19.12.20 - శుక్రవారం భాగం - 11*:
అధ్యాయం 2 భాగం 10 ఇక్కడ
నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
జీవితం ఎప్పుడూ ఒకేలా సాఫీగా సాగిపోతుందని అనుకోవడానికిలేదు. వెలుగు తర్వాత చీకటిలాగే, సంతోషంతో పాటే దుఃఖము, అంతులేని విచారము కూడా చోటు చేసుకుంటాయి.
మా గోపి పుట్టిన సరిగ్గా నెల రోజులకు, అంటే 1957, ఏప్రిల్ 17 వ తేదీన పూజ్యులు, మా తాతగారు, సాలూరు చినగురువుగారు, శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారు విజయనగరంలో స్వర్గస్తులయ్యారు. వయసేమీ మీరిపోలేదు. కేవలం 57 ఏళ్ళు మాత్రమే. విజయనగరం నుండి మా ప్రభు చిన్నాన్నగారు టెలిగ్రామ్ పంపారు. ఇంట్లో ఒక నెలల పిల్లవాడున్నకారణంగా, దూరాభారం మూలంగా, మా నాన్నగారు మాత్రం వెంటనే విజయనగరం వెళ్ళారు. మేమెవరమూ వెళ్ళలేకపోయాము. విజయనగరం వదలి వచ్చాక మరల మా తాతగారిని చూడలేదు. మా గోపిలో ఆయన పోలికలు కొన్ని ప్రస్ఫుటంగా వున్నాయి. ఘంటసాల మాస్టారు కూడా, పనుల ఒత్తిడి వల్లనే అనుకుంటాను, వెళ్ళలేకపోయారు. సీరియస్ అని టెలిగ్రామ్ వచ్చినా మా నాన్నగారు వెళ్ళేవేళకు మా తాతగారు కాలం చేయడం జరిగింది. అప్పటికి ఒక సంవత్సరం ముందే విజయనగరం సంగీత కళాశాల గాత్ర ఆచార్యుడిగా పదవీ విరమణ చేయడం జరిగింది. ఇంటి పెద్ద కుమారుడిగా మా నాన్నగారు కర్మకాండ అంతా ముగించారు. విశాఖపట్నం నుండి మా పెద్ద చిన్నాన్నగారు పట్రాయని నారాయణ మూర్తిగారు కూడా తండ్రిగారి కడసారి చూపులకు అందుకోలేకపోయారని విన్నాను. స్థానికంగా వున్న మా తాతగారి మిత్రులు, శిష్యులు, కొంతమంది బంధువర్గం ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారని చెప్పగా తెలిసింది. 19వ శతాబ్దం ఉత్తరార్ధానికి చెందిన ఒక వాగ్గేయకారుని శకం ముగిసింది. కారణాలేవైనా కావచ్చు, శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రిగారి విద్వత్ కు తగిన గుర్తింపు అటు సంగీత కళాశాలలో కాని, తరువాత ప్రభుత్వపరంగా కానీ లభించలేదు.
ఈ అభ్యర్ధనలేవీ దున్నపోతుని కదిలించలేకపోయాయి. తాతాగారు అర్ధాంతరంగా కన్నుమూయడానికి ఈ మనోవ్యధ కూడా ఒక కారణం
కారణం ఏదైనా ఆయనకు రావలసిన పెన్షన్ కూడా ఆయనకు దక్కలేదు. ఆయన కాలం చేసిన ఐదేళ్ళ తరవాత సరైన కారణాలు చెప్పకుండానే శ్రీ ప్రభుత్వంవారు ఆయన పెన్షన్ కేసు మూసేసిన విషయం తెలియజేసేరు. ఇది నిజంగా విచారకరమైన విషయం.
ఐదేళ్ళపాటు మా తాతగారి పెన్షన్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ వృధాకావడంతో, విజయనగరం మహరాజా సంగీత కళాశాలలో ఉద్యోగం కోసం తగిన అర్హతలతో చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలివ్వకపోడంతో ఆయన మూడవ కుమారుడు శ్రీ పట్రాయని ప్రభాకరరావు తన భార్య(కమలమ్మ), ఇద్దరు చిన్న పిల్లలతో (పివిఎన్ఎస్వి ప్రసాద్, మంగమాంబ) విజయనగరం వదలి సాలూరులో తమ తండ్రిగారు నిర్మించిన శారదా గాన పాఠశాలలోనే ఒక వారగా ఆవాసం ఏర్పర్చుకొని అక్కడకు వచ్చే సంగీతాభిలాషులకు విద్య నేర్పడం ప్రారంభించారు.
