visitors

Thursday, August 4, 2016

సంగీత కళాశిఖామణి - శ్రీపాద పినాకపాణి



 సంగీతరావుగారు తన సమకాలీనులైన ప్రముఖ సంగీతవేత్తల వైదుష్యాన్నివివరిస్తూ  అనేక ప్రామాణిక వ్యాసాలు రాసారు. 1976 సంవత్సరం ఆంధ్రప్రభ దినపత్రికలో  ప్రచురించబడిన ఈ వ్యాసపరంపరలో శ్రీపాద పినాకపాణిగురించి సంగీతరావుగారు రచించిన వ్యాసం ఇది. 






ఆంధ్రప్రభ – సెప్టంబర్ 26, 1976, విజ్ఞాన వేదిక
సంగీత సంప్రదాయవేత్త
శ్రీపాద పినాకపాణి 

ఆంధ్ర గాయకలోకంలో డాక్టర్ శ్రీపాద పినాకపాణిగారిది గురుస్థానం. ఈ గౌరవం ఆయనకు సహజంగానే సంప్రాప్తమైంది.

ఆయన మానమైన ఆహ్వానాన్ని పురస్కరించుకొని గత మూడు దశాబ్దాలకు పైగా ఎందరో వర్తమాన సంగీత విద్వాంసులు వారి సన్నిధిలో తమ అనుభవాన్ని, జ్ఞానాన్ని సరిదిద్దుకొన్నారు; సుగమం చేసుకొన్నారు.

ఈనాటి సుప్రసిధ్ధ ఆంధ్ర గాయకులు చాలా మంది వారి ప్రభావాన్ని తలదాల్చిన వారే.

శ్రీ పినాకపాణిగారు సంగీత సంప్రదాయోధ్ధారకులుగా గణింపదగనవారు. గానంలో వారి విశిష్ఠమైన బాణీ, వారి ప్రభావం సోకిన విద్వాంసులందరి గానంలోనూ వారి మూర్తి పొడగడుతుంది. చివరకు కంఠస్వరం పట్టువిడుపులలోనే కాదు – పలికే తీరులో కూడా.

శ్రీ పినాకపాణి సంగీతాన్ని ఏనాడూ వృత్తిగా స్వీకరించినవారు కాదు. సంగీతం ఆయన జీవత సార్థకతకు, ఆనందానికి మాత్రమే ఆలంబనమయి ఉంది. సంగీతవృత్తికి సంబంధించిన అసహ్యకర వాతావరణానికి ఆయన ఎప్పడూ దూరమే. అంతేకాదు, సన్మాన, సత్కారాల ఎడల కూడా ఆయన నిర్లిప్తులే.

అందుకనే ఏమో ఆయన సంగీతం అంత స్వఛ్ఛమయి ఉంది. అంత ఆదర్శవంతంగా కూడా ఉంది.
రాగసంచారములోనైతేనేమి, కీర్తన పాఠంలోనైతేనేమి – సంప్రదాయ విద్వాంసులందరిలోను ఏకవాక్యతలేదు. అనేక కీర్తనలలో మౌలికమైన పాఠమేదో స్పష్టపడదు. ధాతురచనలో ఎంతో ప్రక్షిప్తమయ్యే అవకాశం ఉంది. మన రాగసంప్రదాయం తెలియని పాశ్చాత్య సంగీతజ్ఞులకి ఒకే కీర్తన వివిధ గ్రంథాలలో ఉన్న వ్రాతపాఠం అనేక విధాలుగా గోచరిస్తుంది.

శ్రీ పినాకపాణిగారు వివిధ పాఠ భేదములు గల ధాతుమాతువులను పరిశీలించి, తమక గల ప్రజ్ఞతో, అనుభవంతో, అధికారకారంతో ఒక ఉత్తమమైన పాఠ క్రమాన్ని అనేక కృతులకు నిర్ణయించిన పండితులు. వారు నిర్ణయించిన ధాతుమాతుక్రమంతో వారు స్వయంగా గానం చేయడమే కాకుండా, అనేక మంది విద్వాంసులు ఆ క్రమాన్ని అనుసరించడం కూడా జరుగుతూ ఉంది. వారు ఏర్పఱచిన కీర్తన పాఠం దాక్షిణాత్య పండితుల ప్రశంసలనందుకున్నది కూడా.

ఈనాడు తెలుగు దేశంలో కర్ణాటక సంగీత సంప్రదాయాన్ని అనుసరిస్తున్న ఉత్తమశ్రేణి విద్వంసులు పలువురు ఏర్పడి ఉన్నారన్నా, తెలుగు దేశం అంతటా సంప్రదాయ సంగీత ఎడల అపూరవమైన ఆసక్తి, ఆదరణ, అభివృధ్ధి చెందుతూ ఉన్నాయన్నా, దానికంతకూ కారణం శ్రీ పినాకపాణిగారి నిరంతరమైన అజ్ఞాత కృషి ఫలితమే అని అనక తప్పదు. అంతేకాదు, ఆంధ్ర గాయకలోకంలో పరస్పరసమైన అవగాహన, సానుభూతి, ప్రోత్సాహం నానాటికీ పెంపొందుతూ, ఒక సామూహికమైన సంగీత కృషి సాగుతున్నదంటే శ్రీ పినాకపాణిగారి అమోఘమైన సంకల్పశక్తి దోహదప్రాయంగా ఉందన్న విషయం స్పష్టమే.

ఈ సందర్భంలో వివిధ విజాతీయ సంగీత ప్రభావాలను, ప్రజాభిప్రాయాన్ని గ్రహించి, మన సంగీత సంప్రదాయాన్ని సింహావలోకనం చేసుకోవడం, ఆత్మవిమర్శ చేసుకోవడం అప్రస్తుతం కావు.

మన సంగీత సంప్రదాయశైలిని ప్రధానంగా ప్రదర్శించేది నేటి సంగీత కచేరీ విధానం. దగ్గరగా రెండు దశాబ్దులైనా అయి ఉండవచ్చు ఈ కచేరీ అమలులోకి వచ్చి. ఈ కచేరీ నడిపించే పధ్ధతి విద్వాంసులందరికీ ఒకే మూస. గానం చేసే రచనలలోగూడా ఎక్కువ మార్పు ఉండదు. రాగసంచారంలోనూ, స్వరసంచారంలోనూ విన్నదే వింటూ ఉండడం సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. గాయకుల భావనాశక్తి, సాధనబలం కూడా సంపదాయ పరిధిలోనే పరిభ్రమిస్తూ ఉంటాయి. కొన్ని దశాబ్దాలుగా నూతన శైలికి తార్కాణమైన సజీవమైన రచనలు రాలేదు. సాధనకి ఉన్న గుర్తింపు రచనకు, భావనాశక్తికి లేదు. ఈ స్థితిలో రసికులు నూతనత్వాన్ని కోరడం కళకి ద్రోహం తలపెట్టడంగా భావించకూడదు.

ఇక సంప్రదాయ సంగీతం తన ప్రత్యేకతను నిలబెట్టుకుందుకు ఒక గమక విధానాన్ని అనుసరిస్తుంది. ఒక పత్యేకమైన తరహాకి చెందిన సాహిత్యాన్నే ఆదరిస్తుంది. సాహిత్యంలోని విషయం కూడా భక్తి, శృంగారాలకే పరమితమై ఉంటుంది. ఇక సాహిత్యం ఒదిగి ఒదిగి అప్రధానంగా ఉంటుంది. వాద్యప్రపచంలో ఏదో ఒకటి రెండు వాద్యాలను మాత్రమే పరిగ్రహిస్తుంది. ఇదీ మన సంప్రదాయ శైలి. సంప్రదాయ సంగీతశైలిలో ప్రజాజీవతం అంతా ప్రతిఫలించదు. అది పూజాగృహం దాటి బయటకి రాదు. జీవితం సంగీతమయంగా చేసే ప్రయత్నం సంప్రదాయ మార్గంలో ఏ మాత్రం జరగలేదు. ఈ విషయంలో సంప్రదాయాభిమానులను, రసికులను కలవరపెడుతున్న సమస్యలెన్నో ఉన్నాయి.

సంప్రదాయ సరళిలో ఎంతో భక్తిప్రపత్తులు కలిగిన విద్వాంసులకు కూడా ఏదో మార్పు తీసుకురావాలనే తపన లేకపోలేదు.

కొంతమంది విద్వాంసులు రాగాలాపన హిందుస్థానీ సంగీత శైలిలో నడిపిస్తూ, కీర్తనను మాత్రం మామూలు పధ్ధతిని అనుసరిస్తున్నారు. మరికొందరు హిందుస్థానీ సంగీత శైలికి చెందిన భజనలు, టుమ్రీలు, గత్తులను తమ స్వంత సాహిత్యంతో దిగుమతి చేస్తున్నారు.

ఈ సమస్యలను ఉపేక్షించడం వల్లగానీ, ప్రజాభిరుచిని శంకించడంవల్లగాని పరిష్కారం కాదు.

సంప్రాదయ సంగీతం తన విశిష్టతను కాపాడుకుంటూ తన ప్రత్యేక మార్గంలో ప్రజాభిరుచికి సన్నిహితం కావడానికి చేసే ప్రయత్నంలో శ్రీ పినాకపాణిగారి వంటి పండితుల అనుభమూ, సహకారమూ ఎంతైనా వినియోగించుకోవలసి ఉంటుంది.  

===+++===  ఫఫరరరరర