21.03.2021 - ఆదివారం భాగం - 23*:
అధ్యాయం 2 భాగం 22 ఇక్కడ
నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
"లవకుశ ప్లాప్ అయిందట" రావమ్మ కబురు. మురుగేశ మొదలియార్ స్ట్రీట్ మొగలోనున్న నాడార్ కట్టెల అడితి దగ్గర గోడకు అంటించివున్న ఏవో తమిళ సినీమా వాల్ పోస్టర్లు చూస్తూంటే చెప్పింది. రావమ్మ చెప్పిన వార్త నాకు రుచించలేదు. కారణం, లవకుశ సంగీతం ఘంటసాలగారిది.
"నీకెలా తెలుసు?" అని కొంచెం కోపంగా అడిగాను.
"మా నాన్నే చెప్పారు" అని అంది.
"మీ నాన్నగారు కూడా ఆ సినీమాకు పనిచేశారు కదా! ప్లాప్ అంటున్నావే" అని అడిగాను.
నా మాటలు రావమ్మకు అర్ధం కాలేదు. ఆ టాపిక్ అక్కడితో ఆపేసి మౌనంగా ఇంటికి వచ్చాము.
ఆ రోజుల్లో ఎవరైనా ఘంటసాల మాస్టారు సంగీతం నిర్వహించిన సినీమాలలోని పాటల గురించి విమర్శించినా, ఆ సినీమాలు ఫెయిల్యూర్ అయాయని పత్రికల్లో వార్తలు చదివినా వాళ్ళమీద విపరీతమైన కోపం వచ్చేది. ఘంటసాల గారు చేసిన సినీమాలు బాగులేవని ఎలా అంటారు అని ఆవేశపడేవాడిని. ఈ రకమైన వార్తలు, విమర్శలను చదివినా, విన్నా కూడా ఘంటసాల మాస్టారిలో పెద్ద ప్రతిస్పందన కనిపించేదికాదు. ఒక చిత్రంలోని పాటలు బహుళ జనాదరణ పొందకపోయినా, ఆ సినీమాలు పరాజయం పొందినా అందుకు అనేక కారణాలుంటాయి. ఏ ఒక్క వ్యక్తివల్లో సినీమా హిట్ కాదు. అందుచేత సినీమా పాటలు/సినీమా జయాపజయాల విషయంలో ఘంటసాల మాస్టారు నిర్లిప్తంగా వ్యవహరించేవారు. పాటల స్వరరచన విషయంలో తనకు గల ప్రతిభతో అనుభవంతో సంపూర్ణన్యాయం చేకూర్చడానికి తన వంతు కృషి చేసేవారు. మన కర్తవ్యం మనం ఆచరించాలి. జయాపజయాలు దైవాధీనాలు అనే భావం కలిగివుండాలి. అనుభవ రహితమైన వీరావేశం పొందడంలో, ఉక్రోషపడడంలో ఏమాత్రం అర్ధంలేదని కొంత వయసు,ఆలోచనాపరిధి పెరిగాక గానీ తెలిసిరాలేదు. సినీమా ప్రపంచంలోని నటీనటులు, గాయకులు, దర్శకులు, సమాజంలోని ప్రముఖ వ్యక్తుల విషయంలో ఆరాధన, గౌరవాభిమానాలు కలిగివుండవచ్చు. వారిని తమ ఆదర్శ పురుషులుగా స్వీకరించవచ్చును. వారిగురించి తమ ప్రేమాభిమానాలను తమకు తోచినవిధంగా ప్రకటించుకోవచ్చు. తప్పులేదు. కానీ తన భావాలే, అభిప్రాయాలే ఇతరులు కూడా కలిగివుండాలని నిర్బంధించడం సమంజసం కాదు.
తన అభిమానులు, అభిమాన సంఘప్రతినిధులమంటూ వచ్చేవారందరికీ ఘంటసాల మాస్టారు ఒకే మాట చెప్పేవారు. ఉత్తమమైన సంగీతాన్ని ఎవరు పాడినా మెచ్చుకోవాలి. ఆదరించాలి. వారిని గౌరవించడం తెలుసుకోవాలి. అభిమానం పేరిట దురభిమానం పెంచి మన సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలిగించకూడదని హితవు పలికేవారు.
సరి, ఇక లవకుశ విషయానికి వద్దాము.