సాలూరులో శారదా గాన పాఠశాల విద్యార్ధులు - కుమారుడు పివిఎన్ఎస్ ప్రసాద్, కుమార్తె మంగమాబంలోతో శ్రీ పట్రాయని ప్రభాకరరావు
విజయనగరంలో మా తాతగారి అంత్యక్రియలు జరిపి మద్రాస్ వచ్చిన మా నాన్నగారిలో బాహ్యంగా ఒక మార్పు కనిపించింది. కొన్నాళ్ళపాటు తన తలమీద ఒక నల్లటి టోపీ పెట్టుకొనేవారు. ఎప్పుడూలేనిది ఆ టోపి ఎందుకు పెట్టుకున్నారో ఆ వయసులో నాకు తెలియలేదు. మా తాతగారి మరణానికి సంబంధించిన వివరాలు కూడా మా నాన్నగారు చెప్పిన గుర్తులేదు. పెద్దయ్యాక తెలుసుకున్నవే.
మా తాతగారు పోయాక నా వరకు విజయనగరం సంగీత కళాశాలతో కానీ, విజయనగరం ఊరుతో కానీ, కొన్ని దశాబ్దాలపాటు ఏ రకమైన సంబంధం లేకుండాపోయింది. రైల్లో ఆ ప్రాంతాలకు వెళ్ళేప్పుడు విజయనగరం రైల్వే స్టేషన్ ను చూడడం తప్ప ఊళ్ళోకి వెళ్ళలేదు. 1980ల నుండి సాంస్కృతిక కార్యక్రమాలతో సత్సంబంధాలు ఏర్పడినప్పటినుండి అప్పుడప్పుడు విజయనగరం ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది.
సంగీత దర్శకుడిగా 1957 వ సంవత్సరం ఘంటసాల మాస్టారికి చాలా విజయవంతమైన సంవత్సరం. ఆ సంవత్సరంలో ముందుగా 'రేపు నీదే', 'మాయాబజార్', 'వినాయకచవితి', 'సతీ అనసూయ', 'సారంగధర' చిత్రాలు విడుదలయి సంగీతపరంగా మాస్టారికి, కాసులపరంగా నిర్మాతలకు సంతోషాన్ని కలుగజేసాయి.
'సారంగధరుడు' 11 వ శతాబ్దానికి చెందిన ఆంధ్ర చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని కుమారుడు. కవిత్రయంలో ఆద్యుడు, ఆంధ్ర మహాభారతం రెండున్నర ఆశ్వాసాలను రచించిన నన్నయ భట్టారకుడు ఈ రాజరాజనరేంద్రుని ఆస్థాన కవీశ్వరుడే. 'సారంగధర' చరిత్ర బుర్రకథగా ఆంధ్రదేశంలో విస్తృతంగా ప్రచారం పొందింది. ఇందులో చారిత్రక సత్యాలకన్నా కల్పితమే ఎక్కువని చెపుతారు. ఈకథ జరిగిందనడానికి నిదర్శనంగా రాజమహేంద్రవరంలో సారంగధరమెట్ట, చిత్రాంగిమేడ, రత్నాంగిమేడవంటి అవశేషాలు కొన్ని ఇటీవలి కాలం వరకూ వున్నాయి. శ్రీ గురజాడ అప్పారావుపంతులుగారు ఈ సారంగధర చరిత్రను ఇంగ్లీషులో ఒక పద్యకావ్యంగా వ్రాసి ప్రచురించారని చెపుతారు.
