visitors

Sunday, April 25, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై ఎనిమిదవ భాగం

25.04.2021 - ఆదివారం భాగం - 28:
అధ్యాయం 2  భాగం 27 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఘంటసాల మాస్టారు గాయకుడిగా, సంగీత దర్శకుడిగా సినీమాలలోనే కాదు ఇతరత్రాకూడా చాలా బిజీగా వుండేవారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో, బయట ఊళ్ళ సంగీత కచేరీలతో క్షణం తీరిక లేకుండా వుండేవారు. వీటన్నిటి ప్రభావం మాస్టారి ఆరోగ్యంమీద పడింది. అయినా లెక్కచేసేవారు కాదు. అనుకున్నది సాధించేవరకు విశ్రమించేవారు కాదు.

గతంలో ఒకసారి చెప్పాను భారతీయ సినీమారంగం నియమబధ్ధమైన, చట్టబధ్ధమైన పరిశ్రమగా పనిచేయలేదు. ఒక పరిశ్రమకు వుండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆనాటి సినీమా నిర్మాణం లో  కనిపించేవికావు. నిర్మాతే సర్వాధికారి. నటీనటుల పారితోషకాలు, సాంకేతిక నిపుణుల వేతనాలు అందరికీ ఒకేలా వుండేవికావు. అలాగే అవి నిర్మాతకు, నిర్మాతకు కూడా మారిపోతాయి. అవి కూడా సక్రమంగా నిర్ణీత సమయానికి చెల్లుబాటు జరిగేదికాదు. ఆర్ధిక స్తోమతగల నిర్మాత అయితే ఇబ్బంది లేదు, సినీమా పూర్తయేలోగా వారి వారి డబ్బులు చేతికందేవి. అలాకాకుండా మూడు రీళ్ళ సినీమాతీసి మిగిలిన సినీమా తీయడానికి డిస్ట్రిబ్యూటర్లు మీద, ఫైనాన్షియర్స్ మీద ఆధారపడే నిర్మాతల నుండి డబ్బు రాబట్టుకోవడం యమయాతనే. పనిచేయించుకొని పూర్తిగా అనుకున్న డబ్బు చెల్లించకుండా వచ్చే సినీమాలో చెల్లిస్తామని ఎగవేత వేసిన నిర్మాతలెందరో కనిపిస్తారు. అలాగే చిత్రం ఆఖరి దశలో వుండగానే రిలీజ్ డేట్ ప్రకటించేస్తారు. అందుకోసం సమయాసమయాలు చూసుకోకుండా నటినటులు,  సాంకేతిక నిపుణులు, సినీ నిర్మాణానికి చెందిన అన్ని విభాగాలవారు రాత్రింపగళ్ళు కష్టపడవలసి వచ్చేది. రాత్రి కాల్షీట్లంటే తెల్లార్లు స్టూడియోలోనే గడపవలసి వచ్చేది. వీటన్నిటి ప్రభావం వారి ఆరోగ్యంమీద పడేది. షూటింగ్ లు అర్ధరాత్రి జరిగేవి. సినిమా రీరికార్డింగ్ లు వరసగా మూడేసి నాలుగేసి రోజులు డే అండ్ నైట్ పనిచేసేవారు. ఇళ్ళకు వెళ్ళే అవకాశం వుండేదికాదు.  1960లకు ముందు మా నాన్నగారు కూడా రాత్రుళ్ళు ఇంటికి రాకుండా వరసగా స్టూడియోలో రీరికార్డింగ్ లకు పనిచేయడం నాకు గుర్తుంది. ఇప్పటిలా సెల్ ఫోన్ల యుగం  కాదది. మామూలు ల్యాండ్ టెలిఫోన్ల వసతి కూడా అందరికీ వుండేది కాదు.  ఇంట్లో ఏ అత్యవసర పరిస్థితి ఏర్పడినా వెంటనె తెలిసే అవకాశం వుండేదికాదు.  ఇన్ని అవస్థలుపడి పనిచేసినా రాబడి అంతంతమాత్రంగానే వుండేది.  కొంతమంది మ్యూజిక్ డైరక్టర్ల పారితోషకాలు వారి దగ్గర పనిచేసే ఆర్కెష్ట్రా వారి ఆదాయంకంటే  తక్కువగానే ఉండేది. ఆర్కెస్ట్రా వారికి రెగ్యులర్ గా పదిమంది దగ్గర పనిచేసే అవకాశంవుంది. కానీ మ్యూజిక్ డైరక్టర్ మరీ గొప్ప పేరు ప్రఖ్యాతులున్న వారైతే తప్ప చేతినిండా పనే వుండదు. సంవత్సరానికి రెండు మూడు సినీమాలు విడుదలైతే ఘనమే. వీటన్నిటితో సినీమారంగానికి చెందిన అనేక విభాగాలలోని కార్మీకులలో, సాంకేతిక నిపుణులులో బాగా అసంతృప్తి పెరిగింది. కానీ, వారు చేయగలిగింది ఏమీ లేదు. ఇష్టంలేకపోతే మూటాముల్లె సద్దుకొని సొంతవూరు చేరుకోవడం తప్ప. తమ జీవితప్రమాణాలు పెరిగే మార్గాలకోసం అన్వేషణ మొదలెట్టారు. తమ స్థితిగతులు చక్కబడేందుకు యూనియన్లు ఏర్పాటు చేసుకొని తమ పనిపాటల విషయంలో ఒక నియమావళిని అనుసరించాలనే నిర్ణయానికి వచ్చారు. చాలా విభాగాలలో యూనియన్లైతే ఏర్పడ్డాయేకానీ వారి కోరికలు ఆచరణసాధ్యం కావడానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. 

