visitors

Sunday, March 28, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై నాలుగవ భాగం

28.03.2021 - ఆదివారం భాగం - 24:
అధ్యాయం 2  భాగం 23 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
తూర్పున బంగాళాఖాతంలో నుంచి ఉదయించిన సూర్యుడు తన కిరణాలను మా లోగిట్లోకి ప్రసరించకముందే, ఒక రోజు ఉదయం, చాలా తిరుపతి గుళ్ళు మా ఇంటి వాకిట ప్రత్యక్షమయాయి. ఇది మేము 'నెం.35, ఉస్మాన్ రోడ్' కు వచ్చిన కొత్తల్లో. తిరుపతిలో కనిపించే గుళ్ళు మెడ్రాస్ లో మా ఇంటివాకిట్లో చూడడం అదే మొదటిసారికావడం వలన నాకు వింతగా అనిపించింది. 
"ఒరే! అప్పన్నా! ఇదేరా ఘంటసాల ఇల్లు. ఆపు, బండాపు' అని ఒకరు, 'ఓయ్ ఓబులేశు!  ఉస్మాన్ రోడ్ లో 35 నెంబరు ఇల్లు ఇదే. ఘంటసాల పేరుంది. అందరు దిగండి, దిగండి" అనే అరుపులతో మాకు తెల్లవారడం అలవాటయిపోయింది. 

మాయాబజార్, వినాయకచవితి, వెంకటేశ్వర మహత్యం వంటి సినీమాల ప్రభావంతో, ఏడుకొండల సామి మీద ఘంటసాల పాడిన భక్తిగీతాల మహత్యంతో తిరుపతి దేవుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తజనమంతా మద్రాసు క్షేత్రాన్ని కూడా సందర్శించి తమ అభిమాన సినీమా దేవుళ్ళ ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ దర్శనం కోసం కాచుకొని మరీ చూసి మహదానందపడేవారు. టూరిస్ట్ బస్సుల వారంతా తిరుపతి, పరిసర ప్రాంతాలతోపాటూ మద్రాస్ స్టార్ దర్శనం అనే ప్రత్యేక ఆకర్షణ కల్పించి తమ టూరిస్ట్ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లజేసుకున్నారు. మద్రాస్ తెలుగు సినీమాకు కేంద్రంగా వున్నంతకాలం తిరుపతి యాత్రీకుల బస్సులతో మా ఉస్మాన్ రోడ్ ఉదయం తొమ్మిది గంటలవరకు కోలాహలంగా వుండేది. ఎందుకంటే సినీమావాళ్ళెప్పుడు ఉదయం తొమ్మిది దాటితే ఇళ్ళ దగ్గర దొరకరు. కోడంబాక్కం స్టూడియోలలో పట్టుకోవలసిందే. రికమెండేషన్ లేకుండా ఏ స్టూడియో వాళ్ళు ఈ యాత్రీకాభిమానులను లోపలికి వదిలే సాహసం చేయరు. 

జనవరి సంక్రాంతి సమయంలో పాడిపంటలు ఇంటికి చేరాక అందరి చేతుల్లో నాలుగు డబ్బులు కనిపిస్తాయి. ఆ ఆనందంతో కుటుంబాలతో తీర్థయాత్రలు మొదలెడతారు. అప్పటినుండి వేసవి శెలవులు పూర్తి అయేవరకూ ప్రతీరోజూ ఐదారు బస్సులకు తక్కువ లేకుండా తిరుపతి యాత్రీకులు మా ఇంటిగేటు ముందు నిలబడేవారు. వారిలో డెభ్భై, ఎనభై ఏళ్ళ వృధ్ధుల నుండీ మూడు, నాలుగేళ్ళ పసిపాపల వరకూ ఆడా, మగా వుండేవారు. నడవలేని స్థితిలోకూడా చేతికర్ర ఊతంతో తిరుపతి వెంకన్నను ఎంత భక్తితో దర్శించుకునేవారో అదే భక్తితో మద్రాస్ లో ఘంటసాల వేంకటేశ్వరుని, నందమూరి తారకరాముని, తదితర సినీ నటీనటులను చూసి ఆనందించేవారు. 

