visitors

Friday, September 4, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదిహేనవ భాగం

04.09.20 - శుక్రవారం భాగం - 15:
పధ్నాలుగవ భాగం ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"శ్రీమతి లీలమ్మ గారికి,
అంటూ తన కృతులను రేడియోలో, కచేరీలలో పాడేందుకు తన అనుమతి పత్రాన్ని ఒక పోస్ట్ కార్డ్ మీద మా తాతగారి తరఫున మా ప్రభూ చిన్నాన్నగారు ముత్యాలకోవ వంటి దస్తూరీతో తన దగ్గరున్న మెరూన్ కలర్ 'రత్నం' పాళీ పెన్ తో వ్రాసి చదివి వినిపించగా, ఆ బరువైన లావుపాటి పెన్ తో మా తాతగారు ఉత్తరం క్రింద 'పట్రాయని శీతారామశాస్త్రి' అని సంతకం చేశారు. 

ఆ తరువాత, ఆ ఉత్తరాన్ని, అప్పటికే సినీమాలలో పాడుతూ మంచి పేరు తెచ్చుకుంటున్న గాయని శ్రీమతి పి.లీల గారి మెడ్రాస్ ఎడ్రస్ కు  మా చిన్నాన్నగారు పోస్ట్ చేశారు. ఆయన  తెల్ల చొక్కాజేబులు చాలా పెద్దవి. అందులో మనీపర్స్, పద్దులపుస్తకం, కాగితాలు, పోస్ట్ కార్డులు‌, పెన్నులు, ఇలా ఎన్ని వస్తువులైనా పట్టేవిగా ఉండేవి. 

నాకు మా తాతగారు తన సంతకాన్ని తప్పుగా పెడుతున్నారనిపించింది. 'సీతారామశాస్త్రి' కి బదులుగా 'శీతారామశాస్త్రి' అని వ్రాయడం  ఒక ఆశ్చర్యం. అయితే, 'శీ' అని వ్రాయడం ఆయన అలవాటని తెలిసింది.

మా తాతగారు, పట్రాయని సీతారామ శాస్త్రిగారు ఒక వాగ్గేయకారుడు. భావప్రాధాన్యమున్న ఎన్నో కృతులు వ్రాశారు. చందోబధ్ధంగా పద్యాలు వ్రాసారు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ తనదైన బాణీని వినిపించిన శాస్త్రిగారే 'కౌముదీ పరిషత్' కు ఉచితమైన అధ్యక్షుడిగా ఇతర కవులందరిచేత ఎన్నుకోబడి తన జీవితాంతం ఆ పదవిలో కొనసాగారు. ఇంతకూ సీతారామశాస్త్రిగారికి ఏ స్కూల్ చదువులేదు. వారి తాతగారు (తల్లిగారి తండ్రి) ఇసకలో దిద్దించిన ఓనామాలు తప్ప ఎక్కడా ఏ పాఠశాల గడప తొక్కలేదు. 

మా ముందు తరంలోని పెద్దలెవరికీ హైస్కూలు, కాలేజీ సర్టిఫికెట్లు లేవు. అందువలన వారందరూ పూర్తిగా తమ సంగీతాన్నే నమ్ముకొని జీవించవలసివచ్చింది. చదువుకు సంబంధించిన సర్టిఫికెట్ లేని కారణంగా మా తాతగారికి రావలసిన మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్ పదవి రాలేదు. ఆ పదవి దక్కకపోవడానికి గల అనేక కారణాలలో ఇది కూడా ఒక కారణంగానే ఒప్పుకోవాలి. కారణాలేవైనా ఉద్యోగ విరమణానంతరం రావలసిన పెన్షనూ రాలేదు. 

పూర్వజన్మ సుకృతం, స్వయంకృషి సీతారామ శాస్త్రిగారిని ఒక ఉన్నత వాగ్గేయకారుడిని చేసింది. ఒక విలక్షణ వ్యక్తిగా నిలబెట్టింది. సర్వశ్రీ - పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి, క్రొవ్విడి రామం, క్రొవ్విడి లక్ష్మణ్, నల్లాన్ చక్రవర్తుల సోదరులు, భళ్ళమూడి నరసింహం, ఆకుండి వెంకటశాస్త్రి, బుర్రా శేషగిరి రావు, జీవన ప్రభాత వంటి లబ్ధప్రతిష్టులైన సాహితీవేత్తలతో పాటు మా తాతగారి శిష్యులందరూ, ఘంటసాల సహా, కౌముదీ పరిషత్ సభ్యులే. మా నాన్నగారి ముఖ్యస్నేహితులు జీవన ప్రభాత, పంతుల శ్రీరామశాస్త్రి, భట్టిప్రోలు కృష్ణమూర్తి, మంథా వెంకట రమణారావు. వీరంతా కౌముదీ పరిషత్ కార్యకలాపాలలో పాల్గొనేవారు. వీరు అప్పటికే రచయితలుగా పేరుపొందివున్నారు. వీరి రచనలు 'భారతి' లో వస్తూండేవి. కౌముదీ పరిషత్  సంస్థ రాజమండ్రిలో కూడా జీవన ప్రభాత ఆధ్వర్యంలో నడిచింది. మా తాతగారి ఆధ్వర్యంలోని 'కౌముదీ పరిషత్', 'భారతీ తీర్థ' (ఆంధ్రా వేదిక్ రీసెర్చ్ యూనివర్సిటీ)కు అనుబంధ సంస్థగా మారి కవి, గాయక, పండితుల సమ్మేళనంతో ఒక ప్రముఖ వేదికగా అందరి మన్ననలు పొందింది. తరుచూ, సంగీత, సాహిత్య గోష్టులు జరిపేవారు. 