అలాటి పరిస్థితులలోనే 'సౌతిండియన్ సినీ మ్యుజిషియన్స్ యూనియన్' ఏర్పడింది. ఏ సంవత్సరంలో ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభమయిందో నాకు తెలియదు. మొదటి సమావేశం మాత్రం పాండిబజార్  ఆంధ్ర కిళ్ళీ షాపు దగ్గర ఏస్ వయొలనిస్ట్ రామసుబ్బుగారి ఇంట్లో జరిగిందని నాన్నగారు చెబుతుంటారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన గాయకులు, సంగీత దర్శకులు, వాద్యకళాకారులు, కోరస్ ఆర్టిస్ట్ లు అంతా సభ్యులుగా వుండేవారు. అందులో ఘంటసాల మాస్టారు, మా నాన్నగారు కూడా సభ్యులే.  అందరూ నెలవారీ/సంవత్సరపువారీ చందాలు కట్టి సభ్యులు కావాలి. మొదట్లో మ్యుజిషియన్స్ యూనియన్ చాలా చిన్న స్థాయిలో ఏ రకమైన గుర్తింపులేకుండా వుండేది. ఒక ప్రెసిడెంట్, ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్,  శెక్రెటరీ, కొంతమంది కమీటీ మెంబర్స్ వుండేవారు. వీళ్ళంతా పదిరోజులకో, పదిహేనురోజులకో ఒక ఆదివారం నాడు చేరి తమకుండే కష్టనష్టాలన్నీ ఏకరువు పెట్టి వాటి పరిష్కారమార్గాలకోసం తీర్మానించేవారు. అయితే ఇవేవీ నిర్మాతల దగ్గరచ ఫలించేవికావు. యూనియన్ చాలాకాలం తమ కోరికల లిస్ట్ పెంచుకుంటూ పోయిందే తప్ప వాటిని పెద్దగా సాధించిన దాఖలాలు లేవు. మా నాన్నగారు ఒక సభ్యుడిగా చాలాసార్లే ఈ యూనియన్ మీటింగ్ లకు హాజరయ్యారు. వెళ్ళిన ప్రతీసారీ ఆదివారం నాడు పనిచేయాలా వద్దా? నైట్ కాల్షీట్లు పనిచేయకూడదు. అలా పనిచేస్తే డబుల్ కాల్షీట్  డబ్బులు చెల్లించాలి వంటి రెండు విషయాలమీదే తీవ్రంగా తర్జనభర్జనలు జరిపేవారు. ఈ సమావేశాలలో విభిన్న రాగాలు వినపడేవి. ఒకరికి సాధకంగావుండేది మరొకరికి ఇబ్బందికరం. ఈ విధంగానే సినీ మ్యుజిషియన్స్ యూనియన్ కొన్నాళ్ళు కుంటినడక సాగించింది. పెద్ద సంగీత దర్శకులు, బిజీ సంగీతదర్శకులు యూనియన్ కార్యకలాపాలలో ముఖ్యపాత్ర వహించడానికి ఇష్టపడేవారు కాదు. యూనియన్ విషయాలలో ప్రముఖంగావుంటే  తమకు అవకాశాలిచ్చే నిర్మాతల అసంతృప్తికి గురి కావలసివస్తుందేమోననే భయం పైకి చెప్పకపోయినా కొందరిలో వుండేది. 

