visitors

Sunday, July 4, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై ఎనిమిదవ భాగం

04.07.2021 - ఆదివారం భాగం - 38*:
అధ్యాయం 2  భాగం 37 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఘంటసాలవారు చిత్రనిర్మాణం నుండి శాశ్వతంగా తప్పుకున్న తర్వాత తమ్ముడు సదాశివుడు, బావమరది సుబ్బారావు, ప్రొడక్షన్ మేనేజర్ సుబ్బు (సుబ్బారావు), ఎడిటర్లు హరినారాయణ, దేవేంద్రలు తమ ఉపాధి కోసం వేర్వేరు దిశలకు వెళ్ళిపోయారు. ఉన్నత విద్యాన్వేషణలో వచ్చి వుండిన రామబ్రహ్మం తన గమ్యస్థానం చేరుకున్నారు. ఆనారోగ్య స్థితిలో ఘంటసాల మాస్టారి ప్రియ మిత్రుడు దేవగుప్తాపు రామచంద్రరావు ముందు 35, ఉస్మాన్ రోడ్ ను వదలి వైజాగ్ వెళ్ళారు. కొన్నాళ్ళకు ఈ లోకాన్నే వదిలిపెట్టిపోయారు. అయినా నెం.35,ఉస్మాన్ రోడ్ ఆశ్రితులకు కల్పవృక్షం. ఆశ్రిత పక్షపాతియైన ఘంటసాల మాస్టారి ఆదరణలోకి మరికొందరు నెం.35, ఉస్మాన్ రోడ్ ను తమ నివాసం చేసుకున్నారు. మాస్టారి ఆఖరి బావమరది, సావిత్రమ్మగారి తమ్ముడు కె.హరినారాయణగారు, అనపర్తి నుండి వేదుల సుబ్రహ్మణ్యంగారు అలా వచ్చినవారే. ఉద్యోగాన్వేషణలో మద్రాస్ వచ్చిన మా నాన్నగారి రెండవ మేనమామ ఆయపిళ్ళ విశ్వేశ్వరరావుగారి పెద్దకుమారుడు పార్థసారధిగారు కూడా ఇదే 35, ఉస్మాన్ రోడ్ లో కొన్నేళ్ళు గడిపారు. 

సావిత్రమ్మగారి తమ్ముడు అక్కగారి నీడనే వుంటూ క్రమేణా కెమేరా విభాగంలో తర్ఫీదు పొంది ఒక  కెమేరా ఔట్ డోర్ యూనిట్లో అసిస్టెంట్ కెమేరామెన్ గా స్థిరపడ్డారు. ఆ తర్వాత ఆయనకు వివాహం జరిగింది. 1983లో మా నాన్నగారు నెం.35, ఉస్మాన్ రోడ్ ను వదలిపెట్టాక హరినారాయణగారు తన కుటుంబంతో మేమున్న ఔట్ హౌస్ లోకి ప్రవేశించారు.  35 ఉస్మాన్ రోడ్ అమ్మేంతవరకు వారు ఆ ఇంటిలోనే వున్నారనుకుంటాను. వారి సంతానంతో నాకు పరిచయం లేదు. వారి అబ్బాయి ఒకరు ఒక తెలుగు టివి ఛానల్ లో చాలా మంచి  ఉద్యోగంలో వున్నారని చెప్పగా విన్నాను. 

వేదుల సుబ్రహ్మణ్యం గారిది విశాఖపట్నం దగ్గర అనపర్తో, వెదురుపర్తో గుర్తులేదు. పౌరాహిత్యానికి కావలసిన మంత్రాలు, పూజా విధానాలు అన్నీ తెలిసినవారే. ఘంటసాలగారి పరమ భక్తుడు. మీ ఇంట్లో పూజ పునస్కారాలు చేస్తూ మీ సేవ చేస్తూ మీ నీడలో గడిపేస్తానని వచ్చి చేరారు. ఓ ఏడాదో రెండేళ్ళో మాస్టారింట్లోనే  వున్నట్లున్నారు. ఇలా పరమభక్తులమని, మీ సేవ చేసుకొని మీతోనే వుంటామని చెప్పి చాలామంది వచ్చేవారు. అలాటివారిని ఘంటసాలవారు ప్రోత్సహించేవారుకాదు. సినీమాలమీది వ్యామోహంతో పాటలమీది ఆసక్తితో చదువుతున్న చదువులు, చేస్తున్న ఉద్యోగాలను వదలి వచ్చేవారిని కాస్తా గట్టిగానే మందలించేవారు. వేదుల సుబ్రహ్మణ్యం గారు ఘంటసాలవారింటి నుండి వెళ్ళిపోయాక ఎక్కడున్నారో తెలియదు. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత సావిత్రమ్మగారు, నరసింగ కాశీ వెళితే అక్కడ కనిపించి అక్కడ క్రతువులు జరిపిస్తూ స్థిరపడినట్లు చెప్పారట. కాశీలో వీరికి కావలసిన ఏర్పాట్లన్ని తనే స్వయంగా చేసారని తెలిసింది. మాస్టారి పట్ల ఆయనకు గల  భక్తి విశ్వాసం అలాటిది.

అలాగే మరొక వ్యక్తి. పేరు గుర్తులేదు, నిక్ నేమ్ తప్ప. అతను కూడా మాస్టారి మీది భక్తితో మాస్టారి నీడలో వుంటానని వచ్చాడు. మాస్టారు అతనికి తన ఇంట వుంచుకొని ఆశ్రయం కల్పించే పరిస్థితిలో లేనని తనను నమ్ముకొని బంగారు భవిష్యత్తు పాడుచేసుకోవద్దని హితవు చెప్పి పంపేసారు. అయినా అతను రోజూ ఉదయాన్నే 'నెం.35, ఉస్మాన్ రోడ్' కు వచ్చేవాడు. ఎక్కడ వుండేవాడో తెలియదు. మాస్టారు బయటకు వెళ్ళేంతవరకు వుండి ఆయన దర్శనం చేసుకొని వెళ్ళిపోతూండేవాడు. అప్పుడప్పుడు ఆయనతో కారులో రికార్డింగ్ లకు, రిహార్సల్స్ కు వెంటవెళ్ళేవాడు. అలా నిత్యమూ ఘంటసాలవారి దర్శనం చేసుకొని ఆయన చెప్పే మాటలు వింటూ మహదానంపొందాడు. అలా ఏడాదో, రెండేళ్ళో జరిగాక ఆ వ్యక్తి మాస్టారింటి దగ్గర కనపడలేదు. ఏమయ్యాడో తెలియదు. అలాటి అతను ఓ పుష్కరం తర్వాత ఒకసారి తిరుమల కొండమీద ఆలయ పరిసరాల్లో తారసపడ్డాడు. అతనే నన్ను గుర్తుపట్టి అభిమానంతో పలకరించాడు. అక్కడ దీక్షితులు గారి ఇంటివద్ద వుంటున్నట్లు చెప్పి, ఆ రోజు నన్నూ, మా ఆవిడను దీక్షితులుగారింటికి తీసుకువెళ్ళి దేవుడి ప్రసాదం పెట్టించాడు. తర్వాత పెద్దగా ఇబ్బంది పడకుండా స్వామివారి దర్శనానికి తీసుకువెళ్ళాడు. ఇది ఎన్నడూ ఊహించనిది. కారణమేమంటే నాకు మిగతావారితో ఉన్న పరిచయం ఇతనితో పెరగలేదు. అతను తిరుపతిలో నాకు అంత సహాయం చేయవలసినంత స్నేహమో, బాంధవ్యమో మా మధ్యలేదు. ఇందుకు ఘంటసాలవారిపట్ల అతనికి గల నిష్కల్మష భక్తియే కారణమని నేను అనుకొంటాను.

