visitors

Friday, November 6, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఐదవ భాగం

06.11.20 - శుక్రవారం భాగం - 5*:
అధ్యాయం 2 భాగం 4 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
నెం.35, ఉస్మాన్ రోడ్ మా చిరునామాగా మారింది. ఆనాటి మెడ్రాస్ లోని ప్రతీ భవనమూ ముందు విశాలమైన ప్రాంగణంతో, పూలమొక్కల వరసలు, కొబ్బరిచెట్లు, మామిడిచెట్లతో నిండివుండేది. భవంతి వెనకవేపు కారుషెడ్లు, ఆ ఇంటి యజమాని ఆర్ధిక స్తోమతనుబట్టి ఔట్ హౌస్ లువుండేవి. (ఔట్ హౌస్ కు తెలుగు పదమేమిటి చెప్మా!) అలాటి ఔట్ హౌసుల్లో ఆ భవంతిలో పనిచేసే ఉద్యోగస్తులో, కారుడ్రైవరో తమ కుటుంబంతో సహా అందులో ఉండేవారు.

ఘంటసాలవారి గృహం కూడా చాలా విశాలమైన పాతకాలపు భవంతే. నాలుగుప్రక్కలా ప్రహారీతో ఉండేది. తూర్పుముఖం ఇల్లు. వీధివేపు విశాలమైన స్థలం. పిల్లలు ఆడుకోవడానికి తగినంత స్థలం. ఇంటికి రెండుప్రక్కలా ఇంటి వెనకవేపున్న కార్ షెడ్ కి ఔట్ హౌస్ కి వెళ్ళడానికి మట్టి సందులు. ఎడంచేతి వెనకవేపు కారుషెడ్. దాని పక్కనే ఒక చిన్న ఔట్ హౌస్ (పెంకుటిల్లు). మొదట్లో డాబాలేదు. పిల్ల పాపా లేని చిన్న కుటుంబానికి అనువు. ఔట్ హౌస్ పక్కన ఇంటి పనిమనిషికి  చిన్న గుడిసె. ఆ పక్కనే టాయిలెట్. పనిమనిషి గుడిసెకు ఎదురుగా నైరుతిమూల మైన్ బిల్డింగ్ ఆనుకుని ఒక గిలక బావి.  అది 1955లో ఆ ఇంట్లో మా ప్రవేశం నాటికి 35, ఉస్మాన్ రోడ్ నైసర్గిక స్వరూపం. 

ఘంటసాలవారు ఆ ఇంటిని ఎవరో ఒక దొర దగ్గర కొన్నారట. అయితే అంతకు ముందో, తర్వాతో ఎవరో తమిళులు కూడా ఆ భవనంలో వుండి వుండాలి. ఎందుకంటే వీధిగుమ్మం మీద వరండాలో తూర్పువేపు గోడ మీద "వేలుమ్, మయిలుమ్ తుణై" అన్న వాక్యం తమిళం అక్షరాల్లో వుండేది. ఇది అరుణగిరినాదర్ "కందర్ అనుబూది" అన్న అద్వైత సిద్ధాంతం మీద రచించిన భాష్యంలోని మొదటి పద్యం తాత్పర్యం. అంటే, "(కుమారస్వామి) ఆయుధమైన శూలం (వేల్), వాహనమైన నెమలి రక్షించుగాక" అని స్థూలంగా చెప్పుకోవచ్చును.

ఘంటసాలగారి తమ స్వగృహంప్రవేశానికి ముహూర్తం 1951 జూన్ 21న అర్ధరాత్రి 1.30కి. అంతవరకు మోతీలాల్ స్ట్రీట్ లో కొన్నాళ్ళు, రామానుజం స్ట్రీట్ లో కొన్నాళ్ళు చిన్న అద్దె ఇళ్ళలో ఉండేవారట. ఈ గృహప్రవేశం సందర్భంగా సినీమారంగానికి చెందిన ప్రముఖులంతా హాజరయ్యారట. ఈ గృహప్రవేశానికి ఘంటసాలవారు తమ గురుదేవులు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారిని కూడా ప్రత్యేకంగా విజయనగరం నుండి తీసుకువచ్చి ఆయనను సముచితరీతిని సత్కరించారు. ఎంతో శ్రద్ధాసక్తులతో తనకు సంగీతవిద్యను నేర్పి తన ఉజ్జ్వల భవిష్యత్ కు బంగారు బాట వేసిన గురువుగారి ఎడల తనకు గల గురుభక్తిని చాటుకున్నారు ఘంటసాల. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన గురువుగారు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారి సంగీతకచేరీ చాలా జనరంజకంగా జరిగిందని చెప్పేవారు. 