ఇలాటి పరిస్థితులలో ఒక ఏడాది యూనియన్ లో కొత్త కమీటీ మెంబర్స్ గా టి.గోవిందరాజులు నాయుడుగారు, ఘంటసాల మాస్టారు, ఎమ్.బి.శ్రీనివాస్ ఎన్నికయ్యారు. పాతకాలపు సినీమాలలో (అవి ఏ సినీమాలో నాకైతే తెలియదు) మ్యూజిక్ డైరక్టరయిన గోవిందరాజులు నాయుడుగారు ప్రెసిడెంట్. ఘంటసాల మాస్టారు ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ . ఎమ్ బి శ్రీనివాస్ శెక్రటరీగా ఎన్నికయ్యారు. ఎమ్.బి.శ్రీనివాసన్ మలయాళీ. కొన్ని మలయాళ, తమిళ చిత్రాలకు సంగీతం నిర్వహించారు. నెంబర్ వన్ మ్యూజిక్ డైరక్టర్  కాలేకపోయినా మంచి మాటకారి, మంచి సంగీత పరిజ్ఞానం కలవారు. తెలుగులో మనందరికి బాగా తెలిసిన భానుమతి గారి 'వివాహబంధం' సినీమాకు ఎమ్.బి.శ్రీనివాసనే సంగీత దర్శకుడు. 

 
ఎమ్.బి.శ్రీనివాసన్

1971లో మద్రాస్ ఏర్ పోర్ట్ లో అమెరికా ప్రయాణానికి సాగనంపడానికి వచ్చిన ప్రముఖలు తమ్మారెడ్డి కృష్ణమూర్తిగారు, ఎమ్.బి.శ్రీనివాసన్ గార్లతో ఘంటసాలగారు
ఘంటసాలగారి వెనుక అటు ఇటు - నేను, ఘంటసాల రవి

మెడ్రాస్ ఆలిండియా రేడియో లో కోరల్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా అనేక మంచి సంగీతకార్యక్రమాలు రూపొందించారు. ఆరోజుల్లో రేడియోలోనే కాక అందరికి ముఖ్యంగా తెలుగు పిల్లలందరికి తెలిసిన  "పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా" అన్న పాట  స్వరరచన ఆయనదే. 

ఈ ముగ్గురూ యూనియన్ కార్యకలాపాలు చేపట్టిన తర్వాత సినీ మ్యుజిషియన్స్ యూనియన్ మంచి అభివృధ్ధి సాధించింది. అయితే అంత సునాయాసంగా ఏమీ జరగలేదు.  పూర్తి స్థాయి రిజిస్టర్డ్ యూనియన్ గా పనిచేయడం ప్రారంభించిన రోజుల్లో ఆర్ధిక స్వావలంబన కోసం ప్రతి సినీ మ్యూజిషియన్ ప్రతి రికార్డింగ్ కి పావలా చొప్పున విరాళంగా ఇచ్చేవారు. కృష్ణ అని వయొలెనిస్టని జ్ఞాపకం, తరవాత ఆర్కెస్ట్రా అరేంజర్ కూడా, అన్ని రికార్డింగ్ స్టూడియోలకి వెళ్ళి  కళాకారుల దగ్గరనుంచి వారి దగ్గర్నుంచి ఆ విరాళాలు సేకరించేేవారు. ఆ కాంట్రిబ్యూషన్ పుచ్చుకున్నందుకు ఆధారంగా ఒక పింక్ కలర్ టికెట్ లాటిది  ఇస్తూండేవారు.  

