visitors

Sunday, May 2, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై తొమ్మిదవ భాగం

02.05.2021 -  ఆదివారం భాగం - 29*:
అధ్యాయం 2 భాగం 28  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

2021 ఫిబ్రవరి నెల మొదటివారంలో ఆరు ముఖ్య గ్రహాలన్నీ మకరరాశిలో నివసించినట్లు జ్యోతిషశాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ షష్ట్యగ్రహ కూటమి వలన కలిగే లాభనష్టాల గురించి కూడా వారివారి గుణింతాలనుబట్టి వివరించారు. వాటి ఫలితాల విషయంలో ఎవరి అనుభవం వారిదే. సరిగ్గా ఇలాటి గ్రహకూటమే 1962 ఫిబ్రవరిలో  కూడా ఏర్పడింది. అప్పుడు ఏకంగా ఎనిమిది గ్రహాలు ఒకే రాశిలోకి వచ్చిచేరాయి. ఆ అష్టగ్రహ కూటమి ప్రపంచానికే అరిష్టమని, వాటి పరిణామం చాలా భయంకరంగా వుంటుందని, మహప్రళయమే సంభవించబోతుందని మనుష్యకోటే ఏదో విధంగా అంతరించబోతుందని లెఖ్ఖలుకట్టి చెప్పారు.

ఆ సందర్భంగా మద్రాస్ మహానగరం సముద్రతీరాన్ని అంటిపెట్టుకొని వున్న నగరం కావడం వలన అష్టగ్రహకూటమి దినాలలో మద్రాస్ పూర్తిగా సముద్రంలో ములిగిపోతుందనే వార్తకూడా తుఫాన్ వేగంతో ప్రజలను భయభ్రాంతులను చేసింది.  ఇటువంటి భయానక పరిస్థితులలో ప్రజలను సురక్షితంగా కాపాడే ప్రదేశం అరుణాచలం ఒక్కటేనని అందుచేత మీరందరూ వెంటనే తిరువణ్ణామలైకు రావలసిందిగా మా నాన్నగారికి ఒక పోస్ట్ కార్డ్ వచ్చింది. ఈ ఉత్తరాన్ని వ్రాసిందెవరో తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు.

ఆ వ్యక్తి మరెవరోకాదు. విప్లవకవిగా, నాస్తికుడిగా, చెడిపోయినవాడిగా సనాతనవాదులచేత వెలివేయబడ్డ ప్రముఖ రచయిత శ్రీగుడిపాటి వెంకటచలంగారు. ఆ రోజుల్లో స్త్రీ అభ్యుదయం కోసం తన కలంద్వారా తీవ్రంగా స్పందించడం ఆనాటి సభ్యసమాజానికి నచ్చలేదు. చలం రచనలు ఎవరూ చదవకూడదని కొందరు నిషేధించారు. 

నేను  చాలాకాలం పాటు 'మాలపిల్ల', 'మాలపల్లి' ఒకటే అనే భ్రమలో వుండేవాడిని. 'మాలపల్లి' ఉన్నవ లక్ష్మీనారాయణగారు వ్రాసారు. గుడిపాటి వెంకట చలంగారిది 'మాలపిల్ల', నవల. కాంచనమాలతో సినీమాగా కూడా వచ్చింది. చలంగారే మాటల రచయిత కూడా. స్త్రీ జనాభ్యుదయానికి, వెనబడిన వర్గాల ఉద్ధరణకు దోహదం చేసిన సినీమాగా మాలపిల్ల చాలా ప్రశంసలు పొందింది. ఈ 'మాలపిల్ల' సినీమాను మా నాన్నగారి స్నేహితుడు పంతుల శ్రీరామశాస్త్రిగారు ఒక వేసంగి శెలవులకు మద్రాస్ వచ్చినప్పుడు 'సన్'  థియేటర్లో మ్యాట్నీకి మేమిద్దరమే వెళ్ళాము. బెంచ్ టిక్కెట్. జనాలు లేరు. హాయిగా బెంచీలమీద పడుక్కొని చూశాము. నేను చూసిన మొదటి కాంచనమాల సినీమా అదే.  
              
