visitors

Thursday, November 3, 2016

రసాలూరు జ్ఞాపకాలు

నవంబరు 2, 2016 ఈరోజు సంగీతరావుగారి 97వ  పుట్టినరోజు. ఈసందర్భంగా  తన చిన్ననాటి ఊరు సాలూరు జ్ఞాపకాలను రసభరితంగా పంచుకున్న వ్యాసాన్ని తలచుకోవడం సముచితంగా ఉంటుంది. ఈ జ్ఞాపకాల పొరలలో ఆనాటి సాలూరుప్రజల సమాజజీవనంతోపాటు సాంస్కృతిక జీవితానికి సంబంధించిన అనేక విశేషాలు  ఈ వ్యాసంలో నిక్షిప్తమై ఉన్నాయి. (వ్యాసంలో ప్రస్తావించిన చినగురువుగారు - పట్రాయనిసీతారామశాస్త్రిగారు, పెదగురువుగారు -  పట్రాయని వెంకట నరసింహశాస్త్రిగారు). 
రసాలూరు జ్ఞాపకాలు
పి. సంగీతరావు
పూజ్యులు మా తండ్రిగారు సాలూరు చిన గురువుగారి స్వృత్యంజలి కార్యక్రమంలో మీ అందరితో పాల్గొనే అవకాశం ఈ విధంగా రావడం నా ఈ వయస్సులో పరమేశ్వరుడు ప్రసాదించిన వరంగా భావిస్తున్నాను.
 మూడు తరాల సాలురు ప్రజల ప్రేమను, గౌరవాన్ని పొందడం కళాకారునిగా ఆయన జీవన సార్ధకతకు నిదర్శనం. ఆయన బాల్యావస్తని సాలూరులోనే గడిపినా, కొంతకాలం విరామంతో తిరిగి 1928 నుంచి 1935 వరకూ సాలూరులోనే గడిపేరు.

ఆనాటికీ, ఈనాటికీ సాలూరు పట్టణంలో మార్పలు, చేర్పులూ ఉండకపోవు. ఆనాడు సాలూరు యూనియన్ బోర్డ్ అయితే ఈనాడు మున్సిపాలిటీ. ఏమయినా అటు జగన్నాథస్వామి ఆలయం, ఇటు రూథరన్ చర్చి, మధ్య ఆంజనేయస్వామి కోవెల ఎన్ని మార్పులు వచ్చినా సాలూరు స్వరూపాన్ని నిలబెట్టేయి.

ఆరోజుల్లో సాలూరు జీవితం మూడు భాగాలుగా కనిపించేది. 1. మోటారు కులం. 2. వ్యాపార సంఘం. 3. పురోహిత వర్గం. ఊరు కొంత దీనంగా కనిపించినా ప్రజలలో చాలా చైతన్యం, కష్టపడి పనిచేసే లక్షణం, వాక్స్వాతంత్ర్యం ఉండేవి. చుట్టుపక్కల గ్రామలలోని జమీందారీ ఒత్తిడి వంటిది ఏ విధంగానూ సాలూరులో ఉండేది కాదు.

అవి స్వాతంత్ర్య పోరాటపు రోజులు. మహాత్మా గాంధీ ప్రభావం దేశం అంతా నిండింది. నీతి, నిజాయితీ, నిరాడంబరత ప్రజలలో ఆదర్శాలుగా ఉండేవి. రామక్రిష్ణ పరమహంస, స్వామి వివేకానందల ప్రేమ సందేశంతో దీనజనసేవ ఆరాధనీయమయింది. అనేక గ్రామాలలో ఏర్పడిన ప్రేమ సమాజాలలాంటిదే సాలూరులో ఏర్పడిన అనాధ సేవా సంఘం. ఆనాటి వరకూ విచ్చల విడిగా తిరిగిన బాదంపూడి సూర్యనారాయణ ఒక్కమారు గుండు చేయించుకొని అన్నపూర్ణ కావిడి పట్టాడు – దీనజన సేవకోసం.

అదిగో ఆరోజుల్లో వెలసింది సంగీత పాఠశాల – సాలూరు ప్రజల హృదయస్పందనతో. పర్ణశాలనిపించే పురిపాక, చుట్టూ ప్రహారీలా వెదురు మణిగింపు. పర్ణసాల నాలుగు పక్కలా పువ్వుల మొక్కలతో ఋష్యాశ్రమంలా ఉండేది. సంగీత విద్యార్ధులలో లింగబేధంకాని, వయోబేధంగాని, జాతిబేధంగాని లేదు. విద్యార్ధులు అనేక వృత్తులవారు ఉండేవారు. చాకలి పారయ్య అనే విద్యార్ధి ఉండేవాడు. తారాపురం నుంచి గుడ్డి నాయుడు (దుంప లచ్చున్నాయుడు) రైతు కుటుంబానికి చెందినవాడు. రంగారావు పంతులుగారు అతనికి బస్సు పాసు యిచ్చేరు. వారి బస్సులో రాగపోకలకి. సంగీత పాఠాలకి వేళాపాళా అంటూ లేదు. ఎప్పుడైనా రావచ్చును. విద్యార్ధులలో చాలామంది సారూరు వారైనా పై గ్రామల నుంచి వచ్చిన విద్యార్ధులు కూడా చాలా మంది ఉండేవారు. అందరూ నిరధనులే. సంగీత విద్యార్ధులంటే ఊళ్ళో అందరికీ ఎంతో ప్రేమ. వాళ్ళ పోషణ బాధ్యతంతా ఏదో విధంగా పౌరులే భరించేవారు.

 గురువుగారు సంగీత మాస్టరుగా కనిపించేవారు కాదు. ఏదో దివ్యత్వం కనిపించేది. గురువుగారి కుటుంబ పోషణ ఎలా జరిగేదో తెలియదు. ఎవరికీ ఆ విషయం పట్టేది కాదు. సాలూరులో ఆయనకి చిన్న ఇల్లు తప్ప మరే ఆధారంలేదు. గోదావరి, కృష్ణా జిల్లాలలో చాలామంది ఆయన అభిమానులుండేవారు. శ్రీరామ నవమి ఉత్సవ కార్యక్రమాలకు, వివాహాది శుభకార్యాలకు ఆయన కచేరీలు ఏర్పాటయేవి. ఆ విధమైన రాబడే ఆయన జీవకకు ఆధారం. ఈ పరిస్థితిలో అనేక మంది ఇతర స్థలాల నుంచి సాలూరు వచ్చే కళాకారులను ఆదరించవలసిన నైతిక బాధ్యత ఆయన తీసుకునేవారు. జయపురం మహారాజు విక్రమదేవ వర్మగారు జయపురంలో జరిపే దసరా ఉత్సవాలకు చాలామంది కళాకారులు, కవులు, పండితులు వెళ్ళేవారు. వారందరికీ సాలూరు ఒక మకాం క్రింద ఉండేది. వారందరినీ సాలూరు పౌరుల సహాయంతోనూ, సాలూరు రాజుగారి ఔదార్యంతోనూ గురువుగారు సంతోషపరిచి పంపించేవారు. సాలూరు వచ్చే హరిదాసులు చాలామందికి కార్యక్రమాలు ఏర్పాటు చేయడమేకాదు, వాళ్ళకు పక్కవాద్యం హార్మోనియం వాయించేవారు. శ్రీ బోనుమద్ది రాములు మృదంగం వాయించేవారు. తర్వాత శ్రీ ఉరిమి జగన్నాధం మంచి తబలా వాద్య నిపుణుడు. ఆయన ఏదో నాటక సమాజంతో వచ్చి సాలూరులో స్థిరపడ్డారు. ఆయనే పరమేశ్వరీ పిక్చర్ పేలస్ లో నాటకాల కోసం అనేక కర్టెన్లు రాసేరు. సాలూరు నుంచి వెళ్ళిపోయన తర్వాత ఆయన జెమిని స్టూడియోలో తబలా వాద్యునిగా స్థిరపడ్డారు మద్రాసులో. శ్రీ రామలింగం, ప్రసాదు ఆయన కుమారులే. సుప్రశిధ్ధ తబలా వాద్యకులు. ప్రసాదు మాత్రం ప్రస్తుతం ఉన్నాడు. ఘంటసాలగారి అమెరికా పర్యటనలో ప్రసాదు కూడా మెంబరు.


శ్రీ జగన్నాధం ఆరోజుల్లో మా నాన్నగారితో అనేక కచేరీలకి వెళ్ళేవారు. ఆరోజల్లోనే శ్రీ కావ్యకంఠ గణపతిశాస్త్రిగారు సాలూరు వేదసమాజంలో ఉపన్యసించేవారు. శతావాదానం అప్పట్లోనే చూసాను. శ్రీ గోరుగంతు సూర్యనారాయణ శర్మ అని జ్ఞాపకం ఆ శతావధాని. వేదసమాజంలోనే జరిగింది ఆ కార్యక్రమం. శ్రీ కాశీభట్ట కృష్ణరాయ శాస్త్రిగారు సమస్య యిచ్చేరు. గుంటన్ గాంచిన కవత కుదుటన్ బడుబో...శతావధానిగారు బాగుంటన్ గాంచిన... అని పూర్తిచేసారు. ఆ శతావధానంలోని పద్యాలు కొన్ని ఇంకా జ్ఞాపకం ఉన్నాయి.

పర్ణశాలగా ఉన్న సంగీత పాఠశాల శ్రీ రంగారావు పంతులుగారి సంకల్పంతో భవన నిర్మాణ దశలో పడింది. ఆయన సంకల్ప పూర్ణరూపం దాల్చలేదు. పునాదులతో ఆగిపోయింది. ఈ పరిస్థితిలో గురవుగారు వైద్య చికిత్స నిమిత్తం ఒక సంవత్సరం విశాఖపట్నం వెళ్ళవలసివచ్చింది.
ఆరోజుల్లోనే గురువుగారి గ్రామఫోన్ రికార్డులు వచ్చాయి. 1933 కావచ్చును. విశాఖపట్నం నుంచి వచ్చిన తర్వాత పాఠశాల నిర్మాణానికి స్వయంగా పూనుకున్నారు. అప్పుడు సబ్ రిజిస్ట్రారు – టి.ఎల్.ఎన్. రాజుగారు. సబ్ మేజిస్ట్రేట్ – ఆయనా రాజుగరే. ఆయన పేరు భూపతిరాజు నరసింహరాజుగారని జ్ఞాపకం. వారి సహకారంతో తాలూకాలోని వివిధ గ్రామాలలో పాఠశాల నిమిత్తం కచేరీలు చేసి, ప్రజలు ఇచ్చే అతి చిన్న మొత్తాలతో పాఠశాల నిర్మాణం పూర్తిచేయడం జరిగింది. పాఠశాల గోడలు అయి, పైకప్పు వేసిన దగ్గరనుంచి సంగీత పాఠాలు నడుస్తూనే ఉండేవి. అలాగే ప్లాస్టరింగ్, తలుపు, గచ్చులూ పాఠశాల నడుస్తూనే పూర్తయేయి. రోజూ సాయంకాలం దీపారాధన అయిన వెంటనే ప్రార్ధన జరిగేది. ఆ ప్రార్ధన సమావేశానికి చాలామంది వచ్చేవారు. గురువుగారు హార్మోనియం వాయిస్తూ చెప్తూ ఉంటే అందరూ పాడేవారు. ఆ పాట కేదారగౌళ రాగం, ఆదితాళం. శ్రీ శారదా గానశాలోధ్ధరణ గుణశాలీ మమున్ దయగనుమా. పాఠశాల నిర్మాణం చివరకు గురువుగారు విజయనగరం మహారాజా  మ్యూజిక్ కాలేజీ వోకల్ ప్రొఫెసర్ గా విజయనగరం వెళ్ళే సందర్భంలో వీడ్కోలు సభా కార్యక్రమానికి వినియోగపడింది.
 ఆనాటి వీడ్కోలు సభ అతి కరుణరసభరితమయింది. సాలూరులో ఏ మాత్రపు ఆసరా ఉన్నా గురువుగారు ప్రాణప్రదంగా నిర్మంచుకున్న పాఠశాలను వదిలి వెళ్ళేవారుకాదు. ఉద్యోగధర్మం ఆయన ప్రవృత్తికి విరుధ్ధం. కళాకారునిగా ఆయన స్వేఛ్ఛ, సంప్రదాయపు పంజరంలో బంధింపబడింది.


విజయనగరం సంగీత కళాశాల వోకల్ ప్రొఫెసర్ గా ఆయన ఆచార్యత్వంలో అనేక మంది సుప్రసిధ్ధ గాయకులుగా, ప్రభుత్వ కళాశాలాధ్యాపకులుగా, సినిమా కళాకారులుగా రూపొందడం నిజమేకానీ, రసవద్గాయకునిగా వాగ్గేయకారునిగా అనిర్వచనీయమైన వ్యక్తిత్వంతో ప్రభాసించినది సాలూరు చిన గురువుగానే. ఆయన సాలూరులోనే ఉండి ఉంటే సంగీత కచేరీ విధానం ఎంతో రసస్ఫూర్తిగా రూపొంది ఉండేది. ఎన్నో విశిష్టమైన ఆయన సంగీత రచనలతో కర్ణాటక శాస్త్రీయ సంగీతం సుసంపన్నం అయి ఉండేది. గురువుగారి సంగీత రచనలు గురువుగారి స్మారక సంచికలో అచ్చయ్యేయి. (తదనంతర కాలంలో – 2010 లో – శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అధ్యక్షతన మద్రాసు మ్యూజిక్ అకాడెమీ (మిని)లో జరిగిన ఆయన 110 జయంత్యుత్సవంలో ప్రియ సిస్టర్స్, మనుమరాలు జ్యోతిర్మయి లు ఆయన సంగీత రచనలతో కచేరీ చేసారు. మునిమనుమరాలు కాకరపర్తి సత్యసంగీత ఆయన విశిష్టమైన, విలక్షణమైన జావళిని కూచిపూడి సంప్రాదాయంలో ప్రదర్శించింది). 

అనేక స్కాలిత్యాలతో తిరిగి అవి పునర్ముద్రణ పొందవలసి ఉంది. (నాన్నగారు సూచించిన మార్పులు చేర్పులతో తాతగారి కృతులు, పద్యాలు చిన్నపుస్తక రూపంలో ప్రచురించబడి శ్రీ బాలమురళీకృష్ణగారిచే ఆరోజు ఆవిష్కరించబడ్డాయి). నిజానికి ఈ స్మృత్యంజలి సభ గురువుగారికి మాత్రమే పరిమితమయినది కాదు. ఆయనను ప్రేమించి గౌరవించిన సాలూరు పౌరులది, అభిమానులది, ఆయన అంతేవాసులది.

అదిగో పెదబళియార్ సింహులు బహద్దరు సాలూరు రాజాగారు. గురువుగారంటే ఎనలేని ప్రేమ, గౌరవాలు. మహారాజులకుండదగిన దాతృత్వమూ రసజ్ఞతా ఉండేది వారియందు. అయితే దాతృత్వానికి తగిన ధనం ఉండేది కాదు వారిదగ్గర. గొప్ప రసజ్ఞత, రసజ్ఞతకి తగని సంస్కార లోపం తెలిసేది. అప్పుడప్పుడు గురువుగారిని కోటకి పిలిచేవారు. కోటలో మంచి హార్మోనియం, వయొలిన్, తబలా, మృదంగం అన్నీ ఉండేవి. టిక్కిబాబుగారు మృదంగం వాయించేవారు. ఆయన మీసాలతో భీకరంగా ఉండేవారు. ఆయనే మృదంగ చక్రవర్తి అని ప్రభువుగారి అభిప్రాయం. ఇక సభాసదులు పదిమంది లోపు. జవాన్ గురువుగారు మహాప్రభువుకి పార్సీ, ఉర్దూ చెప్పేవారనుకుంటాను. ఆయనే విదూషకుడుకూడా. సభ మధ్యలో ప్రభువువారు రబ్బరు పామును జవాన్ గురువుగారి మీద విసిరేవారు. జవాన్ గురువుగారు భయసంభ్రమాలు నటించేవారు. ప్రభువువారికి బ్రహ్మానందం కలిగేది. అప్పటికే ఆయన వృధ్ధుడు. తెల్లగడ్డానికి ఎర్రరంగు వేసేవారు. కూర్మయ్య అనుకుంటాను అతని పేరు – రాజావారి పి.ఏ అతను. పాట తరవాత కొంత లోకాభిరామాయణం. సెలవు పుచ్చుకునే ముందు ప్రభువు జేబులో ఏముంటే అది గురువుగారి చేతిలో పెట్టేవారు. అది ఐదురూపాయలకి ఎక్కువగాని, ఒక రూపాయికి తక్గువగాని ఉండేది కాదు. అయితే ప్రభువువారి ప్రేమకు గురువుగారి కళ్ళలో నీళ్ళు తిరిగేవి. ప్రభువుగారు కొంత భూమికూడా యిచ్చేరు. అయితే గురువుగారికిచ్చిన భూమి సన్నిహితులు మార్చి రామభద్రపురంలో ఉన్న మంచి భూమికి బదులు ఊటగెడ్డ ఏజెన్సీలో ఉన్న భూమి గురువుగారికి అంటగట్టేరు.

చందూరు రంగారావు పంతులు గారు – ఆయన సాలూరు వ్యక్తికాదు. నెల్లూరు అనుకుంటాను ఆయన స్వస్థలం. బస్సుల రంగారావు అనేవారు. ఆనాడు సాలూరు పురప్రముఖలలో ప్రముఖుడు. సంగీత పాఠశాల నిర్మాణంలో ఆయన భాగం ఉంది. సరీ, ఎందరో పురప్రముఖులు గురువుగారిని ఆదరించినవారు. అందరికీ వందనాలే. గురువుగారిని ఆరాధించిన సాలూరు శిష్యబృందంవారందరూ ఈ సభలో ఆనాటి స్వరూపాలతో కన్నీటితెరల వెనుకనుంచి కనిపిస్తున్నారు. గురువుగారిని కూడా సాలూరులో ఉన్నప్పటి స్వరూపంతోనే చూస్తున్నాను.

శ్రీ తంపెళ్ళ సత్యనారాయణ మంచి విద్వాంసుడు. గ్రామఫోన్ రికార్డ్ ఇచ్చారు. ఆయన కుమారుడు తంపెళ్ళ సూర్యనారాయణ హైదరాబాదు సంగీత కళాశాలలో వయొలిన్ ప్రొఫెసర్. (ఇటీవలే పోయారు). (ఇటీవలే – మార్చ్ 2016 – ఆయన అన్నగారు మహదేవరావుగారు కూడా పోయేరు). శ్రీ నారాయణదేవ్ గారు, పాపయ్య మాష్టరుగారు, మిత్రుడు మానం అప్పారావు ఇంకా అందరూ కనిపిస్తున్నారు. అదిగో, దుంప నరసింహాలు చిన్నతనంలో నడవలేకపోతే ఎత్తుకుని తీసుకుని వచ్చేవాడు. నాకు కసరత్తు గురువు. తరవాత్తర్వాత నరసింహారెడ్డి భాగవతార్. నేను కలివరంలో ఉన్నప్పుడు అక్కడ కథాకాలక్షేపం జరిగింది కూడా. అందరివి పేర్లు జ్ఞాపకం ఉన్నాయి. ఈనాడు వాళ్ళందరినీ పేరు పేరునా తల్చుకుంటున్నాను. ఈ సందర్భంలో గురువుగారు సాలూరు వదిలి వెళ్ళిన తరవాత సంగీత పాఠశాలను నామరూపాలతో నిలబెట్టి, సంగీత వాతావరణం కొనసాగించిన మిత్రుడు మానం అప్పారావుగారికి, మా తమ్ముడు ప్రభుకి, శ్రీ త్రినాథరావుగారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పటికీ వదలని ఆశ చెప్పుకోవాలి. అది, మళ్ళీ సంగీత పాఠశాల, సంగీత పాఠశాలగానే నిలుస్తుందని, సాలూరు సంగీత విద్యా కేంద్రంగా ప్రకాశిస్తుందని. ఇది దురాశ అనుకోవడంలేదు. సాలూరు ప్రజలలో ఇంకా ఆ రసజ్ఞద ఉందనే నమ్మిక మాత్రమే.

ఈ సమయంలో నాచిన్ననాటి అనుభవాలు తలపుకి వస్తున్నాయి. ఒకటి రెండు చెప్పాలనే నా చాపల్యాన్ని మన్నించండి. మా సాలూరు ఏరు తల్లి వేగావతి. నది అన్నంత పేరు భరించలేక వినయంగా సిగ్గుతో ఒదిగి ఒదిగి ప్రవహించేది. సాలూరులో అందరూ ఏటికి వెళ్ళే నీళ్ళు తెచ్చుకునేవారు. తుకిడీలు, తుకిడీలుగా పాఠశాల పక్కనుంచి నీటి కడవలతో వస్తున్న స్త్రీ బృందం ఎంతో చూడముచ్చటగా ఉండేది. మళ్ళీ ఆ దృశ్యం కనబడదు ఈ రోజుల్లో. వేగావతీ నది ఒడ్డున పెరిగిన సీతాఫలాలు ఆ రోజుల్లో ఆక్షేపణ లేకుండా తింటూ తిరిగేవాళ్ళం. వేగావతి అలాగే ఉందో, యింకా చిక్కిపోయిందో. ఆ రోజుల్లో పేరసాగరం నిండితే బలికోరుతుందని భయపడేవారు. ఒకమారు శివరాత్రికి పారమ్మ కొండ ఎక్కలేక భయంతో తిరిగి రావడం జ్ఞాపకం ఉంది.

 బంగారంపేట వెళ్ళే రోడ్డు పక్కన ఉండేది మా మిడిల్ స్కూలు. బాబ్జీ, నేను, కాశీభట్ల లక్ష్మణమూర్తి, మండలేముల సాంబశివరావు కలిసి వెళ్ళేవాళ్ళం స్కూలికి. హెడ్ మాస్టర్ చార్లెస్ పీకాక్, తెలుగు పండితులు కాశీభట్ల క్రిష్ణరాయశాస్త్రిగారు, పుల్లె అప్పలనరసయ్య మనసులోంచి పోలేదు. మా యింటి దగ్గర ఉన్న చర్చిలో షూల్జ్ దొరగారి తెలుగు ఉపన్యాసం మరపురాదు. ఆ మధ్య పదేళ్ళు దాటిందేమో, ఢిల్లీలో ఒక యువకుడు నా పేరు విని పలకరించి తను, బాబ్జీ రెండోకొడుకునని చెప్పేడు. ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తాట్ట.


మరో రెండు చిన్ననాటి ముచ్చట్లు –

సాలూరు జగన్నాథస్వామి రథయాత్ర మరపురాని అనుభవం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే కొత్త రథం తయారుచేసేవారు. దక్షిణాది దేవాలయ రథాలలాగ శాశ్వత రథాలు కావు. రథయాత్ర అంటే వారంరోజుల జాతర. యాత్ర జరిగినంతసేపూ తుంపర పడుతూనే ఉండడం మామూలు. రథయాత్రకి మా యిల్లు కానుకగా వచ్చిన పంచదార చిలకలతో నిండిపోయేది. జగన్నాథస్వామికి భక్తులు కక్కరాలు భోగం చేయిస్తారు. జగన్నాథస్వామి ప్రసాద మాధుర్యం, మహాత్యం ఆనాటి నుంచి అనుభవమే.     

Wednesday, October 19, 2016

విజయనగరం జ్ఞాపకాలు

సంగీతరావుగారు 1936 సం.  ప్రాంతాలలో తాను చూసిన విజయనగరం గురించి వ్రాసిన వ్యాసం ఇది. వివిధ రంగాలలో ప్రసిద్ధిపొందిన మనకు తెలిసిన వ్యక్తులెందరో ఈ జ్ఞాపకాల తెరలలో మనను పలకరిస్తారు.