ఘంటసాల మాస్టారు వైస్ ప్రెసిడెంట్ అయ్యాక  మ్యుజిషియన్స్ యూనియన్ సమావేశాలు చాలా నెం.35, ఉస్మాన్ రోడ్ లోనే జరిగేవి. ఎమ్మె.ఎస్.విశ్వనాథన్, కె.వి.మహాదేవన్, టి.జి.లింగప్ప, రాజన్ నాగేంద్ర, జి.కె.వెంకటేష్, ఎస్.రాజేశ్వరరావు, పెండ్యాల, టి.వి.రాజు, టి.చలపతిరావు, మాస్టర్ వేణు, సుదర్శనం, గోవర్ధనం, పి.లీల, పామర్తి, ఎ.ఎ.రాజ్ (అంట్యాకుల అప్పలరాజ్), రాఘవులు, అప్పారావు (చక్రవర్తి), వి.దక్షిణామూర్తి, బాబురాజ్, సుసర్ల దక్షిణామూర్తిలాంటి who is who of famous music directors of Telugu film world, సంగీత కళాకారులందరిని ఒకేచోట చూసే అవకాశం నాకు ఈ మీటింగ్ ల ద్వారా కలిగింది. ఈ మీటింగ్ లలో స్పష్టంగా తమ భావాలను తెలియజేసినవారూ ఉన్నారు. తాము మాట్లాడకుండా ఇతరులచేత మాట్లాడించేవారూ ఉండేవారు. ఆయా కమిటీలలో సభ్యులుగా మా నాన్నగారు కూడా పనిచేసేరు.

సినీమ్యుజిషియన్స్ లో చాలామంది ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ క్రిస్టియన్స్ లేదా ఆంగ్లో ఇండియన్స్. వీరంతా విధిగా ఆదివారం చర్చ్ కు హాజరవ్వాలి. ఆరోజున రికార్డింగ్ ల వలన సండే ప్రేయర్స్ కు వెళ్ళడం కుదరదు. వారు లేకుండా విశ్వనాథన్, మహాదేవన్ వంటి ప్రముఖ సంగీత దర్శకులు పాటలు , రీరికార్డింగ్ చేయరు. అందువలన చాలామంది కోరిక కూడా ఆదివారం ఆఫ్ వుంటే మంచిదనే.

మరొక పాయింట్ సినీ మ్యుజిషియన్స్ యూనియన్ మెంబర్స్ అందరికీ పని చేయించుకున్న వెంటనే, అంటే రికార్డింగ్/రీరికార్డింగ్ అయిన వెంటనే స్పాట్ పేమెంట్స్ చేయాలి. 

సంఘ సభ్యుల సంక్షేమం/ఆరోగ్యం దృష్ట్యా రాత్రి పది దాటాక పనిచేయకూడదు. అదేవిధంగా నిర్మాతలకు సహాయపడే రీతిలో కూడా ఘంటసాలవారి చొరవ వల్ల కొన్ని మార్పులు తీసుకువచ్చారు. అంతవరకూ రికార్డింగ్ ల సమయంలో వాద్యకళాకారులను నిర్మాతలే  తమ వాహనాలలో  స్టూడియోలకు తీసుకువెళ్ళడం, రికార్డింగ్ తర్వాత ఇళ్ళ వద్ద దింపడం చేసేవారు. ఇది నిర్మాతలకు చాలా బర్డెన్ గా వుండేది.  ఆ పధ్ధతిని తొలగించి మ్యూజిషియన్స్ ఎవరికి వారే వారికి తోచిన వాహనాలలో సమయానికి స్టూడియో కు చేరుకోవాలి. అది ఆ కళాకారుని సొంత భాధ్యత. అందుకు ప్రత్యమ్నాయంగా ప్రతీ మ్యూజిషియన్ కు కొంత పైకం బేటాగా చెల్లించడం ప్రారంభించారు.  నిర్ణీత సమయం దాటాక వచ్చేవారిపై తగు చర్యలు తీసుకునే అవకాశం సంగీతదర్శకుడికి కల్పించారు.