లవకుశ సినీమాను తెలుపు నలుపులలో 1934లో ఈస్టిండియా కంపెనీ వారు మొదటిసారి గా తీశారు. సీనియర్ శ్రీరంజని సీతగా, పారుపల్లి సుబ్బారావు రాముడుగా నటించారు. ఆ చిత్రానికి దర్శకుడు సి.పుల్లయ్య. ఆ లవకుశ సినీమా తెలుగునాట పెద్ద ప్రభంజనం సృష్టించింది. శ్రీరంజనిని అభినవ సీతగా అందలమెక్కించి ఆరాధించారు. అదే ఉత్తర రామచరిత్ర కధను మరల పాతిక సంవత్సరాల తర్వాత ఎ.శంకరరెడ్డి రంగులలో ఎన్ టి రామారావు , అంజలీదేవిలతో తీయ సంకల్పించారు. బహుశా దీనికి బీజం తాను తీసిన చరణదాసి సినీమాలోనే పడిందేమో. ఆ సినిమాలో వచ్చే ఒక డ్రీమ్ సీక్వెన్స్ లో ఎన్.టి.ఆర్ రాముడిగా, అంజలీదేవి సీతగా ఒక యుగళగీతాన్ని (మురిసేను లోకాలు కనుమా") ఆలపిస్తారు. అదే పి.సుశీల, ఘంటసాల మాస్టారు (ఇద్దరు మాత్రమే) తొలి పూర్తి యుగళగీతంగా చెపుతారు.
ఈ సినీమా విడుదలైన మరుసటి సంవత్సరమే "లవకుశ" సినీమా రంగులలో తీయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు నిర్మాత శంకరరెడ్డి. పాత లవకుశ డైరక్ట్ చేసిన సి. పుల్లయ్యగారే దర్శకుడు. తెలుగు తమిళ భాషలలో మొదలుపెట్టారు. రెండు భాషలలో సంగీత దర్శకుడిగా ఘంటసాల నియమితులయ్యారు. సముద్రాల సీనీయర్ పాటలు. ప్రసిధ్ధి పొందిన రామాయణ కధావస్తువుగా ఈ సినీమాలో సంగీతం ప్రధానపాత్ర వహించింది. ఘంటసాల మాస్టారు 'మాస్టర్' గౌరవానికి తనను మించినవారు లేరని నిరూపించుకున్నారు. సినీమాలో అధికశాతం పాటలు, పద్యాలు, రీరికార్డింగే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే లవకుశ చిత్ర నిర్మాణం ఏమాత్రం సులభంగా సాగలేదు. భారీసెట్లతో, రంగుల చిత్రంకావడంతో అనుకున్నదానికంటే బడ్జెట్ పెరిగిపోయింది. సమయానికి తగినంత డబ్బు లభించక కాలాయాపనజరిగింది. తెలుగు,తమిళంలో నటించిన బాలనటులు ఎదగడం ప్రారంభించడంతో కంటిన్యుటీ ఇబ్బంది ఏర్పడింది. తమిళం అయితే లవకుశులలో లవుడి పాత్రను ఉమ అనే అమ్మాయివేసింది. సినీమా నిర్మాణం ఐదేళ్ళు సాగడంతో ఆ ఉమ రూపురేఖల్లో బాగా మార్పు కనిపిస్తుంది.
ముందు తమిళ భాష కు కూడా ఘంటసాలవారినే సంగీత దర్శకుడి నియమించుకున్నారు. మాస్టారు కొన్ని తెలుగు వరసల పాటలనే తమిళంలో కూడా స్వరపర్చారు. కానీ, తమిళం వెర్షన్ కు స్థానికంగా బాగా పాప్యులర్ అయిన తమ సంగీతదర్శకుడు వుంటేనే ఫైనాన్స్ చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడి చేయడంతో సగం సినీమా అయ్యాక కె.వి,మహాదేవన్ ను తమిళానికి సంగీత దర్శకుడిగా నియమించారు. తెలుగులో పి.లీల, పి.సుశీల పాడిన మూడు రామాయణ గీతాలను కె.వి.మహాదేవన్ తన సొంత బాణీలో స్వరపర్చడం జరిగింది.