పండగలు పబ్బాలు వస్తే విజయనగరం సంగీత, సాహిత్యగోష్టులతోనే కాదు, పేకాటలతోనూ హోరెత్తేది. మా నాన్నగారి సాహితీ మిత్రబృందం అంతా ఒరిస్సాలోని రాయగఢా, జయపూర్ రూర్కెలా ఇతర ప్రాంతాలనుంచి వచ్చి  కౌముదీ పరిషత్ సభలలో పాల్గొనడంతో పాటు మా ఇంట్లో నిర్విరామ చతుర్ముఖ పారాయణం నిర్వహించేవారు. నిరంతర శ్వేతకాష్టాల ధూపం ఇంట్లో ఆడవాళ్ళను ఇబ్బంది పెట్టేది. 'ఇస్తోకు రాణి' అనే మాట  వాళ్ళ ఆటలో తరుచూ వినపడేది. ఎత్తడం, అడ్డాట, నేషనల్ బ్రిడ్జ్, మూడు ముక్కలాట వంటి పేర్లు అప్పుడే తెలిసింది. రాత్రుళ్ళు హరికేన్ లాంతర్ వెలుగులోనే పేకాడడం గుర్తు. పిల్లల కోసం చిన్న సైజ్ పేకదస్తాలు వుండేవి. వాటితో 'తరగనితంపి' అనే ఆటను  పిల్లలం ఆడేవాళ్ళం. వీరందరి భోజనాలు, బసలు మా ఇంట్లోనే. సందట్లో సందడిగా చామలాపల్లి, డొంకాడ , భీమవరం, పెంట, గుడివాడ, బొబ్బిలి ప్రాంతాల నుండి  వచ్చి పోయే బంధువుల రాకపోకలతో పండుగలు, వేసవి శెలవుల హడావుడి అంతా మా ఇంట్లోనే కనిపించేది.

మా తాతగారికి దిన పత్రికల్లో వచ్చే దినసరి రాశి ఫలాలాను చదివి వాటిని ఆచరించడం ఒక సరదా. 'అమ్మీ! ఇవేళ నా రాశికి ప్రయాణం అని రాశారు. అందుచేత ఒకసారి బొబ్బిలి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయి ఆ మర్నాటికి చక్కా తిరిగి వచ్చి దినఫలాలను నిజం చేసేవారు. బొబ్బిలిలో ఆయన తమ్ముడు (పెత్తల్లి కొడుకు) సామవేదుల నరసింహంగారు (బొబ్బిలి కోపరేటివ్ బేంక్ సింహాలుగారు), ఆయన చెల్లెలు అప్పలనరసమ్మగారు, ఆవిడ పెద్దకూతురు చెళ్ళపిళ్ళ వరహాలమ్మ - ఆయన పెద్ద మేనకోడలు, ఆవిడ కూతురు శారద ఉండేవారు. మా అమ్మగారు సామవేదుల నరసింహంగారి రెండో మేనకోడలు. వీళ్ళందరినీ ఒకసారి చూసేసి ఒక రోజుండి విజయనగరం వచ్చేస్తూండేవారు. ఆయన అక్కగారు, మా తాతగారి కూడా అక్కగారే అయిన ఓలేటి వెంకట నరసమ్మగారే విజయనగరంలో ఇంటి కేర్ టేకర్. ఇంటి సంరక్షణ పర్యవేక్షణ ఆవిడదే. ఆవిడనే మా తాతగారు అమ్మీ అని పిలిచేవారు. ఆవిడే మా పెద్దమ్మమ్మ.

అలాగే, చోడవరం. ఆ ఊళ్ళో ఆయనకో  చెక్క భూముండేది. అది పేరుకే సొంతం. దానిని కౌలుకు తీసుకున్నవారెవరో కానీ ఆ భూమి మీద ఏవిధమైన ఆదాయం ఇచ్చేవారు కాదని వినికిడి. ఎప్పుడో ఒకసారి చోడవరం రావడం ఆ వ్యక్తిని చూడడం, అతను చెప్పే తీపి కబుర్లకు లొంగి అయ్యో పాపం! అని జాలిపడి తిరిగిరావడం జరిగేది. బస్సు ఖర్చులు, అలసట తప్ప ఒరిగిందేఁవీఁ లేదు. ఆ విషయం ఆయనకూ తెలుసు. ఆ తరువాత, ఆ చోడవరం భూమి కూడా సంసారం కొసం హరించుకుపోయింది.

నా విజయనగరం చదువు, బ్రాంచ్ కాలేజీకి మారింది. ఫస్ట్ ఫారమ్ లో జాయిన్ చేశారు. కొత్త స్కూలు, కొత్త వాతావరణం,కొత్త టీచర్లు, కొత్త స్నేహితులు. అలవాటు పడేందుకు టైమ్ పట్టింది. ఆ బ్రాంచ్ కాలేజీలో చేరినప్పుడే బాల్ పెన్ తో వ్రాయడం మొదలయింది. నాకు ఒక  రోస్ కలర్ టిప్, రోస్ కలర్ బాటమ్ ఉండే తెల్లటి బాల్ పెన్ కొనిచ్చారు. దానితో రాయడానికి కష్టపడవలసి వచ్చేది. అప్పుడే, మొదటిసారిగా చెప్పులు వేసుకోవడం మొదలయింది. బాటా చెప్పులు. పది రూపాయల లోపే. అంతవరకు ఎలాటి రోడ్లమీదైనా చెప్పుల్లేకుండానే తిరిగేవాడిని. కొత్త చెప్పులు అలవాటులేక వేళ్ళమధ్య కరవడం, దానికి మందు పూయడం ఒక పని. ఆ బ్రాంచ్ కాలేజీ, పొడుగాటి వరండాలతో, పెద్ద పెద్ద గదులతో బాగానే ఉండేది. ఆగస్ట్ 15 కి తరగతి గదులు అందంగా రంగు కాగితాలతో అలంకరించేవారు.  ఫస్ట్ ఫారమ్ తరగతిలోఉన్న పిల్లలందరిని స్క్వాడ్ ల క్రింద విభజించారు. నేను నెహ్రూ స్క్వాడ్. కొందరు గాంధీ స్క్వాడ్. మరికొందరు నేతాజీ స్క్వాడ్. అప్పుడే, మన దేశ నాయకుల ఫోటోలు చూడడం, వారి పేర్లు తెలుసుకోవడం. నేను నెహ్రూ స్క్వాడ్ లో ఉన్నందుకు ఒక నెహ్రూ ఫోటోను తీసుకురావాలని చెప్పారు. మా చిన్నాన్నగారి సాయంతో ఒక పేపర్ లోని ఫోటో కట్ చేసి దానిని అదే సైజ్ అట్టమీద అంటించి మధ్యలో ఒక కన్నంపెట్టి దారంతో కట్టి, ఆ నెహ్రూను మా క్లాస్ లో మేము కూర్చుండే చోట గోడకు మేకు కొట్టి తగిలించాము. ఆ పనులు వేరే పిల్లలు చేసారు. ఈ స్కూలుకు వెళ్ళాక విజయనగరంలో కొత్త వీధుల పేర్లు తెలిసాయి. పాలేపువారి వీధి, బొంకులదిబ్బ,  కానుకుర్తివారి వీధి , గుండాలవారి వీధి , లక్కపందిరివీధి , లంకవీధి, మూడు లాంతర్ల వీధి, గంటస్థంభం, కొత్తపేట వంటి పేర్లు తెలిసాయి. అయితే అవెక్కడున్నాయో ఇప్పటికీ నాకు తెలియదు. అప్పుడే బొడ్డువారి హాలని ఒక సినీమా హాలు తయారయింది. అదే శ్రీరామా టాకీసేమో గుర్తులేదు. (ఆ ధియేటర్ ఓనర్ గారి అమ్మాయి ఓ పుష్కరం తరువాత తిరుపతిలో మెడిసిన్ చేస్తూ మెడ్రాస్ మా ఉస్మాన్ రోడ్ ఇంటి పక్కింటి అరవాళ్ళ మేడమీద అద్దెకుండే తెలుగువారింటికి శెలవుల్లో వచ్చి గడపడం ఓ గొప్ప థ్రిల్లు. 

కృష్ణాహాలులో మా వాళ్ళతో కలసి 'పెళ్ళిచేసి చూడు' వంటి సినీమాలు చాలానే చూశాను. అయితే ఆ హాలులో ఇనప స్థంబాలు ఎక్కువగావుండి సినీమా సరిగా కనపడేదికాదు. అలాగే ఆ సీట్లు కూడా. ముందువాళ్ళ తలలు తప్ప సినీమా కనపడదు. అప్పట్లో చాలా సినీమా హాల్స్ సీట్లు అలాగే ఉండేవి. 

ఒక రోజు స్కూల్ కు వెడుతున్నప్పుడో, వస్తున్నప్పుడో ఒక సైకిల్ వాడు స్పీడ్ గా వచ్చి నన్ను గుద్దేశాడు. కంటి మీద గాయమయింది. తెలిసినవాళ్ళెవరో  ఇంటికి చేర్చారు. తరువాత, సుసర్ల వెంకట్రావుగారి క్లినిక్, గాయానికి మందులు, మాకులు, స్కూలుకు డుమ్మా తప్పనిసరి. అదృష్టం ఏమంటే ఆ సైకిల్ బ్రేక్ రాడ్ ఎడమ కనుబొమ్మమీద గుచ్చుకుంది. అది ఏమాత్రం క్రిందికి తగిలినా ఎడమకన్నే పోయుండేదని డాక్టర్ గారు చెప్పారు. ఆ గాయం మచ్చ చాలా సంవత్సరాలవరకూ అలాగే వుండిపోయింది.

మా చిన్నప్పుడు మా ఇళ్ళలో ఎక్కడా గోడ గడియారాలు, చేతి వాచీలు లేవు. టైమ్ తెలుసుకోవాలంటే మా వీధిలో నాలుగైదు ఇళ్ళ తరువాత ఉండే పెద్దమ్మి - చిన్నమ్మి ఇంట్లో వుండే గోడ గడియారాన్ని బయటనుండే కటకటాల తలుపులుగుండా చూసి వచ్చేవాళ్ళం. ఒకరోజు ఉదయం టైమ్ చూడడానికి వెళుతూండగా ఏదో జరిగింది.  ఎవరో ముందుకు త్రోసినట్లయింది. ఒక వారగా నడుస్తున్న నేను రోడ్ అవతల వేపుకు జరిగిపోయాను. అదెలా జరిగిందో నాకే తెలియదు. ఆ సమయంలో ఏదో చిన్న ఉరుము లాటి శబ్దం వినిపించింది. అది కొద్ది క్షణాలు మాత్రమే. తర్వాత ఏమీ లేదు. ఇంటికి వచ్చాక తెలిసింది భూమి కంపిస్తే అలా జరుగుతుందట. విజయనగర ప్రాంతాలలో చాలాకాలం ముందు భూకంపాలు తరచూ వచ్చేవిట. అందుకు కారణం, హెర్కులిస్ భూమిని మోస్తూ ఒక భుజం మీదనుండి మరో భుజానికి మార్చుకోడమేనట. మా మిత్రబృందం చెప్పింది.

తరువాత, తెలిసిన విషయం ఏమంటే విజయనగరానికి సమీపాన రామతీర్థం అనే ఊరుంది. ఆ వూళ్ళోని కోదండ రామస్వామివారి ఆలయం చాలా పురాతనమైనది, ప్రసిధ్ధిచెందినదీను. ఈ ప్రాంతమంతా కొండలు. అవి ఒకప్పుడు గంధకం కొండలట. వాటిలోని గంధకం  లోపల్లోపల మండడం వలన ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో భూకంపాలు ఏర్పడేవట. ఇదంతా శతాబ్దాలకాలం నాటి మాట. వాటిమీద ఎక్కడా ఒక చెట్టుకానీ, పచ్చని మొక్కకానీ కనపడదు. ఆ ప్రభావం వల్లనే అప్పుడప్పుడు భూమి కంపిస్తుందని అనేవారు.




(రామతీర్థంలో కోదండరామస్వామి కోవెల)

మా ఫ్రెండ్స్ లో రీల్ మాస్టర్లు (సింపుల్ గా కోతలరాయుళ్ళు)‌ ఎక్కువే. విజయనగరం ఊళ్ళోనుండి ఎక్కడనుండి చూసినా ఊరి పొలిమేరల్లో ఉన్న మచ్చకొండ, సూదికొండ కనిపించేవి. ఆ మచ్చకొండ మీద ఏదో పాడుపడిన కట్టడం ఉండేది. అదేమిటో స్పష్టంగా గుర్తులేదు. అలాగే, మచ్చకొండకి మచ్చ ఎలా వచ్చిందంటే, విజయనగరం మహారాజావారు కోటలో నుండి కొండమీదున్న ఒక పక్షిని తన పొడుగాటి తుపాకీతో గురిచూసి కొట్టడంతో ఆ గుండు తాకిడికి పక్షితోపాటూ ఆ కొండ పెళ్ళకూడా రాలి మచ్చపడిందట. ఈ విషయాలు మా స్నేహితులు చెపుతూంటే నోరెళ్ళబెట్టుకొని మహా ఆసక్తిగా వినేవాడిని. విజయనగరం మహారాజావారు ఎంత గొప్పవారో అనిపించేది. 

ఇలాటి విషయాలన్నీ మంత్రిప్రగడ నాగభూషణం నోటమ్మట వినపడేవి. మంత్రిప్రగడ వారింటి పక్కనే మల్లాప్రగడవారు. ఆ ఇంటావిడ మా అమ్మగారి స్నేహితురాలు. ఈ నాగభూషణం చిన్నప్పుడే ముదిరిపోయాడు. అప్పుడు జగ్గయ్య నటించిన 'ప్రియురాలు' అనే సినీమా వచ్చింది. ఆ సినీమాలో హీరో సిగరెట్లు కాలుస్తూంటాడు. ఈ కుర్రాడు ఆ సినీమా చూసొచ్చి అందులో జగ్గయ్యలాగే సిగరెట్ కాలుస్తున్నట్లు నటిస్తూ ఆ డైలాగ్ లతో నటించి చూపేవాడు. అతనంటే ఎందుకో నాకు ఎక్కువ పడేదికాదు. కొంచెం దూరంగానే ఉండేవాడిని.

