25.09.20 - శుక్రవారం భాగం - 18*:
పదిహేడవ భాగం ఇక్కడ
అశృనివాళి
గత రెండు మాసాలుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న మధుర గాయకుడు శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు నేడు స్వర్గస్తులయ్యారన్న వార్త మాకెంతో విచారాన్ని, ఆవేదనను కలిగిస్తున్నది. వారి మృతిపట్ల మా పట్రాయని కుటుంబం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నది. శ్రీ బాలసుబ్రహ్మణ్యంగారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాము.
ఘంటసాలవారి తర్వాత, గాయకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా కోట్లాది సంగీతాభిమానుల ప్రేమాభిమానాలను చూరగొన్న వ్యక్తి శ్రీ బాలసుబ్రహ్మణ్యంగారు. గాయకుడిగానే కాక హృదయమున్న మంచి వ్యక్తిగా, స్నేహశీలిగా బాలూగారు అందరి ప్రేమాభిమానాలను పొందారు.
1970 లో మొదటిసారిగా ఘంటసాలవారి రజతోత్సవ సందర్భంగా వారిని రెండుసార్లు కలిసాను. అదే ప్రధమ పరిచయం. తరువాత, 1981 నుండి బిసిఐసి, మద్రాస్ తెలుగు అకాడెమీ కార్యకలాపాలలో దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు బాలుగారితో పరిచయం మరింత దృఢపడింది. సాటి కళాకారుల పట్ల ఎంతో అభిమానం కనపరుస్తూ, వర్ధమాన కళాకారుల పురోభివృధ్ధికి ఎంతగానో కృషిచేశారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యంగారి వంటి అనుభవశాలిని భారతీయ సినీ సంగీత జగత్తు కోల్పోవడం తీరని లోటు. ఆ దివంగత కళాకారునికి నా హృదయపూర్వక శ్రధ్ధాంజలి ఘటిస్తున్నాను.
స్వరాట్
మద్రాస్ సిటిజన్స్ కమిటీ (1980)
భాగం 18
నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
విజయనగరంలో ఫస్ట్ ఫారమ్ చదివిన నేను సెకెండ్ ఫారమ్ అక్కడ చదవలేదు. నా చదువు బొబ్బిలికి మారింది. కారణం, మా నాన్నగారు వృత్తిపరంగా ఆ వూరొదిలేయడం కూడా కావచ్చును. బొబ్బిలిలో మా అమ్మగారి మేనమామ, సామవేదుల నరసింహంగారింటికి చేరాను.
శ్రీ సామవేదుల నరసింహంగారు రెండో అక్కగారి మనుమలు మనుమరాండ్రతో
ఆయన బొబ్బిలి కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో పెద్ద గుమస్తాగా, క్యాషియర్ గా పని చేసేవారు. పిన్నవయసులోనే ఆ ఉద్యోగంలో చేరారు. ఆయన అందులో ప్రవేశించినప్పుడు ఆయన జీతం నెలకు 15 రూపాయలు. ఆ జీతంతో తన అక్కగారిని (మా నాన్నగారి చిన్నత్త, మా అమ్మగారి తల్లిగారు), ఆవిడ పెద్ద కూతురిని, ఆ కూతురి ఒక్కగానొక్క కూతురిని పోషించేవారు. ఆయన జీవితమంతా ఆ బ్యాంక్ లోనే గడిచింది. ఆయన మా బొబ్బిలి తాతగారు. ఆయన భార్య చిన్నతనంలోనే ప్రసవ సమయంలో, పుట్టిన బిడ్డతో సహా పోయింది. ఆ తరువాత, మా తాతగారు మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. తన ఇద్దరి అక్కగార్లను, రెండో అక్కగారి పిల్లలను, మనుమలను, మనవరాండ్రను సంరక్షించడంతోనే కాలం గడచిపోయింది. మా అమ్మగారు శ్రీలక్ష్మి (బొబ్బిలిలో తెలిసినవాళ్ళంతా సుందరి అని పిలిచేవారు). ఆవిడకు మూడేళ్ళ వయసులో మా నాన్నగారితో వివాహం జరిగింది. అప్పటికి ఆయన వయసు తొమ్మిదేళ్ళు. శారదా ఆక్ట్ అమలవుతుందని తెలిసిన వెంటనే అంత చిన్న వయసులో పెళ్ళి జరిపించేశారు.
బిడ్డయగు నొక స్త్రీని యిరువదియొక్క యేండ్లకులోపు వయసుగల పురుషుడు పెండ్లియాడినచో వానికి శిక్ష 1000 రూపాయలు జుల్మానా. అంతకు మించిన వయసున్న పురుషుడైతే శిక్ష ఖైదు జుల్మానా రెండూను.
శారదా ఆక్ట్ అమలులోకి వచ్చాక పెళ్ళిళ్ళు జరపాలంటే వరునికి 21 సంవత్సరాలు, వధువుకు 14 సంవత్సరాలు పూర్తికావాలనేది చట్టం.
