visitors

Sunday, April 11, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై ఆరవ భాగం

11.04.2021 - ఆదివారం భాగం - 26:
అధ్యాయం 2  భాగం 25 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ముందుగా, వారం వారం పట్రాయని బ్లాగ్ ను దర్శిస్తూ 'నెం.35, ఉస్మాన్ రోడ్' ధారావాహికను ప్రోత్సహిస్తున్న సన్మిత్రులందరికీ, రాబోయే శ్రీప్లవ నామసంవత్సర ఉగాది సందర్భంగా మా హృదయపూర్వక శుభాభివందనాలు.
      
ఈ ఏడాది తెలుగు నూతన సంవత్సరాది, తమిళుల నూతన సంవత్సరాది పక్క పక్క రోజుల్లోనే రావడం ఒక విశేషం. తమిళుల నూతన సంవత్సరం ఎప్పుడూ అదే ఏప్రిల్ 14వ తేదీనే జరుపుకుంటారు. చాంద్రమాన ఉగాది మాత్రం ఒక పదిహేను రోజులకి అటుయిటూగా ముందుగానే వస్తూంటుంది. 

ఈ మధ్యకాలంలో రాజకీయ ప్రాబల్య ప్రభావం వలన తమిళనాడు లో నూతన సంవత్సర వేడుకలపై భిన్న భేదాభిప్రాయాలు తలఎత్తి ఒక వర్గంవారు తమిళుల కొత్త సంవత్సరం  'తై' (మన పుష్య మాసం) మాసంలో వచ్చే పొంగల్ (సంక్రాంతి) నుండే ప్రారంభం అవుతుందని దానినే అందరూ పాటించాలని హుకూం జారీచేస్తే మరొక వర్గం కాదు  'చిత్తిరై' (చైత్రం) (ఏప్రిల్ 14) మాస ప్రారంభమే నూతన సంవత్సరమని వాదిస్తుంది. మొత్తానికి ఏ వర్గం అధికారంలో వుంటే వారు నిర్ణయించినదే చట్టం.
'యథారాజా తథాప్రజా'!

మేము  చెన్నై అనబడే మెడ్రాస్ కు రావడమూ, మెడ్రాస్ పెరంబూర్ ప్రాంతంలో 'ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ'  (రైలు పెట్టెల నిర్మాణం) ఆనాటి ప్రధానమంత్రి  శ్రీ జవహర్లాల్ నెహ్రూగారి చేతుల మీదుగా ప్రారంభం కావడం ఇంచుమించు కొద్ది మాసాల తేడాతో జరిగింది. మరో ఆరేడేళ్ళకు న్యూ ఆవడీ రోడ్ లో అణ్ణానగర్ వెస్ట్ సమీపంలో రైల్ కోచ్ ల ఫర్నిషింగ్ విభాగము నిర్మించడం జరిగింది. ఈ రెండు విభాగాలలో పనిచేసే వేలాది ఉద్యోగస్తులలో తెలుగువారి సంఖ్య కూడా అధికంగానే వుండేది. మేము మెడ్రాస్ వెళ్ళిన మొదటి మూడేళ్ళలోనే ఒక ఉగాదికి (అనే గుర్తు) ICF ఫ్యాక్టరీ లో ఘంటసాల మాస్టారి సంగీత కచేరీ జరిగింది. ఆ కచేరీకి నేను కూడా మా నాన్నగారివెంట వెళ్ళాను. నేను చూసిన, చూసి ఆనందించిన ఘంటసాలవారి మొట్టమొదటి సంగీత కచేరీ అదే. ఘంటసాలవారి సంగీత కచేరీ వినడం ఒక గొప్ప అనుభూతి. ఆ అనుభూతిని తరచూ అనుభవించిన అదృష్టం నాకు చిన్నప్పటినుండే కలిగింది.

ఘంటసాల మాస్టారిది, మా నాన్నగారిది ఎప్పుడూ ఒకే డ్రెస్ కోడ్. వైట్ ఎండ్ వైట్. మా నాన్నగారు జుబ్బా, పైజమాలు ధరిస్తే, మాస్టారు జుబ్బా, పంచె లేదా తమిళుల అలవాటు ప్రకారం తెల్ల వేస్టి (లుంగీ)లతో శ్వేత కపోతాలవలె ప్రశాంతంగా కనపడేవారు.


శ్వేత కపోతాలు
మాస్టారు మాత్రం 1972-73 ప్రాంతాలలో కొన్నాళ్ళు కాషాయరంగు బట్టలు ధరించడం జరిగింది. అంతవరకూ ఎప్పుడూ స్వఛ్ఛమైన తెలుపు దుస్తులతోనే కనబడేవారు.

ఘంటసాల మాస్టారు కచేరీలకు బయల్దేరి వెళ్ళేప్పుడు సువాసనలు వెదజల్లే అత్తర్ కొంచెం ఉపయోగించేవారు. సావిత్రమ్మగారి ఆధీనంలో అరంగుళం సైజ్ లో రెండు మూడు బాటిల్స్ లో వివిధ పరిమళాల అత్తర్ లు వుండేవి.  ఆనాటి లెఖ్ఖకు అవి చాలా ఖరీదైనవే. ప్రత్యేకమైన విశేషదినాలలో మాత్రం ఉపయోగించేవారు. ఆ అత్తర్ లను ట్రిప్లికేన్ హైరోడ్ లో వుండే ఒక ముస్లీమ్ అత్తర్ సాహేబ్ అప్పుడప్పుడు మాస్టారింటికి వచ్చి ఈ అత్తర్ లను విక్రయించేవాడు. ఆ సాహేబ్ వీధి వాకిట్లో వుండగానే సెంట్ వాసనల గుబాళింపు సోకేది. తర్వాత ఎప్పుడో 1970 లలో వచ్చిన  'ఆలీబాబా 40 దొంగలు' సినీమాలో  విలన్ సత్యనారాయణ కోసం మాస్టారు పాడిన 'లేలో దిల్బహార్ అత్తర్' పాట విన్నప్పుడల్లా ఘంటసాల మాస్టారు ఉపయోగించిన అత్తర్ సువాసనలే గుర్తుకు వస్తాయి. మా నాన్నగారైతే 'ఆండవర్ జవ్వాదు' పొడిని ఉపయోగించేవారు. 

ఈ సుగంధ పరిమళాలు నా ముక్కుకు సోకుతుండగా  సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కారులో బయల్దేరి ICF కచేరీకి వెళ్ళాము. ఆనాటికి నాకు మద్రాస్ రోడ్ల తీరుతెన్నుల గురించి పెద్దగా తెలియదు. ఆనాటి కచేరీలో పాల్గొన్న ఇతర ఆర్కెష్ట్రావారి గురించి తెలియదు. అయితే మా నాన్నగారితో సహా మరో ఐదుగురారుగురు వాద్య బృందం వుంది. ICF ఫ్యాక్టరీలోకి ప్రవేశించగానే మాస్టారికి అక్కడి ప్రధాన ఉద్యోగులంతా ఘనస్వాగతం పలికి, ముందుగా, కోచ్ ఫ్యాక్టరీ లోపల అంతా తిప్పి చూపించారు. ఆ తర్వాత మాస్టారిని కచేరి వేదిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పండగ వాతావరణంతో అన్ని భాషలవారు హాజరయ్యారు. 

ముందుగానే చెప్పాను, ఘంటసాల మాస్టారి సంగీత కచేరీ వినడం ఒక మధురానుభూతిని కలిగిస్తుందని. అందుకు కారణం, ఆయన ఒక గొప్ప పేరుపొందిన సినీమా గాయకుడు కావడంవల్ల కాదు. కర్ణాటక, హిందుస్థానీ సంగీత శైలులలో లబ్దప్రతిష్టలైన మహాగాయనీగాయకులు, వాద్యకళాకారులు వున్నారు. వారి సంగీతం ఒక వర్గంవారినే ఆకర్షించి ఆనందింపజేస్తుంది. వారంతా పాడే రాగం, తానం, పల్లవులను లేదా ఖయాల్, తుమ్రీలు విని ఆనందించడానికి సంగీతంలోని ఔన్నత్యం, మాధుర్యం అనుభవించడానికి ఆ యా సంగీతం గురించి కొంతైనా తెలిసివుండాలి. అయితే ఏమీ తెలియకపోయినా బుర్రలు ఊపేస్తూ, ఆహా! ఓహో! వహ్వా! అంటూ హంగామా చేస్తూ ఇతరులను ఆకర్షించడానికి, తమ రసికతను నిరూపించుకోవడానికి కొంతమంది కుహానా రసికులు సంగీత సభలకు హాజరవుతూంటారు, అది వేరే విషయం అనుకోండి.   కానీ, ఘంటసాల వారి సంగీతం అలాకాదు. అన్ని వర్గాల శ్రోతలను సమానంగా అలరిస్తుంది. ఘంటసాలగారు లలితసంగీతానికి, లలితసంగీత కచేరీలకు ఆద్యుడు. ఘంటసాలవారు కచేరీలు చేయడం ఆరంభించిన తరువాతే సినీమా పాటల కచేరీలకు ఒక కొత్త గుర్తింపు, హుందాతనం ఏర్పడింది. వేదికలమీద సూటు బూట్లతో, చేతితో మైక్ పట్టుకొని వేదికను దున్నేస్తూ, ఒళ్ళంతా హూనమయేలా హడావుడి చేస్తూ పాటలు పాడే సంస్కృతి ఘంటసాల మాస్టారిది కాదు. తాను కచేరీ చేసే వేదికను సరస్వతీ నిలయంగా భావించి చాలా భక్తిశ్రధ్ధలతో తన కచేరీ ప్రారంభించేవారు. ఘంటసాలవారి సంగీత కచేరీ ఉగాది పచ్చడిలా షడ్రుచులతో, నవరసాలతో నిండివుండేది. శాస్త్రీయం, లలితం,  సినీమాగీతాలు, భక్తిగీతాలు అష్టపదులు, జానపదగీతాలు, పద్యాలు ఇలా అన్ని రకాల ప్రక్రియలతో బహుజనరంజకంగా పండిత పామరులను అలరిస్తూ తన సంగీత కచేరీలు జరిపేవారు. వేదికముందున్న శ్రోతలనాడిని, అభిరుచులను ముందు అర్ధం చేసుకొని అందుకు తగిన పాటలనే ఎంచుకునేవారు. ఘంటసాల మాస్టారు మధ్యలో కూర్చొనివుండగా, ఆయనకు ఇరుప్రక్కలా, వెనుకవేపు వాద్యబృందం అమరివుండేది. అందరూ వేదిక మీద కూర్చోనే శాస్త్రీయ సంగీత పధ్ధతిలో కచేరీ జరిగేది. ఘంటసాల వారు కొన్ని వందల, వేల సంఖ్యలో కచేరీలు జరిపివుంటారు. అయినా, ఆయన ఏనాడు  చేతిలోని పుస్తకం చూడకుండా పాడిందిలేదు. ఒకచేత పుస్తకం, ఒడిలో చేతిరుమాలు, మరొక చేతితో  ఒక చెవిని మూసుకొని పాడడం ఆయన ప్రత్యేకత. అలా ఎందుకు చెవిమూసుకొని పాడతారో కూడా తెలియకుండా చాలామంది ఔత్సాహిక గాయకులు ఘంటసాలవారిని అనుకరించడం చూస్తూంటాము. ఘంటసాల మాస్టారి కచేరీలలో పాడే పాటలన్నీ ఓ మూడు  పాకెట్ సైజు పుస్తకాలలో వుండేవి. కొన్ని పుస్తకాలలోని పాటలు వారి దస్తూరీతో ఉన్నవే. అవన్నీ బాగా పాతబడి జీర్ణావస్థకు చేరుకున్నాక తిరిగి అదే రంగులో, అదే సైజులో కొత్త పుస్తకాలను కొనడం చాలా కష్టమయేది. పానగల్ పార్క్ దగ్గరున్న యూనివర్శల్ స్టోర్స్ , టిప్ టాప్, అంటూ చాలా స్టేషనరీ షాపులు ఎక్కి దిగిన తర్వాత, మాస్టారు ఆశించే సైజు పుస్తకాలు లభ్యమయేవి. 
  

 
 
 


నేను ప్లస్ టూ ముగించినప్పటినుండి ఆ పాత పుస్తకాలలోని పాటలను  తిరిగి కొత్త పుస్తకాలలో రాయడం జరిగింది. అయినా, అలవాటు కొద్ది మాస్టారు  ఆ పాత పుస్తకాలనే కచేరీలకు పట్టుకువెళ్ళేవారు.

ఘంటసాల మాస్టారు తన కచేరీని ఎప్పుడూ వినాయకచవితి చిత్రంలోని 'దినకరా శుభకరా' పాటతోనే ప్రారంభించేవారు. ఆ పాట రావడానికి ముందు జరిగిన సంగీత కచేరీల గురించి నాకు తెలియదు. నేను హాజరయిన మొదటి కచేరీ ICF కచేరీయే.

పూర్యాధనశ్రీ రాగం (కర్ణాటక శైలిలో పంతువరాళి లేదా కామవర్ధని) లోని 'దినకరా' పాటను సశాస్త్రీయంగా రాగాలాపనతో, స్వరకల్పనలతో సుమారు పది పన్నెండు నిముషాలపాటు పాడేవారు.  వినాయకచవితి సినీమాలోనూ, గ్రామఫోన్ రికార్డ్ లోనూ లేని ఒక అనుపల్లవితో సహా ఆ పాటను పాడేవారు. సముద్రాల రాఘవాచార్యులవారు వ్రాసిన ఆ అనుపల్లవి ఏ కారణంచేతనో సినీమాలో లేదు. అందువల్లే రికార్డు లోనూ లేదు. తర్వాత శ్రోతల అభిరుచులమేరకు బహుళ జనాదరణ పొందిన పాటలన్నీ వుండేవి. అన్ని కచేరీలలో విధిగా 'దినకరా శుభకరా', అత్తలేనికోడలు ఉత్తమురాలు', 'పంచదార వంటి పోలిసెంకటసామీ', జయదేవుని అష్టపది 'రాధికా కృష్ణ రాధికా', కరుణశ్రీగారి పుష్పవిలాపం, జాషువాగారి 'పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కొసమై',  దేవదాసు లోని జగమే మాయా, కుడి ఎడమైతే, మాయాబజార్ లోని వివాహభోజనంబు,  ఇలా రకరకాల పాటలు పాడి ఆఖరుగా బ్రతుకుతెరువులోని 'అందమే ఆనందం' పాటతో తన కచేరీ ముగించేవారు. మాస్టారి కచేరీలలో ఎక్కువగా సోలో పాటలే వుండేవి. 'హాయి హాయిగా ఆమనిసాగే' వంటి యుగళాలు పాడినా ఆడ, మగ చరణాలు రెంటినీ ఆయనే పాడేవారు. ఘంటసాలగారి కచేరీలలో మరో విశేషం ఏమిటంటే ఆయన కచేరీలన్నీ సోలో కచేరీలే. ఇతర గాయకులతో కానీ, గాయనీమణులతో కానీ కలసి పాడిన సందర్భాలు బహు అరుదు. 
అలాగే, హెవీ ఆర్కెస్ట్రాతో చేసిన ఇతర సంగీత దర్శకుల పాటలను తన కచేరీలలో ఎక్కువగా పాడేవారు కాదు. కారణం, ఆయా పాటలలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను యదాతథంగా ఉపయోగించడానికి ఆయా పాటల నొటేషన్స్ ను వ్రాయించి తన  కచేరీ ఆర్కెస్ట్రాతో ప్రాక్టీసు చేయించాలి. అప్పుడే పాటకు పెర్ఫెక్షన్ వస్తుంది. కానీ అది  చాలా ఖర్చుతో కూడిన పని. కచేరీ నిర్వాహకులకు అంతంత భారీ మొత్తాన్ని భరించగలిగే ఆర్ధికస్తోమత చాలామంది నిర్వాహకులకు వుండేదికాదు. అప్పట్లో సంగీత కచేరీలు వ్యాపార దృక్పథంతో జరిగినవికావు. అందుచేత మాస్టారు సాధ్యమైనంతవరకూ తన సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలనే పాడేవారు. పాటకు పాటకు మధ్య సందర్భోచితమైన సరస సంభాషణలతో శ్రోతలను రంజింపజేస్తూ కచేరీలు చేసేవారు. ఘంటసాల మాస్టారు పాడితే చాలు, వారిని చూస్తూ పాట వినాలాని తహతహలాడే శ్రోతలే అధికంగా వుండేవారు. ఆయన గాత్ర మాధుర్యం వారి చెవినబడాలి అంతే. ఘంటసాల పాట ఏదైనా అమృత తుల్యమే. 

అలా ICF లోని  ఘంటసాలవారి కచేరీ సుమారు ఓ రెండు గంటలసేపు శ్రోతలను ఆనందంలో ఓలలాడించింది. 

కార్యక్రమానంతరం ICF నిర్వాహకులు ఘంటసాల మాస్టారికి ICFలో తయారయిన రైలుపెట్టె నమూనాను అద్దాలపెట్టెలో పెట్టి జ్ఞాపికగా బహుకరించారు. నేను హాజరయిన ఆ మొదటి సంగీతకచేరీ నాకెపుడూ అపురూపమే, అపూర్వమే.

ఆ తర్వాత మరికొన్నేళ్ళకు మాస్టారింటి హాలులోని అద్దాల బీరువాలో మరో రైలుపెట్టె జ్ఞాపికను చూశాను. అయితే ఆ కచేరీకి నేను వెళ్ళలేదు. ఆ కచేరీ గురించి ఎన్నో దశాబ్దాల తర్వాత  'కళాసాగర్' సుభాన్ ముచ్చటించగా విన్నాను. అప్పట్లో ఎమ్.ఎ.సుభాన్ ICF లో ఉద్యోగం చేస్తూండేవారు. మంచి సాంస్కృతిక పిపాసి. అక్కడి తెలుగు అసోసియేషన్ లో ప్రధానభూమిక వహించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగానే మరో ఉగాదికి ఘంటసాల మాస్టారి కచేరీ ఏర్పాటుచేశారు. మాస్టారు ICFలో కారు దిగి కచేరీ వేదికవద్దకు వెడుతూండగా అక్కడి స్పీకర్లలో తన పాటే వస్తూండడం చూసి చాలా ఆశ్చర్యపోయారట. ఎందుకంటే తాను పాడిన ఆ పాట ఆ రోజు ఉదయమే ఉగాది సందర్భంగా ఆలిండియా రేడియో వారు బ్రాడ్ కాస్ట్ చేసిన ఉగాది పాట. అంత త్వరలో ఆ పాటను తిరిగి వినడం తటస్థిస్తుందని ఘంటసాల గారు ఊహించలేదుట. ఈ పాటను ఎంత శ్రమపడి రికార్డ్ చేసి సాయంత్రం సమయానికి ఘంటసాలగారి సమక్షంలోనే వినిపించిన సుభాన్ గారి కార్యదీక్షాదక్షతలకు ఘంటసాల మాస్టారు ఎంతగానో సంతోషించి అభినందించారట. ఆ విషయాలన్నీ సుభానే స్వయంగా నాకు చెప్పి ఘంటసాలవారి స్నేహ సౌహార్ద్రతను ఎంతో ప్రశంసించారు.  ఆనాడు ICF వారు ఇచ్చినదే ఆ రెండవ రైలు పెట్టె.

1960ల తర్వాత ఎప్పుడో ఒక ఉగాది ఘంటసాల మాస్టారింట్లోనే జరిగింది. శ్రీయుతులు యామిజాల పద్మనాభస్వామిగారు, జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రిగారు (జరుక్ శాస్త్రి) సాహితీలోకానికి చిరపరిచితులు. యామిజాలవారు మా నాన్నగారికి చిరకాల మిత్రులు. సాలూరుకు సమీపంలోని శివరామపురాగ్రహారం వారి స్వస్థలం. ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారిదీ అదే ఊరు. పద్మనాభస్వామిగారు ఉద్యోగరీత్యా మద్రాస్ లో స్థిరపడ్డారు. పానగల్ పార్క్ వద్దనున్న శ్రీరామకృష్ణ మిషన్ శారదా విద్యాలయ గర్ల్స్ హైస్కూలు లో తెలుగు పండితులుగా పనిచేసేవారు. 

శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రిగారి చెల్లెలు మల్లాది మంగతాయారుగారు కూడా అదే స్కూల్ లో మరో తెలుగు టీచర్ గా పనిచేసేవారు. మా చెల్లెళ్ళు, మాస్టారి ఆడపిల్లలు అందరూ యామిజాలవారికి, మంగతాయారుగారి విద్యార్ధినులే. మా పెద్ద చెల్లెలు శ్రీమతి కాకరపర్తి రమణమ్మకి పిహెచ్.డి. చెయ్యాలన్నంత అభిమానం తెలుగు భాష మీద కలగడానికి వీరిద్దరి వద్ద చేసిన శిష్యరికమే కారణమని  నేను అనుకుంటున్నాను. శారదా విద్యాలయలో శ్రీ పద్మనాభస్వామిగారు మాత్రమే మగవారు. మిగిలిన టీచర్లంతా హెడ్మాష్టర్ తో సహా అందరూ మహిళలే. 

యామిజాల వారు మొదట నెం.35, ఉస్మాన్ రోడ్ దగ్గర బజుల్లా రోడ్ కి అవతల తిలక్ స్ట్రీట్ లోను తరవాత  కోడంబాక్కం రైల్వేస్టేషన్ వెళ్ళేదారిలో రామకృష్ణ స్ట్రీట్ ముందుండే వివేకానందా స్ట్రీట్ మొగలో ఉన్న ఇంట్లో ఉండేవారు. యామిజాల వారు చాలా సన్నగా పొడుగ్గా వుండేవారు. మాట కూడా చాలా నెమ్మది. వినీ వినిపించకుండా వుండేది. యామిజాల మాస్టారి భార్య భానుమతి గారు(?) ముగ్గురో నలుగురో మగపిల్లలు. ఆడపిల్లలు లేకపోవడం వలన ఆడపిల్లలంటే ఆ దంపతులు మహా ముచ్చట పడేవారు. మహాశ్రోత్రీయ కుటుంబం. వారింటి పూజాగృహంలో రమణమహర్షి, కావ్యకంఠ గణపతిముని గార్ల చిత్రపటాలు వుండేవి. యామిజాల మాస్టారు మా ఇంటి ప్రక్కనుండే స్కూల్ కు నడచి వెళ్ళేవారు. ఖద్దర్ పంచెకట్టు, మోకాళ్ళ వరకు పొడుగ్గా ఉండే జుబ్బా, దానికి ఒక్క పెన్ను మాత్రం పట్టేపాటి సన్నటి పొడుగు జేబు, భుజంపై కండువా - నిజంగా పూర్వకాలపు ఉపాధ్యాయుడికి ప్రతీకగా వుండేవారు. మాటా నెమ్మది, మనిషి చాలా సౌమ్యుడు. ఈయనకు పూర్తి వ్యతిరేకంగా కనిపించే వ్యక్తి జరుక్ శాస్త్రి అనబడే జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రిగారు. పానగల్ పార్క్ కు ఉత్తరంవేపు యామిజాల వారైతే, దక్షిణం వేపు జలసూత్రం వారు. బహుశా, ఉస్మాన్ రోడ్ లో రామన్స్ కాఫీ పొడి కొట్టు, సలామ్ స్టోర్స్ వెనకవేపు వుండే ఇళ్ళలో వుండేవారనుకుంటాను. అక్కడే జి.ఎన్.స్వామిగారి కుటుంబమూ ఉండేది. టి.నగర్ బస్ స్టాండ్ నుంచి బయల్దేరిన బస్సులు ఆగే మొదటి బస్ స్టాప్ కూడా అక్కడే ఉండేది.

సాయంత్రం ఐదు ఆరు ప్రాంతాలలో  జలసూత్రంవారు, శ్రీరంగం నారాయణబాబుగారు, యామిజాలవారు, మల్లాది రామకృష్ణశాస్త్రిగారు, ఆరుద్రగారి వంటి కవిపుంగవులంతా పానగల్ పార్క్ ముందున్న సిమెంట్ చప్టాల మీద ఆసీనులై లోకాభిరామాయణం ప్రారంభించేవారు. అందరూ సాహితీవేత్తలే కావడం వలన  ఎన్నో ఆసక్తికరమైన విషయలే చర్చించబడేవి. కీట్స్, కృష్ణశాస్త్రి, కిన్నెరసాని, కోడంబాక్కం అప్పలసరసలు, చర్చిల్ చుట్టలు, గిరీశం లెక్చెర్లు, యిలా ఎంతోమంది వారి మాటల్లో కనిపించి పలకరించేవారు. ఈ సాహితీవేత్తల మాటలను వినడానికనే కొంతమంది సాహితీ పిపాసులు శ్రోతలుగా అక్కడికి చేరేవారు. మా నాన్నగారికి కూడా మంచి సాహిత్యాభిలాషవుండడం వల్ల వీరందరితో మంచి సాన్నిహిత్యమే వుండేది. ఆయనకు అవకాశమున్నప్పుడల్లా వీరిని కలుసుకునేవారు. 

శ్రీరంగం నారాయణబాబు
వీరిలో నారాయణ బాబుగారి వేషధారణ మిగతావారికి భిన్నంగా వుండేది. మధ్యపాపిడి, టైట్ పైజమా షేర్వాణి, పొడుగాటి జుబ్బా, పైన వేస్ట్ కోట్.
'యామిజాల జాలమేమి
జాలమేమి యామిజాల'
అంటూ పద్మనాభస్వామిగారి గురించిన రైమ్ ఒకటి వినపడేది. ఆ మాటను ఎవరు ఎప్పుడు ఎందుకు ఉపయోగించారనే విషయం నాకు తెలియదు.

జలసూత్రంవారు మహాభారతాన్ని, యామిజాలవారు రామాయణాన్ని ఆంధ్రీకరిస్తున్న రోజులవి. ఆంధ్రప్రభ దిన పత్రికలో మహాభారతం, ఆంధ్రపత్రిక దినపత్రిక లో రామాయణం ధారావాహికగా ప్రచురించబడేవి. రామాయణ, మహాభారత గ్రంథాల పుస్తకరూప ఆవిష్కరణోత్సవాన్ని ఘంటసాల మాస్టారు చేపట్టారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మా నాన్నగారు కూడా ఇతోధికంగా తోడ్పడ్డారు. ఒక ఉగాదినాటి ఉదయం ఈ కృతిస్వీకారోత్సవం ఘంటసాల మాస్టారింటి హాలులో జరిగింది. ఆ కృతులభర్త ఘంటసాల మాస్టారేనని గుర్తు. ఖచ్చితంగా చెప్పలేను. మా నాన్నగారికి గుర్తుండి ఉండవచ్చు. ఆనాటి ఉత్సవానికి సర్వశ్రీ - దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు, పాలగుమ్మి పద్మరాజుగారి వంటి కవులు ప్రత్యేకంగా విచ్చేసారు. ఆహ్వానితులందరికీ ముందుగా, పార్క్ ల్యాండ్స్ హోటల్ నుండి తెప్పించిన అల్పాహారం తో చిన్నపాటి విందు జరిగింది. తర్వాత, కవిసమ్మేళనంలో భాగంగా యామిజాల పద్మనాభస్వామిగారు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రిగారు తాము ఆంధ్రీకరించిన  రామాయణ, మహాభారతాలనుండి కొన్ని ఘట్టాలను రసవత్తరంగా చదివి వినిపించారు. వక్తల ప్రసంగాల తర్వాత ఘంటసాల మాస్టారు ఈ ఇద్దరు కవులను సముచితరీతిని గౌరవించి సత్కరించారు.  

ఘంటసాల యామిజాల మధ్యలో జలసూత్రం దేవులపల్లి

ఆనాటి కార్యక్రమం ప్రముఖ కవుల రాకతో కళకళలాడింది. మాస్టారు, మా నాన్నగారు ఒక మంచి సత్కార్యంలో భాగస్వాములైనందుకు చాలా ఆనందించారు.

మరికొన్నేళ్ళ తర్వాత, శ్రీ యామిజాల పద్మనాభస్వామిగారు శ్రీ తిరుపతి వేంకటేశ్వరుడిమీద వ్రాసిన 'భువన మోహన' పద్యాన్ని, 'శ్రీశేషశైలేశ శ్రితపారిజాతా' అనే పాటను ఘంటసాల మాస్టారు గ్రామఫోన్ రికార్డ్ గా రిలీజ్ చేసారు.



ఈ విధంగా ఘంటసాల మాస్టారు సాంఘిక, సాంస్కృతిక కార్యకలాపాల పట్ల కూడా మంచి ఆసక్తికనపర్చేవారు.

ఇలాగే మరొకసారి, ఒక యోగాచార్యుడు మాస్టారి వద్దకు వచ్చి మద్రాస్ లో తన యోగాసనాల కార్యక్రమాన్ని సినీ ప్రముఖులందరి ఎదుటా ఏర్పాటు చేయమని కోరారు. సినీమాలోకంలో ఇలాటి యోగా కార్యక్రమాలు ఏమాత్రపు గుర్తింపు, మన్నన పొందుతాయో తెలియని సందిగ్దావస్థలోనే మాస్టారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరంతరం  వృత్తి వ్యాపకాలతో తీవ్రమైన ఒత్తిళ్ళకు గురి అవుతున్న సినీ కళాకారులందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రధ్ధవహించి ప్రతీరోజు కొంతసేపు యోగాసానాలు వేస్తూంటే ఆరోగ్యానికి ఎంతైనా మంచిదని సందేశమిస్తూ ఘంటసాల మాస్టారు పరిశ్రమలోని వారందరికీ ఆహ్వానాలు పంపారు. ఈ ఆహ్వాన పత్రికలను నేను, నరసింగరావు కలసి సినీ ప్రముఖుల ఇళ్ళకు వెళ్ళి ఇవ్వడం అందరినీ ఆహ్వానించాం. ఈ యోగాసానాల కార్యక్రమాన్ని ఘంటసాల మాస్టారు హబిబుల్లా రోడ్ లో వున్న రామారావు కళామండపంలో విజయవంతంగా నిర్వహించారు.

1970లకు ముందు మద్రాసులో తెలుగు సాంస్కృతిక సంఘాలు చాలా తక్కువ సంఖ్యలోనే వుండేవి. చెన్నపురి ఆంధ్ర మహాసభ, పొట్టిశ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్, ఆంధ్రా సోషల్ & కల్చురల్ క్లబ్ - ఇలా తెలుగు సంస్థలు వ్రేళ్ళమీదే లెఖ్ఖపెట్టవచ్చును. ఆయా సంస్థలు కూడా ఏడాదికి ఒకటో రెండో ఉగాది, సంక్రాంతి లాటి పర్వదినాలలో ఉత్సవాలు జరిపేవారు.

ఆరోజుల్లో మద్రాస్ లో తమిళ రంగస్థల నాటకాలకు వుండే మోజు, గిరాకీ సినీమాలకు కూడా వుండేది కాదు. తమిళ సినీ నటులు కూడా తమ పాప్యులారిటీని రంగస్థలం మీదనుండి పెంచుకున్నవారే. శివాజీ గణేశన్, ఆర్.ఎస్.మనోహర్, చో, నాగేష్, తంగవేలు, ఎమ్.ఆర్.రాధ, సహస్రనామం, మనోరమ వంటి నటులంతా కూడా సినీమాలలో నటిస్తూనే  తరచూ నాటకాల ప్రదర్శనలిచ్చేవారు. లెజెండరీ డైరక్టర్ అయిన బాలచందర్, వృత్తిపరంగా గవర్నమెంట్ ఉద్యోగి అయినా రంగస్థల నాటకాల ద్వారా మంచి పేరు పొందారు.  టెలివిజన్ ఇళ్ళలోకి ప్రవేశించనంతకాలం తమిళనాట నాటకాలదే రాజ్యం.  తమిళ సీనీ నటీనటులతో పోలిస్తే తెలుగు రంగస్థల అభివృద్ధికి సినీనటులు చేయగలిగింది ఎంతో కొంత ఉన్నా చేసింది ఏమీ లేదనే చెప్పాలి. 

1965 లో ఘంటసాల మాస్టారు పాడిన పాటలన్నీ ఆణిముత్యాలే. వాటిలో అజరామర గీతాలుగా వన్నెకెక్కినవి - పెండ్యాలగారి 'కొండగాలి తిరిగింది'( ఉయ్యాల జంపాల); నమో భూతనాధా (సత్య హరిశ్చంద్ర); ఎస్.పి.కోదండపాణిగారి 'ఆలయాన వెలసిన, బొమ్మను చేసి ప్రాణం పోసి( దేవత).

ఆ సంవత్సరంలో ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో రెండే రెండు చిత్రాలు విడుదలయ్యాయి. ఒకటి పాండవ వనవాసం. మరొకటి సిఐడి.

ఈ చిత్రాల గురించి వచ్చేవారం....

కొసమెరుపు :
ఇది 1960 లకు ముందే జరిగినది.

ఘంటసాల మాస్టారు కచేరీలకోసం బయట ఊళ్ళకు వెళ్ళేప్పుడు ఎక్కువగా రైల్లోనే వెళ్ళేవారు. మద్రాసు సెంట్రల్ స్టేషన్ వెళ్ళి సాగనంపడనికి పెద్దబాబు, నేను, మాకు (తోడుగా బాబు వాళ్ళ అమ్మగారు - సావిత్రమ్మగారు) వెళ్ళేవాళ్ళం. మా నాన్నగారు ఇతర ఆర్కెష్ట్రాతో ముందే వెళ్ళిపోయేవారు. ఒకసారి హౌరామెయిల్ లో ప్రయాణం. ఆ రోజుల్లో  హౌరామెయిల్ రాత్రి 8.30 కు  4వ నెంబర్ ప్లాట్ఫారమ్ మీదనుండే బయల్దేరేది. మాస్టారు ఫస్ట్ క్లాసులో; ఆర్కెష్ట్రావారు స్లీపర్ కోచ్ లో ప్రయాణం. ఆరోజుల్లో రిజర్వడ్ కంపార్ట్మెంట్స్ లిమిటెడ్ గా ఉండేవి. అందుచేత వెళ్ళిన ప్రతీసారి రిజర్వేషన్ దొరక్కపోతే జనరల్ భోగీలోనే వెళ్ళవలసి వచ్చేది. మాస్టారు స్టేషన్ కు వెళ్ళగానే బృంద సభ్యులున్న చోటికి వెళ్ళి వారిని పలకరించి తన కంపార్ట్మెంట్ వద్దకు వచ్చేవారు. 

ఆ రోజు మాస్టారు కొంచెం ముందే స్టేషన్ కు చేరుకున్నారు. బయట పనుల ఒత్తిడివల్ల ఎప్పుడూ ఆఖరి నిముషంలో ఉరుకులు పరుగులతోనే స్టేషన్ కు వెళ్ళడం జరిగేది. మేమూ వెంట పరిగెత్తుకు వెళ్ళేవాళ్ళం. ఆ రోజు ఓ పది నిముషాలు ముందే చేరుకున్నాము. మాస్టారితోపాటూ మేమూ కంపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాము. ఎదురు సీట్ లో ఎవరో ఇద్దరు యూరోపియన్స్ భార్యాభర్తలు కూర్చొనివున్నారు. మాకు అర్ధంకాని ఇంగ్లీషు స్లాంగ్ లో మాట్లాడుకుంటున్నారు. ఇంక ఒకటి రెండు నిముషాలలో రైలు బయల్దేరబోతున్నదనగా ఆ దొరసాని ఆ దొరగారిని గట్టిగా వాటేసుకొని ముద్దులు పెట్టడం మొదలెట్టింది. Farewell kiss. ఆ దొర మాత్రమే ప్రయాణం చేస్తున్నట్లున్నాడు. నాకూ, పెద్దబాబుకు బ్రహ్మాండమైన షాక్. కళ్ళు పెద్దవి చేసుకొని నోరెళ్ళబెట్టుకు చూస్తున్నాం. మాస్టారు మమ్మల్ని చూసి నవ్వుతు "టైమవుతోంది, ఇంక క్రిందకు దిగండని" అమ్మగారితో చెప్పి వెంటనే మమ్మల్ని క్రిందికి దింపించేసారు. ఆ సీన్ అక్కడితో కట్. అరవై ఏళ్ళ క్రితం బహిరంగ స్థలాలలో ముద్దులు పెట్టుకోవడం భారతీయ సంస్కృతికి విరుధ్ధం. విదేశీయులకు వారి కల్చర్ లో భాగం. వారు అశ్లీలంగా భావించరు. ఈనాడు మన యువతమీద విదేశీ నాగరికతా ప్రభావం  మెట్రోలలోని పబ్లిక్ పార్క్ ల్లో, సినీమా హాల్స్ లో వారి హావభావచేష్టలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 
        ...సశేషం

5 comments:

ameerjan said...

�� ICF లో మాస్టారి కచ్చేరీ విశేషాలతో మొదలైన నేటి మీ బ్లాగ్ ఆద్యంతమూ ఎప్పటి వలెనే ఆసక్తికరంగా సాగింది. శ్వేత కపోతాల అలనాటి అపురూప చిత్రం మరోసారి మమ్మల్ని అలరించింది. అత్తరు, జవ్వాదుల వివరణ, కుహనా రసజ్ఞుల హంగామా, బహుజనరంజకంగా సాగే మాస్టారు కచ్చేరి శైలి, చేతి వేలితో ఓ చెవి మూసుకొని మాస్టారు పాడే విధానం, జీర్ణావస్థకు చేరుకున్న పాటల పుస్తకాలనే మాస్టారు కచ్చేరీలకు తీసుకెళ్ళడం లాంటి అతి చిన్న అంశాలను కూడ వదలి పెట్టకుండ మీరు అక్షరీకరించడం మాస్టారి పై మీ భక్తి శ్రద్ధల్నే కాదు...ఏ విషయాన్నైనా సునిశితంగా పరిశీలించగలిగే మీ నైజాన్నీ తెలియజేస్తున్నది.

�� మాస్టారు తన కచ్చేరీలన్నింటిని “దినకరా శుభకరా” అంటూ ప్రారంభించి...”అందమే ఆనందం” అంటూ ముగిస్తారని తెలియజేయడం; వారివన్నీ చాలవరకు సోలో పాట కచ్చేరీలుగా సాగేవని చెప్పడం; చాల నిరాడంబరంగా, తక్కువ ఖర్చుతోనే కచ్చేరీలు చేయడం మాస్టారు ఇష్టపడేవారని...చెప్పడం...మాకు ఆసక్తిదాయకమైంది.

��అలాగే....ఉగాది కవి సమ్మేళనాల్లో జరుక్ శాస్త్రి, యామిజాల, దేవులపల్లి, పాలగుమ్మి వంటి ఉద్దండ పండితులను మాస్టారు సత్కరించేవారని చదివి...అలాగే అరుదైన, అపురూపమైన ఆ ఛాయాచిత్రాన్ని చూసి చాల సంతోషించాం. ఇక కొసమెరుపు భలే మెరిసినట్లైంది!!����

P P Swarat said...

మీరు పరిశీలనా దృష్టితో చేసిన వ్యాఖ్యలు సంతోషదాయకం. ధన్యవాదాలు.

Pulijalasanthisree said...

నిజమే... లలిత సంగీత కచేరీలు మాష్టారే ప్రారంభించి ఉండాలి...ఆయన కచేరిలే చూస్తున్నాం...వింటున్నాం...లలిత సంగీతానికి...సినీ సంగీతానికి ఒక స్థాయిని కల్పించారాయన..కళ్ళజోడు..చేతిలో పుస్తకము..చెవికి ఆనించి చేయి..పాడేటప్పుడు
ఇవి ఆయన మార్క్ దృశ్యాలు...మా అదృష్టం.. ఇన్ని వివరాలు పంచుతున్నందుకు...ధన్యవాదాలు మీకు

S v మహేష్ బాబు said...

ఘంటసాల మాస్టారు గారి జ్ఞాపకాల పునశ్చరణ లో భాగంగా ఈనాటి సంచికలో వారి సంగీత కచేరీల విశేషాలు.... మాస్టారు గారి వేషధారణ & సింప్లిసిటీ గురించి.... వారు ఉపయోగించే పాటల పుస్తకాలు & అత్తరు ఇత్యాది అంశాల గురించి చాలా చాలా ఆసక్తికరంగా అక్షరీకరించారు....

మాస్టారు గారి తో సన్నిహితంగా మెలిగిన ఆనాటి కవులు & దిగ్గజాల గురించి చాలా తెలియని విషయాలు తెలిసాయి.....

చక్కటి అపురూపమైన మధుర స్మృతులను మాతో పంచుకోవడంతోబాటు అరుదైన ఛాయాచిత్రాలు కూడా మా ముందు ఉంచి మమ్మల్ని ఎంతో ఆనందింపజేసారు...

ఇంత ఓపికగా మాతో మీ జ్ఞాపకాలని పంచుకుంటున్నందుకు ఎప్పటిలాగే శతకోటి ధన్యవాదపూర్వక కృతజ్ఞతాభివందనాలు మీకు తెలియజేసుకుంటూ మరో చకచక్కని సంచిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాము స్వరాట్ బాబాయ్ గారూ 😊🙏🙏😊👏👏👏👏👏👌👌👌👌👌💐💐🌺🌷

చుండి వేంకట రాజు said...

ధన్యవాదాలండి