 

గుడిపాటి వెంకటాచలంగారు భీమ్లీలో (భీమునిపట్నం) వుండేవారు. స్కూళ్ళ ఇన్స్పెక్టర్ అని గుర్తు. ప్రవృత్తి రచనా వ్యాసంగం. చలంగారి రచనలకు ప్రభావితులైన యువకులు చాలామందే వుండేవారు. చలంగారు కొడవటిగంటి కుటుంబరావుగారి బావగారి తమ్ముడు. కొమ్మూరి రామయ్యగారి (ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత కొమ్మూరి సాంబశివరావుగారి తండ్రి) తమ్ముడు చలంగారు. గుడిపాటివారింటి దత్తపుత్రుడు. 

అంతటి తీవ్ర భావాలతో విప్లవ ధోరణి కలిగిన చలంగారు క్రమక్రమంగా తన ఆలోచనా దృక్పథంలో మార్పుకలిగి ఆధ్యాత్మికత వేపు మరలిపోయారు. తన నివాసాన్ని తిరువణ్ణామలైకు మార్చి అక్కడే స్థిరపడిపోయారు. ఆశ్రమవాసం. చలంగారి కుమార్తె సౌరీస్ కూడా అనేక పుస్తకాలు వ్రాశారు. సౌరీస్ మాత్రమే కాక  చలంగారికి మరో ఇద్దరో ముగ్గురో పెంపుడు కూతుళ్ళు వుండేవారు. అందులో ఒకావిడ పేరు పకపక (చంపకం). ఆమె భర్తే ప్రముఖ కవి, రచయిత అయిన వజీర్ రెహ్మాన్. మద్రాస్ లో వుండేవారు. మా నాన్నగారికి మంచి స్నేహితుడు. తరచూ మా ఇంటికి వచ్చేవారు. సంగీతాభిలాషి ఆయన దగ్గర చాలా ఇంగ్లీష్ రికార్డ్ లు వుండేవి. కోడంబాక్కం రంగరాజపురం - విశ్వనాథపురంలో వారిల్లు. అప్పట్లో వారికి రెండేళ్ళో, మూడేళ్ళో ఒక చిన్న పాప. చాలా ముద్దుగా వుండేది. ఆ పాప అన్నం తినే విషయంలో చాలా ఇబ్బందిపెట్టేది. అలాటి సమయంలో సోఫియా లారెన్ పాడిన "జూ బి జూ" పాట ఆ పాపను చాలా ఆకర్షించింది. దానితో ఆ పాప ఆహార సమస్య తీరింది. ఆ పాటను గ్రామఫోన్ లో వినిపిస్తూంటే ఏ అల్లరిలేకుండా శుభ్రంగా అన్నం తినేసేది. అయితే మధ్యలో పాట ఆగితేమాత్రం యాగీయే. విసుగు విరామం లేకుండా నిద్ర వచ్చేవరకూ ఆ పాట అలా వినిపించవలసిందే. నేను ఎప్పుడు వెళ్ళినా వజీర్ రెహ్మాన్ గారింట్లో ఈ సోఫియాలోరేన్  'జూ బి జూ' పాట వినబడేది.


సోఫియా లోరెన్ జూ బి జూ

చలంగారితో మా నాన్నగారికి ఎప్పుడు పరిచయం కలిగిందో నాకు తెలియదు, బహుశా, కుటుంబరావుగారు, జలసూత్రంవారు కారణం కావచ్చు. ఏడాదికో రెండేళ్ళకో ఒకసారి తిరువణ్ణామలై వెళ్ళి చలంగారితో గడిపి వచ్చేవారు. చలంగారికి మా నాన్నగారి పాటంటే ఇష్టం. వారిద్దరిమధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగేవి. ఆయన వ్రాసే ప్రతి ఉత్తరం క్రింద 'ఈశ్వర ఆశీర్వచనాలతో - చలం' అని సంతకం చేసేవారు.

అష్టగ్రహ కూటమి విషయంగా చలంగారు వ్రాసిన ఉత్తరానికి మా నాన్నగారు ఎలా స్పందించారో నాకు తెలియదు. ఆయన ప్రతీవిషయాన్ని తార్కికంగా, హేతుబధ్ధంగా ఆలోచిస్తారు. తన వాదనలను, అభిప్రాయాలను సమర్ధించుకోవడంకోసం వాద ప్రతివాదాలు చేసే అలవాటు లేదు. అందరి అభిప్రాయాలను ఒకేరీతిలో స్వీకరించేవారు. తన ఆలోచనారీతికి తగినట్లు నడుచుకునేవారు.

మా నాన్నగారు నాస్తికులు కారు. ఆయనది జ్ఞానమార్గం. గంటల తరబడి చేసే పూజాపునస్కారాలు, నిరంతర ఆలయ దర్శనాల కర్మమార్గానికి ఆయన దూరమేమోననిపిస్తుంది. అయితే వృత్తిపరంగా అనేక దేవాలయాలను దర్శించేవారు. వాటి చరిత్రను క్షుణంగా అర్థం చేసుకునేవారు. జ్యోతిషం, హస్త సాముద్రికం, వేదాంతం వంటి వాటిలో కూడా మంచి ప్రవేశం వుంది. ఆ శాస్త్రాలలో ఆరితేరిన వారితో మంచి స్నేహమూ వుండేది. అయితే అవన్నీ జ్ఞాన సముపార్జన కోసం మాత్రమే అన్నట్లుండేది.  నాకు తెలిసి ఆయనకు ఏ విషయంలోనూ మూఢ నమ్మకం లేదు. 

మొత్తానికి అష్టగ్రహకూటమికి మద్రాస్ విడిచిపెట్టి అరుణాచలం వెళ్ళలేదు.  తదనంతరం ఆ విషయమై ఎవరితోనూ చర్చించనూలేదు.

ఇలాటి 'నమ్మిక' 'faith' వంటి విషయాలలో ఘంటసాల మాస్టారు, మా నాన్నగారికి భిన్నంగానే వుండేవారు. 

మాస్టారు అందరినీ  నమ్మేవారు. వారు చెప్పే విషయాలకు స్పందించి తీవ్రంగా చలించిపోయేవారు. అలాటివారికి సహాయం చేయడంలోరాత్రింబగళ్ళు శ్రమించేవారు.  ఘంటసాల మాస్టారు చేసిన సగానికి సగం కచేరీలు వ్యక్తులను, సంస్థలను, అలయాలను ఉధ్ధరించడానికే జరిగాయి. అందులో ఆయనకు ఏమాత్రం ఆదాయం వుండేదికాదు. అయినా అలాటి సామాజిక కార్యక్రమాలలో ఆయనకు ఆనందం వుండేది. తన ఆర్కెస్ట్రా వారికి మాత్రం ప్రతిఫలం కలిగేలా చేసేవారు. అయితే ఆ పారితోషికం సినీమా పాటలకు వాయించేదానికన్నా తక్కువగానే వుండేది. అలాగే, గ్రామఫోన్ కంపెనీ రికార్డింగ్స్ కూడా. అందులో కూడా మాస్టారికి రాయల్టీ రూపంలో వచ్చే ఆదాయమే తప్ప అధికలాభం వుండేదికాదు. అందుకే  చాలామంది ఆర్కెస్ట్రా వారు కచేరీలకు, గ్రామఫోన్ కంపెనీ  రికార్డింగ్ లకు అంత సుముఖత చూపేవారు కాదు. అందుకే ఘంటసాల మాస్టారు తనను బాగా అంటిపెట్టుకొని వున్నవారితోనే కచేరీలు చేసేవారు. వారంతా కూడా సంగీతంలో నిష్ణాతులే. మాస్టారి బాణీ, ధోరణికి అలవాటు పడినవారే.

ఒక ఏడాది క్రితం ఎవరో (వారికి ఎలా దొరికిందో తెలియదు) వాట్సప్ సమూహంలో ఒక ఆసక్తికరమైన విషయం పెట్టారు.  అది 1960లకు ముందెప్పుడో  జరిగిన ఘంటసాల మాస్టారి కచేరీకి సంబంధించిన వివరాలు. మౌంట్ రోడ్ స్పెన్సర్స్ వెనక వేపు 'కన్నెమెరా' హోటల్ వుండేది. ఆరోజుల్లోనే చాలా ప్రెస్టేజియస్ స్టార్ హోటల్. సామాన్యులకు అందుబాటులో వుండనిది. అలాటి హోటల్ లో జరిగిన  ఒక పెళ్ళి రిసెప్షన్ లో ఘంటసాలవారికి, వారి బృందానికి చెల్లించిన పైకం వివరాలు చూస్తే నా మతిపోయింది. ఆనాటి కచేరీకి జరిగిన మొత్తం ఖర్చు 1500 రూపాయలుగా వివరించబడింది. ఆ కచేరీలో నాకు తెలిసిన ఒక వైలినిస్ట్ కూడా పాల్గొన్నారు. పేరు లాజరస్. ఆంగ్లో ఇండియన్. మాస్టారి ఆర్కెస్ట్రా మెంబర్. ఆ కచేరీ వివరాలు చాలాకాలం నా ఫైల్ లో వుండేవి. ఇప్పుడు కనపడలేదు. ఎలాగో డెలిట్ అయిపోయాయి.

