visitors

Sunday, November 7, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై ఆరవ భాగం

07.11.2021 - ఆదివారం భాగం - 56:
అధ్యాయం 2  భాగం 55 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఘంటసాలవారికి  భారత ప్రభుత్వం ప్రదానం చేసిన 'పద్మశ్రీ' బిరుదు, ఆ తర్వాత హైదరాబాద్ లో జరిగిన బ్రహ్మాండమైన సినీజీవిత రజతోత్సవం  అసంఖ్యాకులైన వారి అభిమానులలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించింది. దాని ప్రభావంతో దేశవ్యాప్తంగా ఘంటసాలవారికి సన్మానాలు, సత్కార సభలు,వారి సంగీత కచేరీలు విరివిగా జరిగాయి. అందులో ప్రముఖమైనది కలకత్తా ఆంధ్రా అసోసియేషన్ వారు జరిపిన రజతోత్సవ కార్యక్రమం,తదుపరి ఘంటసాలవారి కచేరీ. ఈ సన్మాన సభకు గౌ. దామోదరం సంజీవయ్యగారు, శ్రీ పర్వతనేని ఉపేంద్రగారు, పలువురు తెలుగు ప్రముఖులు హాజరయి ఘంటసాలవారి గాన ప్రతిభను కొనియాడి ఘనంగా సత్కరించారు. ఆ కచేరీ లో పాడిన కొన్ని పాటలు నేటికీ మన ప్రసార మాధ్యమాలలో ప్రచారంలో ఉన్నాయి.

అదే 1970లో జరిగిన మరో సన్మాన సభ ఘంటసాలవారి కి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆ సభ తమ గురుతుల్యులైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి స్వస్థలమైన సాలూరు లో జరిగింది. సాలూరు చిన గురువుగారు, శారదా గాన పాఠశాల వ్యవస్థాపకులు అయిన శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రిగారి జయంతి సందర్భంగా వారి శిష్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఘంటసాలవారికి సాలూరులో ఈ సన్మానం ఏర్పాటు చేశారు. 



సాలూరులోని ప్రముఖులు, కళాపిపాసి శ్రీ పాకలపాటి సత్యనారాయణగారు అధ్యక్షుడుగా, డాక్టర్ నవుడూరి శ్రీరామమూర్తిగారు (మక్కువ డాక్టర్ గారు) ఉపాధ్యక్షుడిగా, ప్రముఖ న్యాయవాది శ్రీ అవధానుల సంజీవరావుగారు కార్యదర్శిగా,   చినగురువుగారి శిష్యుడు శ్రీ మానం అప్పారావు,  స్థానిక వాద్య బృంద నిర్వాహకుడు, గాయకుడు శ్రీ కబీర్ షా వంటి ప్రముఖులు కార్యక్రమాల నిర్వాహకులుగా శ్రీ సీతారామ, త్యాగరాజ, నారాయణదాస మహోత్సవ కమిటీని ఏర్పాటు చేసి  ఈ ఉత్సవాలను ఘనంగా వరసగా ఒక వారం రోజులు సాలూరులో ఏర్పాటు చేశారు. గురువుగారి జయంతి సందర్భంగానే వారి శిష్యులైన మధుర గాయకుడు శ్రీ ఘంటసాల వేంకటేశ్వరావు గారికి సన్మాన సభ ఏర్పాటు చేయడం సాలూరు వంటి అతి చిన్న పట్టణ ప్రజలలో, మా తాతగారి, మా నాన్నగారి అభిమానులలో చాలా ఆసక్తిని, ఆనందాన్ని కలిగించింది. ఈ ఉత్సవంలో పాల్గొనడం తన కర్తవ్యంగా భావించి ఘంటసాలవారు వెంటనే తన ఆమోదాన్ని తెలియజేశారు. మద్రాసు నుండి ఘంటసాల మాస్టారితో పాటు, మా నాన్నగారు పట్రాయని సంగీతరావు గారు, వారి జ్యేష్ట కుమారుడినైన నేను కూడా సాలూరు వెళ్ళాము. అప్పటికి, మా సాలూరు పాఠశాలను నిర్వహిస్తూ వచ్చిన మా రెండో చిన్నాన్నగారు పట్రాయని ప్రభాకరరావుగారు తన కొడుకు వద్ద జెంషడ్పూర్ లో స్థిరపడ్డారు. అక్కడ నుండి ఆయన, మా శర్మబాబు, మక్కువ నుండి మా శ్రేయోభిలాషి, రచయిత,  ఆకుండి నారాయణమూర్తిగారు ఆనాటికి సాలూరు వచ్చారు.

ఘంటసాలవారి సత్కార సభ వైభవంగా జరిగింది. ఆ సభలో మా నాన్నగారు సాలూరు తో తనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని రసవత్తరంగా వివరించారు. ఘంటసాలవారు గురువుగారి స్వస్థలంలో తాను సన్మానం పొందడం మహాద్భాగ్యమని, విజయనగరంలో గురువుగారి సమక్షంలో తాను పొందిన సంగీత శిక్షణ, అనుభవాలను వర్ణించారు. ఆ తర్వాత వారి సంగీత కచేరీ జరిగింది. మరునాడు మా నాన్నగారి సంగీత కచేరీ కూడా జరిగింది.  ఈ సందర్భంగా శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారి జయంత్యుత్సవ ప్రత్యేక సంచికను ఘంటసాలవారి చేతులమీదుగా విడుదల చేయాలని కమిటీవారు సంకల్పించారు. కానీ పుస్తక ప్రచురణలో జరిగిన జాప్యం వలన ఆ పుస్తకావిష్కరణ ఆ రోజు జరగలేదు. తరువాత మరి రెండు సంవత్సరాలకు మరో జయంతి రోజున ఆ ప్రత్యేక సంచికను మరో సందర్భంలో వేరెవరో ఆవిష్కరించారు.  ఈ పుస్తకంలో సర్వశ్రీ - పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రిగారు, క్రొవ్విడి రామంగారు, ఘంటసాల వేంకటేశ్వరరావుగారు, పట్రాయని సంగీతరావుగారు, ఇతర ప్రముఖుల వ్యాసాలు, పట్రాయని సీతారామ శాస్త్రిగారి కృతులు కొన్ని చోటుచేసుకున్నాయి.

సాలూరులో జరిగిన ఈ ఉత్సవంతో నాకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ఆ సన్మాన సభకు హాజరయిన కారణంగా, స్వాగతోపన్యాసకులు  నా పేరును కూడా సభాముఖంగా ప్రకటించడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని, సహజంగాగల సభాపిరికితనం వలన మొహమాటాన్ని కలుగజేసింది. 

సాలూరులో ఘంటసాల మాస్టారికి జరిగిన ఈ సన్మాన సభ కూడా నాకెంతో  అపురూపమైనది, అమూల్యమైనది. మరపురాని సంఘటనలలో ఒకటి.

సాలూరు ఊరంతా నాకు పూర్తిగా పరిచయం లేకపోయినా మా పాఠశాల పరిసర ప్రాంతాలు బాగా తెలుసు. మా ప్రభు చిన్నాన్నగారి కుటుంబం సాలూరు లో ఉన్నంత కాలం గణపతి నవరాత్రులకు ప్రత్యేకించి బొబ్బిలి నుండి వెళుతూండేవాడిని. ఆ విశేషాలన్నీ గతంలో తెలియజేశాను.

ఈ సాలూరు పాఠశాలను గురించి తలచుకున్నప్పుడల్లా కొన్ని చేదు సంఘటనలు కూడా గుర్తుకు వస్తాయి. మన మనుషులనుకునేవారే అసూయతో, స్వార్ధంగా, కుత్సితబుధ్ధితో వ్యవహరించారని తెలిసినప్పుడు ఎంతో బాధ, భయము కలిగింది.

మా ముత్తాతగారు శ్రీ పట్రాయని వెంకట నరసింహ శాస్త్రిగారు,మా తాతగారు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు కలసి  శ్రీ శారదా గాన పాటశాలను నెలకొల్పారు.  మా తాతగారు తమ స్వార్జితంతో ఉన్న స్థలానికి మరికొంత స్థలాన్ని కొని  అష్టకష్టాలు పడి ఒక్కొక్క ఇటుకగా చేరుస్తూ పది సంవత్సరాల నాటికి తగుమాత్రపు నిర్మాణం చేసి సంగీతాభిలాషతో తమ వద్దకు వచ్చినవారికి ఉచితంగా సంగీత శిక్షణలు ఇచ్చేవారు.

సాలూరులోని  మా తాతగారి ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక కుటుంబపోషణార్ధం విజయనగరం మహారాజా సంగీతకళాశాలలో గాత్రోపన్యాసకునిగా చేరారు. తాను ఎంతో పవిత్రంగా, ప్రేమతో స్థాపించిన  సంగీత పాఠశాలను  నిర్వహించే భాధ్యతను తన  శిష్యులకు అప్పగించారు. మధ్య మధ్య వచ్చి స్థితిగతులు చూసుకునేవారు. 1957 ఏప్రిల్ లో మా తాతగారు దివంగతులయ్యాక విజయనగరం లో ఉండే ఆస్కారం లేక మా రెండో చిన్నాన్నగారు పట్రాయని ప్రభాకరరావు గారు తన కుటుంబంతో  స్వస్థలమైన సాలూరు చేరవలసిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలో ఒక భాగంలో  కుటుంబం తో తను వుంటూ మరొక భాగంలో తానే స్వయంగా సంగీత శిక్షణలు ప్రారంభించాలని సంకల్పించారు. కానీ ఆ వ్యవహారం అంత సులభంగా జరగలేదు. అంతవరకూ ఆ పాఠశాలను చూసుకున్న వ్యక్తి మా చిన్నాన్నగారు ఆ ఇంటిలో ప్రవేశించకుండా అనేక అడ్డంకులు కల్పించారు. అందుకుగాను కొంతమంది రౌడీలను కూడా వినియోగించారట. అయితే సాలూరు చిన గురువుగారన్నా, సంగీతరావుగారన్నా గౌరవాభిమానాలు కల వ్యక్తులు చాలా మంది సాలూరులో ఉన్నారు. వారందరూ వచ్చి పాఠశాలను ఆక్రమించుకున్న వ్యక్తికి తగు హితోపదేశం చేసి, అందుకూ లొంగకపోతే ఏంచేయాలో చేసి చూపిస్తామని హెచ్చరించి చివరకు వారిని అక్కడనుండి బయటకు సాగనంపారు. 

మన సొంత ఆస్తులే అయినా  వాటిని స్వయంగా సక్రమంగా నిర్వహించుకోని పక్షంలో కలిగే అనర్ధాలు అనేక రకంగా వుంటాయి. సమాజంలో ఇంకా మంచి వున్నందునే ఈ నాటికీ సాలూరులో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి సంగీత పాఠశాలగా కొనసాగుతున్నది. 

మద్రాస్ లో నేను పనిచేస్తున్న  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ లయొజన్ ఆఫీస్ లో నా తాత్కాలిక ఉద్యోగం కొనసాగుతూనే వచ్చింది. ఆ ఆఫీసుకు ఉన్నతాధికారిగా IAS క్యాడర్ కు బదులు District Administration Officer హోదాలో వున్న వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ నుండి మద్రాస్ ఆఫీసుకు నియమించారు. ఆయన పేరు ఎ.ఎస్.శివశాస్త్రి. గుంటూరు అని గుర్తు. మధ్యవయస్కుడు. ఆఫీస్ కు సమీపంలోనే ఇల్లు అద్దెకు తీసుకొని కుటుంబం తో ఉండేవారు. చాలా శ్రోత్రీయుడు. చాలా సౌమ్యుడు. నా విషయంలో చాలా అక్కర చూపించేవారు.

ఈ తాత్కాలిక ఆఫీసులో తాత్కాలిక ఉద్యోగంలో వుంటూ భవిష్యత్ ను వృధా చేసుకోవద్దని, గ్రాడ్యుయేషన్, స్టెనోగ్రఫీ అయినందువలన ఏవైనా సర్వీస్ కమీషన్ పరిక్షలకు కడితే మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని సలహాలు ఇచ్చేవారు. అక్కడ పని చేస్తున్న రోజులలోనే ఒకసారి తీవ్రమైన జాండిస్ వచ్చింది. ఆఫీసుకు వెళ్ళిరావడం కష్టమైపోయింది.  నెలలపాటు శెలవు పెట్టవలసి వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత శివశాస్త్రి గారి సలహా మేరకు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చాను. మరల మంచి ఉద్యోగాలకోసం ప్రయత్నం మొదలయింది. 

మా క్రిందింట్లోని కొల్లూరి వెంకటేశ్వరరావు గారు ఏవో సలహాలు సూచనలు ఇచ్చేవారు.  మన కృషి ఎంతవున్నా  సమయం, సందర్భం, అంతకుమించిన అదృష్టం కలసిరావాలి. అంతవరకు కాచుకొని ఉండకతప్పదు. తిరుమల కొండమీది వేంకటేశ్వర స్వామివారిలా మేడమీద ఘంటసాల వేంకటేశ్వరావుగారు; క్రింద తిరుపతిలోని వరదరాజ పెరుమాళ్ లా క్రిందింట్లో కొల్లూరి వెంకటేశ్వరరావు గార్ల కుటుంబ సభ్యులతో నెం. 35,ఉస్మాన్ రోడ్ ఎల్లప్పుడూ  సందడిగా కళకళలాడుతూ వుండేది. పైన సంగీత వాతావరణం, క్రింద పారిశ్రామిక, వ్యాపార వాతావరణం. రెండు చోట్లా వచ్చే పోయే జనాలతో ఇంటి మెయిన్ గేట్ ఎల్లప్పుడూ తెరిచే వుండేది. దానివలన బయటనుండి వచ్చే మేకలు, ఆవులు ఉన్న నాలుగు మొక్కలను తృప్తిమేరకు నమిలి పోతూండేవి. అందుకే ఆ కాంపౌండ్ లో పువ్వుల మొక్కలు ఎక్కువ కనపడేవి కావు.

కొల్లూరి వారింటికి బంధుమిత్రుల రాక అధికమే. శని ఆదివారాలు వస్తే ఇల్లంతా సందడే సందడి. అందరూ గట్టిగా అరుచుకుంటూ, నవ్వుకుంటూ మాట్లాడుకునేవారు. 

అప్పుడప్పుడు రావుగారి కజిన్స్ ఇద్దరు వస్తూండేవారు. ఒకరి పేరు చిన్నా, ఇంజనీర్. ఏదో కంపెనీలో ఎక్సిక్యూటివ్ గా పనిచేసేవారు. రేమండ్/రేబన్ గాగుల్స్ మోడల్ లా వుండేవారు. కనిపించినప్పుడు పలకరింపులు వరకే మా పరిచయం. మరొక కజిన్ పేరు పండు. అసలు పేరు తెలియదు. ఇతను IIT లో చదివేవాడట. నాకు పరిచయంలేదు. అతని ముఖం కూడా గుర్తులేదు. రావుగారింట్లో వాళ్ళు మాటల సందర్భంలో అనుకోగా వినడమే. ఈ ఇద్దరూ సొంత అన్నదమ్ములు కారట. ఈ వివరాలు గత వారాలలో ప్రస్తావించడం జరిగింది.

ఒక రోజు క్రిందింటి వెంకటేశ్వరరావుగారింట్లో అంతా నిశబ్దంగా వుంది. పెద్ద అలికిడి లేదు. కనిపించిన ఒకరిద్దరు కూడా ఏదో డల్ గా కనిపించారు. ఏవో కొత్త ముఖాలు కూడా కనిపించాయి. నాకు మేడమీద మాస్టారింట్లోకి వెళ్ళి మాట్లాడేంత చనువు క్రిందింట్లో వుండేదికాదు. మరీ అవసరమైతే తప్ప.

ఉదయం పదకొండు గంటల తర్వాత బయట ఒకటే కలకలం. క్రిందింట్లోంచి   ఒక ముసలాయన గట్టిగా ఏడుస్తూ బయటకు వచ్చారు. పోర్టికో అరుగుమీదే అని గుర్తు, పూర్తిగా కప్పేసిన ఒక బాడీని తీసుకు వచ్చి దింపారు. ఇంట్లోని వారంతా గొల్లుమంటూ ఆ బాడీ చుట్టూ చేరారు. తర్వాత కొంతసేపటికి తెలిసింది  అంతకుముందు రోజు సాయంత్రం చిన్నాబాబు మహాబలిపురం వెళ్ళి వస్తూ రోడ్ ఆక్సిడెంట్ లో దుర్మరణం చెందారని. ఎవరమూ ఏనాడూ ఊహించని  ఆకస్మిక దుర్ఘటన. అన్నిటికంటే విచారకరమైన విషయమేమంటే  ఆ చిన్నాబాబుకు అప్పటికి కొన్ని మాసాలముందే వివాహమయిందట. పాపం, ఆ అమ్మాయి గతేమిటని మా మూడిళ్ళలోని ఆడవారంతా తలచుకొని విపరీతంగా బాధపడేవారు.

వృధ్ధుడైన అతని తండ్రి  కొడుకు పక్కనే కూలబడి విలపించిన దృశ్యం మాత్రం నన్నిప్పటికీ కలచివేస్తూవుంటుంది.  మరొక విషయం ఏమిటంటే అంతకు ముందు సంవత్సరమే IIT లో చదువుతున్న పండుబాబు కూడా తన స్నేహితులతో సముద్రస్నానానికి వెళ్ళి సముద్రంలో ములిగిపోయి దుర్మరణం చెందాడట. ఏడాది వ్యవధిలో, వృధ్ధిలోకి వచ్చి చేతికి ఆసరాగా వుండవలసిన ఇద్దరు నవ యువకులు  కళ్ళెదటే చనిపోవడం  ఆ ఇంటివారికి ఎంత కష్టం,ఎంతటి దురదృష్టకరం. ఆ కుటుంబంలోనివారు ఎలా తట్టుకోగలుగుతారు.

ఎలాటి దుఃఖాలనైనా, కష్టాలనైనా, అన్నింటినీ కాలమే  దూరం చేసి ఓదార్పును ఇస్తుంది. కానీ అలాటి విషాదకర జ్ఞాపకాలు మనసును కలచివేస్తాయి.

🌿🌷🌿

ఇలాటి సందర్భాలలోనే లౌకిక బంధాలకు అతీతంగా వైరాగ్యంతో తాత్త్విక చింతనలో వుండే సాధువులు, సన్యాసుల జీవితమే ఉన్నతమైనదేమో అని అనిపిస్తుంది. అయితే సర్వసంగపరిత్యాగానికి కావలసిన జ్ఞానము, పరిపక్వత  సంపాదించడం అంత తేలికైన విషయము కాదు. సనాతన భారతీయ సంస్కృతి కి దర్పణం పట్టే సాధు సత్పురుషులంటూ ఒక ప్రక్క గౌరవిస్తూనే మరోప్రక్క సన్యాసులంటే సమాజాభివృధ్ధికి ఏమాత్రం దోహదపడనివారని వాదించేవారున్నారు. ప్రతిఒక్కరు ముక్కు మూసుకొని ధ్యానం పేరిట అడవులకు చేరితే  జీవనవ్యవస్థ ఏమవుతుంది. దేశ పురోభివృద్ధి ఎలా సాగుతుందని ప్రశ్నించేవారూ ఉన్నారు. ఈ వాదనలను సమర్ధించడానికి గాని, ప్రతిఘటించడానికి గాని కావలసినంత పరిజ్ఞానము, విచక్షణాశక్తి నాకు ఏమాత్రము లేవు. 

🌺

ఒకరోజు సినీ/రంగస్థల నటులు శ్రీ కాకరాల మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో  చెప్పారు "స్వామీజీ వచ్చారు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు" అని. మా నాన్నగారు ఆయనింటికి వెళ్ళి స్వామీజీని మా ఇంటికి తీసుకువచ్చారు. సచ్చిదానందేంద్రస్వామి మద్రాసులోని మా ఇంటికి రావడం అది రెండవసారి. అంతకు ఒక దశాబ్దం ముందు వచ్చారు. అప్పుడు కూడా శ్రీ కాకరాలగారే వచ్చి చెప్పారు. ఆయన భార్య స్వామీజీ శిష్యురాలు. మా నాన్నగారి మాటల్లో, శ్రీ కాకరాల గారికి ఆధ్యాత్మిక జీవులపట్ల అంత ఆకర్షణ ఉన్నట్లు కనిపించదు. ఇటీవలికాలంలో నేను గ్రహించినది ఆయన శ్రీ రాహుల్ సాంకృత్యాయన్ రచనలకు, సిధ్ధాంతాలకు ప్రభావితుడైన వ్యక్తి. స్వామీజీ మా నాన్నగారిని చూసి "అయితే మీ ఇంటికి బిక్షకు పిలుస్తున్నావా లేకపోతే మీ ఇంట్లో కొన్నాళ్ళు ఉంచుకుంటానంటావా" అని అడిగారట. దానికి సమాధానంగా మా నాన్నగారు " మా ఇంట్లో కొన్నాళ్ళు మిత్రుడుగా ఆహ్వానిస్తున్నాను" అన్నారట. ఆ విధంగా స్వామీజీ మా ఇంట కొన్నాళ్ళపాటు రెండు సార్లు వచ్చి వున్నారు, తన సన్యాస జీవితానికి అనుగుణంగానే. స్వామీజీ 1970 లలో రెండవసారి మా ఇంటికి వచ్చే సమయానికి మా నాన్నగారి ఆర్ధిక స్థితి అంత ఆశాజనకంగా లేదు. కుటుంబం పెరిగింది. ఆదాయం తగ్గింది. ఉన్న ఎనిమిదిమంది కాకుండా తొమ్మిదవ వ్యక్తిని కూడా భరించాలంటే సగటు గృహస్తుకు సాధ్యమయే పనికాదు. అందులోనూ ఆయన సన్యాసి.ఆయన అలవాట్లు,ఆచారాలు, ఆహార విహారాదులు మామూలువారికంటే భిన్నంగా వుంటాయి. స్వామీజి ఉనికి ఘంటసాలగారి సతీమణి  సావిత్రమ్మగారికి అంతగా రుచించలేదు. సన్యాసులు దేవాలయాలలోనో, మఠాలలోనో ఉండాలిగానీ ఇళ్ళలో వుంటే ఎలా అని మా అమ్మగారితో అనడం జరిగింది. దానితో మా నాన్నగారికి  స్వామీజీ కోసం ప్రత్యమ్నాయ నివాసం ఏర్పాటు చేయక తప్పలేదు. ఆ సందర్భంలో మా నాన్నగారికి శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు గారు గుర్తుకు వచ్చారు. బస్సులో పరిచయం, సంగీతం ద్వారానే. ఆయనకు శృంగేరీ,కాంచికామకోటి పీఠాధిపతులతో కొంత సాంగత్యం వుండేదట. ఆయనతో స్వామీజీ చాతుర్మాస్య సమస్యగురించి చెప్పారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి తగిన ఏర్పాటు చేస్తానని చెప్పడమే కాక తమ ఇంటికి బిక్షకు ఆహ్వానించి తీసుకువెళ్ళారు. కానీ, తరువాత వారిద్దరి మధ్య సిధ్ధాంతపరమైన అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. చివరకు స్వామీజీ చాతుర్మాస్య దీక్ష మద్రాసులో జరగలేదు.

ఇక్కడ, సచ్చిదానందేంద్ర స్వాములవారి పూర్వాశ్రమ జీవితం గురించి కొంత చెప్పక తప్పదు. స్వామీజీ పూర్వాశ్రమంలో పంతుల పద్మనాభ స్వామి. మేనమామ గారి సంరక్షణలో మద్రాసులో ఇంజనీరింగ్ చదువుతూండేవారు. ఆ సమయంలో ఆయనకు సంగీతం నేర్చుకోవాలని కోరిక పుట్టిందట. సంగీతం తప్ప మిగిలిన విద్యలేవీ జీవిత సార్ధకత కలిగించవని భావించి, మా తాతగారు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి కీర్తిని విని, నేర్చుకుంటే  ఆయన వద్దే సంగీతం నేర్చుకోవాలని 1935లో సాలూరు వచ్చారట. అప్పటికి ఆయన వయసు ఇరవైలోపు. మా నాన్నగారి కంటే ఐదేళ్ళు పెద్ద.  మా తాతగారి వద్ద సంగీత శిష్యరికం మొదలెట్టారు. పద్మనాభ స్వామి గారికి రవీంద్ర సాహిత్యం అంటే చాలా ఇష్టమట. టాగూర్ కధలన్నీ మాతాతగారికి చదివి వినిపించేవారట. ఆ విధంగా ఆయన మా నాన్నగారికి సన్నిహితుడయ్యారు. ఇతరులనెవ్వరినీ పట్టించుకునేవారు కాదట. కొన్నాళ్లు అయాక ఆయన తల్లిగారి ఆరోగ్యం బాగాలేదనే వార్త వచ్చి సాలూరు వదలిపోయారు. ఆ తర్వాత కాలంలో నరసన్నపేటలో సామవేదుల సీతారామశాస్త్రిగారి వద్ద సంస్కృత భాషాభ్యాసం చేశారట. వేదాంతగ్రంధాలు సంస్కృతంలోనే అధ్యయనం చేయాలని, సన్యాసం స్వీకరించాలని సంకల్పించారట. ఆయన నిర్ణయం బంధువులందరికీ ఆందోళన కలిగించింది. కానీ శాస్త్ర సమ్మతమైనదానిని ఎవరు కాదనగలరు. పంతుల పద్మనాభ స్వామిగారు సన్యాసం స్వీకరించేముందు నైష్టిక బ్రహ్మచర్యం అవలంబించి తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. 

మాతాతగారు తమ నివాసం విజయనగరం మార్చాక  స్వామి మరల మా తాతగారింటికి స్వామీ రామతీర్థలా వచ్చేరట. ఆవిధంగా  మరల ఆయన మాతాతగారికి, మా నాన్నగారికి చాలా సన్నిహితులయ్యారు. మా నాన్నగారు ఏ ఊళ్ళో వున్నా అక్కడకు వెళ్ళి సంగీత,సాహిత్య, వేదాంత చర్చలు జరిపేవారట.
మా తాతగారంటే అమితమైన భక్తి శ్రధ్ధలు కనపర్చేవారట. మా తాతగారు శిష్యులకు బోధించే ఒక  రామనామ సంకీర్తనను తర్వాత ఎప్పుడో ఏభై ఏళ్ళ తర్వాత మా నాన్నగారి దగ్గర పాడి వినిపించారట. 

1947 లో  స్వాతంత్ర్యం వచ్చాక దేశానికి జరిగిన మొదటి పార్లమెంటరీ ఎలక్షన్స్ లో నెహ్రూకు ఎదురుగా సనాతనిస్ట్ పార్టీ అభ్యర్ధిగా ప్రభుకల్ప బ్రహ్మచారి పోటీచేసారట. ఆ సనాతనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు కరపత్ర స్వామీజీ. ఆయన మా స్వామీజీకి శిష్యుడట. శిష్యుడికోసం  ఆయనకూడా ఎలక్షన్ ప్రచారంలో పాల్గొని, కలివరంలో  ఉన్న మా నాన్నగారిని చూసేందుకు వచ్చారట. 

శ్రీ సచ్చిదానందేంద్ర స్వామీజీని మా నాన్నగారు చివరిసారిగా 1980 లలో జంషెడ్పూర్ లో కలిసారు. అప్పటికి స్వామీజీలో కొంచెంగా వార్దక్య లక్షణాలు చోటుచేసుకున్నాయి. స్వాముల వారికి జరగవలసిన సకల మర్యాదలు ఆయన పొందారు. స్వామీజీ అనేక వేదాంత గ్రంధాలు వ్రాసారు.

వాటిలో కొన్ని పుస్తకాలను మా నాన్నగారికి బహుకరించారు కూడా. సుమారు ఇరవై సంవత్సరాలక్రితం స్వామీజీ సిధ్ధిపొందారు. అనారోగ్యంతో వున్న ఆయనను ఆయన భక్తులో, శిష్యులో వారి బంధువులకు అప్పజెప్పారట. కానీ, అనారోగ్యంతో వున్నసన్యాస జీవికి  వాళ్ళెలా ఆప్తులవుతారు. ఎవరూ పట్టించుకోలేదు. చివరకు స్వామీజీ అంత్యక్రియలను ప్రేమ సమాజం వాళ్ళు నిర్వర్తించారట. 

స్వామి సచ్చిదానందేంద్ర గురించి మా నాన్నగారు శ్రీ పట్రాయని సంగీతరావు గారు తన " చింతాసక్తి" లో ఇలా వ్రాసుకున్నారు. ఆ మాటలను యథాతథంగా మీ ముందు ఉంచుతున్నాను.

"అతి చిన్నతనంలోనే అన్వేషణలో పడిన అతి మెత్తటి యువకుడు ఆయన.  ఆయన అన్వేషణలో గ్రహించినదేమో, సాధించినదేమో. ఆయన శాస్త్రీయంగా సన్యసించారు. సన్యాసిగా పీఠాధిపత్యం వహించలేదు. తెలుగులో చాలా గ్రంధాలు రాసినా, సన్యాసిగా గొప్ప పేరు సంపాదించలేదు. డబ్బుకి ఇబ్బంది పడలేదు. నిజమే. కాని యితరులు ఆయన్ని డబ్బుకోసం ఆశ్రయించి ఉండవలసినంత ఉందనుకోను.

లోకంలో ఒక కవి, ఒక గాయకుడు, ఒక భౌతిక శాస్త్రవేత్త  ఇలాంటి వాళ్ళ గొప్పతనం ఏమిటో అర్ధం చేసుకోవచ్చును. ఆధ్యాత్మిక వేత్త అనుభవం ఏమిటో అర్ధం కాదు. కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు గ్రహించినదానిని పుస్తకరూపంగా, ఉపన్యాసాల రూపంగా ప్రకటించి గొప్ప పేరు ప్రఖ్యాతులు, ధనమూ కూడా సంపాదిస్తారు. అయితే అదంతా లౌకికమే. మన అనుభూతి కి భిన్నమైనది ఏమి పొందారో తెలియదు. శంకర, రామానుజులు, స్వామి వివేకానందులు, అరవిందులు, రాజా రామమోహన రాయలు, వీళ్ళంతా గొప్పవాళ్ళే. లౌకికంగా వాళ్ళ గొప్పతనం గ్రహించింది లోకం. వాళ్ళ వ్యక్తిత్వానికి, ప్రచారానికి లోనయింది. చాలామంది కళాకారుల ప్రభావంలాగే. వాళ్ళంతా మనుషులుగానే బతికారు. మానుష స్పృహలోనే జీవించేరు. అవాజ్ఞ్మానసము, అఖండమూ, సచ్చిదానందమూ ఇవన్నీ మాటలే కదా. మనుష్యులలో రూపంలోనూ, గుణంలోనూ, తెలివితేటలలోనూ అంతరం ఉంది. వాళ్ళ అనుభవంలో నాజూకుతనం, మోటతనం, రసికత్వం, ఆటవికత ఇలాటి అంతరవులు ఉన్నాయి. ఇవి తెలుస్తాయి కూడా. బ్రహ్మజ్ఞానిగా భావించినవాని అపరోక్షానుభూతికి, మామూలు మనిషి అనుభవానికి గల వ్యత్యాసం ఏమిటి - అర్ధం చేసుకోవాలి. మనంతట మనమే చెప్పగలిగేది కాదు కదా. 

స్వామీజీ వంటి మహనీయులు, మహానుభావులు ఎందరో ఈ భువిని ప్రభావితం చేసారు. వారందరికీ వందనములు. 

🙏🙏💐💐🙏🙏


నెం.35,ఉస్మాన్ రోడ్ లోని మరెన్నో అనుభవాలతో,
జ్ఞాపకాలతో మళ్ళీ వచ్చే వారం...
          .    ...సశేషం

4 comments:

చుండి వేంకట రాజు said...

ధన్యవాదాలండి. చాలా ఓపికగా వివరిస్తున్నారు

P P Swarat said...

కృతజ్ఞతలు.

మహేష్ బాబు సంబటూరి వెంకట said...

కొన్ని తీపి....
కొన్ని చేదు....
ఎన్నో జ్ఞాపకాల సమాహారం మీ ఈ రైటప్....
ఎంతో శ్రమకోర్చి ఇంత ఓపికగా మీ జ్ఞాపకాలను మాతో పంచుకుంటున్నందుకు మీకు హార్ధిక శతకోటి ధన్యవాదపూర్వక కృతజ్ఞతాభివందనాలు స్వరాట్ బాబాయ్ గారూ 🙏🙏💐💐🙏🙏

హృషీకేష్ said...

మాస్టారి సాలూరు సన్మానం, సాలూరు సంగీత పాఠశాల వివరాలు, స్వామీజీ విషయాలు కొత్తగా చదివించేవిగా ఉన్నాయి. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకొని, సవివరంగా తెలుపుతున్న మీకు అభినందనలు, నమస్సులు! హృషీకేష్🙏🙏