visitors

Friday, November 13, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఆరవ భాగం

13.11.2020 - శుక్రవారం భాగం - 6*:
అధ్యాయం 2  భాగం 5 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్


బుద్ధి, మనసు పరస్పరం విరుద్ధం. బుద్ధి చెప్పినది మనసుకెక్కదు. మనసులోని మాట బుద్ధికెక్కదు.

ఈ ఉపోద్ఘాతం ఎందుకంటారా?! 

జీవనక్రమంలో నెం. 35, ఉస్మాన్ రోడ్ ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్ళడమా, పండుగ సీజన్ కనుక ఆఇంట్లో జరుపుకున్న పండుగ ముచ్చట్లను ముందుగానే  పంచుకోడమా? అంటే మనసు పండుగలవేపే మొగ్గుతోంది. 

నెం.35, ఉస్మాన్ రోడ్ దీపావళి గురించి ముచ్చటించే ముందు, దానికి ముందుగా వచ్చే దసరా నవరాత్రుల గురించి కూడా చెప్పవలసి వస్తుంది. 

బాబూ వాళ్ళమ్మగారు (ఘంటసాల సావిత్రమ్మగారు) దసరా నవరాత్రుల సందర్భంగా తొమ్మిదిరోజులపాటు బొమ్మలకొలువు చాలా గ్రాండ్ చేసేవారు. మేము ఆ ఇంటి ఔట్ హౌస్ లోకి వెళ్ళాక వరసగా నాలుగైదు సంవత్సరాలు బొమ్మల కొలువులు పెట్టిన గుర్తు. ఘంటసాలవారింటి హాలు చాలా విశాలమైనది. దక్షిణం వేపు గోడను ఆనుకొని ఐదు వరసల మెట్లమీద రంగురంగుల దేవతా విగ్రహాలను, పెద్దా, చిన్నా  రకరకాల బొమ్మలను అలంకరించేవారు. అలాగే, నేలమీద దట్టంగా ఇసకపోసి, చదునుచేసి ముందువేపు మెడ్రాస్ మౌంట్ రోడ్, కాసినో, గెయిటీ వంటి సినిమా హాల్స్ నమూనాలు, జి.ఎన్ చెట్టి రోడ్ లోని కొన్ని భవంతుల నమూనాలు, వీధి దీపాల స్థంభాలు, పార్కులలో చెట్లు, మొక్కలు, మినియేచర్ కుర్చీలు, బెంచీలు, వాటిమీద కూర్చుని ఉన్న మనుషులు, ప్లాస్టిక్ కార్లు, సైకిళ్ళు, సైకిల్ రిక్షాలు, రంగురంగుల సీసపు బడ్లు, తోరణాలు. వెనకవేపు పొలాలు, పల్లెటూళ్ళు, కొండపైన ఆలయాలు, అక్కడికి వెళ్ళడానికి రహదార్లు ఉండేవి. Concealed wiringతో series lighting వంటి వ్యవహారమంతా బాబూవాళ్ళ అమ్మగారు, పిన్నిగారి సలహాలు సూచనలమేరకు సుబ్బు ఏర్పాటుచేసేవారు. సుబ్బు అనబడే బి.సుబ్బారావు ఘంటసాలవారి జివిఎస్ ప్రొడక్షన్స్ లో ప్రొడక్షన్ మేనేజర్. ఘంటసాలవారి కుటుంబంలోని వ్యక్తిగా మెసిలేవారు. సావిత్రమ్మగారి అన్నగారి పేరు కూడా సుబ్బారావే. ఆయన అందరికీ సుబ్బారావు అన్నయ్య, పిల్లలకి మాఁవయ్య. ఈయన సుబ్బు. 

పొలాలను పండించడానికి ఒక వారగా ఏర్పాటు చేసిన మట్టిలో ఆవాలు, మెంతులు, ధనియాలు జల్లి వాటిమీద నీరు జల్లి వుంచితే రెండురోజుల్లో పంట పొలాలు తయారయేవి. అటకలమీదవుండే ఈ బొమ్మలను పెట్టెల్లోంచి దింపి వాటిని తుడవడంలో, కొలువులైపోయాక తిరిగి పెట్టెల్లో సద్దడంలో, పల్లెటూరు, పట్టణం మోడల్స్ తయారు చేయడానికి కావలసిన ఇసకను సేకరించడంలోనూ నా వయసుకు తగిన సాయం నేను చేసేవాడిని. మా ఇంటికి ఎదురుగా చాలా దగ్గరలోనే  సొమసుందరం స్ట్రీట్ లో పెద్ద కార్పరేషన్ గ్రౌండ్ వుంది. అక్కడ కబాడీ ఆడ్డానికి, ఉయ్యాళ్ళు ఊగే దగ్గర కావలసినంత ఇసక ఉండేది. ఆ ఇసకను తీసుకురావడానికి నేను, పెద్దబాబు (విజయకుమార్), తమ్ముడు కృష్ణ గోనె సంచులు పట్టుకెళ్ళి మోయగలిగినంత ఇసకను తెచ్చేవాళ్ళం. అలాగే, నవరాత్రి కొలువులు పూర్తి అయిపోయాక ఆ ఇసకనంతా తిరిగి ఆ కార్పరేషన్ గ్రౌండ్ లో తెచ్చిన చోటనే పోసేసి వచ్చేవాళ్ళం. ఆ కండిషన్ కు ఒప్పుకుంటేనే  ఆ మట్టిని తీసుకురావడానికి బాబూవాళ్ళ నాన్నగారు (ఘంటసాలగారు) ఒప్పుకునేవారు. ఈ బొమ్మలకొలువు తీర్చిదిద్దే వ్యవహారమంతా ఘంటసాలవారు ఇంటిలో లేనప్పుడు, లేదా రాత్రి అందరూ పడుకున్న తరువాత ప్రారంభించేవాళ్ళం. ఇలాటి నవరాత్రుల సమయంలోనే ఒకసారి, అదే మొదటిసారి కూడా, సోమసుందరం స్ట్రీట్ ప్లే గ్రౌండ్ లో ఆ ఇసకలో కొంతమంది ఫైట్ చేసుకోవడం చూసాను. అయితే అవి నిజమైన ఫైట్లుకావు. సినీమా ఫైట్లు. కొంతమంది స్టంట్ ఆర్టిస్ట్ లు ఫైట్స్ కంపోజ్ చేస్తూ ప్రాక్టీస్ చెసేవారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని గాలిలో పల్టీలు కొట్టడం, ఒంటిమీద చేయిపడకుండా పిడికెళ్ళతో గుద్దుకోవడం, ఒకళ్ళనొకళ్ళు తోసుకోవడం చూడ్డానికి చాలా సరదగా వుండేది.  ఆడుకోవడానికి గ్రౌండ్ కు వచ్చే చిన్నపిల్లలంతా ఆసక్తిగా చూసి ఆనందించేవారు. తరువాత, వాళ్ళూ అలాగే కొట్టుకునేవాళ్ళు. మరొక రోజు ఒక వస్తాదు లాటి వ్యక్తి కూడా అక్కడికి వచ్చి ఈ రకమైన ఫైటర్స్ అందరికీ ఏవో  సలహాలు చెపుతూ తానూ చేసి చూపించాడు. బాగా వయసైన మనిషే. ఆయన పేరు చక్రపాణి అని, MGR కు అన్నగారని చెప్పుకోవడం విన్నాను. అలాటి వీరుల క్రీడా స్థలంలోని మట్టిని మా ఇంటి బొమ్మలకొలువులో ఉపయోగించేవాళ్ళము.  

ఘంటసాలవారింటి దసరా నవరాత్రుల కొలువులు చూచేందుకు ప్రతీరోజు చాలామంది సినీమా కుటుంబాలకు చెందిన ఆడవాళ్లు, పిల్లలు వచ్చేవారు. నేను మొదటిసారిగా గిరిజ అనే సినీమా నటిని చూసింది సావిత్రమ్మగారి బొమ్మలకొలువులోనే. చూడ్డానికి చాలా తెల్లగా నొక్కుల జుత్తుతో, చెవులకు ఎర్రపొడులున్న  చిన్న రింగులతో  చాలా అందంగా  తెల్లటి చీరలో స్లిమ్ గా కనిపించేరు. నాకు తెలియనివాళ్ళెందరో వచ్చేవారు. భానుమతి, జమునగార్ల ఇళ్ళలో కూడా బొమ్మలకొలువు సంబరాలు బాగానే జరిగేవని చెప్పుకునేవారు. భానుమతిగారంటే   సావిత్రమ్మగారికి చాలా ఇష్టం. అవకాశమున్నప్పుడు వెళ్ళి ఆవిడను చూసేవారు. ఈ నవరాత్రుల బొమ్మల కొలువు పేరంటాళ్ళు వచ్చే సమయంలో ఇంట ఘంటసాలవారు వుండేవారుకారు. వచ్చిన ఆడవాళ్ళంతా వెళ్ళాక ఏ ఎనిమిదింటికో ఇంటికి చేరేవారు. 

బొమ్మలకొలువు పేరంటాళ్ళు వచ్చేప్పుడు పామర్తిగారి పెద్దమ్మాయి రావమ్మ (రామలక్ష్మి), సావిత్రమ్మగారి అక్క కుమార్తె ఝాన్సీ చాలా చురుకుగా పాల్గొనేవారు. వాళ్ళు అట్నుండొకసారి, ఇట్నుండొకసారి తిరుగాడుతూ పేరంటాళ్ళకోసం వుంచిన శెనగలు, వక్కలు ఒక్కొక్కటిగా ఎవరూ చూడకుండా నోట్లో వేసుకోవడం నాకు వింతగాను, భయంగానూ వుండేది, ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తే తిడతారేమోనని. కానీ, వాళ్ళకు ఆ భయం వుండేదికాదు. చాలా సహజంగా, చొరవగా తీసుకోవడమే కాక  రావమ్మ నా చేతిలో కూడా  కొంచెం శనగ్గింజలు, వక్కపొడి పెట్టేది. నాకు అప్పటినుండే వక్కపొడి నమలడం ప్రారంభమయింది. నాకు మరే అలవాటు లేకపోయినా, అందుబాటులో వుంటే ఇప్పటికీ వక్కపొడి నమిలే అలవాటుంది. మెడ్రాస్ లో 'అశోకా' వక్కపొడి 'సవరిన్' వక్కపొడి చిన్న చిన్న పేకట్లలో దేవాలయాల దగ్గర, తామలపాకుల దుకాణాలలో, కిరాణా కొట్లలో అమ్మేవారు. ఒక్కొక్క పొట్లం మూడు నయాపైసలుండేది. పెళ్ళిళ్ళలో, పేరంటాలలో తాంబూలం పేకట్లలో పెట్టడానికి ఈ వక్కపొడి పొట్లాలు తప్పనిసరిగా ఉపయోగించేవారు. 

నాకు వక్కపొడి కొంత అలవాటు కావడానికి కారణమైన మరొక వ్యక్తి మా దొడ్డమ్మగారు, చెళ్ళపిళ్ళ వరహాలమ్మ. భోజనం చేసే సమయం , నిద్రపోయే సమయంలో తప్ప మిగిలిన కాలమంతా ఆవిడ నోట్లో పోకచెక్కలు నానుతూనేవుండేవి. ఆవిడ చీరకొంగుముడిని ఎప్పడూ ఆ చెక్కలుండేవి. వాటిని ఉప్పుచెక్కలనేవారు. మా ప్రాంతాల్లో ఈ వక్కలు రెండు రకాలుగా తూకంవేసి అమ్మేవారు. పోకచెక్కలు. పీటి వక్కలు. 

  

మొదటిరకం రూపాయి నాణెంలా తెలుపు, ఎరుపు చారలతో వుంటాయి. మద్రాసులోను, తమిళనాట ఈ పోక్కాయల చెక్కునే సీవల్ గా అమ్ముతుంటారు. సన్నపొరలాగ సీవల్ చెక్కడానికి ప్రత్యేకమైన కత్తెరలాంటి సాధనాలువాడతారు.వీటిని అడకత్తెరలు అంటారు.

  


రెండవ రకంగా నల్లగా చిన్నవిగా పిక్కల్లా ఉంటాయి. 


ఆరోజుల్లో మద్రాసు తాంబూలసేవనకి, ఎక్కడపడితే అక్కడ, ముఖ్యంగా సినిమా థియేటర్లలో, ఎఱ్ఱటి ఉమ్ముల మరకలకి ప్రసిద్ధి. 

తమిళనాట వెత్తలె పాక్కు ప్రసిద్ధి

ఆ అలవాటు మితిమీరి చివరకి ప్రభుత్వం వక్కపొడుల అమ్మకంమీద ఆంక్షలు విధించే దాకా వెళ్ళింది. ఆఖరికి 'సవరిన్' 'అశోకా' వక్కపొడి కంపెనీలూ మూతపడ్డాయి. ప్రస్తుతం ఇంకా వాడుకలో త్రివేణి, క్రేన్, రత్నం వక్కపొడులు ప్రసిద్ధంగానే ఉన్నాయి. తమిళనాడులో 'రోజా' వక్కపొడి 'నిజాం పాక్కు' వాడకంలో వున్నాయి. పండగలు, పబ్బాలు, పూజలు, వ్రతాలు అంటే ఆకు వక్క తప్పనిసరి.

తమిళనాడు లో అత్యంత వైభవంగా జరుపుకునే పండగలు రెండే రెండు ఒకటి జనవరి లో వచ్చే పొంగల్; మరొకటి అక్టోబర్/నవంబర్ నెలలో వచ్చే దీపావళి. ఈ రెండు పండగల తర్వాతే మిగిలిన పండగలన్నీ. ఈ రెండు పండగలను అన్ని వర్గాలవారు ధనికులు, బీదలు అనే తేడా లేకుండా తమకున్నంతలో ఘనంగా జరుపుకుంటారు. తమిళనాడులో దీపావళీ అమావాస్యకన్నా నరకచతుర్దశికే ప్రాముఖ్యత. 

తెల్లవారుజామున లేచి స్నానాలు ముగించుకొని నూతన వస్త్రాలు ధరించి సూర్యోదయం అయేవరకు బాణసంచా కాల్చడం పరిపాటి. వారికి  దీపావళి వెలుగులకన్నా శబ్దంలోనే ఆనందం. సీమ టపాకాయలు మొదలు బాంబుల వరకు ధ్వని ప్రధానమైన  బాణసంచామీదనే వందలు, వేల రూపాయలు ఖర్చుపెడతారు. ఆ శబ్దకాలుష్యాన్ని ఆనందించాక విందులు, వినోదాలు, దీపావళికి విడుదలైన సినిమాలకి  కుటుంబ సమేతంగా వెళ్ళి మళ్ళీ ఏ రాత్రికో ఇళ్ళకు చేరుతారు. మన తెలుగువారిలా అమావాస్య రోజు రాత్రి దీపాల పండగ జరపరు. 
దీపాలంకరణ వుండదు. కార్తీక పౌర్ణమి రోజున రాత్రిపూట దివ్వెలు వెలిగించి   దేవాలయ పుష్కరిణి జలాలలో వదులుతారు. తమ ఇళ్ళలో ఆచారాన్ని పాటిస్తూ సంప్రదాయబధ్ధంగా దీపాలను వెలిగిస్తారు. అందుచేత దీపావళి అమావాస్య కళ ఆనాటి రాత్రి పెద్దగా కనపడదు. అసలు సిసలు తెలుగువారున్న ప్రాంతాలలోమాత్రం కొంతమంది అమావాస్య నాటి రాత్రి తమ ఇళ్ళముందు దీపాలు పెట్టి బాణసంచా వెలిగిస్తారు.

నెం.35,ఉస్మాన్ రోడ్ లో మాత్రం దీపావళి అమావాస్య చాలా వైభవంగా కళకళలాడుతూ జరిగేది. ఎన్ని వేల రూపాయలకు టపాకాయలు కాల్చారన్నది ముఖ్యం కాదు. దీపావళి రోజున భవనం మొత్తం ప్రమిద దీపాలతో  ఆ ఇంట దీపలక్ష్మి తాండవించేది. నా చిన్నతనంలో ఘంటసాల మాస్టారికి కానీ, ఇంట్లోవారికి కానీ శబ్దాలతో కూడిన బాణసంచా అంటే ఇష్టముండేదికాదు. వెలుగులు చిమ్మే బాణ సంచానే కొనేవారు.
అలాటి క్రేకర్సన్నీ పాండీబజార్ లో , రంగనాధన్ స్ట్రీట్ మార్కెట్లో చాలా విరివిగానే దొరికేవి. కానీ ప్యారీస్ కార్నర్ గొడౌన్ స్ట్రీట్, బందర్ స్ట్రీట్ వంటి ప్రాంతాల్లో హోల్ సేల్ మార్కెట్లలో ఎక్కువ వెరైటీలు దొరుకుతాయని అలాటి చోట్ల క్రేకర్స్ కొనడానికి ఘంటసాలగారు ఉత్సాహం చూపేవారు.

ఈ విషయాలన్నీ 1962 కు ముందు సంగతులు.

ఒక ఏడాది దీపావళికి ఓ మూడు రోజుల ముందు క్రేకర్స్ కొనడానికి ఘంటసాలగారు నన్ను వెంటబెట్టుకువెళ్ళారు. నేను, ఆయన మాత్రమే కారులో వెళ్ళాము. సాధారణంగానే మెడ్రాస్ లో దీపావళికి సమయంలో కొద్దో గొప్పో వానలు పడడం ఆనవాయితి. మేము ఉదయం పది గంటల ప్రాంతంలో బయల్దేరాము. వాతావరణం మబ్బులు కమ్మివుంది. గేటులోనుండి కారు బయటకు వచ్చాక, ఘంటసాలవారు డ్రైవర్ గోవింద్ తో "అణ్ణామలైపురం కెనాల్ రోడ్ ప్రొడ్యూసర్ ఆఫీసుకు పోడా" అని అన్నారు. ఇదేమిటి మందుగుండు సామాను కొందాము రమ్మని, వేరేదో చోటుకు వెళ్ళమంటున్నారే! అయితే ఈవేళ క్రాకర్స్ కొనడానికి వెళ్ళడం లేదేమో అని అనుకుంటుండగా, నా ఉద్దేశం గ్రహించినట్లుగా "నాయనా! ముందు ఆ పని చూసుకొని తరువాత, జార్జ్ టౌన్ వెళదాం" అని అన్నారు. నేను తల ఊపాను. కారు రాజా అణ్ణామలైపురంలో కెనాల్ రోడ్ లో చివరగా కుడిచేతి వేపు ఒక ఇంటిముందు ఆగింది. ఎడమవేపు కెనాల్. "నాయనా! నువ్వు కారులో కూర్చో. ఓ పది నిముషాలలో వస్తాను" అని చెప్పి కారు దిగి లోపలకు వెళ్ళారు. నేను కూడా క్రిందికి దిగి ఆ ప్రాంతాన్ని చూస్తున్నాను. ఒక ఐదు నిముషాల తరువాత అక్కడికి ఒక వాక్సాల్ కారు వచ్చి ఆగింది. అందులోనుండి ఒకావిడ క్రిందికి దిగింది. ఆవిడే ఆ కారును డ్రైవ్ చేస్తూ వచ్చారు. అది నాకెంతో ఆశ్చర్యం. ఎంత గొప్పావిడో, ఎంత తెలివైనదో అని అనుకున్నాను. కారు డ్రైవ్ చేయడానికి తెలివితేటలుండాలో అఖ్ఖరలేదో నాకు తెలియదు. ఆవిడ లోపలకు వెడుతూంటే మాస్టారు బయటకు వచ్చారు. ఆ వచ్చినావిడ ఘంటసాలవారి కి వినయంగా నమస్కారం పెట్టింది. "ఏమ్మా! బాగున్నారా" అంటూ పలకరించారు. ఆవిడ తలూపుతూ లోపలికి వెళ్ళింది. మేము మళ్ళీ కారులో ప్యారీస్ వేపుకి బయల్దేరాం. కారులో కూర్చొని బయట వింతలన్నీ చూస్తూవున్నా, నా బుర్రలో ఆ ఆడమనిషి గురించే ఆలోచిస్తున్నాను. ఆవిడను ఎక్కడో చూశాను. ఎవరో గుర్తు రావడం లేదు. కొంతదూరం వెళ్ళాక ఈ పోలికలున్న అమ్మాయి శభాష్ రాముడు సినీమా లో రమణమూర్తికి జోడీగా పార్క్ లో డ్యూయెట్ పాడింది. ఆ! గుర్తుకు వచ్చింది. కుసుమ కుమారి. తమిళంలో శివాజీ గణేశన్ తో శభాష్ మీనాలో నటించిన మాలిని. తెలుగులో సంతానం వంటి ఓ నాలుగు సినీమాలలో నటించింది. బావామరదళ్ళు సినీమాలో కూడా రమణమూర్తితో నటిస్తున్నట్లు పత్రికలలో చూశాను. (ఒక ఆరేళ్ళ వ్యవధిలో ఓ డజన్ సినీమాలలో నటించి ఎవరో తమిళ డైరక్టర్ ను పెళ్ళిచేసుకొని సినీమాలకు గుడ్ బై చెప్పేసిందని వార్త.)

ఆ ఆలోచన ముగియగానే మరో ఆలోచన. అయితే ఘంటసాలవారు వెళ్ళిన సినీమా కంపెనీ ఎవరిదని. తరువాత, తెలిసింది అది బావామరదళ్ళు సినిమా తీస్తున్న నిర్మాత ఆఫీసని. పాడిన పాటల  రెమ్యునరేషన్ కోసం ఘంటసాలగారు ఆ ఆఫీసుకు వెళ్ళారని. సాధారణంగా ఈ పనులు నరసింగడికి అప్పగిస్తారు. అతనివల్ల సాధ్యం కాకపోతే ఆయనే వెళ్ళేవారు. 

కారు ఫ్లవర్ బజార్ పోలిస్ స్టేషన్ ప్రాంతాలకు వచ్చాక ఒక వారగా గోవిందు బండిని ఆపాడు. అప్పటికే ఒక పెద్ద జల్లుపడి వెలిసింది. రోడ్లన్నీ బురద బురదగా వున్నాయి. అలాగే, ఆ లోపలి గౌడౌన్ స్ట్రీట్ , మింట్ స్ట్రీట్ ల్లోని క్రేకర్స్  షాపులన్నీ చూస్తూ ఎక్కడెక్కడ ఏ ఏ రకాలున్నాయో చూసుకుంటూ వెళ్ళాము.  ఘంటసాలవారి ముఖం గుర్తుపట్టిన కొంతమంది మంది వచ్చి నమస్కారం చేసి పలకరించారు. వారికి నవ్వుతూనే నమస్కారం చేస్తూ ముందుకు సాగారు. అక్కడ ఓ అరగంట గడిపాక ఒక పెద్ద షాపులో మాకు కావలసిన క్రేకర్స్ కొనుగోలు చేసాము. ఈ బాణసంచా కొనడానికి వెళుతున్నానని తెలిసి మా అమ్మగారు నాకు కొంత డబ్బు ఇచ్చారు. ఆ డబ్బులోనే నాకిష్టమైన క్రేకర్స్ కొనుకున్నాను. ఇద్దరికీ కలిపి చాలా క్రేకర్సే వచ్చాయి. మేమిద్దరం కలిపి కొన్న వస్తువుల ఖరీదు చెప్పితే మీరు ఆశ్చర్యపోతారు. వాటన్నిటి వెల అంతా కలిపి తొంభై రూపాయలే. నేను కొన్నవి పదిహేను రూపాయలకు. (ఈనాడు ఆ డబ్బులకి ఏవో రెండు వస్తువులు వస్తాయేమో. క్రేకర్స్ కొనడం మానేసి నాలుగు దశాబ్దాలయింది. కారణం. క్రేకర్స్ పొగ పడక. అవి కాల్చడంలోని ఆసక్తి ఎప్పుడో పోయింది.)

