visitors

Friday, September 11, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదహారవ భాగం

11.09.20 - శుక్రవారం భాగం - 16*:
పదిహేనవ భాగం ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

నా బాల్యమంతా కలివరం, విజయనగరం,బొబ్బిలి మధ్యనే జరిగింది. పుట్టింది బొబ్బిలి. మొదటి ఐదేళ్ళూ నాగావళీ తీరాన. మూడేళ్ళు తెలుగువారికి సాంస్కృతిక కేంద్రమైన విజయనగరంలో. చదువు బొబ్బిలి - మద్రాస్ - బొబ్బిలిలో. ఉద్యోగరీత్యా మద్రాస్ లోనే స్థిరనివాసం. 

నేను ఓ మూడేళ్ళపాటు విజయనగరం లోనే ఉన్నా మా అమ్మగారి ఊరైన బొబ్బిలి తరుచూ వెళ్తూండేవాడిని. అక్కడ మా అమ్మమ్మగారు ఆవిడ తమ్ముడు సామవేదుల నరసింహంగారు, మా దొడ్డమ్మగారు చెళ్ళపిళ్ళ వరహాలమ్మ, ఆవిడ ఒకే కూతురు శారద. వీరందరి సంరక్షణాభారం మా తాతగారిదే. ఆయన బొబ్బిలి కోపరేటివ్ అర్బన్ బ్యాంకు లో పెద గుమస్తా, కేషియర్ గా పనిచేసేవారు. ఆయన భార్య సుందరి చిన్నతనంలోనే పోయింది. మా అమ్మమ్మగారు, దొడ్డమ్మగారు ఇద్దరూ వితంతువులే. మా అమ్మగారి పేరు శ్రీలక్ష్మి అయినా తెలిసిన వారంతా సుందరి అనే పిలిచేవారు. ఆవిడకు ఒక అన్నగారుండేవాడట. నాకు తెలియదు. పేరు రామం. పదహారేళ్ళకే పోయాడట. మా బొబ్బిలి తాతగారి పెద్దక్కగారే విజయనగరం ఇంటి సంరక్షకురాలు. మా తాతగారు సీతారామశాస్త్రిగారి ముగ్గురు కొడుకులను పెంచినావిడ. బొబ్బిలిలో మా తాతగారింట్లో ఉన్నవారందరిదీ సాత్వికమైన  ఆశ్రమ జీవితం. అందుకు తగినట్లుగా వారుండేది ఒక పూరిల్లు. ముందు వెనుకల ఇల్లు. మధ్యలో చిన్న వాకిలి. అందరూ బహు సౌమ్యులు. ఎవరినోటా ఏ విధమైన పరుషపు మాటలు, వ్యాఖ్యానాలు వినవచ్చేవి కాదు. మా బొబ్బిలి తాతగారిని అందరూ 'సింహాలు బాబూ' అని చాలా గౌరవంగా చూసేవారు. అగ్రహారపు జీవనం. అలాటి వాతావరణంలో పెరగడం నా అదృష్టం. మా తాతగారుండే వీధిలో మొదట్లో అందరూ సామవేదులవారి కుటుంబాలే ఉండేవి . అందుకే ఆ వీధిని సామవేదులవారి సందు అని అనేవారు. పోస్టల్ రికార్డ్స్ లో కూడా అలాగే ఉండేది. మా తాతగారి పూర్వీకులు బొబ్బిలి సంస్థానంలో సామవేద పండితులుగా, ఆయుర్వేద వైద్యులుగా ఉండేవారని చెపుతారు.

మా నాన్నగారి తన  నాలుగు, ఐదు క్లాసుల చదువు బొబ్బిలిలో జరిగింది. అప్పుడే, శ్రీ ఆకుండి నారాయణ శాస్త్రిగారి వద్ద కొంత సంగీతం నేర్చుకున్నారు. ఆ నారాయణ శాస్త్రిగారు బొబ్బిలి కోటలో రాజవంశీయుల పిల్లలకు సంగీతం నేర్పేవారు. బొబ్బిలి రాజావారి పట్టాభిషేకం చాలా ఘనంగా జరిగింది. ఆ సందర్భంగా రాజావారి మీద నారాయణశాస్త్రి గారు  ప్రశంసా గీతం ఒకటి స్వయంగా రాసి రాగమాలికలో స్వరపరచేరు. ఆ తరువాత కూడా ప్రతీ సంవత్సరం బొబ్బిలి ప్రాంతంలో పట్టాభిషేకం దినోత్సవం అని జరుపుకునేవారట. అలాంటి ఒక సందర్భంలో  పట్టాభిషేక దినోత్సవంనాడు బొబ్బిలి ఆస్థానంలో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటున్న  మా నాన్నగారి చేత ఆ కీర్తన పాడించేవారట వారి గురువుగారు నారాయమ శాస్త్రిగారు. ఆ పట్టాభిషేక గీతాన్ని మా నాన్నగారు తొంభై ఏళ్ళ వయసులో మళ్ళీ 2010లో పాడినప్పుటి రికార్డింగ్ ఇక్కడ