మా ఇంటి దగ్గరనుండి అయ్యకోనేరు గట్టుకు వెళ్ళాలంటే సుబ్రమణ్యంపేట వీధిలోనుండి తురకల చెరువు మీదుగా వెళ్ళాలి . ఆ వీధిలో అయ్యకోనేరు గట్టుకు ముందు కుడివేపు ఒక పెద్ద తెల్లటి మేడ వుండేది. ఆ ఇంటి వరండాలో పెద్ద పెద్ద డూమ్ లు, రంగురాళ్ళ షాండ్లియర్లు వుండేవి. ఆ ఇంట్లో ఎవరో పట్నాయక్ ఉండేవారు.  రంగురాళ్ళు సేకరించడం ఓ సరదా. మా పక్క వీధిలో ఒకరింట్లో అలాటి రాళ్ళను  మా యింట్లోని వారపత్రికలు ఇచ్చి సంపాదించినట్లు గతంలో చెప్పాను. వాళ్ళింటికి వెళ్ళి చాలారోజులయింది. కోటలోనుండి వచ్చే  కొత్త రంగురాళ్ళేమైన దొరుకుతాయేమోనని వాళ్ళింటికి వెళ్ళాను. నేను ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళేప్పటికి ఎవరెవరో చాలామంది మనుషులు గుమిగూడి వున్నారు. లోపలనుండి ఎవరో ఏడవడం వినిపించింది. నాకు భయంవేసి, ఒకే పరుగున ఇంటికి చేరుకున్నాను. తరువాత, మా చిన్నాన్నగారి మాటల్లో తెలిసిన విషయం ఏమంటే ఆ యింటివారి కొడుకుల్లో ఒకడు విశాఖపట్నం ఏవిఎన్ కాలేజీలో చదువుతూ శెలవులకి రైల్లో విజయనగరం వస్తున్నాడట. అతను రైల్లో చల్లగాలికోసం తలుపు దగ్గర కూర్చున్నాడట. రైలు స్టేషన్లోకి రావడం నిద్రమత్తులో గమనించలేదట. రైలుకి ప్లాట్ ఫారమ్ కి మధ్య కాళ్ళు ఇరుక్కుపోయి అతను పట్టాల మధ్య పడి అక్కడికక్కడే చచ్చిపోయాడట. ఆ సంఘటన వినడానికే చాలా భయంకరంగా అనిపించింది. చిన్నతనం కావడంవలన నేను మళ్ళీ ఆ యింటిలోకి వెళ్ళడానికి మనసురాలేదు.