ఇక దీపావళీ ఉదయం నుండీ హడావుడే. తలంటు స్నానాలు, ఉన్నంతలో పిండివంటల తయారీలలో ఇంట్లోని ఆడవారంతా తలమునకలై వుండేవారు. బాబూ వాళ్ళమ్మగారు ముందురోజే దాచివుంచిన ప్రమిదలన్నింటినీ నీట్లో నానబెట్టి ఆరబెట్టించేవారు. ఇల్లంతా దీపాలు అలంకరించడమంటే మాటలా! నాలుగు ప్రహారీ గోడలు, పోర్టికోలో, బాల్కనీలో డాబామీది గోడలు అన్నింటినీ నూనె దీపాల ప్రమిదలు సిధ్ధం చేసేవాళ్ళం. చీకటి పడడం ఆరంభం కాగానే  సావిత్రమ్మగారు ప్రమిదల్లోని దీపాలు వెలిగించడం మొదలెట్టేవారు. వెనకాల ఔట్ హౌస్ వాకిట్లో కూడా మా అమ్మగారు దీపాలు వెలిగించేవారు. ఆనాటికి  ఘంటసాలవారింట్లో దీపావళి సెలబ్రేట్ చేసే పిల్లలం ముగ్గురం  మాత్రమే. మరో ముగ్గురు నలుగురున్నా వాళ్ళంతా మరీ చిన్నవాళ్ళు. అందుచేత కొన్న క్రేకర్సన్నీ  కాల్చేది నేనూ, పెద్దబాబే. మా బొబ్బిలి, విజయనగరంలో లాగా బాణా సంచా కాల్చడానికి ముందు 'దిబ్బు దిబ్బు దీపావళీ' కొట్టడానికి ఆముదం కొమ్మలు దొరికేవికావు. అందుకోసం బొప్పాయిచెట్టు కొమ్మలు కోసి ఆ ఆకులకు నూనెగుడ్డలు కట్టి వాటిని ముట్టించి వాటితో లాంఛనప్రాయంగా దీపావళీ బాణసంచా కాల్చడం చెసేవాళ్ళం. ఘంటసాలవారితో సహా వారింట్లోని కుటుంబసభ్యులు, ఇతర మిత్రబృందమంతా కూడా చాలా సరదాగా ఈ దీపావళి సంబరాల్లో పాల్గొనేవారు. మా పక్కింటిలోని పిల్లలు కూడా వచ్చి మాతో క్రేకర్స్ కాల్చేవారు. మేము చైనా బజార్లో కొన్న బాణసంచా రాత్రి తొమ్మిది గంటలవరకూ సరిపోయేవి. ఈలోగా గాలికి ప్రమిదలు ఆరిపోకుండా ఆరారగా నూనెపోస్తూవుండడం ఒక పెద్దపని.  నూనె దీపాలు వెలుగుతున్నంతసేపు ఇంట్లోని కరెంట్ దీపాలన్నీ ఆర్పేసి వుంచేవారు. నెం.35, ఉస్మాన్ రోడ్ లోని ఈ నూనె దీపాలకాంతి రోడ్ మీద చాలా దూరంవరకు ఆకర్షణీయంగా కనపడేది. మొత్తం మీద మా నార్త్ ఉస్మాన్ రోడ్ లో ప్రమిద దీపాలతో దీపావళి అమావాస్యను వైభవంగా జరిపేది ఒక్క ఘంటసాలవారింట్లోనే. 

మరొక ఏడాది దీపావళికి ఇంట్లోనే మతాబాలు, చిచ్చుబుడ్లు తయారు చేస్తే ఎలావుంటుందనే సంకల్పం నాకూ, నరసింగకు కలిగింది. మేమిద్దరం ఒకే జిల్లాకు చెందినవాళ్ళం కావడాన మతాబులు , చిచ్చుబుడ్లు తయారు చేయడానికి కావలసిన సరంజామా ఏమిటో బాగా తెలుసు. అయితే ఆ  ముడి వస్తువులు  దొరికే స్థలాలను కనిపెట్టడం చాలా కష్టమయింది. కోడంబాక్కం హైరోడ్ మీద కొన్ని కుండలు, మట్టివస్తువులు దొరికే కొట్లుండేవి. వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఖాళీ చిచ్చుబుడ్లు కోసం ఆర్డర్ ఇస్తే వాళ్ళు రెండు మూడురోజుల తర్వాత రమ్మనేవారు. ఈలోగా మళ్ళీ జార్జ్ టౌన్ ఇరుకు సందుల్లో తిరిగి సురేకారం, గంధకం, అల్యుమినియం బీడు (రజన్) మొదలైనవన్నీ కొని వాటిని కల్వాలలో నూరి  మతాబులకి, చిచ్చుబుడ్లకి కావలసిన పాళ్ళు రెడీ చేసి, ఖాళీ చిచ్చుబుడ్లకి వెళితే వాడు కన్నాలు లేని బుడ్లు చేసిచ్చాడు. ఆ బుడ్లు పగిలిపోకుండా జాగ్రత్తగా వాటికి కన్నాలు పెట్టించడానికి మరొకరోజు ఆలస్యం. సొంత దీపావళి మీద ఆసక్తితో రాత్రింపగళ్ళు కష్టపడి నేను, నరసింగ అనుకున్నవాటిని  సమయానికి సిధ్ధం చేశాము. వీటితో పాటు మరికొంత బాణసంచాను బజార్లో కొన్నాము. యధాప్రకారం భవనమంతా దీపాలు వెలిగించి క్రేకర్స్ వెలిగించడం మొదలెట్టాము. మా ప్రతిష్టాత్మక చిచ్చుబుడ్లు , మతాబాలు మమ్మలిని చీదరపెట్టాయి. చిచ్చుబుడ్లలోంచి పొగతప్ప పువ్వులు రాలేదు. మతాబాలు అంతే పొగతోపాటు గెడ్డలుకట్టిన నిప్పురవ్వలే రాలేయి తప్ప తెల్లటి పువ్వులు రాలేదు. మా ఆపరేషన్ ఫెల్యూరుకి పరిశోధన మొదలెట్టాక తేలిందేమిటంటే  మేము కలపిన మతాబా పాళ్ళలో ఆముదం పాలు అనుకున్నదానికంటే ఎక్కువ పడింది. అందుకే తెల్లటిపువ్వులు రాలలేదని, వచ్చే సంవత్సరం ఈ లోటును సరిచేయాలని సరిపుచ్చుకున్నాము. అంతమాత్రాన దీపావళి ఏమీ ఆగిపోలేదు. మిగతా ఐటెమ్స్ తో గ్రాండ్ గానే జరిగింది. ఆ పై సంవత్సరం దీపావళి కి కూడా సొంత తయారీ మొదలెట్టాము. ఆదిలోనే హంసపాదు ఆ ఏడాది అల్యూమినియం రజన్ ఎక్కడా దొరకలేదు. ఎవరో మహానుభావుడు సలహా ఇచ్చాడు అల్యూమినియం పాత్రలు తయారు చేసే చోట్లకు వెళితే రజన్ దొరుకుతుందని. కానీ మాకు కావలసిన రజన్ దొరకలేదు. వాడు కొంచెం ముతకగా వున్న అల్యూమినియం పొడి మాకు అంటగట్టాడు. దానిని తెచ్చి కల్వంలో ఎన్నిగంటలు దంచినా మాకు కావలసిన పధ్ధతికి రాలేదు. అసలు ఇంతకి అది అసలైన ముడి పదార్ధంకాదు. ఆ ఏడాది మా సొంత తయారీ అట్టర్ ఫ్లాప్. మనకు సొంత తయారీలు ఏవీ అచ్చిరావని ఎవరికివారే గత అనుభవాలు గుర్తుచేసుకోవడం జరిగింది. 

దీపావళినాడు ప్రమిద దీపాలు పెట్టడంలో వుండే ఆనందం, తృప్తి, క్రేకర్స్ కాలిస్తే రాదు అని బాగా అర్ధం చేసుకున్నాం.  

మరొక ఏడాది దీపావళి కి పిల్లలు కొంత పెద్దయ్యారు. కొందరు, కాకరపువ్వొత్తులు పట్టుకునే వయసుకు వచ్చారు. యధాప్రకారంగా చీకటి పడ్డాక భవనం నాలుగు పక్కలా మేడ సహా ప్రమిద  దీప తోరణాలంకరణతో దేదీప్యమానంగా వుంది. సుమారు ఏడున్నర ప్రాంతంలో వరసగా నాలుగైదు  నల్లని పొడుగాటి గవర్నమెంట్ కార్లు సైరన్ మ్రోగించుకుంటూ చాలా స్పీడ్ గా వెళ్ళిపోయాయి. ఎవరో, ఏమిటోనని  చూడ్డానికి మేము గేటు  బయటకు వచ్చాము. ఆఖరున వచ్చిన ఒక నల్లటి కారు మాత్రం నెం.35, ఉస్మాన్ రోడ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం స్లో అయింది. అక్కడ మిగతా ఇళ్ళకంటే వ్యత్యాసం గా కనిపించిన ఆ భవనంలోని ప్రమిదదీపాల కాంతులు  వారిని ఆకర్షించాయన్నది మాత్రం నిజం. తరువాత ఎవరో చెప్పగా తెలిసింది భారతదేశపు ప్రెసిడెంట్ డా. బాబూ రాజేంద్రప్రసాద్ గారు, ఉస్మాన్ రోడ్ మీదుగా రాజభవన్ కు వెళ్ళారని. పైలట్ కార్లన్నీ ముందు స్పీడ్ గా వెళ్ళిపోగా ప్రెసిడెంట్ కారు మాత్రం మా ఇంటి ప్రాంతంలో కొంచెం స్లోగా వెళ్ళిందని. 

ఆ తరువాత మరి కొన్ని నెలలకు తెలిసింది కోడంబాక్కం లెవెల్ క్రాసింగ్ దగ్గర పెద్ద ఫ్లై ఒవర్ కట్టబోతున్నారని. 1950ల నుండే అక్కడ బ్రిడ్జ్ కడతారని వార్తలు వచ్చినా ఆచరణలోకి రాలేదు. సడన్ గా ప్రెసిడెంట్ వస్తున్న వాహనమే ఆర్కాట్ రోడ్ లో లెవల్ క్రాసింగ్ దగ్గర చాలాసేపు నిలబడిపోవడంతో ఈ ఫ్లై ఓవర్ ప్రోజెక్ట్ విషయంలో ప్రభుత్వం ఉలిక్కిపడి నిద్రలేచిందని చెప్పుకున్నారు. కామరాజనాడార్ ముఖ్యమంత్రిగా పునాదిరాయి వేయగా , ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి ఎమ్ భక్తవత్సలం కాలంలో ఫ్లై ఓవర్ మీద రాకపోకలకు ప్రారంభోత్సవం జరిగింది. ఇంతటి చారిత్రాత్మక ఘట్టానికి మూలపురుషుడైన డా. బాబూ రాజేంద్రప్రసాద్ అప్పటికే కాలధర్మం చెందారు. 

నెం.35, ఉస్మాన్ రోడ్ లోని దీపావళి పండగలను తల్చుకున్నపుడల్లా షావుకారు సినీమా లోని మాస్టారు చేసిన దీపావళీ పాటే గుర్తుకు వస్తుంది.
 "దీపావళీ దీపావళి -మా ఇంటా మాణిక్య కళికావళీ ...దీపావళీ ... దీపావళీ".

మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు



వచ్చేవారం మరికొన్ని జ్ఞాపకాలు...
అంతవరకూ 
... సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

6 comments:

Pulijalasanthisree said...

చక్కని దీపావళి కబుర్లు...చదువుతుంటే కళ్ళకు కట్టినట్లు ఉన్నాయి...చాలా బాగుందండి

చుండి వేంకట రాజు said...

ధన్యవాదాలండి

sumabala said...

దసరా సంబరాలు, దీపావళి సందడి చాలా బాగున్నాయి పెద్దన్నయ్యా 👏👏👌👌🙏🙏
-- సుమబాల

Patrayani Prasad said...

🙏🙏శ్రీ అన్నయ్యకు నమస్కారములు.🙏🙏, ఈ అధ్యాయం-2, ఆరవభాగం లో నీవు వ్రాసిన, విజయదశమి, బొమ్మలకొలువు, దీపావళి విశేషాలు, చాలా వివరంగా వ్రాశావు. నాకు తెలియని విశేషాలు, ఈ సంచికలో తెలుసుకో గలిగాను.

గౌరవనీయులు శ్రీ ఘంటసాల మాష్టారు, ఆంధ్రుల దీపావళికి ఇచ్చిన ప్రాధాన్యతను, గుర్తింపును , దీపకాంతుల ద్వారా ఆంధ్రుల సంప్రదాయాన్ని, మదరాసు ప్రజలకు తెలియజేసిన విధానం ఎంతైనా, అభినందనీయం.

చైనా బజార్. జార్జి టౌన్ లో ఉన్నదా? ఇప్పటికీ అక్కడే ఉన్నదా? ఈ దీపావళి మందుగుండు ముడిసరుకులు, విజయనగరానికి , మద్రాస్ నుండే , ఆ రోజుల్లో, వచ్చేవని, వినినట్లు, నాకు జ్ఞాపకం. మదరాసులో (బీడు)(అల్యూమినియం రజనుకి, ఇబ్బంది పడవలసి, వచ్చేదా?.

ఏమైనా కధనం చాల బాగుంది. విశేషాలు బాగున్నాయి. సంతోషం కలిగింది .ధన్యవాదాలు.🙏🙏-పట్రాయని ప్రసాద్, బెంగుళూరు, తేదీ:16-11-2020, సోమవారం. సాయంకాలం. సమయం. గం.05-10 ని .IST.

వడ్డాది గోపాలకృష్ణ మూర్తి said...

మహాశయా, 13.11.2020 భాగం చాలా ఆసక్తికరంగా, ఉత్సాహంగా ఇంకా కన్నుల పండుగగా చర్చించారు. ఘంటసాల గారి దర్శనం మీ కబుర్ల ద్వారా ఉత్సాహంగా మళ్ళీ మళ్ళీ చదువుకుని సంబరపడ్డాము. పరాయి వారి వస్తువులు అనవసరంగా, వృధాగా పోరాదని - బొమ్మలకొలువు అనంతరం పార్కు నుండి తెచ్చిన ఇసుకను తిరిగి అక్కడికే చేర్చడం ఘంటసాల గారి నిబద్ధతను మీ వాక్యాల ద్వారా పునఃప్రకటన చేశారు. ఆనాటి మీ దీపావళి ఈనాటి మా శార్వరి దీపావళి ఐనది. ఎన్నెన్నో కృతజ్ఞతలతో!

వడ్డాది గోపాలకృష్ణ మూర్తి said...

మహాశయా, 13.11.2020 భాగం చాలా ఆసక్తికరంగా, ఉత్సాహంగా ఇంకా కన్నుల పండుగగా చర్చించారు. ఘంటసాల గారి దర్శనం మీ కబుర్ల ద్వారా ఉత్సాహంగా మళ్ళీ మళ్ళీ చదువుకుని సంబరపడ్డాము. పరాయి వారి వస్తువులు అనవసరంగా, వృధాగా పోరాదని - బొమ్మలకొలువు అనంతరం పార్కు నుండి తెచ్చిన ఇసుకను తిరిగి అక్కడికే చేర్చడం ఘంటసాల గారి నిబద్ధతను మీ వాక్యాల ద్వారా పునఃప్రకటన చేశారు. ఆనాటి మీ దీపావళి ఈనాటి మా శార్వరి దీపావళి ఐనది. ఎన్నెన్నో కృతజ్ఞతలతో!