visitors

Wednesday, March 25, 2020

సాధకుడు బోధకుడు విద్వన్మణి- నూకల చినసత్యనారాయణ


                     


సంగీతరావుగారు సమకాలీనులైన కళాకారులను పరిచయం చేస్తూ, వారి కళాప్రదర్శనలోని లోతుపాతులను వివరిస్తూ ఎన్నో ప్రామాణిక వ్యాసాలను రాసారు. 1976 సం.లో ఆంధ్ర ప్రభ దినపత్రిక లో ఈ వ్యాసపరంపర ప్రచురితమైంది. అప్పటి వ్యాసాలలో ఆయా కళాకారులగురించి సంగీతరావుగారు వివరించిన విశేషాలు తెలుసుకోగోరేవారికోసం ఇక్కడ మళ్లీ ప్రచురిస్తున్నాం. శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీ శ్రీపాద పినాకపాణి, నేదునూరి కృష్ణమూర్తి వంటి ఎందరో మహావిద్వాంసులను పరిచయంచేసిన ఆ వ్యాస పరంపరలో నూకల చినసత్యనారాయణగారి విద్వత్తును వివరించే వ్యాసం ఇది.

ఆంధ్రప్రభ – డిసెంబర్ 12, 1976, విజ్ఞాన వేదిక
                                  రాగపస్తారంలో స్వతంత్రుడు
         నూకల చిన సత్యనారాయణ
సంగీతం శాస్త్రంగా, వృత్తిగా పరిగ్ర్యహించి పరిపూర్ణమైన సత్ఫలితాలను సాధించిన పట్టభద్రుడు శ్రీ నూకల సత్యనారాయణ. కర్ణాటక సంగీత రసికులకు ఈనాడు శ్రీ సత్యనారాయణ సంగీతం ఎంతో కుతూహలం, ఆసక్తి ఉన్నాయి. సుశ్రావమైన ఆయన కంఠస్వరమూ, రాగతాళములలో గల స్వాతంత్ర్యమూ, సరసత, కచేరీ నిర్వహించడంలో గల అభినివేశమూ శ్రీ సత్యనారాయణ సంగీతంలోని సహజ ఆకర్షణ.

మూడు పదులు దాటిన శ్రీ సత్యనారాయణ సంగీత జీవితానుభవం గణనీయమైనది. సంప్రదాయ సంగీతం సక్రమమైన పధ్ధతిలో గురుముఖతః సాధనచేసిన శ్రీ సత్యనారాయణ సంగీతం ఆయనను ప్రభావితం చేసిన అనేక మంది విద్వాంసుల ప్రతిభతో తాదాత్మ్యం చెందడం ఆయన రసజ్ఞతను, సహృదయాన్ని వ్యక్తం చేస్తుంది. కళాపరంగా ఎక్కడ ఏ మంచి వినిపించినా దానిని గ్రహించడం వలన శ్రీ సత్యనారాయణ పాండిత్యంలో ఎంతో వైశాల్యమూ, గాంభీర్యమూ ఏర్పడ్డాయి. ఈవిధమైన పాండిత్యం ఉత్తమ గురుత్వానికి లక్షణం.

శ్రీ సత్యనారాయణ మొదట వాయులీన వాదకులైన తరవాతనే గాయకులయ్యారు. వాద్యనైపణ్యం కూడా కలిగిన గాయకుడిలో శాస్త్రియంగా సునిశితమైన అవగాహన, సుస్ఫష్టమైన గమకస్ఫూర్తి ఉంటాయి.
పరిశోధన
శ్రీ సత్యనారాయణ సంగీతశాస్త్రంలో పరిశోధనలు సలిపిన పండితులు. భారతీయ సంగీతంలోని రాగవిధానానికి సంబంధించిన దాక్షిణాత్య, ఔత్తరాహ సంగీతసంప్రదాయ రీతుల తులనాత్మక పరిశీలన వారి ప్రత్యేక కృషి.

రాగవిధానం భారతీయ సంగీతం విశిష్ఠత నిరూపస్తుంది. భారత హృదయ సంవేదన రాగవిధానంలోనే సంగీతమయంగా వ్యక్తం అవుతుంది. రాగములు దేవతామూర్తులుగా ధ్యానించబడ్డాయి. అనేక రాగములు రూపకల్పన చేయబడి చిత్రీకరించబడ్డాయి.

రాగనిర్వచనం
రాగం అంటే ఏమిటి? ఆరోహణావరోహణ క్రమంలో గల స్వర సముదాయం అని స్థూలంగా చెప్పడం కన్న, రాగం అంటే సంగ్రహరూపంగా ఉన్న ఒక స్వర రచన అని అనడం ఉచితం. అయితే, ఆ రచన గాయకుని ఊహాపోహలననుసరించి సంకోచ వ్యాకోచాలకు అవకాశం కలిగిస్తుంది. అనేక రాగాలకు రసనిర్ణయం జరిగింది. అయితే ఆ నిర్ణయం సక్రమంగా అనుసరించబడలేదు. నిజానికి వివిధ రసములకు లక్ష్యప్రాయమైన స్వరరచనలు లేవు. యక్షగానాలలోను, నాట్యరూపకములలోను ఆయా రాగాలను వివిధ రస నిష్ప్తత్తికి పోషించేవారేమో? ఆయా రసభావములను పోషించే సందర్భంలో తీవ్ర, కోమల స్వరసమ్మేళన గాయకుని సరసమైన ప్రతిభే ప్రధానంగా ఉంటుంది. రసనిష్పత్తికి రాగప్రాధాన్యాన్ని చెప్పినట్టు, తాళప్రాధాన్యాన్ని చెప్పడం కనబడదు. అనుభవంలో తాళప్రాధాన్యం ఎంతో కనిపస్తుంది. రసభావపోషణలో రాగముల పరిధి నిర్ణయించడం పరిశోధకుల సమస్య. అనేక ప్రసిధ్ధ రాగములు శతాబ్దుల తరబడి ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తుంది. కాలక్రమాన మేళకర్త పధ్ధతి అనుభవంలోకి రావడం, దానిని బట్టి అనాదిగా వస్తూన్న రాగాలను ఆయా మేళకర్తలకు సంబంధించి వర్గీకరించడం జరిగింది. మేళకర్త విధానం అమలులోకి వచ్చిన తరవాత ఔడవషాడవ భేదాలననుసరించి ఏర్పడ్డ రాగాలు వేలకు వేలు తయారయాయి. వీటన్నిటికీ పేర్లు పెట్టవలసి రావడం ఒక సమస్యే. కారణం – చందోబధ్ధంగా ఏర్పడ్డ ఆయా రాగాలకు అనుభవంలో లేకపోయినా, వేల సంఖ్యలో నామకరణం చేయవలసి ఉంటుంది గదా! అయితే, ఎన్ని పుస్తకాల్లో వెతికినా అన్ని వేల రాగాలు కనబడవు. మనకి కావలసిన మూర్ఛనకి సరిపడే పేరు పుస్తకాల్లో కనబడకపోతే ఏ శక్తిప్రియఅన్న పేరో పెట్టుకోవలసి ఉంటుంది. ఆరోహణావరోహణ క్రమంలో వక్రసంచారంలో ప్రతి చిన్న మార్పును వేరే రాగంగా వ్యవహరించవలసి వస్తుంది.

ఒక రాగం శ్రవణయోగ్యంగా ఉండడం, ఆ రాగంలోని స్వరసంబంధ పరస్పర సంవాది, అనువాది రూపంగా ఉండడం గ్రహించగలుగుతాం. ఈ ప్రాతిపదిక మీద రాగవిధానం పునః పరిశీలించడం అవసరమేమో? ప్రతి చిన్న సంచారాన్నీ ప్రత్యేక రాగంగా పేర్కొనడం కన్నా ఈనాడు వివిధ రాగములుగా పేర్కొనబడిన రాగాలను సమన్వయపఱచి ఒకే రాగంగా విస్తృతపరచవచ్చునేమో! శ్రీ సత్యనారాయణగారి వంటి పరిశోధకులు వివరించవలసి ఉంటుంది.

రాగమేళనం    
ఈనాడు ఉత్తరాది సంగీతంలో రెండు భాగాలుగా గానం చేయడం ఒక ప్రక్రియగా అమలులోకి వచ్చి ఉంది. రాగవిధానం వలన నిర్దిష్టమైన రాగభావములకు ప్రత్యేకత ఏర్పడడం జరిగింది. ఆ రాగ స్వరూపానికి స్కాలిత్యం ఏర్పడకుండా అచంచలమైన లక్షణం ఏర్పడింది. గ్రహస్వరం, న్యాసస్వరం, అంశస్వరములను నిర్ణయించి ఆ రాగ స్వరూపానికి మార్పులు, చేర్పులకు అవకాశంలేకుండా చేయబడింది. దీనివలన ఆయా రాగాల స్వరూపాలు నిర్దిష్టంగా ఏర్పడ్డా, ఆయా రాగములలో రచింపబడిన రచనలలో వైవిధ్యం లోపిస్తుంది. ఒకే రాగంలో ఉన్న అనేక రచనలలో ఉన్న రాగభావం ఒకటే. ఒక కీర్తన గాంధారంలో ప్రారంభం అయితే, మరొకటి షడ్జమంలో ఎత్తుగడ జరిగిందనే తృప్తి తప్పిస్తే మరేమీలేదు.

అందుచేతనే రాగభావములను ఆధారం చేసుకున్న ఆయా రచనలలో స్వరరచయిత భావనకు అవకాశంలేదు. ఇంతకు పూర్వం శతాబ్దులుగా ప్రచారంలో ఉన్న రాగభావన్ని సాహిత్యానికి అమర్చడమన్నదే ప్రధానం. ఆయా విషయాలను వివరంగా రసికులు గ్రహించడానికి శ్రీ సత్యనారాయణగారు వంటి పండితుల పరిశోధనలు ఎక్కువ ఉపకరిస్తాయి.

శ్రీ సత్యనారాయణ ప్రథమశ్రేణి గాయకులు. అనేక సంగీత కచేరీలు చేసి, రసికుల మన్ననలు పొందారు. రేడియో జాతీయ కార్యక్రమాల్లో తమ సంగీతం వినిపించారు. అనేక సంగీత రూపకములకు సంగీత సారథ్యం వహించారు. ప్రభుత్వ మర్యాదలననుసరించి అనేక సత్కారాలు పొందారు. పీఠాధిపతుల ఆశీస్సులనందుకున్నారు.

ఉత్తమ సంగీత విద్వాంసులుగా, ప్రథమశ్రేణి గాయకులుగా, వాద్య నిపుణులుగా, స్వరరచయితగా, ఆచార్యులుగా కృతార్థులయిన శ్రీ సత్యనారాయణ స్వకీయమైన ప్రతిభతో రసిక లోకానికి ఇవ్వగలిగినది ఇంకా ఎంతో ఉందనే అనిపిస్తుంది.

===+++===  ఫఫరరరరర

No comments: