visitors

Friday, October 2, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పంధొమ్మిదవ భాగం

02.10.20 - శుక్రవారం భాగం - 19*:
పధ్ధెనిమిదవ భాగం ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

అక్టోబర్ 02 - మన జాతిపిత మహాత్మాగాంధీజీ జయంతి 

"భలే తాత మన బాపూజీ
బాలల తాత బాపూజీ"

అనే పాట ఊరంతా ఎక్కడ చూసినా వినిపించేది. మా స్కూల్లో ప్రార్ధనా సమయంలో పిల్లలచేత పాడించేవారు. వారితో నేనూ గళం కలిపేవాడిని. గాంధీగారి అహింసావాదం, పరమత సహనం, హరిజనోధ్ధరణ, సర్వమానవ సమానత్వం వంటి సిధ్ధాంతాలతో స్వరాజ్య పోరాటం సాగింది. 1947 లో మనకు స్వాతంత్ర్య మైతే వచ్చింది. దేశంకోసం గాంధీగారు చేసిన త్యాగం, సిధ్ధాంతాలు ఆయనను బలి తీసుకున్నాయి. కులం, మతం, జాతి, భాషాతత్త్వాలకు ఎవరూ అతీతులు కారని ఆనాటినుండి నేటి వరకు రాజకీయ ప్రముఖులు మొదలు పూరిగుడిసెల్లోని సామాన్య మనిషి వరకూ నిరూపిస్తూనే వున్నారు. గాంధీగారి సిధ్ధాంతాలను అందరూ గౌరవించారు, ఆదరించారు. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి అవి పుస్తకాలకే పరిమితమై పోతున్నాయి. ఈలాటి ఆదర్శవాదులెందరో మా ఊళ్ళోనూ వుండేవారు. వారితో విభేదించే సనాతనాచార పరాయణులూ ఎక్కువగానే వుండేవారు. బొబ్బిలిలోని మా ఇంటి పరిస్థితి అలాగే వుండేది. 

మా అమ్మమ్మగారు, దొడ్డమ్మగారు, తాతగార్లకు పాతకాలపు ఆచార వ్యవహారాలన్నీ వుండేవి. మడి, నిత్య పూజా పునస్కారాలు, ఆహారవిహారాదులలో నియమనిష్టలు, ఆధ్యాత్మిక చింతన, సత్సంగ భజన కార్యక్రమాలతో ఒక నియమావళికి అలవాటుపడిన కుటుంబం. ఆనాడు, అక్కడి అగ్రహారీకులంతా చాలావరకు ఈవిధమైన జీవనవిధానంతోనే వుండేవారు. నాకు జ్ఞానంరాక ముందు కూడా నేను వారితో గడిపినా అప్పుడు ఈ విషయాలేవీ తెలియలేదు. కొంచెం ఆలోచన అనేది ఏర్పడ్డాక అనేక సందేహాలు , తెలిసీ తెలియని సందిగ్దత. నాకోసం వారు తమ అలవాట్లను సవరించుకున్నారు. వారు తమ ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి అనే పదార్థాలు అసలు చేర్చుకునేవారు కాదు. పగటిపూట దేవతార్చన వుంటుంది. అందుకని నాకోసం రాత్రిపూట వేరేగా ఇంట్లోనే మరొక స్థలంలో ఉల్లిపాయలతో చేర్చిన  పులుసు, కూరలు, పచ్చళ్ళంటూ చేసిపెట్టేవారు. నిజానికి వారు అలా చేయకపోయినా అడిగేవారులేరు. కానీ, తమ ఆచార వ్యవహారాలవల్ల  నేను ఏమాత్రం ఇబ్బందిపడకూడదనే వారి సద్భావనకు నేనెప్పుడూ వినమ్రుడనై వుంటాను. నాలో ఏవైనా కొన్ని మంచి అలవాట్లున్నాయంటే అవి నాకు బొబ్బిలి ఇంటి వాతావరణం వలన వచ్చినవే. కానీ , నేనెప్పటికీ పరిపూర్ణ సనాతనాపరుడిని కాలేకపోయాను. అందుకు వర్తమానకాల యాంత్రిక పరిస్థితులకు తలయొగ్గక తప్పకపోవడమే కారణం. 

మనోపరిపక్వత లేని, తెలిసీ తెలియని వయసులో ఆ ఇంటి వ్యవహారాలు కొన్ని వింతగానూ, వినోదంగానూ తోచేవి. మా ఇంటిలో వంటకు కట్టెలను, బొగ్గులను ఉపయోగించేవారు. వాటిని బొబ్బిలికి చుట్టుపక్కల అటవీప్రాంతంలోవుండే గిరిజనులు వాటిని మోపులుగా కట్టి కావిళ్ళలో వేసుకొని బొబ్బిలి బజార్లలో పెట్టి అమ్మేవారు. మ తాతగారు బజారుకెళ్ళినప్పుడు వాటి నాణ్యం చూసి కొనుగోలు చేసేవారు. ఆ కట్టెలమ్మేవాడే వాటిని తీసుకువచ్చి ఇంటి మధ్య వాకిట్లో పడేసి  డబ్బులకోసం బయట నిలబడేవాడు. వెనకాలే మా తాతగారు ఇంట్లో పండని కూరగాయలను బజార్లో కొనుక్కొని వచ్చేవారు. అప్పట్లో ఒక మోపు కట్టెలు అర్ధరూపాయి, ముచ్చౌక (అంటే ముప్పావలా, అంటే మూడు పావలాలు. పావలా అంటే రూపాయిలో నాలగవ భాగం). ఆనాడు తొంభైతొమ్మిది శాతం గిరిజనులు నిరక్షరాస్యులు. వారు మాట్లాడే భాష నాకు అర్ధమయేదికాదు. కోయభాషో, సవరభాషో అయ్యుండేది. కట్టెల ఖరీదు అర్ధరూపాయి అంటే అర్ధరూపాయే. వాడికి రూపాయి ఇచ్చి చిల్లర ఇవ్వమంటే ఆ లెఖ్ఖ వాడికి తెలియదు. వాడు ముచ్చౌక అంటే ఖచ్చితంగా మూడు పావలా బిళ్ళలు లెఖ్ఖపెట్టి ఇవ్వాలి. వేరే నాణేలు ఏవి ఇచ్చినా పుచ్చుకునేవారు కాదు. ఇందుకోసమే, మా తాతగారు అణాలు, బేడలు (రెండణాలు), పావలాలు, అర్ధలు విడివిడిగా సంచుల్లో మూటకట్టి వుంచేవారు. ఆయన బ్యాంక్ ఉద్యోగి  కావడం వలన నాణేలు సమృధ్ధిగానే దొరికేవి.  అడిగిన మూడు పావలాలు చేతిలో పడగానే భుజంమీది తువ్వాలు తలకు చుట్టుకొని ఆనందంగా వెళ్ళిపోయేవాడు. వాడు అడిగిన దానికి మారుగా రూపాయి ఇచ్చి చిల్లర ఇవ్వమంటే వాడినేదో మోసం చేస్తున్నామనే భావన వాడిలో కనిపించేది. ఆ తరువాత, మా అమ్మమ్మగారు వాటిమీద నీళ్ళను ప్రక్షాళన చేసి అవి బాగా ఎండిన తరువాత వాటిని తీసుకుపోయి వంటింట్లో భద్రపరిచేది. ఆ కట్టెల మీద, బొగ్గుల మీద అలా ఎందుకు నీళ్ళు జల్లేవారో నాకు చాలా రోజులవరకు తెలియరాలేదు.

మా పక్కింటి రాజుగారి కుటుంబం క్షత్రియులు. ఆ ఇంటి కుర్రాడు గోపితో మంచి స్నేహం. ఇద్దరం కలిసే తిరిగేవాళ్ళం. మా వీధిలో వుండడం మూలంగా వాళ్ళు శాకాహారులుగానే ఉండేవారు. పక్క పక్క ఇళ్ళు కావడం వలన వాళ్ళింటికి వెళ్ళడానికి ఏ అభ్యంతరం ఉండేదికాదు. ఒకసారి వాళ్ళింటి వెళ్ళాను గోపీ కోసం. అతను మధ్య వాకిట్లో ఎండబెడుతున్న గుమ్మడి ఒడియాలకు కాపలాగా కూర్చొని ఉన్నాడు. ఉన్నవాడు సవ్యంగా ఉండకుండా ఓ రెండు ఒడియాలు చేతిలో పెట్టి తినమని తనూ ఒకటి నోట్లో వేసుకున్నాడు. ఎండుతున్న ఒడియాలు రుచిగానే వుంటాయి. మేము ఈ ఒడియాలను తినడం వాళ్ళమ్మగారు చూసి 'బాబుకెందుకు ఇచ్చావు? అలా తినమని చెప్పకూడదం'టూ కొడుకును  గట్టిగా కసిరింది. ఇద్దరమూ చిన్నవాళ్ళమే. ఇద్దరం బిక్కమొహాలేసుకొని బయటకు వచ్చేశాము. అది అక్కడితో ఆగలేదు. ఆ లలితమ్మగారు ఈ విషయాన్ని మా దొడ్డమ్మగారికో, అమ్మమ్మగారికో చెప్పింది. వాళ్ళు నన్నేమీ తిట్టలేదు, కొట్టలేదు. నేను కట్టుకున్న బట్టలిప్పించి నూతి దగ్గరకు తీసుకువెళ్ళి రెండు చేదలతో (బొక్కెన లేదా బకెట్) తలారా స్నానం చేయించి వేరే బట్టలు కట్టబెట్టారు. నాకేమీ అర్ధంకాలేదు. మా అమ్మమ్మగారి దగ్గరున్న చనువుతో కారణం అడిగితే, చాలా సౌమ్యంగా అలా ఇతరుల ఇళ్ళలో ఏవిచ్చినా తినకూడదని, తప్పని,  అది మన ఆచారం కాదని, వాళ్ళు వేరే మనం వేరే అనేది. వేరే అంటే ఏమిటని రెట్టించి అడిగే వయసుకాదు, ధైర్యమూ లేదు. ఆహా!అనుకునేవాడినంతే. ఈ వేర్లకు మూలాలెప్పుడు ప్రారంభమయేయి? వేదకాలంలో ఈ తేడాలుండేవా? ఆ వాంగ్మయాన్ని క్షుణ్ణంగా అర్ధం చేసుకున్నవారి వ్యాఖ్యలు వింటే కొంత అర్ధమై, కొంత అర్ధంకానట్లుగానే సందిగ్దావస్థలోనే కాలం గడిచిపోయింది. ఏది సదాచారం? ఏది అనాచారం? ఇంతవరకూ  నా బుద్ధికెక్కలేదు.
పామరుడిగానే మిగిలిపోయాను. మావాళ్ళకంటే  మహా ఆచారపరాయణులైన వయోవృధ్ధులు బొబ్బిలిలో చాలామందే వుండేవారు. వారికి ఎప్పుడూ బయటనుండి వచ్చేవారితో గొడవలు వచ్చేవి. తమ మడికి భంగం ఏర్పడిందని వాపోయేవారు. అయితే ఆనాటి సామాజిక స్థితిగతులను బట్టి, ఆచార వ్యవహారాదులను బట్టి ఎవరికి వారే సర్దుకుపోయేవారు. అయితే ఆనాటి పరిణామాలు ఇప్పుడు తీవ్రరూపం ధరించి వాటి దుష్ఫలితాలను కొన్ని వర్గాలవారు అనుభవిస్తున్నారు. మంచి తెలివితేటలు , ప్రజ్ఞాపాటవాలు కలిగివుండీ కూడా కులం, జాతి, మతం ప్రాతిపదికన తగిన అవకాశాలు కోల్పోయి తెరమరుగైపోతున్నారు. ఈ రకమైన స్థితి దేశ పురోభివృద్ధికి ఏమాత్రం దోహదపడదు.

బొబ్బిలి చాలా పాత వూరు. గ్రామానికి పెద్దది, పట్టణానికి చిన్నది అనేట్లు ఉండేది. 1950ల నాటికి ఆ ఊరి జనాభా ఇరవైవేల లోపే. బొబ్బిలి రాజ వంశీయులు వెలమ దొరలు. ఒకప్పుడు బొబ్బిలి సంస్థానం కవి, గాయక, పండితులకు నిలయమై వుండేది. బొబ్బిలి రాజులు విద్యాభివృధ్ధికి చాలానే తోడ్పడ్డారు. వారిచే నిర్మించబడిన హైస్కూల్, గర్ల్స్ స్కూల్ చాలా ప్రతిష్టాత్మకంగా వుండేది. శ్రీకాకుళం జిల్లాలోని స్కూళ్ళన్నింటికి తలమానికం బొబ్బిలి హైస్కూల్. చదువులో, ఆటల్లో బొబ్బిలి హైస్కూల్ కు ఒక ప్రత్యేక స్థానం వుండేది. బొబ్బిలి హైస్కూలులో చదువుకున్నవారెందరో కేంద్ర రాజధానిలో ఉన్నతపదవులు అలంకరించారు. 

బొబ్బిలి రాజుల ఇలవేల్పు  వేణుగోపాలుడు. ఆనాటికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడా లేనంత పెద్ద దేవాలయాన్ని కట్టించి పోషించారు. ఆ ఆలయంలో వున్నంత పెద్ద 'బేడా' (ప్రదక్షిణా స్థలం) మరే కోవెలకు లేదనేవారు. గోకులాష్టమి సందర్భంగా వేణుగోపాలస్వామికి జరిగే డోలోత్సవం అత్యంత ప్రముఖమైనది. ఆ ఉత్సవానికి బయట వూళ్ళనుండి వేలాది ప్రజలు తరలి వచ్చేవారు. వేణుగోపాలస్వామి ఆలయం పక్కనే అతి పెద్ద రావిచెట్టువుండేది. దానినిండా గబ్బిలాలు వేళ్ళాడుతుండేవి. వాటిమూలంగా ఆలయ పరిసరాలు దుర్గంధంతో వుండి కోవెలకు వెళ్ళేవారికి ఇబ్బందికరంగా వుండేది. సాయం సమయాలలో, గర్భగుడి ప్రాంతంలో తప్ప, ఆలయంలో దీపాల వెలుగు ఎక్కువగా వుండేది కాదు. అయినా, సాయంత్ర సమయాలలో భక్తుల రాక ఎక్కువగానే వుండేది. భక్తులు తమ తమ అభిష్టాలు నెరవేరడానికి వేణుగోపాలస్వామి వారికి ప్రత్యేక 'భోగం' పూజలు చేయించేవారు. అలాటి సందర్భాలలో ఆలయంలో పంచిపెట్టే 'లస్కోరా' వుండలు చాలా ప్రశస్థం. వాటిని స్వఛ్ఛమైన నేతితో, సుగంధ ద్రవ్యాలతో, చెక్కెర, కొబ్బరి తో తయారు చేసేవారు. నేను బొబ్బిలిలో వున్నంతకాలం క్రమం తప్పకుండా వేణుగోపాలస్వామి కోవెలకు వెళ్ళేవాడిని. అక్కడి బేడాలో ప్రదిక్షణలు చేస్తూ వచ్చీరాని దేవుడి పాటలు, పద్యాలు గాఠిగా చదివేవాళ్ళం. మేము వెళ్ళే సమయానికి భక్తులుండేవారు కాదు. అందువలన మా సంగీతం నిరాటంకంగా కొనసాగేది. అదంతా భక్తి అని చెప్పను. ఒక అలవాటు అంతే. మారుతున్న కాలాన్నిబట్టి నాతో కోవెలకు వెళ్ళే స్నేహితులు మారేవారు. మొదట్లో నేను, గోపి, భాస్కరం వెళ్ళేవాళ్ళం.  

1959లో  రెండవసారి  బొబ్బిలి చేరేనాటికి నా స్నేహ బృందం కొంత మారింది. మా ఇంటినుండి కోవెలకు వెళ్ళడానికి శ్రీరామా టాకీస్ ను,  రాజావారి గుర్రపుశాలను దాటుకొని వెళ్ళాలి. ప్రతీరోజూ సాయంత్రం ఐదుంముప్పావు సమయానికి బయల్దేరి మెల్లగా కబుర్లు చెప్పుకుంటూ ఆరు గంటలకు శ్రీరామా టాకీస్ కు చేరుకునేవాళ్ళం. సరిగ్గా ఆరు గంటలకు లౌడ్ స్పీకర్ లో నుండి ఘంటసాలవారి 'నమో వెంకటేశా', ' ఏడు కొండలస్వామీ ఎక్కడున్నావయ్యా' పాటలు వేసేవారు.

నమో వేంకటేశా పాట
ఏడుకొండల సామీ పాట

 ఆనాడు ఆంధ్రదేశంలోని ప్రతీ సినీమా హాలులో ఆటలు ఈ రెండు పాటలతోనే ప్రారంభమయేవి. ఊళ్ళో ఉన్న రెండు మూడు సినీమా హాల్స్ వాళ్ళు ముందుగా ఘంటసాలవారి ఈ రెండు పాటలను ఒకేసారి వేసేవారు. స్పీకర్ల లోనుండి  వచ్చేఈ పాటలతో బొబ్బిలి నలుమూలలా ప్రతిధ్వనించేది. ఈ పాటలు వినడం కోసమే రోజూ శ్రీ రామా టాకీస్ కు వెళ్ళేవాళ్ళం. ఆ రెండు పాటల తర్వాత, ఆ నాడు ఆడుతున్న సినీమాలో పాటలు వేయడం మొదలెట్టి టిక్కెట్ కౌంటర్లు తెరిచేవారు. ఈలోగా రాబోయే సినీమా పోస్టర్లు ఏవైనా వుంటే వాటిని చూసి మేము మెల్లగా కోవెల దారి పట్టేవాళ్ళం.

బొబ్బిలి దివాణానికి ఎదురుగా టౌన్ హాల్ వుండేది. విశాలమైన హాలు.  బొబ్బిలి సంస్థానం వారిదే. గోడలకు ఎంతోమంది ప్రముఖుల చిత్రపటాలుండేవి. తరచూ ఆధ్యాత్మిక ప్రసంగాలు, భజన కార్యక్రమాలు జరిగేవి. బొబ్బిలి రాచ కుటుంబీకుల ఆధ్యాత్మిక గురువుగారి ప్రవచనాలు కూడా అక్కడే నిర్వహించబడేవి. ఆయన పేరు శ్రీ శ్రీ సీతారామ యతీంద్రులు. 

                      
శ్రీ శ్రీ సీతారామ యతీంద్రులు

ఎక్కడో సుదూర ప్రాంతాలనుండి వచ్చి బొబ్బిలిలో కొన్నాళ్ళుండేవారు. ఆయన ప్రసంగాలు వినడానికి మా ఇంట్లోవారంతా విధిగా వెళ్ళేవారు.  సాయంత్రం ఏ ఏడు గంటలకో ప్రారంభమైన ఈ కార్యక్రమం దివాణంలో రాత్రి పదకొండవ గంట కొట్టేవరకు కొనసాగేది. ఆ తర్వాత, అందరూ యతీంద్రులవారి ఉపన్యాసంలోని విశేషాలను దారమ్మటే ముచ్చటించుకుంటూ ఇళ్ళకు చేరుకునేవారు. రాత్రి పూట వెన్నెల వెలుగులో  అలా నడిచి వెడుతూంటే ఎంతో బాగుండేది. బొబ్బిలి  ముందునుండి సాంస్కృతిక పరంగా చాలా అభివృద్ధి చెందింది. పండగలు, ఉత్సవాలు వస్తే ఊరంతా  సంగీత కచేరీలని, పౌరాణిక నాటకాలని, హరికధలని, బుర్రకధలని, సత్కాలక్షేపాలు  జరిగేవి. ఈనాటి అసభ్య రికార్డింగ్ డాన్సుల సంస్కృతిని మా చిన్నతనంలో ఎవరూ ఊహించనుకూడా ఊహించలేదు. బొబ్బిలిలో భక్తి సంగీత కార్యక్రమాలకు ముఖ్య కేంద్రం తాతావారి ఇల్లు. వారింట్లో వారంతా సంగీతాభిమానులు, సాహితీ ప్రియులు. కీ.శే. తాతా సూర్యనారాయణగారు బొబ్బిలి కోటలని పిల్లలకు చదువునేర్పే గురువుగారు. నాకు ఊహ తెలిసేప్పటికే ఆయన లేరు. ఆయన భార్య తాతా అన్నపూర్ణమ్మగారు శ్రీరాజరాజేశ్వరి దేవి ఉపాసకురాలు.వారి పూజాగృహంలో నిలువెత్తు రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం చాలా ఆకర్షణీయంగా జీవం వుట్టిపడుతూవుండేది. తాతా అన్నపూర్ణమ్మగారి అన్నదమ్ములు మండపాక వారు మంచి కవులు, పండితులుగా వుండేవారు. తాతా అన్నపూర్ణమ్మగారు చాలా నియమనిష్టలతో పూజలు, భజన సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారు. గణపతీ నవరాత్రుళ్ళు, శారదా నవరాత్రులు, శివరాత్రి ఉత్సవాలు వారింట్లోనే చాలా బాగా జరిపేవారు. ఆవిడ స్వయంగా  రాసి, వరసలు కట్టిన భక్తి గీతాలతోనే వారానికి మూడురోజులు శుక్ర, శని, ఆదివారాలలో సాయంత్రం పూట భజన కార్యక్రమాలు జరిగేవి. ఆవిడకు నలుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. పెద్దకొడుకు రామారావు సుగర్ ఫ్యాక్టరీ లో ఉద్యోగి. వారి రెండో అమ్మాయి ఉమాదేవి. మా అమ్మగారు, ఆవిడ కలసి వీణ ప్రాక్టీస్ చేసేవారట. సంగీతంలో మంచి ప్రవేశం వుంది. ఆ ఉమాదేవి వీణ కార్యక్రమాలు ఆలిండియా రేడియో ఢిల్లీ నుండి ప్రసారమయేవి. మా దొడ్డమ్మగారు చెళ్ళపిళ్ళ వరహాలమ్మగారు, అన్నపూర్ణమ్మగారి ప్రధమ శిష్యురాలు. హార్మోనియం వాయిస్తూ ఆ భజనగీతాలన్నింటిని చాలా శ్రావ్యంగా భక్తితత్పరతతో పాడేవారు. అగ్రహారపు వీధుల్లోని గృహిణులంతా విధిగా ఈ భజన కార్యక్రమాలలో పాల్గొనేవారు. భజన కార్యక్రమానంతరం ఇచ్చే ప్రసాదాల కోసం పిల్లలందరం విధిగా అక్కడికి చేరేవాళ్ళం. వారింట్లో నాకు మరో ఆకర్షణ జింక చర్మాలు. వాటిమీదే ఆవిడ కూర్చోవడం, పడుక్కోవడం జరిగేది. మరొకటి వారింట్లోని బేబీ స్వింగింగ్ ఛైర్. తాతావారింట్లోని పిల్లలంతా  వయసులో నాకంటే చాలా చాలా  పెద్దవారు. అందుచేత, అప్పట్లో, వాళ్ళతో నాకు పరిచయం పెరగలేదు.