అసలు నిజం చెప్పాలంటే, మద్రాసులోని, మా టి.నగర్ లోని సినీమావారుండే ప్రాంతాలు ఆ ఇళ్ళ అడ్రస్ లు నాకు కంఠోపాఠం అవడానికి ముఖ్య కారణం ఈ తిరుపతి బస్సులే. ఆనాటి ఆంధ్రదేశం నుండి వచ్చే చాలామంది బస్సుల డ్రైవర్లకు అరవభాషతో సమస్య. యాత్రీకులను ఆకట్టుకుందికి మెడ్రాస్ ట్రిప్ లు వేస్తారే కానీ  మొదటిసారి వచ్చేవాళ్ళకు ఈ ఊరిగురించి ఏ అవగాహన వుండేది కాదు. టి.నగర్ ఉస్మాన్ రోడ్ కు రాగానే ముందుగా మెయిన్ రోడ్ మీద ఒక పెద్ద రాజభవనంలా కనిపించేది ఘంటసాలగారి ఇల్లే. అందుకే తిరుపతి బస్సులవాళ్ళకు మొదటి హాల్ట్ నెం.35, ఉస్మాన్ రోడ్డే. అక్కడికి వచ్చి ఆ డ్రైవర్ మాత్రం ముందుగా వచ్చి 'అయ్య ఉన్నారా!' 'ఘంటసాలగారు లోపలున్నారా!' 'ఘంటసాలవాడు ఉన్నాడా!' 'పాటల దేవుడు ఎన్నింటికి బయటకు వస్తారు' ఇలా ఎవరికి తోచిన భాషలో వారి వారి చదువు సంధ్యలు, సంస్కారాన్నిబట్టి అడిగేవారు. వీళ్ళ ప్రశ్నలకు టార్గెట్  అప్పుడప్పుడు తమ్ముడు కృష్ణ , మా తాయి, ఆవిడ కొడుకు వడివేలు, కారు డ్రైవర్ గోవిందు. అయ్యగారు బయటకు వెళ్ళేవరకు కారు కడగడం, తుడవడం తప్ప మరే పని లేని గోవిందుకు ఓ నాలుగు బీడీలు చేతిలోపెట్టి వాళ్ళకు కావలసిన సమాచారాన్ని బాగానే లాగేవారు ఆ బస్సులవాళ్ళు. అయితే గోవిందు మాట్లాడే అరకొర అరవ తెలుగు వాళ్ళకు అర్ధమయేది కాదు. ఆ సమయంలో పనిపాటాలేని ఆపద్బాంధవుడిని నేను మాత్రమే. గోవిందు తన తరఫున నన్ను చెప్పమనేవాడు. డ్రైవర్  గోవిందు చెప్పిన దానిని తిరిగి నేను స్వఛ్ఛమైన మా విజయనగరం తెలుగులో చెప్పేవాడిని. వచ్చేవాళ్ళలో చాలామంది ఉత్తరాంధ్రదేశంలోని పల్లెటూళ్ళకు చెందినవారవడంతో వారికి నా మాటలు బాగా అర్ధమై చాలా సంతోషపడేవారు. గోవిందు చెప్పిన సినీమావాళ్ళ ఎడ్రస్ లు ఆ డ్రైవర్లకు, కుతూహలంగా వెంటవచ్చిన తిరుపతి యాత్రీకులకు విడమర్చి చెప్పేవాడిని.