ఈ విధమైన సమంజసమైన  సభ్యుల సమస్యలన్నీ ప్రతీసారి చర్చకు వచ్చేవి. 

ఘంటసాల మాస్టారు అటు నిర్మాతలకు, ఇటు సంగీత కళాకారులకు వారధిలాటివారు.  సినీమా రంగంలోని పెద్ద నిర్మాతలందరికీ ఘంటసాలగారంటే చాలా గౌరవం వుండేది. ఆయన మాటకూ విలువవుండేది. మాస్టారు, ఎమ్.బి.ఎస్ చాలా ఓర్పుగా, నేర్పుగా సినీ సంగీత కళాకారుల సమస్యలన్నీ  ఎత్తి చూపి, న్యాయబధ్ధమైన వాటన్నిటికీ సానుకూల పధ్ధతిలో ఇరువర్గాలకు ఆమోదకరమైన నిర్ణయాలు అమలు పర్చడంలో తీవ్రంగా కృషి చేసి కీలకపాత్ర పోషించారు.  క్రమక్రమంగా సినీ మ్యుజిషియన్స్ యూనియన్ చాలా వృధ్ధి చెంది. అన్ని యూనియన్లలోకి సినీ మ్యుజిషియన్స్ యూనియనే నెంబర్ వన్ గా, చాలా దృఢమైన సంఘంగా మార్గదర్శకంగా రూపొందింది. 

ఈ విధంగా ఘంటసాల మాస్టారు ఏక్టివ్ వైస్ ప్రెసిడెంట్ గా సినీ మ్యుజిషియన్స్ యూనియన్ కు రెండు, మూడు టెర్మ్స్ తన నిస్స్వార్ధ  సేవలను అందించి సంఘ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. ఒక్క సంగీత కళాకారులకే కాక పలువురు పాటల రచయితల విషయంలో కూడా తగు చొరవ తీసుకొని వారికి ఇవ్వవలసిన పారితోషకాలను బకాయి పెట్టకుండా చెల్లించేలా కృషిచేసిన సందర్భాలెన్నో.

అయితే తన స్వవిషయంలో మాత్రం కొందరి  నిర్మాతలనుండి తనకు రావలసిన పూర్తి సొమ్మును వసూలు చేసుకోలేకపోయారు. 

ఘంటసాల మాస్టారి తరువాత, పామర్తి, ఎ.ఎ.రాజ్, టి.చలపతిరావు, రామసుబ్బు, కూడా యూనియన్ అధ్యక్షులుగా కార్యకలాపాలు నిర్వహించారు.  మాస్టారి శకం అయ్యాక ఎన్నో కొత్త కొత్త మార్పులు వచ్చాయి.
ప్యాకేజ్ సిస్టం మ్యూజిక్ ప్రారంభమయింది. సంగీతదర్శకుడు అడిగిన లక్షలాది రూపాయలు చెల్లిస్తే చాలు. సీనీమా పాటలు/రీరికార్డింగ్ రెడీ. నిర్మాతకు ఏ బర్డెన్ లేదు. ఎంతమంది ఆర్కెస్ట్రా పెట్టాలి, ఎంతమంది గ్రూప్ సింగర్స్ వుండాలి, ఎవరెవరికి ఎంతెంత పే చెయ్యాలి మొదలైన అధికారాలన్నీ సంగీతదర్శకుడివే. ఈవిధంగా సినీమా సంగీతాన్ని మోనోపలి చేసి లోపాయికారిగా లబ్దిపొందిన  సంగీత దర్శకులు వుండేవారన్న ప్రచారమూ వుండేది.

ఈనాడు సినీ మ్యుజీషియన్స్ యూనియన్ కోడంబాక్కం ఆర్కాట్ రోడ్లో కమలా ధియేటర్ పక్కన తమ సొంత భవనంలో నుండి తమ కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి ఎదిగింది. యూనియన్ లో సభ్యులు కానివారెవ్వరికీ సినీమాలలో పనిచేసే అవకాశంలేదు. విధిగా ప్రతి ఒక్కరూ మెంబర్ కావలసినదే. చందాలు కట్టవలసినదే. కళాకారుల ప్రతిభను బట్టి ABC గ్రేడ్స్ కూడా ఉన్నాయని విన్నాను. 

పనిలేక ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్న వృధ్ధ సినీ సంగీత కళాకారులకు తగు ఆర్థిక సహాయాన్ని కూడా యూనియన్ సంక్షేమనిధి నుండి అందజేస్తున్నదని విన్నాను. మా నాన్నగారు ఇప్పటికీ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా  వార్షిక Full Member సభ్యత్వ రుసుము కడుతూ సినీ మ్యుజిషియన్స్ యూనియన్ సభ్యులుగా కొనసాగుతున్నారు.

 


2011లో జరిగిన యూనియన్ గోల్డెన్ జూబిలీ ఉత్సవాల్లో నాన్నగారిని సీనియర్ మెంబర్ గా ఒక బంగారు ఉంగరంతో సత్కరించింది యూనియన్.అయితే ఘంటసాల మాస్టారు స్వర్గస్థులయాక మా నాన్నగారు పూర్తిగా సినీమా సంగీతానికి దూరమయ్యారు. నాకూ సినీరంగ విశేషాల గురించి ఏ అవగాహనా లేకుండాపోయింది. 

ఏది ఏమైనా ఘంటసాల మాస్టారు గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, సినీ సంగీత కళాకారుల ప్రతినిధిగా  సినీమా రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయం.

💥కొసమెరుపు💥

మా చిన్నప్పుడు హైస్కూల్ రోజుల్లో తరచూ 'మఫ్' (muff) అనే మాట వినబడేది.  దానికి అర్ధం ఈ క్రింద వ్రాసిందాన్ని పూర్తిగా చదివితే అర్ధమౌతుంది.

గతంలో ఒకసారి చెప్పాను, నెం.35, ఉస్మాన్ రోడ్ లో ఒకే పేరుతో ఇద్దరిద్దరు వుండేవారని. వెంకటేశ్వరరావు ద్వయం, సుబ్బారావు ద్వయం, కృష్ణ ద్వయం, జనార్దన ద్వయం అలాగే మరో ద్వయం 'రాఘవులు'. ఈ ద్వయం తర్వాత త్రయం కూడా అయింది. ఆ విషయం మరోసారి చూద్దాము. దీన్ని యాదృచ్ఛికమంటారో, మరేమంటారో నాకు తెలియదుగానీ  నాకు మాత్రం ఒక తమాషాగా వుండేది.

ఈ రాఘవద్వయంలో ఒకరు జెవి రాఘవులు. ఘంటసాల మాస్టారి సంగీత సహాయకుడు. మరొకరు మాస్టారింటి ధోబీ (చాకలి). ఈ రాఘవులు ఒక్క మాస్టారింటికీ, మా ఇంటికి మాత్రమే కాదు సారంగపాణి స్ట్రీట్ లో వుండే అక్కినేని నాగేశ్వరరావు గారింటి ధోబీ కూడా ఈ రాఘవులే. మాస్టారు, నాగేశ్వరరావు గారు ఎక్కువగా తెలుపు బట్టలే ధరించడం వలన ఈ రాఘవులు వారివి వీరికి వీరివి వారికి మార్చేసి తెస్తూ అమ్మగారి (సావిత్రమ్మగారు) దగ్గర చీవాట్లు తినేవాడు. అలాటప్పుడు అన్నపూర్ణ గారి గురించి, నాగేశ్వరరావు గారింటి విశేషాలు చెపుతూ దృష్టి మళ్ళించేవాడు. ఈ రాఘవులులోని ఒక పెద్ద దుర్గుణం ఏమంటే బట్టలు పట్టుకుపోయి నెల్లాళ్ళైనా ఉతికి, ఇస్త్రీ చేసిన బట్టలు తీసుకువచ్చేవాడు కాదు. ఎప్పుడొస్తాడో స్పష్టంగా చెప్పేవాడు కాదు. ఒక వంద బట్టలయ్యాక మొత్తంగా డబ్బులు తీసుకునేవాడు. అప్పుడు, అతని భార్య, పేరు  సీత అనే గుర్తు,  ఇద్దరూ వచ్చేవారు. మా ఇంటి బట్టలు కూడా ఈ రాఘవులే ఉతికి తీసుకువచ్చేవాడు.

