1955 చివరి నెలలలో మా నాన్నగారు, శ్రీ పట్రాయని సంగీతరావు గారు విజయనగరంనుంచి తన కుటుంబాన్ని మాత్రం మెడ్రాస్ కు మార్చవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటికి మా తాతగారు శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రిగారు ఇంకా విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో గాత్రోపన్యాసకునిగా పనిచేస్తూనే వున్నారు. మా నారాయణ మూర్తి చిన్నాన్నగారు 1953 లోనే విశాఖపట్నానికి మకాం మార్చారు. అక్కడ డాబా గార్డెన్స్ లో ఒక చిన్న సంగీతం స్కూల్ పెట్టి గాత్రం, వీణ, క్లాసెస్ ప్రారంభించారు. విజయనగరంలో మా తాతగారు, పెద్దమ్మమ్మగారు, ప్రభూ చిన్నాన్నగారు, కమల పిన్నిగారు, వారి పిల్లలు ప్రసాద్, మంగమాంబ వున్నారు. విజయనగరంలో వుండేప్పుడు మా ప్రసాద్, నేనూ చాలా సఖ్యంగా వుండేవాళ్ళం. ఇప్పటికి ప్రసాద్ నాపట్ల చాలా ప్రేమాభిమానాలతో వుంటాడు. అతను నాకంటే రెండేళ్ళు చిన్న.
ఇది మేము విజయనగరం వెళ్ళిన కొత్తల్లో మా ఇద్దరికీ ఫోటో స్టూడియోలో తీసిన ఫోటో. ఆ వయసులోని ఫోటో చూస్తూంటే ఏదో తమాషాగా వుంటుంది.
అలాటి ఆత్మీయులందరినీ వదలి మెడ్రాస్ వెళ్ళిపోతున్నప్పుడు నేను ఎలా ఫీలయ్యానో నాకు ఏమాత్రం గుర్తులేదు. బహుశా, చాలా దూరం రైలు ప్రయాణం చేయబోతున్నాననే సంతోషం వుందేమో. అంత సుదీర్ఘ రైలు ప్రయాణం చేయడం, నా పదేళ్ళ జీవితంలో అదే మొదటిసారి. అంతకుముందు ఒకసారి ఏదో పాతమొక్కుబడి తీర్చాలని నన్ను సింహాచలం కొండకు తీసుకువెళ్ళారు. అంతకు కొన్ని రోజులముందే విపరీతమైన జ్వరం వచ్చింది. (పదేళ్ళు దాటేవరకు వరకూ తరచూ నాకు మలేరియా జ్వరం వస్తూండేది). సింహాచలం కొండమీదకు మెట్లన్నీ (సుమారు వేయికి పైనే మెట్లున్నాయి). అంత చిన్న వయసులో (7 ఏళ్ళు) ఎవరి చంకా ఎక్కకుండా అన్ని మెట్లు నేనే ఎక్కి వెళ్ళినందుకు మా అమ్మగారు అందరితో చెప్పి మురిసిపోవడం బాగా గుర్తుండిపోయింది. నేనూ ఏదో ఘనకార్యం సాధించేననే అనుకున్నాను.
సింహాచలం దేవుడు వరాహ నరసింహస్వామి. ఆ రోజుల్లో కొండమీదకు బస్సులు లేవు. కాలినడకనే మెట్లమీదుగా వెళ్ళవలసి వచ్చేది. సింహాద్రి అప్పన్న కొండంతా రకరకాల వృక్షాలతో, పూల వనాలతో సుగంధభరితంగా వుండేది. ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా ఉన్న పనసపళ్ళతో చెట్లు, ఆకు సంపెంగ, రేక సంపెంగ వృక్షాల సముదాయంతో, చిన్న చిన్న జలధారలతో దైవీక వాతావరణం మధ్య ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా మా దైవ దర్శనం జరిగింది.