1965నాటి 'పాండవ వనవాసం' సినీమా మీకు గుర్తువుండేవుంటుంది. అందులో ద్రౌపదీ వస్త్రాపహరణం చాలా ఉత్కంఠ, ఉద్వేగ భరితమైన పొడుగాటి దృశ్యం. ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి, గుమ్మడి, నాగయ్య, బాలయ్య, మిక్కిలినేని, లింగమూర్తి, ప్రభాకరరెడ్డి, వంటి హేమాహేమీలు పాల్గొన్న అతి కీలకదృశ్యంలో కౌరవుల అకృత్యాలను నిరసిస్తూ ఒక అర్భకుడు తన గళాన్ని విప్పుతాడు.అతనే వికర్ణుడు. దుర్యోధనుని తొంభైతొమ్మిదిమంది సోదరులలో ఒకడు. రారాజు ఇచ్చిన పెద్దరికంతో కర్ణుడు వికర్ణుని పెద్దగా మాట్లాడనివ్వడు. ఆ వికర్ణుడే మా USN రాజుగారు. ఎవరికైనా గుర్తున్నారా? ఉప్పులూరి సూర్యనారాయణ రాజు. ఇదే అతని మొదటి చిత్రం.
ఘంటసాల మాస్టారి ప్రోద్బలంతోనే రాజుగారికి పాండవ వనవాసంలో నటించే ఛాన్స్ లభించింది. యు.ఎస్.ఎన్. రాజుగారిది విశాఖపట్నం దగ్గర ఏదో వూరు. జిల్లాపరిషత్ లో మంచి ఉద్యోగం. నాటకాలంటే అభిరుచి, ఆసక్తి. అది సినీమాలవేపు మళ్ళింది. మిత్రుల ప్రోత్సాహం. మద్రాసు మెయిల్ ఎక్కేసారు. రాజుగారు ఎలాగో ఘంటసాల మాస్టారికి పరిచయం చేయబడ్డారు. రాజుగారు చాలా మంచి అందగాడు, సౌమ్యుడు. స్నేహశీలి. మాస్టారికి అతనంటే ఒక రకమైన సానుభూతి కలిగింది. మద్రాసు సినీమారంగంలో వుండే కష్టనష్టాలను వివరించారు. సినిమా ను నమ్ముకొని బంగారంవంటి ఉద్యోగాన్ని వదలుకోవద్దని, కావాలంటే కొన్నాళ్ళు లాంగ్ లీవ్ పెట్టి సినీమా వేషాలకోసం ప్రయత్నించమని ఉద్బోధ చేశారు. అప్పటికే రాజుగారికి వివాహం కూడా అయిందనుకుంటాను. ఆ కారణంగా మాస్టారు కొంతమంది నిర్మాత దర్శకులకు రాజుగారిని పరిచయం చేశారు. రాజుగారు అప్పటినుండి ఏదో సమయంలో ఇంటికి వచ్చి ఘంటసాల మాస్టారిని కలిసి తన ప్రయత్నాల గురించి చెప్పేవాడు. నాకూ అతనితో మంచి పరిచయమే వుండేది. అతను కృష్ణవేణి ధియేటర్ పరిసర ప్రాంతాల్లో ఒక రూములో అద్దెకువుండేవారు. మాస్టారి రికమెండేషన్ వలన రాజుగారికి పాండవ వనవాసంలో డైలాగ్స్ వున్న పాత్రే లభించింది. ఆ చిన్న పాత్రనే మహదానందంగా స్వీకరించాడు. ఆ తర్వాత కూడా నెం.35,ఉస్మాన్ రోడ్ వచ్చి పోతూండేవాడు. కొన్నాళ్ళ తర్వాత శెలవుపెట్టిన ఉద్యోగానికి రాజీనామా చేసి తన భార్యను కూడా మద్రాసు తీసుకు వచ్చేశారు. ఆవిడను కూడా మాస్టారింటికి తీసుకువచ్చి అందరికీ పరిచయం చేశారు. చాలా మంచి అమ్మాయి. చక్కటి ఈడూజోడు అని అందరూ ముచ్చటపడ్డారు. కానీ అతను ఉద్యోగం వదిలేయడం ఎవరూ హర్షించలేకపోయారు. ఆ తర్వాత రాజు ఏ సినీమాలలో నటించాడో నాకు మాత్రం అంతగా తెలియదు. నేను చూసిన ఓ మూడు నాలుగు సినీమాలలో హీరో మిత్రబృందంలో ఒకరుగా కాలరు ఎగరేసుకుంటూ పుస్తకాలతో కనిపించే స్టూడెంట్ వేషాలలో చూసాను. ఆ వేషాలకు ఏ విధమైన గుర్తింపు వుండదు. పురోభివృద్ధి వుండదు. రాజుగారి  సినీమా జీవితమూ అలాగే ముగిసిందనుకుంటాను. సినీమాలలో నటనకు తగ్గ వేషాలు దొరకక ఆర్ధిక ఇబ్బందులతో కాలం గడవక కొంతకాలానికి మద్రాస్ వదలిపెట్టారని విన్నాను. అతని పరిస్థితి తల్చుకున్నప్పుడల్లా జాలిగా అనిపిస్తుంది. ఎవరైనా మంచి సలహాలు చెప్పగలరే కానీ వాటిని పరిపూర్ణంగా ఆచరింపజేయలేరు. 

ఆ రోజుల్లో చాలామంది సినీమా జీవితమంటే విలాసవంతమైన గులాబీపాన్పు అనుకునేవారు. అంతో ఇంతో నటన, కాస్తా కూస్తో పాడగలిగితే చాలు మెడ్రాస్ లో లక్షలు సంపాదించి పెద్ద పెద్ద భవంతులు కట్టేయవచ్చని గాలిలో మేడలు కట్టేవారు. దూరపు కొండలు నునుపు. దగ్గరకు వెళ్ళి చూసినవాళ్ళకే తెలుస్తుంది అక్కడంతా వుండేది మిట్టపల్లాలు,ఎగుడుదిగుడు గతుకులు, ముళ్ళ కంపలు, రాళ్ళురప్పలు అని. అక్కడ శిఖరాలకు చేరడం ఏమంత సుగమం కాదని. అలాగే ఆనాటి సినీమా జీవితం కూడా. సినీమా కళాకారులకు పేరు ప్రఖ్యాతులు వచ్చినంతగా ఆర్ధికాభివృధ్ధి వుండేదికాదు. వందలాది, వేలాది సినీ కళాకారులు కష్టాల ఊబిలోనే వుండేవారు.

ఏ ఒక్క గొప్ప కళాకారుడిదీ వడ్డించిన విస్తరికాదు. వారంతా కూడా సుదీర్ఘమైన కృషి చేసి ఎన్నో కష్టాలు అనుభవించాకే ఆ స్థితికి చేరుకున్నారు. వారెంత ఉచ్ఛస్థితికి చేరుకున్నా అనేకమందిని జీవితాంతం అభద్రతాభావం వెన్నాడుతునేవుండేది. తమ తమ ఉన్నతస్థాయిని నిలబెట్టుకుందికి శతవిధాలా పోరాటం సాగించవలసివచ్చేది. ఈ కష్టాలన్ని తన జీవితాంతం అనుభవించి అర్ధం చేసుకున్న వ్యక్తి మన ఘంటసాల మాస్టారు. వారి జీవితం మనకెన్నో సత్యాలను నేర్పుతుంది.

🌿 🌺🌿


ఆ రోజు ఆంధ్రా యునివర్శిటీ డిగ్రి రిజల్ట్స్ వచ్చాయి. డిగ్రీ హోల్డర్ననిపించుకున్నాను. తలమీదనుండి పెద్ద బరువు దించుకున్నట్లనిపించింది. అంతకుమించి నాకు పెద్ద గర్వంగానో, సంతోషంగానో అనిపించలేదు. నేను పాసయినందుకు మా ఇంట్లోను , మాస్టారింట్లోనూ అందరూ ఆనందం వ్యక్తపర్చారు. అప్పటివరకూ మా ఇంట్లోకానీ, ఘంటసాలవారింట్లో కానీ ఎవరూ గ్రాడ్యుయేట్స్ లేరు.  ఆ ఘనత పొందిన మొదటి కుర్రవాడిని నేనే కావడం పెద్దలందరి ఆనందానికి ఒక కారణం. వీటన్నిటికి మించిన ఒక విషయం నాకు ఆశ్చర్యాన్ని, మొహమాటాన్ని కలుగజేసింది. ఘంటసాల మాస్టారు సావిత్రమ్మగారితో "ఈవేళ స్వరాట్ నాతో కలసి భోజనం చేస్తాడు, శ్రీలక్ష్మమ్మగారితో (మా అమ్మగారు) చెప్పు" అని అన్నారు. నేను మాస్టారి పక్కన కూర్చొని భోజనం చేయడమా? ఈ విషయాన్ని వారు ప్రత్యేకంగా ప్రస్తావించడం నాకు చాలా మొహమాటంగా అనిపించింది.  నేను బి.ఏ. పాసయినందుకు అభినందనపూర్వకంగా మాస్టారు అలా అనివుంటారని భావించాను. కానీ, నిజంగానే భోజనాల సమయానికి నన్ను పిలిపించి ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. మేమిద్దరమే. ఆ సందర్భంలో అయ్యగారు అడిగారు  "తర్వాత ఏం చెయ్యదల్చుకున్నావు, ఎమ్.ఏ. చదువుతావా అని. నేను ఏవిషయమూ స్పష్టంగా నోరు తెరచి చెప్పలేకపోయాను. అమ్మగారే వడ్డించారు. ఆ రోజు వారింట్లో వండిన వంటలన్నీ ఇంకా బాగా గుర్తున్నాయి. దోసకాయపప్పు, గుత్తొంకాయ కూర, టమేటో చారు, పచ్చి నీరుల్లిపాయ ముక్కలు వేసిన మెంతిమజ్జిగ, గెడ్డ పెరుగు, ఆవకాయ, కొరివికారం ఇత్యాదులతో మాస్టారి పక్కన కూర్చొని భోజనం. అదే మొదటిసారి. అమ్మగారు చాలాబాగా వండుతారు. వారింట్లోని వంటకాలు అప్పుడప్పుడు మా ఇంటికీ వస్తూండేవి. సావిత్రమ్మగారు మెంతిమజ్జిగ స్పెషలిస్ట్. మా ఇంట్లో  వామువేసి పోపుమజ్జిగ అని చేస్తారు. (దాన్నే సత్యనారయణ బక్షీ (మా తాతగారి మిత్రులు బక్షీ పంతులుగారి కుమారుడు) Air Indiaలో Chief Chef, ఈtv ఒక కార్యక్రమంలో 'అమృత్ పీయూష్' గా పరిచయం చేసేరు.)  

ఆరోజు అమ్మగారు చేసినవన్నీ నాకు ఇష్టమైన పదార్ధాలే అయినా నాకు సహజంగానే వుండే మొహమాటం వలన అంత పెద్దాయన పక్కన ఒంటరిగా కూర్చొని స్వేఛ్ఛగా భోజనం చేయలేకపోయాను. ఆ విషయం ఈ రోజున తల్చుకుంటే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఘంటసాలగారి వంటి ఒక మహోన్నతగాయకుడి సరసన కూర్చొని భోజనం చేయగలగడం మహా అదృష్టం. ఆ భాగ్యం నాకు కలగజేసిన ఘంటసాలవారి సహృదయత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నా తర్వాత చదివిన మా ఇంటిపిల్లలు కానీ, మాస్టారింటి పిల్లలు కానీ అందరూ బాగా చదువుకున్నవారే.  పి.జి.లు, పి.హెచ్.డీ.లు చేసినవారే. అయినా ఆ లోగిటి మొదటి గ్రాడ్యుయేట్ అనే అర్హత మాత్రం  నేను పొందగలిగాను.

🌿 🌺🌿

గత రెండు మూడు వారాలలో సినిమా పాటల గురించి ముచ్చటించే అవకాశం దొరకలేదు. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఘంటసాల మాస్టారికి 1967 విజయవంతమైన సంవత్సరమే. ఆ సంవత్సరంలో మాస్టారు పాడిన అనేక సినీమాపాటలు బాగా హిట్టయి ఘంటసాల తప్ప వేరే గాయకుడు లేడు, మరొకరు అక్కరలేదు అనే స్థాయికి చేరిపోయారు. 


అలాగే, 1967లో ఘంటసాలవారి సంగీతదర్శకత్వంలో 6 సినీమాలు విడుదల అయ్యాయి. అవి - నిర్దోషి, భువనసుందరికథ, స్త్రీ జన్మ, పుణ్యవతి, పెద్దక్కయ్య, రహస్యం చిత్రాలు. సంవత్సరం మొదట్లో నందమూరి వారు హీరోగా వచ్చిన సాంఘిక చిత్రం, సంవత్సరాంతంలో అక్కినేని వారు నటించిన జానపద చిత్రం. అన్ని సినీమాలు సంగీతపరంగా ఘంటసాల మాస్టారికి గొప్ప పేరు ప్రఖ్యాతులనే తెచ్చిపెట్టాయి. ఇతర సంగీత దర్శకులకు ఘంటసాల వారు పాడిన పాటల్లో బాగా హిట్టయినవి, నాకు బాగా నచ్చినవి, ఆ పాటలకు సంబంధించి నాకు జ్ఞాపకం వున్న విశేషాలు కొన్ని ముచ్చటిస్తాను.

రాజమకుటం వచ్చిన ఆరేళ్ళకు వాహినీ బ్యానర్ మీద బి.ఎన్.రెడ్డిగారు తీసిన అద్భుత సామాజిక, కుటుంబగాధా చిత్రం 'రంగులరాట్నం'.  'లవకుశ' సీత అంజలీదేవి తప్ప ఇతర నటీ నటులంతా సినీమాకు నూతన పరిచయస్తులే. చంద్రమోహన్, నీరజ (విజయనిర్మల), విజయలలిత, వాణిశ్రీ, రామ్మోహన్, త్యాగరాజు, నగరాజారావు, కాకరాల, వంటి నూతన నటులకు ప్రాధాన్యమున్న పాత్రలనిచ్చి గొప్ప సాహసమే చేశారు బి ఎన్ రెడ్డి. కథావిలువగల చిత్రం కావడం వలన 'రంగులరాట్నం' అఖండవిజయం సాధించింది.  అమ్మ పాత్రలో అంజలీదేవి తన సీనీయారిటిని ప్రతిభావంతంగా కనపర్చారు. ఈ చిత్రానికి జంట సంగీత దర్శకులు ఎస్ రాజేశ్వరరావు, బి.గోపాలం. గోపాలంగారు మంచి గాయకుడు. ఆయన పాటంటే బి ఎన్ రెడ్డిగారికి ఇష్టం. ఆయన చిత్రాలకు బి.గోపాలం సహ సంగీతదర్శకుడు. ఈ సినీమాద్వారా ఒక పాటల రచయిత ను బి ఎన్ పరిచయం చేశారు. ఆయనే కావలి కాలేజీ లో పనిచేసిన శ్రీ ఎస్.వి.భుజంగరాయశర్మగారు. సినీమాలకు ఆయన వ్రాసిన పాటలు చాలా తక్కువే అయినా తర్వాతి కాలంలో డా.వెంపటి చిన సత్యంగారి నృత్యనాటక గీతాల రచనల ద్వారా భుజంగరాయశర్మగారి ఖ్యాతి దిగంతాలకు ప్రాకింది. కూచిపూడి నాట్యకళా ముమూర్తులలో ఒకరుగా కళాప్రపంచంలో నిలచిపోయారు. రంగులరాట్నంలోని టైటిల్ సాంగ్ "ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నమూ" పాటను భుజంగరాయ శర్మగారే వ్రాశారు. ఘంటసాల మాస్టారి గంభీరమైన గళంలో ఈ వేదాంత తాత్త్విక గీతం అజరామరంగా నిల్చిపోయింది. ఇదే సినీమాలో ఘంటసాల మాస్టారు  ఎస్.జానకితో కలసి పాడిన మరో మధురాతి మధుర భక్తి గీతం  'నడిరేయి ఏ జాములో' దాశరధిగారి రచన. పహాడీ రాగ స్వరాలతో చేసిన పాట. తిరుపతి వెంకటేశ్వరుని కొలిచేవారంతా ఘంటసాల వెంకటేశ్వరుడు పాడిన ఈ పాటను మననం చేసుకోకుండా వుండనేలేరు. 