'సారంగధర' సినీమాను మినర్వా పిక్చర్స్ బ్యానర్ మీద నామదేవ రెడ్డియార్ అనే ఆయన తెలుగు, తమిళ భాషలలో నిర్మించారు. వి.ఎస్.రాఘవన్, రామచంద్రరావు ద్వయం దర్శకత్వం వహించారు. తెలుగులో సారంగధరుడిగా ఎన్.టి.రామారావు, తమిళంలో శివాజీ గణేశన్ నటించారు. భానుమతి (చిత్రాంగి), శాంతకుమారి (రత్నాంగి), రాజసులోచన (కనకాంగి,) ఎస్.వి.రంగారావు (రాజరాజనరేంద్రుడు) తమిళంలో కూడా వారే నటించారు. తెలుగులో నన్నయభట్టుగా మిక్కిలినేని, మంత్రిగా గుమ్మడి నటించారు. తమిళం వెర్షన్ కు జి.రామనాధన్, తెలుగుకు ఘంటసాల సంగీత దర్శకత్వం వహించారు. ఎవరి బాణీవారిదే. రెండు భాషలకు వేర్వేరు వరసలు. చిత్రాంగి పాత్రధారిణి పి.భానుమతి రెండు సోలోలు, కొన్ని పద్యాలు పాడారు. ఆ రోజుల్లో భానుమతిగారికి, ఘంటసాలవారికి మధ్య గాత్రధర్మానికి సంబంధించిన అభిప్రాయభేదాలుండేవని చెప్పుకునేవారు. కానీ, ఈ సారంగధర లోని భానుమతి గారి పాటలను ఘంటసాల మాస్టారే స్వరపర్చారు. వారి నిర్వహణలోనే ఆవిడ పాటలన్నీ రికార్డ్ చేయడం జరిగిందని మా నాన్నగారు, శ్రీ పట్రాయని సంగీతరావు గారు స్పష్టం చేసారు. సినీమా టైటిల్స్ లో ఆయన పేరు వేయకపోయినా ఈ సినిమా సంగీత సహాయకుడిగా ఆయన పనిచేశారు. భానుమతి గారిచేత పాటలు రిహార్సల్స్ చేయించేప్పుడు ఆయన కూడా వున్నారని చెప్పడం జరిగింది.
సారంగధర సినిమా రీరికార్డింగ్ ముందు రషెస్ వేసి చూపించారు. నేను ఆ ప్రొజెక్షన్ కు వెళ్ళాను. రీరికార్డింగ్ మౌంట్ రోడ్ రేవతీ స్టూడియోలో జరిగింది. కోడంబాక్కంలో ఒక రేవతీ స్టూడియో వుండేది. రెండింటికి ఒకరే అధినేత. మౌంట్ రోడ్ లో తేనాంపేట DMS (Directorate of Medical Sciences)కు ఎదురు వేపు వుండేది. దాని పక్కనే కాంగ్రెస్ గ్రౌండ్స్ వుండేది. తరువాతి కాలంలో ఈ రేవతీ రికార్డింగ్ స్టూడియో ఆవరణలో (ECIL) వారి ఆఫీసులు వచ్చాయి. ఇప్పుడు అక్కడ ఒక సబ్ వే, ఒక అండర్ గ్రౌండ్ మెట్రో రైల్వే స్టేషన్ వచ్చాయి. ఇటీవలి కాలం వరకూ ఆ పాత రేవతీ స్టూడియో భవనం అక్కడ వుండేది.
సారంగధర ప్రారంభం సీన్, ఆఖరి క్లైమాక్స్ సీన్ లలోని రీరికార్డింగ్ కు నేను వెళ్ళాను. సారంగధరుని శీలాన్ని శంకించి తండ్రి రాజరాజనరేంద్రుడు కొడుకుకు శిరచ్ఛేదం శిక్ష విధించి, అది అమలుపర్చేంతవరకు చాలా హెవీ సీన్స్. మధ్యలో చాలా పొడవైన హార్స్ ఛేజింగ్. సారంగధరుని స్నేహితుడు సుబుద్ధి(చలం), విలన్ గంగన్న (ముక్కామల)ల మధ్య కత్తియుద్ధం, సారంగధరుని వధించాక ఒక సాధువు ప్రత్యక్షమై తిరిగి సారంగధరుని బ్రతికించడం, కనకాంగి (రాజసులోచన)తో వివాహంతో చిత్రం 'మంగళమ్' కార్డ్ వరకు ప్రతీ బిట్ లో నేపథ్యసంగీతం వినిపిస్తుంది. ఈ బిట్ల్ కు మాత్రం ఓ మూడు కాల్షీట్లు పనిచేసిన గుర్తు.
ఈ సారంగధర చిత్రం నాటికి ఘంటసాలవారి సొంత ఆర్కెష్ట్రా ఏర్పడింది. ఈ సీన్లలో ఎక్కువగా వెస్టర్న్ వాద్యాలే ఉపయోగించారు. ఎక్కువగా వైలిన్స్ (లాజరస్, రామసుబ్బు, సుబ్రమణ్యం (వయోలా), కృష్ణమాచారి, వై.ఎన్.శర్మ, చిత్తూర్ సుబ్రమణ్యం మొదలైనవారు), సెల్లో, డబుల్ బేస్ (బిన్ని) గిటార్స్ (జార్జ్, లూయీ), సాక్సోఫోన్, ట్రంపెట్స్, పియోనో, క్లారినెట్ (సుభాన్), బేస్ డ్రమ్స్, వైబ్రోఫోన్స్ (ఉపద్రష్ట రామచంద్రరావు (ఈయన కుమారుడు ప్రముఖ సంగీత దర్శకుడు విద్యాసాగర్. కొంతకాలం మా నాన్నగారి వద్ద సంగీతం నేర్చుకోవడానికి వచ్చేవారు), రాజేంద్రన్ (ఫ్లూట్), ఆర్గన్ (హుస్సేన్ రెడ్డి), హార్మోనియం (పి. సంగీతరావు), తబలా (పామర్తి, లక్ష్మణరావు, భోగీలాల్. తర్వాతి కాలంలో ఉరిమి లలిత (పెద్ద) ప్రసాద్, జడ్సన్, ఆయన తమ్ముడు చిన్న ప్రసాద్, సుబ్బారావు, కణ్ణన్ (రిథిమ్స్).
ఈ వాద్యకళాకారులే ఘంటసాల మాస్టారి తొలినాటి సినీమాలలో ఎక్కువగా పనిచేశారు. సితార్ జనార్ధన్ పరిశ్రమకు రావడానికి ముందు అన్నపూర్ణ అనే ఆవిడ మాస్టారి ఆర్కెష్ట్రాలో పనిచేశారు. అలాగే, వీణ వాయించడానికి ఎమ్మెస్.రాజు, ఎమ్.రంగారావు వచ్చేవారు. అరవైల తర్వాత, మా నాన్నగారు కొన్ని సినిమాల్లో వీణ కూడా వాయించేరు. పాటకు, సన్నివేశానికి తగినట్లుగా పై ఆర్కెష్ట్రాలోని వాద్య కళాకారులను పిలిపించేవారు.
గతంలో చెప్పుకున్నట్లు సీన్ బై సీన్ సారంగధర సినీమాను వేసి చూసుకుంటూ స్టాప్ వాచ్ తో టైమ్ నోట్ చేసుకుంటూ సన్నివేశం రక్తి కట్టించే విధంగా ఘంటసాల మాస్టారు నేపథ్య సంగీతం సమకూర్చారు. ఈ సీన్లలో సంతోషం, విషాదం, కరుణ, భీభత్సం అని అన్ని రసాలకు తగిన సంగీతం సమకూర్చవలసి వచ్చింది. ఈ రీరికార్డింగ్ రేవతీ స్టూడియో సౌండ్ ఇంజనీర్ కణ్ణన్ ఆధ్వర్యంలో జరిగిన గుర్తు.
ఈ సినీమా రీ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం. ఒక రోజు సాయంత్రం ఆరున్నర సమయంలో టిఫిన్ బ్రేక్ అని అందరు బయటకు వచ్చి ఆ సినిమా కంపెనీ తెప్పించి ఇచ్చిన మైసూర్ బోండా, ఊతప్పమ్, కాఫీలు సేవిస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూన్నారు. అప్పటికి సాయంకాలపు వెలుగు తగ్గి చీకట్లు కమ్ముతూన్నాయి. ఇంతలో, తూర్పు వేపు ఆకాశంలో చాలా ఎత్తున ఒక నక్షత్రంలాటిది కదలాడడం కనిపించింది. అది ముందు నేనే చూసాను. అది విమానం లైట్ లా లేదు. ఏమైయ్యుంటుంది. అలా కొంతసేపు ఉన్నచోటే నిశ్చలంగా కనిపించింది. నేను మా నాన్నగారికి చూపించి అడిగాను. ఈ లోగా అక్కడున్న ఇతర ఆంగ్లోఇండియన్ ప్లేయర్స్ కూడా వింతగా చూడడం ప్రారంభించారు. ఒక్కొక్కరు ఒక్కోలా వ్యాఖ్యలు చేయడం మొదలెట్టారు. కొందరు జెట్ ఫ్లైట్ లైటని , మరికొందరు ఫ్లైయింగ్ సాసరని నిర్ధారించారు. అంతకు కొన్ని రోజుల ముందు ఇండియాలో కూడా కొన్ని ప్రాంతాలలో ఫ్లైయింగ్ సాసర్లు కనిపించాయని రూమర్లు వచ్చాయి. ఇది ఆ రకమే అని కొందరు అభిప్రాయపడ్డారు. ఈలోగా టిఫిన్ బ్రేక్ ముగిసి, అందరినీ రికార్డింగ్ ధియేటర్ కు రమ్మనమని పిలుపురావడంతో అందరూ ఆ ఫ్లైయింగ్ సాసర్ విషయం వదలిపెట్టి తమ పనులలో నిమగ్నమయ్యారు. ఆ మర్నాడు తెలిసింది, గత సాయంత్రం ఆకాశంలో కనిపించింది ఒక హాట్ ఎయిర్ బెలూన్ తాలూకు వెలుగని. ఏది ఏమైనా ఆ వెలుగు కారణంగా అందరికీ మంచి కాలక్షేపం జరిగింది.