అక్కడ నుండి విశాఖపట్నం కూడా వెళ్ళాము. అందుకోసం సింహాచలం స్టేషన్ లో ఒక పెద్ద రావిచెట్టు క్రింది చప్టామీద కూర్చొని చాలాసేపే గడిపాము. ప్లాట్ ఫారమ్ మీద జనాలే లేరు. చల్లటి కొండగాలికి రావి ఆకుల గలగల సవ్వడి చేస్తూంటే చాలా హాయిగా అనిపించింది. ఈలోగా కాస్తా కాలక్షేపం కోసం మా నాన్నగారు పక్కనున్న టీ స్టాల్ నుండి వేడి వేడిగా "శనగపప్పు పకోడీలు ఫ్రెష్ గా వేస్తున్నాడంటూ పట్టుకొచ్చేరు. అందుకు మా అమ్మగారిచ్చిన సమాధానం 'ఆ! గుడ్డు! ఇప్పుడు ఏ హోటల్ వాడు శెనగపిండి వాడుతున్నాడు. ఇవి బఠాణీ పిండితో చేసిన పకోడీలే' అని ఒక్కమాటలో తేల్చేసింది. ఈ మాటలంటున్నప్పుడు ఆవిడ యిచ్చిన రియాక్షన్ ఇంకా అలాగే మనసులో నిల్చిపోయింది. అంటే ఆనాటికే కాదేదీ కల్తీకనర్హం అన్న వ్యాపారసూత్రం బాగా ప్రబలిందనుకోవాలి. (విజయనగరం కోటయ్య కొట్లోని పకోడీలు చాలా ప్రశస్థమని మా తాతగారు అప్పుడప్పుడు తెచ్చేవారు, కల్తీలేనివే అయుంటాయి).
తర్వాత, వాల్టేర్ వెళ్ళే ప్యాసింజర్ రావడం మేము రైలెక్కడం జరిగింది. ఆ రాత్రికి విశాఖపట్నం లో డాబా గార్డెన్స్ లోని మా చిన్నాన్నగారింట గడిపాము. ఆ ఇల్లు లీలామహల్ పక్క వీధిలో వుండేది. (అప్పట్లో ఆ ధియేటర్ పేరు నాకు తెలీదు). ఆనాటికి విశాఖపట్నం చిన్న పట్టణమే. అంత అభివృధ్ధి చెందలేదు. ఇళ్ళు కూడా చెదురుమదురుగానే వుండేవి. చీకట్లో ఊరంతా నిర్మనుష్యంగా వుండేది. డాల్ఫిన్స్ నోస్ కొండమీది లైట్ హౌస్ లైట్ వెలుగు, వాల్టేర్ అప్ ల్యాండ్స్ లోని గవర్నర్ బంగళా లైట్ల వెలుగు మా చిన్నాన్నగారింటికి స్పష్టంగా కనిపించేది. ఇతర కొండలమీద ఇళ్ళేవీ లేవు అప్పటికి. వాల్టేర్ రోడ్లన్నీ ఎగుడు దిగుడు రోడ్లు. సిటీ బస్సులు లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా సైకిల్ రిక్షాలలోనే వెళ్ళాలి మనస్సాక్షి చంపుకొని. ఒక పావలా ఇస్తే ఇద్దరు మనుషుల్ని ఎక్కించుకొని రైల్వే స్టేషన్ నుండి నాలుగైదు మైళ్ళ దూరం వరకూ తీసుకుపోయేవారు. ఎత్తు ప్రాంతాలలో రిక్షా తొక్కలేరు. లాగుతూ, నడిపించుకునే తీసుకువెళ్ళాలి. ఎండైనా, వానైనా. ఆ రిక్షావాళ్ళ శ్రమ, కష్టం చూస్తే మనసుకు బాధ కలుగుతుంది. అలాటివారితో బేరాలాడడం మా నాన్నగారికి ఇష్టంవుండేది కాదు. ఆయన అన్నివిధాలా చాలా ఉదారంగానే ఉండేవారు. మా నాన్నగారెప్పుడూ పిల్లల్ని కొట్టడం, తిట్టడం చేయలేదు. కానీ కోపం వస్తే ఆయన తీక్షణమైన చూపులు, ఘాటైన ఉపన్యాసాలు తీవ్రంగా వుండేవి.
మా నాన్నగారు కథలు చెప్పే తీరు చాలా అద్భుతం. ఎక్కువగా టాగోర్, శరత్, ప్రేమ్ చంద్ కథలు చెప్పేవారు. ఆయన చెప్పిన కథలు చాలా బరువైనవిగా వింటూంటే దుఃఖం కలిగించేవిగా ఉండేవి. అంతలా మనసుకు హత్తుకునేలా కథలు చెప్పే తీరు నాకు మరెవరి దగ్గరా కనపడలేదు. ఈ విషయాన్ని ఘంటసాల సావిత్రమ్మగారు, పాప పిన్నిగారు (ఘంటసాల సదాశివుడిగారి భార్య) కూడా తరుచూ చెప్పేవారు. మేము మెడ్రాస్ కు వెళ్ళకముందు మా నాన్నగారు ఒంటరిగా ఓ ఏడాదికి పైగా ఘంటసాల వారింటి మేడమీద వుండేవారు. (పానగల్ పార్క్ దగ్గరి పార్క్ లాండ్స్ హోటల్ లో భోజనం, 35 ఉస్మాన్ రోడ్ మేడ మీదం మకాం). సత్రవు భోజనం, మఠం నిద్ర. అలాటి రోజుల్లో సాయంత్రం పూట బాల్కనీలో కూర్చొని అందరూ సరదాగా కబుర్లు చెప్పుకునే సమయాలలో మా నాన్నగారు ఇలాటి కథలెన్నో చాలా రసవత్తరంగా, హృదయానికి హత్తుకునేలా చెప్పేవారని, సంగీతంగారి కథలు విన్న తరువాతే పుస్తక పఠనం మీద ఆసక్తి పెరిగిందని చెప్పేవారు.
అలాగే, ఆయన పాడే తీరు, హార్మోనియం మీద కర్ణాటక సంగీతం వాయించే విధానం నన్ను కట్టి పడేసేవి. నేనే కాదు, మా నాన్నగారిని గురించి తెలిసినవారంతా ఇలాగే చెప్పేవారు. సంగీత, సాహిత్యాలలో ఆయనకున్న శాస్త్రపరిజ్ఞానం, అనుభవం అపారం. ఎడ్వాన్స్డ్ మ్యుజీషియన్స్ కు ఆయనొక గొప్ప గైడని ఆయన దగ్గరకు పలువురు సంగీత విద్యార్ధులు వచ్చేవారు. సంగీతరావు గారు గొప్ప మ్యూజికల్ జీనియస్సని డా. సి. నారాయణరెడ్డి గారు సభాముఖంగా ప్రశంసించడం నేను విన్నాను. ఆ సభలో సంగీతరావు గారు లేరు. ఆరుద్ర లాటి చరిత్రకారుడు కూడా సంగీతం విషయంలో ఆయనను సంప్రదించేవారు. ఆయన స్థాయి సంగీత జ్ఞానం కలిగిన కొందరు ప్రముఖులు పొందిన గుర్తింపు ఆయనకి దక్కలేదన్నది ఆయన మిత్రులు కొందరి అభిప్రాయం. కమర్షియల్ పబ్లిక్ రిలేషన్స్ విషయంలో మా నాన్నగారు, తాత, ముత్తాతల మార్గం భిన్నం. వారి ఆశయాలు, ఆదర్శాలు, వారిని మరో మార్గంలో నడిపించేయి.
మా టివికె శాస్త్రిగారు ఎప్పుడూ ఒక మాట అనేవారు "మీ తాత, నాన్నల సంగీతం విని అనుభవించలేకపోవడం జనాల కర్మ. వాళ్ళకు ఆ అదృష్టం, ప్రాప్తం లేదు" అని. ఆయన కుటుంబం అంతటికీ మా తాత తండ్రుల గురించి తెలుసు. టివికె శాస్త్రిగారు కళాకారులను ఉద్దేశించి మరొక మాట కూడా ఎప్పుడూ అంటూండేవారు "ఎంతటి బంగారు పళ్ళేనికైనా, దాని విలువ, మెఱుపు తెలియాలంటే ఒక మంచి దన్ను, దాపు ఉండాలి. ఆ పనే మనం చేస్తున్నాము. మనలాటివాళ్ళు పూనుకొని ప్రోత్సహిస్తేనే మరుగున పడిన మాణిక్యాలు కొన్నైనా బయటపడతాయి" అని యువకులకు స్ఫూర్తినిచ్చేవారు. ఆ విశేషాలన్నీ మరో అధ్యాయంలో.
ఓ! నేను ఈ విషయాలు చెపుతూ కూర్చుంటే మెడ్రాస్ రైలు తప్పినా తప్పిపోవచ్చు. ఇంక మెడ్రాస్ మార్గం పడదాం.
నేను పుట్టిన దగ్గరనుండి దూసి-విజయనగరం, విజయనగరం- బొబ్బిలి మధ్య అనేకసార్లు రైళ్ళలో ప్రయాణం చేసినా నాకవి అంతగా గుర్తులేవు. ఆ రోజుల్లో విజయనగరం నుండి వెళ్ళాలంటే రెండో మూడో రైళ్ళుండేవి, ఒకటి హోరా వేపు, మరొకటి రాయపూర్ వేపు. అందువల్ల వచ్చీపోయే రైళ్ళలో జనాలరద్దీ ఎక్కువగానే వుండేది. మా (సామవేదుల) వరహాల్తాతగారి రైల్వే పరిభాషలో - ప్రతి డబ్బా - కంపార్ట్ మెంటూ క్రిక్కిరిసే వుండేది. (ఆయన రాసిన రైలు కథలు, రైల్వే జోకులు తరుచూ ఆంధ్రపత్రికలో వచ్చేవి). ఆ రైళ్ళలో I, II, III అని మూడు తరగతులు. తొంభై శాతం ప్రయాణీకులు III క్లాసు డబ్బాల్లోనే ప్రయాణం. ఆనాటికి ఎడ్వాన్స్ రిజర్వేషన్ల పధ్ధతి లేదు. అంతా జనరలే. కండబలం కలిగినవాడే రైల్లో రారాజు. రైల్లో సీట్లు నాలుగు వరసల్లో పొడుగాటి కర్రబల్లలతో వుండేవి. కిటికీల వేపు రెండు వరసలు, మధ్యలో ముందు వెనుకలుగా రెండు వరసలు వుండేవి. సామాన్లు పెట్టుకుందుకు పైన బల్లలుండేవి. అయితే, అవెప్పుడూ హోల్డాల్ లు పరచి బలాఢ్యులైన వారి నిద్రలకే నిర్ణయమైపోయివుండేవి. అప్పట్లో ఎవరికీ less luggage more comfort అన్న స్లోగన్ అనుసరించవలసిన విషయంలా అనిపించేదికాదేమో. తక్కువ దూరం ప్రయాణమైనా ఒక హోల్డాల్, నీళ్ళ మరచెంబు, ఓ సూట్ కేసు, గొడుగు, విసనకర్ర తప్పనిసరి. మా నాన్నగారి చిరకాల స్నేహితుడు, తరువాత మా నారాయణమూర్తి చిన్నాన్నగారి వియ్యంకుడు, ప్రముఖ కవి, రచయిత అయిన కీ.శే. శ్రీ పంతుల శ్రీరామశాస్త్రిగారు రాయఘడా నుండి ఎప్పుడు విజయనగరం వచ్చినా హోల్డాల్ తప్పనిసరి. అది మోయడానికి ఒక కూలీ.
35, ఉస్మాన్ రోడ్ ఆఫీస్ రూం దగ్గర
శ్రీ పంతుల శ్రీరామశాస్త్రిగారితో నాన్నగారు
ఇన్ని సామాన్లు, జనం రద్దీల మధ్య శనక్కాయలు, జంతికలు, జాంపళ్ళు అమ్మేవాళ్ళ జంగిడీలతో ప్రయాణం అనూహ్యం. మరి మా నాన్నగారు పూర్తి సామానుతో, ఇద్దరు చిన్న పిల్లలతో అంత రద్దీలో విజయనగరంలో ఎలా రైలెక్కించగలిగారో ఆయనకే తెలియాలి. సగం మంది ప్రయాణీకులకే సీట్లు. మిగిలిన వారంతా వారి వారి పెట్టెల మీద సద్దుకోవడం, లేదంటే తమ స్టేషన్ వచ్చేవరకు వచ్చేపోయేవారి తోపులాటలు, కీచులాటలు భరిస్తూ నిలుచోవడం. అంతకు మించి వారికి వేరే గత్యంతరం లేదు. రైలు ప్రయాణం ఒక భగీరథ యత్నం.
నా మొట్టమొదటి సుదీర్ఘ రైలు ప్రయాణం, విజయనగరం నుండి మెడ్రాస్ కు జనతా ఎక్స్ ప్రెస్ లో జరిగిన జ్ఞాపకం. ఆ రైలు హౌరా(కలకత్తా)లో బయల్దేరి ఖర్గపూర్, భువనేశ్వర్, కటక్, ఆముదాలవలసల మీదుగా విజయనగరం వచ్చి, వాల్టేర్, విజయవాడ, నెల్లూరు, గూడూరుల మీదుగా మెడ్రాస్ చేరేది. (విశాఖపట్నం పోర్ట్ స్టేషన్ కి కొన్ని ఎక్స్ ప్రెస్, పాసెంజర్ ట్రైన్స్ మాత్రం వెళ్ళేవి) ఈ మధ్యలో మరెన్నో ఊళ్ళు. ఆ లిస్టంతా మొదలెడితే కోట శ్రీనివాసరావు ప్రహసనమే అవుతుంది. ఆరోజుల్లో, నాకు జ్ఞాపకం ఉన్నంతవరకూ రెండే రైళ్ళు. ఈనాటికీ తూర్పుకోస్తా తీరం వెంబడి ప్రతిరోజూ 1,664 కిలోమీటర్ల దూరాన్ని28 గంటల్లో దాటుతూ సుదీర్ఘంగా నూట ఇరవై ఏళ్ళుగా ప్రతిరోజూ ప్రయాణిస్తూన్న హౌరా మెయిల్ ఒకటి.
మరొకటి జనతా ఎక్స్పెస్. కొన్నాళ్ళకు దాని స్థానంలో హౌరా ఎక్స్పెస్ వచ్చింది. మరికొన్నేళ్ళకు 1977 మార్చిలో ఆ బండి స్థానే కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ వచ్చి రెండు మహా నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు రెండు గంటలు తగ్గించింది.
ఆరోజుల్లో జనతా ఎక్స్ ప్రెస్ లో మెడ్రాస్ చేరడానికి 20 గంటలకు పైనే పట్టేది. విజయనగరం స్టేషన్ లోకి రైలు సైటింగ్ అయిందనగానే కలకలం మొదలయేది. జనాలంతా పిల్లాపాపలతో సామానేసుకొని ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ముందు వెనుకలకు పరుగులు మొదలెట్టేవారు. దూరాన కనిపించే రైలును చూడగానే నాకు కంగారుపుట్టేది. రైలింజన్ ఆవిరి చిమ్ముకుంటూ స్టేషన్ అదిరేలా ప్లాట్ఫారమ్ మీదకు రావడంతోనే నా గుండె అదరడం ప్రారంభమయేది. ఆ టెన్షన్ ఇప్పటికీ నాకు వుంది. చెన్నై నుండి బయల్దేరే రైళ్ళయితే ఇబ్బంది లేదు కానీ బయట వూళ్ళనుండి వచ్చే రైళ్ళు ఎక్కాలంటే కంగారే కంగారు ఇప్పటికీ, ఎంత రిజర్వేషన్ బెర్తులున్నా, ఆ గుండెల్లో గాభరా తగ్గలేదు.
మరి, మేము మెడ్రాస్ రైలు ఎలా ఎక్కాము, సీట్లు దొరికాయా లేదా అనే విషయాలు గుర్తులేవు.
మేము మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ లో రైలుబండి దిగి ప్లాట్ ఫామ్ మీద అడుగు పెట్టగానే వేరేదో లోకంలోకి వచ్చినట్లయింది.
వచ్చేవారం నుండి మద్రాసు జీవితం కొత్త విశేషాలతో.....
.... సశేషం
13 comments:
మీ జ్ఞాపకాల మాలికలో ఒక్కొక్క విషయం మీ నిరాడంబరతను...పెద్దలపట్ల వినయం...అపూర్వ విషయ పరిజ్ఞానం...తేటతెల్లం చేస్తోంది...మేము కూడా తెలుసుకోగలగడం అదృష్టం... ధన్యవాదాలు మహాశయా....
క్రొత్త అధ్యాయం ఉన్నట్లుండి క్రొత్తగానే ఉంది. ఇంకా గ్రామీణ వాతావరణం ఇంకో 2 వారాలు ఊహించాము. వెంటనే విజయనగరం, విశాఖపట్నం, నృసింహస్వామి, రైల్వే స్టేషన్లూ, పకోడీలు, మద్రాస్ రైళ్ళూ, చేరిపోవడం కొంచెం లోటయ్యింది. కారణం 65 ఏళ్ల నాటి జీవన విధానాన్ని ఈ తరానికి నిక్షిప్తం చేయాల్సింది. అది ఈ కథానిక ద్వారా నిస్సందేహంగా మీకే సాధ్యం! 35, ఉస్మాన్ రోడ్ లో ఘంటసాల గారి దర్శనము కోసం చూస్తూ!
మీకు నా ధన్యవాదాలు.
Thank you very much,sir.
🙏🙏శ్రీ అన్నయ్యకు నమస్కారములు 🙏🙏, ఈ సంచికలో, నీవు వ్రాసిన విశేషాలన్నీ, నాకు క్రొత్తవే. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ విషయాలు మన మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు, గుర్తు లేదు. ఇందు మూలముగా, తెలిసినందుకు,నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ సంచికలో వచ్చిన చిత్రాలు, మాత్రం, చాలా కాలమైనప్పటికీ, చూచినట్లు జ్ఞాపకం ఉన్నాయి. ధన్యవాదాలు. నీ జ్ఞాపకానికి జోహార్లు. చాలా చక్కగా, వివరంగా, అన్ని విషయాలు క్రోడీకరించి వ్రాశావు. కధనం చాలా బాగుంది. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. శ్రీ నారాయణ మూర్తి పెద్దనాన్నగారి ఇల్లు విశాఖపట్నం లో , ప్రేమ సమాజం, ప్రాంతంలో ఉండే దనుకుంటాను. ఆ లీలామహల్ ను, పూర్వపు రోజులలో "సరస్వతి టాకీస్" అనేవారనుకుంటాను.మన చిన్ననాటి ఫోటో భద్రంగా దాచి, ఆవివరణ కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పిల్లలు ఇప్పటివరకు, ఈ మన ఫోటో చూచి ఉండరు . ఒకవేళ చూచినా, వారికి జ్ఞాపకం లేదు . 🙏🙏-
పట్రాయని ప్రసాద్ , బెంగుళూరు, తేదీ :09-10-2020, శుక్రవారం, సమయం:రాత్రి : గం.07:11 ని.IST.
సరస్వతి టాకీస్ వేరేవుంది. దానికి మరోపక్క టాకీస్ లీలామహల్.
రెండో అధ్యాయం - మొదటి భాగం చాలా బాగుంది..... అవును ..... కథలే కాదు .... ఏ విషయమైనా మనసుకు హత్తుకునేలా చెప్పడం నాన్నగారి ప్రత్యేకత.... తరువాతి భాగం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాను పెద్దన్నయ్యా ...
సుమబాల
మీ ప్రయాణపు అనుభవాలు చాలా చక్కగా వివరించారు సర్.కళ్లకు కట్టినట్టుగా ఉంది. ఇలాంటి వర్ణనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.ధన్యవాదాలు.
ధన్యవాదాలు.
స్వరాట్ మాస్టారు గారూ.... మీ జ్ఞాపకశక్తి కి మున్ముందు గా జోహార్లు.... సింహాచలం, మద్రాసు ప్రయాణాల గురించీ... మీ బంధువుల గురించి ఇతర వివరాలు ఎంతో విపులంగా పంచుకున్నారు.... చాలా చాలా చక్కని రైటప్....తరువాయి భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూంటాను స్వరాట్ మాస్టారు గారూ 👌👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏🙏💐💐😊😊
మీ అభిమానానికి ధన్యవాదాలు.
బలే ఉన్నాయి విశేషాలు అన్నీ, అప్పటి పరిస్థితులు. కళ్ళకు కట్టినట్లు చెప్పారు. చాలా ధన్యవాదాలు sir మీకు.🙏🙏 హృషీకేష్
Post a Comment