మా అమ్మమ్మగారు ఆకుండి అప్పలనరసమ్మ (బంధుజనానికి అప్పడు)గారు మా నాన్నగారికి వేలు విడిచిన మేనత్త. బొబ్బిలిలో మా తాతగారు సింహాలు బాబుగా చిరపరిచితులు. ఆయన నివసించే పూరిల్లు ఆయన సొంతం కాదు. ఆయన కజిన్ ది. ఆయన పేరు కూడా సామవేదుల వరాహ నరసింహమే. ఆయనను అందరూ వరహాలుగారని పిలిచేవారు. ఆయన రైల్వేలో గార్డ్ గా పనిచేస్తూ ఒరిస్సా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఉండేవారు. బొబ్బిలి ఎప్పుడోకాని వచ్చేవారు కాదు డ్యూటీ మీద తప్ప. ఆ వరహాలు గారికి మాతాతగారు అన్నా, ఆ అక్కచెల్లెళ్ళనా అభిమానం. ఆ కారణంగా తన ఇంటిని పూర్తిగా మా తాతగారికి అప్పగించేసారు. ఆ యింటికి సంబంధించిన మంచి చెడ్డలన్నీ మా తాతగారి మీదే ఒదిలేశారు. వరహాలుగారు కానీ, ఆయన డాక్టర్ కొడుకు కానీ, నాకు తెలిసి, వారీ బొబ్బిలి ఇంటివిషయంలో ఏనాడు కలగజేసుకోలేదు. మా బొబ్బిలి తాతగారు పరమ సాత్వికుడు. అతిమిత భాషి. చాలా తెలివైనవారు. ఆయన మితభాషిత్వమే నాకూ అబ్బింది. వివాదాలకు ఆమడ దూరం. (ఆమడ అంటే రెండు మైళ్ళా? నాలుగు మైళ్ళా? గుర్తులేదు).
సింహాలు బాబుగారు త్రికాలాలో సంధ్యవార్చేవారు. వండిన వంటలు దేవతార్చన అయ్యేకనే భోజనకార్యక్రమం. ఆ సమయంలో తడిపి ఆరేసిన వేరే బట్టలు కట్టుకునే భోజనాలు చేయాలి. భోజనాలు అరటి ఆకుల్లోనే. భోజనానంతరం ఆయనకు తాంబూలం వేసుకునే అలవాటు. ఆయన దగ్గర నగిషీలు చెక్కిన ఒక పాన్దాన్ వుండేది. అందులో ఆకు, వక్క, సున్నం, లవంగం, ఏలక్కాయ వంటి వస్తువులు పెట్టుకునేందుకు వీలుగా వుండేది. తన తాంబూల సేవనం అయ్యాక, నాకు బాగా గుర్తు, నాకు బాగా చిన్నప్పుడు, నన్ను తన గుండెలమీద కూర్చోపెట్టుకొని పాటలు, పద్యాలు, శ్లోకాలు చదివేవారు. అలాటివాటిలో "చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ" ఒకటి. ఆ పద్యంలో "బంగారు మొలతాడు పట్టుదట్టీ"లు మాత్రం బాగా జ్ఞాపకం ఉండిపోయాయి.
మా సామవేదుల వారి సందులో మొదటి మూడిళ్ళూ పూరిళ్ళే. మేమున్నదానికి మిద్దె. ఆ పైన కప్పు వుండేది. ఆ ఇల్లు మట్టితో సున్నంతో కట్టేరట. నాకు తెలిసే సరికే ఆ యిల్లు కట్టి వంద సంవత్సరాలు దాటిందని చెప్పుకునేవారు. ముందు వెనకల ఇల్లు. మధ్యవాకిలి. వీధిలో ఒక వసారా. ఆ వసారాలోని గోడల మీద రెండు వరసల్లో కొన్ని నిలువుగీతలు , కొన్ని చుక్కలు ఉండేవి. అవి ఎందుకో ఎవరు పెట్టేవారో తెలిసేది కాదు. అలాటి నిలువు గీతలు, చుక్కల బొట్లు మరికొంతమంది ఇంటి గోడలమీదా చూసాను. ఇలాటి గీతలు భానుమతి నటించిన ఆలీబాబా 40 దొంగలు సినీమాలో కూడా తరువాతెప్పుడో చూసాను. ఒకసారి అరటి ఆకులు సప్లై చేసేవాడు, తమలపాకులు సప్లై చేసేవాడు వచ్చి అరటి ఆకుల కట్ట ఇచ్చి గోడమీద ఆకు పసరుతో ఒక నిలువు గీత పెట్టేడు. తర్వాత వచ్చిన తమలపాకుల వాడు ఓ కట్ట తమలపాకులు ఇచ్చి గోడమీద ఆకు పసరుతో ఒక బొట్టు పెట్టాడు. ఇలా