నవంబరు 2, 2016 ఈరోజు సంగీతరావుగారి 97వ పుట్టినరోజు. ఈసందర్భంగా తన చిన్ననాటి ఊరు సాలూరు జ్ఞాపకాలను రసభరితంగా పంచుకున్న వ్యాసాన్ని తలచుకోవడం సముచితంగా ఉంటుంది. ఈ జ్ఞాపకాల పొరలలో ఆనాటి సాలూరుప్రజల సమాజజీవనంతోపాటు సాంస్కృతిక జీవితానికి సంబంధించిన అనేక విశేషాలు ఈ వ్యాసంలో నిక్షిప్తమై ఉన్నాయి. (వ్యాసంలో ప్రస్తావించిన చినగురువుగారు - పట్రాయనిసీతారామశాస్త్రిగారు, పెదగురువుగారు - పట్రాయని వెంకట నరసింహశాస్త్రిగారు).
రసాలూరు జ్ఞాపకాలు
పి. సంగీతరావు
పూజ్యులు మా
తండ్రిగారు సాలూరు చిన గురువుగారి స్వృత్యంజలి కార్యక్రమంలో మీ అందరితో పాల్గొనే
అవకాశం ఈ విధంగా రావడం నా ఈ వయస్సులో పరమేశ్వరుడు ప్రసాదించిన వరంగా
భావిస్తున్నాను.
మూడు తరాల సాలురు ప్రజల ప్రేమను, గౌరవాన్ని
పొందడం కళాకారునిగా ఆయన జీవన సార్ధకతకు నిదర్శనం. ఆయన బాల్యావస్తని సాలూరులోనే
గడిపినా, కొంతకాలం విరామంతో తిరిగి 1928 నుంచి 1935 వరకూ సాలూరులోనే గడిపేరు.
ఆనాటికీ, ఈనాటికీ
సాలూరు పట్టణంలో మార్పలు, చేర్పులూ ఉండకపోవు. ఆనాడు సాలూరు యూనియన్ బోర్డ్ అయితే
ఈనాడు మున్సిపాలిటీ. ఏమయినా అటు జగన్నాథస్వామి ఆలయం, ఇటు రూథరన్ చర్చి, మధ్య
ఆంజనేయస్వామి కోవెల ఎన్ని మార్పులు వచ్చినా సాలూరు స్వరూపాన్ని నిలబెట్టేయి.
ఆరోజుల్లో సాలూరు
జీవితం మూడు భాగాలుగా కనిపించేది. 1. మోటారు కులం. 2. వ్యాపార సంఘం. 3. పురోహిత
వర్గం. ఊరు కొంత దీనంగా కనిపించినా ప్రజలలో చాలా చైతన్యం, కష్టపడి పనిచేసే లక్షణం,
వాక్స్వాతంత్ర్యం ఉండేవి. చుట్టుపక్కల గ్రామలలోని జమీందారీ ఒత్తిడి వంటిది ఏ
విధంగానూ సాలూరులో ఉండేది కాదు.
అవి స్వాతంత్ర్య
పోరాటపు రోజులు. మహాత్మా గాంధీ ప్రభావం దేశం అంతా నిండింది. నీతి, నిజాయితీ, నిరాడంబరత
ప్రజలలో ఆదర్శాలుగా ఉండేవి. రామక్రిష్ణ పరమహంస, స్వామి వివేకానందల ప్రేమ సందేశంతో
దీనజనసేవ ఆరాధనీయమయింది. అనేక గ్రామాలలో ఏర్పడిన ప్రేమ సమాజాలలాంటిదే సాలూరులో
ఏర్పడిన అనాధ సేవా సంఘం. ఆనాటి వరకూ విచ్చల విడిగా తిరిగిన బాదంపూడి సూర్యనారాయణ
ఒక్కమారు గుండు చేయించుకొని అన్నపూర్ణ కావిడి పట్టాడు – దీనజన సేవకోసం.
అదిగో ఆరోజుల్లో
వెలసింది సంగీత పాఠశాల – సాలూరు ప్రజల హృదయస్పందనతో. పర్ణశాలనిపించే పురిపాక,
చుట్టూ ప్రహారీలా వెదురు మణిగింపు. పర్ణసాల నాలుగు పక్కలా పువ్వుల మొక్కలతో
ఋష్యాశ్రమంలా ఉండేది. సంగీత విద్యార్ధులలో లింగబేధంకాని, వయోబేధంగాని,
జాతిబేధంగాని లేదు. విద్యార్ధులు అనేక వృత్తులవారు ఉండేవారు. చాకలి పారయ్య అనే
విద్యార్ధి ఉండేవాడు. తారాపురం నుంచి గుడ్డి నాయుడు (దుంప లచ్చున్నాయుడు) రైతు
కుటుంబానికి చెందినవాడు. రంగారావు పంతులుగారు అతనికి బస్సు పాసు యిచ్చేరు. వారి
బస్సులో రాగపోకలకి. సంగీత పాఠాలకి వేళాపాళా అంటూ లేదు. ఎప్పుడైనా రావచ్చును.
విద్యార్ధులలో చాలామంది సారూరు వారైనా పై గ్రామల నుంచి వచ్చిన విద్యార్ధులు కూడా
చాలా మంది ఉండేవారు. అందరూ నిరధనులే. సంగీత విద్యార్ధులంటే ఊళ్ళో అందరికీ ఎంతో
ప్రేమ. వాళ్ళ పోషణ బాధ్యతంతా ఏదో విధంగా పౌరులే భరించేవారు.
గురువుగారు సంగీత
మాస్టరుగా కనిపించేవారు కాదు. ఏదో దివ్యత్వం కనిపించేది. గురువుగారి కుటుంబ పోషణ
ఎలా జరిగేదో తెలియదు. ఎవరికీ ఆ విషయం పట్టేది కాదు. సాలూరులో ఆయనకి చిన్న ఇల్లు
తప్ప మరే ఆధారంలేదు. గోదావరి, కృష్ణా జిల్లాలలో చాలామంది ఆయన అభిమానులుండేవారు.
శ్రీరామ నవమి ఉత్సవ కార్యక్రమాలకు, వివాహాది శుభకార్యాలకు ఆయన కచేరీలు ఏర్పాటయేవి.
ఆ విధమైన రాబడే ఆయన జీవకకు ఆధారం. ఈ పరిస్థితిలో అనేక మంది ఇతర స్థలాల నుంచి
సాలూరు వచ్చే కళాకారులను ఆదరించవలసిన నైతిక బాధ్యత ఆయన తీసుకునేవారు. జయపురం మహారాజు
విక్రమదేవ వర్మగారు జయపురంలో జరిపే దసరా ఉత్సవాలకు చాలామంది కళాకారులు, కవులు,
పండితులు వెళ్ళేవారు. వారందరికీ సాలూరు ఒక మకాం క్రింద ఉండేది. వారందరినీ సాలూరు
పౌరుల సహాయంతోనూ, సాలూరు రాజుగారి ఔదార్యంతోనూ గురువుగారు సంతోషపరిచి పంపించేవారు.
సాలూరు వచ్చే హరిదాసులు చాలామందికి కార్యక్రమాలు ఏర్పాటు చేయడమేకాదు, వాళ్ళకు
పక్కవాద్యం హార్మోనియం వాయించేవారు. శ్రీ బోనుమద్ది రాములు మృదంగం వాయించేవారు.
తర్వాత శ్రీ ఉరిమి జగన్నాధం మంచి తబలా వాద్య నిపుణుడు. ఆయన ఏదో నాటక సమాజంతో వచ్చి
సాలూరులో స్థిరపడ్డారు. ఆయనే పరమేశ్వరీ పిక్చర్ పేలస్ లో నాటకాల కోసం అనేక
కర్టెన్లు రాసేరు. సాలూరు నుంచి వెళ్ళిపోయన తర్వాత ఆయన జెమిని స్టూడియోలో తబలా
వాద్యునిగా స్థిరపడ్డారు మద్రాసులో. శ్రీ రామలింగం, ప్రసాదు ఆయన కుమారులే.
