visitors

Saturday, January 23, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పదహారవ భాగం

23.01.2021 - శనివారం భాగం - 16*:
అధ్యాయం 2  భాగం 15 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"నాన్నగారు! ముందు బుహారిలో ఫలూడా. తర్వాత రేస్ కోర్సుకు"  మాస్టారికి పెద్దబాబు విజ్ఞాపన. "సరేలే" మాస్టారి అభయం. కారు ఎక్కగానే విజయబాబుకు ఎక్కడలేని హుషారు వచ్చేసింది. ఒక మధ్యాహ్నం పూట మేము ముగ్గురమే షికారుకు బయల్దేరాము. ఆరోజు మాస్టారు ఖాళీగావున్నారు. కారు ఉస్మాన్ రోడ్ లో టి.నగర్ బస్ స్టాండ్ దాటి తిన్నగా సిఐటి నగర్ మీదుగా మౌంట్ రోడ్, సైదాపేట మీదుగా గిండీవేపు  రేస్ హార్స్ లా కారు దూసుకుపోతోంది. డ్రైవర్ గోవిందు ముఖం కూడా వెలిగిపోతూనే వుంది.  కారు ముందుగా గిండీవేపు వెళ్ళడం చూసి పెద్దబాబు(విజయకుమార్) గునిసాడు. ఈలోగా మాస్టారు ఒక దగ్గర  ఎడమ చేతివేపు రోడ్ ఓరగా కారును ఆపమన్నారు. ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడా ఏ  షాపులు, భవనాలు ఏవీ లేవు. అక్కడ  ఇనపముళ్ళ కంచెతో వున్న ఒక పొడుగాటి గోడ, గోడ వెనక చాలా పెద్ద మైదానం కనిపించింది. అయ్యగారు ఇక్కడే ఎందుకు కారు ఆపించారో గోవిందుకు అర్ధం కాలేదు. మాస్టారు పెద్దబాబును కారులోంచి దింపి కారు బోనెట్ మీద కూర్చోపెట్టారు. చెట్లక్రింద చల్లటి నీడలో మంచి గాలి వీస్తూంటే చాలా హాయిగా అనిపించింది. ఇలా కొంతసేపు గడిచాక గోడ వెనక ఉన్న మైదానంలో దూరంగా పరుగులు తీస్తున్న కొన్ని గుర్రాలు కనిపించాయి. వాటిని చూడగానే పెద్దబాబు లో ఉత్సాహం పెరిగింది. వరసగా చాలా గుర్రాలు మా ముందునుంచే పరుగులు తీస్తూ వచ్చి, పక్కకు తిరిగి మరోవేపు మహాస్పీడ్ గా వెళ్ళాయి. అవే రేస్ గుర్రాలని వాటి మీద స్వారీ చేస్తున్నవాళ్ళనే జాకీలంటారని తెలుసుకున్నాను అందరూ నెత్తిమీద క్యాప్ లు, కాళ్ళకుపొడుగాటి తోలుబూట్లతో ఉన్నారు. మళ్ళా మరో ఐదు నిముషాల తర్వాత ఆ గుర్రాలు మరింత వేగంతో దుమ్మురేపుకుంటూ వెళ్ళాయి. వాటిని చూసి పెద్దబాబు ఆనందంగా అరవడం మొదలెట్టాడు.ఈ విధంగా ఓ అరగంట సేపు ఆ గుర్రాల పరుగులు చూసేప్పటికి పెద్ద బాబుకు నీరసం వచ్చేసింది. "నాన్నగారూ, బుహారీ" అని పాట మొదలుపెట్టాడు. ఆవిధంగా నా జీవితంలో  మొదటిసారిగా(అదే ఆఖరుసారి కూడా) గుర్రపందేలను ప్రత్యక్షంగా, చాలా దగ్గరగా, స్పష్టంగా చూడడం జరిగింది.

(మేము కారు నిలుపుకొని నిలబడి చూసిన స్థలంలో కొంతకాలం క్రితం కోకోకోలా వాళ్ళ బాట్లింగ్ ప్లాంట్ ఉండేది. ఇప్పుడు ఆ స్థలమంతా ఎమ్జీయార్ యూనివర్శిటీ క్యాంపస్ గా మారిపోయింది. దానికి ఎదురుగా SPIC బిల్డింగ్ వచ్చింది. రోడ్ రెండు పక్కలా భవనాలమయం. ఫ్లైఓవర్లతో, ఎయిర్ పోర్ట్ వేపు వెళ్ళి వచ్చే వాహనాల రొదతో ఇప్పుడు ఒక్క సెకెండ్ కూడా ఆ ప్రాంతాన నిలబడలేము. ఆ ఎత్తైన భవనాల వెనక ఆ పాత గిండీ రేస్ కోర్స్ అలాగేవుంది. అయితే , ఇప్పుడు చెన్నైలో హార్స్ రేస్ లు జరుగుతున్నాయా, లేదా అనే విషయం మీద నాకు అంత అవగాహన లేదు.) 


గిండీలో హార్స్  రేస్ లు చూసి మళ్ళా మౌంట్ రోడ్ మీదుగా కెథెడ్రల్ రోడ్ కు వెళ్ళి అక్కడనుండి బీచ్ కు వెళ్ళాము. అక్కడ ట్రిప్లికేన్ బీచ్ లో ఒక బుహారీ  రెస్టారెంట్ వుంది. వాళ్ళదే మెయిన్ రెస్టారెంట్ మౌంట్ రోడ్ వెల్లింగ్టన్ పక్కన, (ఇప్పుడు లేదు. దర్గాకు ఎదురుగా అనుకుందాము) మరొకటి సెంట్రల్ స్టేషన్ కు ఎదురుగా వుండేవి. ఇప్పుడూ ఉన్నాయి. ఆనాడు బుహారీకి వెళ్ళడం ఒక స్టాటస్ సింబల్. అలాటిచోట్ల నేనూ అడుగుపెట్టాను. గొప్పే కదూ!

ఆనాటి పెద్ద పెద్ద తారామణుల కోసం ప్రత్యేకించి బుహారీ నుండి పక్కనే వున్న బిలాల్ నుండి భోజనాలు, ఫ్రెష్ జ్యూస్ లు ప్యాక్ చేయించి ఎక్కడో వున్న కోడంబాక్కం స్టూడియోలకు అష్టకష్టాలు పడి తీసుకువెళ్ళేవారు. ఆ పదార్ధాలు చూస్తే తప్ప ఆ నటీమణులకు మూడ్ వచ్చేదికాదు. రా ఫిల్మ్ ఎంత తిన్నా షాట్ ఓకే అయేది కాదు. ఇంతకీ ఆ భోజనాలన్నీ అమ్మగార్ల వెంట వచ్చే అమ్మగార్ల కోసం. అమ్మ ఆనందపడితేనే బేబి ఖుషీ అవుతుంది. ఈలాటి నటీనటులమీద కె.బాలచందర్ మరచిపోలేని బ్రహ్మాండమైన సెటైర్లు రాశారు. సర్వర్ సుందరం సినీమాకోసం. నాగేష్, మనోరమ, ఎస్విరంగారావు ఆ సీన్ లలో అద్భుతంగా జీవించారు.

ఘంటసాల మాస్టారికి అలాటి భేషజాలు ఏవీ ఎప్పుడూలేవు. ఎప్పుడైనా  పిల్లల ముచ్చట తీర్చడం కోసం తీసుకు వచ్చేవారు. బుహారిలో టీ చాలా టేస్ట్ గా వుంటుందని ఆనాటి ప్రతీతి. ఆ రెస్టారెంట్లలో మరో విశేషం ఏమిటంటే, మెడ్రాస్ లో ఆనాడు ఆ హోటల్స్ లో మాత్రమే జూక్ బాక్స్ లుండేవి. పావలాకో పాట. మనకు కావలసిన సినీమా పాటను సెలెక్ట్ చేసుకొని స్లాట్ లో ఒక పావలా బిళ్ళ తోస్తే మనం అడిగిన పాట వినిపిస్తుంది. అయితే మనం కోరిన పాట వెంటనే రాదు. ముందువేసిన పావలాగాళ్ళ పాటలన్నీ వినిపించాక మన పావలా వంతు వస్తుంది, అప్పుడే మనక్కావలసిన పాట విపిస్తుంది. ఈలోగా తాపీగా సమోసాలు (వెజ్/నాన్ వెజ్) స్నాక్స్ తింటూ, స్పెషల్ టీయో, ఫ్రూట్ జ్యూస్ లో సేవిస్తూ, జూక్ బాక్స్ లో ఇతరులు కోరిన పాటలు వింటూ వచ్చీపోయే జనాలను చూస్తూ, కాలక్షేపం చెయ్యొచ్చు. బీచ్ బుహారీ అయితే సముద్రపు గాలి కూడా అదనం. ఫ్రీ.  చాలా సంతోషంగా గడిచేది. ఆ బుహారీ జూక్ బాక్స్ లోనే 'హౌరాబ్రిడ్జ్', 'చైనాటౌన్', 'ఝనక్ ఝనక్ పాయల్ బాజే', 'అవారా', 'మధుమతి' సినీమాలలోని హిట్ పాటలు విన్నాను. నేను కూడా ఒకసారి నా దగ్గర పావలా కాయిన్ లేక క్యాష్ కౌంటర్లో చిల్లర యిచ్చి పావలా నాణెం తీసుకొని 'జిందగీ' సినీమాలోని కె ఎల్ సైగల్ పాట 'సో జా రాజకుమారి సోజా' పాట మీద  (ఏ పాట కోరుకోవాలో తెలియక) మీట నొక్కాను. ఒకపక్క బాబూ వాళ్ళ నాన్నగారు ఏమనుకుంటారో అని భయం. ఆయనదేమీ గమనించనేలేదు. ప్రశాంతంగా టీ త్రాగుతూ, పెద్దబాబు ఫలూడా తింటూవుంటే  చూస్తూ జూక్ బాక్స్ లో పాటలు వింటూన్నారు. ఎంతకీ నా 'సోజా రాజకుమారి' మాత్రం రాలేదు. ఎక్కడో బజ్జుండిపోయింది. వేరే పాటలు వస్తూన్నాయి. చూసి చూసి విసుగెత్తింది. ఈలోగా వచ్చినపని పూర్తయింది వెళ్ళిపోదామన్నాడు పెద్దబాబు. నేను కోరిన పాట వేయని జూక్ బాక్స్ ను, పోయిన నా పావలాను తల్చుకుంటూ మాస్టారి వెనకాలే వచ్చి కారెక్కాను. పావలా పోతే పోయిందిగానీ ఆనాటి షికారు మరపురాని ఆనందం కలిగించింది. నెం.35, ఉస్మాన్ రోడ్ లో ఇలాటి మధురజ్ఞాపకాలు ఎన్నో.



"గోవిందా! గోవిందా! గోవిందా!" అని త్రిస్థాయిలో ఎవరో మాస్టారింట్లోంచి ముమ్మారు పిలిచారు. గోవిందుడు పలకలేదు. నేను  బయటకు వచ్చి నూతి దగ్గర చూశాను. అక్కడలేడు. పోర్టికోలో చూశాను అక్కడా లేడు. గేట్ తెరచి బయటకు వెళ్ళి చూస్తే నోట్లో బీడీ, చేతిలో రోస్ కలర్ పాకెట్ సైజ్ పుస్తకంతో ఎదురింటి నామగిరి డాక్టరమ్మ ఇంటికి వచ్చిన రిక్షావాడితో మాట్లాడుతున్నాడు. ఆ రిక్షావాడి చేతిలో కూడా పసుపు, ఆకుపచ్చ రంగు కాగితాలున్నాయి. విషయం అర్ధమయింది. ఈ సమయంలో అయ్యగారు, అమ్మగారే కాదు సాక్షాత్తు తిరుపతి గోవిందరాజులే వచ్చి పిలిచినా ఈ గోవిందుడి చెవినపడదు. నేను వెళ్ళి "ఇంట్లో పిలుస్తున్నారని" చెప్పాను. వెంటనే, నోట్లో బీడీ క్రిందపడేసి, చేతిలోని పుస్తకం, రంగు కాగితాలు లుంగీలోని
నిక్కర్ జేబులోకి త్రోసేసి, ఆ రిక్షావాడిని అక్కడే వుండమని చెప్పి ఇంట్లోకి పరిగెత్తాడు. ఈ గోవిందు ఘంటసాల వేంకటేశ్వర్లువారి  రథసారధి (కారు డ్రైవర్). మేము మెడ్రాస్ వెళ్ళినప్పటినుండి మాస్టారింట్లో అతనే కారు డ్రైవర్. చూడడానికి చాలా సామాన్యంగా వుంటాడు. కాకీ నిక్కర్, పైన తెల్ల లుంగీ చుట్టుకొని, తెల్లచొక్కాతో వచ్చేవాడు. మాస్టారు రిహార్సల్స్ కు వెళ్ళినా, రికార్డింగ్ లకు వెళ్ళినా, బయట షికార్ల కు వెళ్ళినా, అమ్మగారు షాపింగ్ లకు వెళ్ళాలన్నా, పిల్లలను స్కూలుకు తీసుకు వెళ్ళాలన్నా గోవిందుడు ఉండాల్సిందే. ఉదయం ఎనిమిది గంటలనుండి రాత్రి వరకూ మాస్టారింట్లోనే ఉండేవాడు. రాత్రి ఒకసారి నెం. 35, ఉస్మాన్ రోడ్ ను వదలి వెళ్ళాడంటే అతని లోకమేవేరు. బ్రహ్మాది రుద్రులు వచ్చినా ఈ గోవిందుడితో ఏ పని చేయించలేరు. ఎందువల్లో వేరే చెప్పక్కర్లేదుగా! ఈ గోవిందు గ్రిఫిత్ రోడ్ (ఇప్పుడు సుప్రసిధ్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు "మహారాజపురం సంతానం" రోడ్ గా మారింది) లో 'శ్రీకృష్ణగాన సభ' పక్కనున్న వాసన్ స్ట్రీట్ చివర కోడంబాక్కం స్టేషన్ కు వెళ్ళే త్రోవలో చిన్న(రైల్వే)గేట్ దగ్గర గుడిసెల ఇళ్ళుండేవి (రాజపిళ్ళైతోట్టం స్లం) అక్కడ ఒక గుడిసెలో గోవిందుడి  కుటుంబం ఉండేది. ముగ్గురో నలుగురో  సంతానం. సరిగా తెలియదు. ఆనాటికి అంతా చిన్నపిల్లలే. డ్రైవర్ గోవింద్ చాలా మంచివాడు, నమ్మకస్తుడు. కానీ అతనికి సరైన చదువు సంధ్యలు లేక కొన్ని దుర్గుణాలకు అలవాటు పడ్డాడు. అందులో ఒకటి గుర్రపుపందేలు. ఆ సీజన్ లో శని ఆదివారాలు వస్తే చాలు, సమయం చూసుకొని గిండీ రేస్ కోర్స్ కు పరిగెత్తేవాడు. ఎప్పుడు చూసినా కారు గేర్ బాక్స్ లో తెలుపు, ఎరుపు, పసుపు, పచ్చ‌, నీలం అంటూ రంగు రంగుల అట్టలున్న పాకెట్ సైజ్ పుస్తకాలు పడివుండేవి. ఒక్క కారు డ్రైవింగ్ చేసే సమయంలో తప్ప మిగిలిన సమయాలలో పోర్టికో అరుగుమీద కూర్చొని ఆ విజ్ఞాన గ్రంధాలను తిరగేస్తూండేవాడు. వాటిలో  పందెపు గుర్రాల పేర్లు, వాటిని స్వారీ చేసే జాకీల పేర్లు, గుర్రాలు, జాకీల వయసు, వాళ్ళ యజమానులు, ఏ ఏ గుర్రం ఎన్నిసార్లు గెలిచిందో, ఇత్యాది వివరాలన్నీ వుండేవి. వీటన్నిటినీ క్షుణంగా అధ్యయనం చేసి, నాయర్ టీ కొట్టుదగ్గరున్న రిక్షా వాళ్ళందరితో సంప్రదింపులు జరిపి ఆ గుర్రాలమీద కాచేవాడు. ఎప్పుడైనా నాలుగు డబ్బులు కంటబడితే జాక్పాట్ కూడా ఆడేవాడు. జాక్పాట్ కొడితే దశ తిరిగిపోతుందని ఆశ. గుర్రపందాలలో పోవడమేగానీ, వచ్చి బాగుపడడమనేది పచ్చి కల్ల. ఒక వారం రేసుల్లో ఎవరైనా ఒక వంద గెలిస్తే అంతకుముందే మరెన్నో వందలు, వేలు పోగొట్టుకున్నారని అర్ధం.  "ఒక్క లెగ్ లో జాక్పాట్ మిస్సయిందనే" మాట ఎంతోమంది నోట విన్నాను. ఆ మాటలో నిజం వుండదు. ఐదు లెగ్ లలో బెట్ కాచేప్పుడు ఐదింటి మీది గుర్రాలు గెలిస్తే వాటిమీద డబ్బు కాచిన వాళ్ళకు లక్షల్లో డబ్బు వస్తుంది.  ఈ ఐదింటిలో ఒకటి పోయి మిగిలిన నాలుగూ గెలిచినా పెద్ద మొత్తమే లభిస్తుంది. కానీ అలా జరగదు. వీళ్ళు పందెం కాచిన గుర్రాల్లో ఒకటో, రెండో మాత్రమే ముందుంటాయి. ఈ వ్యవహారం అంతా అర్ధం కావాలంటే మహాశ్వసాగర మథనం చేయాల్సిందే. రేసులకు సంబంధించిన వివరాలన్నీ 'ది హిందూ', 'ది ఇండియన్ ఎక్స్ ప్రెస్, 'దినత్తన్ ది' వంటి దిన పత్రికల క్రీడారంగం కాలమ్స్ లో వేసేవారు. అలాటి వార్తల్లో 'బొబ్బిలి ప్లేట్' 'వెంకటగిరి ప్లేట్' అంటూ కొన్ని తెలుగు వాళ్ళ పేర్లు కనపడేవి.  ఆరోజుల్లో ఈ గుర్రపందేల వ్యసనం సినీమావాళ్ళలో కూడా చాలా ఎక్కువగానే వుండేది. దీన్ని ఆధారం చేసుకొని తమ జీవనాన్ని వెళ్ళబుచ్చుకున్నవారు ఉండేవారు. మద్రాస్ టి.నగర్, విజయరాఘవాచారి రోడ్  లో "ఆంధ్రా సోషల్ & కల్చరల్ క్లబ్"లో తెలుగు సినీమా ప్రముఖులెందరో సభ్యులు. టెన్నీస్, ఛెస్  ప్రాక్టీస్ లతోపాటూ  పేకాటలు జోరుగా సాగేవి. గుమ్మడి, జి.వరలక్ష్మి, ఎస్.వి.రంగారావు వంటి నటులెందరో అక్కడ కనిపించేవారు. చాలా పెద్ద ఎత్తునే డబ్బు చేతులు మారేది. అక్కడికి వచ్చేవారిలో చాలామందికి గుర్రపందేలాట మీద కూడా వ్యామోహం వుండేది. ఎవరికి తగ్గ స్థాయిలో వారు డబ్బు పోగొట్టుకునేవారు. అప్పుడప్పుడు కంటితుడుపుగా కొన్ని వందలు గెలిచేవారు. ఈ హార్స్ రేసుల మీద వాటిలో పాల్గొనే గుర్రాలు, జాకీల మీద నిత్యాధ్యాయనంతో పరిశోధనలు చేసి ఇతరులకు టిప్స్ ఇచ్చే నటుడు ఒకాయన వుండేవారు. ఆయన ఘంటసాల మాస్టారు తీసిన  ఒక సినీమాలో కూడా నటించారు(?) మంచి అందగాడు. చక్కగా నటిస్తాడనే పేరు తెచ్చుకున్నవాడు. తెలుగు సినీమాలలో హీరోగా ఒక  వెలుగు వెలిగి ఆరిపోయాడు. జీవనమే కష్టమైపోయింది. చదువుకున్నవాడు కావడం వలన కొంతమంది సినీ ప్రముఖుల పిల్లలకు ట్యూషన్లు చెప్పుకోవడంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అలాటి నటుడు ఈ గుర్రపందేలకు సంబంధించి ఇతరులకు టిప్స్ ఇస్తూ వారిచ్చే పది, పాతికలతో కాలం గడిపేవాడు. 1965లు వచ్చేసరికి ఆ నటుడికి వేషాలు ఇచ్చే నిర్మాతే కరువయ్యాడు. సావిత్రి, కృష్ణకుమారిల పక్కన హీరోగా నటించిన ఆ నటుడిని జనాలు మర్చిపోయారు.