వాళ్ళు నెలంతా గీతలు, బొట్లు పెట్టి నెలాఖరున వాటి లెఖ్ఖకట్టి డబ్బులు తీసుకునేవారు. వాళ్ళ దగ్గర వేరే ఎకౌంట్ బుక్సేం ఉండేవి కావు. గోడలే ఎకౌంట్ బుక్స్. ఆ గీతల డబ్బులు చేతిలో పడగానే గోడలమీది గీతలను, బొట్లను తుడిపేసేవారు. కొత్త నెలకు మళ్ళీ ఫ్రెష్ గా నిలువుగీతలు, పెద్ద బొట్లు తయారయేవి. అలాటి వసారాను దాటుకొని లోపలకు వెళ్ళగానే కుడిచేతివేపు ఒక గది (దానికి మిద్దె ఉండేది). తర్వాత వాకిలి దాటాక మరో వసారా. లోపల నట్టిల్లు. పూజాగది కూడా అదే. అక్కడ ఒక అటక. తర్వాత వంటిల్లు. కర్రలు, బొగ్గుల పొయ్యిలు, కుంపట్లు వుండేవి. అది దాటితే వెనక పెరడు. మంచినీళ్ళ నుయ్యి. ఆ నూతి చప్టాలమీదనే స్నానం. ఆ నుయ్యి రెండిళ్ళవారికి కామన్. వారికి, వీరికి సంబంధంలేకుండా మధ్యన మట్టిగోడలు. ఇంటికి దూరంగా టాయ్లెట్స్. వర్షాకాలంలో చాలా ఇబ్బంది అయేది. పెరట్లో జామి, నారింజ, కరివేపాకు చెట్లు, దట్టమైన మల్లి, కనకాంబరం, చామంతి పూల మొక్కలు. పొట్ల, బీర, ఆనప, దొండ, చిక్కుడు పాదులు, గోంగూర మొక్కలతో పచ్చపచ్ఛగా ఉండేది. అందరి పెరళ్ళూ ఇలాటి పాదులు, మొక్కలతో కలకలలాడేవి. పెరళ్ళలో ఐంటికి ఇంటికి మధ్య గోడలున్నా, అవి దాటి ఇతరుల ఇళ్ళకు వెళ్ళే ఎత్తులోనే వుండేవి. మా ఇంటి మధ్య వాకిట్లో మందార, రంగు రంగుల పట్టెడ పూల మొక్కలు (చంద్రకాంతలు), గులాబీ, ఎర్రగన్నేరు (కొన్ని ప్రాంతాల్లో 'కరివేరు' అంటారు) చెట్లుండేవి. గోడవారగా వరసగా రుద్రజడ మొక్కలుండేవి. ఆ ఆకు రసం చెవిపోటుకు దివ్యౌషధం. ఎంతటి నొప్పైనా వెంటనే తగ్గిస్తుంది. ఆ రుద్రజడ గింజలను సబ్జాగింజలంటారు. ఎండాకాలంలో ఆ గింజలతో బళ్ళమీద, షాపుల్లోనూ షర్బత్ లు అమ్మేవారు. సబ్జాగింజలు ఒంటికి చలవచేస్తుందట. ఇల్లు పాతకాలంది కావడంవల్ల గోడలన్నీ పచ్చ తివాసిలా పాకుడుపట్టివుండేది. అక్కడ రోకలిబండలు, నల్లగా నిగనిగలాడుతూ పసుపురంగు చుక్కలతో కలర్ ఫుల్ గా గాజుపురుగులు గుంపులుగా పరిగెడుతూ ఉండేవి. తరచూ బొరిగెలతో గోడలను చెక్కుతూ శుభ్రపరుస్తూండేవారు. ప్రతీ పండగకు గోడలన్నీ పేడతో అలికి, సున్నం వేసి గోడల క్రిందిభాగం ఎర్ర జేగురుతో పూసి వాటి మీద వరిపిండి, సున్నం పేస్ట్ మిక్స్ తో చక్కగా బొట్లు, ముగ్గులు పెట్టేవారు. ఆ సమయంలో వసారా గోడమీది ఎకౌంట్స్ మాయమైపోయేవి.
ఈ రకమైన ఇంటిపనులన్నీ మా అమ్మమ్మగారు, దొడ్డమ్మగారే చేసుకునేవారు. ఇళ్ళు నేయడం , పురిగడ్డితో కప్పడం వంటి పనులకు బయట మనుషులు వచ్చేవారు. అలా ఇంటి కప్పులు పాతవి మార్చి కొత్తవి వేసేప్పుడు తేళ్ళు, జెర్రిలు, పాములు బయటపడేవి. వాటన్నిటిని తొలగించి రెల్లుగడ్డితో కప్పేవారు. ఒకసారి ఇల్లు నేయిస్తే కనీసం మూడేళ్ళవరకు తిరిగి చూడనక్కరలేదు. ఆ ఇళ్ళమీద పుల్లగుమ్మడి, తియ్యగుమ్మడి, ఆనప, దోస, బీర పాదులుండేవంటే ఆనాటి ఇళ్ళనేత ఎంత పటిష్టమైనదో ఊహించుకోవచ్చును.
