సంగీతరావుగారు 1936 సం. ప్రాంతాలలో తాను చూసిన విజయనగరం గురించి వ్రాసిన వ్యాసం ఇది. వివిధ రంగాలలో ప్రసిద్ధిపొందిన మనకు తెలిసిన వ్యక్తులెందరో ఈ జ్ఞాపకాల తెరలలో మనను పలకరిస్తారు.
దాదాపు 80 సంవత్సరాల క్రిందటి విజయనగరం ఊరు - సంగీతరావుగారి జ్ఞాపకాలలో......
1936 డిసెబర్ లో మా నాన్నగారు విజయనగరం సంగీత
కళాశాలలో గాత్ర పండితులుగా ప్రవేశించారు. అప్పటి నా వయసు పదిహేను-పదహారేళ్ళు. నాటి
విజయనగరం మహారాజు శ్రీమద్ అలక్ నారాయణ గజపతి మహారాజుగారు. అంటే తెలుగు దేశం
ప్రభుత్వంలో రెవిన్యూ మంత్రిగా ఉండిన అశోక్ గజపతి తాతగారన్నమాట. సుప్రసిధ్ధ
సోషలిస్ట్ నాయకుడు పి.వి.జి. రాజు గారి తండ్రి ఆయన.
విజయనగరం ప్రభువుల యడల ప్రజలకు అమితమైన
భక్తిప్రపత్తులుండేవి ఆరోజుల్లో. 1936లో మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన
ఎన్నికల్లో విజయనగరం నియోజక వర్గంనుంచి ఇండిపెండెంట్A గా అద్వితీయమైన మెజారిటీతో గెలుపొందేరు అలక్
నారాయణ గజపతి. ఆనాటికి విజయనగరం సాంస్కృతికంగా ఆంధ్రదేశంలో ప్రముఖంగా ఉండేది.
విజయనగరం కాలేజీ పురాతనమైనది. సంస్కృత కళాశాల, సంగీత కళాశాలలు విజయనగరంలో మాత్రమే ఉండేవి.
సుప్రసిధ్ధ నేపధ్య గాయకుడు ఘంటసాల విద్యార్ధిగా
గడిపిన రోజులవి.
విజయనగరానికి సంబంధించిన నా జ్ఞాపకాలు అంటే
60-70 (ఇప్పుడు 80) సంవత్సారాల కిందటి జీవితం నెమరు వేసుకోవాలి. ఆ జ్ఞాపకాలు
యదార్ధానికి ఇటు అటుగా ఉండే అవకాశం ఉంది.
ఆంధ్రుల సంప్రదాయానికి, సంస్కృతికి,
ప్రాభవానికి ఆనాటికి కూడా విజయనగరం ప్రతీకగా ఉండేది. నవయుగ వైతాళికుడు గురజాడ
అప్పారావు తెరమరుగై అప్పటికి చాలా కాలం అయింది. ఆటపాటల మేటి అజ్జాడ ఆదిభట్ల
నారాయణదాసుగారు, మహామహోపాధ్యాయ తాతా సుబ్బరాయశాస్త్రిగారు, గాంధర్వవిద్యాభూషణ ద్వారం వెంకటస్వామి
నాయుడుగారు, వీణా వెంకటరమణయ్యదాసుగారు, మల్లాది విశ్వనాధకవిరాజు, కవిశేఖర భోగరాజు
నారాయణమూర్తి మొదలైన మహనీయులు ఆనాటికి ఇంకా ఉండనే ఉన్నారు.
కళలకి, వేదశాస్త్రములకు, సంస్కృతికి విజయనగరం
కేంద్రంగా భావించబడేది ఆరోజుల్లో. ఆంధ్ర దేశానికంతటికీ సంగీత పాఠశాల విజయనగరంలోనే
ఉండేది. మొదటి సైన్సు కాలేజీ, సంస్కృత కాలేజీ విజయనగరంలోనే స్థాపించబడ్డాయి.
ఎంతోమంది సుప్రసిధ్ధులు విజయనగరంలోనే ఉండేవారు. ఈనాడు సుప్రసిధ్ధులైన సంగీత, సాహీతీవేత్తలు చాలామంది
విజయనగరం కళాశాలలకి చెందినవారే. ఆదిభట్ల నారాయణదాసుగారు సంగీత కళాశాల మొదటి
ప్రిన్సిపాల్. ఆయన రిటైరయ్యాక ద్వారం వెంకటస్వామినాయుడు ప్రిన్సిపాల్ అయ్యారు.
వాసా వెంకట్రావుగారు వీణ అధ్యాపకులుగాను, పట్రాయని సీతారామశాస్త్రిగారు,
పేరిబాబుగారు, నేమాని వరహాలుదాసుగారు గాత్ర పండితులుగాను, మునిస్వామి అనే ఆయన
నాదస్వర పండితులుగాను, శ్రీపాద సన్యాసిరావుగారు మృందగ పండితులుగానూ ఉండేవారు.
సంగీత కళాశాల విజయనగరం మహారాజావారు స్థాపించక
పూర్వమే కట్టు సూరన్నగారు ఒక సంగీత పాఠశాల సానివీధిలో నడిపించేవారట. ఈ సంగీత
పాఠశాల గురించి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి కథలుగాథలులో చదివిన జ్ఞాపకం.
మహామహోపాధ్యాయ తాతాసుబ్బరాయశాస్త్రిగారు, పేరి
లక్ష్మీనారాయణశాస్త్రిగారు, వఝ్ఝల చినసీతారామశాస్త్రిగారు మొదలైన ఉద్దండ పండితులు
చాలామంది సంస్కృత కళాశాలాధ్యాపకులుగా ఉండేవారు. కవిశేఖర భోగరాజు నారాయణమూర్తిగారు,
విశ్వనాధకవిరాజుగారు, కాలేజీ తెలుగుశాఖలో ఉండేవారు. ఎంతోమంది కథకులు, రచయితలు,
హరికథకులు మొదలైన కళాకారులతో విజయనగరం హుందాగా ఉండేది. ఆనాటికి అనారోగ్యంగా ఉన్నా
విశ్వవిఖ్యాత పహిల్వాన్ కలియుగ భీముడు కోడి రామ్మూర్తినాయుడుగారు కూడా ఉన్నటే
జ్ఞాపకం.
నారయణదాసుగారు అధ్యక్షులుగా ఉన్న రోజులలో
హరికథా కాలేక్షపం విద్యార్ధులే ఎక్కువగా ఉండేవారు. నాయుడుగారు ప్రిన్సిపాల్ అయిన
తరువాత సంగీత కళాశాలలో సంప్రాదయ సంగీతాధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఆనాడు
ఆంధ్ర సంగీత పాండిత్యానికి దక్షిణదేశం అంతటికీ ఉత్తమ ప్రతినిధి నాయుడుగారే. ఆంధ్ర
దేశానికంతటికీ ఆనాడు సంగీత కళాశాల విజయనగరంలో మాత్రమే ఉన్నా, విజయవాడలో
గాయకసార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు పది కళాశాలలు కూడా చేయలేనంతటి
సంగీత విద్యాప్రదానం చేస్తుండేవారు ఆరోజుల్లో.
ఇక ఆరోజుల్లో విద్యార్ధుల పరిస్థితి దయనీయంగా
ఉండేది. ఎవరికీ హోటలులో భోజనం చేసి విద్యాభ్యాసం చేయగలిగే స్తోమత ఉండేది కాదు. చాలామంది
వారాలు చేసుకొనో, మధుకరం చేసుకొనో విద్యాసముపార్జనచేస్తూ, ఉన్నత విద్యాసాధన
చేసేవారు.
విద్యార్ధులోల కొంతమందికి సింహాచలం బోర్డింగ్
హౌస్ లో ఉచిత భోజనవసతి కల్పించేరు సంస్థానంవారు. ఇంగ్లీషు, సంస్కృత, సంగీత కళాశాల
విద్యార్ధులకు మాత్రం 20 మంది లోపుగానే ఈ సదుపాయం ఉండేది. ఆ రోజుల్లో సంస్కృత,
సంగీత కళాశాల విద్యార్ధులు వారాలు, మధూకరం చేసుకుంటూ విద్యాభ్యాసం చెయ్యడం
సహజంగానే భావించేవారు. ఆయా విద్యార్ధుల యెడల గృహస్థులు ప్రేమగానే ఉండేవారు.
సంప్రాదయులు కూడా విద్యార్ధులు మధూకరవృత్తినవలంబిచడమే మహోత్కృష్టకార్యంగా
భావించేవారు.
సంగీత విద్యార్ధులు తమ విద్యాసాధనని
సార్ధకపఱచుకొందికి విజయనగరంలో అనేక భజన గోష్టులు దోహదం చేసేవి. వ్యాసుల
రాజారావుగారి మేడలోనూ, వంకాయల వారింటిలోనూ, శంభరదాసుగారి కుటీరంలోనూ ప్రతీవారం ఏదో
రోజున భజన కాలక్షేపం ఉండేది. అంతేకాదు ఏకాహాలు, సప్తాహాలు ఎప్పుడూ ఎక్కడో ఒకచోట
సంవత్సరం పొడుగునా జరుగుతూ ఉండేవి. ఈ భజన కాలక్షేపాలలో విద్వాంసులు, విద్యార్ధులు
అందరూ పాల్గొనేవారు. ఈ భజనగోష్టులలో సాధకులకి మంచి ప్రోత్సాహం, పాడడానికి చొరవ
ఏర్పడేవి. ఒక్కొక్క సందర్భంలో ఏదో ఒక కీర్తన తీసుకొని బృందగానం చేసేవారు.
స్వరకల్పనలో అందరూ పాల్గొంటూ ఉండేవారు స్పర్ధతో.
సాలూరు చిన గురువుగారుగా ప్రసిధ్ధులు పట్రాయని
సీతారామశాస్త్రిగారింట్లో నిత్యమూ సంగీత, సాహిత్య సమ్మేళనం జరుగుతూ ఉండేది.
గురువుగారి మిత్రులు, సాహితీవేత్తలు తమ రచనలు వినిపించేవారు. పండితులు, కవులు,
కథకులు, నవలా రచయితలు అందరూ అనేక విధాలైన చర్చలు చేస్తుండేవారు. సంగీత, సాహిత్యాల
పరస్పర సంబంధ విషమై ఆరోజుల్లో సీతారామశాస్త్రిగారి సంగీత శిష్యుడు పంతుల
లక్ష్మీనారాయణశాస్త్రిగారి ‘లక్ష్య లక్షణ సమన్వయం’ అన్న వ్యాసం ‘వేదిక్ రిసర్చ్’ పత్రికలో ప్రచురించేరు. అది గురువుగారి ఆదర్శాలని ప్రతిబింబించేదిగా
భావించబడింది. గురువుగారింట్లో సమావేశమైన మిత్రబృందమే తరువాత ‘కౌముదీ పరిషత్తు’ గా పరిణమించింది. ఈ
పరిషత్తు సభ్యులు చాలామంది సుప్రసిధ్ధ రచయితలుగా, సంగీతజ్ఞులుగా లోకానికి
పరిచయమయ్యేరు.
యువ కళాకారులని, కవులనీ, రచయితలనీ
ప్రోత్సాహించిన మరో పెద్ద సంస్థ ‘ఆంధ్ర భారతీ తీర్ధ’ అదే ‘ఆంధ్రా రిసెర్చ్ యూనివర్సిటీ’. ఈ సంస్థకి బుర్రా శేషగిరిరావు పంతులుగారు అధిపతి. యువ రచయితలు, కవులు,
కథకులు, తమ రచనలని ఈ సంస్థ సభలలో వినిపించేవారు. యువ గాయకులు, వాద్యకులు తమ
గానాన్ని ప్రదర్శించేవారు. అర్హులకి బిరుదు ప్రదానాలని కూడా ఈ సంస్థ నిర్వహించేది.
కీ.శే. పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారికి ‘గాయక సార్వభౌమ’ బిరుదు, గిడుగు సీతాపతిగారికి గౌరవ డాక్టరేటు, స్థానం నరసింహారావుగారికి ‘నటశేఖర’ ఈ సంస్థ ఇచ్చినవే.
చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ ఆంధ్ర దేశం
అంతటా సుప్రసిధ్ధులుగా ఉండేవారు. నటుడిగా, హరికథకుడిగా నాటి యువతరానికి మార్గదర్శి
ఆయన. మారుతీ భక్త మండలి అనే కళాసంస్థని నిర్వహించేవారు.
మహారాజావారి నాటక సమాజానికి చెందిన పాతతరం
నటులు రామయణం సర్వేశ్వరశాస్త్రిగారిని నా చిన్నతనంలో చూసేవాణ్ణి. ఆయన సంస్కృత
కళాశాల లైబ్రేరియన్ అని జ్ఞాపకం.
ఆరోజుల్లో సరిదె లక్ష్మినరసమ్మ (కళావర్ రింగు)
సుప్రసిధ్ధ నర్తకి, గాయనీమణి కూడా.
1940 ప్రాంతాల్లో శ్రీశ్రీ తఱచు విజయనగరంలో
కనిపించేవారు. అంతేకాదు, ఆరుద్ర విజయనగరం కాలేజీలో చదువుకోడం జ్ఞాపకం ఉంది.
మరో సుప్రసిధ్ధ వ్యక్తి దొడ్డమ్మ – జయంతి
సీతారామభాగవతార్. ఘంటస్తంభం దగ్గర పార్క్ లోని వెల్నాట్ల లైబ్రరీకి లైబ్రేరియన్
ఆయన. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి వేషానికి దొడ్డమ్మది గొప్పపేరు. ఆయన గోదావరి
పుష్కరాల పాట గ్రామఫోన్ రికార్డ్ ఆంధ్రదేశం అంతటా వినిపించేది.
సుప్రసిధ్ధ సాహితీపరుడు ఆచార్య రోణంకి
అప్పలస్వామిగారు కొంతకాలం బ్రాంచి కాలేజీలో పనిచేయడం కూడా జ్ఞాపకం ఉంది. చాగంటి
సోమయాజులుగారిని తఱచు ఆలేవారి వీధిలో ఉన్న ఆకుండి సత్యనారాయణగారింట్లో చూసేవాణ్ణి.
ఆయన గొప్ప కథకుడిగా ఆనాటికే గుర్తింపు ఉండేది కథా రచయితల్లో. ఆయనని మా
సత్యనారాయణగారు నరహరిరావు అని పిలిచేవారు. ఆకుండి సత్యనారాయణగారూ రచయితే. ఆయన కథలు
ఆనాటి ఆంధ్రభూమి (ఆండ్ర శేషగిరిగారి పత్రిక)లో ప్రచురింపబడుతూండేవి.
వ్యాసనారాయణ మెట్ట అందరికీ తెలిసిన ప్రదేశమే
ఆరోజుల్లో. నల్లచెఱువు మెట్టలు, బాబా మెట్టలు అనేవారు కూడా. నా చిన్నతనంలో ఒక
వైష్ణవస్వామి మెట్టమీద ఉన్నదేవాలయాన్ని పునరుధ్ధరించేరు. అలాగే వ్యాసనారాయణ
మెట్టలో ఖాదరు అవులియా బాబావారి ఆశ్రమం ఉండేది. అక్కడ రోజూ సాయంత్రం బాబాగారి
దర్బారులో నాట్య, సంగీత కార్యక్రమాలు ఉండేవి. బాబాగారి దర్శనానికి వెళ్ళేవారు
బీడీకట్ట సమర్పించేవారు. నాగపూర్ తాజుద్దీన్ బాబాగారి శిష్యుడనేవారు అవులియా
బాబాగారిని.
నిజానికి విజయనగరం ముచ్చట్లు ఎంతో వివరంగా
చెప్పుకోవలసిఉంది. సాంస్కృతికంగా వివిధ శాఖలలో ఎంతో ఘన చరిత్రగలిగిన విజయనగరం మా
ఊరని చెప్పకోగలగడం అదృష్టంగా భావిస్తున్నాను.
++
4 comments:
బహుచక్కగా 1936 నాటి విజయనగరము విశేషాలను వివరించారు ధన్యవాదములు
60/70 సంవత్సరాల పూర్వపు విజయనగర సాంస్కృతిక స్ధితి తెలుసుకొనే అవకాశం కల్పించారు. బహు ధన్యవాదములు.
60/70 సంవత్సరాల పూర్వపు విజయనగర సాంస్కృతిక స్ధితి తెలుసుకొనే అవకాశం కల్పించారు. బహు ధన్యవాదములు.
మా తరం వాళ్లకు కూడా అర్థమయ్యేలా చెప్పారు
Post a Comment