visitors

Monday, February 7, 2011

పట్రాయని సంగీతరావు

శ్రీ పట్రాయని సంగీతరావుగారు- శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారి ప్రధమ పుత్రుడు.
పట్రాయని సంగీతరావుగారికి మొదట పెట్టిన పేరు నరసింహమూర్తి, అసలు పేరు తాతగారి పేరే అయినా సంగీతరావుగానే ప్రసిద్ధులు, సార్థక నామధేయులు.
పట్రాయనివారి సంగీతకుటుంబంలో మూడవతరానికి చెందినవారు సంగీతరావు. తాతగారు పట్రాయని నరసింహ శాస్త్రిగారు, తండ్రిగారు పట్రాయని సీతారామశాస్త్రిగారు. సంగీతరావు-వీరిరువురి సంగీత 
 వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు.

బాల్యం


1920 నవంబరు 2న సీతారామశాస్త్రి, మంగమ్మల ప్రథమ సంతానంగా ఇప్పటి విజయనగరం జిల్లా, కిండాం అగ్రహారంలో మాతామహుల ఇంట జన్మించారు. ఆయపిళ్ళ లక్ష్మీ నారాయణ, చెన్నమ్మ దంపతులు మాతామహులు. ఇద్దరు సోదరులు పట్రాయని నారాయణమూర్తి, పట్రాయని ప్రభాకరరావులు. 


సీతారామశాస్త్రిగారు సంగీత శిక్షకులుగా జీవనయానం చేస్తున్నప్పుడు విజయనగరం, శ్రీకాకుళం, సాలూరు  మొదలయిన ప్రదేశాలలో సంగీతరావుగారి బాల్యం గడిచింది.

శ్రీకాకుళం జిల్లా నాగావళి ఒడ్డున వారథి పక్కన స్కూల్లో కొన్నాళ్ళు చదువుకున్నారు. సంగీతరావుగారికి ఎనిమిది, నారాయణ మూర్తిగారికి ఆరు, వారి ఆఖరి తమ్ముడు ప్రభాకరరావుగారికి రెండేళ్ళ వయసులో ఉండగా తల్లి మంగమ్మగారు  మరణించారు. ఆమె మరణం ఇటు సీతారామ శాస్త్రిగారికి, అటు పిల్లలకు జీవితంలో పెనువిషాదంగా పరిణమించింది. కొంత కాలం తల్లిగారి పుట్టింట్లో మాతామహుల దగ్గర పిల్లలు ముగ్గురూ పెరిగారు. క్రమంగా మాతామహుల సంరక్షణ నుంచి పిల్లలు ఒకరొకరిగా  సాలూరు లో స్థిరపడిన తండ్రి , తాతగార్ల  దగ్గరకు చేరుకున్నారు.
 
పట్రాయని నరసింహశాస్త్రిగారు సాలూరులో పెదగురువుగారిగా, ఆయన కుమారుడు సీతారామశాస్త్రిగారు చిన గురువుగారిగా పిలువబడుతూ సాలూరు వాసుల ప్రేమాభిమానాలను పొందిఉన్న రోజులు అవి. నరసింహశాస్త్రిగారు సాలూరులో  ఒక చిన్న ఇంట్లో వృద్ధురాలైన తల్లితో కలిసి నివసిస్తూ ఉండేవారు. సీతారామశాస్త్రిగారు సాలూరు, చుట్టుపక్కల గ్రామాలు, ,బరంపురం వంటి సంస్ధానాలలో సంగీత విద్యా ప్రదర్శనలు చేస్తూ ఇంచుమించు సంచార జీవనం చేసేవారు.ఉత్తరదేశంలో కలకత్తా, ఖర్గపూర్ వంటి ప్రాంతాలలో కూడా సంగీతకచేరీలు చేసేవారు.


ఆ కాలంలో సీతారామ శాస్త్రిగారి పెదతల్లి కూతురు నరసమ్మగారు తల్లిలేని ఈ పిల్లల సంరక్షణ భారాన్ని నెత్తిన వేసుకున్నారు. ఆవిడ మంచి సంగీతజ్ఞానం, సాహితీ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి కావడం వలన ఆవిడ పెంపకం పిల్లల శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదం చేసింది. మంచి గమకస్ఫూర్తితో ఆవిడ పాడుతుంటే మైమరచి పోయేవారుట పిల్లలు. 

బాల్యంలో తాతగారి దగ్గర గడిపిన జీవితం సంగీతరావుగారిని అతిచిన్న వయసులోనే సంగీతజ్ఞుడుగా రూపొందడానికి సహాయం చేసింది. గొప్ప సంగీత విద్వాంసులుగా పేరు సంపాదించుకొని ఉన్న నరసింహ శాస్త్రిగారు, మనవలు సాలూరు చేరేనాటికి చాలా నిరాడంబరంగా, ఒక యోగిలాగ జీవితం సాగిస్తూ ఉన్నారు.


ఆరడుగుల ఎత్తు, బోడితలమీద జడకట్టిన చిన్న పిలక, చెవులకి ఒరిస్సాలో రూపొందిన కుండలాలు, మెడలో పెద్ద సైజు రుద్రాక్ష తావళం, కాషాయం రంగుదేరిన ధోవతి పంచెకట్టు, పైన శాలువా. ఇదీ అప్పటికి  ఎనిమిదేళ్ళ వయసులో ఉన్న  మనవడు సంగీతరావుగారి మనస్సు లో స్థిరపడ్డ తాతగారి రూపం. ఉదయం లేస్తూనే తాతగారి వెంట తిరుగుతూ పూజా పునస్కారాలకి సహాయం చేస్తూ, భజనలో గొంతు కలుపుతూ ఉండేవారు. 


ఆ రోజుల్లో సాలూరు, బొబ్బిలి ప్రాంతాలలో ఏకాహాలు, సప్తాహాలు, దేవీ నవరాత్రులు, వసంత నవరాత్రులు, వనభోజనాలు తరచుగ  జరిగేవి. భజన కాలక్షేపాలు జరిగినప్పుడు తాతగారితో పాటు వెళ్లేవారు. తాతగారి ప్రోత్సాహంతో అతి చిన్న వయసులోనే స్వరకల్పనలు చేస్తూ సంగీతప్రదర్శన చేసేవారు.


బొబ్బిలిలో ప్రముఖ విద్వాంసులు ఆకుండి నారాయణశాస్త్రిగారి దగ్గర కొన్నాళ్లు శిష్యరికం చేసారు సంగీతరావు. సీతారామశాస్త్రిగారు ఉత్తర దేశయాత్రలో ఉండగా నరసింహశాస్త్రిగారికి ఒంట్లో అనారోగ్యం ఏర్పడింది. అందువల్ల బొబ్బిలిలో మేనత్తగారి సంరక్షణలోకి మారినప్పుడు కొంతకాలం ఆ కుటుంబంతో కలిసి ఉండవలసిన సందర్భం వచ్చింది. తండ్రి దగ్గరలేడు, కుర్రవాడు చెడిపోతాడని సంగీతం నేర్చుకోమన్నారు. ఆవిధంగా బొబ్బిలిలో ఆకుండి నారాయణశాస్త్రిగారి వంటి ప్రముఖుల వద్ద శిష్యరికం లభించింది. 


