visitors

Friday, December 5, 2014

విశాలాక్షి గారి ముచ్చట్లు

                          

చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరికైనా మధురాతి మధురంగానే ఉంటాయి. కొన్ని అనుభవాలు ప్రత్యక్షంగా మనిషి వ్యక్తిత్వం మీద ప్రభావం చూపితే, మరికొన్నిటి ప్రభావం పరోక్షంగా ఉంటుంది.  వాటి ప్రభావం ఎలా ఉన్నా పరిమళం మాత్రం జీవితమంతా వెన్నంటి ఉంటుంది. మరికొన్ని వ్యక్తిత్వవికాసంలో కూడా  దోహదపడతాయి. జీవితపు మలుపుల్లో మైలురాయిలాగా కనిపిస్తూ గుర్తుచేస్తుంటాయి.
ఈ జ్ఞాపకాల కాసారంలో ద్వివేదుల విశాలాక్షిగారు ఇక లేరు అని కాలం విసిరిన చిన్న గులకరాయి సృష్టించిన అల్లిబిల్లి తరంగాలే  వేణుగోపాలకృష్ణ రాసిన ఈ  వ్యాసంలోని అక్షరాలు.

ద్వివేదుల విశాలాక్షిగారు ఆంధ్ర సాహిత్యలోకానికి చిరపరిచితులే. విశాలాక్షిగారి భర్త శ్రీ ద్వివేదుల నరసింగ రావుగారు. డి.ఎన్.రావు అనేది ఆయన వ్యవహారనామం.  సంగీతరావుగారి విజయననగర జీవితంనుండే డి.ఎన్.రావుగారితో ఆత్మీయమైన అనుబంధం ఉండేది.   సినీరంగంలో స్థిరపడిన  ఘంటసాల గారు మద్రాసుకి వస్తే ఎన్నో అవకాశాలు ఉన్నాయని సంగీతరావుగారిని ఆహ్వానించారు. తండ్రికి నచ్చని సినీరంగం నాకూ వద్దనుకున్నారు సంగీతరావుగారు. కానీ  సంసారసాగరంలో పడి ఊపిరాడక మునుకలు వేస్తూ ఈదుతుంటే  మార్గాంతరాన్ని ఆలోచించారు మిత్రులు. ఆయనని బలవంతంగా విజయనగరం రైల్వేస్టేషన్ లో రైలు టికెట్ కొని మద్రాసుకి రైలెక్కించారు డి.ఎన్. రావు గారు. అది సంగీతరావుగారి సుదీర్ఘ సంగీత ప్రయాణంలో ముఖ్యమైన  మైలు రాయి. 1955లోజరిగింది ఇది. తరువాత డి.ఎన్.రావుగారి కుటుంబం కూడా మద్రాసులో కాపురం పెట్టాకా ఈ చెలిమి మరింత దృఢం అయింది. డి.ఎన్. రావు గారు, విశాలాక్షిగారు సంగీతరావుగారి కుటుంబంతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. ఇవి గోపీ (వేణు గోపాలకృష్ణ) చిన్ననాటి  విశాలాక్షిగారి కబుర్లు...
                                                                                  
                      నాకు తెలిసిన 'మంచోళ్ళు'                    
1965-66 ప్రాంతాల్లో అంటే నేను ఐదు-ఆరు చదివే రోజుల్లో నేను తరచుగా వెళ్ళే చోటు పూర్ణిమ, విజయరాఘవాచారి రోడ్డు. వాణీ మహల్ నుంచి విజయరాఘవాచారీ రోడ్డులోకి తిరిగేక కుడిచేతివేపున్న పెద్ద బంగళా. D.N. రావుగారి ఆఫీస్ కం రెసిడెన్స్. United States Educational Foundation of India. (అంతకు పూర్వం చెట్ పట్ –సేత్తు పట్టు - హేరింగ్టన్ రోడ్డులో ఉండేవారు. ఒక్కసారి వెళ్ళిన గుర్తు. 1964 అయుంటుంది.) నాన్నగారు వెళుతుంటే వెంట మేం పిల్లలం కూడా వెళ్ళేవాళ్ళం. మొదట్లో. తరవాత్తరవాత ఎవరూ లేకుండా నేనే వెళ్ళేవాణ్ణి. అలా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదని కొంత కాలానికి అర్ధం అయింది. అక్కడ నా వయసు వాళ్ళెవరూ లేకపోయినా అలా వెళిపోతూండడానికి కారణం అక్కడి friendly atmosphere. వాళ్ళబ్బాయి శ్రీనాధ్, అమ్మాయి ఛాయ, (ఇద్దరూ అన్నయ్య కన్నా పెద్దేనేమో). విశాలాక్షిగారు. అందరూ చాలా friendly గా ఉండేవారు, నేను చాలా చిన్నవాణ్ణే అయినా. గేటు దగ్గరనుంచి చాలా లోపలికి ఉంటుంది బంగళా. ఇప్పటికీ. కింద ఆఫీస్ పైన రెసిడెన్స్. పాత్ వేకి రెండు పక్కలా లాన్, మధ్యలో చిన్నకొలను, కొలనులో తెల్ల, వయొలెట్ కలువలు, రెండు హంస బొమ్మలు, చేపలు – (చేపలు ఒరిజినల్). ఇంటికి ముందు వెనకా పువ్వుల మొక్కలు, చెట్లు. సాయంత్రాలు నిశ్శబ్దంగాను, pleasant గాను ఉండేది ఆ ప్రాంతం. చుట్టుపక్కల బిల్డింగ్స్ మధ్య దూరం ఎక్కువ. ఆ ఇల్లు B.N. రెడ్డిగారికి (కొండారెడ్డిగారు?) సంబంధించిన వాళ్ళది కావొచ్చు. పక్కన constructions ఏవీలేని ఖాళీ స్థలం ఉండేది. దాన్ని టెన్నిస్ కోర్ట్ చేస్తే బాగుంటుందని అనుకునే వారు ఛాయ. (ఒకవేళ ఆ స్థలంలో తరవాత కొండారెడ్డిగారి బిల్డింగ్ వచ్చుంటుందా? ఏమో?) ఆ రోజూల్లో ఆవిడ IIT  admission కి prepare అవుతుండేవారనుకుంటాను. ఆ సాయంత్రం వేళల్లో అలా వాళ్ళింట్లో కలిసినప్పుడు నాన్నగారు పాడేవారు. చాలా విషయాలగురించి మాట్లాడేవారు. పద్మని కూడా పాడమనేవాళ్ళు. (అప్పట్లోనే – 1969 కావొచ్చు – పద్మ ఆంధ్రా క్లబ్ లో పాడి ఫస్ట్ ప్రైజ్ సంపాదించింది. రిలీజ్ కాని దైవం సినిమాలోని ఎన్ని మాయలు చేసినావయా పాడింది. పామర్తిగారు అప్పడు సెక్రటరీయో లేదా ఏదో ఆఫీస్ బేరర్. శారద కూడా పాడినట్టు జ్ఞాపకం. ఎన్ని మాయలు నేర్చినావయా, జయజయ సుందర నటరాజ, తిరుమలమందిర సుందర ఇవన్నీ సంగీతం పాఠంలో భాగంగా అందరికీ నేర్పించేవారు నాన్నగారు).
అమ్మమ్మ పూజలకోసం, వ్రతాలు వస్తే, వచ్చి పువ్వులు కోసుకెళ్ళు అనేవారు విశాలాక్షిగారు. తెలతెలవారుతుండగా మొక్కలమధ్య తిరుగుతూంటే పరిమళం అంటే ఏమిటో తెలుస్తుంది. పువ్వులు కోసుకురాడం నాకు దినచర్యే. అదికూడా ప్రతిరోజు "నేనొక పూలమొక్కకడ" పద్యం మెదులుతూండగా.  అలా వాళ్ళింటికెళ్ళడం అలవాటయింది. ఒకరోజు వాళ్ళింట్లో లంచ్. మొదటిసారి పసువు రంగు లో నెయ్యి చూసాను. అవును పసుపు వేసేను అన్నారావిడ. అలాగే మొదటిసారి కిచిడి. మొదటిసారి స్ట్రాబెరి ice cream. అది కూడా ఆవిడ తయారుచేసినదే (!?) Ice cubes tray లో. ఈ traysలో లా చిన్న చిన్న క్యూబ్స్ కావు. పెద్దవి. అవిప్పుడు చూస్తే అవికూడా చిన్నవిగానే ఉంటాయేమో మరి.
ఒకరోజు సాయంత్రం అందరూ లాన్ లో పేం కుర్చీలేసుకుని కూర్చుని మాట్లాడుకుంటుండగా నేను నా whistle ప్రతిభని వేళ్ళతోని, వేళ్ళులేకుండా చూపించాను. బాగుంది, కానీ అమ్మాయిల కాలేజీల దగ్గర వెయ్యకు అన్నారు విశాలాక్షిగారు. అప్పట్లోనే ఒక చిన్న బొచ్చుకుక్కపిల్లని తెచ్చుకున్నారు. దాని పేరు పిక్సీ. అది గడ్డిలో పరిగెడుతూ, దొర్లుతూ పడుతూ, పట్టకోడానికి వచ్చేది మమ్మల్ని.
శ్రీనాధ్ అప్పటికే సిటి బేంక్ లో పని చేసేవారో లేదో నాకు తెలీదు. అప్పట్లో దాని పేరు First National City Bank. మౌంట్ రోడ్డు మీద ఉండేది. ఒక రోజు సాయంత్రం ఎప్పటిలానే నా మాటలకి వాళ్ళు నవ్వుకుంటూ, శ్రీనాధ్, ఆ కొబ్బరిచెట్టు ఎక్కి కొబ్బరికాయలు ముట్టుకుని దిగితే రెండు రూపాయలు పందెం అన్నారు. నేను రెడి అయిపోయాను. అప్పుడెవరెవరున్నారో నాకు గుర్తులేదు. రెండు చేతులతో పట్టుకుని చెట్టెక్కి కొబ్బరికాయలు ముట్టుకుని దిగేను. ఆయన కొత్త రెండు రూపాయల నోటిచ్చుకున్నారు. లైట్ పింక్, ఉల్లిపొర రంగులో ఉండే ఆ నోట్ల మీద వెనక పులి బొమ్మ ఉండేదనుకుంటాను. మర్నాడు ఉదయం గుండెలమీద ఎర్రగా చారలు. అమ్మ తిట్టింది అలా పందాలు కాసి డబ్బులు తీసుకోకూడదని. వాళ్ళింటికెళ్ళి కుర్చీకి తగిలించి ఉన్న ఆయన షర్ట్ జేబులో ఆ నోటు పెట్టేసాను. అది ఎప్పటికీ ఆయనకి తెలిసుండదు.  ఆ తరవాత ఆయన లండన్ వెళ్ళడం. అన్నీ జరిగిపోయాయి. నాకు వగరు అన్న రుచి తెలిసింది ఆయనవల్లే. ఇన్ని వాల్ నట్స్ చేతిలో పెట్టేరు. ఆ రుచేంటో గాని నచ్చలేదు. నవ్వి అలా తినరు అని మరిన్ని కిస్ మిస్ పళ్ళు ఇచ్చారు. Probably they were amused by my innocent boyish behavior.
ఒకరోజు రాత్రి వాళ్ళింటింనుంచి తీసుకువచ్చిన భారతిలో కరెన్సీ నోట్లు బయడపడ్డాయి. మరిచిపోయి పెట్టేసారేమోనన్నారు నాన్నగారు. నవ్వులాటకని తరవాతి తెలిసింది. అది అన్నయ్యకి వచ్చిన రెమ్యునరేషన్. 67లో BA   పూర్తయి బొబ్బిలినుంచి వచ్చేక కొన్ని రోజులు ఫౌండేషన్ నిర్వహించే GRE పరిక్షలకి ఇన్విజిలేషన్ వెళ్ళేవాడినని అన్నయ్య అన్నాడు.  
1966 అక్టోబర్ నాకు బాగా జ్ఞాపకం. ఘంటసాలగారి కచేరీ పంచశీల సమితి, హైదరాబాదు, కి వెళ్ళేరు నాన్నగారు. అప్పటికి కొన్నిరోజులుగా లల్లీకి (లలిత, రెండో క్లాస్ చదువుతున్నప్పుడు) ఒంట్లో బాగులేదు. కామెర్లు అని, ఇంకేదో. రాత్రికి రాత్రి సీరియస్ అయింది. అమ్మ, సావిత్రమ్మగారు గాభరా పడుతున్నారు. ఆవిడ కారుతీయించి రాయపేట హాస్పిటల్ తీసుకెళ్ళేరు. ఆ రాత్రి దానికి తెల్లారలేదు. సెరిబ్రల్ హెమరేజ్ అని అన్నారని D.N. రావుగారు చెప్పేరు. మర్నాడు ఘంటసాలగారు ఫ్లైట్ లో వచ్చేరు. ఆ మర్నాడు నాన్నగారు వచ్చేరు. కానీ మాకెందుకో (పిల్లలకి) నమ్మకంలేదు. అదెక్కడో ఇంకా ఉందనే చాలా రోజులు మా అనుమానం.

 లలిత
 C M బ్రహ్మానంద రెడ్డి ఘంటాసాలగారికి మెమెంటో ఇస్తున్నప్పటి ఫోటో, పక్కన నాన్నగారు హార్మోనియంతో ఉన్నది, మేడ మీద ఆఫీసు రూం గుమ్మంమీద ఉండేది. పంచశీల సమితి వారు ఆయనకిచ్చిన సన్మాన పత్రం పెద్దది గోల్డ్ ఫ్రేం తో ఉన్నది హాల్లో గోడమీద ఉండేది. ఆ రెండూ (with dates) ఈ విషయాలన్నీ మరపురాకుండా చేసినవి. ఆ సన్మాన పత్రంలో ఓ spelling mistake ఉంది. ఘ కి ఒత్తు ఎక్కడ పెట్టాలో చాలామందికి తెలీదు.... పోనీ కొంత మందికి తెలీదు... కాదా... at least  ఆ సన్మాన పత్రం రాసినతనికి తెలీదు. Ok.       
రెక్సోనా సోప్ చుట్టూ ఉండే రేపర్ మీద విడివిడిగా ఇండియా రాష్ట్రాలు గ్రీన్ కలర్ డ్రాయింగ్ తో కొన్ని రోజులు అమ్మేరు. వాటన్నిటిని కలెక్ట్ చేసి ఇండియా మేప్ పూర్తిచేసి పంపిస్తే ఏదో ఇస్తారు. అరే అవి నేను పారేసానే. ఈ సారి ఇస్తాను అని విశాలక్షిగారు కొన్ని ఇచ్చేరు.  అలా పూర్తి చేసిన మేప్ పంపిచాను కూడా. నాకేం రాలేదు మరి. ఈ కలెక్షన్ పిచ్చి ఎక్కువగానే ఉండేది. మేచస్ – అగ్గిపెట్టి మీద బొమ్మలు, ఐదు పైసలకి పది. కూరలు, ఏవి కొన్నా మిగిలిన డబ్బులు తీసుకెళ్ళి సాయిబు కొట్లో మేచస్ కొనేసేవాణ్ణి. birds, animals, flags, air crafts ఇలా అన్నీ కలెక్ట్ చేసేవాణ్ణి. Calcutta Confectionary Works, Bombay, వాళ్ళ fruitee, milky bar toffees, bubble gum రేపర్స్ లోపల ఈ బొమ్మలుండేవి. ఒక్కొక్కటి పది పైసలు. Special indication ఉన్న రేపర్ పంపిస్తే వాళ్ళు ఖాళీ ఆల్బం పంపేవాళ్ళు. ఇంక ఆ ఖాళీలని నింపడానికి ఈ fruiteeలు, milky barలు కొంటూండమే పని. అక్క birds ఆల్బం మధ్యలో ఆపేసింది. Animals ఆల్బం పూర్తిచేసి పంపిస్తే నా పేరుమీద 35 ఉస్మాన్ రోడ్డు అడ్రస్ తో లెటర్ పేడ్, విసిటింగ్ కార్డ్స్ వచ్చేయి. పైన ట్రంకుపెట్టిలో ఇంకా ఉన్నాయి. కొన్ని నెలలు పట్టేది పూర్తిచెయ్యడానికి. కాని విశ్వమోహన్, అల్లు air crafts ఆల్బం వారం రోజుల్లోనే పూర్తిచేసి పంపించేసారు. ఆ buying spree ఎంతో ఊహించుకోవచ్చు. (అప్పటికి – వాళ్ళు శంకరాభరణం తీస్తారని విశ్వమోహన్ కాదు వాళ్ళ నాన్నగారే అనుకుని ఉండరు). ప్రపంచ దేశాల నాయకుల ఆటోగ్రాఫ్స్ ఉన్న పుస్తకం, స్టాంప్ సైజ్ లో వాళ్ళ పోటోలు వచ్చేయి వాళ్ళకి. కానీ general knowledge కి ఈ కలెక్షన్ బాగానే ఉపయోగపడుతుంది. చాలా దేశాల జెండాలు, వాళ్ళ కరెన్సీ, రకరకాల జంతువులు, పక్షులగురించి చాలా విషయాలు నాకు తెలిసాయి.
1968 నాటికి బజుల్లా రోడ్డు చివర ఉన్న ఒక ఇంట్లోకి మారిపోయిన రోజుల్లోనే విశాలాక్షిగారు నాకీ రేపర్స్ ఇచ్చేవారు. అక్కడనుంచి వాళ్ళు మలేషియా వెళ్ళిపోయారు. పనగల్ పార్క్ పోస్టాఫీస్ లో కొని తీసుకు వచ్చిన ఏరోగ్రాం మీద నాన్నగారు రాసిన చాలా ఉత్తరాలు పటాలింగ్ జయా అడ్రస్ కి నేనే పోస్ట్ చేసేవాడిని.  అప్పుడు, మలేషియా వెళ్ళడానికి ముందు, వాళ్ళింట్లో ఉన్న చాలా వస్తువులు మా ఇంటికి transfer అయ్యాయి. లాన్ లో వేసుకుని కూర్చునే పేం కుర్చీలు, గుండ్రటి పేం టీ పాయ్. ఇండేన్ గేస్ కనెక్షన్, బేడ్మింటన్ రేకెట్స్ with net, carom board with coins. 151 ఉస్మాన్ రోడ్ ఇంటి ముందు డబుల్స్ కోర్ట్ కి కావలసినంత చోటుండేది. 1975-76 లో మురళి, శాస్త్రి డబుల్స్ కోర్ట్ వేసి ఇచ్చేరు. రోజూ అందరం ముమ్మరంగా బేడ్మింటన్ ఆడేలా చేసినవి ఆ రేకెట్సే. అవి మెటల్ వి కావు. Wood. పైనున్న (అటక) ట్రంకుపెట్టి ఓ ట్రెషర్ బాక్స్ – వాళ్ళింటినుంచి వచ్చిన దేశవిదేశాల పిక్చర్ పోస్ట్ కార్డ్స్, ఆల్బంలు అన్నీ ఇంకా అలాగే ఉన్నాయి. 
ఇంకా చాలా మొక్కలు with కుండీలు. Light indigo కలర్ చామంతులు, చాలా పెద్దవి పూసేవి. అమ్మ, నేను చాలా ఏళ్ళు ఆ మొక్కల సంరక్షణ చూసాం. ఇంక పుస్తకాలయితే ఎన్నో. అందులో చాలా ప్రతిమా బుక్స్. ఆ పుస్తకాల్లో నేను ప్రతి సంవత్సరం పరీక్షలయ్యాక వేసవి సెలవులు ప్రారంభం కాగానే విధిగా చదివే పుస్తకం నండూరి రామ్మోహన్ రావుగారి అనువాదం – హకల్ బెరీఫిన్. ఎన్ని సార్లు చదివానో లెక్కలేదు. మార్క్ ట్వేన్ ఇంగ్లీష్ ఒరిజినల్ ఇప్పటి దాకా నేను చూడలేదు. ఆ అవసరం రాలేదు. మొన్ననే పద్మ అడిగింది కావాలని చదవడానికి. ఇంట్లో అప్పటికే నాన్నాగారి కలెక్షన్ లో ఉన్న టాం సాయర్, హకల్ బెరిఫిన్ పుస్తకాలు అట్టలూడి ముందు, వెనక కొన్ని కాయితాల్లేకుండా, నల్లటి దారంతో కుట్టబడి, ముక్కలైపోతూ ఉండేవి. కొత్తగా వచ్చిన పుస్తకాల్లో హకల్ బెరిఫిన్ రెండుండేవి. ఒకటి తక్కువ పేజీల పాత ఎడిషన్. రెండోది latest, unabridged. పెద్దది. సౌరకుటుంబం, అంతరిక్షం గురించి కొన్ని పుస్తకాలు చదివేను. లైట్ ఇయర్ – కాంతి సంవత్సరం concept అవి చదివాక తెలిసొచ్చింది.
అంతకు ముందే ఆవిడ రాసిన పుస్తకాలు, అభిమాన పురస్సరంగా – విశాలాక్షి అని ఆవిడ సంతకం చేసి నాన్నాగారికిచ్చిన పుస్తకాలన్నీ ఇంట్లో ఉండేవి. కొవ్వొత్తి ఆంధ్రప్రభలో సీరియల్ గా వచ్చింది. వారధి రెండు కుటుంబాల కధ గా సినిమా అయింది. అందులో సుశీల వేణుగాన లోలుని గన బాగా పాడేరంటూంటారు నాన్నగారు. ఆవిడ పుస్తకాలు రీప్రింట్ చెయ్యడానికి కాపీలు లేవంటే నేనే కొన్ని పంపిచాను.                       
ఒకసారి విశాలాక్షిగారు మాత్రమే మలేషియా నుంచి వచ్చేరు. తెల్లవారుఝామున ఎప్పుడో ఫ్లైట్ లేండ్ అవుతుంది. ఆవిడని రిసీవ్ చేసుకుని హోటల్ (ఉడ్ లేండ్స్) లో దింపే బాధ్యత నాకిచ్చేరు. 1986-87. జ్ఞాపకం లేదు. North-East monsoon vigorous గా ఉండే రోజులు. నవంబరయి ఉంటుంది. Cyclone form అయింది. సరిగ్గా ఆవిడ వచ్చేరోజు సాయంత్రం గాలి, కుంభవృష్టి. కోడంబాకం నుంచి చెరువుల్లా మారిన రోడ్ల మీద కష్టపడి ఈదుకుంటూ airport చేరేసరికి తెల్లారిపోతోంది. Electric trains రాత్రి పొద్దుపోయాక ఉండవు. ఉన్నా నడవ్వు. రోడ్లమీద బస్సులు, ఆటోలు నడిచే అవకాశంలేనే లేదు. ఈ వాతావరణంలో ఫ్లైట్ లు కేన్సల్ అవాల్సిందే, లేదా divert అవాల్సిందే, లేండయే ప్రసక్తే లేదు. కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ మలేషియానుంచి వచ్చింది కరెక్ట్ టైంకే, లేండయింది. వెళ్ళిపోయింది అన్నాడు airportలో. చందూర్ గారికి ఫోన్ చేస్తే వచ్చేసుంటారు హోటల్ కి వెళ్ళి చూడు అన్నారు. ఎలాగో మళ్ళీ కష్టపడి ఉడ్ లేండ్స్ చేరుకున్నాను. హోటల్ గదిలో క్షేమంగా ఉన్నారు ఆవిడ. But D.N. రావుగారు was not impressed when I tried to explain. Later he said if you were a good administrator (or planner?) you would have planned for rain. ఆయన చెప్పిన మరో సలహా – don’t carry chips on your shoulder.  మీ నాన్నగారి అభిప్రాయాలు, నమ్మకాలు మీ నాన్నగారివే – do not get carried away. 
మలేషియానుంచి తిరిగి వచ్చేసేక భీమిలిలో ఇల్లు కట్టుకున్న తరవాత రెండు మూడు సార్లు నేను వెళ్ళేను. పక్కనే సౌరీస్ గారి దర్శనం కూడా అయింది. అంతకుమునుపే చాలా ఏళ్ళ క్రితం తంబురా ఇవ్వడానికి తిరువణ్ణామలై వెళ్ళినప్పుడు చలంగారిని, ఆవిడని కూడా చూసాను. భీమిలిలో శ్రీనాధ్ మెమోరియల్ లైబ్రరీ ఉండేది ఓ పక్కన. ఒక సారి తగరపువలస దగ్గర సంతో ఏదో. సాయంత్రం భీమిలీ చేరేసరికి చీకటి పడిపోయింది. భోజనం అయ్యాక రాత్రి D.N. రావుగారే కార్ లో విశాఖపట్నం ఆసీల్ మెట్ట సిగ్నల్స్ దగ్గర డ్రాప్ చేసేరు. తోడుగా ఓ కుర్రాడు వచ్చేడు.
1998-99 అనుకుంటాను. ఆంధ్రా సోషియల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ – అస్కా, ఒరిజినల్ గా విజయరాఘవాచారీ రోడ్లో అక్కడే ఉండే ఆంధ్రా క్లబ్ –మద్రాసు లో రాజాలక్ష్మీ అవార్డు తీసుకుందికి విశాలాక్షి గారు వచ్చినప్పుడు నేను, సుధ వెళ్ళి కలిసేం. సన్మానం తరవాత మర్నాడు మళ్ళీ హోటల్ రూంలో కలిసినప్పుడు నా కధ నీ కొండకు నీవే రప్పించుకో చూపించేను. నీకు శైలి ఉందయ్యా అన్నారావిడ అది చదివి.


 2001 లాసన్స్ బే కాలనీ, విశాఖపట్నం  స్వర్ణముఖి అపార్ట్ మెంట్స్ లో విశాలాక్షిగారు, డి.ఎన్. రావుగారిని కలిసినప్పుడు తీసిన వీడియోనుంచి ఈ ఫోటో.

2013లో  శ్రీవెంపటి చినసత్యంగారి పేరుమీద అవార్డు ఇచ్చిన సందర్భంలో నాన్నగారు విశాఖపట్నం వెళ్లారు. విశాలాక్షిగారిని చూడడంకోసం కిర్లంపూడి లేఅవుట్లోని పామ్ అపార్ట్ మెంట్స్ కి వెళ్లారు. 

హుదూద్ తుఫాన్ భీభత్సం చూసాక ఆవిడతో ఒకసారి మాట్లడమని చెప్పేరు నాన్నగారు. సరేనన్నాను. ఫాల్కివాలా ఫౌండేషన్ లో వెన్నెల internship కోసం మద్రాసెళ్ళి, ఎనిమిదిని (నవంబర్) తిరిగి బయల్దేరే రోజు ఉదయం ఈనాడు లో వార్తచూసాక తెలిసింది నేను చెయ్యాల్సిన పని ఇక ఎప్పటికి చెయ్యలేనని.    

1 comment:

కథా మంజరి said...

మీ తల పోతలలో ప్రతి పదం కదిలించింది. చాలా బాగుంది. 1969 లో మా సంస్కృత కలాశాల గణపతి ఉత్సవాల సందర్భంగా జరిగిన సభకి ఆమె వచ్చేరు. రావు గారు ఎంచేతో రాలేక పోయేరు. అప్పటికే నేను పత్రిక, ప్రభలకి కథలు రాస్తూ ఉండడంతో నాతో యాలా ఆత్మీయంగా మాట్లాడేరు.భీమిలిలో ఒకటి రెండు పర్యాయాలు కలిసాను.