visitors

Saturday, November 21, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏడవ భాగం

20.11.20 - శుక్రవారం భాగం - 7*:
అధ్యాయం 2 భాగం 6 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

35, ఉస్మాన్ రోడ్ లో దీపావళి పండగ చాలా సంతోషంగా దేదీప్యమానంగా జరిగేది. దీపావళీ అమావాస్య మర్నాడు ఉత్తర భారతదేశంలో లక్ష్మీపూజ చాలా ఘనంగా జరుపుతారు. అదేరోజున కార్తీకమాసం ప్రారంభం. కార్తీకమాసమంతా పూజలు, వ్రతాలు, దానధర్మాలు, సంతర్పణలు జరిపే మాసం. ఉత్తరాది వ్యాపారస్తులంతా దీపావళీ మర్నాడు లక్ష్మీకుబేర పూజలు చేసి కొత్త పద్దులకు శ్రీకారం చుట్టుతారు. వ్యాపారానికి కొత్త సంవత్సరం ఆనాటినుండే ప్రారంభం. గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్1-మార్చ్31. కానీ చాలా మంది వ్యాపారస్తులు నవంబరు1-అక్టోబర్31 పరిగణిస్తారు. గతంలో నేను పనిచేసిన  కంపెనీలో కూడా నవంబర్-అక్టోబర్ ఎక్కౌంటింగ్ ఇయర్ గా పనిచేసేవారు. వర్కర్లకు, ఉద్యోగస్తులకు అక్టోబర్ లోనే దసరా, దీపావళీ సందర్భంగా బోనస్ లు బట్వాడా చేసేవారు.

రాజశ్రీ/శ్రీ/రాజలక్ష్మీ ప్రొడక్షన్స్ అన్న మూడు సినిమా నిర్మాణ సంస్థల అధినేత సుందర్లాల్ నహతా ప్రముఖ మార్వాడీ వ్యాపారవేత్త. ఆయనకు చిత్రనిర్మాణం, సినీమాల డిస్ట్రిబ్యూషన్లతో పాటూ సినీమాలకు ఫైనాన్స్ చేయడం వంటివి ఉండేవి. సుందర్లాల్ నహతాగారికి ఘంటసాలవారంటే చాలా గౌరవం, మంచి స్నేహం వుండేవి. దీపావళీ మరుసటిరోజు సాయంత్రం సుందర్లాల్ గారు తమ స్వగృహంలో జరిగే లక్ష్మీపూజకు ఘంటసాలవారిని ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవించి సత్కరించడం ఒక ఆనవాయితి. ఘంటసాల మాస్టారు సర్వసాధారణంగా అరవవాళ్ళ పద్ధతిలో తెల్ల వేష్టీ - లుంగీ ధరించేవారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం  పంచె కట్టుకునేవారు. సుందర్లాల్ గారింటి లక్ష్మీపూజలకు సంప్రదాయబధ్ధంగా తెల్లటి పంచె, తెల్లటి అరచేతుల చొక్కా ధరించి వెళ్ళడం బాగా గుర్తు.

సుందర్లాల్ నహతా నిర్మించిన మొట్టమొదటి తెలుగు చిత్రం 'జయం మనదే' మొదలు 'సతీ అనసూయ', మంచి మనసుకు మంచిరోజులు', 'శభాష్ రాముడు', 'రక్తసంబంధం', 'శాంతినివాసం', 'అభిమానం', 'శభాష్ రాజా', 'బందిపోటు', 'వీర కేసరి' (కన్నడం) చిత్రాల వరకూ వరసగా ఘంటసాలవారే సంగీత దర్శకత్వం నిర్వహించారు. ఈ చిత్రాలన్నిటికీ మా నాన్నగారు కూడా సహాయ సంగీత దర్శకులలో ఒకరుగా పనిచేశారు. కానీ, సినీమా టైటిల్స్ లో పేరు వేయడమనేది 'అభిమానం' చిత్రంతోనే ప్రారంభమయింది. 1955 నుండీ ఘంటసాలవారి వద్ద సంగీత సహాయకుడిగానే పనిచేస్తున్నా కొన్ని సినీమాలలో పేర్లు వేయడానికి, మరికొన్ని సినీమాలలో పేరు కనపడకపోవడానికి కారణమేమిటో నాకు అర్ధం కాదు. 'అభిమానం' సినీమాకు పూర్వం సినీమా టైటిల్స్ లో 'సంగీతరావు' అనే పేరు చూసిన గుర్తు లేదు.