ఘంటసాల మాస్టారి పాత సినీమాలన్నింటిలో పాటలు ఎక్కువగానే వుండేవి. ఈ సారంగధర చిత్రం లో కూడా పాటలు, పద్యాలు అన్ని కలిపి ఇరవైకి పైగానే ఉన్నాయి. వాటిని ఘంటసాల, పి.భానుమతి, పి.లీల, జిక్కి, మాధవపెద్ది, పిఠాపురం, ఎమ్మెస్.రామారావు, రాఘవులు, స్వర్ణలత ఆలపించారు. అన్నానా భామినీ, ఓ నా రాజా, అడుగడుగో అల్లడుగో, సాగేను బాలా నీ చెంత చేర, కలలు కరగిపోవునా, జయ జయ మంగళగౌరీ, పోయిరా మాయమ్మ వంటి పాటలు చాలా జనాదరణ పొంది ఇప్పటికీ శ్రోతలను రంజింపజేస్తున్నాయి. అలాగే, సారంగధరుడు చిత్రాంగిల మధ్య సంవాద పద్యాలు కూడా ఘంటసాల, భానుమతి గార్ల అభిమానుల మధ్య మంచి ఆసక్తిని, ఆనందాన్ని రేకెత్తించాయి.
సారంగధర సినీమాకు సంబంధించిన మరొక విశేషం వుంది. అది ఆ సినిమా టైటిల్ మ్యూజిక్. ఈ టైటిల్ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి ఘంటసాల మాస్టారు తమ గురుదేవులు కీ.శే. శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారి స్వరరచనను ఉపయోగించుకున్నారు. అది గురువుగారు, ఆనాటికి వాడుకలో సూర్యకాంతి జన్యరాగంగా ఉన్న లలితరాగంలో చేసిన 'లలితే సరసగాన కళాశ్రితే' అనే కృతి. ఈ కృతిని టైటిల్ మ్యూజిక్ గా ఉపయోగించి ఘంటసాలవారు తమ గురువుగారు శ్రీ సీతారామశాస్త్రిగారి పట్ల తమకు గల భక్తిని, వినయవిధేయతలను చాటుకున్నారు. గురువుగారు పరమపదించిన సంవత్సరంలోనే సారంగధర సినీమా విడుదలకావడం, గురువుగారి కృతి ఈ సినీమాలో వినపడడం సాలూరి చినగురువుగారి శిష్యులకు, స్నేహితులకు, సహజంగానే కుటుంబ సభ్యులకు అమితానందం కలిగించింది. ఘంటసాలవారి సహృదయతను అందరూ హర్షించారు.
సారంగధర టైటిల్ మ్యూజిక్ - తాతగారి కృతి - సాహిత్యంతో
సారంగధర టైటిల్ మ్యూజిక్ - తాతగారి కృతి - వాద్యసంగీతం
ఘంటసాల మాస్టారు తీరికగా వుండే సమయాలు చాలా తక్కువ. ఎప్పుడూ ఉదయం, సాయంత్రం రికార్డింగ్ లనో, రిహార్సల్స్ అనో, కంపోజింగ్ అనో బయటే గడిపేవారు. మధ్య మధ్యలో బయట వూరు కచేరీలకు వేరే వెళుతూండడంతో ఇంట్లోవారితో సరదాగా గడిపే సమయం వుండేదికాదు. అలా ఎప్పుడైనా సమయం దొరికితే ఇంట్లోవారిని బీచ్ కో లేక స్నేహితుల ఇళ్ళకో తీసుకువెళ్ళేవారు. అప్పుడప్పుడు నేనూ వెళ్ళేవాడిని. అలా ఒకరోజు రాత్రి ఏడు గంటలయ్యాక మాస్టారు, సావిత్రమ్మగారు , పెద్దబాబు, నేనూ కలసి పాత నల్ల న్యాష్ కారులో బయల్దేరాము. ఎక్కడికి వెడుతున్నమో నాకు సరిగా తెలియదు. బీచ్ కు అనుకున్నాను. కానీ, కారు బీచ్ రోడ్ వేపు కాకుండా అడయార్ వేపు మళ్ళింది. వెళ్ళేది బీచ్ కు కాదని అర్ధమయింది. కారు విండోలోనుండి బయటకు చూస్తూవున్నాను. కారు ఒక పెద్ద బ్రిడ్జ్ మీద చీకట్లో వెళుతోంది. క్రింద పెద్ద నదిలాటిది వుంది. దానిని అడయార్ రివర్ అంటారని అందులోని నీరు వెళ్ళి సముద్రంలో కలుస్తుందని చెప్పారు. చీకట్లో స్పష్టంగా తెలియలేదు. (కొన్నాళ్ళకు ఆ అడయార్ బ్రిడ్జ్ శిథిలావస్థకు వచ్చి రాకపోకలు పూర్తిగా ఆపివేశారు. అప్పట్లో ఇవతల ఒడ్డున నెప్ట్యూన్ స్టూడియో, అవతలివేపు థియోసాఫికల్ సొసైటీ, అడయార్ మర్రిచెట్టు వంటి ప్రసిద్ధికెక్కిన స్థలాలుండేవి. ఆ నెప్ట్యూన్ స్టూడియోను ఎమ్.జి.ఆర్. కొని సత్యా స్టూడియోగా మార్చి తన సొంత సినీమాలు ఆ స్టూడియోలో నిర్మించేవారు. ఇప్పుడు అది కూడా మూతబడింది. దానిస్థానే ఎమ్జీయార్ జానకీ రామచంద్రన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి ఉమెన్స్ కాలేజీ నడుస్తున్నది. దానికి ఎదురుగానే దుర్గాబాయి దేశ్ ముఖ్ గారి ఆంధ్రమహిళా సభ హాస్పిటల్, హాస్టల్ వున్నాయి. ఇప్పుడు నది రెండు ప్రక్కలను కలుపుతూ ఒక కొత్త బ్రిడ్జ్ , ఓ ఫ్లై ఓవర్ కట్టారు. పాత జ్ఞాపకాలకు చిహ్నంగా శిధిలమైపోయిన పాత అడయార్ బ్రిడ్జ్ ఇంకా నిలిచేవుంది. ఆనాటికి వాడుకలోనే ఉన్న ఆ పాత బ్రిడ్జ్ మీదుగా డ్రైవర్ గోవింద్ కారును పోనిచ్చి బిసెంట్ నగర్ బీచ్ కు వెళ్ళే రోడ్ లో ఒక సైడ్ వీధిలో ఒక ఇంటిముందు ఆపాడు. మాస్టారో, అమ్మగారో ఇంటినుండి బయల్దేరేముందే గోవింద్ తో ఎక్కడికి వెళ్ళాలో చెప్పివుంటారు.
మేము కారు దిగి గేట్లోకి వెళుతూండగానే ఆ ఇంట్లోని ఒక పెద్ద వయసాయన, ఓ నలుగురు ఆడవాళ్లు బిలబిలాడుతూ బయటకు వచ్చి మాస్టారికి, అమ్మగారికి స్వాగతం చెప్పారు. అందరూ కలసి కోరస్ గా "కూర్చుండ మా ఇంట కురిచీలు లేవు..." అంటూ గట్టిగా, సంతోషంగా పాడడం మొదలుపెట్టారు. నాకు వారి ధోరణి చాలా వింతగా అనిపించింది. వారంతా ఎవరో , అలా ఎందుకు పాడారో నాకు తెలియదు. తర్వాత పెద్దయాక తెలిసింది, వారంతా కోరస్ గా పాడినది జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి 'ఉదయశ్రీ' కావ్య ఖండికలోనిదని.
మేమంతా ఒక గదిలో కూర్చున్నాము. మేము వెళ్ళినందుకు ఆ ఇంటివారు బ్రహ్మానందం పొందారు. ఆ ఇంటాయన జడ్జ్ గానో, మేజిస్ట్రేట్ గానో పనిచేసేవారట. భార్య , ముగ్గురు అమ్మాయిలు. అప్పటికి అవివాహితలు. అందరికీ ఘంటసాలవారన్నా, ఆయన పాటన్నా ప్రాణం. నాకు ఆ మనుషులు, వాతావరణం చాలా వింతగా, కొత్తగా తోచింది. చాలాసేపు ఏవో కబుర్లతో గడిచింది. వారంతా ఏవేవో పాటలు పాడడమే కాకుండా ఘంటసాల మాస్టారిచేత కూడా పాడించి విని ఆనందించారు. సమయం మించిపోతున్నదని తిరిగి బయల్దేరబోతున్న మమ్మల్ని, భోజనం చేసే వెళ్ళాలని పట్టుబట్టి ఆపేసారు. కొంతసేపయ్యాక మా అందరికీ, పెద్ద పెద్ద ప్లేట్లలో అరిటాకులు పెట్టి అందులో నాలుగేసి పెద్ద ఇడ్లీలు, కొబ్బరి చట్నీ వేసి మాముందుంచారు. భోజనం అని చెప్పి ఇప్పుడు ఇడ్లీలు తెచ్చారు. భోజనానికి ఎంతసేపు అవుతుందో. వారింట్లో టిఫిన్, భోజనం చేయాలంటే నాకు మొగమాటంగా అనిపించి వద్దన్నాను. అమ్మగారు, వీళ్ళంతా మనవాళ్ళే, ఫర్వాలేదు తినమని చెప్పారు. ఆ కార్యక్రమం ముగిసిన కాసేపటికి అక్కడనుండి బయల్దేరి ఇంటికి వచ్చాము. కారులో కూర్చున్నంతసేపూ నాకు ఒకటే ఆలోచన. భోజనాలు చేసి వెళ్ళాలని బలవంతపెట్టి, కేవలం టిఫిన్ మాత్రమే పెట్టారని. కొంత వయస్సు వచ్చాక తెలిసింది, తమిళనాట చాలామంది రాత్రిపూట అన్నానికి బదులు ఏవో ఫలహారాలే చేస్తారని, దానినే భోజనం అంటారని. అప్పట్లో అది నాకు చాలా వింత. మా ఇంటావంటా లేని విషయం. అయితే ఇప్పుడు అందరూ ఏవో కారణంగా రాత్రిపూట అన్నాలకు స్వస్తి చెప్పి ఫలహారాలతోనే గడిపేస్తున్నారు. ఎక్కడో మా నాన్నగారిలాటి పాత తరం పెద్దలు తప్ప.
ఆ అడయార్ అభిమాన స్నేహితులు మాస్టారింటికి అప్పుడప్పుడు వచ్చేవారు. ఆ అమ్మాయిలు ఘంటసాలవారి ని అన్నయ్య అని, సావిత్రమ్మగారిని వదినా అని పిలిచేవారు. వారి అభిమానం అవధులు దాటిన అభిమానంగా అనిపించేది. 'సావిత్రీ! మీ అడయారు పిచ్చివాళ్ళు వస్తున్నారు' అంటూ ఇంట్లోని రామచంద్రరావులాటి వారు వ్యాఖ్యానించేవారు. ఆయన అలా అనడం నాకు ఇబ్బందికరంగా తోచేది. ఆ కుటుంబమంతా ఎంతో ప్రేమతో అంత దూరం నుండి చూడాలని వస్తే ఈయన అలా వ్యాఖ్యానించడం న్యాయమేనా అనిపించేది. కానీ, ఇంట్లోవారు చెప్పుకునే విషయాలు విన్న తర్వాత తప్పులేదేమో అనిపించింది. ఘంటసాలవారికి, వారికి గల అన్నాచెల్లెళ్ళ బంధం ఈనాటిది కాదని, గత జన్మలో కూడా మాస్టారే తమ అన్నగారని చెప్పేవారట. అలాగే, ఆనాటి మరొక ప్రముఖ గాయకుడు ఏ.ఎమ్.రాజా, ఆ అమ్మాయిలలో ఒకరికి భర్త అని, అదికూడా పూర్వజన్మ బంధమని, మాస్టారిని చూసిన తరువాత రాజా గారింటికి వెళతామని చెప్పేవారట. ఈ రకమైన వీరాభిమాన కధనాలు విన్నాక, మనుషులలో ఇన్ని రకాల మనస్తత్త్వాలవారు ఉంటారని తెలుసుకున్నాను. ప్రముఖుల పట్ల వారి అనుయాయులు, అభిమానులు తమ గౌరవాన్ని, భక్తిని, ప్రేమను వ్యక్తపర్చడంలో ఇదొక భాగమని అర్ధమయింది. అలాటివారిని సానుభూతితో అర్ధం చేసుకోవాలే తప్ప విమర్శించకూడదని తెలుసుకున్నాను.
1957 డిసెంబర్ లో మరొక ముఖ్య విశేషం చోటు చేసుకుంది.
ఆ విశేషాలన్నీ వచ్చే వారం......
...సశేషం
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.
6 comments:
ఈనాటి 35 ఉస్మాన్ రోడ్ 2/11 వ భాగం సాలూరి చిన గురువు గారి నిర్యాణం తో కొంచెం బరువుగానూ మరియు సారంగధర చిత్రం తయారీ విశేషాలు తిరిగి అడయారు వంతెన, పరోక్ష బంధువులతో కొంచెం ఆనందంగా నడిచింది. 57 సంవత్సరాలకే 1957లో శ్రీ సీతారామ శాస్త్రి గారు శరీరాన్ని విడిచి పెట్టడం బాధ అనిపించింది. వారి జ్ఞాపకాలు కు వారి ద్వారా కొన్ని వందల కుటుంబాలకు ఈనాటికి కొన్ని వేల కుటుంబాలకు ఆలంబన ఐనది. సారంగధర విశేషాలు, జిక్కి గారి పుట్టిల్లు విశేషాలు చాలా హృద్యంగా చెప్పేరు!👌💐😊
శ్రీ విజికె గారు. ధన్యవాదాలు.
ఆవిడ జిక్కిగారు కానేకాదు.ఆ అభిమానులు జిక్కిగారి పుట్టింటివారు కాదు. ఏ ఎమ్ రాజా పాటలంటే ప్రాణం పెట్టే ఒక వీరాభిమాని. అంతే.ఆ పేరా మరొకసారి జాగ్రత్తగా చదివిచూడండి.
మీ తాత గారి pension వ్యవహారం బాధ పడే విషయమే. పేరున్న వారి విషయంలో కూడా ప్రభుత్వం తీరు ఇలా ఉంది ఏంటో!! సారంగధర విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అభిమానుల స్పందనలు బాగున్నాయి. ధన్యవాదాలు... హృషీకేష్
ధన్యవాదాలు.
👆🙏🙏అన్నయ్యకు నమస్కారములు,🙏🙏,
నెం.35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక ), అధ్యాయం -2 - పదకొండవ భాగం,
19-12-2020 -
శుక్రవారం భాగం :11* లో
వివరించిన అనుభవాలన్నీ, చాలా ఆసక్తికరంగా సాగాయి. ఎన్నో తెలియని విషయాలు, చక్కగా వివరంగా తెలియ జేసిన శ్రీ పట్రాయని ప్రణవ స్వరాట్ అన్నయ్యకు, ధన్యవాదాలు.
కధ చాలా
బాగా నడుస్తోంది. బాగుంది.
తరువాయి భాగంలో ఏముందా అనే కుతూహలం కలుగుతోంది .
వచ్చే సంచిక కోసం ఎదురుచూస్తూ ఉన్న
పట్రాయని ప్రసాద్, & కుటుంబం.
బెంగుళూరు, తేదీ:26-12-2020,
శనివారం
సమయం:
రాత్రి :గం 07:40 ని IST.
👆🙏🙏అన్నయ్యకు నమస్కారములు,🙏🙏,
నెం.35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక ), అధ్యాయం -2 - పదకొండవ భాగం,
19-12-2020 -
శుక్రవారం భాగం :11* లో
వివరించిన అనుభవాలన్నీ, చాలా ఆసక్తికరంగా సాగాయి. ఎన్నో తెలియని విషయాలు, చక్కగా వివరంగా తెలియ జేసిన శ్రీ పట్రాయని ప్రణవ స్వరాట్ అన్నయ్యకు, ధన్యవాదాలు.
కధ చాలా
బాగా నడుస్తోంది. బాగుంది.
తరువాయి భాగంలో ఏముందా అనే కుతూహలం కలుగుతోంది .
వచ్చే సంచిక కోసం ఎదురుచూస్తూ ఉన్న
పట్రాయని ప్రసాద్, & కుటుంబం.
బెంగుళూరు, తేదీ:26-12-2020,
శనివారం
సమయం:
రాత్రి :గం 07:40 ని IST.
Post a Comment