ఇంట్లో పూచిన పువ్వులు ఆడవారి పూజలకు వినియోగించేవారు. మా తాతగారు తన పూజా పుష్పాలు తను పని చేసే బ్యాంకు నుండి కోసుకు తెచ్చుకునేవారు. అక్కడ ఆ పువ్వుల మొక్కలను నాటి పెంచి పోషించేది ఆయనే. బ్యాంక్ తాళాలు ఆయన దగ్గరేవుండేవి. ఇంటి బాధ్యత అంతా తానే చూసుకునేవారు. ఇంట్లోవారికి ఏది అవసరమైనా వెంటవెంటనే గమనించి అమర్చిపెట్టేవారు. చాలా గోప్యమైన వ్యక్తి. ఎటువంటి ఆర్భాటం, హడావుడి లేకుండా గుట్టుగా సంసారం నడిపేవారు. నిర్వికార యోగి. బ్యాంక్ స్టాఫ్ కు ఆయనొక దైవం. అతి మర్యాదగా వ్యవహరించేవారు. ఈయన కూడా ఎవరి విషయాల్లో జోక్యం చేసుకునేవారు కాదు. తనేమిటో,తన పనేమిటో అంతవరకే. విజయనగరం తాతగారింటి వాతావరణానికి, బొబ్బిలి తాతగారింటి వాతావరణానికి పరస్పర విరుధ్ధం. విజయనగరం ఇల్లు ఇరవైనాలుగు గంటలు పాటలు పద్యాలు, వచ్చేపోయే జనాలతో ఒకే హడావుడి. బొబ్బిలి ఇల్లు ప్రశాంతంగా ఒక మునివాటికలా ఉండేది. ఎప్పుడో సాయంత్రం పూట మాఇంటి నూతినీరు తియ్యగా వుంటుందని మాకు పరిచయస్తుల కుటుంబాల ఆడవారు బిందెలతో వచ్చేవారు. మా ఇంటిలో పువ్వులు పెట్టుకునేవారు లేనందున పెరట్లోని పువ్వులను కోసి ఆ వచ్చే ఆడవాళ్లకు పంచేవారు. అలాగే, పండగలకు, పబ్బాలకు కూరగాయలు, కరివేపాకు, నారింజ వంటివి పంచిపెట్టేవారు. హడావుడి జీవితానికి అలవాటు పడ్డవాళ్ళు బొబ్బిలి ఇంటిలో ఒకరోజు కూడా గడపలేరు. ప్రశాంతమైన, నియమబధ్ధ జీవితానికి అలవాటుపడినవారికి ఆ యిల్లెంతో చాలా ఆహ్లాదకరంగా వుంటుంది. నా బాల్యం, చదువు అలాటి వాతావరణం లో జరిగింది. అందువలన నాకు ఎక్కువగా ఒంటరిగా గడపడంలోనే ఆనందం లభించేది. కానీ దీనివలన నేను పదిమందితో స్వేఛ్ఛగా, ధైర్యంగా నా భావాలను చెప్పలేకపోయేవాడిని. మా ఇంటికి ఎదురుగానే బ్రాంచ్ స్కూల్. మధ్యలో స్కూల్ ప్రహరీ గోడ ఒక్కటే అడ్డు. అందులోనే నన్ను సెకెండ్ ఫారమ్ లో చేర్పించారు. ఆ స్కూల్ రాజావారిది. మా నాన్నగారి కాలంలో ఆడపిల్లల బడి. ఎనిమిది క్లాసులవరకు ఉండేది. తొమ్మిదవ క్లాసు నుండి హైస్కూల్ కు వెళ్ళాలి. అదీ రాజావారిదే. ఈ గర్ల్స్ స్కూల్లో ఆడపిల్లలు ఎనిమిదో క్లాసు ముగించి వెళ్ళిపోయేప్పుడు ఈ స్కూలు గుర్తుండిపోయేలా ఏవో చక్కటి కానుకలు ఇచ్చి పంపేవారట. ఆనాడు విద్యలను, విద్యార్ధులను ప్రోత్సహించే తీరు అలావుండేది. మా కాలం వచ్చేసరికి అది కో ఎడ్యుకేషన్ బ్రాంచ్ స్కూల్ గా మారింది. మా ఇంటివేపు గేట్ లేదు. స్కూల్ ముందు గేట్ లోనుండే స్కూలుకు వెళ్ళాలి. మా ఇంటినుండి మూడు, నాలుగు నిముషాలు. వీధిలో పెద్దలెవరూ కనపడకపొతే మా ఇంటివేపున్న గోడలు దాటి అవతలవేపున్న క్లాసుల్లోకి పరిగెత్తేవాళ్ళం. అలాచేయడంలో ఒక్కొక్కసారి కాళ్ళు చేతులు చెక్కుకుపోయేవి, క్లాసుకి పరగెత్తే తొందరలో. ఆ బ్రాంచ్ స్కూలు చాలా పెద్దదే. ఒక్కొక్క క్లాసుకు చాలా సెక్షన్సే ఉండేవి. స్కూల్ మధ్య ఖాళీస్థలంలో, లేదా ముందు గేటు దాటాక వచ్చే స్థలంలో కానీ ప్రేయర్స్, జండా వందనాలు, ఆటలు జరిగేవి. స్కూలు చుట్టూర పెద్ద పెద్ద రంగు రంగు పువ్వులతో గరుడవర్ధనం, నందివర్ధనం చెట్లుండేవి. అప్పట్లో నాతో చదివిన వారిలో మహమ్మద్ హాజీ, నంబియార్ వేణుగోపాల్, ముప్పాళ అప్పన్న పేర్లు మాత్రమే గుర్తున్నాయి. (ఈ ముగ్గురిని మరల ఓ 43 ఏళ్ళ తరువాత బొబ్బిలిలో జరిగిన మా బిసిఐసి ఉత్సవాలలో, అందులోనూ లోకల్ కమిటీ మెంబర్స్ గా కలుసుకుని మూడు రోజుల ఉత్సవాలలో వాళ్ళతో గడపడం నేను ఊహించలేని విషయం). ఈ ముప్పాళ అప్పన్న అనే అతను వయసులో మా అందరికంటె బాగా పెద్ద.అప్పటికే మీసాలొచ్చేసాయి. ఆటల్లో ఫస్ట్. చదువులో లాస్ట్. అదే క్లాసులో ఏడు సంవత్సరాలుగా ఉంటున్నాడనేవారు. మంచి ఫుట్ బాల్ ప్లేయరన్న కారణంగా స్కూల్లోంచి తీసేయలేదని అనేవారు (వినడానికి అతిశయోక్తిగానే వుంటుంది). స్కూల్లోని పిల్లలకే కాక, టీచర్లకు అతనంటే పక్క బెదురుండేదనేది నిజం.