ఒక దశలో సినీమా అసలు పూర్తి అవుతుందా లేదా అనే అనుమానం కలిగించింది. దీనికి తోడు సి. పుల్లయ్యగారి అనారోగ్యం కారణంగా దర్శకుడిగా ఆయనకు బదులుగా ఆయన కుమారుడు సి.ఎస్. రావు కొనసాగారు. చిట్టచివరకు శంకరరెడ్డి చిత్ర నిర్మాణం పూర్తి చేయలేక నెగెటివ్ రైట్స్ ను పూర్తిగా సుందర్లాల్ నహతాకు అమ్మివేసి, అష్టకష్టాలు పడి 1963 లో సినీమా విడుదల చేశారు.
తెలుగులో మొట్టమొదటి గేవాకలర్ చిత్రం 'లవకుశ' ఘంటసాల సంగీతం, పి.ఎల్.రాయ్ కెమెరా పనితనం, టివిఎస్ శర్మ ఆర్ట్ డైరక్షన్ లవకుశ సినీమాకు గొప్ప ఎసెట్. లవకుశ సినీమా రీరికార్డింగ్ ఆద్యంతం చూసే అవకాశం కలిగింది. లవకుశ సినీమాలో వచ్చే నేపథ్యసంగీతం సినీమాకు ఎంతో పరిపూర్ణతను, విశిష్టతను చేకూర్చింది. ఈ సినీమాలోని ప్రతీ పాట, పద్యం, ఘంటసాలవారి సంగీత వైదుష్యానికి గీటురాళ్ళు. నాలుగు గంటలకు పైగా సాగే లవకుశ చిత్రానికి సంగీతమే ప్రాణం అనడం సత్యదూరం కాదు. సినీమా విడుదలైన రెండు వారాల కలెక్షన్ నిరాశాజనకంగానే వుండి సినీమా ఫెయిలనే నిర్ణయానికి వచ్చే సమయంలో, ఒక్కసారిగా అనూహ్యంగా లవకుశ దశ మారిపోయింది. క్రమక్రమంగా కలెక్షన్స్ పెరిగి విజయబాటలో సాగింది. చిన్నా పెద్దా అన్ని సెంటర్లలో విజయదుందుభి మ్రోగించింది. మొదటి రన్ లోనే తెలుగులో కోటి రూపాయలు ఆర్జించిన మొట్టమొదటి గేవాకలర్ రంగుల సినీమా లవకుశ. అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకుంది. తమిళం లవకుశ కూడా విజయవంతమైన సినీమాగానే నమోదు అయింది.
1934 నాటి సినీమాకు ఎంత ఆదరణ లభించిందో ఈ కొత్త లవకుశ కు అంతకు రెట్టింపు కీర్తి ప్రతిష్టలు లభించాయి. పల్లె పల్లెల నుండి ఎడ్లబళ్ళమీద బంధు, మిత్ర కుటుంబసమేతంగా లవకుశ చిత్రం చూడడానికి ప్రజలు తరలివెళ్ళడం జరిగింది. మా బొబ్బిలి లో లవకుశ ఆడినన్నాళ్ళు చుట్టుపక్కల గ్రామాలలోని మా కుటుంబ మిత్రులంతా సినీమా చూసివచ్చి మా ఇంట్లోనే పడుక్కొని మర్నాడు ఉదయం బళ్ళమీద తిరిగివెళ్ళేవారు.
సీతారాములుగా అంజలిదేవీ, ఎన్.టి.రామారావుల ఇమేజ్ విపరీతంగా పెరిగిపోయింది. శ్రీరాముడి గెటప్ లోని ఎన్.టి.ఆర్ ఫోటోలు తెలుగునాట చాలామంది ఇళ్ళ పూజాగృహాలలో చోటు చేసుకున్నాయి. సీతమ్మ అంటే అంజలీదేవే అనే భావన ఈ చిత్రం కలిగించింది. తెలుగు భాష సజీవంగా వున్నంతవరకూ లవకుశ సంగీతం వినిపిస్తూనే వుంటుంది. పి.లీల, పి.సుశీలగార్ల గాన ప్రతిభకు దర్పణం లవకుశ. వారి గానానికి చిత్రిక పట్టి మెరుగుదిద్దిన ఘంటసాల స్టారి పేరు చిరస్థాయిగా నిలిచేవుంటుంది.
ఒక అద్భుత కళాఖండం నిర్మించిన నిర్మాతగా ఎ.శంకరరెడ్డి గారికిపేరు మాత్రమే మిగిలింది. ఆ సినీమా లాభాలలో ఒక్క పైసా కూడా ఆయనకు దక్కకపోవడం చాలా విచారకరం.
చిత్రం! భళారే విచిత్రం!
1940-1960ల మధ్య శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ అతి పెద్ద చిత్రనిర్మాణ సంస్థగా ఒక వెలుగు వెలిగింది. సుప్రసిద్ధ బహుభాషా నటీమణి పి.కన్నాంబ, ఆమె భర్త, చిత్ర దర్శకుడు కడారు నాగభూషణం ఈ సంస్థ అధినేతలు. వీరి నిర్మాణంలో దాదాపు పాతిక సినీమాలు తెలుగు, తమిళ భాషలలో నిర్మాణమయ్యాయి. అయితే అవేవీ ఈ తరానికి తెలిసినవి కావు. అధికశాతం పౌరాణికాలే. కన్నాంబ నట-గాయని. తమిళంలో అనర్గళంగా పేజీలకు పేజీలు తెరమీద మాటల తూటాలతో ప్రేక్షకులను అదరగొట్టిన గొప్ప నటి. తెలుగులో పల్నాటియుధ్ధం , తమిళంలో కణ్ణగి, హరిశ్చంద్ర, మనోహర వంటి చిత్రాలు కేవలం ఒక చిన్న ఉదాహరణకు మాత్రమే.
పల్నాటియుధ్ధం లో ఘంటసాల మాస్టారు కన్నాంబతో కలసి "తెర తీయగరాదా" అనే పాటను గానం చేసిన సంగతి అందరికీ తెలుసు.
శ్రీరాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ తీసిన సినీమాలలో చెప్పుకోతగిన పాటలేవీ మాస్టారు ఎక్కువగా పాడలేదు. రాజేశ్వరి కన్నాంబ, నాగభూషణంల పెంపుడుకూతురు. ఆమె పేరుమీదే చాలా చిత్రాలు నిర్మించారు. రాజేశ్వరి ప్రముఖ దర్శకుడు సి.ఎస్.రావు మొదటి భార్య. ఈమెను విడచిపెట్టి సినీ నటి రాజసులోచనను పెళ్ళి చేసుకున్నారు. ఈ సంఘటన కన్నాంబ దంపతులను మానసికంగా, శారీరకంగా చాలా కృంగదీసింది. తరువాత, ఆర్ధికంగా కూడా అనేక ఇబ్బందులకు గురిఅయ్యారు. అలాటి సమయంలో చేపట్టిన సినీమా 'ఆప్తమిత్రులు'. కడారు నాగభూషణంగారే డైరక్టర్. ఈ సినీమాకు ఘంటసాల వారిని సంగీతదర్శకుడిగా నియమించుకోవడం నేను ఎదురుచూడని విషయం. ఆప్తమిత్రులు గొప్ప సినీమాయేం కాదు కానీ, ఇందులో మనసుకు హాయిని కలిగించే కొన్నిపాటలను ఘంటసాల మాస్టారు స్వరపర్చి చిత్రానికి బలం చేకూర్చారు. "రావే చెలీ ఈవేళా", "పవనా మదనుడేడా మరలిరాడా", "దయరాదా నామీదా యశోదా ప్రమోదా", "ఈ లోకమూ మహా మోసమూ" వంటి పాటలు జనాదరణ పొందాయి.
"ఆప్తమిత్రులు" ఆర్ధికంగా కన్నాంబ దంపతులను ఎంతవరకు ఆదుకున్నారో తెలియదు. 1964లో కన్నాంబ కాలధర్మం చెందడంతో కడారు నాగభూషణం మరింత దిగజారిపోయారు. ఎమ్జీయార్ తో "తాళిబాగియం"( తాళి భాగ్యం) అనే ఒక తమిళ సినీమా మొదలుపెట్టి అది పూర్తిచేయడానికి అప్పులపాలై, ఉన్న ఆస్తులన్నీ అమ్మివేసి సినిమా పూర్తిచేశారు. ఇక్కడితో ఒక ప్రముఖ చలనచిత్ర సంస్థ చరిత్ర ముగిసింది.
నిలువ నీడలేక కడారు నాగభూషణం అక్షరాలా రోడ్ న పడ్డారు. ఆయన అంటే గౌరవాభిమానం కల కొంతమంది సహాయంతో ఉస్మాన్ రోడ్ లో, మా ఇంటికి సమీపంలో పానగల్ పార్క్ కు వెళ్ళే త్రోవలో వాసన్ స్ట్రీట్ దాటాక 'మీనాక్షీ లాడ్జ్' అనే అతి సాదా లాడ్జింగ్ హోటల్ లో ఒక చిన్న గదిలో కాలం గడిపారు. రాజభవనం లాంటి పెద్ద భవంతిలో భోగభాగ్యాలతో అతి పెద్ద కార్లలో తిరుగాడిన కడారు నాగభూషణంగారి అంతిమ దినాలు ఒక చిన్న గదిలో ముగిసాయి. లాంఛనప్రాయంగా చిత్రసీమ శోకించింది. పలువురు ప్రముఖులు సంతాపం జరిపి ఆయనకు నివాళులు అర్పించారు. అక్కడితో సరి. ఒక ప్రముఖ దర్శక నిర్మాత కథ ముగిసింది.
1934లో సోమసుందరం, ఎస్.కె.మొహిదీన్ లు భాగస్వాములుగా ఏర్పడి కోయంబత్తూరు లో జూపిటర్ పిక్చర్స్ ను ప్రార్ంభించారు 1940-50ల మధ్య అక్కడి సెంట్రల్ స్టూడియోలో దాదాపు 40 సినీమాలు తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషలలో నిర్మించారు. ఎక్కువగా ఎమ్జీయార్ తోనే తీశారు. అన్ని హిట్ సినీమాలే. సెంట్రల్ స్టూడియో మూతబడ్డాక తమ సంస్థను మద్రాసు కు తరలించి నెప్ట్యూన్ స్టూడియోలో అనేక సినీమాలు తీశారు. ఈ నెప్ట్యూన్ స్టూడియోను ఎమ్జీయార్ కొనుగోలు చేసి తల్లి సత్యభామ పేరిట సత్యా స్టూడియోస్ గా మార్చి తన చిత్రాలు అక్కడ నిర్మించారు. అడయార్ రివర్ బ్రిడ్జ్ కు ముందు ఆంధ్ర మహిళా సభ కు ఎదురుగా వుండే ఈ సత్యా స్టూడియో ఎమ్జీయార్ మరణానంతరం ఒక విద్యాలయంగా ఎమ్జీయార్-జానకి ఉమెన్స్ కాలేజీగా రూపుదిద్దుకున్నది.
జూపిటర్ పిక్చర్స్ కు మన ఘంటసాల మాస్టారికి గతంలో పెద్ద సంపర్కం వున్న గుర్తులేదు. జూపిటర్ తీసిన పాత సినీమాలలో మాస్టారు పాడారా అనేది సందేహమే. పాడిన అతి తక్కువ సంఖ్యలో పాడివుండాలి. వివరాలు తెలియవు. ఆ సంస్థ భాగస్వామి కుమారుడు ఎస్ కె హబిబుల్లా. ఆయన తెలుగులో వరసగా రెండు సినీమాలు తీశారు. ఒకటి వాల్మీకి (తెలుగు, కన్నడం), మరొకటి మర్మయోగి. ఈ రెండు చిత్రాలలో హీరో ఎన్.టి.రామారావు. ఈ రెండు చిత్రాలకు ఘంటసాల మాస్టారు సంగీతం నిర్వహించడం నాకు ఆశ్చర్యమే. ఈ సినీమాల సమయంలోనే మొదటిసారిగా వాల్మీకి రీరికార్డింగ్ కు జూపిటర్ (నెప్ట్యూన్) స్టూడియో లోపలికి వెళ్ళడం జరిగింది.
రామాయణాన్ని వ్రాసిన ఆదికవిగా, అడవులు పట్టిన సీతకు ఆశ్రయమిచ్చి లవకుశులను పెంచిన వాల్మీకి మహర్షిగానే ఆయన వృత్తాంతం మనకు తెలుసు. వాల్మీకి మహర్షి కావడానికి ముందుగల గాధను ఒకటి తయారు చేసి ఒక జానపద-పౌరాణిక చిత్రంగా జూపిటర్ పిక్చర్స్ వారు తీసారు. పౌరాణిక, జానపద చిత్రాలకు కావలసిన శాస్త్రీయ, లలిత సంగీత పరిజ్ఞానం ఘంటసాల మాస్టారికి వున్నంతగా ఇతరులకు లేదంటే తప్పు పట్టరనే భావిస్తాను. ఆ కారణం చేతనే వాల్మీకి చిత్రం మాస్టారికి లభించిందనుకుంటాను. వాల్మీకిలో చాలానే పాటలు పద్యాలు వున్నాయి. ప్రముఖ రంగస్థల నటుడు కె. రఘురామయ్య ఈ చిత్రంలో నారదుడు. రఘురామయ్య పాటంటే అభిమానించే తెలుగు ప్రేక్షకులు అనేకం. ఆయన బాణీకి తగినట్లుగా మాస్టారు కొన్ని పాటలను పద్యాలను రఘురామయ్య చేత పాడించి రక్తికట్టించారు. వాల్మీకికి మాస్టారు పాడిన పాటలు, పద్యాలు వారి గాన ప్రతిభను వెల్లడిస్తాయి.
వాల్మీకి కృతమైన "మా నిషాద ప్రతిష్టాం త్వమగః శాశ్వతీః సమాః" అనే శ్లోకాన్ని, కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం" అనే శ్లోకాన్ని ఘంటసాల వారు గానం చేసిన తీరు నభూతో నభవిష్యతి. "శ్రీ రామాయణ కావ్య కథ", "హరియే వెలయునుగా", "జయ జయ జయ నటరాజా" వంటి శాస్త్రీయ గీతాలను స్వరపర్చడం, గానం చేయడం వారికే చెల్లు.
హైదరాబాద్ లో శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతుల సమక్షంలో "గిరిజా కళ్యాణం" యక్షగానం గానం చేసిన సమయంలో ముందుగా ఈ వాల్మీకి చిత్రంలోని "జయ జయ జయ నటరాజా" పాటను కూడా కొంతచేర్చి పాడడం జరిగింది. రామాయణ గాధలకు సంగీతం నిర్వహించడంలో తనకు తానే సాటియని వాల్మీకి చిత్రం ద్వారా ఘంటసాలగారు మరోసారి నిరూపించుకున్నారు.
ఘంటసాలవారు సుప్రసిద్ధ చలనచిత్ర నిర్మాత, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అయిన సుందర్లాల్ నహతా గారి ఆస్థాన సంగీత దర్శకుడు. తొలి చిత్రమైన 'జయం మనదే' మొదలుకొని 'వీరకేసరి' (కన్నడం) వరకు వరసగా ఎనిమిది సంవత్సరాలలో 10 సినీమాలకు సంగీత దర్శకత్వం వహించి ఆ రోజుల్లో ఒక చరిత్రే సృష్టించారు. రాజశ్రీ , శ్రీ ప్రొడక్షన్స్, రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద ఈ చిత్రాలన్నీ నిర్మించబడ్డాయి. సుందర్లాల్ గారు టి. అశ్వత్థ నారాయణ భాగస్వామ్యం లో కొన్ని చిత్రాలు, పోతిన డూండేశ్వరరావు భాగస్వామ్యంలో కొన్ని చిత్రాలు నిర్మించారు. ఈ సినీమాలలో అధిక సంఖ్యాకం ఇతర భాషలలో విజయవంతమైన సినీమాలనే తెలుగు, తమిళ, కన్నడ భాషలలో తీసి విజయంపొందారు. సుందర్లాల్ నహతాగారి సినీమాలలో అపజయం పొందినవి చాలా తక్కువ. సినీమా వ్యాపారాన్ని కాచి వడపోసిన వ్యక్తి. సినీమా విజయమే ఆదర్శం, లక్ష్యం. ఆ దృక్పథంతోనే సినీమా నిర్మాణం నిర్దిష్టంగా, పక్కా ప్లాన్ తో సాగేది. వెంటవెంటనే సినీమాలు తీసే దిట్ట నహతాగారు. నహతాగారి సినీమాలలో అధికసంఖ్యాకం పాటలు పరభాషా చిత్రాల్లోని పాటలుగానే వుండేవి. ఒక మూడు, నాలుగు పాటలు మాత్రం ఘంటసాల మాస్టారి సొంత బాణీలు.
అలాటి సుందర్లాల్ నహతా గారికి ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన ఆఖరి తెలుగు చిత్రం ' బందిపోటు'. బి.విఠలాచారి దర్శకుడు. దెయ్యాలు, పిశాచాలు, మంత్రాలు, తంత్రాలు లేని జానపదం. రాజశ్రీకి ఘంటసాల మాస్టారు సంగీతం నిర్వహించిన తొలి చిత్రం 'జయం మనదే' కూడా జానపదమే. ఈ రెండూ rich versus poor రాచరికపు అమానుషాలను ఎదుర్కొనే సామాన్య వీరుడు కథానాయకుడు. మధ్యలో ప్రేమోపాఖ్యానం. సామాన్య ప్రేక్షకుడు చూసి ఆనందించడానికి కావలసిన సరంజామా అంతా బందిపోటులో కనిపిస్తుంది. హీరో ఎన్.టి.ఆర్ కు ఇలాటి సినీమాలు నల్లేరుమీద బండే. దర్శకుడు బి.విఠలాచార్య, సంగీత దర్శకుడు ఘంటసాల కలసి పనిచేసిన తొలి చిత్రం 'బందిపోటు'. ఈ సినీమాలోని క్లైమాక్స్ సీన్ ను కలర్ లో చిత్రీకరించారు. సంగీతం విషయంలో దర్శకుడు విఠలాచారిగారి సరళి, సంగీత దర్శకుడు ఘంటసాలవారి సరళి పరస్పర విరుధ్ధం. ఒకరిది ఉధృతంగా ఉరుకుతూ పరుగులుతీసే జలపాతమైతే, మరొకరిది గంభీరంగా, నిదానంగా ఒంపుసొంపులు తిరుగుతూ ప్రవహించే జీవనది. 'బందిపోటు' చిత్రంలో ఉన్న ఏడు పాటలు స్వఛ్ఛమైనవి. పరభాషా గీతాల ప్రభావం లేనివి. ఏడింట్లో 'వగల రాణివి నీవే' మాత్రమే మాస్టారి సోలో. ఒకటి లీల బృందం, మిగిలినవన్నీ పిసుశీలతో, పి.లీలతో పాడిన డ్యూయెట్లే. "ఓ అంటే తెలియని ఓ దేవయ్యా" పాట ఒక మంచి నృత్యగీతం.
కొసరాజుగారి సెటైర్ బాగా వినిపిస్తుంది. ఈ పాటను మాస్టారు, సుశీల పోటీపడి ఆలపించారు. చాలా మంచి పాట. పాట చిత్రీకరణ ఎంతో బాగుంటుంది. పాట చివర్లో వచ్చే మాస్టారి ఆలాప్ ఆ పాటకే హైలైట్. ఈ సినీమాలో నాలుగు పాటలలో కోరస్ వారికి మంచి అవకాశం కల్పించారు ఘంటసాల. బందిపోటు సినీమాకే తలమానికంగా,ఈనాటి వరకూ ఎల్లప్పూడూ అందరినీ అలరిస్తున్న పాట "ఊహలు గుసగుసలాడే". ఈ పాట వరస, టెంపో దర్శకుడు విఠలాచారిగారికి నచ్చలేదు. పాటంతా మరింత హడావుడిగా ఉద్రేకభరితంగా వుండాలని పట్టుబట్టారు. కానీ, ఘంటసాల మాస్టారు ఈ పాట విషయంలో రాజీపడలేదు. ఘంటసాల మాస్టారి ట్యూనే చివరకు ఓకె అయింది. సినీమా విడుదలయ్యాక ఆ పాట ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో అందరికీ తెలుసు. కన్నడం వీరకేసరి లో కూడా ఈ పాట సూపర్ హిట్ అయింది. సాధారణంగా, సన్నివేశాన్నిబట్టి ఫలానా పాట ఫలానా రాగంలో చేస్తే సముచితంగా వుంటుందని నిర్ణయించుకొని చేసే పాటలు కొన్ని అయితే, రాగ నిర్ణయం లేకుండా చేసే పాటలు కొన్ని వుంటాయి. ఆ రకమైన పాట "ఊహలు గుసగుసలాడే". ఆరోహణా, అవరోహణా క్రమంలో ఉండవలసిన స్వరాలన్నీ వున్నాయి. ఈ స్వరాలున్న రాగం ఏదై వుంటుందనే జిజ్ఞాస మా నాన్నగారికి చాలా కాలం తరవాత కలిగి తన దగ్గరున్న సంగీత గ్రంథాలు తిరగేసి చూస్తే "ఊహలు గుసగుసలాడే" పాటలోని స్వరాలు ఓ రెండు రాగాలకు పోలి వున్నాయి. అవి ఒకటి సౌదామిని అనే రాగం. మరొకటి సుమనేశరంజని అనే రాగం. ఈ రెండూ సినీమాలకు సంబంధించినంతవరకూ అపూర్వరాగాలే. గతంలో ఏ సంగీతదర్శకుడు ఏ సినీమాలోనూ ఉపయోగించలేదు. సౌదామిని రాగంలో ఒకే ఒక కృతి త్యాగయ్యగారిది వుందట. ఈ "ఊహలు గుసగుసలాడే" పాటంతా సౌదామిని రాగంలో ఉంటుంది. చరణాలలో మాత్రం ఒక దగ్గర అన్యస్వర - కాకలినిషాద ప్రయోగంతో సుమనేశరంజని చాయలుంటాయి. ఈ రెండు రాగాలకు సంబంధించిన వివరాలను మా నాన్నగారు (సంగీతరావుగారు) తన వ్యాసాలలోనూ, ఘంటసాల మాస్టారి భగవద్గీత రాగ విశ్లేషణలోనూ తెలియజేశారు.
గతంలో కూడా పాత సినీమాలలో "చారుకేశి", "చక్రవాకం", "రాగేశ్వరి" వంటి అరుదైన రాగాలను సమర్ధవంతంగా సినీమాలలో ప్రవేశపెట్టి ఆ గీతాలకు అజరామరత్వం కల్పించిన ఘనతకూడా మన గానగంధర్వుడు ఘంటసాల మాస్టారిదే. ఘంటసాల గాన విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈనాడు వున్న ప్రసారమాధ్యమాలు ఆనాడు వుండివుంటే ఘంటసాలవారి కీర్తిప్రతిష్టలు మరింతగా దిగంతాలకు ప్రాకివుండేది. మరెన్నో ఆణిముత్యాలు మనకు అందుబాటులో ఉండేవి.
"నీ పెళ్ళికి నా కచేరీ ఏర్పాటు చెయ్యి. అప్పుడు వచ్చి పాడతాను...."ఎవరు ఎవరితో అన్నారు?
వివరాలు వచ్చేవారం నెం.35, ఉస్మాన్ రోడ్ లో...
...సశేషం
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.
1 comment:
����ప్రేమాభిమానాలున్న మనిషి మీద ఎలాంటి చేదు నిజాలు రుచించవు కదా! పైగా బాల్యంలో!! అదే ...మాస్టారు వంటి అనుభవజ్ఞులు, సుమనస్కులు గెలుపు ఓటములను సరి సమానంగా స్వీకరించగలరు! ప్రతిభను ఎక్కడున్నా, ఎవరి వద్దనున్నా మెచ్చుకోవాలన్న పెద్ద మనసు మాస్టారు మాటల్లో తెలిసి పోతోంది. ఈ సుద్దులే నేటి పోస్ట్ కు శుభారంభం!
‘లవకుశ’ సినిమా కోసం నిర్మాత పడ్డ కష్టాలు, చివరకు కష్టఫలితం వారికి దక్కకపోవడం విధి వైచిత్ర్యమే!! గాయనీ గాయకుల, నటీనటుల ప్రతిభ మరువరాని అంశమైనా, మీరన్నట్లు ఘంటసాల మాస్టారి సంగీత వైభవం ‘లవకుశ’ సినిమాకు ఆయువు పట్టు అన్నది నిర్వివాదాంశం!
అలాగే ...కాస్తోకూస్తో సంగీతాభిమానం వున్న మాలాంటి వారికి సౌదామిని, సుమనేశరంజని రాగాలను మాస్టారు బందిపోటు సినిమా కోసం వాడిన విషయం, పాటల వీడియోలు, నాన్నగారు తెలియజెప్పిన ‘భగవద్గీత రాగ విశ్లేషణ’ కు ఇచ్చిన లింకు..ఇవన్నీ మీ బ్లాగును సరికొత్త పుంతలు తొక్కిస్తున్నాయనే చెప్పాలి.
వచ్చే వారం పెళ్ళి, పాట కచ్చేరి వివరాల కోసం ఆతృతతో ఎదురు చూస్తూంటాం!��������������������
Post a Comment