visitors

Saturday, December 26, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పన్నెండవ భాగం

26.12.2020 - శనివారం భాగం - 12*:
అధ్యాయం 2  భాగం 11 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

నెం.35, ఉస్మాన్ రోడ్ లోగిలి నిశ్శబ్దంగా వుందీ అంటే ఘంటసాల మాస్టారు ఇంట్లోవున్నారని అర్ధం. ఆయన వున్న సమయాలలో రేడియో శబ్దాలు కాని, గ్రామఫోన్ పాటలు కానీ వినిపించేవి కావు. అలాగే, అనవసర సంభాషణలు గట్టిగా వినపడేవికావు. వారు ఇంట్లో ఉన్న సమయంలో ప్రశాంతంగా వుంచాలని ఇంట్లోవారంతా తాపత్రయపడేవారు. ఆయన రికార్డింగ్ లకో, రిహార్సల్స్ కో బయటకు వెళ్ళిన సమయాలలోనే పాటలు వినడం జరిగేది. అలాగే, సాయంత్రం సమయాలలో బాల్కనీలో అందరూ కలసి సత్కాలక్షేపం చేసేవారు. అప్పుడప్పుడు కధలమీద, సాహిత్యం మీద కబుర్లు సాగేవి. అలాటప్పుడు మా నాన్నగారే వక్త. సావిత్రమ్మగారు, పాప పిన్నిగారు, సుబ్బారావు, రామచంద్రరావు, బ్రహ్మంగారు మొదలైనవారంతా శ్రోతలు. శ్రీ సంగీతరావుగారు (మా నాన్నగారు) ఏ విషయం మీదనైనా రసవత్తరంగా మాట్లాడేవారు. ఆయన శరత్, టాగోర్, ప్రేమ్ చంద్ కథలను కళ్ళకుకట్టినట్లుగా, హృదయానికి హత్తుకునేలా చెప్పేవారు. ముఖ్యంగా, ఆయన చెప్పే 'కుక్క-యజమాని', 'గోపాల్' వంటి కరుణరస ప్రధానమైన కథలు దుఖః కలిగించేవి. అయినా ఆ కథలను ఎప్పుడు చెప్పినా వినాలనిపించేవి. 

సర్వశ్రీ - పంతుల శ్రీరామశాస్త్రి (రాయఘడాలో హైస్కూల్ మాస్టర్), భట్టిప్రోలు కృష్ణమూర్తి (OAS, ఒరిస్సా జైపూర్ ఎస్టేట్ ఆఫీసర్), మంథా రమణరావు (రూర్కేలా ఐరన్&స్టీల్ ఫ్యాక్టరీ లో పెర్సనల్ మేనేజర్) వంటి ఆనాటి ప్రముఖ రచయితలు ఆయనకు విజయనగరం కాలంనాటి నుండీ మంచి మిత్రులు. 

  

పంతుల, భట్టిప్రోలు, మంథా మిత్రులతో నాన్నగారు

(ఈ రచయితల కథలు వ్యాసాలు భారతి లో ప్రకటించబడేవి. ఆకాలంలో 'భారతి' పత్రికలో రచనలు ప్రచురించబడ్డాయంటే అదొక అమూల్యమైన గొప్ప ప్రశంసాపత్రం. తెలుగు భాషలో నిష్ణాతులైన వారి రచనలు మాత్రమే భారతిలో చోటుచేసుకునేవి). 

విజయనగరంలో వున్న రోజుల్లో వ్రాసిన కధలు కొన్ని ఆంధ్రపత్రిక(వారపత్రిక)లో ప్రచురితమయ్యాయి. ఈ ముగ్గురు శెలవుల్లో మద్రాస్ వచ్చి మా నాన్నగారితో కొన్నాళ్ళు గడిపేవారు. అలాటప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా, సర్వశ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు, యామిజాల పద్మనాభ స్వామి, జలసూత్రం రుక్మిణీ నాధ శాస్త్రి, మాలతీ, ఎన్నార్ చందూర్ దంపతులను కలిసేవారు. వృత్తిపరంగా, సముద్రాల, మల్లాది, దాశరధి, ఆరుద్ర, సి.నారాయణ రెడ్డి, ఆత్రేయ వంటి కవులతో మంచి అనుబంధం వుండేది. మా నాన్నగారు ఎవరైనా మరీ బలవంతపెడితే తప్ప ఏ రచనలు చేసేవారు కాదు. ఆయనలోని రచనాశక్తిని గ్రహించిన చందూర్లు బలవంతం మీద ఆంధ్రమహిళ, జగతి వంటి పత్రికలకు కొన్ని కధలు వ్రాశారు. సమకాలీన సంగీత విద్వాంసులమీద ఆంధ్రప్రభ దిన పత్రికలో సంగీత వ్యాసాలు వ్రాయడం జరిగింది. అలాగే ఆయన జీవితంలో తారసపడిన ప్రముఖ వ్యక్తులందరితో తనకు గల అనుబంధాన్ని, జ్ఞాపకాలను 'చింతాసక్తి' పేరిట, తన ఆత్మ సంతృప్తికోసం, ఒక పుస్తకం వ్రాసుకున్నారు. వాటన్నిటినీ సంకలనపరచి ఒక పెద్ద పుస్తకంగా ప్రచురించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ పుస్తకం మీముందుకు వస్తుంది. మా నాన్నగారి రచనా వ్యాసాంగానికి 'నెం.35, ఉస్మాన్ రోడ్' లోని వ్యక్తులు,  వాతావరణం కూడా ఎంతో దోహదపడ్డాయి.

మాస్టారు ఉదయం రికార్డింగ్ ఉంటే మధ్యాహ్నం 1.30 తరువాత, మధ్యాహ్నం రికార్డింగ్ అయితే రాత్రి 9.30 తరువాత ఇంటికి చేరేవారు. మాస్టారు వచ్చేలోపల, రేడియో సిలోన్, వివిధభారతిలో వచ్చే తెలుగు, తమిళ, హిందీ సినిమాల పాటలను మార్చి మార్చి వినేవాళ్ళం. అలాగే కొత్తగా వచ్చిన గ్రామఫోన్ రికార్డులను అరగదీసేవాళ్ళం. మాస్టారు సినీమా లలో పాడిన తెలుగు, తమిళ, కన్నడ భాషా చిత్రగీతాలను హెచ్ ఎమ్ వి, కొలంబియా కంపెనీ వారు విడుదల చేసేవారు. అలాటి పాటలను మాస్టారికి 'కాంప్లిమెంటరీ'లుగా పంపేవారు. అయితే,  ఒక సినీమాలో పదిహేను,  ఇరవై పాటలు, పద్యాలు వుంటే అవన్నీ రికార్డ్ రూపంలో వచ్చేవికావు. బాగా అమ్ముడుపోతాయనే నమ్మకం వున్న పాటలనే రికార్డులుగా వేసేవారనుకుంటాను. అలాటి రికార్డులు మాత్రమే మాస్టారింటికి వచ్చేవి. 

నాకు తెలిసినప్పటినుండీ HMVలో శ్రీ మంగపతిగారే ప్రోగ్రామ్ ఇన్ ఛార్జ్ గా వుండేవారు. మూడు మాసాలకు ఒకసారైనా ఓ రెండు లలితగీతాలు మాస్టారివి రికార్డ్ చేసేవారు. ఆ లలితగీతాల కంపోజింగ్ మాస్టారింటి హాల్ లోగానీ, లేదా మేడమీది ఫ్రంట్ రూమ్ లో కానీ జరిగేవి. అలాటి సందర్భాలలోనే సర్వశ్రీ - రావులపర్తి భద్రిరాజు, ఎ వేణుగోపాల్, సముద్రాల ఆంజనేయులు, విజికె చారి, సి.సుబ్బారావు వంటి గీత రచయితలను చూడడం జరిగింది.

HMVలో పెరుమాళ్ అని ఒక ఎటెండర్ వుండేవాడు. మధ్యపాపిడి, సగం నెరసిన నొక్కులజుత్తు. కళ్ళజోడు, ఖాకీడ్రెస్. వారానికి ఒకసారైనా సైకిల్ మీద వచ్చి రెండో మూడో రికార్డులు ఇచ్చివెళ్ళేవాడు. (అంటే ఆరు పాటలు). సాధారణంగా అతను వచ్చే సమయానికి నేనే వాకిట్లో వుండేవాడిని. పెరుమాళ్ పుస్తకంలో సంతకం చేసి ఆ రికార్డులను తీసుకునేవాడిని. ఆ రికార్డులు నాలుగుపక్కలా ట్వైన్ దారంతో కట్టబడివుండేవి. వాటిని తీసుకువెళ్ళి అమ్మగారికి అప్పగించి వాటిని వినే అవకాశం కోసం ఎదురుచూసేవాడిని. 

ఘంటసాల మాస్టారి ఇంట్లో మొదట్లో ఒక పెద్ద పాతకాలపు వాల్వ్ రేడియో, ఒక HMV గ్రామఫోన్ ప్లేయర్ మెయిన్ హాల్ లో వుండేవి. ఆ హాలుగోడలన్నీ  స్కై బ్లూ  కలర్ లో కళ్ళకు చల్లదనాన్ని ఇచ్చేవిగా వుండేవి.  వీధి గుమ్మంనుండి లోపలి హాలు చివరివరకు ఒక ఆకుపచ్చ తివాసి (కొబ్బరినారుతో చేసినది) ఉండేది. ఎడమప్రక్క పడమట గోడంతాపూర్తిగా అద్దాల బీరువా. దానినిండా మాస్టారికి వచ్చిన షీల్డ్ లు, వెండి కప్పులు, పతకాలతో పూర్తిగా నిండివుండేది. హాలుకు మధ్య రంగురంగుల ముఖమల్ తివాసీ దానిమీద ఒక పెద్ద సోఫా ఎదురెదురుగా సింగిల్ సోఫాలు. ఈ సోఫాలు దూదితో చేయబడినవి. తెలుపు ఆకుపచ్చల చారలతో చాలా ఆకర్షణీయంగా వుండేవి. అక్కడే ఒక పక్కగా మాస్టారి పేము పడకకుర్చీ, రెండు కాళ్ళు జాపుకొని హాయిగా పడుక్కునేందుకు వీలుగా పొడుగాటి మడత చేతులతో ఉండేది. గ్రామఫోన్ కు దక్షిణం  గోడవేపు ఒక స్టాండ్ మీద గ్రామఫోన్, పక్కనే రేడియో గ్రామ్ . దానికి ముందు ఒక పేము కుర్చీ. తూర్పు గోడమీద అయ్యగారు , అమ్మగారి పెద్ద కలర్ ఫోటోలు. తరువాత కాలంలో జలాల్ కంపెనీ వారి సిల్వర్ డయల్ పెండ్యులమ్ వాల్ క్లాక్ వచ్చాయి. ఆ వాల్ క్లాక్ ను తుడిచి , కీ ఇచ్చే భాధ్యత తమ్ముడు కృష్ణదైతే అతనెక్కిన కుర్చీని పట్టుకోవడం నా అలవాటు గా మారింది. ఆ HMV గ్రామఫోన్ కు రెండు మూతలుండేవి. ఒకటి పైవేపు. మరొకటి ముందువేపు. ఆ మూతలు వేసేసినా కూడా పాట స్పష్టంగా వినబడేది. ముందువేపు స్పీకర్లు వుండేవి. అందులో వినపడే పాట స్టూడియో ధియేటర్లో వినేపాటలాగే నిర్దిష్టంగా వినపడేది. అలాటి గ్రామఫోన్ మరల నేను ఎవరింట్లోనూ చూసిన గుర్తులేదు. ఆ గ్రామఫోన్ లో పాటలు పెట్టి, కీ ఇవ్వడమన్నా,  ముల్లు మార్చడమన్నామహదానందంగా వుండేది. రామచంద్రరావో, అమ్మగారో పెడుతునప్పుడు చూసి తెలుసుకున్నాను. కొంచెం పెద్దయ్యాక నేనే ఆ గ్రామఫోన్ లో రికార్డులు పెట్టేవాడిని. తరువాత కొన్నేళ్ళకు (1967-68లో ఇంటి రినొవేషన్ ఫస్ట్ ఫ్లోర్ లో మరో ఇల్లు కట్టిన తరవాత) ఆ పాత రేడియో స్థానే ఒక నాలుగు బ్యాండ్ల ఫిలిప్స్  రేడియో గ్రామ్ వచ్చింది. అందులోనే రేడియో, గ్రామఫోన్ కూడా వుండేది. ఒకేసారి ఎనిమిది రికార్డులు లోడ్ చేస్తే ఒకదాని  తరవాత ఒకటి వరసగా టర్న్ టేబుల్ మీద ఆటోమేటిక్ గా పడి ఆటోమేటిక్ గానే పికప్ రికార్డ్ మీదకి దిగి ఒక పాట తరువాత మరో పాట ప్లే అయేవి. ఆ రేడియో గ్రామ్ క్రింది భాగంలో రెండు మూడు వరసల్లో రికార్డులు భద్రపరిచే స్థలముండేది. కొన్ని వందల రికార్డులు వాటిలో దాచవచ్చును. ఇవన్నీ 1965 తర్వాత వచ్చినవి. అప్పటినుండే ఇంట్లో అందుబాటులో వున్న గ్రామఫోన్ రికార్డులకు ఒక ఇండెక్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచన రావడం, (రికార్డులు మీద నెంబర్లు కూడా వేసేమేమో!) నెంబర్ ప్రకారం కొంత లిస్ట్ తయారు చేయడం జరిగింది. అందులో నా పాత్ర కూడా వుందని చెప్పడానికి ఆనందంగానేవుంది.

నాకు పది పన్నెండేళ్ళ వయసులో ఆ పాత HMV గ్రామఫోన్ లో చాలా పాటలే విన్నాను. అందులో ముఖ్యంగా, పుష్పవిలాపం, కుంతీకుమారి, సాంధ్యశ్రీ, పాపాయి పద్యాలు, షావుకారు, పాతాళభైరవి, చంద్రహారం, దేవదాసు, చిరంజీవులు, కన్యాశుల్కం, సంతానం,  మాయాబజార్, సారంగధర, ఇలా ఎన్నో సినీమా పాటలు. అప్పటికి నా వయసు సుమారు పన్నెండేళ్ళు. 

ఆ సమయంలోనే 'సతీ అనసూయ' సినీమా వచ్చింది. సినీమా 1957 లో వచ్చినా  కొన్ని పాటల రికార్డింగ్ 1956 లోనే వాహినీలో జరిగిన గుర్తు. వాహినీలో ముందు కృష్ణన్ సౌండ్ ఇంజనీర్. తరువాత వల్లభజోస్యుల శివరాంగారు వచ్చారు. పెద్ద పెద్ద మీసాలు. భారీ శరీరం. ఈయన  పోతన, షావుకారు, గుణసుందరి వంటి అనేక సినీమాలలో కూడా  నటించారు. విజయాగార్డెన్స్ రికార్డింగ్ ధియేటర్ రాకముందు మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన అనేక సినీమా పాటలను వాహినీ స్టూడియో లో శివరాంగారి ఆధ్వర్యంలోనే రికార్డ్ అయాయి. విజయాగార్డెన్స్ వచ్చాక మాస్టారి సినీమా పాటలు అక్కడే రికార్డింగ్ జరపడం మొదలెట్టారు. అక్కడ ఏ ఆర్ స్వామినాథన్ సౌండ్ ఇంజనీరు. అప్పట్లో భరణీలో కోటేశ్వరరావుగారు (ఆయన తరువాత జెమినీ స్టూడియోకు మారారు), ఏవిఎమ్ లో జె జె మాణిక్యం , ప్రసాద్ లో ఎస్పి రామనాధన్ వంటివారు సౌండ్ ఇంజనీర్లుగా వుండేవారు.

సతీ అనసూయ పాటల రికార్డింగ్ వాహినీలో జరిగినా, రీరికార్డింగ్ మాత్రం వేరే స్టూడియో జరిపారు. అది కూడా వడపళని దాటాకే అర్కాట్ రోడ్ లోనే ఉండేది. (ఆ రోజుల్లో వాహినీ, ఏవిఎమ్ దాటాక అంతా నిర్మానుష్యంగా వుండేది. సినీమా వారి వాహనాల రాకపోకలే కనిపించేవి. ఆ ఆర్కాట్ రోడ్   పోరూర్, పూనమల్లి హైరోడ్ కు వెళుతుంది. అప్పట్లో పొలాలు, కొబ్బరితోటలతో నిండిన ఆ ప్రాంతమంతా ఇప్పుడు ఒక కాంక్రీట్ జంగిల్. హెవీ ట్రాఫిక్ జామ్ లతో, వాతావరణ కాలుష్యంతో మనుషులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.)

సతీ అనసూయలో కూడా ఇరవైకి పైగానే పాటలు పద్యాలు వున్నాయి. ఇవన్నీ గ్రామఫోన్ రికార్డులు గా వచ్చాయా అనేది నాకు సందేహమే. అందులోని పాటలన్నింటికీ చాలా శ్రావ్యమైన సంగీతాన్నే ఘంటసాల మాస్టారు సమకూర్చారు. ఆ పాటలన్నీ గ్రామఫోన్ లో వేసుకొని వినేవాళ్ళం. 


ముఖ్యంగా ఎమ్మెల్ వసంతకుమారి పాట 'మారు పల్కవదేమిరా', 'పోనేల మధుర పోనేల కాశి', 'జయ జయ దేవహరే, 'ఓ నాగదేవతా నా సేవగొని', 'ఊగేరదిగో మువ్వురు దేవులు ఉయ్యాలలో పసిపాపలై', 'కదిలింది గంగా భవానీ' వంటి పాటలను, మళ్ళీ మరేవైనా కొత్త రికార్డ్ లు వచ్చేవరకు వేసుకు వినేవాళ్ళం. గ్రామఫోన్ లో ఈ పాటలు వినడానికి నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలి. అందుకు పిన్నిగారిని ఆశ్రయించేవాడిని. ఈ రకంగా మాస్టారు లేని సమయంలో పాటల కార్యక్రమం జరిగేది.

'ఓ సఖా ఓహో సఖా' పాట డ్యూయెట్. జిక్కి, మాస్టారు పాడారు. ఈ పాటకు మూలం 'ఝనక్ ఝనక్ పాయల్ బాజే' లో లతామంగేష్కర్, హేమంత్ కుమార్ పాడిన 'నయన్ సొ నయన్ నహీ మిలో" పాట. చాలా మంచి పాట. స్లో రిధిమ్ లో ఉండే ఈ పాటను రతీ మన్మధుల నృత్యగీతికి తగినట్లు మార్చి మాస్టారు వరసను కూర్చారు. సతీ అనసూయ లేడీ ఓరియెంటెడ్. హీరో లేని సినీమా. అంజలీ, జమునలే ఈ చిత్రానికి జీవం. గుమ్మడి, కెవి శర్మ,  పద్మనాభం, రేలంగి, ముక్కామల, రాజనాల ముఖ్యపాత్రలు.  కాంతారావు, అమర్ నాధ్ కూడా ఉన్నారు. ఆఖరున ఒక సీన్ లో శాపం తీరిన కౌశికుడుగా, జమున భర్తగా ఎన్ టి రామారావు కనిపిస్తారు. కానీ యూట్యూబ్ పొస్టర్స్ లో ఎన్టీఆర్ ఫోటోను, పేరును ప్రముఖంగా చూపిస్తున్నారు.

సతీ అనసూయ రాజశ్రీ ప్రొడక్షన్స్ సుందర్లాల్ నహతాగారి రెండవ సినీమా. కడారు నాగభూషణం గారు డైరక్టర్. ఈ సినీమా రీ రికార్డింగ్ వడపళని దాటాక అదే ఆర్కాట్ రోడ్ లోని పేరమౌంట్ స్టూడియో లో జరిగిన గుర్తు. పక్క పక్కనే శ్యామలా స్టూడియో,  ప్రకాష్,  మెజెస్టిక్, వాసూ స్టూడియో,  గోల్డెన్ స్టూడియో, ఫిలింసెంటర్ వంటి చిన్న స్టూడియోలుండేవి. ఆ తరువాత కొంతకాలానికి కర్పగం, ఎ ఆర్ ఎస్ గార్డెన్స్ వంటి స్టూడియో లు వచ్చాయి. ఆ రోజుల్లో ఈ స్టూడియో లన్నీ చాలా బిజిగా కళకళలాడుతూ పనిచేసేవి. ఈనాడు ఆర్కాట్ రోడ్ లోని సినీమా స్టూడియోలన్నీ మూతబడి, వాటి నామరూపాలే తెలియకుండా ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళ గొడౌన్లుగా, మల్టీస్టోరీడ్ హైటెక్ బిల్డింగ్స్ గా రూపాంతరం చెందాయి. 

సినీమా నిర్మాణం పూర్తిగా బజారుకు ఎక్కింది. పెద్ద పెద్ద భవంతులలో , బీచ్ రిసార్ట్స్ లో, పూర్తి ఔట్ డోర్ లలో సినీమా షూటింగ్ లు జరుపుతున్నారు. సినీమా  టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ఆ మార్పే నేటి సినీమా సంగీతంలో కనిపిస్తోంది. అంతా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తో, గ్రాఫిక్స్ ,ఏనిమేషన్స్ తోనే సినీమా తయారౌతున్నది. గతకాలపు విలువలేవీ ఈ నాటి సినీమా కు అవసరం లేదు.

పారమౌంట్ స్టూడియోలో జరిగిన రీరికార్డింగ్ లో కొన్ని సీన్లను చూశాను. పారమౌంట్ స్టూడియో మరీ పెద్దదేం కాదు. ఆ స్టూడియో కు వెళ్ళాలంటే డైరక్ట్ బస్ సౌకర్యం లేదు. మా నాన్నగారితో కానీ, లేదా, మాస్టారి తో కానీ వెళ్ళేవాడిని. మా నాన్నగారిని , ఇతర ఆర్కెష్ట్రా వారిని తీసుకు వెళ్ళడానికి ప్రొడక్షన్ మేనేజర్  బి. సుబ్బారావు (సుబ్బు) కారో, వ్యానో తీసుకువచ్చేవారు. ఆ సుబ్బునే మాస్టారి సొంత చిత్రాలకు కూడా ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశారు.

ప్రొడక్షన్ మేనేజర్ల ఉద్యోగాలు నిరంతరం కాదు. ఆ సినీమా పూర్తి అయ్యేవరకే. వెంటవెంటనే మరో సినీమా తీసే కంపెనీ అయితే ఫర్వాలేదు. లేకపోతే జీవనం కోసం మరో సినీమా కంపెనీకోసం వెతుకులాట తప్పదు. సినీమా లోకంలో అనుభవమున్నవారు వెంటవెంటనే ఏదో కంపెనీలో చేరిపోతూంటారు. సినీమాలలో ఎవరికీ Job guarantee లేదు. ఆనాడు సినీమా నిర్మాణం most unorganized. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకున్నవారు బ్రతికి బాగుపడ్డారు. లేనివారు తెరమరుగైపోయారు.

సరి, ఇప్పుడు, 'సతీ అనసూయ' ను చూద్దాము. ఈ సినీమా రీరికార్డింగ్ మధ్యాహ్నం నుండి మర్నాటి ఉదయం వరకూ డబుల్ కాల్షీట్లు లో పనిచేసిన జ్ఞాపకం. రీరికార్డింగ్ చూడ్డానికి వెళ్ళినవాళ్ళం ఏ తొమ్మిందింటి వరకో వుండి తిరిగి వచ్చేసేవాళ్ళం. సతీ అనసూయ లో రీరికార్డింగ్ సమయంలో నేను చూసినవి,  నాకు బాగా జ్ఞాపకం వున్న సీన్లు - మనుషులు చేసిన పాపాలు పిశాచాలై పవిత్ర గంగాదేవిని పీడిస్తూ వెంటపడేప్పుడు  వచ్చే స్పెషల్ ఎఫెక్ట్స్, అత్రి మునిని కాటేయమని పార్వతీదేవి శివుడి మెడలోని నాగరాజును ఆజ్ఞాపిస్తుంది. ఆ సందర్భంలో ఆ నాగుపాము వెళుతున్నప్పుడు వచ్చే మ్యూజిక్. ఆ సీన్ లో యూనివాక్స్, ఘటసింగారి లేక పంబలాటి వాద్యం నేపథ్యంలో వినిపిస్తుంది. అనసూయ పాతివ్రత్యబలం వలన కాటేయడానికి వెళ్ళిన నాగరాజు పూలహారంగా మారేప్పుడు వినిపించే వీణ బిట్స్, సింబల్స్, బేస్ డ్రమ్స్ వంటి వాద్యాలతో నేపధ్యసంగీతం సమకూర్చారు. 

అలాగే, ఇంద్రుడు నర్మద మీదకు పంచభూతాలను ప్రయోగించి భీభత్సాన్ని సృష్టించే సమయంలో వచ్చే స్పెషల్ ఎఫెక్ట్స్, మధ్య మధ్య త్రిమూర్తులు ప్రత్యక్షం అయ్యేప్పుడు వచ్చే మ్యూజిక్, త్రిమూర్తులు పసిపాపలుగా మారడానికి ముందు, వెనక వచ్చే మ్యూజిక్ స్వయంగా రికార్డింగ్ థియేటర్లో కూర్చోని సినీమా చూస్తూ, వినడం ఆ వయసులో గొప్ప థ్రిల్లింగ్. 

నాకు సినీమా షూటింగ్ లు చూడడంలో ఏనాడు పెద్ద ఆసక్తి వుండేదికాదు. అవకాశం దొరికితే మాత్రం రీరికార్డింగ్ లకు మాత్రం తప్పక హాజరయేవాడిని.

ఈ సినీమా ప్రివ్యూ కూడా ఇంట్లో అందరం చూశాము.

1960-70ల మధ్య ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక వంటి ప్రముఖ తెలుగు వార పత్రికలు, యువ, జ్యోతి వంటి మాస పత్రికలు దసరా, దీపావళి, సంక్రాంతి సమయాలలో ప్రత్యేక సంచికలు ప్రచురించి నవలలు, కథల పోటీలు నిర్వహించి ఉత్తమ రచనలకు మొదటి బహుమతి 5000, రెండవ బహుమతి, 3000, మూడవ బహుమతి 1500/- రూపాయలు ప్రకటించి ఆయా నవలలను, కధలను ధారావాహికలుగా తమ తమ పత్రికలలో ప్రచురించేవారు. పండగల సందర్భంలో వచ్చే ఆ ప్రత్యేక సంచికలు తెరచి చూడగానే ఘాటైన ఒక సెంట్ వాసన పాఠకులను మత్తెక్కించేది. ఆ సెంట్ పేరు 'కునేగా మరికొళందు'. 

 

 


పత్రికలవారు, ఆ సెంట్ కంపెనీవారు సంయుక్తంగా తమ వ్యాపారాభివృధ్ధికోసం ఈ విధంగా ప్రజలను ఆకర్షించేవారు. 

ఒకసారి మా హైస్కూలులో మా క్లాస్ పిల్లలందరిని స్టడీ టూర్ లాటిదానికి తీసుకువెళ్ళారు. కొంతమంది మా క్లాస్ అయ్యవారితో  టి.నగర్ నుండి బస్ లో వెళితే మరికొందరు తమ సొంత వాహనాలమీద వెళ్ళారు. నేను, వెస్ట్ మాంబళం ప్యాడీఫీల్డ్ రోడ్ లో వుండే  ఎస్ ఎస్ వాసన్, వంటి పిల్లలు మరికొంతమందిని కలుపుకొని మాంబళంనుండి నడచుకుంటూ   జయరాజ్ థియేటర్ మీదుగా సైదాపేట బస్ స్టాండ్ దగ్గర  47 నెం. బస్ ఎక్కి అడయార్ లో దిగి అయ్యవారు చెప్పిన ఎడ్రస్ కు వెళ్ళాము. అదొక ఫ్యాక్టరీలాగా వుంది. ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళగానే పరిచయమున్న ఘాటైన సెంట్ వాసన తగిలింది. అది ఆంధ్రపత్రిక ప్రత్యేక సంచికల్లో వచ్చిన కునేగా సెంట్ వాసనే. ఆ ఫ్యాక్టరీ పేరు 'గంగా సోప్ ఫ్యాక్టరీ' అని జ్ఞాపకం. దీనికి సమీపంలోనే అడయార్ నుంచి OMR (Old Mahabalipuram Road) దారిలో లాటిస్ బ్రిడ్జ్ రోడ్ మీద 'ఈరోస్' సినీమాహాలు చూసిన జ్ఞాపకం.  ఇప్పుడు ఆ స్థలాలన్నీ గొప్ప రియల్ ఎస్టేట్ వెంచర్స్ గా మారిపోయాయి.
 
మేమందరం కలసి అయ్యవారితో లోపలకు వెళ్ళాము. అక్కడ ఒకాయన ఆ ఫ్యాక్టరీని అంతా చూపించి, అరవంలో సబ్బులు ఎలా చేస్తారో, ఏ ఏ కెమికల్స్ ఎంతెంత పాళ్ళలో కలుపుతారో, ద్రవపదార్ధం గట్టి సబ్బుబిళ్ళగా ఎలా మారుతుందో అన్నీ వివరించి చెప్పారు. ఆయన చెప్పింది కొంత అర్ధమయింది. కొంత కాలేదు. అప్పటికి మధ్యాహ్నం మూడు దాటింది. లోపలనుండి బయటకు వచ్చి చెట్లక్రింద మేము తెచ్చుకున్న ఫలహారాలు తినడం మొదలెట్టాము. వచ్చేప్పుడే స్కూలుకు ఎదురుగా వున్న టి.నగర్ సోషల్ క్లబ్ క్యాంటిన్ లో ఎవరికి కావలసిన టిఫిన్ వారు ప్యాక్ చేయించుకొని తెచ్చుకున్నారు. "ఆబ లావు పీక సన్నం" అని మావేపు ఒక సామెత ఉంది. తెలీసీతెలియక ఒక నాలుగు ఇడ్లీలు కట్టించాను. అక్కడ వాటిని విప్పి చూసేసరికి  బాగా చల్లారిపోయి గట్టిపడిపోయాయి. చాలా పెద్ద పెద్ద ఇడ్లీలు. దానినిండా కారప్పొడి, మంచి నూనే వేసి వుంది. వేడివేడిగా ఉన్నప్పుడైతే మహారుచిగా వుండే ఆ ఇడ్లీలను రెండుకంటే తినలేకపోయాను. మిగతావాళ్ళందరిదీ కూడా అదే పరిస్థితి. ఎవరూ తెచ్చుకున్న ఫలహారాలు పూర్తిగా తినలేదు. సగం సగం అక్కడే పారేసారు. కొంతమంది పిల్లలు తాము తిన్న ఫలహారాల ఆకులు, కాగితాలు చెత్తకుప్ప తొట్టిలో వేయకుండా తిన్నచోటే చెట్లక్రింద వదిలేయడంతో అక్కడి వాచ్ మేన్ కోపగించుకొని చీవాట్లు పెట్టాడు. మా అయ్యవారు సర్దిచెప్పి మా అందరికి శుభ్రమైన మంచి అలవాట్లు గురించి ఒక క్లాస్ తీశారు. ఆ తర్వాత, అందరం బయటకు వచ్చి అడయార్ బస్ స్టాండ్ లో  బస్సెక్కి సైదాపేట లో దిగి అక్కడ టి.నగర్ బస్ పట్టుకొని ఇంటికి చేరేసరికి బాగా చీకటి పడిపోయింది.

రామకృష్ణా స్కూల్ లో ఏన్యువల్ డే సెలిబ్రేషన్స్ ఘనంగానే సాగేవి. మేడ మీద ప్రేయర్ హాలులో గానీ, క్రిందనున్న ఖాళీ స్థలంలోగానీ జరిగేవి. ఇది పూర్తిగా మగపిల్లల స్కూల్ కావడం వలన డాన్స్ లు తప్ప మిగిలిన  సంగీతం, నాటికలు, మ్యాజిక్ వంటి కార్యక్రమాలన్నీ జరిగేవి. ఇందులో మాక్లాస్ కు చెందిన త్యాగరాజు, అతని తమ్ముడు శివశంకర్ (లింగమూర్తిగారి అబ్బాయిలు) వైలిన్, మృదంగం కార్యక్రమం తప్పనిసరిగా వుండేది. అతను త్యాగకీర్తనలు ఓ రెండు వాయించిన తరువాత సినీమా పాటలు ఓ రెండు వాయించేవాడు. ఒకటి దేవదాసు లోని 'జగమే మాయ' పాట. పాట చివరలో వచ్చే దగ్గులను కూడా వైలిన్ మీద పలికించే ప్రయత్నం చేసేవాడు. పిల్లలందరూ సంతోషంగా చప్పట్లు కొట్టేవారు. మరొక పాట మాయా బజార్ లోని 'వివాహ భోజనం' అందులో వచ్చె నవ్వులను వైలిన్ మీద వాయిస్తూంటే పిల్లలంతా కోరస్ గా పాడేవారు. చాలా సరదాగావుండేది. దేవదాసు, మాయాబజార్ రెండూ తమిళనాట దిగ్విజయం పొందిన సినీమాలు. ఆ రెండు చిత్రాలతోనూ ఘంటసాలవారి కి సంబంధం వుండడం నాకు గర్వకారణం. స్కూల్ ప్రోగ్రామ్స్ అయ్యాక ఆ సినీమాల పాటలగురించే కబుర్లు చెప్పుకుంటూ, మెల్లగా నడచుకుంటూ ఇళ్ళకు చేరుకునేవాళ్ళం.

మరిన్ని విశేషాలతో... వచ్చే వారం...   
...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

7 comments:

వడ్డాది గోపాలకృష్ణ మూర్తి said...

అయ్యా ఈనాటి ఘంటసాల గారి గురించి 35, ఉస్మాన్ రోడ్డు సంగతులు చాలా బాగా విశదీకరించారు. ఘంటసాల గారి క్రమశిక్షణ, నియమబద్ధమైన శిక్షణ గురించిన విశేషాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
ఆ నాటి పాటల రికార్డింగ్ ల రికార్డుల మరియు వాటిని పొందుపరిచే విధం అందునా ఆ పాటను అందరు ఆస్వాదించే విషయం మాకు ఎంతో ఆనందం కలిగించింది. సతీ అనసూయ పాటల మీద ఎంతో మక్కువ ఉండేది. మీరన్నట్లు ఎక్కువగా చిత్రంలోనే వినేవాళ్ళం!
నాకు ఈనాటి భాగంలో తెలుసుకున్న విశేషం గురు శ్రీ సంగీతరావుగారి పుస్తకం త్వరలో విడుదల కాబోతుందని తెలుసుకుని మహదానందం పడ్డాం! ఇటు మీ విద్యాభ్యాసం ఖాళీ సమయాల్లో అటు పాటలు వినడం రికార్డింగులకు వెళ్లడం చాలా సంతోషం వేసింది. కృతజ్ఞతలతో భవదీయుడు
వడ్డాది గోపాలకృష్ణ మూర్తి

P P Swarat said...

చాలా సంతోషం సర్.
మీకు నా ధన్యవాదాలు.

హృషీకేష్ said...

నిజంగా అదృష్టవంతులు sir. మాస్టర్ గారితో పాటు ఉండటం, studios కి వెళ్ళటం, మాష్టారి వద్దకు, సంగీతరావు గారి వద్దకు వచ్చిన మహామహులను మీరు చూడటం. బాల్యం ముచ్చట్లు చాలా interesting గా ఉన్నాయి. ధన్యవాదాలు. అభినందనలు🙏🙏హృషీకేష్

P P Swarat said...

మీకు నా ధన్యవాదాలు.

చుండి వేంకట రాజు said...

ధన్యవాదాలండి. బాగా వివరంగా వ్రాస్తున్నారు

Patrayani Prasad said...

������అన్నయ్యకు నమస్కారములు,����,

నెం.35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక ), అధ్యాయం -2 - పన్నెండవ భాగం,
26-12-2020 -
శనివారం భాగం :12*లో

వివరించిన అనుభవాలన్నీ, చాలా ఆసక్తికరంగా సాగాయి. ఎన్నో తెలియని విషయాలు, చక్కగా వివరంగా తెలియ జేసిన శ్రీ పట్రాయని ప్రణవ స్వరాట్ అన్నయ్యకు, ధన్యవాదాలు.

కధ చాలా
బాగా నడుస్తోంది. బాగుంది.

తరువాయి భాగంలో ఏముందా అనే కుతూహలం కలుగుతోంది .

వచ్చే సంచిక కోసం ఎదురుచూస్తూ ఉన్న

పట్రాయని ప్రసాద్, & కుటుంబం.
బెంగుళూరు, తేదీ:26-12-2020,
శనివారం
సమయం:
రాత్రి :గం 07:40 ని IST.

P P Swarat said...

ధన్యవాదాలు.