మా ఇంటి ఎదురుగా కె.వి.రెడ్డి, వ్యాసారావు స్ట్రీట్ లో నాగయ్య (తరువాతి కాలంలో రమణారెడ్డి), బజుల్లా రోడ్ లో ఎన్.టి.రామారావు, కస్తూరి శివరావు, సారంగపాణి స్ట్రీట్ లో అక్కినేని నాగేశ్వరరావు, అతి పొడుగాటి హబిబుల్లా రోడ్ లో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సుబ్బారావు, గుమ్మడి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, తిరుమలపిళ్ళై రోడ్ లో జమున, అక్కడి సమీపంలోనే కాంచన, మహాలింగపురంలో నాగభూషణం, శారద, నీలకంఠమెహతా స్ట్రీట్ లో రేలంగి, వైద్యరామయ్యర్ స్ట్రీట్ లో భానుమతి (అయితే ఆవిడ కోడంబాక్కం భరణి స్టూడియో ఎదురుగా వుండే భవనంలోనే వుండేవారు),  సౌత్ బోగ్ రోడ్ లో శివాజీ గణేశన్, ఆర్కాట్ స్ట్రీట్ లో ఎమ్జీయార్ ;  రామన్ స్ట్రీట్ లో కె.ఆర్.విజయ, గాయని ఎస్ జానకి, జెమినీ స్టూడియోకు సమీపంలో నుంగబాక్కం హైరోడ్ జెమినీ గణేశన్, రట్లండ్ గేట్ లో జగ్గయ్య, కోడంబాక్కం నాగార్జున నగర్ లో మిక్కిలినేని, పద్మనాభం, కొంచెం దూరంలో బాలకృష్ణ, సౌత్ ఉస్మాన్ రోడ్  సిఐటి నగర్ లో పెండ్యాల, పి.బి.శ్రీనివాస్, తేనాంపేట ఎల్డామ్స్ రోడ్ లో సి.ఎస్.ఆర్., ఎస్.ఎస్.రాజేంద్రన్, దేవిక, సంగీత దర్శకులు ఎస్.రాజేశ్వరరావు, టి.వి.రాజు, ఆళ్వార్ పేట సీతమ్మకాలనీలో పి.సుశీల, సెనెటాఫ్ రోడ్ లో షావుకారు జానకి, రాజా అణ్ణామలైపురంలో అంజలీదేవి, అడయార్ లో బి.సరోజాదేవి. ఇలా తమ అభిమాన తారాగణం వివరాలు తెలుసుకొని ఉబ్బితబ్బిబైయేవారు. అలాగే, బ్రతికిన కాలేజి (జూ), చచ్చిన కాలేజి (మ్యూజియం), మెరీనా బీచ్, హైకోర్ట్, లైట్ హౌస్, హార్బర్, మూర్ మార్కెట్ వంటి యాత్రాస్థలాలకు వెళ్ళే మార్గాలను సేకరించేవారు. ఇంతమంది ఎడ్రస్ లు నాకు తెలియడానికి, గుర్తుండిపోవడానికి కారణం ఈ తిరుపతి యాత్రీకులు, డ్రైవర్ గోవిందు చలవే. నేను మద్రాస్ రూట్ మ్యాప్ తెలుసుకోవడంలో చాలా సహాయపడింది వీరే అని చెప్పాలి. 

అయితే ఈ తిరుపతి యాత్రీకులకు సినీమావాళ్ళందరి దర్శనభాగ్యం లభించేదా అంటే సందేహమే. వచ్చిన అభిమానులను నిరాశపర్చకుండా వారితో సరదాగా మట్లాడి వారిని తృప్తి పర్చేవారిలో ఘంటసాల, ఎన్.టి.రామారావు ముఖ్యులని వారిని చూడడానికి వచ్చే అభిమానులు చెప్పుకోగా చాలాసార్లు విన్నాను. మిగతా చాలామంది నటీనటులను కోడంబాక్కం రైల్వేగేట్ దగ్గర కార్లలో పడిగాపులు పడుతూండగా చూసి ఆనందించేవారు.

సినీ నటుల తర్వాత ఈ తిరుపతి యాత్రికులంతా చూసి అమితంగా చూసి సంతోషపడేది ఘంటసాల మాస్టారినే. ఆయన వచ్చినవారిని పలకరించే తీరు, కలుపుగోలుతనం వారికి తమ సొంత మనిషితో మాట్లాడుతున్నామనే భావన కలిగించేది. ఘంటసాల మాస్టారు ఇంటిలో వున్నప్పుడు ఎవరు వచ్చినా మాట్లాడకుండా పంపలేదు. తనను చూడాలనే ఆశతో ఎక్కడో సుదూరప్రాంతాలనుండి వచ్చినప్పుడు నాలుగు మంచిమాటలతో ఆనందపర్చడం తన కర్తవ్యంగా భావించేవారు. 