సుప్రశిధ్ధ తబలా వాద్యకులు. ప్రసాదు మాత్రం ప్రస్తుతం ఉన్నాడు. ఘంటసాలగారి అమెరికా
పర్యటనలో ప్రసాదు కూడా మెంబరు.
శ్రీ జగన్నాధం
ఆరోజుల్లో మా నాన్నగారితో అనేక కచేరీలకి వెళ్ళేవారు. ఆరోజల్లోనే శ్రీ కావ్యకంఠ
గణపతిశాస్త్రిగారు సాలూరు వేదసమాజంలో ఉపన్యసించేవారు. శతావాదానం అప్పట్లోనే
చూసాను. శ్రీ గోరుగంతు సూర్యనారాయణ శర్మ అని జ్ఞాపకం ఆ శతావధాని. వేదసమాజంలోనే
జరిగింది ఆ కార్యక్రమం. శ్రీ కాశీభట్ట కృష్ణరాయ శాస్త్రిగారు సమస్య యిచ్చేరు. “గుంటన్ గాంచిన కవత కుదుటన్ బడుబో...” శతావధానిగారు “బాగుంటన్ గాంచిన...” అని పూర్తిచేసారు. ఆ
శతావధానంలోని పద్యాలు కొన్ని ఇంకా జ్ఞాపకం ఉన్నాయి.
పర్ణశాలగా ఉన్న
సంగీత పాఠశాల శ్రీ రంగారావు పంతులుగారి సంకల్పంతో భవన నిర్మాణ దశలో పడింది. ఆయన
సంకల్ప పూర్ణరూపం దాల్చలేదు. పునాదులతో ఆగిపోయింది. ఈ పరిస్థితిలో గురవుగారు వైద్య
చికిత్స నిమిత్తం ఒక సంవత్సరం విశాఖపట్నం వెళ్ళవలసివచ్చింది.
ఆరోజుల్లోనే
గురువుగారి గ్రామఫోన్ రికార్డులు వచ్చాయి. 1933 కావచ్చును. విశాఖపట్నం నుంచి
వచ్చిన తర్వాత పాఠశాల నిర్మాణానికి స్వయంగా పూనుకున్నారు. అప్పుడు సబ్
రిజిస్ట్రారు – టి.ఎల్.ఎన్. రాజుగారు. సబ్ మేజిస్ట్రేట్ – ఆయనా రాజుగరే. ఆయన పేరు
భూపతిరాజు నరసింహరాజుగారని జ్ఞాపకం. వారి సహకారంతో తాలూకాలోని వివిధ గ్రామాలలో
పాఠశాల నిమిత్తం కచేరీలు చేసి, ప్రజలు ఇచ్చే అతి చిన్న మొత్తాలతో పాఠశాల నిర్మాణం
పూర్తిచేయడం జరిగింది. పాఠశాల గోడలు అయి, పైకప్పు వేసిన దగ్గరనుంచి సంగీత పాఠాలు
నడుస్తూనే ఉండేవి. అలాగే ప్లాస్టరింగ్, తలుపు, గచ్చులూ పాఠశాల నడుస్తూనే
పూర్తయేయి. రోజూ సాయంకాలం దీపారాధన అయిన వెంటనే ప్రార్ధన జరిగేది. ఆ ప్రార్ధన
సమావేశానికి చాలామంది వచ్చేవారు. గురువుగారు హార్మోనియం వాయిస్తూ చెప్తూ ఉంటే
అందరూ పాడేవారు. ఆ పాట కేదారగౌళ రాగం, ఆదితాళం. “శ్రీ శారదా గానశాలోధ్ధరణ గుణశాలీ మమున్ దయగనుమా”. పాఠశాల నిర్మాణం చివరకు గురువుగారు విజయనగరం మహారాజా మ్యూజిక్ కాలేజీ వోకల్ ప్రొఫెసర్ గా విజయనగరం
వెళ్ళే సందర్భంలో వీడ్కోలు సభా కార్యక్రమానికి వినియోగపడింది.
ఆనాటి వీడ్కోలు సభ
అతి కరుణరసభరితమయింది. సాలూరులో ఏ మాత్రపు ఆసరా ఉన్నా గురువుగారు ప్రాణప్రదంగా
నిర్మంచుకున్న పాఠశాలను వదిలి వెళ్ళేవారుకాదు. ఉద్యోగధర్మం ఆయన ప్రవృత్తికి
విరుధ్ధం. కళాకారునిగా ఆయన స్వేఛ్ఛ, సంప్రదాయపు పంజరంలో బంధింపబడింది.
విజయనగరం సంగీత
కళాశాల వోకల్ ప్రొఫెసర్ గా ఆయన ఆచార్యత్వంలో అనేక మంది సుప్రసిధ్ధ గాయకులుగా,
ప్రభుత్వ కళాశాలాధ్యాపకులుగా, సినిమా కళాకారులుగా రూపొందడం నిజమేకానీ,
రసవద్గాయకునిగా వాగ్గేయకారునిగా అనిర్వచనీయమైన వ్యక్తిత్వంతో ప్రభాసించినది సాలూరు
చిన గురువుగానే. ఆయన సాలూరులోనే ఉండి ఉంటే సంగీత కచేరీ విధానం ఎంతో రసస్ఫూర్తిగా
రూపొంది ఉండేది. ఎన్నో విశిష్టమైన ఆయన సంగీత రచనలతో కర్ణాటక శాస్త్రీయ సంగీతం
సుసంపన్నం అయి ఉండేది. గురువుగారి సంగీత రచనలు గురువుగారి స్మారక సంచికలో
అచ్చయ్యేయి. (తదనంతర కాలంలో – 2010 లో – శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అధ్యక్షతన
మద్రాసు మ్యూజిక్ అకాడెమీ (మిని)లో జరిగిన ఆయన 110 జయంత్యుత్సవంలో ప్రియ
సిస్టర్స్, మనుమరాలు జ్యోతిర్మయి లు ఆయన సంగీత రచనలతో కచేరీ చేసారు. మునిమనుమరాలు
కాకరపర్తి సత్యసంగీత ఆయన విశిష్టమైన, విలక్షణమైన జావళిని కూచిపూడి సంప్రాదాయంలో
ప్రదర్శించింది).
అనేక స్కాలిత్యాలతో తిరిగి అవి పునర్ముద్రణ పొందవలసి ఉంది.
(నాన్నగారు సూచించిన మార్పులు చేర్పులతో తాతగారి కృతులు, పద్యాలు చిన్నపుస్తక
రూపంలో ప్రచురించబడి శ్రీ బాలమురళీకృష్ణగారిచే ఆరోజు ఆవిష్కరించబడ్డాయి). నిజానికి
ఈ స్మృత్యంజలి సభ గురువుగారికి మాత్రమే పరిమితమయినది కాదు. ఆయనను ప్రేమించి
గౌరవించిన సాలూరు పౌరులది, అభిమానులది, ఆయన అంతేవాసులది.
అదిగో పెదబళియార్
సింహులు బహద్దరు సాలూరు రాజాగారు. గురువుగారంటే ఎనలేని ప్రేమ, గౌరవాలు.
మహారాజులకుండదగిన దాతృత్వమూ రసజ్ఞతా ఉండేది వారియందు. అయితే దాతృత్వానికి తగిన ధనం
ఉండేది కాదు వారిదగ్గర. గొప్ప రసజ్ఞత, రసజ్ఞతకి తగని సంస్కార లోపం తెలిసేది.
అప్పుడప్పుడు గురువుగారిని కోటకి పిలిచేవారు. కోటలో మంచి హార్మోనియం, వయొలిన్,
తబలా, మృదంగం అన్నీ ఉండేవి. టిక్కిబాబుగారు మృదంగం వాయించేవారు. ఆయన మీసాలతో
భీకరంగా ఉండేవారు. ఆయనే మృదంగ చక్రవర్తి అని ప్రభువుగారి అభిప్రాయం. ఇక సభాసదులు
పదిమంది లోపు. జవాన్ గురువుగారు మహాప్రభువుకి పార్సీ, ఉర్దూ చెప్పేవారనుకుంటాను.
ఆయనే విదూషకుడుకూడా. సభ మధ్యలో ప్రభువువారు రబ్బరు పామును జవాన్ గురువుగారి మీద
విసిరేవారు. జవాన్ గురువుగారు భయసంభ్రమాలు నటించేవారు. ప్రభువువారికి బ్రహ్మానందం
కలిగేది. అప్పటికే ఆయన వృధ్ధుడు. తెల్లగడ్డానికి ఎర్రరంగు వేసేవారు. కూర్మయ్య
అనుకుంటాను అతని పేరు – రాజావారి పి.ఏ అతను. పాట తరవాత కొంత లోకాభిరామాయణం. సెలవు
పుచ్చుకునే ముందు ప్రభువు జేబులో ఏముంటే అది గురువుగారి చేతిలో పెట్టేవారు. అది
ఐదురూపాయలకి ఎక్కువగాని, ఒక రూపాయికి తక్గువగాని ఉండేది కాదు. అయితే ప్రభువువారి
ప్రేమకు గురువుగారి కళ్ళలో నీళ్ళు తిరిగేవి. ప్రభువుగారు కొంత భూమికూడా యిచ్చేరు.
అయితే గురువుగారికిచ్చిన భూమి సన్నిహితులు మార్చి రామభద్రపురంలో ఉన్న మంచి భూమికి
బదులు ఊటగెడ్డ ఏజెన్సీలో ఉన్న భూమి గురువుగారికి అంటగట్టేరు.
చందూరు రంగారావు
పంతులు గారు – ఆయన సాలూరు వ్యక్తికాదు. నెల్లూరు అనుకుంటాను ఆయన స్వస్థలం. బస్సుల
రంగారావు అనేవారు. ఆనాడు సాలూరు పురప్రముఖలలో ప్రముఖుడు. సంగీత పాఠశాల నిర్మాణంలో
ఆయన భాగం ఉంది. సరీ, ఎందరో పురప్రముఖులు గురువుగారిని ఆదరించినవారు. అందరికీ
వందనాలే. గురువుగారిని ఆరాధించిన సాలూరు శిష్యబృందంవారందరూ ఈ సభలో ఆనాటి
స్వరూపాలతో కన్నీటితెరల వెనుకనుంచి కనిపిస్తున్నారు. గురువుగారిని కూడా సాలూరులో
ఉన్నప్పటి స్వరూపంతోనే చూస్తున్నాను.
శ్రీ తంపెళ్ళ
సత్యనారాయణ మంచి విద్వాంసుడు. గ్రామఫోన్ రికార్డ్ ఇచ్చారు. ఆయన కుమారుడు తంపెళ్ళ
సూర్యనారాయణ హైదరాబాదు సంగీత కళాశాలలో వయొలిన్ ప్రొఫెసర్. (ఇటీవలే పోయారు).
(ఇటీవలే – మార్చ్ 2016 – ఆయన అన్నగారు మహదేవరావుగారు కూడా పోయేరు). శ్రీ
నారాయణదేవ్ గారు, పాపయ్య మాష్టరుగారు, మిత్రుడు మానం అప్పారావు ఇంకా అందరూ
కనిపిస్తున్నారు. అదిగో, దుంప నరసింహాలు చిన్నతనంలో నడవలేకపోతే ఎత్తుకుని తీసుకుని
వచ్చేవాడు. నాకు కసరత్తు గురువు. తరవాత్తర్వాత నరసింహారెడ్డి భాగవతార్. నేను
కలివరంలో ఉన్నప్పుడు అక్కడ కథాకాలక్షేపం జరిగింది కూడా. అందరివి పేర్లు జ్ఞాపకం
ఉన్నాయి. ఈనాడు వాళ్ళందరినీ పేరు పేరునా తల్చుకుంటున్నాను. ఈ సందర్భంలో గురువుగారు
సాలూరు వదిలి వెళ్ళిన తరవాత సంగీత పాఠశాలను నామరూపాలతో నిలబెట్టి, సంగీత వాతావరణం
కొనసాగించిన మిత్రుడు మానం అప్పారావుగారికి, మా తమ్ముడు ప్రభుకి, శ్రీ
త్రినాథరావుగారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పటికీ వదలని ఆశ చెప్పుకోవాలి.
అది, మళ్ళీ సంగీత పాఠశాల, సంగీత పాఠశాలగానే నిలుస్తుందని, సాలూరు సంగీత విద్యా
కేంద్రంగా ప్రకాశిస్తుందని. ఇది దురాశ అనుకోవడంలేదు. సాలూరు ప్రజలలో ఇంకా ఆ రసజ్ఞద
ఉందనే నమ్మిక మాత్రమే.
ఈ సమయంలో
నాచిన్ననాటి అనుభవాలు తలపుకి వస్తున్నాయి. ఒకటి రెండు చెప్పాలనే నా చాపల్యాన్ని
మన్నించండి. మా సాలూరు ఏరు తల్లి వేగావతి. నది అన్నంత పేరు భరించలేక వినయంగా
సిగ్గుతో ఒదిగి ఒదిగి ప్రవహించేది. సాలూరులో అందరూ ఏటికి వెళ్ళే నీళ్ళు
తెచ్చుకునేవారు. తుకిడీలు, తుకిడీలుగా పాఠశాల పక్కనుంచి నీటి కడవలతో వస్తున్న
స్త్రీ బృందం ఎంతో చూడముచ్చటగా ఉండేది. మళ్ళీ ఆ దృశ్యం కనబడదు ఈ రోజుల్లో. వేగావతీ
నది ఒడ్డున పెరిగిన సీతాఫలాలు ఆ రోజుల్లో ఆక్షేపణ లేకుండా తింటూ తిరిగేవాళ్ళం.
వేగావతి అలాగే ఉందో, యింకా చిక్కిపోయిందో. ఆ రోజుల్లో పేరసాగరం నిండితే
బలికోరుతుందని భయపడేవారు. ఒకమారు శివరాత్రికి పారమ్మ కొండ ఎక్కలేక భయంతో తిరిగి
రావడం జ్ఞాపకం ఉంది.
బంగారంపేట వెళ్ళే రోడ్డు పక్కన ఉండేది మా మిడిల్ స్కూలు.
బాబ్జీ, నేను, కాశీభట్ల లక్ష్మణమూర్తి, మండలేముల సాంబశివరావు కలిసి వెళ్ళేవాళ్ళం
స్కూలికి. హెడ్ మాస్టర్ చార్లెస్ పీకాక్, తెలుగు పండితులు కాశీభట్ల
క్రిష్ణరాయశాస్త్రిగారు, పుల్లె అప్పలనరసయ్య మనసులోంచి పోలేదు. మా యింటి దగ్గర
ఉన్న చర్చిలో షూల్జ్ దొరగారి తెలుగు ఉపన్యాసం మరపురాదు. ఆ మధ్య పదేళ్ళు దాటిందేమో,
ఢిల్లీలో ఒక యువకుడు నా పేరు విని పలకరించి తను, బాబ్జీ రెండోకొడుకునని చెప్పేడు.
ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తాట్ట.
మరో రెండు చిన్ననాటి
ముచ్చట్లు –
సాలూరు
జగన్నాథస్వామి రథయాత్ర మరపురాని అనుభవం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే కొత్త రథం
తయారుచేసేవారు. దక్షిణాది దేవాలయ రథాలలాగ శాశ్వత రథాలు కావు. రథయాత్ర అంటే
వారంరోజుల జాతర. యాత్ర జరిగినంతసేపూ తుంపర పడుతూనే ఉండడం మామూలు. రథయాత్రకి మా
యిల్లు కానుకగా వచ్చిన పంచదార చిలకలతో నిండిపోయేది. జగన్నాథస్వామికి భక్తులు
కక్కరాలు భోగం చేయిస్తారు. జగన్నాథస్వామి ప్రసాద మాధుర్యం, మహాత్యం ఆనాటి నుంచి
అనుభవమే.
No comments:
Post a Comment