  
1951లో గృహప్రవేశానికి ఘంటసాలవారి ఆహ్వాన పత్రిక 

ఈ గృహప్రవేశం సమయంలోనే ఘంటసాలవారు తనకు చేదోడువాదోడుగా వున్న తన మిత్రుడు దేవగుప్తాపు రామచంద్రరావుకు తానే పెద్దై దగ్గరుండి ఉపనయనం జరిపి  ఉత్తమ స్నేహితులు ఎలావుండాలో చాటిచెప్పారు. రామచంద్రరావు  విశాఖపట్నం జిల్లాలోని ఏదో ఒక చిన్న గ్రామానుంచి పొట్టచేతబట్టుకొని మెడ్రాస్ చేరుకున్నవాడు. వీరిద్దరిని స్నేహితులుగా చేసింది  టి.నగర్ పనగల్ పార్క్. రామచంద్రరావు సంగీతం మనిషికాడు. ఉదయమంతా ఎక్కడెక్కడో ఏవేవో పనులు చేసుకుని రాత్రుళ్ళు ఘంటసాలగారు ఈ పార్క్ చప్టాలమీద కూర్చొని పాటలు పాడుతుంటే ఆయన కూడా పక్కనచేరి  అగ్గిపెట్టె మీద తాళం వేస్తూ ఉత్సాహపరిచేవాడట. ఆకలి ఇద్దరిని ఒకటి చేసింది. విజయనగరంలో తన తొలి రోజులలో నేలనూతల నాగభూషణం, ముద్దు పాపారావు ఎలాటి స్నేహాన్ని కనపర్చారో మళ్ళీ  అలాటి స్నేహితుడే మెడ్రాస్ లో రామచంద్రరావు రూపంలో ఘంటసాలగారికి లభించాడు. ఘంటసాలవారికి సావిత్రిగారితో వివాహమయ్యాక తొలిసారిగా మెడ్రాస్ లో కొత్త ఊళ్ళో, కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టినప్పుడు ఆవిడకు కూడా వంటా-వార్పు నేర్పి ఇంటిపనులలో చేదోడు వాదోడుగా వుండేవారట. 

ఘంటసాలగారి నెం.35, ఉస్మాన్ రోడ్ ఔట్ హౌస్ లోకి మేము రాకముందు అందులో పామర్తిగారు ఉండేవారు.

ఔట్ హౌస్ ముందు పామర్తిగారితో నాన్నగారు

వారి స్వగ్రామం ఘంటసాలవారి స్వగ్రామమైన చౌటపల్లి సమీపంలోని సిధ్ధాంతం. జీవనాధారం లేక ఘంటసాలవారిని ఆశ్రయిస్తే, ఆయనకు డోలక్ వాయిద్యాన్ని సమకూర్చి దాన్ని వాయించే నైపుణ్యం సంపాదించుకునే దారి కూడా చూపారు. 1950లో వచ్చిన లక్ష్మమ్మ కధలో ఘంటసాలవారి పాటను  పాడుతూ రుక్మిణి (ప్రఖ్యాత నటీమణి లక్ష్మి తల్లిగారు) నృత్యానికి నట్టువాంగం చేస్తూ పామర్తి తెరమీద కనిపిస్తారు. 
ఆనాటినుండి ఘంటసాలవారికి సహాయకుడిగా పనిచేశారు. పామర్తిగారి పేరు కూడా వేంకటేశ్వరరావు. ఆయనకు మొదటినుండి స్వతంత్రంగా సినీమాలకు సంగీత దర్శకత్వం వహించాలనే తపన వుండేది. ఆ దిశగా అనేక ప్రయత్నాలు చేసేవారు. (ఇక్కడ, యీ 'వేంకటేశ్వర' నామం మీద ఒక సందేహం. నా భాషాజ్ఞాన పెంచుకోవలని ఈ ప్రశ్న. వేంకటేశ్వర అని రాసేప్పుడు 'వె' కు దీర్ఘం ఇస్తారు. మరి, అదే 'వెంకట, వెంకట్రావు, వెంకట్' అన్నప్పుడు ఆ 'వె' కు ఎందుకు దీర్ఘం ఉండదో?)

నేను పుట్టి పెరిగిన వాతావరణానికి, యీ ఇంటి వాతావరణానికి చాలా తేడా. ఈ పరిసరాలకు అలవాటు పడడానికి కొంత సమయం పట్టింది. ఆనాటికి, ఆ కాంపౌండ్ అంతటికీ ముగ్గురే పిల్లలం. నేను, మా పెద్ద చెల్లెలు రమణమ్మ, ఘంటసాలవారింట్లో వారి పెద్దబ్బాయి, విజయకుమార్ (అసలు పేరు ఇంకేదో వుంది 'సుబ్రహ్మణ్య' కూడా కలుస్తుంది. నిజానికి ఈ కుర్రవాడు రెండవవాడు. మొదటి సంతానం 1950లో పుట్టిన వారం రోజులలోనే ఋణానుబంధం త్రెంచుకొని, ఆ దంపతులకు గర్భశోకం మిగిల్చాడు).

ఇంట్లో ఏమీ తోచేదికాదు. మా రమణమ్మ నాకంటే ఏడేళ్ళు చిన్నది. తనతో ఆడుకునే అవకాశంలేదు, ఎత్తుకొని ఆడించడం తప్ప. వెనకనున్న ఔట్ హౌస్ లోనుండి, గూట్లోని పక్షిలా బయటపడి వాకిట్లో ఉన్న కార్ల చుట్టూ తిరుగుతూ, గేటు బయట నిలబడి వచ్చేపోయే కార్లను, తోపుడు రిక్షాలను, ఎప్పుడో అరగంటకు ఒకసారి వచ్చి పోయే 12B (వడపళని-శాంథోమ్ రూట్) బస్సులను చూస్తూ ఆనందిస్తూండేవాడిని. మెడ్రాస్ లో అప్పట్లో - 1950-60 ప్రాంతంలో కలకత్తాలోలాగ ట్రామ్ వాహనాలు, హాండ్ రిక్షాలే అన్నీ. బస్సులు, కార్లు, బొంబాయిలోలాగ టాక్సీలు, వుండేవి. సైకిల్ రిక్షాలు, ఆటోరిక్షాలు 70ల నాటికి ఆ తరవాత వచ్చేయి.  1955 నాటికే బస్సు రవాణా, ట్రామ్ రవాణా సంస్థల మధ్య గొడవలు వచ్చి ట్రామ్ సర్వీస్ రద్దుచేసేసారట. మేము మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో మైలాపూర్, మౌంట్ రోడ్, చైనా బజార్ వంటి ప్రాంతాలలో రోడ్లమీద ట్రామ్ బళ్ళ ట్రాక్ లు (పట్టాలు) ఉండేవి. కాలక్రమేణా రోడ్ల మరామత్తు సమయంలో ఆ పట్టాలన్నింటినీ తొలగించడం జరిగింది. ఒక మైలు రెండు మైళ్ళ లోపు ప్రయాణానికి చిన్న పిల్లలు, ముసలివారు, డాక్టర్ల దగ్గరకు వెళ్ళే గర్భిణీ స్త్రీలు లాగుడు హాండ్ పుల్లింగ్ రిక్షా మీదే ఆధారపడేవారు. ఆ రిక్షాలో ఇద్దరికే కూర్చోనే స్థలం ఉంటుంది. ఇద్దరు మనుషులను మరోమనిషి మోసుకుంటూ పోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ, కొందరికి అదే జీవనోపాధి. క్రమేపీ 1970 లు వచ్చేసరికి కరుణానిధి ప్రభుత్వం ఈ లాగుడు రిక్షాల స్థానంలో సైకిల్ రిక్షాలను రిక్షా కార్మికులకి ఉచితంగా ఇచ్చింది. (ఆ రకమైన ఉచితాల జ్ఞాపకార్ధం మౌంట్ రోడ్ మీద సైదాపేట్ లోకల్ స్టేషన్ దారిలో నిర్మించిన ఒక ఆర్చ్ (హైదరాబాద్ భాషలో 'కమాన్') మీద ఒక రిక్షా, కళ్ళజోడు, ఇత్యాది బొమ్మలుంటాయి. అలాటి లాగుడు రిక్షా తరవాత మ్యూజియం పీస్ గా మారి మెడ్రాస్ ఎగ్మూర్ మ్యూజియం లో వుండేది.

మా ఇంటికి ఎదురుగా ఒక డాక్టర్ ఉండేవారు. ఆ ఇంటి గోడకు డాక్టర్ నామగిరి అని ఉండేది. అక్కడికి చాలామంది గర్భిణీ స్త్రీలు ఈ రిక్షాలలో వచ్చివెళ్ళేవారు. వాళ్ళు తిరిగి వచ్చేవరకూ ఆ రిక్షావాళ్ళు కాచుకునుండేవారు. వెళ్ళినవారు తిరిగి వచ్చేలోపల ఈ రిక్షావాళ్ళు తమిళం దినపత్రికలు చదువుతూండేవారు. ప్రతీ రిక్షావాడు  తప్పనిసరిగా తనకు నచ్చిన దిన పత్రికను చదవతూండడం చూసేవాణ్ణి. ఆ రోజుల్లో దేశం మొత్తం మీదే  అత్యధిక సంఖ్యలో అమ్ముడుపోయేవి మలయాళం దిన పత్రికలు, ఆ తరువాత తమిళ భాషా దినపత్రికలు. మిగిలిన భాషా దిన పత్రికల సర్కులేషన్ మలయాళ, తమిళ పత్రికలలో సగమే. దీనికి అక్కడి ప్రజలలోని అక్షరాస్యత,  రాజకీయ చైతన్యమే ముఖ్యకారణం. పత్రికా పఠనమయ్యాక   వక్క, పొగాకు, సున్నంతో తామలపాకులు, బీడీల పనిబట్టేవారు. కుంభకోణం వెత్తలై - వెట్రిలై (తమలపాకు) చాలా ప్రసిధ్ధి. ఈ తాంబూలసేవన ప్రక్రియ చాలా సమయమే తీసుకునేది. ఆ సరంజామా అంతా రిక్షావాళ్ళ నడుము దగ్గర లుంగీ మడతల్లోనే వుండేది. ఇదంతా నాకు వింతగా ఒక వేడుకగా వుండేది. వాళ్ళు మాట్లాడే మాటలు క్రమంగా అర్ధం అవడం ప్రారంభించాయి. మెడ్రాస్ లో వాళ్ళు మాట్లాడే తమిళం కాస్త సంకరం. స్వఛ్ఛమైన, ఉన్నతమైనది తమిళంగా మిగిలిన రాష్ట్ర ప్రజలు గుర్తించరు.  ఆ భాష, యాస మిగిలిన వారి దృష్టిలో అంత ఉన్నతమైనది కాదు. తిరుచ్చి, తంజావూరు, మదురై ప్రాంతాల తమిళమే శుధ్ధమైన తమిళమనే వాదన ఉంది. దేశంలో అన్ని ప్రాంతాలలోలానే ఈ మద్రాస్ రాష్ట్రంలో కూడా ఒక్కో ప్రాంతానికి ఒక్కో యాస. కోయంబత్తూరు ప్రాంతంలో ఒకలా, తిరునల్వేలి, కన్యాకుమారి ప్రాంతాలలో ఒకలా మాట్లాడతారు. ఇన్ని రకాల యాసలు వంటబట్టించుకోవడం కష్టమే. మన దేశంలోని అన్ని భాషల్లాగే తమిళం కూడా భ్రష్టు పట్టిపోతోందని, పరభాషా వ్యామోహంతో పెద్దలే తమ పిల్లలకు కనీస తమిళ భాషా జ్ఞానం కూడా లేకుండా చేస్తున్నారని తమిళ భాషాప్రియులు వాపోతుంటారు. ఆధునిక సినీమాలు,  టెలివిజన్ కార్యక్రమాలు అభివృద్ధి చెందాక స్పష్టమైన తమిళం మాట్లాడేవారే కరువైపోతున్నారని, ప్రాధమిక పాఠశాల స్థాయి నుండే ప్రతీ విద్యార్ధికి అరుణగిరినాదర్ వ్రాసిన తిరుపుగళ్ (15 వ శతాబ్దం) ఆధ్యాత్మిక గ్రంధం, 5వ శతాబ్దానికి ముందే తిరువళ్ళువర్ రచించిన తిరుక్కురళ్ (ధర్మార్దకామమోక్షాలు గురించి సూక్తులు) ద్విపదలు పాఠ్యాంశాలుగా పెట్టి చిన్నవయసునుండే పిల్లలకు వాటి మీద అవగాహన కల్పించాలని, అప్పుడే పిల్లలు స్వఛ్ఛమైన తమిళ ఉచ్ఛారణ చేయగలుగుతారని, తమిళ భాష సజీవంగా దృఢంగా నిలుస్తుందని భాషావేత్తలు ప్రభుత్వానికి సలహాలిస్తుంటారు. కానీ వినేదెవరని, చెవిటివాడి ముందు శంఖమేనని వాపోతుంటారు. దేశంలోని అన్ని ప్రాంతాలలోని భాషాపరంగా అందరు సంప్రాదయవాదుల ఆవేదన ఈ విషయంలో ఒకటే.  నేటి చదువులన్ని జీవనోపాధి కోసమే. భాషాజ్ఞానం, భాషౌన్నత్యం అనే భావాలు ఏనాడో ప్రాధాన్యతను కోల్పోయాయి.