ఆ స్కూల్ నాలుగు పక్కలా రూఫ్ ల క్రింద గోడలకు వెంటిలేషన్ కోసమని పెద్ద పెద్ద రంధ్రాలుండేవి. లోపలివేపు జాలీలతో మూసేసివుండేవి. బయటవేపు, చీకటి పడే సమయానికి ఎక్కడనుండి వచ్చేవో గుడ్లగూబలు వచ్చి అందులో చేరేవి. ఆ వూరు వెళ్ళిన కొత్తలో ఆ గుడ్లగూబల అరుపులు భయంగా ఉండి నిద్రపట్టేది కాదు. అలాగే, మా పక్కింటాయన గురక ఒకటి. (ఆ ఇల్లు పాల్తేరు మధురకవి వారిది) ఆయన పేరు సూర్యనారాయణ రాజు. ఆ ఇంట్లో అద్దెకుండేవారు. హైస్కూల్ రైటర్. చాలా ఎర్రగా బొద్దుగా ఉండేవారు. గొడుగు లేకుండా బయటకు వెళ్ళేవారు కాదు. ఆయనకు ఆస్త్మా వుండేది. రాత్రుళ్ళు విపరీతంగా దగ్గుతూ ,మూలుగుతూవుండేవారు. విపరీతమైన ఆ గురక చాలా భయంకరంగా వుండేది. ఆయన గొంతు కూడా చాలా బొంగురుగావుండి, పగటి పూట కూడా ఆయనను చూస్తేనే భయంవేసేది. ఆయన భార్య లలితమ్మగారు. ఒక అబ్బాయి. నా ఈడువాడే. పేరు గోపాలకృష్ణ రాజు.
ఆ స్కూల్లో చేరడానికి ముందో తరువాతో గుర్తులేదు కాని రాత్రిపూట, మా ప్రక్క అగ్రహారం వీధిలోని ఒక మాస్టారింటికి ట్యూషన్ కు వెళ్ళేవాడిని. ఆయనను అందరూ N L మాస్టర్ అనేవారు. (నడిమింటి లక్ష్మీ నరసింహం ఆయన పూర్తి పేరు). ఆయన అన్ని సబ్జెక్ట్స్ చెప్పేవారు. బ్రాంచ్ స్కూల్ మాస్టర్. చాలా కోపిష్టి. చాలా కఠినుడు. ఏ చిన్న తప్పు చేసినా కర్రతో కొట్టడం, తొడపాశం పెట్టడంలాటివి చేసేవారు. స్వపర భేదం వుండేది కాదు. తన పిల్లలైనా, బయట పిల్లలైనా, ఆడైనా, మగైనా శిక్షమాత్రం ఒకలాగే వుండేది. ఆనాటి తల్లిదండ్రులకు తమ పిల్లలు బాగా చదివి ప్రయోజకులు కావాలి. ఆ క్రమంలో వారి బాగుకోసం స్కూల్లో మాస్టర్లు శిక్షించినా, కఠినంగా వున్నా తల్లిదండ్రులు జోక్యం చేసుకునేవారు కాదు. (అదే యిప్పుడైతే, తమ పిల్లల మనోభావాలు ఏమాత్రం దెబ్బతిన్నా స్కూల్ ముందు ధర్నాలు, HRCకి ఫిర్యాదులు, టీచర్లకు suspensions, dismissal orders). ఇంత జరిగాక కూడా చదువు అబ్బకపోతే వాడి ఖర్మంతే అని ఏ వృత్తి విద్యల్లోకి, చిల్లర పనులకి తోలేవారు. NL మాస్టారి దగ్గరకు మగపిల్లలతో పాటు, ఆడపిల్లలు వచ్చేవారు. వారిలో వఝ్ఝల సంగమేశ్వరరావు మాస్టారి అమ్మాయిలు కళ్యాణి, మురళీ కూడా ఉండేవారు. సంగమేశ్వరరావు గారు అప్పటికే బొబ్బిలి హైస్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. అయినా, ఆయన పిల్లలు ఈయన దగ్గర ట్యూషన్ కు వచ్చేవారు. రాత్రిపూట ట్యూషన్ కు వెళ్ళేప్పుడు పిల్లలు ఎవరి లాంతరు వాళ్ళే తెచ్చుకోవాలి. ఆ రోజుల్లో చాలా ఇళ్ళల్లో కరెంట్ ఉండేది కాదు. (నా కోసమని మా తాతగారు ప్రత్యేకంగా ఒక పెద్ద లాంతర్ కొన్నారు. మా ఇంట్లో రెండుమూడు రైల్వే స్టేషన్లలో లైన్ మేన్లు వాడే దీపాల్లాంటివి ఉండేవి. వాటికి నాలుగు పక్కలా అద్దాలు ,ఒక ద్వారం ఉండేవి. వీటినెప్పుడో రైల్వే చుట్టాలు తెచ్చి పడేసారు. ఇవికాక రెండు లాంతర్లు, రెండు బుడ్డి దీపాలు వుండేవి).
సెలవు రోజుల్లో ట్యూషన్ మధ్యాహ్నం వుండేది. మాస్టారు ఇంట్లో లేకపోతే రణగొణధ్వనే. ఉన్నట్టుండి ఒక్కోసారి ఏ మబ్బు లేకుండానే వర్షం పడేది. ఒక పక్క ఎండ కాచేది. అది చూచి ఈ ఆడ,మగపిల్లలంతా ఒకేసారి గాఠిగా 'ఎండా వానా, నక్కల కుక్కల పెళ్ళి' అని అరుస్తూ గంతులేసేవారు. అలా ఎందుకు అరిచి గంతులేసేవారో నాకు తెలిసేది కాదు. వాళ్ళతో సమానంగా గంతులేసి అరవడానికి ధైర్యం చాలేది కాదు.
మా సామవేదుల వారి సందులోనే నా వయసు పిల్లలు చాలామందే ఉండేవారు. పాలకొండ డాక్టర్ గారి పిల్లలు, మధ్య కామేశ్వరిగారి భాస్కరం ( బాచీ), రైటర్ రాజుగారి గోపి ఒకే వయసువాళ్ళం. ఒక్క స్కూల్ టైము, రాత్రుళ్ళు తప్ప మిగతా కాలమంతా ఆ సామవేదుల వారి సందులోనే ఆటలతో గడిపేవాళ్ళం. బొంగరాలు , కర్రా బిళ్ళ, గోళీలు, తొక్కుడుబిళ్ళ సహా. అలాగే బచ్చాలాట కూడా - సిగరెట్ పెట్టెల అట్టలను పేకముక్కల్లా చింపి వాటిని నేల మీద ఒక పెద్ద రౌండ్ లో పెట్టి వాటిని దూరం నుంచి వెడల్పాటి రాళ్ళు లేక పెంకులతో గురిచూసి కొట్టాలి. అలా కొట్టినప్పుడు ఎన్ని అట్టముక్కలు గిరికి అవతలవేపుకు వెళితే అవన్నీ కొట్టినవాడి సొంతం. నిజానికి ఇదీ నిషేధింపబడిన లిస్ట్ లో ఉండే ఆటే. కొంతమంది పందేలు కాసి నిజం డబ్బులతోనే ఆడేవారు. అది వ్యసనంగా మారిపోతుందని భయం. అలాగే కర్రాబిళ్ళ ఆట కూడా. దాని వల్ల దెబ్బలు, దెబ్బలాటలు వస్తాయని ఆ ఆటనీ మాకు నిషేధించారు. వీటితో పాటూ మరో కాలక్షేపం కూల్ డ్రింక్స్ మూతలను రౌండ్ గా చేసి వాటి మధ్య రెండు కన్నాలు పెట్టి వాటి మధ్య దారం కట్టి వాటిని తిప్పడం. కంటికి కనపడనంత స్పీడ్ గా తిరిగేవి. అయితే అవి కూడా ప్రమాదమే. పొరపాటున శరీరానికి తగిలితే గీసుకుపోతుంది. ఇవి తర్వాత కిల్లీ కొట్లలో పెప్పర్ మెంట్లుగా అమ్మేవారు. ఆడినంతసేపు ఆ దారం సాయంతో ఆడడం, తరువాత దారం తీసేసి నోట్లో వేసుకొని చప్పరించడం.
పాలకొండ డాక్టర్ గారి పేరు ర్యాలి కామేశ్వరరావు. ఆయన తండ్రి పేరు గుర్తులేదు. రిటైర్డ్ హెడ్మాస్టర్. ఆజానుబాహువు. బట్టతల, పంచెకట్టు, పొడుగుచేతుల లాల్చీ. చాలా గంభీరమైన కంఠం. ఆయన బయటకు వస్తున్నారంటే పిల్లలందరికీ హడల్. ఒక్కడు కూడా బయట కనపడేవారు కాదు. వారిది చాలా పెద్ద డాబా ఇల్లు. పెద్ద పెద్ద వరండాలు. ఒక పక్క క్లినిక్. పేరేదీ వుండేది కాదు.(పాలకొండ డాక్టర్ అంటేనే చాలు).
ఆ ఇంటి వరండాలలో గాంధీ, నెహ్రూ, నేతాజీ, పటేల్, రవీంద్రనాథ్ టాగూర్, మొదలైన ప్రముఖుల నిలువెత్తు సైజులో పటాలు గ్రేకలర్ లో గోడలకు వెలాడుతూండేవి. నలుగురో, ఐదుగురో డాక్టరు గారి సంతానం. అందరిలోకి పెద్దావిడ నరసుబాయి. ఆఖరి యిద్దరూ దినకర్ (దిన్ను), శాంబూ. పెద్దయ్యాక ఒకరు సి.ఎ. మరొకరు డాక్టర్ అయ్యారట. వాళ్ళింట్లో చిన్న పెద్ద అందరికీ కళ్ళజోళ్ళుండడం నాకొక వింత. అన్నిటికన్నా మరో పెద్ద వింత ఆ ఇంట్లో చిన్నవాళ్ళను కూడా పెద్దవాళ్ళు 'గారు' అని సంబోధించేవారు. ఆ ఇంటిని ఆనుకునే పెద్ద కామేశ్వరిగారి పసుపురంగు మేడ. ఆవిడ కుమారుడు ఎస్ ఎమ్ రావుగారు. మధ్యప్రదేశ్ లో రైల్వే లో స్టేషన్ మాస్టర్. ఆయనకు కొడుకులు, కూతుళ్ళు పెద్ద సంసారమే. అందులో ఒక అమ్మాయి లక్ష్మి(సుగుణ) చక్రవర్తుల సత్యనారాయణ గారి భార్య. ఆయన చెల్లెలు లక్ష్మి మా మురళీ భార్య. ఎస్ ఎమ్ రావు గారి మరో అమ్మాయి జయలక్ష్మి(రాణి). కొల్లూరి కోటేశ్వరరావు గారి భార్య. వీరందరితోటి అనుబంధం పెరిగింది మద్రాసులోనే. అందుచేత వీరి ప్రస్తావన రాబోయే అధ్యాయాలలోనే. మా ఇంటికి ఆనుకొని ఎడంచేతివేపు ఒక డాబా ఇల్లు. అందులో ఒక సానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఉండేవారు. ఒకే కొడుకు. చిరంజీవి. ఎర్రగా, పొడుగ్గా నిన్నటి తరం హీరో శ్రీకాంత్ లా వుండేవాడు. వైజాగ్ కాలేజీలో చదువు. హాస్టల్ లో ఉంటూ సెలవులకు తల్లిదండ్రుల దగ్గరికి బొబ్బిలి వచ్చేవాడు. ఆ ఇంట్లో అందరూ దొరల తెలుపులో ఉండేవారు. ఆ పెద్దాయన డ్యూటిలో ఉంటే ఖాకీ నిక్కర్, షర్ట్, ఖాకీ టోపి, ఎర్రబూట్లతో వెళ్ళేవారు. మొదట్లో పోలీసాయన అనుకునేవాడిని తేడా తెలియక.
ఆ ఇంటి పక్కన సామవేదుల సూరమ్మగారిల్లు. ఆ పక్కన భాగవతుల రామావతారంగారిల్లు. వీరంతా మా తాతగారికి దగ్గర బంధువులే. ఆ ఇళ్ళవారంతా రైల్వేలలో పనిచేయడం వలన ఆ ఇళ్ళలో వేరెవరో అద్దెలకుండేవారు. ఆ ఇళ్ళలో కరెంట్ లైట్లుండేవి. ఆ రెండిళ్ళలో ఒక ఇంటిలో
టొబాకో డిపార్ట్మెంట్ లోని ఆఫీసర్ ఉండేవారు. పొగాకు ఇన్స్పెక్టర్ అనేవారు. వారికి ఒకే అమ్మాయి. నాకంటే పెద్దదే. పేరు సీతాలక్ష్మి. థర్డ్ ఫారమ్ లో చేరింది. చాలా చొరవగా కలివిడిగా మాట్లాడేది. స్కూల్ లో చేరిన మొదటి రోజుల్లో స్కూలుకు తనకు తోడుగా వెళ్ళడానికి నన్ను పురమాయించారు. కానీ, నేను కూడాకలసి వెళ్ళలేదు. వెళ్ళిన రెండు మూడు రోజులు ఆ అమ్మాయికి వంద గజాలు ముందో, వెనకో ఉండేవాడిని. ఇది చూసి ఆ సీతాలక్ష్మి నా సాయం ఏమీ అఖ్ఖరలేదని తానే ఒంటరిగా వెళ్ళిపోయేది. నాకు పెద్ద రిలీఫ్.
సామవేదుల వారి సందుకు ఎదురుగా ఒక మేడ ఇల్లు. ఉప్మాకవారిది. నారాయణప్పవలసవారు. ఆ ఇంట్లో అబ్బి, కామేశ్వరావు గార్లు అన్నదమ్ములు, వారి సంసారాలు ఉండేవి. సంగీతం పట్ల, ముఖ్యంగా పౌరాణిక నాటకాల పద్యాలంటే విపరీతమైన మోజు. హార్మోనియం వాయిస్తూ చాలా బాగా పద్యాలు చదివేవారు. ఆ ఇంటి హడావుడి వీధంతటికీ తెలిసేది. ఆ ఇంట్లనే గుమ్మా అమ్మన్నగారి కుటుంబం వుండిన గుర్తు. ఆవిడ మా అమ్మమ్మగారికి, దొడ్డమ్మగారికి చాలా సన్నిహితురాలు. ఆవిడ కుమార్తె సుగుణకు మా అమ్మగారికి, శారదకు మంచి స్నేహం. ఆ అమ్మన్నగారి పెద్దబ్బాయి విశ్వనాధం సుగర్ ఫాక్టరీలో పనిచేసేవారు. ముగ్గురో నలుగురో అన్నదమ్ములు. ఒకాయన ప్రభు అందులో ప్రసన్నకుమార్ గారు మా మరదలు సుధారాణి పినతల్లిగారి భర్త. బొబ్బిలి వదిలాక ఆయనను చూసింది పాతికేళ్ళ తరవాత మా గోపి పెళ్ళిలోనే. వాళ్లంతా వయసులో నాకన్నా పెద్ద. ఈ ఉప్మాక వారింటికి కుడిపక్కన మహమ్మద్ గౌస్ఖాన్ గారిల్లు. ఆయనకు పెద్ద బజార్లో ఒక కాఫీ హోటలుండేది. ఆ గౌస్ ఖాన్ గారు తమ చిన్నతనంలో బొబ్బిలి రాజావారితో గుర్రాల మీద పోలో ఆట ఆడేవారట. ఆయన ఇంటి పక్కనే బొబ్బిలికి ల్యాండ్ మార్క్ లాటి ఆంజనేయస్వామి గుడి. ఆ కోవెల పూజారి పూరిల్లు కూడా అందులోనే. ఆయన కొడుకు నాకు పరిచయం. ముఖ్యప్రాణేశ్వరరావు. అరుదైన పేరు. అందుకే ఆ మనిషి రూపు నా మనస్సులో మాసిపోయినా పేరు మాత్రం గుర్తుండిపోయింది. ఆంజనేయస్వామి కోవెల వెనకవేపు పాత బస్టాండ్. బస్టాండ్ వుంటే దానిని ఆనుకొని టీ స్టాల్స్, కిల్లీకొట్లు , పాక హొటల్స్ ఉండకతప్పదు. ఉల్లిగార్లకు, పకోడీలకు ఆ పాక హోటల్స్ ప్రసిధ్ధి. ఆ పాకల తడకలకు కొత్త, పాత సినీమాలలో వాల్ పోస్టర్లు, జమున, అంజలి, సావిత్రి అంటూ వాళ్ళ ఫోటోలు అంటించివుండేవి. కీచుమని కిళ్ళీబడ్డీలలోని గోలీసోడాల చప్పుళ్ళు, వచ్చీపోయే బస్సుల రొదలు. అమ్మకాల వాళ్ళ అరుపులతో రాత్రి తొమ్మిది వరకు ఆ ప్రాంతమంతా చాలా హడావుడి గా ఉండేది. విజయనగరం, రాజాం, సాలూరు, పార్వతీపురం, వంత్రం వంటి ఊళ్ళకు ఆ బస్ స్టాండ్ నుంచే బస్సులు వెళ్ళేవి.