మాస్టారిని చూడడానికి వచ్చేవారిలో అన్ని రకాలవారూ ఉండేవారు. ఫలానా సినీమాలో మీరు పాడిన పాటలు చాలా బాగున్నాయి అని కొందరూ, సినిమా లో మీ పాటలకి, ఇప్పడు మీరు మాట్లాడే మాటకు పోలికే లేదని కొందరూ, ఎన్.టి.రామారావుకు, ఎ.నాగేశ్వరరావుకు, రేలంగికి ఎవరికి పాడినా వారు పాడుతున్నట్లే మాకు అనిపిస్తుంది అదెలా పాడతారు అని కొందరు 
'బాబూ ముసలిదాన్ని అడుగుతున్నాను ఏడుకొండలసామీ మీద పాట పాడి వినిపించవా' ఇలా రకరకాల ప్రశ్నలు వేసేవారందరికీ ఓపికగా సమాధానాలు చెప్పేవారు. వాళ్ళు ఏ ఏ సినీమాలు చూశారు. ఏ పాటలు బాగా నచ్చాయని అడిగి తెలుసుకునేవారు. ఒకసారి తిరుపతి యాత్రీకుల బస్సులో ఓ పది పన్నెండేళ్ళ కుర్రాడు వచ్చాడు. అందరూ ఘంటసాలగారితో మాట్లాడుతుంటే వాడికీ ఏదో  అడగాలని తహతహ. చివరకు ధైర్యం చేసి మీరు ఏదైనా పాట పాడండి అని అడిగాడు. అందుకు మాస్టారు "నేను సినీమాలలో పాడుతున్నది నువ్వు వింటున్నావు కదా ! నువ్వే ఒక పాట పాడు వింటాను" అని ఎదురు అడిగారు. "నేనా! పాటా! నాకు రాదే, మీరే పాడి వినిపించండి" అన్నాడు. "అయితే నీ పెళ్ళికి నా కచేరీ పెట్టించు. అప్పుడు మీ ఊరు వచ్చి ఏన్నో పాటలు పాడతాను" అని అనగానే ఆ కుర్రాడు సిగ్గుతో అష్టవంకరలుపోయాడు. అక్కడ వచ్చినవారంతా గొల్లుమని నవ్వి ఆ కుర్రాడిని వెంటనే పెళ్ళిచేసుకోరా ఘంటసాల మనూరు వచ్చి పాడతాడు అని ఆ పిల్లాడిని ఎగతాళి చేస్తూ సంతోషంగా మాస్టారి దగ్గర శెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు. 

ఒకసారి ఘంటసాల మాస్టారిని చూసినవారుకానీ, మాట్లాడినవారు కానీ ఆయనను కానీ, ఆయన మాటకారితనాన్ని కానీ ఎన్నటికీ మరువలేరు. ఘంటసాలగారి వ్యక్తిత్వం అలాటిది. ఘంటసాలవారి నెం.35, ఉస్మాన్ రోడ్ ఎప్పుడూ వచ్చేపోయే జనాలతో కలకలలాడుతూవుండేది. సొంత సినీమా నిర్మాణం ఆపేసినా ఎవరో బంధుమిత్రులతో ఆ ఇల్లునిండే వుండేది. మాస్టారింట్లోనే భోజనాలు చేసేవారు కొందరైతే బయటే భోజనాలు చేసి రాత్రి మాస్టారింటి మేడమీద నిద్రలుపోయి ఉదయాన్నే తమ తమ పనులు చూసుకునేవారు కొందరు.

మా నాన్నగారు విజయనగరం వదలి మద్రాసు రావడానికి తీవ్రమైన ప్రేరణ, ఒత్తిడి తెచ్చిన సన్నిహితులు ఇద్దరు. ఒకరు ఘంటసాల మాస్టారు అయితే, మరొకరు, ద్వివేదుల నరసింగరావు. ఆయనే మా నాన్నగారికి రైలు టిక్కెట్ కూడా కొనిచ్చి బలవంతాన సాగనంపారు. వారి అమ్మాయి ఛాయకు మా రెండో చిన్నాన్నగారు కొన్నాళ్ళు వైలిన్ సంగీతం కూడా నేర్పారు. నరసింగరావుగారు విజయనగరం ఎమ్.ఆర్. కాలేజీలో లెక్చెరర్ గా పనిచేసేవారు. ఆయన భార్య శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి గారు అప్పటికే రచనా వ్యాసాంగంలో అడుగుపెట్టారనుకుంటాను.

మేము విజయనగరం నుండి వచ్చేక నరసింగరావుగారు విజయనగరం మహారాజావారి స్కాలర్షిప్ మీద అమెరికాలో ఉన్నత విద్యలకు వెళ్ళారు. అక్కడ విస్కన్సిన్ యూనివర్శిటీ లో ఎకానామిక్స్ లో పి.హెచ్.డి. చేశారు. అక్కడ డాక్టరేట్ చేస్తున్న సమయంలోనో లేక ముగిసిన తర్వాతో ఒకసారి మద్రాస్ వచ్చి మా నాన్నగారిని, ఘంటసాల మాస్టారిని చూడడానికి వచ్చారు. ఆయన ఎక్కడవున్నా మా నాన్నగారితో చాలా తరుచుగా ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేవారు.

నరసింగరావుగారు మద్రాస్ వస్తూ తనతో కూడా ఒక పెద్ద టేప్ రికార్డర్ తీసుకువచ్చి ఇండియాలో తమ బంధుమిత్రుల సంభాషణలు, పాటలు, పద్యాలు రికార్డ్ చేసుకొని తీసుకువెళ్ళారు. ఆ సమయంలో, ఘంటసాల మాస్టారింట్లోని చిన్న హాలులో ఉత్తరం గోడకు ఆనుకొని ఒక పెద్ద టేబిల్ వుండేది. దానిమీద ఆ భోషాణం స్పూల్ టేప్ రికార్డర్ పెట్టి అందరి గొంతులు రికార్డ్ చేశారు. మాస్టారు, మా నాన్నగారు కొన్ని పాటలు, పద్యాలు పాడారు. చిన్నా పెద్దా అందరిచేతా పాడించారు, మాట్లాడించారు. నావంతు వచ్చింది. పాడు పాడమని ఒత్తిడి చేశారు. అంతమంది మధ్యలో పాడడమే! నా గొంతు తడారిపోయింది. అప్పటికి నాకు పధ్నాలుగు, పదిహేనేళ్ళుంటాయి. నాగొంతు పీలగా, ఆడపిల్ల గొంతులానే వుండేది. ఆ వయసులోనే మా నాన్నగారు నాకు సంగీతం నేర్పాలని ప్రయత్నించారు. నా గొంతుకు ఏ శృతి సరిపోతుందో ఆయన సంగీతజ్ఞానానికి తట్టలేదు. అలాగే గీతాలవరకు నేర్చుకున్నాను. ఆయన చెప్పిన పధ్ధతిలో పాడకుండా అరవయాసతో (స్థానికప్రభావం వల్ల)  పాడడం ఆయనకు సుతారము నచ్చలేదు. గాత్రం లాభం లేదని వీణ, హార్మోనియం కూడా నా మీద ప్రయోగించి చూశారు. వినాయక చవితిలోని 'దినకరా శుభకరా' పాట ప్రాక్టీస్ ముగియకుండానే హార్మోనియం ప్రాక్టీస్ అటకెక్కిపోయింది. అలాగే వీణ సాధన కూడా. గీతాలతో ఆగిపోయింది. సంగీతానికి అతిముఖ్యమైన శృతి, లయలు రెండింటికి నన్ను చూస్తే భయమే. ఇలాటి నన్ను పట్టుకొని 'పాడమని నన్ను అడగతగునా'. అయినా తప్పలేదు. మొదటిసారిగా మైక్ ముందు మాయాబజార్ లోని 'లాహిరి లాహిరి' పాట ఎత్తుకున్నాను. అది పాటా, మాటో నాకే తెలియలేదు. పాడడం అయ్యాక నేను పాడినది మళ్ళీ రీ-ప్లే చేశారు. అందరూ ఒకటే నవ్వులు. ఆ నవ్వులకు అర్ధం నాకు తెలుసు. ఇక జన్మలో ఏనాడు నా పాటతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదనే నియమాన్ని ఈనాటి వరకు నిలబెట్టుకున్నాను. మధ్య మధ్య వ్రతభంగం జరిగిందనుకోండి. అయితే నాకన్నా మహాన్యాయంగా పాడుతూ అందరిచేత చప్పట్లు కొట్టించుకున్న వాళ్ళని తర్వాతి కాలంలో చాలామందినే చూశాను. అయినా నేను టెంప్ట్ కాలేదు. I am great to that extent. అయినా లలితకళలు అబ్బడమనేది పూర్వజన్మ సుకృతంగానే నేను భావిస్తాను. కృషి, సాధన కొంతవరకే ఉపయోగపడతాయి. సంగీత, సాహిత్య, నృత్యాది కళలు విద్యాలయాలలో నేర్చుకున్నంతమాత్రాన వచ్చేవికావు. అక్కడ శాస్త్రపరిజ్ఞానం అలవడుతుంది. అంతవరకే. స్వతసిధ్ధమైన జ్ఞానంలేకపోతే ఏ డిగ్రీలు పనిచేయవు. 

ఆ రోజు ద్వివేదుల నరసింగరావుగారు నెం.35, ఉస్మాన్ రోడ్ లో చాలాసేపు వున్నారు. మాస్టారింటి మెయిన్ హాలులో కూర్చొని చాలాసేపు చాలా విషయాలు మాట్లాడారు. ఆయన వేసుకున్న సూటు, బూటు (హ్యాట్ మాత్రం లేదు), మాటా, చేష్టా అంతా యూరోపియన్ కల్చర్ వంటబట్టిన మనిషంటే ఇలాగే వుంటారేమో అని అనిపించింది. విజయనగరం ఎమ్.ఆర్. కాలేజీలో  లెక్చెరర్ గా పనిచేసేప్పుడు అక్కడి స్టూడెంట్స్ ఈయనను దిలీప్ కుమార్ అనేవారట. కానీ ఆయన ఒడ్డు, పొడుగూ నామట్టుకు ప్రదీప్ కుమార్ లా అనిపించేది. 
ఆనాటి అమెరికన్ యూనివర్శిటీలలో విద్యా విధానానికి, మన దేశపు విద్యా విధానాలకు గల తేడాలు , అక్కడి ప్రొఫెసర్లు, స్టూడెంట్ల మధ్య వుండే గురు శిష్య సంబంధాలు, బోధనా పధ్ధతులు, ఇలా చాలా విషయాల మీద ఆయన మాట్లాడడం నాకు బాగా గుర్తు వుంది. ఆయన చెప్పిన విషయాలన్ని ఘంటసాల మాస్టారితో సహా ఇంట్లోని వారంతా చాలా శ్రధ్ధగా ఆలకించారు. 

1953 లో ఘంటసాలవారు తమ కుటుంబంతో మా తాతగారిని చూడడానికి విజయనగరం వచ్చినప్పుడు ఈ నరసింగరావుగారింట్లో కూడా ఆతిథ్యం పొందడం గుర్తుకు వచ్చింది. అయితే అప్పటి నరసింగరావుగారు నాకు గుర్తులేరు. 1971 లో ఘంటసాల వారు విదేశాలలో పర్యటించడానికి ద్వివేదుల నరసింగరావుగారు కూడా తగిన తోడ్పాటు అందించారని విన్నాను.

ఘంటసాల మాస్టారి కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. సినీమా వ్యాపారం తమకు అచ్చిరాదనే విషయం తేలిపోయింది. స్వగ్రామంలో తల్లిగారి ఆధ్వర్యంలో కొంత భూవసతి ఏర్పాటుచేసినా కౌలుదార్ల మోసం అనండి, లేక అసమర్ధత అనండి, వాటి మీద వచ్చే ఆదాయం అంత లాభసాటి కాలేదనే భావన అందరిలో వుండేది. 

ఘంటసాల మాస్టారి మిత్రుడు  రామదాసని (ఉణుకూరు అనుకుంటాను) ఒకాయన వేసవికాలంలో మాస్టారిని చూడ్డానికి వచ్చేవారు. ఘంటసాల మాస్టారు చెరువులో ఈతకొడుతున్నట్లు ఒక ఫోటో వుంది. అందులో ఆయన పక్కన వుండేది ఈ రామదాసే. ఆయన మద్రాసు వచ్చినప్పుడల్లా మాస్టారి కోసం తాజాయైన చేబ్రోలు పొగాకు తెచ్చేవారు. అలాగే ఊరగాయల సీజన్ లో గుంటూరు కారం, శ్రేష్టమైన ఆవపొడి తెచ్చేవారు. సావిత్రమ్మగారు పెట్టే ఆవకాయ, దోసావకాయ, కొరివికారం తల్చుకుంటే ఇప్పటికీ నోరూరుతుంది. అలాగే  మెంతిమజ్జిగ చేయడంలో కూడా  ఆవిడ ఎక్స్పర్ట్. అవన్నీ రుచి చూసినవాడిలో నేనూ వున్నానడంలో ఏ సందేహమూ లేదు.

రామదాసుగారు తెచ్చే చేబ్రోలు పొగాకును తగు రీతిలో చుట్టలు చేయడంలో మాస్టారి ఆర్కెష్ట్రాలో పనిచేసే భద్రంగారు నైపుణ్యం సంపాదించారు. రావూరి వీరభద్రంగారు కూడా విజయనగరం మ్యూజిక్ కాలేజీలో మా తాతగారి విద్యార్ధే. ఘంటసాలగారికి బాగా జూనియర్. అందరిలాగే భద్రంగారు కూడా సినీమాలలో పెద్ద గాయకుడు కావాలనే ఆశతోనే వచ్చారు. కానీ అదృష్టం అందరినీ వరించదు. కోరస్ సింగర్ గానే మిగిలిపోయారు. పెళ్ళయి పిల్లలు పుట్టాక మా ఔట్ హౌస్ డాబామీద ఒక చిన్న కొబ్బరాకుల కప్పున్న ఇంటిలో కొన్నేళ్ళున్నారు. ఆయన మాస్టర్ వేణు దగ్గర హార్మోనియం వాయించడం నేర్చుకోవడం మొదలుపెట్టి మాంగల్యబలం, తోటికోడళ్ళు, వినాయకచవితి సినీమాలలోని పాటలు సాధన చేసేవారు. ఆయన చెప్పే విజయనగరం కబుర్లమీది ఆసక్తితో భద్రంగారు చుట్టలు చుట్టేప్పుడు ఆయనతో కాలక్షేపం చేసేవాడిని. ఆయనకు ప్రసన్న అనే తమ్ముడు. వైజాగ్ ఏ.వి.ఎన్. కాలేజీలోనో, యూనివర్సిటీ కాలేజీలోనో  ఎమ్మే తెలుగు లిటరేచర్ చేసేవాడు. కానీ మధ్యలో చిన్న ప్రేమ వ్యవహారంలోపడి అది సఫలంకాక డిప్రెషన్ లో పడి కొన్నాళ్ళ చదువు సక్రమంగా కొనసాగలేదని భద్రంగారు బాధపడేవారు.

పొగాకు చుట్ట మాస్టారికి వ్యసనం కాదు. అవసరం. రోజుకు మూడు చుట్టలు అవసరపడేవి.  

ఘంటసాల మాస్టారు తమ తమ్ముడికి ఏదో ఆధారం కల్పించాలని చాలా తాపత్రయపడేవారు. తమ్ముడు సదాశివుడుగారు, బావమరది సుబ్బారావు గారూ ఇద్దరు వైజాగ్ ఎ.వి.ఎన్. కాలేజీలో ఇంటర్ చదివేవారు. అదే సమయంలో ఘంటసాలగారు సొంత సినీమా నిర్మాణం మొదలుపెట్టడంతో ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకునేందుకు వీరిద్దరు ఇంటర్ పూర్తి చేయకుండానే మద్రాసు వచ్చేసారు. ఒకసారి విద్యకు బ్రేక్ పడితే అది ముందుకు సాగడం కష్టమని అందరికీ తెలిసిందే.  

సినీమాలలో వచ్చిన నష్టంనుండి కోలుకునే ప్రయత్నంలో వేరే మరో వ్యాపారం చేయాలి. అన్నగారిలా తమ్ముడు గాయకుడు కాదు. ఇలాటి పరిస్థితులలో వారిని డైరీఫారమ్ బిజినెస్ ఆకర్షించింది. నార్త్ మద్రాస్ శివార్లలోని మాధవరం డైరీ మిల్క్ ప్రోజెక్టులో పాల వ్యాపారం చేయాలని నిర్ణయించారు. ఎన్.టి.రామారావుగారి కజిన్ రమేష్, ఎమ్జీయార్ అన్న చక్రపాణి, గుడివాడ ప్రాంతాలకు చెందిన బాపినీడు, మరికొంతమంది అక్కడ పాల వ్యాపారం చేస్తూవుండడంతో ఘంటసాల మాస్టారు కూడా ఒక పది గేదెలు కొని తమ్ముడిచేత వ్యాపారం మొదలుపెట్టించారు. ఈ పాల వ్యాపారస్తులందరికీ మాధవరం మిల్క్ కాలనీలోనే క్వార్టర్స్ ఇచ్చేవారు. అలాటి ఒక క్వార్టర్ లో తమ్ముడు తాతగారు (సదాశివుడుగారు), మరదలు పాపగారు (సుబ్బలక్ష్మి) కాపురం పెట్టి పాలవ్యాపారం సాగించారు. మేము పిల్లలందరం శని, ఆదివారాలలో మాధవరం మిల్క్ కాలనిలో గడుపుతు అక్కడి మిల్క్ ఫాక్టరీ తీరుతెన్నులు చూసేవాళ్ళం. ప్రశాంతమైన వాతావరణంలో బాబాయి, పిన్నిగార్లతో గడపడం మాకు చాలా ఆనందంగా వుండేది.

ఘంటసాల మాస్టారికి అత్యంత ఆప్తుడు,పానగల్ పార్క్ కాలంనాటి చిరకాల మిత్రుడు అయిన దేవగుప్తాపు రామచంద్రరావు మాస్టారిని, మద్రాసును విడిచిపెట్టి వెళ్ళిపోయారు.

ఆ ఆసక్తికరమైన విషయాలతోపాటూ....

1964 అక్కినేని వారి ఆత్మబలంతో మొదలయి
నాగయ్యగారి రామదాసుతో ముగిసింది. ఈ మధ్యకాలంలో మరెన్నో ఉత్తమ చిత్రాలు. అసంఖ్యాకమైన ఘంటసాల మాస్టారి గాన తరంగాలు. ఆ సినీమా కబుర్లన్నిటితో  మళ్ళా  వచ్చేవారం.....
                       ...సశేషం


1 comment:

ameerjan said...

�� ఈ వారం కబుర్లు భలే హోమ్లీ గా అనిపించాయి. ఆరోజుల్లో ..తిరుపతి దర్శనం తదుపరి దర్శనం నందమూరి, ఘంటసాల వారిదేనని మేమూ చాల సార్లు విన్నాం! మీ బ్లాగు చదివిన తరువాత ...ఆహ్వానించి అక్కున జేర్చుకునే దేవుడొకరైతే... పరామర్శించి ప్రేక్షక భక్తులను సంతోషపరిచే దేవుడు మరొకరని తెలిసింది. ఏమైనా...ఆనాటి అభిమానాలే వేరు!

�� చదువుకునే రోజుల్లో కొందరు సినీ దేవుళ్ళ అడ్రసులు బట్టీయం పట్టి మిత్రులతో పంచుకోవడం...మాకు అదో సరదా! ����

�� శాస్త్ర పరిజ్ఞానం కోసమే కళాశాలలు కాని, కళ స్వాభావిక జ్ఞానం లేకుంటే అంతగా అబ్బదన్న విషయం బాగా చెప్పారు. ఇక ద్వివేదుల నరశింగరావు, విశాలాక్షి గార్ల గురించి కూడ చదివి ఆనందించాం.

�� చేబ్రోలు పొగాకు చుట్టలు మాస్టారు ఓ వ్యసనంగా కాక, రోజుకు మూడు మాత్రమే కాల్చేవారని చెప్పారు. మా నాన్న గారు కూడ సరిగ్గా అలాగే మూడు లంగరు చుట్టలు మాత్రమే కాల్చడం నాకు గుర్తుంది. వారూ అరవై ఏళ్ళ వయసులోనే డయాబిటీస్ తీవ్రత వల్ల తనువు చాలించడం జరిగింది.

�� మాస్టారు మదరాసులో వుంటూ నా అన్నవాళ్ళందరికీ చేదోడు వాదోడుగా వుంటూ సహాయ సహకారాలందిస్తూ రావడం...మీ ప్రతి ఎపిసోడ్ లోనూ గమనిస్తూనే వున్నాం! ఆప్యాయతానురాగాలు కనబరిచే వారి ప్రవర్తన తరువాతి తరాలకు ఆదర్శం!��