ప్రణవ స్వరాట్
మెడ్రాస్ లో మళ్ళీ నా స్కూల్ జీవితం ప్రారంభమయింది. 1956 లో టి.నగర్ పానగల్ పార్క్ కు ఎదురుగా వున్న 'శ్రీ రామకృష్ణా మిషన్ హైస్కూల్' లో III ఫారమ్ (8వ తరగతి) లో చేర్చారు. త్యాగరాయనగర్ మెయిన్ బ్రాంచ్ అది. రామకృష్ణ మిషన్ స్కూల్స్ చక్కటి చదువు, క్రమశిక్షణలకు చాలా ప్రసిధ్ధి. ఆ హైస్కూల్ కు టి.నగర్ లో చాలానే బ్రాంచ్ లు ఉండేవి. బజుల్లా రోడ్, గ్రిఫిత్ రోడ్, రామనాధన్ స్ట్రీట్, బర్కిట్ రోడ్ లలో ఎలిమెంటరీ /మిడిల్ క్లాస్ స్కూల్స్ వుండేవి. మెయిన్ స్కూల్ కు సంబంధించిన ఆటస్థలాలు జి.ఎన్.చెట్టి రోడ్ లో, గ్రిఫిత్ రోడ్ ముప్పత్తమ్మా ఆలయం దగ్గర ఉండేవి. రామకృష్ణా మిషన్ బాయ్స్ హాస్టల్ ఈ ప్లేగ్రౌండ్ కు ఆనుకొని వుంటుంది. హాస్టల్ విద్యార్ధులు గ్రౌండ్ లోకి వెళ్ళే మార్గమూ వుంది. ఆ హాస్టల్ ప్రధాన ద్వారం దొరైసామీ రోడ్ వేపు వుంటుంది. రామకృష్ణా మిషన్ శారదా గర్ల్స్ హైస్కూల్ ఉస్మాన్ రోడ్ లో పానగల్ పార్క్ దగ్గర వుంది. ఆ స్కూల్ లో రోడ్ వేపు ప్రహారీలో చాలా పెద్ద నాగమల్లి చెట్టుండేది. ఆ చెట్టు, నాగమల్లి పుష్ప సౌరభం ఆ స్కూలుకు ఒక ప్రత్యేక ఆకర్షణ. నేను, మా తమ్ముడు గోపి, చెల్లెళ్ళు రమణమ్మ, పద్మ, లలిత, సుమబాల అంతా రామకృష్ణా మిషన్ విద్యార్ధులమే.
ఘంటసాల మాస్టారి ముగ్గురు ఆడపిల్లలు శ్యామల, సుగుణ, శాంతి(రాధ) కూడా రామకృష్ణ మిషన్ శారదా గర్ల్స్ హైస్కూల్ లోనే చదువుకున్నారు. ఎలిమెంటరీ క్లాసులు జిఎన్ చెట్టి రోడ్ లోని కమలాబాయి స్ట్రీట్ లో వున్న 'బాల గురుకుల్' లో చదువుకున్నారు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఒక యూరోపియన్. పేరు డంకన్. అప్పుడప్పుడు మాస్టారి పిల్లలను దింపడానికి, తీసుకురావడానికి వెళ్ళేప్పుడు చూసేవాడిని. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. గేట్ ముందు నిల్చొని వచ్చే పోయే పిల్లలకు షేక్ హాండ్స్ ఇస్తూ ప్రేమగా పలకరించేవారు.