ఒకసారి మాస్టారు కచేరీకి బయట వూరు వెళ్ళవలసి వచ్చింది. మా నాన్నగారు కూడా. వీళ్ళిద్దరి చాలా బట్టలు రాఘవులింట్లో వుండిపోయాయి. మనిషి కనపడడు. అప్పుడు సావిత్రమ్మగారు ఎవరైనా రాఘవులుండే చోటికి వెళ్ళి చూసొస్తే బాగుంటుందని అన్నారు. ఆ సమయానికి నేనూ, నరసింగే అందుబాటులో వున్నందువల్ల రాఘవులింటికి వెళ్ళి బట్టలు తెచ్చే పని మాకు పురమాయించారు. అయితే ధోబీ రాఘవులు ఇల్లు ఎక్కడో ఎవరికీ తెలియదు సైదాపేట రైలు బ్రిడ్జి క్రింద వున్న అడయార్ రివర్ లో బట్టలు వుతుకుతాడని తప్ప. అక్కడికి వెళితే కనిపిస్తాడని ఓ ఊహ. ఆ సైదాపేట ఏరేదో మా విజయనగరం అయ్యకోనేరులా, బొబ్బిలి  గుర్రపు చెరువులా వుంటుంది, అక్కడ లవకుశ లో రేలంగి, గిరిజ, డాక్టర్ శివరామకృష్ణయ్య స్టైల్ లో  'వెయ్యర దెబ్బ దరువెయ్యర దిబ్బ బండమీద దబాదిబా' అంటూ చాకలాళ్ళు రేవులో బట్టలు చింపేస్తూవుంటారు, రాఘవులను ఆమాత్రం పట్టలేకపోతామాని మా ధైర్యం. (అప్పటికి లవకుశ రిలీజ్ కాలేదు కానీ పాటలు రికార్డ్ అయాయి. ఈ పాట షూటింగ్ కూడా ఆ ఏటి ఒడ్డునే జరిగిందని చెప్పడం జ్ఞాపకం). 

నరసింగకి మెడ్రాస్ కొత్త. అరవం రాదు. నాకు వచ్చునని నేను అనుకునేవాడిని. మేమిద్దరం కోడంబాక్కం స్టేషన్లో తాంబరం వేపు వెళ్ళే లోకల్ ట్రైన్ లో బయల్దేరాము. రైలు మాంబళం దాటింది. సైదాపేట దాటింది. కొంతసేపటికి ఒక బ్రిడ్జి క్రింద ఒక ఏరు (అడయార్ రివర్) కనపడింది. అయితే ఆ చుట్టుపక్కల ఏ చాకలివాళ్ళు కనపడలేదు. ట్రైన్ అక్కడెక్కడా ఆగలేదు. పాతకాలం కింగ్ ఇన్స్టిట్యూట్ భవనం దాటి ముందుకు వెళ్ళి గిండీ స్టేషన్ లో ఆగింది. అక్కడ రైలు దిగి మళ్ళా వెనక్కు సైదాపేట బ్రిడ్జి క్రిందివరకు లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వచ్చి అడయార్ రివర్ ప్రాంతంలో ఉన్న కొన్ని గుడిసెల ముందున్న కొంతమందిని రాఘవులు గురించి అడిగాము. అందరూ ఒకే సమాధానం 'తెరియాదు' అది మాకు బాగా తెలిసింది. వెతికి వెతికి వేసారి రాఘవుడు కానరాక ఎండలో కాళ్ళీడ్చుకుంటూ (కొంత దూరం) భోజనాల వేళకు ఈదురోమని ఇంటికి చేరాము. చేసే పని తాలుకు ముందువెనుకలు క్షుణంగా తెలుసుకోకుండా, సరైన ఊహ లేకుండా ఏ కార్యం మొదలెట్టినా వాటికి ఏ ఫలితం దక్కదు. వృధాయాసం తప్ప. ఈ పరమానందయ్య శిష్యుల  (నేను, నరసింగ) తెలివితేటలు చూసి మా అమ్మగార్లిద్దరూ మురిసి ముూర్ఛపోయారు.

పరమానందయ్య శిష్యులంటే గుర్తుకు వచ్చింది, ఘంటసాల మాస్టారి అద్వితీయ సంగీత ప్రతిభకు గీటురాయి 1966 నాటి 'పరమానందయ్య శిష్యుల కథ' పాటలు, విశేషాలు...... వచ్చే వారమే......
                      ...సశేషం


4 comments:

చుండి వేంకట రాజు said...

చాలా మంచి విశేషాలు చెబుతున్నారు. ధన్యవాదాలండి

P P Swarat said...

Thankyou.

ameerjan said...

మరో చక్కని జ్ఞాపకాల మాలిక అందించారు స్వరాట్ గారు!��
సినీ పరిశ్రమలో సంగీతకారుల బాధలు, వృత్తిరీత్యా వారికి యూనియన్ల ఆవశ్యకత, కాలమానం లేని వృత్తి బాధ్యతల వల్ల, ఆర్థికంగా సరియైన భరోసా లేనందువల్ల ఘంటసాల మాస్టారితో సహా ఎందరెందరో కళాకారులు తీవ్రమైన ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం; ఆ తరువాత మాస్టారి “ఉభయకుశలోపరి” తరహా నాయకత్వంలో యూనియన్ ఎదుగుదల చాల బాగా కళ్ళకు కట్టినట్లు చెప్పారు!
కొసమెరుపుగా ‘మఫ్’లనగానెవరో సోదాహరణంగా వివరించి నవ్వులు పూయించారు! ధన్యవాదాలండీ!!����

మహేష్ బాబు సంబటూరి వెంకట said...

నమస్తే స్వరాట్ బాబాయ్ గారూ 🙏🙏

ఈనాటి మీ జ్ఞాపకాల సంచిక లో సినీ సంగీత కళాకారుల సాధక బాధకాలూ... సంగీత కళాకారుల యూనియన్ ఆవిర్భావం & తదనంతర పురోగతి, ఘంటసాల మాస్టారు & ఎం బి శ్రీనివాసన్ గారు లాంటి వారి నిబద్ధత తో కూడిన చొరవ ఇత్యాది విషయాలన్నీ పూస గుచ్చిన చందంగా చాలా చాలా విపులంగా తెలియజేశారు. ఈ విషయాలన్ని చదివి తెలుసుకుని ధన్యులమైనాము. 😊🙏

ఇక ఈ సంచిక చివరలో మఫ్ అనే పదం గురించి చెప్తూ వివరించిన దోభీ రాఘవులు గారి ఎపిసోడ్ హాయిగా నవ్వులు పూయించింది😄😄....
అన్నట్టు మా హైస్కూల్ రోజుల్లో (1980-85) మా ఇంగ్లీషు మాస్టర్ సుబ్బరాయుడు గారు కూడా ఈ మఫ్ అనే పదాన్ని మా మీద విరివిగా వాడేవారు 😄😀.... మాకూ అర్థం తెలియకపోయినా ఆయన ఆ పదం ప్రయోగించే విధానానికి తెగ నవ్వుకునేవాళ్ళము....

ఇంత ఓపికగా మాతో మీ ఘంటసాల గారి జ్ఞాపకాలని పంచుకుంటున్నందుకు ఎప్పటిలాగే శతకోటి ధన్యవాదపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూన్నాను స్వరాట్ బాబాయ్ గారూ 🙏🙏🌺💐