సుమారు 263 సంవత్సరాలకు ముందు ఒక సాధారణ కోడి పందేలు కారణంగా చిన్నగా వైషమ్యాలు ఏర్పడి అవి పెరిగి పెద్దవై ఇరుగు పొరుగు సంస్థానాల మధ్య పోరు పెరిగి విజయనగరం, బొబ్బిలి రాజుల మధ్య యుధ్ధానికి దారి తీసింది. హైదరాబాద్ నవాబ్, ఫ్రెంచ్ బుస్సీల ఫిరంగి సైనికుల సహాయంతో బొబ్బిలి కోటను నేలమట్టం చేసి బొబ్బిలి వీరులందరినీ హతమార్చారు. బొబ్బిలి కోటలోని అంతఃపుర స్త్రీలంతా ఆత్మాహుతి చేసుకున్నారు. ఇందుకు ప్రతీకారంగా బొబ్బిలి రాజు బావమరిది తాండ్ర పాపారాయుడు విజయరామరాజును దారుణంగా హత్యచేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తరువాత, ఒక 150 సంవత్సరాలకు బొబ్బిలి వంశీయులు ఇప్పుడున్న చోట కొత్తగా ఒక కోట నిర్మించుకున్నారు. దాని చుట్టూ ఒక ఊరు వృధ్ధి చెందింది. ఆనాటి  అసలు రాజ వంశస్థులెవరూ లేని కారణంగా ఇతర సంస్థానాలనుండి దత్తత కు వచ్చినవారే సంస్థానాధీశులు అయినట్లు చెప్పుకుంటారు. ఇప్పుడున్న విజయనగర రాజుల పూర్వీకులు ఉత్తరప్రదేశ్ లోని  రేవా సంస్థానం నుండి దత్తతకు వచ్చినవారే. అందుకే ఇన్నాళ్ళైనా వారెవరూ స్వఛ్ఛమైన తెలుగు మాట్లాడలేరు. పివిజి రాజు పెత్తండ్రి - సర్ విజ్జీ ప్రముఖ క్రికెటర్. రన్నింగ్ కామెంటేటర్ గా కూడా చాలా ప్రసిధ్ధి పొందారు.

ఉత్తరాంధ్రాలో ఉన్న జమిందారి సంస్థానాలలో ప్రముఖమైనవి విజయనగరం, బొబ్బిలి, సాలూరు. అందులో ఉన్నతంగా, పెద్ద ఆదాయం కలిగినది విజయనగరం, తరువాత బొబ్బిలి, చివరగా సాలూరు. ఈ సంస్థానాల గురించి ఒక జోకు ప్రచారంలో ఉండేది. ఈ మూడు సంస్థానాలలో నగారాలు మ్రోగించేవారట. ఆ నగారాల నాదం ఆ ఆస్థానాల ఆర్ధికస్థితిని పోలి ఉండేదట.  విజయనగరం నగారా ఘనం ఘనం అని ఘనంగా మ్రోగేదట. బొబ్బిలి నగారా ధనం ధనం అంటూ ధనం కోసం మ్రోగేదట. ఇక, సాలూరు నగారా ఋణం, ఋణం అంటూ ఋణనాదం చేసేదట. ఆయా సంస్థానాల ఆదాయ స్థితిగతులని ఇలా ఈ జోక్ చేసేవారు. 

అలాటి మూడు సంస్థానాలతోనూ మా పూర్వీకులకు సత్సంబంధాలు వుండేవి.

1952లో విజయనగరంలో ఉన్నప్పుడు విజయావారి  "పెళ్ళిచేసి చూడు" చిత్రం వచ్చింది. ఆ సినీమాను అక్కడ చూసినా పూర్తి అవగాహన లేని వయసు. "బ్రహ్మయ్యా! బ్రహ్మయ్యా!" పాట, "అమ్మా! నొప్పులే, అమ్మమ్మా నొప్పులే" పాట, ఎన్ టి రామారావు పిచ్చివాడిలా బస్సు నడపడం, పుష్పలత, మహంకాళి వెంకయ్య నూలు దారంతో ఆడడంవంటివేవో గుర్తున్నాయి తప్ప, పూర్తి సినీమా గుర్తులేదు. నేను, మా అమ్మగారు 1953లోనో ఎప్పుడో బొబ్బిలి వచ్చినప్పుడు రాజావారి హాలుకి పెళ్ళి చేసి చూడు సినీమా రాబోతున్నదని వార్త వచ్చింది. ఆ సినీమాకు ఘంటసాలవాడే సంగీతం సమకూర్చాడని, అందులో అతని పాటలున్నాయని అందరూ ఘనంగా చెప్పుకున్నారు. ఘంటసాల విజయనగరం మ్యూజిక్ కాలేజీలో అందులో సాలూరు చినగురువుగారి దగ్గర సంగీతం నేర్చుకోవడం వలన, ఆ ప్రాంతాలవారందరికీ ఘంటసాల అన్నా ఘంటసాల సంగీతమన్నా, పాడిన పాటన్నా, పద్యమన్నా విపరీతమైన అభిమానం, గౌరవం ఇప్పటికీ వున్నాయి. ఘంటసాల తప్ప మరో గొప్ప గాయకుడున్నాడంటే ససేమిరా ఒప్పుకోరు. 

పెళ్ళిచేసి చూడు చిత్రమూ అందులోని పాటలు అప్పటికే బహుళ జనాదరణ పొందడంతో బొబ్బిలిలో ఆ సినీమా కోసం అందరూ ఎదురు చూసారు. బొబ్బిలిలో అప్పటికి ఒకటే పెర్మనెంట్ సినీమా హాలు. అదే రాజావారి శ్రీరామా టాకీస్. అదికాక ఓ రెండు మూడు టూరింగ్ టాకీస్ లు ఉండేవి.  టెంట్ హాల్స్. అవి వర్షాకాలంలో పనిచేయవు. రాజావారి హాలులో సౌండ్ బాగుంటుందని, డబుల్ ప్రొజెక్టర్ తో పని చేస్తుందని, ఆ హాలులో స్క్రీన్ సిల్వర్  స్క్రీన్ అని చెప్పేవారు. స్క్రీన్ క్లాత్ కాదు. అలాటి హాలులో సినీమా చూడడం ఆనందంగా భావించేవారు. సినీమా రిలీజ్ డేట్ తెలియగానే పోస్టర్లు అంటించిన బళ్ళు ఊరేగించారు. ఆ బళ్ళకు ముందు ఓ ముగ్గురు డప్పులు వాయించుకుంటూ వచ్చేవారు. ఊళ్ళోని ప్రతీ వీధి జంక్షన్ లో నిలబడి లౌడ్ స్పీకర్లలో ఆ సినీమా గురించి గట్టిగా అరిచి చెప్పేవారు. ఐదేసి నిముషాలకు ఒకసారి గ్రామఫోన్ లో ఆ సినీమాలో పాటలు పెట్టేవారు . గ్రామఫోన్ కీ తగ్గినా, స్పీడ్ లెవెల్స్ కదిలిపోయినా పాట మహా బొంగురుగానో, లేదా కీచుగానో వినిపించేది. ఒక్కొక్కసారి జట్కా బండికి పోస్టర్ తడకలు కట్టి, సినిమా రంగు కాగితాలు గాలిలోకి విసురుతూ పంచేవారు. మరి, అలాటి ఘంటసాలవాడి సినీమా చూడడం మానేస్తామా?

మా సామవేదుల వారి వీధిలో ఆఖరి మూడిళ్ళూ సామవేదులవారివే. వారంతా కజిన్స్. తాతా సహోదరుల పిల్లలుఆ మూడిళ్ళ కోడళ్ళ పేరూ ఒకటే. కామేశ్వరి. పెద కామేశ్వరి, మధ్య కామేశ్వరి, చిన్న కామేశ్వరి. ఆ చిన్న కామేశ్వరిగారి భర్త సత్తేలు(సత్యనారాయణ). ఒకే కొడుకు తరణీరావు. చిన్నప్పటినుండీ ఏదో అనారోగ్యం. మెడ ఒక పక్కకు వంగిపోయి భుజానికి అంటుకుపోయినట్లుగా వుండేది. నెలల పిల్లాడిగా ఉన్నప్పటినుండి చిన్న ఊగుడు కుర్చీలో పడుక్కోబెట్టడం వలన అలాటి అవకరం వచ్చిందనేవారు. మరేదో కారణం కావచ్చు. బాగుపడలేదు.  వారిల్లు విశాలమైన పెంకుటిల్లు. రెండు వీధులవేపునుండి ఇంట్లోకి ప్రవేశముండేది.
వారింటికి మా వీధివేపుండే గుమ్మం మాకు దగ్గర.  నిమ్మ, నారింజ, పంపర పనస, జామి వంటి చాలా చెట్లు,   మల్లి, బంతి చామంతి వంటి రకరకాల పువ్వుల మొక్కలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ ఇల్లుండేది. ఆ సత్తేలుగారు చెలికాని అచ్యుతరావుగారి రైస్ మిల్లులో పనిచేసేవారు. అచ్యుతరావుగారు బొబ్బిలి రాజా వారికి బావమరది అని విన్నాను. వారంతా వెలమ  దొరలు. అలాటి దొరల కొలువులో పనిచేయడం వలన మిగిలిన వారికంటే కొంచెం ఉన్నతమే. వాళ్ళింటికి అన్నీ దొరగారి దివాణం నుంచే వస్తాయని ఆ చిన్నకామేశ్వరిగారు గొప్పగా చెపుతూండేది. మా తాతగారి కుటుంబానికి కూడా దగ్గరే. మా అమ్మమ్మగారిని వదినా అని పిలిచేది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఒక పెద్ద చెంబుతో పాలో, లేక మజ్జిగో నిమ్మాకులు, దబ్బాకులు వేసి ఇచ్చి ఇంటికి తీసుకువెళ్ళమనేది. మనిషి మంచిదే. కానీ నోటి ధాటీ వుండేది. వాళ్ళ ఇంటి పక్కనున్న మధ్య కామేశ్వరి గారికి భర్త లేడు. ముగ్గురు పిల్లలు రమణ, వరహాలు, భాస్కరం. బాచీ అని పిలిచేవారు. అతను నాకు బొబ్బిలిలో మొదటి స్నేహితుడు. పెద్దతను అప్పటికే  ఉద్యోగరీత్యా (రైల్వేలోనే అని గుర్తు) వేరెక్కడో ఉండేవాడు. రెండో అతను వరహాలు. హైస్కూలు లో పేరు మోసిన ఫుట్ బాల్ ప్లేయర్. గోల్ కీపర్ గా మంచి పేరుండేది. స్పోర్ట్స్ కోటాలోనే అతనికీ రైల్వేలో ఉద్యోగం దొరికింది. అతనికి బ్రహ్మాండమైన చెముడు. వాళ్ళిల్లు కూడా మా ఇల్లులాగే పూరిల్లు. ఆ పక్కన పెద కామేశ్వరిగారిల్లు. మేడ ఇల్లు. ఎస్ ఎమ్ రావ్ గారూ రైల్వేలోనో పనిచేసేవారు. ఆరోజుల్లో ఉత్తరాంధ్రాలోని చాలామంది SSLC పూర్తికాగానే చిన్నో, చితకో రైల్వే ఉద్యోగం కోసం తెగ తాపత్రయ పడి ఆ ఉద్యోగంలోనే జీవితాంతం గడిపేవారు. ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్ లో స్థిరపడిన సగంమంది తెలుగువారంతా రైల్వే ఉద్యోగులే. ఉత్తరాంధ్రాకు చెందినవారే. వారంతా తమ తమ ఊళ్ళలో తెలుగు సంస్కృతిని కాపాడుకోవడంలో ఇతోధికంగా కృషిచేశారు. 

ఆ రోజుల్లో  బొబ్బిలి కోటకు ఎదురుగా, రాజవీధిలో ఒక టౌన్ హాలుండేది. అందులో తరచూ బొబ్బిలి రాణీగారి ఆధ్వర్యంలో పురాణ కాలక్షేపాలు, భజన కార్యక్రమాలు నిర్వహించేవారు. వాటిలో మా వాళ్ళంతా కూడా వెళ్ళి పాల్గొనేవారు. మా దొడ్డమ్మగారు, చెళ్ళపిళ్ళ వరహాలమ్మ గారు బాగా పాడేవారు హార్మోనియం కూడా వాయించేవారు. బొబ్బిలిలో ఉండే అనేక సత్సంగ కార్యక్రమాలన్నింటికీ విధిగా హాజరయి భజనగీతాలు ఆలపించేవారు. రాణీగారి టౌన్ హాల్ లో జరిగే భజనలకు స్త్రీలకు మాత్రమే ప్రవేశం. రాణివాసపు ఘోషా అమలులో ఉండేది. మగవారికి వేరేగా ఏర్పాటు చేసేవారు. మా కుటుంబానికి ఈ రకమైనటువంటి పరిచయాలు బొబ్బిలి సంస్థానంతో ఉండేవి.



శ్రీ వి ఏ కే రంగారావు

మనందరికీ బాగా తెలిసిన ప్రముఖ సంగీత, నృత్య విమర్శకుడు శ్రీ విఏకె రంగారావు (వేంకట ఆనంద కృష్ణ)గారిది ఆ వూరే. బొబ్బిలి రాజా శ్వేతాచలపతి రామకృష్ణ రంగారావు గారి తమ్ముడు, కిర్లంపూడి జమిందారు శ్రీ జనార్ధన రంగారావుగారి కుమారుడు. వారి బంగళా ఊరికి కొంచెం దూరంగా విశాలమైన తోటలో వుండేది. విఎకే రంగారావుగారికి నృత్యంలో మంచి ప్రవేశముండేది. ఆయనకు పదహారేళ్ళ వయసులో కాలికి గజ్జె కట్టి వారి రామ్ మహల్ లో నృత్యం చేయడం బాగా గుర్తు. బహుశా గోకులాష్టమి ఉత్సవాల సమయం కావచ్చు. ఈవయసులో కూడా ప్రతీ సంవత్సరం కార్వేటినగర్ వేణుగోపాలుని సన్నిధిలో గజ్జె కట్టి నాట్యం చేస్తారట. అయితె, ఆయనతో నా పరిచయమంతా ఘంటసాలవారింట్లో ఉన్నప్పుడే. బొబ్బిలిలో కృష్ణాష్టమి సమయంలో డోలాయాత్ర చాలా ఘనంగా జరిపేవారు. మా అగ్రహారం వీధి చివరన ఉన్న పూల్ బాగ్ లో ఉన్న మండపంలో  పెద్ద ఊయలను అలంకరించి అందులో కృష్డ విగ్రహాలు పెట్టి పూజా పునస్కారాలు జరిపేవారు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకూ మా వీధంతా రకరకాల షాపులతో, చుట్టుపక్కల గ్రామాలనుండి ఎడ్లబళ్ళమీద   వచ్చే జనాలతో మహా కోలాహలంగా వుండేది. అలాటి సమయాలలో మా తాతగారి బంధువులు కొందరు పక్కనున్న పాల్తేరు నుండో లేక రాయపూర్ నుండో వచ్చి ఈ డోలాయాత్ర, ఊళ్ళో ఉన్న తెలుగు సినిమాలు మూడాటలు చూసి ఆ మర్నాడు తిరిగి వెళ్ళిపోతూండేవారు. మా వీధి చివరన ఉన్న పూలబాగ్ లో చాలా మంచి టెన్నిస్ కోర్ట్ వుండేది. అక్కడ టెన్నిస్ ఆడడానికి బొబ్బిలి రాణిగారు తమ నల్ల ఫోర్డ్ కారులో ప్రతీరోజూ సాయంత్రం నాలుగైదు గంటల ప్రాంతంలో దుమ్ము రేపుతూ వెళ్ళేవారు. ఆ కారంతా తెల్లటి సిల్క్ తెరలు కప్పేసి ఉండేవి. యువరాణి లావణ్యకుమారి మంచి టెన్నిస్ ప్లేయర్. ఆవిడ మద్రాస్ లో  స్టేట్ లెవెల్  పోటీల్లో  చాలా వాటిలో పాల్గొన్నారు.

బొబ్బిలిలోని రాజావారి కోట, వేణుగోపాలస్వామి ఆలయం, సంస్థానం హైస్కూల్, సుగర్ ఫాక్టరీ, ఊరు చివరి తాజ్ మహల్ లాటి గెస్ట్ హౌస్, ఇవే  ఆ వూరి ప్రతిష్టా చిహ్నాలు. దివాణంలోని గంటలు, సుగర్ ఫ్యాక్టరీ సైరన్ లు బొబ్బిలి ప్రజలకు సమయపాలనం గురించి గుర్తు చేసేవి.

సినీమాలకు సంబంధించినంత వరకూ బొబ్బిలి B సెంటర్. అందువలన ఫస్ట్ రిలీజ్ సినీమాలు బహు అరుదు. పక్కనున్న పార్వతీపురం బిజినెస్ సెంటర్ అందువలన అది A గ్రేడ్ . ప్రతి కొత్త సినీమా ఆ ఊళ్ళో ఆడుతుంది. ఆ A సెంటర్స్ లో ఆడి వెళ్ళిన తరువాత ఎప్పుడో బొబ్బిలిలో  సినీమాలు రిలీజయేవి. అప్పట్లో సినిమాలన్ని ఏ పదిహేను కాపీలో, ఇరవై కాపీలో మాత్రమే తీసి ఆంధ్రదేశమంతా ఆడేవారు. బొబ్బిలిలాటి ఊళ్ళో బొమ్మ నాలుగు వారాలాడితే అది హిట్ సినీమా క్రిందే లెక్క. మామూలు సినీమాలన్నీ రెండు వారాలాడితే గొప్ప.


అలాటి సందర్భంలో, ఈ పెళ్ళిచేసి చూడు సినీమా వచ్చింది. బొబ్బిలి రాణిగారి అనుయాయులంతా పాసుల మీద  ఈ  సినీమా చూసేందుకు అవకాశం వచ్చిందని, అందరం కలసి సాయంత్రం ఆటకు వెళదాం రమ్మనమని మా వీధిలోని చిన కామేశ్వరిగారు మా అందరిని బయల్దేరదీసింది. సాధారణంగా ఈ సినీమాలకు పాసులు సినీమా ఇంక వెళిపోతుందనగా, పోలీసులకు, సానిటరీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లవారికి ఇచ్చేవారు. ఎందుకంటే ఆయా శాఖలవారి నిరంతర సహకారం సినీమా ధియేటర్లకు అవసరం. అందుకోసం వాళ్ళకి ఫ్రీ. 

మేము వెళ్ళినది సినిమా విడుదలైన వారంలోనే. అందులోనూ ఆడవారికి మాత్రమే. నేను చిన్నపిల్లవాడిని కావడం వలన నాకు ఇబ్బంది లేదు. కానీ, వచ్చిన ఇబ్బంది అంతా శ్రీరామా టాకీస్ లోనే. మేమంతా రాణివాసం వారికి కావలసినవాళ్ళం కావడం వలన మమ్మల్నందరినీ తీసుకువెళ్ళి బాక్స్ లో కూచోపెట్టారు. హాలుకు రెండు ప్రక్కలా రెండు బాక్స్ లు ఒక్కొక్కదాంట్లో పదిహేనుమందో ఇరవైమందో కూర్చోవచ్చును. రాయల్ ఫేమీలి వారికోసం మాత్రమే. ధియేటర్లోని ఇతర ప్రేక్షకులు ఎవరూ కనపడకుండా పూర్తిగా తెరలు కప్పేసి ఉంచుతారు, ఘోషా కోసం.  హాలులో హైక్లాస్ కుర్చీ టికెట్ తప్ప మిగిలిన క్రింది క్లాసులు ఆడవారికి వేరే, మగవారికి వేరే. మధ్యలో  కర్ర డివైడర్స్ ఉండేవి. సినీమా వేసేముందు ధియేటర్లోని లైట్లన్నీ పూర్తిగా ఆర్పివేశాక అప్పుడు బాక్స్ లోని తెరలు తొలగించేవారు. అసలే పొట్టివాడిని. దానికి తోడు అడ్డంగా  బాక్స్ ముందు పిట్టగోడలు (parapet wall). నిక్కి నిక్కి చూడాలి.
 
తెరమీద 'పొగ త్రాగరాదు' 'No Smoking', 'ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు' వంటి హితోపదేశాల స్లైడ్స్ తరువాత ఇండియన్ న్యూస్ రీల్ విమానాలతో ఏదో ఒక పది నిముషాల వార్తా విశేషాలు. తర్వాత, అసలు సినీమా. అప్పటిదాకా హాలు బయట డప్పుల మ్రోత, టిక్కెట్ల అమ్మకం జరిగేది. మెయిన్ సినీమా ప్రారంభించాక టికెట్ కౌంటర్లు మూసివేశేవారు. డప్పుల మ్రోత ఆగేది. సాయంత్రం ఆరుగంటల వేళ ఊళ్ళో ఉన్న మూడు సినీమా హాల్స్ డప్పుల మ్రోత ఊరంతటికి వినపడేది. 

"పెళ్ళి చేసి చూడు" సినీమాకు ముందు ఆ సినీమా ట్రైలర్ వేశారు. అయితే బొమ్మలేకుండా మాటలతోనే ఆ సినీమా వివరాలు, పాటలు వినిపించిన గుర్తు. అందులో పని చేసిన వారిగురించి చెపుతూ, "ఇంట ఇంటనూ గంట గంటకూ ఎవ్వరి కంఠం వింటారో  ఆ ఘంటసాలవారీ చిత్రానికి నాదబ్రహ్మలండీ" అని ఆ సినీమాకు సంగీత దర్శకత్వం వహించి, పాటలు పాడిన ఘంటసాలవారి గురించి ప్రత్యేకంగా చెప్పడం ఒక విశేషం. నాకు మహా ఆనందం. 

అంటే అప్పటికే ఘంటసాలవారి గళం ఆంధ్రదేశాన్ని ప్రభావితం చేసిందని అర్ధమౌతుంది. ఆ సినీమాలో మిగతా అంశాలతో పాటు పిల్లలకోసమే నాలుగు పాటలు డాన్స్ లు పెట్టడం వలన పెళ్ళిచేసి చూడు, ఆ బాల గోపాలాన్ని అమితంగా ఆకర్షించింది. 



సినీమా పూర్తయి బాక్స్ లోని ఆడవాళ్లంతా కారులోనో, తెరలుకట్టిన జట్కాలలోనో వెళ్ళిపోయాక ధియేటర్ తలుపులు తీసేవారు. అప్పుడు మిగతా జనం బయటకు పోయేవారు. నాకు కట్టి పడేసినట్లుగా ఉండే ఈ బాక్స్ సినీమా తృప్తి కలిగించలేదు. మళ్ళీ  మా తాతగారి దగ్గర మారాం చేసి  ఆరణాల బెంచి టిక్కెట్టు కొనుక్కొని చుట్ట, బీడీ, సిగరెట్ పొగల మధ్య మరొకసారి 'పెళ్ళి చేసి చూడు' సినీమాను తృప్తిగా చూశాను. 

ఈ పెళ్ళి చేసి చూడు సినీమా చూశాక మర్నాడు మా శారద పెళ్ళికి కుద్దిగాం తరలివెళ్ళేం.

ఆ వివరాలు వచ్చేవారం....
                 ....సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

10 comments:

వడ్డాది గోపాలకృష్ణ మూర్తి said...

16వ భాగం క్రొత్త పంథా లో ఉంది. ఇటు బంధుజన పరిచయం అటు ఆనాటి ముచ్చట్లు అందునా పెళ్లి చేసి చూడు చిత్రం ఆరంభ సంరంభం మన ఘంటసాలే అందులో పాడాడని నాటి పల్లె ప్రజల ఆనంద వాతావరణం అన్నీ కళ్ళకు కట్టినట్లు-మీ భాషకు జోహారులు. వచ్చే వారం కుద్దిగాం పెళ్లికి వెళ్ళడానికి బట్టలు ఇనుప రేకు పెట్టె సర్దేసుకుంటాము.

Unknown said...

మమ్మల్ని కాసేపు రాజ సంస్థానాలకు తీసుకెళ్లారు.సూక్ష్మమైన విషయాలను పూసగుచ్చినట్లు వివరించడం అబ్బురపరుస్తోంది. 90 ఏళ్ల వయస్సులో కూడా అంత బాగా పాడిన సంగీతరావు గారికి నమోవాక్కములు. మీకు కోటి వందనాలు.

Unknown said...

హృషీకేష్
మమ్మల్ని బొబ్బిలి, విజయనగరం సంస్థానాలకు తీసుకెళ్లారు. పూసగుచినట్లు వున్న మీ వివరాలు అద్భుతం. 90 ఏళ్ల వయస్సులో సంగీతరావు గారి గానం అద్భుతం. మీకు, వారికి నమో నమః!!

P P Swarat said...

అభినందనలు తెలియజేసినవారందరికీ ధన్యవాదాలు.

Pulijalasanthisree said...

నిండైన జీవితం...కనులపండువుగా కధనం...నాకాశ్చర్యమేమంటే..ఇంత జ్ఞాపకశక్తి ఎలా ప్రోది చేసుకున్నారో... నని... అద్భుతం ఆర్యా..ఈ విషయాలన్నీ చదువుతుంటే నాకు వేయిపడగలు నవల ...అందలి కవి వర్ణన కళ్ళముందు కనబడుతున్నాయి...కోట...రాజావారు..రాణీ.. దాస దాసీలు...మళ్ళీ మనసును ఆ ఊహాలలోకి తీసికెళ్లారు...పెళ్లిచేసిచూడు చిత్ర విశేషాలు బాగున్నాయి..నిజంగా ఘంటసాల గారు కారణజన్ములే..అందుకే విజయనగరం చేరారు...ధన్యవాదాలు ఆర్యా...ఈ రచనలన్నీ ఇంతకుముందే రాసి ఉంచుకున్నారా...ఇప్పుడే రాస్తున్నారా

P P Swarat said...

ధన్యవాదాలు. ఏ వారానికి ఆ వారం వ్రాస్తున్నవే.

Patrayani Prasad said...

🙏🙏శ్రీ ప్రణవ స్వరాట్ అన్నయ్యకు, నమస్కారాలు 🙏🙏, ఇప్పుడే ఈ భాగం చదివాను. చాలా బాగుంది . ఈ 16 వ భాగంలో వ్రాసిన విషయాలు 1952-53 ప్రాంతాలలోవి. సుమారుగా నాకు తెలియనివే . అప్పటికి నా వయసు నాలుగు లేక 5 సంవత్సరాలు. జ్ఞాపకం లేవు. అక్కడ అక్కడ కొన్ని విషయాలు జ్ఞాపక మున్నా వరుసగా లేవు. ఇప్పుడు 72 ఏళ్ల వయసులో ఇవి చదవడం వలన ఒక రూపం ఏర్పడింది. 1957 తరువాత విషయాలు కొంతవరకు తెలిసినా, బొబ్బిలి విషయాలు తెలియనివి, ఇంత వివరంగా తెలిపినందుకు ధన్యవాదాలు -పట్రాయని ప్రసాద్, బెంగుళూరు , తేదీ -12-9-2020 . శనివారం ఉదయం 08:00 గంటలు .

P P Swarat said...

ప్రసాద్ , చాలా సంతోషం.

Ameerjan Shaik said...

💎 ఈనాటి పదహారవ ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా కొనసాగించారండీ స్వరాట్ గారు! ఈ ఎపిసోడ్ కంతటికీ హైలైట్..శ్రీ సంగీతరావు గారు పాడిన.. మాన్యులు శ్రీ నారాయణ శాస్త్రి గారి కీర్తననే చెప్పాలి. మీరన్నట్లు శ్రీ శాస్త్రి గారు స్వయంగా రాసి రాగమాలికలో కూర్చి పాడిన కీర్తనలో సాహిత్యమూ అంత చక్కగా ఒదిగింది. ఓ వైపు రాజావారి గుణగణాల్ని కీర్తిస్తూ, చతురంగబలాల సమర్థతను స్తుతిస్తూ, రాజు గారి మోహనరూపాన్ని పొగుడుతూ, ధర్మపత్ని సహితంగా సలక్షణంగా వుండాలంటూ ఆశీర్వచనమిస్తూ...ఆరు రాగాల పేర్లను మేళవించి కీర్తనను రాసి పాడడం శాస్త్రి గారి గొప్పదనమైతే...ఇంత కాలంగా పాడుతూ రావడం...తన 90 వ ఏట కూడ ఇలా రాగయుక్తంగా పాడడం ప్రశంసాపాత్రమే! ఇంత గొప్ప కీర్తనను మాకు అందించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు!!🙏🙏

💎 ఇక సంస్థానాలు, రాణివాసాలు, ఘోషా సాంప్రదాయాలు...ఇవన్నీ...మేమంతా అక్కడే వుండి చూస్తూన్నంత సహజంగా రాశారు. సినిమాలు కొందరికీ ఫ్రీ ఎందుకంటే...ఆయా శాఖలవారి నిరంతర సహకారం సినిమా థియేటర్లకు అవసరం. అందుకోసం వాళ్ళకు ఫ్రీ! ఇది చదివి భలే నవ్వుకున్నాం. ఇక విమర్శకులు శ్రీ వి.ఏ.కె.రంగారావు గారి గురించి కూడ కాస్త మీ బ్లాగులో వివరించారు. థ్యాంక్స్!!!

P P Swarat said...

మీ అభినందనలకు కృతజ్ఞతాభివందనములు.