ఆకుండి నారాయణ శాస్త్రిగారు బొబ్బిలి గర్ల్స్ స్కూల్ లో టీచర్ గా పనిచేసేవారు. మహారాణిగారి వద్ద ఆయన వీణాగానం చేసినప్పుడు శిష్యుడు సంగీతరావుతో పాటలు పాడించేవారుట నారాయణ శాస్త్రిగారు. స్వర పల్లవులు, లక్షణగీతాలు, వర్ణాలు ఇలా ఎన్నో నేర్చుకున్నారు ఆయన దగ్గర. 
బొబ్బిలి స్కూల్లో 4,5 తరగతులు చదువుకున్నారు. ప్రతిరోజు రాణీగారు  పూజామహల్ కి వచ్చి అర్చన చేసేవారుట. అక్కడే నారాయణశాస్త్రిగారి  వీణావాదం వినేవారుట. నారాయణశాస్త్రిగారు శిష్యుడు సంగీతరావుతో గాత్రం పాడిస్తూ వీణతో సహకరించేవారుట. 

ఆరోజుల్లో బొబ్బిలి సంస్థానంలో జరిగిన పట్టాభిషేకం గొప్ప ఉత్సవం. ఆ ఉత్సవదినం గుర్తుగా ప్రతి సంవత్సరం కార్నేషన్ డే పేరుతో బొబ్బిలిలో ఉత్సవాలు జరిగేవి. ఆ సందర్భంలో  నారాయణశాస్త్రిగారు తాను రచించిన నవరాగమాలికను సంగీతరావుతో పాడించారు. ఆరోజులలో కంటాభంజి రైల్వే వారి గణేశ ఉత్సవాలలో కచేరీ చేసి శ్రీరంగం గోపాలరత్నంగారితో పాటు బంగారు మెడల్ బహుమతిగా పొందారు. ఆ రకంగా ఎంతో చిన్న వయసులోనే సంగీత కచేరీలు చేసిన బాల విద్వాంసుడు సంగీతరావు.


శారదా వివాహ చట్టం వచ్చేస్తోందన్న తొందరలో చాలా చిన్న వయసులోనే, సంగీతరావుగారి తొమ్మిది సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది. వారి చిన్నత్తగారి అమ్మాయి శ్రీలక్ష్మి పెళ్ళికూతురు. అప్పటికి ఆమె మూడేళ్ళ పసిపాప, అందరూ ముద్దుగా చిన్నమ్మడు అని పిలిచేవారు. 

ఈ ఫోటోలో కుడిచేతిపక్కన కూర్చున్న వారు సంగీతరావుగారు, పక్కన దండ వేసుకొని నిలుచున్నవారు వారి శ్రీమతి శ్రీలక్ష్మి.
 
తాతగారు నరసింహశాస్త్రిగారి వైద్యం కోసం కుటుంబం కొన్నాళ్లు బొబ్బిలిలో ఉండి తిరిగి సాలూరు తిరిగివెళ్లిపోయారు. 


1931లో తాతగారు నరసింహశాస్త్రిగారు కన్నుమూసారు. అప్పటికి సంగీతరావుగారికి పదిసంవత్సరాల వయసు.  నరసింహశాస్త్రిగారి మరణంతో అప్పటికి సంప్రదాయం పై తిరుగుబాటు ధోరణిలో ఉన్న సీతారామశాస్త్రిగారిలో కొంత మార్పు వచ్చింది. సంప్రదాయం పై అభిమానం ఏర్పడింది. 

1919 లోనే   నరసింహశాస్త్రిగారు, సీతారామ శాస్త్రిగారు  సాలూరులో ఒక సంగీత పాఠశాల స్ధాపించి విద్యార్ధులకు ఉచితంగా సంగీత శిక్షణ ఇస్తూ ఉండేవారు.. నరసింహశాస్త్రిగారి మరణం తర్వాత ఆ సంగీత పాఠశాలను అభివృద్ధి చేయడానికి నడుంకట్టారు సీతారామ శాస్త్రిగారు. పర్ణశాలలా కనిపించే పాఠశాలకు పటిష్టమయిన కట్టడం రూపం  ఇవ్వాలని ఆయనకు కోరిక. శ్రీ శారదా గాన పాఠశాల  1936 కాలానికి భవనంగా రూపుదిద్దుకుంది.
                                                            సాలూరులోని సంగీత పాఠశాల - నాడు
                             సాలూరు లోని సంగీత పాఠశాల -నేడు


సీతారామశాస్త్రిగారు తన విద్యా ప్రదర్శనలు, కచేరీలలో సంపాదించిన ధనాన్ని, సాలూరు వాసుల కళాభిమానాన్ని, సంగీత పోషకులైన దాతల విరాళాలను పునాదులుగా  సాలూరు లో శ్రీ శారదా పాఠశాలను స్ధాపించారు. ఈ విద్యానిలయంలో ఎందరో విద్యార్థులకి  ఉచిత సంగీత శిక్షణ ఇస్తూ ఉండేవారు. బయట ఊళ్ళనుండి వచ్చిన  శిష్యులకు గురువుగారి ఇంటిలోనే బస. సాలూరు, ఇతర చుట్టుపక్కల గ్రామాలనుంచే కాక ఆంధ్రదేశంలోని పలు ప్రాంతాలనుంచి ఎందరో విద్యార్ధులు సంగీతం నేర్చుకోవడానికి  వచ్చేవారు. వారిలో చాలామంది నిర్థనులే. సీతారామశాస్త్రిగారికి అవకాశం లేని సందర్భంలో  ఆ శిష్యులను సాలూరు వాసులే ఆదుకొనేవారు.


సాలూరురాజా వారికి నాటకాలంటే సరదా ఉండేది. అనేక నాటక సమాజాలవారు సాలూరుకు వచ్చేవారు. సంస్థానంలో జరిగే ఉత్సవాలలో, పర్వదినాలలో సాలూరు, జయపురంలో  హరికథా కాలక్షేపాలు జరిగేవి. వీటికి  సీతారామ శాస్త్రిగారు హార్మోనియం సహకారం అందించే వారు. అందువల్ల ఆ నాటికి ప్రసిద్ధులయిన నటులు, ప్రముఖులెందరితోనో  సీతారామ శాస్త్రిగారికి  పరిచయం ఉండేది.  ఆవిధంగా ఎందరో ప్రముఖ నటులు, సాహితీ వేత్తల ప్రభావం  సంగీతరావుగారి పై  ప్రసరించింది.


బొబ్బిలి నాగరికంగా ఎంత అభివృద్ధి చెంది ఉన్నా, బొబ్బిలి జీవితంకన్నా సాలూరులో, తమ పాఠశాల  విద్యార్ధులతో గడిపిన జీవితమే ఆకర్షించింది సంగీతరావుగారిని. సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన శిష్యులు కొందరి గురించి, ఆనాటి వారి అమాయకమైన ప్రవర్తన, సంగీతం పైన వారు చూపిన అమితమైన శ్రద్ధాసక్తులు, తన జీవితంలో వారు ఏర్పరచిన ప్రభావం, ఆనాటి సాలూరు జీవితం గురించి సంగీతరావుగారు తన చింతాసక్తి పుస్తకం లో ఎంతో వివరంగా రాసారు.


సీతారామశాస్త్రిగారికి  కుటుంబపోషణతో పాటు పాఠశాల నిర్వహణ బాధ్యత  కూడా క్రమంగా భారంగా మారిన దశలో ఆయనకు విజయనగరంలోని మ్యూజిక్ కాలేజీలో వోకల్ ప్రొఫెసర్ గా ఉద్యోగావకాశం వచ్చింది. ఉద్యోగజీవితం పట్ల ఆసక్తి లేకపోయినా ఆర్థిక స్థితి సహకరించని ఆ పరిస్థితులలో శిష్యులకి పాఠశాలను అప్పగించి వెళ్ళలేక వెళ్ళలేక విజయనగరానికి కుటుంబంతో సహా తరలి వెళ్ళారు సీతారామశాస్త్రిగారు.

విజయనగర జీవితం


విజయనగరం విద్యలనగరంగా అప్పటికే సుప్రసిద్ధమై ఉంది. ప్రముఖ సంగీత విద్వాంసులు, సాహితీరంగంలో దిగ్గజాలెందరో విజయనగరంలో ఉండేవారు. సంగీతంలోనే కాక సీతారామశాస్త్రిగారికి ఛందోబద్ధంగా పద్యాలు అల్లడం వంటి సాహిత్యాభిమానం కూడా  ఉండడంచేత చాలామంది విద్వాంసులు, పండితులతో గాఢమయిన పరిచయం ఉండేది. 

 ప్రతిరోజు సాయంత్రం సీతారామశాస్త్రిగారి ఇంటి వద్ద సంగీత సాహిత్యాలలో అభిరుచి కలిగిన కవి,పండితులు కలుసుకుని సాహిత్య చర్చలు చేసేవారు. కవితాగోష్ఠులు జరిగేవి. సీతారామశాస్త్రిగారి మిత్రబృందం అంతా ఆనాటికే వివిధరంగాలలో ప్రసిద్ధి చెందినవారు. ఈ సాహితీ సమావేశాలు తదనంతరం కౌముదీ పరిషత్తుగా పరిణమించాయి. భారతీతీర్థ సంస్థ దీనిని తమ అనుబంధ సంస్థ గా గుర్తించింది.  సీతారామ శాస్త్రిగారు తన జీవిత పర్యంతం ఈ పరిషత్తుకి అధ్యక్షులుగా వ్యవహరించారు.   ప్రతిరోజూ సాయంత్రం తండ్రిగారు, మిత్రులతో జరిపే సంగీత, సాహిత్య గోష్టులు సంగీతరావుగారిని విశేషంగా ఆకర్షించేవి. ఆనాటి సంగీత విద్వాంసుల, సాహితీవేత్తలతో కలిగిన  పరిచయాలు సంగీతరావుగారి సంగీత సాహిత్య జీవితాలపై విశేషమైన ప్రభావం చూపాయి.


విజయనగరంలో భారతీతీర్థ సంస్థ దసరా సభలలో 1939వసంవత్సరంలో  సీతారామశాస్త్రిగారిని సంగీత భూషణ బిరుదుతో గౌరవించింది.  1952 సంవత్సరంలో  సంగీతరావుగారి విద్వత్తును గుర్తించి అదే  సంస్థ వారికి కూడా ఆంధ్ర సంగీత భూషణ బిరుదును ప్రదానం చేసింది. తండ్రితో పాటు అదే గౌరవాన్ని అందుకోవడం సంగీతరావుగారి   ప్రతిభకి తార్కాణం.


ఆకుండి వెంకటశాస్త్రిగారికి గురుపూజ జరిగిన సందర్భంలో సంగీత రావుగారు  1943 లో కాకినాడ వెళ్ళారు. అప్పుడు దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు, పాలగుమ్మి పద్మరాజు గారువంటి  ప్రముఖులతో సంగీతరావుగారికి  పరిచయం ఏర్పడింది. ఫ్రేజర్ పేట రినైసాన్స్ క్లబ్ లో సంగీతరావుగారు కచేరీ చేసారు. అప్పుడు ప్రముఖుల నుండి  లభించిన ప్రశంసలు ఆయనలో ఎంతో ఆత్మ విశ్వాసాన్ని నింపాయి.


పట్రాయని సీతారామశాస్త్రిగారు గొప్ప హార్మోనిస్టు. భారతీయ సంగీతానికి హార్మోనియం పనికిరాదని దానిని విదేశీ ప్రభుత్వం నిషేధించింది. స్వాతంత్ర్యానంతరం కూడా హార్మోనియం పై  రాజకీయ నిషేధం కొనసాగింది- నిన్న, మొన్నటిదాకా. సమకాలీన విద్వాసులు కూడా దానిని తమ కచేరీలలో ఉపయోగించేవారు కాదు. కానీ సీతారామశాస్త్రిగారికి హార్మోనియం ప్రాణసమానం. చాలా సున్నితమైన స్వరాలను, గమకాలను కూడా హార్మోనియం మీద పలికించేవారని ప్రతీతి. తండ్రిలాగే సంగీతరావుగారు కూడా హార్మోనియంని ఎంతో అద్భుతంగా నేర్పుగా వినిపించడంలో ప్రావీణ్యం చూపేవారు. ప్రత్యేకంగా ఏ విద్యాకేంద్రంలోను సంగీతాన్ని అభ్యసించడం  గాని, వాయిద్యాలపై  శిక్షణ గానీ పొందకుండానే హార్మోనియం, వీణ, వయోలిన్ వాయిద్యాల పై స్వయం ప్రతిభతో పట్టు సాధించారు.  హైస్కూలు వరకు సాలూరులోను, స్కూలు ఫైనల్ వరకు చదువును  విజయనగరం లో పూర్తిచేసారు. 


తండ్రి సీతారామశాస్త్రి గారు పనిచేసిన కాలేజీ, విజయనగరం మహరాజా సంగీత కళాశాల. విద్యలనగరం విజయనగరంలో సంగీతం నేర్చుకొని తమలోని కళను సానపెట్టుకోవడానికి వచ్చే విద్యార్థులెందరో ఉండేవారు.


అలా వచ్చిన వారిలో గురువుగారికి ఆనాడు అత్యంత ప్రీతి పాత్రుడు, నేటి మన గాన గంధర్వ ఘంటసాల వేంకటేశ్వరరావు.  సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన వారికి సింహాచలం దేవస్థానం వారి సత్రంలో భోజన సదుపాయాలు కల్పించబడేవి. ఘంటసాల వచ్చిన రోజులలో కాలేజీకి శలవురోజులు కావడం వంటి కొన్ని కారణాల వలన ఆయన గురువుగారింట్లోనే కొంత కాలం బస చేసారు.

చలనచిత్ర సంగీతకారుడిగా తన విజయంలో గురువుగారు సీతారామశాస్త్రిగారివద్ద చేసిన శిష్యరికం పాత్రని ఘంటసాల తన జీవితంలో ఎప్పుడు మరిచిపోలేదు. ఎన్నో ఘట్టాలలో గురువుగారిని అత్యంత భక్తిశ్రద్ధలతో తలుచుకున్నారు. తాను చిత్రపరిశ్రమలో నిలదొక్కుకొని ఇల్లు కట్టుకొని 1950లో  గృహప్రవేశం చేసిన సందర్భంగా గురువుగారిని  మద్రాసుకు పిలిచి ఎంతో ఆత్మీయంగా ఘనంగా సత్కరించారు.


వివాహం చిన్న వయసులోనే జరగడం, కుటుంబ బాధ్యతలు పైబడడం వంటి కారణాలు సంగీతరావుగారి జీవితానికి ఒక గమ్యాన్ని నిర్దేశించుకోవలసిన ఆవశ్యకతను కలిగించాయి. కొన్నాళ్ళు సాలూరులోనే ఉండి పాఠశాలను నిర్వహించే ఉద్దేశంతో సాలూరులో మకాం పెట్టారు. తండ్రిగారు ప్రారంభించిన సంగీత పాఠశాలను ఇంకా అభివృద్ధి లోకి తీసుకొని రావాలన్న ఆశ ఎంత ఉన్నా ఆర్థిక వనరులు అందుకు అనుమతించలేదు. 

ఈ పరిస్థితిలో శ్రీకాకుళం జిల్లాలో నాగావళి నది ఒడ్డున ఉన్న కలివరం అనే కుగ్రామానికి చెందిన గంగుల అప్పలనాయుడుగారు సంగీతరావుగారిని తమ ఊరికి ఆహ్వానించారు. ఒక విధంగా ఆస్థాన గాయకుడి పదవిలాంటి ఉద్యోగం. అంతకుముందు మండా సూర్యనారాయణశాస్త్రిగారు, వాసా కృష్ణమూర్తిగారు అక్కడ కొంతకాలం ఉండి వెళ్ళారు. కలివరంలో సంగీతరావుగారు కుటుంబంతో మూడు సంవత్సరాలున్నారు.

మొదటిసారి సంగీతరావుగారు 1942 లో మద్రాసు వచ్చారు. అప్పటికి ఘంటసాలగారు సినీ పరిశ్రమకు రాలేదు. నాగయ్యగారితో భక్త పోతన తీస్తున్న రోజులవి. జెమిని  స్టూడియోలో పనిచేస్తున్న సీతారామశాస్త్రిగారి మిత్రుడు, శిష్యుడు ఉరిమి జగన్నాధంగారు సంగీతరావుగారిని నాగయ్యగారికి పరిచయం చేసారు. అప్పుడు సంగీతరావుగారు సముద్రాల రాఘవాచార్యులు, నాగయ్యగారి దగ్గర పాటలు పద్యాలు పాడారు. కానీ అవి నగరాలమీద బాంబులు పడుతున్న యుద్ధపురోజులు. తండ్రిగారి ఒత్తిడి మేరకు తిరిగి విజయనగరం  వెళ్లిపోయారు సంగీతరావుగారు.

1948 లో  చిత్రసీమలో ప్రవేశించి స్థిరపడ్డాక గురువుగారు సీతారామశాస్త్రిగారిని చూడడం కోసం మారెళ్ళ రంగారావుగారితో కలిసి  ఘంటసాలగారు విజయనగరం వెళ్ళారు. కానీ అప్పుడు  గురువుగారు - సీతారామశాస్త్రిగారు పెద్దకుమారుడు సంగీతరావుగారి దగ్గర  కలివరంలో ఉన్నారు. విజయనగరం నుండి కలివరం వెళ్ళి గురువుగారిని కలిసారు ఘంటసాల. తెలుగు చిత్రసీమలో అవకాశాలు చాలా ఉన్నాయని, తనతో మద్రాసు రమ్మని ఎంతగానో పిలిచారు. కానీ సంగీతరావుగారికి అప్పుడు  చలనచిత్ర పరిశ్రమ పట్ల  ఆసక్తి లేక ఆయనతో వెళ్ళలేదు.
 
 1952 లో తన మిత్రుడు ద్వివేదుల నరసింగరావు (రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి గారి భర్త) బలవంతం మీద, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో, జీవితంలో నిలదొక్కుకోవాలని విజయనగరం నుంచి మరొకసారి  మద్రాసు వచ్చారు సంగీతరావుగారు.  చిన్ననాటి మిత్రుడిని కలవడానికి  ఘంటసాల నివాసానికి వెళ్ళారు. 


ఆ రోజులకి ఘంటసాల లక్ష్మమ్మకథతో మంచి గాయకుడిగానే కాక మేటి సంగీత దర్శకునిగా కూడా స్థిరపడి ఉన్నారు. స్వంతంగా పరోపకారం చిత్రం నిర్మిస్తున్నారు. ఘంటసాలగారు పల్లెటూరు, పరోపకారం చిత్రాలలో సంగీతరావుగారితో కొన్ని కోరస్  పాటలు కూడా పాడించారు. కానీ సినీ రంగంలోని వ్యక్తులకు  సంగీతజ్ఞు లపై గల చిన్నచూపును, నిర్లక్ష్యాన్ని సహించలేకపోయారు సంగీతరావుగారు. సినిమా రంగానికి దూరంగా ఉండే ఉద్దేశంతో తిరిగి  కలివరం వెళ్ళిపోయారు. 

మరికొంతకాలానికి 1954లో కలివరం నాయుడుగారి కుటుంబంతో కలిసి  సంగీతరావుగారు కూడా తిరుపతి యాత్రకి బయలుదేరారు. స్వామి దర్శనం అయ్యాక యాత్రలో భాగంగా మద్రాసు వచ్చారు. చిన్ననాటి స్నేహితుడిని పలకరించి పోవడానికి  వచ్చిన సంగీతరావుగారిని ఘంటసాల  తిరిగి వెనక్కి వెళ్ళనివ్వలేదు. గాయకుడిగానే కాక సంగీత దర్శకత్వం కూడా చేస్తూ ఉన్న ఘంటసాలగారు తనకు చేతినిండా పని ఉందని, సహాయకుల అవసరం ఉందని, ఉండిపొమ్మని కోరి, స్టేషన్ కి వెళ్లి  కలివరం నాయుడుగారికి సంగీతరావుగారు  విజయనగరం రారని చెప్పేరుట. 

1954 - అప్పుడు ఘంటసాల కన్యాశుల్కం, మాయాబజారు, మొదలయిన చిత్రాలకు సంగీతదర్శకత్వం చేస్తున్న రోజులు. ఘంటసాల సంగీతం సమకూర్చిన చిత్రాలలో  ఘంటసాలకు సహాయకుడిగా ఉన్నారు సంగీతరావుగారు. ఘంటసాల స్వరపరుస్తూన్నప్పుడు వాటికి  నోట్స్ రాసి ఇవ్వడం, ఆర్కెష్ట్రాకి సూచనలు ఇవ్వడం  చేసేవారు సంగీతరావుగారు. 

1955లో ఘంటసాల  స్వంత ఆర్కెష్ట్రాని ప్రారంభించారు. అప్పటినుండి  ఘంటసాల  సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు అన్నిటిలోనూ సంగీతరావుగారు తనవంతు సహకారం అందించారు. ఘంటసాలగారు ప్రైవేటుగా ఇచ్చిన రికార్డులలో పాపాయి పద్యాలు మొదలైనవాటిలో సంగీతరావుగారి హార్మోనియం మనం వినగలం. 

కంచి పరమాచార్యులవారికి జరిగిన ఉత్సవాలలో హైదరాబాద్ లో ఘంటసాలగారు తను స్వరపరచిన రహస్యం చలనచిత్రంలోని  మల్లాది రామకృష్ణశాస్త్రిగారి గిరిజా కల్యాణం రచనను గానం చేసిన సందర్భంలో సంగీతరావుగారు ఘంటసాలగారితో పాటు స్వరం కలిపారు. సంగీతాభిమానులను ఈ ప్రైవేటు రికార్డు అలరిస్తుంది. అలాగే శ్రీ ఘంటసాల గానంచేసి, ఆంధ్రదేశం యావత్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలకించే శ్రీ వేంకటేశ్వర ప్రభాతప్రార్ధన, భగవద్గీత రికార్డులో కూడా సంగీతరావుగారి హార్మోనియం  సహకారం మనకు వినిపిస్తుంది.
 
శ్రీ ఘంటసాలగారి విద్యార్ధి దశనుంచి ఆయన జీవితకాల పర్యంతం అనేక దశలలో సంగీతరావుగారు ఆయన మిత్రుడిగా, సహచరుడిగా మెలిగారు. సీతారామశాస్త్రిగారు తన ఆఖరి కుమారుడు ప్రభాకరరావుగారి విషయంలో ఘంటసాలగారి సహాయం కోరినా, కాకతాళీయంగా సంగీతరావుగారు, ఘంటసాలగారి కోరికమేరకు ఆయన సినీజీవిత స్వర సహచరుడయ్యారు. అటువంటి తన గురుపుత్రుడుగా సంగీతరావుగారిని ఘంటసాలగారు తన జీవితాంతం కూడా ఎంతో ఆదరాభిమానాలు కనపరిచి గౌరవించారు.


శ్రీ ఘంటసాల గారితో సంగీతరావుగారు

శ్రీ ఘంటసాలగారి స్వర సహాయకుడిగా 1974వరకు సుమారు పాతిక సంవత్సరాల పాటు తెలుగు సినిమాతో  సంగీతరావుగారి జీవితం ముడిపడివుంది.

భావస్ఫోరకంగా, రసానుగుణ్యంగా సంగీత రచన చేసిన సందర్భాలలో , భగవద్గీతకి సంగీత రచన చేసిన సమయంలో తాను గురుపుత్రులుగా గౌరవించే సంగీతరావుగారి అపారమైన శాస్త్రీయ సంగీత పరిజ్ఞానాన్ని, హిందుస్తానీ, కర్ణాటక సంగీతాలలో ఆయనకు గల ప్రామాణికతను ఘంటసాల గారు సమయోచితంగా ఉపయోగించుకున్నారు. భగవద్గీత ప్రైవేటు రికార్డులో ఘంటసాల ప్రయోగించిన రాగాలు, వాటి సార్థకత గురించి ఇటీవల సంగీతరావుగారు తన వ్యాఖ్యానంతో భగవద్గీత రాగరసస్ఫూర్తి అనే చక్కని రికార్డు వెలువరించారు. శ్రీ నూకల ప్రభాకర్ గారు దీనిని రికార్డుచేయడంలో సహకరించారు.
                            భగవద్గీత రికార్డింగ్ సందర్భంలో హార్మోనియం పై సంగీతరావుగారు

                    శ్రీ ఘంటసాల సంగీత కచేరీలో హార్మోనియంతో సహకారం-సంగీతరావుగారు


 శ్రీ ఘంటసాల ఆర్కెష్ట్రా అనే పేరుతో ఘంటసాలగారు తమ బృందంతో కలిసి అనేక కచేరీలు చేసారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంగీతరావుగారు హార్మోనియం తో సహకరించేవారు. శ్రీ ఘంటసాల 1970-71 ప్రాంతాలలో అమెరికా, జర్మనీ దేశాలలో సాంస్కృతిక పర్యటన జరిపి అనేక దేశాలలో కచేరీలు చేసారు. ఘంటసాలగారి తొలి, ఆఖరి విదేశీ పర్యటన అదే.
ఆ పర్యటన దిగ్విజయంగా జరిగింది. 


ఘంటసాలగారు ఆ పర్యటనలో చేసిన కచేరీ కార్యక్రమాలన్నీ ఇటీవల ఘంటసాలగారి అభిమానులు సేకరించి ఒకచోట చేర్చి అందుబాటులో ఉంచారు. ఆ కార్యక్రమాలను ఇక్కడ వినవచ్చు. ఈ కార్యక్రమాలలోనే కాదు ఘంటసాల జీవించి ఉన్నంత కాలం ఆయన జీవనయానంలో తోడునీడగా మసిలారు సంగీతరావుగారు.













 1974 సంవత్సరానికి ఘంటసాలగారి అనారోగ్యం, చిత్రసీమలో సంగీత దర్శకుడిగా ఆయన చిత్రాల సంఖ్య తగ్గిపోవడం వలన సంగీతరావుగారు కూడా ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. అప్పటికే చిత్రసీమలో శ్రీ వెంపటి చినసత్యంగారితో ఏర్పడిన పరిచయం సంగీతరావుగారి జీవితాన్ని మలుపు తిప్పింది.


మద్రాసు కూచిపూడి అకాడెమి -సంగీతరావుగారు
 
వెంపటి చినసత్యంగారు మద్రాసు నగరంలో స్ధాపించిన మద్రాసు కూచిపూడి అకాడెమీతో అనుబంధం ఏర్పడడం సంగీతరావుగారి జీవితంలో మలి మజిలీ.

మద్రాసులో వెంపటి చిన సత్యం చలనచిత్రాలలో నృత్య దర్శకుడిగా ఉండేవారు. అంతే కాక కూచిపూడి ఆర్ట్ అకాడెమీ అనే సంస్థను స్థాపించి అనేకమంది విద్యార్థులకు నృత్య శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఘంటసాల స్వంతంగా నిర్మించిన పరోపకారం చిత్రంలో సత్యంగారు వీధి గాయకుడిగా చిన్న పాత్రలో కనిపస్తారు. హార్మోనియం వాయిస్తూ వలపుల కథకిది తొలిపలుకు అనే ఘంటసాల సంగీత దర్శకత్వం లోని  పాటకి అభినయం చేసారు. ఆ సందర్భంలో ఘంటసాలకు సహాయకుడిగా ఉన్న సంగీతరావుగారికి,  సత్యంగారికి  మొదటిసారిగా పరిచయం ఏర్పడింది. క్రమంగా ఆ పరిచయం స్నేహంగా పరిణమించింది. 


సంగీతరావుగారిని ఆర్థికంగా ఆదుకొనే ఉద్దేశంతో తమ సంస్థలో విద్యార్థులకు సంగీత శిక్షణ ఇవ్వవలసినదిగా ఆహ్వానించారు సత్యంగారు.  సంగీతరావుగారు అంగీకరించి కూచిపూడి అకాడెమీలో విద్యార్థులకు సంగీతం చెప్పేవారు. అప్పుడే ఢిల్లీలో జరగనున్న తమ కార్యక్రమంలో సంగీతరావుగారిని పాటలు పాడవలసినదిగా కోరారు సత్యంగారు.


కచేరీలు చేసిన రోజులు దాటి ఘంటసాలగారికి సంగీతదర్శకత్వంలో సహాయకుడిగా మాత్రమే ఉంటూ ఉన్న సంగీతరావుగారికి మళ్ళీ గాయకుడిగా కొత్త అనుభవం కలిగింది. ఢిల్లీ కార్యక్రమంలో సంగీతరావుగారి గానం విన్న సుబ్బుడు వంటి విమర్శకులు ఆయనను ప్రశంసిస్తూ హిందూలో వ్రాసారు. అలా అయిదారు సంవత్సరాలు కూచిపూడి అకాడెమీలో పాటలు పాడారు సంగీతరావుగారు.  

కూచిపూడివారి పద్మావతీ శ్రీనివాసం నాటకానికి ద్వారం భావనారాయణగారు సంగీత దర్శకత్వం  వహిస్తుండగా సంగీతరావుగారు ఆయనకి అసిస్టెంట్ గా ఉన్నారు.  భావనారాయణగారు విజయనగరంలో ఉండేవారు. ఒక సందర్భంలో సంగీతరావుగారు చేసిన సందర్భోచితమైన సంగీతం కూచిపూడివారికి నచ్చి మొత్తం నాటకానికి సంగీతరావుగారే సంగీతం చేయాలని కోరారు.  అది మొదలుగా మద్రాసు కూచిపూడి నాటక అకాడెమీ సంగీతరావుగారి జీవితంలో ప్రధాన భాగం అయింది. 



1974 తర్వాత సుమారు ముఫ్ఫై సంవత్సరకాలంలో కూచిపూడి నాటక అకాడమీ ఆధ్వర్యంలో తయారైన దాదాపు 15 నృత్యనాటికలకు సంగీతరావుగారు సంగీతం నిర్వహించారు. సంగీతంలోనే కాక సాహిత్యంలో కూడా సంగీతరావుగారికి ఉన్న అభినివేశం వెంపటి చిన సత్యం గారి నృత్య నాటకాలు రక్తి కట్టడానికి సహాయపడింది.



 శ్రీ వెంపటి చినసత్యం(కుడివేపు కూర్చున్నవారు)గారితో సంగీతరావుగారు


శ్రీ భుజంగరాయ శర్మగారి సాహిత్యానికి సంగీరావుగారి సంగీతం తోడై కూచిపూడి నాటకాలు అత్యంత జనాదరణ పొందాయి. ఈ నృత్య కార్యక్రమాలలో సంగీత దర్శకుడిగానే కాక ఆర్కెష్ట్రా లో ఉండి తన వీణా వాదనతో వాద్యసహకారాన్ని కూడ అందించారు.  వీరి కలయికలోని మొదటి నాటకం పద్మావతి శ్రీనివాసం.
                                  శ్రీ భుజంగరాయ శర్మగారితో సంగీతరావుగారు

కూచిపూడి వారి బృందంతో పాటు దేశవిదేశాలు ఖండాంతరాలు పర్యటించారు సంగీతరావుగారు. తన సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఘంటసాలగారి సహాయకుడిగా ఉన్న సినీ జీవితంలో కన్నా కూచిపూడి ఆర్ట్ అకాడెమీ లో సంగీత దర్శకుడిగా, వైణికుడిగా గడిపిన జీవితంలోనే తన నిజమైన వ్యక్తిత్వం అభివ్యక్తం అయిందని సంగీతరావుగారు అంటారు.




కేవలం సంగీతరంగంలోనే కాదు, సాహితీ రంగంలోనూ ఎంతో ప్రతిభను కనపరిచారు సంగీతరావుగారు. సంగీత, సాహిత్యరంగాలలో ప్రముఖుల గురించి, వారి విద్వత్తును గురించి ఎంతో ప్రామాణికమైన వ్యాసాలు వ్రాసారు. ఆంధ్రప్రభ లో ఆయన వ్రాసిన వ్యాస పరంపర ప్రచురించబడింది. అంతేకాక మారుపేర్లతో ఎన్నో కథలను ప్రచురించారు. ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్, ఆమె భర్త ఎన్నార్ చందూర్ సంగీతరావుగారికి ఆప్త మిత్రులు. ఆయనలోని రచయితను ప్రోత్సహించినవారు. తెలుగు స్వతంత్ర, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, జగతి, ఆంధ్ర మహిళ వంటి ప్రముఖ పత్రికలలో సంగీత రావుగారి రచనలు ప్రచురించబడ్డాయి.


చలం, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి, దాశరథి, శ్రీశ్రీ వంటి ప్రముఖులతో సంగీతరావుగారికి  చక్కని స్నేహం ఉంది. చలంగారు అరుణాచలంలో ఉన్న చివరిదశలో సంగీతరావుగారు ఆయనను చూసి వస్తుండేవారు. ఆరుద్ర గారు  కూడా సంగీతరావుగారికి మంచి మిత్రులు. సంగీత పరమైన అంశాలలో ఆరుద్రగారు సంగీతరావుగారితో చర్చిస్తూ ఉండేవారు. తద్వారా  పరస్పరం సందేహ నివృత్తి చేసుకునేవారు. ఆరుద్రగారు కోరగా అన్నమయ్య గీతాలను కొన్నింటిని సంగీతరావుగారు స్వరపరిచారు కూడా.


 ప్రముఖ కథారచయిత పంతుల శ్రీరామ శాస్త్రిగారు సంగీతరావుగారి బాల్య మిత్రుడు. 

 
సంగీతరావుగారు వ్రాసిన కొన్ని కథలు శ్రీరామశాస్త్రిగారి పేరుతో ప్రచురించబడ్డాయి. సంగీతరావుగారి గురించి  శ్రీరామ శాస్త్రిగారు పద్యాలు కూడా అల్లారు. 

ప్రముఖ కథ,నవలా  రచయిత మంథా రమణారావు గారి తో సంగీతరావుగారికి గాఢమైన స్నేహం ఉండేది.  




సంగీతరావుగారికి ఆధ్యాత్మిక విషయాలపై కూడా ఆసక్తి మెండు. ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేక గ్రంథాలను ఆయన చదవడంతో పాటు నిర్మాణాత్మకమైన చర్చలు కూడా సాగిస్తూ ఉంటారు. సాహిత్య పఠనంతో పాటు వ్రాయడంలో కూడా ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు సంగీతరావుగారు. 


ఘంటసాలగారి ఆర్కెష్ట్రాలో ఉండగాను, కూచిపూడి వారి ప్రదర్శనలో భాగం గాను తాను చేసిన విదేశీ యాత్రలను గ్రంథస్థం చేసారు.

కూచిపూడి నాట్యం గురించి, నాట్య ప్రక్రియలగురించి ఎన్నో వ్యాసాలు రచించారు.


                              శైలసుధ నిర్వహించిన కూచిపూడి సెమినార్ లో సంగీతరావుగారు


మద్రాసు ఆకాశవాణి కేంద్రంద్వారా ఎన్నో విలువైన ప్రసంగాలను రికార్డు చేసారు. కర్ణాటక, హిందుస్తానీ సంగీతాలలో తన పరిచయాన్ని, పాండిత్యాన్ని వినియోగించుకునేలా ఎందరో విద్యార్ధులకు, పరిశోధకులకు మార్గదర్శకం చేసారు.


మద్రాసు మ్యూజిక్ అకాడెమీలో హరికథల గురించి జరిగిన సెమినార్ లో ఆదిభట్ల నారాయణదాసుగారు మొదలైన గొప్ప హరికథకులు చేసిన రాగాలను వాటి గొప్పతనాన్ని ప్రదర్శించే లెక్చర్ డిమాన్స్ట్రేషన్స్ ని తమ కుమార్తె పద్మావతి తో కలిసి  చేసి  ప్రముఖ సంగీతజ్ఞుల మెప్పులు పొందారు.

 శ్రీ పప్పు వేణుగోపాలరావుగారు, సంగీతరావుగారు, వారి కుమార్తె పద్మావతి

1974లో చేసిన పద్మావతి శ్రీనివాసం మొదలు శ్రీపద పారిజాతం,  హరవిలాసం, కల్యాణ రుక్మిణి, శివధనుర్భంగం (రామాయణం), అర్థనారీశ్వరం, ఇటీవల 2000 సం. గోపీకృష్ణ వంటి కూచిపూడి నృత్యనాటకాల వరకు సంగీతరావు గారు కూచిపూడి ఆర్ట్ అకాడెమీ రూపొందించిన నృత్య రూపకాలకు సంగీతదర్శకత్వం వహించి సంగీతాభిమానులకు వీనుల విందు చేసారు.

వాగ్గేయకారులచే అరుదుగా ప్రయోగింపబడి ప్రస్తుతం కచేరి సర్కిట్ లో లేని ఆందోళిక, శుద్ధబంగళా, మంగళకైశిక, సైంధవి, సుప్రదీపం, సూత్రధారి వంటి రాగాలతో భావరస స్ఫూర్తితో సందర్భోచితంగా ఈ నాటకాలకు ఆయన చేసిన సంగీత రచన శాస్త్రీయసంగీత విద్వాంసుల, రసికుల మన్ననలను పొందింది.
రస నిర్ణయానికి స్వరం, రాగం ఇవే కాక నడక కూడా ప్రధానం. నడకకి తగినట్టుగా  స్వర,రాగాలను కూర్చాలి. కూచిపూడి నాటకాలలో సాహిత్యానికి చాలా  ముఖ్యమైన పాత్ర ఉంది.

కూచిపూడి నృత్యనాటకాలలోని పాటల స్వరకల్పనలో శ్రీ సంగీతరావుగారి ఉపజ్ఞ గురించి ఇక్కడ చూడవచ్చు. 
               
నవరసాలకు సంబంధించి సంగీతం కూర్చవలసి వచ్చినప్పుడు ఏ భావానికి ఎటువంటి రాగం ప్రయోగించాలన్న విషయంలో కూచిపూడి నాటకాలకు సంబంధించి మనకు నమూనాలు లేవు. తనకు గల అపారమైన సంగీతానుభవంతో సంగీతరావుగారు చేసిన నూతన ప్రయోగాలన్నీ  కూచిపూడి నాటకాలకు అద్భుత విజయాలను అందించాయి. 



ఘంటసాలగారితో  స్వర సాహచర్యం చేసిన కాలం కన్నా, కర్నాటక సంగీతజ్ఞుడిగా తనలోని ప్రతిభను ప్రదర్శించే అవకాశం కలిగిన ముఫ్ఫై సంవత్సరాల కాలాన్ని, తన జీవితంలోని అత్యంత సంతృప్తికరమైనదిగా  సంగీతరావుగారు భావిస్తారు. కూచిపూడివారికి సంగీతాన్ని అందించడంలోనే తన నిజమైన వ్యక్తిత్వం ఆవిష్కృతమైందని సంగీతరావుగారి విశ్వాసం. 



 రష్యా పర్యటనలో కూచిపూడి బృందంతో సంగీతరావుగారు

ఏ డాక్టరేట్లు, యూనివర్సిటీ డిగ్రీలు ఆయన్ని వెదుక్కొని రాకపోయినా, గంభీరమైన ఆయన సంగీత, సాహిత్య జ్ఞానవార్థినుంచి యధాశక్తి లబ్ధి పొందేందుకు ప్రయత్నించిన ఎందరో యూనివర్సిటీ రిసెర్చి స్కాలర్లకు సంగీతాభిమానులకు ఆయన దిశనిర్దేశకుడు - friend, guide and philosopher అని అభివర్ణిస్తారు కొడవటిగంటి కుటుంబరావుగారి కుమారుడు, ప్రముఖ సాహితీ విమర్శకులు రోహిణీ ప్రసాద్- సంగీతరావుగారి గురించి.

శ్రీ సంగీతరావుగారిని వరించిన బిరుదులు -సత్కా రాలు

సంగీతరావుగారు అతి పిన్న వయసులోనే అంటే పదహారు సంవత్సరాల వయసులోనే భారతీతీర్థ వారి ప్రతిష్ఠాత్మక సంగీత భూషణ బిరుదాన్నందుకున్నారు.


1994 లో నృత్యనాటక సంగీతానికి ఆయన చేసిన విశేష కృషిని గుర్తించి తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదునిచ్చి సత్కరించింది.

ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం ఘంటసాలగారి విగ్రహాన్ని హైదరాబాదులో ఆవిష్కరించిన సందర్భంగా జరిగిన గొప్ప సభలో సంగీతరావుగారిని ఘంటసాల ఆత్మీయుడుగా సత్కరించారు.




మద్రాసు తెలుగు అకాడమీ వారు 2003 లో సమైక్య భారతి స్వర్ణ పురస్కారాన్ని లక్షరూపాయల నగదు బహుమతిగా అందచేసారు.



2004 లోకూచిపూడి నాట్యానికి సంగీతరావుగారు అందజేసిన విశిష్ట సేవలకుగాను శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ పేరిట నెలకొల్పిన జీవితకాల పురస్కారాన్ని అందుకున్నారు.
                                                                                                             




2006 లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంస్ధ ఘంటసాల 84వ జన్మదిన సందర్బంగా అప్పటి ముఖ్యమంత్రి డా.రాజశేఖర రెడ్డిగారి చేతుల మీదుగా అతి ఘనంగా సత్కరించింది.
2007 లో విశాఖపట్టణానికి చెందిన సనాతన ధర్మ ఛారిటి సంస్ధ శ్రీరామనవమి సందర్భంగా సంగీతరావుగారిని ఘనంగా సత్కరించింది. 

అడపా దడపా ఘంటసాలగారి పేరుమీద చిన్న చిన్న సంస్థలు జరిపే సభలలో అనేక గౌరవ సన్మానాలు అందుకున్నారు.

ఇవేకాక ఘంటసాలగారి బృందంతో 1972 లో అమెరికా పర్యటనలో, దేశవిదేశయానాలలో అందుకున్న సన్మానాలెన్నో.


.




1974 తర్వాత కూచిపూడి ఆర్టు అకాడెమీ వారి ప్రదర్శనలలో భాగంగా దాదాపుగా ప్రపంచంలోని చాలా దేశాలను పర్యటించారు. లెక్కకు మించిన అవార్డులను,
రివార్డులను  దేశ విదేశాలలో అందుకున్నారు సంగీతరావుగారు


ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, ఎనిమిది మంది మనవలు,     ముగ్గురు ముని మనవలు సంగీతరావుగారి కుటుంబం.

ప్రస్తుతం హైదరాబాదులో నివాసం. నిరంతరం మనసుని, వాతావరణాన్ని ఉల్లాసంగా ఉంచుకుంటూ, ఆహ్లాదభరితమైన చతుర సంభాషణలతో జీవితాన్ని ఉత్సాహంగా గడపడం ఆయనకి నాటికీ నేటికీ కొనసాగుతున్న అలవాటు. ఇంటికి వచ్చి పలకరించేవారినయినా, మద్రాసునుంచి ఫోన్లు చేస్తూ సందేహాలు నివృత్తి చేసుకునేవారయినా అందరినీ ఆప్యాయంగా అమ్మా, బాబూ అంటూ నోరారా ఆత్మీయంగా సంభాషించడం ఆయన తత్వం. భగవంతుడిచ్చిన చెక్కుచెదరని జ్ఞాపకశక్తితో ఏకాలం నాటివో అయిన జ్ఞాపకాలను, వ్యక్తుల పేర్లను తలచుకుంటూ ఆయన చెప్పే విశేషాలు వినడం ఆయనతో సంభాషించిన వారికి ఒక మధురమైన ఆత్మీయ జ్ఞాపకం. దిన వారపత్రికలలో వచ్చే సాహిత్య సంబంధమైన పజిల్స్ నింపడంలో సహచరి శ్రీలక్ష్మిగారికి సహాయం చేయడం, క్రికెట్ టెన్నిస్ వంటి ఆటలను టివిలో ప్రసారం చేసినప్పుడు వదిలిపెట్టకుండా చూస్తూ వారి విజయాలను మనవలతో పాటు ఆనందించడం చూసేవారికి అదో వేడుక.
                           అర్థాంగి శ్రీ లక్ష్మిగారితో సంగీతరావుగారు

నిరంతర చైతన్య శీలి సంగీతరావుగారు. వయసులో చిన్న వారైనా , సంగీతరావుగారిని గురువుగారూ అంటూ సంబోధించినా రోహీణీప్రసాద్ గారు సంగీతరావుగారికి మంచి మిత్రులు.


88 సంవత్సరాల యువకుడు అంటూ సంగీతరావుగారి గురించి  శ్రీ రోహిణీ ప్రసాద్ వ్రాసిన వ్యాసం సంగీతరావుగారి జీవితంలోని చాలా కోణాలను ప్రదర్శించే చక్కని పరిచయం.
శ్రీ ఘంటసాలగారితో తన అనుబంధం గురించి సంగీతరావుగారు వెల్లడించిన వివరాలను ఇక్కడ చూడవచ్చు.


సంగీతరావుగారి గురించి మరిన్ని కబుర్లు కావాలంటే ఈ లింకులు కూడా చూడవచ్చు.




సార్థక నామథేయుడు (మార్చి 2005 లో ఈమాట వెబ్ మాగజైన్ లో వచ్చిన వ్యాసం)

సంగీతరావుగారి చిన్ననాటి సంగతులు(జూలై 2005లో ఈమాట వెబ్ మాగజైన్ లో వచ్చిన వ్యాసం)

11 comments:

కథా మంజరి said...

good post

Anonymous said...

This article is a rich source of information on the life of Sri SangeetaRao garu.But his opinion that his career other than with Ghantasala in serving cinema industry is more satisfying will be perplexing to many.
somupadma,youtube

swathi said...

హాయ్ సుధా ,
చాలా చాలా బాగా రాశావు. అభినందనలు

Anonymous said...

I really liked reading this article. Thanks for showing us the rarest pictures. Enjoyed the treasure. Hopefully next time, I get a chance to meet this great person.

Prof. Raghu Echempati
USA

Unknown said...

I am blessed to have associated with master garu and cherish all the moments with him. The pictures bring back all memories....

Sabitha Bhamidipati

SRRao said...

సుధ గారూ !
గొప్ప నిధిని అందించారు. ధన్యవాదాలు.

కొత్త పాళీ said...

సుధగారు, అనేక విధాలుగా చాలా సంతృప్తి కలిగించింది ఈ వ్యాసం. అరుదైన ఫొటోలు శోభని కూర్చాయి. వారి జీవనయానంలో కొన్ని మధురఘట్టాలని ముందుతరాలవారికి అందించడంలో మీ ఈ ప్రయత్నం ముఖ్యం, అభినందనీయం.
చిన్నసత్యంగారు నాటకాల్లో నేను పూర్తిగా చూసింది క్షీరసాగర మథనం ఒకటే. అందులో లక్ష్మీదేవి ఆవిర్భవించే సందర్భంలో "పొడమే రమ" అని శహన రాగంలో వచ్చే పాట నాకు చాలా ఇష్టం.

Sudha Rani Pantula said...

కొత్తపాళీగారూ,
మీ అభినందనని ఎంతో ఆలస్యంగా అందుకోవడం వలన మరెంతో ఆలస్యంగా స్పందిస్తున్నాను. క్షమాపణతో పాటు ధన్యవాదాలు కూడా అందుకోండి. గొప్పకళాకారుల జీవితవిశేషాలను పరిచయం చేయడమే ఈ వ్యాసాల లక్ష్యం కూడా. చంద్రునికో నూలుపోగు అంతే.

Kolluru Viswanatham, Bangalore said...

Though I heard about Sri Sangeetha Rao garu as an asst. to late music director Ghantasala long back but I had opportunity to meet him personally only in 1998 at Chennai when I came there after my retirement. He is really very interesting personality. AYANA OKA SARTHAKA NAMADHEYUDU. One thing I admire about him is his memory power. At the ripe old age also he remembers most of our relatives by name. He used to narrate very interesting anecdotes of his childhood and young age. He still remembers about many agraharams of Northern Andhra Pradesh and persons of those places. A nicely compiled article about his life and achievements. The photographs added much interest to the already interesting article. I congratulate Sudha for posting such a nice article about Sri Sangeetha Rao garu.

Sudha Rani Pantula said...

శ్రీ విశ్వనాధంగారికి,
మీరు సంగీతరావుగారి పట్ల ఎంతో అభిమానంతో రాసిన ఆ వ్యాఖ్య చాలా సంతోషం కలిగించింది. వ్యాసం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

Dr. B.N.V. Parthasarathi said...

సుధా,
మీరు బ్లాగ్ లో రాసిన విషయాలు, సంగీతానికి, సాహిత్యానికి సంబంధించి సేకరించిన వివరాలు ఆసక్తిదాయకం గా వున్నాయి. ఇది ఎంతో చారిత్రక అవసరం కూడాను. సంగీత రావు గారి గురించి, వారి మూడు తరాల మహానుభావుల గురించి మీరు రాసిన, సేకరించిన విషయాలు తెలుగు సంగీత, సాహిత్య చరిత్రకి విలువయిన చారిత్రాత్మక అంశాలు.
సంగీత రావు గారు సంగీత సాహిత్యాల లో పండితులు. వారు దాదాపు ఎనిమిది దశాబ్దాల పై గా సుమారు మూడు, నాలుగు తరాల ప్రముఖ సంగీతకారులు, సాహితీవేత్త లతో సాన్నిహిత్యం ఉన్నవారు. వారు నిండుకుండ, నిరాడంబరులు, నిగర్వి. అటు విజయనగరం, బొబ్బిలి , సాలూరు నుంచి ఇటు మద్రాసు వరకు శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, చలన చిత్ర సంగీత,సాహిత్యం, కూచిపూడి నాట్యానికి సంబంధించిన సంగీత, సాహిత్యం, తెలుగు సాహిత్యం, మరెన్నో దేశ, విదేశాలకు చెందిన పలు అంశాలు, వాటికి సంబంధించిన అనేక కళాకారుల గురించి పరిచయం, అవగాహన వున్న వ్యక్తి.
నా ఉద్దేశంలో ఈ బ్లాగ్ ద్వారా ఇంతవరకు మనకి తెలిసిన విషయాలు, ముఖ్యంగా చారిత్రాత్మక విషయాలు కన్నా, ఇంకా సంగీత రావు గారి ద్వారా తెలుసుకో వలసిన విషయాలు ఎన్నో వున్నాయి. ఇవి భావితరాలవారికి కేవలం ఒక చరిత్రకి సంబంధించిన విషయాలు గా కాకుండా, ఎంతో ఆసక్తిదాయకంగా, స్పూర్తిదాయకంగా కూడా ఉపయోగ పడతాయి అనటం నిర్వివాదాంశం. మీ ఈ ప్రయత్నం ఈ దిశ గా విజయవంతంగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను. మీ ఈ కృషి ఎంతో శ్లాఘనీయం.
బచ్చు నరసింహ వెంకట పార్ధసారధి. ( B.N.V.Parthasarathi)