visitors

Sunday, May 9, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫైవ భాగం

09.05.2021 - ఆదివారం భాగం - 30*:
అధ్యాయం 2  భాగం 29 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"సంగీతం బాబూ...! ఒకసారి త్యాగయ్యగారి 'శివశివ యనరాదా', 'శ్రీ గణపతిని సేవింపరారే' ఈ రెండు కృతులు వినిపించండి". 

వెంటనే సంగీతరావుగారు హార్మోనియం వాయిస్తూ పంతువరాళి రాగంలోని 'శివశివ యనరాదా ', సౌరాష్ట్ర రాగంలోని ' శ్రీ గణపతినీ సేవింపరారే' కృతి పల్లని పాడి వినిపించారు. "చరణం పాడండి" అన్నారు. వెంటనే సంగీతం గారు "పనస నారీకేళ ఫలముల నారగించి" అని పాడి వినిపించారు. "శివశివ యనరాదా పల్లవి, 'పనస నారికేళా ఫలముల" చరణం మాత్రం నొటేషన్స్ వ్రాసి ఎంత టైమ్ పడుతోందో చూడండి." నొటేషన్ రాసి టైమ్ చూశారు.

"బాబూ... ఒకసారి ఆ భోజనాల సీన్  మానిటర్ వేయండి". సైలంట్ పిక్చర్ స్క్రీన్ మీద కనిపించింది. నొటేషన్ హార్మోనియం మీద ప్లే చేసి చూశారు. నొటేషన్ లెన్గ్త్ ఎక్కువైపోయింది. సీన్ కు తగ్గట్లుగా నొటేషన్ లోని స్వరాలను కుదించారు. 

"ఇప్పుడు వైలిన్స్, హార్మోనియం, ఫ్లూట్  వాళ్ళు మాత్రం ఈ బిట్ నొటేషన్ తీసుకొని ప్లే చేయండి. వెస్టర్న్ వైలిన్స్ అవసరం లేదు' అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఘంటసాల మాస్టారు తర్వాత సీన్ గురించి ఆలోచించడం మొదలెట్టారు.

అది భరణీ స్టూడియో. నైన్ టు నైన్ కాల్షీట్. "పరమానందయ్య శిష్యుల కథ" క్లైమాక్స్ రీ రికార్డింగ్. పరమానందయ్య శిష్యులు కోటలో రహస్యంగా ఎవరికీ తెలియకుండా వంటగదిలోకి ప్రవేశించి అక్కడ వున్న ఫలహారాలన్నీ ఆరగించడానికి ముందు దేవుడి గదిలోకి వెళ్ళి పూజలు చేస్తూంటే దేవకన్య చిత్రలేఖ రహస్యంగా వారిని గమనిస్తూ వారెవరో మహానుభావులని భావిస్తుంది.  ఆమె కళ్ళకు ఆ గుంపులో ఒకరు బొజ్జగణపతిలా కనిపించి భక్తితో నమస్కరిస్తుంది. తర్వాత వారు అక్కడున్న విందు పదార్థాలన్నీ సుష్టుగా భోజనం చేస్తారు. వారికి ఫలాలనిచ్చి చిత్రలేఖ భక్తితో నమస్కరిస్తుంది. వారంతా "మహారాజును పెళ్ళాడుదువు గాక"  అని దీవిస్తారు. ఈ వింతను మహారాజుకు చెప్పడానికి చిత్రలేఖ వెళ్ళిపోతుంది. అదీ సీన్. దీని మీద మ్యూజిక్ పోస్ట్ చేయాలి.

ఈ సీన్ చూడగానే వెంటనే ఘంటసాల మాస్టారికి ఈ రెండు కృతులు గుర్తుకు వచ్చాయి. సందర్భోచితంగా, పాత్రల ఔచిత్యం దెబ్బతినకుండా రసస్ఫూర్తితో ఈ కృతులను ఉపయోగించారు. ఇలాంటి విషయాలలోనే సంగీత దర్శకుడి అనుభవం, ప్రతిభ గోచరమవుతాయి. ఘంటసాల మాస్టారి సంగీతంలో ఇలాటి రసగుళికలు ఎన్నో కనిపిస్తాయి.



తోట సుబ్బారావు అనే కొత్త నిర్మాత 'పరమానందయ్య శిష్యుల కథ' సినీమా తీస్తున్నారట. సి.పుల్లయ్యగారు దర్శకుడు. ఎన్.టి.ఆర్ హీరో. ఎల్.విజయలక్ష్మి, కె.ఆర్.విజయ హీరోయిన్లు. ఘంటసాల సంగీతం అనే వార్త సినీమా పత్రికల ద్వారా తెలియవచ్చింది. అంటే ఈ సినీమాలో కూడా మంచి సంగీతం వినే అవకాశం వుందన్నమాట అని మా బొబ్బిలి ఘంటసాలాభిమానులు ఆనందపడడం చూసాను. ఆ  సమ్మర్ కు మద్రాస్ చేరాను.

"ఒరేయ్ నాయనా ! ఇవేళ తొమ్మిదింటికి శ్రీదేవీ ప్రొడక్షన్స్ కంపోజింగ్ వుంది. నాన్నగారిని రెడిగా వుండమని చెప్పు". తొమ్మిదింటికి మాస్టారి కారులో శ్రీదేవీ ప్రొడక్షన్స్ ఆఫీసుకు వెళ్ళాము. ఆ ఆఫీసు ఎక్కడో చాలా దూరంగా వుంటుందనుకుంటే, కారెక్కిన రెండు నిముషాలకే అక్కడికి చేరుకున్నాము. తీరా చూస్తే అది మా ఇంటి పక్కనే. ఫర్లాంగ్ దూరంలో ఉన్న కోట్స్ రోడ్డులో.

మేము మద్రాస్ వచ్చినప్పటినుండీ ఈ కోట్స్ రోడ్ లో ఎన్నిసార్లు తిరిగానో లెఖ్ఖేలేదు. మా నాన్నగారి కారాకిల్లీల కోసం పాండీబజార్ లోని ఆంధ్రా కిల్లీ షాప్ కి ఆ కోట్స్ రోడ్ లో నుండే వెళ్ళేవాడిని. కోట్స్ రోడ్ లో చాలామంది ప్రముఖులే వుండేవారు. రోడ్ మొదట్లోనే పాతకాలపు నటి కుమారి ఇల్లు, తమిళ హాస్యనటుడు టి.ఆర్.రామచంద్రన్ ఇల్లు, హిందుస్థాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ జి.ఆర్.రావు, చివరగా సుప్రసిద్ధ తెలుగు నటుడు ధూళిపాళ గారి ఇల్లు ఆ కోట్స్ రోడ్ లోనే. వారింటి పచ్చరంగు ఇనప గేటు మీద తెలుగు అక్షరాల్లో 'ధూళిపాళ' అని ఉండేది. 

ఆ కోట్స్ పేరుతోనే నా సగం జీవితం ముడిపడిపోవడం మరో పెద్ద విచిత్రం. 28 ఏళ్ళపాటు నేను ఒకేచోట పాతుకుపోయి పనిచేసిన కంపెనీ పేరు కూడా "కోట్స్". అయితే ఈ కంపెనీ 'Coates ', రోడ్ 'Coats' ఒకరు కాదు. అలాటి ప్రసిధ్ధికెక్కిన కోట్స్ రోడ్ లోని శ్రీదేవి ప్రొడక్షన్స్ కు ఎన్నిసార్లు వెళ్ళానో.

శ్రీదేవీ ప్రొడక్షన్ అధినేత తోట సుబ్బారావు నిర్మిస్తున్న మొదటి చిత్రం. 'పరమానందయ్య శిష్యుల కథ'. తోట సుబ్బారావుగారు వరసగా తీసిన ఐదు చిత్రాలకు ఘంటసాల మాస్టారే సంగీతం. మాస్టారితో సుబ్బారావుగారికి మంచి స్నేహం, అంతకు మించి చాలా గౌరవం. తన చిత్రాల సంగీతం విషయంలో మాస్టారికి పూర్తి స్వేచ్ఛనిచ్చేసారు. 

తోట సుబ్బారావు గారిది చాలా భారీ విగ్రహం. ఆయన , ఆ సినీమా డైరెక్టర్ సి.పుల్లయ్యగారు, ఆయన సహాయకుడు బి.ఎల్.ఎన్.ఆచార్య - ముగ్గురిదీ ఒకటే డ్రెస్ కోడ్. తెల్లటి పంచెకట్టు, పైన జుబ్బా. మొదట్లో తోట సుబ్బారావుగారి ఆకారం చూసి దగ్గరగా వెళ్ళడానికి జంకేవాడిని. 

ప్రప్రథమంగా సినీమా మొదలెడుతూ 'పరమానందయ్య శిష్యులు' కథతో ప్రారంభిస్తున్నారే! అది ఫ్లాప్ సబ్జెక్ట్ కదా, సినీమా ఏం సక్సెస్ అవుతుంది అని పాండీబజార్ చెట్టుక్రింద పక్షులు గుసగుసలాడాయి. నిజమే. ఈ పరమానందయ్య శిష్యులు సినీమా తీసే కస్తూరి శివరావు అప్పులపాలై ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని పేదరికంతో అష్టకష్టాలు పడ్డారు. చివరకు ఆయన మరణం కూడా చాలా దుర్భరంగా జరిగిందని చెప్పుకుంటారు. జీవనం కోసం ఏదో నాటకం ఆడడానికి ఏదో వూరు వెళ్ళి అక్కడ చనిపోతే ఆ మృతదేహాన్ని ఒక కారు డిక్కిలో వుంచి మద్రాస్ కు తరలించారని అంటారు. బ్యూక్ వంటి కారుకు ఓనర్ గా మహా దర్జాగా ఒక వెలుగు వెలిగిన హాస్యనటుడు కస్తూరి శివరావు, సినీమా నిర్మాణం వల్లనే పూర్తిగా దిగజారిపోయారు.

ఈ నేపథ్యం తెలిసినవారు 'పరమానందయ్య శిష్యులు" కథ సినీమాగా తీస్తున్నారంటే భయపడడం సహజమే. నిజానికి పరమానందయ్య శిష్యులను సినిమాగా తీయడానికి కావలసినంత కథేమీ వుండదు. కొంతమంది బుద్ధిహీనులు కలసి చేసే కొన్ని తెలివితక్కువ పనులు తప్ప. వారి చేష్టలు ఇతరులకు హాస్యాస్పదంగా, చిరాకుపుట్టించేవిగా ఉంటాయి. ఇలాటి ఎలిమెంట్స్ తో మూడుగంటల సినీమాను రసవత్తరంగా ఎలా తీయగలరు? అది ప్రశ్న.

అక్కడే, దర్శకుడు సి.పుల్లయ్య, కథారచయిత వెంపటి సదాశివ బ్రహ్మంగార్ల తెలివితేటలు, అనుభవం, ప్రతిభ తోట సుబ్బారావుగారికి కలిసివచ్చేయి. దర్శక రచయితలిద్దరూ ఈ కథకు ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ను ఇచ్చారు. పరమానందయ్య శిష్యులు నిజానికి ఒట్టి వెర్రివెంగళప్పలు కాదు. ఒక దేవకన్య శాపానికి గురైన మునికుమారులు. ఆ దేవకన్య వివాహసమయంలోనే వారికి శాపవిముక్తి. ఈలోగా వారంతా రాజగురువు పరమానందయ్య (చిత్తూరు వి.నాగయ్య)గారి దగ్గర శిష్యులుగా చేరి అనేకమైన తెలివితక్కువ పనులు చేస్తూంటారు. అయితే ఆ తెలివితక్కువ పనులలోనే ఇతరులకు చాలా మంచి కూడా జరుగుతూంటుంది. వీటన్నిటికి మెయిన్ లింక్ నందివర్థన మహారాజు (ఎన్టీఆర్), రాజనర్తకి (ఎల్.విజయలక్ష్మి), దేవకన్య చిత్రలేఖ (కె. ఆర్.విజయ)ల ముక్కోణపు ప్రేమకథ. ఈ అంశాలన్నింటినీ ఒకదానితో ఒకటి లింక్ చేస్తూ  నవరసాలతో కూడిన అద్భుతమైన కథను తయారు చేసారు. రేలంగి, రమణారెడ్డి తప్ప మిగిలిన తెలుగు సినీమా హాస్యనటులంతా ఈ 'పరమానందయ్య శిష్యులు కథ'లో నవ్వుల పంట పండించారు. 

ఈ సినీమాలోని ఒక గొప్ప విశేషం ఏమంటే హాస్యంలో ఎక్కడా వెకిలితనం, అసభ్యత లేకపోవడం. సినీమా ఆద్యంతం ఎక్కడా విసుగుపుట్టించకుండా ప్రేక్షకులకు పుష్కలంగా వినోదాన్ని పంచిపెడుతుంది. కథానాయకుడిగా ఎన్.టి.రామారావు ఈ సినీమాలో చాలా అందంగా, హుందాగా పాత్రోచితంగా నటించారు. కథానాయికలుగా ఎల్.విజయలక్ష్మి, కె.ఆర్.విజయ చేసిన నృత్యాలు మంచి ఆకర్షణ. 

ఈ సినీమాకు ప్రాణం ఘంటసాలవారి పాటలే. మాస్టారి శాస్త్రీయ సంగీత ప్రతిభ ఈ సినీమాలో చాలాచోట్ల ప్రతిఫలించింది. సదాశివ బ్రహ్మం, శ్రీశ్రీ, సముద్రాల, సినారె, కొసరాజు వ్రాసిన ఓ ఇరవై పాటలు, పద్యాలను ఘంటసాలవారితో పాటు, పి.సుశీల, పి.లీల,  ఎస్.జానకి, ఏ.పి.కోమల, పిఠాపురం,  మొదలైనవారు  చాలా శ్రావ్యంగా పాడి రక్తి కట్టించారు. ముఖ్యంగా, ఘంటసాల మాస్టారి స్వర రచనలోని  - 'ఇదిగో వచ్చితి రతిరాజా', 'కామినీ మదన రారా' (ఘంటసాల, లీల), 'వనిత తనంతట తానే వలచిన' (లీల, కోమల), 'ఓ మహాదేవా నీ పదసేవా' (పి.సుశీల)" వంటి పాటలు, ఘంటసాలవారి సంగీత ప్రతిభకు దర్పణం పడతాయి.

ఈ సినీమాలో మరో అద్భుతమైన వ్యంగ్యాత్మక గీతం 'పరమగురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడురా'. కొసరాజుగారి చురక. నేటి సమాజంలో కొందరు పెద్ద మనుషుల  ముసుగువేసుకొని ఏతీరుగా వుండి  ప్రజలను దోచుకు తింటున్నారో తెలియజెప్పే పాట. పిఠాపురం, జెవి రాఘవులు, అప్పారావు (తర్వాత చక్రవర్తి పేరుతో ప్రసిద్ధుడు), పట్టాభి, భద్రం, సౌమిత్రి, మొదలైనవారు పాడారు. పరమానందయ్యగారి శిష్యులు - పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య, కోళ్ళ సత్యం, జి.రామచంద్రరావుల మీద చిత్రీకరణ. అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకర్షించిన పాట.


"పరమగురుడుచెప్పినవాడు పెద్దమనిషి కాడయా " బృందగీతం

ఇంతకుముందే చెప్పినట్లుగా ఘంటసాలవారి సినీమాలలో రీరికార్డింగ్ కు ఒక ప్రత్యేకత వుంటుంది. సందర్భానికి తగిన నేపథ్య సంగీతాన్ని సమకూర్చడంలో వారిదొక ప్రత్యేక శైలి. సినిమా ఆద్యంతం నేపథ్య సంగీతం వీనులవిందుగా వుంటుంది. బీభత్సంగా జరిగే కత్తియుధ్ధాలు, హార్స్ ఛేసింగ్ లలో కూడా ఉపయోగించే వెస్టర్న్ వాద్యాలలో కూడా, అంతర్లీనంగా, ఏదో ఒక పాట వింటున్న అనుభూతిని శ్రోతలలో కలిగించడం ఒక్క ఘంటసాలవారికే చెల్లు. వారి అనేక సినీమాలలో ఈ ధోరణి వారి స్వరరచనలో కనిపిస్తుంది. 'పరమానందయ్య శిష్యులు కథ' టైటిల్ సంగీతాన్ని కూడా సశాస్త్రీయంగా మనసుకు ఆహ్లాదకరంగా స్వరపర్చారు. 

ఈ మొత్తం సినీమా రీరికార్డింగ్ చూసే అవకాశం నాకు దొరికింది. 

"పరమానందయ్య శిష్యుల కథ" ఘనవిజయం సాధించింది. ఘంటసాలవారి సంగీతానికి మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రంలోని గీతాలన్నీ ఈనాటికీ టీ.వి. ఛానల్స్ లో తరచూ వినిపిస్తూనేవున్నాయి. 

ఘంటసాల మాస్టారు తాను సంగీత దర్శకత్వం వహించిన సినీమాలలో తాను పాడే పాటలకన్నా ఇతర గాయనీమణులకోసం చేసే పాటలమీదే ఎక్కువ శ్రధ్ధవహిస్తారేమో అనిపిస్తుంది.

'నెం.35, ఉస్మాన్ రోడ్' లో కనిపించే వ్యక్తుల పరిచయాల విషయంలోకానీ కొన్ని సంఘటనల విషయంలో కానీ కొన్ని ముందు వెనకలుంటాయి. అవి ఆనాటి తిధి, వార, నక్షత్రాలకు కట్టుబడివుండవు. గమనించగలరు.

1966లో ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. శకుంతల, పరమానందయ్య శిష్యుల కథ, పాదుకా పట్టాభిషేకం.

ఈ మూడు చిత్రాల నిర్మాతలు ఘంటసాల మాస్టారికి కొత్తే. అంతకుముందు వారి ఇతర చిత్రాలకు వేటికీ సంగీతం చేయలేదు.
 
శకుంతల - రాజ్యం పిక్చర్స్ లక్ష్మీరాజ్యం- శ్రీధరరావుగారు నిర్మించింది. గతంలో వీరు తీసిన అనేక చిత్రాలకు (కృష్ణలీలలు, హరిశ్చంద్ర, నర్తనశాల) సుస‌ర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకుడు.

అనాదిగా మన సమాజంలో అబలగా ముద్రపడిన  స్త్రీ అనుభవించే అనేక కష్టనష్టాలకు, అవమానాలకు దర్పణంపట్టే పాత్ర శకుంతల. ఐదవ శతాబ్దానికి(?) చెందిన సంస్కృత కవి కాళిదాసు వ్రాసిన అభిజ్ఞాన శాకుంతలంలోని కథానాయకి శకుంతల. శకుంతల, దుష్యంతుల ప్రణయగాథ ఇతివృత్తం.

సినీమా మాధ్యమం ఆవిర్భవించినప్పటినుండి ఈ కథను అనేక భాషలలో అనేకసార్లు సినిమాగా తీయడం జరిగింది.

ముందుగా, తమిళంలో సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు ఎమ్ ఎస్ సుబ్బులక్ష్మి, జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యంలు శకుంతల, దుష్యంతులు గా ఒక శకుంతల వచ్చింది. 

ఆ తర్వాత 1943లో హిందీలో  వి.శాంతారాం తన మొదటి భార్య జయశ్రీ గాడ్కర్ శకుంతలగా, చంద్రమోహన్ (1966 రంగుల రాట్నం ఫేం చంద్రమోహన్ కాదు) దుష్యంతుడిగా నిర్మించారు.

 

భారతీయ సంగీత, నృత్య, చిత్ర కళలలో అణువణువున ద్యోతకమయ్యే భావ సౌందర్యాన్ని, విశిష్టతను తన సినిమాల ద్వారా అద్భుతంగా ఆవిష్కరించి ప్రపంచానికి చాటిచెప్పిన నిర్మాత, దర్శకుడు వి.శాంతారామ్.



ఆయనకు శకుంతల పాత్ర అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. అన్నట్టు ఈ సినిమాలో ప్రియంవద ఎవరో కాదు వి.శాంతారామే(నట!) [source: wikipedia]

ఈ శకుంతలను తిరిగి కలర్ లో  తెలుగు హిందీ భాషలలో ఎన్.టి.రామారావు దుష్యంతుడిగా, ఘంటసాలవారు సంగీత దర్శకుడిగా నిర్మించబోతున్నారనే వార్త కొన్నాళ్ళు మద్రాస్ లో సంచారం చేయడం జరిగింది. కానీ, ఏ కారణం చేతనో శాంతారాం సంకల్పం నెరవేరలేదు. అదే కనుక జరిగివుంటే ఎన్.టి.ఆర్ , ఘంటసాలల కీర్తికిరీటాలలో మరో ఉత్తమ మణిగా భాసిల్లివుండేది. తర్వాత, శాంతారాం తానే దుష్యంతుడిగా, తన రెండవ భార్య సంధ్య శకుంతలగా 'స్త్రీ' పేరిట 1961లో నిర్మించి అఖండ ఖ్యాతి పొందారు. 



ఈ సినీమాను మౌంట్ రోడ్ లోని గ్లోబ్ ధియేటర్ (LIC పక్కన వుండేది) లో చూసిన గుర్తు. ఈ చిత్రంలోని పాటలు, నృత్యాలు, దృశ్య చిత్రీకరణ ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. విదేశాలలో, చలనచిత్రోత్సవాలలో కూడా ప్రదర్శించబడి విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలను పొందిన చిత్రం శాంతారాం 'స్త్రీ'.

ప్రేక్షకులను ఇంతటి ప్రభావితం చేసిన 'శకుంతల'ను 1965లో తీయ సంకల్పించారు లక్ష్మీరాజ్యం, శ్రీధర్ రావులు.

కమలాకర కామేశ్వరావు దర్శకత్వంలో ఎన్.టి.రామారావు దుష్యంతుడిగా, బి.సరోజాదేవి శకుంతలగా, నాగయ్య కణ్వుడిగా, ఇ.వి.సరోజ, ముక్కామల మేనకా విశ్వామిత్రులుగా, శారదా, గీతాంజలులు శకుంతల నెచ్చెలులుగా ప్రముఖ తారాగణంతో తలపెట్టారు. సంగీత దర్శకుడిగా ఘంటసాలవారిని నియమించారు. ఈ విషయం నాకు చాలా రకాలుగా ఆనందం కలిగించింది. ఒకటి ఈ సినిమా ఘంటసాలవారు చేయడం వలన మా నాన్నగారికి కొన్నాళ్ళపాటు పనివుంటుంది. మరొకటి, శాంతారాం తీసిన స్త్రీ స్థాయిలో తెలుగులో సినీమా వస్తుందనే ఆశ. అయితే అది ఆశగానే మిగిలిపోయింది. కారణం ఈ తెలుగు సినీమా కలర్ లో కాకుండా బ్లాక్ ఎండ్ వైట్ లో తీసారు. అది నాకు బాగా అసంతృప్తి కలిగించింది.
 
తెలుగు శకుంతల కు జీవం ఘంటసాల మాస్టారి సంగీతం, నాగయ్య,ఎన్.టి.ఆర్ ల నటనా ప్రాభవం. కణ్వుడి పాత్రలో నాగయ్యగారి నటన అద్వితీయం. తాను మునే అయినా, సంసార జంఝాటాలు తనకు లేకపోయినా అడవిలో క్రూర మృగాల మధ్య దొరికిన శకుంతలను పెంచి పెద్ద చేసిన తండ్రిగా, ఆమె వివాహం చేసుకొని తనను, పరివారాన్ని వదలి భర్త దగ్గరకు సాగనంపవలసిన స్థితిలో పెంచిన మమకారంతో కణ్వుడు పడే ఆవేదనను వ్యక్తీకరించడంలో నాగయ్యగారి నటన ఎలాటి రాతిగుండె కలవారినైనా కదలించి, కరిగిస్తుంది. ఈ సన్నివేశంలో  సముద్రాల వారి సాహిత్యానికి ఘంటసాల మాస్టారు స్వరపర్చిన 'ఆనందమౌనమ్మా అపరంజి బొమ్మా' పాట పాత్రౌచిత్యంతో, సందర్భోచితంగా అసామాన్యంగా అమరింది. ఈ సన్నివేశంలో నాగయ్యగారి నటన, ఘంటసాల, సుశీలగార్ల భావావేశం అద్వితీయం. ఈ ఘట్టమే శకుంతల చిత్రానికి హైలైట్ అనిపిస్తుంది. సినీమా కలర్ కాకపోతేనేం. నటీనటుల పాత్రోచిత నటన, నవరసాలతో నిండిన ఘంటసాలవారి పాటలు, నేపథ్య సంగీతం శకుంతలకు ప్రాణప్రతిష్ట చేశాయి. 


కణ్వుడు శకుంతలను అత్తగారింటికి పంపించిన  సన్నివేశం లో గీతం

ఈ సినీమాలో  దుష్యంతుడిగాగా ఎన్.టి.ఆర్ హుందాగా నటించారు. ఆ పాత్రకు ఘంటసాల మాస్టారు పాడిన 'అనాఘ్రాతం పుష్పం' అనే కాళిదాసు శ్లోకం,  'మదిలో మౌనముగా' పాట ఎంతో మనోహరంగా వుంటుంది. 

అలాగే, చిత్రం  ప్రారంభంలోని మేనక నృత్యగీతం 'కనరా ముని శేఖరా' ఘంటసాలవారి సంగీతవైదుష్యానికి దర్పణం పడుతుంది. 

శకుంతల సినీమాలో కూడా  వైవిధ్యభరితమైన సంగీతానికి ఎంతో అవకాశం వుంది. పాటల రూపేణా, నేపథ్య సంగీత రూపేణా సంగీత దర్శకుడి ప్రతిభను కనపర్చడానికి  మంచి అవకాశం గల కథ శకుంతల. అటువంటి శకుంతలకు అజరామరమైన సంగీతాన్నే సమకూర్చారు మన ఘంటసాల మాస్టారు. శకుంతల సినీమా టైటిల్ మ్యూజిక్ కూడా చాలా శ్రవణానందకరంగా వుంటుంది. కావాలంటే మీరూ విని చూడండి.
         

అదే సంవత్సరంలో ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో  విడుదలైన మరో పౌరాణిక చిత్రం 'పాదుకా పట్టాభిషేకం'. మరో రామాయణ గాథ. సంగీతానికి మంచి స్కోప్ ఉన్న చిత్రం మాస్టారికి రావడం నాకు అన్నివిధాలా ఆనందం కలిగించిన విషయం. ఈ చిత్రనిర్మాత పొన్నలూరి బ్రదర్స్. ఈ సినీమాను వేరే బ్యానర్ పై తీశారు. ఈ నిర్మాతలు గతంలో భాగ్యరేఖ, దైవబలం, కాడెద్దులు ఎకరా నేల వంటి కొన్ని సినీమాలు తీసారు. వారికి సొంత స్టూడియో కూడా వుండేది. అయితే, చిత్రమేమంటే వీరి సినీమాలు వేటిలోనూ ఘంటసాలవారు పాడలేదు. ఓ రెండు సినీమాలలో ఒక్కొక్క పద్యం మాత్రం పాడించుకున్నారు. 

ఇక్కడ ఒక్క విషయం మాత్రం నాకు బాగా గుర్తు. అదేమిటంటే పొన్నలూరి బ్రదర్స్ తీసిన 'దైవబలం' చిత్రానికి రీ-రికార్డింగ్ ఎమ్మెస్ రాజు (ఎమ్.సుబ్రమణ్యరాజు) చేశారు. ఆయన ఘంటసాల ఆర్కెస్ట్రాలో వీణ, మాండలిన్ వాయించేవారు. ఆయన పట్టుబట్టి మా నాన్నగారికి 'దైవబలం' రీరికార్డింగ్ లో హార్మోనియం వాయించడానికి నొటేషన్స్ వ్రాయడానికి అవకాశం కల్పించారు. మా నాన్నగారు ఘంటసాల మాస్టారి అనుమతితోనే వెళ్ళారు. నిజానికి ఎమ్మెస్ రాజుగారికి మా నాన్నగారిని పిలవవలసిన అవసరంలేదు. కానీ అది ఆయనకు మా నాన్నగారిపట్ల గల అభిమానం, గౌరవం. ఇలాటి స్నేహభావం పామర్తిగారికి, జె.వి.రాఘవులుగారికి మా నాన్నగారిపట్ల ఎందుకు కలగలేదో అని నాకు ఆ వయసులో అనిపించేది. అది అనుభవరాహిత్యం. ప్రపంచం పోకడ పట్ల అవగాహన లేకపోవడం. 

అలాటి పొన్నలూరి వారు తమ పౌరాణిక చిత్రానికి సంగీతం చేయడానికి ఘంటసాలవారినే  ఎందుకు ఎంచుకున్నారో నాకు అర్ధంకాలేదు.  

ఈ సినీమాలో చాలా పద్యాలు, కొన్నే పాటలు వున్నాయి. పాటల  కంపోజింగ్ స్థాయినుండి ఈ సినీమా చాలా 'లో' బడ్జెట్  సినీమా అని అయినా చాలా రిచ్ గా వుండాలని అందుకు ఈ చిత్రంలో పనిచేసేవారంతా (నటీనటులు, సంగీత దర్శకుడు, గాయనీ గాయకులు, ఆర్కెస్ట్రా, టెక్నిషియన్స్, మొదలైనవారంతా) తమ పూర్తి వేతనాలలో కొంత తగ్గించి సహకరించాలని నిర్మాతల తరఫునుండి ఒత్తిడి రావడం మొదలయింది. మొత్తం సంగీతమంతా (రీ-రికార్డింగ్ సహా) పదివేల లోపే పూర్తయిపోవాలని భావిస్తున్నట్లు చెప్పుకోవడం జరిగింది. పాటల/రీరికార్డింగ్ కోసం ఆర్కెస్ట్రాను పదిహేనుమందిని పెడితే అంతమంది వద్దు, ఓ ఐదుగురిని తీసేయమనడం. అన్నీ సింగిల్ ఇన్స్ట్రుమెంట్సే పెట్టమనడం వంటివి జరిగాయి. నిజానికి  ఈ విధమైనటువంటి కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పడం అంత సముచితంకాదు. 

కానీ ప్రేక్షకులు సాధారణంగా ఒక సినీమా చూడగానే వారు కొన్న టిక్కెట్టుకు తగ్గ ఆనందం దొరక్కపోతే ఆ సినీమా చెత్త అని, మ్యూజిక్ వరస్ట్ అని, ఎడిటింగ్ బాగాలేదని, కెమెరా ఏంగిల్స్ బాగాలేవని, ఔట్ డోర్ డ్యూయెట్స్ లో హీరో హీరోయిన్లు కాస్ట్యూమ్స్ చీప్ అని నానా రకాల కామెంట్స్ చేస్తారు. ఈ రకమైన కామెంట్స్ కు ఆయా కళాకారులు బాధ్యులు కారు. 'పిండి కొద్ది రొట్టె'.
 
పాదుకా పట్టాభిషేకం నిర్మాతలలో ఒకరైన పొన్నలూరి వసంతకుమార్ రెడ్డి ఈ చిత్ర దర్శకుడు. కాంతారావు రాముడు, కృష్ణకుమారి సీత. 

సినీమా పూర్తయి రీరికార్డింగ్ ముందు ప్రొజెక్షన్ వేసి చూపారు. నిజానికి రీరికార్డింగ్ లేకుండా ఏ రష్ చూసినా బాగున్నట్లు అనిపించదు. రీరికార్డింగ్ బాగా రావాలంటే సంగీత దర్శకుడికి కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి. కాని అక్కడ కూడా మాస్టారిచ్చిన లిస్ట్ లో కట్స్ పెట్టారు. ఘంటసాల మాస్టారు చాలా సహృదయుడు కనుక, చిత్రనిర్మాతగా తానూ విపరీతంగా నష్టపోయిన వ్యక్తిగా సాటి నిర్మాతకు ఎంతటి సహాయ సహకారాలు అందించాలో పరిపూర్ణంగా అందించి, తన సంగీత దర్శకత్వ అనుభవాన్ని ఉపయోగించి 'పాదుకా పట్టాభిషేకం' పూర్తిచేశారు. తన విభాగానికి చెందినంతవరకు పరిపూర్ణ న్యాయం చేకూర్చారు. ఇక బాక్సాఫీస్ దగ్గర జయాపజయాలంటారా - అవి దైవాధీనాలే. ఆ దైవాలు తెలుగు సినీమా ప్రేక్షకులే. వారే సినీమాను  ఎప్పుడు, ఎందుకు, ఎలా ఆదరిస్తారో వారికే తెలియదు. అందుకే సినీమా వ్యాపారం ఒక గాంబ్లింగ్ అంటారు.
పాదుకా పట్టాభిషేకంలో  సీతారాముల యుగళగీతం

నాకు ఆనాటి కొందరు చిత్ర నిర్మాతల మనస్తత్త్వం అర్ధమయేదికాదు. 'మెత్తని వాళ్ళను చూస్తే మొత్త బుద్ధి' అంటారు. అది కొందరు తూ.చ. తప్పక పాటిస్తారు. మన సంగీత దర్శకుల దగ్గర  'లో-బడ్జెట్' లో ముగించాలని, డబ్బు ఎక్కువ ఇచ్చుకోలేమని బీద ఏడ్పులు ఏడ్చేవారే, తమ తర్వాత చిత్రానికి మరో పెద్ద తమిళ మ్యూజిక్ డైరక్టర్ నో, హిందీ మ్యూజిక్ డైరక్టర్ నో పెట్టి వారి కండిషన్స్ అన్నిటికీ సలామ్ కొడుతూ వందమందికి తక్కువ లేకుండా ఆర్కెస్ట్రా పెట్టి లక్షలు లక్షలు ఖర్చు చేస్తారు. బొంబాయి వారైతే స్టార్ హోటల్స్, బీచ్ రిసార్ట్స్ లో కంపోజింగ్ లు, మందూ మాకూ అన్ని హంగులు సమకూరుస్తారు. వారికి పొరుగింటి పుల్లకూరే రుచి.

💥కొసమెరుపు💥
 
తెలుగు సినిమా రంగంలో చాలామంది గాయకులున్నారు. అందులో చాలామందియొక్క సంగీత పరిజ్ఞానం, విద్వత్  కోరస్ లకు ఎక్కువ, సోలోలు, డ్యూయెట్లకు తక్కువ అన్నట్లుంటుంది. ఇలాటివారందరికీ తరచూ మంచి అవకాశాలు కల్పించడం సంగీత దర్శకులకు చాలా ఇబ్బందికరమైన విషయమే.

ఛాన్స్ ల కోసమని ఘంటసాల మాస్టారి దగ్గరకు చాలా మందే వస్తూండేవారు. సాధారణంగానే సినిమాలలో బృందగానాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాటిచోట్ల ఐదుగురారుగురు ఆడా, మగా కంటే ఎక్కువమందికి అవకాశం కల్పించబడదు. అడిగినవారందరికీ అవకాశం కల్పించబడదు. అలాటి సందర్భాలలో ఆ కోరస్ సింగర్స్  మనసు నొచ్చుకోకుండా సమాధానం చెప్పడం చాలా కష్టమైన పని. ఆ గాయనీ గాయకులను ఆదుకోలేకపోతున్నందుకు ఘంటసాలగారు ఎంతో వేదన చెందేవారు.

అలా ఘంటసాలవారి దగ్గరకు వచ్చేవారిలో కొమ్మినేని హైమావతి  అనే ఆవిడ వచ్చేవారు. కోరస్ సింగర్ గా మాస్టారి సినిమాలలో చాలా పాటలలో గొంతు కలిపేరు. 

హైమావతిగారి తమ్ముడు అప్పారావు. తాను కూడా గాయకుడు కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఆశించిన ఫలితం లభించక క్రమేణా డబ్బింగ్ వైపు దృష్టి సారించారు. అందులో నిలదొక్కుకున్నారు. కొన్నేళ్ళపాటు చాలా అవస్థలు పడిన తర్వాత సంగీతదర్శకుడిగా అవకాశం దొరికింది. క్రమక్రమేణా అప్పారావు చక్రవర్తిగా మారి తెలుగు సినీ సంగీతరంగంలో ఒక ట్రెండ్ సెట్టర్ గా మకుటంలేని చక్రవర్తిగా ఒక వెలుగు వెలిగారు.

చక్రవర్తి (ప్రముఖ సంగీతదర్శకుడు) అప్పారావుగా వున్న కాలంలో ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో వచ్చిన 'పరమానందయ్య శిష్యులు కథ' లో పిఠాపురం, రాఘవులు, మొదలగువారితో కలసి 'పరమగురుడు చెప్పినవాడు' పాటలో ఒక చరణం పాడారు. 

చక్రవర్తి సంగీతదర్శకుడై చేసిన అనేక డబ్బింగ్ సినీమాలలో, స్వతంత్రంగా చేసిన తొలి సినీమాలలో ఘంటసాల మాస్టారు కొన్ని పాటలు పాడడం విశేషం. ఆ తర్వాత కాలంలో కూడా హీరోలకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారి చేతే పాడించారు కానీ చక్రవర్తి పాడలేదు.
 
ఘంటసాలగారి జీవితం ఒక తెరచిన పుస్తకం. ఇతరులకు స్ఫూర్తిదాయకంగానూ, మార్గదర్శకంగా నిలిచే అంశాలు  ఆయన జీవితంలో ఎన్నో ఎన్నెన్నో...

మరికొన్ని వచ్చేవారం....

                ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.


2 comments:

ameerjan said...

💎 మరో చక్కని ఎపిసోడ్ నేటి మీ జ్ఞాపకాల మాలిక! సినిమాలోని సన్నివేశ సందర్భాన్ని బట్టి నేపథ్య సంగీతాన్నందించే విద్య నేడు మనం కనలేము. సీను పండాలంటే నటీ నటుల అభినయమెంత ముఖ్యమో నేపథ్య సంగీతానికీ అంత ప్రాముఖ్యత వుందని తెలిసి మసలిన వారు మన పాత తరం సంగీత దర్శకులు! ఇక తన సంగీతానికి శాస్త్రీయతను అద్దడంలో మాస్టారి మేధస్సును తక్కువ అంచనా వేయగలమా? ఆ సన్నివేశానికి తగిన రెండు కృతులు, వాటి రాగాలను తన సంగీత తూణీరంలోంచి తీసి “సంగీతం బాబు” గారికి చెప్పేసి, తనకున్న తరువాతి పనిలో నిమగ్నమైపోవడం ఆ “మాస్టారు” కే చెల్లింది! అన్నట్లు 10-11 ఏళ్ళ వయసులో చూసిన ఆ సినిమా ఎంతగా ఎంజాయ్ చేశామో!!👏👌👌

💎 మీరన్నట్లు ..మాస్టారి సంగీత ప్రతిభ మెండుగానే కనిపిస్తుందీ సినిమాలో! కొసరాజు వారి కొరకొర సాహిత్యం..సరియైన సమయంలో పెద్ద మనుషులనబడే వారి మీద వేసిన సరియైన చురక! ఆ పాట నేపథ్యానికి గాత్రమిచ్చిన వారిలో అప్పారావు గారూ వుండినారని ఇపుడే తెలిసింది!

💎 అలాగే...శాంతారామ్ గారి చిత్రమాలికను కూడ స్పృశించడం బావుంది. ఆ తరువాత మాస్టారి సంగీత సమర్పణలో వచ్చిన మరో అద్భుత సంగీత భరిత చిత్రం శకుంతల! ఆర్థికంగా విజయం పొందక పోయినా, పాటలు, అభినయం విషయంలో ప్రేక్షకులకు సంతృప్తిని మిగిల్చిందనే చెప్పాలి. మీరన్నట్లు సినిమా టైటిల్ మ్యూజిక్ కూడ ఏదో ఒక గొప్ప పాట వింటూన్నామన్న అనుభూతి కలిగిస్తుంది!

💎 ఇక “కొసమెరుపు” : ‘కోరస్ లకు ఎక్కువ, సోలోలు, డ్యూయెట్లకు తక్కువ’ ఎంత బాగా నప్పిందో !🙏🙏🙏

P P Swarat said...

మీ సమీక్షకు నా కృతజ్ఞతలు.