visitors

Sunday, April 4, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై ఐదవ భాగం

04.04.2021 -  ఆదివారం భాగం - 25:
అధ్యాయం 2 భాగం 24  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
1964 లో తెలుగు సినీమా ఖ్యాతిని ఇనుమడింప జేసిన సినీమాలెన్నో వచ్చాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే - ఆత్మబలం, గుడిగంటలు, మూగమనసులు, అమరశిల్పి జక్కన్న, రాముడు భీముడు, డా.చక్రవర్తి, దాగుడుమూతలు, బొబ్బిలియుద్ధం మొదలైన సినీమాలు ఆర్ధికంగా ఘనవిజయం పొందాయి. ఈ సినీమాలన్నిటి విజయానికి సంగీతం,  ఘంటసాల గారు పాడిన పాటలే ఎంతో దోహదం చేసాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సినీమాలలోని పాటలన్నీ ఈ నాటికీ అన్ని టివి ఛానల్స్ లో, సినీమా పాటల వేదికల మీద విస్తృతంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ పాటల సజీవత్వానికి ఘంటసాల మాస్టారి అసాధారణ గానమాధుర్యమే కారణమని నా నిశ్చితాభిప్రాయం.

ఇక, ఘంటసాల మాస్టారు ఆ ఏడాది సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు చూస్తే -  గుడిగంటలు, మర్మయోగి, శ్రీ సత్యనారాయణ మహత్యం, వారసత్వం  - నాలుగూ ఎన్.టి.రామారావు కధానాయకుడిగా నటించినవే. రెండు సాంఘికం, ఒకటి జానపదం, ఒకటి పౌరాణికం. ఈ నాలుగు సినీమాలకు ఘంటసాల మాస్టారు మర్చిపోలేని సంగీతాన్నే అందించారు. 

ఈ నాలుగు సినీమాల విషయంలో నాకు తెలిసిన విషయాలు అనుభవాలు ఈ వారం తెలియజేస్తాను. 

మర్మయోగి సినీమా తమిళం రీమేక్. 1951 లో జూపిటర్ పిక్చర్స్ తీసిన ఈ సినీమా ఘన విజయం సాధించడమేకాక ఎమ్.జి.ఆర్ కు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఆకాలంలో కత్తియుద్ధాలకు ఎమ్జీయార్ పెట్టింది పేరు. అదే సినిమాను అదే జూపిటర్ పిక్చర్స్ వారు తెలుగులో ఎన్టీఆర్ తో అదే మర్మయోగి పేరుతో తీశారు. ఈ సినీమాలో రామారావు కొన్ని సీన్లలో ఛత్రపతి శివాజీ గెటప్ లో కనిపిస్తారు. ఈ సినీమాకు సంబంధించినంతవరకు ఈ సినిమా లోని కధానాయకుడు ఎన్.టి.ఆర్. కథానాయిక కృష్ణకుమారిలకు  స్వరపర్చిన పాటలకంటే ఉపపాత్రలకోసం చేసిన పాటలు సన్నివేశపరంగా మంచి జనాదరణ పొందాయేమో అనిపిస్తుంది. లీలావతి (పి.లీల), గుమ్మడి (మాస్టారి నవ్వులు) కలసి నటించిన పడవ పాట 'నవ్వులనదిలో పువ్వుల పడవ' పాట, మరో ఉపపాత్ర లంక సత్యం కోసం మాస్టారు పాడిన పద్యాలు, ఆ తర్వాత కొందరు నర్తకీ మణులు (కోమల, జమునారాణి) పాడిన 'ఎందుకు పిలచితివో రాజా!' పాట చాలా హాయినికలిగిస్తాయి. 

ఈ చిత్రంలో జమునారాణి ఏకంగా నాలుగు పాటలు, అందులో మాస్టారితో మూడు డ్యూయెట్లు పాడడం ఒక విశేషమే. ఆవిడ nasal voice ఒక ప్రత్యేక ఆకర్షణగా  అభిమానించే రసికులెందరో వున్నారు.  

జానపదచిత్రం కావడాన కావలసినన్ని యుద్ధాలు, ఛేసింగ్స్, ఘోస్ట్  చేసే అట్టహాసాలు చూడడానికి ఉత్సాహం కలిగిస్తాయి. రీరికార్డింగ్ కు ముందు రష్ వేసి చూపించారు. సినీమా స్లోగా, డ్రాగీగా నాకు అనిపించింది. కానీ, ఒక్కొక్క సీన్ మీద మాస్టారు కంపోజ్ చేసిన బిట్స్ చూశాక నా అభిప్రాయమే మారిపోయింది. ఓపెనింగ్ సీన్సలోని ఆటలు, పోరాటాలు, మధ్య మధ్యలో హార్స్ ఛేసింగ్స్ వాటిమీద ఉపయోగించిన ట్రంపెట్స్, సాక్సోఫోన్, వైలిన్స్, ప్లూట్, క్లారినెట్, కాంగో, బేస్ డ్రమ్స్ ల ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు ఉత్సాహం రేకెత్తిస్తాయి.

ఈ సినీమాలో  మరో ముఖ్య ఆకర్షణ రాజుగారి దెయ్యం. మధ్య మధ్యలో వచ్చి వ్యాంప్  రాణి (లీలావతి)ని భయపెడుతూంటుంది. ఆ సీన్ లో రంపం, వైలిన్ బౌతో సృష్టించిన ఎఫెక్ట్స్ ప్రేక్షకులను అలరించాయి. ఆ దెయ్యం చేసే కొన్ని ధ్వనులను తబలా ప్రసాద్ వినిపించాడు. అతని గొంతు దగ్గర పికప్ లు పెట్టి రికార్డ్ చేయడం బాగా గుర్తుంది. 

రక్తసంబంధం తర్వాత రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుందర్లాల్ నహతా నిర్మించిన చిత్రం గుడిగంటలు. ఇదికూడా తర్జుమా చిత్రమే. శివాజీ నటించిన 'ఆలయమణి' ని గుడిగంటలుగా ఎన్టీఆర్ తో నిర్మించారు. ఆనవాయితీ ప్రకారం ఈ సినీమాలోని ఆరు పాటల్లో రెండు మాత్రమే మాస్టారి స్వయంప్రతిభను చాటే పాటలు. మిగిలిన నాలుగు తమిళం, హిందీ పాటల వరసలే. అయినా అవి కూడా తెలుగుదనం సంతరించుకునేలా స్వరపర్చడంలో మాస్టారి నైపుణ్యం కనిపిస్తుంది. పాటలన్నీ బహుళ జనాదరణ పొందాయి. 

టైటిల్ మ్యూజిక్ మీద షెహనాయ్, వైలిన్స్, తబలా వంటి వాద్యాలు ప్రాధాన్యత వహించాయి. చిత్రం ప్రారంభం నుండి టెన్నిస్ మ్యాచ్ మీద వచ్చే రీరికార్డింగ్ కు నేనూ వెళ్ళాను. ఎక్కువ పాళ్ళలో మెలోడ్రామా గల చిత్రం గుడిగంటలు. శివాజీ , ఎన్టీఆర్ నటించిన ఈ కథ హిందీలో (ఆద్మీ) దిలీప్ కుమార్ నటించడం ఆశ్చర్యమే. శివాజీ గణేశన్  హెవీడోస్ నటనకు, దిలీప్ కుమార్  సున్నితమైన ముఖభావాలకు పొంతనే కుదరదు. ఈ చిత్రంలో మాస్టారు పాడిన మూడు సోలోలు ఈనాటికీ అందరూ విని ఆనందిస్తున్నారు.

లాహిరి లాహిరి పాట తర్వాత మరోసారి నేను ఘంటసాల మాస్టారికి తీరని  ద్రోహం చేసాను. అది బొబ్బిలి కాలేజీలో ఫస్ట్ ఇయర్ డిగ్రీ చేస్తున్నప్పుడు. కాలేజీ ఏనివర్శరీ ఫంక్షన్స్ లో కొంతమంది మిత్రద్రోహులు నన్ను అడగాపెట్టకుండా  పాటలు పాడేవారి లిస్ట్ లో నాపేరు వేయించారు. నా పేరు మైక్ లో ఎనౌన్స్ చేసే వేళకు నేను ఆ చుట్టుపక్కలే లేను. ఎక్కడో వున్న నన్ను బలవంతంగా స్టేజిమీదకు తోసారు. అసలే భసాపంకం. మా ఊరి వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు గట్టిగా పద్యాలు చదవడం తప్ప పాడడమనేదే లేదు. స్టేజి మీద అంతమంది లెక్చరర్ లు, స్టూడెంట్ల మధ్య ఏం పాడాలి? ఎవరి పాట పాడాలి. ఆ సమయంలో ఆ వూళ్ళో ఆడుతున్న 'గుడిగంటలు' లో పాట గుర్తుకు వచ్చింది. ఆ పాటలో  ప్రముఖ రచయితల కథానాయికల పేర్లు ఉపయోగించారు కవి దాశరధి. అప్పట్లో ఆ పాట పూర్తిగా గుర్తుండేది.  వెంటనే నా బాణీలో ఆ పాటను పాడేసాను. లేదా, చదివేసాను. మా బొబ్బిలి యువరాజా వారితో సహా అక్కడున్నవారంతా చాలా సహృదయులు.  నాకూ చప్పట్లు కొట్టారు. 'నీలోన నన్నే నిలిపేవు నేడే ఏ శిల్పి కల్పనవో, ఏ కవి భావనవో'  పాటను ఎంతో భావయుక్తంగా  స్వరపర్చి, అద్భుతంగా గానం చేసిన ఘంటసాల మాస్టారికి గానం పేరిట  నాలాటివారెందరు అన్యాయం చేస్తున్నారో కదా!

పొడుగాటి గజిబిజి బిజిఎమ్స్ తో అసలు పాట పల్లవేదో మర్చిపోయేలా పాటల కంపోజింగ్ ఘంటసాల మాస్టారి శైలికాదు.  పాటలోని భావానికి తగినట్లుగా అవసరంమేరకు మాత్రమే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేయడం, అందుకు అవసరమైన వాద్యాలను మాత్రమే ఉపయోగించడం, తాను పాడి, తోటి గాయకులచేత పాడించి కావలసిన రసభావాన్ని సృష్టించడమే మాస్టారి బాణీ. 

హెవీ ఆర్కెష్ట్రా హోరు, జోరు వల్లే పాట రక్తికడుతుందని అనుకునేవారికి పూర్తి వ్యతిరేకం ఘంటసాల బాణి. వారి పాటలన్నింటిలో గాయకులకే ప్రాధాన్యత. ఏ గాయకుడి రేంజ్ ఎంతవరకు, ఎవరెవరు ఏయే పాటలు పాడగలరన్నది ఆయనకు తెలిసినంత సుస్పష్టంగా ఇతర సంగీత దర్శకులకు తెలియదనే చెప్పాలి. అలాటి సున్నితమైన, శ్రావ్యమైన, లాలిత్యంతోకూడిన మంచి పాటలు గల చిత్రం 'వారసత్వం'. ఈ సినీమాకు ముందు అనుకున్న పేరు 'మమకారం'. ఆర్ధిక ఇబ్బందులవల్ల సినీమా నిర్మాణం దాదాపు మూడేళ్ళు సాగింది. సినీమా చేతులు మారి 'వారసత్వం' గా విడుదలయింది. వారసత్వంలో ఘంటసాల మాస్టారు, సుశీల ఆలపించిన 'ప్రేయసీ మనోహరి వరించి చేరవే', సుశీల పాడిన 'పేరైనా అడుగలేదు, ఊరైనా అడుగలేదు', మాస్టారు, పి.లీల పాడిన 'చిలిపి కృష్ణుని తోటి చేసేవు పోటీ' పాటలు అపాతమధురాలుగా, అజరామర గీతాలుగా అభివర్ణించవచ్చు. ఈ చిత్రంలోని పాటలన్నీ ఎంతో శ్రావ్యమైనవి. 

ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో 1964 లో విడుదలైన మరో పౌరాణిక చిత్రం 'శ్రీ సత్యనారాయణ మహత్యం'. దాదాపు ఇరవై పాటలు, పద్యాలు గల సంగీత రసభరిత చిత్రం. ఘంటసాల మాస్టారి గాన వైదుష్యానికి దర్పణం పట్టే చిత్రంగా చెప్పుకోవాలి. ఈ సినీమాలో మాస్టారి తో పాటూ సుశీల, లీల, కోమల, స్వర్ణలత, వసంత, మాధవపెద్ది, రాఘవులు ఉన్న పాటలన్నింటిని పాడారు. 

1964 నాటికి ఘంటసాల సంగీతకుటుంబంలో మరో గాయకుడు వచ్చి చేరాడు. అతనే మొవ్వ జనార్దనరావు. బాగానే పాడేవాడు. కానీ అదృష్టం కలసిరాలేదు. మాస్టారి దగ్గరే వుంటూ కోరస్ లు పాడడం, మాస్టారి కంపోజింగ్ లకు రావడం, ఆయనతో రికార్డింగ్ లకు, కచేరీలకు వెళ్ళడం చేసేవాడు. మనిషి చాలా సౌమ్యుడు. సున్నితమైనవాడు. మాతో స్నేహపూర్వకంగా మెసిలేవాడు. ఈ సినీమా కోరస్ లలో మొవ్వ జనార్ధనరావు కూడా ఇతరులతో పాడాడు. ఘంటసాలవారి సంగీత కుటుంబంలో మరో ద్వయం - జనార్దన ద్వయం. ఇద్దరి ఇనిషియల్స్ 'ఎమ్' తోనే ఆరంభమౌతాయి. మిట్ట, మొవ్వ. మిట్టా జనార్దన్ సుప్రసిద్ద సితార్ విద్వాంసుడు. మొవ్వ జనార్దన రావు గాయకుడు. ఈ ఇద్దరితో పరిచయం పెరగనప్పుడు వీరిద్దరిలో ఎవరు జనా‌ర్దన్ , ఎవరు  జనార్దనరావు అనే తికమక చాలా రోజులుండేది.

ఈ సినీమా టైటిల్స్ మీద 'జయ జయ శ్రీమన్నారాయణా జయ విజయీభవ నారాయణా' అనే దశావతార గీతం. ఈ పాటను రాగమాలికలో కంపోజ్ చేశారు మాస్టారు. ఈ పాట విషయంలో మాస్టారు ఒక కొత్తపోకడ పోయారనే అనుకుంటున్నాను. నేను అంతకుముందు ఏ పాటల్లోనూ అలాటి స్వర రచన వినలేదు. ఘంటసాల మాస్టారు, పి.లీల, బృందం పాడిన  ఈ పాట లో ఎక్కడా నేపథ్య వాద్య సంగీతం వినపడదు, లయ ప్రధాన వాద్యాలు తప్ప. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపించవలసిన చోట్లలో మాస్టారు బృందగాయకుల గాత్రాలనే ఉపయోగించారు. స్వరాలు, ఛాయాస్వరాలను ఆయా గాయకులు ఆలపిస్తుండగా ప్రధాన పాటను మాస్టారు, లీల పాడారు. ఇదొక వైవిధ్యమైన ప్రక్రియగా నేను భావిస్తున్నాను. 


ఈ సినిమాలో మరో డ్యూయెట్ మాస్టారు, సుశీల పాడిన 'జాబిల్లి శోభ నీవే జలదాలమాల నీవే, జలతారు మెరుపు నీవే' పాట. ఈ పాట కంపోజింగ్, రిహార్సల్స్, రికార్డింగ్ కు అనారోగ్యం కారణంగా మా నాన్నగారు పూర్తిగా హాజరు కాలేదు. ఈ పాట ఆయన లేకుండానే జరిగింది. నేను ఆ పాట సమయంలో వుండడం మూలాన ఆ పాట ట్యూన్ ఎలా చేశారో మా నాన్నగారు నన్ను వినిపించమనేవారు. నేను కొంచెం అటుయిటుగా పాడి వినిపించేవాడిని. సినీమాలో ఈపాట నాయికా నాయకుల మధ్య సాగే యుగళగీతమే అయినా శృంగారభావాలేవీ ధ్వనించవు. నాయిక నాయకుని పరంగా ఆలపిస్తుంది. కానీ, నాయకుడు నాయికను తలచుకోవడానికి బదులుగా దైవాన్ని తల్చుకుంటూ పాడడం తరచూ మనం చూసే సినీమాలలో కనపడదు. మరి ఈ నావెల్టీని ఆడియన్స్ ఏవిధంగా రిసీవ్ చేసుకున్నారో నాకు తెలియదు.

ఈ సినీమాలో మాస్టారు పాడిన 'మాధవా మౌనమా సనాతనా కనరావ కమలనయనా' అనే పాట ఈ చిత్రానికే హైలైట్. ఘూర్జరీతోడి (శుభపంతువరాళి) రాగంలో కంపోజ్ చేశారు. మాస్టారు మూడు శృతిలో ఈ పాటను పాడారని చెప్పగా విన్నాను. పాట క్లైమాక్స్ లో మాస్టారి రెండిషన్ చాలా హైపిచ్ లో ఉంటుంది. ఈ పాట రికార్డింగ్ డేట్ ఫిక్సయి రికార్డింగ్ థియేటర్ కూడా బుక్ చేయడం జరిగింది. వాహిని స్టూడియో అనే గుర్తు. 