మైలాపూర్ లోని వివేకానంద కాలేజి కూడా రామకృష్ణ మిషన్ వారిదే. రామకృష్ణ మిషన్ ప్రధాన ఆశ్రమం, మైలాపూర్ కపాలేశ్వరాలయం పుష్కరిణి పక్కనుంచి మందవళ్ళి వెళ్ళే రోడ్ మీద వుంది. రామకృష్ణ ఆశ్రమ ప్రధాన కార్యనిర్వాహక స్వామీజీలంతా అక్కడే వుంటారు. చాలా విశాలమైన కట్టడం. నిత్యమూ ఏవో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూనేవుంటాయి. నేను రామకృష్ణా మిషన్ హైస్కూల్ లో మూడు సంవత్సరాలు చదివినా ఒక్కసారి కూడా, ఆ తరువాతికాలంలో కూడా ఆ ఆశ్రమంలోకి వెళ్ళే అవకాశం దొరకలేదు, బయటనుండి చూడడమే తప్ప. వయసు ప్రభావం కావచ్చును. మద్రాస్ సైట్ సీయింగ్ కు వచ్చే బంధువులను, మిత్రులను నేనే దగ్గరుండి మద్రాసులోని అన్ని ఆలయాలకు, విహార ప్రదేశాలకు తీసుకువెళ్ళేవాడిని. కానీ, ఎవరూ కూడా రామకృష్ణ పరమహంసకు, స్వామీ వివేకానందకు చెందిన ఈ ఆశ్రమాన్ని దర్శించాలని ఎప్పుడూ అనుకోలేదు. బహుశా, సాధవులు, సన్యాసాశ్రమం లోని వారే అక్కడకు వెళ్ళాలనే భావనేమో? తెలియదు. పాండిచ్చేరి అరబిందో ఆశ్రమానికైతే చాలా సార్లే వెళ్ళాను. అలాగే ఆరోవిల్ మెడిటేషన్ సెంటర్ నిర్మాణంలో వున్నప్పుడు చూడడం జరిగింది. (మా జ్యోతి, శశి శేఖర శాస్త్రి గార్ల సౌజన్యంతో).
టి.నగర్ లో రామకృష్ణా మిషన్ స్కూల్సే కాకుండా తెలుగు విద్యార్ధుల సౌకర్యార్ధం, పాండీబజార్ చివర్లో మౌంట్ రోడ్ జంక్షన్ కు ముందు బోగ్ రోడ్ దాటాక ఎడమచేతివేపు గిరియప్పా రోడ్ మీద ఉన్న స్కూలు 'కేసరి హైస్కూల్'. ఈ హైస్కూల్ కు మెయిన్ స్కూల్ మైలాపూర్ లో వుంది. నాకు ఆ స్కూల్ చూసిన గుర్తులేదు. మా ఆవిడ ఆ స్కూల్ విద్యార్ధినే.
కేసరీ హైస్కూల్స్ వ్యవస్థాపకుడు డా. కె.ఎన్. కేసరి. సుప్రసిధ్ధ ఆయుర్వేద వైద్యాలయం కేసరీ కుటీరమ్ అధినేత. ఈ సంస్థ తయారు చేసే 'లోధ్ర' దేశవ్యాప్తంగా చాలా ప్రసిధ్ధి పొందిన ఔషధం. మా చిన్నప్పుడు అన్ని వార్తా పత్రికలలో మహిళలకు ఉద్దేశించిన ఈ లోధ్ర ప్రకటనలు విరివిగా కనపడేవి.
డా. కేసరిగారు మన తెలుగు వెలుగులలో ఒకరు. ఒంగోల్ జిల్లాకు చెందిన వ్యక్తి. గొప్ప వైద్యుడు, విద్యావేత్త, దాత, గృహలక్ష్మి పత్రిక స్థాపకుడు. ఈతరంవారికి ఇంకా బాగా అర్ధంకావాలంటే, సుప్రసిధ్ధ బహుభాషా గాయకుడు ఉన్నికృష్ణన్ ముత్తాతగారాయన .