ఆ బస్ స్టాండ్ నుండి తిన్నగా ముందుకు వెడితే ఒక పక్క హైస్కూల్ రోడ్, మరోపక్క చెలికాని వెంకట్రావు, అచ్యుతరావు గార్ల రైస్ మిల్. ఆదే చీపురుపల్లిరోడ్. అక్కడే బొబ్బిలియుధ్ధం నాటి తాండ్రపాపయ్య సంస్మరణార్ధం ఒక చావడి వుండేది. అందులో ఆయన పేరిట ఒక ఎలిమెంటరీ స్కూల్ వుండేది. అవన్నీ దాటుకొని ముందుకు సాగితే రైల్వే స్టేషన్.
ఆంజనేయ స్వామి గుడినుండి బొబ్బిలి రాణీగారి పూలబాగ్ కు వెళ్ళే వీధి అగ్రహాం వీధి. ఎడమ ప్రక్క సామవేదులవారి సందు, జూబ్లీ రోడ్, అడ్డు అగ్రహారం వీధులు. అగ్రహారం వీధిలో నడిమింటి కుటుంబాలు మూడు ఉండేవి. సూర్యనారాయణ స్వామిగారిల్లు, NVG మాస్టారు (నడిమింటి వేణుగోపాలస్వామిగారు), NL మాస్టారి కుటుంబం. వీరంతా తాతా సహోదరుల పిల్లలు. నడిమింటి వేణుగోపాలస్వామిగారు బొబ్బిలి హైస్కూల్ హెడ్ మాస్టర్ గా చాలా ప్రసిధ్ధులు. ఎప్పుడూ పంచె, చొక్కా, కోటుతోనే వుండేవారు. ఆయన తమ్ముడో, కజినో తెలియదు ఎన్ ఆర్ శివస్వామి ఢిల్లీలో ఇన్కమ్ టాక్స్ ట్రిబ్యునల్ లో చాలా పెద్ద పోస్ట్ లో ఉండేవారు. సూర్యనారాయణ స్వామిగారు వీరందరిలో పెద్ద. వారి తండ్రిగారేదో వడ్డీలకు డబ్బు తిప్పేవారని చెప్పేవారు. భూవసతి వుండడంతో ఎవరికీ ఉద్యోగాలు చేయవలసిన అవసరం లేదు. ఈ సూర్యనారాయణ స్వామిగారు మా తాతగారికి స్నేహితుడు. ఆయనకు క్రాఫ్ ఉన్నా వెనకాల చిన్న పిలక కూడా వుండేది. రోజూ రాత్రి భోజనాలయాక మా తాతగారు కనీసం ఒక గంటైనా వాకింగ్ చేసి వచ్చి వారింటి అరుగుల మీద ఇరుగు పొరుగు వారంతా కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుకునేవారు. సెకెండ్ షో సినీమా మొదలెట్టాక, రాయపూర్ రాత్రి బండి వెళ్ళాక, స్టేషన్ నుండి వచ్చే జట్కా బళ్ళను చూసి తర్వాత నిద్రలకు లేచేవారు. ఇది ఒక రోజూ రెండు రోజులు కాదు. దశాబ్దాలపాటు ఇదే దినచర్య.
ఈ కుటుంబాలలో శివస్వామి పేరు చాలా కామన్ గా వినిపించేది. సూర్యనారాయణ స్వామిగారి పెద్దబ్బాయి శివస్వామి నా కంటే కొంచెం పెద్ద. నాటకాలంటే విపరీతమైన పిచ్చి. తనే నాటకాలు రాసి జిల్లాస్థాయి నాటక పోటీలలో పాల్గొనేవాడు. 'అంతర్వాణి' అనే నాటకం తరుచూ ఆడేవారు. దీనితో చదువు కుంటుపడింది. తర్వాత ఎప్పుడో ప్రైవేట్ గా MA పూర్తి చేశాడట. అతని తమ్ముడు లక్ష్మణస్వామి. వీళ్ళకు ఒక అక్కగారుండేది. ఆవిడ పేరు అన్నపూర్ణ అని గుర్తు ఆవిడ మా శారదకు స్నేహితురాలు. వాళ్ళింట్లో ఒక టాయ్ పెడల్ కారు ఉండేది. నా చిన్నతనంలో దాంట్లో కూర్చొని ఆ ఇంటి మధ్య వాకిట్లో తిరగడం ఒక థ్రిల్ గా ఉండేది.
....సశేషం
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.