visitors

Sunday, February 21, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవైయవ భాగం

21.02.2021 - ఆదివారం భాగం - 20*:
అధ్యాయం 2  భాగం 19 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
ఘంటసాల మాస్టారింటి వరండాలో ఎడమవైపున్న కిటికీలకు,కుడివైపునుండే ప్రవేశద్వారానికి మధ్య గోడమీద 'GHANTASALA MUSIC DIRECTOR - IN/OUT'  అనే ప్లాస్టిక్ నేమ్ బోర్డ్ వుండేది. 

ఆ  in/out లు మార్చడానికి వీలుగా ఒక స్లైడింగ్ వుండేది. దానిమీద వున్న ఒక చిన్న బటన్ ను జరిపితే IN/OUT లు కనిపించేవి. ఘంటసాల మాస్టారు బయటకు వెళ్ళినప్పుడు, తిరిగి ఇంటికి వచ్చినప్పుడు విధిగా ఆ IN/OUT లకు మార్చేవారు. నేను ఆ యింటికి వెళ్ళిన కొత్తల్లో ఆ చుట్టుపక్కల ఎవరూ లేకపోతే ఆ నేమ్ బోర్డ్ లోని IN/OUT స్లైడింగ్ తో ఆడుతూ కాలక్షేపం చేసేవాడిని. ఆ నేమ్ ప్లేట్ ఆ గోడకు బిగించేప్పుడే క్రిందిభాగం స్క్రూ వద్ద చిన్నముక్క విరిగిపోయింది.


అదెప్పుడు ఎవరు బిగించారో నాకు తెలియదు. అయినా, ఆ అశ్రధ్ధకు  కారకులైన ఆ బోర్డ్ ను బిగించినవారి మీద ఒక నిరసన భావం వుండేది. ఇలాటి నేమ్ ప్లేటే పామర్తిగారు దొరైసామి రోడ్ లో తంజావూరు స్ట్రీట్ కార్నర్ లో మేడమీద అద్దెకున్నప్పుడు చూశాను. పామర్తిగారింటి నేమ్ ప్లేట్ నల్లటి ప్లాస్టిక్ బోర్డ్ మీద తెల్లటి అక్షరాలు అదే సైజ్ లో వుండేవి.

 

పామర్తిగారికి మ్యూజిక్ డైరక్టర్ గా రాణించాలనే కోరిక మహాబలంగా వుండేది. అందుకు సర్వదా కృషిచేస్తూనేవుండేవారు. కానీ, ఆయన ఆశించినమేరకు అవకాశాలు అందలేదు. డబ్బింగ్ సినీమాలెన్నిటికో సంగీతదర్శకత్వం వహించినా చాలా తక్కువగానే స్ట్రైట్ సినీమాలకు సంగీతం నిర్వహించారు. పామర్తిగారు సంగీతదర్శకత్వం వహించిన చిత్రాలలో ముఖ్యమైనవి -'సతీ తులసి' ,'బబృవాహన', తిరుపతమ్మకధ'.  వీటన్నిటిలో మాస్టారు పాడిన మంచి పాటలు కొన్ని ఉన్నాయి.

 

మన చిత్రసీమలో వున్న పెద్ద దయనీయ పరిస్థితి ఏమిటంటే, ఒకసారి ఎవరికైనా సంగీతదర్శకుడిగా ముద్రపడిపోయిందంటే, అవకాశాలు వచ్చినా రాకపోయినా ఆ శాఖలోనే వుండిపోవలసిందే. వాద్యకారునిగా అంతకుముందు ఇతరులవద్ద పనిచేసినా,  ఒకసారి సంగీతదర్శకుడయ్యాడని అనిపించుకుంటే అతనికి వాద్యకారునిగా ఉపయోగించుకునేందుకు ఇతర సంగీత దర్శకులు సంకోచించేవారు. అలాగే ఈ నూతన సంగీతదర్శకులుగా ముద్రపడినవారు కూడా ఇతరుల వద్ద ఆర్కెష్ట్రాలో ఛాన్స్ కోసం ఆశించడానికి ఒక రకమైన అహం అడ్డువచ్చేది. ఒక కళాకారునిలో ఎంతటి ప్రతిభావ్యుత్పత్తులున్నా తాను ఆశించిన రంగంలో  ఒక స్థాయికి చేరుకోవడంలో విఫలమై ఆర్ధిక దుస్ధితులను ఎదుర్కొనే కళాకారులెందరో మద్రాస్ రోడ్లమీద కనపడేవారు.

 

సంగీత దర్శకులమని అనిపించుకోవడమే లక్ష్యంగా కాక తమకున్న వాద్య నైపుణ్యంతో అందరి సంగీత దర్శకుల వద్ద అవకాశాలు చేజిక్కించుకొని కేవలం వాద్యగాడి హోదాలోనే లక్షలు సంపాదించి మద్రాసులో సొంత ఇళ్ళూ వాకిళ్ళు ఏర్పరచుకొని హాయిగా బ్రతికినవాళ్ళూ ఉన్నారు. ఈ రకమైన పరిస్థితి సినీమాలలో ఒక్క సంగీతరంగంలోనే కాదు,అన్ని శాఖల్లో కనిపిస్తారు. హీరోలైపోదామని, హీరోయిన్లు కావాలని, దర్శకులు కావాలని , నిర్మాతలైపోవాలని , లేదా గొప్ప కెమేరామెన్లు అయిపోవాలని ఆదర్శంగా పెట్టుకొని ఆ అవకాశాలు లభించక, తిరిగి తమ సొంతవూరుకు వెళ్ళే ధైర్యమూ చాలక మురికివాడలలో జీవితం కొనసాగించుకున్నవారెందరో మద్రాస్ లో కనిపిస్తారు. సినీమా ఒక విచిత్రలోకం. అక్కడ టాలెంట్ ఒక్కటే గుర్తింపుకు రాదు. అంతకుమించిన మరెన్నో అంశాలు పరిగణించబడతాయి. ఎవరు ఎప్పుడు ఎందుకు షైన్ అవుతారో ఎవరూ చెప్పలేరు.

 

నేపధ్యగాయకునిగా, సంగీత దర్శకునిగా ఘంటసాల మాస్టారుకు వున్న స్థానం అద్వితీయం. మెడ్రాస్ చిత్రపరిశ్రమలో ప్రవేశించిన మొదటి మూడేళ్ళు  అవకాశాల వెతుకులాటలో  చాలా శ్రమించిన మాట వాస్తవమే అయినా 1950 ల తరువాత, చిత్రనిర్మాతలే ఘంటసాలగారిని వెతుకుతూ వచ్చారు. ఘంటసాలగారే తమ చిత్రంలో పాడాలని, తమ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాలని కోరుకొని మరీ వచ్చేవారు. తనకుతానుగా పనికోసం వెంపర్లాడలేదు. ఇతరులకు లభించే అవకాశాలకు ఏనాడూ అడ్డుపడలేదు. సాటి కళాకారుల మనుగడకోసం తనకు వచ్చిన సినీమాలను, పాటలను ఎంతో ఉదారంగా వదులుకున్న సంఘటనలెన్నో.

 

ఘంటసాలవారింటికి అవకాశాలకోసం వాద్య కళాకారులు, కోరస్ పాడేవారూ ఎంతోమంది వచ్చేవారు. మాస్టారి చేతిలో ఎప్పుడూ నాలుగైదు చిత్రాలకు తక్కువలేకుండా వుండేవి. ఆ సినీమాలలో హీరో, హీరోయిన్ ల సోలో, డ్యూయెట్  సాంగ్స్ తో పాటూ రెండో మూడో బృందగానాలు వుండేవి. అలాటి పాటలలో పాడే ఛాన్స్ కోసం ఎంతోమంది కోరస్ గాయనీగాయకులు మాస్టారి వద్దకు వచ్చేవారు. ఒక్క ఘంటసాల మాస్టారింటికే కాదు, ప్రముఖ సంగీత దర్శకులందరినీ వెళ్ళి కలుసుకోవడం వారి దైనందిక జీవితంలో ఒక నిత్యకృత్యం.  మాస్టారు వారందరితో సరదాగా అన్ని విషయాలు ముచ్చటించేవారు.

పాటల ఛాన్స్ ల కోసం ప్రత్యేకించి, డబ్బులు ఖర్చుపెట్టుకు రావద్దని చెప్పేవారు. ఘంటసాల మాస్టారు అలాటివారిని ప్రొత్సహించేవారు కాదు. కోరస్ పాటలు వుంటే తప్పక అవకాశాలు కల్పిస్తానని, ఈ విషయంగా తనను కలుసుకోవలసిన అగత్యమే లేదని చెప్పేవారు.

ఘంటసాల మాస్టారి సినీమాలలో వచ్చే బృందగానాలలో జెవి రాఘవులు తో పాటూ వి.రామారావు, కృష్ణ, బ్రహ్మయ్య, సౌమిత్రి,రఘురాం,రావూరి వీరభద్రం, పట్టాభి; ఆడవారిలో వైదేహి,ఉడత, హైమావతి( చక్రవర్తి అక్క), బేబీ కృష్ణవేణి( లైలా మజ్నులో చిన్న లైలా), సరోజిని, శోభ, సుందరమ్మ మొదలైనవారు కనిపించేవారు. వీరందరూ బాగా పాడేవారే. కానీ వీరిలో చాలామంది కోరస్ కే పరిమితమైపోయారు. భద్రంగారు వైలిన్ నేర్చుకొని ఘంటసాలవారి ఆర్కెష్ట్రాలో చోటు సంపాదించుకున్నారు. సినీమా లలో గాయకుడిగా తగిన అవకాశాలు దొరకక పట్టాభిగారు హరికధా రంగంలో కృషిచేసి పట్టాభి భాగవతార్ గా కొంత గుర్తింపుపొందారు.

భద్రంగారు, రామారావు గారు అప్పటికి బ్రహ్మచారులు. నార్త్ ఉస్మాన్ రోడ్ లో ఇప్పుడు 'జాయ్ అలుక్కాస్' జ్యూవెలరీ షాప్ ఉన్నచోట ఒక పాత మేడమీద రూమ్ లో అద్దెకుండేవారు. వాళ్ళ రూమ్ లో పంజరాలలో చిలకలు, కుందేళ్ళువుండేవి. వాటని చూడడానికి నేను, పెద్దబాబు భద్రంగారి రూమ్ కు వెళ్ళి వాటికి బఠాణీలు, శనగలు పెట్టేవాళ్ళం. రామారావు, భద్రం ఈ ఇద్దరూ పానగల్ పార్క్ దగ్గర పార్క్ లాండ్స్ హోటల్లో భోజనం చేసేవారు. వాళ్ళతో పాటూ మేమిద్దరం కాలక్షేపానికి వెళ్ళేవాళ్ళం. మమ్మల్ని చూసి అక్కడి సప్లయర్స్ పెద్ద పెద్ద అప్పడాలు తినడానికి ఇచ్చేవారు. ఫ్రీగానే. అలాగే అప్పుడప్పుడు రసమ్ కూడా ఇచ్చేవారు. పార్క్ ల్యాండ్స్ హోటల్ లోని టిఫెన్లు, భోజనం కూడా చాలా రుచికరంగా, చవకగా వుండేది. మేము మెడ్రాస్ రావడానికి ముందు మా నాన్నగారు కూడా అదే హోటల్ లో భోజనం చేసేవారు.  రెండు పూట్లా భోజనానికి నెలవారీ టిక్కెట్లు నలభై/ఏభై రూపాయాలలోపే అని జ్ఞాపకం.

ఘంటసాల మాస్టారింటికి అమ్మగారిని చూడడానికి ఒకావిడ వచ్చేవారు. పేరు అన్నపూర్ణమ్మ. బళ్ళారి రాఘవాచార్యులు వంటి నటులతో నాటకాలలో నటించేవారట. పద్యాలు చాలా బాగా పాడేవారు. బిబిసి రేడియోలాగా లోక విశేషాలన్నీ సావిత్రమ్మగారికి చెప్పేవారు. ఆవిడ మా పిల్లలందరితో సరదాగా కబుర్లు చెప్పేవారు. అయితే అన్నపూర్ణమ్మ గారితో ఉన్న పెద్ద సమస్య, ఆవిడకు బ్రహ్మాండమైన చెముడు. ఎదుటివారికి చెముడన్నట్లుగా ఆవిడ చాలా గట్టిగానే మట్లాడేవారు ఆవిడ కూతురు శోభ. అసలు పేరు సరోజిని. గాయనీమణులలో చాలామంది సరోజినిలు వుండడాన శోభగా పేరు మార్చుకుంది. ఒక పక్క లా కాలేజీలో చదువుతూనే అవకాశం దొరికితే  సినీమాలలో కోరస్ పాటలు పాడేది. అయితే ఆ రంగంలో నిలదొక్కుకోలేక లా పూర్తిచేసి ఎవరినో పెళ్ళిచేసుకొని జీవితంలో స్థిరపడింది. 1980 ప్రాంతాలలో ఎప్పుడో ఒకసారి మౌంట్ రోడ్ లో కనపడి నన్ను గుర్తుపట్టి పలకరించింది. తానేదో కంపెనీలో ఎక్సిక్యూటివ్ గా పనిచేస్తున్నట్లు చెప్పింది.

శాస్త్రీయ సంగీతంలో ఎంతో నైపుణ్యమున్న గాయకులు, వాద్యకళాకారులు మాస్టారి వద్దకు అవకాశాలకోసం వచ్చేవారు. అయితే వారిలో చాలామంది సినీమా టెక్నిక్ కు తమను తాము మలచుకోలేకపోయేవారు. 1974 తర్వాత ఈ కళాకారులంతా ఏమయ్యారో, ఎక్కడున్నారో నాకు తెలియదు. అప్పుడప్పుడు మా జంట సంస్థల వేదికలమీద కొందరు పాత పరిచయస్తులు కనపడి పలకరించేవారు. ఘంటసాల మాస్టారితో తమకున్న అనుబంధం గురించి జ్ఞప్తికి తెచ్చుకునేవారు. మాధవపెద్ది సత్యంగారు, పిఠాపురం నాగేశ్వరరావుగారూ కూడా అప్పుడప్పుడూ ఘంటసాలవారి ని కలుసుకునేందుకు నెం.35,ఉస్మాన్ రోడ్ కు వచ్చేవారు.

అలాగే ఘంటసాల మాస్టారింటి బొమ్మలకొలువు వంటి విశేషాలకు వచ్చి 'వదినా, వదినా' అంటూ సావిత్రమ్మగారితో హడావుడిగా కబుర్లు చెప్పే మరో గాయని బేబీ కృష్ణవేణి. మొదటిసారి ఈ పేరు విన్నప్పుడు నాకు అక్కడ బేబీ ఎవరూ కనపడలేదు. బదులుగా షర్మిలాటాగూర్ స్టైల్ చక్రాల్లాటి చెవులరింగులతోసాధనా స్టైల్ లో నుదుటిపై హెయిర్ లాక్స్ తో ఒక పెద్దమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయే బేబి కృష్ణవేణి. సి.కృష్ణవేణి, పి.జి.కృష్ణవేణిలతోపాటు మరో కృష్ణవేణి. అందరికీ తెలియడం కోసం బేబీగానే పిలవబడేది. లైలామజ్ను లో చిన్న లైలా, చిన్న మజ్ను గా ఈ బేబి కృష్ణవేణి,  వీణ చిట్టిబాబు నటించారు.

తర్వాత, ఈ కృష్ణవేణి ఏ సినీమాలలో నటించిందో నాకు తెలియదు, కానీ, మాస్టారి సంగీతదర్శకత్వంలో తరుచూ కోరస్ సింగర్ గా కనపడేది. కొన్నాళ్ళ తరువాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పేరు తెచ్చుకొని తోటి డబ్బింగ్ ఆర్టిస్ట్ చుండ్రూ సూర్యనారాయణ అనే ఆయనను వివాహం చేసుకున్నారు. నేను సినిమా రంగానికి చెందినవాడిని కాకపోవడంతో 1974 నుండీ ఈ కోరస్ సింగర్స్ విషయాలు తెలిసే అవకాశం పోయింది.

స్థానికంగా వుండే గాయనీ గాయకులే కాక ఆంధ్రదేశం నలుమూలల నుండీ ఔత్సాహిక గాయకులంతా ఘంటసాలవారికి తమ గానాన్ని వినిపించి, మెప్పించి సినీమాలలో గుర్తింపు పొందాలని ఆశతో వచ్చేవారు. అలాటివారిని మాస్టారు సాదరంగా నాలుగు మంచి మాటలతో ప్రోత్సహించేవారు. గాయకులమంటూ వచ్చేవారిలో సగానికిపైగా ఔత్సాహికులే తప్ప వారికి కనీస సంగీతజ్ఞానం వుండేదికాదు. ఘంటసాలవారి పాటలే తిరిగి ఆయన ఎదుట పాడి వినిపించేవారు. అవన్నీ కూడా ఆయన చాలా ఓపికగా విని, సున్నితంగా పాడినవారి మనసు నొప్పించకుండా మంచి సలహాలు చెప్పి పంపేవారు.

మరి కొందరు చాలా బాగా మాస్టారి పాటల, లేక యితరుల పాటలో పాడి వినిపించేవారు. అలాటివారిని సినీమా పాటలు, తాను పాడినవి కాక ఇతర లలితగీతాలు లాటివి పాడమనేవారు. వచ్చినవారిలో ఎవరికీ ఇతర లలితగీతాలు పాడే సామర్ధ్యం ఉండేది కాదు. కొంతమంది ఏవో పాటలు పాడినా అవి ఆమోదయోగ్యంగా వుండేవికావు. తన దగ్గర పాటలు పాడి వినిపించడానికి వచ్చినవారందరికీ ఒకటే సలహా చెప్పేవారు. పాడేప్పుడు ఏ గాయకుడి గొంతును అనుకరించవద్దని, తమకు భగవంతుడు ఇచ్చిన స్వతసిధ్ధమైన గాత్రంతోనే పాడడం సాధన చేయాలని చెప్పేవారు. స్టార్ సింగర్స్ ను అనుకరిస్తూ పాడేవారికి లభించే గుర్తింపు తాత్కాలికమని, అలాటివారికి దీర్ఘకాలిక మనుగడ కష్టమని అనేవారు. ప్రతీ గాయకుడు అనుకరణలేని తన సహజ బాణీనే అభివృధ్ధి చేసుకోవాలని భావించేవారు. తన గొంతునే అనుకరిస్తూ సినీమాలలో పాడే వర్ధమాన గాయకులను చూసి,వారి భవిష్యత్ గురించి మనసులోనే బాధపడేవారు. గాయకుడుగా రాణించాలంటే శృతి శుధ్ధత , లయ, భాష , భావప్రకటనల విషయంలో తగిన శ్రధ్ధాభక్తులు పాటిస్తూ సంగీత సాధన చేయమని సలహా ఇచ్చేవారు. సినీమాలలో గాయకులుగా రాదల్చుకున్నవారు తమ జీవనోపాధికి ఏదో వృత్తిని చేసుకుంటూ సినీమా ప్రయత్నాలు కొనసాగిస్తే ఆ కుటుంబ సభ్యులకు ఆసరా అవుతారని, కేవలం సినీమాలనే నమ్ముకోవడం శ్రేయస్కరం కాదని ఘంటసాల మాస్టారు అభిప్రాయపడేవారు.

ఈ సలహా చాలామందికి చేదు మందులా తోచేది. చేదుమందు ఒంటికి ఆరోగ్యం. ఘంటసాలవారి  సలహాలలో జీవిత సత్యమెంతో వుంది.