అలాగే, విల్లివాక్కంలోని ఎస్ కే పి డి - శ్రీ కనకదుర్గ హైస్కూల్ తెలుగు పిల్లలకోసం స్థాపించబడింది. ఇలాటి తెలుగు స్కూల్స్ పరశువాకం, ముత్యాలపేట (జార్జ్ టౌన్) మొదలైన ప్రాంతాల్లో వుండేవి. నా దురదృష్టంకొద్దీ ఈ తెలుగు స్కూల్స్ అన్నీ మేముండే నెం. 35, ఉస్మాన్ రోడ్ కు చాలా దూరం. సిటి బస్సులో ఒక్కొణ్ణే పంపడానికి సిద్ధంగా లేరు మావాళ్ళు. పాండీ బజార్ చివరున్న కేసరి హైస్కూల్ కూడా నడకకు చాలా దూరం. బస్సు లో వెళ్ళాలంటే అప్పట్లో వడపళని నుండి శాంథోమ్ వెళ్ళే 12B రూట్ బస్ ఒక్కటే ఉండేది . అందుకు బజుల్లా రోడ్ బస్ స్టాపింగ్ వరకూ వెళ్ళాలి. బస్సులకోసం పడిగాపులు పడాలి. అందుచేత, కేసరీ స్కూల్ లో చేరే విషయం రూల్డౌట్. తెలుగు సినిమా రంగానికి చెందిన చాలామందికి పనగల్ పార్క్, పాండీబజార్ కేర్ ఆఫ్ అడ్రస్. అలాగే తెలుగు సినిమా రంగానికి చెందిన చాలామంది సాంకేతిక నిపుణుల పిల్లలందరూ ఈ ప్రాంతంలో తెలుగు మీడియం ఉన్న ఈ కేసరీ హైస్కూల్ లో నే చదువుకునేవారు. అనంతరం కాలంలో తమ తమ రంగాల్లో ప్రసిద్ధులయ్యేరు. అంతేకాక ఈ స్కూలు ప్రత్యేకత ఏమిటంటే ఆ స్కూలు టీచర్లు, ఆఫీసుస్టాఫ్ చాలామంది తెలుగు సినిమా రంగంతో సంబంధం ఉన్నవారే. మన తెలుగు సినీమాలలో అడపాతడపా కనపడేవారు. ఆ కేసరీ హైస్కూల్ లో డ్రిల్ మాస్టర్ గా పనిచేసిన భక్తవత్సలం నాయుడు నటుడిగా, నిర్మాతగా, విద్యాలయాల స్థాపకుడిగా తెలుగు సినీమా ప్రేక్షకులందరికీ చిరపరిచితుడు. ఆ ప్రముఖుడెవరో నాకన్నా మీకే బాగా తెలుసు.
తెలివైన విద్యార్థులు ఎక్కడ చదివినా రాణిస్తారు. పురోభివృద్ధి చెందుతారు. నా వరకూ, అన్నిటికంటే ముఖ్యమైనది రామకృష్ణా స్కూల్ మా ఇంటికి చాలా దగ్గర. నడిచి వెళ్ళి రావచ్చును. రామకృష్ణ మిషన్ హైస్కూల్ లో ఆరవ తరగతి నుండి SSLC వరకు వుంది. అందులో 'A' సెక్షన్ పూర్తిగా తెలుగు మీడియం విద్యార్ధులకు కేటాయించబడింది. 'B' నుండి ఐదారు సెక్షన్లు తమిళ విద్యార్ధుల కోసం. ఒక్కో సెక్షన్ లో ముఫ్ఫైమంది విద్యార్ధులు. దాదాపు వెయ్యిమంది విద్యార్థులతో రామకృష్ణా మిషన్ బోయ్స్ మెయిన్ హైస్కూల్ రెండు అంతస్థుల విశాల భవనంలో కళకళలాడుతూ వుండేది. ఆ స్కూలే కాదు, స్కూల్ కు ఎదురుగా వున్న పానగల్ పార్క్ కూడా. స్కూల్ ప్రారంభం కావడానికి గంట ముందు, స్కూలు వదిలాక సాయంత్రం ఐదున్నర వరకూ సగంమంది పిల్లలు ఆ పార్క్ లోనే ఆటలాడేవారు. హాస్టల్ విద్యార్ధులు మాత్రం ఇలాటి ఆటపాటలకు దూరం. బోయ్స్ హాస్టల్ దొరైసామీ రోడ్ లో వుండేది. ఆ హాస్టల్ వుండి చదువుకునే విద్యార్ధులకు కట్టు, బొట్టు, కట్టుబాట్లు చాలానేవుండేవి. అప్పట్లో చాలామంది తమిళ విద్యార్ధులు తెల్ల వేష్టీ (లుంగీ), తెల్ల చొక్కాలు ధరించేవారు. నుదుట విబూదిరేఖలతో గురుకులం విద్యార్ధుల్లా సంప్రదాయబధ్ధంగా వుండేవారు. తెలుగు సెక్షన్ పిల్లలు నిక్కర్లు, ప్యాంట్ షర్ట్ లతో వచ్చేవారు. చాలామంది తమిళ అయ్యర్, అయ్యంగార్ల పిల్లలు తల ముందుభాగం గుండుతో, వెనుక శిఖలతో వచ్చేవారు. అది ఆనాటి ఆచారవ్యవహారాలకు ఇచ్చే గౌరవమర్యాదలు. ఈ వాతావరణం అంతా నాకు చాలా కొత్త , ఎంతో వింత.
ఆ స్కూల్ లో చేరాక నా చదువు కష్టాలు ఇంకా ఎక్కవైయాయి. మా తెలుగు మాస్టారి పేరు వేదం వెంకటరాయ శాస్త్రిగారు. ఈయన, ప్రముఖ వేద పండితులు, కవి అయిన వేదం వెంకటరాయ శాస్త్రిగారి కుటుంబం వాడని చెప్పుకునేవారు. ఆయన తప్ప ఇంకెవరు తెలుగు మాట్లాడినా నా చెవులకు అరవంలాగే వినపడేది. తెలుగు విద్యార్థులు కూడా వాళ్ళలో వాళ్ళు తమిళంలోనే మాట్లాడుకునేవారు. మొదట్లో నాకేమీ అర్ధమయేదికాదు. అందుచేత స్కూల్ లేని సమయాలలోఎప్పుడూ ఘంటసాలవారింట్లో పెద్దబాబు తో కాలక్షేపం చేయడం, గ్రామఫోన్ లో వేసే పాటలు వినడం పట్ల మహా ఆసక్తిగా వుండేది. అయ్యగారు ఇంట్లో వున్నంతసేపు ఇల్లంతా మహా నిశబ్దంగా వుండేది. ఆయన బయటకు వెళ్ళిన తరువాతే గ్రామఫోన్ లో పాటలు, రేడియో వినడం. తిరిగి ఆయన కారు గేట్లోకి రాగానే గోవింద్ హారన్ మ్రోగించేవాడు. దానితో ఎక్కడివారక్కడే ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయేవారు. రికార్డింగ్ లలో, రిహార్సల్స్ లో పాడి పాడి వచ్చాక తిరిగి తన పాటలు తాను వినడానికి అయ్యగారు పెద్దగా ఇష్టపడేవారు కాదు. రాత్రి తొమ్మిది తర్వాత శనివారం నాడు ఆలిండియా రేడియో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమయే నేషనల్ ప్రోగ్రామ్స్ కచేరీలు కొంతసేపు వినేవారు. ఆ సమయంలో ప్రాంతీయ కేంద్రాలకు కూడా అవే కచేరీలు ప్రసారం చేసేవారు.
అప్పట్లో ఆకాశవాణివారు 'వాణి' పత్రిక ప్రచురించేవారు. అందులో ఆ నెలలో వివిధ కేంద్రాలు ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలుండేవి. అందులో ప్రముఖ సంగీత విద్వాంసుల ఫోటోలు, వారి వివరాలు కూడా ఇచ్చేవారు.
ఘంటసాలవారు తాను ఎంత గొప్పగాయకుడైనా, ప్రతిభ కలిగిన సంగీత దర్శకుడైనా ఎక్కడ ఏమంచి పాట వినపడినా అది కర్నాటిక్ అయినా, హిందుస్థానీ అయినా సినీమా పాట అయినా విని ఆనందించేవారు. ఆయా గాయకుల ప్రతిభను గుర్తించి అభినందించేవారు. తాను తప్ప వేరే గొప్ప గాయకులు లేనే లేరనే భావన, ఆ విధమైన అహంకారం ఏనాడూ వారిలో వుండేదికాదు.
అదేవిధంగా, శృతిలయలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, భావ రహితంగా, లోపభూయిష్టంగా పాడే పాటగాండ్రను ఏమాత్రం ఉపేక్షించేవారు కాదు.
ఒకరోజు ఉదయం, ఆనాటి సాయంత్రం ఆరుగంటలకు ఏదో స్టూడియో లో 'చిరంజీవులు' సినీమా ప్రివ్యూ వేస్తున్నారని ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తి వచ్చి చెప్పి వెళ్ళారు. ఆ సినీమాకు ఘంటసాలవారిదే సంగీతం. మా నాన్నగారు అందులోని పాటలకు హార్మోనియం వాయించారు. అందుచేత, అందరూ ఆ ప్రివ్యూకు వెళ్ళవచ్చును. సాయంత్రం వేసే ప్రివ్యూను తల్చుకొని నాకు ఉదయంనుండి మహా ఆనందం. అయితే, మా నాన్నగారు అందరిని తీసుకువెళతారా? ఎవరితో ఎలా వెళ్ళాలి అనే ఆలోచనలతోనే గడిచిపోయింది. మొత్తానికి మా ఇంట్లోవారంతా కూడా స్టూడియో లో వేసే 'చిరంజీవులు' సినీమాకు వెళ్ళడం జరిగింది. కోడంబాక్కం రైల్వే లెవెల్ క్రాస్ దాటి వడపళని వేపు వెళ్ళడమనేది బ్రహ్మయత్నం. ఏనాడు వెళ్ళగానే రైలుగేట్ తెరిచి వుండదు. కనీసం, పావుగంటసేపైనా వచ్చేపోయే లోకల్ ట్రైన్స్, సౌత్ కు వెళ్ళే రైళ్ళు చూడడంతోనే కాలం గడిచిపోయేది.
స్టూడియోలలో వేసే ఏ ప్రివ్యూ సినీమాలు కూడా పూర్తిగా టైటిల్స్ నుండి చూడడం బహు అరుదు. మేము వెళ్ళేప్పటికి ఎప్పుడూ ఒకటి రెండు రీళ్ళు తర్వాత నుండే చూసేవాళ్ళం. సినిమా చూసిన తృప్తి వుండేదికాదు. ఒక సినీమాకైతే మేము వెళ్ళి కూర్చున్న ఐదు నిముషాలకే ఇంటర్వెల్ కార్డ్ వేసేసారు.
టైటిల్స్ తో సహా పూర్తి సినీమాలు చూడలేకపోయిన కొరత అమ్మగారి (సావిత్రమ్మగారు)లోను వుండేది. సినీమా ప్రొజెక్షన్ రోజున "సాయంత్రం అందరూ రెడీగా వుండండి,నేను వచ్చి తీసుకువెళతాను, లేదా కారు పంపిస్తాను మీరు వెళ్ళండి" అనేవారు. రెండోదే ఎక్కువగా జరిగేది. మాస్టారు చాలా అరుదుగా, బయటవారి సినీమా ల ప్రివ్యూకు హాజరయ్యేవారు. అందుకు కారణం ఆ రోజుల్లో అంత బిజీగా వుండేవారు.
పోనీ మనసుకు నచ్చిన తెలుగు సినీమాలు బయట ధియేటర్స్ లో చూద్దామంటే మద్రాస్ లో తెలుగు సినీమాలే రావు. సినీమాలు తీసేది మెడ్రాస్ లో నైనా ఆ వూళ్ళో తెలుగు సినీమాలు ఆడవు. జార్జ్ టౌన్ తాతముత్తియప్పన్ వీధిలోని సెలెక్ట్ ధియేటర్లో మాత్రం తెలుగు సినీమాలు ఆడుతాయి. శుక్రవారం నుండి గురువారం వరకు ఒక్కవారం మాత్రమే. కానీ మేముండే టి.నగర్ నుండి ఆ సినీమా ధియేటర్ కు వెళ్ళిరావడమంటే ఒక ఊరినుండి మరోవూరు వెళ్ళడమే. ఆ సెలక్ట్ ధియేటర్ కూడా అంత పెద్దదికాదు. పాతకాలం హాలు. తెలుగు సినీమా మీది వ్యామోహంతో స్థానిక తెలుగులు ఆ ధియేటర్ కు వెళతారు.
అలాటి సెలెక్ట్ టాకీస్ కు అమ్మగారు, అయ్యగారు, నేను మాత్రమే ఒక సినీమా చూడ్డానికి వెళ్ళాము. ఆ విశేషాలు మరోభాగంలో ముచ్చటిస్తాను.
మద్రాసులో కొన్ని తెలుగు సాంస్కృతిక సంస్థలు 1970 తరువాత ఆవిర్భవించాయి. అప్పటినుండి ఆ సంస్థలు తమ సభ్యుల వినోదం కోసం పాతవో, కొత్తవో నెలకు ఒకటి రెండు తెలుగు సినిమాలు ఆదివారం ఉదయం 10 గంటలకు ఏదో ధియేటర్ లో వేసేవారు. ఆ సినిమా లు చూడడం కోసం తెలుగు ప్రజలు చందాలు కట్టి సభ్యులయేవారు.
చిరంజీవులు చిత్రం లోని సంగీతం, సాహిత్యం విలువలు పెద్దయ్యాక తెలుసుకున్నవే. ఆ సినీమా ప్రివ్యూ చూసినప్పుడు అవేవీ తెలియదు. పైగా 'చిరంజీవులు' సినీమా లో వినోదం పాలు తక్కువ. చిత్రం విషాదాంతం. ఆ సినీమా లోని అన్ని పాటలు వీనులవిందే . నాకు బాగా ఇష్టమైనది మనసునీదే మమత నాదే' ఎడ్లబండిపాట. అందులోని రిథిమ్ , మాస్టారి వాయిస్ ఎఫెక్ట్స్ ఎన్నటికి మరపురావు.
అలాగే, 'కనుపాప కరువైన కనులెందుకు' పాట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో వినవచ్చే తబలా, డ్రమ్స్, వీణ, వైలిన్ బిట్స్ ఇప్పటికీ చెవుల్లో మారు మోగుతూనే వుంటాయి.
'తెల్లవార వచ్చె తెలియక నా సామీ' లీల పాడిన సుప్రభాత గీతం. ఎంతో మనోజ్ఞం.
ఈ పాటను సుప్రసిధ్ధ హిందీ గాయని లతా మంగేష్కర్ చేత పాడించాలని అనుకున్నారనే వార్త గురించి నాకు తెలియదు. సినీమా ఆఖరులో రెండు బొమ్మలు నీటిలో తేలుకుంటూ పోవడం ఒకటి బాగా గుర్తుండి పోయింది. ఈ సినిమాలో గుడ్డివాడిగా నటించిన ఎన్ టి రామారావుకు, షూటింగ్ సమయంలో నిరంతరం వాడిన కృత్రిమ కనుగుడ్ల వల్ల నిజంగానే కొంతకాలం కంటిసమస్య ఏర్పడిందని, అయినా రామారావు లెఖ్ఖచేసేవారు కాదని చెప్పుకునేవారు.
దేవదాసు, కన్యాశుల్కం సినీమా లు తీసిన వినోదా పిక్చర్స్ డి.ఎల్ నారాయణ గారిదే ఈ చిరంజీవులు సినీమా కూడా. ఈ సినీమా లోని ఘంటసాలవారి సంగీతం గురించి,పాడిన పాటల గురించి పత్రికలలో చాలా గొప్పగా రాశారు. స్టూడియోలలో చూసిన చాలా సినీమాలు పెద్దయ్యాక టివి ఛానల్స్ లో చూసాను. రెండుగంటలలో సినీమాలు పూర్తిచేయడంకోసం కొంత సినీమా కట్ చేసేస్తారు. కొన్ని మంచిపాటలు కూడా కనపడవు. ఒరిజినల్ సినీమా చూసిన ఆనందం, తృప్తి టివి సినీమా లలో వుండదు.
మా నాన్నగారు, అమ్మగారు కూడా పిల్లలతో ఏ విషయంలో కఠినంగా వ్యవహరించేవారు కాదు. కొట్టి తిట్టడం ద్వారా పిల్లలు బాగా చదువుతారు, క్రమశిక్షణతో వుంటారనే విషయంలో మా పెద్దలకు నమ్మకం లేదు.
ఘంటసాలవారి పెద్దబాబు (విజయకుమార్)ను కూడా స్కూల్లో చేర్చారు. పాండీబజార్ లోని హోలీ ఏంజెల్స్ కాన్వెంట్. అతనికి చిన్నతనం కావడం వలన రోజూ స్కూలుకు వెళ్ళడానికి చాలా మారాం చేసేవాడు. నేను శెలవుదినాలలో పాప పిన్నిగారితో కలసి ఆ నాష్ కారులో వెళ్ళి కాన్వెంట్ లో దింపడం, తిరిగి తీసుకురావడం జరిగేది. చదువు, తెలివితేటల విషయంలో పెద్ద బాబు, నేనూ సేమ్ టు సేమ్.
బాబూ వాళ్ళమ్మగారు పిల్లల పెంపకం విషయంలో మా అమ్మగారికి పూర్తి విరుధ్ధం. కోపం వస్తే చాలా కఠినంగానే వుండేవారు. ఆవిడ గట్టిగా అరిచారంటే పిల్లల లాగూలు తడిసిపోయేవి. వారి పిల్లలందరికీ ఆవిడ పెట్టే తొడపాశాలు అనుభవమే. అలాటి సందర్భాలలో పిల్లలను అనునయించి, సముదాయించడం మా అమ్మగారు, పాప పిన్నిగారి వంతు. అయితే ఈ రకమైన థర్డ్ డిగ్రీ పనిష్మెంట్లు అన్నీ అయ్యగారు ఇంటిలో లేనప్పుడే. ఆయన పిల్లలను ముద్దుగానే చూసుకునేవారు. కానీ, పెద్దబాబుకు కూడా నాలాగే వాళ్ళ నాన్నగారి దగ్గర చనువు తక్కువే. సాధ్యమైనంతవరకూ మాస్టారి ఎదుటపడేవాడు కాదు.
విజయకుమార్ కు చదువు చెప్పడానికి ఇంటికి ఒక ముసలి అయ్యవారు వచ్చేవారు. స్కూల్ లో చదువు చెప్పే మాస్టర్లను అయ్యవారని పిలవడం పరిపాటి. ఆ ముసలి అయ్యవారి దగ్గర పెద్దబాబు చదువు చాలా వినోదాత్మకంగా వుండేది.
ఆ విశేషాలన్నీ వచ్చేవారం.....
...సశేషం
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.