తరచూ ఎవరో ఒకరు మాస్టారి సహాయాన్ని అర్ధిస్తూ వచ్చేవారు. వారందరికీ ఏదో విధంగా సహాయపడేవారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో వుండే దేవాలయ అర్చకులకు వచ్చే ఆదాయం కుటుంబపోషణకు చాలక చాలా దీనావస్థలో వుండడం ఘంటసాలవారిని చాలా కలచివేసింది. రావలసిన జీతాలు సక్రమంగా అందుబాటు జరగక అర్చకులు చాలామంది అతి పేదరికంలో మగ్గేవారు. అలాగే చాలా దేవాలయాల భూములు కూడా అన్యాక్రాంతమై, భూతగాదాలకులోనై కోర్ట్ లు కేసులు అంటూ దేవాలయ ఆదాయం కుంటుపడ్డాయి. ఇలాటివారికి తనకు చేతనైన సహాయం ఏదైనా చేయాలనే తపనతో 'వెలనాటి వైదిక అర్చక సంఘం' అనే దానిని ఏర్పర్చి అర్చకులు సాధకబాధకాలన్ని ఆ సంఘ ప్రతినిధులను తన ఇంటికి రప్పించి వారితో సావకాశంగా చర్చించి ఆనాటి రాష్ట్రమంత్రులైన  బ్రహ్మానందరెడ్డి, సంజీవరెడ్డి, తిమ్మారెడ్డి, ఎ.వాసుదేవరావు వంటి నాయకులు మాస్టారిని బాగా గౌరవించే మిత్రులు. అలాటివారిని కలసి, సంప్రదించి, నిర్విరామంగా ఉత్తరప్రత్యుత్తరాలు జరిపి ఆలయ అర్చకులకు తగు సహాయం అందేలా కష్టపడ్డారు. 

జగద్గురు ఆదిశంకరాచార్యులవారు, సనాతన హిందూ ధర్మ పరిరక్షణకోసం దేశవ్యాప్తంగా పర్యటించి అనేక పీఠాలను స్థాపించారు.  అలాగే ఆయన శిష్యపరంపర కూడా అనేక శంకర పీఠాలను స్థాపించారు. అలాటి వాటిలో ఒకటి ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని ఏకైక పీఠమైన పుష్పగిరి పీఠం. రాజ మహారాజుల కాలంలో గొప్పగా విరాజిల్లిన ఈ పుష్పగిరి పీఠం క్రమక్రమేణా తన వైభవాన్ని కోల్పోయింది. పీఠానికి చెందిన చాలా వ్యవహారాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఆ స్థితిలో పునరుధ్ధరణకు ఘంటసాలవారు  నడుంకట్టి చేసిన సేవ అనన్యసామాన్యం.

ఘంటసాలమాస్టారికి ఈ పీఠం గురించి తెలిసేనాటికి పుష్పగిరి పీఠాధిపత్యం వహించిన స్వామి నవయువకులు. అతి చిన్న వయసులోనే మహత్తరమైన పీఠాధిపత్యం లభించింది. అంతటి ఔన్నత్యం కలిగిన పదవి వహించేందుకు కావలసిన మనోపరిపక్వత, శాస్త్ర పరిజ్ఞానము, ఆగమశాస్త్ర విధివిధానాలు, మొదలైనవి సంపూర్ణంగా ఒంటబట్టలేదని అనుకునేవారు. సామాన్య ప్రజలకు పీఠాధిపతుల ఎడల భక్తి భావము, గౌరవము ఏర్పడాలి. అందుకు తగినట్లు ఈ యువస్వామి శిక్షణ పొందాలని ముందుగా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. మద్రాస్ లో చాతుర్మాస్య దీక్షలు జరపడానికి తగిన వసతులు ఏర్పాటు చేశారు ఘంటసాల మాస్టారు. ఆనాటి స్థానిక తెలుగు ప్రముఖులలో ఆధ్యాత్మిక విషయాలలో అక్కర, ఆసక్తి కలిగినటువంటి వైశ్య భక్తశిఖామణి ఆర్.ఆర్.నాధం, డి.ఎస్.శాస్త్రి వంటి మరికొంతమందిని కూడగట్టుకొని ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. మద్రాస్ లోని శంకరమఠాలలో, జార్జ్ టౌన్ లోని కచాలేశ్వరాలయంలో పుష్పగిరి స్వాముల చాతుర్మస్య దీక్షకు వసతులు ఏర్పర్చి తనకు సమయం చిక్కినప్పుడల్లా స్వామీజీని కలుస్తూ పీఠాధిపత్య హోదా ఎలా కాపాడుకోవాలో వంటి ఆధ్యాత్మిక, లౌకిక విషయాలను చర్చించేవారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పుష్పగిరి పీఠం గురించి స్థానిక ప్రజలందరికీ తెలియడానికి తను స్వయంగా భక్తి సంగీత కచేరీలు చేసారు. అదే సమయంలో ఒక రోజు మా నాన్నగారి (పట్రాయని సంగీతరావుగారి) సంగీత కచేరీ కూడా జరిగింది. ఆ రోజున తంబురా శృతి వేయడానికి తగినవారు అందుబాటులో లేక ఘంటసాల మాస్టారే మా నాన్నగారి కచేరీకి తంబురా శృతివేసారని, తరువాత ఎప్పుడో  ఘంటసాల మాస్టారి ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ  ఒక వ్యాసంలో  పుష్పగిరి స్వామీజీయే ఉటంకించారు. ఘంటసాలగారి విద్యార్థి దశలో అటువంటి కొన్ని సందర్భాలు ఉన్నా, అనంతరం అలా సహకరించడం తన స్థాయికి తక్కువ పని అని ఘంటసాలవారు ఆనాడు భావించలేదు. ముఖ్యంగా శాస్త్రీయ సంగీత విద్వాంసుల ఎడల వారికి ప్రత్యేక గౌరవ మర్యాదలుండేవి.

ఇలాటి సంఘటనే ఘంటసాల మాస్టారి తొలి దినాలలో కూడా జరిగింది. మద్రాస్ మ్యూజిక్ ఎకాడెమీలో నిస్సార్ హుస్సేన్ ఖాన్ అనే సుప్రసిధ్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసుడి కచేరీ జరిగినప్పుడు పక్కన తంబురా శృతి వేయడానికి ఎవరూ లేకపోతే వెంటనే ఘంటసాలవారే తంబురా శృతి వేసారని ఒక వ్యాసంలో పట్రాయని సంగీతరావుగారు పేర్కొన్నారు. అంతటి హృదయవైశాల్యం గల వ్యక్తి ఘంటసాల మాస్టారు.

ఈ విధంగా నూతనంగా పీఠాధిపత్యానికి వచ్చిన స్వాములవారి వద్దకు తనకు తెలిసిన ప్రముఖులెందరినో తీసుకువెళ్ళి ఆంధ్రప్రదేశ్ లోని శంకరపీఠం అభివృధ్ధి చెందాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేసి వారందరి తోడ్పాటును అర్ధించారు. ఘంటసాలవారు పుష్పగిరి పీఠౌన్నత్యానికి, ఆ పీఠానికి అధిపతియైన శ్రీ మదోద్దండ విద్యానరసింహ భారతీస్వాములవారి పురోభివృద్ధికి అనన్యసామాన్యమైన సేవలందించారు.

ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలకే కాక సాంఘిక సంక్షేమాలకోసం కూడా తన శక్తిని, ప్రతిభను వినియోగించారు.

సినీమావారు ఏ సత్కార్యం తలపెట్టినా అందులో పాలుపంచుకోవడానికి ముందు వరసలో నిలిచింది ఘంటసాల మాస్టారే. సదా ప్రజల మధ్యే వుండాలని ఆకాంక్షించే ప్రజాగాయకుడు ఘంటసాల మాస్టారు. అందుకే ఎన్.టి.రామారావుగారు 'మా మాస్టారు' అంటూ గౌరవంగా, ఆప్యాయంగా పరిచయం చేసేవారు. ఎన్.టి.రామారావుగారి నేతృత్వంలో జరిగిన అనేక సంక్షేమ కార్యక్రమాలలో ఘంటసాలవారు మరువలేని పాత్ర పోషించారు. రాయలసీమ కరువు నిధి, పోలీస్ సంక్షేమనిధి, ఇండో-చైనా వార్ సందర్భంగా ప్రధానమంత్రి రక్షణనిధి వంటి అనేక కార్యక్రమాలలో ఎన్.టి.ఆర్ తో సమానంగా వేదికను పంచుకున్నారు. ఈ విధమైన సంక్షేమ కార్యక్రమాలలో సినీ ప్రముఖులు అంతా వారి వారి అవకాశాలనుబట్టి పాలుపంచుకున్నారు. ఇది వాలంటరీ సర్వీస్ గా భావించి కొందరు, లేదా ఒక వర్గం వారు చేస్తున్న ఫంక్షన్స్ కనుక పాల్గొనడం ఇష్టం లేక మానివేసినవారు కొందరు వున్నా, దేశం కోసం చేస్తున్న ఈ కార్యక్రమాలలో పాల్గొనడం తన విధిగా ఘంటసాలవారు భావించి తన సేవలందించారు. అందుకే ఒక సందర్భంలో ఎన్.టి.ఆర్ స్పందిస్తూ "మాస్టారు ఎవరు వచ్చినా రాకపోయినా ఫర్వాలేదు, మీరు నా పక్కనుంటే చాలు. మనిద్దరమే ఆంధ్రదేశమంతా పర్యటించి నిధులు వసూలు చేద్దామని" అన్నారట. అయితే అలాటి పరిస్థితి ఏర్పడకుండా సినీరంగమంతా ఒక్కటై దేశం కోసం తమ కళలను వినియోగించారు. చైనా యుధ్ధం సమయంలో ప్రధానమంత్రి రక్షణనిధికి ఎంతగానో తెలుగు సినీమారంగం తమ తోడ్పాటును అందించింది. విజయవాడ, హిందూపూర్, అనంతపూర్, వరంగల్, విశాఖపట్నం, మద్రాస్ వంటి అనేక ప్రధాన నగరాలలో ఎన్.టి.రామారావు నాయకత్వంలో అనేక సాంస్కృతికోత్సవాలు నిర్వహించారు.  కాంతారావు, దేవిక, ఛాయాదేవి, ధూళిపాళ, పద్మనాభం, జగ్గయ్య వంటి ప్రముఖ నటీనటులంతా రకరకాల స్కిట్ లు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించేవారు. రాజసులోచన బృందం నృత్యకార్యక్రమాలుండేవి. ఇలాటి సందర్భంలోనే ఎన్.టి.ఆర్ 'శ్రీకృష్ణ సత్య' ను స్టేజ్ షోగా రూపొందించారు. అందులోని పాటలు పద్యాలను ఘంటసాల మాస్టారే స్వరపర్చారు. (ఈ కథనే తరువాత సినీమాగా తీద్దామని మీరే సంగీత దర్శకత్వం వహించాలని ఎన్టీఆర్ ఘంటసాల మాస్టారిని కోరారుట. అయితే అది ఆచరణలో జరగలేదు. అనేక చిత్రాల్లాగే ఇదికూడా మాస్టారి చేయి జారిపోయింది. ఆ అవకాశం పెండ్యాల గారు దక్కించుకున్నారు).

ఘంటసాల మాస్టారి సోలో కచేరీలు ప్రజలను విపరీతం ఉత్తేజపరిచేవి.

ఇవికాక,  ఉదయంపూట సినీ కళాకారులంతా జోలెపట్టి  ఆయా నగరాల పురవీధులలో  సంచారం చేస్తూ నిధులు వసూలు చేశారు. చిన్నలు, పెద్దలు, పేదలు, ధనికులు అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున విరాళాలు నటీనటుల జోలెలో వేసేవారు. అనేక చోట్ల ఎంతోమంది మహిళలు తమ ఒంటిమీది విలువైన నగలను కూడా విరాళంగా ఇవ్వడం జరిగింది.  వీరు వెనక నడిచి వస్తూంటే ముందుగా ఘంటసాల మాస్టారు తన దేశభక్తి గీతాలతో ప్రజలను ఉత్తేజపరిచేవారు. ఇందుకోసమే ప్రత్యేకంగా బుర్రకథను, కొన్ని పాటలను వ్రాయించి తానే స్వరపర్చి గానం చేసేవారు. అలాటివాటిలో ఒకటి "హలో మిస్టర్ చౌఎన్ లై" అని  చైనా దురాగతాలను ఎండగడుతూ రాక్ ఎన్ రోల్ టైప్ లో ఒక పాట చేశారు. ఈ పాటల కంపోజింగ్, రిహార్సల్స్ మాస్టారింట్లోనే జరిగాయి. ఈ రక్షణనిధి సాంస్కృతికోత్సవాలలో మాస్టారివెంట మా నాన్నగారు పాల్గొని హార్మొనియంతో సహకరించారు.  ఈ పాటలన్నిటికి ప్రజలంతా పెద్ద ఎత్తునే ఆకర్షితులయ్యారు. ఎన్.టి.ఆర్ చేపట్టిన రక్షణనిధి విజయవంతమయింది. తరువాత రోజులలో కొన్ని గ్రామఫోన్ రికార్డ్ లుగా కూడా ఇచ్చారు.ఇలాటి రక్షణనిధి కార్యక్రమం 1965లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగిన సమయంలో మద్రాస్ తేనాంపేట కాంగ్రెస్ గ్రౌండ్స్ లో  కూడా జరిగింది. ఆ కార్యక్రమానికి నేనూ వెళ్ళాను. ఆనాటి సాంస్కృతికోత్సవంలో తెలుగు, తమిళ  ప్రముఖ నటీనటులంతా పాల్గొన్నారు. 
ఎమ్.జి.ఆర్, శివాజీ, జెమినీ గణేశన్, సావిత్రి, దేవిక, ఎన్.టి.ఆర్, అక్కినేని, కాంతారావు, జగ్గయ్య వంటి హేమహేమీలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు సినీమా పరిశ్రమల ప్రముఖులంతా ఒక చోట చేరితే అభిమానులకేం కొదవ. కాంగ్రెస్ గ్రౌండ్సంతా కిక్కిరిసిపోయింది. రకరకాల వినోదకార్యక్రమాలు జరిపారు.  సూపర్ హిట్ తెలుగు తమిళ గీతాలతో ఘంటసాల మాస్టారు చేసిన కచేరీ ప్రేక్షకులకు మహదానందం కలిగించింది. ఎమ్.జి.ఆర్, ఎన్.టి.ఆర్ ల ఉపన్యాసాలతో ప్రజలు ఊగిపోయారు.

కులాలలని, మతాలని, జాతులని, భాషలని, ప్రాంతాలని తమలో తాము ఎన్ని విధాలుగా కుమ్ములాడుకొని చస్తున్నా  దేశ సమగ్రతకు, రక్షణకు ముప్పువాటిల్లుతున్నదంటే దేశంలోని అన్ని వర్గాలవారు ఏకమై సమైక్యంగా పోరాడతారు. అదే భారతీయ తత్త్వం. భిన్నత్వంలో ఏకత్వం. Unity in diversity.

ఈ విధంగా సినీ కళాకారులంతా సేకరించిన సుమారు పది లక్షల రూపాయలను ఒక వేదిక మీద ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రిగారికి ఎన్టీఆర్ బృందం అంతా కలసి అందజేశారు.

ఈ రక్షణనిధి కార్యక్రమాలలో పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతాపూర్వకంగా గౌరవిస్తూ ఎన్.టి.రామారావు పతకాలను అందజేశారు. ఆనాటి ఎన్.టి.ఆర్ పతకం ఇప్పటికీ మా ఇంట్లో ఉంది.సినీమా రంగం వ్యామోహాలకు, ప్రలోభాలకు నిలయం.  వ్యాపారమే ప్రధాన లక్ష్యం. అలాటి రంగంలోని ఘంటసాలవంటి ప్రముఖ వ్యక్తి ఇటువంటి సామాజిక, అలౌకిక, పారమార్థిక కార్యకలాపాలలో పాల్గొనడం చాలా అరుదు. అందుకే ఘంటసాలవారు ప్రజల మనిషిగా, సినీమారంగంలో ఒక విశిష్ట వ్యక్తిగా అందరి మన్ననలు పొందారు. 