ఈమధ్య ఈ వాట్సప్ సమూహాలతో పరిచయం ఏర్పడి అనేకమంది సమూహ సభ్యులు ఘంటసాలవారితో తాము పొందిన ప్రత్యక్ష పరోక్ష అనుభవాలు పంచుకోవడం జరిగింది. 1960 లో జరిగిన అలాటి ముచ్చట ఒకటి ప్రస్తావిస్తాను. శ్రీ జ్యోతి ప్రభాకరరావు వరంగల్ వాస్తవ్యులు. రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో క్యాషియర్ గా పనిచేసేవారు. మంచి ఔత్సాహిక గాయకులు. ఘంటసాల మాస్టారి పాటలు పాడడంలో మంచి నైపుణ్యం సంపాదించి స్థానికంగా జూనియర్ ఘంటసాలగా అందరి ప్రశంసలు పొందారట. ప్రభాకరరావుగారికి ఘంటసాలగారన్నా, ఆయన గానమన్నా విపరీతమైన అభిమానం. ఘంటసాలగారిని కలిసి ఆయనతో మాట్లాడాలని, తన పాటను వినిపించాలని కలలు కనేవారట. ఆ కలలు నెరవేరే సందర్భం కలసివచ్చింది. వరంగల్ నుండి తమ మిత్రబృందంతో ప్రభాకరరావు మద్రాస్ వచ్చి ముందుగా ఘంటసాలవారింటికే వెళ్ళారట. ఘంటసాలగారు వరంగల్ నుండి వచ్చిన అభిమానులందరితో ముచ్చటించి, ప్రభాకర రావుగారి పాట విన్నారట.  తన అభిమాన గాయకుని ముందు ఆయనే ఆలపించిన 'కృష్ణా! ముకుందా మురారీ!' పాటను పాడి వినిపించారట. పాటంతా విని మాస్టారు చాలా సంతోషించి అభినందించారట. ఇంకా బాగా సాధకం చేస్తే గాయకుడిగా రాణించగలవని ఆశీర్వదించారట.

ఆ తర్వాత, మాస్టారు బయటకు కారులో వెళ్ళబోతే ఆ కారు వెంటనే స్టార్ట్ కాక మొరాయిస్తే ప్రభాకరరావు, మరికొంతమంది మిత్రులు ఒక చేయివేసి త్రోయగా స్టార్టయిందని, ఆ విధంగా తన అభిమాన గాయకుడికి ఏదోవిధంగా సహాయపడిన ఆనందం తనకు దక్కిందని వరంగల్ లో అందరికీ చెప్పి ఆనందించారట. ఆ తరవాత ప్రభాకరరావుగారి బృందం అంతా ఘంటసాలవారింటి నుండి బయల్దేరి నెం.35, ఉస్మాన్ రోడ్ సమీపంలోని బజుల్లా రోడ్ లోని ఎన్.టి.రామారావుగారిని చూడడానికి వెళ్ళారట. అవి 'శ్రీ సీతారామ కళ్యాణం' సినీమా నిర్మాణం లో వున్న రోజులు.  వీళ్ళంతా వెళ్ళే సమయానికి రామారావు గారు రావణాసురుని మేకప్ లో వుండి స్టూడియో కు వెళ్ళడానికి సిధ్ధంగా వున్నారట. అభిమానులను అభిమానించే ఎన్టీఆర్ ఈ మిత్రబృందాన్ని కూడా వేరే వ్యాన్ లో వాహినీ స్టూడియో కు తన షూటింగ్ కు తీసుకువెళ్ళారట. ఆ రోజు రావణబ్రహ్మ అష్టదిక్పాలకులను శాసించే సీన్ షూట్ చేస్తున్నారట. ఈ షూటింగ్ అరేంజ్మెంట్స్ జరిగే సమయంలో ఘంటసాల మాస్టారి అభిమాని ప్రభాకరరావు గారి పాటను వినిపించడానికి రామారావుగారు అనుమతించగా వారి ముందు కూడా పాండురంగమహత్మ్యం లోని 'కృష్ణా ముకుందా మురారి' పాట పడారట. రామారావు గారు కూడా చాలా సంతోషించారట. ఆ తర్వాత, ఎప్పుడో టి చలపతిరావు గారు కొత్త గాయకులను ప్రోత్సహించే క్రమంలో ఈ వరంగల్ ప్రభాకరరావు గారిని ఆడిషన్ కు పిలిపించారట. కానీ, ఇందుకు ప్రభాకరరావు గారి తల్లి చాలా విముఖత చూపి తన కొడుకు తనకు దూరం కావడానికి ఇష్టపడక ఆయన ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసారట. ఈ విధంగా జ్యోతి ప్రభాకరరావు సినీ గాయకుడు కావాలనే ఆశలు నీరుగారిపోయాయట.

ఈ విషయాలన్నీ జ్యోతి ప్రభాకరరావుగారి కుమారుడు జ్యోతి రాజకుమార్ గారు తెలియజేసేరు.

ఘంటసాలవారికి దేశవ్యాప్తంగా ఎంతమంది ఆత్మీయాభిమానులు, ప్రియభక్తులు వుండేవారో ఈ చిన్న సంఘటన తెలియజేస్తుంది. 1961 లో ఘంటసాల మాస్టారి సంగీతంలో రెండే సినీమాలు. ఒకటి 'శ్రీ కృష్ణ కుచేల', మరొకటి ' శభాష్ రాజా'. శ్రీ కృష్ణ కుచేల లో సి.ఎస్.ఆర్ హీరో(కుచేలుడు), శభాష్ రాజాలో అక్కినేని హీరో. శ్రీకృష్ణ కుచేల సినిమా ఆర్ధికంగా విజయవంతం కానప్పటికీ అందులో చాలా మంచి సంగీతముంది. నటనాపరంగా చక్కటి సినీమా. ఇందులో రంగస్థల నటులైన కె.రఘురామయ్య, అద్దంకి శ్రీరామమూర్తి పాడిన పద్యాలున్నాయి. ఒక పద్యమో, పాటో సి.ఎస్.ఆర్ గారిచేత కూడా మాస్టారు పాడించారు. కానీ సిఎస్ ఆర్ గారి ఒత్తిడితో దానిని మాస్టారే మరల పాడి సినిమాలో ఉపయోగించారు. శ్రీ కృష్ణ కుచేల సంగీతం గురించి, అద్దంకి శ్రీరామమూర్తిగారి గురించి ఆయన బాణీ గురించి మా నాన్నగారు (పి. సంగీతరావు) తమ వ్యాసాలలో, చాలా ఇంటర్వ్యూలలో పాడి వివరించారు.


శబాష్ రాజా సినిమా వినోదం కలిగించే ఒక సాధారణ సినిమా. హుషారైన పాటలెన్లో ఉన్నా ఇది సుందర్లాల్ నహతాగారి సినిమా కావడం వలన హిందీ వరసల పాటలే అధికం. ఈ సినిమాలోని 'అందాల రాణివై ఆడుమాపాట చాలా బాగుంటుంది. వైవిధ్యంగల నేపథ్యగాయకుడిగా ఘంటసాలవారి గానప్రతిభ 1961లో మరోసారి నిరూపించబడింది. సీతారామ కళ్యాణం (గాలి పెంచలనరసింహారావు) - కానరార కైలాస నివాస, జయత్వదభ్రవిభ్రమద్బ్రమద్భుజంగ మస్ఫుర, గోవింద మాధవ దామోదర; వెలుగు నీడలు లో (పెండ్యాల) - పాడవోయి భారతీయుడా, కలకానిదీ విలువైనదీ; బావామరదళ్ళు లోని (పెండ్యాల) - నీలిమేఘాలలో, ముక్కోటి దేవతలు, పయనించే మన వలపుల, హృదయమా ఓ బేల హృదయమా; భార్యాభర్తలు లో (ఎస్.రాజేశ్వరరావు) - జోరుగా హుషారుగా, చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి; భక్త జయదేవ లో (ఎస్.రాజేశ్వరరావు) - ప్రళయపయోధిజలే, నీ మధుమురళీ గానలీల, అనిలతరళ కువలయ నయనేన, ప్రియే చారుశీలే; పెండ్లి పిలుపు లో (కె.ప్రసాదరావు) - నాలోని అనురాగమంతా; కృష్ణప్రేమ లో (పెండ్యాల) - మోహనరూపా గోపాలా; ఋష్యశృంగ లో (టి.వి.రాజు) - నభో లోకనాయకా, పరుగులు తీసేవూ పయనమెచటికో మౌనీ; జగదేకవీరుని కథ లో (పెండ్యాల) - శివశంకరీ శివానందలహరి, ఓ సఖీ ఓహో సఖీ, ఆశా ఏకాశ నీ నీడనె నే చేరేసా, రా రా కనరారా కరుణ మానినారా, మనోహరముగా మధుర మధురముగా; వాగ్దానం లో (పెండ్యాల) - సీతాకల్యాణం హరికథ, పాహి రామప్రభో, నా కంటిపాపలో నిలచిపోరాకలసివుంటే కలదు సుఖం లో (మాస్టర్ వేణు) - ముద్దబంతి పూలు బెట్టి; పెళ్ళికాని పిల్లలు (మాస్టర్ వేణు) - చల్లగాలి చక్కని తోట, ప్రియతమా రాధికా, మొన్ననిన్ను చూశాను; ఇద్దరు మిత్రులు లో (ఎస్.రాజేశ్వరరావు) - హలో హలో అమ్మాయి, ఖుషీ ఖుషీగా నవ్వుతూ, ఈ ముసిముసి నవ్వుల - ఈ పాటలన్నీ వివిధ రసాలతో కూడిన వైవిధ్యంగల పాటలు. ఈ పాటలన్నీ ఘంటసాల మాస్టారి గళం నుండి అలవోకగా జాలువారి చిరంజీవత్వం సంతరించుకున్నాయి.

ఈ సినిమాలు వచ్చి అరవై ఏళ్ళు దాటినా ఈ పాటలన్నీ ఈ నాటికీ సినీమా సంగీతాభిమానులందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నాయి. ఈ పాటలు పాడని గాయకులు లేరు. వినపడని సభాస్థలి కానీ టివి ఛానల్స్ గానీ వుండనే వుండవు.

ఘంటసాల శకం సినీ సంగీత చరిత్రలో ఒక స్వర్ణయుగమే. మా నాన్నగారి మాటల్లో ఇరవైయవ శతాబ్దం ఘంటసాలది.
1961లో వచ్చిన తెలుగు చిత్రాలలోని పాటలన్నీ బహుళ జనాదరణపొందినవే అయినా విజయావారి ' జగదేకవీరునికథ' చిత్రంలో ఘంటసాల మాస్టారు పాడిన  'శివశంకరి శివానందలహరి' పాట ఆనాటినుండి నేటివరకూ నెంబర్ 1 పాటగానే రసజ్ఞులందరిచేతా ప్రశసించబడుతున్నది. ఈ పాటకు కలిగినంత సంచలనం, వాదోపవాదాలు, ఊహాగానాలు మరేపాటకు లేవంటే అతిశయోక్తి కాదు. ఆ సినీమా విడుదలైనప్పుడు  ఆ చిత్రంలోని అన్నిపాటల్లాగే పెండ్యాల గారు చాలా అద్భుతంగా స్వరపర్చారని, ఆ పాటను ఘంటసాల మాస్టారు తన గానప్రతిభతో మరింత అద్భుతంగా పాడారని, హీరో ఎన్టీఆర్ చాలా గొప్పగా నటించారని ప్రశంసలు వచ్చాయి. గత మూడు దశాబ్దాలుగా 'శివశంకరి ' పాటను గురించిన చర్చలు అనూహ్యంగా పెరిగిపోయి వాస్తవానికి అతీతమైన వ్యాఖ్యలు ప్రచారంలోనికి వచ్చాయి. ఘంటసాల, పెండ్యాల, ఎన్టీఆర్, కెవి రెడ్డి, పింగళిగార్ల వీరాభిమానులు ఈ పాట గురించి ఏమాటంటే ఏవిధంగా రియాక్ట్ అవుతారో తెలియని పరిస్థితి ఉందన్నవిషయం మాత్రం నిజం.

విజయావారి 'జగదేకవీరునికథ' కు 1944 లో వచ్చిన పక్షిరాజావారి 'జగదలప్రతాబన్' తమిళం సినీమా ఆధారం. అందులో హీరో పి.యు.చిన్నప్ప. హీరోయిన్లు తెలుగులోలాగే నలుగురు. జి. రామనాధన్ సంగీతం. ఈ సినీమాలో పాటలన్నీ ఆనాడు సూపర్ హిట్. గాయక నటునిగా పి.యు.చిన్నప్పకు త్యాగరాజ భాగవతార్ తో సమానమైన అంతస్తును ఏర్పర్చిన సినీమా 'జగతలప్రతాపన్'. ఈ సినీమాలో కూడా 'శివశంకరి' పాటలాటిదే అతిపెద్ద పాట ఒకటి వుంది. ఇందులో కూడా హీరో అనేక రూపాలలో అనేక వాద్యాలు వాయిస్తూ కనిపిస్తాడు. "తాయై పణివేన్" అనే ఈ పాటను కళ్యాణిలో స్వరపరిచారు. ఈ పాట అనుకున్నదానికంటే నిడివి పెరిగిపోగా పది పన్నెండు నిముషాలకు కుదించారట. ఆ కారణంగా ఈ పాట గ్రామఫోన్ రికార్డ్ గా రాలేదట. పి.యు.చిన్నప్ప ఈ గీతాన్ని మరల ఒక నలభై అయిదు నిముషాలపాటు కచేరీ బాణీలో పాడి గ్రామఫోన్ రికార్డ్ గా విడుదల చేయడం అది తమిళనాట విపరీతమైన జనాదరణ పొందడం జరిగిందని తమిళ పత్రికలలో వచ్చిన వార్త.విజయావారి 'జగదేకవీరునికథ'ను తమిళంలో మరల 'జగదలప్రతాబన్' పేరిట డబ్ చేశారు. ' శివశంకరీ' పాటను శీర్కాళి గోవిందరాజన్ పాడిన గుర్తు. దక్షిణాది భాషలతోపాటూ హిందీ, ఒరియాలోకి కూడా డబ్ చేసి మంచి విజయాన్ని పొందిన చిత్రం 'జగదేకవీరునికథ'. తెలుగు భాష సజీవంగా ఉన్నంతకాలం ఘంటసాల మాస్టారి గాన వైదుష్యానికి నికషోపలంగా 'శివశంకరీ' పాట అజరామరంగా నిల్చిపోయివుంటుంది.


ఘంటసాల మాస్టారి మరిన్ని మంచి పాటలతో, విశేషాలతో మళ్ళీ వచ్చే వారం......

సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.


4 comments:

మహేష్ బాబు సంబటూరి వెంకట said...

ఈ 20 వ సంచికలో ఘంటసాల మాస్టారు గారి చక్కని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే మంచి మంచి విషయాలు ఎన్నో తెలిపారు.... ఔత్సాహిక గాయనీ గాయకులకు ఘంటసాల గారి ప్రోత్సాహం... సలహాలు.... సూచనల గురించి,
ఇంకా ఘంటసాల గారితో పనిచేసిన కోరస్ సింగర్ ల గురించి ఎన్నో తెలియని విషయాలు వివరంగా తెలిపారు....

మీరు ప్రస్తావించిన పట్టాభి గారే విశ్వనాధ్ గారి సిరిసిరిమువ్వ చిత్రం లో 'మా ఊరి దేవుడమ్మా చల్లంగా మమ్మేలు రాముడమ్మా' అనే పాటని బాలు గారితో కలిసి పాడారని నేను అనుకుంటున్నాను... నా అభిప్రాయం సరైనదో కాదో తెలుపవలసిందిగా నా విన్నపం బాబాయ్ గారూ 🙏🙏😊

ఇక, జగదేకవీరుని కథ లోని శివశంకరీ పాట గురించి.... ఆ పాట తమిళ వెర్షన్ గురించి చాలా చక్కని సమాచారం అందించారు...

కొసమెరుపు : కడప జిల్లా చెన్నూరు లో నేను హైస్కూల్ లో చదివేరోజుల్లో డాక్టర్ రామచంద్రరావు గారు అని మా తాతయ్య గారు మా స్కూల్ పక్కనే క్లినిక్ నడిపేవారు ...
స్కూల్ వదిలాక ఆయన దగ్గర కాస్సేపు కబుర్లు చెప్పుకుని స్కూల్ లోనే ట్యూషన్ అయ్యాక కడప బస్సు ఎక్కి పది పైసల టికెట్ తో మా ఊరు చేరే వాడిని...

మా డాక్టర్ తాతయ్య గారి క్లినిక్ లోనూ ఘంటసాల మాస్టారు గారి ఇంటి బయట ఉన్న లాంటి IN / OUT బోర్డు ఉండేది.... మీ లాగే నాకు కూడా దాన్ని ఓ అరడజను సార్లైనా ఇటూ అటూ స్లైడ్ చేయకుంటే ఏదో వెలితి గా ఉండేది ఆ పూటకి 😀😀👍🙏🙏

మరోమారు ఘంటసాల మాస్టారు గారి గురించి ఇంత చకచక్కని అపురూపమైన మీ జ్ఞాపకాలను వారం వారం ఎంతో శ్రమకోర్చి పంచుకుంటున్నందుకు మీకు మా హృదయపూర్వక శతాధిక కోటి కృతజ్ఞతాభివందనాలు మరియు ధన్యవాదములు ప్రియమైన స్వరాట్ బాబాయ్ గారూ... 😊🙏🙏😊💐💐😊

మీరు అందించిన అరుదైన ఛాయాచిత్రాలు... మీ నాన్న గారు సంగీతరావు గారి మాటల్లో 20వ శతాబ్ది గాయకుడు ఘంటసాల అనే వీడియో మాకు పెద్ద బోనస్ బాబాయ్ గారూ.... ధన్యులము 😊🙏🙏😊💐💐😊

ameerjan said...

��అబ్బ! మళ్ళీ ఎన్నో ఆసక్తిదాయకమైన విషయాలు చెప్పారు స్వరాట్ గారు! “ ఇన్ & ఔట్ బోర్డ్ ప్లాస్టిక్ దై వుండడం, ఓ మూల విరిగి వుండడం...ఆశ్చర్యమేసింది! 70 లలోనే నాకు తెలిసి చెక్క పలక మీద బ్రాస్ ప్లేట్ విత్ స్టెయిన్ లెస్ స్టీల్ కోటింగ్ తో నేను చూశాను. మీరన్నట్లు “ఇన్ & ఔట్” స్లైడింగ్ బటన్ తో ఆడుకోవడం ఆనాటి సరదాల్లో భాగమే! ��
మాస్టారు విధిగా ఈ బటన్ ను మార్చేవారని చదివి...చిన్న చిన్న విషయాల్లో కూడ వారెంత నిబద్ధతతో వుండే వారో తెలుస్తూంది!

“ఇగో”....కళాకారులనూ వదల్లేదన్న విషయం మీ బ్లాగులో సున్నితంగా ప్రస్తావించడం బావుంది. అలాగే...సాటి కళాకారుల మనుగడ విషయంలో...మాస్టారు ఎంతో ఉదారంగా వ్యవహరించేవారన్న నిజం మీరు మరోసారి తెలియజేశారు!��

��కోరస్ కళాకారులు, డబ్బింగ్ కళాకారుల్ని ఉదహరిస్తూ...మాకందరికీ హరికథా కళాకారుడిగా సుపరిచితుడైన శ్రీ పట్టాభి భాగవతార్ గురించి చెప్పడం, అలాగే ఒకే పేరుతో వున్న వివిధ గాయనీమణుల వివరాలు ఆసక్తి కరంగా వున్నాయి. సినిమా టెక్నిక్ కు అనుగుణంగా తమను మలచుకోలేక పోయిన కళాకారులు తెరమరుగు కావడం...మాస్టారి సలహాల్లో జీవిత సత్యాల్ని గమనించక... చేదు మందుగా భావించి పెదవి విరిచిన వారి వైఫల్యాలు వివరిస్తూ...చివర ఒక్కటే మాటలో పెద్దవారు శ్రీ సంగీతరావు గారన్నట్లు...’ఇరవైయ్యో శతాబ్దం సినీ సంగీత చరిత్రలో ఘంటసాల మాస్టారిదే’ నన్నది నిర్వివాదాంశం!����

మీనుండి మరిన్ని విశేషాలకోసం వచ్చే వారం వరకూ ఎదురు చూస్తాం!!!

P P Swarat said...

ధన్యవాదాలు. శ్రీ పట్టాభిగారి పాట గురించిన మీ అభిప్రాయం సరైనదే.

P P Swarat said...

శ్రీ అమీర్జాన్ సాబ్ ధన్యవాదాలు.