visitors

Saturday, January 16, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పదిహేనవ భాగం

16.01.2021 -  శనివారం భాగం- 15*:
అధ్యాయం 2 భాగం 14 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

అందరికీ పండుగానంతరం చెబుతున్న మకర సంక్రమణ శుభాకాంక్షలు.

దీపావళీ  వచ్చి వెళ్ళిన తరువాత వచ్చే మరో పెద్ద పండగ మకర సంక్రాంతి. నాలుగురోజుల పండగ. ధనుర్మాస కాలం ప్రారంభమైన దగ్గరనుండే తెల్లవారుజామునే పక్కనే ఉన్న 'దరుమపురి ఆదీన మడం' (ధర్మపురి ఆధీన మఠం)లో నుండి, కొంచెం దూరంలో ఉన్న అమ్మవారి గుడులనుండి భక్తిగీతాలు గాలిలోనుండి తేలివచ్చి మమ్మల్ని మేల్కొలిపేవి. మెడ్రాస్ కు చలికాలంలేదు. రెండే కాలాలు. వేసవికాలం, వర్షాకాలం. అయినా ఉదయాన్నే సముద్రపుగాలి చలి చలిగా గిలిగింతలు పెట్టేది. అప్పట్లో ఇంత జనసముద్రం, వాతావరణ కాలుష్యం లేని రోజులు కదా.

మహానగరం కావడంవలన రోడ్లమీద సంక్రాంతి ముగ్గుల హడావుడి ఎక్కువ కనపడేది కాదు. ఎవరింటి వాకిట్లో వారు ముగ్గులు పెట్టుకునేవారు. మాంబళం శివ విష్ణు ఆలయం, మైలాపూర్ కపాలేశ్వరాలయం, ట్రిప్లికేన్ పార్ధసారధి, విల్లివాక్కం దామోదరస్వామి, ఇతర ప్రముఖ ఆలయ ప్రాంతాల  మాడ వీధులలోని స్త్రీలంతా చూడముచ్చటైన ముగ్గులు, వాటిమధ్య రకరకాల పువ్వులతో గొబ్బెళ్ళుతో అలంకరించేవారు. బోగి(భోగీ), పొంగల్(సంక్రాంతి), మాట్టు పొంగల్(కనుమ). ఆ మర్నాడు ముక్కనుమను ఉழవర్  తిర్నాళ్ గా పండుగ చేసుకుంటారు. ఉழవర్ అంటే కర్షకులు. రైతులు, వ్యవసాయదారుల కృషిని గుర్తిస్తూ నాలుగో రోజు ఊరు వాడా అంతా కలిసి సమష్ఠిగా చేసుకునే పండుగ రోజు.  ఈ నాలుగు రోజులూ ఊరంతా ఆనందోత్సాహాలతో సందడే సందడి. 

మకర సంక్రాంతి పండగ అంటేనే వ్యవసాయదారులకు, పశువులకు సంబంధించిన పండగ. ఈ పండగ విశేషాలన్నీ మన పాత తెలుగు సినీమాలెన్నిటిలోనో చూశాము. భోగీనాడు ఉదయాన్నే భోగీ పిడకల తోరణంతో, లేదా ఎవరిళ్ళనుండో దొంగతనంగా ఎత్తుకొచ్చిన పాత తలుపులు, విరిగిపోయిన కిటికీలు, కట్టెలతో భోగి మంటలు వేయడం మా ఊళ్ళలో రివాజు. కానీ మెడ్రాస్ లో రోడ్లమీద భోగీమంటల నిషేధం వుండేది. పైగా పేడ గొబ్బిళ్ళ పిడకలు తట్టేంత అవకాశం నగరవాసులకు వుండేది కాదు. అందువల్ల పాత రబ్బర్ టైర్లు, ట్యూబులు, చిత్తు పుస్తకాలు వారి వారి ఇళ్ళలోనే మంటపెట్టి ఆనందించేవారు. ఈ రకమైన చర్యలవలన కాలుష్యం పెరగడం తప్ప మరే విశిష్టత లేదు. ఈ నాలుగురోజుల పొంగల్ పండగలకు ప్రభుత్వపరమైన ఆశీస్సులు వున్నాయి. ఈ రోజుల్లోనే తిరువళ్ళువర్, అంబేద్కర్ ల జయంతులని కూడా పురస్కరించుకుని అదనంగా చేర్చి సభలు, సమావేశాలు, కవితాగోష్టులంటూ ప్రజలను మరింత చైతన్యవంతం చేయడం జరుగుతూంటుంది. 

పొంగల్ వస్తోందంటే మూర్ మార్కెట్ పక్కనున్న కన్నప్పర్ తిడల్ లోని SIAA గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ లు ప్రారంభమయేవి. అలాగే సర్కస్ కంపెనీల డేరాలు వెలిసేవి. ఒక ఏడాది కమలా త్రీ రింగ్ సర్కస్ మెడ్రాస్ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ఆ సర్కస్ ఆడిన రోజుల్లో రాత్రిపూట సెర్చ్ లైట్లతో ఊరంతటిని హడలుగొట్టారు. వున్నట్టుండి లైట్ వెలుగు పడి మాయమయేది. మళ్ళీ రెండు మూడు నిముషాలకు కనపడేది.  ఆ దీపపు వెలుగు ఎక్కడో వున్న మా టి నగర్ ఇళ్ళలో కూడా  పడేది. అదేమిటో తెలియక జనాలు మొదట్లో కంగారు పడ్డారు. తర్వాత తెలిసింది అది 'కమలా త్రీ రింగ్ సర్కస్' వాళ్ళ ప్రచార సాధనమని. భారీ ఎత్తున అనేక ఆకర్షణలు కలిగిన ఆ సర్కస్ నేనూ చూశాను.

డైరీ మిల్క్, బాటిల్డ్ మిల్క్ సంస్కృతి రాకముందు 35, ఉస్మాన్ రోడ్ కి ఆవుపాలు, గేదెపాల సరఫరావుండేది. ఉదయమో, రాత్రో ఆ పశువులను ఇంటికి తీసుకువచ్చి పాలు పితికి ఇచ్చేవారు. ఆ పాలు పితికి పోసే ఆర్ముగం మహా మాయలోడు. ఒక పొడుగాటి గొట్టంలాటి స్టీల్ లేదా ఇత్తడి పాత్రలో పాలు పితికేవాడు. ఆవుపొదుగులు కడగడానికి ఆ పాత్రలో నీరు తెచ్చేవాడు. కడగడం అయ్యాక పాలు తీసేముందు "అమ్మగారు చూసుకోండి" అంటూ ఆ పాత్రను బోర్లించి తిప్పేసేవాడు. పక్కనే అమ్మగారో, తమ్ముడు కృష్ణో(గుండు మావయ్య) ఉంటే తీసిన పాలు చిక్కగావుండేవి. దగ్గరలో ఎవరూ లేకపోతే ఆ పాత్రలో నీళ్ళు అలాగే వుండేవి. పాలు నీళ్ళలాగే వుండేవి. ఈ మాయాజాలం అందరికీ ఎరికే. చీవాట్లు పెట్టడమూ జరిగేది. ఆ పాలవాడు కుంటిసాకులూ సాగేవి. మాట్టు పొంగల్ రోజున ఆ ఆవులను బాగా అలంకరించి మాస్టారింటికి తీసుకువచ్చేవాడు. ఆవుమీద భక్తికాదు. పండగ ఈనాముల కోసం. ఆవుల ఒళ్ళంతా పసుపు పూసి కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరణ చేసేవాడు. ఆవుల కొమ్ములు, కాలిగిట్టలకు రంగు పెయింట్లు వేసేవారు. ఆయా పాలవాళ్ళు ఏ రాజకీయ పార్టీ అనుయాయులైతే ఆ పార్టీ రంగులు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లోనూ లేదా ఎరుపు, నలుపు రంగుల్లోను ఆ పశువుల కొమ్ములు మెరుస్తూండేవి. ఆ రెండు కొమ్ముల చివర మువ్వలు కట్టేవారు. అవి తల ఆడించినప్పుడల్లా గలగలాడుతూ చూడముచ్చటగా వుండేది. బేటరీతో వెలిగే చిన్న చిన్న బల్బులూ తగిలించేవారు.  అమ్మగారు ఆ పశువులకు ఓ చిన్న పూజలాటిది జరిపి ఆ పాలవాడికి పొంగల్ ఇనాము ఇచ్చిపంపేవారు. 

పొంగల్ రోజుల్లో పానగల్ పార్క్ మార్కెట్, పాండీబజార్ మార్కెట్, రంగనాధన్ స్ట్రీట్ బజార్లో అన్ని షాపులు కళకళలాడుతూ వుండేవి. రకరకాల పువ్వుల దుకాణాలు, పళ్ళదుకాణాలు, పసుపు కొమ్మలు, పొడుగాడి చెరుకుగడలు, మురియులు(మరమరాలు) కొనుక్కొని పట్టుకెళ్ళే పిల్లలు పెద్దలతో కాలుపెట్టే సందులేకుండా వుండేది.

ఉழవర్ తిరునాళ్ రోజున ఊరిజనమంతా మెడ్రాస్ మెరీనా బీచ్ లోనే కాపురం. ఎక్కడెక్కడినుండో ప్రత్యేక బస్సుల్లో తండోపతండాలుగా కుటుంబాలతో సహా వచ్చి బీచ్ లో ఆటపాటలతో ఆనందంగా గడిపేవారు.
 
పొంగల్ వస్తోందంటే కొత్త సినిమాలకు కొదవలేదు. పోటాపోటీగా సినీమాలను వదిలేవారు. రోజుకు నాలుగైదు ఆటలతో పొంగల్ వారంరోజులు అన్ని ధియేటర్లు కళకళలాడుతూ కోలాహలంగా వుండేవి. ఏ సినీమాకైనా కలెక్షన్లు కనిపించేవి. రెండోవారం నుండి ట్రెండ్ మారేదనుకోండి అది వేరే విషయం. దీపావళీ, పొంగల్ పండగలొస్తే ఎమ్.జి.ఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ఎస్.ఎస్.రాజేంద్రన్ల సినీమాలు తప్పనిసరిగా విడుదల చేసేవారు.  అవి కూడా పక్క పక్క ధియేటర్లలో వేసేవారు. ఆయా థియేటర్ల దగ్గర పండగ వాతావరణంతో పాటు యుధ్ధవాతావరణమూ కనిపించేది. బుధ్ధున్నవాడెవడూ పండగల రోజులలో సినిమాకు వెళ్ళడనుకునేవాళ్ళం. మెడ్రాస్ లో కేవలం ఎమ్జీయార్ సినీమాలు మాత్రమే ఆడే ధియేటర్లు కొన్నయితే, శివాజీ సినీమాలు తప్ప వేయని సినిమా హాల్స్ మరికొన్ని ఉండేవి. జెమినీ గణేశన్ ను 'సాంబార్ హీరో పడమ్(సినీమా)' అని ఎగతాళి చేసేవారు. కానీ, ఆ సాంబార్ హీరో ఏక్ట్ చేసిన మాయాబజార్, తేన్ నిలవు,  కళ్యాణ పరిసు(పెళ్ళికానుక), కొంజుం సలంగై(మురిపించే మువ్వలు), 'వంజికోట్టై వాలిబన్', 'రాము', 'కర్పగం'(తోడు నీడ) వంటి చిత్రాలెన్నో తమిళనాడులో, సిలోన్, మలేషియా  వంటి విదేశాలలో సైతం సంచలనం సృష్టించాయి.

ఇలాటి పండగ సీజన్లలోనే ఒక సంవత్సరం మెడ్రాస్ కు ఒక కొత్తరకం సినీమా వచ్చింది. ఆ సినీమాను చూడ్డానికి ఆడమగా, పిల్లజెల్లా, ముసలిముతక, చిన్నాచితక అందరూ తండోపతండాలుగా ఎగబడి ఆ సినీమాను చూసారు. మేము ఆ సినీమా ఆ వూరు వదలి వెళ్ళిపోవడానికి ముందు వెళ్ళి చూసివచ్చాము. 'సర్కరామ' అనే ఆ సినీమాను మనవాళ్ళు 'సర్కారమా' అనో 'సర్కారామా' అనో అనేవారు. Circle Vision. Panorama లాగా Circlerama. ఆ సినీమా విశేషం ఏమంటే ఆ సినీమాను నిల్చునే చూడాలి. కూర్చుండ కుర్చీలుండవుగా. 

  

సినీమాను వెయ్యడానికి ప్రొజెక్టర్లు కనపడేవి కావు. ఒక్కొక్క ఆటకు నూరు, నూటయాభైమంది లోపలే జనాలను వదిలేవారు. ఆ సినీమా హాలు పెర్మనెంట్ కాదు. ఒక గుడారంలో ఆ సినీమా. సన్ ధియేటర్ పక్కనే వున్న విశాలమైన కాంగ్రెస్ గ్రౌండ్స్ లో ఈ సర్కారమ సినీమా ప్రజలను విపరీతంగా ఆకర్షించింది. సినీమా మొదలవగానే గుడారంలోపల అన్ని దిక్కులనుండి సినీమా పెద్ద పెద్ద తెరలమీద బ్రహ్మాండమైన సౌండ్ తో  కనిపించింది. ఆ సినీమా కధాంశం గుర్తులేదు. వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంగా, నోళ్ళు తెరచి చూశారు. తరువాతి రోజుల్లో సినీమా టెక్నాలజీ పెరిగి బిర్లా ప్లానెటోరియా, 70 mm స్క్రీన్ లు వచ్చాక అలాటి వింతలెన్నో సర్వసాధారణం అయాయనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ నాటికి 'సర్కరామ' ఒక గొప్ప అనుభవం. 

మేము మెడ్రాస్ వెళ్ళిన కొత్తల్లో అన్ని సింగిల్ స్క్రీన్ ధియేటర్లే. 1960-70లలో ఒకే కాంపౌండ్ లో రెండేసి, మూడేసి స్క్రీన్ లున్న ధియేటర్లు కట్టడం ప్రారంభమయింది. 

మెడ్రాస్ సిటీ లిమిట్స్ లో చాలా లిమిటెడ్ గానే సినీమా హాల్స్ వుండేవి. ముందుగా టి.నగర్ నుండి ప్రారంభిస్తే - పాండీ బజార్లో "రాజకుమారి" (తమిళం) (ఇది ప్రముఖ సినీమా నటి టి.ఆర్.రాజకుమారిది. ఈ ధియేటర్లో సినీమా చూడడానికి వచ్చిన కృష్ణకుమారి  తానే ఒక  సినిమా హీరోయిన్ అయిపోయింది. తరువాత, రాజకుమారి చేతులు మారి "సాహ్నీ" గా మారిన రోజుల్లో ఇంగ్లీష్, హిందీ సినిమాల హాలుగా మారింది. ఇందులోనే నేను "ఝనక్ ఝనక్ పాయల్ బాజే", "నవరంగ్" సినీమాలు చూశాను. మళ్ళీ కొన్నాళ్ళ తరవాత రాజకుమారీగా మారిపోయింది.

జి.ఎన్.చెట్టి రోడ్ (గోపతి నారాయణస్వామి చెట్టి రోడ్) చివర మౌంట్ రోడ్ కు సమీపంలో "సన్" ధియేటర్(తమిళం). ఇది బండి సుందర్రావు నాయుడు గారనే తెలుగాయనది. ఎమ్జియార్ సినిమాలే వేసేవారు. వెస్ట్ మాంబళంలో నేషనల్ ధియేటర్ (తమిళం), సైదాపేటలో "జయరాజ్"(తమిళం), అడయార్ లో "ఈరోస్". లజ్ కార్నర్లో "కామధేను", మౌంట్ రోడ్ ప్రాంతంలో  "గెయిటీ ", మెడ్రాస్ లో నిర్మించబడ్డ మొట్టమొదటి సినీమాహాలు. 1913 లో శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడుగారు కట్టించారు. పరశువాక్కంలోని "రాక్సీ", మింట్ లోని "క్రౌన్" ధియేటర్ లను కూడా రఘుపతి వెంకయ్య నాయుడే నిర్మించినట్లు సినీమా చరిత్ర. 

గ్లోబ్" ఇదే తరువాత "అలంకార్". "ప్లాజా", "వెల్లింగ్టన్", "మిడ్ లాండ్" (ఈ ధియేటర్ ను నటి జయప్రద కొని "జయప్రద" గా మార్చి పైనే మరో ధియేటర్ కూడా కట్టించారు). "న్యూ ఎలిఫిన్ స్టన్", "ఓడియన్", గెయిటీ , "కాసినో ',  ట్రిప్లికేన్ హైరోడ్ లో "స్టార్', వాలాజారోడ్ లో "పారగన్", మౌంట్ రోడ్ గెయిటీ పక్కన కూవమ్ వంతెన దాటాక "చిత్ర", పరశువాక్కంలో "రాక్సీ", కెల్లీస్ లో "ఉమ", "మేఖల", అయనావరంలో "సయానీ", విల్లివాక్కంలో "నాదముని" (ఇందులో భానుమతి గారికి భాగస్వామ్యం వుండేదనేవారు). జార్జ్ టౌన్ లో  "సెలక్ట్"(తెలుగు), "మినర్వా" (ఇంగ్లీష్). ఇది గోడౌన్లు, వర్క్ షాపుల మధ్య ఒక మేడ మీద వుండేది. ముగ్గురేసి కూర్చునేలా పేము సోఫాలు. కెపాసిటీ వందలోపే). బ్రాడ్వేలో "ప్రభాత్", "బ్రాడ్వే", మింట్ లో  "మురుగన్",  "క్రౌన్", "శ్రీకృష్ణా", వాషర్ మేన్ పేటలో "మహరాణి", రాయపురంలో "బ్రైటన్", ఇవి ఆనాటి ప్రముఖ సినీమా హాల్స్.

ఈ రాక్సీ , బ్రాడ్వే సినీమాల మీద శ్రీ శ్రీ గారి ప్రసిధ్ధికెక్కిన వాక్యం ఒకటుంది. " బ్రాడ్వే లో కాంచనమాలా ? లేక రాక్సీలోని  నార్మా షెరెర్?" ఎవరిని చూడాలో అర్ధంకాక ఒక యువకుడు సందిగ్ధంలో పడ్డాడని. 

వీటిలో మౌంట్ రోడ్ లోని గ్లోబ్, ఓడియన్, మిడ్ లాండ్, న్యూఎలిఫిన్ స్టన్, కాసినోలలో కేవలం ఇంగ్లీష్ సినీమాలు, అప్పుడప్పుడు హిందీ సినిమాలు మాత్రం ఆడేవి. నేను చూసిన మొట్టమొదటి ఇంగ్లీషు సినీమా "కొ వాడీస్", విజయనగరంలో మా నారాయణమూర్తి చిన్నాన్నగారు తీసుకెళ్ళారు. ఆ సినీమా పేరు తప్ప మిగిలిన విషయాలు గుర్తులేవు. మెడ్రాస్ వచ్చాక నేను చూసిన తొలి ఇంగ్లీష్ సినీమాలు 'టెన్ కమాండ్మెంట్స్", "బెన్ హర్", మరొక సినీమా పేరు, ది మిస్టీరియస్ ఐలండ్ అయుండొచ్చు, సరిగా గుర్తులేదు. జూల్స్ వెర్న్ నవలే అని జ్ఞాపకం. ఆంధ్రపత్రికలో 'సాగరగర్భంలో సాహసయాత్ర' అనే సీరియల్ వచ్చేది. ఆ సినీమాయే అది. ఆ సినీమాను మిడ్ లాండ్ లోనే చూశాము. మానాన్నగారు, ఊరినుంచి వచ్చిన ఆయన స్నేహితులు, మాస్టారి తమ్ముడు సదాశివుడుగారు, బావమరది సుబ్బారావు గారు కూడా వచ్చిన గుర్తు. నిజానికి నేను ఆరోజు వెళ్ళగలిగే స్థితిలో లేను. అప్పుడు నా ఎడమకాలి వెనక మోకాలు మధ్యలో పెద్ద సెగగడ్డలేచింది. కాలు మడవబడక విపరీతంగా బాధపడుతున్న సమయం. అయినా మొండిగా వాళ్ళతో బయల్దేరాను. ఆ రోజు వేసుకున్న డ్రెస్ కూడా బాగా గుర్తే. బ్లూబ్లాక్ పోలియెస్టర్ ప్యాంట్, సిల్వర్ గ్రే షార్క్ స్కిన్ ఫుల్ హాండ్ షర్ట్. అసలే కురుపు. దాని మీద ఒత్తిడి తెస్తూ మరింత వేడి కలిగించే పోలియెస్టర్ ప్యాంట్. బలవంతంగా, కుంటుకుంటూ వాళ్ళ వెనక వెళ్ళాను. ఆ సినిమా చాలా విజయవంతమైన సినీమా. అయితే బలవంతంగా వెళ్ళి సినిమా చూసిన ఆనందం దక్కలేదు. చూసి వచ్చాక రాత్రి కొంచెం జ్వరం కూడా వచ్చింది.

మౌంట్ రోడ్ గీతాకేఫ్ పక్కనే మలుపు తిరగగానే  (ఇప్పుడు సబ్ వే ఉన్న చోట) అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ వుండేది. ఎక్కువగా ఆంగ్లో ఇండియన్స్, వెస్ట్ నర్లే వచ్చేవారు. ఓపెన్ ఎయిర్ లోనే పూలతీగెలు, పూలతొట్లు మధ్య చిన్న వాటర్ ఫౌంటెన్. దాని చుట్టూ కుర్చీలు, రౌండ్ టేబిల్స్ తో వుండేది. దానిని ఆనుకొని వున్న అతి చిన్న ధియేటర్ న్యూ ఎలిఫిన్ స్టన్. పారమౌంట్, వార్నర్ బ్రదర్స్  వాళ్ళ వార్ సినీమా లు ఎక్కువగా ఆడేవి. అందులోనే "హటారీ"  అనే  ఇంగ్లీష్ సినీమా చూసాను. చూడడం వరకే. బ్రహ్మాండమైన దృశ్యాలు చూసి ఆహా! ఓహో! అని ఆనందించడం వరకే. ఆ  అమెరికన్ ఇంగ్లీష్ ఒక్క మాటకూడా అర్ధమైయ్యేదికాదు. ఇప్పటికీ. నేనూ హాలీవుడ్ సినిమాలు చూస్తాననిపించుకోవడం కోసం.  స్టాటస్ సింబల్ కదా! 

ఓడియన్ లో "జిస్ దేశ్ మే గంగా బహతీహై", మిడ్ ల్యాండ్ లో "మొఘల్-ఏ-ఆజం" చూశాను. మరపురాని చిత్రాలు.

నేను చూసిన మొట్టమొదటి 70 mm సినిమా లిజ్ టేలర్ , రిఛర్డ్ బర్టన్, రెక్స్ హారిసన్ల "క్లియోపేట్రా". సఫైర్ థియేటర్లో. 64లో ఆ థియేటర్ కట్టినప్పుడు అందులో రిలీజైన మొట్టమొదటి సినిమా క్లియోపేట్రా. మద్రాసులోని మొదటి 70 mm థియేటర్. లాబీలో స్నాక్స్ కౌంటర్ దగ్గర ఓ 'Foosball' table కూడా ఉండేది. ఆ కౌంటర్ వెనక గోడమీద ఆరడగుల ఎత్తునుంచి రూఫ్ దాకా ఓ పది పదిహేనడుగులు పొడుగున్న wooden board మీద ఆ థియేటర్ లో అప్పటి వరకూ రిలీజైన సినిమాల లిస్ట్ డేట్ వారీగా ఉండేది. కాఫీలు, కూల్ డ్రింక్స్ తాగుతూ ఏ సినిమా చూసామో, లేదా చూడలేదో అని లెక్కబెట్టుకుంటూన్న జనం కూడా ఉండేవారు. మౌంట్ రోడ్ వేపు వ్యూ కనిపించేలా అద్దాలతో ఓ లిఫ్ట్ పైకి కిందికీ వెళుతూ కనిపించేేది.  

ట్రిప్లికేన్ ప్రాతంలో ముస్లీమ్ జనాభా ఎక్కువగా ఉండేది. అందువల్ల అక్కడి "స్టార్" ధియేటర్లో హిందీ సినీమాలు మాత్రం ఆడేవి. "సెలెక్ట్" సినిమాలో తెలుగువి వచ్చేవి. కానీ అక్కడికి వెళ్ళి సినీమా చూడడమంటే మరో ఊరు వెళ్ళడమే. ఈ సెలెక్ట్ లో మాస్టారితో కలసి ఒక సినిమాకు వెళ్ళాము. ఆ సినీమా విశేషాలు రానున్న వారాలలో. ఇక మిగిలిన సినీమా హాల్స్ లో అరవ సినీమాలే ఆడేవి.

ఇన్ని సినీమా హాల్స్ వివరాలు నాకు ఎలా తెలుసనే సందేహం మీకు రావడం సహజం. ఆరోజుల్లో మెడ్రాస్ రోడ్లలో వుండే ఇళ్ళ కాంపౌండ్ గోడలమీద పెద్ద పెద్ద సినిమా వాల్ పోస్టర్స్ పెద్ద పెద్ద అక్షరాలతో దర్శనమిచ్చేవి. సినీమా పోస్టర్స్ లేని సిటీ గోడలే అరుదు. అలాటి వాటిలో ఘంటసాల మాస్టారి ఇంటి కాంపౌండ్ వాల్. అదెందుకో మరి, సినీమా వాల్ పోస్టర్ల బారిన పడలేదు. కొన్నేళ్ళ తర్వాత సర్కారు వారు గోడలమీద సినీమా వాల్ పోస్టర్ల సంస్కృతికి చరమగీతం పాడారు. అయితేనేం, మద్రాస్ వీధుల గోడలన్నీ రాజకీయ పార్టీల కబ్జాకు గురి అయాయి. ఇప్పుడు ఏ గోడ చూసినా ఉదయసూర్యుడు, రెండాకులు, హస్తం, సుత్తి కొడవళ్ళు, వాటి నాయకుల నిలువెత్తు చిత్రాలు మనలను బెదిరిస్తూంటాయి.  

మా ఇంటి ఎదురుగా వుండే అన్ని ఇళ్ళ గోడలమీదా కొట్టచ్చేలా సావిత్రి, అంజలి, భానుమతి, సరోజాదేవి, రాజసులోచన, జమున, శివాజీ గణేశన్, ఎమ్జీయార్, ఎమ్ ఆర్ రాధ, పి.ఎస్ వీరప్ప, నంబియార్ మొదలగువారి  రంగు రంగులబొమ్మలు, దర్శనమిచ్చేవి. ఆ పోస్టర్లలో సినీమా హాల్స్, అవి ఉండే స్థలాలు ఇంగ్లీష్ లో ఉండేవి. సినీమా పేర్లన్నీ తమిళంలో పెద్దవిగా ఉండేవి. నేను తమిళం నేర్చుకోవడానికి ఎక్కువగా సహాయపడినవి ఈ వాల్ పోస్టర్లే. ఆ సినీమా పేర్లేమిటో తెలుసుకొని అందులోని అక్షరాలను పోల్చుకోవడంతో ప్రారంభించాను. ఒకసారి మా ఇంటి ఎదురు గోడమీద ఎమ్జీయార్, భానుమతి, కన్నాంబల బొమ్మలతో ఒక వాల్ పోస్టర్ చూసాను. అందులో భానుమతి, కన్నాంబ వుండడం నన్ను ఆకర్షించింది. వాళ్ళిద్దరూ మనోళ్ళు కదా! ఆ సినీమా పేరేమిటని మా రావమ్మను (పామర్తిగారి పెద్దమ్మాయి) అడిగాను. "తాయిక్కుప్పింతారమ్" అని చెప్పింది.  అందులో నాకు రెండే రెండు మాటలు అర్ధమయాయి. ఒకటి తాయి. మరొకటి కుప్పింతారం. నా కళ్ళకెదురుగా మా ఇంటి ముసలి పనిమనిషి 'తాయి', కుప్పించి ఎగిరింది అన్నట్టనిపించి నవ్వొచ్చింది. నాకెందుకు నవ్వొచ్చిందో అర్ధంకాని రావమ్మ అయోమయంగా చూసింది. తర్వాత ఎన్నేళ్ళకో నాకు తమిళం కొంత అర్ధమవడం ప్రారంభించాక ఆ సినీమా అసలు పేరు అర్ధమయింది " తాయ్ క్కు పిన్ దారమ్" (అంటే 'తల్లి తర్వాతే భార్య' అని అర్ధం). ఎమ్జీయార్ సినీమాలన్నింటిలో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా వుండేది. రాజకీయాలలో ఎదగడానికి కూడా తమిళనాడు మహిళల ఆదరణే కారణం.

ఈ మెడ్రాస్ ధియేటర్లలో ఎక్కడో ఏదో మూల ఘంటసాల మాస్టారు తమిళ పాటలు పాడిన సినీమాలు, సంగీతం చేసిన సినీమాలు ఆడుతూనేవుండేవి. తమిళ ప్రేక్షకుల చెవులకు ఘంటసాల పాట, పేరు సోకుతూనే వుండేది.

అలాగే, ఇన్ని సినీమా హాల్స్ గురించి తెలియడం వెనక మరో కధ ఉంది.1970 ప్రాంతాలలో మా టివికె శాస్త్రిగారికి మెడ్రాస్ లో తెలుగు సినీమాలు ఆడించి తెలుగులకు సేవచేయాలనే కోరికపుట్టింది. మద్రాసులోనే తెలుగు సినీమా తయారవుతున్నా, సినీమాలతో సంబంధంలేని తెలుగువారు తెలుగు సినిమా చూసే అదృష్టానికి నోచుకోలేదు. తెలుగు జనాభా ఎక్కువుండే ప్రాంతాలను, ఆ చుట్టుప్రక్కల వుండే సినీమా హాల్స్ వివరాలు సేకరించేపనిలో నన్నూ వినియోగించారు. ఆ సమయంలో ఈ ధియేటర్ల పేర్లు, స్థలాలు మరింతగా తెలిసాయి. చివరకు అందరికీ అందుబాటులో టి.నగర్ బస్ స్టాండ్ కు ఎదురుగా వున్న కృష్ణవేణి ధియేటర్ ను ఎంపిక చేశారు. దాని ఓనర్ ఒక నెల్లూరు రెడ్డిగారని గుర్తు. ప్రతీ ఆదివారం ఉదయం ఏదో ఒక తెలుగు సినిమాను మార్నింగ్ షోగా వేయడం జరిగింది. ఆ ప్రయత్నం విజయవంతమైతే ఈవెనింగ్ షోస్ వేయాలని భావించారు. సుమారు ఒక ఏడాది వేసాక ఆదాయం కంటే ఖర్చులే  ఎక్కువగా కనిపించడంతో ఆ తెలుగు సినిమా సేవకు స్వస్తి పలికారు. నాకు మాత్రం మెడ్రాస్ సినీమా హాల్స్ పరిజ్ఞానం మిగిలిపోయింది. 

1960ల తర్వాత ఆనంద్, సత్యం, సఫైర్, దేవీ కాంప్లెక్స్ - దేవీ, దేవీ పారడైజ్, దేవీబాలా, దేవీకళ - పైలట్, ఉడ్ లాండ్స్, శాంతి, అభిరామి, మోక్షమ్, వంటి మల్టీ స్క్రీన్ ధియేటర్లెన్నో వెలిసాయి. అయితే ఇవన్నీ చాలావరకూ ఈనాడు మూతబడి కళ్యాణ మండపాలుగానో, షాపింగ్ మాల్స్ గానో మారిపోయాయి. ఇవాళ సినీమా ధియేటర్ల బిజినెస్ అంత లాభసాటి కాదనే స్థితిలో వున్నారు. ఇప్పుడంతా మల్టీప్లెక్స్ కల్చర్. గత ఇరవై ఏళ్ళలో నేను థియేటర్లలో చూసిన సినీమాలు ఒక పాతిక కూడా వుండవు. ఎందుకంటే ఈ తరం సినీమాలు, అందులో వినిపించే సంగీతం విని, చూసి ఆనందించే స్థితిలో ఏమాత్రం లేకపోవడమే. 

ప్రేక్షకుల హృదయాలకు హత్తుకొని పదికాలాలపాటు (ఘంటసాలవారి డైలాగ్) పాడుకునేలా ఈనాటి సినీమా సంగీతం లేదు. 

1959 లో వచ్చిన  'మాంగల్యబలం' 'శభాష్ రాముడు' వంటి కొన్ని చిత్రాలు తమిళంలో కూడా రిలీజ్ అయి గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఘంటసాలవారి కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేసాయి. 

1959 లో తెలుగులో కూడా గాయకునిగా, సంగీత దర్శకుడిగా ఆఖిలాంధ్ర ప్రజలచేత కొనియాడబడేలా ఏన్నో సినీమాలు వచ్చాయి. అందులో ముఖ్యమైనవి - మాంగల్యబలం, అప్పుచేసి పప్పుకూడు, సతీ సుకన్య, పెళ్ళి సందడి, జయభేరి, ఇల్లరికం, రేచుక్క పగటి చుక్క, శభాష్ రాముడు, బాలనాగమ్మ, బండరాముడు, భక్త అంబరీష వంటి సినీమాలున్నాయి. వీటన్నిటిలో మకుటాయమానంగా నిలిచిపోయిన చిత్రం "జయభేరి". ఈ చిత్రంలో పాటలన్నీ ఆపాతమధురమే. ఇందులో ఘంటసాల మాస్టారు పాడిన పాటలన్నీ గాయకులకు సవాలు విసిరి హడలెత్తించేవే. అందులోని రసికరాజా, మది శారదా దేవి మందిరమే, రాగమయీ రావే, నందుని చరితము, యమునా తీరమున, ఇలా ఈ సినీమాలో పాటలన్నింటికీ ఘంటసాల మాస్టారు ప్రాణప్రతిష్ట చేసి సంగీత దర్శకుడు పెండ్యాలగారి కీర్తికి దోహదపడ్డారంటే అతిశయోక్తికాదు. జయభేరి చిత్రంలోని "మదిశారదాదేవి" పాట సన్నివేశం తనకెంతో ఇష్టమైనదని ఘంటసాల మాస్టారు అనేక సందర్భాలలో చెప్పారు. గురుపాదులైన నాగయ్యగారి సమక్షంలో అక్కినేని, ఇతర శిష్యబృందం ఈ పాటను ఆలపించినప్పుడు, విజయనగరంలో తమ గురువులు శ్రీ పట్రాయని సీతామశాస్త్రిగారి సన్నిధిలో తాను చేసిన సంగీత సాధన, గురువుగారి బోధన, వాత్సల్యం గుర్తుకు వచ్చేయని, ఈ రకమైన పాట చిత్రీకరణ చాలా ఆనందం కలిగించిందని చెప్పేవారు. 


                  "జయభేరి" చిత్రంలో "మది శారదాదేవి మందిరమే" పాట

ఈ సంవత్సరంలో ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలలో శభాష్ రాముడు, పెళ్ళి సందడి సినీమాలు సంగీతపరంగా కూడా మంచి పేరు తెచ్చి పెట్టాయి. శభాష్ రాముడు లోని "రేయీ మించేనోయి రాజా", "జయమ్ము నిశ్చయమ్మురా", పాటలు, "పెళ్ళిసందడి" సినీమా లోని "రావే ప్రేమలతా", "ఛమక్ ఛమక్ తారా, "జాలీ బొంబయిలే మామా", లీల, జిక్కిలు పాడిన 'సమయమిది డాయరా సరసుడా' అనే జావళీ తరహా పాట, "హైలేలో నారాజా రావోయి నీదేనోయి కన్నె రోజా" అనే ఓరియంటల్ మ్యూజిక్ తో వున్నపాట ఈనాటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే వున్నాయి. ఈ చిత్రాలలోని సంగీతం విషయంలో  మాస్టారు అన్ని రకాల సంగీత శైలులు ప్రయోగించడం ఒక విశేషం. శభాష్ రాముడు, పెళ్ళి సందడి ఈ రెండు సినీమాల రీరికార్డింగ్ చూశాను.


           "సమయమిది డాయరా" -పెళ్ళిసందడి - లీల, జిక్కి యుగళగీతం

"ఒక్క లెగ్ లో జాక్పాట్ మిస్. ఈ మాట ఎవరు ఎవరితో అన్నారు .....??

వచ్చే వారం ....  
...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

3 comments:

చుండి వేంకట రాజు said...

ధన్యవాదాలండి

P P Swarat said...

మీకు కూడా నా ధన్యవాదాలు.

హృషీకేష్ said...

మద్రాసు లోని సినిమా థియేటర్లు అన్నింటినీ చూపించారు. తెలుగు వారు ఎక్కువగా ఉండేవారు కదా అక్కడ. తెలుగు చిత్రాల కోసం ఎక్కువ హాళ్లు లేకపోవడం చిత్రమే. ధన్యవాదాలు!!🙏🙏హృషీకేష్