నాకు సాంస్కృతిక కార్యక్రమాలపట్ల అభిరుచి, ఆసక్తి పెరగడానికి కారణం తాతావారింటి భజన కార్యక్రమాలే.  అవే నాకు స్ఫూర్తి. నాకు సంగీతంలో ప్రవేశం లేకపోయినా శ్రావ్యమైన సంగీతమంటే మక్కువ ఎక్కువే. అన్నపూర్ణమ్మగారి అక్కగారు దొడ్లా అమ్మాయమ్మగారు. చాలా వృధ్ధురాలు. ఆవిడ కూడా రాజరాజేశ్వరి ఉపాసకురాలే. వారింట్లో కూడా వారం వారం భజనలు జరిగేవి. మా దొడ్డమ్మగారు, అమ్మమ్మగారు అక్కడ కూడా పాడేవారు. వారిద్దరూ వారానికి రెండు మూడురోజులు ఉపవాసాలుండేవారు. ఉపవాసమంటే ఇప్పటిలా టిఫిన్ల ఉపవాసం కాదు. కటిక ఉపవాసం. ఒంటిపూట భోజనం. ఏకాదశి వంటి పర్వదినాలైతే రోజంతా ఉపవాసమే.

బొబ్బిలిలో వున్నంత కాలం చాలా హుషారు గా జరుపుకున్న పండగ దీపావళి. దీపావళి బాణసంచా అంతా మా తాతగారే స్వయంగా చేసేవారు. అయితే ఎప్పుడు, ఎక్కడ చేసేవారో తెలియనిచ్చేవారు కాదు. దీపావళీ రోజునే ఒక్కొక్కటి బయటపెట్టేవారు. అందులో మతాబాలు, చిచ్చుబుడ్లు, తాటాకు  చక్రాలు ఎక్కువుండేవి. సింహాలుబాబు(మా తాతగారు)గారి తాటాకు చక్రాలు మా వాడలో చాలా ప్రసిధ్ధి. వాటిని ముట్టించగానే మొదట భూచక్రంలా తిరుగుతూ  ఓ ముఫ్ఫై అడుగులు ఎత్తుకు ఎగిరేది. ఆయన చేసే చిచ్చుబుడ్లు ప్రత్యేకమైనవి. మందార కుంపీలని వాటి వెలుగు తెల్లగా కాకుండా ఎరుపు, పచ్చ, నీలం అని వివిధ వర్ణాలలో వుండేవి. ఆ దీపావళి మందుగుండు సామగ్రి తయారీకి కావలసిన వస్తువులు, పాళ్ళు అన్నీ నీట్ గా ఒక నోట్ బుక్ లో రాసివుంచారు. రాత్రి పూట అందరు పడుక్కునే సమయంలో మా తాతగారు ఈ బాణ సంచా తయారు చేసేవారు. తారాజువ్వలు, చిచింద్రీలు ప్రమాదకరమని వాటిని చేసేవారు కాదు. నా పోరుపడలేక తక్కువ ప్రమాదకరమైన చిచింద్రీలు చేసుకుందికి అనుమతించేవారు. భాస్కరం, గోపీ, నేనూ కలసి సిండికేట్ లో చిచింద్రీలు కట్టేవాళ్ళం. అందుకు కావలసిన పేకేజీ డొక్కులు, లేదా, జిల్లేడు మానులను సేకరించి వాటిని బాగ ఎండబెట్టి వాటితో బొగ్గు, చిన్న బజార్ నుండి సురేకారం, గంధకం తీసుకువచ్చి వాటిని విడివిడిగా కల్వం లో వేసి నూరి, వాటిని వస్త్రకాళితం పట్టి వాటిని 3-1/2 (సురేకారం),1/2(గంధకం), 1( బొగ్గు) పాళ్ళలో ఈ పొడుల మిశ్రమాన్ని చిచింద్రీ గొట్టాలలో  దట్టించి కూరేవాళ్ళము. గొట్టలు తయారికి వెంటనే మండిపోని దళసరి కాగితాలను ఉపయోగించేవారు. ఈ మందుగుండును తూకం వేయడానికి పెద్ద రూపాయి బిళ్ళనే ఉపయోగించేవాళ్ళం. చిచింద్రీ ఎంత గట్టిగా దట్టించి,ఎంత గట్టిగా మూత మూస్తామో అన్నదాని మీదే చిచింద్రీ performance వుంటుంది. మా పూర్వీకులు కొందరు ఆయుర్వేద వైద్యంతో సంబంధమున్నవారు కావడంచేత ఇళ్ళలో పాతకాలపు కల్వాలు వివిధ సైజుల్లో వుండేవి.

దీపావళి బాణసంచా కాల్చడానికి ముందు చాలా తతంగం వుండేది. ముందుగా పూరిళ్ళవాళ్ళందరూ అగ్ని ప్రమాదాలనుండి కాపాడుకోవడం కోసం తమ ఇంటి కప్పులను పూర్తిగా నీళ్ళతో తడిపేవారు. తరువాత, ఇంటి గుమ్మాలమీద ప్రమిద దీపాలు వెలిగించేవారు. తర్వాత, ఆముదం కొమ్మల ఆకులకు నూనెగుడ్డలు కట్టి వాటిని వెలిగించి ఆ మంట అంతా ఆరేవరకూ 'దిబ్బు దిబ్బు దీపావళీ మళ్ళీ వచ్చే నాగుల చవితి' అంటూ ఆ ఆముదం కొమ్మలను నేలమీద బాదించేవారు. అవి ఆరిపోయిన తరువాత, మతాబులు, కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, విష్ణు చక్రాలు, అగ్గిపెట్టెలు, గోడ పటాసులు, సీమ టపాకాయలు, తాటాకు పటాసులు అంటూ ఎవరి స్తోమతును బట్టి వారు బాణా సంచా వెలిగించేవారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ చిన్నపిల్లలకు, ముసిలాళ్ళకు మాత్రమే. యువకుల తారాజువ్వల పరాక్రమం తొమ్మిది తర్వాత ప్రారంభమయేది. అల్లరికి ఆకాశంలో వదలడానికి బదులు నేలమీద ఒదిలేవారు. అలాటివాటితో చిన్న చిన్న తగాదాలోచ్చేవి. అయితే విజయనగరం లంకవీధి  కొబ్బరి బొండాలు, వెలక్కాయలు వంటి వాటితో పోరాటాలు లాటివి బొబ్బిలి దీపావళి పండగలలో నేను వినలేదు. అయితే ఎక్కడో ఒకటి రెండు చోట్ల తారాజువ్వలు పడి ఇళ్ళో, గడ్డివాములో తగలబడడం లాటి వార్తలు దీపావళి మర్నాడు వినవచ్చేవి. 'అయ్యో పాపం' అనుకునేవారు. అంతే. షరా మామూలే.

బొబ్బిలిలో నాకు మహదానందం కలిగించే మరో ముఖ్యమైన పండగ శివరాత్రి. ఆ రోజున శివాలయం ఉదయం నుండి మర్నాటివరకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలతో ఆలయమంతా కళకట్టేది. తాతావారింట, దొడ్లావారింట శివరాత్రి భజనలతో జాగరణ చేసేవారు. దానికి విధిగా మా అమ్మమ్మగారు, దొడ్డమ్మగారు వెళ్ళేవారు.  మేము పిల్లలం కూడా రాత్రంతా జాగరం చేసేవాళ్ళం. అయితే భజన కార్యక్రమాలతో కాదు. మా జాగరణ పధ్ధతి వేరే. సాయంత్రం వరకూ  తాతావారింట భజనలలో పాల్గొని మెల్లగా అక్కడ నుండి జారుకొని ఆంజనేయస్వామి గుడి రావిచెట్టుక్రింద సమావేశమై ఊళ్ళో ఏ హాలులో ఏ సినీమా ఆడుతున్నదో వాల్ పోస్టర్లమీద చూసేవాళ్ళం. శివరాత్రి నాడు ఐదాటలు ఆడేవారు. అప్పట్లో బొబ్బిలిలో వుండే ఏకైక పెర్మనెంట్ సినీమా హాలు రాజావారి శ్రీరామా టాకీస్, ఏనుగుల వీధిలో మామిడివారి టూరింగ్ టాకీస్ (ఈ టూరింగ్ టాకీస్ ప్రొప్రైటర్లు ప్రముఖ సినీమా కవి తాపీ ధర్మారావు నాయుడిగారి బంధువులని అనేవారు). చాకలి వీధిలో ఒక టూరింగ్ టాకీస్, చెలికాని వెంకట్రావు గారి రైస్ మిల్ వెనకవేపు ఎదురుగా శర్మ టూరింగ్ టాకీస్ ఉండేవి. ఈ హాల్స్ అన్నింటిలో 'శివరాత్రి జాగరణ చేసి తరించండి' అని బోర్డ్ లు పెట్టేవారు. మేము తూ.చా. తప్పక పాటించేవాళ్ళం. ఆరోజుకోసమే వెతికి వెతికి ఎక్కడ లేని పాత డొక్కు పౌరాణికం సినీమాలు 1940ల నాటివి తీసుకువచ్చి వేసేవారు. భక్త సిరియాళ, భక్త మార్కండేయ, అంటూ ఏవో వేసేవారు. మేమూ చాలా భక్తిగా ముందు చాకలి వీధి టూరింగ్ టాకీస్ సినీమాకు వెళ్ళేవాళ్ళం. టూరింగ్ టాకీస్ లన్నింటిలో సింగిల్ ప్రొజెక్టర్లే ఉంటాయి. అందుచేత ప్రతీ అరగంటకు ఒక ఇంటర్వెల్. ఒక్కొక్క సినీమాకు కనీసం నాలుగు ఇంటర్వెల్స్. ఒక  బాక్స్ లో రీల్ తీసి ప్రొజెక్టర్లో లోడ్ చేసి సినీమా వేసేలోపల సోడాలు, టీలు, చేగోడీలు,జంతికలు, చుట్ట, బీడీ, సిగరెట్ల అమ్మకాలతో హాలు హాలంతా గగ్గోలుగా వుండేది. టూరింగ్ టాకీస్ లో నేల టిక్కెట్ పావలా, బెంచ్ ఆరణాలు, కుర్చీ అర్ధరూపాయి. ఆఖరుది ముప్పావలా. నేల టిక్కెట్టుకే గిరాకీ. హాయిగా అందరూ ఇసక నేలమీద కాళ్ళుజాపుకొని కూర్చొని సినీమాను ఎంజాయ్ చేసేవారు. ఇవే బెంచ్, కుర్చీ అంటే ఎదుటివాడి తలలు అడ్డం, బెంచ్ సందుల్లోంచి వచ్చే నల్లుల బెడద కన్నా నేలే నయం. కాకపోతే వెనకవాడి చుట్టో, సిగరెట్టో, నోట్లోని కిళ్ళీయో మనమీద పడకుండా చూసుకోవాలంతే. అయితే అదంత వీజీ కాదు. అలాటి మిసైల్స్ వచ్చి పడడం దెబ్బలాటలు మొదలై తన్నుకోవడాలు, మరోసారి సినీమాలు ఆగిపోయి లైట్లేసి జనాలను కంట్రోల్ చేయడంతో మళ్ళీ సినీమా . అక్కడ అయిపోయాక సెకెండ్ షో మరో హాల్ లో. లేట్ నైట్ షో ఏ రెండింటికో రెండున్నరకో శ్రీరామా టాకీస్ లో చూసేప్పటికి తెల్లారిపోయేది. శివరాత్రి జాగరణ చాలా భక్తితో, విజయవంతంగా ముగిసిపోయేది. అక్కడనుండి మళ్ళా తాతావారింటి భజన కార్యక్రమాలకు హాజర్ వేయించుకునేవాళ్ళం.    రాత్రి వరకు మేల్కొనేవుండాలని రాత్రి తొమ్మిదిలోపల పడుక్కుంటే శివరాత్రి జాగరణ ఫలితం వుండదని చెప్పేవారు. అందుకని నిద్ర రాకుండా వుండేందుకు మధ్యాహ్నం మరో మ్యాట్నీ షో. దానితో శివరాత్రి ముగిసేది. శివరాత్రి 'జాగరణ'కి కావలసిన డబ్బులు మా తాతగారే ఉదారంగా ఇచ్చేవారు. జాగరణ ఖర్చు రెండు రూపాయి కాసులు. ఓ నాలుగు సినీమాలు కొన్ని వేయించిన వేరుశనగకాయలు. ఒక అణా పెడితే  రెండు దోసెళ్ళ వేరుశనగకాయలు వచ్చేవి. వాటిని నేను, గోపి అనే గోపాల్, బాచీ అనే భాస్కరం సమానంగా పంచుకొని సినీమాలన్నింటిని చూసేవాళ్ళం. బొబ్బిలిలో ఇలాటి శివరాత్రి జాగరణలు చాలా సంవత్సరాలు చేశాను.

బొబ్బిలి బ్రాంచ్ స్కూల్ లో నా చదువు అసమాన్యంగా వెలిగిపోలేదు. సాదాసీదాగానే జరిగింది.  మా తాతగారు ఇంటి దగ్గర కలంపట్టి వ్రాయడం నేర్పించారు. ఇంగ్లీష్ నాలుగు బడులు చేతివ్రాత బాగుండడానికి కాపీయింగ్ చేయించేవారు. ఇంట్లో ఒక కర్ర డెస్క్ వుండేది. దాని ముందు కూర్చొని ఇంక్ బాటిల్ లో కలం ముంచి ఇంగ్లీష్ కాపీలు వ్రాయించేవారు. అప్పట్లో  కేమిల్, సులేఖ, విల్సన్ ఇంక్ బాటిల్స్ ఎక్కువ వాడకంలో వుండేవి. ఇంగ్లీష్ సబ్జెక్ట్, వ్యాకరణం, తెలుగు వ్యాకరణం, లెక్కలు నన్ను మహా ఇబ్బంది పెట్టేవి. ఏడవ తరగతికి కావలసిన స్టాండర్డ్ నాకు లేదు. సమస్యంతా నాలోనే ఉండేది. సందేహాలను ఎలా అడగాలో, ఎవర్నడగాలో, అడిగితే ఏమనుకుంటారో. మొహమాటం. బిడియం. భయం.  ఏ ప్రశ్నకు ఏది సమాధానమో తెలిసేది కాదు. అన్నీ అనుమానాలే. అడిగితే ఈమాత్రం తెలియదా అని తిడతారేమో అని భయం!  ఎలా సెకెండ్ ఫారమ్ కు వచ్చావని పిల్లలు ఎగతాళి చేస్తారేమోనని సంకోచం. మాస్టర్లనే కాదు, సాటి విద్యార్ధుల దగ్గర కూడా అడిగే ధైర్యం లేకపోయేది. ఏదో మొత్తానికి భట్టీయం పట్టడం వల్లనో, ట్యూషన్ లో నూరిపోయడం వల్లనో బొబ్బిలి బ్రాంచ్ స్కూల్ లో సెకెండ్ ఫారమ్ హాఫ్ ఇయర్లీ పరీక్షలలో మంచి మార్కులతోనే గట్టెక్కాను. 

 ఈలోగా మళ్ళీ స్థలం మార్పిడి.  వేరే వూళ్ళో , వేరే వాతావరణం లో మరో రకమైన స్కూలులో నా చదువు.


ఇక్కడితో ఒకటవ అధ్యాయం సమాప్తం
    
రెండవ అధ్యాయం వచ్చేవారం
...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

10 comments:

Unknown said...

బొబ్బిలి అనుభవాలు, శివరాత్రి జాగరణలు బాగున్నాయి.🙏
హృషీకేష్🙏

P P Swarat said...

Thank you.

వడ్డాది గోపాలకృష్ణ మూర్తి said...

బొబ్బిలి, మీ చదువు, స్నేహితులు, మడి తడి భోజనాలు, సంప్రదాయం పద్ధతులు, దీపావళి, శివరాత్రి పండుగలు, బాణాసంచా, జాగరణలు, సినిమాలు ఇంకా పరీక్షల తతంగం అన్నీ కలిపి మమ్మల్ని మీతో త్రిప్పేసుకున్నారు. మాకు తిరిగి రాబుద్ధి ఉహు! మా చిన్నతనాలు ఇంచుమించు అవే! జస్ట్ ప్లేస్ చేంజ్!

P P Swarat said...

ధన్యవాదాలు. నమస్కారం.

ameerjan said...

ఆహా!
ఎంత ఆనందమో! బాల్యస్మృతులన్నీ గుర్తుకు వస్తూంటే! మీ బ్లాగ్ లో ఇచ్చిన బొబ్బిలి వివరాలన్నీ చాలవరకు నా బాల్యంలోనూ అనుభవించినవే! నా ఒకటవ తరగతి మేస్టారు ఓ బ్రహ్మచారి పిలక బ్రాహ్మణుడు కావడం వల్ల, నాకూ ఈ మడి ఆచార వ్యవహారాలవీ చూస్తూ వుండే వాణ్ణి...ఏమీ తెలీకపోయినా! అలాగే నా బాల్య స్నేహితులు బ్రాహ్మణ, వైశ్య వర్గాల వాళ్ళే కావడం.. ఈ వ్యవహారాలతో పరిచయముండేది.

అలాగే...టూరింగ్ టాకీసులో నేల క్లాసు వ్యవహారాలు, నాలుగు ఇంటర్వెల్స్, జాగర రాత్రి సినిమాలు, రూపాయి నాణేలు, బాణసంచా తయారీ, వాటిని పంచుకోవడం....ఇత్యాది చాల సహజంగా...వున్నది వున్నట్టు చెప్పడం మీ ప్రత్యేకత స్వరాట్ గారు!
ధన్యవాదాలు!!������

సంబటూరి వెంకట మహేష్ బాబు said...

మీ చిన్ననాటి స్మృతులను చదువుతూంటే 1970,80దశకాల నాటి మా బాల్య జ్ఞాపకాలు తడుముకున్న అనుభూతి కలిగింది.... మేమూ బ్రాహ్మణులమే కావడం వల్ల ఈ మడి ఆచారాలు, వాటి గురించిన సంశయాలు నాకు కూడా అనుభవమేనండీ... శివరాత్రి జాగారాల తంతు మీ లాగే సేమ్ టు సేమ్ 😊😊.... దీపావళి టపాకాయలు కొనిచ్చేవారు కానీ పొరబాటున కూడా తయారీ వైపు పోనిచ్చేవారు కాదు మా పెద్దలు... మీ బాల్య స్మృతుల అక్షరీకరణ పరమాద్భుతమ్ స్వరాట్ మాస్టారు గారూ.... మిక్కిలి ధన్యవాదాలు మరియు హృదయపూర్వక శుభాభినందనలు మీకు 👌👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

Patrayani Prasad said...

🙏🙏 శ్రీ అన్నయ్యకు నమస్కారములు🙏🙏, నీవు,నీ ,చిన్నప్పటి బొబ్బిలి విషయాలు వ్రాయగా, వీటిలో ఎన్నో విషయాలు, నాకు తెలియని విశేషాలు కూడా ఉన్నాయి. చాలా బాగా,ఏర్చి, కూర్చి, ఆలోచించి,వ్రాస్తున్నందుకు ఎంతైనా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ముఖ్యముగా దొడ్డమ్మ విషయాలు, ఈ టూరింగ్ సినిమా హాల్స్ పేర్లు తెలియవు. నేను బొబ్బిలి, వచ్చినపుడు వేణుగోపాల టూరింగ్ టాకీస్ అని ఒకటి ఉండేది. మిగిలిన వాటి వివరాలు నాకు పరిచయం లేదు. బొబ్బిలికి మరొక ప్రత్యేకత, గుర్రపు జట్కాల వివరాలుకూడా వస్తాయని అనుకొంటున్నాను. అప్పట్లో ఆఊళ్లో రిక్షాలు లేవుకదా! - రాబోయే అధ్యాయం కోసం చూస్తున్నాము. ధన్యవాదాలు.🙏🙏--- పట్రాయని ప్రసాద్, బెంగుళూరు, తేదీ:03-10-2020, శనివారం మధ్యాహ్నం:01:53pm. IST.

Patrayani Prasad said...

చాలా బాగా వ్రాస్తున్నారు . చాలా బాగుంది.

నాగరాజు కెవియస్ said...

మీ చిన్న నాటి స్మృతులు చదువుతుంటే మా బాల్యం గుర్తుకు వచ్చింది సర్. ఈ మడి, ఆచారాది వ్యవహారాలు మేమూ చిన్నతనంలోచ చూసాం.. కానీ..మీరన్నట్టు అది అర్ధం కాని వయసు

ప్రతి వారం ఎన్నో...ఎన్నెన్నో మధురం స్మృతులను మాతో పంచుకుంటున్న మీకు అనేకానేక ధన్యవాదాలు
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻🙏🏻


నాగరాజు కెవియస్
హైదరాబాద్

P P Swarat said...

ఈ వ్యాసాలు చదివి అభినందిస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.