సినీమారంగం పూలపాన్పు కాదు. ముళ్ళమయం. అదృష్టం అందరినీ వరించదు. అలా వరిస్తే, తెలివైనవారు, విజ్ఞత కలిగినవారైతే తమకు కలిసొచ్చిన అదృష్టానికి తమ కృషిని, ప్రతిభను జోడించి ముందుకు దూసుకుపోతారు. అలాటివారిని వేళ్ళతో లెఖ్ఖపెట్టవచ్చును. ఇదొక వ్యామోహాల పుట్ట. సినీమా రంగానికి చెందిన ఎంతోమంది జూదం, త్రాగుడు, గుర్రపందేల వంటి వ్యసనాలతో   పూర్తిగా రోడ్ న పడ్డారు. అయినా షో నడుస్తూనేవుంది.

అయితే, ఈ వ్యసనపరులు ఇతర రంగాల్లోమాత్రం లేరా? వున్నారు. అయితే మనకు తెలిసే అవకాశం తక్కువ. అదే సినీమారంగానికి చెందినవారైతే వార్త గుప్పుమంటుంది. 

మని+షి =మనిషి అని ఒకరు నిర్వచించారు.ఈ రెంటికీ బానిస కానంతవరకే మనిషి. మని మత్తుకు, మదిర మత్తుకు, మగువ మత్తుకు అలవాటుపడితే అధఃపతనమే. ఈ మూడు 'మ'మ కారాలకు దూరంగా వుండగలిగినవాడు ధన్యజీవి. కానీ ఈలోకంలో పరిపూర్ణ పురుషులంటూ ఎవరూ లేరు. మనకు తెలియని, మనం చూడలేని పరమాత్మ తప్ప. అందరూ  ఏవో రకమైన బలహీనలతో బ్రతికేవారే. కాకపోతే హిపొక్రసితో ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూంటారు. అంతే.

మన  చుట్టు వున్న సాంఘిక వాతావరణం ఎలావుంటుందో, మనకి జీవితంలో ఎన్ని రకాల మనుషులు తారసపడతారో అర్ధం చేసుకోవడానికి నెం.35, ఉస్మాన్ రోడ్ కొంత దోహదపడుతుందని భావిస్తున్నాను.

ఘంటసాలవారి కారు డ్రైవర్ గా గోవింద్ చాలా రకాల కార్లనే తోలాడు. మేము మెడ్రాస్ వెళ్ళేనాటికి మాస్టారింట్లో మూడు కార్లుండేవి ఒకటి వాక్సాల్ ముదురాకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగుల్లో వుండేది. దాని నెంబర్ MSZ 4997. మరొకటి ముదురాకు పచ్చ మారీస్ మైనర్. 




మరొకటి నల్లరంగు నాష్ కారు. సొంత సినీమా నిర్మాణం జరిగినంతకాలం ఈ మూడు కార్లు వుండేవి. ఇవి చాలక వ్యాన్లూ అద్దెకు తీసుకునేవారు. కొన్నాళ్ళకు వాక్సాల్ కారు అమ్మేసి హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళదే 'ల్యాండ్ మాస్టర్' నల్ల రంగు కారు కొన్నారు. (ఆ తరవాత రెండు అంబాసడర్ లు ఒకదాని తరవాత ఒకటి వచ్చేయి. అందులో ఒకటి పచ్చరంగు MSS 1130. తరవాతది లైట్ బ్లూ కలర్ MSW 8929 అని గుర్తు. అదే 35, ఉస్మాన్ రోడ్ పోర్టికోలో దర్శనమిచ్చిన ఆఖరి కారు). లాండ్ మాస్టర్ అప్పట్లో కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది. ఏదో దసరా పండగల సమయంలో ఇంటికి వచ్చింది. ఆ కారుకు పూజచేసి పూలదండలు వేసి కారంతా గంధం, కుంకుమలు చిలకరించి, నాలుగు టైర్ల క్రిందా నాలుగు నిమ్మకాయలు పెట్టి, హారతినివ్వడం నాకు వింతగా, ఆనందంగా అనిపించింది. ఆ కార్యక్రమం అంతా అయ్యాక ఒక రౌండ్ కొట్టివద్దామని బయల్దేరారు.  పెద్దబాబు, నేనూ కూడా వున్నాము. ఇంటిబయటకు వచ్చి ఎడమప్రక్కకు తిరిగి ఉస్మాన్ రోడ్ మీదుగా బజుల్లా రోడ్, వాణీమహల్, డా. నాయర్ రోడ్ లోనుండి పాండీబజర్  వచ్చేప్పటికి వర్షం మొదలయింది. అక్కడనుండి పానగల్ పార్క్ మీదుగా ఉస్మాన్ రోడ్ ఇంటికి చేరేప్పటికి వర్షం ఎక్కువయింది. కొత్తకారుకు అద్దిన చందనమంతా కరిగిపోయింది.  ఆ సమయంలో కారు డ్రైవ్ చేసినది గోవింద్ కాదు. జివిఎస్ ప్రొడక్షన్స్ మేనేజర్ సుబ్బు (సుబ్బారావు). మాస్టారింటి కుటుంబ సభ్యుడిలా మసిలేవారు. ఈయన సుందర్లాల్ నహతాగారి సినీమా కంపెనీల ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశారు. 

మాస్టారింట్లో ఎవరికీ డ్రైవింగ్ రాదు. సావిత్రమ్మగారికి నేర్చుకోవాలనే కుతూహలం వుండేది. ఆ క్రమంలో డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలెట్టిన మూడో రోజునో, నాల్గవరోజునో కారును ఇంటిగేట్ గోడకు (మెల్లగానే అనుకోండి) గుద్దించేయడంతో కారు డ్రైవింగ్ శిక్షణకు మంగళం పాడడం జరిగింది. అయితే దానివలన ప్రమాదమేమీ జరగలేదు. పిల్లలలో పెద్దబాబు, చిన్నబాబు పెద్దయ్యాక కారు డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఈ నల్ల ల్యాండ్ మాస్టర్ కి ముందు నుండి దాహమెక్కువ. ఎంత పెట్రోల్ పోసినా చాలేదికాదు. మాన్యూఫాక్చరింగ్ లోనే లోపం అని అనుకునేవారు. మాస్టారికి అలవాటైన పెట్రోల్ బంక్ వాణీమహల్ ఎదురుగా వున్న 'గోపాలకృష్ణ ఆటోమొబైల్  సర్వీస్'. పెట్రోల్ పోయించాలన్నా, కారు సర్వీసింగ్ చేయాలన్నా అక్కడే. ఇప్పటికీ ఆ పెట్రోల్ బంక్ అక్కడేవుంది. ఈ కారు ఎక్కువ కాలం లేదు. ఈ కారు ఎక్కిన కొత్త రోజుల్లో నాకు వింతగా అనిపించింది, అంతకుముందు ఎరుగనిది ఒకటి ఉండేది. రోడ్ మీద వెడుతున్నప్పుడు కుడి, ఎడమల వేపు తిరిగేప్పుడు ఒక స్విచ్ నొక్కితే  ఆటోమెటిక్ గా కారు బయట రెండు డోర్ల మధ్య ఒక ఇండికేటర్ లో లైట్ వెలుగుతూ ఠక్ అని బయటకు వచ్చేది. ఈ ఇండికేటర్ రెండు పక్కలా ముందు వెనక డోర్ల మధ్య వుండేది. పక్కలకు తిరిగేప్పుడు చెయ్యి బయటపెట్టి చూపించక్కరలేదు. కానీ డ్రైవర్ గోవిందు ఆ ఇండికేటర్లను ఉపయోగించేవాడు కాదు. అది నాకు పెద్ద కొరతగా వుండేది. అందువల్ల ఏదో పెద్ద ప్రమాదం జరిగిపోతుందని భయపడుతూ వుండేవాడిని. అలాగే కారు ముందువేపున్న రెండు లైట్లకి సగానికి పైగా నల్లటి పెయింట్ విధిగా అన్నికార్లకు పూసేవారు. అది ట్రాఫిక్ రూల్. కొన్నాళ్ళకు అదిపోయి మధ్యలో బల్బ్ దగ్గర పెద్ద బొట్టు పెట్టడం మొదలెట్టారు. రాత్రిపూట ప్రయాణం చేసేప్పుడు ఎదురుకార్లు హెడ్ లైట్స్ వేయకూడదు. ఎదురుగా వచ్చే కారును గమనిస్తూ లైట్లను ఆన్ ఆఫ్ చేస్తూ డ్రైవ్ చేయాలి. ఇప్పుడెవరూ ఏ ట్రాఫిక్ రూల్స్ ను సక్రమంగా పాటించనే పాటించరు. అందుకే అధికశాతం లారీ, బస్, కారు, మోటర్ సైకిల్ ఆక్సిడెంట్లు రాత్రిపూటే జరుగుతాయి. మనలో హక్కుల గురించి అథార్టీగా మాట్లాడేవారేతప్ప పాటించవలసిన విధులగురించి పట్టించుకోరు. అది తమకోసం కాదన్నట్లుంటారు.

ఇంతలో హిందుస్థాన్ మోటార్స్ ల్యాండ్ మాస్టర్ ను మాడిఫై చేసి 'అంబాసిడర్' మోడల్ ను మార్కెట్లోకి పెట్టారు. అప్పట్లో రంగుల కార్లు ఎక్కువగా ఉండేవి కావు. నలుపు, తెలుపు కార్లు మాత్రమే. అలాటి సమయంలో అంబాసిడర్ లో రంగు రంగులవి వచ్చేయి. మాస్టారు ల్యాండ్ మాస్టర్ ను మార్చి అంబాసిడర్ కొన్నారు. దాని నెంబర్ MSS 1130. లేత ఆకుపచ్చలో తెలుపు మిక్స్ చేస్తే వచ్చే రంగు. చాలా ఆకర్షణగా వుండేది. ఆ రంగు కార్లు చాలా తక్కువగా ఉండేవి. కొన్నేళ్ళ తరువాత ఆ కారు మార్చి మరొకటి తీసుకున్నారు. ఆ రోజుల్లోని బ్యూక్, ఛెవర్లెట్, కాడిలాక్, డాడ్జ్, ప్లిమత్ వంటి స్కై బ్లూ, గ్రీన్, రెడ్ కలర్ కార్లు సావిత్రి, సరోజాదేవి, ఎన్టీఆర్, ఎఎన్నార్, భానుమతి, దేవిక, శివాజీ, ఎమ్జీయార్, ఎమ్ ఆర్ రాధా, జెపి చంద్రబాబు (తమిళం కమేడియన్) వంటి ప్రముఖుల దగ్గరవుండేవి. కానీ అన్నిటికంటే అన్ని కాలాలకు, అన్ని వర్గాలకు సౌకర్యంగా వుండేది అంబాసిడర్ ఒక్కటే అని అనుకునేవారు. నిన్న మొన్నటివరకు అంబాసిడర్ కార్లే ఎక్కువగా ఉండేవి. దీనితోపాటు ఆస్టిన్ ఇంగ్లండ్, ఆస్టిన్ ఇండియా, స్టాండర్డ్ ఫియట్ కార్లు  కూడా చాలా పాప్యులర్ గా, రోడ్లమీద ఎక్కువగా కనపడేవి. ఈ ఫియట్ కారే తర్వాత ప్రిమియర్ పద్మినీగా రూపాంతరం చెందింది. మరోటి ఆరోజుల్లో అరుదుగా కనిపించే కారు హెరాల్డ్ (గుండమ్మ కధలో NTR డ్రైవ్ చేసేది).

కారు డ్రైవింగ్ విషయంలో నటి సావిత్రి చాలా రాష్ డ్రైవర్ అని పేరు. విపరీతమైన స్పీడ్ తో కారు నడిపేది. స్పీడ్ గా వెళ్ళనప్పుడు కారెందుకు అనేది ఆవిడ తత్త్వం. సావిత్రి షోలవరం కారు రేసుల్లో కూడా పాల్గొనేదని ఆనాటి పత్రికలలో చదివాను. సావిత్రికి పూర్తి విరుధ్ధం ఒక తమిళ విలన్ కమేడియన్. ఆయన మహా శృంగారపురుషుడు. అతనికి ఎంతమంది భార్యలు, ఎంతమంది ఉంపుడుగత్తెలు, ఎంతమంది పిల్లలున్నారో అతనికే తెలియదట. ఆ నటుడి గురించి జోక్ చెప్పుకునేవారు. కోడంబాక్కం రోడ్ల మీద ఇరవైమైళ్ళ స్పీడ్ కన్నా కారును తోలద్దని డ్రైవర్ కు చెప్పేవాడట. ఎందుకంటే ఆ రోడ్లమీద కార్లకు అడ్డంబడి ఆడుకునే చిన్న పిల్లలలో తన సంతానం కూడా వుంటుందేమోనని అతని భయమట. ఆయన పిల్లలు చాలామంది తమిళ సినీమాలలో, టివి సీరియల్స్ లో ఇంకా నటిస్తూనే వున్నారు.

ఘంటసాల వారింట పనిచేసినవారంతా మొదట్నించీ చివరి వరకూ  వారితో కలసి జీవితంలో ప్రయాణం సాగించినవారే. అలాటివారిలో ఈ గోవింద్ కూడా ఒకడు. నాకు తెలిసి అతనివల్ల ఒక్కసారి కూడా ఏ విధమైన కారు ప్రమాదం జరగలేదు. అంత జాగ్రత్తగా కారు నడిపేవాడు. బయట వూళ్ళకు రాత్రి ప్రయాణాలు చేసేప్పుడు  బయల్దేరే ముందే హెచ్చరిక చేసేవాడు, నిద్రపోయేవాళ్ళు వెనక సీట్లో కూర్చోమని, తన పక్కన వద్దని. తన పక్కన ఏదో మాట్లాడుతూ నిద్రకు జోగనివాళ్ళనే కూర్చోమనేవాడు. నిద్రపోయేవాళ్ళు పక్కనుంటే తనకు  తెలియకుండానే కళ్ళుమూతలు పడతాయనేవాడు. అలాటి డ్రైవర్ డ్రైవ్ చేస్తున్న కారు ఒకసారి బెంగుళూర్ నుండి వస్తూ ప్రమాదానికి గురయిందని అందులో ప్రయాణం చేస్తున్న ఘంటసాల సోదరులకు తీవ్రగాయాలయ్యాయని చాలా ప్రమాదకర పరిస్థితిలో వున్నారని ఒక  తమిళపత్రికలో ప్రచురించినట్లుగా వార్త వచ్చింది. ఇంట్లో అందరూ చాలా ఆందోళన చెందారు. ఇప్పటిలా అప్పుడు టెలిఫోన్లు, సెల్ ఫోన్లు లేవు. బయటకు వెళ్ళిన మనిషి క్షేమంగా తిరిగివస్తేనే తెలిసేది. ఈ వార్త వచ్చిన కొన్ని గంటల తర్వాత మాస్టారు, తమ్ముడు-తాత (సదాశివుడు) క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఎక్కడా ఏ కారు ప్రమాదమూ జరగలేదు. ఆ వార్త ఒట్టి వదంతి మాత్రమే. ఈ న్యూస్ ను వేసింది 'హిందూనేశన్' అనే 1940లనాటి ఒక Yellow Journal. (ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చే అధిక సంఖ్యాకం ఇలాటివే) ఇందుకు కారణం, ఏదో రకమైన సెన్సేషనల్ న్యూస్ ను ఆదరించే పాఠకులే. అటువంటి వార్తలు రాసే ఆ పత్రిక ఎడిటర్ చివరకి హత్యకి గురవడం ఒక సంచలనం అయితే ఆ హత్య కేసులో తగులుకున్నతమిళ సినిమా ప్రముఖుల్లో ఒకరు ఆనాటి తమిళ సినిమా సూపర్ స్టార్ అవడం మరో సంచలనం.


ఘంటసాల మాస్టారు 1959 లో మరో సినీమా తీయడానికి సన్నాహం మొదలుపెట్టారు. ఈ సినీమాల నిర్మాణానికి మొదటినుండి శ్రీమతి సావిత్రమ్మగారు వ్యతిరేకించినట్లుగా ఆవిడ మాటలద్వారా అర్ధమయేది. విధి బలీయం అంటారు కదా! మరో సినీమా ప్రారంభమయింది.

విశేషాలు వచ్చేవారం...
                    ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

No comments: