27.06.2021 - ఆదివారం భాగం - 37:
అధ్యాయం 2 భాగం 36 ఇక్కడ
నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
🌺
"అయ్యగారు రమ్మంటున్నారు.. రా..."
" నాన్ వారే... నీ పో..."
"అయ్యగారు రికార్డింగ్ కు వెళ్ళాలి. అర్జెంట్ గా రా...."
" నీ పో... ఉడనే వరే...."
" వెంటనే రా.. లేకపోతే అయ్యగారికి కోపం వస్తుంది...."
"సరి సరి.. నీ పో .. నాన్ వరే..."
కొన్నేళ్ళపాటు వాళ్ళిద్దరి మధ్య ఇంతే సంభాషణ.
ఒకరు గుండు మావయ్య( తమ్ముడు కృష్ణ), మరొకరు ఘంటసాలవారి ఆస్థాన బార్బర్. మా ఇంటికి అతి సమీపంలోనే అతని సెలూన్. ఒకరికి తమిళం రాదు; మరొకరికి తెలుగు తెలియదు. అయినా ఒకరి భావాలు మరొకరికి అర్ధమౌతాయి.
ఘంటసాల మాస్టారి ఇంటికే ఆ బార్బర్ వచ్చేవాడు. అతనిని పిలవడానికి సాధారణంగా తమ్ముడు కృష్ణ వెళ్ళేవాడు. అతనితోకూడా నేను వెళ్ళేవాడిని. వాళ్ళిద్దరి మధ్య ఎన్నేళ్ళయినా ఇవే మాటలు.
ఆ బార్బర్ ఒకసారి మా తమ్ముడు గోపికి కటింగ్ చేస్తూ జుట్టుతోపాటూ చెవికూడా కొంచెం కత్తిరించేసాడు. అంతే! ఆ తర్వాత అతనన్నా అతని సెలూన్ అన్నా హడలెత్తి మావాడు అటుపక్క వెళ్ళడం మానేశాడు. తర్వాత, పానగల్ పార్క్ దాటాక వచ్చే రామన్ కాఫీ వర్క్ షాప్ వరసలోని 'పూఙ్గా ముడి తిరుత్తం' ను మేము పోషించడం మొదలుపెట్టాము.
నాన్నగారికి ఎవరోవచ్చి గెడ్డానికి సోపు రాయడం, అది నురగగా మారడం, వాడు ఒక కత్తితో గీయడం ఇవన్ని మాస్టారి ఐదేళ్ల పాపకు వింతగానూ, ఒక ఆటగానూ తోచింది. ఒక రోజు తానుకూడా ఇదే ఆటను మా పక్కింటి అబ్బాయితో మొదలెట్టింది. గెడ్డం చేసుకోడానికి నరసింగ తయారు చేసి పెట్టుకున్న రేజర్ ని ఉపయోగించే సమయానికి నరసింగ వచ్చి చూడ్డంతో చిన్న రక్తపాతంతో పెద్ద ముప్పు తప్పింది. ఆ పిల్లవాడు కూడా అదేదో ఆటలా ఆనందంగా బుధ్ధిగా కూర్చున్నాడు. పిల్లల విషయంలో ఎంతో జాగురూకత అవసరం. చిన్నపిల్లలను అనుక్షణం గమనిస్తూండాలి. లేకపోతే ఎన్ని అనర్ధాలైనా జరిగే అవకాశం వుంది.
ఘంటసాల మాస్టారికి ఎప్పుడైనా కాసేపు బయట నడవాలని కోరికపుట్టేది. అలాటప్పుడు నాలాటివారిని వెంటపెట్టుకు వెళ్ళేవారు. అలా మాస్టారితో కొన్నిసార్లు కలసివెళ్ళిన ప్రదేశాలు రెండే రెండు, ఒకటి పార్క్ ల్యాండ్స్ హోటల్; మరొకటి పాండీబజార్ లోని 'గ్రాండ్ సెలూన్'. ఎప్పుడు వెళ్ళినా సాయంత్రం సమయంలోనే. పానగల్ పార్క్ నెం.35, ఉస్మాన్ రోడ్ కు చాలా దగ్గరగానే వుండేది. పార్క్ కు నాలుగు ప్రక్కలా పశ్చిమం వేపు ఉస్మాన్ రోడ్డు మీద శారదా విద్యాలయ గర్ల్స్ హైస్కూలు, కూరల బజార్; దక్షిణం వేపు నాగేశ్వరరావు రావు రోడ్. (అక్కినేని కాదు. 'దేశబంధు' కాశీనాధుని వారి గౌరవార్ధం పెట్టిన పేరు. కొంతకాలానికి రాజకీయాలు కొత్తపుంతలు త్రొక్కడంతో నాగేశ్వరరావు లో 'రావు' కులం పేరుగా భావించి సర్కార్ వారు ఆ 'రావు'ను తొలగించి 'నాగేశ్వర' రోడ్ చేసారు.) ఆ రోడ్డు మీదే తారాచంద్ గలాడా జ్యూవెలర్స్, నల్లి శిల్క్స్, పార్క్ ల్యాండ్స్ హోటల్ ఉండేవి; తూర్పున రామకృష్ణ మిషన్ బాయ్స్ మెయిన్ హైస్కూలు; ఉత్తరం వేపున ప్రకాశం రోడ్డు. ఈ ప్రకాశం రోడ్డు ఉస్మాన్ రోడ్డు కలిసే దగ్గర శారాదా విద్యాలయ గర్ల్స్ హైస్కూలు ఎదురుగా మూలమీద బర్మా షెల్ పెట్రోల్ బంక్ ఉండేది. ఇది ఆనాటికి పనగల్ పార్క్ టోపోగ్రఫీ. తనకు తొలి రోజుల్లో ఆశ్రయమిచ్చిన పానగల్ పార్క్ కు ఒక ప్రదక్షిణం చేసి ఇక చివరగా పార్క్ ల్యాండ్స్ హోటల్ కు వెళ్ళేవాళ్ళం. ఈలోగా రోడ్ మీద ఎవరెవరో తెలిసినవాళ్ళు, తెలియనివాళ్ళుకూడా మాస్టారిని చూసి విష్ చెయ్యడం, పలకరించడం జరిగేది. ఆ హోటల్ లో కూడా ఘంటసాల మాస్టారికి తెలిసిన పాత స్టాఫ్, సర్వర్ల్ వుండేవారు. వారంతా మాస్టారిని సగౌరవంగా ఆహ్వానించి అట్టే జనాలు లేని ఫ్యామిలీ రూమ్ లో కూర్చోపెట్టేవారు. నేను, పెద్దబాబు కూడా భద్రంగారితో (ఆయన భోజనం ఆ హోటల్ లోనే) తరచూ అదే హోటల్ కు వెళుతూండడంవలన అక్కడవారితో బాగానే పరిచయం వుండేది.మాస్టారికి ఆ సమయంలో ఆ హోటల్ కు వెళ్ళడం కేవలం కాలక్షేపం కోసం మాత్రమే. ఆ హోటల్ లో ఆయన ఎప్పుడూ రెండు ఇడ్లీ సాంబార్ మాత్రమే ఆర్డర్ చేసేవారు. అంతే. ఆ రోజుల్లో సామాన్య జనాలకు కూడా ఈ హోటల్ అందుబాటులో వుండేది. కేవలం ఒక ఇడ్లి, రెండు ఇడ్లీలు, సాంబార్ తో రోజంతా కాలక్షేపం చేసే ప్రజానీకం ఎందరో. తీసుకున్నది ఒక ఇడ్లీ అయినా, నాలుగు ఇడ్లీలైనా సమృధ్ధిగా అడిగినప్పుడల్లా చాలా రుచికరమైన సాంబారు వడ్డించేవారు. మామూలు సాదాసీదా జనాలంతా ఆ సాంబారు తోనే కడుపునింపుకునేవారు. అటువంటి దుర్భర వాతావరణంలో జీవించిన మాస్టారు అవన్నీ గుర్తు చేసుకొని చాలా విషయాలు చెపుతూండేవారు. అలా పార్క్ ల్యాండ్స్ లో కొంతసేపు గడిపి, పానగల్ పార్క్ కు మరో వేపునుండి నార్త్ ఉస్మాన్ రోడ్ వేపుకు మళ్ళి మెల్లగా నడుచుకుంటూ ఇంటికి చేరేవాళ్ళం. పార్క్ నుంచి ఇల్లు అర కిలోమీటర్ కన్నా తక్కువ దూరంలోనే ఉండేది.
అలాగే, మాస్టారికి నడవాలని బుధ్ధిపుడితే వెళ్ళే మరో స్థలం పాండీబజార్ లోని గ్రాండ్ సెలూన్. మా ఇంటి ఎదురు వీధి వ్యాసారావు స్ట్రీట్ చివర నాగయ్యగారి (తర్వాత, రమణారెడ్డిగారి) ఇల్లు దాటాక, కుడిచేతి వేపు రాఘవయ్యా రోడ్ లోని కె.కె.వినాయకమ్ అనే రాజకీయ నాయకుడి (ఈయన ఒక పార్లమెంట్ ఎలక్షన్స్ లోనో, అసెంబ్లీ ఎలక్షన్స్ లోనో టి.టి.కృష్ణమాచారికి ప్రత్యర్థిగా పోటీచేశారు.) మేడ దాటి జి.ఎన్.చెట్టి రోడ్ దాటుకుంటూ పాండీబజార్ ప్రారంభంలోని ఆంధ్రా కిళ్ళీ షాప్ దగ్గర కనిపించే తెలుగు సినీమా జనాల పలకరింపులు అందుకుంటూ అక్కడ ఎడమవేపు పాండీబజార్లోకి ప్రవేశించేవాళ్ళం. ఆ రోడ్ పేరు సర్ త్యాగరాయ రోడ్డు. (పిట్టి త్యాగరాయ చెట్టి జస్టిస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు.) ఆ రోడ్డు మీద పాండీబజార్ లో ఎడమచేతివేపు వరసగా గీతా కేఫ్, విల్సన్ మెడికల్ షాప్ (ఉస్మాన్ రోడ్ సలామ్ స్టోర్స్ కు ఎదురుగా విలియమ్స్ మెడికల్ షాప్ వుండేది. ఈ రెండింటి ఓనర్ ఒకళ్ళో కాదో తెలియదు కానీ విలియమ్స్ లో పనిచేసిన మేనేజర్ ఒకాయన విల్సన్స్ లో కనిపించేవారు. నేను 'ఫెరడాల్' విటమిన్ టానిక్ ఆ ఉస్మాన్ రోడ్ విలియమ్స్ లో రెగ్యులర్ గా కొనడానికి వెళ్ళేవాడిని). పాండీబజార్ విల్సన్ మెడికల్ షాప్ దాటాక కేరళా హెయిర్ డ్రెసెస్; పాండీబజార్ పాత పోలీస్ స్టేషన్; గ్రాండ్ సెలూన్; ఆ తర్వాత పాండీబజార్ రోడ్డు కి పేరెలల్ గా ఉన్న రాజా బాదర్ స్ట్రీట్ కి ఇంకా ముందుకెళ్తే ఉండే గోపాలకృష్ణ అయ్యర్ రోడ్డుకి కలుపుతూండే లేన్ కి ముందు సి.ఎస్.ఆర్.గారి చెట్టు, అది అక్కడ అప్పట్లో నారాయణన్ కేఫ్ ముందున ఉండేది. ఇప్పుడదే అక్కడే అడయార్ ఆనంద భవన్ ముందుంది. అవన్నీ దాటి ముందుకు వెళితే నాయర్ రోడ్ దగ్గర పాండీ బజార్ సరిహద్దు. దాన్ని దాటితే హోలీ ఏంజెల్స్ కాన్వెంట్; అక్కడనుంచి సుమారు అరకిలోమీటర్ దూరంలో ఆ రోడ్ చివర గిరియప్పా రోడ్డు దాటాక ఎడమవేపు కూవం కాలువ గట్టున కేసరీ హైస్కూలు. అది దాటితే మౌంట్ రోడ్; అక్కడ 'యు' టర్న్ తీసుకొని మళ్ళీ అరకిలోమీటర్ దూరంలోని పాండీబజార్లోకి ప్రవేశించేలోపు కుడివేపు కూవం కాలువ దాటాక SRMT 'శ్రీ రామదాస్ ట్రాన్స్ పోర్ట్' వారీ లారీ గొడౌన్, ఆ తరవాత బోగ్ రోడ్. మరికొంచెం దూరం నడిస్తే నాయర్ రోడ్ కు ఎదురుగా డీలక్స్ హోటల్, రాజకుమారి ధియేటర్, కృష్ణా ఫోటో స్టూడియో, భారత్ కేఫ్, అవన్నీ దాటాక ఆంధ్రాబ్యాంక్, డా.గాలి బాలసుందర్రావుగారిల్లు, రామకృష్ణా మెయిన్ బాయ్స్ హైస్కూల్ కాంపౌండ్ వాల్ వంటివి కొన్ని మాత్రమే నా జ్ఞాపకాలలో మిగిలివున్నాయి.
ఈ పాండీబజార్ మొత్తం ఘంటసాల మాస్టారు నడిచేవారని మాత్రం అనుకోకండి. ఆయన గ్రాండ్ సెలున్ వరకే నడిచేవారు. మిగిలిన స్థలాలగురించి నా చాపల్యం వలన చెప్పినవి. గ్రాండ్ సెలూన్ కు కేరళా హెయిర్ డ్రెసెస్ మధ్య మొదట్లో కొన్నేళ్ళపాటు పోటాపోటీగా వుండేవి. ఆనాటి సెలూన్లన్నీ చాలా పరిశుభ్రంగా మంచి మంచి ఊదువత్తుల పరిమళంతో, చక్కని నాదస్వర సంగీతమో, షెహనాయ్ సంగీతమో, లేక మంచి భక్తి సంగీతమో వినిపిస్తూ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా వుంచేవి. గ్రాండ్ సెలూన్ విశాలంగా ప్రశాంతంగా వుండేది. కేరళా హెయిర్ డ్రెసెస్ కన్నా జనాలు రద్దీ తక్కువగా వుండేది. అందుకే ఘంటసాల మాస్టారు అక్కడికి వెళ్ళేవారనుకుంటాను. అలాటిచోట్ల కూడా ఎవరో ఒకరు తెలిసినవారు కనిపించి మాట్లాడేవారు. మాస్టారు హెయిర్ కటింగ్ లేదా షేవింగ్ పూర్తి చేసుకొని వచ్చేవరకు ముందు రూమ్ లో కూర్చొని అక్కడ వుండే ఫిలిం ఫేర్, స్క్రీన్ వంటి సినీమా పత్రికలు తిరగేస్తూండేవాడిని.
(ఇప్పుడు కూడా కేరళా హెయిర్ డ్రెసెస్ మూడు కటింగ్ లు, ఆరు షేవింగ్ లుగా అధునాతన ఫేషన్లకు తగ్గట్లుగా అభివృధ్ధిలో వుంది. గ్రాండ్ సెలూను మాత్రం కొన్ని దశాబ్దాల క్రితమే మూతబడింది. కారణం తెలియదు.)
అక్కడనుండి బయటకు వచ్చి మెల్లగా అదే వరసలో వెనక్కి మరలి బరోడా బ్యాంక్ మీదుగా ప్రకాశం రోడ్ లోకి వెళ్ళి నార్త్ ఉస్మాన్ రోడ్ లో ఇంటికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇంటికి వెళ్ళే దోవలో ఎంతోమంది సినీమా పత్రికలవారు కనపడి పలకరించేవారు. వారందరితో సౌమ్యంగా, స్నేహపూర్వకంగా మాట్లాడేవారు. ఘంటసాల మాస్టారితో ఇలాటి అనుభావాలు 35, ఉస్మాన్ రోడ్డులో మిగతా పిల్లలకన్నా నాకే ఎక్కువగా దక్కాయని చెప్పవచ్చును.
🍀
సినీమా వ్యామోహంగల యాత్రికులు మెడ్రాస్ టి.నగర్ పాండీబజార్లో నారాయణన్ కేఫ్, పానగల్ పార్క్ దగ్గర నల్లీ సిల్క్స్, టి.బి.గలాడా జ్యువెలరీ షాప్, సాయంత్రం పూటైతే పానగల్ పార్క్ కూరగాయల షాప్ ప్రాంతాలలో కొంతమంది నటీనటుల సందర్శనాభాగ్యం పొందేవారు. అయితే అక్కడికి వచ్చే నటులు మేకప్ లేకుండా సహజ రూపాలతో వుండడంతో అభిమానులకు వారిని పోల్చుకోవడం కష్టమయేది. ఆ రోజుల్లో తళుక్కుమనే తారా సందోహాన్ని చూడడానికి అనువైన ప్రదేశం కోడంబాక్కం పెద్దగేట్, చిన్నగేట్. కోడంబాక్కం స్టూడియోలలో షూటింగ్ కు వెళ్ళే తారలంతా ఈ రెండు గేట్లు మీదుగానే వెళ్ళాలి. ఆ రెండు గేట్లూ లోకల్ ట్రైన్స్ రద్దీ వలన ప్రతీ పది నిముషాలకు మూసేవుంటాయి. కనీసం నాలుగైదు రైళ్ళు వెళ్ళేవరకు మేకప్ వేసుకున్న తారల సౌందర్యాలను తనివితీరే చూసే అవకాశం అక్కడే లభించేది. 1972 తర్వాత పెద్ద గేట్ దగ్గర కోడంబాకం బ్రిడ్జి కట్టడంతో సినీమా యాత్రికుల రవాణా, హంగామా తగ్గింది. అలాగే తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలివెళ్ళడంతో మద్రాస్ లో సినీమా యాత్రా బస్సుల రాకపోకలు తగ్గిపోయాయి.
నా వరకు నేను సావిత్రి, జెమినీ గణేశన్లను జంటగా మొదటిసారి చూసింది తారాచంద్ గలాడా షాప్ ముందరే. చాలామంది జూనియర్ ఆర్టిస్ట్ లను పానగల్ పార్క్ కూరగాయల షాప్ లోనే చూశాను. మా ఇంటికి కావలసిన కావలసిన పచారీ సామాన్ల కోసం సలామ్ స్టోర్స్ కు, ప్యూర్ ఫిల్టర్ కాఫీ పొడి కోసం రామన్స్ కాఫీ వర్క్స్ కు, కూరగాయల కోసం పానగల్ పార్క్ కు చాలాకాలం నేనే వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు సావిత్రమ్మగారికి తోడుగా వెళ్ళేవాడిని. పానగల్ పార్క్ కూరగాయల షాప్ నిజానికి సామాన్యులకు అందుబాటులో లేనిదే. అక్కడ అన్నీ, మా విజయనగరం భాషలో చెప్పాలంటే 'ప్రియమే'. అంటే ధర చాలా ఎక్కువే. కానీ అందుకు తగ్గట్లుగా చాలా ఫ్రెష్ గా, వివిధ రకాల ఆకు కూరలు, కూరగాయలు, రకరకాల పళ్ళు, అరటి ఆకులు, కొబ్బరికాయలు, పువ్వులు, సమస్తమూ అక్కడ లభించేవి. తరవాత చాలాకాలనికి కార్పరేషన్ వారు స్లాబ్డ్ రూమ్స్ కట్టేరు కానీ మా చిన్నప్పుడు పార్క్ ఈ చివరినుండి ఆ చివరివరకూ చిన్న పాకల్లో కొన్ని షాపులుంటే వాటికి ఎదురుగా ప్లాట్ఫారమ్ మీద మరిన్ని చిన్న షాపులుండేవి. ప్రతీ షాపు వాడు రకరకాల ఊదువత్తులు వెలిగించి పెట్టేవారు. అలాగే అక్కడి పువ్వుల దుకాణాల్లోంచి వచ్చే సుగంధపరిమళాలతో అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుండేది. మాంబళం రైల్వే స్టేషన్ రోడ్ అంతా కూడా కూరగాయల షాపులే. అక్కడ కూరగాయలు చాలా చౌక (చీప్)గా దొరికేవి. కాని అంత దూరంనుండి కూరగాయలు మోసుకురావడం ఒక పెద్ద సమస్యగా వుండేది. వేసవికాలంలో ముఖ్యంగా మామిడికాయ ఊరగాయల సీజన్లో ఈ రెండు కూరగాయల ప్రాంతాలు తెలుగువారితో రద్దీగా వుండేవి. మనం ఎంచుకున్న మామిడికాయలను అక్కడే కీలుకత్తిపీటతో ముక్కలు చేసి ఇచ్చే సౌకర్యం వుండేది. కాకపోతే అక్కడివాళ్ళు తరిగే అన్ని ముక్కలకు టెంక వుండేదికాదు. వాళ్ళు చాలా స్పీడ్ గా కాయలను టకటక కొట్టిపడేస్తారు. ఇందుకు సిధ్ధపడేవాళ్ళు, ఒంట్లో ఓపికలేనివారు ఆ మామిడికాయల షాపులను ఆశ్రయించేవారు.
ఆవకాయల సీజన్ 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో కూడా చాలా హాడావుడిగానే సాగేది. మాస్టారింట్లో ఆవకాయలకు కావలసిన ప్రశస్థమైన ఆవాలు, ఎండుమిరపకాయలు, నువ్వులనూనె అన్నీ గుంటూరు నుండే వచ్చేవనుకుంటాను. ఒక్కో ఏడాది అయితే పొడులు రూపంలోనే వచ్చేవి. మాస్టారింట్లో ఎప్పుడూ ఏడాది పొడుగునా కావలసిన మామిడికాయ ఊరగాయలు, దోసావకాయ, కొరివికారం, గోంగూర పచ్చడి అంటూ రకరకాల ఊరగాయలు నోరూరించేవి. మా అమ్మమ్మగారు, అమ్మగారు కూడా ఆవకాయ స్పెషలిస్టులే. మాస్టారింట్లో కృష్ణాజిల్లా స్టైల్ అయితే మా ఇంట్లో ఉత్తరాంధ్రా స్టైల్ ఊరగాయలు. మా లోగిట్లోవారికి ఈ ఆవకాయ నోరూరిస్తే, మా పక్కింటివాళ్ళకు మాత్రం కడుపు, ఒళ్ళు మండేవీ ఆ ఆవకాయల ఘాటుకి. తమిళులు కారానికి ముఖ్యంగా తెలుగువారి కారానికి ఆమడ దూరం. ఇదే ఆవకాయల సీజన్ లో మా దొడ్డమ్మగారు గోంగూర పువ్వుతో పచ్చడి చేసి ప్రత్యేకంగా శాంతి ఆశ్రమంనుండి తెచ్చేవారు. ఏమైనా తెలుగువారు ఊరగాయల స్పెషలిస్ట్ లే. అయితే నవతరం వారి టేస్ట్ లు, దేహారోగ్య పరిస్థితులు చూస్తూంటే ఊరగాయల శకానికి స్వస్తి పలికేట్టుగానే కనిపిస్తోంది.
ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇలాటి ఒక మామిడికాయల సీజన్ లోనే నేను రాధాకుమారిగారిని మొదటిసారిగా పానగల్ పార్క్ కూరగాయల షాపుల్లో చూశాను. (ఆ కుటుంబంతో గల స్నేహం మరో అధ్యాయంలో చెపుతాను) అప్పటికి ఆవిడను ఏ సినీమాలోనూ చూడలేదు. పత్రికల్లో బొమ్మలు తప్ప. అయితే వాణీమహల్లో వేసిన 'పట్టాలు తప్పిన బండి' నాటకంలో చూశాను. ఆ నాటకం రావి కొండలరావుగారి నాటకం. అప్పట్లో వాళ్ళు పనగల్ పార్క్ దగ్గరే వాసన్ స్ట్రీట్ లో ఎక్కడో వుండేవారు. సాయంత్రం ఆరయేసరికి చక్కగా ముస్తాబై తెల్లటి చీరలో కూరగాయల షాపులలో ప్రవేశించేవారు. చాలా ధాటీయైన గొంతు. తూనికల విషయంలో ఒకసారి రాధాకుమారి ఒక షాపు వాడితో గొడవపడడం చూశాను. ఈవిడ విజయనగరం తెలుగులో, ఆ షాపువాడు అరవంలోనూ కొంతసేపు ఘర్షణ పడ్డారు. అప్పుడే తెలిసింది ఆవిడ తెలుగావిడని. అలాగే సురభి బాలసరస్వతి, జూ. శ్రీరంజనీ, ఛాయాదేవి, ముక్కామల, వీరంతా ఆ కూరల షాపుల్లో కనపడేవారు. పానగల్ పార్క్ మార్కెట్లో బేరాలుండవు. వచ్చినవాళ్ళూ చేయరు. ఎందుకంటే అక్కడికి వచ్చేవాళ్ళలో ఎనభైశాతం ధనవంతులు, ఎక్కువగా మార్వాడీలు. కార్లలోంచి హుందాగా దిగి ముందుకు వెడుతూంటే వాళ్ళ వెనకే అర్భకంగా వుండే వాళ్ళింటి పనివాళ్ళో లేక డ్రైవర్లో గంపలు, పెద్దపెద్ద సంచులు మోసుకు వస్తూంటే వీళ్ళు ఆ కూర రెండు కిలోలు, ఈ కూర మూడు కిలోలు, ఇవి ఐదు కిలోలు అంటూ కిలోల లెఖ్ఖన కొనేవాళ్ళు. వెనకొచ్చినవాళ్ళు అమ్మగార్ల షాపింగ్ పూర్తి అయేవరకు పాపం! ఆ బరువంతా మోస్తూ వెనకాలే తిరిగేవాళ్ళు. ఇక బేరం ప్రసక్తేముంది?
💐
సినీమాల పట్ల తెలుగు, తమిళులకు వున్నంత మోజు, వీరాభిమానం, వ్యక్తి ఆరాధన ఇతర ప్రాంతాలలో కనపడదు. కేరళ, బెంగాలీ ప్రాంతాలలో సినీమా క్రేజ్ తక్కువ అనేవారు. సినీమా కూడా ఇతర పరిశ్రమలు, వ్యాపారంలాంటిదిగానే భావించేవారు. సినీ నటులకు పెద్దగా ప్రత్యేక గుర్తింపు వుండేదికాదని అనేవారు. ఆ రోజుల్లో సినీ కళాకారులకు ఎక్కువగా ప్రచారాన్ని కల్పించేది సినీమా పత్రికలే. సినీమా నటీనటులు, నిర్మాతలు, అనేక సినీమా పత్రికల మనుగడకోసం ఇతోధిక ఆర్ధిక సహాయం చేసేవారు. అందుకు ప్రతిఫలంగా తగిన ప్రచారాన్ని ఆయా పత్రికలవారు చేసేవారనడంలో అతిశయోక్తి లేదు.
విజయనగరంలో నా చిన్నప్పటినుండీ పత్రికలలో సినీమా బొమ్మలు సినీమా వార్తలు కనపడేవి. అప్పట్లో 'కినీమా' అనే పూర్తి సినీమా విషయాలతో నిండిన బొమ్మల పుస్తకం వచ్చేది. ఈనాడు మనం చెప్పుకునే 'సినీమా' అనే మాటను పాత రోజుల్లో 'కినీమా' అని అనేవారేమో. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వంటి వార పత్రికలలో కూడా చివరగా ఓ నాలుగైదు పేజీలు సినీమా వార్తలకు, సమీక్షలకు, బొమ్మలకు కేటాయించేవారు. ఆయా పత్రికల అట్టల మీద సర్వసాధారణంగా సినీ తారల బొమ్మలే వుండేవి. గాయకుల బొమ్మలో, దర్శకుల బొమ్మలో, సంగీత దర్శకుల బొమ్మలో అసలు కనిపించేవికావు. మొదటినుండీ సినీమా అంటే నటీనటులే. మద్రాస్ వచ్చాక ఎన్నో సినీమా పత్రికల పరిచయం కలిగింది.
ఘంటసాల మాస్టారింటికి అనేక రకాల పత్రికలు వచ్చేవి. అందులో సినిమా పత్రికలూ వుండేవి. చందాలు కట్టి తెప్పించేవి కొన్నయితే, చందాలు కట్టనివీ వచ్చేవి. రామనాధ్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో జివిజి కృష్ణగారు ఎడిటర్ గా 'సినీమారంగం'; ఇంటూరి వెంకటేశ్వరరావు గారి 'సినీమా'; గోటేటి రామారావుగారి 'మధురవాణి'; కె.కె.శర్మగారి 'కాగడా'; శ్రీకృష్ణగారి 'మెఱుపు'; రమణమూర్తి గారి 'కొరడా' మరెవరిదో 'చిత్రభూమి' ఇలా రకరకాల సినీమా పత్రికలు ఘంటసాల మాస్టారింటికి వచ్చాకే నాకు పరిచయం అయ్యాయి.
తెలుగులో సినీమారంగం అయితే, అదే తమిళంలో 'పేసుమ్ పడమ్'. పాకెట్ సైజ్ పుస్తకరూపంలో వచ్చేది. తెలుగు విభాగానికి జి.వి.జి.కృష్ణగారు ఎడిటర్. ఆయన ప్రముఖ జర్నలిస్ట్, రచయిత, నటుడు కూడా. దేవదాసు సినీమాలో సావిత్రి (పార్వతి) సవతి కొడుకుగా నటించింది జి.వి.జి.కృష్ణగారే. పౌరాణిక చిత్రాలలో బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, అష్టదిక్పాలకులు అంటే నిర్మాతలకు జి.వి.జి.గారే గుర్తొస్తారు. ఘంటసాల మాస్టారి పాటల్లో భావాలు ఫోటో ఫీచర్ ను జి.వి.జి.కృష్ణగారే ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి సినీమా రంగంలో ప్రచురించారు. ఆ ఫోటోలను ఈనాటికీ మనం అనేక ఛానల్స్ లో, సమూహాలలో చూస్తూంటాము. సినీమారంగం తెలుగు సినిమా పత్రికలలో అగ్రశ్రేణిలో ఉండేది.
ఇంటూరి వెంకటేశ్వరరావుగారి 'సినీమా' కూడా బహుళ జనాదరణ పొందిన పత్రికే. ఇంటూరివారు నాగయ్యగారికి పరమభక్తుడు. సినీ జర్నలిస్టులకు భీష్మాచార్యుడు. నాగయ్యగారి అంత్యక్రియలు జరిపించడంలో, ఆయన శిలావిగ్రహాన్ని పానగల్ పార్క్ లో ప్రతిష్టించడంలో ఇంటూరివారి కృషి అనన్యసామన్యం. 'సినీమా' పత్రికలో సినీమాలకు సంబంధించిన అనేక ఫీచర్లుండేవి. అందులో ఇంటూరి వారి 'ఎక్స్ట్రా నటి వెంకాయమ్మ' ధారవాహికగా వచ్చేది. 'గోచీకట్టి గోదాలోకి దిగడం' అనే మాట ఇంటూరివారి పెట్ పదం. నాకెందుకో ఆ వెంకాయమ్మను తల్చుకున్నప్పుడల్లా నటి ఛాయాదేవే గుర్తుకు వచ్చేది. ఇంటూరి వెంకటేశ్వరరావుగారి 'సినీమా'లో మరో ముఖ్యమైన ఫీచర్ 'ప్రశ్న-జవాబులు' ఏచూరి చలపతిరావు, భీమవరంనుండి బి.మొహిద్దీన్ బాషా, మచిలీపట్నం నుండి ఎన్.వి.ఎస్.చలపతిరావు, ఐ.అర్జునరావు రెగ్యులర్ గా ప్రశ్నలు పంపేవారు. ఆ ప్రశ్నలు, సమాధానాలు తమాషాగా, వినోదం కలిగించేవిగా ఉండేవి.
ఒకాయన అడుగుతాడు 'జానపద చిత్రాలకు ఎన్.టి.రామారావును మించినవాడు లేడని నేనూ, 'కాదు...అక్కినేనే మిన్న అని నా మిత్రుడు వాదించుకుంటున్నాము', మరి మీరెవరితో ఏకీభవిస్తారు ఎడిటర్జీ', అని. ఇంటూరివారికి ఈ ఇద్దరు నటుల సహకారమూ కావాలి. అందుచేత పాము చావకుండా, కర్ర విరగకుండా వుండేలాటి సమాధానం ఏదో చెప్పి గోడ దాటేసేవారు.
మరొక అభిమాని ప్రశ్న 'దేవదాసు లోని ఘంటసాల పాటలు గొప్పవా, లేక జయభేరి లో ఘంటసాల పాటలు గొప్పవా? తెలియజేయండి' అని. ఇలాటి కాలక్షేపం బఠాణీలు అనేకం 'సినీమా'లో కనిపించేవి.
ఆనాటి ప్రమాణాలకి తెలుగులో యెల్లో జర్నల్ గా చెప్పుకో తగ్గది కామేశ్వర శర్మగారి 'కాగడా'. ఎక్కువగా సినీ తారల 'గ్లామర్' ఫోటోలతో కొంచెం సరస గాసిప్స్ సంయుక్తంగా నడిచేది.
'కొరడా' రమణమూర్తిగారు నటి రాధాకుమారిగారి తండ్రి. రావికొండలరావుగారి మామగారు. కొండలరావుగారు కూడా ప్రముఖ జర్నలిస్టే. రమణమూర్తిగారికి వచ్చే ఆదాయం ఆయన సిగరెట్లకే చాలేది కాదేమో అనిపించేది.
వీరు కాకుండా వాసిరాజు ప్రకాశంగారు, ముళ్ళపూడి వెంకట రమణగారు, వి.ఎ.కె.రంగారావుగారు వీరంతా కూడా సినీ జర్నలిజంలో నిష్ణాతులే.
'సినీమారంగం' వంటి ఏ ఒకటి రెండు పత్రికలో తప్ప మిగిలిన సినీమాపత్రికలన్ని నిర్మాతలు ఇచ్చే సినీమా ప్రకటనల మీదే ఆధారపడేవి. కొన్ని కొన్ని పత్రికలు కొన్ని మాసాలపాటు కనపడేవేకావు. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్స్ పుష్కలంగా సేకరించి వాటిమీద వచ్చే ఆదాయంతో పత్రికలు నడిపేవారు. ఆంధ్రపత్రిక వంటి ప్రముఖ పత్రిక కూడ పెద్ద నిర్మాతల సహకారం వుండాలనే భావనలోనే వుండినట్లు ముళ్ళపూడి రమణగారి జీవితచరిత్రలో చదివాను. ఆయన ఆంధ్రపత్రికలో పనిచేసేప్పుడు విజయావారి 'అప్పుచేసి పప్పుకూడు' సినీమా మీద తీవ్రంగా విమర్శించారట. అది చూసి చీఫ్ ఎడిటర్ శివలంక శంభూప్రసాద్ గారో లేక రాధాకృష్ణగారో అన్నారట 'నువ్వింత ఘాటుగా విమర్శిస్తే చక్రపాణిగారికి కోపం వస్తుదేమో! మనకు రావలసిన ప్రకటనలు ఆగిపోతాయేమో! కొంచెం ఆచి తూచి సమీక్షలు రాయి' అని సలహా ఇచ్చారట. మరి అంత పెద్ద సంస్థకే అలాటి బెదురున్నప్పుడు ఇక సామాన్య పత్రికల సంగతేమిటి. ఫిలింఫేర్, స్క్రీన్, స్టార్ ఎండ్ స్టైల్ వంటి ప్రముఖ సినిమా పత్రికల ముందు ప్రాంతీయ సినిమా పత్రికలు సూర్యుడి ముందు దివిటీల వంటివే.
ఇలాటి పరిస్థితులలో విజయావారే తమ బి.ఎన్.కె ప్రెస్ నుండి అత్యంత భారీ ఎత్తున వివిధ భాషలలో ఒక రంగు రంగుల సినీమా మాస పత్రిక ప్రారంభించారు. అదే 'విజయచిత్ర'. తమిళంలో 'బొమ్మై'. ఈ పత్రిక ప్రభావంతో అనేక సాదాసీదా సినీమాపత్రికలు తుడిచిపెట్టుకుపోయాయి. రావికొండలరావు కోటలో పాగా వేశారు. విజయచిత్రకు సబ్ ఎడిటర్ గా తన అనుభవసారంతో ఎన్నో మంచి శీర్షికలు ప్రవేశపెట్టారు. 'విచి'గా పాఠకుల వింత ప్రశ్నలకి విచిత్రమైన జవాబులిచ్చేవారు. విజయచిత్ర సెంటర్స్ప్రెడ్ నటీమణులు షర్మిలా టాగోర్, ముంతాజ్, రేఖ, సాధన వంటి గ్లామర్ క్వీన్ లు కాలేజీ కుర్రాళ్ళ రూముల గోడలమీద ప్రధాన ఆకర్షణగా దర్శనమిచ్చేవారు. ఎన్నో సంవత్సరాలపాటు విజయచిత్రే అగ్రశ్రేణి సినీమా పత్రికగా విరాజిల్లింది.
ఇక ఈ చిన్న చిన్న సినీమా పత్రికల వారంతా ఉదయం నుండి సాయంత్రం వరకూ ప్రకటనల సేకరణలో, చందాల వసూళ్ళతోనే సతమతమయ్యేవారు. ఈ క్రమంలో ఇంటూరి మొదలు రమణమూర్తి వరకు ప్రతీ పత్రికాధిపతి మాస్టారు ఇంటికి చందాలకోసం వచ్చేవారు. అసలు ఘంటసాలవారికి పత్రికా పఠనమే అలవాటు లేదు. అందులోనూ సినీమా పత్రికలు చూసే ఆసక్తి ఆయనకుగానీ, ఇంట్లోవారికి గాని అసలు లేదు. వచ్చిన ఆ పత్రికలన్ని ముందునుండి చివరవరకూ నేనే చదివేవాడిని. కానీ, ఘంటసాలగారు చాలా ఉదారులు, సహృదయులు. తనకు ఈ పత్రికలు పంపవద్దని, తనకు తోచిన ఆర్ధిక సహాయం అడపాదడపా చేసేవారు. ఆయన వద్దన్నా కూడా ఏవో కొన్ని పత్రికలు ఇంటికి వస్తూనేవుండేవి. షరా మామూలే.
ఈ వారం చాలా విషయాలే ముచ్చటించినట్లున్నాను.
మిగిలిన విషయాలు...వచ్చే ఆదివారము నాడూ
మెచ్చుక కలసి ....చూసెదమూ....
...సశేషం
No comments:
Post a Comment