శాంతినివాసం చిత్రంలో మా నాన్నగారు తొలిసారిగా వీణ వాయించిన గుర్తు. అలాగే అదే సంవత్సరం విడుదలైన 'భక్త రఘునాధ్' చిత్రం లో కూడా వీణవాయించేరు. అప్పటినుండి అవసరాల మేరకు హార్మోనియంతో పాటూ వీణను కూడా సినీమాలలో వాయించేవారు.

అసలు సినిమాలలో టైటిల్స్ కు అథారిటీ ఎవరో? అసిస్టెంట్ డైరక్టరా? ప్రొడక్షన్ మేనేజరా? నిర్మాత? సంగీత దర్శకుడా? ఎవరు ఎవరిని సంప్రదించి  నటీ నటులు, ఈ సాంకేతిక నిపుణుల పేర్లు టైటిల్స్ వేస్తారు? ఎందుకంటే 'పాండురంగ మహత్యం' సినీమాలో నేపధ్యగాయకునిగా ఘంటసాలవారి పేరు లేదు. ( సింగర్స్ కార్డే మిస్సింగ్).

సినీమా టైటిల్స్ లోని పేర్ల విషయంగా మా నాన్నగారిని అడిగితే, సమాధానం 'తెలియదు'. అంటే ఆ విషయం పట్ల ఆసక్తి లేదని అర్ధం. బందిపోటు/వీరకేసరి చిత్రాల తరువాత ఘంటసాల మాస్టారు సుందర్లాల్ నహతాగారి సొంత చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేయలేదు. కానీ, తాము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న కొన్ని సంస్థలకు ఘంటసాలవారే సంగీత దర్శకుడిగా నియమించబడేందుకు ప్రోత్సహించేవారని వినికిడి. 

ఇంక, దీపావళీ ముచ్చట్ల నుండి అసలు కథలోకి వద్దాము. 

ఘంటసాలవారింట్లో చాలామంది వ్యక్తులుండేవారు. ఎవరు ఎవరో తెలిసేది కాదు. తరుచూ, 'తాతా', 'పాపా' అనే పేర్లు వినబడేవి. కానీ, ఆ వయసువాళ్ళెవరూ కనపడేవారు కాదు. ఒకరోజు ఆ గుట్టు తెలిసిపోయింది. పక్కపాపిడి, వంకీల ఒత్తైన నల్లటి జుత్తు సాఫీగా దువ్వుకున్న ఒక పాతికేళ్ళ యువకుడినే ఈ పెద్దవాళ్ళందరూ తాతా అని పిలుస్తున్నారు. ఆయనే పిల్లలందరూ బాబాయి అని పిలిచే ఘంటసాలగారి తమ్ముడు సదాశివుడుగారు. నాన్నగారు కూడా ఆయన్ని తాతగారనే అనేవారు. ఇక పాప అంటే చిన్నపాపేంకాదు. ఆయన భార్య, పిల్లలందరికీ పిన్ని, ఘంటసాలవారి మేనకోడలు, వాళ్ళ అక్కగారు జయప్రద, బావగారు ర్యాలి పిచ్చిరామయ్యగారి పెద్దకుమార్తె, సుబ్బలక్ష్మి.  తాత, పాప జోడీ అప్పట్లో వింతగా అనిపించేది. వీరు కాక రామచంద్రరావు. మెడ్రాస్ హార్బర్ లో పనిచేసేవారు. మొదట్లో బంధువేమో అనుకునేవాడిని. కారణం, ఆయన ఇంట్లో వారందరితో చాలా చనువుగా ఉండేవారు. ఒక్క ఘంటసాలవారిని మాత్రం 'అయ్యగారు' అని పిలిచేవారు. మిగతావారందరినీ ఏకవచన ప్రయోగమే. ఆయనకి ఘంటసాలవారికి పానగల్ పార్క్ కాలంనుండీ స్నేహం. ఆయనకు సంసారం లేదు. ఘంటసాలవారి కుటుంబమే తన కుటుంబం. ఆ ఇంట్లో ఇద్దరు కృష్ణులు. ఒకరు తమ్ముడు కృష్ణ. పిల్లలందరికీ గుండుమాఁవయ్య, బందరువాసి కొమరవోలు కృష్ణారావు.  వాళ్ళ సొంతవూరు బందరు గురించి ఎప్పుడూ చెప్పేవారు. ఊరు ప్రయాణాల్లో ఘంటసాలవారి పర్సెనల్ అసిస్టెంట్. మరొకరు మామయ్య కృష్ణ, సావిత్రమ్మగారి మేనమామ. కేరళ పాలక్కాడుతో సంబంధం ఉన్న వ్యక్తి. తమ్ముడు కృష్ణ సావిత్రమ్మగారిని, పాపగారిని అక్కయ్య అని పిలిచేవారు.  వాళ్ళ మధ్య ఏ రకమైనా పోలికలు వుండేవికావు. ఇదంతా, 35, ఉస్మాన్ రోడ్ ఇంట్లోని వ్యక్తుల గురించి ఏమాత్రం అవగాహన లేని రోజుల్లో నాలో మెసిలే ఆలోచనలు. 

తమ్ముడు కృష్ణ ఇంటిపనుల్లో చేదోడువాదోడుగా ఉండేవారు. సదాశివుడుగారు, మామయ్య కృష్ణ జివిఎస్ ప్రొడక్షన్స్ నిర్మాణ కార్యకలాపాలు చూసేవారు. ఉదయం తొమ్మిది గంటలు అయేసరికి ఆ ఇల్లంతా వచ్చేపోయే జనాలతో కలకలలాడూతూండేది. పామర్తిగారు, రాఘవులుగారు (మాస్టారి సహాయకులు), సుబ్బు (ప్రొడక్షన్ మేనేజర్), బి.హరినారాయణ, దేవేంద్ర (ఫిల్మ్ ఎడిటర్స్) తరుచూ కనిపించేవారు. ప్రొడక్షన్ ఆఫీస్ కూడా మేడమీదే కావడంవలన వీళ్ళంతా సాయంత్రం వరకూ అక్కడే వుండి ఆ వ్యవహారాల గురించి చర్చించుకునేవారు. షూటింగ్ రోజుల్లో లొకేషన్స్ కు వెళ్ళి ఏ రాత్రికో తిరిగి వచ్చేవారు. వీళ్ళే కాక సినీమాలలో పాటలు పాడే కోరస్ ఆర్టిస్ట్ లు, కొంతమంది టెక్నిషియన్స్ వస్తూండేవారు. వీళ్ళలో చాలామంది ఘంటసాలవారిని 'అయ్యగారూ' అని, సావిత్రమ్మగారిని 'అమ్మగారూ' అని పిలిచేవారు. దీనివల్ల నాకు ఒక క్లూ దొరికింది. అవసరమైనప్పుడు నేను కూడా అయ్యగారు, అమ్మగారు అని పిలవడం అలవాటు చేసుకున్నాను. వారిని ఎలా పిలవాలి అనే ప్రశ్నకు సమాధానం దొరకడంతో చాలా రిలీఫ్ గా అనిపించింది. 

అయ్యగారు సాధారణంగా ఉదయం ఎనిమిది గంటలకు రెడీ అయిపోయేవారు. ఈలోగా రాఘవులుగారు వచ్చేవారు. ఆయన, పామర్తిగారూ కూడా అయ్యగారు, అమ్మగారు అనే పిలిచేవారు. మా నాన్నగారు మాత్రం ఘంటసాలవారిని మాస్టారు అని పిలిచేవారు. ఆయన 'సంగీతబాబూ' అని సంబోధించేవారు. సావిత్రమ్మగారు, పాపగారు, మొదలైన వారంతా  'సంగీతం'గారు అని పిలిచేవారు.  మాస్టారితో కూడా తోడుగా రికార్డింగ్ లకు, రిహార్సల్స్ కు రాఘవులుగారు మాత్రమే వెళ్ళేవారు. మాస్టారి సంగీత దర్శకత్వం వహిస్తున్న సినీమాల కంపోజింగ్, రిహార్సల్స్, రికార్డింగ్, రీరికార్డింగ్ ల సమయంలో మాత్రమే మా నాన్నగారు, పామర్తిగారు, రాఘవులుగారు కలిసి పనిచేసేవారు. మిగతా సమయాలలో మాస్టారు  పిలిపిస్తేనే తప్ప మా నాన్నగారు వెళ్ళేవారు కాదు. మేముండే ఔట్ హౌస్ లోనే సంగీత సాధనలోనో, గ్రంధపఠనంలోనో, రచనా వ్యాసాంగంలోనో నిమగ్నమైవుండేవారు. ఆయనకు ఇతరుల విషయాల్లో అనవసర జోక్యం, హస్కు, గాలికబుర్లు అంటే ఇష్టముండేదికాదు. పిల్లలం మాకూ  కూడా తరవాత అదే అలవాటయింది. 

పామర్తిగారి సతీమణి రాజమ్మగారు (రాజ్యలక్ష్మి), వారి అమ్మాయి రావమ్మ (రామలక్ష్మి) తరుచూ మాస్టారింటికి వచ్చేవారు. చాలా చనువుగా వుండేవారు. ఆ అమ్మాయి సావిత్రమ్మగారిని, పాపగారిని అక్కయ్యా అని పిలిచేది. ఘంటసాలవారిని మావయ్యా అనేది. సదాశివుడిగారిని తాత అనేది. వారంతా ఒకరికొకరు బంధువులనుకునేవాడిని చాలా రోజులు. కానీ కాదు. పక్క పక్క గ్రామాలవారు. ఈ వరసలు నాకు వింతగావుండేవి. అక్కయ్య భర్త బావ అవుతారు. మావయ్య భార్య అత్త కదా! ఈ రకమైన చుట్టరికాలు నాకు కొత్త. అర్ధం చేసుకోవడానికి చాలాకాలమే పట్టింది. రావమ్మ నాకంటే కొంచెం పెద్దది. అప్పటి నా దృష్టిలో చాలా ధైర్యస్థురాలు. ప్రాథమికదశలో స్పోకెన్ తమిழ்కి నాకు కోచ్. అప్పట్లో పామర్తిగారి కుటుంబం జి.ఎన్.చెట్టి రోడ్ లో వాణీమహల్ దగ్గర నార్త్ క్రిసెంట్ రోడ్ లో వుండేవారు. సంగీత దర్శకుడు టి.చలపతిరావుగారు, దర్శకుడు టి. ప్రకాశరావుల ఇళ్ళుకూడా ఆ ప్రాంతమేనని గుర్తు. ఆ రోడ్ మీదే మరికొంచెం ముందుకు వెళితే ఎడమవేపు లక్ష్మీ కాలనీ. అందులో మాధవపెద్ది సత్యం, మాధవపెద్ది గోఖలే, పింగళి నాగేంద్రరావుగార్ల ఇళ్ళుండేవి. 

ఘంటసాలవారింటి పోర్టికోలో ఎప్పుడూ రెండు మూడు కార్లుండేవి. ఒకటి వాక్సాల్ కారు. ఒకటి ముదురాకుపచ్చ రంగులోని మారీస్ మైనర్. మూడవది నాష్  కారు. నలుపు రంగు కారు. పాతకాలం మోడల్. పెద్దదిగా సోఫాలాంటి సీట్లతో కుటుంబం అంతా ఒకేసారి వెళ్ళడానికి అనువుగా వుండేది. ఆ కారుకు రెండు పక్కలా ప్లాట్ ఫారమ్ లాటిది వుండేది. కిందకు దిగడానికి. కారు డిక్కీ కూడా విశాలంగా వుండేది. అయితే ఆ కారుకు స్టార్టింగ్ ట్రబుల్ . హేండిల్ వేసి స్టార్ట్ చేయడానికి  తెగ యాతన పడేవారు. ఆ కారును సుబ్బు (బి.సుబ్బారావు) అవసరానికి ఉపయోగించేవారు. మాస్టారు వాక్సాల్ కారులో వెళ్ళేవారు. డ్రైవర్ పేరు గోవిందు. అరవ తెలుగులో మాట్లాడేవాడు. 

ఆ నాష్ (Nash) కారు పెద్ద బాబుకు, నాకు ఆటస్థలం. అతను స్టీరింగ్ వీల్ ముందు కూర్చొని దాన్ని అటు యిటూ తిప్పుతూండేవాడు. నేను పక్కన కూర్చొని గట్టిగా అరుచుకుంటూ ఆడేవాళ్ళం. నాకు ఈ కార్లు పేర్లు కొన్ని తెలిసాయంటే దానికి కారణం పెద్దబాబే. ఇద్దరం వీధి గేటు బయట నిలబడి వచ్చేపోయే కార్లను చూస్తూండేవాళ్ళం. ఎక్కడో బజుల్లా రోడ్ దగ్గర కారుకు హారన్ వేస్తే ఆ కారు పేరు ఏమిటో చెప్పేసేవాడు. ఏ కారు హారన్ ఎలావుంటుందో చెప్పేవాడు. చాలావరకు నిజమే అయివుండేవి. అంతవరకూ నేను విన్న కారు పేరు ఫోర్డ్ మాత్రమే. బొబ్బిలి రాణీగారిది. ఈ ఉస్మాన్ రోడ్ ఇంటికి వచ్చాక పెద్దబాబు ద్వారా ప్లిమత్, డాడ్జ్, కాడిలాక్, ఆస్టిన్ ఇంగ్లాండ్, ఫియట్, మారీస్ మైనర్, ల్యాండ్ మాస్టర్ వంటి కొన్ని కార్ల పేర్లు తెలిసాయి. అలాగే, ఆకాశంలో ఎక్కడో ఎగిరే ఏరోప్లేన్ల గురించి కూడా వర్ణించేవాడు. వాళ్ళ నాన్నగారు ఏరోప్లేనులో ప్రయాణం చేసినప్పుడు ఆయనతోపాటూ ఏర్ పోర్ట్ దాకా వెళ్ళిన అనుభవం కావచ్చును. డకోటా అని, బోయింగ్ అని, జెట్ అని ఏవేవో పేర్లు చెప్పేవాడు. కనీకనిపించకుండా ఆకాశంలో ఎగిరే ఆ ప్లేన్ లు ఎక్కడినుండి ఎక్కడికి వెడుతున్నాయో కూడా వివరించి చెప్పేవాడు. అయితే ఆ మాటలు నిజంకావని అతని ఊహాగానం అని తరువాత తెలుసుకున్నాను. 

పెద్దబాబుకు పామర్తి గారి దగ్గర చాలా చనువుండేది. మావయ్యా అని పిలిచేవాడు. (నాకు ఈ వరస కూడా తికమకగానే వుండేది). ఆయన వచ్చినప్పుడల్లా కార్ల గురించే ఏవో ప్రశ్నలు వేసేవాడు. ఆయన కూడా మరింత ఉత్సహాంతో మౌంట్ రోడ్ ఖివ్ రాజ్ మోటార్స్ లో కొత్త మోడల్ కారు చూశానని అది బుక్ చేద్దామనుకుంటున్నాని అనేవారు. సావిత్రమ్మగారితో కూడా ఆ కొత్త కార్లు వాటి రేట్ల గురించి వివరించి చెప్పేవారు. 

ఒకరోజు నేనూ, పెద్దబాబు ఆ నాష్ కారులో కూర్చొని ఆటలు మొదలెట్టాము. కొంతసేపు అయ్యాక పెద్దబాబు ఇప్పుడే వస్తాను కూర్చోమని చెప్పి కారు దిగి కారు డోర్ గట్టిగా మూసి లోపలకు వెళ్ళాడు. ఆ అదురుకి ఈ కారు సడన్ గా 'బొయ్'మని హారన్  మ్రోగడం మొదలెట్టింది. నాకు కంగారు పుట్టింది. ఆ హారన్ ఎలా ఆపాలో ఏమిటో ! ఎక్కడ ఏమయిందో తెలీదు. ఆ సౌండ్ కు ఇంట్లోవారంతా బయటకు వచ్చేసారు. ఈలోగా సుబ్బు వచ్చి ఏవో రెండు వైర్లను విడదీయడంతో హారన్ మ్రోగడం ఆగింది. పెద్దవాళ్ళెవరూ లేకుండా కారులో ఆడకూడదని, కారు గేర్ సరిగాలేకపోతే ముందుకెళ్ళి దేన్నైనా గుద్దేస్తుందని మందలించారు. నాకు అవమానంగా తోచింది. నేనుగా ఆ కారు ఎక్కలేదని, అంతవరకు పెద్దబాబు కూడా అక్కడే ఉన్నాడని చెప్పలేకపోయాను. అలా చెపితే అతనిమీద పితూరీలు చెప్పినట్లవుతుందని నా భావన. పిల్లల్లో complaining nature వుండకూడదని, సద్దుకుపోయే స్వభావం వుండాలని మా నాన్నగారు చేసే హితబోధలవలన నేను నోరు మెదపలేదు. ఆ సంఘటన జరిగాక నేను అక్కడున్న ఏ కారువైపుకి తిరిగి చూడలేదు. పెద్దవాళ్ళెవరైనా పిల్చి కారు ఎక్కమనేదాకా ఎక్కేవాడిని కాదు. 

తర్వాత, మా ఆట స్థలం  మేడమీదికి మారింది. అక్కడ ఒక గదిలో బోల్డెన్ని రంగు రంగుల చమ్కీల ముఖమల్, సాటీన్ బట్టలు పడివుండేవి. అవన్నీ సినీమాలో ఉపయోగించడానికని చెప్పాడు.  ఆ రంగు రంగుల బట్టలు సినీమాలలో తెలుపు, నలుపు రంగులలోనే ఎందుకు కనిపించేవో తెలిసేది కాదు. అక్కడే ఒక తోరణానికి ఒక పెద్ద గంట వేలాడుతూండేది. ఆ తోరణానికి క్రింద 'GVS PRODUCTIONS' అని ఇంగ్లీష్ లో రాసివుండేది. గుడిగంటలా కనపడే ఆ పెద్ద గంటను మ్రోగించి చూసాను. దేవాలయం గంటలా మ్రోగనేలేదు. 'డబ్ డబ్ డబ్' మనేది. నాకు చాలా విచిత్రమనిపించింది. అక్కడే కొన్ని ఫోటో ఆల్బంలు వుండేవి. అందులో ఎన్.టి.రామారావు, జానకి, రాజసులోచన, సిఎస్ఆర్, మొదలైనవారి ఫోటోలుండేవి. 

అప్పట్లో 'సొంతవూరు' సినీమా నిర్మాణంలో వుంది. ఈ సినీమాను ఘంటసాల వారే నిర్మించారు. ఇది వారి రెండవ చిత్రం. మొదటి చిత్రం 'పరోపకారం'. 

ఈ సొంతవూరు  సినీమాలోని 'మనవూరే భారతదేశం మనమంతా భారతీయులం' పాట రికార్డింగ్ కు వెళ్ళాను. మాస్టారు పాడిన ఈ కోరస్ పాటలో  రావూరి వీరభద్రం కూడా కోరస్ పాడారు. భద్రంగారు కూడా విజయనగరం మ్యూజిక్ కాలేజీలో మా తాతగారి దగ్గరే సంగీతం నేర్చుకున్నారు. 


తాతగారితో ఆర్.వి. భద్రం ఇతర శిష్యులు

పైనున్నగ్రూప్ ఫోటోలో తాతగారికి ఎడమవైపు కింద కూర్చునున్నాయన. సినిమాలలో పాటలు పాడాలని మద్రాస్ వచ్చి  పాపం చాలా అవస్థలే పడ్డారు. కొన్నాళ్ళు కోరస్ లు పాడాక, గాయకుడిగా మనుగడ సాగించడం కష్టమని గ్రహించి ఘంటసాలవారి సలహాతో వైలిన్ సాధన ప్రారంభించి ఎట్టకేలకు ఘంటసాల ఆర్కెష్ట్రా లో స్థానం సంపాదించారు. సొంతవూరు సినీమా పాటల రికార్డ్ లు 78 RPM నల్లటి రికార్డులు కావు. నేను చూసినప్పుడు అవి తెల్లగా చిన్నవిగా వుండేవి. అవి వినైల్ రికార్డ్ లని బాబూ వాళ్ళమ్మగారు చెప్పారు. ఈ సినిమా పాటలు ఎందుకనో HMVకి గాని, కొలంబియాకు గాని ఇవ్వలేదు. వేరెవరో రిలీజ్ చేశారు. 
                        


ఎన్ టి రామారావు శ్రీకృష్ణుడి వేషంలో మొట్టమొదటిసారిగా తెరపైన కనిపించింది ఈ సొంతవూరు చిత్రంలోనే ఒక (డ్రీమ్ సాంగ్ కావచ్చును. గుర్తులేదు). నటి రాజసులోచనకు తెలుగులో హీరోయిన్ అంతస్తు కల్పించినది కూడా ఈ సొంతవూరు చిత్రమేనని అనుకునేవారు.1956 వేసవి శెలవులు తర్వాత నన్ను పనగల్ పార్క్ ఎదురుగా పాండీబజార్ రోడ్ దగ్గర రామకృష్ణ మిషన్ హైస్కూల్ మెయిన్ బ్రాంచ్ లో 8 వ తరగతిలో చేర్పించారు.

ఆ విశేషాలన్నీ..... వచ్చేవారం... 
...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.


9 comments:

ameerjan said...

రాను రాను రసవత్తరమౌతూ...ఉత్సుకతను రేకెత్తిస్తూంది..35, ఉస్మాన్ రోడ్!����

P P Swarat said...

మీ అమూల్యాభిప్రాయానికి ధన్యవాదాలు.

Dr. P. SUMABALA said...

మాాకు తెలియని 35 ఉస్మాన్ రోడ్డు విషయాలు -- చాలా Interesting గా ఉన్నాయి.

సుమబాల

P P Swarat said...

Thank you.

Unknown said...

చాలా చాలా బాగుంది సార్ ఈ వర్ణన.నమస్కారాలు.

వడ్డాది గోపాలకృష్ణ మూర్తి said...

ఈ 21.11.2020 నాటి 7వ భాగం మంచి రసగంధాయంగా అనిపించింది. పెద్ద బాబు తో స్వరట్ గారి ఆటలు, కారులోని ఆటలు, మేడ మీద లంబార్ రూమ్ కి ఆటలు, లోగా సహాయ సంగీత దర్శకుల ప్రస్తావన, ఘంటసాల గారి సమయ పాలన ఆన్నీ సమపాళ్లలో కుదిరేయి. ధన్యవాదాలతో!

P P Swarat said...

అభివాదాలు.

శివరామి రెడ్డి said...

It is very narrative and informative of Ghantasala life along with Sangeetha Rao gari life.🙏🙏💐

హృషీకేష్ said...

అద్భుతమైన వివరాలతో మాకు ఎంతో అనుభూతిని కలిగిస్తున్నారు sir!! శతథా ధన్యవాదాలు!!🙏🙏హృషీకేష్