. ఆజానుబాహు. సేలం పట్టుపంచె పెద్ద అంచులవి కట్టుకునేవారు ఎగగట్టి. పట్టు జుబ్బా మోకాళ్ళవరకు. కాలికి గండపెండేరం, చేతికి మురుగులు, మెళ్ళో బంగారు పతకం, మధ్యపాపిడి, చేతిలో దుడ్డుకర్ర, పెద్ద పెద్ద పండు మీసాలు. ఇదీ మేము చూసిన దాసుగారి రూపం.
రోజూ మధ్యాహ్నం నాలుగు గంటలకు ఆయన పార్కులో ఉన్న టౌన్ హాలుకి బయలుదేరేవారు. పులివేషం వెంట జనంలా ఉండేవారు జనం ఆయన వెంట. రోడ్డుమీదే ఆయన శిష్యులకి పాఠం చెప్పేవారు. మా ఇంట్లో ఉంటున్న మధూకర విద్యార్థి నేలనూతుల నాగభూషణం ఆయన  చివరితరం శిష్యుడు. ఆ రోజుల్లో గుడసుమీరిన బుద్ధిమంతులు ఎవరూ ఉండేవారు కారు. ఆయన వెంట. అందరూ అమాయకులు, వెర్రిబాగుల వాళ్ళలాంటివారే ఉండేవారు.
ఆయన హరికథాపాఠం కానుకుర్తివారి వీథిలోంచి బొంకులదిబ్బ దగ్గరకొచ్చేసరికి " చాటుచున్నదదో భేరి "అని సీతాకల్యాణం మట్టు ప్రారంభం అయ్యేది కోటగేటు దగ్గర. అదో మజిలీ. అక్కడ కొంతసేపు భక్తులతో గోష్టి. ఆ తరువాత మజిలీ-మూడు లాంతర్లు,  పైడితల్లి అమ్మవారి గుడిదగ్గర. అక్కడ డప్పులు, తప్పెట్లు వాయించేవాళ్ళ విద్వత్ పరీక్షలు జరిగేవి. దాసుగారు దుడ్డుకర్ర తో తాళం చూపించేవారు. వాళ్ళు డప్పు వాయించేవారు. మనకి అంత దృష్టి ఉండదు ఆ వాద్యం మీద. కానీ దాసుగారి ముందు వాళ్ళు వాయిస్తూ ఉంటే అబ్బ!  దీనిలో అంత వ్యవహారం ఉందా అనిపించేది.  దాసుగారు మెచ్చుకొని వాద్యకులకు బిరుదులివ్వడమూ ఉండేది.
తరువాత మజిలీ. సానివీధి శివాలయం దగ్గర. అక్కడ ఆయన శృంగార జీవితం నెమరువేసుకునేవారు. ఇక్కడ ఉండేదిరా నా సాని అనేవారు. ఆ మాటతో కుర్రాళ్ళందరికీ హుషారు పుట్టేది. అలాగా బాబూ! మంచి ప్రాయంలో ఉండేదా బాబూ అనేవారు. ఏమీ అరవై ఏళ్ళు దాటేయి దానికి అనేవారు. అంతా గొల్లుమనేవారు. తరువాత ఆయన పార్క్ లో టౌన్ హాలుకి వెళ్ళిపోయేవారు.  శిష్యులు బయట ఉండిపోయేవారు పార్కులో రేడియో వింటూ. తిరిగి ఆయన ఎనిమిది దాటేక బయలుదేరేవారు. గురువుగారిని ఇంటికి దిగపెట్టి శష్యులు వెళ్ళేవారు ఇళ్ళకి.