మరీ, తప్పనిసరైతే తప్ప మాస్టారింట్లోకి తరుచూ వెళ్ళి ఇంట్లోవారికి ఇబ్బంది కలిగించకూడదని మా నాన్నగారు చేసిన హెచ్చరికవల్ల ఘంటసాలవారింటి లోపలికి వెళ్ళడానికి సంకోచించేవాడిని. 

ఇలా కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు వీధి వరండా మీద ఘంటసాలవారి పెద్దబాబు కనపడడం, మెల్లగా మాటలు కలపడం జరిగింది. అతను తెలుగులోనే మాట్లాడాడు. హమ్మయ్య, మాట్లాడేందుకు ఒక తెలుగువాడు దొరికాడని సంతోషమేసింది. వయసురీత్యా అతను నాకంటే ఐదేళ్ళు చిన్న. నాలో వయసుకు తగ్గ ఎదుగుదల కనపడేదికాదు. ఇద్దరమూ ఒకే వయసువాళ్ళం  అన్నట్లుండేది. పెద్దవాళ్ళంతా ఎవరి పనులమీద వారున్నప్పుడు, ఎవరూ చూడకుండా మెల్లగా వెనక వేపునుండి ఘంటసాలవారింట్లోకి వెళ్ళడం ప్రారంభం అయింది. ఒకరోజు ఉదయం బాబూ వాళ్ళ నాన్నగారు (ఘంటసాలవారి గురించి చెప్పుకున్నప్పుడల్లా మా ఇంట్లో వారందరం ఇలాగే సంబోధించేవాళ్ళం) బయటకు వెళ్ళిపోయాక పెద్దబాబును ఆడుకుందికి రమ్మని పిలవడానికి వెనక హాలుకి వెళ్ళాను. అప్పుడు అక్కడ బాబూ వాళ్ళమ్మగారు (సావిత్రమ్మగారు) అతనికి బట్టలు తొడిగి తల దువ్వుతున్నారు. నేను దగ్గరకు వెళ్ళి 'ఏమోయ్! రావోయ్, ఆడుకుందాం' అంటూ పిలిచాను. అందుకు, వాళ్ళ అమ్మగారు 'ఎందుకోయ్', 'ఎక్కడికోయ్' అంటూ ఆటపట్టించారు. నా మాటల్లో తప్పేముందో తెలియలేదు. ఆనాటి దాకా నేను పెరిగిన ఊళ్ళలో అందరూ స్నేహితులను 'ఏమోయ్' అనే పిలువడం వల్ల నాకూ అదే అలవాటయింది. మరీ, సన్నిహిత మిత్రులైతే 'ఒరేయ్', అని 'వాడూ, వీడూ' అని పిల్చుకునేవారు. నేను మాత్రం ఇంతవరకూ ఎవరిని 'ఒరేయ్' ' ఒసేయ్' అని పిలవలేదు, ఇంట్లోని పిల్లలతో సహా. బాబూ వాళ్ళమ్మగారు అలా ఆటపట్టించడం నాకు చిన్నతనంగా అనిపించి మారుమాట్లాడకుండా అక్కడినుండి వెళ్ళిపోయాను. మరొకరోజు, నేను బయట వాకిట్లో నిల్చొని వచ్చేపోయే వాహనాలు చూస్తుండగా ఎవరో వచ్చి 'ఘంటసాలగారున్నారా' అని అడిగారు. ఆ వచ్చినవారెవరు, పేరేమిటి, ఎందుకోసం వచ్చారని? అడిగి తెలుసుకునే జ్ఞానం వుండేది కాదు అప్పట్లో. సరాసరి లోపలకు వెళ్ళాను చెప్పడానికి. అక్కడ బాబూ వాళ్ళమ్మగారు (సావిత్రమ్మగారు) కనిపించారు. ఎవరో వచ్చారని చెపితే సరిపోయేది. అది మానేసి 'వారున్నారాండీ' అని అడిగాను. 'ఎవరా వారు'? తిరుగు ప్రశ్న. నా మాట తడబడింది. మళ్ళీ 'ఆయన లేరాండీ' అని అడిగాను. 'ఎవరా ఆయన'? మళ్ళీ ప్రశ్న. నా నోట తడారిపోయింది. ఆవిడ ధోరణికి ఆవిడ ఎదట పడాలంటే నాకు భయం పట్టుకుంది. మెల్లగా అక్కనుండి తప్పుకున్నాను. ఆ వచ్చినాయనకు మరెవరో సమాధానం చెప్పిపంపడం జరిగింది. ఈ సంఘటన తరువాత  చాలాకాలం పాటు బాబూ వాళ్ళ అమ్మగారి ఎదుటపడే ప్రయత్నం చేయలేదు. మా ఇంట్లోనే గడపడం మొదలెట్టాను. ఇంట్లో ఉంటే పాత క్లాసు పుస్తకాలు చదవమని లేకపోతే కొత్త స్కూల్లో పాఠాలు అర్ధం కావని మా అమ్మగారు పోరుతూండేది. పుస్తకం తీసేసరికి ఎక్కడినుండో మా రమణమ్మ వచ్చి ఆ పుస్తకం లాగేయడమో, గిల్లడమో, కొరకడమో చేసేది. వద్దని ఏమాత్రం వారించినా గుక్క తిప్పుకోకుండా ఏడుపు మొదలెట్టేది. ఆ ఏడుపును మాన్పించడానికి పెద్దలు నానా యాతనా పడేవారు. మా రమణమ్మకు చిన్నప్పడు చిలిపితనం ఎక్కువే. విజయనగరంలో వున్నప్పుడే తన కంటే పెద్దదైన మంగమాంబను, చిన్నదైన జ్యోతిని కొరకడం, జుత్తుపట్టుకు పీకడం వంటి చేష్టలన్నీ చేసేది. "దొడ్డా! రమణమ్మ కొరికింది, జుత్తుపీకింది" అంటూ  అంబిక ఏడుపు లంకించుకునేది. జ్యోతికి ఏడవడం తప్ప మాటలు రావు అప్పటికి. వాళ్ళు ఏడుస్తూంటే తానంతకంటే గాఠిగా ఏడుపు లంకించుకునేది. అలాటి పిల్లను ఎత్తుకొని ఆడించడం, ఉయ్యాలూపి నిద్రపెట్టడం వంటి పనులలో మా అమ్మగారికి సహాయం చేసేవాడిని. అలాటప్పుడు ఆ గిల్లుళ్ళు, జుత్తు పీకించుకోవడం అనుభవైకవేద్యమే. పెద్దవాడిని కదా! "చెల్లి చిన్నదిరా, సద్దుకుపోవాలి" అనేవారు. అలా అన్నిటికీ సద్దుకుపోవడం అలవాటయింది.

మెల్లగా, ఘంటసాల వారింటి వ్యక్తులతో పరిచయాలు కలిగాయి. తరుచూ , "తాతా!", "పాపా!" అంటూ ఎవరో ఎవరినో పిలవడం వినబడేది. కానీ ఆ తాతగారు కానీ, ఆ పాప కానీ నాకంట పడనేలేదు. 

ఆ విషయాలన్నీ వచ్చేవారం....

                ...సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

8 comments:

హృషీకేష్ said...

సావిత్రమ్మ గారు మిమ్మల్ని ఆటపట్టించడం బాగుంది. మద్రాసులో కూడా trams ఉండేవని ఇప్పుడే తెలిసింది. నిజానికి చాలా comfortable అవి పెద్దవాళ్ళకి కూడా. ధన్యవాదాలు sir. వచ్చేవారం కోసం వేచిచూస్తూ... హృషీకేష్

వడ్డాది గోపాలకృష్ణ మూర్తి said...

35 ఉస్మాన్ రోడ్ లోని ఘంటసాల గారు స్వంత ఇంటి ఆవరణలో వెనుక చిన్ని భాగంలో శ్రీ పట్రాయని సంగీతరావు గారి కుటుంబ ప్రస్థానం మొదలయినది. ఎంతయినా గురు శిష్య పరిచయము ఆప్యాయతలు మించి విశ్వాసం పాదుకున్న శతాబ్దం. పెద్దా కుర్రవాడు గా ప్రణవ స్వరాట్ ఇంట్లో, వీధిలో, వచ్చీపోయేవారిలో అందునా ఇంటి పిల్లలతో మీకు మీరు గా చొరవదారుగా నేటికీ కనరారు మహాశయా! నాటి భాషాశైలి అందునా తెలుగులో వలెనే తమిళ భాషా సాంస్కృతిక పరిభాష నాటికే క్షీణదశకు పునాదులు బాగా చర్చ పెట్టారు. ఘంటసాల సావిత్రి గారి పట్ల మీ పరిచయం మళ్లీ మళ్లీ చదువుకున్నాము. నాటి నాన్న గారు నేటికి నూరు సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా మీకుటుంబానికి మా ప్రేమ గౌరవాలు మీకు ఎల్లరకూ మనసారా పంచుతూ - వడ్డాది కుటుంబం!

Dr. P. SUMABALA said...

పెద్దన్నయ్యా,
నీ జ్ఞాపకాల మాలిక ఎంతో Interesting గా సాగుతోంది. నాకు తెలీని మద్రాసు సంగతులు చదువుతూ ఉంటే చాలా బాగుంది.
Madras Tram Service గురించి నేను చదువిన కొన్ని విషయాలు:

మద్రాస్ లోని ట్రామ్‌లు, రేవులు - లోతట్టు ప్రాంతాల మధ్య వస్తువుల రవాణా కి, ప్రయాణీకుల కోసం నడిచేవి. ఇది భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ట్రామ్ వ్యవస్థ 7 మే 1895 న ప్రారంభమైంది. మౌంట్ రోడ్, ప్యారిస్ కార్నర్, పూనమల్లీ రోడ్, రిప్పన్ బిల్డింగ్ మార్గాలలో ఇవి నడిచేవి. ట్రామ్ సంస్థ 1950 లో దివాళా తీసింది, 12 ఏప్రిల్ 1953 న మూసివేయబడింది.
సుమబాల

Pulijalasanthisree said...

మద్రాసు కబుర్లు బాగున్నాయి....లాగుడు రిక్షాలు కలకత్తాలో చూశానండి 25 ఏళ్ళ క్రితం... మనిషే బండిని లాగడం...నేను కూడా ఎక్కాను ఆ రిక్షా...కానీ సిగ్గేసింది...ఇక సావిత్రమ్మ గారు మిమ్మల్ని ఆటపట్టించడం...మీ చెల్లి రమణమ్మ ఆగడం చూస్తుంటే ..బంధాలు బలపడేది అలాగేకదా అనిపిస్తుంది... మళ్ళీ మరిన్ని కబుర్లకోసం ఎదురు చూస్తాం...నమస్తే

P P Swarat said...

ఈ ధారావాహికను చదివి అభినందిస్తున్న సహృదయులందరికీ కృతజ్ఞతలతో...

హృషీకేష్ said...

లక్ష్మమ్మ కధ లోని నృత్య గీతం బాగుంది sir. ఫరజు రాగం ఉందని ఇప్పుడు తెలిసింది. ధన్యవాదాలు. హృషీకేష్

Patrayani Prasad said...

నెం. 35 ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక )- అధ్యాయం 2 -ఐదవ భాగం.06-11-2020 -శుక్రవారం భాగం -5*- 👆🙏🙏శ్రీ అన్నయ్యకు నమస్కారములు. 🙏🙏. ఈ మధ్య నా ఆరోగ్యం కొద్దిగా సరిగా లేకపోవడం తో, వెంటనే స్పందించ లేకపోయాను. పాఠకులంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను . ఈ అధ్యాయం 2- ఐదవ భాగంలో వివరణ, మరీ చక్కగా ఉంది. ఆ చిన్న వయసులో పరిశీలన చేసినవాటిని, జ్ఞాపకం ఉంచుకోవడమే కాక , వాటిని తిరిగి, చిన్న వాడిగా మారి ఆ వయసులో వారి భావాలను, రమ్యముగా చిత్రీకరించి ,మా అందరి ముందు వ్యక్తీకరించి విధానం ఎంతైనా కొనియాడ తగ్గది. ధన్యవాదాలు. చి.రమణమ్మ కొరకడం కాదు, కండపట్టుకుని కరిచేసేది. కరిచేసి, ఏమైనా అంటే చాలు , గుక్క పట్టేసి ఏడ్చి , మనిషి నీలంగా మారిపోయేదట. నాకు కొద్దికొద్దిగా జ్ఞాపకం ఉంది. అప్పుడు తాతగారు వారిద్దరిని , తన దగ్గర కూర్చోపెట్టుకొని కాసేపు ఆటలాడించిన తరువాత, మళ్ళీ ఎలాగో సమయం చూసి కరిచేసేదట.
అమ్మబాబోయ్! మా అమ్మ పెద్ద అయిన తరువాత, ఈ విషయం, ప్రస్తావన వచ్చినపుడు, చెప్పడం గుర్తు ఉంది.ఏమైనా చిన్నప్పుడు కదా! తెలియనితనం, అంతే.-పట్రాయని ప్రసాద్, బెంగుళూరు, తేదీ:09-11-2020, సోమవారం. రాత్రి:సమయం.గం. 07:12ని.IST.

హృషీకేష్ said...

13.11.2020న పెట్టిన భాగంలో దీపావళి విశేషాలు బలే ఉన్నాయి. మాస్టారితో కలసి మీరు దీపావళి సామాను కొనటం, మీ వక్కపొడి అలవాటు బాగున్నాయి. ధన్యవాదాలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు🙏🙏హృషీకేష్