ఈ పాటను తెరమీద పాడే అదృష్టం త్యాగరాజుకు లభించింది. గూండాగా, దుష్టుడిగానే ప్రేక్షకులకు తెలిసిన త్యాగరాజుకు అతి సాత్వికపాత్రలో చూపించి అతని ఇమేజ్ ను మార్చిన బి.ఎన్. రెడ్డిగారి  సాహసమూ, దర్శకత్వ ప్రతిభ అనన్యసామాన్యం. 

ఘంటసాల మాస్టారికి సంబంధంలేకపోయినా రంగులరాట్నం లో మరో అద్భుతగీతం. సుశీలగారు పాడింది. సాలూరివారి సంగీత ప్రతిభకు గీటురాయి "కోయని కోయిల పలికినది" దాశరధిగారి రచన. నీలాంబరి రాగంలో చేసిన ఈ పాటను సుశీలగారు ఎంతో శ్రావ్యంగా, లలితమధురంగా గానంచేశారు. ఈ పాట చివరలో వీణ మీద వినిపించిన 'శృంగారలహరి' (లింగరాజ్ అర్స్ సాహిత్యం, స్వరరచన) చిట్టస్వరంలోని కొన్ని స్వరాలను  చిట్టిబాబుగారు వీణ మీద, తన కోకిల స్వరంతో సుశీలగారు  అత్యంత మనోజ్ఞంగా ఆలపించి పాటకు జీవం పోసారు. ఈ పాట చిత్రీకరణలో బిఎన్ రెడ్డిగారి ప్రతిభ ఎంతైనా కనిపిస్తుంది. ఆ పాట మీరూ వినండి.





"మల్లియలా... రా మాలికలా...రా
మౌనముగా ఉన్నా...రా
మా కధనయే విన్నా...రా "

ఘంటసాలవారి సంగీత ప్రతిభ గురించి ఎప్పుడు, ఎక్కడ ప్రస్తావించినా "జ్ఞాన్ పీఠ్" అవార్డు గ్రహీత  డా. సి.నారాయణరెడ్డి గారు ఈ 'మల్లియలారా' పాట విశిష్టత గురించే చెప్పేవారు. తమ అలవాటుకు మారుగా ఘంటసాల మాస్టారు తనకు ముందు  ఈ ట్యూన్ ఇచ్చి మాటలు వ్రాయమన్నారని, చాలా భావగాంభీర్యం గల సన్నివేశం కనుక మాస్టారి ట్యూన్ కు అనుగుణంగా తగిన పదాలను ప్రయోగించినట్లు సినారె గారు చెప్పేవారు. మధ్యమావతి రాగచాయలలో వున్నదని చెప్పబడుతున్న 'మల్లియలారా' పాట 'నిర్దోషి' చిత్రం లోనిది. ఎన్.టి.రామారావు, సావిత్రిల మీద చిత్రీకరింపబడిన ఈ తొలిరేయి గీతం సూపర్ హిట్ సాంగ్ గా ఈనాటివరకూ బహుళ ప్రచారంలో కొనసాగుతున్నది. ఈ పాట స్వరరచనలో, పాడేప్పుడు భావప్రకటనలో ఘంటసాల మాస్టారి సంగీతప్రతిభ అణువణువున కనిపిస్తుంది. 



ఇదే 'నిర్దోషి' పేరుతో హెచ్.ఎమ్.రెడ్డిగారు 1951 లో ఒక సినీమా తీశారు. ఆ సినీమాకు ఘంటసాలవారే సంగీతదర్శకుడు. ఈ కొత్త చిత్రంలో నటించిన అంజలీదేవి ఆ నిర్దోషిలోనూ నటించారు. ఈ రెండింటి కధాంశం వేర్వేరే.

1967 నిర్దోషి   ఒక క్రైమ్ స్టోరీ. నిర్మాత నర్రా రామబ్రహ్మం. దర్శకుడు దాదామిరాసి. తమిళంలో అనేక క్రైమ్ థ్రిల్లర్స్ తీసిన అనుభవజ్ఞుడు. 

నర్రా రామబ్రహ్మంగారు, అట్లూరి పుండరీకాక్షయ్య గారూ కలసి గతంలో 'మహామంత్రి తిమ్మరుసు' చిత్రం తీసినట్లు చెప్పడం జరిగింది. ఆ సినీమా తీసిన ఐదేళ్ళకు ఇద్దరూ విడివిడిగా ఎన్టీఆర్ హీరోగా సీనీమాలు తీశారు. అందులో గౌతమీ పిక్చర్స్ బ్యానర్ మీద రామబ్రహ్మంగారి 'నిర్దోషి' ఆయనకు ఘంటసాలగారు చేసిన మొదటి చిత్రం. మాస్టారంటే రామబ్రహ్మంగారికి మంచి మర్యాద, గౌరవం వుండేవి. సంగీత దర్శకత్వం విషయంలో పూర్తి స్వేఛ్ఛను ఇచ్చారు. గౌతమీ రామబ్రహ్మంగారి గౌతమీ ఆఫీస్ టి.నగర్ వెంకటనారాయణ చెట్టి రోడ్ మొదట్లోనే రామకృష్ణా మెయిన్ స్కూల్ పక్కనే నానారావు నాయుడు స్ట్రీట్ ను ఆనుకొని వుండేది. నానారావు నాయుడు స్ట్రీట్ చివరలో నటుడు ముదిగొండ లింగమూర్తి గారి ఇల్లు. గౌతమీ ఆఫీసుకు మూడిళ్ళ తర్వాత నటి ఎస్.వరలక్ష్మి మేడ. అది దాటి కొంచెం ముందుకు వెడితే రాజా స్ట్రీట్. అందులో నటి సంధ్య, ఆమె కూతురు, నటి జయలలిత మేడ వుండేవి.

నిర్దోషిలో కొన్ని పాటల కంపోజింగ్ సమయంలో గౌతమీ ఆఫీసుకు వెళ్ళేవాడిని. రామబ్రహ్మంగారు అంత పెద్ద మేడలో (అద్దెదే) ఒంటరిగా వుండేవారు. సంసారం లేదు. కుటుంబం విషయం నాకు తెలియదు. క్రైమ్, ఫ్యామిలి సెంటిమెంట్ కలసిన ఈ నిర్దోషిలో మాస్టారు పాడిన పాటలు రెండు మాత్రమే ఒకటి మల్లియలారా - సోలో, మరొకటి సుశీలగారితో డ్యూయెట్ - 'ఈ పాట నీకోసమే హోయి ఈ ఆట నీకోసమే'.

ఉన్న ఏడు పాటల్లో ఒకటి కొసరాజు గారు, మిగిలిన ఆరూ డా.సి.నారాయణరెడ్డిగారు వ్రాసారు.  ట్యూన్ కు లిరిక్స్; లిరిక్స్ కు ట్యూన్;  రెండు పధ్ధతులలోనూ పాటల రచన సాగింది. క్రైమ్ సినీమాలో ఒక చక్కటి జోలపాట, సుశీలగారు పాడిన 'చిన్నారి కృష్ణయ్య రారా '. 

అలాగే మరో ఫోక్ డాన్స్ టైప్ సాంగ్ ' సింగారి చెకుముకి రవ్వ' పాట. ఈ రెండూ సినీమాకోసం పాడింది పి.సుశీలగారే అయినా ఆ గొంతులోని మార్దవం, భావం  యదాతధంగా ఘంటసాల మాస్టారి బాణియే. పాటలన్నీ జనరంజకంగానే అమరాయి. 

ఘంటసాల మాస్టారు తమ విదేశీ పర్యటనలో పాడిన ఈ నిర్దోషి సినీమాలోని 'మల్లియలారా' పాటతో పాటు 'సింగారి చెకుముకి రవ్వ' పాట కూడా అక్కడి శ్రోతలను బాగా ఆకట్టుకుంది. ఈ పాటలో వున్న ఫోక్ టింజ్ అక్కడివారిని బాగా ఆకర్షించిందని మాస్టారు చెప్పేవారు.


ఇలాటి మరిన్ని మంచి పాటల విశేషాలతో ...
వచ్చే వారం 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో......

                ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

No comments: