visitors

Saturday, December 12, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పదవ భాగం

12.12.2020 - శనివారం భాగం - 10*:
అధ్యాయం 2  భాగం 9 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
1955 ల నాటికి మెడ్రాస్ లో ఆటోరిక్షాల సౌకర్యం వచ్చినా అంత విరివిగా ఉండేవికావు. టాక్సీలే ఎక్కువగా కనిపించేవి. దగ్గర దూరాలైతే తోపుడు రిక్షాలనే ఆశ్రయించేవారు. మద్రాస్ సెంట్రల్ స్టేషన్ నుండి ఎగ్మూర్ స్టేషన్ కు వెళ్ళేత్రోవలో రిప్పన్ బిల్డింగ్ ఎదురుగా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ క్రింద, ఎవరెస్ట్ హోటల్ ను అనుకొని ఒక జట్కా స్టాండ్ వుండేది. ఆంధ్రాలోని పల్లెటూళ్ళనుండి వచ్చే యాత్రికులు తమ సైట్ సీయింగ్ కు ఈ జట్కాబళ్ళవాళ్ళనే ఆశ్రయించేవారు. అలాగే సినీమా షూటింగ్ లలో హీరోహీరోయిన్లు పాటలు పాడుకుంటూ విహారార్ధం  వెళ్ళే అలంకార గుర్రబగ్గీలు కూడా అక్కడ కనిపిస్తాయి. (ఇప్పటికీ, అంటే మొన్న మెట్రో రాని రోజుల వరకూ కూడా అక్కడ ఒక గుర్రాలశాలలాంటిది, శిధిలావస్థలోనున్న ఊరేగింపులకోసం సిద్ధంచేసే గుఱ్ఱపు బగ్గీ శకలాలు కనిపిస్తూండేవి). ఎలక్ట్రిక్ ట్రైన్స్, మెట్రో ట్రైన్స్ ఇంత అభివృద్ధి చెందినా, అప్పుడూ  ఇప్పుడూ కూడా మద్రాస్ లో సిటీ బస్సులలో ప్రయాణమే చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. ఆనాడు ఉస్మాన్ రోడ్ చాలా విశాలంగా  రెండు ప్రక్కలా చల్లని నీడనిచ్చే వృక్షాలతో ప్రశాంతంగా వుండేది. ఇప్పుడున్నంత రద్దీగానీ, గృహసముదాయాలు గానీ అప్పుడు వుండేవి కావు. పాతకాలపు మేడలు, పెంకుటిళ్ళు తీర్చిదిద్దినట్లుండేవి. మల్టీస్టోరీడ్ ఫ్లాట్ సిస్టమ్ వచ్చిన మెట్రోపోలిటన్ సిటీస్ లో ఆఖరిది మద్రాస్. ఇటీవలి కాలం వరకు ఇండిపెండెంట్ హౌస్ లు కట్టుకోవాడానికి, అలాటి ఇళ్ళలోనే అద్దెలకు ఉండడానికే మద్రాస్ ప్రజలు ఇష్టపడేవారు.

నెం.35, ఉస్మాన్ రోడ్ కు ఎదురుగా ఒక పాతకాలపు మేడ వుండేది. అది డా. నామగిరిగారిది. నామగిరి అంటే మగవాడనే చాలా రోజులు అనుకునేవాడిని. తర్వాత తెలిసింది, నామగిరి అంటే మధ్య వయసు దాటిపోయిన ఒక మహిళ అని. ఆ ఇంటికి వెనకవేపు ఖాళీస్థలంలో ఒక లాండ్రీ షాప్ ఉండేది. ఆ షాప్ వ్యాసారావు స్ట్రీట్ లోకి వస్తుంది. ఆ ఇంటికి ఎదురుగా కె వి రెడ్డిగారి ఇంటి వెనుక భాగం. అప్పట్లో ఘంటసాలవారు, కె వి రెడ్డిగారు ఇద్దరూ విజయా చిత్రాలకు పనిచేసేవారు. రాత్రిపూట వారింటి లైట్ల వెలుగును బట్టి రెడ్డిగారు స్టూడియో నుండి వచ్చారో లేదో చూసుకొని ఘంటసాల మాస్టారు రావడానికి ఎంత సమయం పడుతుందోనని అమ్మగారు నిర్ధారించుకునేవారు. మాస్టారు ఇంటికి వచ్చేవరకు పోర్టికోలోని ట్యూబ్ లైట్ వెలుగుతూండేది. అయ్యగారు ఇంటికి వచ్చిన తరువాత వాకిట్లో లైట్లు ఆర్పేసేవారు. అంతవరకూ నేను కూడా బయట వాకిట్లోనే కాలక్షేపం చేసేవాడిని. కె వి రెడ్డిగారి ముందుభాగం గేటు మురుగేశ మొదలియార్ రోడ్ లో వుండేది. ఆ వీధిని ఆనుకొని ఉస్మాన్ రోడ్ మీద ఒక నాడార్ కట్టెల అడితి. అక్కడ సమస్త వంటచెరకు, రిటైల్ లో బొగ్గులు, సరుగుడు రాటలు, వెదురు బొంగులు, నిచ్చెనలు, వంటి గృహోపకరణ వస్తువులు అమ్మేవారు. దాని యజమాని కె టి సోమసుందరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు. 1965-66 ప్రాంతంలో పార్టీ ఎమ్ ఎల్ సిగా ఎన్నికైనవాడు. ఎప్పుడూ తెల్లటి ఖధ్ధర్ బట్టలు ధరించి పదిమంది జనాలతో కనిపించేవాడు.

ఆ వీధి దాటాక కోట్స్ రోడ్. ఆ రోడ్ ను ఆనుకొని కుమారి అనే పాతకాలం నటీమణి మేడ. ఆవిడ పాత సుమంగళి, దేవత, మల్లీశ్వరి, కాళహస్తీమహత్యం వంటి సినీమాలలో నటించారు. ఆవిడ మేడ పువ్వుల డిజైన్లతో కూడిన పసుపు, ఆకుపచ్చ రంగుల అద్దాల కిటికీలతో వుండేది. ఆవిడను నేను ఎప్పుడూ ఆ ఇంట్లో చూడలేదు. అయితే, మా నాన్నగారు వాడిన మొదటి వీణ ఆవిడ దగ్గరే కొన్నారని చెప్పిన గుర్తు. ఆ మేడకు ముందో, పక్కనో ఒక హాండ్ రిక్షా స్టాండ్. మా ఇంటికి రెగ్యులర్ గా ఒక వయసైపోయిన రిక్షా అతను అక్కడే వుండేవాడు. పేరు వీరప్పన్  అని గుర్తు. అరవతనే. చాలా నెమ్మదస్తుడు. మా అమ్మగారు, సావిత్రమ్మగారు కూడా ఆ రిక్షా అతను ఉంటేనే తీసుకురమ్మనేవారు. అక్కడే, నాయర్ టీ దుకాణం. ఆ నాయర్ దుకాణం లో టీ, కాఫీ, బన్నులు, బీడీ, చుట్ట, సిగరెట్లు, వక్కపొడి, తామలపాకులు, సీవల్, పొగయిల్ (చిన్న చిన్న పుగాకు కాడలముక్కలు), తమిళం దిన పత్రికలు మొదలైనవి ఆ షాప్ లో దొరికేవి. కార్పరేషన్ ఆఫీసులలో పనిచేసే లేబర్ ఆడా, మగా పనివాళ్ళు, ఇళ్ళలో పాచిపనులు చేసే ఆడవాళ్ళు, అందరూ ఉదయాన్నే ఆ నాయర్ కొట్లో టీ తాగి, సంప్రదాయబధ్ధంగా అన్నింటితో కూడిన తమలపాకులు సేవించి, విధిగా తమిళ పత్రికలలోని వార్తలు చదివి, విని ఆ పిమ్మటే తమ తమ పనులకు బయల్దేరేవారు. ఆ రోజుల్లో మెడ్రాస్ రోడ్లమీది వీధి దీపాల స్థంభాలన్నీ చెయ్యెత్తు మేరకు తెల్లని మరకలతో నిండివుండేవి. ఆ వూరు వెళ్ళిన కొత్తల్లో లైట్ స్తంభాలకు ఆ తెల్ల మరకలు ఎందుకుండేవో తెలిసేదికాదు. మెడ్రాస్ లో అధిక సంఖ్యాకులు ఆడా, మగా ఉదయాస్తమానం వరకూ తమలపాకులు నములుతూనే వుంటారు. అది వారి సంస్కృతి లో భాగమైవుండేది. ఇతర ప్రాంతాలలోలాగా ఇక్కడ మీఠాకిళ్ళిలు, కారాకిళ్ళీలు కట్టి అమ్మే అలవాటు లేదు. ఒక అణాపెడితే ఆకు, వక్క, సీవల్, పుగయిల్, సున్నం ఇత్యాది తాంబూల సామగ్రి దొరికేది. తామలపాకులకు రాసిన సున్నం వేళ్ళను  పక్కనున్న లైట్ల స్థంభాలకు పూయడం, ఒకటి రెండు మీటర్ల దూరం ఊయడం అప్పటి వారి సంస్కృతిలో భాగం.
 
ఆ టీ స్టాల్ నాయర్ ఒక మలయాళీ. చాలా సన్నగా పొడుగ్గా మన రమణారెడ్డిగారిలా వుండేవాడు. మధ్యవయస్కుడు. చామనచాయ. ముందువేపు కొంచెం బట్టతల. వెనకాల భుజాలవరకు గిరజాలజుత్తు వేలాడుతూండేది. గళ్ళలుంగీ, చేతుల బనీన్ ధరించేవాడు. నడుముకు బిగువుగా వెడల్పాటి ఆకుపచ్చ పటకా(బెల్ట్) వుండేది. మా నాన్నగారు తన సిగరెట్లకోసం నన్ను ఆ నాయర్ కొట్టుకే పంపేవారు. నన్ను చూడగానే ఆ నాయర్ ఓ రెండు సిజర్స్ సిగరెట్లు తీసి ఒక ఖాళీ పెట్టెలో పెట్టి ఇచ్చేవాడు.  నేను నోరు తెరచి అడగవలసిన పనేలేదు. మా నాన్నగారి బ్రాండ్ అతనికి బాగా తెలుసు. పాకెట్ ఫుల్ గా సిగరెట్లు కొనిపెట్టుకునే అలవాటు మా నాన్నగారికి ఏనాడు లేదు. ఈ సిజర్స్ కు ముందు బెర్కిలీ బ్రాండ్ సిగరెట్లు కాల్చడం గుర్తుంది. (ఈ బ్రాండ్లు ITC వి. అప్పట్లో ఇంపీరియల్ టొబాకో కంపెనీ. తరువాత, ఇండియన్ టొబాకో కంపెనీగా మారింది.  ఈ ITC  ప్రింటింగ్, ప్యాకింగ్ డివిజన్ మద్రాస్ తిరువొత్తియూరు స్టేషన్ సమీపంలో రైల్లో వచ్చే వాళ్ళకు సిగరెట్ వాసనలు వెదజల్లుతూ దర్శనమిచ్చేది.ఆ రోజుల్లో ఛార్మీనార్ సిగరెట్లకు  కూడాఎక్కువ గిరాకీయే వుండేది. ఆ బ్రాండ్ వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ వారిది (VST). ఈ సిగరెట్ల పొగరెట్ల బారిన నేను ఎప్పుడూ పడలేదు. Smoking is injurious to health' అన్న statutory warning అవసరం నాకెప్పుడూ పడలేదు.

మా నాన్నగారికి జరడా కారా కిళ్ళీల అలవాటు వుండేది. అయితే ఆయన అలవాట్లన్నీ చాలా పరిమితంగా ఆయన స్వాధీనంలోనే వుండేవి. వద్దనుకుంటే ఒక్క క్షణంలో  స్విచ్ ఆఫ్ చేసినట్లు మానేసేవారు. అలాంటి నియంత్రణ చాలా తక్కువమందిలో కనిపిస్తుంది.

జరడా ఖారా కిళ్ళీలు చాలా తక్కువ షాపుల్లోనే దొరికేవి.  అలా దొరికే ఒకే ఒక షాపు పాండీబజార్ మొదట్లో వుండే కైలాసం షాపు. దానిని ఆంధ్రా కిళ్ళీ షాపు అనేవారు. టి.నగర్ ప్రాంతంలో ఈ అలవాటున్న తెలుగువారంతా అక్కడికి చేరేవారు. గీతా కేఫ్, నారాయణ కేఫ్ లలో కాఫీ టిఫిన్లు ముగించుకొని సిగరెట్లు, ఖారాకిళ్ళీల కార్యక్రమం కైలాసం ఆంధ్రా కిళ్ళీషాప్ దగ్గర పెట్టేవారు. నారాయణ కేఫ్ ప్రముఖ నటుడు సి ఎస్ ఆర్ గారికి కేరాఫ్ ఎడ్రస్. నారాయణ కేఫ్ లో టిఫిన్ కాఫీలు సేవించి వచ్చి బయట చెట్టుక్రింద తన బ్రౌన్ కలర్ బ్యూక్ కారును ఆనుకొని చిద్విలాసంగా సిగరెట్ పీలుస్తూ చుట్టూ చేరిన జనాలతో పిచ్చాపాటి సాగించడం సి.ఎస్.ఆర్.గారి నిత్యకృత్యం. ఆంధ్రానుండి వచ్చే తెలుగు సినిమా అభిమాన యాత్రికులకు ఒక అపురూప దృశ్యం. ఆయన ఇల్లు తేనాంపేట ఎల్డామ్స్ రోడ్ లోఎక్కడో వుండేది. కానీ, సిఎస్ ఆర్ గారిని కలుసుకోవాలంటే మాత్రం ఉదయాన్నే నారాయణ కేఫ్ కు వస్తే తప్పక దొరికేవారు. ఇప్పుడు ఆ నారాయణ కేఫ్ లేదు, దానిముందు చెట్టులేదు, చెట్టుక్రింద కారు, కారును ఆనుకొని కబుర్లు చెప్పే సిఎస్ ఆర్ లేరు, ఆ తరం మనుషులెవరూ లేరు. ఇప్పుడు ఆ హోటల్ స్థానంలో అడయార్ ఆనందభవన్ వారి స్టార్ స్వీట్ స్టాల్, దానికి అనుబంధ రెస్టారెంట్ వెలసాయి. 

స్కూల్ కు వెళ్ళే త్రోవలో  పానగల్ పార్క్ బయట చాలా పెద్ద చెట్లుండేవి అందులో ఒక చెట్టుకు దట్టంగా ఆకుపచ్చ రంగులో సన్నటిగొట్టంతో నాలుగైదు తెల్లరేకుల పువ్వులుండేవి. వచ్చేపోయే జనాలమీద పూలజల్లు కురిపిస్తూండేవి. అది దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే నెత్తిమీద ఠంగుమని మొట్టికాయ పడేది. కంగారుగా నాలుపక్కలా చూస్తే గుబురుగా ఊలుబంతి లాటి తెల్లటిపువ్వు. ఆ పువ్వు కాడ చాలా పొడుగుగావుండేది. ఆ పువ్వును చేతిలోకి తీసుకోగానే రేకలన్నీ విడిపోయి ఒక  చిన్న తెల్లటి కాయ బయటపడేది. ఆ కాయ చాలా గట్టిగావుండేది. ఆ కాయ తగిలితే చాలు  ప్రాణం పోయేంత పనేయ్యేది. అలాటి చెట్లు రెండువుండేవి. వాటిక్రిందనుండి వెళ్ళేప్పుడు క్రిందికి పైకి చూస్తూ జాగ్రత్తగా నడవవలసి వచ్చేది. క్లాసులోని కొంతమంది కొంటెపిల్లలు ఆ కాయలతో నెత్తిమీద, మోచేతి ఎముకలమీద, వేళ్ళ కణుపుల మీద కొడుతూ అవతలవాళ్ళు నొప్పితో  ఏడవడం ఒక్కటే తక్కువగా బాధపడుతూంటే చూసి హింసానందం పొందేవారు. కొందరు మాటలతో హింసిస్తారు. కొందరు చేష్టలతో హింసిస్తారు. బలవంతుడి చేతిలో బలహీనుడు ఎప్పుడూ లోకువే. పానగల్ పార్క్ కు నాలుగు పక్కలా ఇనపగేట్లున్నాయి. మూడు పక్కల గేట్లు సాయంత్రం వరకు తాళాలు వేసి మూసేవుంటాయి. స్కూలుకు చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళంకాదు. ఇనపగేటుకు ఇటిక స్థంభాలకు మధ్య పిల్లలు దూరేంత ఖాళీస్థలం వుండేది. ఆ స్థలంలోనుండి పార్క్ లోకి వెళ్ళి మెయిన్ గేటు ద్వారా స్కూలుకు వెళ్ళేవాళ్ళం. పానగల్ పార్క్ లో చాలా పొగడ చెట్లుండేవి. ఆ చెట్లపువ్వులన్ని ఉదయం అయేసరికి క్రిందకు రాలి నేలంతా దట్టంగా గోధుమ రంగు తివాసిలా పరచుకునివుండేది. చల్లటిగాలి, పొగడపూల పరిమళం మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా వుండేది. 

రామకృష్ణా మిషన్ హైస్కూల్ లో చదివేప్పుడు చాలామంది పిల్లలే పరిచయం అయ్యారు. మా ఇంటి వరసలోనే నార్త్ ఉస్మాన్ రోడ్ లోనే, బజుల్లా రోడ్ కు ముందు అల్లాడి రామచంద్రన్ అని ఒక అబ్బాయి. తండ్రి సహస్రనామంగారు, అన్నగారు శంకరన్ ఇద్దరూ పేరుమోసిన అడ్వొకేట్లు. వారింటి మేడమీది భాగం చాలాకాలంపాటు అసంపూర్తి కట్టడంగానే మిగిలిపోయింది. కారణం తెలియదు. ఆ రామచంద్రన్ చాలా తెలివైనవాడు. పెద్దయ్యాక వివేకానందా కాలేజీ ప్రొఫెసర్ అయ్యాడు. శ్రీధర్ అనే అబ్బాయి కోడంబాక్కం ట్రస్ట్ పురం నుండి నడుచుకుంటూ మా ఇంటి గేటు ముందు నిలబడేవాడు. ఇద్దరం కలసి స్కూలుకు వెళ్ళేవాళ్ళం. అతని తండ్రి ధనికొండ హనుమంతరావు గారు. సుప్రసిధ్ధ కధా రచయిత. జార్జ్ టౌన్ లో క్రాంతి ప్రెస్ కు యజమాని. సౌత్ ఉస్మాన్ రోడ్ చివర శివాజీ స్ట్రీట్ నుండి అమాత్య అనే కుర్రవాడు వచ్చేవాడు. పూర్తిపేరు గుర్తులేదు. చాలా సన్నగా, తెల్లగావుండేవాడు. మంచి మృదుస్వభావి. అతని తెలుగు అర్ధమయేది. మా ఇద్దరికి స్నేహం కలసింది, ఆ స్కూల్ లో చదివినంతకాలం. తరువాత, కొన్ని దశాబ్దాలకు తెలిసింది అమాత్య 'చందమామ' రామారావు (అందులో మేనేజర్) గారి అబ్బాయని. రామారావు గారు టివికె శాస్త్రిగారికి, రావి కొండలరావు గారికి మంచి మిత్రుడు. అలాగే, వెస్ట్ మాంబళం నుండి ఎస్ ఎస్ వాసన్ అనే కుర్రవాడు. అతని తెలుగు అరవ యాసే అయినా అతనితో స్నేహం బాగానే కుదిరింది. స్కూల్ వదిలాక శారదా హైస్కూల్ వరకు కలిసే వెళ్ళేవాళ్ళం. అతను అక్కడ ఆగిపోయేవాడు. అతని అక్క ఆ స్కూల్ లో చదివేది. ఆ అమ్మాయి వచ్చేవరకు వుండి, ఆమెతో కలిసి ఇంటికి వెళ్ళేవాడు. 'నీ పేరు ఎస్ ఎస్ వాసన్. జెమిని స్టూడియో నీదే కదా, ఈ పక్కనే వున్న వాసన్ స్ట్రీట్ నీదే. కష్టపడి వెస్ట్ మాంబళం వరకు ఎందుకు, వాసన్ స్ట్రీట్ లోకి వచ్చెయ్యొచ్చు కదా' అని అనేవాడిని, అదేదో గొప్ప జోకులా. నా మాట అర్ధమయేదో లేదో కానీ ఓ నవ్వు పారేసేవాడు. వీళ్ళేకాక, శ్యామసుందర్లాల్ (అతనిల్లు జి.ఎన్ చెట్టి రోడ్ లో రామకృష్ణా గ్రౌండ్స్ వెనకాల చాలా పెద్ద మేడ. వారింట్లో దట్టంగా సంపెంగ చెట్లుండేవి. దొరైసామీ రోడ్ నుండి వచ్చే యతిరాజులు, శేషశాయి, శేషగిరి వెంకటగిరి( పెద్దయ్యాక సి.ఎ. చేసి పెద్ద కన్సల్టెన్సీ నడిపాడు), విజయరాఘవాచారి రోడ్ లోని డి.ఎస్ శాస్త్రిగారి అబ్బాయి; సుబ్రి అనే సుబ్రహ్మణ్యం, నుంగబాక్కం నుండి వచ్చే చల్లావారి అబ్బాయి (పేరు గుర్తు లేదు). అతని అన్నగారు రాజశ్రీ ప్రొడక్షన్స్ లో ఆఫీస్ మేనేజర్ గా పనిచేసేవారు. అలాగే, మా ఇంటికి ఎదురు వీధి వ్యాసారావు స్ట్రీట్ చివరన వుండే నటుడు రమణారెడ్డిగారి అబ్బాయి ప్రభాకరరెడ్డి, తిరుమూర్తి స్ట్రీట్ నుండి ఒక అబ్బాయి వచ్చేవాడు. అతను శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రిగారి మేనల్లుడు. అలాగే శ్రీ ముదిగొండలింగమూర్తిగారి ఆఖరి ఇద్దరు అబ్బాయిలు మాస్కూల్ లోనే చదివేవారు. పెద్దతను మా క్లాస్ మేట్. త్యాగరాజనుకుంటాను. తమ్ముడు శివశంకర్, అన్నదమ్ములు ఇద్దరూ వైలిన్, మృదంగాలమీద శాస్త్రీయ సంగీత సాధన చేసేవారు. వాళ్ళ ఇల్లు స్కూలుకు ఆనుకొనివుండే నానారావు నాయుడు వీధి చివరలో వుండేవారు. ఆ వీధి టి.నగర్ పోస్టాఫీస్ కు, పాండీబజార్ కు వెడుతుంది.  స్కూలు అయ్యాక చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు లింగమూర్తిగారు కూడా సంధ్యావందనం చేసుకుంటూ కనిపించేవారు. ఆయన సినీమా నటుడంటే నమ్మలేనట్లుండేవారు.

అలాగే మొసలికంటి శరత్చంద్రకుమార్ మా స్కూలుకు ఒక స్టార్ అట్రాక్షన్. బాల నటుడిగా కొన్ని సినిమాలలో ప్రముఖ పాత్రలు వహించాడు. అంతేకాదు. అతను మంచి కర్నాటిక్ క్లాసికల్ వైలినిస్ట్. అతను విజయనగరం ద్వారం వారి శిష్యుడు. ఆయన పినతండ్రి ఎమ్ ఎస్ రావుగారు ఘంటసాలగారి పార్టీలో, కోదండపాణి పార్టీలో వైలినిస్ట్. తరువాత కాలంలో ఆయన కూడా శ్రీ వెంపటి చినసత్యంగారి నృత్యనాటకాలకు వైలిన్ వాయించేవారు. ఈ శరత్చంద్రకుమార్ మన మాస్టారి రెండో అబ్బాయి రత్నకుమార్ కు వైలిన్ గురువు. మౌంట్ రోడ్డులోని బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరిలో పనిచేసేవారు.

ఇలా చాలమంది తెలుగు పిల్లలు మా క్లాస్ లో వుండేవారు. ఈ పిల్లలంతా స్కూలు ప్రారంభం కావడానికి ఒక గంటముందే పార్క్ లో చేరి బొంగరాలాట, గోళీలాట మొదలెట్టేవాళ్ళు. అన్నిటికంటే 'నుండీ' (ఒంటికాలిమీద పరిగెడుతూ ఇతరులను తాకడం) ఆట చాలా పోటాపోటీగా ఆడేవాళ్ళు. 

నేను రామకృష్ణా మిషన్ లో చదివేప్పుడు తెలుగు విద్యార్ధులందరికీ చుక్కల్లో చంద్రుడిలా ఒక అబ్బాయి వెలిగిపోతూండేవాడు. నాకు ఒకటో రెండో క్లాసులు సీనియర్. ఎర్రటి హంబర్ సైకిల్ మీద బజుల్లా రోడ్ నుండి వచ్చేవాడు. రోజూ చూసేవాడిని, కానీ పరిచయం కలగలేదు. పేరు రామకృష్ణ. అతని చుట్టూ చాలా స్నేహబృందమే వుండేది. అందుకు కారణం తరువాత తెలిసింది. ఆ అబ్బాయి సుప్రసిద్ధ నటుడు ఎన్ టి రామారావు గారి పెద్ద అబ్బాయని. (పాపం! ఆ రామకృష్ణ 1962లో  వాళ్ళ తాతగారింటికి నిమ్మకూరు వెళ్ళి అక్కడ  చాలా అర్ధాంతరంగా కాలంచేశాడు. అసలు కారణం తెలియదు. కానీ నేను వినడం సన్ స్ట్రోక్ వల్ల చనిపోయాడని. ఏమైనా  ఈ దుర్మరణం రామారావు గారి దంపతులకు తట్టుకోలేని విఘాతమే. అతని పేరుమీదుగానే ఎన్ టి రామారావు గారు హైదరాబాద్ లో రామకృష్ణా హార్టీకల్చరల్   సినీమా స్టూడియో నిర్మించారు).

1957వ సంవత్సరంలో 'నెం.35,ఉస్మాన్ రోడ్' లో చాలా సంఘటనలు చోటుచేసుకున్నాయి. సంగీతదర్శకుడిగా ఘంటసాల మాస్టారికి 1957 చాలా విజయవంతమైన సంవత్సరం. ఆ ఏడాది మాస్టారివి ఐదు సినీమాలు విడుదలై మంచి విజయం సాధించాయి. అలాటివాటిలో ఒక సినీమా గురించి గత వారం ముచ్చటించడం జరిగింది. అదే వినాయకచవితి. ఈ వారం, ఘంటసాలవారి సంగీతదర్శకత్వంలో వచ్చిన మరో సెన్సేషనల్, ఆల్ టైమ్ రికార్డ్ సినీమా 'మాయాబజార్' సినీమా గురించి కొన్ని విశేషాలు. 'మాయాబజార్' విజయం గురించి సాధన గురించి, సంగీతపరంగా అందులోని పాటల గురించి నెలకొల్పిన రికార్డ్ ల గురించి మీ అందరికీ బాగా తెలిసిందే. నేను ప్రత్యేకించి చెప్పేదేమీ లేదు. మాయాబజార్ సినీమా వినాయక చవితి కంటే ఒక ఐదు మాసాలు ముందే రిలీజయింది. 1957 మార్చ్ 27 న మాయాబజార్ సినీమా విడుదలయింది. 

అంతకు పదిరోజుల ముందు నెం.35, ఉస్మాన్ రోడ్ లో ఒక శుభకార్యం చోటుచేసుకున్నది. మార్చ్ 17  రాత్రి  మా ఇంట శిశూదయం. మాకు తమ్ముడు పుట్టాడు. ఘంటసాలవారి లోగిట్లో నాలగవ శిశువు. మా తమ్ముడు పుట్టిన సమయంలో 'మాయాబజార్' క్లైమాక్స్ రీరికార్డింగ్ జరుగుతున్నది. ఆ సమయంలో ఘంటసాల మాస్టారు వాహినీ స్టూడియో లో వున్నారు. రాత్రంతా రీరికార్డింగ్ ముగించుకొని ఉదయం ఇంటికి చేరారు. మాస్టారు ఇంటికి రాగానే సావిత్రమ్మగారు ఈ శుభవార్తను మాస్టారికి తెలియజేశారు. ఆయన చాలా సంతోషించి ఈ పిల్లవాడు పుట్టిన సమయంలో రాత్రి స్టూడియోలో శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనం, దాని తరువాత వచ్చే క్లైమాక్స్ రీరికార్డింగ్ చేస్తూవున్నామని, అదే సమయంలో మన ఇంట గోపాలకృష్ణుడే జన్మించాడని అందుచేత, పిల్లవాడి పేరు గోపాలకృష్ణ అని సంతోషంగా ప్రకటించారట. మా తమ్ముడికి 'గోపాలకృష్ణ' పేరే పెట్టడం జరిగింది. 



బాలసారె రోజునో, అ తరువాతో గుర్తులేదు కానీ  ఘంటసాల మాస్టారు మా తమ్ముడికి తన పేరు, వాడిపేరు కలిసి వచ్చేలా నీలం రంగు 'G' అక్షరం గల ఒక ఉంగరాన్ని బహుకరించారు. మాస్టారు వాడిని ముద్దుగా చూసేవారు. వాడికి ఆరు మాసాలు వచ్చాక, ఆయనకు తీరికున్న సమయాలలో మా గోపిని తన గుండెల మీద కూర్చోపెట్టుకొని ముచ్చట్లాడేవారు.


ఘంటసాలగారు ఎత్తుకుని ఆడించినప్పటి గోపాలకృష్ణ

మాయాబజార్ చిత్రం పాటల రికార్డింగ్, రీరికార్డింగ్ లకు సంబంధించి నాకు ప్రత్యక్ష అనుభావాలు లేవు. కానీ నేను విన్న విషయం ఒకటుంది. మాస్టారి పెద్దబ్బాయి విజయకుమార్ కు చిన్నప్పటి నుండి లయజ్ఞానం బాగా వుండేదని అనుకునేవారు. అప్పుడప్పుడు మాస్టారు సంగీతం చేసే సినిమాల రికార్డింగ్ లు, రీరికార్డింగ్ లలో ఫైనల్ టేక్ వరకు రిధిమ్స్ సెక్షన్లో ఏదో ఒక వాద్యాన్ని తీసుకొని వాయించేవాడు. అంత చిన్న వయసులో అంత చక్కగా వాయించడం చూసి  అందరూ ముచ్చటపడేవారు. ఫైనల్ టేక్ లో మాత్రం వేరే ఆర్కెష్ట్రావారు వాయించేవారు. అలాగే, మాయాబజార్ సినీమాలో రధం గుర్రపు డెక్కల చప్పుళ్ళు మాస్టారి పెద్దబాబు వినిపించాడని అనేవారు. ఈ మాయాబజార్ విషయం తెలియదు, కానీ, వేరే సినీమా రీరికార్డింగ్ లో చూసాను. ఒక చిన్న కర్ర పలకమీద దట్టంగా ఇసుకపర్చి దానిమీద రెండు కొబ్బరిచిప్పలను బోర్లించి లయబధ్ధంగా చేతితో వాయిస్తే గుర్రపుడెక్కల చప్పుడు వచ్చేది. ఇప్పుడున్నన్ని ఎలక్ట్రానిక్ వాద్యపరికరాలు ఆ రోజుల్లో వుండేవి కావు. మామూలుగా దొరికే వస్తువులుతోనే కావలసిన సౌండ్ ఎఫెక్ట్స్ రాబట్టేవారు. గుహల తలుపులు తెరవడానికి బెలూన్లు; పక్షుల అరుపులకోసం ప్లాస్టిక్ చిలకబొమ్మలలో నీరుపోసి వేళ్ళు అడ్డంపెట్టి ఊదితే రకరకాల పక్షుల సౌండ్స్ వినిపించేవి. ఆకాశంలో ఉరుములు, పిడుగుల చప్పుళ్ళకి పల్చటి టిన్ షీట్లను మైకు ముందు టైమింగ్ ప్రకారం ఝాడిస్తే ఉరుముల్లా వినపడేవి. అలాగే రంపంమీద వైలిన్ కమాన్ పెట్టి వాయిస్తే కొన్ని భయంకరమైన సౌండ్స్ పుట్టేవి. అయితే ఈ రకమైన ఎఫెక్ట్స్ వాయించడానికి కూడా కృషి, సాధన, నేర్పు కావాలి. ప్రతి ఆర్కెష్ట్రా లో రిథిమ్ సెక్షన్లో ఇలాటి సౌండ్ ఎఫెక్ట్ స్పెషలిస్ట్ లు వుండేవారు. పెద్దబాబు చిన్నప్పుడు సరదాగా రిహార్సల్స్ టైములో మొరాకోస్, కబాష్, టాంబొరిన్, వంటి వాద్యాలను వాయించేవాడు. పెద్దయ్యాక పియోనో వాద్యం మీద మంచి పట్టు సాధించి తన తండ్రిగారి పాటలకు పియోనా వాయించాడు. ఆ విశేషాలన్నీ మరోసారి చూద్దాము.



మాయాబజార్ సినిమా విడుదలకు ముందు స్టూడియో లో చాలాసార్లు ప్రివ్యూలు వేసారు. నేను స్టూడియోలోనే మూడుసార్లు చూసిన గుర్తు. సినీమా ప్రివ్యూ పూర్తికాగానే ఆ సినీమా కు సంబంధించిన ముఖ్యులంతా వరసగా ధియేటర్ బయట నిలబడగా,  సినీమా చూడడానికి వచ్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, గాయకులు, పత్రికలవారు ఒక్కొక్కరుగా వచ్చి దర్శక నిర్మాతలకు, ముఖ్య నటులకు, సంగీత దర్శకునికి తమ అభినందనలను తెలిపారు. మాయాబజార్ చూసినవారిదంతా ఒకే అభిప్రాయం.' సినీమా అధ్భుతం. నూరు రోజులు గ్యారంటీ'. 


      మాయాబజార్ లో మోహినీ భస్మాసుర నృత్య రూపకం

ఆ రోజున శ్రీసాలూరి రాజేశ్వరరావు గారు మాస్టారిని గట్టిగ వాటేసుకొని "మాస్టారు సంగీతం చాలా బాగా వచ్చింది. అన్నిపాటలు హిట్టవుతాయి" అని సంతోషంతో మాస్టారి చేతులు పట్టుకొని అన్న మాటలు నాకు బాగాగుర్తు. 

మాయాబజార్ చిత్రాన్ని ఘంటసాల మాస్టారి గురువుగారైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారి కి విజయనగరంలో ఆయన స్నేహితులు, శిష్యులు పట్టుపట్టి బలవంతాన తీసుకువెళ్ళి చూపించారని, గురువుగారు ఆ సినీమా చూసి చాలా సంతోషించారని వినికిడి. తన శిష్యుడి అభివృద్ధిని, ప్రతిభను స్వయంగా చూడగలిగారు.

మరిన్ని విషయాలతో వచ్చేవారం... 
                    ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.


13 comments:

వడ్డాది గోపాలకృష్ణ మూర్తి said...

మహాశయా, నేటి ఉస్మాన్ రోడ్డు 35 రెండవ భాగంలోని పదవ విభాగం ఎన్నో విశేషాలతో కూడుకొని ఉంది. అప్పటి ఆ చాలా ప్రాచుర్యం మరియు స్థల ప్రాశస్త్యం ఇంకా స్థల పరిచయం బాగా విశకరించారు. మధ్యలో సి ఎస్ ఆర్ గారు ముదిగొండ లింగమూర్తి గారు వారి పరిచయాలు చాలా బాగున్నాయి. చిరంజీవి గోపాలకృష్ణ ఉదయం అతని చిన్న "చిన్న తనం" ఘంటసాల గారి గుండెలమీద గడపడం చాలా బాగుంది. అంతలో మాయాబజార్ విశేషాలు ఇంకా విజయకుమార్ బాల్యం హృద్యంగా అమరేయి. నందమూరి రామకృష్ణ గూర్చి చాలా బాగా బాధ్యతగా వ్రాసేరు. వయోల్నిస్ట్ మొసలికంటి శరత్ చంద్ర కుమార్ గతంలో కొద్దిగా విన్నాము ఇప్పుడు వివరంగా మీ ద్వారా ఇతర వివరాలు పొంద గలిగేము. ధన్యోహం!

వెంకట మహేష్ బాబు సంబటూరి said...

అత్యద్భుతమైన ఎపిసోడ్ స్వరాట్ బాబాయ్ గారూ...... 👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👍👍😊😊💐💐🙏🙏

ఇన్ని దశాబ్దాల తరువాత కూడా మీరు ఆ నాటి మదరాసు మహానగరంలోని వివిధ ల్యాండ్ మార్క్ ల గురించి.... కేఫ్ ల గురించి.... కిళ్లీ కొట్ల గురించి.... మీతో చదువుకున్న సహాధ్యాయుల గురించీ ఎంతో చక్కగా గుర్తు పెట్టుకుని ఇంత విపులంగా చెప్పగలిగారంటే.... ఆహా... మీ జ్ఞాపకశక్తి కి మనసారా జేజేలు 👏👏👏👏👏🙏🙏😊😊.....సి ఎస్ ఆర్ గారు... లింగమూర్తి గారు వంటి గొప్ప నటులు గురించి.... మాయాబజార్ సినిమా మేకింగ్ విశేషాలు చదువుతూ ఉంటే ఎంతో ఆసక్తిదాయకం గా ఉన్నాయి 😊👌👌👌👌👌👌👌👌😊

ఘంటసాల గారి జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకునేందుకు వచ్చే శనివారం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూంటాను స్వరాట్ బాబాయ్ గారూ 😊🙏🙏😊👍👍😊💐💐😊

P P Swarat said...

శ్రీ వడ్డాది గోపాలకృష్ణ మూర్తిగారికి ధన్యవాదాలు.

P P Swarat said...

శ్రీ మహేష్ బాబుగారికి ధన్యవాదాలు.

R N Nandyal said...

Without missing even a small detail you have described the happenings to the delight of the readers.You have an enviable memory.It adds to the knowledge of the readers
Ranganath Nandyal

P P Swarat said...

Thank you very much for your kind appreciation.

నాగరాజు కెవియస్ said...

ధన్యవాదాలు సర్...మరో అపురూపమైన జ్ఞాపకాన్ని మాతో పంచుకున్నందుకు...మీ జ్ఞాపకశక్తి అమోఘం...ప్రతి వారం మీరు పంచుతున్న నెం.35 ఉస్మాన్ రోడ్...ఎన్ని సార్లు చదువుతున్నా, మళ్ళీ మళ్ళీ చదివాలనిపిస్తోంది.
మరో మారు మీకు ధన్యవాదాలు స్వరాట్ సర్🙏🏻

నాగరాజు కెవియస్ హైదరాబాద్

P P Swarat said...

ధన్యవాదాలు.

ameerjan said...

నమస్తే స్వరాట్ గారు!
ఈ ఎపిసోడ్ లో మీరెన్నెన్నో సూక్ష్మమైన వివరాలు కూడ వివరంగా చెప్పడం చాల ఆశ్చర్యం కలిగించింది. తమిళుల తమలపాకు సంస్కృతి, స్థంభాలకు సున్నం రాయడాలు, నాయర్ టీ కొట్టు, పానగల్ పార్కులో చెట్లు, గేట్లు, మీ సహాధ్యాయుల వివరాలు పేర్లతో సహా తెలియజెప్పడం; మాయాబజార్ విశేషాలు...పూసగుచ్చిన విధంగా తెలియజెప్పడం! హ్యాట్సాఫ్ మాస్టారూ!!
మళ్ళీ శనివారం మీ బ్లాగు దర్శనం కోసం ఎదురు చూస్తూ....

అమీర్ జాన్ షేక్, హైద్రాబాద్
12/12/2020

P P Swarat said...

మీ అభినందనలకు కృతజ్ఞతలు.

Patrayani Prasad said...

👆🙏🙏అన్నయ్యకు నమస్కారములు,🙏🙏,

నెం.35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక ), అధ్యాయం -2 - పదవ భాగం, 12-12-2020 -
శనివారం భాగం :10 * లో

వివరించిన అనుభవాలన్నీ, చాలా ఆసక్తికరంగా సాగాయి. ఎన్నో తెలియని విషయాలు, చక్కగా వివరంగా తెలియ జేసిన శ్రీ పట్రాయని ప్రణవ స్వరాట్ అన్నయ్యకు, ధన్యవాదాలు.

కధ చాలా
బాగా నడుస్తోంది. బాగుంది. తరువాయి భాగంలో ఏముందా అనే కుతూహలం కలుగుతోంది .
వచ్చే సంచిక కోసం ఎదురుచూస్తూ ఉన్న

పట్రాయని ప్రసాద్, & కుటుంబం.
బెంగుళూరు, తేదీ:18-12-2020,
శుక్రవారం
సమయం:
సాయంత్రం: గం 05:15 ని IST.

P P Swarat said...

అభినందనకు ధన్యవాదాలు.

హృషీకేష్ said...

మంచి ఉత్సాహాభరితంగా సాగుతోంది sir మీ ధారావాహిక. ప్రతీ చిన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని రాయటం సామాన్యం కాదు. అద్భుతం. అభినందనలు!!🙏🙏