ఒక రోజు మా ఇంటి వరండాలో కూర్చొని ఫ్లోర్ క్యారమ్స్ ఆడుతూంటే ఒక పెద్ద సినీమా వ్యాన్ వచ్చింది. సాధారణంగా, సినీమాల ప్రచారమంతా జట్కా బళ్ళకు, రిక్షాలకు సినీమా పోస్టర్లు అంటించి "నేడే చూడండి మీ అభిమాన పూర్ణా ధియేటర్లో" అని స్పీకర్లో అరుస్తూ సినీమా కాగితాలు పంచిపెట్టేవారు. వాటిని పేపర్ బండి అనేవారు. ఆ సినీమా పేంప్లట్స్ చాలా చీప్ పల్చటి కాగితాలమీద ఎరుపు, పసుపు, పచ్చ, నీలం రంగులలో పంచేవారు. వాటిమీద సినీమా వివరాలు, కధా సంగ్రహం ఉండేవి. ఆ కాగితాలకోసం పిల్లలంతా ఆ జట్కా ల వెనక, రిక్షాలవెనుక పరిగెత్తి వాటిని సంపాదించేవారు. అలాటిది, ఒక సినీమా ఎడ్వర్టైజ్మెంట్ కోసం ఒక పెద్ద వ్యాన్ లాటిది మా వీధిలోకి రావడం మహదానందం కలిగించింది. ఆ వ్యాన్ కు మూడు పక్కలా పూర్తిగా  బల్బులతో అలంకరించి పోస్టర్లు తగిలించారు. దానిమీద "చంద్రహారం" అని రాసివుంది. నాకు బాగా తెలిసిన ఎన్ టి రామారావు బొమ్మవుంది. వేరెవరి బొమ్మలో కూడా ఉన్నాయి. నాకెందుకో ఆ సినీమా పేపర్ సంపాదించాలనిపించి ఆ వ్యాన్ వెనకాల పడ్డాను.  ఆ వీధిలో కొంత దూరం వెళ్ళాక ఎలాగో ఒక పాంప్లెట్ నాకు దొరికింది. అలాటి సినీమా పేపర్ అంతవరకూ నేను చూడలేదు. మల్టీ కలర్స్ లో  గ్లేజ్డ్ పేపర్ మీద వీక్లి పత్రికల సైజ్ లో ఉంది. ఆ పేపర్ నాకెంతో అమూల్యమైనదిగా తోచింది. దానిని జాగ్రత్తగా మా అమ్మగారిచేతికిచ్చాను. చంద్రహారం సినీమా పెళ్ళి చేసి చూడు తీసినవాళ్ళదని ఇందులో కూడా ఘంటసాల పాటలున్నాయని తెలిసింది. ఆ పోస్టర్ మీద ఎన్ టి రామారావుతో పాటు శ్రీరంజని, ఎస్వీరంగారావు, సావిత్రి, రేలంగీ, మరెవరో ఉన్నారని తెలిసింది. నేను  ఆ రంగుల సినీమా పోస్టర్ ను నా పరీక్షల అట్టమీద అంటించి చాలా జాగ్రత్తగా చూసుకునేవాడిని. నేను విజయనగరంలో ఉన్నంతకాలం చంద్రహారం పోస్టర్ నా దగ్గరే ఉండేది. తరువాత, ఆ చంద్రహారం సినీమా వ్యాన్ మరో రెండుసార్లు రాత్రిపూట పూర్తి లైట్ల వెలుగుతో మా వీధిలోనుంచి వెళ్ళింది. అప్పటికీ, ఇప్పటికీ కూడా నాకు చంద్రహారం అంటే చాలా ఇష్టం. అందులోని మాలిగా ఎస్వీరంగారావు పాడిన 'ఏనాడు మొదలిడితివో ఓ విధి' పాట నాకు చాలా ఇష్టం. ఆ సీన్ లో మాలిని చూస్తే జాలిగా ఉండేది. కారణం తెలియదు. ఆ సినీమాలో  మిగిలిన పాటలంటే కూడా మహా ఇష్టం. కారణం, ఆ పాటలు పాడింది మా తాతగారి శిష్యుడని తెలియడం వలన. ఆ సినీమా చూసి వచ్చిందగ్గర్నుంచి పిల్లలంతా సావిత్రిలాగా కళ్ళు పెట్టి చేతివేళ్ళూపూతూ ఒకళ్ళనొకళ్ళు భయపెట్టుకునేవాళ్ళు. అలా చేస్తే ఎన్ టి రామారావు లాగా కళ్ళు తిరిగి పడిపోవాలని. కానీ, ఏ ఒక్కడూ కళ్ళు తిరిగి పడిపోలేదు. కానీ, మాలో మేము కాట్లాడుకోవడానికి కారణమయింది 'నువ్వు నన్ను శాపం పెట్టాలని చూస్తున్నావా' అని.
                       
(ఏ నాడు మొదలెడితివో పాట - చంద్రహారం లో మాలి పాడే పాట)

విజయావారు చంద్రహారం కోసం చాలానే కష్టపడ్డారు. భారీగా ఖర్చుపెట్టారు. కానీ, ప్రజలకే నచ్చలేదు. కారణం వాళ్ళ పాతాళభైరవి సినీమా. అందులోని నటులే ఇందులో ఉన్నా అందులోని మాయలు, మంత్రాలు, హాంఫట్, జై పాతాళభైరవి, కాపాలికా, నరుడా ఏమి నీ కోరికా వంటి మాటలు, గాలిలో ఎగిరే మహల్స్ లేకపోవడమే. అందులోనూ ఎన్ టి రామారావు యుధ్ధం చేయకుండా ఎప్పుడూ నిద్రపోతూండడం  సాదా ప్రేక్షకులకు తీరని ఆశాభంగం. అందులోనైతేనేం, చంద్రహారంలో అయితేనేం, ఘంటసాలవారి సంగీత ప్రతిభే ఈనాటికీ ఆ సినీమాల గురించి తల్చుకునేట్లు చేస్తోంది.)

పిల్లల ఆటలు సీజనల్. ఒక సీజన్ లో మా వీధిలో పిల్లలంతా ముమ్మరంగా బొంగరాలాటలో మునిగి వుండేవారు. వాళ్ళతో సమానంగా ఆడాలని నా కోరిక. నా పోరుపడలేక ఒక బొంగరం కొనిచ్చారు. అయితే దానికి తాడేసి చుట్టడం చేతనైయ్యేదికాదు. తోటిపిల్లలు దానిని తీసుకొని దానికి ముల్లులేదు, ఆటకు పనికిరాదని చెప్పడంతో కోపం వచ్చి ఒక రోజంతా బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చున్నాను. తర్వాత, మా చిన్నాన్నగారు ముల్లున్న బొంగరం కొనిచ్చి అదెలా తిప్పాలో నేర్పారు. బొంగరం నేలమీద పడకుండా అరచేతిమీద త్రిప్పడం సర్కస్ చూస్తున్న ఆనందం. (మరోచరిత్ర లో కమలహాసన్, సరితల బొంగరం సీన్ మరో సర్కస్). ఇలా రెండు మూడు రోజులు ఆడేనో లేదో పిల్లల్లో ఒకడు ఆడిస్తానని చెప్పి దానిని రెండు ముక్కలు చేసి చేతికిచ్చాడు. కొత్తది కొనిస్తానన్న వాగ్దానంతో.

ఇలా మూడు బొంగరాలు, ఆరుచెక్కలుగా కాలక్షేపం జరుగుతున్న సమయంలో మా శారదక్క పెళ్ళి నిశ్చయమయింది. శారద మా దొడ్డమ్మగారి అమ్మాయి. నాకంటే ఏడేళ్ళు పెద్దది. బొబ్బిలిలో మా తాతగారింట్లో వుంటుంది. పెళ్ళి కుద్దిగాం అనే ఒక పల్లెటూళ్ళో. (ఆ ఊరు ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దులలో వంశధారా నదీ తీరాన ఉంది).

ఆ పెళ్ళి విశేషాలు....
వచ్చే వారమే....
                   ....సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

13 comments:

Pulijalasanthisree said...

మేం కూడా చిన్పపిల్లలమైపోయిన భావన...చక్కని శైలి...కళ్ళను మనసును కూడా అక్షరాలవెంట పరిగెత్తించింది..అద్భుతః...

వడ్డాది గోపాలకృష్ణ మూర్తి said...

ఉస్మాన్ రోడ్ 35
అలనాటి - 1959-60 గ్రామీణ మరియు కొన్ని కొన్ని చిన్న చిన్న పురములను,నగరాలను
పేటలను జీవన గమనంతో ఎంతో ఉత్సాహంగా నడుస్తూంది కథానిక. ఒక్క మనవి! ఈ 50 రోజులలోనూ జరిగిన భాగాలు ఇప్పటికి ఒక సంపుటి గా ప్రింట్ కి వెళితే గురుశ్రీ పట్రాయని సంగీతరావు గారి శత జయంత్యుత్సవమునకు 02.11.2020 నాటికి ఒక జ్ఞాపికగా మా బోటి అంతే వాసులకు సదరు గ్రంధం ఎంతో ఉపయుక్తమైనదిగా ఉంటుందని మనవి! నా ఉద్దేశ్యంలో ఇప్పటికే కార్య రూపం దాలిస్తే మెమెంతో అదృష్టవంతులం!
వడ్డాది గోపాలకృష్ణ మూర్తి

వడ్డాది గోపాలకృష్ణ మూర్తి said...

ఉస్మాన్ రోడ్ 35
అలనాటి - 1959-60 గ్రామీణ మరియు కొన్ని కొన్ని చిన్న చిన్న పురములను,నగరాలను
పేటలను జీవన గమనంతో ఎంతో ఉత్సాహంగా నడుస్తూంది కథానిక. ఒక్క మనవి! ఈ 50 రోజులలోనూ జరిగిన భాగాలు ఇప్పటికి ఒక సంపుటి గా ప్రింట్ కి వెళితే గురుశ్రీ పట్రాయని సంగీతరావు గారి శత జయంత్యుత్సవమునకు 02.11.2020 నాటికి ఒక జ్ఞాపికగా మా బోటి అంతే వాసులకు సదరు గ్రంధం ఎంతో ఉపయుక్తమైనదిగా ఉంటుందని మనవి! నా ఉద్దేశ్యంలో ఇప్పటికే కార్య రూపం దాలిస్తే మెమెంతో అదృష్టవంతులం!
వడ్డాది గోపాలకృష్ణ మూర్తి

వడ్డాది గోపాలకృష్ణ మూర్తి said...

ఉస్మాన్ రోడ్ 35
అలనాటి - 1959-60 గ్రామీణ మరియు కొన్ని కొన్ని చిన్న చిన్న పురములను,నగరాలను
పేటలను జీవన గమనంతో ఎంతో ఉత్సాహంగా నడుస్తూంది కథానిక. ఒక్క మనవి! ఈ 50 రోజులలోనూ జరిగిన భాగాలు ఇప్పటికి ఒక సంపుటి గా ప్రింట్ కి వెళితే గురుశ్రీ పట్రాయని సంగీతరావు గారి శత జయంత్యుత్సవమునకు 02.11.2020 నాటికి ఒక జ్ఞాపికగా మా బోటి అంతే వాసులకు సదరు గ్రంధం ఎంతో ఉపయుక్తమైనదిగా ఉంటుందని మనవి! నా ఉద్దేశ్యంలో ఇప్పటికే కార్య రూపం దాలిస్తే మెమెంతో అదృష్టవంతులం!
వడ్డాది గోపాలకృష్ణ మూర్తి

వడ్డాది గోపాలకృష్ణ మూర్తి said...

ఉస్మాన్ రోడ్ 35
అలనాటి - 1959-60 గ్రామీణ మరియు కొన్ని కొన్ని చిన్న చిన్న పురములను,నగరాలను
పేటలను జీవన గమనంతో ఎంతో ఉత్సాహంగా నడుస్తూంది కథానిక. ఒక్క మనవి! ఈ 50 రోజులలోనూ జరిగిన భాగాలు ఇప్పటికి ఒక సంపుటి గా ప్రింట్ కి వెళితే గురుశ్రీ పట్రాయని సంగీతరావు గారి శత జయంత్యుత్సవమునకు 02.11.2020 నాటికి ఒక జ్ఞాపికగా మా బోటి అంతే వాసులకు సదరు గ్రంధం ఎంతో ఉపయుక్తమైనదిగా ఉంటుందని మనవి! నా ఉద్దేశ్యంలో ఇప్పటికే కార్య రూపం దాలిస్తే మెమెంతో అదృష్టవంతులం!
వడ్డాది గోపాలకృష్ణ మూర్తి

P P Swarat said...

మీ సదభిప్రాయాలకు ధన్యవాదాలు.

P P Swarat said...

శ్రీమతి శాంతిశ్రీ గారూ కృతజ్ఞతలు.

VENKATA SOMASEKHAR PERURI said...

చక్కని రచనాశైలి తో సాగిపోయిన అలనాటి జ్ఞాపకాలు వివరించిన తీరు అద్భుతంగా ఉన్న దండి

Unknown said...

ఎప్పటిలాగే చక్కగా, బాల్య స్మృతులు, అద్భుతమైన ముచ్చట్లతో బలే నడిపిస్తున్నారు. శత వందనాలు. 🙏🙏

P P Swarat said...

మీ అభిమానానికి ధన్యవాదాలు.

Patrayani Prasad said...

శ్రీ ప్రణవ స్వరాట్ అన్నయ్యకు నమస్కారములు.🙏🙏 నీవు అద్భుతముగా వ్రాస్తున్న ఈ నాటి 'జ్ఞాపకాల మాలిక ' చదువుతూ ఉంటే, అప్పటికి అయిదు లేక ఆరేళ్ళ వయసులో ఉన్న నేను కూడా నీతోపాటు తిరుగాడినా, కొన్ని తెలియనివి, కొన్ని మరచి పోయినవి, కొన్ని కొంతవరకు జ్ఞాపకం, ఉన్నవాటిని, నెమరు వేసుకునే అవకాశం కలిగి, చాలా సంతోషం వేసింది. మా నాన్నగారు కీర్తిశేషులు శ్రీ పట్రాయని ప్రభాకర రావు గారు, కీర్తిశేషులు మా అమ్మ, కమలమ్మ, కొన్నికొన్ని విషయాలు జీవించి ఉండగా, జ్ఞాపకం చేసుకొంటూ, చాలా ఆనంద పడేవారు. ఆ సంగతులన్నీ, ఈ సంచిక ద్వారా మరో మారు తలచు కోగలిగే అవకాశం కలిగించి నందుకు, నీకు ధన్యవాదాలు🙏🙏-. పట్రాయని ప్రసాద్, బెంగుళూరు. తేదీ:04-09-2020, శుక్రవారం, రాత్రి : గం 07:00 ని .

ఉస్మాన్ రోడ్ 35 said...

స్వరాట్ గారు, మీ రచనాశైలి కళ్ళముందు కదలాడే చలన చిత్రంలానే ఉంటుంది. అలనాడు మీకనుబంధవాసులై చరించిన పుణ్యపురుషులు, స్త్రీశిరోమణుల జీవన విధానాలను, మరుపు రాని మధుర జ్ఞాపకాలను మీ శిలాక్షరాలలో పదిలపరచి మాకు మీ అనుభూతుల్ని పంచుతున్నారు.మా చిన్ననాటి మధుర స్మృతుల్ని నెమరువేసుకొనేవిధంగా మీ రచన ఒక ప్రవాహంలా సాగుతూ ఉంది
ఆనాటి పెద్దల స్వచ్ఛమైన మనసులు మా కళ్ళముందు కఫలాడుతున్నాయి.ఒకింత నయనాలలో కన్నీళ్లు కూడా జాలువారుతున్నాయి.ఎందుకంటే మీవి కేవలం కాగితాలు మీద నిక్షిప్తమయ్యే అక్షరాలు కావు. అవి మీ హృదయం నుండి బహిర్గతమయే సత్య శోధనకు సంకేతాలు. మాగుంట వెంకటరంగారెడ్డి నెల్లూరు.

T

P P Swarat said...

శ్రీయుత మాగుంట వెంకట రెడ్డిగారికి ధన్యవాదాలు. గత తరపు వ్యక్తులంతా నేటి తరానికి ఏదో విధమైన స్ఫూర్తిని కలిగిస్తారు. అందులోని మంచివరకూ గ్రహించి మన స్థితిని గుర్తుంచుకోవలసిన అవసరం ఉందని నమ్ముతున్నాను.