మా తమ్ముడు నారాయణమూర్తి పెళ్ళి 1939లో  అయినట్టు జ్ఞాపకం.  పెళ్ళి భీమవరం అగ్రహారంలో అయింది. మనుగుడుపులకు, పెళ్ళికూతురూ, పెళ్ళివారూ విజయనగరం వచ్చిన సందర్బంలో పెళ్ళి కళ కోసం ఆరోజు ఇంట్లోనే వినోదంగా మా ఇంట్లో ఉన్న నేలనూతల నాగభూషణాన్ని హరికథ చెప్పమని అడిగేం కుర్రాళ్ళు అందరమూను. మా గురువుగారి సెలవు కావాలే అన్నాడు అతను. మొత్తానికి గురువుగారి సెలవయింది. గురువుగారు కూడా వస్తామన్నారు  అన్నాడు నాగభూషణం. మా గుండెల్లో రాయిపడింది. ఆటపట్టించడానికి అతని హరికథ అనుకుంటే చివరికి వ్యవహారం జటిలం అయిపోయింది. కుర్ర వ్యవహారం అనుకున్నది పెద్ద కార్యక్రమం అయిపోయింది. కథ ప్రారంభం అయింది. సహకార వాద్య గోష్టి ముమ్మరంగా ఉంది. "శంకరాశ్రిత ఘన శంకరా ప్రభ" అని ప్రార్థన ప్రారంభం అయింది కేదారరాగంలో. చరణంలో మిత్రం కింకర జన సముదాయ సౌఖ్యంకర దగ్గరికి వచ్చేసరికి నాగభూషణం గారికి ఆవేశం వచ్చేసింది. నృత్యం ఉధృతమైంది. కుర్రాళ్ళందరికీ మంచి వినోదంగా ఉంది. సరిగ్గా ఆ సమయంలో నారాయణదాసుగారు శిష్యపరివారం అంతా ఇరవై మంది దాకా వచ్చేసారు. సాయంత్రం ఏడున్నర ప్రాంతంలో.  పెద్దలంతా వారిని ఆహ్వానించారు. మర్యాదలన్నీ అయ్యాక దాసుగారే ప్రారంభించారు కథ.  


చాటుచున్నదదో భేరి నుంచి. ఏమి గాత్రం. అది సింహగర్జనలా ఉండేది ఆగాత్ర గాంభీర్యం. శ్రీ రామచంద్రమూర్తి శివ ధనుస్సు ఎత్తడానికి సభలో ప్రవేశించగానే సభ్యుడు అనుకుంటున్నారు ఆ అవతారమూర్తిని చూసి కన్నవారెలెంత ధన్యులో . ఈ విధంగా సాగింది కథ. దాసుగారితో శిష్యబృందం అంతా వంత పాడారు. వచనం ఆయన అందిస్తుంటే నాగభూషణం గారు వల్లె వేసారు. శిష్యుల ఎడల ఆయన ప్రేమ అటువంటిది.
1982లో అనుకుంటాను. ఎంబార్ విజయరాఘవాచార్యులుగారికి మద్రాసు మ్యూజిక్ అకాడెమీ సంగీత కళానిధి బిరుదం ఇచ్చింది. ఆయన తమిళనాడులో ప్రసిద్ధ హరికథకుడు. సంగీతంలో ప్రామాణికుడు. ఆ సభలో హరికథకి సంబంధించి సెమినార్లు జరిగాయి. ఒక రోజు పప్పు వేణుగోపాలరావుగారు శ్రీ నారాయణ దాసుగారి జీవిత విశేషాలు తెలియజేసిన సందర్భంలో సోదాహరణంగా దాసుగారి  రచనలు, అనేక హరికథలలోని మట్లు నేను, మా అమ్మాయి చి.సౌ. పద్మ పాడడం అయింది. ఆ కార్యక్రమానికి ముందు క రెండు మాసాలైనా అయి ఉంటుంది. ఆ మట్లన్నీ ఒక క్రమంలో మూల సంగీత రచనకి భిన్నం కాకుండా చూసుకుంటూ ఆయన వచనాలు చెప్పే పద్ధతి, ఇవన్నీ సరి చూసుకోవలసి వచ్చింది. (ఆ సోదాహరణ ప్రసంగానికి బహుమతి కూడా లభించింది)


నేను హరికథకుణ్ణి కాదు. నా చిన్నతనం నుంచి దాసుగారి మొదటి తరం శిష్యులు పాడగా విన్నాను. రావికంటి జగన్నాథ దాసుగారని ఉండేవారు. ఆయన కుంటివారు. కూర్చునే హరికథలు చెప్పేవారు. నారాయణ దాసుగారి మట్లు ఆయన బానీలో యథాతథంగా పాడేవారు. మా నాన్నగారు ఆయన విన్న రుక్మిణీ కల్యాణంలో భూపాలరాగంలో సామిరావ దేమిరాయో సర్వాంతర్యామిరా అన్న మట్టు ఎంతో భావావేంతో, శరణాగతితో నినే నమ్మినాను, తనువమ్మినానా నీకు దయరాదా మదీ నీ సతీ నీవే నా గతీ నిక్కము దయా నీరధీ అంటూ గానం చేసేవారు ఆయన. ఒళ్ళు గగుర్పొడిచేది. అలాగే మార్కండేయ లో బాలచంద్రమౌళి పాదము విడక అనే మట్టు పున్నాగవరాళిలో విన్నప్పుడు హృదయావేశాలను సంగీతంలో ఎంత సమర్ధంగా రసస్ఫూర్తిగా తెలియచేయవచ్చునో అర్థమయింది.

 దాసుగారి సంగీత రచన లక్ష్యం, రసభావ పోషణకి రాగ తాళములను సమన్వయపరచడం లోను, ఆయన ఎంత ప్రతిభావంతుడో తెలుస్తుంది. అసలు దాసుగారి మట్లు సంగీత సాహిత్యాలకు సమర్థమయిన సమన్వయాలు. ఆ మట్లు నడకలో మాట మాటగా తెలుస్తుంది. వాగ్గేయకారుల రచనలో మాట సాగుతుంది.  
ఒకటనిపిస్తుంది.  యావదాంధ్రదేశ రసిక లోకమూ అతనిని ఒక యుగ పురుషునిగా గుర్తించినా సంగీత విద్వల్లోకంలో ఆయనను వాగ్గేయకారునిగా గుర్తించకపోవడం అన్యాయం. అనాలోచితం. రసదృష్టి లేకపోవడం.

ఈనాడు మనం సంగీత సభలలో రాగపోషణలో, స్వరకల్పలలో ఎంతో నాదానుభవం పొందగలం. అదే విధంగా అంతర్లీనమయిన లయ సౌందర్యాన్ని విజ్ఞులు గ్రహించగలరు. విశిష్టమయిన కర్ణాటక సంగీతపు నుడికారం వినిపిస్తుంది. కర్ణాటక సంగీతానుభవం పొందలేరు నిజమే. అయితే సాహిత్యం తోను, రసభావములతోను, సమన్వయపడిన కృతి పాడుతున్నప్పుడు సంగీతానికి సాహిత్యానికి పొంతన లేదు. ఆ స్పృహే లేదు. గాయకులకు సంగతులు వేయడంలో నిగ్రహం లేదు. సంగీతం, సాహిత్యంలోని రసభావానుగుణ్యంగా లేదు. రాగ చిత్రణ, రాగ ప్రస్తారము లయబద్ధంగా గానం చేయడమే ప్రధానం అన్నట్టుగా వినిపిస్తుంది. కీర్తనను  గానం చేయడానికి చాలా శ్రద్ధాసక్తులు అవసరం. భావానుగుణ్యంగా సంగీతం ఉందా లేదా అన్నదానికి ముందు పదోచ్చారణ, ఆ పదం మీద వచ్చే ధ్వని మధురంగా వినిపించాలి. దంత, తాలవ్య, ఓష్ఠ్య, కంఠ్యముల ఆధారంగా వచ్చే నాదం శ్రావ్యమై ఉండాలి. మన ప్రయత్నం అంతా తంజూవూరు బానీ సాధించడంతో పూర్తి కాదు. దానివల్ల ఏమయిందీ, తెలుగు వాడికి తెలుగుపాట వినపడదు. సంగీతపు బానీ విషయంలో దాసుగారిది సముచితమయిన అవగాహన.  ఆయన అన్నారు – పాటలో తమిళుడు తమిళ యాచతో పాడతాడు. నా తెలుగు యాచతో నేను పాడతాను.

రాయడం  మరచిన సంగతి – దాసుగారు రిటైరయ్యి నాయుడుగారు ప్రిన్సిపాల్ అయిన తర్వాత దాసుగారు కూర్చున్న కుర్చీమీద నాయుడుగారు కూర్చునేవారు కాదు. దాసుగారి రచన అయిదు తాళాలకు సంబంధించి ఏక ముఖంగా ప్రదర్శించడానికి ఉద్దేశించబడిన పంచముఖి పటం కట్టించి ఉంది. ఆ పటం ఆకుర్చీ మీద ఉండేది ఒకమూల.