సరిగ్గా రికార్డింగ్ రోజున ఘంటసాల మాస్టారికి హై ఫీవర్. పైగా ముఖంమీద సెగగడ్డలు లేవడంతో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నారు. ఆ రోజు రికార్డింగ్ కాన్సిల్ చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచన కూడా సావిత్రమ్మగారికి కలిగింది. కానీ, ఘంటసాల మాస్టారు ఆ సలహాకు సుముఖత చూపలేదు. ఆ రోజు రికార్డింగ్ కాన్సిల్ చేస్తే నిర్మాత చాలా నష్టపోతాడని ఆయన ఆవేదన. పైగా ఈ పాట షూటింగ్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయినట్లుంది. ఎన్.టి.రామారావుగారితో షెడ్యూల్. ఈ అవకాశం కోల్పోతే మరల రామారావుగారి డేట్స్ కుదరడం కష్టం. ఈ విధంగా నిర్మాత సాధకబాధకాలన్నీ ఆలోచించి, తన అనారోగ్యాన్ని లక్ష్యపెట్టకుండా రికార్డింగ్ కు వెళ్ళడానికే నిశ్చయించారు. మంచో చెడ్డో ఆ సత్యనారాయణస్వామే చూసుకుంటాడని స్టూడియోకు బయల్దేరారు. ముఖం మీది సెగగెడ్డలకు మంచి గంధం పూతపెట్టుకొని జ్వరంతోనే వెళ్ళారు. మాస్టారు ధియేటర్ కు వెళ్ళే సమయానికి మా నాన్నగారు,  పాట నొటేషన్స్ ను, బిజిఎమ్ నొటేషన్స్ ను ఆర్కెష్ట్రా వారందరికీ చెప్పడం వారంతా వారి వారి బిట్స్ రాసుకోవడం అయింది. ఈ పాటలో ఎక్కువగా షెహనాయ్, వైలిన్స్, సెల్లో, డబుల్ బేస్, డ్రమ్స్, తబలా వాద్యాలు వినిపిస్తాయి. ఘంటసాల మాస్టారు వచ్చి సౌండ్ ఇంజనీర్ రూమ్ లో నుండి ఆర్కెష్ట్రా వారు వాయించిన పాట విన్నారు. ఎవరికి ఇవ్వవలసిన సూచనలు వారికిచ్చి వాయిస్ తో ఒక మానిటర్ చూద్దామని తన మైక్ వద్దకు వెళ్ళారు. ఆనాటి ఆయన పరిస్థితిని చూసినవారంతా నిర్మాతతో సహా, జాలిపడి ఆరోజు రికార్డింగ్ కాన్సిల్ చేస్తే బాగుంటుందనే భావించారు. కానీ మాస్టారు ఒప్పుకోలేదు. మాస్టారికి ఏవిధమైన ఒత్తిడి తేకుండా అతి భక్తి శ్రద్ధలతో ఆర్కెష్ట్రా వారు జాగ్రత్తగా వాయించడం మొదలెట్టారు. ఇప్పటి రికార్డింగ్ సిస్టంకి, ఆనాటి విధానానికి హస్తిమశకాంతం తేడా. ఆనాడు ట్రాక్ సిస్టమ్ అంత అభివృద్ధి చెందలేదు. లైవ్ రికార్డింగ్ చేయడానికే అందరు సంగీతదర్శకులు పాటుపడేవారు. ఒక పాట రికార్డింగ్ అనేది ఒక సమిష్టి కృషి. ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదు. అనేక విభాగాల సాంకేతిక నిపుణులంతా కలసి పనిచేస్తేనే ఒక పాట బయటకు వస్తుంది. ఆరోజు అందరికీ ఒకటే ఆలోచన. ఘంటసాలగారిని ఎక్కువ శ్రమ పెట్టకుండా పాట పూర్తిచేయాలి. ఆర్కెష్ట్రాతో వాయిస్ మానిటర్ చూశారు.  మాస్టారు వెంటనే
రెడీ ఫర్ టేక్ అన్నారు. ధియేటర్ అంతా పిన్ డ్రాప్ సైలన్స్. పస్ట్ టేక్ ప్రారంభమయింది. ఘంటసాల మాస్టారిలో ఏ దైవం ఆవహించిందో తెలియదు. తన జ్వరం, సెగగడ్డల బాధ అన్నీ మర్చిపోయారు. ఆ మూడు శృతిపాటను అద్భుతంగా ఎవరూ ఊహించని విధంగా అద్భుతంగా పాడారు. పాట క్లైమాక్స్ లో 'మాధవా ! కేశవా' అంటూ బాధతో తదాత్మ్యం చెంది పెట్టిన కేకతో రికార్డింగ్ ధియేటర్ దద్దరిల్లింది. ఏదో అవాంఛనీయ పరిస్థితి ఏర్పడిందేమోననే అందరూ భయపడ్డారు. కానీ ఏమీ జరగలేదు. మాస్టారిలోని భావావేశానికి ఆర్కెష్ట్రాతో సహా అందరూ నిశ్చేష్టులయ్యారు. షెహనాయ్ సత్యం అయితే బొటబొటా కన్నీరే కార్చారు. ఇక సెకెండ్ టేక్ కు అవసరమే లేకపోయింది. అందరూ ఫుల్లీ సాటిస్ఫైడ్. అనుకున్న సమయానికి రికార్డింగ్ పూర్తి అయింది. ఎన్టీఆర్ తో షూటింగ్ పూర్తి అయింది. ఇది నేనెప్పటికీ మర్చిపోలేని సంఘటన. అందుకే సంగీతం దైవదత్తమని, ఘంటసాల మాస్టారు దైవాంశసంభూతుడని మనస్ఫూర్తిగా నమ్ముతాను.

ఈ సినీమా పూర్తికాకుండానే ఈ సినీమాను డైరక్ట్ చేస్తున్న ఎస్ రజనీకాంత్ మరణించారు. మిగిలిన సినీమాను ఆ చిత్ర నిర్మాతలలో ఒకరైన కె. గోపాలరావు పూర్తిచేశారు. చిత్రాన్ని రజనీకాంత్ గారికి అంకితమిస్తూ డైరెక్టర్ గా ఆయన పేరే వేశారు.

ఘంటసాల మాస్టారి సినీ జీవితచరిత్రలో ఇలాటి మరచిపోలేని ఘట్టాలెన్నో! నాకు తెలిసినవి కొన్ని మాత్రమే. 

రామచంద్రరావు. ఇంటిపేరు దేవగుప్తాపు. విశాఖపట్నం జిల్లావాడు. సొంతవూరు ఏదో నాకు గుర్తులేదు. ఘంటసాలవారి చిరకాలమిత్రుడు. సావిత్రమ్మగారికంటే ముందునుంచి సాన్నిహిత్యం కలిగిన వ్యక్తి. రామచంద్రరావు, ఘంటసాలగారిని కలపి మైత్రీబంధం పెంచినది పానగల్ పార్క్ అరుగులే. ఇద్దరూ జీవనోపాధి వెతుక్కుంటూ మెడ్రాస్ చేరినవారే. అష్టకష్టాలు పడినవారే. ఎప్పుడైతే ఘంటసాలగారికి గాయకుడిగా పేరు రావడం ప్రారంభమయిందో అప్పటినుండే ఆకలి దప్పులు తీర్చుకోవడానికి తగిన ఆదాయము రావడం ప్రారంభించింది. అటువంటి సమయంలో పార్క్ స్నేహితుడిని వదిలేసి ఘంటసాలవారు తన దారి తాను చూసుకోలేదు. ఆ మిత్రుడిని కూడా తన దగ్గరే పెట్టుకున్నారు. మాస్టారు, రామచంద్రరావు కలసి మోతీలాల్ స్ట్రీట్, రామానుజం స్ట్రీట్ లలో అద్దె ఇళ్ళలో కాలక్షేపం చేశారు.  సావిత్రమ్మగారు మొట్టమొదటిసారిగా మద్రాసు కాపరానికి వచ్చినప్పుడు తోడుగావుండి తీసుకువచ్చినది ఈ రామచంద్రరావేనట. చిన్న వయసులోనున్న సావిత్రమ్మగారికి దగ్గరుండి వంటావార్పు నేర్పింది కూడా ఈ రామచంద్రరావే. ఘంటసాల వారి కుటుంబానికి చాలా ఆత్మబంధువు. ఒక్క ఘంటసాలగారిని తప్ప మిగిలిన వారందరినీ ఏకవచనప్రయోగమే. మాస్టారిని మాత్రం గౌరవంగా అయ్యగారు అని పిలిచేవారు. అంతటి ఆత్మీయంగా మెలిగిన కారణంచేతనే ఘంటసాల మాస్టారు తన స్వగృహప్రవేశం సమయంలో తన మిత్రుడైన రామచంద్రరావుకు దగ్గరుండి ఘనంగా ఉపనయనం జరిపించారు. ఆ విషయాలు గతంలో నెం.35, ఉస్మాన్ రోడ్ లో చోటుచేసుకున్నాయి.

నెం. 35, ఉస్మాన్ రోడ్ ఒక పుష్పక విమానంలాటిది. ఎంతమంది వచ్చినా మరొక్కరికి చోటు వుంటూనే వుండేది. మేస్టారింటి మేడమీద ఎంతమంది వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయో. వారంతా నాకన్నా వయసులో బాగా పెద్ద. మా నాన్నగారికంటే వయసులో చిన్నయినా నాకు వారెవరూ సమవయస్కులు కారు. అయినా అందరూ ఆప్యాయంగా, స్నేహపూర్వకంగా వుండేవారు. ఈ రామచంద్రరావు మా అమ్మగారిని అక్కయ్యగారని పిలిచేవారు.

మనిషి సన్నగా, చామనఛాయతో, పక్కపాపిడి క్రాఫింగ్ తో ఎప్పుడూ ప్యాంట్,  ఫుల్ హ్యాండ్ షర్ట్ తో మహానీటుగా వుండేవారు. చేతిరుమాలులో పౌడర్ వేసుకొని ఆ రుమాలును మెడ వెనకనుండి ముందుకు చుట్టుకోవడం ఫస్ట్ ఫస్ట్ రామచంద్రరావు దగ్గరే చూశాను. ముందు రెండు పళ్ళు కొంచెం ఎత్తుగానే వుండేవి. చైన్ స్మోకర్. ఇంట్లో కాల్చేవారు కారు. కానీ మేడమీద రోడ్లమీద వెళుతున్నప్పుడు చాలా సిగరెట్లే కాల్చేవారు. ఘంటసాల మాస్టారి సినీమా నిర్మాణ వ్యవహారాలలో ఏమాత్రం పాత్ర వహించారో నాకు అంతగా గుర్తులేదు, కానీ, మద్రాస్ హార్బర్ లో ఏదో ఉద్యోగం చేసేవారు. ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం దాటాక ఇంటికి చేరేవారు. హార్బర్ నుండి అప్పుడప్పుడు ఏవో ఫారిన్  వస్తువులు, తినుబండారాలు తెచ్చేవారు. మాస్టారింట్లోనే భోజనవసతులన్నీ. అలాటి రామచంద్రరావుకు ఏదో అనారోగ్యం ఏర్పడింది. తరచూ దగ్గుతూవుండేవారు. అయినా సిగరెట్లు మానలేదు. డాక్టర్లు పరిక్ష చేసి చూసి క్షయ అని నిర్ధారించారు.  విశ్రాంతి కోసమని కొన్నాళ్ళ తర్వాత హార్బర్ ఉద్యోగం మానేశారు. మైలాపూర్ లజ్ కార్నర్ లో ఏదో ఒక కాఫీ హోటల్ లో గల్లాపెట్టి దగ్గర కూర్చొనే ఉద్యోగం చేశారు. అదీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.  తోడుగా ఊరినుండి అతని మేనల్లుడో, అన్నకొడుకో ఒక అబ్బాయి వచ్చి మాస్టారింట్లోనే గడిపాడు. చివరకు వ్యాధి ముదిరి, పిల్లలున్న ఇంట్లో గడపడం శ్రేయస్కరం కాదని విశాఖపట్నం కెజిహెచ్ లో చేరారు. అలాటి గడ్డు పరిస్థితులలో కూడా ఘంటసాల మాస్టారు తన మిత్రుడిని ఆర్ధికంగా ఆదుకున్నారు. ప్రతీ నెల రామచంద్రరావుకు కొంత పైకాన్ని మనీఆర్డర్ ద్వారా పంపేవారు. చిన్నవయసు కావడం వలన కొన్ని విషయాలు అర్ధమయి కాకుండా వుండేవి.

ఒకసారెప్పుడో మా అమ్మగారితో మా పిల్లలం అందరం బొబ్బిలి వెళుతున్నప్పుడు మాకు వాల్టేర్ స్టేషన్ లో  చాలా దీనస్థితిలో కనిపించారు. మా అమ్మగారి దగ్గర కష్టసుఖాలు చెప్పుకున్నారు.

ఈలోగా రైలు కదిలింది. కానీ రామచంద్రరావు క్రిందికి దిగలేదు. నాకు ఒకటే కంగారు, ఎలా దిగగలడని. లేపోతే అతను కూడా మాతో బొబ్బిలి వస్తున్నారా అని తెలియదు. కానీ ఆయన మాత్రం మా అమ్మగారితో కబుర్లు చెపుతునే వున్నారు. ఆ రైలు విశాఖపట్నం స్టేషన్ కు వెళ్ళి తిరిగి వాల్టేర్ వచ్చేక రామచంద్రరావు క్రిందికి దిగారు. ఆయనకు మా అమ్మగారు కొంత డబ్బు ఇవ్వడం చూశాను. ఆ పైకం తీసుకుంటున్నప్పుడు రామంచంద్రరావు కళ్ళలో నీళ్ళు చూసి నాకు చాలా బాధ కలిగించింది. 

ఆ రోజుల్లో చాలా రైళ్ళు వాల్టేర్ స్టేషన్ నుండి విశాఖపట్నం స్టేషన్ కు వెళ్ళి అక్కడనుండి మళ్ళా వాల్టేర్ స్టేషన్  వచ్చి ఆగి అక్కడనుండి గోపాలపట్నం జంక్షన్ దాకా వచ్చాక మెడ్రాస్ వెళ్ళేవి, హౌరా వెళ్ళేవి, రాయపూర్ వెళ్ళేవి డైవర్ట్ అయ్యేవి.

అదే రామచంద్రరావును ఆఖరిసారిగా చూడడం. ఆ తర్వాత ఎప్పుడో వ్యాధి ముదిరి విశాఖ కెజిహెచ్ లోనే కాలం చేశారని విన్నాను.

రైలు పయనంలాటి ఈ జీవితంలో ఎంతోమంది తారసపడుతూంటారు. కలసి ప్రయాణం చేస్తాం. ఎవరి మజిలీ వచ్చినప్పుడు వారు వెళ్ళిపోతూంటారు. కొందరిని మరల చూసే అవకాశం వుంటుంది. కొందరి గురించి ఏ విషయాలు తెలియవు. కాలక్రమేణా మనకు ఆప్తులనుకునేవారంతా మనకు తెలియకుండానే మన  జ్ఞాపకాల దొంతరలనుండి కనుమరుగైపోతారు. ఎవరికి ఎంతవరకు ఋణానుబంధమో అంతవరకే ఈ బంధాలు, అనుబంధాలు, స్నేహాలు అన్నీ. ఉన్న నాలుగు రోజులు మంచిగా, అందరితో సఖ్యంగా వుంటూ మంచివాడనిపించుకోవడమే మనం చేయవలసింది. ఈ సూత్రాన్నే ఘంటసాల మాస్టారు తన స్వల్ప జీవితంలో తూ.చ. తప్పక పాటించారని నాకు అనిపిస్తుంది. 

మరిన్ని ఉత్సాహభరిత విశేషాలతో వచ్చే వారం...
...సశేషం

3 comments:

మహేష్ బాబు సంబటూరి వెంకట said...

మరో చకచక్కని సంచిక..... ఎన్నో చక్కని జ్ఞాపకాల పునశ్చరణ.....

ఘంటసాల గారు 1964 లో సంగీత దర్శకత్వం వహించిన గుడిగంటలు, మర్మయోగి, శ్రీ సత్యనారాయణ మహత్మ్యం, వారసత్వం చిత్రాల్లోని మధురమైన పాటల రికార్డింగ్ విశేషాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.....

మాధవా మౌనమా పాట రికార్డింగ్ విశేషాలు చదువుతూంటే తన పని పట్ల మాస్టారు గారి అంకితభావం..... ఆయన ప్రతిభా పాటవాలు తలుచుకుని చాలా భావోద్వేగం కలిగింది.....

మధ్యలో మీరు మీ ప్రమేయం లేకుండానే ఆఖరి నిమిషంలో బొబ్బిలి కాలేజీ వేదిక పైనుండి పాడవలసి వచ్చిన గుడిగంటలు చిత్రం పాట విషయంలో మీ ' భసాపంకం' 😀😀 వివరాలు మీలోని హాస్య స్ఫోరకత ని తేటతెల్లం చేసాయి....

ఇక దేవగుప్తపు రామచంద్రరావు గారు లాంటి మిత్రుల విషయం లో ఘంటసాల గారు ఎంత ఉదాత్తత చూపించేవారో మీ ద్వారా తెలుసుకుని ఘంటసాల మాస్టారు గారి మంచి మనసుకు మనసారా మౌనంగా మనసులోనే సాష్టాంగ నమస్కారములు చేసుకుని నివాళులు అర్పించాను ...

ఇంత చక్కని జ్ఞాపకాలను మాతో ఎంతో శ్రమకోర్చి ఓపికగా పంచుకుంటున్నందుకు మీకు శతాధిక కోటి కృతజ్ఞతాభివందనాలు మరియు హార్ధిక ధన్యవాదములు స్వరాట్ బాబాయ్ గారూ 👌👌👌👌👌🙏🙏💐💐😊😊

P P Swarat said...

మీకు నా ధన్యవాదాలు.

చుండి వేంకట రాజు said...

ధన్యవాదాలు సార్