visitors

Sunday, March 28, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై నాలుగవ భాగం

28.03.2021 - ఆదివారం భాగం - 24:
అధ్యాయం 2  భాగం 23 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
తూర్పున బంగాళాఖాతంలో నుంచి ఉదయించిన సూర్యుడు తన కిరణాలను మా లోగిట్లోకి ప్రసరించకముందే, ఒక రోజు ఉదయం, చాలా తిరుపతి గుళ్ళు మా ఇంటి వాకిట ప్రత్యక్షమయాయి. ఇది మేము 'నెం.35, ఉస్మాన్ రోడ్' కు వచ్చిన కొత్తల్లో. తిరుపతిలో కనిపించే గుళ్ళు మెడ్రాస్ లో మా ఇంటివాకిట్లో చూడడం అదే మొదటిసారికావడం వలన నాకు వింతగా అనిపించింది. 
"ఒరే! అప్పన్నా! ఇదేరా ఘంటసాల ఇల్లు. ఆపు, బండాపు' అని ఒకరు, 'ఓయ్ ఓబులేశు!  ఉస్మాన్ రోడ్ లో 35 నెంబరు ఇల్లు ఇదే. ఘంటసాల పేరుంది. అందరు దిగండి, దిగండి" అనే అరుపులతో మాకు తెల్లవారడం అలవాటయిపోయింది. 

మాయాబజార్, వినాయకచవితి, వెంకటేశ్వర మహత్యం వంటి సినీమాల ప్రభావంతో, ఏడుకొండల సామి మీద ఘంటసాల పాడిన భక్తిగీతాల మహత్యంతో తిరుపతి దేవుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తజనమంతా మద్రాసు క్షేత్రాన్ని కూడా సందర్శించి తమ అభిమాన సినీమా దేవుళ్ళ ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ దర్శనం కోసం కాచుకొని మరీ చూసి మహదానందపడేవారు. టూరిస్ట్ బస్సుల వారంతా తిరుపతి, పరిసర ప్రాంతాలతోపాటూ మద్రాస్ స్టార్ దర్శనం అనే ప్రత్యేక ఆకర్షణ కల్పించి తమ టూరిస్ట్ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లజేసుకున్నారు. మద్రాస్ తెలుగు సినీమాకు కేంద్రంగా వున్నంతకాలం తిరుపతి యాత్రీకుల బస్సులతో మా ఉస్మాన్ రోడ్ ఉదయం తొమ్మిది గంటలవరకు కోలాహలంగా వుండేది. ఎందుకంటే సినీమావాళ్ళెప్పుడు ఉదయం తొమ్మిది దాటితే ఇళ్ళ దగ్గర దొరకరు. కోడంబాక్కం స్టూడియోలలో పట్టుకోవలసిందే. రికమెండేషన్ లేకుండా ఏ స్టూడియో వాళ్ళు ఈ యాత్రీకాభిమానులను లోపలికి వదిలే సాహసం చేయరు. 

జనవరి సంక్రాంతి సమయంలో పాడిపంటలు ఇంటికి చేరాక అందరి చేతుల్లో నాలుగు డబ్బులు కనిపిస్తాయి. ఆ ఆనందంతో కుటుంబాలతో తీర్థయాత్రలు మొదలెడతారు. అప్పటినుండి వేసవి శెలవులు పూర్తి అయేవరకూ ప్రతీరోజూ ఐదారు బస్సులకు తక్కువ లేకుండా తిరుపతి యాత్రీకులు మా ఇంటిగేటు ముందు నిలబడేవారు. వారిలో డెభ్భై, ఎనభై ఏళ్ళ వృధ్ధుల నుండీ మూడు, నాలుగేళ్ళ పసిపాపల వరకూ ఆడా, మగా వుండేవారు. నడవలేని స్థితిలోకూడా చేతికర్ర ఊతంతో తిరుపతి వెంకన్నను ఎంత భక్తితో దర్శించుకునేవారో అదే భక్తితో మద్రాస్ లో ఘంటసాల వేంకటేశ్వరుని, నందమూరి తారకరాముని, తదితర సినీ నటీనటులను చూసి ఆనందించేవారు. 

అసలు నిజం చెప్పాలంటే, మద్రాసులోని, మా టి.నగర్ లోని సినీమావారుండే ప్రాంతాలు ఆ ఇళ్ళ అడ్రస్ లు నాకు కంఠోపాఠం అవడానికి ముఖ్య కారణం ఈ తిరుపతి బస్సులే. ఆనాటి ఆంధ్రదేశం నుండి వచ్చే చాలామంది బస్సుల డ్రైవర్లకు అరవభాషతో సమస్య. యాత్రీకులను ఆకట్టుకుందికి మెడ్రాస్ ట్రిప్ లు వేస్తారే కానీ  మొదటిసారి వచ్చేవాళ్ళకు ఈ ఊరిగురించి ఏ అవగాహన వుండేది కాదు. టి.నగర్ ఉస్మాన్ రోడ్ కు రాగానే ముందుగా మెయిన్ రోడ్ మీద ఒక పెద్ద రాజభవనంలా కనిపించేది ఘంటసాలగారి ఇల్లే. అందుకే తిరుపతి బస్సులవాళ్ళకు మొదటి హాల్ట్ నెం.35, ఉస్మాన్ రోడ్డే. అక్కడికి వచ్చి ఆ డ్రైవర్ మాత్రం ముందుగా వచ్చి 'అయ్య ఉన్నారా!' 'ఘంటసాలగారు లోపలున్నారా!' 'ఘంటసాలవాడు ఉన్నాడా!' 'పాటల దేవుడు ఎన్నింటికి బయటకు వస్తారు' ఇలా ఎవరికి తోచిన భాషలో వారి వారి చదువు సంధ్యలు, సంస్కారాన్నిబట్టి అడిగేవారు. వీళ్ళ ప్రశ్నలకు టార్గెట్  అప్పుడప్పుడు తమ్ముడు కృష్ణ , మా తాయి, ఆవిడ కొడుకు వడివేలు, కారు డ్రైవర్ గోవిందు. అయ్యగారు బయటకు వెళ్ళేవరకు కారు కడగడం, తుడవడం తప్ప మరే పని లేని గోవిందుకు ఓ నాలుగు బీడీలు చేతిలోపెట్టి వాళ్ళకు కావలసిన సమాచారాన్ని బాగానే లాగేవారు ఆ బస్సులవాళ్ళు. అయితే గోవిందు మాట్లాడే అరకొర అరవ తెలుగు వాళ్ళకు అర్ధమయేది కాదు. ఆ సమయంలో పనిపాటాలేని ఆపద్బాంధవుడిని నేను మాత్రమే. గోవిందు తన తరఫున నన్ను చెప్పమనేవాడు. డ్రైవర్  గోవిందు చెప్పిన దానిని తిరిగి నేను స్వఛ్ఛమైన మా విజయనగరం తెలుగులో చెప్పేవాడిని. వచ్చేవాళ్ళలో చాలామంది ఉత్తరాంధ్రదేశంలోని పల్లెటూళ్ళకు చెందినవారవడంతో వారికి నా మాటలు బాగా అర్ధమై చాలా సంతోషపడేవారు. గోవిందు చెప్పిన సినీమావాళ్ళ ఎడ్రస్ లు ఆ డ్రైవర్లకు, కుతూహలంగా వెంటవచ్చిన తిరుపతి యాత్రీకులకు విడమర్చి చెప్పేవాడిని.

మా ఇంటి ఎదురుగా కె.వి.రెడ్డి, వ్యాసారావు స్ట్రీట్ లో నాగయ్య (తరువాతి కాలంలో రమణారెడ్డి), బజుల్లా రోడ్ లో ఎన్.టి.రామారావు, కస్తూరి శివరావు, సారంగపాణి స్ట్రీట్ లో అక్కినేని నాగేశ్వరరావు, అతి పొడుగాటి హబిబుల్లా రోడ్ లో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సుబ్బారావు, గుమ్మడి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, తిరుమలపిళ్ళై రోడ్ లో జమున, అక్కడి సమీపంలోనే కాంచన, మహాలింగపురంలో నాగభూషణం, శారద, నీలకంఠమెహతా స్ట్రీట్ లో రేలంగి, వైద్యరామయ్యర్ స్ట్రీట్ లో భానుమతి (అయితే ఆవిడ కోడంబాక్కం భరణి స్టూడియో ఎదురుగా వుండే భవనంలోనే వుండేవారు),  సౌత్ బోగ్ రోడ్ లో శివాజీ గణేశన్, ఆర్కాట్ స్ట్రీట్ లో ఎమ్జీయార్ ;  రామన్ స్ట్రీట్ లో కె.ఆర్.విజయ, గాయని ఎస్ జానకి, జెమినీ స్టూడియోకు సమీపంలో నుంగబాక్కం హైరోడ్ జెమినీ గణేశన్, రట్లండ్ గేట్ లో జగ్గయ్య, కోడంబాక్కం నాగార్జున నగర్ లో మిక్కిలినేని, పద్మనాభం, కొంచెం దూరంలో బాలకృష్ణ, సౌత్ ఉస్మాన్ రోడ్  సిఐటి నగర్ లో పెండ్యాల, పి.బి.శ్రీనివాస్, తేనాంపేట ఎల్డామ్స్ రోడ్ లో సి.ఎస్.ఆర్., ఎస్.ఎస్.రాజేంద్రన్, దేవిక, సంగీత దర్శకులు ఎస్.రాజేశ్వరరావు, టి.వి.రాజు, ఆళ్వార్ పేట సీతమ్మకాలనీలో పి.సుశీల, సెనెటాఫ్ రోడ్ లో షావుకారు జానకి, రాజా అణ్ణామలైపురంలో అంజలీదేవి, అడయార్ లో బి.సరోజాదేవి. ఇలా తమ అభిమాన తారాగణం వివరాలు తెలుసుకొని ఉబ్బితబ్బిబైయేవారు. అలాగే, బ్రతికిన కాలేజి (జూ), చచ్చిన కాలేజి (మ్యూజియం), మెరీనా బీచ్, హైకోర్ట్, లైట్ హౌస్, హార్బర్, మూర్ మార్కెట్ వంటి యాత్రాస్థలాలకు వెళ్ళే మార్గాలను సేకరించేవారు. ఇంతమంది ఎడ్రస్ లు నాకు తెలియడానికి, గుర్తుండిపోవడానికి కారణం ఈ తిరుపతి యాత్రీకులు, డ్రైవర్ గోవిందు చలవే. నేను మద్రాస్ రూట్ మ్యాప్ తెలుసుకోవడంలో చాలా సహాయపడింది వీరే అని చెప్పాలి. 

అయితే ఈ తిరుపతి యాత్రీకులకు సినీమావాళ్ళందరి దర్శనభాగ్యం లభించేదా అంటే సందేహమే. వచ్చిన అభిమానులను నిరాశపర్చకుండా వారితో సరదాగా మట్లాడి వారిని తృప్తి పర్చేవారిలో ఘంటసాల, ఎన్.టి.రామారావు ముఖ్యులని వారిని చూడడానికి వచ్చే అభిమానులు చెప్పుకోగా చాలాసార్లు విన్నాను. మిగతా చాలామంది నటీనటులను కోడంబాక్కం రైల్వేగేట్ దగ్గర కార్లలో పడిగాపులు పడుతూండగా చూసి ఆనందించేవారు.

సినీ నటుల తర్వాత ఈ తిరుపతి యాత్రికులంతా చూసి అమితంగా చూసి సంతోషపడేది ఘంటసాల మాస్టారినే. ఆయన వచ్చినవారిని పలకరించే తీరు, కలుపుగోలుతనం వారికి తమ సొంత మనిషితో మాట్లాడుతున్నామనే భావన కలిగించేది. ఘంటసాల మాస్టారు ఇంటిలో వున్నప్పుడు ఎవరు వచ్చినా మాట్లాడకుండా పంపలేదు. తనను చూడాలనే ఆశతో ఎక్కడో సుదూరప్రాంతాలనుండి వచ్చినప్పుడు నాలుగు మంచిమాటలతో ఆనందపర్చడం తన కర్తవ్యంగా భావించేవారు. 

మాస్టారిని చూడడానికి వచ్చేవారిలో అన్ని రకాలవారూ ఉండేవారు. ఫలానా సినీమాలో మీరు పాడిన పాటలు చాలా బాగున్నాయి అని కొందరూ, సినిమా లో మీ పాటలకి, ఇప్పడు మీరు మాట్లాడే మాటకు పోలికే లేదని కొందరూ, ఎన్.టి.రామారావుకు, ఎ.నాగేశ్వరరావుకు, రేలంగికి ఎవరికి పాడినా వారు పాడుతున్నట్లే మాకు అనిపిస్తుంది అదెలా పాడతారు అని కొందరు 
'బాబూ ముసలిదాన్ని అడుగుతున్నాను ఏడుకొండలసామీ మీద పాట పాడి వినిపించవా' ఇలా రకరకాల ప్రశ్నలు వేసేవారందరికీ ఓపికగా సమాధానాలు చెప్పేవారు. వాళ్ళు ఏ ఏ సినీమాలు చూశారు. ఏ పాటలు బాగా నచ్చాయని అడిగి తెలుసుకునేవారు. ఒకసారి తిరుపతి యాత్రీకుల బస్సులో ఓ పది పన్నెండేళ్ళ కుర్రాడు వచ్చాడు. అందరూ ఘంటసాలగారితో మాట్లాడుతుంటే వాడికీ ఏదో  అడగాలని తహతహ. చివరకు ధైర్యం చేసి మీరు ఏదైనా పాట పాడండి అని అడిగాడు. అందుకు మాస్టారు "నేను సినీమాలలో పాడుతున్నది నువ్వు వింటున్నావు కదా ! నువ్వే ఒక పాట పాడు వింటాను" అని ఎదురు అడిగారు. "నేనా! పాటా! నాకు రాదే, మీరే పాడి వినిపించండి" అన్నాడు. "అయితే నీ పెళ్ళికి నా కచేరీ పెట్టించు. అప్పుడు మీ ఊరు వచ్చి ఏన్నో పాటలు పాడతాను" అని అనగానే ఆ కుర్రాడు సిగ్గుతో అష్టవంకరలుపోయాడు. అక్కడ వచ్చినవారంతా గొల్లుమని నవ్వి ఆ కుర్రాడిని వెంటనే పెళ్ళిచేసుకోరా ఘంటసాల మనూరు వచ్చి పాడతాడు అని ఆ పిల్లాడిని ఎగతాళి చేస్తూ సంతోషంగా మాస్టారి దగ్గర శెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు. 

ఒకసారి ఘంటసాల మాస్టారిని చూసినవారుకానీ, మాట్లాడినవారు కానీ ఆయనను కానీ, ఆయన మాటకారితనాన్ని కానీ ఎన్నటికీ మరువలేరు. ఘంటసాలగారి వ్యక్తిత్వం అలాటిది. ఘంటసాలవారి నెం.35, ఉస్మాన్ రోడ్ ఎప్పుడూ వచ్చేపోయే జనాలతో కలకలలాడుతూవుండేది. సొంత సినీమా నిర్మాణం ఆపేసినా ఎవరో బంధుమిత్రులతో ఆ ఇల్లునిండే వుండేది. మాస్టారింట్లోనే భోజనాలు చేసేవారు కొందరైతే బయటే భోజనాలు చేసి రాత్రి మాస్టారింటి మేడమీద నిద్రలుపోయి ఉదయాన్నే తమ తమ పనులు చూసుకునేవారు కొందరు.

మా నాన్నగారు విజయనగరం వదలి మద్రాసు రావడానికి తీవ్రమైన ప్రేరణ, ఒత్తిడి తెచ్చిన సన్నిహితులు ఇద్దరు. ఒకరు ఘంటసాల మాస్టారు అయితే, మరొకరు, ద్వివేదుల నరసింగరావు. ఆయనే మా నాన్నగారికి రైలు టిక్కెట్ కూడా కొనిచ్చి బలవంతాన సాగనంపారు. వారి అమ్మాయి ఛాయకు మా రెండో చిన్నాన్నగారు కొన్నాళ్ళు వైలిన్ సంగీతం కూడా నేర్పారు. నరసింగరావుగారు విజయనగరం ఎమ్.ఆర్. కాలేజీలో లెక్చెరర్ గా పనిచేసేవారు. ఆయన భార్య శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి గారు అప్పటికే రచనా వ్యాసాంగంలో అడుగుపెట్టారనుకుంటాను.

మేము విజయనగరం నుండి వచ్చేక నరసింగరావుగారు విజయనగరం మహారాజావారి స్కాలర్షిప్ మీద అమెరికాలో ఉన్నత విద్యలకు వెళ్ళారు. అక్కడ విస్కన్సిన్ యూనివర్శిటీ లో ఎకానామిక్స్ లో పి.హెచ్.డి. చేశారు. అక్కడ డాక్టరేట్ చేస్తున్న సమయంలోనో లేక ముగిసిన తర్వాతో ఒకసారి మద్రాస్ వచ్చి మా నాన్నగారిని, ఘంటసాల మాస్టారిని చూడడానికి వచ్చారు. ఆయన ఎక్కడవున్నా మా నాన్నగారితో చాలా తరుచుగా ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేవారు.

నరసింగరావుగారు మద్రాస్ వస్తూ తనతో కూడా ఒక పెద్ద టేప్ రికార్డర్ తీసుకువచ్చి ఇండియాలో తమ బంధుమిత్రుల సంభాషణలు, పాటలు, పద్యాలు రికార్డ్ చేసుకొని తీసుకువెళ్ళారు. ఆ సమయంలో, ఘంటసాల మాస్టారింట్లోని చిన్న హాలులో ఉత్తరం గోడకు ఆనుకొని ఒక పెద్ద టేబిల్ వుండేది. దానిమీద ఆ భోషాణం స్పూల్ టేప్ రికార్డర్ పెట్టి అందరి గొంతులు రికార్డ్ చేశారు. మాస్టారు, మా నాన్నగారు కొన్ని పాటలు, పద్యాలు పాడారు. చిన్నా పెద్దా అందరిచేతా పాడించారు, మాట్లాడించారు. నావంతు వచ్చింది. పాడు పాడమని ఒత్తిడి చేశారు. అంతమంది మధ్యలో పాడడమే! నా గొంతు తడారిపోయింది. అప్పటికి నాకు పధ్నాలుగు, పదిహేనేళ్ళుంటాయి. నాగొంతు పీలగా, ఆడపిల్ల గొంతులానే వుండేది. ఆ వయసులోనే మా నాన్నగారు నాకు సంగీతం నేర్పాలని ప్రయత్నించారు. నా గొంతుకు ఏ శృతి సరిపోతుందో ఆయన సంగీతజ్ఞానానికి తట్టలేదు. అలాగే గీతాలవరకు నేర్చుకున్నాను. ఆయన చెప్పిన పధ్ధతిలో పాడకుండా అరవయాసతో (స్థానికప్రభావం వల్ల)  పాడడం ఆయనకు సుతారము నచ్చలేదు. గాత్రం లాభం లేదని వీణ, హార్మోనియం కూడా నా మీద ప్రయోగించి చూశారు. వినాయక చవితిలోని 'దినకరా శుభకరా' పాట ప్రాక్టీస్ ముగియకుండానే హార్మోనియం ప్రాక్టీస్ అటకెక్కిపోయింది. అలాగే వీణ సాధన కూడా. గీతాలతో ఆగిపోయింది. సంగీతానికి అతిముఖ్యమైన శృతి, లయలు రెండింటికి నన్ను చూస్తే భయమే. ఇలాటి నన్ను పట్టుకొని 'పాడమని నన్ను అడగతగునా'. అయినా తప్పలేదు. మొదటిసారిగా మైక్ ముందు మాయాబజార్ లోని 'లాహిరి లాహిరి' పాట ఎత్తుకున్నాను. అది పాటా, మాటో నాకే తెలియలేదు. పాడడం అయ్యాక నేను పాడినది మళ్ళీ రీ-ప్లే చేశారు. అందరూ ఒకటే నవ్వులు. ఆ నవ్వులకు అర్ధం నాకు తెలుసు. ఇక జన్మలో ఏనాడు నా పాటతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదనే నియమాన్ని ఈనాటి వరకు నిలబెట్టుకున్నాను. మధ్య మధ్య వ్రతభంగం జరిగిందనుకోండి. అయితే నాకన్నా మహాన్యాయంగా పాడుతూ అందరిచేత చప్పట్లు కొట్టించుకున్న వాళ్ళని తర్వాతి కాలంలో చాలామందినే చూశాను. అయినా నేను టెంప్ట్ కాలేదు. I am great to that extent. అయినా లలితకళలు అబ్బడమనేది పూర్వజన్మ సుకృతంగానే నేను భావిస్తాను. కృషి, సాధన కొంతవరకే ఉపయోగపడతాయి. సంగీత, సాహిత్య, నృత్యాది కళలు విద్యాలయాలలో నేర్చుకున్నంతమాత్రాన వచ్చేవికావు. అక్కడ శాస్త్రపరిజ్ఞానం అలవడుతుంది. అంతవరకే. స్వతసిధ్ధమైన జ్ఞానంలేకపోతే ఏ డిగ్రీలు పనిచేయవు. 

ఆ రోజు ద్వివేదుల నరసింగరావుగారు నెం.35, ఉస్మాన్ రోడ్ లో చాలాసేపు వున్నారు. మాస్టారింటి మెయిన్ హాలులో కూర్చొని చాలాసేపు చాలా విషయాలు మాట్లాడారు. ఆయన వేసుకున్న సూటు, బూటు (హ్యాట్ మాత్రం లేదు), మాటా, చేష్టా అంతా యూరోపియన్ కల్చర్ వంటబట్టిన మనిషంటే ఇలాగే వుంటారేమో అని అనిపించింది. విజయనగరం ఎమ్.ఆర్. కాలేజీలో  లెక్చెరర్ గా పనిచేసేప్పుడు అక్కడి స్టూడెంట్స్ ఈయనను దిలీప్ కుమార్ అనేవారట. కానీ ఆయన ఒడ్డు, పొడుగూ నామట్టుకు ప్రదీప్ కుమార్ లా అనిపించేది. 
ఆనాటి అమెరికన్ యూనివర్శిటీలలో విద్యా విధానానికి, మన దేశపు విద్యా విధానాలకు గల తేడాలు , అక్కడి ప్రొఫెసర్లు, స్టూడెంట్ల మధ్య వుండే గురు శిష్య సంబంధాలు, బోధనా పధ్ధతులు, ఇలా చాలా విషయాల మీద ఆయన మాట్లాడడం నాకు బాగా గుర్తు వుంది. ఆయన చెప్పిన విషయాలన్ని ఘంటసాల మాస్టారితో సహా ఇంట్లోని వారంతా చాలా శ్రధ్ధగా ఆలకించారు. 

1953 లో ఘంటసాలవారు తమ కుటుంబంతో మా తాతగారిని చూడడానికి విజయనగరం వచ్చినప్పుడు ఈ నరసింగరావుగారింట్లో కూడా ఆతిథ్యం పొందడం గుర్తుకు వచ్చింది. అయితే అప్పటి నరసింగరావుగారు నాకు గుర్తులేరు. 1971 లో ఘంటసాల వారు విదేశాలలో పర్యటించడానికి ద్వివేదుల నరసింగరావుగారు కూడా తగిన తోడ్పాటు అందించారని విన్నాను.

ఘంటసాల మాస్టారి కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. సినీమా వ్యాపారం తమకు అచ్చిరాదనే విషయం తేలిపోయింది. స్వగ్రామంలో తల్లిగారి ఆధ్వర్యంలో కొంత భూవసతి ఏర్పాటుచేసినా కౌలుదార్ల మోసం అనండి, లేక అసమర్ధత అనండి, వాటి మీద వచ్చే ఆదాయం అంత లాభసాటి కాలేదనే భావన అందరిలో వుండేది. 

ఘంటసాల మాస్టారి మిత్రుడు  రామదాసని (ఉణుకూరు అనుకుంటాను) ఒకాయన వేసవికాలంలో మాస్టారిని చూడ్డానికి వచ్చేవారు. ఘంటసాల మాస్టారు చెరువులో ఈతకొడుతున్నట్లు ఒక ఫోటో వుంది. అందులో ఆయన పక్కన వుండేది ఈ రామదాసే. ఆయన మద్రాసు వచ్చినప్పుడల్లా మాస్టారి కోసం తాజాయైన చేబ్రోలు పొగాకు తెచ్చేవారు. అలాగే ఊరగాయల సీజన్ లో గుంటూరు కారం, శ్రేష్టమైన ఆవపొడి తెచ్చేవారు. సావిత్రమ్మగారు పెట్టే ఆవకాయ, దోసావకాయ, కొరివికారం తల్చుకుంటే ఇప్పటికీ నోరూరుతుంది. అలాగే  మెంతిమజ్జిగ చేయడంలో కూడా  ఆవిడ ఎక్స్పర్ట్. అవన్నీ రుచి చూసినవాడిలో నేనూ వున్నానడంలో ఏ సందేహమూ లేదు.

రామదాసుగారు తెచ్చే చేబ్రోలు పొగాకును తగు రీతిలో చుట్టలు చేయడంలో మాస్టారి ఆర్కెష్ట్రాలో పనిచేసే భద్రంగారు నైపుణ్యం సంపాదించారు. రావూరి వీరభద్రంగారు కూడా విజయనగరం మ్యూజిక్ కాలేజీలో మా తాతగారి విద్యార్ధే. ఘంటసాలగారికి బాగా జూనియర్. అందరిలాగే భద్రంగారు కూడా సినీమాలలో పెద్ద గాయకుడు కావాలనే ఆశతోనే వచ్చారు. కానీ అదృష్టం అందరినీ వరించదు. కోరస్ సింగర్ గానే మిగిలిపోయారు. పెళ్ళయి పిల్లలు పుట్టాక మా ఔట్ హౌస్ డాబామీద ఒక చిన్న కొబ్బరాకుల కప్పున్న ఇంటిలో కొన్నేళ్ళున్నారు. ఆయన మాస్టర్ వేణు దగ్గర హార్మోనియం వాయించడం నేర్చుకోవడం మొదలుపెట్టి మాంగల్యబలం, తోటికోడళ్ళు, వినాయకచవితి సినీమాలలోని పాటలు సాధన చేసేవారు. ఆయన చెప్పే విజయనగరం కబుర్లమీది ఆసక్తితో భద్రంగారు చుట్టలు చుట్టేప్పుడు ఆయనతో కాలక్షేపం చేసేవాడిని. ఆయనకు ప్రసన్న అనే తమ్ముడు. వైజాగ్ ఏ.వి.ఎన్. కాలేజీలోనో, యూనివర్సిటీ కాలేజీలోనో  ఎమ్మే తెలుగు లిటరేచర్ చేసేవాడు. కానీ మధ్యలో చిన్న ప్రేమ వ్యవహారంలోపడి అది సఫలంకాక డిప్రెషన్ లో పడి కొన్నాళ్ళ చదువు సక్రమంగా కొనసాగలేదని భద్రంగారు బాధపడేవారు.

పొగాకు చుట్ట మాస్టారికి వ్యసనం కాదు. అవసరం. రోజుకు మూడు చుట్టలు అవసరపడేవి.  

ఘంటసాల మాస్టారు తమ తమ్ముడికి ఏదో ఆధారం కల్పించాలని చాలా తాపత్రయపడేవారు. తమ్ముడు సదాశివుడుగారు, బావమరది సుబ్బారావు గారూ ఇద్దరు వైజాగ్ ఎ.వి.ఎన్. కాలేజీలో ఇంటర్ చదివేవారు. అదే సమయంలో ఘంటసాలగారు సొంత సినీమా నిర్మాణం మొదలుపెట్టడంతో ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకునేందుకు వీరిద్దరు ఇంటర్ పూర్తి చేయకుండానే మద్రాసు వచ్చేసారు. ఒకసారి విద్యకు బ్రేక్ పడితే అది ముందుకు సాగడం కష్టమని అందరికీ తెలిసిందే.  

సినీమాలలో వచ్చిన నష్టంనుండి కోలుకునే ప్రయత్నంలో వేరే మరో వ్యాపారం చేయాలి. అన్నగారిలా తమ్ముడు గాయకుడు కాదు. ఇలాటి పరిస్థితులలో వారిని డైరీఫారమ్ బిజినెస్ ఆకర్షించింది. నార్త్ మద్రాస్ శివార్లలోని మాధవరం డైరీ మిల్క్ ప్రోజెక్టులో పాల వ్యాపారం చేయాలని నిర్ణయించారు. ఎన్.టి.రామారావుగారి కజిన్ రమేష్, ఎమ్జీయార్ అన్న చక్రపాణి, గుడివాడ ప్రాంతాలకు చెందిన బాపినీడు, మరికొంతమంది అక్కడ పాల వ్యాపారం చేస్తూవుండడంతో ఘంటసాల మాస్టారు కూడా ఒక పది గేదెలు కొని తమ్ముడిచేత వ్యాపారం మొదలుపెట్టించారు. ఈ పాల వ్యాపారస్తులందరికీ మాధవరం మిల్క్ కాలనీలోనే క్వార్టర్స్ ఇచ్చేవారు. అలాటి ఒక క్వార్టర్ లో తమ్ముడు తాతగారు (సదాశివుడుగారు), మరదలు పాపగారు (సుబ్బలక్ష్మి) కాపురం పెట్టి పాలవ్యాపారం సాగించారు. మేము పిల్లలందరం శని, ఆదివారాలలో మాధవరం మిల్క్ కాలనిలో గడుపుతు అక్కడి మిల్క్ ఫాక్టరీ తీరుతెన్నులు చూసేవాళ్ళం. ప్రశాంతమైన వాతావరణంలో బాబాయి, పిన్నిగార్లతో గడపడం మాకు చాలా ఆనందంగా వుండేది.

ఘంటసాల మాస్టారికి అత్యంత ఆప్తుడు,పానగల్ పార్క్ కాలంనాటి చిరకాల మిత్రుడు అయిన దేవగుప్తాపు రామచంద్రరావు మాస్టారిని, మద్రాసును విడిచిపెట్టి వెళ్ళిపోయారు.

ఆ ఆసక్తికరమైన విషయాలతోపాటూ....

1964 అక్కినేని వారి ఆత్మబలంతో మొదలయి
నాగయ్యగారి రామదాసుతో ముగిసింది. ఈ మధ్యకాలంలో మరెన్నో ఉత్తమ చిత్రాలు. అసంఖ్యాకమైన ఘంటసాల మాస్టారి గాన తరంగాలు. ఆ సినీమా కబుర్లన్నిటితో  మళ్ళా  వచ్చేవారం.....
                       ...సశేషం


Sunday, March 21, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై మూడవ భాగం

21.03.2021 -  ఆదివారం భాగం - 23*:
అధ్యాయం 2 భాగం 22  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"లవకుశ ప్లాప్ అయిందట" రావమ్మ కబురు. మురుగేశ మొదలియార్ స్ట్రీట్ మొగలోనున్న నాడార్ కట్టెల అడితి దగ్గర గోడకు అంటించివున్న ఏవో తమిళ సినీమా వాల్ పోస్టర్లు చూస్తూంటే చెప్పింది. రావమ్మ చెప్పిన వార్త నాకు రుచించలేదు. కారణం, లవకుశ సంగీతం ఘంటసాలగారిది.

"నీకెలా తెలుసు?" అని కొంచెం కోపంగా అడిగాను. 
"మా నాన్నే చెప్పారు" అని అంది. 
"మీ నాన్నగారు కూడా ఆ సినీమాకు పనిచేశారు కదా! ప్లాప్ అంటున్నావే" అని అడిగాను. 
నా మాటలు రావమ్మకు అర్ధం కాలేదు. ఆ టాపిక్ అక్కడితో ఆపేసి మౌనంగా ఇంటికి వచ్చాము.

ఆ రోజుల్లో ఎవరైనా ఘంటసాల మాస్టారు సంగీతం నిర్వహించిన సినీమాలలోని పాటల గురించి విమర్శించినా, ఆ సినీమాలు ఫెయిల్యూర్ అయాయని పత్రికల్లో వార్తలు చదివినా వాళ్ళమీద విపరీతమైన కోపం వచ్చేది. ఘంటసాల గారు చేసిన సినీమాలు బాగులేవని ఎలా అంటారు అని ఆవేశపడేవాడిని. ఈ రకమైన వార్తలు, విమర్శలను చదివినా, విన్నా కూడా ఘంటసాల మాస్టారిలో పెద్ద ప్రతిస్పందన కనిపించేదికాదు. ఒక చిత్రంలోని పాటలు బహుళ జనాదరణ పొందకపోయినా, ఆ సినీమాలు పరాజయం పొందినా అందుకు అనేక కారణాలుంటాయి. ఏ ఒక్క వ్యక్తివల్లో సినీమా హిట్ కాదు. అందుచేత సినీమా పాటలు/సినీమా జయాపజయాల విషయంలో ఘంటసాల మాస్టారు నిర్లిప్తంగా వ్యవహరించేవారు.   పాటల స్వరరచన విషయంలో తనకు గల ప్రతిభతో అనుభవంతో సంపూర్ణన్యాయం చేకూర్చడానికి తన వంతు కృషి చేసేవారు. మన కర్తవ్యం మనం ఆచరించాలి. జయాపజయాలు దైవాధీనాలు అనే భావం కలిగివుండాలి.  అనుభవ రహితమైన వీరావేశం పొందడంలో, ఉక్రోషపడడంలో ఏమాత్రం అర్ధంలేదని కొంత వయసు,ఆలోచనాపరిధి పెరిగాక గానీ తెలిసిరాలేదు. సినీమా ప్రపంచంలోని నటీనటులు, గాయకులు, దర్శకులు,  సమాజంలోని ప్రముఖ వ్యక్తుల విషయంలో ఆరాధన, గౌరవాభిమానాలు కలిగివుండవచ్చు. వారిని తమ ఆదర్శ పురుషులుగా స్వీకరించవచ్చును. వారిగురించి తమ ప్రేమాభిమానాలను తమకు తోచినవిధంగా ప్రకటించుకోవచ్చు. తప్పులేదు. కానీ తన భావాలే, అభిప్రాయాలే ఇతరులు కూడా కలిగివుండాలని నిర్బంధించడం సమంజసం కాదు.

తన అభిమానులు, అభిమాన సంఘప్రతినిధులమంటూ వచ్చేవారందరికీ ఘంటసాల మాస్టారు ఒకే మాట చెప్పేవారు. ఉత్తమమైన సంగీతాన్ని ఎవరు పాడినా మెచ్చుకోవాలి. ఆదరించాలి. వారిని గౌరవించడం తెలుసుకోవాలి. అభిమానం పేరిట దురభిమానం పెంచి మన సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలిగించకూడదని హితవు పలికేవారు.  

సరి, ఇక లవకుశ విషయానికి వద్దాము. 

లవకుశ సినీమాను తెలుపు నలుపులలో 1934లో ఈస్టిండియా కంపెనీ వారు మొదటిసారి గా తీశారు. సీనియర్ శ్రీరంజని సీతగా, పారుపల్లి సుబ్బారావు రాముడుగా నటించారు. ఆ చిత్రానికి దర్శకుడు సి.పుల్లయ్య. ఆ లవకుశ సినీమా తెలుగునాట పెద్ద ప్రభంజనం సృష్టించింది. శ్రీరంజనిని అభినవ సీతగా అందలమెక్కించి ఆరాధించారు.  అదే ఉత్తర రామచరిత్ర కధను మరల పాతిక సంవత్సరాల తర్వాత ఎ.శంకరరెడ్డి రంగులలో ఎన్ టి రామారావు , అంజలీదేవిలతో తీయ సంకల్పించారు. బహుశా దీనికి బీజం తాను తీసిన చరణదాసి సినీమాలోనే పడిందేమో. ఆ సినిమాలో వచ్చే ఒక డ్రీమ్ సీక్వెన్స్ లో ఎన్.టి.ఆర్ రాముడిగా, అంజలీదేవి సీతగా ఒక యుగళగీతాన్ని (మురిసేను లోకాలు కనుమా") ఆలపిస్తారు. అదే పి.సుశీల, ఘంటసాల మాస్టారు (ఇద్దరు మాత్రమే) తొలి పూర్తి యుగళగీతంగా చెపుతారు.



ఈ సినీమా విడుదలైన మరుసటి సంవత్సరమే "లవకుశ" సినీమా రంగులలో తీయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు నిర్మాత శంకరరెడ్డి. పాత లవకుశ డైరక్ట్ చేసిన సి. పుల్లయ్యగారే దర్శకుడు. తెలుగు తమిళ భాషలలో మొదలుపెట్టారు. రెండు భాషలలో సంగీత దర్శకుడిగా ఘంటసాల నియమితులయ్యారు. సముద్రాల సీనీయర్ పాటలు.  ప్రసిధ్ధి పొందిన రామాయణ కధావస్తువుగా ఈ సినీమాలో సంగీతం ప్రధానపాత్ర వహించింది. ఘంటసాల మాస్టారు 'మాస్టర్' గౌరవానికి తనను మించినవారు లేరని నిరూపించుకున్నారు. సినీమాలో అధికశాతం  పాటలు, పద్యాలు, రీరికార్డింగే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే లవకుశ చిత్ర నిర్మాణం ఏమాత్రం సులభంగా సాగలేదు. భారీసెట్లతో,  రంగుల చిత్రంకావడంతో అనుకున్నదానికంటే బడ్జెట్  పెరిగిపోయింది. సమయానికి తగినంత డబ్బు లభించక కాలాయాపనజరిగింది. తెలుగు,తమిళంలో నటించిన బాలనటులు ఎదగడం ప్రారంభించడంతో కంటిన్యుటీ ఇబ్బంది ఏర్పడింది. తమిళం అయితే లవకుశులలో లవుడి పాత్రను ఉమ అనే అమ్మాయివేసింది. సినీమా నిర్మాణం ఐదేళ్ళు సాగడంతో ఆ ఉమ రూపురేఖల్లో బాగా మార్పు కనిపిస్తుంది.

ముందు తమిళ భాష కు కూడా ఘంటసాలవారినే సంగీత దర్శకుడి నియమించుకున్నారు. మాస్టారు కొన్ని తెలుగు వరసల పాటలనే తమిళంలో కూడా స్వరపర్చారు. కానీ, తమిళం వెర్షన్ కు స్థానికంగా బాగా పాప్యులర్ అయిన తమ సంగీతదర్శకుడు వుంటేనే ఫైనాన్స్ చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడి చేయడంతో సగం సినీమా అయ్యాక కె.వి,మహాదేవన్ ను తమిళానికి సంగీత దర్శకుడిగా నియమించారు. తెలుగులో పి.లీల, పి.సుశీల పాడిన మూడు రామాయణ గీతాలను కె.వి.మహాదేవన్ తన సొంత బాణీలో స్వరపర్చడం జరిగింది. 

ఒక దశలో సినీమా అసలు పూర్తి అవుతుందా లేదా అనే అనుమానం కలిగించింది. దీనికి తోడు సి. పుల్లయ్యగారి అనారోగ్యం కారణంగా దర్శకుడిగా ఆయనకు బదులుగా ఆయన కుమారుడు సి.ఎస్. రావు కొనసాగారు. చిట్టచివరకు శంకరరెడ్డి చిత్ర నిర్మాణం పూర్తి చేయలేక నెగెటివ్ రైట్స్ ను పూర్తిగా సుందర్లాల్ నహతాకు అమ్మివేసి, అష్టకష్టాలు పడి 1963 లో సినీమా విడుదల చేశారు. 

తెలుగులో మొట్టమొదటి గేవాకలర్ చిత్రం 'లవకుశ' ఘంటసాల సంగీతం, పి.ఎల్.రాయ్ కెమెరా పనితనం, టివిఎస్ శర్మ ఆర్ట్ డైరక్షన్ లవకుశ సినీమాకు గొప్ప ఎసెట్. లవకుశ సినీమా రీరికార్డింగ్ ఆద్యంతం చూసే అవకాశం కలిగింది. లవకుశ సినీమాలో వచ్చే నేపథ్యసంగీతం సినీమాకు ఎంతో పరిపూర్ణతను, విశిష్టతను చేకూర్చింది. ఈ సినీమాలోని ప్రతీ పాట, పద్యం, ఘంటసాలవారి సంగీత వైదుష్యానికి గీటురాళ్ళు. నాలుగు గంటలకు పైగా సాగే  లవకుశ చిత్రానికి సంగీతమే ప్రాణం అనడం సత్యదూరం కాదు. సినీమా విడుదలైన రెండు వారాల కలెక్షన్ నిరాశాజనకంగానే వుండి సినీమా ఫెయిలనే నిర్ణయానికి వచ్చే సమయంలో, ఒక్కసారిగా అనూహ్యంగా లవకుశ దశ మారిపోయింది. క్రమక్రమంగా కలెక్షన్స్ పెరిగి విజయబాటలో సాగింది. చిన్నా పెద్దా అన్ని సెంటర్లలో విజయదుందుభి మ్రోగించింది. మొదటి రన్ లోనే తెలుగులో కోటి రూపాయలు ఆర్జించిన మొట్టమొదటి గేవాకలర్ రంగుల సినీమా లవకుశ. అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకుంది. తమిళం లవకుశ కూడా విజయవంతమైన సినీమాగానే నమోదు అయింది.

1934 నాటి సినీమాకు ఎంత ఆదరణ లభించిందో ఈ కొత్త లవకుశ కు అంతకు రెట్టింపు కీర్తి ప్రతిష్టలు లభించాయి. పల్లె పల్లెల నుండి ఎడ్లబళ్ళమీద బంధు, మిత్ర కుటుంబసమేతంగా లవకుశ చిత్రం చూడడానికి ప్రజలు తరలివెళ్ళడం జరిగింది. మా బొబ్బిలి లో లవకుశ ఆడినన్నాళ్ళు చుట్టుపక్కల గ్రామాలలోని మా కుటుంబ మిత్రులంతా సినీమా చూసివచ్చి మా ఇంట్లోనే పడుక్కొని మర్నాడు ఉదయం బళ్ళమీద తిరిగివెళ్ళేవారు.

సీతారాములుగా అంజలిదేవీ, ఎన్.టి.రామారావుల ఇమేజ్ విపరీతంగా పెరిగిపోయింది. శ్రీరాముడి గెటప్ లోని ఎన్.టి.ఆర్ ఫోటోలు తెలుగునాట  చాలామంది ఇళ్ళ పూజాగృహాలలో చోటు చేసుకున్నాయి. సీతమ్మ అంటే అంజలీదేవే అనే భావన ఈ చిత్రం కలిగించింది. తెలుగు భాష సజీవంగా వున్నంతవరకూ లవకుశ సంగీతం వినిపిస్తూనే వుంటుంది. పి.లీల, పి.సుశీలగార్ల గాన ప్రతిభకు దర్పణం లవకుశ. వారి గానానికి చిత్రిక పట్టి మెరుగుదిద్దిన ఘంటసాల స్టారి పేరు చిరస్థాయిగా నిలిచేవుంటుంది. 


ఒక అద్భుత కళాఖండం నిర్మించిన నిర్మాతగా ఎ.శంకరరెడ్డి గారికిపేరు మాత్రమే మిగిలింది. ఆ సినీమా లాభాలలో ఒక్క పైసా కూడా ఆయనకు దక్కకపోవడం చాలా విచారకరం. 
చిత్రం! భళారే విచిత్రం!

1940-1960ల మధ్య శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ అతి పెద్ద చిత్రనిర్మాణ సంస్థగా ఒక వెలుగు వెలిగింది. సుప్రసిద్ధ బహుభాషా నటీమణి పి.కన్నాంబ, ఆమె భర్త, చిత్ర దర్శకుడు కడారు నాగభూషణం ఈ సంస్థ అధినేతలు. వీరి నిర్మాణంలో దాదాపు పాతిక సినీమాలు తెలుగు, తమిళ భాషలలో నిర్మాణమయ్యాయి. అయితే అవేవీ ఈ తరానికి తెలిసినవి కావు. అధికశాతం పౌరాణికాలే. కన్నాంబ నట-గాయని. తమిళంలో అనర్గళంగా పేజీలకు పేజీలు తెరమీద మాటల తూటాలతో ప్రేక్షకులను అదరగొట్టిన గొప్ప నటి. తెలుగులో పల్నాటియుధ్ధం , తమిళంలో కణ్ణగి, హరిశ్చంద్ర, మనోహర వంటి చిత్రాలు కేవలం ఒక చిన్న ఉదాహరణకు మాత్రమే. 
పల్నాటియుధ్ధం లో ఘంటసాల మాస్టారు కన్నాంబతో కలసి "తెర తీయగరాదా" అనే పాటను గానం చేసిన సంగతి అందరికీ తెలుసు. 

శ్రీరాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ తీసిన సినీమాలలో చెప్పుకోతగిన పాటలేవీ మాస్టారు ఎక్కువగా పాడలేదు. రాజేశ్వరి కన్నాంబ, నాగభూషణంల పెంపుడుకూతురు. ఆమె పేరుమీదే చాలా చిత్రాలు నిర్మించారు. రాజేశ్వరి ప్రముఖ దర్శకుడు సి.ఎస్.రావు మొదటి భార్య. ఈమెను విడచిపెట్టి సినీ నటి రాజసులోచనను పెళ్ళి చేసుకున్నారు. ఈ సంఘటన కన్నాంబ దంపతులను మానసికంగా, శారీరకంగా చాలా కృంగదీసింది. తరువాత, ఆర్ధికంగా కూడా అనేక ఇబ్బందులకు గురిఅయ్యారు. అలాటి సమయంలో చేపట్టిన సినీమా 'ఆప్తమిత్రులు'. కడారు నాగభూషణంగారే డైరక్టర్. ఈ సినీమాకు ఘంటసాల వారిని సంగీతదర్శకుడిగా నియమించుకోవడం నేను ఎదురుచూడని విషయం. ఆప్తమిత్రులు గొప్ప సినీమాయేం కాదు కానీ, ఇందులో మనసుకు హాయిని కలిగించే కొన్నిపాటలను ఘంటసాల మాస్టారు స్వరపర్చి చిత్రానికి బలం చేకూర్చారు. "రావే చెలీ ఈవేళా", "పవనా మదనుడేడా మరలిరాడా", "దయరాదా నామీదా యశోదా ప్రమోదా", "ఈ లోకమూ మహా మోసమూ" వంటి పాటలు జనాదరణ పొందాయి.

"ఆప్తమిత్రులు" ఆర్ధికంగా కన్నాంబ దంపతులను ఎంతవరకు ఆదుకున్నారో తెలియదు. 1964లో కన్నాంబ కాలధర్మం చెందడంతో కడారు నాగభూషణం మరింత దిగజారిపోయారు. ఎమ్జీయార్ తో "తాళిబాగియం"( తాళి భాగ్యం) అనే ఒక తమిళ సినీమా మొదలుపెట్టి అది పూర్తిచేయడానికి అప్పులపాలై, ఉన్న ఆస్తులన్నీ అమ్మివేసి సినిమా పూర్తిచేశారు. ఇక్కడితో ఒక ప్రముఖ చలనచిత్ర సంస్థ చరిత్ర ముగిసింది. 

నిలువ నీడలేక కడారు నాగభూషణం అక్షరాలా రోడ్ న పడ్డారు. ఆయన అంటే గౌరవాభిమానం కల కొంతమంది సహాయంతో ఉస్మాన్ రోడ్ లో, మా ఇంటికి సమీపంలో పానగల్ పార్క్ కు వెళ్ళే త్రోవలో వాసన్ స్ట్రీట్ దాటాక 'మీనాక్షీ లాడ్జ్' అనే అతి సాదా లాడ్జింగ్ హోటల్ లో ఒక చిన్న గదిలో కాలం గడిపారు. రాజభవనం లాంటి పెద్ద భవంతిలో భోగభాగ్యాలతో అతి పెద్ద కార్లలో తిరుగాడిన కడారు నాగభూషణంగారి అంతిమ దినాలు ఒక చిన్న గదిలో ముగిసాయి. లాంఛనప్రాయంగా చిత్రసీమ శోకించింది. పలువురు ప్రముఖులు సంతాపం జరిపి ఆయనకు నివాళులు అర్పించారు.  అక్కడితో సరి. ఒక  ప్రముఖ దర్శక నిర్మాత కథ ముగిసింది.

1934లో సోమసుంద‌రం, ఎస్.కె.మొహిదీన్ లు భాగస్వాములుగా ఏర్పడి కోయంబత్తూరు లో జూపిటర్ పిక్చర్స్ ను ప్రార్ంభించారు 1940-50ల మధ్య అక్కడి సెంట్రల్ స్టూడియోలో దాదాపు 40 సినీమాలు తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషలలో నిర్మించారు. ఎక్కువగా ఎమ్జీయార్ తోనే తీశారు. అన్ని హిట్ సినీమాలే. సెంట్రల్ స్టూడియో మూతబడ్డాక తమ సంస్థను మద్రాసు కు తరలించి నెప్ట్యూన్ స్టూడియోలో అనేక సినీమాలు తీశారు. ఈ నెప్ట్యూన్ స్టూడియోను ఎమ్జీయార్ కొనుగోలు చేసి తల్లి సత్యభామ పేరిట సత్యా స్టూడియోస్ గా మార్చి తన చిత్రాలు అక్కడ నిర్మించారు. అడయార్ రివర్ బ్రిడ్జ్ కు ముందు ఆంధ్ర మహిళా సభ కు ఎదురుగా వుండే ఈ సత్యా స్టూడియో ఎమ్జీయార్ మరణానంతరం ఒక విద్యాలయంగా ఎమ్జీయార్-జానకి ఉమెన్స్ కాలేజీగా రూపుదిద్దుకున్నది.

జూపిటర్ పిక్చర్స్ కు మన ఘంటసాల మాస్టారికి గతంలో పెద్ద సంపర్కం వున్న గుర్తులేదు. జూపిటర్ తీసిన పాత సినీమాలలో మాస్టారు పాడారా అనేది సందేహమే. పాడిన అతి తక్కువ సంఖ్యలో పాడివుండాలి. వివరాలు తెలియవు. ఆ సంస్థ భాగస్వామి కుమారుడు ఎస్ కె హబిబుల్లా. ఆయన తెలుగులో వరసగా రెండు సినీమాలు తీశారు. ఒకటి వాల్మీకి (తెలుగు, కన్నడం), మరొకటి మర్మయోగి. ఈ రెండు చిత్రాలలో హీరో ఎన్.టి.రామారావు. ఈ రెండు చిత్రాలకు ఘంటసాల మాస్టారు సంగీతం నిర్వహించడం నాకు ఆశ్చర్యమే. ఈ సినీమాల సమయంలోనే మొదటిసారిగా వాల్మీకి రీరికార్డింగ్ కు జూపిటర్ (నెప్ట్యూన్) స్టూడియో లోపలికి వెళ్ళడం జరిగింది.

రామాయణాన్ని వ్రాసిన ఆదికవిగా,  అడవులు పట్టిన సీతకు ఆశ్రయమిచ్చి లవకుశులను పెంచిన వాల్మీకి మహర్షిగానే ఆయన వృత్తాంతం మనకు తెలుసు. వాల్మీకి మహర్షి కావడానికి ముందుగల గాధను ఒకటి తయారు చేసి ఒక జానపద-పౌరాణిక చిత్రంగా జూపిటర్ పిక్చర్స్ వారు తీసారు. పౌరాణిక, జానపద చిత్రాలకు కావలసిన శాస్త్రీయ, లలిత సంగీత పరిజ్ఞానం ఘంటసాల మాస్టారికి వున్నంతగా ఇతరులకు లేదంటే తప్పు పట్టరనే భావిస్తాను. ఆ కారణం చేతనే వాల్మీకి చిత్రం  మాస్టారికి లభించిందనుకుంటాను. వాల్మీకిలో చాలానే పాటలు పద్యాలు వున్నాయి. ప్రముఖ రంగస్థల నటుడు కె. రఘురామయ్య ఈ చిత్రంలో నారదుడు. రఘురామయ్య పాటంటే అభిమానించే తెలుగు ప్రేక్షకులు అనేకం. ఆయన బాణీకి తగినట్లుగా మాస్టారు కొన్ని పాటలను పద్యాలను రఘురామయ్య చేత పాడించి రక్తికట్టించారు. వాల్మీకికి మాస్టారు పాడిన పాటలు, పద్యాలు వారి గాన ప్రతిభను వెల్లడిస్తాయి.

వాల్మీకి కృతమైన "మా నిషాద ప్రతిష్టాం త్వమగః శాశ్వతీః సమాః" అనే శ్లోకాన్ని, కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం"  అనే శ్లోకాన్ని ఘంటసాల వారు గానం చేసిన తీరు నభూతో నభవిష్యతి. "శ్రీ రామాయణ కావ్య కథ", "హరియే వెలయునుగా", "జయ జయ జయ నటరాజా భుజగశయనా" వంటి శాస్త్రీయ గీతాలను స్వరపర్చడం, గానం చేయడం వారికే చెల్లు. 

హైదరాబాద్ లో శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతుల సమక్షంలో "గిరిజా కళ్యాణం" యక్షగానం గానం చేసిన సమయంలో ముందుగా ఈ వాల్మీకి చిత్రంలోని "జయ జయ జయ నటరాజా" పాటను కూడా కొంతచేర్చి పాడడం జరిగింది. రామాయణ గాధలకు సంగీతం నిర్వహించడంలో తనకు తానే సాటియని వాల్మీకి చిత్రం ద్వారా ఘంటసాలగారు మరోసారి నిరూపించుకున్నారు. 

ఘంటసాలవారు సుప్రసిద్ధ చలనచిత్ర నిర్మాత, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అయిన సుందర్లాల్ నహతా గారి ఆస్థాన సంగీత దర్శకుడు. తొలి చిత్రమైన 'జయం మనదే' మొదలుకొని 'వీరకేసరి' (కన్నడం) వరకు వరసగా ఎనిమిది సంవత్సరాలలో 10 సినీమాలకు సంగీత దర్శకత్వం వహించి ఆ రోజుల్లో ఒక చరిత్రే సృష్టించారు. రాజశ్రీ , శ్రీ ప్రొడక్షన్స్, రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద ఈ చిత్రాలన్నీ నిర్మించబడ్డాయి. సుందర్లాల్ గారు టి. అశ్వత్థ నారాయణ భాగస్వామ్యం లో కొన్ని చిత్రాలు, పోతిన డూండేశ్వరరావు భాగస్వామ్యంలో కొన్ని చిత్రాలు నిర్మించారు. ఈ సినీమాలలో అధిక సంఖ్యాకం ఇతర భాషలలో విజయవంతమైన సినీమాలనే తెలుగు, తమిళ, కన్నడ భాషలలో తీసి విజయంపొందారు. సుందర్లాల్ నహతాగారి సినీమాలలో అపజయం పొందినవి చాలా తక్కువ. సినీమా వ్యాపారాన్ని కాచి వడపోసిన వ్యక్తి. సినీమా విజయమే ఆదర్శం, లక్ష్యం. ఆ దృక్పథంతోనే సినీమా నిర్మాణం నిర్దిష్టంగా, పక్కా ప్లాన్ తో సాగేది. వెంటవెంటనే సినీమాలు తీసే దిట్ట నహతాగారు. నహతాగారి సినీమాలలో అధికసంఖ్యాకం పాటలు పరభాషా చిత్రాల్లోని పాటలుగానే వుండేవి. ఒక మూడు, నాలుగు పాటలు మాత్రం ఘంటసాల మాస్టారి సొంత బాణీలు. 

అలాటి సుందర్లాల్ నహతా గారికి ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన ఆఖరి  తెలుగు చిత్రం ' బందిపోటు'.  బి.విఠలాచారి దర్శకుడు. దెయ్యాలు, పిశాచాలు, మంత్రాలు, తంత్రాలు లేని జానపదం. రాజశ్రీకి ఘంటసాల మాస్టారు సంగీతం నిర్వహించిన తొలి చిత్రం 'జయం మనదే' కూడా జానపదమే. ఈ రెండూ rich versus poor రాచరికపు అమానుషాలను ఎదుర్కొనే సామాన్య వీరుడు కథానాయకుడు. మధ్యలో ప్రేమోపాఖ్యానం. సామాన్య ప్రేక్షకుడు చూసి ఆనందించడానికి కావలసిన సరంజామా అంతా బందిపోటులో కనిపిస్తుంది. హీరో ఎన్.టి.ఆర్ కు ఇలాటి సినీమాలు నల్లేరుమీద బండే. దర్శకుడు బి.విఠలాచార్య, సంగీత దర్శకుడు ఘంటసాల కలసి పనిచేసిన తొలి చిత్రం 'బందిపోటు'. ఈ సినీమాలోని క్లైమాక్స్ సీన్ ను కలర్ లో చిత్రీకరించారు. సంగీతం విషయంలో దర్శకుడు విఠలాచారిగారి సరళి, సంగీత దర్శకుడు ఘంటసాలవారి సరళి పరస్పర విరుధ్ధం. ఒకరిది ఉధృతంగా ఉరుకుతూ పరుగులుతీసే జలపాతమైతే, మరొకరిది గంభీరంగా, నిదానంగా ఒంపుసొంపులు తిరుగుతూ ప్రవహించే జీవనది. 'బందిపోటు' చిత్రంలో ఉన్న ఏడు పాటలు స్వఛ్ఛమైనవి. పరభాషా గీతాల ప్రభావం లేనివి. ఏడింట్లో  'వగల రాణివి నీవే' మాత్రమే మాస్టారి సోలో. ఒకటి లీల బృందం, మిగిలినవన్నీ పిసుశీలతో, పి.లీలతో పాడిన డ్యూయెట్లే. "ఓ అంటే తెలియని ఓ దేవయ్యా" పాట ఒక మంచి నృత్యగీతం.


కొసరాజుగారి సెటైర్ బాగా వినిపిస్తుంది. ఈ పాటను మాస్టారు, సుశీల పోటీపడి ఆలపించారు. చాలా మంచి పాట. పాట చిత్రీకరణ ఎంతో బాగుంటుంది. పాట చివర్లో వచ్చే మాస్టారి ఆలాప్ ఆ పాటకే హైలైట్. ఈ సినీమాలో నాలుగు పాటలలో కోరస్ వారికి మంచి అవకాశం కల్పించారు ఘంటసాల. బందిపోటు సినీమాకే తలమానికంగా,ఈనాటి వరకూ ఎల్లప్పూడూ అందరినీ అలరిస్తున్న పాట "ఊహలు గుసగుసలాడే". ఈ పాట వరస, టెంపో దర్శకుడు విఠలాచారిగారికి నచ్చలేదు. పాటంతా మరింత హడావుడిగా ఉద్రేకభరితంగా వుండాలని పట్టుబట్టారు. కానీ, ఘంటసాల మాస్టారు ఈ పాట విషయంలో రాజీపడలేదు.  ఘంటసాల మాస్టారి ట్యూనే చివరకు ఓకె అయింది.  సినీమా విడుదలయ్యాక ఆ పాట ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో అందరికీ తెలుసు. కన్నడం వీరకేసరి లో కూడా ఈ పాట సూపర్ హిట్ అయింది. సాధారణంగా, సన్నివేశాన్నిబట్టి ఫలానా పాట ఫలానా రాగంలో చేస్తే సముచితంగా వుంటుందని నిర్ణయించుకొని చేసే పాటలు కొన్ని అయితే, రాగ నిర్ణయం లేకుండా చేసే పాటలు కొన్ని వుంటాయి. ఆ రకమైన పాట "ఊహలు గుసగుసలాడే". ఆరోహణా, అవరోహణా క్రమంలో ఉండవలసిన స్వరాలన్నీ వున్నాయి. ఈ స్వరాలున్న రాగం ఏదై వుంటుందనే జిజ్ఞాస  మా నాన్నగారికి చాలా కాలం తరవాత కలిగి తన దగ్గరున్న సంగీత గ్రంథాలు తిరగేసి చూస్తే "ఊహలు గుసగుసలాడే" పాటలోని స్వరాలు ఓ రెండు రాగాలకు పోలి వున్నాయి. అవి ఒకటి సౌదామిని అనే రాగం. మరొకటి సుమనేశరంజని అనే రాగం. ఈ రెండూ సినీమాలకు సంబంధించినంతవరకూ అపూర్వరాగాలే. గతంలో ఏ సంగీతదర్శకుడు ఏ సినీమాలోనూ ఉపయోగించలేదు. సౌదామిని రాగంలో ఒకే ఒక కృతి త్యాగయ్యగారిది వుందట. ఈ "ఊహలు గుసగుసలాడే" పాటంతా సౌదామిని రాగంలో ఉంటుంది. చరణాలలో మాత్రం ఒక దగ్గర అన్యస్వర - కాకలినిషాద ప్రయోగంతో సుమనేశరంజని చాయలుంటాయి. ఈ రెండు రాగాలకు సంబంధించిన వివరాలను మా నాన్నగారు (సంగీతరావుగారు) తన వ్యాసాలలోనూ, ఘంటసాల మాస్టారి భగవద్గీత రాగ విశ్లేషణలోనూ తెలియజేశారు.


 
గతంలో కూడా పాత సినీమాలలో "చారుకేశి", "చక్రవాకం", "రాగేశ్వరి" వంటి అరుదైన రాగాలను సమర్ధవంతంగా సినీమాలలో ప్రవేశపెట్టి ఆ గీతాలకు అజరామరత్వం కల్పించిన ఘనతకూడా మన గానగంధర్వుడు ఘంటసాల మాస్టారిదే. ఘంటసాల గాన విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈనాడు వున్న ప్రసారమాధ్యమాలు ఆనాడు వుండివుంటే ఘంటసాలవారి కీర్తిప్రతిష్టలు మరింతగా దిగంతాలకు ప్రాకివుండేది. మరెన్నో ఆణిముత్యాలు మనకు అందుబాటులో ఉండేవి.

"నీ పెళ్ళికి నా కచేరీ ఏర్పాటు చెయ్యి. అప్పుడు వచ్చి పాడతాను...."ఎవరు ఎవరితో అన్నారు?

వివరాలు వచ్చేవారం నెం.35, ఉస్మాన్ రోడ్ లో...
                       ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, March 14, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై రెండవ భాగం

14.03.2021 - ఆదివారం భాగం - 22:
అధ్యాయం 2  భాగం 21 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఒకానొకప్పుడు అంటే 1970లకు ముందు దక్షిణాది సినీమా పరిశ్రమ యావత్తు మెడ్రాస్ లోనే వుండేది. (క్రమేణా, తెలుగు సినిమా హైదరాబాద్ కు, కన్నడ సినీమాలు మైసూర్, బెంగుళూర్ కు, మలయాళం సినీమా త్రివేండ్రమ్  కు తరలి వెళ్ళిపోవడంతో మెడ్రాస్ సినీ పరిశ్రమ కాంతిహీనమైపోయింది.)

జెమినీ, AVMలు తీసే హిందీ సినీమాలు కూడా మెడ్రాస్ లోనే.  జెమినీ, జూపిటర్ వంటి సినీమా స్టూడియోలు తప్ప మిగిలినవన్నీ కోడంబాక్కం, వడపళని చుట్టుపక్కల ప్రాంతాల్లో వుండేవి. అయితే సినీమా నిర్మాణ సంస్థలు అధిక భాగం టి.నగర్ ఏరీయాలోనే వుండేవి. అందుచేత సినీమాలలో హీరోలైపోదామని వచ్చే ఔత్సాహిక నటులు, ఎప్పుడో ముగిసిపోయిన తమ పనికి రావలసిన పారితోషికం కోసం సినీమా ఆఫీసులు చుట్టూ తిరిగే జూనియర్ నటీనటులు, సాంకేతిక నిపుణులు తరచు మా ఉస్మాన్ రోడ్ లో కనిపించేవారు. 

నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఉన్న సమయం కన్నా పోర్టికోలోనో లేక గేటు బయట గడిపే సమయమే ఎక్కువ.  అలాటి సమయంలో మా రోడ్ లో ఎంతోమంది సినీమా నటులు కనిపించేవారు. కొంతమంది నటులు ఎన్నో సినీమాల్లో సూట్, బూట్లతో దర్జాగా పైపులు, సిగరెట్లు కాలుస్తూ లక్షాధికారులు లాగా కనిపిస్తారు. వారి నిజజీవితంలో కూడా అలాగే వుంటారనే భ్రమలో వుండేవాడిని. అలాటివారంతా పానగల్ పార్క్ ఏరియాలో చాలా సాదా సీదాగా నడిచిపోతుంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపించేది. టి.ఆర్.రామచంద్రన్, వి.కె.రామస్వామి, సహస్రనామం వంటి తమిళనటులూ కనిపించేవారు.  ఒక సాదా పంచె, మల్లు బనీన్ లాటి చొక్కా, చంకన గొడుగుతో, కాలినడకన  బడుగు బాపనకు దర్పణంగా  వంగర వెంకట సుబ్బయ్య కనిపించేవారు. సినీమాలో ఎలావుండేవారో, బయటా అలాగే వుండేవారు. సీతారాం, నల్లరామ్మూర్తి, జి.ఎన్ స్వామి కనిపించేవారు. ఒక పెద్ద స్టార్ హీరోకు మామగారు, తెలుగు సినీపరిశ్రమనే అజమాయిషీ చేసే స్థితికి ఎదిగిన అనేక సూపర్ హిట్ సినీమాల నిర్మాతకు తండ్రి, అంతకుమించి వందలాది సినీమాలలో హాస్యనటుడిగా పేరు పొందిన అల్లు రామలింగయ్య తన తొలిరోజులలో చాలా సామాన్యంగా సైకిల్ మీద వెడుతూ కనిపించేవారు. అప్పట్లో చిన్న చిన్న సినిమా వేషాలతోపాటు హోమియో వైద్యం కూడా చేసేవారట. అన్నిటికంటే నాకు ఆశ్చర్యం కలిగించినది ఒకప్పటి నెంబర్ వన్ కమేడియన్ కస్తూరి శివరావు. హీరోలతో సమానమైన హోదాను అనుభవించిన నటుడు. ఒక పెద్ద బ్యూక్ సొంతదారుడు. చిత్రనిర్మాత  కూడా. 

కొంతమంది జీవితాలు ఎందరికో ఆదర్శంగానూ గుణపాఠాలు గానూ అమరుతూంటాయి. అలాటివారిలో ఉదాహరణగా  కస్తూరి శివరావును, చిత్తూర్ వి.నాగయ్యగారిని సినీమాలోకం లో చెప్పుకుంటారు.

1950 -60 ల మధ్య అనేక హిట్ సినీమాలలో నటించి ఒక ఐకాన్ గా గుర్తింపు పొందిన నటుడు కస్తూరి శివరావు. ఆయన అంతిమ జీవితం చాలా దుర్భరంగా సాగింది. ఎన్.టి.రామారావు ఇంటికి పక్కన ఒక పాత ఇంటిలో చాలా దీనస్థితిలో వుండేవారు. కాలం ఖర్మం కలసిరాకపోతే కోటీశ్వరుడు కూడా పూరి గుడిసెల్లో వుండవలసినదే. శివరావు పరిస్థితి అదే.  మాసిపోయిన షెరాయి, జుబ్బాతో, చింపిరిజుట్టుతో ఒక పాత పాడైపోయిన సైకిల్ మీద మా ఇంటిమీదుగా వెళ్ళడం చాలాసార్లు చూశాను.  మా ఇంటి సమీపంలోనే సైకిల్ టైర్ పంచర్ అయి ఒకసారి, చైన్ ఊడిపోయి మరొకసారి, సైకిల్ ను తోసుకుంటూ వెళ్ళడం నా కళ్ళారా చూశాను. అప్పట్లో చిన్నతనం కారణంగా నాకేమీ అనిపించలేదు. కానీ ఒక వయసు వచ్చాక, ఆ నటుడి గత వైభవం గురించి తెలిసాక మాత్రం, అతని గురించి తల్చుకుంటే మనసు బరువెక్కిపోతుంది. 

'ఇండియన్ పాల్ముని' గా ప్రసిధ్ధి పొందిన బహుభాషా చిత్రనటుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, దర్శకుడు, ఎంతో మంది నటీనటులకు మార్గదర్శి చిత్తూర్ వి.నాగయ్య చలనచిత్ర జీవిత చరిత్ర అందరికీ తెలిసినదే. ఎంత వైభవంగా జీవించారో, అంత దైన్యంగా అంతిమ జీవితం గడచింది. తాను చిత్రనిర్మాతగా వున్నప్పుడు ఆయన రేణుకా ఆఫీస్ ఒక ధర్మసత్రంలా వుండేదట. ఆయన సినీమాతో సంబంధం వున్నవారూ, లేనివారూ కూడా అక్కడకు వచ్చి ముప్పొద్దులా సుష్టుగా భోజనం చేసి వెళ్ళేవారట. ఆకలితో ఎవరు వచ్చినా ఆదరించిపంపేవారట. నాగయ్యగారు నటించిన పాత్రల ప్రభావం ఆయనమీదే వుండేదనిపిస్తుంది. నాగయ్యగారు అందరిమీదా అమితమైన జాలి, ప్రేమ కనపర్చేవారు. తనకు మాలిన ధర్మంగా అప్పులు చేసి అన్నదానాలు చేసారు. ఆయన చేపట్టిన 'రామదాసు' చిత్రనిర్మాణం ఆర్ధిక ఇబ్బందులవల్ల పూర్తయి విడుదల కావడానికి అనేక సంవత్సరాలు పట్టింది. ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్, శివాజీ గణేశన్, అంజలీదేవి నాగయ్యగారి మీద గౌరవాభిమానాలతో ఉచితంగా నటించి చిత్రం పూర్తికావడానికి ఇతోధిక సహాయం చేసారు. కానీ, రామదాసు చిత్రం పరాజయం పొందడంతో నాగయ్యగారి పరిస్థితి మరింత దిగజారింది. నిజజీవితంలో కూడా 'ఏ తీరున నను దయ చూచెదవో ఇనకులోత్తమ రామా' అని అతి దైన్యంగా పాడుకోవలసిన స్థితికి దిగజారిపోయారు. పైగా వృధ్ధాప్యం. చేతిలో తగినన్ని మంచి వేషాలు లేకపోవడంతో మా ఇంటి ఎదురు వీధైన వ్యాసారావు స్ట్రీట్ లోని నెం. 11 ఇంటిని అమ్మివేసి (నటుడు రమణారెడ్డి కొనుకున్నారు).

పానగల్ పార్క్ సమీపంలోని దొరైసామీ రోడ్ కు ఆనుకొనివుండే ఒక చిన్న సందులోని అద్దె ఇంటికి మారారు. వారు ఆ యింటిలో వున్నప్పుడు ఏవో సందర్భాలలో రెండు మూడుసార్లు వెళ్ళి కలియడం జరిగింది. వ్యక్తిగా, నటుడిగా నాగయ్యగారి మీది గౌరవంతో సాటి నటులు, దర్శక నిర్మాతలు తమ చిత్రాలలో తండ్రి పాత్రలకు తీసుకొని ఆదుకునేవారు. అలాటి పరిస్థితులలో కూడా కొందరు ఆయనను అవాంఛనీయ అవమానాలకు గురిచేసేవారని చెప్పుకోవడం వుంది. ఘంటసాల మాస్టారి ఆర్కెష్ట్రాలో పనిచేసే ప్రముఖ వైలినిస్ట్ వై.ఎన్.శర్మగారి (సంగీత దర్శకుడు మణిశర్మ తండ్రి) ఇల్లు కూడా నాగయ్యగారింటి సమీపంలోనే వుండేది. శాస్త్రీయ సంగీత కచేరీలకు, సాంస్కృతికోత్సవాలకు ప్రసిధ్ధిపొందిన 'వాణీ మహల్' ఆడిటోరియంను, శ్రీ  త్యాగబ్రహ్మ గాన సభను స్థాపించినది నాగయ్యగారే. నాగయ్యగారు దివంగతులైనాక ఆయనంటే విపరీతమైన అభిమానం చూపించే ప్రముఖ జర్నలిస్ట్ ఇంటూరి వెంకటేశ్వరరావు ('సినీమా' వార పత్రిక) మరికొంతమంది పాత్రికేయులు, ప్రముఖులు కలసి నాగయ్య విగ్రహ ప్రతిష్టాపన చేసారు. ఆ విగ్రహ ప్రతిష్టాపన అంత సజావుగా సాగలేదు. ఆ విగ్రహం కొన్నాళ్ళు పానగల్ పార్క్ లో ఈశాన్యమూలన ఉండేది. 

1935-57 మధ్య కాలంలో తన హాస్య నటనతో, వ్యంగ్యాత్మక, సందేశాత్మక గీతాలతో  తమిళదేశాన్ని ఒక ఊపు ఊపిన 'కలైవానర్' ఎన్.ఎస్.కృష్ణన్ విగ్రహం విషయంలో కూడా ఎన్నో స్థల మార్పులు జరిగాయి.

చెప్పాలంటే నాగయ్య, శివరావుగార్ల వంటి దుర్భర జీవితాన్ని గడిపిన, గడుపుతున్న కళాకారులెందరో చిత్రసీమలో కనిపిస్తారు.

కొంతమంది నటీనటుల దుర్భర జీవితానికి కారణం కాలమా? స్వయంకృతాపరాధమా? ఎవరికి తోచిన వ్యాఖ్యలు వారు చేస్తారు. కానీ ఒక్కటి మాత్రం నిజం. సినీమాలోకంలో  ఉఛ్ఛస్థితిలో వుంటూ, వరస విజయాలతో  ప్రజలలో గ్లామర్, పాప్యులారిటీ వున్నంతవరకే  నటులకైనా, నటీమణులకైనా, మరే ఇతర సాంకేతికనిపుణులకైనా  రాచమర్యాద.  ఆహా! ఓహో! అంటూ భజనదాసులు చుట్టూ చేరుతారు. ఆ దశ కాస్తా దాటితే ఆ వ్యక్తి ఎంతటి ప్రతిభావంతుడైనా ఎవరూ కన్నెత్తి చూడరు. ఆపదలో ఆదుకోవడం మాట ఎలావున్నా పలకరించను కూడా పలకరించరు. ఇందుకు ఎవరూ అతీతులు కారు. అదే సినీమా లోకం. 

సినీమా పరిశ్రమ అంటారు, కానీ, ఆ మాట తప్పని నా ఉద్దేశ్యం.

ఈనాటి సినీమా నిర్మాణ స్థితిగతుల గురించి నాకేమీ తెలియదు. కానీ, 1970లకు ముందువరకు దక్షిణాది సినీమా పూర్తిగా unorganized sector గానే వుండేది. డబ్బున్న నిర్మాతల మాటే శాసనం. పొగాకు, మిరపకాయల వ్యాపారం మీద వచ్చిన లాభాలతో సినీమా వ్యామోహంతో సినీమాలు తీద్దామని వచ్చే నిర్మాతలు కొంతమంది. ఉన్న  డబ్బు కాస్తా రెండు రీళ్ళతోనే ఖర్చయిపోగా, భార్య పేరునున్న పొలమేదో కూడా అమ్మేసి సగం సినీమా తీసి తర్వాతి సినిమాకు డబ్బు ఎలా సద్దుబాటు చేయాలో తోచక సమయానికి డిస్ట్రిబ్యూటర్ లు దొరకక ఫైనాన్షియర్స్ చేతుల్లోబడి అష్టకష్టాలుపడి సినీమా పూర్తయిందనిపించేవారే ఎక్కువమంది వుండేవారు. ఇక సినీమా రిలీజ్ అయ్యాక జయపజయాలు నిర్ణయించేది A,B,C సెంటర్ ప్రేక్షకులే. వారు ఎప్పుడు, ఎందుకు, ఏది నచ్చుతారో అనేది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలింది. రిలీజైన కొన్ని సినీమాలు బాగున్నా, బాగున్నాయని టాక్ వచ్చినా కలెక్షన్ షీట్స్ మాత్రం డల్ అని నిల్ చూపించి నిర్మాతకు ఒట్టి చేతులు చూపేవారు. ఈ రకమైన లాలూచీ థియేటర్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్ ల ప్రతినిథులు చాకచక్యంగా పనిచేసి డైలీ కలెక్షన్ రిపోర్ట్ లను నిల్ గా చూపేవారూ ఉన్నారు. ఘంటసాల మాస్టారి 'భక్త రఘునాధ్' మరీ ప్లాప్ కాదు. కొన్ని సెంటర్స్ లో నాలుగైదు వారాలాడింది. అయితే కొన్ని సెంటర్స్ నుండి వచ్చే డైలీ కలెక్షన్ రిపోర్ట్ లో 'rain effected no show' అనో లేక 'no audience, Second show cancelled' అని రిపోర్ట్స్ వచ్చేవి. అయితే అవన్నీ అన్నివేళలా కరెక్ట్ కాదని తేలేది. ఎవరినీ ఏమీ అనలేని, చేయలేని పరిస్థితి చిన్న నిర్మాతలది. ఈ పరిస్థితిలో వారు చాలామంది చిన్న నటులకు, సాంకేతిక నిపుణులకు బకాయి పెడుతూంటారు. ఇవ్వవలసిన చాలా చిన్న మొత్తానికి కూడా ఇవేళా, రేపూ అంటూ తమ ఆఫీసుల చుట్టు తిప్పించుకొని చివరకు ఒక చెక్ ఇస్తారు. బ్యాంక్ లో బేలన్స్ వుండదు. చెక్ బౌన్స్ అవుతుంది. దాన్ని పట్టుకొని నిర్మాత ఆఫీసుకు పరుగుపెడతారు. నిర్మాత ఎప్పుడూ చిన్న చిన్న వాళ్ళకు కనపడడు. ఆఫీస్ మేనేజర్ వుంటాడు. అన్ని రకాలవారిని మేనేజ్ చేయగలవాడే మేనేజర్ . ఏదో చెప్పి మరల చెక్ ప్రజంట్ చేయమని బుజ్జగించి పంపేస్తారు. ఇలా రెండుమూడుసార్లు చెక్ బౌన్సయాక ఒక శుభ ముహుర్తాన చెక్ పేమెంట్ కు బదులు క్యాష్ ఇచ్చి పంపుతారు. అలా ఏ పేమెంట్ ఇవ్వని కేస్ లు చాలానే వుంటాయి.  నేను ముందు చెప్పిన చాలా మంది చిన్న నటులు తమ బకాయిలు వసూలు చేసుకోవడానికి కాలినడకన, సైకిళ్ళ మీద వెడుతూ ఎదురు పడేవారు. రావలసిన డబ్బులు చేతిలో పడిన రోజు వారికి పండగే. ఇవన్నీ మా నాన్నగారికీ అనుభవైకవేద్యమే. తగినంత ఆదాయం లేకపోయినా, అవసరం లేకపోయినా తప్పనిసరిగా బ్యాంకు ఎక్కౌంట్ తెరవవలసి వచ్చేది. 

మా నాన్నగారి బ్యాంక్ ఎక్కౌంట్ మొదట్లో పాండీబజార్ బరోడా బ్యాంక్ లో వుండేది. ఒకటి రెండుసార్లు చెక్ వేయడానికో, డబ్బులు తీయడానికో వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాను. ఏదో చలాన్ రాసిచ్చారు. అదెందుకో, ఎలా రాయాలో నాకు తెలిసేది కాదు. (ఇది నా ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ లో ఫస్ట్ డేనే నన్ను మహా ఇరకాటంలో పెట్టి నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ వివరాలు మరోసారి). బరోడా బ్యాంకులో కొందరు తెలుగువారుండేవారు. ఈ బ్యాంక్ పాండీబజార్ లో ఇప్పుడు పోలిస్ స్టేషన్ కు పక్కన రెండో బిల్డింగ్ లో వుండేది. ఈ రెండింటికి మధ్య ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉండేది. పాండీబజార్ కి వెళ్ళే దారిలో పనగల్ పార్క్ కి ఉత్తరం వేపు ప్రకాశం రోడ్ మీద, శారద విద్యాలయా ఎదురుగా మూలమీద బర్మా షెల్ పెట్రాల్ బంక్ పక్కన ఇండియన్ బ్యాంక్ ఉండేది. బరోడా బ్యాంక్ కు ఎదురుగా బ్రదర్స్ డయరీ Dr.గాలి బాలసుందర్రావుగారి ఇంటి పక్కన ఆంధ్రా బ్యాంక్ ఉండేది. అందులో పనిచేసే విశ్వనాధంగారు మా నాన్నగారికి మంచి స్నేహితుడు. నాకు కొన్ని రోజుల ట్యూషన్ మాస్టర్.

పాండీబజార్ ఆంధ్రా బ్యాంక్ పక్కనుండి వెళుతున్నప్పుడల్లా ఒక భయంకర సంఘటన గుర్తుకు వచ్చి ఒడలంతా కంపిస్తుంది.

'శ్రీ రామాంజనేయ యుధ్ధం' సినిమా మీకు గుర్తుండే వుండాలి. బాపు, ఎన్.టి.ఆర్, బి.సరోజాదేవిల రంగుల సినీమాకాదు. 1958ల నాటి తెలుపు నలుపు సినీమా. ఆ సినీమాయే ప్రముఖ నటి చంద్రకళకు మొదటి తెలుగు సినీమా. అప్పటికి చాలా చిన్నపిల్ల. యయాతి మహారాజు కుమార్తెగా ఒక భక్తి నృత్యగీతంలో కనిపిస్తుంది. ఆ అమ్మాయి. ఎమ్.ఎస్.నాయక్ గారి కూతురు. నాయక్ గారు ఆ రోజుల్లో పేరుమోసిన ఫిలిం డిస్ట్రిబ్యూటర్. కృష్ణా పిక్చర్స్ అధినేత. ఘంటసాలవారి సొంత సినీమాలకు కృష్ణా పిక్చర్స్ వారే పంపిణీదారులు. ఈ 'శ్రీరామాంజనేయ యుధ్ధం' లో ఘంటసాల మాస్టారు పాడిన పద్యాలు చాలా పాప్యులర్ అయాయి. ఈ నాటికీ అందులోని "శ్రీ రఘురామచంద్ర మది చింతన" అనే పద్యం వినవస్తూంటుంది. ఈ సినీమాలో అమర్నాథ్ రాముడు. జూ.శ్రీరంజని సీత. సూర్యనారాయణ లక్ష్మణుడు. రాజనాల ఆంజనేయుడు. మిక్కిలినేని యయాతి మహారాజు. 

లక్ష్మణుడు వేషం వేసిన సూర్యనారాయణ ఆంధ్రా బ్యాంక్ పాండీబజార్ బ్రాంచ్ లో క్యాషియర్. తెలుగువాడు. సినీమాలలో నటించాలనే కాంక్షతో చిన్నా చితకా వేషాలు వేసేవారు. జోగీందర్, విజయకుమార్ అనే ఇద్దరు సూర్యనారాయణకు మంచి స్నేహితులు.

ఒకరోజు ఉదయం సూర్యనారాయణ ఎప్పటిలాగే బ్యాంక్ లావాదేవీలకోసం రిజర్వ్ బ్యాంక్ నుండి కొన్ని లక్షలమొత్తం డ్రా చేసి బయటకు వచ్చిన ఆయన్ని విజయకుమార్, జోగీందర్ లు ఆపి మాట్లాడుతూ దారి మధ్యలో ఎక్కడో ఆ డబ్బు లాక్కునే ప్రయత్నంలో వారిమధ్య తీవ్ర ఘర్షణ జరిగి ఆ ఇద్దరూ సూర్యనారాయణను ఆ ఘోరంగా చంపేసినట్టు పత్రికల్లో వచ్చింది.  పట్టపగటిపూట ఆ శవాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక, కారులో శవంతో సాయంత్రం దాకా ఊరంతా తిరుగుతూ చీకటిపడే సమయానికి చెంగల్పట్ వెళ్ళే దారిలో అక్కడవున్న పెద్ద చెఱువులోనో, నిర్మానుష్యంగా వున్న ప్రాంతంలోనో  శవాన్ని విసిరేసి డబ్బుతో అక్కడనుండి పారిపోయారని తెలిసింది. 

రిజర్వ్ బ్యాంక్ కు వెళ్ళిన సూర్యనారాయణ ఎంతకీ బ్యాంకుకు తిరిగిరాకపోవడం, తన ఇంటికీ చేరకపోవడంతో బ్యాంక్ అధికారులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. చెంగల్పట్టు దగ్గర దొరికిన శవం సూర్యనారాయణదిగా పోలీసులు గర్తించి,  హత్యగా నిర్ధారించి హంతకుల కోసం వేట మొదలెట్టారు. కొంతకాలానికి అసలు హంతకులు జోగిందర్, విజయకుమార్ లేనని తేల్చి వారిని అరెస్ట్ చేసారు. చాలా నెలలు ఈ కేసు హైకోర్టులో విచారణ జరిపిన తరువాత నిందితులైన విజయకుమార్, జోగీందర్ లకు ఉరిశిక్ష వేశారు. కోర్టులో ఆ కేస్ విచారణ జరుగుతున్నంతకాలం తెలుగు, తమిళ, ఇంగ్లీషు దినపత్రికలలో వివరాలన్నీ ధారావాహికగా ప్రచురించారు. ఈ ఆంధ్రా బ్యాంక్ హత్య ఆనాటికి యువకులుగా ఉన్నవారికి, మద్రాసులో ఉన్నవారికి గుర్తుండే అవకాశం వుంది. పాండీబజార్ ఆంధ్రాబ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, బీచ్ రోడ్, చెంగల్పట్ చెరువు చూసినప్పుడల్లా నాకు ఈ భయంకర సంఘటన గుర్తొస్తూంటుంది. 

1962లో ప్రారంభమై 1963లో విడుదలైన సినీమాలన్నీ ఘంటసాల వారి గాన ప్రతిభకు పట్టం గట్టినవే. వారి కీర్తి కిరీటంలో కలికితురాయిలెన్నో. 1963లో కూడా ఎన్.టి.ఆర్ హవా బాగానే వీచింది. ఎ.ఎన్.ఆర్ తో నటించిన శ్రీకృష్ణార్జునయుధ్ధం, పెంపుడుకూతురు, వాల్మీకి, సవతికొడుకు, లవకుశ, పరువు ప్రతిష్ట, ఆప్తమిత్రులు,  బందిపోటు, లక్షాధికారి తిరుపతమ్మ కథ, నర్తనశాల, మంచి చెడులాంటి 12 సినీమాలతో ముందంజలో ఉన్నారు. అక్కినేని వారివి నాలుగు మాత్రమే. అందులో ఒకటి డబ్బింగ్ - శ్రీకృష్ణార్జునయుధ్ధం, చదువుకున్న అమ్మాయిలు, పునర్జన్మ, నిరపరాధి. జగ్గయ్య ఈడూజోడూ, కాంతారావు తోబుట్టువులు కూడా ఈ సంవత్సరంలోనే విడుదలయ్యాయి. ఈ సినీమాలలో ఘంటసాలగారు పాడిన పాటలన్నీ ఆపాతమధురాలుగా ఈ నాటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే వున్నాయి.

1945 నుండి 1974 వరకు ఏ రకమైన పోటీకి సాటిలేని గాయకుడు ఘంటసాల మాస్టారేనని పదేపదే నొక్కివక్కాణించ పనిలేదు. గాయకుడిగా వారిదే అగ్రస్థానం. మకుటంలేని మహారాజు. 

1963లో ఘంటసాలగారు సంగీత దర్శకత్వంలో వచ్చిన నాలుగు సినిమాలు వాల్మీకి, లవకుశ, ఆప్తమిత్రులు, బందిపోటు. ఈ సినీమాలలోని సంగీతం చిరస్థాయిగా మిగిలిపోతుందున్న విషయంలో ఎవరికీ ఏ సందేహము అవసరంలేదు.

ఈ నాలుగు సినీమాల విశేషాలు వచ్చే సంచికలో...
   
                  ...సశేషం

Sunday, March 7, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవైయొకటవ భాగం

07.03.2021 -  ఆదివారం భాగం - 21:
అధ్యాయం 2 భాగం 20 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
శౌరిరాజన్, శ్రీనివాసన్. ఈ రెండు పేర్లు విష్ణుమూర్తికే చెందుతాయి. శౌరిరాజన్ డాక్టర్. శ్రీనివాసన్ సివిల్ ఇంజనీర్.

ఘంటసాలవారింట్లో ఎవరికి ఏ అస్వస్థత కలిగినా డాక్టర్ శౌరిరాజన్ ఇంటికి వచ్చి చూసేవారు. మంచి హస్తవాసిగల డాక్టర్ అని పేరు. అందరితో చాలా సౌమ్యంగా కలివిడిగా మాట్లాడేవారు. సాధారణమైన ఎత్తుచాలా సన్నగా వుండేవారు. ఆయన క్లినిక్ సౌత్ ఉస్మాన్ రోడ్ లో రంగనాధన్ స్ట్రీట్ సమీపంలో శ్రీదేవీ హోటల్ పక్కన ఒక మేడమీద వుండేది. క్లినిక్ ఎప్పుడూ కిటకిటలాడుతూవుండేది.

మొదట్లో మేమూ శౌరిరాజన్ దగ్గరకే వెళ్ళేవాళ్ళం. శౌరిరాజన్ చాలా పేద కుటుంబం నుండి రావడం వలన పేదవారికి ఉచితంగా వైద్యం చేసేవారు. మొదట్లో CITనగర్ ప్రాంతంలో గాయకుడు పి.బి.శ్రీనివాస్ ఇంటి పరిసరప్రాంతాలలో ఒక చిన్న ఇంటిలో తల్లి, తమ్ముడుతో నివసించేవారు.

1950లలో శ్రీరామ్ అని ఒక తమిళ నటుడు వుండేవారు. చాలా తమిళం, కొన్ని తెలుగు సినీమాలలో హీరోగా, విలన్ గా నటించినవారు. 


శ్రీరాం సంసారం (తమిళం) చిత్రంలో

శ్రీరాం, వైజయంతీమాల - మర్మవీరన్ చిత్రంలో


ఆయనింట్లో శౌరిరాజన్ తల్లి వంటలక్కగా పనిచేసేవారట. తండ్రిలేని ఈ కుటుంబ దీనస్థితికి జాలిపడి శ్రీరామ్ శౌరిరాజన్ మెడిసిన్ చదవడానికి ఇతోధికంగా ఆర్ధిక సహాయం చేశారట. శౌరిరాజన్ డాక్టరయి కొంత నిలదొక్కుకున్నాక తమ్ముడిని చదివించి ఇంజనీర్ ను చేశారు. హస్తవాసి గల డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న శౌరిరాజన్ రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ తరఫున ముందు కౌన్సిలర్ గా, తర్వాత MLAగా ఎన్నికయ్యారు. అప్పుడే ఆయన వివాహం జరిగింది. ఆయన భార్య పేరు రుక్మిణి. జంటకు తగిన పేర్లు అమరినాయి. అంతేకాదు రుక్మిణిగారు గైనికాలజస్ట్.  సమాజంలో అంతస్తు పెరిగింది. ఉస్మాన్ రోడ్ లోని ఆ చిన్న క్లినిక్, టి.నగర్ లోనే దండపాణీ స్ట్రీట్ లో ప్రముఖ నటి కన్నాంబ ఇంటి సమీపానికి మారింది. పెద్ద మెటర్నిటి హాస్పిటల్ వెలసింది. ఘంటసాల మాస్టారి ఆడపిల్లల్లో ఒకరు రుక్మిణీ శౌరిరాజన్ హాస్పిటల్ లోనే పుట్టినట్లుసావిత్రమ్మగారు డిస్ఛార్జ్ అయి ఇంటికి వచ్చిన రోజున నేనూ వున్న గుర్తు. మెటర్నిటి పక్కనే డా. శౌరిరాజన్ రూమ్ కూడా వుండేది. పేషంట్లతో పాటూ వచ్చిపోయే రాజకీయ నాయకుల హడావుడి కూడా ఎక్కువగానే వుండేది. అందువలన ఇళ్ళకు వెళ్ళి పేషంట్లను చూడడం తగ్గించేశారు. కానీ డాక్టర్ గారి తల్లి సావిత్రమ్మగారిని చూసేందుకు వస్తునే ఉండేవారు.

డా.శౌరిరాజన్ తమ్ముడు ఎమ్.కె.శ్రీనివాసన్ ఇంజనీర్ అయ్యాక స్వంతంగా వృద్ధిచెందేరు. ఆయన ఆఫీస్ మా ఎదురు వీధి వ్యాసారావ్ స్ట్రీట్ లో వుండేది. 70లలో 'పరక్కుం పడై' అన్న పేరుతో వినియోగదారుల పరిరక్షణ కోసం ఒక సంస్థని నడిపేవారు. తరవాత కొంత కాలానికి వారమ్మాయి IPSకి ఎంపిక కావాడం, అనంతరం ప్రధాని రక్షణ వ్యవస్థలో ఒక ఉన్నత స్థానాన్ని పొందడం చరిత్ర.

డా.శౌరిరాజన్ వద్దకు వెళ్ళడం తగ్గింది. (ఆయన 2013లో 84 ఏళ్ళ వయసులో కీర్తిశేషులయేరు). డా. జయంతి రామారావు, డా.గోవింద మీనన్ (ఛైల్డ్ స్పెషలిస్ట్), డా.చిట్టూరి సత్యనారాయణ (ఇ.ఎన్.టి స్పెషలిస్ట్), డా. బ్రహ్మానందం, (ఈయన క్లినిక్ 34, ఉస్మాన్ రోడ్ బోర్డ్ మీద మాత్రం Dr.Bhirmananadam, Cardiologist  అని ఉండేది) ఇత్యాది డాక్టర్లతో పరిచయాలు ఏర్పడి ఘంటసాల మాస్టారికి, వారింట్లోవారికి ట్రీట్ చేయడం జరిగింది. వీరందరికీ ఘంటసాల మాస్టారి గానమంటే మహా ప్రీతి.

వీరిలో డా. జయంతి రామారావు ఘంటసాల మాస్టారి కుటుంబానికి అతి సన్నిహితుడిగా మెలిగారు. ఘంటసాల మాస్టారు దివంగతులైన తర్వాత కూడా జయంతి గారి కుటుంబంతో మంచి స్నేహ సంబంధాలు కొనసాగాయి. ఇంట్లోవారికి ఏ అనారోగ్యం వచ్చినా డా.జయంతి రామారావుగారిని సంప్రదించేవారు. పూనమల్లీ హైరోడ్ లోని ఒక పెద్ద అపార్ట్ మెంట్లో వున్నప్పుడు రెండు మూడుసార్లు వెళ్ళాను.  చాలా కాలం తర్వాత అంబత్తూర్ తెలుగు సాంస్కృతిక సంఘంవారి ఉత్సవాలకు డా. జయంతిగారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి ఘంటసాల మాస్టారి తమ్ముడు సదాశివుడుగారు, నేనూ కూడా డాక్టర్ గారితో  వెళ్ళడం జరిగింది.

ఘంటసాల మాస్టారు, డా. జయంతి రామారావుగారి మైత్రీ చాలా పాతదే. సదాశివుడిగారికి ఏదో అస్వస్థత కలిగినప్పుడు మింట్ లో ఉన్న స్టాన్లీ మెడికల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. అప్పుడే డా.జయంతి రామారావుగారితో ప్రథమంగా పరిచయం. ఘంటసాలవారి పాటంటే విపరీతంగా అభిమానించే జయంతిగారు సదాశివుడు గారి చికిత్స విషయంలో చాలా శ్రధ్ధ వహించారు.

డా. జయంతి రామారావు ప్రముఖ నెఫ్రాలజిస్ట్. మాస్టారి ప్రోద్బలంతోనే విజయా హాస్పిటల్ లో కన్సల్టెంట్ గా చేరారని విన్నాను. ఆయనను అపోలోలో కూడా చాలాసార్లు చూశాను. భార్యాభర్తలు ఇద్దరూ చాలా మంచివారు. మంచి స్నేహశీలురు. ఘంటసాల మాస్టారు విజయా హాస్పిటల్ లో వున్నప్పుడు డా.జయంతిగారి సేవలు, సహాయం మరువలేనివి.

డా. శౌరిరాజన్ మా అందుబాటులో వుండరని తెలిసాక మా నాన్నగారు పాండీబజార్ పార్థసారధిపురంలోని తణికాచల రోడ్, రాజాచార్ స్ట్రీట్, అగస్త్యర్ గుడి ప్రాంతంలోని  ఎస్.వి.టి.చారీగారి క్లినిక్ కు తీసుకువెళ్ళేవారు. చారీగారి క్లినిక్ మాకు మరీ దూరమైపోవడంతో మరో డాక్టర్ ను చూసుకోవలసిన పరిస్థితి లో ఉస్మాన్ రోడ్ లోనే మా ఇంటికి సమీపంలో ఉస్మాన్ రోడ్ గోవిందన్ స్ట్రీట్ మూలమీద ఉండే ఒక ఇంటి గదీలో క్లినిక్ నడిపే డా.రాఘవన్ అనే ఆయన మా పాలిట ఆపద్బాంధవుడయేరు. కొంచెం వయసు మీరినవాడే. RMPడాక్టరే అయినా చాలా అనుభవజ్ఞుడు. ఎంతో మంచివాడు. ఆ రోజుల్లో ఆయన ఫీజు రెండు రూపాయలో, మూడు రూపాయలో ఉండేది. ఇచ్చేవారి దగ్గర పుచ్చుకునేవారు. పేదలైతే ఉచితంగా చూసేవారు. ఇంజక్షన్లు, మందులు పేషంట్లే కొనుక్కోవాలి. సంగీతం మీద అభిరుచి వుండేదనుకుంటాను, రాఘవన్ డాక్టర్ మా నాన్నగారంటే మంచి అభిమానం చూపేవారు.

డాక్టర్ల ప్రసక్తి వచ్చింది కనుక ఘంటసాలవారి కుటుంబానికి తెలిసిన మరో డాక్టర్ గారి ముచ్చటతో నేటి వైద్య ప్రహసనం ముగిద్దాము. ఈ డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళేముందు 'నెం.35, ఉస్మాన్ రోడ్'లోని మరో యిద్దరు వ్యక్తుల గురించి చెప్పక తప్పదు. ఒకరు తాయి. మరొకరు ఆవిడ కొడుకు పయ్యా. (అంటే కుర్రోడు అని చెప్పుకోవచ్చు). పేరు వడివేలు.  తాయి మా లోగిలి పనిమనిషి. తాయి అంటే తల్లి. నిజంగా పిల్లలందరినీ అమ్మలాగే విపరీతమైన అభిమానం చూపేది. తాయి పనిమనిషే అయినా ఏకవచన ప్రయోగం చేయడానికి నాకు మనస్కరించదు. మా ఔట్ హౌస్ పక్కనే ఒక చిన్న గుడిసెలో తల్లీకొడుకులుండేవారు.

మేము ఆ ఇంటికి వెళ్ళేనాటికే తాయికి నలభైఐదేళ్ళు దాటివుంటాయి.వీళ్ళు ఎక్కడివారో, ఎప్పుడు  వచ్చారో నాకు తెలియదు. చాలా నమ్మకస్తురాలు. మొత్తం ఇంటిపని తానే చేసేది. కొడుకు మతిస్థిమితం లేనివాడు. చిన్నవయసులో బాగానే వుండేవాడట. పెద్దగా చదువు సంధ్యలు లేవు. అలాటివాడికి పెళ్ళయింది. వచ్చిన భార్యకు వీడంటే ఇష్టంలేదు. వచ్చిన కొన్నాళ్ళకో, కొన్నేళ్ళకో ఆ పిల్ల నూతిలో దూకడమో, లేక, వేరెవరితోనో వెళ్ళిపోవడమో జరిగింది. ఆ తర్వాతే పయ్యాకు (వడివేలు) మతి తప్పింది. అయితే ఎవరినీ ఏ ఇబ్బంది పెట్టేవాడు కాదు. పొద్దస్తమానం ఆ గుడిసెలోనే స్థబ్దుగా కూర్చోడంతల్లిపెట్టింది తినడం, నిద్రవస్తే పడుక్కోవడం. అప్పుడప్పుడు నాలుగురోడ్లు తిరిగి వచ్చేవాడు. మూడ్ బాగుంటే తల్లితోపాటూ వెత్తలె, పాక్, సీవల్, పుగాకు కాడలు నములుతూ తల్లి పనిపాటల్లో సాయపడేవాడు. ఎవరేది చెప్పినా చేసేవాడు. అలాటి కొడుకుతో ఒక వయసు మళ్ళిన తల్లి జీవితం వెళ్ళదీయడం దుర్భరమే. చుట్టాలో, తెలిసినవాళ్ళో అప్పుడప్పుడు తాయి గుడిసెకు వచ్చేవారు.



35, ఉస్మాన్ రోడ్ సంఘటనలకి సాక్షీభూతంగా నేటికీ అక్కడ నిలబడిన ఉన్నRain Trees - అదే తూంగు మూంజి - నిద్ర గన్నేరు చెట్లు. తాజాగా గత నెల, ఫిబ్రవరి 23, 2021న తీసిన ఫోటో

ఘంటసాలవారింటి లోగిలి చాలా పెద్దది.  పెరట్లో వేపచెట్టు ఆకులు, పక్కింటి మామిడిచెట్టు ఎండుటాకులతో నేలంతా నిండిపోయేది. వాకిట్లో అయితే చెప్పే అక్కరలేదు. రోడ్ మీద వున్న రెండు చెట్ల ఆకులు, ఎండిన పువ్వులతో నిండిపోయేది. మద్రాస్ లోని రోడ్లన్ని అలాటి avenue tressతో దట్టమైన నీడను ప్రసాదించేవి. ఆ చెట్లని మా అమ్మగారు నిద్ర గన్నేరు చెట్లనేవారు. అరవలు వాటిని తూంగుమూంజి (నిద్రముఖం) చెట్లనేవారు. రాత్రిళ్ళు ఆ చెట్ల ఆకులు ముడుచుకుపోయుండేవి. 


  


గుత్తులు గుత్తులుగా నూలుపోగులవంటి పింక్, తెలుపు కలసిన పువ్వులు పూసేవి. కాయలు శీకాయ కాయల్లావుండేవి. ఆ పువ్వులు ఎండి, బ్రౌన్ కలర్ కు మారి జలజలా క్రిందకు కుప్పలు కుప్పలుగా రాలేవి. పక్కన ఆనందన్ స్ట్రీట్ లో ఉండే గుడిసెవాసులు, మేకలు కాచుకునేవాళ్ళు, మేకలు పశువులకి మేపడానికి, చిన్న వంపు కత్తులు కట్టి ఉన్న పొడుగాటి వెదురు కఱ్ఱలతో ఆ కాయలు, ఆకులు, కోసుకోడానికి వస్తుండేవారు. ఎండిపోయి పడిపోయిన ఆకులు, కాయలతో వాకిలి నిండిపోయుండేది తెల్లారేసరికి. వాటన్నిటినీ మహా ఓపికగా ఉదయం ఊడ్చి, కళ్ళాపు జల్లి ఒక చిన్న ముగ్గుపెట్టడంతో తాయి దినచర్య ప్రారంభమయేది. తర్వాతే మాస్టారింటి లోపల పనులకు వెళ్ళేది. మధ్యే మధ్యే పానీయం అన్నట్లు గంటకోసారి తన గుడిసె ముందు కూర్చొని పొగాకుతో కూడిన తాంబూల సేవనం జరిగేది. ఈ ప్రాంతాల్లో చాలామంది సమయానికి అన్నం లేకపోయినా ఫర్వాలేదు, వెత్తలె పాక్ ఉంటే చాలన్నట్లు వుండేవారు. తమిళనాడులో వెత్తలె పాక్ అలవాటులాటిదే మా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వాసులు కొందరికి ఒక అలవాటు వుండేది. అది పొగాకు చుట్ట. కొన్ని తెగలవారిలో ఆడ, మగ, వయోభేదం లేకుండా చుట్టలు కాల్చేవారు. కొంతమందికి అడ్డపొగ అలవాటుండేది. అంటే ఆ చుట్టను నిప్పువున్నవేపు నోట్లో పెట్టుకునేవారు. నోరు కాలకుండా ఎలావుండేదో నాకు ఇప్పటికీ అంతుపట్టని మేజిక్కే. మేము మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో తాయి చీరకట్టు కూడా వ్యత్యాసంగా వుండేది. మన తెలుగువారి చీరకట్టుకు విభిన్నమైనది. తరవాత అర్ధం అయింది. దక్షిణాది జిల్లాలలో పాతకాలపు స్త్రీల కట్టువ్యవహారం అదని.

అలాటి తాయికి ఒకసారి జ్వరం వచ్చింది. ఒకటి రెండు రోజులైనా తగ్గలేదు. అమ్మగారు తాయిని డాక్టర్ దగ్గరకు వెళ్ళమని చెప్పారు. తోడుగా నన్నుకూడా వెళ్ళమన్నారు రిక్షాలో. నాకు దిక్కు తోచలేదు. ఆ డాక్టర్ తో ఏం చెప్పాలి, ఏ భాషలో చెప్పాలని. అన్నిటికంటే బలహీనత ఏమిటంటే బయటవాళ్ళతో ధైర్యంగా మాట్లాడలేకపోవడం. పాప పిన్నిగారు సలహా ఇచ్చారు. "ఈ అమ్మాయికి జ్వరం వచ్చింది, కొంచెం చూడండి అని చెప్పు చాలు" అని  ఆ డాక్టర్ తో ఎలా మాట్లాడాలో చెప్పారు. ఆ డాక్టర్ గారు తెలుగాయనే సమస్యేంవుండదని ధైర్యం చెప్పారు. తాయి రిక్షా ఎక్కడానికి ఒప్పుకోలేదు. నడిచే వెళ్ళాము. ఆ డాక్టర్ గారు ఒక హోమియోపత్. వుండేది బజుల్లా రోడ్ లో.  

నెం.35, ఉస్మాన్ రోడ్ కు ఎడమవైపు ఫర్లాంగు దూరంలో (సుమారుగా పావు కిలోమీటర్) రోడ్ కు రెండు వైపులా బజుల్లా రోడ్. ఎడమవైపు బజుల్లా రోడ్ మొదట్లో (ఇప్పుడు వివేక్ అండ్ కో బిల్డింగ్ వెనకవేపు ఎడమవేపు మొదట ఉండే ఒక పాత ఇల్లు హాస్యనటుడు కస్తూరి శివరావుగారిది. ఆ ఇంటి పక్కిల్లు 63వ నెంబర్ ఇల్లు. ఎన్.టి.రామారావుగారిది. రామారావుగారింటికి ఎదురుగా పెండ్యాలగారిల్లు. పెండ్యాలగారు ఆ ఇంటిని దాసరి నారాయణరావుగారికి అమ్మేసారు. పెండ్యాలగారు అంతకుముందు నార్త్ ఉస్మాన్ రోడ్ లోని CITనగర్ లో వుండేవారు. పెండ్యాలగారికి ఇళ్ళు కొనడం, లాభసాటిగా అమ్మడం ఒకరకమైన వ్యాపారం కాకపోవచ్చు. వ్యాపకం కావొచ్చు

కుడివేపు బజుల్లా రోడ్ ఒకానొకప్పుడు చాలా ఫేమస్. ఆ రోడ్ లోనే బ్రిటిష్ ప్రభుత్వ ఆఖరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డా. చక్రవర్తి రాజగోపాలాచారిగారి స్వగృహం వుండేది.




రాజాజీగారికి నెహ్రూగారికి మధ్య అంత సయోధ్య వుండేదికాదని అనుకునేవారు. ఈయన సొంతంగా స్వతంత్ర పార్టీని స్థాపించారు. ఆ పార్టీ జండా నీలం బాక్ గ్రౌండ్ తో మధ్యలో తెల్లటి నక్షత్రం. 


ఆయన సంపాదకత్వం లో స్వతంత్ర పత్రిక కూడా వచ్చేది. రాజాజీ వ్రాసిన రామాయణం చాలా పేరుపొందింది. రాజాజీ చాలా మంచి వక్త. మాటలతో మనుషులను బోల్తా కొట్టించడంలో రాజాజీ మహా దిట్ట అన్న అభిప్రాయం ప్రముఖ పాత్రికేయుడు, లాయర్, హాస్యనటుడు, తుగ్లక్ సంపాదకుడు 'చో' రామస్వామిది. (భాగీరథన్ రాసిన తేన్ మొழிయాళ్అన్న  నాటకంలో ఆయన నటించిన పాత్ర పేరు చోఅని ఇప్పుడే తెలుసుకున్నాను – సోర్స్ దినమణి). రాజాజీ సూక్తులన్నీ ఇతరులకు చెప్పడానికే, తనకు వర్తించవనే మనస్తత్త్వం రాజాజీదని చో ఒకసారి తన తుగ్లక్ పత్రికలో వ్యంగ్యాత్మకంగా వ్రాశారు.

రాజాజీ ఒకసారి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉపన్యసించారట. భారతదేశ సనాతన ధర్మం గురించి, మన ఆచార వ్యవహారాలగురించి, ప్రతీ పౌరుడు ఆచరించవలసిన నీతి నియమాలగురించి ధారాప్రవాహంగా ప్రసంగించారట. వేల సంఖ్యలో ప్రజలంతా ఆయన పురాణకాలక్షేపాన్ని చాలా భక్తిశ్రధ్ధలతో విని ఆయనను వేనోళ్ళ పొగిడారట. ఆ సభకు రాజాజీ భార్య కూడా వచ్చి భర్త ప్రసంగానికి ముగ్ధురాలయిందట. రాత్రి భార్యాభర్తలిద్దరూ జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమం గురించి ముచ్చటించుకుంటూ భోజనాలు చేస్తున్న సమయంలో రాజగోపాలాచారిగారి భార్య ఆయనకు వేడి వేడి సాంబార్ వడ్డించారట. రాజాజీగారు ఆ సాంబార్ లో ఏవో వెతుకుతున్నారట. ఇది ఏం సాంబారు అని అడిగారట. బెండకాయ  సాంబారు అని చెప్పగానే రాజాజీ చిరాకు పడ్డారట. "శుభ్రంగా చిన్న ఉల్లిపాయలు వేసి చేయవచ్చు కదా" అని గదమాయించారట. అందుకు ఆవిడ "అదేమిటండీ ఇవేళ శనివారం. భోజనంలో ఉల్లిపాయ ఎలా చేరుస్తాము. పైగా ఇవేళ మీరే మన ఆచారవ్యవహారాల గురించి ఆహార నియమాల గురించి ఊరికి ఉపదేశం చేసారు, మర్చిపోయారా!" అని అడిగారట.  అందుకు రాజాజీ నవ్వుతూ "ఓసి పిచ్చిదానా! ఉపదేశాలనేవి ఇతరులకోసం మాత్రమే. మనం శుభ్రంగా ఉల్లిపాయ సాంబార్ లాగించవచ్చును" అని భార్యకు హితబోధ చేసారట. ఇది తుగ్లక్ చో సెటైర్. నిజానిజాలు వాళ్ళకే ఎరుక.

సరే, మన తాయి విషయం చూద్దాము. రాజాజీ యిల్లు దాటాక కొంత దూరంలో రోడ్ కు అవతల ప్లాట్ఫారమ్ మీద డాక్టర్ గారింటి నెంబర్ కనిపించింది. గేట్ తెరుచుకొని లోపలికి వెళ్ళితే ఒక వరండా కనిపించింది. మేము వెళ్ళే సమయానికి ఎవరూ లేరు. తాయిని అక్కడ వుండమని చెప్పి కాలిగ్ బెల్ నొక్కాను. అరవ గుండారు లుంగీ చుట్టుకున్న ఒక ముసలాయన బయటకు వచ్చి ఎవరని అడిగారు. నేను వెంటనే స్పష్టమైన తెలుగులో అమ్మగారు, పాప పిన్నిగారు చెప్పినట్లు "ఈ అమ్మాయికి జ్వరం. చూడండి" అని తడబడుతు చెప్పాను. డాక్టర్ గారూ చుట్టూ చూసి "ఎక్కడ అమ్మాయి"? అని అడిగారు. ఈ అమ్మాయే అని తాయిని చూపించాను.

ఆయన పగలబడి నవ్వడం ప్రారంభించారు. నేను అన్నమాటలో నవ్వేందుకు ఏముందో నాకు అర్ధం కాలేదు. ఆ డాక్టరు గారు "ఈవిడ అమ్మాయా! సరి సరి అంటూ నా అమాయకత్వానికి జాలిపడి, తర్వాత తాయిని పరీక్షించి ఏవో మందుపొట్లాలు ఇచ్చారు. తాయి, నేను ఇంటికి వచ్చేసాము. కానీ మయసభలో పరాభవం పొందిన దుర్యోధన సార్వభౌముడి చెవిలో ప్రతిధ్వనించే ద్రౌపది నవ్వులా, ఈనాటికీ మరిచిపోలేనివి ఆ డాక్టర్ గారి వికటాట్టహాసం, ఈ తాయి-అమ్మాయి సంఘటన. ఇలాటి సంఘటనలు అవమానంగా అనిపించినా తప్పులు చేసే మంచి పాఠాలు నేర్చుకంటామన్నదీ తెలిసిసొస్తుంది. 

ఘంటసాల మాస్టారు కాలంచేసి ఎన్నో దశాబ్దాలు గడిచినా  తమిళనాట ఘంటసాల పేరు చిరస్మరణీయమే. నగరంలోని ఏ హాస్పిటల్ కు వెళ్ళి ఘంటసాల కుటుంబంలోని వారని చెపితే చాలు, ప్రత్యేక శ్రధ్ధతో అభిమానం చూపించి వైద్యం జరిపిన సంఘటనలున్నాయి. ఇంతకూ వారెవరూ ఘంటసాల మాస్టారిని చూసివుండరు. పాటే విని వుంటారు. అయినా గత కాలపు చిత్రాల్లోని ఘంటసాల పాటల ప్రభావం వారి మీద వుందని స్పష్టంగా తెలుస్తోంది.


1962లో ఎన్.టి.రామారావుగారు నటించిన చిత్రలు తొమ్మిది వచ్చాయి. అక్కినేనివారివి ఆరు చిత్రాలు. వీటిలో ఎన్.టి.ఆర్. నటించిన గులేబకావళి కథ, భీష్మ, గుండమ్మ కథ, మహామంత్రి తిమ్మరుసు, రక్తసంబంధం, ఆత్మబంధువు చిత్రాలు, అందులోని పాటలూ బహుళ జనాదరణపొందినవే.

ఇక నాగేశ్వరరావుగారి సినీమాలలో ఆరాధన, మంచిమనసులు, కులగోత్రాలు, సిరిసంపదలు, హిట్ సినీమాలుగా పేరుపొందాయి. అదే సంవత్సరం జగ్గయ్యగారి పదండిముందుకు చిత్రం మంచి పేరు తెచ్చుకుంది.

ఈ సంవత్సరంలో ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో నాలుగు సినీమాలు వచ్చాయి. కోవెలమూడి భాస్కరరావుగారి మోహినీ రుక్మాంగద, సిఎస్ రావు డైరక్షన్లో టైగర్ రాముడు, విజయావారి గుండమ్మ కథ, సుందర్లాల్ నహతగారి రక్త సంబంధం. వీటిలో గుండమ్మ కథ, రక్త సంబంధం సినీమాలు సిల్వర్ జూబ్లీ చేసుకున్నాయి. గుండమ్మ కథ తమిళం వెర్షన్ "మనిదన్ మారవిల్లై" కు కూడా ఘంటసాల మాస్టారే సంగీతం. ఈ సినీమాలోని కొన్ని పాటల్లో మాస్టారి హమ్మింగ్స్ వినిపించినా జెమినీ గణేశన్ పాటలు శీర్కాళి గోవిందరాజన్, నాగేశ్వరరావు పాటలను ఎ.ఎల్.రాఘవన్ పాడడం ఒక విశేషం. గుండమ్మకథ పాటలు ఎంతటి జనాదరణ పొందాయో ప్రత్యేకించి చెప్పపనిలేదు. అలాగేరక్తసంబంధం పాటలు కూడా. ఈ ఏడాది విడుదలైన ఎఎన్నార్ చిత్రాల పాటలు, ఎన్టీఆర్ గులేబకావళి, మహామంత్రి తిమ్మరుసు, ఆత్మబంధువులో పాటలు, భీష్మలో పద్యాలు ఘంటసాల మాస్టారి కీర్తి ప్రతిష్టలను మరింత పెంచాయి.

ఎన్టీఆర్, ఎఎన్నార్, జగ్గయ్య, కాంతారావు, బాలయ్య, రేలంగిలకు ఘంటసాలవారు పాడిన పాటలు ఎంతో వైవిధ్యంతో కూడుకొని, పాడుతున్నది ఆయా నటులే అన్న భ్రమను శ్రోతలకు కలిగిస్తాయి. ఈ సినీమాలు విడుదలై అరవై సంవత్సరాలైనా ఆ చిత్రాల పాటలు సంగీతాభిమానులను మైమరపిస్తూనే వున్నాయి. గుండమ్మ కథ సినీమాలో ఎల్.విజయలక్ష్మి నృత్యం కోసం మాల్కౌంస్ రాగంలో ఘంటసాల మాస్టారు స్వరపర్చిన నృత్య వాద్య సంగీతం అజరామరంగా నిల్చిపోయింది. ఈ నాటికీ ఆ వాద్యగీతాన్ని నృత్యకళాకారులంతా వేదికలమీద ప్రదర్శిస్తున్నారు.

కొసమెరుపు: "భీష్మ " చిత్రంలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం ప్రదర్శించారనడంలో ఎటువంటి సందేహంలేదు. వృధ్ధుడైపోయిన భీష్ముడి మేకప్, గెటప్ ల గురించి ఎవరో చక్రపాణి గారి దగ్గర చాలా గొప్పగా వర్ణించారట. రామారావుగారి మేకప్ అద్భుతం. మనిషినే గుర్తుపట్టలేము అంటూ పొగిడారట. అందుకు చక్కన్నగారు మహాకూల్ గా "అంత గుర్తు పట్టలేనప్పుడు ఆ వేషం ఆడే ఎందుకెయ్యడం. నువ్వే వెయ్యచ్చు" అని అన్నారట. చక్రపాణి గారి భాష్యమేవేరు.

ఇదే చిత్రంలో, దర్శకత్వపరంగా మరో చిన్న లోపాన్ని కూడా ప్రేక్షకులు ముచ్చటించుకునేవారు.

భీష్ముడు వృధ్ధుడై యుధ్ధరంగంలోకి దిగినప్పుడు ఎన్టీఆర్ మాటలలో, చేతలలో వణుకు ప్రదర్శించగా పద్యాలు పాడేప్పుడు ఘంటసాల స్టోన్ కంచు ఘంటలా దుమ్ము దులిపేసిందని, మాటకు పాటకు మ్యాచ్ కాలేదనే  భావన వినవచ్చేది. ఈ విషయంలో దర్శకుడు, సంగీతదర్శకుడు తగిన శ్రధ్ధ తీసుకోలేదని కొందరి అభిప్రాయం. దిష్టి పరిహారార్ధం చిన్న చిన్న లోపాలుండాలి. ఏమంటారు ?

మరిన్ని విశేషాలతో వచ్చే వారం...  

                    ...సశేషం