visitors

Friday, April 3, 2020

శ్రీ సంగీతరావుగారి జ్ఞాపకాలలో శ్రీ ఎస్వీ భుజంగరాయశర్మగారు

                                     
                                   శ్రీ ఎస్వీ భుజంగరాయశర్మగారు       

                                                                                                                                                                                                                  -  పట్రాయని సంగీతరావు


తిరుమల తిరుపతి దేవస్థానం ఒక నృత్యనాటకం శ్రీనివాస కల్యాణం పేరుతో ప్రదర్శించాలని సంకల్పించింది. నృత్య నిర్వహణ వెంపటి చిన సత్యంగారికప్పగించింది. దీనికి సలహాదారు బి.ఎన్. రెడ్డిగారు, రచయిత ఎస్. వి. భుజంగరాయ శర్మగారు. సంగీత నిర్వహణ ద్వారం భావనారాయణగారు. ద్వారం భావనారాయణగారికి సహాయకుడిగా నన్నాహ్వానించేరు. ఆయన అంతకు పూర్వం శాకుంతల నృత్యనాటాకానికి సంగీత నిర్వహణ చేశారు.

శ్రీనివాస కల్యాణంలో రెండు సీన్లు పూర్తయ్యాయి. భృగుమహర్షి త్రిమూర్తుల యోగ్యతను పరీక్షించడం ప్రారంభమయింది. మహేశ్వరుణ్ణి పరీక్షించడానికి రావలసి ఉన్నది. పరమేశ్వర ప్రార్ధన శ్లోకం ప్రారంభమయింది. వాసంత ప్రసవీకృతైందవకళమ్ చూడాకలాపోన్నతమ్ – మాటలన్నీ లలితంగా, శ్రవణపేయంగా వినిపించేయి. కృతైందవకళమ్–  ఇందుశబ్దానికి తధ్ధిత రూపం ఐందవా’ ? అని అడిగాను. తధ్ధిత రూపమనే వ్యాకరణ పారిభాషిక పదంతో కూడిన ప్రశ్న నా నుంచి రావడం శర్మగారికి వింతగా వినిపించింది. ఈ సంఘటన తరవాత నన్ను సాహిత్యాభిలాషిగా గ్రహించేరు. అప్పటినుంచి ఏది రికార్డు చేయవలసి వచ్చినా, ఆ సాహిత్యాన్ని ముందుగా నాకు వినిపిస్తూ ఉండేవారు.

ఆయన చాలా సహృదయుడు. స్నేహాభిలాషి. భాషలోను, భవంలోను ఉత్తమ సంస్కారం కలిగినవాడు. క్రమంగా – భావనారాయణగారు మద్రాసులో ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం లేకపోవడంతో – పద్మావతీ శ్రీనివాసం – నృత్యనాటాకానికి సంగీతం నేనే నిర్వహించవలసీ వచ్చింది. శర్మగారు ఏది రాసినా లలితంగా, సుకుమారంగా వినిపించేది. వెంటనే దానికి సంగీతం అమర్చడానికి ఎంతో ఉత్సాహం కలిగేది.

నాటకరంగ విభజనలో, పాత్రపోషణలో ప్రదర్శన సంబంధమైన అంశాలు అన్నిటిలోను సత్యంగారు, శర్మగారిని సంప్రదిస్తూ ఉండేవారు.

ఆ రోజుల్లో కావలి కాలేజీలో ఇంద్రగంటి హనుమఛ్ఛాస్త్రి గారూ పనిచేవారు. హనుమఛ్ఛాస్త్రి గారూ, పిలకా గణపతిశాస్త్రిగారూ విజయనగరం సంస్కృత కళాశాలలో విద్యార్ధులుగా ఉండినప్పుడు పంతుల లక్ష్మీనారాయణ గారు శతవృధ్ధులు.

నవ్యకవిత్వం ఆవిర్భవించిన రోజులవి. నవ్యకవిత్వం పట్ల ఇంద్రగంటి వారికీ, పిలకావారికి సానుభూతి ఉండేది. ఆనాటి ముచ్చట్లు నేను కొన్ని విన్నాను. శర్మగారికా ముచ్చట్లు చెప్పడం జరిగింది. ఆ కబుర్లు పొడిగించాలని ఉండేది శర్మ గారికి.

శ్రీ వెంపటి చిన సత్యం గారు శర్మ గారి సాహిత్యమే కాకుండా, ఆయన సాన్నిహిత్యమూ కోరుకునేవారు. ఆ కారణంచేతే అకాడెమీ నృత్యనాటకాలు ఎక్కడ జరిగినా, శర్మగారి తోడ్పాటు ఉంటూ ఉండేది.

ఆ రోజుల్లో – అవతల కెనడా నుంచి ఇవతల ఫ్లోరిడా దాకా సంచారం జరిగింది. ఈ ప్రయాణాలన్నీ గ్రేహౌండ్బస్సులోనే. శర్మగారూ మాతోటే ప్రయాణం చేసేరు. ఆయన నాకు దగ్గరగా ఉండేవారు.
ఆ బస్సులోనే –
  ‘ఎన్ని సొగసుల మూట 
  మా తెలుగు పాట
  ఎంత తేనియలొలుకు 
  మా తెలుగు పలుకూ
అనే పాట రాసి చూపించేరు నాకు శర్మగారు. నాకది వెంటనే పాడి వినిపించాలనిపించింది. రాగమాలికలో చేశానాపాట.

ఆ పాట ఇదీ –
పల్లవి – రాగం పీలు
ఎన్ని సొగసుల మూట మా తెలుగు పాటా
ఎంత తేనియలొలుకు మా తెలుగు పలుకు       llఎన్నిll


చరణం 1 – రాగం పీలు
తొలికారు మబ్బులో పులకించు ధాత్రిలా
ధాత్రియెదలో మేలుకొను పంటసిరిలా              llఎన్నిll
చరణం 2 – రాగం పీలు
గొబ్బెమ్మ సిగలోని గుమ్మడీ పూవులా
గుమ్మడీ మనసులో మంచు కోరికలా              llఎన్నిll
చరణం 3 – రాగం జంఝూటి
తలుపు దగ్గర చెప్పు తన మగని పేరులా
పేరులో తారాడూ మన్మథుని రూపులా            llఎన్నిll
చరణం 4 – రాగం మోహన
గోదారి ఒడిలోని నెలవంక పాపలా
నెలవంక చెక్కిళ్ళ పాల వెన్నెలలా                  llఎన్నిll

చరణం 5 – రాగం మధ్యమావతి
భద్రాద్రి రాము నెన్నుదుటి కస్తూరిలా
కస్తూరి మనసులో కారుణ్య రేఖలా                  llఎన్నిll

– ఇలా ఏ పాట రాసినా లలిత సుందరమైన ఆ శైలి మనసునెంతో ఆకట్టుకుంటుంది.
శర్మగారెప్పుడు ఏ పనిమీద మద్రాసు వచ్చినా ఆయనతో సత్కాలక్షేపం అవుతుందనే ఆశ నాకుండేది.
18-03-2020
ఉదయం  11 గంటలకు
నాన్నగారు చెపుతుండగా రాసిన వ్యాసం
-      కె వి రమణమ్మ 

No comments: