శ్రీ సంగీతరావుగారు రచించి స్వరపరిచిన
ఓ ఉగాది పాటను ఇక్కడ పరిచయం
చేయబోతున్నాను.
ఆకాశవాణి మద్రాసుకేంద్రంలో చిన్న
పిల్లలు ఉగాది సందర్భంగా పాడడం కోసం సంగీతరావుగారు ఓ గేయం రచించారు. ఆనందనామ
సంవత్సరం (బహుశ 1975) ఉగాది సందర్బంగా ఈ గేయం ఆకాశవాణి లో ప్రసారమయింది.
మరోసారి ప్రభవ నామ సంవత్సరం ఉగాది నాడు మద్రాసు తెలుగు అకాడమీ వారి ఉగాది
ఉత్సవాలలో ఉగాదికి ఆహ్వానగీతంగా ఒక పాటను స్వరపరచవలసిన సందర్భం వచ్చినపుడు
సంగీతరావుగారు బాలాంత్రపు రజనీకాంతరావుగారు రచించిన గేయాలనుంచి ఒక గేయాన్ని
ఎత్తుగడ గా తీసుకుని తన గేయాన్ని కూడా కలిపి స్వరపరిచారు. రజనీకాంతరావుగారి
శతపత్రసుందరి గేయసంపుటిలో నుంచి ఈ గేయాన్ని తీసుకున్నారు
(శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు సంగీతం సాహిత్యం ఉభయరంగాలలోను లబ్ధ
ప్రతిష్టులైన ప్రతిభా మూర్తి. లలితసంగీత రీతులను తెలుగు ప్రజలకు రేడియో మీడియా
ద్వారా ప్రసారం చేస్తూ, తన రచనలతో, సంగీతంతో ప్రచారం చేస్తూ పరిపూర్ణమైన సహకారం
అందించిన గొప్ప సంగీతమూర్తి. రజని పేరుతో తెలుగువారికి సుపరిచితులు.)
కొత్త సంవత్సరం ఆలయంలో మ్రోగిన ఘంటానాదంలా, ఆకాశంలో మెరిసిన ఆశా జ్యోతిలా ఆగమిస్తోందని భావించారు
రజనీకాంతరావుగారు.
గడిచిపోయిన సంవత్సరం లోని చేదు జ్ఞాపకాలు, మనస్సులోని పాపపుటాలోచనలు అన్నీ
పటాపంచలైపోయి మనసులోని బాధనంతటినీ తుడిచేసి ఆ విశ్వ విభుడైన పరమేశ్వరుని కరుణా
కటాక్షాలు జడివానగా కురుస్తుండగా ప్రక్షాళితమైన మనస్సులతో కొత్త సంవత్సరానికి
స్వాగతం పలకాలని ఆశించారు రజనీకాంతరావుగారు.
వసంత ఋతువులో చెట్లు పండిన సారంలేని ఆకులను రాల్చేసి కొత్తచిగుళ్లను
తొడుగుతాయి. జగమంతా పచ్చదనం వెల్లివిరుస్తూ మనసులను ఉల్లాసపరుస్తుంది. అటువంటి
శుభోదయం సమయంలో ఈ జగత్తులోని సర్వసౌభాగ్యాలకు కారణమైన ప్రభువును కీర్తించుదామని
తనతో గొంతు కలపమని పిలుస్తారు రజనీకాంతరావుగారు.
ఆ గేయం యొక్క సాహిత్యం ఇది.
ఆలయమున వినబడునదిగో
ఆకసమున కనబడునదిగో
నవవర్షపు ఘంటానినదం
నవ్యాశా జ్యోతీ... నవ్యాశా జ్యోతీ...
ప్రాతయేటి పెను తమస్సులూ
పాప కలితములు మనస్సులు
పటాపంచలే
క్షుభిత హృదయములపై విరిసి
విభుని కరుణ జడులై కురిసే
నవవసంతమై నవవసంతమై
శుభోదయోత్సవ సమయమునా
ప్రభూయనుచు మధుర రవమునా
కీర్తించుదమా
కీర్తించుదమా “ ఆలయమున
వినబడునదుగో.....”
ఇక్కడివరకు ఈ ఉగాది పాటలో రచన బాలాంత్రపు రజనీకాంతరావుగారిది. ఇక ఇక్కడ నుంచి
సాహిత్యం సంగీతరావుగారిది.
అటువంటి నవ వసంతం ఆగమించిన కొత్త సంవత్సరానికి ఈ విధంగా స్వాగతం పలికారు
సంగీతరావుగారు.
ముందుగా-
నవయుగం అంటే కొత్తసంవత్సరం ఆగమించిన వేళ ప్రకృతి ఎలా ఉంటుందో వివరించారు.
వసంతకాలం హృదయాలను పులకింపజేసే సమ్మోహనకరమైన కాలం. వసంతానికి మరోపేరు ఆమని.
వసంతకాలంలో తొలిసంజె వేళలో విరిసే వెలుగులు, ఆహ్లాదపరిచే వెన్నెలవేళలు
అనుభవైకవేద్యమే. వసంతకాలం అనగానే మధురమైన సువాసనతో విరిసే మల్లెపూలు, చవులూరించే మధురమైన మామిడిపళ్ళు అందరికీ గుర్తొస్తాయి. అంతే
కాక కొత్త మామిడిచిగుళ్ళను మేసి కలకూజితం చేసే కోయిలమ్మ కూడా వసంతానికి ప్రతినిధి
కదా. అందుకే ఇన్ని అందమైన అనుభూతులనిచ్చే ఆమనికి, కొత్త సంవత్సరపు తొలిరోజుకి ఈ
విధంగా స్వాగతం చెప్పారు.
ఆ.... ఆ....ఆ...
స్వాగతమిదె స్వాగతమిదే వత్సరాదికి
స్వాగతమిదె స్వాగతమిదె నవయుగాదికి
తొలిసందె వెలుగులు
పులకించే వెన్నెలలు
మధురమైన ఫలములను మరుమల్లే విరులను
కొసరి కొసరి వినిపించే కోయిలమ్మ పాటను
హాయిగా తీయగా అందిచే ఆమనికి
స్వాగతమిదె స్వాగతమిదే వత్సరాదికి
స్వాగతమిదె స్వాగతమిదే నవయుగాదికి
కొత్తసంవత్సరానికి కేవలం స్వాగతం చెప్పి ఊరుకుంటే ఎలా.
అందుకే సమాజాభ్యుదయానికి తాను ఆశించే
విలువలను కూడా ప్రస్తావించి ఈ గేయాన్ని ముగించారు.
అనుమానం అసహనం అపరిమిత ద్వేషం
మటుమాయం కాగా మమకారం సహకారం
సమరసభావం శాంతి సౌభాగ్యం
అందిచే ఆమనికి
స్వాగతమిదె స్వాగతమిదే వత్సరాదికి
స్వాగతమిదె స్వాగతమిదే నవయుగాదికి
పాటను స్వరపరుస్తుండగా రికార్డు చేసినందువల్ల
పాతికసంవత్సరాలకు పైబడి పోయినందువల్ల, సాంకేతికంగా కొంత సౌలభ్యం తక్కువగా
ఉన్నా పాట వరుసను సంగీతరావుగారి స్వరంలో వినడం కోసం దాన్ని కూడా జతపరుస్తున్నాను
ఇక్కడ. ఆడియో పోస్టుకి శ్రీ శివగారు అద్భుతంగా చేసి ఇచ్చిన వీడియో ఇది.
ఈ ఇద్దరు ప్రతిభామూర్తులు - శ్రీ సంగీతరావుగారు, శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావుగారు ఈ ఇద్దరి గురించి శ్రీ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు రచించిన వ్యాసం ఈమాట- వెబ్ పత్రికలో ప్రచురించబడింది. ఈ ఇద్దరితోనూ ఎంతో ఆత్మీయమైన స్నేహానుభవం ఉన్న రోహిణీ ప్రసాద్ గారు చెప్పిన ఎన్నో విశేషాలతో కూడిన ఆ వ్యాసాన్ని (80 ఏళ్ళ యువకులు) ఆసక్తి ఉన్నవారు ఇక్కడ చూడవచ్చు.
https://eemaata.com/em/issues/200807/1296.html
No comments:
Post a Comment