దాదాపు 80 సంవత్సరాల క్రిందటి విజయనగరం ఊరు - సంగీతరావుగారి  జ్ఞాపకాలలో......
1936 డిసెబర్ లో మా నాన్నగారు విజయనగరం సంగీత కళాశాలలో గాత్ర పండితులుగా ప్రవేశించారు. అప్పటి నా వయసు పదిహేను-పదహారేళ్ళు. నాటి విజయనగరం మహారాజు శ్రీమద్ అలక్ నారాయణ గజపతి మహారాజుగారు. అంటే తెలుగు దేశం ప్రభుత్వంలో రెవిన్యూ మంత్రిగా ఉండిన అశోక్ గజపతి తాతగారన్నమాట. సుప్రసిధ్ధ సోషలిస్ట్ నాయకుడు పి.వి.జి. రాజు గారి తండ్రి ఆయన.

విజయనగరం ప్రభువుల యడల ప్రజలకు అమితమైన భక్తిప్రపత్తులుండేవి ఆరోజుల్లో. 1936లో మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఎన్నికల్లో విజయనగరం నియోజక వర్గంనుంచి ఇండిపెండెంట్A గా అద్వితీయమైన మెజారిటీతో గెలుపొందేరు అలక్ నారాయణ గజపతి. ఆనాటికి విజయనగరం సాంస్కృతికంగా ఆంధ్రదేశంలో ప్రముఖంగా ఉండేది. విజయనగరం కాలేజీ పురాతనమైనది. సంస్కృత కళాశాల, సంగీత కళాశాలలు విజయనగరంలో మాత్రమే ఉండేవి.

సుప్రసిధ్ధ నేపధ్య గాయకుడు ఘంటసాల విద్యార్ధిగా గడిపిన రోజులవి.

విజయనగరానికి సంబంధించిన నా జ్ఞాపకాలు అంటే 60-70 (ఇప్పుడు 80) సంవత్సారాల కిందటి జీవితం నెమరు వేసుకోవాలి. ఆ జ్ఞాపకాలు యదార్ధానికి ఇటు అటుగా ఉండే అవకాశం ఉంది.

ఆంధ్రుల సంప్రదాయానికి, సంస్కృతికి, ప్రాభవానికి ఆనాటికి కూడా విజయనగరం ప్రతీకగా ఉండేది. నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు తెరమరుగై అప్పటికి చాలా కాలం అయింది. ఆటపాటల మేటి అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు, మహామహోపాధ్యాయ తాతా సుబ్బరాయశాస్త్రిగారు, గాంధర్వవిద్యాభూషణ ద్వారం వెంకటస్వామి నాయుడుగారు, వీణా వెంకటరమణయ్యదాసుగారు, మల్లాది విశ్వనాధకవిరాజు, కవిశేఖర భోగరాజు నారాయణమూర్తి మొదలైన మహనీయులు ఆనాటికి ఇంకా ఉండనే ఉన్నారు.

కళలకి, వేదశాస్త్రములకు, సంస్కృతికి విజయనగరం కేంద్రంగా భావించబడేది ఆరోజుల్లో. ఆంధ్ర దేశానికంతటికీ సంగీత పాఠశాల విజయనగరంలోనే ఉండేది. మొదటి సైన్సు కాలేజీ, సంస్కృత కాలేజీ విజయనగరంలోనే స్థాపించబడ్డాయి. ఎంతోమంది సుప్రసిధ్ధులు విజయనగరంలోనే ఉండేవారు. ఈనాడు సుప్రసిధ్ధులైన సంగీత, సాహీతీవేత్తలు చాలామంది విజయనగరం కళాశాలలకి చెందినవారే. ఆదిభట్ల నారాయణదాసుగారు సంగీత కళాశాల మొదటి ప్రిన్సిపాల్. ఆయన రిటైరయ్యాక ద్వారం వెంకటస్వామినాయుడు ప్రిన్సిపాల్ అయ్యారు. వాసా వెంకట్రావుగారు వీణ అధ్యాపకులుగాను, పట్రాయని సీతారామశాస్త్రిగారు, పేరిబాబుగారు, నేమాని వరహాలుదాసుగారు గాత్ర పండితులుగాను, మునిస్వామి అనే ఆయన నాదస్వర పండితులుగాను, శ్రీపాద సన్యాసిరావుగారు మృందగ పండితులుగానూ ఉండేవారు.

సంగీత కళాశాల విజయనగరం మహారాజావారు స్థాపించక పూర్వమే కట్టు సూరన్నగారు ఒక సంగీత పాఠశాల సానివీధిలో నడిపించేవారట. ఈ సంగీత పాఠశాల గురించి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి కథలుగాథలులో చదివిన జ్ఞాపకం.

మహామహోపాధ్యాయ తాతాసుబ్బరాయశాస్త్రిగారు, పేరి లక్ష్మీనారాయణశాస్త్రిగారు, వఝ్ఝల చినసీతారామశాస్త్రిగారు మొదలైన ఉద్దండ పండితులు చాలామంది సంస్కృత కళాశాలాధ్యాపకులుగా ఉండేవారు. కవిశేఖర భోగరాజు నారాయణమూర్తిగారు, విశ్వనాధకవిరాజుగారు, కాలేజీ తెలుగుశాఖలో ఉండేవారు. ఎంతోమంది కథకులు, రచయితలు, హరికథకులు మొదలైన కళాకారులతో విజయనగరం హుందాగా ఉండేది. ఆనాటికి అనారోగ్యంగా ఉన్నా విశ్వవిఖ్యాత పహిల్వాన్ కలియుగ భీముడు కోడి రామ్మూర్తినాయుడుగారు కూడా ఉన్నటే జ్ఞాపకం.

నారయణదాసుగారు అధ్యక్షులుగా ఉన్న రోజులలో హరికథా కాలేక్షపం విద్యార్ధులే ఎక్కువగా ఉండేవారు. నాయుడుగారు ప్రిన్సిపాల్ అయిన తరువాత సంగీత కళాశాలలో సంప్రాదయ సంగీతాధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఆనాడు ఆంధ్ర సంగీత పాండిత్యానికి దక్షిణదేశం అంతటికీ ఉత్తమ ప్రతినిధి నాయుడుగారే. ఆంధ్ర దేశానికంతటికీ ఆనాడు సంగీత కళాశాల విజయనగరంలో మాత్రమే ఉన్నా, విజయవాడలో గాయకసార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు పది కళాశాలలు కూడా చేయలేనంతటి సంగీత విద్యాప్రదానం చేస్తుండేవారు ఆరోజుల్లో.

ఇక ఆరోజుల్లో విద్యార్ధుల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఎవరికీ హోటలులో భోజనం చేసి విద్యాభ్యాసం చేయగలిగే స్తోమత ఉండేది కాదు. చాలామంది వారాలు చేసుకొనో, మధుకరం చేసుకొనో విద్యాసముపార్జనచేస్తూ, ఉన్నత విద్యాసాధన చేసేవారు.

విద్యార్ధులోల కొంతమందికి సింహాచలం బోర్డింగ్ హౌస్ లో ఉచిత భోజనవసతి కల్పించేరు సంస్థానంవారు. ఇంగ్లీషు, సంస్కృత, సంగీత కళాశాల విద్యార్ధులకు మాత్రం 20 మంది లోపుగానే ఈ సదుపాయం ఉండేది. ఆ రోజుల్లో సంస్కృత, సంగీత కళాశాల విద్యార్ధులు వారాలు, మధూకరం చేసుకుంటూ విద్యాభ్యాసం చెయ్యడం సహజంగానే భావించేవారు. ఆయా విద్యార్ధుల యెడల గృహస్థులు ప్రేమగానే ఉండేవారు. సంప్రాదయులు కూడా విద్యార్ధులు మధూకరవృత్తినవలంబిచడమే మహోత్కృష్టకార్యంగా భావించేవారు.

సంగీత విద్యార్ధులు తమ విద్యాసాధనని సార్ధకపఱచుకొందికి విజయనగరంలో అనేక భజన గోష్టులు దోహదం చేసేవి. వ్యాసుల రాజారావుగారి మేడలోనూ, వంకాయల వారింటిలోనూ, శంభరదాసుగారి కుటీరంలోనూ ప్రతీవారం ఏదో రోజున భజన కాలక్షేపం ఉండేది. అంతేకాదు ఏకాహాలు, సప్తాహాలు ఎప్పుడూ ఎక్కడో ఒకచోట సంవత్సరం పొడుగునా జరుగుతూ ఉండేవి. ఈ భజన కాలక్షేపాలలో విద్వాంసులు, విద్యార్ధులు అందరూ పాల్గొనేవారు. ఈ భజనగోష్టులలో సాధకులకి మంచి ప్రోత్సాహం, పాడడానికి చొరవ ఏర్పడేవి. ఒక్కొక్క సందర్భంలో ఏదో ఒక కీర్తన తీసుకొని బృందగానం చేసేవారు. స్వరకల్పనలో అందరూ పాల్గొంటూ ఉండేవారు స్పర్ధతో.

సాలూరు చిన గురువుగారుగా ప్రసిధ్ధులు పట్రాయని సీతారామశాస్త్రిగారింట్లో నిత్యమూ సంగీత, సాహిత్య సమ్మేళనం జరుగుతూ ఉండేది. గురువుగారి మిత్రులు, సాహితీవేత్తలు తమ రచనలు వినిపించేవారు. పండితులు, కవులు, కథకులు, నవలా రచయితలు అందరూ అనేక విధాలైన చర్చలు చేస్తుండేవారు. సంగీత, సాహిత్యాల పరస్పర సంబంధ విషమై ఆరోజుల్లో సీతారామశాస్త్రిగారి సంగీత శిష్యుడు పంతుల లక్ష్మీనారాయణశాస్త్రిగారి లక్ష్య లక్షణ సమన్వయం అన్న వ్యాసం వేదిక్ రిసర్చ్ పత్రికలో ప్రచురించేరు. అది గురువుగారి ఆదర్శాలని ప్రతిబింబించేదిగా భావించబడింది. గురువుగారింట్లో సమావేశమైన మిత్రబృందమే తరువాత కౌముదీ పరిషత్తు గా పరిణమించింది. ఈ పరిషత్తు సభ్యులు చాలామంది సుప్రసిధ్ధ రచయితలుగా, సంగీతజ్ఞులుగా లోకానికి పరిచయమయ్యేరు.

యువ కళాకారులని, కవులనీ, రచయితలనీ ప్రోత్సాహించిన మరో పెద్ద సంస్థ ఆంధ్ర భారతీ తీర్ధ అదే ఆంధ్రా రిసెర్చ్ యూనివర్సిటీ. ఈ సంస్థకి బుర్రా శేషగిరిరావు పంతులుగారు అధిపతి. యువ రచయితలు, కవులు, కథకులు, తమ రచనలని ఈ సంస్థ సభలలో వినిపించేవారు. యువ గాయకులు, వాద్యకులు తమ గానాన్ని ప్రదర్శించేవారు. అర్హులకి బిరుదు ప్రదానాలని కూడా ఈ సంస్థ నిర్వహించేది. కీ.శే. పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారికి గాయక సార్వభౌమ బిరుదు, గిడుగు సీతాపతిగారికి గౌరవ డాక్టరేటు, స్థానం నరసింహారావుగారికి నటశేఖర ఈ సంస్థ ఇచ్చినవే.

చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ ఆంధ్ర దేశం అంతటా సుప్రసిధ్ధులుగా ఉండేవారు. నటుడిగా, హరికథకుడిగా నాటి యువతరానికి మార్గదర్శి ఆయన. మారుతీ భక్త మండలి అనే కళాసంస్థని నిర్వహించేవారు.

మహారాజావారి నాటక సమాజానికి చెందిన పాతతరం నటులు రామయణం సర్వేశ్వరశాస్త్రిగారిని నా చిన్నతనంలో చూసేవాణ్ణి. ఆయన సంస్కృత కళాశాల లైబ్రేరియన్ అని జ్ఞాపకం.

ఆరోజుల్లో సరిదె లక్ష్మినరసమ్మ (కళావర్ రింగు) సుప్రసిధ్ధ నర్తకి, గాయనీమణి కూడా.

1940 ప్రాంతాల్లో శ్రీశ్రీ తఱచు విజయనగరంలో కనిపించేవారు. అంతేకాదు, ఆరుద్ర విజయనగరం కాలేజీలో చదువుకోడం జ్ఞాపకం ఉంది.

మరో సుప్రసిధ్ధ వ్యక్తి దొడ్డమ్మ – జయంతి సీతారామభాగవతార్. ఘంటస్తంభం దగ్గర పార్క్ లోని వెల్నాట్ల లైబ్రరీకి లైబ్రేరియన్ ఆయన. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి వేషానికి దొడ్డమ్మది గొప్పపేరు. ఆయన గోదావరి పుష్కరాల పాట గ్రామఫోన్ రికార్డ్ ఆంధ్రదేశం అంతటా వినిపించేది.

సుప్రసిధ్ధ సాహితీపరుడు ఆచార్య రోణంకి అప్పలస్వామిగారు కొంతకాలం బ్రాంచి కాలేజీలో పనిచేయడం కూడా జ్ఞాపకం ఉంది. చాగంటి సోమయాజులుగారిని తఱచు ఆలేవారి వీధిలో ఉన్న ఆకుండి సత్యనారాయణగారింట్లో చూసేవాణ్ణి. ఆయన గొప్ప కథకుడిగా ఆనాటికే గుర్తింపు ఉండేది కథా రచయితల్లో. ఆయనని మా సత్యనారాయణగారు నరహరిరావు అని పిలిచేవారు. ఆకుండి సత్యనారాయణగారూ రచయితే. ఆయన కథలు ఆనాటి ఆంధ్రభూమి (ఆండ్ర శేషగిరిగారి పత్రిక)లో ప్రచురింపబడుతూండేవి.

వ్యాసనారాయణ మెట్ట అందరికీ తెలిసిన ప్రదేశమే ఆరోజుల్లో. నల్లచెఱువు మెట్టలు, బాబా మెట్టలు అనేవారు కూడా. నా చిన్నతనంలో ఒక వైష్ణవస్వామి మెట్టమీద ఉన్నదేవాలయాన్ని పునరుధ్ధరించేరు. అలాగే వ్యాసనారాయణ మెట్టలో ఖాదరు అవులియా బాబావారి ఆశ్రమం ఉండేది. అక్కడ రోజూ సాయంత్రం బాబాగారి దర్బారులో నాట్య, సంగీత కార్యక్రమాలు ఉండేవి. బాబాగారి దర్శనానికి వెళ్ళేవారు బీడీకట్ట సమర్పించేవారు. నాగపూర్ తాజుద్దీన్ బాబాగారి శిష్యుడనేవారు అవులియా బాబాగారిని.

నిజానికి విజయనగరం ముచ్చట్లు ఎంతో వివరంగా చెప్పుకోవలసిఉంది. సాంస్కృతికంగా వివిధ శాఖలలో ఎంతో ఘన చరిత్రగలిగిన విజయనగరం మా ఊరని చెప్పకోగలగడం అదృష్టంగా భావిస్తున్నాను.

++

Thursday, August 4, 2016

సంగీత కళాశిఖామణి - శ్రీపాద పినాకపాణి సంగీతరావుగారు తన సమకాలీనులైన ప్రముఖ సంగీతవేత్తల వైదుష్యాన్నివివరిస్తూ  అనేక ప్రామాణిక వ్యాసాలు రాసారు. 1976 సంవత్సరం ఆంధ్రప్రభ దినపత్రికలో  ప్రచురించబడిన ఈ వ్యాసపరంపరలో శ్రీపాద పినాకపాణిగురించి సంగీతరావుగారు రచించిన వ్యాసం ఇది. 


ఆంధ్రప్రభ – సెప్టంబర్ 26, 1976, విజ్ఞాన వేదిక
సంగీత సంప్రదాయవేత్త
శ్రీపాద పినాకపాణి 

ఆంధ్ర గాయకలోకంలో డాక్టర్ శ్రీపాద పినాకపాణిగారిది గురుస్థానం. ఈ గౌరవం ఆయనకు సహజంగానే సంప్రాప్తమైంది.

ఆయన మానమైన ఆహ్వానాన్ని పురస్కరించుకొని గత మూడు దశాబ్దాలకు పైగా ఎందరో వర్తమాన సంగీత విద్వాంసులు వారి సన్నిధిలో తమ అనుభవాన్ని, జ్ఞానాన్ని సరిదిద్దుకొన్నారు; సుగమం చేసుకొన్నారు.

ఈనాటి సుప్రసిధ్ధ ఆంధ్ర గాయకులు చాలా మంది వారి ప్రభావాన్ని తలదాల్చిన వారే.

శ్రీ పినాకపాణిగారు సంగీత సంప్రదాయోధ్ధారకులుగా గణింపదగనవారు. గానంలో వారి విశిష్ఠమైన బాణీ, వారి ప్రభావం సోకిన విద్వాంసులందరి గానంలోనూ వారి మూర్తి పొడగడుతుంది. చివరకు కంఠస్వరం పట్టువిడుపులలోనే కాదు – పలికే తీరులో కూడా.

శ్రీ పినాకపాణి సంగీతాన్ని ఏనాడూ వృత్తిగా స్వీకరించినవారు కాదు. సంగీతం ఆయన జీవత సార్థకతకు, ఆనందానికి మాత్రమే ఆలంబనమయి ఉంది. సంగీతవృత్తికి సంబంధించిన అసహ్యకర వాతావరణానికి ఆయన ఎప్పడూ దూరమే. అంతేకాదు, సన్మాన, సత్కారాల ఎడల కూడా ఆయన నిర్లిప్తులే.

అందుకనే ఏమో ఆయన సంగీతం అంత స్వఛ్ఛమయి ఉంది. అంత ఆదర్శవంతంగా కూడా ఉంది.
రాగసంచారములోనైతేనేమి, కీర్తన పాఠంలోనైతేనేమి – సంప్రదాయ విద్వాంసులందరిలోను ఏకవాక్యతలేదు. అనేక కీర్తనలలో మౌలికమైన పాఠమేదో స్పష్టపడదు. ధాతురచనలో ఎంతో ప్రక్షిప్తమయ్యే అవకాశం ఉంది. మన రాగసంప్రదాయం తెలియని పాశ్చాత్య సంగీతజ్ఞులకి ఒకే కీర్తన వివిధ గ్రంథాలలో ఉన్న వ్రాతపాఠం అనేక విధాలుగా గోచరిస్తుంది.

శ్రీ పినాకపాణిగారు వివిధ పాఠ భేదములు గల ధాతుమాతువులను పరిశీలించి, తమక గల ప్రజ్ఞతో, అనుభవంతో, అధికారకారంతో ఒక ఉత్తమమైన పాఠ క్రమాన్ని అనేక కృతులకు నిర్ణయించిన పండితులు. వారు నిర్ణయించిన ధాతుమాతుక్రమంతో వారు స్వయంగా గానం చేయడమే కాకుండా, అనేక మంది విద్వాంసులు ఆ క్రమాన్ని అనుసరించడం కూడా జరుగుతూ ఉంది. వారు ఏర్పఱచిన కీర్తన పాఠం దాక్షిణాత్య పండితుల ప్రశంసలనందుకున్నది కూడా.

ఈనాడు తెలుగు దేశంలో కర్ణాటక సంగీత సంప్రదాయాన్ని అనుసరిస్తున్న ఉత్తమశ్రేణి విద్వంసులు పలువురు ఏర్పడి ఉన్నారన్నా, తెలుగు దేశం అంతటా సంప్రదాయ సంగీత ఎడల అపూరవమైన ఆసక్తి, ఆదరణ, అభివృధ్ధి చెందుతూ ఉన్నాయన్నా, దానికంతకూ కారణం శ్రీ పినాకపాణిగారి నిరంతరమైన అజ్ఞాత కృషి ఫలితమే అని అనక తప్పదు. అంతేకాదు, ఆంధ్ర గాయకలోకంలో పరస్పరసమైన అవగాహన, సానుభూతి, ప్రోత్సాహం నానాటికీ పెంపొందుతూ, ఒక సామూహికమైన సంగీత కృషి సాగుతున్నదంటే శ్రీ పినాకపాణిగారి అమోఘమైన సంకల్పశక్తి దోహదప్రాయంగా ఉందన్న విషయం స్పష్టమే.

ఈ సందర్భంలో వివిధ విజాతీయ సంగీత ప్రభావాలను, ప్రజాభిప్రాయాన్ని గ్రహించి, మన సంగీత సంప్రదాయాన్ని సింహావలోకనం చేసుకోవడం, ఆత్మవిమర్శ చేసుకోవడం అప్రస్తుతం కావు.

మన సంగీత సంప్రదాయశైలిని ప్రధానంగా ప్రదర్శించేది నేటి సంగీత కచేరీ విధానం. దగ్గరగా రెండు దశాబ్దులైనా అయి ఉండవచ్చు ఈ కచేరీ అమలులోకి వచ్చి. ఈ కచేరీ నడిపించే పధ్ధతి విద్వాంసులందరికీ ఒకే మూస. గానం చేసే రచనలలోగూడా ఎక్కువ మార్పు ఉండదు. రాగసంచారంలోనూ, స్వరసంచారంలోనూ విన్నదే వింటూ ఉండడం సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. గాయకుల భావనాశక్తి, సాధనబలం కూడా సంపదాయ పరిధిలోనే పరిభ్రమిస్తూ ఉంటాయి. కొన్ని దశాబ్దాలుగా నూతన శైలికి తార్కాణమైన సజీవమైన రచనలు రాలేదు. సాధనకి ఉన్న గుర్తింపు రచనకు, భావనాశక్తికి లేదు. ఈ స్థితిలో రసికులు నూతనత్వాన్ని కోరడం కళకి ద్రోహం తలపెట్టడంగా భావించకూడదు.

ఇక సంప్రదాయ సంగీతం తన ప్రత్యేకతను నిలబెట్టుకుందుకు ఒక గమక విధానాన్ని అనుసరిస్తుంది. ఒక పత్యేకమైన తరహాకి చెందిన సాహిత్యాన్నే ఆదరిస్తుంది. సాహిత్యంలోని విషయం కూడా భక్తి, శృంగారాలకే పరమితమై ఉంటుంది. ఇక సాహిత్యం ఒదిగి ఒదిగి అప్రధానంగా ఉంటుంది. వాద్యప్రపచంలో ఏదో ఒకటి రెండు వాద్యాలను మాత్రమే పరిగ్రహిస్తుంది. ఇదీ మన సంప్రదాయ శైలి. సంప్రదాయ సంగీతశైలిలో ప్రజాజీవతం అంతా ప్రతిఫలించదు. అది పూజాగృహం దాటి బయటకి రాదు. జీవితం సంగీతమయంగా చేసే ప్రయత్నం సంప్రదాయ మార్గంలో ఏ మాత్రం జరగలేదు. ఈ విషయంలో సంప్రదాయాభిమానులను, రసికులను కలవరపెడుతున్న సమస్యలెన్నో ఉన్నాయి.

సంప్రదాయ సరళిలో ఎంతో భక్తిప్రపత్తులు కలిగిన విద్వాంసులకు కూడా ఏదో మార్పు తీసుకురావాలనే తపన లేకపోలేదు.

కొంతమంది విద్వాంసులు రాగాలాపన హిందుస్థానీ సంగీత శైలిలో నడిపిస్తూ, కీర్తనను మాత్రం మామూలు పధ్ధతిని అనుసరిస్తున్నారు. మరికొందరు హిందుస్థానీ సంగీత శైలికి చెందిన భజనలు, టుమ్రీలు, గత్తులను తమ స్వంత సాహిత్యంతో దిగుమతి చేస్తున్నారు.

ఈ సమస్యలను ఉపేక్షించడం వల్లగానీ, ప్రజాభిరుచిని శంకించడంవల్లగాని పరిష్కారం కాదు.

సంప్రాదయ సంగీతం తన విశిష్టతను కాపాడుకుంటూ తన ప్రత్యేక మార్గంలో ప్రజాభిరుచికి సన్నిహితం కావడానికి చేసే ప్రయత్నంలో శ్రీ పినాకపాణిగారి వంటి పండితుల అనుభమూ, సహకారమూ ఎంతైనా వినియోగించుకోవలసి ఉంటుంది.  

===+++===  ఫఫరరరరర