1966లో గాయకుడిగా ఘంటసాల మాస్టారి కీర్తిప్రతిష్టలను పెంచే చిత్రాలు చాలానే వచ్చాయి. అందులో ప్రముఖమైనవి - శ్రీకృష్ణ పాండవీయం, పల్నాటియుధ్ధం, ఆత్మగౌరవం, భీమాంజనేయయుధ్ధం, చిలకాగోరింక, సంగీతలక్ష్మి,  భక్తపోతన, శ్రీకృష్ణ తులాభారం, మనసేమందిరం, ఆస్తిపరులు, మోహినీ భస్మాసుర మొదలైనవి.
 
ఈ చిత్రాల్లోని పాటలన్నీ ఈనాటికి మనం విని ఆనందిస్తూనే ఉన్నాము. 💥కొసమెరుపు💥

శ్రీకృష్ణ తులాభారం నిర్మాణంలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒక చిన్న ముతక జోక్ నా చెవినబడింది. 

శ్రీకృష్ణ పాండవీయంలో  ఒక కొత్త నటికి అవకాశమిచ్చారు ఎన్.టి.రామారావు. ఆవిడే కె.ఆర్.విజయ. మలయాళీ. అప్పుడే కొన్ని తమిళ చిత్రాలలో హీరోయిన్ గా వేయడం మొదలు పెట్టింది. ఆవిడకు అప్పట్లో  తెలుగు శుధ్ధంగా (అంటే అసలు) రాదు. అర్ధము కాదు.

ఈ సినీమా నిర్మాణంలో వున్నప్పుడే శ్రీకృష్ణ తులాభారం సినీమా కూడా నిర్మాణంలో వుంది. అందులో కూడా సింగార కృష్ణుడిగా రామారావుగారి నటన అద్వితీయం. ఆ విషయాన్ని అందరు గొప్పగా చెప్పుకునేవారు. ఒకరోజు కె.ఆర్.విజయ, శ్రీకృష్ణపాండవీయం సెట్ లో రామారావు గారి దగ్గర 'శ్రీకృష్ణ తులాభారం' సినీమా ప్రస్తావన తెచ్చి ఆయనను ప్రశంసించబోయిందట. కానీ విజయకు తెలుగు సరిగ్గారాక శ్రీకృష్ణ తులాభారం అనేమాట పలకలేకపోవడంతో సెట్ మీద ఉన్నవారికి  'శ్రీకృష్ణ తులాభారంలో'' అశ్లీలత ధ్వనించిందట. ఇది విన్న వెంటనే ఎన్టీఆర్ ముఖం ఆగ్రహంతో ఎర్రబడిందట. వెంటనే పక్కనున్న పుండరీకాక్షయ్యలాటివారితో "ముందు ఈ అమ్మాయికి తెలుగు బాగా నేర్పి తీసుకురండి. అంతవరకు ఆ అమ్మాయితో షూటింగ్ కాన్సిల్" అని హుకూం జారీచేశారట. 

అదీ కధ.  అయితే ఇందులోని నిజానిజాలైతే నాకు తెలియదు.  ఇది రామారావుగారి స్టైల్ లో 'శత్రు వర్గాలవారు మా మీద పన్నిన కుట్ర' కూడా కావచ్చు. అందుచేత ఊరికే చదవండి వెంటనే మర్చిపొండి. 

😊Statutory warning: గాసిప్స్  ఒంటికి పట్టించుకోవడం మనసుకు మంచిదికాదు.

1966 లో విడుదలైన  ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు  మూడు - శకుంతల, పరమానందయ్య శిష్యుల కథ, పాదుకా పట్టాభిషేకం.

నేను ముందే పరమానందయ్య శిష్యుల గురించి చెపుతానని క్రిందటి వారమే  కమిట్ అయిపోయాను. అయితే పరమానందయ్యగారి శిష్యులు వేమారం వెళ్ళారట.

వచ్చేక, వచ్చేవారం కలుద్దాము.....
                  ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

No comments: