కలైమామణి - శ్రీ సంగీతరావుగారు, శ్రీ నేదునూరి కృష్ణమూర్తిగారి గురించి 1976లో రచించిన వ్యాసం ఇది. ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం అనుబంధంలో సంగీతరావుగారు ఎందరో సంగీతజ్ఞులను పరిచయం చేసారు. ఆ పరంపర లోనిదే ఈ వ్యాసం:
శ్రీ నేదునూరి కృష్ణమూర్తి
తెలుగు
దేశంలో సంప్రదాయ సంగీత విద్వాంసుడుగా ఉన్నత ప్రమాణాలని నెలకొల్పిన విద్వద్గాయకుడు
శ్రీ నేదునూరి కృష్ణమూర్తి. శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గానం ప్రముఖ దాక్షిణాత్య
సంగీత విద్వాంసుల మన్ననలను పొంది రసికలోకం సన్మానాన్ని పొందింది. దక్షిణ భారత దేశం
కర్ణాటక సంగీతానికి ఆది పీఠం. సంప్రాదాయ సంగీత పరీక్షకు నికషోఫలం.
సంగీత మూర్తిత్రయం శ్రీ
త్యాగరాజస్వామి, ముద్దుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి మొదలైన కర్ణాటక సంగీత
సంప్రదాయ యుగకర్తలకు జన్మభూమి అయిన దక్షిణ దేశం, సంగీత సాధకులకు మార్గదర్శకమై ఉంది.
సంగీత సాధనకు, సిధ్ధికి , రసజ్ఞతకు నిలయమైన దక్షిణ దేశంలో ప్రథముశ్రేణి
విద్వాంసుడు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి పొందిన సన్మానం, గాయకుడుగా అతడు సాధించిన
నిరపేక్షణీయమైన ఘనవిజయం.
తరతరాలుగా
సంగీత సాధన జరుగుతున్నా, తెలుగు దేశంలో దక్షణాది బాణీ సాధించడం ఒక ఆదర్శంగానే
ఉంది. ప్రముఖ వాగ్గేయకారుల రచనలు తెలుగు భాష ఆధారంగానే జరిగినా, ఆ సంగీతానికి
మాత్రం హక్కుదారులు దక్షిణాత్యులుగానే భావించడం జరిగింది. తెలుగు దేశంలో సంగీత సభలు నిర్వహిస్తూ,
స్వర్ణోత్సవాలు, వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వివిధ సంస్థల చరిత్రలు ఈ సత్యాన్ని
ఋజువు చేస్తాయి. ఈ తరంలో తెలుగు దేశంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి వంటి ప్రముఖ
విద్వాంసులు ఎందరో కర్ణాటక సంగీతంలో పాండిత్యంతోబాటు దాక్షిణాత్యపు బాణీకూడా
సాధించడంతో కర్ణాటక సంగీతంలో ఒక సమాన స్థాయి ఏర్పడడం గమనించగలం.
ఏ
కళారంగంలోనైనా ఏ విధమైన కొత్తదనాన్నైనా సాధించగలిగినవారు వెంటనే గుర్తింపబడడానికి
అవకాశాలు ఎక్కువ. సంప్రదాయ మార్గంలోనే సక్రమంగా అనుసరిస్తూన్న కళాకారులు తమ
విశిష్టతను నిరూపించుకోవాలంటే ఎంతో ప్రతిభ, దీక్ష అవసరం. సంప్రదాయ విరహితంగా వేరే
పంథాననుసరించిన వారు చాలా మంది ఉంటారు. అటువంటివారివలన కళకి అరుదుగా మంచి జరుగుతుంది. సంప్రదాయ మార్గంలో కనీసపు భద్రత ఉంది.
సంప్రదాయ
మార్గంలో ప్రథమశ్రేణి గాయకుడుగా ధృవపడి నిలిచినవారు శ్రీ కృష్ణమూర్తి. కర్ణాటక
సంగీతశైలిని నిర్దిష్టంగా, రసవత్తరంగా ప్రదర్శించగల ఆయన కంఠం లలిత గంభీరమైనది. వివిధ
గమకములు పరిపుష్ఠంగా, శ్రవణపేయంగా ఆయన కంఠంలో ఒదుగుతాయి. శ్రీ కృష్ణమూర్తి గానం
ఎంతో నిగ్రహం, ఔచిత్యమూ, ఆత్మవిశ్వాసమూ, సరసత కలిగి ఏ వైపరీత్యానికి తావు ఇవ్వదు. రాగాలాపనలోను,
స్వరకల్పనలోనూ స్వకీయమైన విశిష్టతను నిరూపించుకొన్నవారు శ్రీ కృష్ణమూర్తి.
అధ్యాపకుడుగా
శ్రీ కృష్ణమూర్తి వివిధ వాగ్గేయకారుల రచనలు గానం చేస్తున్నప్పుడు రసికులు తాదాత్మ్యం
పొందుతారు.శ్రీ కృష్ణమూర్తి ఉత్తమగాయకులు మాత్రమే కాదు. ఉత్తమ అధ్యాపకులు కూడా.
వారి పర్యవేక్షణలో, శిక్షణలో ఎందరో వర్ధమాన గాయకులు సంగీత సభలలో పాల్గొని తమ
గురుసంప్రదాయానికి వన్నె తెస్తున్నారు.
తాళ్ళపాక రచనలు
శ్రీ
నేదునూరి కృష్ణమూర్తి నేడు ఆంధ్రప్రదాశ్ ప్రభుత్వ కళాశాలాధ్యక్షతను అతిదక్షతతో
నిర్వహిస్తూ సంకీర్తన రచనకు ఆద్యుడైన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలకు
స్వర రచన చేస్తున్నారు. శ్రీ కృష్ణమూర్తి స్వరపరచిన కీర్తనలు విద్వల్లోకంలో
ప్రచారం పొంది ఉన్నాయి.
‘అలరులు
కురియగ ఆడెగదే’ అనే శంకరాభరణంలోని కీర్తన రసికలోకాన్ని ఎంతో
ఆకర్షించింది.
ప్రాచీన
గేయరచనలకు స్వరరచన చేయడం ఎంతో గురుతర బాధ్యతతో కూడిన కార్యం. ఈనాడు ఉపనిషత్తులు,
బ్రహ్మసూత్రాలు కూడా సంగీతమయంగా వినవచ్చే పరిస్థితి ఏర్పడింది. తప్పులేదు. ఏ
మాటయినా పాటగా పాడవచ్చును. సంగీత చేరడంలో వాటి విశిష్టతకు గాంభీర్యానికి దోహదంగా
ఉంటుందో లేదో గ్రిహించవలసి ఉంటుంది. భజగోవింద శ్లోకముల వంటి వైరాగ్య సూచకమైన
రచనలకు భాగేశ్వరి, జయజయవంతి, బేహాగ్ లాంటి రాగాలలో పాడితే రసనిష్పత్తిలో రాగ
తాళముల ప్రాముఖ్యాన్ని విస్మరించినట్టు అవుతుంది.
అష్టపదులు,
తరంగాలు, సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలు, రామదాసు, కీర్తనలు, మొదలైన అనేక గేయరచనలకు
అధికారికమైన స్వర పాఠం అంటూ లేదు. గాయకులు వారి అభిరుచికి, ప్రజ్ఞకు అర్హమైన
రీతిలో గానం చేయడం జరుగు ఉంది. ముఖ్యంగా ప్రాచీన రచనలకు సముచితమైన రాగ తాళములు
నిర్ణయించడం ఒక సమస్య. ప్రాచీనమైన సంకీర్తనలు, గేయములు సాహిత్య ప్రధానంగా ఉంటాయి. సాహిత్యభావానికి,
పదముల నడకకు అనుకూలంగా స్వరరచన సాగకపోతే కార్యసిధ్ధి సంతృప్రికరంగా జరగదు.
“లలిత
లవంగ లతా పరిశీలన కోమల మలయ సమీరే” అన్నది “లలి తాలా వంగాలా తాపారీ శీలనా” అని
పరిణమిస్తుంది.
వివిధ
రూపంగా ఉన్న సంకీర్తనలకు, గేయములకు వాటి ప్రత్యేక శైలిని నిరూపించడంలో
సంప్రదాయాన్ని ఎంతో అనుభవంతోనూ, విజ్ఞతతోనూ గ్రహించవలసి ఉంటుంది.
సంగీత
ప్రపంచంలో శ్రీ త్యాగరాజస్వామివారి ప్రభావంతో విద్వాంసుల ముఖత వినవచ్చిన ప్రతి
రచనా వాటి ప్రత్యేక శైలిని కోల్పోవడం గమనించగలం. రామదాసు కీర్తన, పురందరదాసు
కీర్తనా అన్నీ త్యాగరాజస్వామివారి కీర్తన నమూనాలోనే ఉంటాయి.
సహస్రాధికంగా
ఉన్న అన్నమాచార్యులవారి కీర్తనలు మాన్యులు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, శ్రీ
నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరచినవి ఒకటి రెండు తేడాగా మూడు పదులు మాత్రం పుస్తకరూపంగా
వచ్చాయి.
శ్రీ
అన్నమాచార్యుల వారి సంకీర్తనలకు రాగ తాళములు సూచింప బడ్డాయి. వాటిని అనుసరించడంలో
సాధకబాధకాలు ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడే అర్ధం అవుతాయి. కొన్ని సంకీర్తనలకు తాళం సూచింపబడలేదు.
సూచింపబడిన రాగాలు కొన్ని వాడుకలో లేవు.
స్వరరచయితగా
ఈ పరిస్థితిని సంపూర్ణంగా అవగాహన చేసుకుని అన్నమాచార్యులవారి సంకీర్తనల ప్రాచీన
శైలిని నిరూపిస్తూ సార్ధకంగా స్వరరచన చెయ్యగలగడం లక్ష్య లక్షణ పారంగతులూ,
ప్రతిభావంతులూ అయిన శ్రీ కృష్ణమూర్తిగారికే సాధ్యం.
సంకీర్తనాచార్యులు,
భక్త శిఖామణి అన్నమాచార్యులవారి సంకీర్తనలు గాయక చూడామణి శ్రీ నేదునూరి
కృష్ణమూర్తి గారి స్వరమాధుర్యంతో రాగహృదయులకు భక్తిని, రక్తిని కలిగించగలగడంలో
ఆశ్యర్యంలేదు.
No comments:
Post a Comment